Jump to content

నారాయణీయము/తృతీయ స్కంధము/12వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము

12వ దశకము - వరాహావతార వర్ణనం

12-1-శ్లో.
స్వాయంభువో మనురథో జనసర్గశీలో
దృష్ట్వా మహీమసమయే సలిలే నిమగ్నామ్।
స్రష్టారమాప శరణం భవదంఘ్రిసేవా-
తుష్టాశయం మునిజనైః సహ సత్యలోకే||
1వ భావము.
హిరణ్యాక్షు డట్లు భూమిని జలమున ముంచివేయుచుండగా, జీవులను సృష్టించుటకు బ్రహ్మచే నియోగించబడిన ‘స్వాయంభువ మనువు‘ , ప్రళయసమయముకాని సమయమున భూమి జలమున మునుగుట చూచి, మునిగణములతో సత్యలోకమునకు వెళ్ళి, నీ పాదపద్మ సేవ యందు నిమగ్నుడైన బ్రహ్మను శరణు కోరెను.

12-2-శ్లో.
కష్టం ప్రజాస్సృజతి మయ్యవనిర్నిమగ్నా
స్థానం సరోజభవ! కల్పయ తత్ప్రజానామ్।
ఇత్యేవమేష కథితో మనునా స్వయంభూః।
అంభోరుహాక్ష! తవపాదయుగం వ్యచింతీత్||
2వ భావము.
“పద్మసంభవా! నీ ఆజ్ఞ మేరకు జీవ సృష్టి జరుపుచుండగా భూమి జలమున మునిగినది” అని బ్రహ్మకు తెలిపి; విషణ్ణ వదనముతో - స్వయంభువ మనువు, 'జీవులకు నివాసస్థానమును కల్పింప' మని బ్రహ్మను కోరెను. పద్మదళాక్ష! బ్రహ్మదేవుడు అప్పుడు నీ పాదములను స్మరించెను.

12-3-శ్లో.
హా ! హా! విభో! జలమహం న్యపిబం పురస్తాత్
అద్యాపి మజ్జతి మహీ కిమహం కరోమి!
ఇత్థం త్వదంఘ్రియుగళం శరణం యతో౾స్య
నాసాపుటాత్ సమభవః శిశుకోలరూపీ||
3వ భావము.
“ఓ! ప్రభూ! ప్రళయకాలమున నేను జలము నంతటిని త్రాగి వేసితిని -కాని ఇప్పుడు భూమి నీట మునిగిపోవుచున్నది. నే నేమి చేయుదును” అని పలికి; బ్రహ్మ నీ పాదపద్మములను స్మరించెను. అట్లు పలికిన బ్రహ్మ నాసికాపుటము నుండి నీవు వరాహరూపమున శిశువుగా ఉద్భవించితివి.

12-4-శ్లో.
అంగుష్ఠమాత్రవపురుత్పతితః పురస్తాత్
భూయో౾థ కుంభిసదృశః సమజృంభథాస్త్వమ్।
అభ్రే తథావిధముదీక్ష్య భవంతముచ్చైః
విస్మేరతాం విధిరగాత్ సహసూనుభిస్స్వైః||
4వ భావము.
బ్రహ్మదేవుని నాసికాపుటము నుండి ఉద్భవించిన అంగుష్ట (బొటన వేలంత) మాత్రమైన నీరూపము క్షణమాత్రమున ఏనుగు శరీర ప్రమాణమునకు పెరిగినది. అంతరిక్షమున ఆ విధముగా కనిపించు నీ రూపము - బ్రహ్మకు, ఆయన పుత్రులకు అత్యంత ఆశ్చర్యమును కలిగించినది.

12-5-శ్లో.
కో౾సావచింత్య మహిమా కిటిరుత్థితో మే
నాసా పుటాత్ కిము భవేదజితస్య మాయా।
ఇత్థం విచింతయతి ధాతరి శైలమాత్రః
 సద్యో భవన్ కిల జగర్జిథ ఘోరఘోరమ్||
5వ భావము.
“ఆ విధముగా అనూహ్యరీతిలో తన (బ్రహ్మ) నాసికాపుటము నుండి మిక్కిలి మహిమాన్వితముగా వెలువడిన ఈ వరాహరూపము ఎవరిది? ఇది అజితుని మాయయై యుండవలయును” అని బ్రహ్మ యోచించుచున్నంతనే, నీవు పర్వతాకార రూపమును దాల్చి దిక్కులు పిక్కటిల్లునట్లు గర్జించితివి.

12-6-శ్లో.
తం తే నినాదముపకర్ణ్య జనస్తపఃస్థాః
సత్యస్థితాశ్చ మునయో నునువుర్భవంతమ్।
తత్ స్తోత్ర హర్షులమనాః పరిణద్య భూయః
తోయాశయం విపుల మూర్తిరవాతరస్త్యమ్||
6వ భావము.
మిక్కిలి మహిమాన్వితమైన నీ గర్జనను విని, జనస్తప సత్యలోకవాసులైన మునీశ్వరులు నిన్ను స్తుతించిరి. వారి స్తోత్రములకు ప్రసన్నుడవైన నీవు, నీ వరాహరూపము పర్వతమును తలపించుచుండగా మరల భీకరముగా గర్జించుచు జలగర్భమున చొచ్చుకొని పోయితివి.

12-7-శ్లో.
ఊర్ధ్వ ప్రసారిపరి ధూమ్రవిధూతరోమా
ప్రోక్షిప్తవాలధిరవాజ్ముఖఘోరఘోణః।
తూర్ణప్రదీర్ణజలదః పరిఘూర్ణదక్ష్ణా
స్తోతౄన్మునీన్ శిశిరయన్నవతేరిథ త్వమ్||
7వ భావము.
ఓ! విష్ణుమూర్తీ! నిన్ను స్తుతించుచున్న మునులకు సంతోషము కలిగించుచు, నీ వట్లు జలమున చొచ్చుకొని పోవుచుండగా పైకెత్తబడిన నీ వాలరోమములు నిక్కబొడుచుకొన్నవి. నీ వాలము పొగవర్ణముతో పొగక్రమ్మిన ఆకాశమును తలపించుచుండగా - మేఘములను చెదరగొట్టుచు, నీ కనుల నటునిటు త్రిప్పుచు, భీకరమైన నీ ముట్టెను క్రిందకు వంచి నీవు నీట మునిగితివి.

12-8-శ్లో.
అంతర్జలం తదను సంకులనక్రచక్రం
భ్రామ్యత్తిమింగలకులం కలుషోర్మిమాలమ్-
ఆవిశ్యభీషణరవేణ రసాతలస్థాన్
ఆకంపయన్ వసుమతీమగవేషయస్త్వమ్||
8వ భావము.
దేవా! అప్పుడు, నీవు మొసళ్ళు మరియు తిమింగముల సమూహములు తిరుగాడు జలాంతర్బాగమున ప్రవేశించితివి. నీ వేగమునకు అల్లకల్లోలమైన ఆ రసాతలమున, నీవు చేయు భీకర ధ్వనులకు - అందలి ప్రాణులు భయముతో కంపించుచుండగా, నీవు భూమిని అన్వేషించితివి.

12-9-శ్లో.
దృష్ట్వాథ దైత్యహతకేన రసాతలాంతే
సంవేశితాం ఝటితి కూటకిటిర్విభో! త్వమ్!
ఆపాతుకానవిగణయ్య సురారిఖేటాన్
దంష్ట్రాంకురేణ వసుధామదధాః సలీలమ్||
19వ భావము.
విభూ! అసురుడయిన హిరణ్యాక్షునిచే రసాతలమున దాచబడిన భూదేవిని నీవు శ్రీఘ్రమే కనుగొంటివి. నీతో పోరాటమునకు వచ్చిన రాక్షస సమూహమును నిర్లక్ష్యముగా ఎదురించి మాయా వరాహరూపమున నీ కోరలతో వసుధను (భూమిని) అవలీలగా పట్టుకొంటివి.

2-10-శ్లో.
అభ్యుద్ధరన్నథ ధరాం దశనాగ్రలగ్న-
ముస్తాంకురాంకిత ఇవాధికపీవరాత్మా।
ఉద్ధూతఘోరసలిలాజ్జలధేరుదంచన్
క్రీడావరాహవపురీశ్వరా! పాహి రోగాత్||
10వ భావము.
ఉధృత సముద్ర తరంగములను నిరోధించుచూ.. వరాహమూర్తీ! సూకరము (పంది) తుంగగడ్డను తన కోరలపై నిలిపిన రీతిగా, ఆ సముద్రగర్భమును చీల్చుకొని, మహకాయుడవైన నీవు ‘పుడమిని‘ నీ కోరల ముందుభాగమున నిలుపుకొని పైకి వచ్చుటను.. దేవతలు చూచిరి. హిరణ్యాక్షునితో రణక్రీడ జరుపుటకు వరాహరూపమును ధరించిన నారాయణుడా! నన్ను రోగమునుండి రక్షింపమని ప్రార్ధించు చున్నాను.


తృతీయ స్కంధము
12వ దశకము సమాప్తము.

-x-
 

Lalitha53 (చర్చ) 10:42, 8 మార్చి 2018 (UTC)