నారాయణీయము/ఏకాదశ స్కంధము/91వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
ఏకాదశ స్కంధము
[మార్చు]91- వ దశకము - భక్తి స్వరూపవర్ణనము
91-1
శ్రీకృష్ణ। త్వత్పదోపాసనమభయతమం బద్థమిథ్యార్థదృష్టేః
మర్త్యస్యార్తస్య మన్యే వ్యపసరతి భయం యేన సర్వాత్మనైవ।
యత్తావత్ త్వత్ప్రణీతానిహ భజనవిధీనాస్థితో మోహమార్గే
ధావన్నప్యావృతాక్షః స్థలతి న కుహచిద్దేవదేవాఖిలీత్మన్॥
1వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! మిధ్యాజగత్తుకు బద్ధుడైన జీవుడు అనేక కష్టములకు లోనగుచున్నాడు. స్వయముగా నీవే ఉపదేశించిన భజనార్చనలను ఆర్తితో పాటించినచో అట్టి ఉపాసకుడు అవివేకియే అయినను సంసారక్లేశమున చిక్కుకొనడు; పతనము చెందడు. సర్వాత్ముడవైన దేవదేవా! నీ పాదపద్మములను ఆశ్రయించినచో సర్వ భయములు, వేదనలు తొలిగిపోవును.
91-2
భూమన్। కాయేన వాచా ముహురపి మనసా త్వద్బల ప్రేరితాత్మా
యధ్యత్కుర్వే సమస్తం తదిహ పరతరే త్వయ్యసావర్పయామి।
జాత్యాపీహా శ్వపాకస్త్వయి నిహితమనః కర్మవాగింద్రియార్థ।
ప్రాణో విశ్వం పునీతే న తు విముఖమనాస్త్వత్పదాద్విప్రవర్యః॥
2వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! సకలేంద్రియములను నీసేవకు వినియోగించి ధృఢభక్తితో నిన్ను సేవించువాడు ఏ జాతివాడు అయుననూ అట్టివాడు పవిత్రడగుటయే కాక సకల విశ్వమునూ పవిత్రముచేయును. నీ పాద పద్మములయందు విముఖుడైనవాడు విప్రుడే అయిననూ పవిత్రుడు కాలేడు. నాకు శక్తిని, ప్రేరణను కలిగించు ఓ! పరమాత్మా! నా శరీరముతోను, వాక్కుతోను, మనస్సుతోను నేను చేయు సకల కర్మలను నీకే అర్పింతును.
91-3
భీతిర్నామ ద్వితీయాత్ భవతి నను మనఃకల్పితం చ ద్వితీయం
తేనైక్యాభ్యాసశీలో హృదయమిహ యథాశక్తి బుద్ధ్యా నిరుంధ్యామ్।
మాయావిద్ధే తు తస్మిన్ పునరపి న తథా భాతి మాయాధినాథం
తం త్వాం భక్త్యా మహత్యా సతతమనుభజన్నీశ భీతిం విజహ్యామ్॥
3వ భావము :-
భగవాన్! అన్యము అను భావన భీతినికలిగించును. వాస్తవమనకు అన్యమనునది, భిన్నమయినది ఏమియూలేదు; అది మనస్సు కల్పించిన భావన మాత్రమే. వివేకము మాయకు వశమయునచో చిత్తమున ఏకత్వము ఎన్నటికినీ నెలకొనదు. ప్రభూ! శ్రీకృష్ణా! మాయకు అధిపతివగు నిన్ను ధృఢభక్తితో సేవించి, చిత్తభ్రాంతిని నియంత్రించెదను; సమస్తమునందు ఏకత్వభావనకు యత్నించెదను; భీతిలేక జీవించెదను.
91-4
భక్తేరుత్పత్తివృద్ధీ తవ చరణజుషాం సంగమేనైవ పుంసాం
ఆసాద్యే పుణ్యభాజాం శ్రియ ఇవ జగతి శ్రీమతాం సంగమేన।
తత్సంగో దేవ భూయాన్మమ ఖలు సతతం తన్ముఖాదున్మిషద్భిః
త్వన్మహాత్మ్యప్రకారైర్భవతి చ సు దృఢా భక్తిరుద్ధూతపాపా॥
4వ భావము :-
భగవాన్! సంపదకోరువాడు శ్రీమంతుల సాహచర్యమును కోరును. అంతఃకరణయందు భక్తిని పొందకోరువాడు పుణ్యపురుషుల సాంగత్యమును అభిలషించును. అట్టి సత్పురుషుల సాంగత్యము నాకు కలుగ చేయుము; వారి భోదనలు, ప్రభూ! నీ లీలలు, మహత్యములు వినుభాగ్యమును నాకు కలిగించుము; సుధృఢము, పాపరహితము అగు భక్తిని ప్రసాదించుము.
91-5
శ్రేయోమార్గేషు భక్తావధికబహుమతిర్జన్మకర్మాణి భూయో
గాయన్ క్షేమాణి నామాన్యపి తదుభయతః ప్రద్రుతం ప్రద్రుతాత్మా।
ఉద్యద్ధాసః కదాచిత్ కుహచిదపి రుదన్ క్వాపి గర్జన్ ప్రగ్రాయన్
ఉన్మాదీవ ప్రనృత్యన్నయి కురు కరుణాం లోకబాహ్యశ్చరేయమ్॥
5వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! ముక్తిని ప్రసాదించు మార్గములలో ఒకటి అయిన భక్తి మార్గమును నేను అనుసరించెదను. అత్యంత భక్తితో నీ జన్మవృత్తాంతమును, లీలలను మరల మరల వినెదను. నా హృదయము పరవశమగునట్లు, పలుమారులు నీ నామసంకీర్తనను చేసెదను. కొన్ని సమయములలో గానముచేయుచు, నవ్వుచు, నృత్యముచేయుచు బాహ్యస్మృతి లేక ఉన్మాదివలె తిరుగుచుందును. ప్రభూ! నన్ను అనుగ్రహించుము.
91-6
భూతాన్యేతాని భూతాత్మాకమపి సకలం పక్షిమత్స్యాన్ మృగాదీన్
మర్త్యాన్ మిత్రాణి శత్రూనపి యమితమతిస్త్వన్మయాన్యానమాని।
త్వత్సేవాయాం హి సిధ్యేన్మమ తవ కృపయా భక్తిదార్ద్యం విరాగః
త్వత్తత్త్వస్యావబోధో౾పి చ భువనపతే।యత్నభేదం వినైవ॥
6వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! పంచభూతములలోను, పంచభూతత్మకములగు పక్షులు, మత్స్యములు, మృగములు, మానవులు మొదలగు సకలప్రాణులలోను (మిత్రులు, శత్రువులు) వ్యాపించియున్న నీరూపమును నేను తలచెదను; నా బుద్ధిని స్థిరపరచుకొని నీకు నమస్కరించెదను. విశ్వేశ్వరా! నీయందు నాకు ధృఢభక్తిని, వైరాగ్యమును ప్రసాదించుము. పరతత్వజ్ఞానముతో నిన్ను సేవించు భాగ్యమును కలిగించుము .
91-7
నో ముహ్యన్ క్షుత్తృడాద్యైర్ భవసరణిభవైస్వన్నిలీనాశయత్వాత్
చింతాసాతత్యశాలీ నిమిషలవమపి త్వత్పాదాదప్రకంపః।
ఇష్టానిష్టేషు తుష్టివ్యసనవిరహతో మాయికత్వావబోధాత్
జ్యోత్స్నాభిస్త్వన్నఖేందోరధికశిశిరితేనాత్మనా సంచరేయమ్॥
7వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! నీ పాదపద్మములపై స్థిరముగా నా చిత్తమును నిలిపి, ఆకలిదప్పులకు వెఱువక, క్షణమయిననూ నీపాదధ్యాసవీడక, ఎల్లప్పుడూ నీ నామమునే స్మరించుచూ నిన్ను సేవించెదను. మంచి చెడులయెడ సమభావము కలిగి ఫలితమేదయునను అది మాయే! అన్న ఎరుకను కలిగి ఉండెదను. నీ కాలిగోరునుంచి సహితము ప్రసరించు కాంతికిరణములు - చల్లని చంద్రకాంతి కిరణములవలె ప్రభూ! నాహృదయమును తాకుచుండగా, ఆనందముతో సంచరించెదను.
91-8
భూత్వేషేషు త్వదైక్యస్మృతిసమధిగతౌ నాధికారో౾ధునా చేత్
త్వత్ప్రేమత్వత్కమైత్రీజడమతిషు కృపా ద్విట్సు భూయాదుపేక్షా।
అర్చాయాం వా సమర్చాకుతుకమురుతరశ్రద్ధయా వర్ధతాం మే
త్వత్సంసేవీ తథాపి ద్రుతముపలభతే భక్తలోకోత్తమత్వమ్॥
8వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! నీవు సకల భూతాత్మకుడవు - అన్న భావన నా చిత్తమున స్థిరముగా నిలిచినను నిలవకపోయిననూ నీ ఎడల మాత్రము నాకు ప్రేమ, భక్తి, నీ భక్తులపట్ల మితృత్వము, పరతత్వజ్ఞాన విముఖులయెడ దయ, శతృత్వమువహించిన వానిపై ఉపేక్ష, నాకు ప్రసాదించుము. ప్రభూ! నీ ఆర్చామూర్తులను అర్చించువారు నీ భక్తులలో శ్రేష్టులగుదురు. నీ ఆర్చామూర్తిని సేవించవలెననుడు కోరిక నాయందు వృద్ధిచెందుగాక!
91-9
ఆనృత్య త్వత్స్వరూపం క్షితిజలమరుదాద్యాత్మనా విక్షిపంతీ
జీవాన్ భూయుష్ఠకర్మావళివివశగతీన్ దుఃఖజాలే క్షిపంతీ।
త్వన్మాయా మా౾భిభూన్మామయి భువనపతే।కల్పతే తత్ప్రశాంత్యై
త్వత్పాదే భక్తిరేవేత్యవదదయి విభో। సిద్ధయోగీ ప్రబుద్ధః॥
9వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! నీ స్వరూపము మాయావృతమయినది. నీ ప్రేరణచేతనే జలము, భూమి, వాయువు మొదలగు పంచభూతములు తమ మాయతో జీవులను కర్మబద్దులను చేయుచున్నవి; ఆయా కర్మల ఫలములను వారిచేత అనుభవింపజేయుచూ, భ్రాంతిలోముంచి దుఃఖితులను చేయుచున్నవి. ప్రభూ! నేనట్టి మాయలో పడకుండుగాక! ఆ మాయాప్రభావమును అధిగమించుటకు నీ పాదభక్తియే ఏకైకమార్గమని ప్రబుద్ధుడు అను ఒక సిద్ధయోగిచెప్పెను.
91-10
దుఃఖాన్యాలోక్య జంతుష్వలముదితవివేకో౾హమాచార్యవర్యాత్
లబ్ద్వా త్వద్రూపతత్త్వం గుణచరితకథాద్యుద్భవద్భక్తిభూమా।
మాయామేనాం తరిత్వా పరమసుఖమయే త్వత్పదే మోదితాహే
తస్యాయం పూర్వరంగః పవనపురపతే। నాశయాశేషరోగాన్॥
10వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! జీవుల సుఖదుఃఖములను చూచుచూ వివేకమును పొందెదను; ఉత్తమ గురువులు చెప్పిన నీ స్వరూపతత్వమును; గుణగణములను, మహత్యములను తెలుసుకొనెదను; జ్ఞానభక్తితో మాయను అధిగమించెదను. పరమానందము ప్రసాదించు వైకుంఠము చేరుటకు నీ పాద భక్తియే సోపానము. అట్టి భక్తిని సాధించుటకు నా వ్యాధిని హరించుము; అని గురవాయూరు పురాధీశా! నిన్ను ప్రార్ధించుచున్నాను.
ఏకాదశ స్కంధము
91వ దశకము సమాప్తము
-x-