Jump to content

నాయకురాలు (పల్నాటి వీరచరిత్ర)/4-వ అంకము

వికీసోర్స్ నుండి

4-వ అంకము

[ ప్రవేశము - ప్రతాపుడు ]

పోరడమంటే కత్తులతో పోరాటమేగాదు. కత్తులూ ఫిరంగులూకూడా సమకూర్చలేని విజయం సత్యవ్రతం సమకూర్చుతుంది. దీనిది క్రౌర్యంలేని ప్రతాపం. అహింస దీనికి వేరు. ఇతరులు హింసించినా నిరోధించక సహించడం వృక్షం. ప్రేమ దీని ఫలం. ఈ పోరాటంలో శత్రుత్వసంహారమే గాని శత్రుసంహారం లేదు. ఇటువంటిపోరు నాకు చాలా యిష్టం.

1-వ రంగము

మాచర్ల - రాజుగారి గృహం

[మ. దే. రా. బ్ర నా; బాలుడు; కొమ్మరాజు మొ. వారు ప్రవేశము ]

బ్రహ్మ: తా నొకటి తలంచితే దైవమొకటి తలంచాడన్నట్టయింది.

మ. దే. రా : కాదు, కాదు, మన మొకటి తలంచితే నాగమ్మ మరొకటి తలంచింది. అంతా మాయగారడి మోస్తరయింది. బెరస నెవలికి లొంగిపోవడమే ఆశ్చర్యం.

బా. చం : బెరస రంగంలో నిలుచుంటే అభిమన్యుడు పద్మ వ్యూహంలో పోరుతున్నట్లున్నది. దాని అయిదు తన్నులూ అశ్వినజారిపోయినవి. చిత్రంగా కొంకి మెడకు తగులుకొన్నది. మునివేళ్ల కందుతున్న గురిజాలరాజ్యం యెగిసి పోగా, కాళ్లక్రిందవున్న మాచర్లకూడా బెసికిపోయింది. రెంటికీ జెడ్డ రేవడల మయినాం.

బ్రహ్మ : విజయం రొంపిలో స్తంభం. ఎటు వొరుగుతుందో చివరవరకూ చెప్పలేము. ఒకడు యెల చేతికందినట్టే భావించి చేయి చాచుతాడు. జయలక్ష్మి వాణ్ణి కసిరికొట్టి మఱివొకడికి చేయి అందిస్తుంది. ఒకడు చెట్టు యిండె బెట్టి నరికి ఒకవైపుకు లాగుతాడు. అది మఱివొక వైపుకు విరుసుకొని యిండ్లను భగ్నము చేస్తుంది. న్యాయాధిపతి విచారణ పూర్తిజేసి ఒక వైపు అభిప్రాయం తేల్చుకొంటాడు. కాని యే స్వల్ప అనుమానమో తగిలి కథ అడ్డంగా తిరుగుతుంది. విరగబండి కోసి ఆరవేసిన పనలు చేలమీద పరవంజివుంటవి. ఈనగాచి నక్కలపాలు జేసినట్లు ఒక్క వానతో అంతా ముగుస్తుంది. విధియొక్క చెయ్దిము లిట్టివని చెప్పవీలులేదు. విజయకారణము ధనంగాని, దేహబలంగాని, సైన్యబాహుళ్యంగాని, ఆఖరుకు బుద్ధిబలంగాని కాదు. అదృష్టమే కారణము.

కొమ్మ : గాలిలో దీపంబెట్టి దేవుడా నీ మహిమంటే యేమి ప్రయోజనం. తెలిసి తెలిసి చేతులమీదుగా రాజ్యం పోగొట్టుకొన్నాం. అతిసంచయేచ్ఛ తగదు. కలిగిన దానితో తృప్తిజెందివున్నట్టయితే యింతముప్పు వాటిల్లక పోయేది.

బ్రహ్మ : గెలుపోటము లెవరికీ ముందుగా దెలియవు. గెలువ గలమను ఆశ లేనిది యెవడూ యేపనీ తలపెట్టడు. ఆశయే ఆరంభముల కన్నిటికీ మూలము. సంశయములకు లోనయ్యేవాడు యేపనీ నిర్వహించలేడు. సాహసము లోనే జయ మున్నది. సాహసమే వీరలక్షణము. సాహసునకు శంకితుడు పరిపంధివర్గములోనివాడు. వెనుకకు లాగడం శంకితుని పని. ముందడుగు వేసేవాడు సాహసుడు.

అలరాజు : గతజలసేతుబంధన మెందుకు? ముందు జరుగ వలసిన పనేదో తేల్చండి.

బా. చం : బాలుణ్ణి; సాహసించి చెప్పినందుకు క్షమించండి. మనము మాచర్లను విడువక మండలమును సంరక్షించు కొందాము. కల్లజూదములో పోగొట్టుకొన్నది కత్తితో గెలుచుకొందాము. మాచర్లను మొదట అక్రమంగా తీసుకొన్నామనే అపవాదుకూడా పోతుంది.

కొమ్మ : దండోపాయాని కిప్పటికంటె మంచిసమయము రాదు. మాచర్లను విడిచిపోయి యెప్పుడో మళ్ళీవచ్చి యుద్ధం జేయడం నేలవిడిచి సాము చేయడం. అయితే యిప్పుడు యుద్ధంజేసినా గెలుస్తామన్న ధైర్యం నాకు లేదు.

బ్రహ్మ : మనము చేసేపని ముందు మన మనస్సుకు న్యాయంగా దోచాలె. దేవుడూ, లోకమూ మెచ్చేటట్టుగా వుండాలె. మనం జేసిన ప్రతిజ్ఞకు వ్యతిరేకంగా పోతే సత్యదూరుల మవుతాము. సత్యవ్రతంతో సమానమయింది లేదు.

బా. చం : మనది క్షత్రియధర్మం. రాజ్యం వీరు లనుభవించ దగినదిగాని సత్యవ్రతం బట్టే సన్యాసులకు చేజిక్కేది గాదు. మనం పోరలేమని తోస్తే యెప్పుడో తిరిగివచ్చి పోరాడుదామని భ్రమపెట్టుకొని ప్రవాసకష్టాల పాలుగావడంకంటె రాజ్యం మన కక్కరలేదని యిప్పుడే చెప్పివేస్తే నాగమ్మే యింత పొల మిప్పిస్తుంది. దున్నుకొని బ్రతుకుదాం. బ్రహ్మ : ధర్మరక్షణకోసం శత్రువును హింసించడమూ, అది సాధ్యంగాకపోతే ధర్మమువిడిచి పారిపోవడమూ రెండూ సత్యమునకు దూరమయినవే. ఆ రెంటిలో పారిపోవడం కంటె హింసించడమే మేలు.

బా. చం : మీరు పల్నాటిని విడిచి బయట అడుగుబెట్టిన మర్నాటినుంచీ శత్రు శేషం పనికిరాదని నాగమ్మ మన వెంటబడి వేధించి నాశనం జేస్తుంది.

బ్రహ్మ : మనం హింసామార్గ మవలంబించి ప్రతిక్రియకు పూనుకొన్నామా, నశించడమే నిశ్చయం. అహింసావ్రత మవలంబించి శత్రువును నిరోధించకుండా సత్యమును కాపాడితే నశించం. తప్పకుండా బలవంతుల మౌతాము. ధర్మబలమే బలము.

బా. చం : ఏబాధలు పెట్టినా సత్యానికి నిలువబడడం బ్రాహ్మణధర్మంగాని క్షత్రియధర్మం గాదు.

బ్రహ్మ : బ్రాహ్మణజన్మమెత్తకపోయినా సర్వోత్కృష్టమయిన సత్యవ్రతం యెవరయినా అవలంబించవచ్చు.

బా. చం : ఏడుసంవత్సరములు ప్రవాసములో నవిసినతరువాత మీరు యుద్ద మసలే చేయలేరు. ఇప్పటి బలగముకూడా జారిపోతుంది.

కొమ్మ : నాయుడుగారూ ! నాకు తెలియ కడుగుతాను, అవసరమయితే యిప్పుడుగాని, మఱొకప్పుడుగాని మాచర్ల కోసం మీరు పోట్లాడ దలచారా ?

అ. రా : సమయం నెరవేర్చి వచ్చినతరువాత పోరే అవసరం లేకపోవచ్చు. బ్రహ్మ : ఈ యేడుసంవత్సరములూ యెవ రెన్ని బాధలు పెట్టినా సహించి సమయం నెరవేర్చినట్లైతే శత్రువుల హృదయం మారిపోయి ఉభయులకూ శత్రుభావం నశించి మిత్రభావమే కలుగవచ్చు. కలుగకపోతే రణం నిశ్చయం.

బా. చం : నా నిశ్చితాభిప్రాయ మిది. గడు వయినతరువాత వారు మీకు రాజ్య మెటూ యియ్యరు. అప్పుడు మీరు యుద్ధంజేసి గెలవడం వట్టిమాట. యేడుసంవత్సరములూ బాధలుపడి తరువాత చావడంకంటె జయమో, మరణమో యిప్పుడే తేల్చుకోవడం మంచిది.

బ్రహ్మ : మనకు ఇప్పుడో అప్పుడో మరణమే నిశ్చయమైన యెడల మన మిచ్చినమాట చెల్లించి తరువాత మనకు న్యాయంగా రావలసినదానికోసం పోరి వీరస్వర్గమందడం మేలు.

మ. దే. రా : గురువుగారు నిశ్చయించినదే జావైన దారి. దానిని మనమందరం శిరసావహించవలసినది.

కొమ్మ : తథాస్తు,

అందరు : తథాస్తు .

బ్రహ్మ: కొమ్మరాజుగారూ, వారి కొమారుడూ మనతో వనవాసం జేయవలసిన ప్రసక్తిలేదు. గురిజాలకు వెళ్లడమే ఉత్తమమని నాకు తోస్తున్నది.

కొమ్మ : సుఖకాలములో మీ ఆశ్రయమును బొంది, కష్టకాలములో వైదొలగడం నాకు సమ్మతంగాదు.

అ. రా : ఉత్తమమయిన జవాబు. బ్రహ్మ : ఇక మనము వెళ్లవలసిన స్థలము నిర్దేశం చేయవలసి వున్నది. మ. దే. రా : తమరే నిశ్చయించండి.

బ్రహ్మ : మండాది విశాలమయిన ఊరు. కృష్ణ అడ్డమున్నది. పశువులకు నీరూ మేతా సమృద్ధిగా దొరికే అడవులు అందికెలో వున్నవి.

లంకన్న : మన కిప్పుడు పశుధనమే ఆధారం. మండాది పశువుల పెంపుకు ఒనరయిన ఊరు. మెకాలపోడుగూడా తక్కువ. .

మ. దే. రా : మండాది పోవడం అందరికీ యిష్టమేనా ? కొ మ్మ : పోయి వుంటుంటే సాధక బాధకాలు తెలుస్తవి. వసతిగుదరకపోతే ఇంకొకవూ రవుతుంది.

బ్రహ్మ: రేపు ప్రొద్దునే ప్రయాణం. ఎల్లుండి తెల్లవారుగట్ల పల్నాటియెల్ల కట్టదాటి పోతాము.

ఆహా ఎంతమాట! మనము పల్నాటిని విడిచిపోతున్నామా ! తల్లీ పల్నాటిరాజ్యలక్ష్మీ ! ఇక యేడేండ్లు నీ నీళ్లు రుణస్య దీరినవి. పవిత్రమయిన యీ పల్నాటి పుణ్యభూమిమీద పరుండేభాగ్యం మనకు లేదు. మనకు చంద్రవంక నీళ్ళలో పర్వస్నానం ప్రాప్తం దిరీంది. పచ్చిక దుబ్బులవలె పెరిగిన యీ పల్నాటికొండలు మన కిక కనుపడవు. పల్నాటిభానుడు మనమీద అస్తమించబోతున్నాడు. తల్లీ ని న్నొకవరముమాత్రము కోరుతున్నాము. నీ ఉత్సంగములో పతనమై కండ్లు దెరిచాము. తిరిగి నీ వొళ్లోనే క్రిందికొరిగి మాగన్నుబెట్టే భాగ్యముమాత్రం మా కియ్యి. అదియే ముల్లోక రాజ్యం పెట్టు.

[ తెరపడుతుంది. ]

2--వ రంగము

గురిజాల - రాజమందిరము

[ నలగామరాజు, నాగమ్మ, నరసింగరాజు ప్రవేశము ]

నల. రా : ఇప్పటి కొకవిధంగా గట్టెక్కినట్టే. పల్నాటిని బాధించుతున్న అంతఃశత్రువులను సరిహద్దుల వెలుపలికి తరిమాం. బయటిశత్రువులకంటే లోపలిశత్రువులు ఎక్కువ అపాయకారు లనేది దేహములోని శత్రువులకూ, దేశములోని శత్రువులకూ కూడా వర్తిస్తుంది. మా కుటుంబము యొక్క ప్రాపున తరములనుండి యెల్లవిధముల పేరు ప్రతిష్ఠల బొంది, అదంతా మరచి, చివరకు కుటుంబకలహములు బెంచి, తానే యేడుగడని నమ్ముకొనివున్న మమ్మును మోసగించి, బెదరించి, రాజ్య మపహరించిన బ్రహ్మనాయుని కృతఘ్నత జ్ఞాపకమునకు వచ్చినప్పుడల్లా విచారం గలుగు తుంది. కాని యితరులకు చెప్పడం సులభం, తాను చేయడం కష్టం. మాకు పరోపకారులయిన వారియెడల మేమయినా కృతజ్ఞులమై వుంటే చాలు. మిక్కిలి కావలసిన వాండ్లు సహితం శత్రువులలో గలిసిపోయి, చిక్కులలో ముణిగివున్న మాకు కొండవలె అండయి నిలిచి బృహస్పతిని మించిన తన మేధాసంపత్తిచేత దేశమును, మమ్మును ఉద్ధరించిన నాగమ్మగారిని కలకాలము మరువకుందుము గాక !

నాయ : దైవసేవ, దేశసేవ, రాజసేవ - మూడూ కలిసివున్న యీ మహత్కార్యవిషయమున నే జేసిన అల్పసేవను ఏలినవా రింతగా ప్రశంసింప పని లేదు. నా ధర్మం నే నెరవేర్చాను. ఇది నాకూ తరణోపాయమే. నా కిట్టి వీలును నే కోరకుండానే కలిగించినందుకు తమకు నే నెంతయు కృతజ్ఞురాలనై వుండవలసివున్నది.

నల. రా : ఈ అవకాశమును మేము గలిగించడమేమి? మీ అర్హతే మీకు ఒనగూర్చింది.

నాయ : యోగ్యతనుబట్టి యోచించేయెడల మానవుడు దేనికీ అర్హుడుగాడు. పరమేశ్వరుని కృపచేతనే మన కన్నీ ప్రసాదింపబడుతున్నవి. మన ప్రయత్న మూరక నిమిత్తమాత్రమే.

నల. రా : భగవంతుడు మిమ్ము నొకసాధనంగా వుపయోగించ దగినట్టు భావించడమే మీ అర్హతను తెలియజేస్తున్నది.

నాయ : కార్యసాఫల్యమునకు దైవ పురుషకారముల రెంటియొక్కయు ఆవశ్యకతను బహుసమర్థతతో నిరూపించారు.

నర: తమ రింతవరకు మాట్లాడినదంతా గతముయొక్క ప్రశంస. ఇకముందు జరుగవలసినదానిలో దైవము సంగతి అటుండ నిచ్చి, మీ రిద్దరు చేయవలసిన పురుషకారముమాత్ర మెక్కువగా వున్నది. పురుషప్రయత్నము ఫలించడమూ, ఫలించక పోవడమూ గలదుగాని, యిప్పుడో, యెప్పుడో చేసినకర్మలకు ఫలమియ్యడందప్ప పరమశివుడుగాని పరకేశవుడుగాని యేమీ ఊరక ప్రసాదించినట్టు నే వినలేదు. దీనిని తమరు బౌద్ధవాద మంటారుగామాలె.

నల. గా : అభిప్రాయ భేదములున్నా మాకూ తమ్ముడికీ ఆచరణలో భేద మెప్పుడూ కలుగ లేదు. మా తమ్ముని ఉపదేశములను యిదివరకు వినక చెడిపోయినాముగాని విని చెడిపోయినది లేదు. నీ సలహాను వినగోరుతాను. నర : శత్రువులు మాచర్లను విడువకపూర్వం అచ్చట జరిగిన ఆలోచనసభలో బాలుడు మొదలయిన యువకులు వొడంబడిక ప్రకారం మాచర్లను విడిచిపోకూడదనీ, యిప్పుడే యుద్ధముజేసి వీలయితే గురిజాలనుసహా. సంపాదించవలసినదనీ వాదించారు. ప్రస్తుతం యుద్ధం జేసి నెగ్గలేమని బ్రహ్మనాయుడు నచ్చజెప్పితే సంక్షేపించుకొన్నారుగాని పూర్తిగా మానుకోలేదు. ఈ వొడంబడిక యేడుసంవత్సరము లయినా మాచర్ల మనకు వదిలి పెట్టరు. . సేనలను సమకూర్చుకోవడం పూర్తిజేసుకొని, యే అపరాత్రివేళ మాచర్ల మండలంమీద వచ్చిపడతారో చెప్పలేము. పల్నాటి సరిహద్దులకు కొంత దూరములో నయినా విడిది యేర్పరచుకొన్నట్లేతే వాండ్లు బయలుదేరేజాడలు కనిపెట్టి సకాలములో యెదుర్కోగలంగాని మందట చెట్టుమీది గద్దలాగ పీటపెట్టుకొని సమయానికై వేచివుండి యేమరుపాటున మాచర్లను తన్నుకొని పోవడానికి సిద్ధంగా వున్న వాండ్లను అడ్డటం కష్టం.

నల. రా : తమ్ముడూ, నీవు దూరదృష్టి గలిగి యోచించి చెప్పినదంతా వాస్తవమేగాని మన మేకారణంచేత వారిని దూరంగా పంపగలం?

నాయ : నా కొక్క మాటచెప్పండి. ఈ యేడేండ్లు షరతుల ప్రకారం వారు నడుచుకొని తరువాత రాజ్యమియ్యమంటే యిచ్చివేస్తారా?

నల. రా : అది యెప్పుడూ జరుగదు. తిరిగి వారికిచ్చే కాడికి యిప్పుడు వారిని వెళ్లగొట్టడమెందుకు ? నాయ : షరతులప్రకారం రాజ్య మివ్వమంటే మీ రేమని కాదంటారు ?

నల. రా : రాజ్యం మాదిగాని మీదిగాదు ; యివ్వడానికి వీలులేదని స్పష్టంగా తెగజెప్పుతా.

నాయ : వారు కత్తిదూస్తే ?

నల. రా : మనమూ సిద్ధమే.

నర: నేను వారి కత్తికి భయపడనుగాని, అలరాజుయొక్క సంధిప్రయత్నాలకు భయపడతా. మీకు మొగమోట మెక్కువ. ఎదుటి మనిషిని కాదనలేరు.

నల. రా : తండ్రీ కొడుకులు శత్రువులతోజేరి వారి బాగోగులు తమవని యెప్పుడనుకొన్నారో వారి సంబంధ మప్పుడే తెగిపోయింది.

నర : మీ రీ మాటమీద నిలువలేరు.

నల. రా : నీవు నా మనోదౌర్బల్యం కనిపెట్టే చెప్పుతున్నావు గాని నేను గుండె రాయి జేసుకొన్నా.

నర : ఏమో, నాకుమాత్రం నమ్మకంలేదు.

నాయ : సరే, ప్రస్తుత మాసంగతి నిలపండి. ఒడంబడిక ముగిసేటప్పటికి యిప్పటికంటె వారు తప్పక బలపడతారు.

నర : యిప్పు డేకారణంచేత వారిమీదికి పోతాం ? లోకం మెచ్చుతుందా?

నాయ : మొదట మీరు వొప్పుకొని మాచర్ల వారి కిచ్చారు. ఏడు సంవత్సరము లయినతరువాత తిరిగి యిస్తామని మళ్లీ వొడంబడిక జేశారు. ఈ రెండు వొడంబడికలప్రకారం మీరు పోయేటట్టయితే మీకేమీ పట్టులేదు. నల. రా : మొదటివొడంబడిక నే నంగీకరించను. మోసకృత్యమని వెంటనే లోకానికి వెల్లడించాను.

నాయ : అయితే రెండవదీ నిలవదు. మొదటిదానిని సౌమ్యంగా రద్దుజేయడమే రెండవదాని వుద్దేశము.

నల. రా : అనే తేలుతున్నది.

నర : అని తేలితే, వారు రమ్మని పిలిచిందాకా వూరుకోక సమయం చూచి దెబ్బగొట్టడమే నీతి.

నాయ : అంతయోచన యిప్పుడు వద్దు. వారిని దూరంగా గొట్టేయోచన ప్రస్తుతం జేయాలె.

నర : వూరికే పొమ్మంటే పోతారా ?

నాయ : వూరికే పోనిమాటే ; వీరు మండాదిలో వేయిజనం కాపురం వుండడం, వేలకొలది పశువులను దౌర్జన్యంజేసి చుట్టుపట్ల మేపడం, అడవులలోవున్న చెంచుజనానికి పోడుగా వున్నది. వారి నుసికొలిపితే మన ప్రమేయంలేకుండా మూడురోజులలో లేవగొడతారు. చెంచులు బాధపడుతున్నారని తెలిసి నాయకుణ్ణి పిలిపించా. ఇప్పుడు కచేరి హాలులో తమ దర్శనంకోసం కాచుకొనివున్నాడు.

నల. రా : తక్షణం పిలిపించండి.

నర : ఎవరురా అక్కడ ? చెంచునాయకుణ్ణి లోపలికి రమ్మను

నౌకరు : చిత్తం.

[ చెంచునాయకుడు ప్రవేశము ]

చెంచు : సామీ, దణ్ణం ; నీ పాదాలకాడివాణ్ణి. తమ దర్శనానికి చందమామకోసం వెన్నెలపిట్టలాగ కనిపెట్టుకొని వున్నా. నల. రా : ఏమి పనిమీద వచ్చావు ? భయపడక చెప్పు ; మీ గూడెమంతా సుఖంగా వున్నా దా?

చెంచు : మా గూడేనికి వండవచ్చింది సామీ. మేము భూమి మీద నిల్చేకోపులేదు. మా కందరికీ పోదెరువులు వచ్చినవి. మా చుట్టుపట్ల నాలుగామడలదాకా కీకారణ్యంగా వున్న అడవులన్నీ మారణమయిపోయినవి. చెట్లన్నీ కొట్టారు. ఒక బచ్చెనకఱ్ఱ చేసుకొనడానికి పుల్లదొరకడం లేదు. పశువు నోటగరవడానికి గడ్డిపోచలేదు. ఎక్కడజూసినా బెమ్మనాయుడుగారి ఆవులు దిక్కుల కెగబాకి మేస్తున్నవి. ఎక్కడ జూచినా వారి తొఱ్ఱుపట్లే

నల. రా : మీ రెక్కడికయినా లేచిపోమంటారా?

చెంచు : మేము యాడికి లేచిపోతాము సామీ ? గడ్డపుట్టగా పుట్టినవాండ్లం.

నాయ : నాయకుడా, యిప్పు డేమి చేస్తా నంటావు ?

చెంచు : నీవు దేవతవు. మనిషయిపుట్టి భూమి పాలిస్తున్నావు. నీవు తల వూచావాఅంటే పుంజులమూ, పెట్టలమూ పోగై లంకన్ననూ, ఆవులనూ తెల్లవారేవరకు సోదిలోకి రాకుండా కొడతాం.

నల. రా : గోపాలకులను కొట్టగలరుగాని సైన్యాన్ని మీరు ఎదిరించగలరా?

చెంచు : వాండ్ల సైన్యాలు మమ్ము నేమీ చేయలేవు. చెట్టు కొకండ్లం చెదిరిపోయి అంబులు కురిపిస్తాం. గొడ్లుగాసే వాండ్లనుమాత్రం అడవిలో అడుగుబెట్టనియ్యం. వారం రోజులలో మందను మాటివేస్తాం. గెలుచుకున్న ఆవులలో సగం ఏలినవారికి కానుకయిస్తా. సగం నా కిప్పించ్చండి. నల. రా : సరే, నీయిష్టం వచ్చినట్టుకానియ్యి. నాగమ్మగారూ, నాయకుడికి తాంబూలమియ్యండి. నాయకుడా, సంగతులెప్పటివప్పుడు కామకా తెలియపరుస్తూవుండు.

చెంచ : రోజూ అంచె నడిపిస్తా. దండాలు సామీ !

నల. రా: వెళ్లు.

[ నిష్క్రమణం - తెరపడుతుంది ]

3-వ రంగము

మండాదిలో మలిదేవరాజుగారి యిల్లు

[ మ. దే. రా. బ్రహ్మ. సభికులు ప్రవేశము ]

బ్రహ్మ : మహాప్రభూ, సభాసదులారా, మనము పల్నాటిని విడిచి పరదేశాల పాలయినప్పటినుంచీ మన ఆవుల మందలను కంటికి రెప్పగా కాచి మస శిబిరానికంతకూ జీవనం జరుపుతున్న లంకన్న వీరస్వర్గం బొందాడు.

మ. దే. రా : ఏమి ఆశ్చర్యం ! ఎవరు చంపారు ?

బ్రహ్మ : ఆ వీరుని మరణచరిత్రను కన్నమదాసువలన సావకాశంగా వినగోరుతున్నాను.

మ. దే. రా : కన్నమబాసూ, తూచాలుపోకుండా వీరచరిత్రను వినిపించగోరుతున్నాను.

క. దా : మహాప్రభూ ! మనము మండాది ప్రవేశించినప్పటి నుంచి మనకు పడమరా, దక్షిణానా పెచ్చు బెరిగివున్న అడవులలో సంచరించి, లేబచ్చికలు మేసి, చెలమలలో నీళ్లుదాగి మనమందలు పెంపొందుతూ వచ్చినవి. అడవులలో తిరిగే చెంచులు మనలను జూచి బెదిరి పరుగెత్తుతూ వచ్చారుగాని యే ఆటంకము కలిగించలేదు.

మ. దే. రా : అడవు లొకరి సొమ్ము గనుకనా ? ఆక్రమించు కొన్న వాడే అధికారి.

క. దా : కాని వారమురోజులనుంచీ వారి నడవడి మారిపోయినది. మేతకు దూరముగా బోయిన మందలపైబడి చెంచులు వందలకొలది ఆవులను తొలగదోలుకొని పోతూ వచ్చారు. అది కని పెట్టి లంకన్న మూడురోజులనుంచీ ఆవులను చెదరిపోనీక సమీపమున మేపుకొని మబ్బుపడక పూర్వమే తొఱ్ఱుపట్లకు జేర్చి తెల్లవార్లూ కావలిగాచి, దొంగలకు అసిఆడకుండా చేశాడు. ఈ మూడురోజులూ ఒక్క జీవమయినా జాయా బోలేదు.

మ. దే. రా : లంకన్నయొక్క శక్తిసామర్థ్యములు మనకు దెలియనివా?

క. దా : కడచినరాత్రి చెంచులు యెత్తుమార్చి గుంపులు గుంపులుగా విల్లంబులతోను ఖడ్గములతోను బయలు దేరి ....

బ్రహ్మ : వారికి ఖడ్గము లెక్కడివి ?

క. దా : అదే చెప్పబోతున్నాను. దెబ్బతిని మాచే జిక్కిన చెంచును ప్రశ్నిస్తే తమ నాయకుడు గురిజాల బోయి నాయకురాలిదగ్గిర 200 కత్తులు దెచ్చినాడనీ, తమకు చేజిక్కిన పసరములలో సగము గురిజాలకు తోలిపెడుతున్నాడనీ చెప్పినాడు.

మ. దే. రా : సరే, కథకు మూలము దెలిసింది. తరువాత. క. దా: తరువాత నోదేవా ! చెంచుల తండములు కొన్ని గోవులను, మరికొన్ని గోపాలురను ముట్టడించినవి. గోవులు దూడలను నడుమ బెట్టుకొని మూడువల్లెములుదీరి మొగ్గరించి నిలచినవి. చెంచులు కఱ్ఱలు, కత్తులు దీసికొని ఆవులపై బడగా వాటిలో ముందలివరుస ముట్టెలు వోరవొంపుగా బెట్టి, తోకమట్ట లెగబట్టి, బుసకొట్టుతూ ముందుకు చెంగలించి దుమికి చోరులను కొమ్ములతో చీరీ, డొక్కలలో గుచ్చి యెత్తీ, గిట్టలతో మట్టీ హతము గావించినవి.

బ్రహ్మ : బాగు బాగు, ఆ యావులు పల్నాటిగడ్డన బుట్టినవి గదా ! చారకొద్దీ గొడ్డూ, కోరకొద్దీ పులీ అన్నారు.

క. దా : అంతట హతశేషులు గోవులనువదలి గోపాలురనే తలపడ్డారు.

బ్రహ్మ : పల్నాటిలో పచ్చికనబుట్టిన పౌరుషము వశువులతో ఆగిపోతుందనుకున్నారుగామాలె. పండిపాతళ్లునిండి వీరుల రక్తములో వెల్లువగట్టింది.

క. దా : అంతట పోరు ఘోరమయింది. కోయలూ, చెంచులూ వికారధ్వనులతో అడవిమృగాలవలె కమరబడ్డారు. అప్పుడు వుభయులకూ జరిగిన యుద్ధము మనుష్యుల పోరువలెగాక వానర, రాక్షసయుద్ధంవలె ఘోరమై తోచినది. అడవిలో వున్న క్రూరమృగములన్నీ బాసటయై యిరువాగులా జేరి కోరలతోనూ, గోళ్లతోను పోరాడుతున్నట్లు కనబడ్డది. చెంచులు నిరాయుధులయిన గోపాలుర పెక్కండ్ర నుక్కడంచారుగాని, లంకన్నయొక్క బారుటీటె పోటులకూ, కత్తివాతి సరుకులకూ నిలువరించ లేక పరుగెత్తారు. చెంచు వెనుకపొంచుండి కోల్పులివలె దుమికి గురిజాలక త్తితో లంకన్న కుడిభుజమును నరికివైచాడు.

మ. దే. రా : లంకన్న కుడిభుజముతో మన కుడిభుజమూ పడిపోయింది.

బ్రహ్మ : నాగమ్మబంపిన ఖడ్గమే మృత్యువునకు తోడ్పడినదా ?

క. దా : నేలపడినభుజము భుజంగమువలె శత్రువును వెదకినట్టు నలువంకకూ బారినది.

బ్రహ్మ : శౌర్యము అతని యెముకలకుబట్టి వొంట జితించింది.

క. దా : అంతట సవ్యసాచియై యెడమచేతితో యీటెగొని అందిన చెంచునల్లా యేటు కొక్కనిగా పొడిచివేశాడు. తక్కిన యెరుకలెల్లరూ ఆ భీకరమూర్తినిచూచి నివ్వెరపడి పారిపోవడమునకూ, పోరాడడమునకూ కాలుచేతులాడక కత్తుల నేలవైచి, కట్టెలై నిలువబడ్డారు. నిరసరాధులపై కురుకుట కిచ్చగింపకనో యన్నట్లు బలమయిన గాయముచేత రక్తము క్షీణించి మన దుర్దశకు నిట్టూర్పువిడిచి నేలకొరిగాడు. ఇది హతశేషులవలన నే విన్న చరిత్ర.

మ. దే. రా : తమ నాయకుని గోల్పోయిన గోవులనూ, గోపాలురనూ వెంటనే శత్రువులు వశము జేసిసికొన్నారు కాబోలు. తరువాతి కష్టచరితమునుగూడ వినుటకు సిద్ధముగనే వున్నాము. దాసూ, త్వరలో ముగించు.

క. దా : త్వరలోనే ముగిస్తాను. కష్టకాలమల్పమయినా ధీర్ఘముగనే కనబడుతుంది. గోపాలుర ఆర్తధ్వనులు విని చేరువలోవున్న యీ మీ దాసుడు..... ( భిడియపడతాడు. ) మ. దే. రా : నిన్నుగురించి చెప్పుకొనడానికి సందేహిస్తున్నావు గామాలె ; మరొకవిధంగా తెలిసికొనడానికి ప్రస్తుతం మా కవకాశంలేదు. కనుక ఆత్మస్తుతి దోషమని యెంచక జరిగినదంతా వివరముగా మరొకడు జెప్పినట్టు నీవే చెప్పుమని ఆజ్ఞాపించుతున్నాను.

క. దా : చిత్తము. నేను కత్తి చేతికి తీసుకొని చెదిరినగోపాల బలమంతా కూడదీసుకొని, హతశేషులయిన చెంచులనందరినీ తుదముట్టించి, మందలను మళ్లవేసి, మనవూరి గమిటి దగ్గర నిలువవేశాము.

బ్రహ్మ: పల్నాటివీరున కర్హమయినరీతినే వర్తించావు. ఇక మీ కార్యమును నిర్ణయించుకోండి.

బా. చం : బాలుడనే కారణంచేత నా అభిప్రాయం యిదివరకొక పర్యాయము త్రోసిపుచ్చారు. మళ్లీ అవకాశం వచ్చిందిగనుక తిరిగి విన్నవించుతాను. మీ సేవకులలో మేటి వీరు డొకడు మ్రుక్కడి చెంచులచేతిలో బడి మరణించాడు. ఇటులనే గడువుదినాలలోపల తక్కినవారుకూడ గోవులకని, గొఱ్ఱెలకని ప్రాణా లర్పించడం జరుగబోతుంది. అట్టి దుర్మరణము మాకందరికీ సంభవించకముందే మన నీ యిక్కట్టులపాలుజేసిన నాయకురాలినీ, దాని మ్రుక్కడి అనుచరులనూ అంత మొందించడమో, లేక పల్నాటికై ప్రాణాలర్పించడమో మేము చేయగలముగాని వీరధర్మమెరుగని యే యేనాదులచేతులలోనో చావలేము.

క. దా : రాజ్యములు వీరు లనుభవించతగినవిగాని విరాగు లనుభవించదగినవిగావు. గొడ్లకూ, గోదలకూ ప్రాణమ లర్పించడంకంటె వెంటనే దండయాత్రజరిపి పల్నాటికై ప్రాణాలర్పిస్తాము.

బ్రహ్మ : ఏదోవిదంగా యుద్ధములో చనిపోవడమే మన వుద్దేశం గాదు. నలగామరాజు పెట్టేబాధలను ఓపికతో సహించడమునకే యెక్కువధైర్యము కావలసివున్నది. ఇప్పటికి ఒక్క లంకన్నను గోల్పోవడము దప్ప తక్కిన మన చట్రమంతా యింతవరకు చెక్కుచెదరలేదు. మన అనుచరుల సంఖ్యకూడ క్రమంగా హెచ్చుతున్నది. పశుధనం వృద్ధయింది. సత్యం కొరకు కష్టా లనుభవిస్తున్నామని లోకు లనుకొంటున్నారు. గట్టిప్రయత్నం చేసేయెడల మన అనుచరు లింకా వృద్ధవుతారు. మన యువకు లింకా కొద్దికాలము ఓపిక పెట్టుకొనే యెడల ఇహపరాలు రెండూ మనవౌతవి. మనమందరమూ మండాది విడిచి పల్నాటికుట్రలకు దూరంగా శ్రీశైల ప్రాంతమున మేడపిలో దిగుదాము. అది తృణకాష్టజలసమృద్ధి గల అడవిప్రదేశము. అక్కడ ఒకరిఆటంకము లేకుండా మనము యుద్ధప్రయత్నములు చేసికోవచ్చు.

మ. దే. రా : మనకు బహునాయకం పనికిరాదు. నాయుడుగారు చెప్పినట్టుపోవడందప్ప మరొక మార్గము మనకు పనికిరాదు. మేడపికి ప్రయాణం సాగించి మిగిలినరోజులు అక్కడ గడుపుదాము.

[ తెర పడుతుంది ]