నాయకురాలు (పల్నాటి వీరచరిత్ర)/2-వ అంకము

వికీసోర్స్ నుండి

2-వ అంకము

[ ప్రవేశము - ప్రతాపుడు]

నేను లయకారకుణ్ణే అయినా నావల్ల లోకానికి శ్రేయస్సేకాని నష్టం లేదు. విలయమే వికాసానికి తోడ్పడుతుంది. రాయిని నశింపజేసి మొక్కను జేస్తా, చెట్లను పోకార్చి జంతువులను పెంపు జేస్తా, జంతుసృష్టిని వికసింపజేసి మనుష్యుణ్ణి చేస్తా, మనుష్యుణ్ణి పశుత్వములోనుంచి మానవత్వమునకూ, దానినుంచి దేవత్వమునకూ పెంపు జేయడమే నా పని.

అజ్ఞానం పశుత్వ చిహ్నం. లోకంలో అజ్ఞానం నశింపజేయడానికి బహుప్రయత్నాలు జేస్తున్నా, లోకములోని మతకర్తలూ, సంస్కర్తలూ, బోధకులూ నా పరివారములోని వారే. అజ్ఞానముతో పోరాడి గెల్చినవాడే ధన్వి. ముల్లోకాలను జయించినవానికంటె లోకములోని అజ్ఞానమును, ధనాంధతను, నిరంకుశత్వమును నిరోధించినవాడే వీరుడు. పల్నాటిరంగములో యీ యుద్ధముకూడా ప్రదర్శిస్తా

1 - వ రంగము

మాచర్ల - సభాభవనము

[బ్రహ్మనాయుడు, మలిదేవరాజు , సభికులు ప్రవేశము ]

బ్రహ్మనాయుడు : మిత్రులారా ! మన కిప్పటికి నిబ్బరము గుదిరింది. మాచర్ల రాజధానీనగర మయింది. మన ఆదర్శముల ప్రకారము రాజ్యముచేయడానికి అవకాశము గలిగింది. శ్రీ మలిదేవప్రభువు పెద్దవారయి రాజ్యనిర్వహణమునకు బూనుకొనేవరకూ దానిని రక్షించే భారము మనమీద వున్నది. భారము లన్నిటికంటే రాజ్యభారము దుర్భరము.

కొమ్మరాజు : అందుక నే 'రాజ్యాంతే నరకం ధృవ' మన్నారు.

బ్రహ్మ : అది యెంతయు సత్యము. ధర్మాధర్మాఃను నిర్ధారణ చేయడం దుష్కరం. దుష్టశిక్షణము, శిష్టరక్షణము చక్కగ జరిపినప్పుడే రాజు తన ధర్మమును నిర్వహించినవా డవుతాడు. అది చేయనినాఁడు ధర్మము నశించి, అధర్మము పెచ్చు పెరుగుతుంది. జనులు చెడునడతలలో దిగుతారు. వారి పాపమును రాజు పంచుకోవలసివస్తుంది.

కొమ్మ: రాజధర్మమును చక్కగా ఉపదేశించారు.

బ్రహ్మ : దుష్టులలోను, శిష్టులలోను చేర్పదగని దీనజనులను పరిపాలించడం రాజుయొక్క రెండవధర్మం "దుర్బలస్య బలం రాజా” అని బలవంతులు బలహీనులను బాధించకుండా రక్షించడము ముఖ్యకార్యము. భూమి ఏభారమయినా మోయగలదుగాని ధనికుడిభారము మోయలేదు.

కొమ్మ : తమ మంత్రిత్వమున మలిదేవుని రాజ్యము నిజముగ దేవరాజ్యమై వర్ధిల్లగలదని భావిస్తాను.

బ్రహ్మ: ఈ మహాకార్యము నా వొక్కడిచే నెరవేరేదిగాదు. సరదారులు, పరిజనులు తోడ్పడినప్పుడే యీ రాజ్యతరణి సౌఖ్యముగా ప్రయాణముచేయగలదు. రాష్ట్రమునకు ప్రజలు శరీరము ; ప్రభువు శరీరి. ఇవి రెండూ పొందిక గలిగి యుండినప్పుడే ధర్మనిర్వహణము కొనసాగుతుంది. కాని యింతవరకు నే జెప్పినదంతా పురుషప్రయత్నమును గురించియే; దై వము తప్పదలంచినచో మన ప్రయత్నములన్నీ నిష్ప్రయోజనము ; చెన్నకేశవుని కృపలేనిది యేకార్యమును నెరవేరదు.

కొమ్మ : పురుషకారము మూడుపాళ్లు, దైవ మొకపాలు. దైవము తప్పక అనుకూలిస్తాడని భావించియే మనము ప్రయత్నము చేయవలసివుంటుంది. మన మిప్పుడు ప్రభుత్వ నిర్వహణానికి తగిన యేర్పాట్లు చేయవలసియున్నది.

బ్రహ్మ : మీ యందరి కోర్కెమీద నన్ను రాజుగారు మంత్రిగాను, పురోహితుడుగాను నియమించారు. కొమ్మరాజుగారూ, ముతసాని పిచ్చిరెడ్డిగారూ, గండు కన్నమనాయుడుగారూ మంత్రాలోచనసభ్యులుగా వుండి నాకు తోడ్పడ ప్రార్థితులు. పశురక్షణమునకు లంకన్నా, సేనానాయకత్వమునకు మాలకన్నడూ అర్హులని నియమించినాను.

కొమ్మ : నేను క్షత్రియుణ్ణి. క్షత్రియేతరులయిన పై వుద్యోగులకు నమస్కరించవలసిన బాధ్యత లేనియెడల యీ పదవిని స్వీకరించడానికి యేసందేహం లేదు.

ముతసాని పిచ్చిరెడ్డి : కన్నమనీడు మతవిషయమున తమకూ, యుద్ధవిద్యయందు నాకూ ప్రియశిష్యుడు. తమశిష్యుణ్ణయిన నా కేయాక్షేపణా లేకపోయినా, తమ శిష్యకోటిలో చేరని చమూపతులకూ, వాహినీపతులకూ మీ కొ త్తనియామకము కంటకముగా వుండక మానదు. ఈరోజు గురిజాల నుండి తెలియవచ్చిన సంగతులనుబట్టి నలగామరాజు నాగమాంబికను మంత్రిగాను, సర్వాధికారములు గల నాయకురాలుగాను నియమించారనీ , ఆమెకు కేతురెడ్డినీ నరసింగరాజునూ సహాయమంత్రులుగ యేర్పరచారనీ తేలింది. నాయకురాలూ, కేతురెడ్డీ మాచర్లమండలములోని రెడ్డిప్రముఖుల నందరినీ తమవైపు త్రిప్పుకొనడానికి రాయబారాలు జరుపుతున్నారు. మాచర్లమండలములో కెల్ల మహావీరుడని పేరొందిన మాడుగుల వీరారెడ్డి యీ రోజు గురిజాలకు పయనమైనట్లు తెలుస్తుంది. అతనిని బహుశా సేనాధ్యక్షుణ్ణిగా నియమిస్తారు. తమరు బాగా యోచించి యేర్పాట్లు చేయవలసిందని ప్రార్థన.

బ్రహ్మ : : గురిజాల సమాచారములు నాకూ కొంతవరకు తెలిసినవి. వైష్ణవమతప్రవిష్టులయిన తమబోటివారుదప్ప రెడ్లుగాని, ఇతర అగ్రజాతులుగాని మనకు తోడ్పడుతారని తోచదు. కన్నడు మన రాజునందు అచంచలమైన భక్తిశ్రద్ధలు గలవాడు. నాయకురాలి కెన్నడూ అతడు లోబడేవాడు గాడు. మఱియు నా భావములు కన్నడు గ్రహించినట్లు యితరశిష్యు లెవరూ గ్రహించలేదు. మన రాజ్యమును పాలించేది ధర్మముగాని, వ్యక్తులు గాదనే మూల సూత్రము మనము గ్రహించితే యీ సందేహాలు పుట్టవు.

పిచ్చిరెడ్డి : సనాతనవాదులయిన చాతుర్వర్ణ్యములవారు తమకు తోడ్పడరని నిశ్చయమేనా ?

బ్రహ్మ : చీకటి వెలుతురుకు తోడ్పడితే వారు మనకు తోడ్పడుతారు.

పిచ్చిరెడ్డి : అట్లయితే ధీశక్తిచేత తమరు సంపాదించిన రాజ్యం మలిదేవమహారాజుకు నిలువడం దుర్ఘటం. బ్రహ్మ : మనము ఆ ఐహిక రాజ్యాన్ని ఆను జేసికొని, ఆముష్మిక రాజ్యాన్ని స్థాపించవలెనని అనుకొంటున్నాము. ఇహము ఆముష్మికానికి మెట్టుగా వుండాలె. వర్ణభేదాలు సమత్వ ధర్మానికి ప్రతిబంధకాలు. స్వల్పకాలమయినా స్వర్గమే అనుభవింతాము.

కన్నడు : ఈ యేర్పాటు కొంత యోచించి చేయరాదా?

బ్రహ్మ: దాసూ! యేర్పాటు అయిపోయినది.

బాలచంద్రుడు : మన మీ క్షణమునుంచీ వర్ణభేదాలను నిర్మూలంజేసి మన ధర్మం విస్తరింపజేయాలె.

[ సేవకుడు ప్రవేశము ]

సేవకుడు : అయ్యా, గురిజాలనుండి రాయబారి వచ్చి కాచుకొని వున్నాడు.

బ్రహ్మ : గురజాలనుంచా ? రాయబారా? అవశ్యము లోపలికి తీసుకొనిరా,

( సేవకుడు నిష్క్రమించును )

కొమ్మ : కొత్తమంత్రిణి సంధి కోరుతున్నదేమో?

బ్రహ్మ: కాదు, విగ్రహమే కోరుతుంది. వారు సంధి కోరదగిన పరిస్థితు లిప్పుడు లేవు.

[ రాయబారి ప్రవేశము ]

బ్రహ్మ: పొదిలె పాపన్నగారా ! రండి, .

పాపన్న : అయ్యా, క్షమించండి. ఇక్కడ ప్రభు వెవరో, నమస్కార మెవరికి జేయవలెనో తెలియడంలేదు. పేరులేని ప్రభువుకు నమస్కారము.

బ్రహ్మ : మీరు వచ్చినది రాయబారమునకా, తగవులకా ? పాపన్న : నాకు గలిగిన సందేహమును వెలిబుచ్చినాను.

బ్రహ్మ: ఎందుకు మీ కీ సందేహము గలిగినది ?

పాపన్న : ఇక్కడ ప్రభువు రాజనామధారుడో లేక రాజప్రతినిథో మాకు దెలియదు. రాజు బాలుడుగాబోలు. వారిపై అధికారముగల పాలకు లెవరు?

బ్రహ్మ: మేమే.

పాపన్న : మీ కీ యధికార మెవరిచ్చారు ?

బ్రహ్మ : రాజుగారే యిచ్చారు.

పాపన్న : బాలు డిస్తే చెల్లుతుందా ?

బ్రహ్మ : యువరాజుకోసము రాజ్యమును మేమే సంపాదించాము.

పాపన్న : అనగా మీరే హక్కుదారులు ?

బ్రహ్మ : రాజుగారిదే రాజ్యము.

పాపన్న : మీరు వారికి వ్రాసి యిచ్చారా ?

బ్రహ్మ : వ్రాసి యియ్యడ మెందుకు ? రాజ్యము వారిదే.

పాపన్న : రాయబారము మీతోనే జరుపుతాను. ఉత్తరము చదువుకొన్నారా?

బ్రహ్మ : చదివాను.

పాపన్న : ఏమి జవాబు ?

బ్రహ్మ : మా రాజ్యము మీ కిచ్చుటకు వీలులేదు.

కొమ్మ : ఉత్తరములో నేమున్నది ? బ్రహ్మ : ఏమున్నది ? దుండగపు మాటలు. నలగామరాజును మోసపుచ్చి మండలము తీసికొన్నామట. తిరిగి యిచ్చివేయడమో లేక వారికి సామంతులుగా వుండి పొలించు కోవడమో జరుపవలెనట. కొమ్మ : రెంటికీ మన మంగీకరించకపోతేనో ? ?

బ్రహ్మ: దానికి జవాబు వుత్తరములో లేదు.

కొమ్మ : రెంటికీ అంగీకరించమని జవా బియ్యండి.

పిచ్చి రెడ్డి : తొందరపడవద్దు.

కొమ్మ : ఆ ఉత్తరానికి జవా బంతే.

పి. రె : వారి కోర్కెలను మన మంగీకరించనియెడల యేమి చేస్తారో చెప్ప లేదు గనుక ఉత్తరము సౌమ్యముగా వున్నది. సంధిమాటల కవకాశ మిస్తున్నది.

కొమ్మ : రెండునెలలనాడు రాజ్య మిచ్చి, ఈ రోజు మళ్లీ తెమ్మనమంటే రాజీ యేమున్నది ?

అలుగురాజు : ప్రతిపక్షముయొక్క దృష్టితోగూడా మనము యోచించాలె.

బాలచంద్రుడు : అనగా?

అలుగురాజు : వారు చెప్పేకారణాలు కేవలము నిరాధారములు గావు.

కన్నడు : మోసముచేశామంటారా?

అలుగు : కేవలము మోసముగాదు. భిడియపెట్టాము.

బ్రహ్మ: రాజ్యము ఇచ్చివేతామంటారా ?

అలుగు: రాజీగా బోదాము.

పి. రె: పోరునష్టం - పొందులాభం.

బ్రహ్మ: వారికి లోబడివుండడం గిట్టకనేగదా పంచుకొన్నాము ?

పి. రె: ఇప్పటికీ వెనుకటికీ భేద మున్నది. మన హక్కును వా కంగీకరిస్తున్నారు.

బ్రహ్మ : సామంతరాజును తొలగించే అధికారము రాజు కుండదా? పి. రె: మన బలాన్నిబట్టి వుంటుంది.

బా. చం: అది యిప్పుడే తేల్చుకుందాము.

పి. రె: ఇప్పుడు మనకు ప్రతిఘటించే బలమున్నదా ?

బ్రహ్మ : బుద్ధిపూర్వకంగా చేతులో వున్న రాజ్యం వదులుకొని నాగమ్మచేతికి పోదామంటారా ?

కొమ్మ : బ్రతికిన నాలుగురోజులయినా పౌరుషంతో జీవించాలె. రాజు క్షత్రియుడు. మంత్రి వెలమదొర. మీకు తగినరీతిగా వర్తించండి.

బా చం : వెలమలు కత్తికింద నలిగినవారుగాని కాడికింద నలిగినవారు గారు. నలగామరాజు కాడి మన మెడమీద మోపితే నాగమ్మ ఛో అనడం ఆరంభిస్తుంది.

పి. రె: బింకాలతో లాభం లేదు. కన్నడు : మాలకన్నడు జీవించివుండగా మాచర్లకు భయం లేదు. అవమానకరమయిన సంధి పనికిరాదు.

బా. చం: సంధికి యితరు లంగీకరించినా మే మంగీకరించము.

అనపోతు : సత్యం.

చాకలిచందన్న : మగసిరైన జవాబు చెప్పావు.

పాపన్న : మాచర్ల గురిజాలతో పోరడం పొటేలు కొండను ఢీకొన్నట్టే.

బహ్మ: ఇప్పుడు యుద్ధపుమాటల ప్రసక్తి లేదు. పాపన్న గారూ ! జవాబు యోచించి పంపిస్తాము.

పా: చిత్తము, సెలవు. ( నిష్క్రమిస్తాడు. )

బహ్మ: ఈ రాయబారంధర్మాన మన కర్తవ్యం స్పష్టంగా తేలింది. మనం సేనలను వృద్ధిచేసుకొనే పనిమీద వుండక తప్పదు. పి. రె: మనము అన్నికులములవారూ సేనలో చేరే సౌకర్యాలు చేస్తే మంచిది.

బ్రహ్మ : మనకు ధర్మచ్యుతి లేకుండా ఇతరకులములు చేరితే సంతోషమే. సైనికులకోసం సనాతనధర్మ వాదులం కాజాలము. మతస్వాతంత్ర్యంకోసమేగదా గురిజాలనుండి విడిపోయివచ్చాము. మన మతధర్మాలను స్పష్టంగా లోకానికి వెల్లడించి ఆచరణలో పెట్టినప్పుడే మనకు బలము చేకూరుతుందిగాని ; చెప్పేది వొకటి, చేసేది మఱొకటిగా వున్నంతకాలం మనధర్మము నెవరూ పాటించరు. కన్నమ నాయుడి కొమార్తెను బాలచంద్రుడి కివ్వడము నిశ్చయమయింది. లగ్నమయిన వెంటనే చెన్న కేశవస్వామి సన్నిధిన గోష్ఠి జరిపించి చాపకూటి సంతర్పణ చేస్తారని చాటించవలసినది. దానికి తగిన ప్రచారకు లెవరు ?

బా. చం : నా స్నేహితులలో ప్రచారకులుగా వుండదగినవాం డ్లనేకులున్నారు. వారిలో బాపన అనపోతురాజు, వెలమ దోర్నీడు, చాకలి చందన్న , కుమ్మర తేర్కుడు, అగసాలి చందన్న, మంగలి మంచన్న ముఖ్యులు.

బ్రహ్మ : మిమ్ములను నా తోడిప్రచారకులుగా నియమించుతున్నాను. మన మందరమును భగవంతుని సేవకులము. మనలో అంతరములు లేవు.

పి. రె: రెడ్డిప్రచారకు లెవరూ దొరకరా ?

బ్రహ్మ : నీవుదప్ప రెడ్డిప్రచారకుడు మరొకడు దొరకడు. దొరికితే సంతోషమే. విచారించండి. సోదరులారా!

చా. చందన్న : అయ్యా ! తమరు ధర్మసంస్థాపనకొరకు అవతరించిన మహాపురుషులు. మే మందరమును తమ అనుచరులము; సేవకులము. సోదరులారా ! అని పిలవడం మాకు క్షేమంగాదు.

బ్రహ్మ : మన మందరమూ భగవంతుని సేవకులము. ధర్మ నిర్వహణమునకై భగవంతు డుపయోగించు సాధనములము. భగవంతుని యెదుట అంతస్థుల భేదము లేదు. భగవంతు డేర్చుకొన్న పనిముట్లు కొన్ని యెక్కువనీ, మరికొన్ని తక్కువనీనా? భగవంతుని కృపచేత మన ప్రయత్నములు విజయము గాంచునుగాక !

2 - వ రంగము

[ సావడి - బ్రహ్మనాయుడు, కన్నమనీడు ప్రవేశము ]

కన్న : నాన్నగారికి నమస్కారము.

బ్రహ్మ : బాబా! తలంబ్రాలు గావడంతోటే గోష్టి ప్రారంభింతాము. వంటలయినవా?

కన్న : రెండువేలమందికి మాత్రమే ముందు ప్రయత్నం జరిగింది. జనము అనుకొన్నకాడికి యిబ్బడి ముబ్బడయ్యేటట్టున్నది. మరి పదిమంది కుమ్మరులను బిలిపించి అన్నం వండించి పోయిస్తున్నా. సాదం చాలినంత వుంటే సాధకం వెనుకా ముందూ సర్దుకోవచ్చు. తళియలు యెన్ని గంటల కుంచమంటారు?

బ్రహ్మ : తళియలంటే జ్ఞాపకంవచ్చింది. తగాదాలు రావుగదా?

కన్న : చాపకూటిపద్ధతికి అంగీకరించినవాండ్లుమాత్రమే గోష్ఠికి రావలసినదని ప్రకటించా. అందువల్ల తగాదా లేమీ రాకూడదు.

బ్రహ్మ : ఏ యే కులాలు వచ్చినవి ? కన్న : బ్రాహ్మణులు, వెలమలు, రెడ్లు స్వల్పంగా వచ్చారు. కోమట్లు రాలేదు. అలగాలు విశేషంగా వుంటారు. అందరికంటె మాలమాదిగ లెక్కువ.

బ్రహ్మ: కోమ ట్లసలే రాలేదా ? ఎందువల్ల ?

కన్న : లేదు, వారికి బ్రహ్మ వ్రాసిందో, బ్రాహ్మడు చెప్పిందో దప్ప మరొకటి పనికిరాదట.

బ్రహ్మ : భరన్యాపకలాపం యీరోజు జరుపుదామా ?

కన్న : కొంద రందుకోసం ప్రత్యేకంగా వచ్చారు. తమరు అనుగ్రహిస్తే నేనుకూడా అడ్డంకి తీర్చుకొనవలెననే వున్నది.

బ్రహ్మ: ఇంకా ఎవరెవ రున్నారు ?

కన్న : మంగళగిరినుంచి ఒక మాలదాసరిస్వామి వచ్చారు. బ్రహ్మతేజం వుట్టిపడుతున్నది. కేశవస్వామిసన్నిధిన తమద్వారా భరన్యాసం పొందవలెనని వున్నదట. భగవంతుని యొక్క సర్వమయత్వం ఆయన కనుక్షణమూ అనుభవములో వున్నట్టున్నది. సమదర్శనులంటే వారినే చూచాను.

బ్రహ్మ : వారిని తప్పకుండా వెటబెట్టుకొని తీసుకురా. ఏమి టా కలకలం ?

కన్న : మనవాండ్లదే. నగరసంకీర్తనం జరుగుతున్నది. దేవాలయమువైపుగా వస్తున్నారు.

బ్రహ్మ : నేనుకూడా వచ్చి కలుసుకుంటా, పద.

3 - వ రంగము

[మాచర్ల వీథి — అర్చకుడు, రెడ్డి వగైరాలు ప్రవేశం ]

రెడ్డి : ఓ స్వామీ ! ఇదేమి కలికాలమండి ?

పాట

[ శంకరాభరణం - చతుశ్రగతి - ఏక , ]

మాలకన్నడు - చాకలిచందడు - మంగలిమంచన్న
జట్టుగట్టుకొని - సేవ జేతురట - చెన్న కేశవులకు
కులకట్లిప్పుడు - వీరలందరు - కూలద్రోతురంట
మొదటవి జేసిన వారికంటెను - మొనగాం డ్లీరంట
బ్రహ్మనాయు డీ మాలగుంపులకు - పట్టుగొమ్మయంట
         సేనల - బెట్టి పోరునంట
         గుడిలో - కొట్టి దూరునంట
         మనలను - నెట్టివేయునంట
సాములుమీరే - శ్రద్దదీసుకొని - సరిపెడుదురు రండి.

అర్చ : ఇవ్వేళ గుళ్లో మీ సేవేనా ?

రెడ్డి : ఇంకేమిసేవ స్వామీ ! అన్నీ అంతానికి వచ్చినవి. కలియుగం ముంచకవస్తున్నది.

అర్చ: ఆ గోలేమిటి?

రెడ్డి : ఇంకా మీకు తెలియదూ? మాలగుంపు వూరేగుతూ గుళ్ళోకి పోతున్నది.

అర్చ : అయ్యో ! అయ్యో ! మాలగుంపే ! వచ్చిపడుతున్నది.
        మాదిగమల్లిగ - కుమ్మరితేర్కుడు - మంగలిమంచన్న
        పాప మప్పుడే - కలియుగమంతట - పండిపోయెనటర
        తోళ్ల గాబులో - దేవునిముంచి - తొలిచిపెడుదువటర
        తోళ్లకంపుతో - చన్నకృష్ణుడికి - ధూపమేతువటర
                 ఆవము - బెట్టి కాల్తువటర
                 మాంసము - బెట్టి ప్రోతువటర

            పొదిలో - బెట్టి యూతువటర
      చన్నకృష్ణు డీ - పూజలకెల్ల - సమ్మతించునటర ?
కుమ్మరి తేర్కుడు :
       చన్నకృష్ణుడు - త్రిప్పుచుండు తన - సారెను యెల్లపుడు
       చిత్రచిత్రముగ - ఘటములనెల్ల - చేస్తువుండు నెపుడు
       అగ్గిబుగ్గితో - అతని ఆవము - ఆరిపోవ దెపుడు
       పాతకుండలను - పోగు జేసి మఱి - పగులగొట్టు నతడు
            కులముల - గౌరవింప డతడు
            గుణముల - గొప్పసేయు నెపుడు
            పాపము - పరిహరించుతాడు
      పెద్దకుమ్మరని - చెన్నకేశవుడు - పేరుపొందినాడు.
పెద్దసెట్టి :
      గుళ్లుగోపురాల్ గట్టి దేవునికి - కొలువు సేయగలరా
      రత్నకిరీటము బెట్టి కేశవుని - రంజింపంగలరా
      అమ్మవారికి పైడికంటెలను - అర్పించంగలరా
      యేమిబెట్టనిది దేవుడు మీకు - యెట్లు కండ్లబడురా
           వూరికె - వచ్చిదూకునటరా
           కోరికె - లిచ్చిపోవునటరా
           ఆశల - కంతు వుండదటగా
  చిలుమువదలనిది - యెవ్వడి కైనను - ఛిద్రము బోనటరా.
బ్రహ్మనాయుడు :
పేదసాదలభేద మెరుంగని - పెద్దప్రభువతండు
చెన్న కేశవుని సాన్నిధ్యంబున - సతతముండగనుడు
చిన్ని కృష్ణుని చరణసేవనే - సేయుచుండు డెపుడు.

         చన్నకృష్ణుని - చక్కదనంబును - సందర్శింపగ రండు
         ముద్దుకృష్ణుని మురళీనాదము - మోగుచుండు వినుడు
                  తలచిన - తలపు లెరుగు నతడు
                  పిలువక - పలకరించువాడు
                  పేదల - పెద్దజేయు ఘనుడు
         పండిత పామర భేదంబులను పాటింపనివాడు.

క. దా : ఆహా ! నా హృదయం పొంగిపోతున్నది. ఏడీ చెన్నకేశవుడు ? సేవించంది నే వుండలేను.

బ్రాహ్మణుడు : ఎట్లా సేవిస్తావు ?

క. దా : వెళ్లి ఆలింగనంచేసుకుంటా. అంతటితో నా తాపము. ఆరిపోతుంది. అయ్యో నే భరించలేను.

బ్రాహ్మ : జన్మానా స్నానం జెయ్యని యీ మురికిశరీరంతో నేనా, నీవు ఆలింగనం చెయ్యడం ? చెన్న కేశవుడు మైలబడడూ ?

కన్నమదాసు: మైలబడతాడా, అయ్యో! మరెట్లా? దూరంగావుండి రెండు పూలు ఆయన పాదాలమీదపెట్టి చిన్నంగా వత్తుతా.

బ్రాహ్మ: నీ చేతు లొంకా తోళ్లకంపుకొడుతూనే వున్నవి. వాటితోనే అంటుకుంటావూ ?

క. దా: స్వామి సన్నిధిలో ఆయన వినేటట్టుగా కీర్తనలయినా పాడుకుంటా.

బ్రాహ్మ: బ్రాహ్మణుల నోట వచ్చే సామగానాలు వినేవాడు, నీ బొల్లిపాటలు వినవచ్చాడా ?

క. దా : అయ్యో, వినడా, మఱి నా గతేమి ? పోనీ ఎదటికిపోయి కండ్లతో నయినా చూస్తా. ఆ రూపం కండ్లతో జూచి ఆనందిస్తా. బ్రాహ్మ : బ్రాహ్మలు, కోమట్లు పట్టుబట్టలతో ఆలయం నిండివున్నారు. ఇది సేవాకాలం.

క. దా : అయితే నే నేమీ జెయ్యను ? నిలువలేనే. నాన్నగారూ ! ఏమి మార్గం? నాకు పిచ్చెక్కుతున్నది.

బ్రహ్మ : ఆయన్నే పిలువు, వచ్చి దర్శన మియ్యమని,

కన : కేశవా ! తండ్రీ ! నిన్ను చూడంది నిలువలేను. చెన్నకేశవా!

అదుగో కేశవుడు. ఆకాశమంతా కేశవుడే భూమంతా కేశవుడే, నా వొళ్లంతా కేశవుడే. నా లోపలా కేశవుడే !

పాట

[ హిందుస్తాని ముఖారి ఆది తాళము]

      దర్శనమాయె - సం - దర్శనమాయె
      విశ్వ - రూపుని - దర్శనమాయె
            దర్శనమాయె - సందర్శనమాయె - వి ||
      కేశవాయని - కేక వేయగ
      ఏకరూపమున - లోకమంతటను
           దర్శనమాయె - వి||

బ్రహ్మ : ఆర్యులారా! భగవత్కృపవలన కన్నమదాసుకు భగవత్సాక్షాత్కారము గలిగినది. అతడు ధన్యుడు. మనము ఈ సమయముననే మన వీరవైష్ణవమతముయొక్క ధర్మములను లోకమునకు వెల్లడించి వాటిని ఆచరణలో బెట్టుటకు ప్రయత్నించాము.

శ్రీమన్నారాయణునియందు భక్తి గలిగి ఆయన కృపాతిశయముచేత మోక్షమును పొందగలరు. వీరవైష్ణవు లందరు కులభేదములు పాటింపక సమభావముతో వర్తించవలసివున్నది. దయా సత్య శౌచములు ప్రతిమానవుడు అవలంబించవలయును. ఇవి వీరవైష్ణవమతముయొక్క ప్రధాన సిద్ధాంతములు.

బ్రాహ్మ : పంచమాది కులములతో సాహచర్యము అనర్థదాయకము కాదా?

బ్రహ్మ : అగ్రవర్ణముల వారికంటె పంచము లెక్కువ దుర్మార్గులు కారు. అందుచేత వారితో సాహచర్యమువలన యే అనర్థమును రాదు. ఆరోగ్యవిషయమున వారి అలవాట్లు కొన్ని సరియైనవి కావుగాని ఆ విషయమున వారిని బాగుచేయవలసిన భారము అగ్రవర్ణములమీదనే నిలచివున్నది. అసహ్యమునకోర్చి శిశువులను తల్లిదండ్రు లేవగింపక యేవిధముగ సాకుతారో అగ్రవర్ణముల వారందరూ శిశు ప్రాయులుగా వున్న పంచములను పుత్రప్రేమతో ప్రేమించి బాగుచేయడము ధర్మము. తల్లిదండ్రులకు శిశువు లెట్లు అస్పృశ్యులుగారో, పంచములూ అగ్రవర్ణములకు అస్పృశ్యులు గారు. వారిని ప్రేమించి బాగుచేయుట ఉభయులకూ తరణోపాయమే. మన హృదయముల యందు ప్రేమ వున్న యెడల వా రస్పృశ్యులు కావడమునకు మారుగా మన హృదయాలింగమునకే అర్హు లవుతారు. ప్రేమ లేకపోవడమే మన భేదములకు కారణము. పండితులు అందరియందూ సమదర్శనులే. విశ్వదృష్టి గల వాడికి తిరుపతికొండయొక్క ప్రతిరాతియందూ శ్రీ వేంకటేశ్వర్లే కనబడుతాడు. ఆత్మయొక్క విశ్వమయ త్వము గోచరించినవాడికి ఏభేదములూ కనపడవు. భేదముల కజ్ఞానమే మూలము.

వీరవైష్ణవులలో భోజన ప్రతిభోజనములకు అడ్డుండ గూడదు. మీ రందరు శంకలు విడిచి నిష్కల్మష హృదయములతో చాపకూడు భుజించి సమభావమును వెల్లడించవలెనని నా కోరికె.

బ్రాహ్మ : భోజన ప్రతిభోజనములకు మరింత ప్రాముఖ్య మియ్యడమెందుకు ?

బ్రహ్మ : కులభేదములను రక్షించే కంచెగోడలు భోజన ప్రతిభోజన నిషేధములే. శాస్త్రములు కులములమధ్య అనులోమ, ప్రతిలోమ వివాహము లంగీకరించి భోజన ప్రతిభోజనములు నిషేధించినవి. అన్యోన్యవివాహములకంటె భోజన ప్రతిభోజనములే సమభావము గల్గించడమున కెక్కువ తోడ్పడతవి. కనుక ఈ విభేదమును మీరు ముందు కొట్టివేయవలసివున్నది.

అందరు : శ్రీమద్రమారమణగోవిందో హరి,

బ్రహ్మ : వీరవైష్ణవు లందరు సమానమయిన మతహక్కులు కలిగివుంటారు. వేదములు పక్షపాతము జూపినయెడల అవి త్యాజ్యములు, యజ్ఞోపవీతము అందరును వేసికొన గూడనిచో, నా సోదరునికి నిషేధింపబడినది నాకూ పనికిరాదు. సంస్కృతము అందరూ చదువగూడనియెడలఅదీ వర్జనీయమె. దీనికే త్రివిధసన్యాసమని పేరు. సమదర్శన భావమునకు ప్రతిబంధకములయిన యీ మూటిని త్యజించినవాడే ఉత్తమ సన్న్యాసి. అందరు : శ్రీమద్రమారమణగోవిందోహరి.

బ్రహ్మ: అయ్యా ! తమ రందరు భోజనానికి లెండి,

[అందరు లేతురు, తెరపడుతుంది.]

4-వ రంగము

బ్రహ్మనాయుడి సావిడి

[ బహ్మనాయుడు, కన్నమనీడు ప్రవేశము ]

బ్రహ్మ : కన్నా ! బండి రోడ్డెక్కిందనుకున్నాం. మళ్లీ రొంపిలో కూరుకున్నది. నాయకురాలు కొరుకులు వేసింది లాగడం కష్టం. వదలిపెట్టి పోలేము. నరసింగరాజును మంత్రిగా నియమించినట్లయితే సమదీటుగా వుండే వాండ్లము. కాని అతడు గొప్ప త్యాగమే చేశాడు.

కన్న : మనిషి దుర్మార్గుడయినా అన్నయందు మిక్కిలి గౌరవం. మాచర్ల మన కియ్యడము అతని కేమాత్రం యిష్టంలేదు.

బ్రహ్మ: నరసింగరాజు చాలా దూరదృష్టిగలవాడు. నాయకురాలిని నియమించడం అతని సలహాయే అనుకుంటాను. దానితో రంగమంతా మారిపోయింది. కాయలను వెనుకకు తిప్పకపోతే ఆట కట్టుతుందేమో.

కన్న : ఎత్తుకోవడంతోటే షహా అన్నదే నాయకురాలు.

బ్రహ్మ : మనము వెనుకకు తగ్గినంతమాత్రముచేత వెంటబడే మనిషిగాదు. పక్క దాట్లుకూడా కాచుకోవాలె. కన్న : ఆమె కత్తికీ, కార్యాలోచనకూకూడా మన మెదురడ్డగలము గాని దేశములో ఆమెకున్న పరపతి ప్రతిఘటించడం దుర్ఘటం. మనకు మంది చాలుగాని మార్బలం తక్కువ.

బ్రహ్మ: మనకు దైవబల మున్నది. దానికి మించింది లేదు.

కన్న : అది సరే, మాచర్ల చన్నడు మనకూ, గురిజాల యిష్ట కామేశుడు ఆమెకూ వున్నారు. ఆ బలాలు మినహాయించి. మనం మాట్లాడుదాం.

బ్రహ్మ: నాకు ప్రతివీరు డేడీ ? ఆ(-

కన్న : అటు తమకు ప్రతివీరుడు లేనిమాట వాస్తవం.

బ్రహ్మ : నీవు, బాలుడు, అనపోతు, లంకన్న నాతోటివాండ్లే..

కన్న : అపచారం. తమ తరువాతి వాండ్లం.

బ్రహ్మ : అటు రాజు ధైర్యంజేసి రణరంగంలో నిలిస్తే అమోఘంగా పోట్లాడుతాడు. నాయకురాలు, నరసింగరాజు, వీరా రెడ్డి అతిరథులలోనివాండ్లే అయినా అటు నాయకబలం తక్కువ.

కన్న : సేనలు లేనిది నాయకు లేమిచేస్తారు ? మనకు పంచము లెందరు పోగయినా వారి సేనలో పదోవంతుండరు.

బ్రహ్మ : మనవాండ్లకు మతోత్సాహ మెక్కువ. అటు సైనికులు శిక్షలో ఆరితేరినా మనవాండ్ల మతోత్సాహం ముందు నిలువలేరు

కన్న : నాయకురా లీ భేదం కనిపెట్టకపోలేదు. వర్ణాశ్రమ రక్షణ మనే పేరుతో ఉత్సాహం పెంచుతుంది. అయినా మనవాండ్లకున్న తెంపు వాండ్ల కుండదు. బ్రహ్మ : అంతకంటె పైయెత్తుకూడా యెత్తింది. పల్నాడు చింపి చీలికెలు చేస్తున్నామట.

కన్న : అది నిజమే. ఇవ్వాళ యిద్దరు పంచుకొంటే రేపు పదిభాగాలవాండ్లు బయలుదేరవచ్చు. తమ కెట్లావుందో గాని పంపిణీ నాకుమాత్రం నచ్చలేదు.

బ్రహ్మ : పదిచీలికలు గాదు, పదివేల చీలికలయినా నా కిష్టమే. ప్రభువులకు పంచడమేగాదు, పల్నాడంతా పరిజనుల కందరికీ పదిలక్షల చెక్కలుజేసి, పంచిపెట్టి, యే బాధలూ లేకుండా వ్యవసాయం చేసుకొని జీవించమని చెప్పడమే నా కిష్టం. ఎన్నిభాగాలు చేసినా పల్నాడు పల్నాటి ప్రజలకే వుంటుంది.

కన్న : ఈ దృష్టితో జూస్తేతప్ప మీ పల్నాటివిభజనం నాకు నచ్చలేదు.

బ్రహ్మ : అందుకనే నాయకురాలు పల్నాటిని బలవంతంగా పంచుకొన్నామని చెప్పేది సులభంగా జనులమనసు కెక్కుతున్నది.

కన్న : మీ సిద్ధాంతం చాతుర్వర్ణ్యముల వారికి నచ్చుతుందనుకోను.

బ్రహ్మ : పోనీ, నచ్చినవాండ్లే మనతో చేరుతారు. అందుకనే పంచములే కావలె నంటున్నా.

కన్న : చివరకు మీ పోరాటము పంచమ-పంచమేతర తగాదాలోకి దిగుతుంది.

బ్రహ్మ : అంతకంటె బీదల- భాగ్యవంతుల తగాదాలోకి దిగుతుదంటే సరిపోతుంది. కన్న : సత్యాసత్యముల తగాదా అంటే యెక్కువ బాగా సరిపోతుందేమో?

బ్రహ్మ : ఒప్పుకొన్నా. నా సిద్ధాంతం నీ కర్థమయినట్టు మఱెవరికీ అర్థంగా లేదు.

కన్న : నే ధన్యుణ్ణి. తమ ఆజ్ఞలను శిరసావహించి ఆచరణలో పెడతా. పాపన్న రాయబారానికి యేమి జవాబు వ్రాస్తారు ?

బ్రహ్మ: వ్రాసే దేమున్నది ? అప్పుడు జరిగిన సంభాషణే జవాబు. దానిమీద నాయకురాలు ఏదారికి వస్తుందో చూడాలె. మనం వాండ్ల యావలు దీస్తూ మతప్రచారమూ, తద్వారా క్రొత్తసైనికులను చేర్చుకోవడమూ యెడతెగకుండా జరపాలె.

కన్న : చిత్తము.

(తెరపడుతుంది)