Jump to content

నారాయణీయము/ఏకాదశ స్కంధము/94వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
ఏకాదశమ స్కంధము

94- వ దశకము - తత్త్వజ్ఞానోత్పత్తి


94-1
శుద్ధానిష్కామధర్మైః ప్రవరగురుగిరా తత్స్వరూపం పరంతే
శుద్ధం దేహేంద్రియాదివ్యపగతమఖిలం వ్యాప్తమావేదయంతే।
నానాత్వస్థౌల్యకార్శ్యాది తు గుణజవపుస్సంగతో౾ధ్యాసితంతే
వహ్నేర్ధారుప్రభేదేష్వివ మహాదణుతా దీప్తతా శాంతతాది॥
1వ భావము :-
భగవాన్! కృష్ణా! నీ పరమాత్మరూపము శుద్ధమయినది, గుణాతీతమయినది, దేహింద్రియములకు అతీతమయినది, స్థూలమయినది మరియు సూక్ష్మమయినది, సకలమునను వ్యాపించినది; సకల జీవులలోనుప్రకాశించునది. దారువును మండించు అగ్నికి దారువు లక్షణమును బట్టి సంకోచ వ్యాకోచములు ఎట్లు కలుగునో, అటులనేజీవుని పూర్వ జన్మల కర్మఫలముననుసరించి వారిలో నీవు చిన్న, పెద్దరూపములలో సత్వ, రజో, తమోగుణములు ఆపాదించబడి ప్రకాశించుచుందువు. ప్రభూ!నీ ఈ తత్వరూపమును శుద్ధభక్తులు నిష్కామకర్మలనాచరించుచు గురువులనాశ్రయించి గ్రహింతురు. అన్యులకు ఇది అసాధ్యము.

94-2
ఆచార్యాఖ్యాధరస్థారణి సమనుమిలచ్ఛిష్యరూపోత్తరార-
ణ్యావేధోద్భాసితేన స్ఫుటతరపరిబోధాగ్నినా దహ్యమానే।
కర్మాలీవాసనాతత్కృతతనుభువనభ్రాంతికాంతారపూరే
దాహ్యాభావేన విద్యాశిఖిని చ విరతే త్వన్మయీ ఖల్వవస్థా॥
2వ భావము :-
భగవాన్!కృష్ణా! తత్వజ్ఞాన సముపార్జనలో గురుశిష్యుల బంధము, వైదిక కర్మలలో అగ్ని పుట్టించుటకు ఉపయోగించు ఉత్తరారణి (కొయ్య కవ్వము) అధరారణి (క్రిందిభాగము) వంటిదని చెప్పవచ్చును. ఎట్లనగా తత్వ పిపాసి అయున శిష్యుడు తనలోని జ్ఞానాగ్నినిరగిలించుకొనుటకు కవ్వమువలె, గురువు అను అధరారణి సహాయము పొందును. కర్మవాసన ఫలితమే ఈ ప్రపంచమని గురుసహాయముతో తెలుసుకొనును; అజ్ఞానము అను అరణ్యమును దాటి ఇహలోక భ్రాంతులను వీడును; జ్ఞానము అజ్ఞానముల ఎరుకను వీడి శుద్ధ భక్తితో సర్వమూ భగవన్మయమని తెలుసుకొనును.

94-3
ఏవం త్వత్ప్రాప్తితో౾న్యో న హి ఖలు నిఖిలక్లేశహానేరుపాయో
నైకాంతాత్యంతికాస్తే కృషివదగదషాడ్గుణ్యషట్కర్మయోగాః।
దుర్వైకల్యైరకల్యా అపి నిగమపథాస్తత్ఫలాన్యప్యవాప్తాః
మత్తాస్త్వాం విస్మరంతం ప్రసజతి పతనే యాంత్యనంతాన్ విషాదాన్॥
3వ భావము :-
భగవాన్! కృష్ణా! సకలక్లేశములను అధిగమించి నీ తత్వజ్ఞానమును పొందుటకు భగవద్భక్తియే ఏకైక మార్గము. రోగము నిర్మూలించుటకు ఔషధము సేవించినట్లు, చేయు షడ్గుణషట్కర్మాచరణలు మరియు యోగసాధనలు జీవులను తమతమ క్లేశములను అధిగమింపజేసి నీదరిచేర్చగల పరిపూర్ణ పారమార్ధిక సాధనలు కానేరవు. ప్రభూ! వేదమార్గమును అనుసరించి ఫలముపొందియూ గర్వితులయినచో, అట్టివారు నిన్ను విస్మరింతురు; పతనమై అనంత దుఃఖములను పొందుదురు.

94-4
త్వ ల్లోకాదన్యలోకః క్వ ను భయరహితో యత్ పరార్థద్వయాంతే
త్వద్భీతస్సత్యలోకే౾పి న సుఖవసతిః పద్మభూః పద్మనాభ।
ఏవం భావే త్వధర్మార్జితబహుతమసాం కా కథా నారకాణాం
తన్మే త్వం ఛింధి బంధం వరద।కృపణబంధో।కృపాపూరసింధో।॥
4వ భావము :-
పద్మనాభా! కృష్ణా! నీ వైకుంఠముకన్నా భయములేని లోకమువేరే ఇంకేమి ఉండును? తన ఆయుః కాలమగు రెండు పరార్ధములు కాలము ముగియుచుండగనే బ్రహ్మదేముడు సహితము భయపడును; తన సత్యలోకమున ప్రశాంతముగా ఉండజాలడు. బ్రహ్మదేమునికే ఇట్లయినచో అధర్మ ప్రవర్తనతో పాపములాచరించి తమోమయమగు నరకలోకమున పెక్కు బాధలు అనుభవించు జీవులగతి ఏమని చెప్పుదుము? దీనబంధో! కరుణాసింధో! నా లౌకికబంధములను త్రెంచివేయుము. నీ దరిచేరు మార్గము ప్రసాదించుము.

94-5
యథార్థ్యాత్ త్వన్మయస్యైవ హి మమ న విభో।వస్తుతో బంధమోక్షౌ
మాయావిద్యాతనుభ్యాం తవ తు విరచితౌ స్వప్నబోధోపమౌ తౌ।
బద్ధే జీవద్విముక్తిం గతవతి చ భిదా తావతీ తావదేకో
భుంక్తే దేహద్రుమస్థో విషయఫలరసాన్ నాపరో నిర్వ్యథాత్మా॥
5వ భావము :-
భగవాన్! కృష్ణా! వాస్తవమునకు పరమాత్మవైన నీకును జీవుడనైన నాకును భేదములేదు. జీవుడికి బంధము, ముక్తి అనునవి మాయవలననే కలుగుచున్నవి. అవి స్వప్నము జాగ్రదావస్థలవంటివి. ఈ సత్యమును గ్రహించిన జీవన్ముక్తునికి బంధములుగాని మోక్షముగాని అంటవు. బద్ధజీవుడు జీవన్ముక్తుడు అనువారు వృక్షముపై నివసించు రెండు పక్షులవంటివారు. (కర్మ)ఫలములను ఆస్వాదించు పక్షియే బద్ధజీవుడు. ఫలాపేక్షలేక (కర్మ)ఫలమందు నిరాసక్తుడై ఆనందముగా నున్న రెండవ పక్షియే జీవన్ముక్తుడు. కర్మలే ప్రాణిని పరమాత్మకు దూరముచేయును.

94-6
జీవన్ముక్తత్వమేవంవిధమితి వచసా కిం ఫలం దూరదూరే
తన్నామాశుద్ధబుద్ధేర్న చ లఘు మనసశ్శోధనం భక్తితో౾న్యత్।
తన్మే విష్ణో।కృషీష్ఠాస్త్వయి కృతసకలప్రార్పణం భక్తిభారం
యేన స్యాం మంక్షు కించిద్గురువచనమిలత్త్వత్ప్రభోధస్త్వదాత్మా॥
6వ భావము :-
భగవాన్! కృష్ణా!జీవన్ముక్తియనునది ఇటువంటిది అని చిత్తశుద్ధిలేనివానికి మాటలతో వివరించి చెప్పిన ఏమి లాభము? అట్టి వానికి జీవన్ముక్తి అను మాటసహితమూ చాలాదూరముగా తోచును. మనసును సుద్ధిచేయునిది, ముక్తినొసంగునది భక్తియే తప్ప మరిఏమేమియూ కాదు. ప్రభూ! విష్ణుమూర్తీ! సకలము నీకే అర్పించగల సంపూర్ణ శుద్ధభక్తిని నాకు ప్రసాదింపుము. గురూపదేశముతోను, వారి భోధనలతోను నేను నీ తత్వమును శీఘ్రమే తెలుసుకొనెదను; ముక్తిని పొందెదను.

94-7
శబ్దబ్రహ్మణ్యపీహ ప్రయతితమనసస్త్వాం న జానంతి కేచిత్
కష్టం వంధ్యశ్రమాస్తే చిరతరమిహ గాం బిభ్రతే నిష్ప్రసూతిమ్।
యశ్యాం విశ్వాభిరామాః సకలమలహరా దివ్యలీలావతారాః
సచ్చిత్సాంద్రం చ రూపం తవ న నిగదితం తాం న వాచం భ్రియాసమ్॥
7వ భావము :-
భగవాన్! కృష్ణా! 'వేదములు శబ్దబ్రహ్మము' అని తెలిసియు, పరిశుద్ధమనసు, పరిపూర్ణము అయినభక్తి లేక కేవలము అధ్యయనము చేయుటకే వల్లెవేయువారు నిన్ను ఎన్నటికీ తెలుసుకొనలేరు. వారి ప్రయత్నములు వ్యర్ధములగును.వేదములు ప్రతిపాదించిన పరతత్వ సారమును గ్రహించుకొనలేని యత్నములు చిరకాలము గొడ్డుమోతు ఆవును పోషించిన రీతిని నిష్ప్రయోజనమగును. ప్రభూ! సకల పాపములను హరించునది, ముల్లోకములను అలరించునది అయిన నీ సచ్చిదానందరూపమును, అవతారలీలలను కీర్తించలేని వాక్కు నన్ను ఆశ్రయించకుండుగాక!

94-8
యో యవాన్ యాదృశో వా త్వమితి కిమపి నైవావగచ్ఛామి భూమన్
ఏవం చానన్యభావస్త్వదను భజనమేవాద్రియే చైద్యవైరిన్।
త్వల్లింగానాం త్వదంఘ్రిప్రియజనసదసాం దర్శనస్పర్శనాదిః
భూయాన్మే త్వత్ప్రపూజానతినుతిగుణకర్మానుకీర్త్యాదరో౾పి॥
8వ భావము :-
భగవాన్! నీ రూపము ఎటులుండునో నాకు తెలియదు. నీవు ఇటువంటివాడవు అటువంటివాడవు అను తత్వవిచారణను నేనెరుగను .వేరేవిధమగు ఏభావనయు లేక నీయెడ భక్తికలిగి నిన్ను సేవించుట మాత్రమే నేను చేయగలను. ఛేదిరాజును (శిశుపాలుని) సంహరించిన ఓ! పరమాత్మా! శ్రీకృష్ణా! నీ చిహ్నములు (గుర్తులు) ధరించి నీ పాదపద్మములను ప్రీతితో సేవించు నీభక్తులను సందర్శించుచు నిన్ను పూజించుచు, నీ గుణగణములను కీర్తించుచు, లీలలను గానముచేయుచు, నిరంతరమూ నీ ధ్యాసలో నిమగ్నుడనై యుందును; నన్ను ఆదరించుము.

94-9
యద్యల్లభ్యేత తత్తత్తవ సముపహృతం దేవ దాసో౾స్మి తే౾హం
త్వద్గేహోన్మార్జనాద్యం భవతు మమ ముహుః కర్మ నిర్మాయమేవ।
సూర్యాగ్నిబ్రాహ్మణాత్మాదిషు లసితచతుర్భాహుమారాధయే త్వాం
త్వత్ప్రేమార్ధ్రత్వరూపో మమ సతతమభిష్యందంతాం భక్తియోగః॥
9వ భావము :-
భగవాన్! కృష్ణా! నేనేమేమి కలిగియుంటినో, నాకేమేమి లభించబోవునో అదిఅంతయూ భక్తితో నీకే సమర్పింతును. నేను నీదాసుడను .నీ సేవలో అలసత్వము చూపను. నీ ఆలయము పరిశుభ్రము చేయుట మొదలగు కర్మలను ఇష్టముగా ఆచరింతును. సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, సకలమునను వ్యాపించిననీ ఆత్మ అను చతుర్భుజములతో ప్రకాశించుచున్న నీ ఈ రూపమును ఆర్తిగా ఆరాధింతును. ప్రభూ! నీ ప్రేమార్ద్రరూపము నిరంతరముగా నాహృదయమున ప్రవహించుగాక! అట్టి భక్తియోగమును నాకు ప్రసాదించుము.

94-10
ఐక్యం తే దానహోమవ్రతనియమతపస్సాంఖ్యయోగైర్దురాపం
త్వత్సంగేనైవ గోప్యః కిల సుకృతితమాః ప్రాపురానందసాంద్రమ్।
భక్తేష్వన్యేషు భూయస్స్వపి బహుమనుషే భక్తిమేవ త్వమసాం
తన్మే త్వద్భక్తిమేవ ద్రఢయ హర గదాన్ కృష్ణ।వాతాలయేశ॥
10వ భావము :-
భగవాన్! కృష్ణా! నీ ఐక్యము పొందుట దానముచేత, త్యాగముచేత, హోమాది క్రతువులుచేత, తపస్సు సౌంఖ్యాది యోగములచేత కూడా దుర్లభము. సర్వకాల సర్వావస్థలయందు నీయందే తమ చిత్తమును నిలిపి నిన్ను ఆరాధించి గోపికలు నీలో ఐక్యమయిరి, పుణ్యాత్ములు అధిక భక్తి కలిగినవారు వేరే భక్తులు ఎందరో ఉండి ఉండవచ్చును; కాని గోపికల భక్తినే నీవు స్వీకరించితివి. గురవాయూరు పురాధీశా! అటువంటి భక్తిని నాలో ధృఢతరము చేయుము. నా రోగమును హరించుము.


ఏకాదశ స్కంధము
94వ దశకము సమాప్తము
-x-