Jump to content

నాయకురాలు (పల్నాటి వీరచరిత్ర)/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

ప్రస్తావన

శ్లో. యత్సత్యవ్రతభంగభీరుమనసా యత్నేన మందీకృతం
    యద్విస్మర్తుమపీహితం శమవతా శాంతిం కులస్వేచ్ఛతా,
    తద్వ్యుత్తారణిసంభృతం నృపసుతాకేశాంబరాకర్షణైః
    క్రోధ్రజ్యోతిరిదం మహత్కురువనే యౌధిష్ఠిరం జృంభతే.
                                            -భట్టనారాయణమహాకవి; వేణీసంహారము.

బ్రహ్మశ్రీయుతులును, దేశభక్తులును అగు ఉన్నవ లక్ష్మీనారాయణపంతులుగారు వ్రాసిన "నాయకురాలు" అను నీ చిన్ని నాటకమును చదివినంతనే పైసూక్తి నాకు జ్ఞాపకమువచ్చినది. కేవలము జ్ఞాపకమువచ్చుటమాత్రమేకాక , ఈ నాయకురాలియందలి ఇతివృత్తముకూడ సర్వవిధముల కౌరవ - పాండవుల దాయభాగమున కైన పోరాటముతో తులదూగుచున్నది. పైగా నాటక రచయితలు రచనామధ్యమున వెల్లడిసేయించిన వాక్యములును నీ యర్థమునకు చక్కని యుపష్టంభకములుగా నున్నవి.

కథామూలము

నాయకురా లను నీ చిన్నినాటకమునకు అసలు ఆకరము పల్నాటివీరచరిత్రము. దీనిని ద్విపదలో ఆంధ్రకవిసార్వభౌముఁడని ప్రఖ్యాతిగాంచిన శ్రీ నాథమహాకవి రచించె నని లోకమున ప్రతీతి గలదు. శ్రీనాథకవిసార్వభౌముఁడు సుప్రసిద్ధుఁడై ఆంధ్రులగు ప్రతివారి హృదయములందును నిప్పటికిని యశఃకాయముతో తేజరిల్లుచున్నాడు . పంతులుగా రీ గ్రంథములోని అత్యల్పమగు కథాభాగ మును గైకొని సకృత్పఠనమాత్రముచేతనే ఎట్టి బండల కైనను ఒడలు జలదరించి రసస్ఫూర్తి యగునట్టి శైలిలో దిద్ది తీర్చినారు.

విస్మృతములగు ప్రతిభా ప్రాభవములు గల స్వజాతి వారి మద్బోధించి కార్యశూరులనుగా నొనర్చుటకు మహాకవులు వీర చరిత్రములను దృశ్యములుగానో, శ్రవ్యములుగానో కూర్చి, యౌచిత్యము చెడకుండ , పౌరుష పరాక్రమ ప్రతిభా ప్రాభవములను మొక్కవోనీయకుండ, దేశీయులలో చక్కని ప్రబోధము గలిగించుటకు సాధారణముగా నన్ని దేశములందును, అన్నికాలములందును వీరచరిత్ర గ్రంథములను వ్రాయుట ఆచారమైనది. ఇట్టి సనాతనమగు సత్సంప్రదాయమును పోనీయకుండ, కేవలము నిద్రాముద్రితావస్థలో నున్న తన సోదరాంధ్ర దేశీయులను, యొక్కింత మేల్కొల్పి వారిని కార్యనిరతులనుగాను, సద్వర్తనులనుగాను, దేశభక్తులనుగాను సిద్ధముచేయుటకై ప్రస్తుత మీ గ్రంథమును దృశ్యకావ్యరూపమున - అనగా నాటకరూపమున - రచించి వెలయించిన శ్రీ లక్మీనారాయణ పంతులుగారి ప్రయత్న మెంతయును శ్లాఘ్యతమ మనుటకు సందియము లేదు. అందునను ప్రధానపాత్రములను సత్యవ్రతాచరణదీక్షా నిబద్ధులనుగా దిద్దితీర్చుట యనునది ఇట "బంగారమునకు తావి యబ్బినట్టు" లైనదని సంతసింపదగినవిషయము.

“నాయకురాలు" గ్రంథ ప్రశంస

నాయకురాలు ( అనగా గ్రంథము ) ఆకృతిని చిన్నదయ్యును గుణమున మిన్న, నిక్కమగు దేశాభిమానము, జాత్యభిమానము, సత్యవ్రతనిరతి, యశఃకాంక్ష, సర్వసమానత్వము, విశ్వమంతయును స్వకుటుంబముగా నెన్నునట్టి హృదయౌదార్యము, అనన్యమగు భగవద్భక్తి , ఆశ్రితజనానురక్తి ఇత్యాది సుగుణముల నెన్నిటినో ఆదర్శప్రాయముగ ప్రదర్శించి మన యిప్పటి యువకులను స్వదేశ, స్వభాషాసంసేవనదీక్షాపరతంత్రులనుగా చేయుటలో సాక్షాత్తును నాయకురాలే యని ఇయ్యది చెప్పందగియున్నది.

నాటకమునందలి ఇతివృత్తము

ఏగ్రంథముయొక్క మంచిచెడ్డలనుగాని, గుణావగుణములను గాని చర్చించుటకుముందు దాని యానుపూర్విని మున్ముందుగా కొంత నెఱింగియుండవలసియుండుట పాఠకులకు ధర్మమై యున్నది. అందునను కాలగర్భమున లీనమై, విస్మృతప్రాయమై, కథాశేషమై యున్న చారిత్రికగ్రంథము విషయములో - తత్రాపి అట్టి ప్రాచీన చరిత్రమునుండి ఇతివృత్తలేశమును సంగ్రహించి ప్రస్తుత దేశ కాల పాత్రానుసారముగ చారిత్రికతేజము నుద్బోధించుటకై ప్రవర్తించిన యిట్టి దృశ్యకావ్యముల విషయములో, పూర్వాపరసందర్భములను గోచరింపఁజేసి, గ్రంథనిర్మాణచాతురిని. తదీయ ఘనాదర్శమును విస్పష్టముగా వెలయింపజేయుటకై ఆనుపూర్విని విచారణచేయవలసి యుండుట తప్పనిసరి యైనది. కాఁబట్టి రెండు వాక్యములలో నీ నాయకురాలియందుగల కథాంశమును తేటపఱచి ఆ పిమ్మట శ్రీపంతులుగారు గ్రంథనిర్మాణమునందు గనఁబఱచిన నేర్పును బ్రశంసించుకొనుట మనకు అవశ్యకర్తవ్యమై యున్నది.

పల్నాటి పూర్వచరిత్రము

ఇందలి కథాభాగము ఆంధ్రదేశములోని సుప్రసిద్ధచారిత్రిక ఖండమగు పలనాడునకు సంబంధించినదని చదువరు లెఱింగినదే. ఈ పల్నా డనునది కృష్ణానదికి దక్షిణతీరమున సముద్రమునకు దాదాపు నూటఇరువదిమైళ్లదూరములో నున్న ఆంధ్రదేశములోని యొకభాగము. ఈ భూఖండముయొక్క వైశాల్య మించుమించు పదునొకండువందల చతురపుమైళ్లు గలదు. చారిత్రికదృష్ట్యా వీక్షించినచో ప్రస్తుతము ప్రఖ్యాతిలో నున్న మాచర్ల, గురిజాల, తుమురుకోట . కారెమపూడి మున్నగు స్థలములు ఆ పూర్వకాలమున పల్నాటిసీమలో ప్రధానపట్టణము లని మన మెఱుంగఁగలము. కేవలము ఈ పట్టములుమాత్రమేకాక ఆ కాలమున పల్నాటివీరులు త్రవ్వించిన తటాకములు, కట్టించిన కోటలు, పట్టణములు, తీర్పించిన దేవాలయములు వేయించిన దానశాసములు మున్నగు కథాశేషములగు ప్రతిష్ఠాపనము లన్నియును ఇప్పటికిని ఈ వీరపురుషుల యొక్క విఖ్యాత మగు ప్రజానురాగమును, పరిపాలనసౌష్ఠవమును మనకు వేయినోళ్ల జాటుచు నుద్బోధకములుగా నున్న వనుట నిస్సంశయము.

పల్నాటి ప్రభువులు

అసలు ఈ పల్నాటిని పాలించిన ప్రభువులు ( అనగా వీరజాతికి చెందిన వారు) కేవలము ఆంధ్రదేశమే ఆదినుండి జన్మస్థానముగా గలిగిన ఆంధ్రవంశములకు సంబంధించినవారో, లేక ఏ యుత్తర భారతమునుండియైనను వలసవచ్చి ఆంధ్రదేశమునకు పాలకత్వమును వహించినవారో స్పష్టముగా నిర్ధారణచేయుటకు తగిన ప్రమాణ బలము మన కిప్పుడు లేకున్నను ఎన్నో తరములనుండి ఆంధ్రదేశమునందే నివసించి ఆంధ్రజాతితో, ఆంధ్రభాషతో, ఆంధ్రసంఘముతో, ఆంధ్ర ప్రజలతో కలసిమెలసి "తాము - పరులు" అను భేదము లేకుండా (అనఁగా పాలకులు, పాల్యులు అనే భేదము లేకుండా) ఎంతో అన్యోన్యముగా ప్రజాపాలన మొనర్చి, దేశాభివృద్ధికి అన్నివిదముల తోడ్పడి 'తామే వారు, వారే తాము' గా పాలించి ప్రజాప్రీతిని జూఱగొనిన శుభగుణులని చెప్పుట కెట్టి సందియమును లేదు.

వీరుల పూర్వచరిత్రము

ఇట్లు పల్నాడును పాలించిన వీరులలో (మనకు తెలిసినంత వఱకు ) మొదటిపాలకుఁడు అనుగురాజు. ఈయన చందవోలు పరిపాలకుని కుమార్తె యగు మైలమ్మను వివాహమాడి పల్నాడు నరణదేశముగా గ్రహించి పాలించెను. ఈయనకు మైలమ్మ మాత్రమే కాక విజ్జలదేవి, భూరమాదేవి యని మఱి యిర్వురుగూడ భార్య లుండిరఁట, ఈ భార్యలలో విజ్జలదేవియందు పెదమల్ల , పినమల్ల , బాలమల్ల దేవులును, మైలమాదేవియందు నలగామరాజును, భూరమా దేవియందు కామరాజు మున్నగు నల్గురుకుమాళ్లును పుట్టిరి. అనుగు రాజునకు దొడ్డనాయుఁ డను నతఁడు వెలమ మంత్రిగా నుండెను. ఆయనకుమారులలోనివాడే మన బ్రహ్మనాయుడు. (అనగా రెండవ కొడుకు) ఈ బ్రహ్మనాయుని అన్నయగు పెద్దన్నను (బాచరాజును) అనుగురాజు తనకు సంతానము కలుగకముందు కొన్నాళ్లదనుక స్వీకారపుత్రునిగ పరిగ్రహించి యుండుటచేత మన బ్రహ్మనాయునికి కేవల మనుశ్రుతముగావచ్చు మంత్రిసుతత్వముమాత్రమే కాకుండా, యువరాజత్వముకూడ కొంత ధర్మతః సంబద్ధమై వచ్చినది. కనుకనే పల్నాటినాయకుల కథాభాగములో బ్రహ్మనాయుడు ప్రతిచోటను ఎక్కుడు ప్రాముఖ్యమును ఆక్రమించుకొనుట మనకు గోచరమగుచు నుండును.

వీరుల యుద్ధకారణము

పైని చెప్పిన వివర మంతయును బ్రహ్మనాయుని ప్రధానత్వమును తోఁపింపచేయుటకై వ్రాసితిని. కాని ఇది మన కథాంశము గాదు. ఇక ప్రస్తుతమునకు వత్తము. అనుగురాజు పల్నాటిని పాలించి మృతినొందినతర్వాత నలగామరాజు పట్టాభిషిక్తుడైనాడు. నలగామరాజు రాజ్యపాలనము వహించిన కొన్నాళ్ళకు దొడ్డనాయకుడు (బ్రహ్మనాయుని తండ్రి) కూడ ఆదారినే పట్టుట గలిగినది. ఇట్టి స్థితిలో నలగామరాజునొద్ద పరంపరాప్రాప్తమగు మంత్రిత్వమును దొడ్డనాయునితర్వాత బ్రహ్మనాయుడే పూనవలసియున్నను, మఱి యొకరీత్యా నాయకురాలు (ఈమెయే యీ నాటకములోని నాయకురాలు) ఆ పదవిని ఆక్రమించుకొనుట గల్గినది. అయినను బ్రహ్మనాయుడు మంచి మేధావియును, కార్యచతురుడును, ప్రభుభక్తిధురంధరుడును, సత్యనిరతుడును, నిక్కమగు దేశభక్తిచే సంభరితుడును అగుటచేత నీ యకార్యమునకు కుపితుడుగాక, నలగామరాజుయొక్క తక్కిన యార్వురు సోదరులను పెద్దవారలగునంతవఱకు పెంచుచు కాలమును ప్రతిక్షించియుండి, తనకు పదచ్యుతి కల్గినను, అనాదినుండివచ్చుచున్న ప్రభువంశమునందలి భక్తిచే అనురాగమునే ప్రదర్శించుచు, ఆ పిల్లలు పెద్దవారలైన వెనుక తాను మాచర్ల పట్టణములో ప్రవేశించి, అచ్చట స్థిరనివాస మేర్పఱచుకొని కాలమును త్రోయసాగెను.

"బలవత్స్వామిక మవిశుద్దాగమనం ధనం భుంజానస్యకుతో మనస్సమాధిః ” (బలవంతులైన సొంతదారులు గలిగియుండి అక్రమరీత్యా చేజిక్కినదానిని అనుభవించువానికి ఎంతటి ప్రాముఖ్య ప్రాబల్యము లున్నను మనశ్శాంతి చేకూరుట ఎట్లు ?) అని భారవి మహాకవి చెప్పినట్లు నాయకురాలు ( ఈమెయొక్క నిజమైన పేరు నాగమ్మ. గామాలపాడు ఈమె జన్మస్థానము. తండ్రిపేరు రామిరెడ్డి ) బ్రహ్మనాయుడు తన కెప్పటికైనను కంటిలోని నలుసులాంటివాడే అనిన్నీ, ఎట్లైనను అతనిని లేకుండ చేసినచో తన బాహటాకు అడ్డు లేదనిన్నీ తలంచి తాను మంత్రిపదవికి వచ్చినది మొదలుకొని ఎటులయినను బ్రహ్మనాయుని, అతని పరివారమును తుదముట్టింపవలయుననిన్నీ దృఢము జేసికొన్నది. కనుకనే నలగామరాజుపట్టాభిషేక కాలమున కానుకల నర్పింపవచ్చిన బ్రహ్మనాయునికి విషము పెట్టించినది. ఇంకను ఎన్నెన్నో మాయోపాయములు చేసినది. కాని పాండవులయెడల ధార్తరాష్ట్రు లవలంబించిన వంచనకృత్యములవలె నవి యన్నియు నిష్ఫలములైనవి. చివఱకు కోడిపందెము లనే మిషపెట్టి బ్రహ్మనాయుని, తదనుయాయులను రప్పించి, కౌరవులవలెనే తానును వారిని ఆ మాయాద్యూతమున నోడించి, ఏడు సంవత్సరములు అజ్ఞాతవాసము చేయించినది. బ్రహ్మనాయుడు తన అనుయాయులతో ఆ కాలమున మండాదికి వలసపోయెను. నాయకురాలు అచ్చటకూడ కౌరవులవలెనే ఆటవికులనుప్రేరేచి అతని ఆవులమందలను చంపించుట మొదలయిన ఘోరకృత్యములను చేయించి, నానా బాధలు పెట్టినది. చివఱకు ఎట్లయిననేమి అనుకొన్నట్లు ఆ యేడేండ్లు గడపిన తరువాత పాండవులవలెనే బ్రహ్మనాయుడు మొదలయినవారు గూడా తమభాగమును తమకు స్వాధీనము చేయవలసినదని అలరాజు ద్వారా రాయబారమంప, కృష్ణరాయబారమువలె ఆ ప్రయత్నము వృథ అయిపోయినందున, ఆంధ్రదేశపు కురుక్షేత్ర మనదగిన నాగులేటి యొడ్డున యుభయపక్షములవారును పోరి అనేకవేలజనులను నాశము చేసికొనిరి. చివఱకు ఆ యుద్ధమున నలగామరాజు పరాజితుడై బ్రహ్మనాయుని శరణు సొచ్చెను. మహావీరుడు, దయాళువు. ఆర్య వర్తనుడు, నిశ్చలమగు ప్రభుభక్తి దేశసేవానిరతి ప్రజానురాగాసక్తి గల బ్రహ్మనాయుడు నలగామరాజును చేపట్టి అతనికి గురిజాల సింహాసనమున తాను పట్టాభిషేకముచేసి, తానే ప్రధానియై పరిపాలనముచేసి కీర్తినొందెను.

వీరులకథ - నాయకు రాలిలో దాని కూర్పు

పల్నాటివీరులకథలో గల సారాంశ మిది. దీనిని నాటకముగా వ్రాయుటలో మన పంతులుగారు నాయకురాలిని ప్రధానపాత్రనుగా తీసికొన్నారు. తీసికొనుటయేమి ? అసలు కథలోగూడ నాయకురాలే ప్రధానురాలు. నాయకురాలివంటి తీవ్రరాజకీయపరిజ్ఞాత్రి ఈ కథలో లేనియెడల బ్రహ్మనాయుని సుగుణములు ప్రకాశదశకే వచ్చి యుండెడివి కావు. అగుటకు ఆడుదియే యైనను ఈమె యుద్ధరంగమున సాక్ష్మానృత్యుదేవతయే ! రాజ్యతంత్రము నడపుటలో చాణక్యునంతటి వానికైన టాఠాలు గుణింపచేయగల కుటిలప్రజ్ఞగల కోమలి. నలగామరాజు మొదలగువారిని తోలుబొమ్మలవలె గారడీచేసి ఆడించిన సాహసురాలు, అపరభీష్ము డనందగిన బ్రహ్మనాయుని యంతవానిని గడగడ వణకించిన అంబాస్వరూపిణి. ఎత్తుకు ప్రతి యెత్తు ఎత్తుటలోనేమి, వ్యూహమునకు ప్రతివ్యూహమును పన్నుటలో నేమి ఈమె కీమెయే సాటి. ముద్రారాక్షసనాటకమునందు రాజసమంత్రి యొక్క పన్నాగములను పాడువారించి, నందవంశమునందుగల భక్తిచే వివిధ ప్రయత్నములుచేసియైనను ప్రభుభక్తిని జూపగా దివిరిన రాక్షసమంత్రిని, చాణక్యు డేవిధముగా లొంగదీసి పరపక్షమునకు దాసుడై మంత్రిపదవిని వహించి, తదభివృద్ధికై పాటుపడజేసెనో, అట్లే మన నాయకురాలును బ్రహ్మనాయుని సర్వప్రయత్నములను ఉపసంహరించి, చివఱకు అతనిచేతనే నలగామరాజునకు మంత్రిత్వము చేయించిన (చేయునట్లుచేసిన) జాణ. నాయకురాలియందు ఇంతటి ఆధిక్యము లుండుటంబట్టియే ఈ నాటకమున కీమెను ప్రధానపాత్రముగా పరిగణించుటయేకాక, నాటకముపేరునుగూడ “నాయకురాలు" అనియే శ్రీ పంతులుగారు పెట్టినారని తలంచుచున్నాను. ( ఇది నా యూహమాత్రమే )

ఇతివృత్తసంయోజకము

నాయకురా లను నీనాటకములోని ఇతివృత్తము నలగామరాజు పట్టాభిషిక్తుడైనతరువాత, నాయకురాలి విషప్రయోగమునకు బ్రహ్మనాయుడు తాను గురియై, అచ్చటినుండి పరుగెత్తిపోయి మాచెర్లలో నివాస మేర్పఱచుకొనినపిమ్మటినుండి ఆరంభ మగుచున్నది. కనుకనే ప్రథమాంకము 1-వ రంగములో పొదిలె పాపన్న, కల్వగుంట కాశీపతుల సంభాషణతో వెనుకటి కధాంశములో పొటమరించిన గృహచ్ఛిద్రములును, తత్ప్రయుక్తములగు మనస్పర్థలును సూచనచేయుచు కథోపక్రమణమును ఆరంభించి, క్రమముగా కథాంశమును పెంచుచు, ప్రభువుల మనస్పర్థలవలనను, పరస్పరద్వేషములవలనను ( అనగా ఇచ్చట బ్రహ్మనాయుడు, నాయకురాలు అను ఉభయుల కక్షలమూలమున ) అకృత్రిమములగు ప్రేమలతో, అన్నదమ్ములవలె అన్యోన్యముగా నున్న ప్రజాసామాన్య మేవిధముగా సంతప్తమగుచున్నదియును ప్రదర్శించి, రెండవ రంగమున రవంత రాజకీయపరిజ్ఞానమును,కొంచెమంత ప్రభుభక్తి గల అనుయాయుల హృదయపరిస్థితులును విస్పష్టము చేయదొడగి, మూడవ రంగమున ద్విధావిభిన్నమైన పాలకజనమును ఏకోన్ముఖమునకు గొనివచ్చుటకై పరివారము చేయవలసిన ధర్మమును నిరూపించి, ఆబాలగోపాలమును ఈ సందర్భమున నెట్టి పరిస్థితులలో తగుల్కొని పరితపించుచున్నారో విశదముచేయుచూ, చదువరులకు గ్రామాలపాటిప్రాంతములలోని (నాయకురాలి జన్మస్థలము) ప్రాభవసంపదలను పరిచయము గావించుచు, అయిదవ రంగమునకు ద్రిప్పి నాయకురాలిపక్షపువారి ఆదర్శములను రెండవపక్షము వారి సంభాషణలలో బీజనిక్షేపరూపముగా ప్రదర్శింపజేయుచు, కడునేర్పుగా నాగాంబిక (నాయకురాలి) దృఢనిశ్చయమును వెల్లడించుటతో మొదటి యంకమును శ్రీ పంతులుగారు ముగించినారు.

తర్వాత రెండవ యంకమునందు తొలిరంగమున పరపక్ష నిశ్చయమును విన్నపిమ్మట బ్రహ్మనాయుని మంత్రినిశ్చయమును వెల్లడించుటకై మాచర్లసభాభవనమును ప్రదర్శించి, కేవలసాత్విక దృష్టియును, అవిరతమగు ప్రభుభక్తియును. జానురక్తియును గల బ్రహ్మనాయుని మంతనమునున్నూ, అందలి గాంభీర్యమున్నూ, అతని యనుచరుల ఆదర్శములను వెల్లడించుచు, నాయకురాలి రాయబారిని మధ్యను ప్రవేశపెట్టించి బ్రహ్మనాయుని పక్షమునకు కదలిక పుట్టించి తద్ద్వారా రెండవపక్షమువారి ఆదర్శములున్నూ , దృఢనిశ్చయములను వెల్లడింపజేసి తదనుగుణముగా తాత్కాలిక లోకసంస్థితిని ప్రదర్శించి రెండు మూడు రంగములను ముగించి నాల్గవ రంగమునందు విక్లబ హృదయముచే వేదనపడుచున్న బ్రహ్మనాయుని నొకమారు చూపి రెండవ యంకమును నేర్పుతో ముగించిరి.

ఇకను మూడవ అంకమునందు మరల నాయకురాలి ప్రతివ్యూహరచనలను, రాజ్యతంత్రగమనిక లను ప్రేక్షకులకు రుచి చూపుచూ బ్రహ్మనాయుడు మున్నగువారిని ప్రవాసమంపుటకు అంకురార్పణయగు (కోడిపందెమును ) ద్యూతప్రయత్నమును, తదనుసారమగు నాహ్వానధోరణిని ప్రదర్శించి మొదటి రంగమును ముగించి, రెండవ రంగమున జూదమునకై ఆహూతులయిన బ్రహ్మనాయునిపక్షమువారి మంత్రాలోచనసందర్భములకు మనలను తీసికొనిపోయి, అంతతో ఆ రంగమును ముగించి, మూడవ రంగమున ద్యూతసభాభవనమునందలి ద్యూతఖేలనవిధానమును కడునేర్పుతో చూపి, బ్రహ్మనాయునిపక్షమువారి పరాజయముతో అజ్ఞాత వాసమునకు అంకురార్పణ చేయించి, సభాపర్వమును చక్కగా సంతరించి ఆ యంకమును అంతతో ముగించి, అరణ్యపర్వము నారంభించిరి. పిమ్మట నాలవ యంకములో అజ్ఞాతవాసఖిన్నులగు బ్రహ్మనాయునిపక్షమువారి తహతహలు, తటపటాయింపులు మొదటిరంగములో పొడగట్టును. ఇట్లే రెండవ రంగములో తత్ప్రతిపక్షులగు నాయకురాలి వ్యూహరచనములును, శత్రుమారణార్థము పన్నిన కుటిలములగు పన్నుగడలును, తన్మూలమున దోలాఁదోళితమగు నాయకురాలి హృదయావేగములును గోచరించును. తరువాత నిందులోనే మూడవ రంగమునందు వనవాసముచే ఖిన్నులై , త త్ల్కేశములమూలమున స్వబలక్షయమునకు గురియై కర్తవ్యము నాలోచించుటకై కూడిన బ్రహ్మనాయుని యాలోచనా గృహమును ప్రదర్శించి, శత్రువుల కుట్రలకు బదులుచేయుటెట్లాయని ఆందోళితములగు మనస్సులతో స్వకర్తవ్యము నన్వేషించుచున్న వీరులను ప్రత్యక్షీకరించుచు నాలవ రంగమును ముగించినారు.

అయిదవ యంకములో ఉత్తీర్ణప్రతిజ్ఞులై స్వస్థానాభిముఖులై వచ్చుచున్న బ్రహ్మనాయునిపక్షమువారిని, వారి మంతనములను మొదటి రంగములోనున్నూ, అలరాజు సంధిరాయబారముతో రెండవ రంగమునున్నూ ప్రదర్శించి, సంధిప్రయత్నముల వైఫల్యమును వెల్లడించి, యుద్ధమున కంకురార్పణ చేయించినారు. దీనితో అయిదవ యంకము ముగియును.

తర్వాత ఆరవ అంకము ఆరంభమగును. ఇందులో మొదటి రంగమునందు యుద్ధరంగప్రదర్శనము ఆరంభమై నాయకురాలి పక్షమువారికి మొదటి గెలుపు చేకూరుటయును, పిమ్మట రెండవ రంగమునందు స్వపక్షపరాభవమును, తోకత్రొక్కిన త్రాచులవలె విజృంభించిన బ్రహ్మనాయుని పక్షమువా రొనర్చిన పూర్ణాహుతియును, దానితో నాయకురాలి పక్షమువారు లొంగి బ్రహనాయుని శరణు సొచ్చుటయును, “వీరపురుషోచితమైన రణమరణభాగ్యము తనకు గలుగదయ్యెనుగదా" యన్నవగపుతో విక్లబుడై యున్న బ్రహ్మనాయుని సమీపించి, నాయకురాలిపక్షమువారు క్షమాపణవేడి ఆశీర్వదింప గోరుటయును ప్రదర్శించి నలగామరాజును గురిజాల సింహాసన మెక్కించుటతో ఆరవ రంగమును ముగించిరి. దీనితో నాయకురాలి నాటకమును ముగియును.

పాత్రపోషణ విధానము

ఆంధ్రదేశమునందలి ఆధునిక గ్రంథకర్తలలో ప్రతిభా ప్రాభవ విషయమున శ్రీ లక్ష్మీనారాయణ పంతులుగారు మిన్నలు . దేశభక్తి, భాషాభిమానము, జాతీయాభిమానము అను సుగుణములు వీరికి వెన్నతోబెట్టినవి. ఆంధ్రదేశపు చారిత్రికవిజ్ఞాతలలో మా యెఱింగినంతవట్టునకు ఇంతటి యభినివేశముతో, ఇంతటి యానుపూర్వితో ఆంధ్రదేశపు ప్రాచీనచరిత్రాంశములను చెప్పగలవా రీ కాలములో నరుదుగా నున్నారు. మన మధ్యరాష్ట్రమునందు పేరెన్నికగల స్థలపురాణము లెన్ని గలవో, ప్రభువులు మొదలగు స్థానికపరిపాలకు లెవ్వరెవ్వరి ప్రభుత్వములో మన సాంఘిక సారస్వత విషయములందు ఏ యే విధములగు మార్పులు, కూర్పులు జరుగుచువచ్చినవో, హృద్గతముగా (హృదయవేదిగా) సంవత్సర మాస పక్ష తిథుల సంఖ్యలతో కూడ, నిస్పటికిని ఏకరువుపెట్టి సమన్వయముచేయగల శక్తి వారికున్నది. శైవమతవిజృంభణాంతమునగల సాంఘిక, సారస్వతముల స్థానికచరిత్రములను సాధారణముగా వారు కోరినంతనే వప్పగింపగలరు. ఇది నా స్వానుభవ విషయము, ఆంధ్రలోకమునకు కాన్కగా పంతులుగారు వ్రాసిన 'మాలపల్లి ' యను గ్రంథమును చదువుటమూలముగా నియ్యది అనుభూతమైన విషయమై యుండుట చేత ఇక దీనినిగుఱించి విశేషించి చెప్పవలసిన పని యుండదని నా విశ్వాసము. ఆంధ్రమహాభారతమును విశేషమగు విమర్శనముతో వీరు చదివినన్ని మారులు ఇఁక నిప్పటిపండితులుగూడ నెవ్వరును చదివియుండ రన్నను తప్పు కాదు. కలముపోటునందును, కత్తిపోటు నందును సమానమగు విఖ్యాతిని గడించిన తిక్కనసోమయాజియొక్క విరాటోద్యోగములు ఈయన సొమ్ము. కనుకనే చిరకాలమునుండి తాము చేసిన రాజనీతిధౌరంధర్యమును వీరు ఈ నాటకమునందు ఆదినుండి అంతమువఱకును వెల్లడించియున్నారు. నాయకురాలి సవిమర్శగా చదువుటకు దొరకొను పాఠకవర్గము మున్ముందుగా నీ విషయమును తెలిసికొని యుండుట మిగుల ముఖ్యమని నా యభిప్రాయము.

ఇక ప్రస్తుతమునకు వచ్చుచున్నాను. శ్రీ లక్మీనారాయణపంతులుగారు నాయకురాలిని నిర్మించుటలో కౌరవ-పాండవ యుద్ధగాథను ప్రధానాదర్శముగా గొన్నారు. కావుననే బ్రహనాయుని పాత్రమును పోషించుటలో అన్నివిధముల నజాతశత్రుని పాత్రము ననుకరించి అతని సత్యవ్రతభంగ భీరుత్వమును, ఆయన శ్రమ ప్రధానమగు శీలమును, శాంత్యాకాంక్షను, కులాభివృద్ధిని, స్వజనానురక్తిని, స్వదేశాభిమానమును సంపూర్ణముగా నిందు పోషించుటకై తమ యావచ్ఛక్తిని వినియోగించి ధన్యులై నారు. బ్రహ్మనాయునికి ఎదిరిపాత్ర మగు నాయకురాలిని తీర్చుటలోగూడ తొలుదొల్త స్త్రీసామాన్యమునకు సహజమున్నూ, గ్రామీణస్త్రీలకు తప్పనిసరిదియును అగు ముగ్ధభావమును, కోమలహృదయతను, అమాయికత్వమును, ప్రాకృతజనవాత్సల్యమును గల నాయికగా వర్ణించినప్పటికిన్నీ, రాజ్యతృష్ణచే కఠినమైపోయి స్వీయనాశమును కూడ లక్ష్యముసేయని రారాజు హృదయకాఠిన్యమునూ, శత్రు మారణమునకై ఎట్టి యధర్మమార్గములనైనను తొక్కెడి సామర్ష బుద్ధిన్నీ, అకారణద్వేషమున్నూ కనులకు కట్టినట్లు తీర్చి అధికారాంధకార మన్న నెట్టిదియో ఆ పాత్రమున ప్రదర్శించినారు. బ్రహ్మనాయుడు-నాయకురాలు అను నీ యుభయపక్షములలో పరస్పర ద్వేషమును, అన్యోన్యసంఘర్షణమును పెంచి కథ నడుపుటకై , ఒకరికి సర్వవర్ణసమత్వమూ, రెండవవారికి కేవలము ఆర్యజనవిభక్తమగు వర్ణాశ్రమధర్మరక్షణమూ అనువాని నవలంబనముగా గొని, యుభయపక్షములవారు తమ తమ బలమును అభివృద్ధిచేసికొనుటలో వీనిని ప్రధాన సాధనములుగా దేశకాలపరిస్థితులను గ్రహించినట్లు ఇందు నిరూపించినసందర్భము ఈకాలములోని మనకు ఒకరకపు ఛాయలను సూచించుచున్నట్టు లున్నప్పటికిన్నీ, అవి నిక్కమగు చరిత్రాంక ములై , చాపకూడు ఇత్యాదులగు సంకేతములద్వారా సత్యములుగా నుండుటచేత, చారిత్రికదృష్ట్యా ఈ గ్రంథకర్తకు వాటిని కూర్పక తప్పినదికాదు. ఈ నాటకమునందు బ్రహ్మనాయుని, తదనుచరులను దిద్దితీర్పుటలో వారి నోట పల్కించిన యాదర్శవాక్యములు ఇప్పు డీ ఇరువదవ శతాబ్దిలోని గాంధీమహాత్ముని యుపదేశములను ప్రతిపదమునందును స్ఫురణకు తెచ్చుచున్నవి. ఇట్టులనే, నాయకురాలి విషయములో గూడ ఆబాలగోపాలమును వర్ణాశ్రమధర్మరక్షణపరత్వము మారుమ్రోగునట్లు చేసినారు. ఈవిధముగానే ఈ నాటకమునందు ప్రధానపాత్రములను, ఉపపాత్రములను మొదలగు నన్ని యంగములను సంపూర్ణముగా తీర్చికూర్చుటలో శ్రీ పంతులుగారు కనబఱచిన ప్రజ్ఞావిశేషము ఎంతగా చెప్పినను, వ్రాసినను ఏమాత్రమూ తరగునది కాదని మనవిచేసికొనుచున్నాను.

ఇకను పాత్రపోషణవిషయమును ముగించుటకు ముందుగా నొకమాటను చెప్పవలసియున్నది. సాధారణముగా నింతవఱుకును మన నాటకములలో అంకముల సంధులను అతికి కథాంశములను పొందించుటలో సంస్కృతభాషామర్యాదను విష్కంభములను వ్రాయుట మనవారి యాచారమైయున్నది. కాని యిందులో మాత్రము విష్కంభమన్న పేరుతో ప్రత్యేకముగా అంకముల సంధులను కూర్చినను. కూర్పకున్నను ప్రతాపు డనుపేరుతో కాలపురుషునొకనిని ప్రవేశపెట్టుచు విష్కంభములేని కొరతను దీర్చి క్రొత్తపుంతను ద్రొక్కినారు. అయినను విష్కంభముయొక్క యాశయము లిందు గానరావు. వీ రీ నాటకములో అంకసంధులలో ప్రతాపపాత్రమును ప్రవేశపెట్టినప్పుడెల్లను ఆ పాతముద్వారా అత్యుత్కృష్టములును, ప్రకృతిశాస్త్రై కగమ్యములును, తీవ్రమగు మనీషతో విచారణచేసిన గాని బోధపడనట్టివి అగు కొన్ని యాదర్శప్రాయములగు సిద్ధాంతములను వెల్లడించుటలో ఈ ప్రతాపుని సంభాషణవాక్యములు జీవగఱ్ఱలై వెలయుచున్నవి. అగుట కీ వాక్యములు సాధారణ జనులకు అంతగా బోధపడునవి కాకపోయినా, స్థూలదృష్టులకు ఏవో వేదాంతములుగా పొడగట్టినా, ఈ నాటకముయొక్క తత్త్వ మంతయును వీటిపైననే ఆధారపడియున్నది. మొదటియంకము నారంభమున సృష్టిస్థితి లయముల తత్త్వమును ఉపన్యసించి, ప్రపంచము కేవలము సంకోచ వికాసములద్వారా ప్రవృత్తులను జరపుచున్నదని నిరూపించి, పల్నాటియుద్ధరంగప్రదర్శనము తటస్థించిన మూలకారణములను చక్కని మాటలతో తేటగా వెల్లడిచేయించిన పట్టులు తాత్త్వికులకు అపరిమితమగు నానందమును కూర్చునవియై యున్నవి. పిమ్మట రెండవ యంకము ఆరంభములో మఱల ప్రతాపుని ప్రవేశపెట్టి, ప్రధాన సిద్ధాంతములగు సంకోచ వికాసములను ప్రదర్శించుట కెట్టి సాధనసామగ్రి ఆవశ్యకమైనదియును సూచింప చేసినారు. ఈ సందర్భములో వీరు వ్రాసిన "అజ్ఞానం పశుత్వ చిహ్నం" మొదలయిన వాక్యజాలము సందిగ్దాభిప్రాయము గలవారి కన్నులకు మహోపదేశమును గావించు దివ్యాంజనపు ఘుటికలనియే చెప్పవచ్చును. తర్వాత మనకు ప్రతాపపాత్రము మూడవ అంకము నారంభమున దర్శనమిచ్చి , హింస అహింసా ధర్మముల యాథాతథ్యమును కలరూపున నెఱిగించునప్పుడు, ఏపాటి చేతనము కలవారికైనను ఒడలు జలదరింపక మానదు. దీనిలో పశుత్వ చిహ్నమైన అజ్ఞానపు పూర్ణస్వరూపమును చిత్రించి మున్ముందటి యంకములలో రాగల యద్దాని విభ్రమవిలాసముల స్వరూపమును అద్భుతముగా చిత్రించినారు. ఈ సందర్భమందలి వాక్యములు లోకశాంతి నాకాంక్షించు పెద్దలందఱును ఒక్కమారైనను మననము సేయుట కర్హములని నా విజ్ఞప్తి.

ఆ తర్వాత నెప్పటియట్టులు నాలవ అంకము ఆరంభములో ప్రతాపుడు దర్శనమిచ్చును. కాని వెనుకటి ప్రతాపస్వరూపము మాత్రము కాదు. ఇచ్చటి ప్రతాపుడు అద్వితీయ బ్రహ్మతేజుఃప్రపూర్ణమైన, క్రౌర్యవిహీనమైన అహింసతో సహకారము నొనర్చుచు నిత్యత్వవ్రతముయొక్క విజయస్వరూపమును చిత్రించు ప్రతాపుడు మాత్రమే, మన కిచ్చట కన్పడుచున్నాడు. ఈ నాటకములో తక్కిన భాగములందుకంటె, ఈ యొక్కయంకమును నిర్మించుటలో గ్రంథకర్తగారు అతులమగు నైపుణ్యమును, ప్రజ్ఞావిశేషమును, పదర్శించి మనల సంతృప్తులచేసి ధన్యతను చేకూర్చుకొను చున్నారు. తర్వాత నైదవ యంకము నారంభమున మఱల ప్రతాపపాత్రమును ప్రవేశపెట్టి నిత్యసత్యవ్రతపూర్ణమగు అహింసారంగమున నెంతెంతటి యుత్తమపాత్రములున్నూ తమ తమ పాత్రములను ప్రదర్శించుటలో ఎట్టు లెట్టులు శక్తి చాలకున్నదియును సూచించుచు, అహింసాతత్వము నెఱుగనికతన కలుగబోవుచున్న సర్వనాశనమునకై ప్రజ లెట్లు పాత్రములు కాబోవుచున్నదియును వెల్లడించుచు నిష్క్రమించును. ఇకను మిగిలినది ఆరవ యంకము, ఈ యంకమునందు వెనుకటి యంకములలోవలె గాక ప్రతాపపాత్రము ఆద్యంతముల రెంటను ప్రవేశము గాంచుచున్నది. అందులో తొలుత బీభత్సరసప్రాదుర్భావస్థితిని అంకాదియందును. ప్రళయగీతమును గానముచేయుటమూలమున బీభత్సరనిపరిపూర్ణ స్థితిని అంకాంతమునను కీర్తింపజేసి సంకోచ వికాసముల పరిణామములను వెల్లడించి, యంతతో ఈ పాత్రము నిష్క్రమణము జెందును. దీనితో నీ నాటకముగూడ పూర్తియగును. ఇట్టి రచనాసంవిధానము మనకు నూత్నమును, ముఖ్యముగా దృశ్యకావ్యముల ప్రయోజనమును నిర్ణయించునదియును నయియుండి, ప్రేక్షకుల మనస్సుల కవాజ్మానసగోచరమగు తాత్త్విక స్థితిని గల్గించుట ద్వారా ఆనందపరాకాష్ఠను వెలయించుచున్నది. ఇంతటి మహోత్తమమగు సన్ని వేశములతో ఇతివృత్తనిర్వహణము గావించిన శ్రీ లక్ష్మినారాయణ పంతులుగారి ప్రతిభ నాబోటివాని వర్ణనమున కతీతమైన దనుట నిక్కము.

నాటకభాష - తదౌచిత్యము

సాధారణముగా గ్రంథకర్త లెంతటి యుత్కృష్టమగు ప్రతిభాసంపద గలవారై నను, అనురూపములగు భాషయును, భావమును అలవడినగాని రససిద్ధి నెనయజాలరు. కాని లక్ష్మీనారాయణపంతులు గారి కీ రెండును కొట్టినపిండి. వారి రచనములో భాషాభావములు అన్యోన్యసామరస్యముతో కలసిమెలసి ముద్దులుగులుకుచుండును. గ్రాంథికభాషయందు వారికి అపారమగు నభిమానమును, ఆదరమును ఉన్ననూ ఇట్టి చారిత్రికనాటకములయొక్క ఘనాదర్శములను వెల్లడించుటకై వారు మారుమూలభాషకై – స్వపాండిత్య ప్రదర్శన గౌరవమునకై --పరుగులెత్తక , నిత్యకృత్యవ్యవహారముల నుపయోగించునట్టి, శిష్టసంవ్యవహారమున నున్నట్టి భాషనే (అనగా వాడుక భాషనే) ప్రధానముగా గొని గ్రంథములను తీర్చుచున్నారు. “కవయః కాళిదాసాద్యాః కవయో వయమప్యమీ" అన్నట్టులు అస్మాదృశులముకూడ ఏదో కొంచె మించుమించు వ్యావహారికభాషను వాడుటకు ప్రయత్నించుచున్న వారమే యయ్యును, వారి సిద్ధహస్త సౌభాగ్యమును మేము పూర్తిగ కాంచలేకున్నాము. కాంచలేకున్నా మనుటయేల ? రసవత్తరమును, అనన్యసామాన్యప్రతిభావిలసితమును నైన వారి వాడుకభాషా రచనమగు నీ కృతికి యథామతి పీఠికను వ్రాయుటకు పూనుకొనినప్పుడు నామట్టునకు నాకు జంకు కలిగినది. కాని, ఆప్తులగువారి యానతియే నన్ను ఉత్సాహపరతంత్రునిగాచేసి, గ్రాంథికభాషలో నిట్లు నా లేఖినిని ప్రసరింపచేసినది. కావున నిందులకై శ్రీ పంతులుగారిని, తదితరులగు గ్రంధపాఠకులను మన్నింప వేడుచు వాఙ్మనఃకాయము లనెడి త్రికరణములద్వారా సర్వదా లోక శ్రేయమునకై తమ తనుమనోధనములను వినియోగించి, కృతార్థులగుచు సోదరాంధ్రజాతినంతను కృతార్థత నెనయించుచు నున్న బ్రాహ్మశ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణపంతులుగారి కీర్తి యాచంద్రతారకముగా నెలకొని, భవిష్యదాంధ్రయువకులకు సర్వవిధముల నాదర్శమై వెలయునట్లు చేయుమని అకారణదయాళువును, సర్వలోక నియంతయును నైన యా జదీశ్వరుని నిరంతరము వేడుకొనుచు నింతతో నా యీ లేఖినిని విషయాంతరమున నేమించెదను.

క్రోదన-ఫాల్గుణ పూర్ణిమ

చెన్నపురి

ఇట్లు విధేయుడు

పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి