నాయకురాలు (పల్నాటి వీరచరిత్ర)/1-వ అంకము

వికీసోర్స్ నుండి

నాయకురాలు

1-వ అంకము

[ ప్రవేశము - ప్రతాపుడు ]

ప్రతాపుడు : నా పేరు ప్రతాపుడు. సౌందర్యవల్లి నా తోబుట్టువు. మాది మొదట శక్తి రూపం.

ప్రపంచములో సృష్టి స్థితి లయాలని మూడున్న వంటారు గాని, జరుగుతున్నవి రెండే కార్యాలు. అవి సంకోచ వికాసాలు. స్థితిలో మొదటి భాగం వృద్ధి ; రెండవది క్షీణత. వృద్ధి సృష్టి కార్యములోని భాగమే. క్షీణదశ లయములో జేరుతుంది. కనుక ప్రపంచములో సంకోచ వికాసాలు రెండే వున్నవి. అనగా సృష్టి, లయము అనే రెండుపనులే జరుగుతున్నవి.

సౌందర్యవల్లి సృష్టిని జేస్తుంది, నావల్ల లయం జరుగుతుంది. సౌందర్యవల్లి స్వరూపం శృంగారం, నా స్వరూపం రౌద్రం. సృష్టి జేయడం నా సోదరికి నిత్యలీల, లయింప జేయడం నాకు నిత్యలీల. మొదటినుంచీ నా కిదే పని. ఏదో నెపం బెట్టి నాపని నే జరిగించుకుంటుంటా.

నా నాటకానికి అంతులేదు. ఇదివర కెన్నో రంగాలయినవి. ఇంకా యెన్నో కావలసివున్నవి. పల్నాటిరంగం ఒకటి చూపించవలెనని వచ్చా. ఆఁ విన్నారా? ముందుగా దేవరహస్యం ఒకటి చెపుతా. పూర్వం విష్ణూ, శక్తీ - ఇద్దరూ తగవులాడారు. ఆ పగ తీర్చుకోవడానికి విష్ణుహంశలో బ్రహ్మనాయుడు, శక్తిహంశలో నాగమ్మ జన్మించారు. ఆ రెండు పాత్రలను బెట్టి నే నాటకం నడిపిస్తా. మీరు నాటకం చూస్తూవుండండి. నే మళ్లీ వచ్చి నా లీలలు యింకా మనవిచేస్తా. {{c|( నిష్క్రమణము )||

1-వ రంగము

గురిజాల - కోట పహరా

[ ప్రవేశము - పొదిలె పాపన్న ]

పాపన్న : అబ్బా ! చలికి వేళ్లు కొంగరుబోతున్నవి. ఎన్నిసార్లు పచారుజేసినా ఒంటికి వేడెక్కందే ! కాస్త దమ్ము పీల్చంది లాభంలేదు.

[ చుట్ట తాగుతూ ] ఎవ రా వచ్చేది ? పగవాండ్లా, స్నేహితులా?

[ కల్వగుంట కాశీపతి ప్రవేశము ]

కాశీపతి : నేనే.

పాపన్న : నేనే అంటే?

కా.ఎవరనై నా అనుకో.

పా : కాశీపతీ, శత్రుడవా, మిత్రుడ వా?

కా: ఎవరయిందీ యెట్లా జెప్పను, నీ సంగతి తేలందే ?

పా: తేలే దేమున్నది, పొట్టే తెలుస్తుంది.

కా: సామాన్యంగా అంతే అనుకో, మనబోటివాండ్లదే కష్టం పా : పిల్లలను చూడడానికయినా తేపా మాచర్లకు పోక తప్పదు. రెండు రాజ్యాలకూ విరోధాలు బలమయినవా అంటే, మధ్య సన్నవాండ్లం నలుగుతాం.

కా: చంద్రవంక యిక మనది కాదనుకోమా లేక నాగులేరు పగవాండ్లదని విడిచిపోదామా?

పా : ఈ పంపిళ్లేమిటి ? పల్నాడంతా ఒక టే గడ్డ.

కా : ఇదివరకు మనది. పోతుగ డ్డనిపించుకున్నది. చుట్టుపట్ల రాజ్యాలలో మన మన్నమాటల్లా చెల్లింది. ఇతరులు మనవంక తేరిచూడలేకపోయినారు.

పా: ఇవ్వాళ పల్నాడు రెండు చీలికెలు చేశారు. రేపు నాలుగు చేసుకుంటారు. వాండ్ల దేమిపోయింది ? వాండ్ల వుసులు వాండ్లు జూచుకున్నారు. మన కష్టాలు దెలిసినవాడు బ్రహ్మనాయుడై నా చెప్పకూడదూ?

కా: నీదంతా తెలియనిసోది. పంపిణీకి మూలకందం బ్రహ్మనాయుడే అయితే, ఆయనను వద్దనమంటావేమి ?

ఇవ్వాళ రెండు చీలికెలు చేశారు. రేపు నలుగురు పంచుకుంటారు. అప్పుడు నలుగురివి నాలుగుదారు లవుతవి. ఎదుటివాడికి పలచదనంగాదూ?

పా: పోయింది. పల్నాటిపేరు పోయింది. ఇక పల్నాటిపేరు మాసిపోయి చీలిక కొక కొత్తపేరు పుడుతుంది.

కా: ఎక్కడబోయింది ? పెద్దవాండ్లలోకూడ కదలిక బుట్టింది. సన్నగా రాజుతున్నది. కేతురెడ్డి మొన్న నాతో హెచ్చరించాడు. తరువాత యేమయిందో తెలియలా? పా: ఆయన యీ పహరాలోనే తనిఖీకి వస్తాడు. వేళయింది, పహరా మార్చుకొన్నట్టు దస్కతుబెట్టు.

కా: ఉఁ-దూరంగా అలికి డవుతున్నది.

పా: వస్తున్నట్టున్నాడు. పారా వెయ్యి.

కా: ( తిరుగుతూ) ఎవరువారు ? జవాబు చెప్పి కదులు. మిత్రుడవా, శత్రువువా ?

కే : మిత్రుణ్ణే ; కేతురెడ్డిని. అంతా క్షేమమా?

కా: అంతా క్షేమమే.

కే: అత డెవరు ? మాచర్లమనిషి లాగున్నా డే ?

కా: పొదిలె పాపన్న ; ఇప్పుడే పారా వదిలాడు.

కే: ఆహా ! కోటముఖస్థలాన యిద్దరు పగవాండ్లా కావలి గాయడం?

పా : పగవాండ్లమే. ఇక మాకు గంగధారిమడుగు, పాముల మడుగు, పిల్లేటినీళ్లు విషాలు ; గురిజాల పరదేశం.

కా: పెద్ద లేమైనా మార్గం యోచించారా ?

కే : ఒకటేమార్గం; పరాయిల చేజిక్కింది, వూరికే వస్తుందా ?

పా: రాదులే. యేమయినా తేలిందా?

కే: నరసింగరాజుగారు చాలా పట్టుదలగా వున్నారు. నాగమ్మగారు పొద్దున కాశీనుంచి తిరిగివచ్చారట. వెళ్లి మాట్లాడుదా మనుకొంటున్నాము. మీ సలహా ఏమని?

పా: ఇందరి మాటలూ, సలహాలూ వద్దు. నిర్ధారణ చెయ్యండి. మేము దేనికయినా సిద్ధమే. ఆలస్యం చేయవద్దు. పని వేడిలో జరగాలె.

2--వ రంగము

నరసింగరాజు గృహము

(సరసింగరాజు, కేతురెడ్డి ప్రవేశము )

నరసింగరాజు : మాచర్ల మండలములో అభిప్రాయం యెటు మొగ్గుగా వుందో విచారించారా ?

కేతురెడ్డి : ఇప్పుడు ముల్లు మనవైపుకే వున్నా లోకములో రాముడికీ రావణుడికీకూడా స్వస్తిజెప్పి కాలం గడుపు కొనేవాండ్లు చాలామంది వుంటారు. కాలం కుదిరిన తరువాత వారి పలుకుబడి యెక్కువకూడా కావచ్చు.

న : ఏ యెండ కా గొడుగు బట్టేవాండ్లు యెవరికీ ప్రతికూలించరు. ఎదుటవున్న వాడే పెండ్లికొడుకు. మనము మాచర్ల మనదనే అంటూ వుంటే సందేహించి చాలాభాగం యెటూ చేరకుండా వుంటారు.

కే : అక్కడ ప్రొద్దున లేస్తే పొలిమేరదాటి రాంది గడవనివాండ్లు చాలామంది వుంటారు. పంపిణీ యెవరికీ యిష్టముండదు.

న: జోస్యం చెప్పు, నాగమ్మగారి అభిప్రాయం యెటు బోతుందో?

కే: అభిప్రాయాలతో లాభంలేదు. కార్యభారం వహిస్తుందా, లేదా అని ప్రశ్న.

న: వారితో మాట్లాడడానికి మంచిసమయ మేదో విచారించారా?

కే: రెండు జాములకు శివపూజట, అటుతరువాత మంచి సమయమని తెలుస్తుంది.

న : అభిజితులగ్నం బెట్టారే. చీకటితో ప్రయాణంగట్టితేనేగాని అందుకోలేము. కే: ఏమన్నారు రాజుగారు ?

న : మీతో జెప్పినవే నాకూ జెప్పారు. భాగము బుద్ధిపూర్వకంగా యివ్వలేదనీ, బెదిరించి బ్రహ్మనాయుడు మోసకృత్యంగా తీసుకొన్నాడనీ, తిరిగి పొందడం న్యాయమనీ, మూడే ముక్కలు.

కే: ఈ మాటలవల్ల ప్రయోజనం లేదు. తనకు రాజ్యం రావడం న్యాయమంటే యిచ్చిపోయేవాం డ్లెవరూ వుండరు. యుద్ధం జేయకుండా రాజ్యాలు రావు. దానికి తయారవుతారేమో గట్టిమాట కనుక్కోండి. తీరా మనమంతా సిద్ధం జేసుకొన్నతరువాత ఆయన తమ్ముడని కర్షిస్తే అభాసపనవుతుంది.

న: ముగ్గులోకి దిగితే వెనుకకుదీసేవారు గారు. జయము కలుగుతుందనిమాత్రం నచ్చజెప్పేవాండ్లు గావాలె. బ్రహ్మనాయుడు పూర్తిగా పిరికిమందు బోశాడు. యుద్ధమంటే ముందంజవేసేవాడు మంత్రి దొరకాలె.

కే : బ్రహ్మనాయుడినే మంత్రిగా వుండమని తిరిగి కోరుతున్నారటగా?

న: ఎవరు గోరారు ? ఇది రాజుగారికి దోచిన సలహా కాదు. అలరాజు కదుటా దిండునా బడకుండా వున్నాడు. తండ్రిని యిటు దీసుక రాలేడు. తాను మామను విడిచి పోలేడు. మామకు మగపిల్లలు లేకపోవడంచేత యే కాలానికయినా రాజ్యం తనకు వస్తుందనే ఆశ బాగావున్నది. అటుబోతే యీ అవకాశం బోతుందని భయం. ఎటూ పాలుపోక రాజీపెటకం బెడుతున్నాడు. చివఱకు అనుకొన్నంత అయింది. బ్రహ్మనాయుడు యువరాజుకు తాను రాజ గురువుననీ, పాలనకర్తననీ నిన్న మాచర్లలో ప్రకటించుకొన్నాడు. ఇప్పుడు మాచర్లకు నిజమయిన ప్రభువే నాయుడన్నమాట. రాత్రి రాజుగారికి వచ్చిన జవాబులో మన రాజుగారు భయపడవలసిన అవసరము లేదనీ, తాను మాచర్లలోనే వుండి గురిజాలకు పరరాజభయం లేకుండా కాపాడుతాననీ వ్రాసి వున్నది. అంటే, నలగామరాజు వారికి సామంతరా జన్నమాట.

కే : దానినిబట్టి రాజుగారి కంత అర్థం ద్యోతకమయిందా ?

న : దాంట్లో దాపఱిక మేమున్నది? స్పష్టంగానే కనబడ్డది. ఇక బ్రహ్మనాయుడు మంత్రిపదవి స్వీకరించడని నిశ్చయించుకొన్నాడు.

కే: మన రాజుగారు సామంతపదవికి అంగీకరిస్తారా ?

న: అంగీకరిస్తాడు. బుద్ధిపూర్వకంగా అంగీకరించకపోయినా బ్రహ్మనాయుడు బలవంతంగానయినా వొప్పిస్తాడనికూడా అన్నాను. ఉత్తరం కండ్లు తెరిపించింది. ఇప్పుడు తహతహ పడుతున్నాడు.

కే: రాజుగారికి నిజస్థితి తెలియడం మంచిదయింది. నాయుడు వేసిన అంజనం యిప్పటికి దిగింది. మన మార్గం మనం యోచించవచ్చు.

న: మనం ముందుబోయి నాగమ్మగారికి విషయం తెలిపి వుంచితే తాను వేటనెపంమీద గామాలపాటి ప్రాంతాలకు వస్తామన్నారు. ఉభయులకు అక్కడ సమా వేశం గలిగించాలె.

కే: సరే, చీకటితో బయలుదేరుదాం.

(తెర పడుతుంది.)

3 - వ రంగము

గామాలపాటి పరిసరాలు

[ నరసింగరాజు, కేతురెడ్డి ప్రవేశము ]

నర : రాస్తా చాలా చుట్టు ; అడివిదారి అందిపుచ్చుకున్నట్టుగా వున్నది.

కే : రహితువత్తిడి బాగా వున్నట్టున్నది. భూమి బాగా తెగుబాటయింది.

న: మేత పుష్కలంగా వున్నది. పశువులు జూడు, నున్నగా యీగవాలితే జారిపోయేటట్టుగా వున్నవి. ఆహా ! పిల్లవా వాడెంత శ్రావ్యంగా పాడుతున్నాడు !

కే: గొంతుకేమి, పాట గమనించండి.

పాట

మోహన - ఖండగతి - ఏక

కాపు బాలిక

కోపానబోయేటి - కోరబొల్లావా
పరుగుపరుగునబోయె - పాలబొల్లావా
మేతదావిణిబడ్డ - మేలంపుటావా
          మాచర్ల అడవులు - మనవిగావోయి
          మరపుచొప్పున బోయి - మాటదెచ్చేరు.

కే: మన రాజకీయవ్యవహారాలు సామాన్యజనులనుగూడ కలవరపెడుతున్నవిసుమా !

(ఆవులు చెప్పినట్టు మఱివొక బాలిక )

పాలాకుపచ్చలా - పరువంపుపడుచా
అద్దాలరవికలా - ముద్దులాపడుచా
తంగేటి పూవుల - ధరియించుపడుచా
          మాచెర్ల అడవులూ - మనవిగాకేమి ?
          మలిదేవుడడ్డినా - మరలివచ్చేమా !

న : పల్నాటబుట్టిన పశువులకుకూడా పౌరుషమేగదా.

(కాపు బాలకుడు)

కోరకొమ్ములతోటి - కొమరొప్పుబసవా
పులిమచ్చవన్నెతో - పాలుపొందుబసవా
నీటిదావిణిబడ్డ - నీలంపుబసవా
         చంద్రవంకానీళ్ల - చాయ బోకోయి
         మాచర్లమడుగులు - మరచిపోవోయి.

కే: మాచర్ల తనకు దూరమయిందని బాలు డెంతవిచారపడుతున్నాడు ! ప్రజలభావాలు పరికించి పాలించగలవాడే ప్రభువు.

న: ఇక్కడి ఆచారాలు మా కేమితెలుస్తవి? మీబోటివాండ్లు తెలియజెప్పాలె.

(బసవడు చెప్పినట్టు మఱివొక బాలుడు )

చిరికోలబట్టిన - చిన్నిబాలూడా
చద్దిమూటలనొప్పు - ముద్దుబాలూడా
పిల్లనక్రోవూదు - పిన్నబాలూడా
        మాచర్ల అడవులు - మనవిగాకేమి ?
        బ్రహ్మన్న అడ్డితే - పారివచ్చేమా!

న: శబాష్ బసవా, నాయకురాలి స్వగ్రామమయిన గామాలపాటి పేరు నిలిపావు.

కే: ఈపాట వింటే రాజువొంట జితించిన పిరికిమందు విరిగిపోను.

న: గామాలపాడు పెద్దవూరే సుమా !

కే : వూరికేమి, ఆ రోటిపాట వినండి.

న : ఇక రోటిదగ్గర పాటలు వినవలసిందే. రాజ్యం పోగొట్టుకొని చేసే పనే అది.

కే : అయ్యా, రోటిపాటలే మేటివీరులను తయారుజేసేది. ఇందాకటి నుడుగే మళ్లీ అంటున్నది వినండి.

పాట

మధ్యమావతి - త్రిశ్రగతి - ఏక

సాధనచతుష్టయపు - సంపత్తిగన్న
అతడెపో సద్గురుడు - అతడె పరశివుడు.

న: గామాలపాడంతా శివమయం జేసిందే నాగమ్మగారు !

కే: మనమోస్తరుగాదు, ఆమె వొక పనికి పూనుకుంటే, పూర్తెయ్యేవరకు నిద్దురపోనిస్తుందా?

వర్ణాశ్రమాచార - వావిదప్పి తే
తారుమారై పోను - ధర్మములన్ని

కే: ఈ పాట బ్రహ్మనాయుడికి తలనొప్పి పుట్టించక మానదు. నాగమ్మ కేవల శిష్టాచారసంపన్నురాలు,

పల్నాటిరాజులు - పాడిదప్పేరు
మాచర్లదప్పేను - మారాజుకపుడె

న : మన రాజకీయవ్యవహారములలోకి పూర్తిగా దిగింది.

కదుళ్లె కత్తులు - వెదుళ్లె గదలు
రండెమ్మ మీరంత - దండుబోదాము

కే: రాజా, గామాలపాటి వీరవనితలె మార్గం జూపిస్తున్నారు. ఈ వీరమాతయొక్క పదమునే మనము ఉపశ్రుతిగా తీసికొనవచ్చును.

న : ఉపశ్రుతిమాత్రమేగాదు. బస్త్రీలు నిద్దురబోతుంటే పల్లెటూళ్లుడికిపోతున్నవని యీ పాట ఋజువు జేస్తున్నది.

[ ఒక ముసలివాడు ప్రవేశము ]

కే : అయ్యా ! నాగమ్మగారిల్లెక్కడ ?

ము: ఇదే.

న : వా రేమి జేస్తున్నారు ? నిద్దురలేచారా ?

ము : అయ్యా ! మీదు పరదేసులా ? పల్నాట పగటినిద్దుర లేదే? ?

కే: వారు కొద్దికాలము క్రిందటనే యీ దేశము వచ్చారు. దేశాచార మామ్లీతు తెలియదు.

ము: రాజులా? రాజబంధువులా ? అంతకంటే పరాయి లెవరున్నారు, ఈ దేశములో ?

కే: మా సంగ తెందుకులెండి ! అమ్మగా రింట్లో వున్నారా ?

ము : మా సంగతి మీకూ వద్దు.

కే: అయ్యా ! తమపేరు ?

ము : అదిమటు కెందుకు ? పరాయిగా వచ్చినవారు మీ సంగతి చెప్పకపోతే నే నంతవెఱ్ఱివాడి ననుకున్నావా, మా సంగతి జెప్పడానికి ? కే : అయ్యా ! నే ఈదేశపువాడినే, రెడ్లము.

ము : అది కనుపడుతూనే వున్నది.

కే: వారు మన రాజుగారి సోదరులు.

ము : అయ్యా ! తమరేనా పగటినిద్దురబోతూ పల్నాడు పంచి పెట్టింది ?

కే: మేలుకుండి పంచిపెట్టగూడదా ?

ము : అది నిద్దురమత్తులపనే, సరే, నాపేరు రామిరెడ్డంటారు,

కే: నాగమ్మగారు తమపుత్రికేనా ?

రా: మఱె - మాపిల్లే - లోపలికి దయచెయ్యండి. మెల్లాలో కూర్చున్నది. ( తెరలోనికి పోతారు)

[ నాగమ్మ ప్రవేశము ]

నాగ : [ ప్రత్యుద్ధానం చేస్తూ ] అయ్యా ! కేతురెడ్డిగారా, గురిజాలకోటకు అధ్యక్షులే ! దయచెయ్యండి. ఓహో ! నరస ప్రభువుగారా; ఏమిసుదినం ! సాక్షాత్తు దొరలే యీ కుటీరములో అడుగుబెట్టారు ! బీదల కుటీరములుకూడ చూస్తుంటేనేగాని రాజభవనముల వైభవాతిశయం తెలియదు.

న: కాదు, మా నిద్దురమత్తు వదలదనండి,

నా ; సరె, మా అయ్యగారితో తమకు సంభాషణ జరిగినట్టున్నది. వారి కవి మామూలుమాటలే; రాజులు సోమరులూ, నిద్రమత్తులూ అని వారి అభిప్రాయం.

న: అది నిశ్చయంగూడాను.

నా : కాని తమబోటివారిని మినహాయించక తప్పదు. పాదప్రక్షాళనం జేసి యిటు తివాసిమీదికి దయచేయండి.

[ అందరూ కూర్చుంటారు ]

నా : ప్రభువుగారికి క్షేమమేగద ?

కే: జేమమే ; తమకు తెలియని సంగతు లేమున్నవి ? తమరు దేశంలో లేనిలోపముమాత్రం జరిగింది.

నా: కేతురెడ్డిగారు కోటను పాలిస్తుండగనే పల్నాటికేతువు పడిపోయిందే?

కే: నాగమ్మగారు భూభారము వహింపని లోపమే నని మనవి జేశాను.

నా : పల్నాటిభారమును వహిస్తున్న పున్నాగముల కది అగౌరవమని నా మనవి.

కే: పున్నాగముల అగౌరవము స్త్రీనాగములు తొలంగించాలె.

నా: బ్రహ్మనాయుడుగారు మంత్రిపద వేల మానుకున్నారో చెప్పగలరా?

న: మాచర్లలో రాజగురువులై పూజలు గొంటున్నారు. ఐహికపదవులయందు వారికి అస్త తగ్గినట్టున్నది.

నా : లోకములో బ్రహ్మ పూజలుగొనడం యిప్పటికి వింటున్నాము. ఐహికపదవులయందు ఈ బ్రహ్మకు ఆశ తగ్గిందనుకోను. నిజానికి ఏబ్రహ్మకూ తగ్గలేదు. ప్రస్తుతము యువరాజుకు రాజప్రతిధిగా వున్నా, త్వరలో మాచర్లకు రాజుగూడా అవుతాడు. ఇవి నాగమ్మ జోస్యం.

కే: రాజుగావలెనని కోరికెమాత్రమున్నదనండి.

న: బుద్ధి భూము లేలవలెననే వుంటుంది. అది నెరవేరవద్దా?

నా: అది వేరు. ఇప్పుడు జరిగినపనికంటె సులభసాధ్యమే.

న: వారసుడుకూడా కాడే. నా : కత్తి అన్నిహక్కులు కలుగజేస్తుంది.

న : మలిదేవునియందు బ్రహ్మనాయుడి కత్యంతమయిన ప్రేమ.

నా : అవును, తోడేలుకు మేకపోతుమీదా అటువంటిప్రేమే వుంటుంది.

కే : నాయుడు అట్టి క్రూరకృత్యాలకు లోబడడని నా మనవి.

నా : ఆయన పూర్వచరిత్ర మీకు దెలియదు. ఒక చిన్న దృష్టాంతం జెపుతాను. ఈ మధ్యనే లేక లేక పుట్టిన కొడుకును యెవడో తండ్రిగండ మున్నదని చెప్పితే నరకడానికి అడవికి బంపించాడు. అన్నగారు దయదలచి పిల్లవాడిని దాచిపెడితే ఆయనమీద కక్ష సాధిస్తున్నాడు. ఆయన స్వార్థపరత్వానికీ, కౌర్యానికీ యింతకంటె యేమి దృష్టాంతము కావాలి?

న; శివ, శివ ! పాపము శమించుగాక.

నా : పాపము దానెంతటది శమించదు. గట్టి ప్రయత్నం జెయ్యాలె.

కే : అంతవరకు నిశ్చయమే.

నా : మరి మీరంతా యేమి యోచించారు ?

న : మనది మంత్రిలేని రాజ్యం. ఆ పదవి తమరు స్వీకరించాలె.

నా : నాకే పంత్రిపదవి !

న : తమరు స్వీకరించక తప్పదు. తమరు చుక్కానిదగ్గర నిలవంది పడవ గట్టు జేరదు. ఇది రాజుగారి నిశ్చితాభిప్రాయంకూడాను.

నా : ఏమో ! ఇది నావల్ల కాదగినపని గాదు.

కే : మీరు కారణజన్ములు. ఈ పని మరివొకరివల్ల గాదు. న: ఈ సంగతి మాట్లాడడానికే రేపు రాజుగా రిటు వేటకు వస్తారు. ముందుగా విన్నవించడానికి మమ్మును బంపారు.

నా : అయ్యా ! వింటున్నావుగద, సంగతులన్నీ ! ఏమంటావు ?

రా : నీవు మంత్రైనంతమాత్రంచేత లాభంలేదు. వారంతా అక్షరాలా నీవు చెప్పినట్టు నడవడానికి వొప్పుకుంటే అంగీకరించవచ్చు. రాజుగారికి యీ షరతులు వైనంగా జెప్పు. వొప్పుకుంటేనే ఆయెను.

నా : ఇంతపని నావల్ల అవుతుందా ?

రా : అయితే నీవల్లనే కావాలె. మాచర్ల మనదయ్యేవరకు ఎత్తినకత్తి దించనని దీక్ష,బెట్టుకో. అది నెరవేరిన వుత్తరక్షణం వైదొలగి నీ పొలమూ, పశువులూ చూచుకో.

నా : నాకు పశువులసేవ పశుపతిసేవకంటేగూడ ప్రియతరము. రాజ్యభారనిర్వహణ మతిదుష్కరం.

రా: ఎల్లకాలం ని న్నీ భారం మోయమనడంలేదుగా. సమయం గాని సమయాలు వచ్చినప్పుడు మామూలు ప్రకారం పోదామంటే వీలుగాదు.

నా: రాజుగారు ఈ షరతుల కంగీకరిస్తారా ?

న : మే మడిగిన వొక్కషరతు తమరు అంగీకరిస్తే తక్కిన షరతు లెన్నైనా వా రంగీకరిస్తారు.

నా : సరే. అన్నీ వారి సమక్షములోనే మాట్లాడుదాం. రేపేవేళకు వస్తారు ?

కే: ఇదే వేళకు వస్తారు.

నా : చిత్తం. అకాలమయింది. శివపూజకు లేవండి.

(నిష్క్రమణం, తెరబడుతుంది.)

4 - వ రంగము

గామాలపాడు ఆవులమంద

[ నాగమ్మ, రామిరెడ్డి, పశువులు ప్రవేశము ]

నా : అయ్యా, నేను ఎటువంటిదాన్నో నీ కొకబిడ్డనున్నాను. నాకు గొడ్లే బిడ్డలుగదా !

రా : గొడ్డూ - బిడ్డా అని గొడ్డునే ముందు జెప్పారమ్మా.

నా : ఎవరో నాబోటెమ్మే చెప్పివుంటుంది. ప్రేమతో బెంచుకొన్న ఈ మందా, పంటకువచ్చిన ఈ పొలాలూ విడిచి గురిజాల బోవడమంటే నా కేమీ మనసొప్పడము లేదు.

రా : నాలుగురోజులు అలవాటుపడ్డదాకా ఏదో క్రొత్తగా వుంటుంది. పట్టవాసం అలవాటుపడ్డవాండ్లకు పల్లెలలో వుండడమూ కష్టమే.

నా : నేను బస్తీలకూ, రాచనగళ్లకూ కొత్తదాన్ని గాక పోయినా పల్లెలకే అలవాటుపడ్డాను. కాని నక్కెక్కడ నాకలోక మెక్కడ!

రా : పట్టవాసమంటే నాకూ తలనొప్పే.

నా : మిరపతోట పూతా పిందే విదులుతున్నది. రాత్రి దోలిన పయరగాలికి రెమ్మలు చిత్తవత్తుగా బుట్టి, నలుదిక్కులా సాగుతున్నవి. కాపుకు వచ్చేలోగా తప్పక సీకాయకుండ పెట్టించు.

రా: అదెంతలో పని !

నా : వరిగచేను విశేషంగా పెరగకపోయినా కాడకంటె యెన్ను పొడుగై ధాన్యలక్ష్మి తాండవమాడుతున్నది. చూ డీ వరిగెదుబ్బు. యెన్ను బరువై కదలలేని నిండు చూలాలివలె పిల్లగాలికి బందికాడుతున్నది.

రా : సమయానికి దీనికి నీ సహాయ ముండదుగదా ? యే కోతకత్తె దాని జన్మము సార్థకము చేయవలసివున్నదో ?

నా : గోలలైన యీ గోవులను విడిచి కపటములకూ, కుట్రలకూ, మోసములకూ ఉనికిపట్టైన రాచకార్యములలో ప్రవేశిస్తున్నాను. ఈ అడుసులో దిగబడి నా యెద కూరుకొనిపోతుందో, కుమ్మరిపురుగువలె సంచరిస్తుందో చెప్పలేను.

రా : అంటించుకొంటే అంటుతుంది. నా” అనే అక్షరం తీసివేయి, ఏదీ అంటదు - అదిగో కపిల ! నీవు దూరము వెళ్లబోతున్నావని సడిగన్నట్టున్నది. ఓసి దాని కడుపుడక - ఎట్లా అలుముకుంటున్నదో చూడు.

నా: (వీపు నిమిరి) దీనికి మలుగులు కుంగినవి. ఎక్కువ రోజులు పట్టదు. ఈనంగనే నాకు వుత్తరం వ్రాయి. ఎల్లావు నే లేకపోతే దిగులుపడుతుందిగాఁవాఁలె.

రా : అది నిన్ను ముట్టెతో రమ్మని పిలుస్తున్నది. దగ్గరకు పద-- ఏమి చేస్తుందో.

నా: (కొమ్ముపట్టుకొని వూపి) నే పోయివచ్చేదా ? ఎందుకు ముట్టె నా వొళ్ళో పెడతావు ? నీ కేమైన తాయం తెచ్చాననుకొన్నా వా ?

రా : బుడిగిది పుట్టినప్పటినుంచి నీకు మాలిమి. నీవు లేకపోతే పాలీయదు. నా : నేను రెండుచేతులతో ఏకధారగా పాలు తీస్తుంటే అది కండ్లు మూసుకొని వొళ్ళు మరిచి మహదానందంతో కాలు కదపకుండా వూగుతూ నిలువబడేది. నేనూ వొళ్ళు మరిచే దాన్ని, ఇక కొన్నాళ్ళదాకా నా కీ ఆనందం లభించదు కదా!

రా : దీని యెడదూడను యెట్లా మరచివుంటావే? నీ కది మనుమరాలుగదా.

నా : ఇళ్ళో - అబ్బా - నే నేమి జేసేదే ; అయ్యా, చూడు. దానికి బాగా వయస్సు మొటమరిస్తున్నది. దాని కాటిక కండ్లకు తోడుగా సిగమోరతాడు వేయిస్తే కళకళ్లాడుతూ పెండ్లికూతురువలె వుంటుంది. (ముద్దు పెట్టుకొని) ఇగ పో, అయ్యా ! పులి కాటువేసి తల్లిబోయిన యీ చిన్ని పెయ్యను నే విడిచిపోలేను. నావెంటనే తీసుకుపోతా. పోతపాలచేత గాబోలు, దీనికి పొట్ట పెరిగింది.

రా : తీసుకపోనవసరములేదమ్మా, నీ మారుగా నే చూచు కుంటాగా,

నా : దానికి కొమ్ములు రాకపోయినా, రేపు సంక్రాంతికి కొమ్ములు మొల్చేచోట సున్నము, ఎర్రమన్ను చుక్కలు రాయించు.

రా: అట్లాగేలే. మళ్లీ ప్రయాణానికి యెండపడుతుంది, పద .

నా: నేను గురిజాలపోయినా ఆ కోడెదూడ మువ్వల పట్టెడ రవళి, చిరుగంటల చప్పుడు పొద్దుగూకులు చెవులో మోగుతుసే వుంటవి. ఆ కాలి వెండ్రుకలతాడు అందానికి అందె వేసుకొన్నట్టుగా వుంది. బసవడూ ! ఇటు రారా, చూడువాడి కొంటెతనము. చిక్కకుండ పరుగెత్తాడు. సరె - తలచుకొన్నకొద్దీ విచారంతప్ప ఎంతసేపున్నా పోక తప్పదుకదా? ఇక నీవు ఇంటికి పో. రాజుగారు వచ్చే వేళవు తున్నది. పోయి కలుసుకొంటా.

రా : అమ్మా ! మూడుకాళ్ల ముసలిని. నన్నేమి జేసిపోతావే ? ఊరక పండ్లబిగువున మాట్లాడుతున్నాగాని, కాళ్లు నిలవబడడము లేదు. నీవు లేకపోతే ఇల్లు గబ్బగీమవుతుంది.

( అని కూలబడుతాడు. )

నా : ( మీద చేయివేసి ) ఏమే అయ్యా ! ఎట్లావున్నదీ? నీవు ధైర్యము విడిస్తే నాకు కాలుసాగదు. ఒకవేళ బలవంతంగా పోయినా నా మనస్సు నీమీదనే వుంటుంది. పోనీ రా వీలులేదని రాజుగారితో చెప్పివేస్తాను. నీకు కష్టమైనపని నా కెందుకు ? పోనీ నీవుకూడా రా.

రా: (చివ్వున లేచి) నీవు మహత్కార్యం చేయబోతుంటే ఈ ముదుసలి అడ్డమురావడంకూడానా? తక్షణం లేచి పద. నే నింట్లోవుండి ఈ కామాటమంతా చూచుకొంటా. వెనుకాలోచనవద్దు. (అని వెళ్లి నాడు)

[ తెరపడుతుంది. ]

5 - వ రంగము

[ వనము : నలగామరాజు, కేతురెడ్డి , నరసింగరాజు ప్రవేశింతురు. ]

నల: కేతురెడ్డి, చేతమీదుగా పోగొట్టుకొన్నా, సగము రాజ్యమూను. అప్పటి కేదో ముసించింది. ఆలోచించి చెప్పుతానన్నా పోయేదే. సర్దార్లంతా మలిదేవుడితో షరీఖనీ, తన బలవంతంమీద మీరంతా సగాని కొప్పుకొన్నారనీ, దాని కంగీకరించకపోతే యావత్తూ పోతుందనీ త్వరపెట్టి ఒడంబడికమీద నాచేత గీటు పెట్టించుకొన్నారు.

కే: మిగిలినదానికి విచారించ పనిలేదు. తిరిగి పాటుకు వచ్చే మార్గమేదో యోచించాలె.

నర : ఆ మార్గాలన్నీ ఇప్పుడు మనకు తేలేవిగావు. నాగమ్మగారికి సర్వాధికారమిచ్చి సమయోచితంగా ఆమెనే యోచించమందాం ; ఆమె కార్యఖడ్గముల రెంటికీ దీటైన మనిషి. సర్వవిధముల బ్రహ్మనాయుడికి సమవుజ్జీ. పల్నాటిమొత్తంమీద ఆమెకు బంధుజాలమంతా బీరకాయ పీచు.

నల : బ్రహ్మనాయుడి రామానుజమతములో జేరి మాలమాదిగలంతా అటు తోజౌతారు. కన్నమనీడు మాల పటాలములకు నాయకుడట. వాండ్లంతా వీరావేశముతో రాక్షసులవలె పోట్లాడుతారు. మతావేశపూరితులైనవారి నెదిరించడం కష్టం.

కే : నాగమ్మగారు వర్ణాశ్రమాల కాపాడుతారని ప్రతీతి. చాతుర్వర్ణ్యములవారికి బ్రహ్మనాయుడి రానూనుజమత మంటే ద్వేషము. నాలుగుజాతుల బలమంతా మనకు బాస టౌతుంది..

నల : ఉభయపక్షముల బలాబలములూ చూచుకోనిది యుద్ధమున కీయకొనకూడదు. తొందరపడి వున్నదీ పోగొట్టు కుంటామేమో. నర : మన బలాబలా లిప్పుడు తేలవు. నాగమ్మగారికి అమాత్య పదవీ, సర్వసైన్యాధిపత్యమూ ఇయ్యంగనే మన సేనలు ఇబ్బడి ముబ్బడి గాకమానవు.

నల : ఏమి కేతురెడ్డీ ! నీ అభిప్రాయమూ అంతేనా ?

కే : చాతుర్వర్ణ్యముల సంగతి అట్లావుంచినా పల్నాటి రెడ్లందరూ నాగమ్మ బావుటాకిందికి చేరకమానరు.

నల : అంతమటుకు నిశ్చయమే.

నర : ఆమె మతప్రచారంకూడా మనకు తోడ్పడుతుందనే నా అభిప్రాయము. కులభేదాలకు నాయుడు పూలుముడుచుకొని కూర్చొనడంచేత వర్ణాశ్రమధర్మాలు సంరక్షించడానికి బద్ధకంకణురాలైన మంత్రి తప్పక మన రాజ్యమునకు పెట్టనికోట.

నల: నాకు తెలిసినంతవరకు సర్దార్లు నాగమ్మగారివైపే మొగ్గు ; కొందరు సాధ్యమైతే బ్రహ్మనాయుడినే మంత్రిగా నియమించమంటారు. అది పొసగదు. పొసగినా మన రాజ్యాని కది క్షేమముకాదు. మీ ఇద్దరి అభిప్రాయముగూడ తేల్చి చెప్పండి.

నర : నాగమ్మగారికి సర్వాధికారములిచ్చి కార్యం గట్టెక్కించమని కోరడం నా యభిప్రాయం.

కే : పల్నాటిక్షేమంగోరేవా రందరూ ఆ యభిప్రాయంతో ఏకీభవించక తప్పదు.

నల : నేనూ అదే నిశ్చయించా. ఇట్టి సమయములలో బహునాయకం పనికిరాదు. ఇక మనకు ఆమెయే నాయకురాలు. నేనూ ఆమె ఆజ్ఞలకే కట్టుబడివుంటాను. నర : రాజుగారి యీ నిశ్చయమువలన మనకు జయముకలిగినట్లే భావిస్తాను.

కే : నిశ్చయం.

నర : మాటలసందున మనం గమనించలేదుగాని అడవి రాను రాను దూర సందులేకుండా పెనవేసుకొని, ఏ కొమ్మ దేనిదో చెప్పడానికి వీలులేకుండా వున్నది.

కే : ఎడం లేకపోవడంచేత ఒక దానికొమ్మ యింకొకదానికి అంటుబడుతున్నది.

నల : అది కొమ్మలకు స్వభావమే. అందుకనే చెట్లు దూరంగా నాటమన్నా రు.

నర : మీరు పొరబడుతున్నారు. అన్ని కొమ్మలూ అట్లా అంటుబడవు. కొంతవరకు అది చెట్టునుబట్టి వుంటుంది.

కే : పండ్లచె ట్లంటుబడతవిగాని ముండ్లచె ట్లెక్కడైనా అంటుబడడం చూచారా?

నల : ముండ్లచె ట్లెవరూ అంటుదొక్కరు.

నర : పల్నాటిలో కొమ్మలు ఇతరచెట్ల కంటుబడవుగూడాను.

నల : దానికి కారణము అన్నీ ముండ్లచెట్లు కావడమే .

కే : కారణ మేదైనా, అది మాకు గౌరవమే. నల: చూ డిక్కడ, పులెడుగుల జాడ లున్నవి.

కే : పులులకేమి ? ఈ ప్రాంతమున పులులు, అడవిపందులు ఏట్లాడుతుంటవి.

నల : ఊళ్లదగ్గర పులులు చెర్లాడుతుంటే జనులకు భయంగదా?

కే : ఒక్కొక్కప్పుడు పులులు ఊళ్లమీది కెగబడుతుంటే మనుష్యులు కర్రలతో కొట్టి చంపుతుంటారు. నల : పల్నాడు యింకను పూర్తిగా మానవుడికి స్వాధీన పడ్డట్టు లేదు.

నర : ఇప్పుడుసహా, వృక్షసృష్టీ, జంతుసృష్టీ, మనుష్యసృష్టీ మూడూ స్వాధికారానికై ఒకదానితో వొకటి పల్నాటిలో పోరుతునే వున్నవి.

కే : మనుష్యుని గొడ్డలి ఎప్పుడూ వూళ్ల చుట్టూ ఆడుతూ వుండవలసిందే. కాస్త ఏమార్లితే వూళ్లు అడవి వేసిపోతవి.

నల : ఇప్పు డెంత ప్రొద్దయింది ?

కే : కిరణములు నిలువుగా పడుతున్నవి. రెండుజాములు కావచ్చింది.

నర : చండకిరణుడు తన యెండను గోల్పోయి చంద్రమండలము ననుకరించుతున్నాడు.

కే : కిరణములు వేడిమినిమాత్రమేకాక తెల్లదనమునూ గోల్పోయి పందిటికి గట్టిన పచ్చతీగలవలె వ్రేలాడుతున్నవి.

నల : ఆవరణముయొక్క ప్రభావంచేత యిచ్చట సర్వమూ వనసామ్యమును పొందుతున్నది.

ఎవ రా యౌవనుడు? వేట కరుదెంచిన వసంతకుమారునివలె వున్నాడు.

కే : యౌవనము మూర్తీభవించినట్లున్నది. గాండీవము ధరించిన అర్జునకుమారుడా యేమి ?

నర : ఇట్టి పురుషసౌందర్యమును నే నెన్నడూ చూడ లేదు.

నల: ఆ యౌవనమునకు యీ వనసౌందర్య మెంతో పొందిక గా వున్నది. నర : ఆయౌవన మీ సుందరవనమును సహితము యౌవన వంతము చేస్తున్నది.

నల : ఒక కొమ్మ అడ్డమువచ్చి యాతనిం గౌగలించు కొంటున్నది.

నర : లతకన్నియ లాతని వెడదయురము నలముకొని పెనవేసుకొంటున్నవి, ఏమి వాని భాగ్యము !

నల : వనమునంతా సమ్మోహింపజేస్తున్న ఆ మూర్తిని మన మాహ్వానింతాము.

నర : అది యుక్తమే. సౌందర్యము యౌవనమునకు వశవర్తినియై సపర్యలు చేస్తుందిగదా. ఈ వనసౌందర్యమున కీ యౌవనుని పట్టాషిక్తునిజేతాము.

నల : యౌవనము, సౌందర్యము అన్యోన్యాశ్రయములు, పర్యాయపదాలుగూడాను. యౌవను డెప్పుడూ సౌందర్యానికి పట్టాభిషిక్తుడే.

నర : సౌందర్యమునకుమాత్రమేకాదు, శౌర్యధైర్యములూ ఆతని వశములే.

నల : సుగుణములు విగుణా న్నెప్పుడూ ఆశ్రయించవు. దేహసౌష్టవమూ. మనోవికాసమూ పరమమిత్రములే. గుణసంపన్నుడయిన యౌవను డన్నిటికి పట్టాభిషిక్తుడే.

(యౌవనుడు ప్రవేశము )

యౌవనుడు : రాజా ! జోహారు ; మిత్రులకు నమస్కారములు.

కే : (నరసింగరాజుతో) అయ్యా, ఒక సందేహము. నిన్న శంకరునకు సపర్యలుచేస్తున్న, గంగాసమానురాలగు పవిత్రరూపమేనా యిది ; నర : పురుషరూపమును ధరించిన నాగాంబికనా మన మిప్పుడు. చూస్తున్నాము !

నాగాంబిక : అయ్యా ! యీ వేషమును మన్నింపుడు.

నల : పల్నాటిరాజ్యమునకు సర్వాధికారములతో అమాత్య పదవికి ఈమె నభిషిక్తురాలను జేస్తున్నాము.

నాగాంబిక : పల్నాటిరాజ్యమున కంతకును మిమ్మును ప్రభువునుగా నభిషిక్తుని జేస్తున్నాము.

కేతు ; నర : ఉభయుల ఆశీర్వచనములూ ఫలించునుగాక !