Jump to content

నాయకురాలు (పల్నాటి వీరచరిత్ర)/3-వ అంకము

వికీసోర్స్ నుండి

3-వ అంకము

[ ప్రవేశము - ప్రతాపుడు ]

ప్ర : లోకమంతా ఒక పెద్ద కసాయిదుకాణం. మారణకర్మ అవిచ్ఛిన్నంగా జరుగుతూనే వుంటుంది. హింసాదోషంమాత్రం నా కంటదు. ప్రపంచములో ఎవరిమీదా ద్వేషంలేకుఁడా ప్రేమతో చంపేవాణ్ణి నే నొకణ్ణే. రణసాధనాలు - అంటే మారణసాధనాలు -- ప్రపంచమంతటా అమర్చిపెట్టా. కొమ్ములు, కోరలు, గోళ్లు, గిట్టలు, కొండ్లు — ఇవి నా పంచబాణాలు. వీటితో నా పని ముప్పాతికె మువ్వీసం తెమిలిపోతున్నది. కత్తి మొదలయిన కృత్రిమసాధనాలు యెప్పుడోగాని వుపయోగించను.

పల్నాడు నా ప్రేయసి. నా పౌరుషం పల్నాడంతా వెదజల్లే. ఎక్కడజూచినా నా భీకరరూపమే ప్రత్యక్ష మవుతుంది. ఏళ్ల లో కత్వలు, ఎత్తిపోతలు, సుడిగుండాలు తప్ప యెక్కడా యిసుకతిన్నెలు లేవు. గులకరాళ్లు, నాపరాళ్లు, చెకుముకిరాళ్లు, పలుగురాళ్లు మొనలుదేలి కత్తులున్నట్టుంటవి. ఇక్కడ పండ్లచెట్లకంటె ముండ్లచెట్లెక్కువ. పరాయిదేశపువాడు అక్కడి పశువులను పట్టుకోవలెనంటే

చిక్కవుగదా ! స్త్రీపురుషులు ఆబాలగోపాలము అంతా వీరులే. ఆంధ్రదేశములో పల్నాటికి వీరభూమని పేరు.

1వ-రంగము

అభ్యంతరమందిరముయొక్క పంచపాళి.

[ ప్రవేశము - నాయకురాలు మేజాబల్లమీద కూర్చొని ]

నాయకురాలు : (స్వగతం) రెండుజాములకు మిగిలింది. నిద్దురపట్టదు. కందిరీగలవలె తలంపులు నన్ను పట్టి పల్లార్చుతున్నవి. చుక్కలకంటె మిక్కిలయినవి. దిక్కుతోచడం లేదు. గగనచారులైన ఓ గ్రహసత్తములారా ! లోకమున కంతకూ భావిసూచకులయిన మీరై నా మార్గము సూచించలేరా? లేక మీశక్తికికూడా మించిందా ?

శ్రుతిమించి రాగాన పడుతున్నది. సమత్వమను పేరుపెట్టి మాలమాదిగలను రెచ్చగొట్టి అందరిమీదికి ఎక్కొలుపు తున్నాడు. ఏమిఘోరము! చాపకూడట. సర్వము జగన్నాథమయిపోతున్నది. చన్న కేశవాలయము చండాలులపర మయినది. అంతయు చెడినది. వర్ణాశ్రమధర్మాలు వరద గలిసినవి. వేదములు, యజ్ఞోపవీతములు త్యాజ్యము లట. సంస్కృతము పనికిరాదట, వ్యాస వాల్మీకాది మహాకవుల విజ్ఞానామృతము పందికి పన్నీటివలె వీరికి పనికిరాదు గామాలె. బ్రహ్మనాయుడా ! నీకై అంతగా వగవనుగాని నీవు జన్మించి పల్నాటిని పరిహాసాస్పదము జేస్తున్నావని నాకు విచారము.

మాలలు, మంగలులు, చాకలులు, కుమ్మరులు మత ప్రచారకులట! వీరాధివీరుడయిన పిచ్చిరెడ్డి మాలకన్నడి క్రింద వాహినీపతి. పండువంటి బ్రాహ్మణుడు-ఆ అనపోతునుమాలపోతులలోగలిపావు. నీ మతప్రచారకుల ముందు మన్వాది మహర్షు లేలపనికివస్తారు ? చెట్టు చెడు కాలమున కీ కుక్కమూతిపిందెలు. దేశాన్ని పంచుకొని తినే పాలకులు, స్వార్థపరులై పరులనాశ్రయించి పైకి రా గోరే ప్రజలు. దేశ మీ దుర్గతికి వచ్చింది.

ఎందుకీ గంట? ఎవరురా అది ?

నౌకరు : ( ప్రవేశించి) సహాయమంత్రిగారు అగత్యముగా తమతో మాట్లాడగోరుతున్నా రు.

నాయ : ఇప్పు డెంతపొ ద్దయినది ?

నౌక : తోలికోడి కూసింది.

నాయ : మెల్లాలోకి తీసుకొనిరా. ( ఇద్దరు వెళ్లుతారు)

( నాయకురాలు, నరసింగరాజు ప్రవేశము )

నాయ: రాజుగారూ ! దయచేయండి. తమకు నిశాచరత్వ మబ్బినట్టున్న దే?

నర : సాహచర్యదోషం.

నాయ : నాకు ఈ రాత్రంతా అనిమిషత్వ మబ్బిందిగాని రాత్రించరత్వం పట్టలేదే !

నర : నిశాచరులూ ఒకప్పు డనిమిషులే. ఈ రాత్రి నాకు రెండుగుణాలూ ఏకకాలమందే పట్టుబడ్డవి. రాత్రి గంగవరం బోయి కట్టుబోతును పట్టుకొని వచ్చా. వాడి మాయకోడిని యాభై మొనగాడికోళ్ల మీద వదిలి చూశా. ఒక్కొకదానికి అయిదునిమిషాలు పెట్టలేదు. వరుసగా నరికి పోగులు బెట్టింది. నాయ : చిత్రం ! కారణ మేమని వూహిస్తారు ?

నర : తాను మంత్రకట్టు కట్టాననీ, ఎదటికోడిదెబ్బలు తనకోడికి తగలవనీ అంటాడుగాని నే నమ్మను.

నాయ : మఱి మీ అభిప్రాయమేమిటి ? ఏదో అసాధారణ ప్రజ్ఞ కొంత వున్నదంటారా?

నర : మంత్రకట్టనుకోనుగాని కొంతప్రజ్ఞ లేకేమి ? కోడికి యీకెలలో యేదో యినుపతీగెలతో అల్లినకవచం తొడిగి వున్నదనుకొంటాను. దాన్నిమనలను ముట్టుకోనియ్యడు.

నాయ : ఏ పిల్లెయితేనేమి. ఎలుకనుబట్టితేసరి, వాణ్ణి నమ్మి మనం పందెం వొడ్డవచ్చునా ?

నర : నిరభ్యంతరంగా వొడ్డవచ్చు. బ్రహ్మనాయుడూ నాయకురాండ్ర మంత్రశ క్తికంటే వాడి మంత్రశక్తి ఎక్కువ శక్తిగలదని రుజువవుతుంది.

నాయ : నాయుడు పందేనికి మొగ్గేనా ?

నర : నాగమ్మగారిమంత్రశక్తి నాయుణ్ణి మొగ్గించడములోనే వున్నది. మొగ్గుతాడనే నా నమ్మకం.

నాయ: ఎందుకని?

నర : ఆయనకింకా తగినంతసిబ్బంది పోగుగాలేదు. నాయకురాలు రెడ్డిసేనలతో యెప్పుడు వచ్చి మాచర్లమీద పడుతుందోనని భయపడుతున్నాడట. యుద్ధము చేయకుండా నాగమ్మను వోడించేమార్గం యేదయినా కనపడితే తప్పక సంతోషిస్తాడు. నాయ : ఎంత అతడు సిద్ధముగా వున్నా మనముగా సూచించబోతే అనుమానపడతాడు. మహాయావలమనిషి. ఏమరుపాటున వొప్పించాలె.

నర : సంక్రాంతి యిక పదిరోజు లున్నది. ఈ యేడు మన కోడిపందేలకు రాడేమో?

నాయ : అదంతా వట్టిది. సప్తా యేడులోకాలలో యెక్కడ కోడిపందెమని కాకికబురు వచ్చినా వెళ్లుతాడు. పోకుండా వుండలేడు. ఒక్క మాచర్లకే ఆహ్వానం పంపితే అనుమానిస్తాడు. చుట్టుపట్ల రాజ్యాల కన్నిటికీ ప్రకటన పంపుదాం. దూరపువూళ్ల వాండ్లకు ఆలస్యంగా పంపితే వాండ్లు రారు. ఇక మాచర్లవారూ మనమే హాజరవుతాము. రాజుగారి సంతకంతో ప్రకటన పంపితే బాగుంటుంది. ప్రకటనకు ముసాయిదా తయారుచేయండి. ఎవరురా అక్కడ?

నౌకరు : చిత్తం.

నాయ : వ్రాతపరికరాలు తెప్పించు.

[ గుమాస్తా ప్రవేశము ]

నాయ : వ్రాయి.

గు : చిత్తము.

నాయ : (చెప్పుతుంది.)

ఆహ్వానపత్రిక

ఈ యేడు సంక్రాంతి కనుముపండుగరోజున ఏటాజరిగే దానికంటె ఇనుమిక్కిలిగా గురిజాల మైదానములో కోడి పందెములు జరుగబోతున్నవి. మేటిపందెగాండ్లందరూ పౌరుషముగల పుంజులనుదెచ్చి పందెములు జరిపి దేశములో పౌరుషమును పెంపొందింప గోరుతున్నాము. మానధనులయిన ప్రభువులును, సరదారులును 'కోడిపోరుకంటె గొప్పదిలేదయా' అనే ప్రమాణవాక్యమును సార్థకపరచ గోరుతున్నాము.

ఇట్లు

పల్నాటిప్రభువయిన నలగామరాజు

ఇది చాలునా?

నర : మనరాజు పల్నాటిప్రభువని సంతకముచేయడము ఎంతో సూచిస్తున్నది.

నాయ : పల్నాటికంతకు తనే ప్రభువునని అభిప్రాయము.

నర : అది కాదనేవారితో కలతకు మొద లన్నమాట.

నాయ : ఈ పందెమే అందుకాయె. సరే, ప్రకటనకు ప్రతులు తయారుచేయించి నలుదిక్కులకు పంపించు.

గు: చిత్తము.

[ వెళ్లుతాడు ]

నర : పందెమేమి బొడ్డుతారు ?

నాయ : ఓడినవారు తమ రాజ్యమును గెలిచినవారి కొప్పగించి పరదేశములకు వెళ్లిపోవడం.

నర: గడువువెళ్లినతరువాత ?

నాయ : తరువాతి సంగ తెవరెరుగుదురు ? నర : యుద్ధమేనా?

నాయ : ఈమధ్య గోగ్రహణాలూ, యుద్ధాలు జరుగకుంటే,

నర : రెండవభారతకథ నడుస్తుంది.

నాయ : పర్యవసానంమాత్రం భేదంగా వుంటుంది. కృష్ణు డిటుంటాడు. నేను కృష్ణపాత్రను ధరిస్తా.

నర : సరే, మనకు జయం నిశ్చయం.

[ లేస్తాడు ]

నాయ : కట్టబోతును గుప్తంగా స్వాధీనములో వుంచండి.

నర : పందేలయ్యేవరకూ కోణ్ణీ, వాణ్ణీ మాయింట్లోనే పదిలం జేసా.

నాయ : మీరూ మంత్రకట్టే అంటూవుండండి. బహుమతులు మాత్రం పుష్కలంగా యియ్యండి.

[ నరసింగరాజు నిష్క్రమణం ]

నాయ : [ స్వగతం ]

జూదరితనంగూడ అబ్బింది. ఇది రాజకీయజీవితం. కుట్రలు, కుతంత్రాలు, మారాముళ్లు, ఎన్నో చేయక తప్పదు. నిద్రలేదు, గుండె నిమ్మళంలేదు, కడుపులో చల్ల కదలకుండా దూడలను దువ్వుకుంటూ మానెడు విత్తులు చల్లి గోనెలు పండించుకుంటూ హాయిగా వుండకుండా లేనిపోని బెడద బెట్టుకుంటినేమా అని చివరకు విచారపడవలసివస్తుందేమో. అమాయికపు ఆవు పశువులు – రచ్చలలో రాటుదేలిన ఈ రాజకీయవేత్తలు ఎక్కడి కెక్కడ? హస్తిమశకాంతరం భేద మున్నది. అయితే — అట్లావుండు. ఆఁ _ భేదమా ? ఉండదుమఱీ - పశువులకూ మనుష్యులకూ భేదముండదూ? ఆహార నిద్రాదులలోనేకదా పశుప్రపంచమంతా యిమిడివున్నది ? మనోవికాసము గలవాడు మానవుడు. మానవజన్మమెత్తి పశువులవిధంగా జీవించనా ? మంచితనమనగా మట్ఠతనం గాదు. జడభరతుని జీవితపద్ధతి నాకు రుచించదు. మానవుడు మేధావంతుడయినందుకు పశుప్రాయుడుగా జీవించగూడదు. పల్నాటిని పీలికలుగా చించి జనులలో కలహములకూ, కల్లోలములకూ కారణమౌతుంటే, ఋషి సాంప్రదాయములన్నీ ధ్వంసంజేసి సంఘమును సంకరం జేస్తుంటే, పశువులాగ చూస్తూ వూరుకోనా ? మూఢ జనులవలె బాధలు సహిస్తూ పడివుండనా ? నాయందీశ్వరశక్తి ప్రస్ఫుటమై వున్నది. మంత్రశక్తికి కొదవలేదు. ఉత్సాహశక్తి యీ మహదారంభమునకు పురికొల్పినది. చతురుపాయముల నువయోగించి యీ కార్యమును సాధించితీరుతాను.

జూదము పనికిరాదా ? రాజు చతురంగబలసమేతుడై యుద్ధము చేయవచ్చునుగదా? గుఱ్ఱములకూ, ఏనుగులకూ నే కోళ్లను కలుపుతాను. ఏనుగులు పోరి రాజ్యాలు సంపాదించంగాలేనిది కోళ్లుపోరి సంపాదిస్తే తప్పు వచ్చిందా ?

కార్యమువల్ల కాకపోతే ఖడ్గము నుపయోగిస్తాను. పల్నాటి నుద్ధరిస్తాను. ఇప్పటి కీ యెత్తు వేసి చూస్తాను.

[ నిష్క్రమణం ]

2వ-రంగము

మాచర్ల - కచేరిసావడి

[ మలిదేవరాజు, బ్రహ్మనాయుడు మొదలగువారు ప్రవేశము ]

బ్రహ్మ: చూచారుగదా ఆహ్వానపత్రిక . ఈయేడు కనుము పండుగ చాలా ఖులాసాగా వెళ్ళిపోతుంది. ప్రకటన ఒక్క పల్నాటికేకాదు. నాయకురా లిది చాలా మంచిపని జేసింది. చుట్టుపట్ల రాజులంతా మూగుతా రనుకొంటాను. అయితే పాపం వాండ్లకు వ్యవధి చాలదు. దేశంలో పందేలంటే యింకా సరదా పుట్టలే. కొత్తగా యిప్పుడు దేవులాడబోతే వట్టి అలికీకోళ్లు దొరుకుతవి. జాతికోళ్లు దొరకవు. నాకు వారంరోజులు గడువిస్తేచాలు. ఏరకం గావలెనంటే అవి తయారుచేస్తాను. నా కో ళ్లెప్పుడూ తయారు తింటూనేవుంటని. ఇదంతా యెందుకు - వచ్చే సంవత్సరం మాచర్లలోనే పందేలు జరుపుదాం. మనకీర్తి చుట్టుపట్లంతా వ్యాపిస్తుంది. బాలుడూ, రేపు పందేనికి నీవు కోళ్ళను యేర్చి యేర్పాటుచెయ్యి.

బా. చం : మా ముఠాలోనే వున్నవి. లోకాన్నంతా జయించగల కోళ్ళు.

బ్రహ్మ: ప్రయాణం రేపుకద్దనంగా బంట్లనన్నింటినీ ఒక్కచోట చేర్పించు. తనఖీకి వస్తా ఒక్కసారి కంటితో చూచానాఅంటే కోడిచార చెప్పివేస్తా.

కొమ్మ : నాయుడుగారూ, నా దొక మనవి. ఈ వ్యసనం కూడనిది. మనం ఆజోలి పోవద్దని నా అభిప్రాయం. ప్రస్తుత స్థితులలో పచ్చిగడ్డివేస్తే మండేటట్లుగా వున్నది. ఉభయులకు కలహాలు పెరుగుతవి. మనము ఆపలేము. బ్రహ్మ : తమరు అనవసరంగా భయపడుతున్నారు. ఇవి మనవాండ్లలో పౌరుషం పూర్తిగా పెంచవలసిన రోజులు. కోడి పందేలే వీరులను తయారుచేసే గురుకులాలు.

మ. దే. రా : నిశ్చయం. కోడిపందేలే లేకపోతే యింతమంది వీరులు మనవైపు లేకనేపోదురు:

అ. రా : మానాన్నగారు చెప్పినదే వాస్తవం. దీనిమూలంగా కలహాలు పెరిగితీరుతవి. అలగాజనం చెప్పినట్టురారు. గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు.

బ్రహ్మ : నలగామరాజుగారికి పందెములంటే చాలాయిష్టం. ఏది వొడ్డుదామన్నా సరేనంటారు. విరోధాలకు బదులు యిటువంటి సమావేశములవల్ల యితరరాజులతోగూడ సఖ్యం కుదుర్చుకోవచ్చు.

మనం ప్రస్తుతం సిబ్బందితక్కువవాండ్లం. పందేలలో సరదాగల రాజులందరినీ మనవైపుకు లాగగలను. ఇది మన చేతులలోవున్న బలమయిన సాధనం. దాన్ని వుపయోగించడమే నీతి. మన అదృష్టం బాగావుంటే యేది యెట్లా జరుగుతుందో చెప్పలేము.

మ. దే. రా : నిశ్చయం

అ. రా : మాకు వ్యాయమని తోచింది చెప్పాం.

కొమ్మ: తమ చిత్త ప్రకారం కానియ్యండి.

బ్రహ్మ: ప్రభువుగారి అభిప్రాయమేమి ?

మ. దే. రా : తప్పక మనం పరివారసహితంగా పోయి పందెం పెట్టవలసిందనే. వెనుకడుగు వద్దు.

అందరు: చిత్తం.

3-వ రంగము

గురిజాలదగ్గర మైదానం

[ బాలుడు. కన్నమనీడు ప్రవేశము ]

[ కోళ్లపందెం తెరలోపల జరుగుతుంది ]

బాలుడు : నాన్నగారు వచ్చేవేళయింది. తాగడం ఆపివేయించు. కత్తులన్నీ చికిలిచేశారా?

కన్న : కత్తు లెందుకు? నా నెవిలి ఆరెదెబ్బతోనే నాయకురాలి పుంజులను పడుకోబెడుతుంది.

బా. చం: అటువంటి పనులు జెయ్యకు. వట్టిపందేలు గావు.

కన్న : వూరికే తమాషాకన్నా, ఇదుగోనోయి, ఇక కోళ్లకు దాణా వెయ్యకండి. కాస్త ఆకలితో వుంటేనేగాని రోష మెక్కదు. నీళ్లుబెట్టి వరుసగా పందిట్లో కట్టి వేయండి.

[ మలిదేవరాజు, బ్రహ్మనాయుడు ఇతరులు ప్రవేశము ]

బ్రహ్మ: బాలచంద్రా ! అంతా సిద్ధంగా వున్నదా ?

బా. చం: మనవాండ్రమంతా వచ్చాము. గురిజాలవారు ఇప్పుడే ఒకరొకరు చేరబారుతున్నారు. నరసింగరాజుగారు వచ్చారు. పై రాజ్యాలవాండ్ల పొళుకు వెక్కడా కనబడదు. అంతా చప్పగా వుందికాని యెక్కడా ఉత్సాహం కనబడదు.

బ్రహ్మ : ఆవైపుకల్లా నరసింగరాజే సర్దాగల మనిషి. కొంతవరకు రాజుగూడా నయమే. ఇక పై రాజ్యాల సంగతి చెప్పనే అవసరంలేదు. మ. దే. రా : పైవాండ్లకు కాలవ్యవధిగూడా చాలదులే. వడసారం వారంరోజులయినా లేకపోయె. ఇటువంటి పందేలలో నిలువబడవలెనంటే కోళ్ళకు యెంతశిక్షణ వుండాలె ! నేను పదిహేను రోజులయినా యీదించంది. కోడిని పందేనికి బెట్టను. వట్టివాటిని బెట్టి పేరుచెడకొట్టుకోవడం దప్ప యేమీ లాభం వుండదు.

బా. చం: చూస్తారా మన కోళ్ళను ?

బ్రహ్మ : పదండి. దాని చెరు పేముంది ? మళ్ళీజూతాము. నా తనిఖీకి ఆగని కోడిని యెప్పుడూ పందేనికి బెట్టను. నాకు నచ్చిన కోడి యెప్పుడూ కోసబోదు.

మ. దే. రా : అనుభవం.

బ్రహ్మ : కేవలం అనుభవమే కాదు.

మ. దే. రా : మెళకువగూడానూ. అరుగో ! రాజుగారూ, నాయకురాలూ వస్తున్నారు.

బ్రహ్మ : కాస్త హెచ్చుతగ్గుగా వేళకే వచ్చారు.

కన్న : మనము అగ్గిపడకముందే ఆరంభించాలె.

బ్రహ్మ : మన ఆలస్యమేమున్నది ? వారు సరే ననంగనే ప్రారంభింతాము.

[ నాయకురాలు ప్రవేశము ]

[ రంగస్థలములో గురిజాలవారు ఒక భాగములో కూర్చుంటారు ]

నాయ : మనవాండ్లంతా వచ్చారా? మాచర్లవారంతా తయారుగా వున్నట్లున్నదే? మాదెప్పుడూ తేమానమే. ఇంకానయం, నరసింగరాజుగారు పూనుకోబట్టి యిప్పటి కయినా తెమిలాం. అయ్యా, బ్రహ్మనాయుడుగారూ ! యితరదేశాలవారు యెవరూ వచ్చినట్టులేదే? యేమి చేతామంటారు?

బ్రహ్మ: వాండ్లకు దీనియందు శ్రద్ధతక్కువ. వచ్చిన మనమే కానిత్తాము.

నాయ : ఇతరదేశాలదాకా యెందుకు, మాకున్నదీ మీకున్నశ్రద్ధ?

బ్రహ్మ: బయటివాండ్లకు సకాలంలో తెలిసినట్టులేదు. రెండునెలలయినా ముందుగా ఆహ్వానా లందితే, వెసులుబాటు చూసుకోని వస్తారు.

నాయ: దీనియందు రుచికలిగిందాకానే తరువాత వద్దన్నా వూరుకోరు. కొంతకాలం దీనిభారం మీమీద బెట్టుకొని జరపండి.

బ్రహ : అట్లాగే. వచ్చేసంవత్సరం ఆహ్వానాల యేర్పాటంతా నే జేస్తాను. ఇక్కడే జరుపుదాం.

నాయ : యెక్కడ జరిపితేనేమి? మాచెర్లలో జరిపినా నా కిష్టమే ; అదిమాత్రము మనదిగాదా ?

[ రహస్యంగా ]

మ. దే. రా : చూచారా. ఈ ఆటలవల్ల యెట్లా స్నేహం గుదురుతున్నదో.

బ్రహ్మ : ఈ మాటే నేను నిన్నంటే కొమ్మరాజుగా రంగికరించారుగారు.

కొమ్మ : నాయుడుగారూ, తమరేమయినా చెప్పండి. ఆమె మాటలలో స్నేహమేమీ గనపడడం లేదు. మాచర్ల "మసదం” టున్నది. బ్రహ్మ : దూరపుచూపు మంచిదేగాని తమకు అనుమాన మెక్కువ.

కొమ్మ : మనము చెడతాం.

బ్రహ్మ : నమ్మక చెడడంకంటే నమ్మి చెడడం మంచిది.

అ. రా : ఎట్లాజెడ్డా పర్యవసానం వొకటే.

[ ఒక సుద్దులవాడు. ప్రవేశము ]

పాట

బు. క : పల్నాటిమిద్దెలకు - వాసాలులేవు
          కొండవీటిబ్రాహ్మలకు - మీసాలులేవు
          మాచర్లకోళ్లకు - రోసాలులేవో - తంధాన

[ వెళ్లిపోతాడు ]

బా, చం : ఎవడురావాడు ? చూపిస్తాం వుండు, మాచర్ల కోళ్లకు రోసాలు వున్నదీ, లేనిది.

నర : మీరూ చూతురుగాని. క. దా : అవును, వుభయులము చూస్తాం. తినబోతూ రుచడగడ మెందుకు?

[ సుద్దులవాడు తిరిగి ప్రవేశము ]

బు. క : మాచర్లదొరలకు - వేసాలులేవు
          అజ్ఞానచేష్టలకు - దోసాలులేవు
          పల్నాటిరెడ్లకు - మీసాలులేవో - తంధాన.

[ వెళ్లిపోతాడు ]

కేతు : అవురా ! బ్రహ్మనాయుడు నీచేత యిట్లా కూయిస్తున్నాడా ? పల్నాటిరెడ్లకు మీసాలులేవుగా ? . నాయ : అయ్యా, మీ రెందుకు తొందరపడతారు. అవసరము వచ్చినప్పుడు చూపింతురుగాని.

కొమ్మ : ఇదియేమో పెద్ద పన్నుగడగా వున్నది.

నర : ఎవడివో వెఱ్ఱిమాటలకు మీ రుభయులూ కోపించడం బాగాలేదు.

కేతు : రెడ్డిక్షాత్రం వెలమక్షాత్రానికి తీసిపోయేదిగాదు.

బా. చం : పారంపర్యంగా వచ్చే వెలమక్షాత్రం యెండాకాలంలో వచ్చే రెడ్లయొక్క చొప్పకట్టక్షాత్రంక్రింద ఆగుతుందా?

కేతు : రెడ్డికత్తులు వెలమకుత్తుకలకు ప్రయోగించినప్పుడు తెలుస్తుంది.

బా. చం : రెడ్లకత్తులు చొప్పకట్టలు బాగా నరుకుతవి.

బ్రహ్మ: అయ్యా, మనము విలాసంగా పండుగ గడుపుకోడానికి వచ్చాం. మీ వాక్కలహాలుచాలించి పందేలు ప్రారంభించండి. మధ్యవర్తిని యెన్నుకొందాము.

నర : ఉభయులకు కావలసినవాడూ, శ్యాయస్తుడూ, ఆలరాజే దీనికి తగినవాడు.

బ్రహ్మ: మాకూ యిష్టమే.

అ. రా: నాన్నగారూ ! యిది యేదో యెత్తుగా తోస్తున్నది.

కొమ్మ : ఏమన్నాగానియ్యి. అంగీకరించి న్యాయం జెప్పు. ఉభయులూ కోరినప్పుడు కాదనడం తప్పుమాట.

అ. రా : అంగీకరించాను. మీ ఉభయులు చెరొక ప్రతినిధిని నిర్ణయించుకొని వారిద్వారా పుంజులను వదలండి. నల. రా : మా తరఫున నాగమ్మగారు. ఆమే చర్యల కన్నిటికీ నే బద్ధుణ్ణి. మ. దే. రా : మా తరపున బ్రహ్మనాయుడుగారు, వారి చర్యలకు నేనూ బద్దుడనే.

నాయ : నరసింగరాజుగారూ, మొదట అచ్చకాకిడేగను వదలండి.

బ్రహ్మ: మంచిదానిని యేర్చారు. నలుపులో కాకిని మించింది. కన్నడూ, మనం వింజాబెరసను వదలుదామా ?

కన్న : వద్దు. అసలుబెరసనే వదలుదాం.

బ్రహ్మ: సరే.

నాయ : ఎంత అందంగా వుందీ ! కండ్లు తెల్లగా బేడబిళ్లలలాగున్నవి. మా నెవలికి దీటుగాదు. అయినా చూతాం.

నల. రా : రెండూ పోరుతుంటే కర్ణార్జునుల ద్వంద్వయుద్ధంలా గున్నది.

మ. దే. రా : ఒక తన్నుకే డేగకు బోర బద్దలుగా చీలింది.

నాయ : చీలినా మెడపట్టు వదిలిందేమో చూడండీ. ఆ పట్టులో బెరస పడవచ్చు.

బ్రహ్మ : ఫయిసల్, మెడమీది దెబ్బతో డేగ పడిపోయింది.

అ. రా : నాగమ్మగారూ ! యింకొకదాన్ని వదలుతారా ?

నాయ : రాజుగారూ ! పూరికోళ్లలో బడిరకం చూసి వదలండి.

మ. దే. రా : (రహస్యంగా) సరుకు ఖాళీ అయినట్టున్నది. పూరికోళ్లలోకి దిగింది.

బ్రహ్మ : వినేను ; చిన్నగా మాట్లాడండి. బెరసక్రింద పూరి కోడి ఆగలేదు. అయిదు నిమిషాలుకూడా పట్టదు

బా. చం: అయింది. పూరికోడి పూరిమేసింది. ఇంకొకదాన్ని తియ్యండి. బ్రహ్మ : పడిపోయినా వదలదు చూడు. పూరికోళ్లలో మెరుగయిందే, బెరసకు ఆగ లేకపోయిందిగాని.

నాయ : బెరసలు మాదగ్గర లేవు. వింజాబెరసను వదిలి చూస్తాం.

బా. చం : ఇది తొలిముద్దకే పోతుంది. వియ్యమయినా కయ్యమయినా సరిదీట్లతో చెయ్యాలె.

నల. రా : వింజాబెరస అంత తీసివేసిందేనా ?

బా. చం : ఎంతోనా ? చూడండి. అది మొగిసి ముందుకు రాందే?

నల. రా : రాకేమి ? కమరబడ్డది.

బా, చం: అదుగో ! ఒక్కతన్ను కే తెల్లయీకె వేసింది. అరరే! పరుగెత్తిపోతున్నది.

[ బ్రహ్మనాయుడుపక్షమువారు నవ్వుతారు ]

మ. దే. రా: నాగమ్మగారూ ! కోసకోళ్లనుగూడా పందేలకు పెట్టిస్తున్నారేమి ? మీవైపున దీటయిన పుంజులు లేకపోతే చెప్పండి ; మేము పెట్టలను వదలుతాము.

నాయ : పుంజులు వోడిపోయి పెట్టలే గెలుస్తవేమో, ఎవరు చూచారు? నరసింగరాజుగారూ, ఈసారి నెవలిని వదలండి.

బ్రహ్మ : ఇది చూపులకు బాగానే వున్నది. వరియెన్ను లాగ తో కానూ అదినీ.

నాయ: దీనితో మీ బెరస ఫయిసల్.

బా. చం: నెవలి బెరసను కొట్టటానికి యిదే మొదలు. మీకంత బరవాసావుంటే ఎంతపందెం వొడ్డుతారో చెప్పండి. నల. రా : నే వోడితే రాజ్యం మీకు వదిలి యేడేండ్లు దేశ త్యాగంజేసి సపరివారంగా ప్రవాసం చేస్తాను.

మ. దే. రా: నే వోడినా అదే పందెం. గెలిస్తే పల్నాటి ఏకచ్ఛత్రాధిపత్యంజేస్తా. వోడితే నా మొదటిస్థితికి నే వస్తా.

బ్రహ్మ : నాగమ్మగారూ, సరేనా ?

నాయ : మీ రేమంటారో చెప్పలేదే ?

బ్రహ్మ: ఏమయినా సరే, అన్నమాటకు వెనుకకుపోయేది లేదు.

నాయ : (నలగామరాజుతో ఆలోచించి) యేమయినా సరే, మేమూ వెనుకకుబోము.

కొమ్మ : ఇది యేదో విలయానికి వచ్చింది. యీ పందెం కూడదు.

అ. రా : నేను ఉభయులనూ ప్రార్థిస్తాను. ఇంకొక పందెం పెట్టుకోండి. ఎవరు వోడినా కష్ట మే, అయిన వాండ్లలో పని.

మ. దే. రా : (బ్రహ్మనాయుడితో) వీండ్లు ప్రతిదానికీ అడ్డం వస్తున్నారు. తమరు లేచి గట్టిగా జెప్పండి.

బ్రహ్మ : ( లేచి) కొమ్మరాజుగారు చెప్పినది వాస్తవమయినా ఉభయరాజులూ, మంత్రులూ కలిసి పందెం వొడ్డి వెనుక దీయడం అక్రమం.

నాయ : నన్నూ అదే బాధిస్తున్నది.

మ. దే. రా : ఏమయినా కానియ్యండి, నేను వెనుకడుగు వేయను. నల. రా : నేనుమాత్రం వెనుకకు తగ్గుతానా ?

మ. దే. రా : [ బ్రహ్మనాయుడితో రహస్యంగా ] మా అన్నమాట మిగలా అన్నందుకు పండ్లబిగువున మాట్లాడుతున్నాడు గాని సందిస్తే వెనుకకు లాగుతాడు.

బ్రహ్మ : వదలండి కోళ్లను.

నాయ : కోళ్లు మన పందెంయొక్క విలువ తెలిసి పోట్లాడుతున్నట్లు కనుబడుతున్నది.

బా. చం : తొలింబ్రంలోనే బెరస జుట్టు పట్టుకొని అయిదు తన్నులు తన్నింది.

బ్రహ్మ : అరే! అయిదూ తప్పించుకున్న దే ! వజ్రదేహంలా గున్నది.

నాయ : అదుగో ! ఫయిసల్ ; బెరసకు మెడ సగం దెగింది. కోడిమెడ బడ్డది.

బ్రహ్మ : బెరస పడిపోయింది.

బా. చం : తెప్పిరిల్లి లేస్తుందేమో ఆగండి.

నాయ : పెద్దనిద్రే; నరసింగరాజుగారూ, నేవలిని ఆపండి.

నల. రా : మాచర్ల మాది.

[ కోలాహలం ]

నాయ : ఎప్పుడూ మీదే. నడుమ రజ్జుసర్పభ్రాంతయింది.

నల. రా : బ్రహ్మనాయుడుగారూ, మీ రిక మాచర్ల పోవడమెందుకు ? యిక్కడనుంచే ప్రయాణం గట్టండి.

మ. దే. రా: అరే. చివరకు యిట్లయిందేం ? అ. రా : ఇంకొక విధంగా అవుతుందని నేననుకో లేదు. మొదట జెపితే వినకపోయినారు. యిప్పటికయినా యేదో విధంగా రాజీగా ఫయిసల్ చేసుకోండి..

నాయ : మీరు జెప్పే రాజీమాట అంతా బతికి బాగుంటే, యేడుసంవత్సరాలు ముగిసినతరువాత ఆలోచింతాము. ఈ మధ్యగాదు.

మ. దే. రా : రాజ్యం వచ్చింది ; పోయింది.

బ్రహ్మ : మాచర్ల వెళ్లి బంధువులను తీసుకొని వెళ్లుతాం.

నల. గా ; మూడురోజులు గడువు, తరువాత ఒక్క నిమిషం. వుండవద్దు.

[ బ్రహ్మనాయుడు మొదలగువారు నిష్క్రమణం, తెరపడుతుంది ]