Jump to content

ధనాభిరామము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి


శ్రీరస్తు

ధనాభిరామము

పీఠిక

శా. శ్రీధాత్రీధరకన్యకారమణు దాక్షిణ్యాంబుధిన్ సర్వలో
    కాధారున్ ఫణిరాజకంకణుని చంద్రాకల్పు సర్వజ్ఞు స
    ద్బోధానందకరైక భక్తహృదయాంభోజాతవాసున్ వచో
    మాధుర్యంబున దక్షవాటిపురి భీమస్వామి చింతించెదన్. 1

చ. ఒసపరి యింద్రనీలములయెప్పు నటించెడి మేనికాంతితో
    ముసలగ దాసి శూలకరముద్గరకుంతశరాసనోగ్రప
    ట్టెసపటుఖేటకావళివడిన్ దనహస్తమునన్ వెలుంగఁగా
    పొసగిన మేటివేలుపని పూని భజించెద వీరభద్రునిన్.2

ఉ. కోరికమీర పాల్కడలికూఁతునకున్ వలకన్నుగీటి యిం
    పారగ ధారుణీసతికి నావలి దాపలికన్నుగీటి తా
    వారికి వారిలోపలను వాదముఁ బుట్టఁగజేసి నవ్వుతో
    నూరక యుండువిష్ణు జలజోదరు గొల్చెద భక్తితోడుతన్.3

చ. పలుకులబోటితోఁ గలసి భావమునం దరలేక నిచ్చలున్
    వలపులరాజు కయ్యమున వాడిమిఁ జూపి సుఖాబ్ధి దేలుచున్
    కలయ చరాచరంబుల సుఖస్థితిమై సృజియించు ప్రోడయం
    న్నలువ దలంచి మ్రొక్కెద మనంబున కోరికె లంకురింపగన్.4


ఉ. పొందుగ నీశుముందటను బొజ్జగదల్చుచు నాడుచుండగా
    విందులు విందు లంచునరవిందదళాయతనేత్రగౌరి యా
    నందముతోడఁ బిల్చినను నవ్వుచు దానెదురేఁగు పార్వతీ
    నందను లోకవంద్యు గణనాథుని గొల్చెద నిష్టసిద్ధికిన్.5

చ. సరసిజసంభవామరులు సన్నుతిసేయ శివుండు దాను భా
    సురముగ నొక్కకుత్తికను పోలి జగంబులకెల్ల దల్లి యై
    విరచితభోగభాగ్యముల విశ్రుతికెక్కిన యాదిశక్తికిన్
    గురుతరమైనయావడఁకు గుబ్బలిపట్టిని గోరి మ్రొక్కెదన్. 6

ఉ. భావజుగన్న తల్లి శివభామినికిం జెలికత్తె భారతీ
    దేవికి యత్తగారు గురుతింపగ రాని గుణాంబురాశి సం
    భావితచంద్రమూర్తి సితపంకజలోచనుకూర్మిరాణి లీలా
    విభవోన్నతిన్ బొదలు లచ్చిశుభంబులు మాకు నీవుతన్. 7

ఉ. వీణెయు బొత్త మంకుశము వేడుకతో జపమాల జేతులం
    బ్రాణపదంబులై వెలయు భవ్యతనుప్రభనిండి సర్వ గీ
    ర్వాణులు సన్నుతింపగను వర్ణన కెక్కిన బ్రహ్మరాణికిం
    వాణికి మత్తకీరపికవాణికి మ్రొక్కెద కార్యసిద్ధికిన్. 8

చ. దొరయ నఘోరమంత్రనిరతుం బ్రతివాదిమహాంబురాశిని
    ష్ఠురబడబానలుం ఘనవిశుద్ధచరిత్రుని శాంతమూర్తి భా
    సురనిగమార్థతత్వగుణశోభితదేశికచక్రవర్తి మ
    ద్గురుముదిబండ వంశగురుధూర్జటి గొల్చెద నిష్టసిద్ధికిన్. 9

క. పుట్టంబుట్టిమహానది
    బుట్టియు సైకతస్థలమునబుట్టి జగంబుల్
    నెట్టన బొగడఁగ వెలసిన
    యట్టిమహాత్ముల దలంతు నాదిమకవులన్. 10

మ. భవభూతిన్ శివభద్రుమాఘుగలభున్ బాణున్ సుబంధ్వాఖ్యుభా
    రవి శ్రీహర్షుని కాళిదాసు భవుహేరంబున్ మయూరాహ్వయున్
    కవిమిత్రుం జయదేవు మల్హణుని విఖ్యాతుం బ్రశంసించెద
    న్నవశబ్దార్థవిచిత్రకావ్యయుతనానాశాస్త్రపారీణులన్.11

చ. అలఘుని శబ్దశాసనపదాంకితు తిక్కనసోమయాజి ని
    శ్చలమతి శంభుదాసు బుధసన్నుత నాచనసోమనార్యు చె
    న్నలరిన చిమ్మపూడి యమరేశ్వరు భాస్కరు రంగనాథునిన్
    దలతు నవూర్వచిత్రకవితామహనీయసమగ్రచిత్తులన్. 12

చ. చెప్పగ లేరు కావ్యము ప్రసిద్ధికి నెక్కగ తారు జెప్పినన్
    తప్పులెకాని యొప్పులు పదంబుల గానరు సత్కవీశ్వరుల్
    చెప్పిన తప్పులెన్నుదురు సిగ్గు లెరుంగరు వారి నిందులో
    జెప్పగ నేటికిం సరకుజేయకుడీసుకవీంద్రు లెన్నడున్.13

చ. ధర జనవశ్యమై భజన తప్పక యక్కెడయొరలేని యెందఱేని బె
    ల్లొరసినమించుగల్గి కడునొప్పగునెత్తున వన్నె వచ్చియుం
    జిరనుతి నన్నిదిక్కులను చెల్లుబడై సుకవిత్వ మెప్పుడున్
    వొరపది లేక బంగరపుపూదెవిధంబున నుండి యొప్పుగన్. 14

వ. అని యిష్టదేవతా ప్రార్థనంబును, మద్గురునాథస్తోత్రంబును పురాతనకవి ప్రశంసయు,
    కుకవినిరసనంబును, సత్కవీశ్వర వర్ణనంబునుఁ జేసి మఱియును.

చ. అనువుగ భారతాంబునిధి యెవ్వలికిన్ దగనీది నందులోఁ
     ఘనకవితామృతంబు చవిగాంచిన తిక్కయసోమయాజి పా
     వనతరమైన యట్టికులవర్ధనుఁడన్ మహిఁబేరుగల్గు నూ
     తనకవిసూరనాహ్వయుఁడ ధర్మగుణప్రతిపాలనీయుఁడన్.15


సీ. విస్తీర్ణవిభవయాపస్తంభసూత్రుఁడా
          కాశ్యపగోత్రవిఖ్యాతయశుఁడు
    ఘనత ననంతసేనుని మల్లయామాత్య
          పౌత్రుండతిప్పన ప్రభునిసుతుఁడ
    పార్వతీశుభగర్భ పాదోనిధానసం
          పూర్ణచంద్రుఁడ రాజపూజితుఁడను
    రాజార్ధశేఖర పూజావిశేషసం
          దానైకచిత్తుఁడ మానధనుఁడ
తే. భద్రవైభవ శ్రీవీరభద్రలబ్ధ
    జనిత చాతుర్యకావ్యలక్షణ విచిత్ర
    విపులవాచాసమగ్రసంవిద్ధమతిని
    సూరయామాత్యతిలకుండ సుకవివరుఁడ.16

క. రామామణులకు మది నభి
   రామం బనదగు ధనాభిరామంబు వచ
   శ్శ్రీమెరయఁ బద్యకావ్యము
   గా మహి విరచింతు సరసకవు లవుననగన్.17

క. వెయ్యేల యేను భాగ్యము
   సేయుటకున్ గానవచ్చె సిద్ధంబుగ నా
   సేయంబూసిన కృతికిని
   నాయకుఁ డనురక్తి భీమనాయకుఁ డగుటన్.18

వ. అని విచారించి సరససజ్జనహృదయానందంబగు నీ ప్రబంధంబున కధీశ్వరుండు సకలసురాసురపూజిత పాదారవిందుండు నీహారశిఖరకన్యకా వక్షోపరిలిప్తకుంకుమాంకితవక్షస్థలుం


    డును కరుణాకటాక్షవీక్షణాలంకారుండును సర్వలోకాధీశ్వరుండును నగు భీమేశ్వరుం భావించి.

షష్ఠ్యంతములు

.

క. దివిజగణయక్షదక్షా
   స్తవనీయున కఖిలలోకసంరక్షునకున్
   భవసంహరునకు లక్ష్మీ
   ధవశరునకు నమితశారదానాథునకున్.20

క. కుంజర దానవదుర్మద
   భంజనునకు ప్రమథయూథపరిపాలునకున్
   కంజభవామరవరముని
   మంజులవాక్యప్రసంగమహిమాఢ్యునకున్.21

క. క్షితిధరకన్యాధిపునకు
   శతమఖముఖదివిజనికరసంయమివరపూ
   జిత పదపంకేరుహునకు
   సితకరజూటునకు భక్తచింతామణికిన్.22

క. అంధకగజదైతేయ జ
   లంధర ముఖదనుజదళనలాలిత్యకళా
   బంధురవిజయోన్నతునకు
   సింధురచర్మాంబరునకు శితికంఠునకున్. 23

క. ధరణిజలపవన(హుతవహ)
   ఖరచర చంద్రాంబరాత్మ కలితాప్తతను
   స్థిరమూర్తికి సకలచరా
   చరపరిపూర్ణ ప్రబావస విశేషునకున్. 24


క. దుర్గాధీశ్వరునకు నపవర్గఫలాంచితవిశేషవైభవనిధికిన్
   భర్గునకు విమలగుణసన్మార్గైకచరిత్రభక్త మందారునకున్.25

క. ఆకాశకేశునకును సు, శ్లోకచరిత్రునకు నమితలోకేశునకున్
   కాకోదరహారునకును, భీకరునకు దక్షవాటి భీమేశునకున్.26

వ. అభివందనంబొనరించి భక్తజనపారిజాతంబగు నద్దేవుని కిట్ల అనియె. 27

_____________



ప్రథమాశ్వాసము



క. శ్రీనగకన్యాయుత ని
    త్యానందసుఖైక వైభవామోదీత సం
    ధాన నిజభక్తరక్షణ
    భూసుత శ్రీదక్షవాటిపురభీమేశా.28

క. ఆకర్ణింపుము పుణ్య
    శ్లోకముని సురగరుడయక్షశుభవిభవగుణా
    నీరము ఘనతరమగు స్వ
    ర్లోకము విలసిల్లు మూఁడులోకములందున్.29

సీ. పసిడిమయంబైన ప్రాకారములచేత
          నిండిన పరిఘంబు నిధులచేత
    గోమేధికోన్నతగోపురంబులచేత
          మాణిక్యఖచిత హర్మ్యములచేత



మరకత స్థాపితవరసౌధములచేత
       హరినీలమణులగేహములచేత
వజ్రదీప్తులమించు వరకుడ్యములచేత
       లాలితకృతకశైలములచేత
తే. మెరుగుదీవెలబోలు భామినులచేత
    చల్లనై యొప్పు నారామసమితిచేత
    చెన్ను మీరిన కొలనులచేత చెప్ప
    చూపగలిగినయమరావతీ పురంబు.30

వ. అందొక్కనాఁడు. 31

సీ. చాల గొజ్జంగినీట జలక మొప్పుగ నాడి
          చీనిచీనాంబరశ్రేణి గట్టి
    ఘనసారకుంకుమ కలితకస్తూరికా
          మిళిత చందనచర్చ మేననలది
    నిర్మలనవరత్ననిచయ కాంతిచ్ఛటా న
          వ్యనానాభూషణములు దాల్చి
    కమనీయకల్పవృక్షప్రసూనంబులు
          కీలుకొప్పున నిండ గీలుకొల్పి
తే. సురగణంబులు సేవింప సొరిది దివిజ
    రమణు లందంద వింజామరులువ్రేయ
    ఘనతచింతామణుల పీఠము ననుఁజూడ
    నిండుకొలువుండె మెరసి యాఖండలుండు.32

వ. ఆసమయంబున తక్కినదిక్పాలకులు చనుదెంచి యథోచితాసనంబుల నాసీనులై యున్నంత.33


సీ. నీలాలచాయలు గేలిసేయగజాలు
          కచములం దరచు చీకట్లుగ్రమ్మ
    కలువరేకులయొప్పు గరిసించుకన్నుల
          కొల్లలై చూపులు క్రీళ్లువార
    పరిపూర్ణ చంద్రబింబము మించు మొగమున
          దరహాసచంద్రికల్ దరుచుగాయ
    వెలుగువిద్యుల్లతావిభవంబు ప్రకటించు
          తనువులకాంతిబిత్తరము లెగయ
తే. విమలమై యొప్పు కనకకుంభములబోలు
    వలుదచన్నులపై హారములు నటింప
    పదములను నందియల్ మ్రోయ ప్రబలి దివిజ
    లలనలేగిరి దేవేంద్రుకొలువునకును.34

సీ. చారువిద్యుల్లతాసముదయం బెంతయు
         మెచ్చులరూపులై మెలగె ననగ
    విలసిల్లుపండు వెన్నెలలోనితేట నా
         కారంబులై మేన కట్టెననఁగ
    నసమానగతి సుధారసము చూడ్కులను
         నిరుపమాకృతులచే నెగడె ననఁగ
    లాలితంబగు నూత్నలావణ్యరసము లిం
         పొంది దేహంబుపై పొసగెననఁగఁ
తే. బల్లవంబులు కోమల ప్రబలవికచ
    కుసుమములు నవ్యమృదువును గురుతరముగ
    కాయములు దాల్చి నటియించుకరణి నరిగి
    రింపుసొంపార సురకాంత లింద్రుకడకు.35


వ. ఇట్లు చనుదెంచి రంభాద్యప్సరోవిలాసినీసందోహంబులు ప్రియంబున మ్రొక్కిన
     వేల్పురేడు గారవించు మన్ననలచెన్నొంది తలంకక కెలంకులనుండి రయ్యవసరంబున.

సీ. తమ్మిమేడనునుండు తరుణి ముద్దులపట్టి
            యల్ల రేరాయని యల్లుగుఱ్ఱ
    ఘనతకెక్కినవసంతునితోడి చెలికాఁడు
            మనసులమలసెడు మావటీఁడు
    పచ్చపిట్టలతేరు పఱపియాడెడుజోదు
            పాంథజనంబులపాలిగొంగ
    మగతనంబుల కెక్కుడగు తియ్యవిలుకాఁడు
            పువ్వులమ్ములు సేయు బూమెకాఁడు
తే. మహిమ దీపింప విటవిటీమానధనము
    కలికితనమున గొల్లాడు కన్నకాఁడు
    వలపులకు నెల్లగనిలోకవశ్యరూప
    మంత్రరక్షాసమర్థుండు మన్మథుండు.37

చ. చిలుకలతేరునుం జెఱకుశింగణి వాడని పువ్వుదూపులన్
    వెలయగ మీనకేతనము వేడుక గ్రాలగ నద్భుతంబుగా
    నళులును గండుకోయిలలు నంచలు గొల్వగ నేగుదెంచె ను
    జ్వలతరరూపసంపదల వన్నెల దిక్కులు పిక్కటిల్లగన్. 38

క. సరసనవకుసుమమృదుతర
    పరిమళములు వొలయభావభవురాకదిదా
    సురకాంతానయనోత్సవ
    కరమును మోహమును వశ్యకరమును దనరెన్.39


వ. ఇవ్విధంబున రతిరాజు సురరాజుకడకుం జని తదనుమతంబున నుచితాసనంబునం
    గూర్చుండిన రంభాదిప్రమదాజనంబులు అతులితమోహాయత్తచిత్తలై మత్తిల్లి
    యితరంబు మరచి చూచుచుండు సమయంబున. 40

క. అనిమిషనాథుఁడు నిర్జర
   వనితలదగఁజూచి మీకవశ్యము చాలన్
   ధనమో రూపమొ చెపు డా
   యనవుడు మదిఁదెలిసి తెలియ నాకృతు లొలయన్. 41

ఉ. ఊరక యుండె రంభ మరియొక్కతెకున్ గనుసన్న జేసె నిం
    డారగమంజుఘోష తెగనాడక మీదులు జూచుచుండె తా
    నేరనియట్లు నూర్వశి కనిన్ కననట్లుగ మాట లేక పై
    చీరచెరంగువట్టె వలచేతబుడింకెను చిత్రరేఖయున్. 42

[1]సీ. అరసి నిరుత్తరయై యుండె నొక్కతె
         వదనాంబుజాతంబు వంచె నొకతె
    యూరికె నేల వ్రాయుచునుండె నొక్కతె
         చేతఁగేదగిరేకు జీరె నొకతె
    తడయక బరపె నాతలిడాలి నొక్కతె
         వొసపరిపై చూచు చుండె నొకతె
    పలుకనేరక సిగ్గుబడియుండె నొక్కతె
         మదిలోన దలచుచు మసలె నొకతె
తే. పొంచి సందిట చెయ్యి సంధించెనొకతె
    యొకతె మరుగున సిగ్గుచే నొదిఁగె నొకతె

   భక్తి శ్రవణావతంసంబు బట్టె నొకతె
   కూడిమెల్లన మంతనం బాడె నొకతె.43
 
వ. మరియు తక్కినవిలాసినీజనులు లజ్జాననలై హృజ్జాతుని మొగంబు వీక్షించిన. 44

క. సురరాజుతోడ మన్మథు
   వెరవున సభవారు వినగ నిట్లని పలికెన్
   బరికింప నిందు నందును
   తరుణులకును రూపెగాక ధన మేమిటికిన్. 45

ఉ. మానితరూపయౌవనసమగ్రతచే తుదిముట్టి పై కళా
    స్థానము లంగభేదములు జాతులుతప్ప కెఱింగి కామవి
    ద్యానిపుణుండునై మెలఁగునాతనిగూడి రమించునట్టి యా
    మానిని యొండొరుంగవయ మైకొనునే ధనమెంత యిచ్చినన్.46

ఉ. చేరిక జేసి యంగనలు చిత్తము లప్పు డెరింగి పొందగా
    నేరక గాఢపాకముల నెంతయు కాంక్షలు దీర్పజూచినన్
    నీరజలోచనల్ ధనము నించక బిల్వరు కాక మేలు కీ
    డారసి రూపవంతునిఁ బ్రియంబునగూడ ధనంబు జూతురే. 47

క. వలపుగలవిటుని కౌగిలి
   గలిగిన లోనుబ్బుఁగాక కామిని యొరులన్
   దలచునె మానము ప్రాణము
   దలచునే ధనధాన్యతతుల తనమదిలోనన్.48
 
వ. అని యివ్విధంబున రూపవిలాస విశేషంబులు యోషాచయంబుల మోహాతిశయంబులకు విహారస్థానంబులని రూపంబు ప్రతిష్ఠించి ధనంబు నిరసంబుగా నాడిన కుబేరుండు

   రోషారుణితలోచనుండై పాకశాసనుండు వినం పుష్పశరాసనున కిట్లనియె.49

క. నీమాటలసవు రేమియు
   నామనసున కియ్యకొనవు నాకును వినుఁడా
   ప్రేమాతిశయమొ ద్రవ్యము
   భామినులకు చక్కదనము పదటికి జెపుమా. 50

సీ. కడువికృతాంగు చక్కనివానిగాఁ జేయు
           పాపకర్ముని పుణ్యపరునిఁ జేయు
    చంచలాత్ముని నిశ్చలచిత్తుగాఁ జేయు
           నధికభీతుని సాహసాంకుఁ జేయు
    కులహీను మిక్కిలి కులజునిగాఁ జేయు
           వీరిడివాని వివేకిఁజేయు
    పడి ననాచారు నాచారవంతుని జేయు
           సరవితో జడమతి సరసు జేయు
తే. బేల నిలభీముడను వేరపిలువజేయు
    రసికతలు యింతలేనినిరక్షరీకు
    పావనం బైన సకలవిద్యావిశాలుఁ
    డనగ జేయును ధనము తథ్యంబు వినుము.51

చ. సకలకళా ప్రవీణుఁడయి చక్కనిరూప విశేషసంపదం
    బ్రకటితుఁడై విశుదగుణభవ్యతనుప్రభ నొప్పుచున్న నా
    యకుఁడు దరిద్రుడైన మరి యాతనినెవ్వరుఁ జేరనీరు పా
    యక ధనహీనుఁడున్ శవము నారయనొక్కవిధంబుధారుణిన్.52

చ. సరసతలేనివాని నతిజాడ్యుని రూపము లేనివాని ము
    ష్కరుని వివర్ణునిన్ తనువు చాలగ మాసినవాని ప్రామిడిన్

   వెరవిడివాని నైన మరివింతలు సేయగఁ జాల రంగనల్
   కరమరుదైనవస్త్రములు కాంచనముల్ తగనిచ్చి పంచినన్.53

క. ధనహీనుకులము రూపును
   ధనహీనుని నేర్పు విద్య తాలిమి వెరవున్
   వినుతికి నెక్కగ నేరవు
   వనితలకు ధనంబె మందు వలపులరేచన్.54

గీ. రూకగలవారు విద్యలరూఢి మించి
   నట్టివారును కులజులు నధమవృత్తి
   ధనముగలవారివాకిండ్లధైర్య ముడిగి
   కొలిచియుండుట యెరుగవాకుసుమబాణ.55

వ. అంత "ధనమూలమిదంజగ” త్తనియెడి యక్షేశ్వరునకు నామిథ్యాలాపంబులు వలవదుడుగుమని
   పుండ్రేక్షశరాసనుండు రక్తాక్షుండై వీక్షించి సహస్రాక్షుండు వినంగ నిట్లనియె.56

క. జనసమ్మతమగుమాటలు
   వినసమ్మతిగాక లేనివిం కలవిం గూ
   ర్చిననేలసభలకెక్కును
   తనవెఱ్ఱియుతాతపెద్దతనముంగలదే.57

ఉ. లాలితరూపయౌవన విలాససమగ్రత చాల నొప్పు నీ
    లాలకివేడ్కతోడఁదనయాత్మసుఖంబునరూపసంపదన్
    జాలవిశేషతంబొదలుచక్కనివానిరమించుగాక తా
    మేలిధనంబులిచ్చిననుచేకొనునేవికృతాంగునెంతయున్. 58

సీ. పలుమారు కలికి చూపులతోన చిలికించి
           పైకొని యంతయు పనులు సేసి

    చల్లని మధురభాషణముల నలరించి
            చేరవచ్చిన కూడ చెలిమిజేసి
    కళలున్ననెలవులు కదిలించి తగుబాహ్య
            రతులను చిత్తంబు గరగజేసి
    తమకంబుజేసి నాత్మకు లోనుగాజేసి
            హృజ్జాతకేళి బుజ్జగించి
తే. సమరతులగూడి పారవశ్యమునుబొందు
    కదిసి చమటూరి కౌఁగిట గాఁకదీర్చి
    కలయనేర్చిన చాలు నిక్కము ధనంబు
    తలప నొల్లరు కలలోన జలజముఖులు.59

క. గరగరికయుఁబ్రాయంచును
    సరసత్వము నేర్పు రూపు సంపదయుసు సు
    స్థిరమృదుభాషలు గల
    పురుషులు గలిగినను ధనము పొలఁతులు తలఁపన్.60

క. మూటలుగట్టి ధనంబులు
    వాటముగా నొసగి తమకు వశమనుచును రా
    వాటునుగలవాటును నిడ
    యేటికి దలచెదరు తమకు యిందునిభాస్యల్. 61

క. రూపంబు ధనము నిచ్చును
    రూపం బటు తనకులంబు రూఢిగ జేయున్
    రూపంబు లోకవశ్యము
    రూపము లేనట్టినరుని రోతురు భామల్.62

వ. అని కఠోరంబులుగాఁ బలికిన చిలుకతేరివాని నలుక దీపింపం గనుంగొని
    యలకాధీశ్వరుం డిట్లనియె.

క. పొలిచి సతులచిత్తము
   నేలాగున తెలియవచ్చు నెరుగనిరీతిన్
   మేలొకదిక్కున నుండగ
   తేలింపుదు రొకనివింత తేటలచేతన్.63

సీ. పోనీక నొకని చూపులచేత కరగించి
         మాటల నొక్కని మరగజేసి
    ఆలింగనంబుల దేలించి యొక్కని
         నొకని కౌగిటలోన జోలలార్చి
    అధరామృతంబుచే నలయించి నొక్కని
         యొక్కని మరుకేళిఁ జొక్కఁజేసి
    బాసల నొక్కని భ్రమయించి నేతల
         దొడ్డుగా నొక్కని నొడ్డుబెట్టి
గీ. యిన్ని విధముల భ్రమయించి యెవ్వరికిని
   వలవరెంతయు ధనము కేవలము విటుల
   భ్రమలఁ బెట్టుదురిది గానక మలముఖుల
   మనము లెరుగగవశమె యవ్వనజజునకు. 64

చ. ప్రవిమల బాహుమూలముల భవ్యరుచుల్ బ్రకటించి మేలి చ
    న్గవ కఠినత్వమున్ మెరుగుగైకొని మోహము పుట్టచూపులో
    నవకపు చూపులన్ వలపునాటుకొనన్ భ్రమయించి చేరివై
    భవముదలిర్ప కూటముల ప్రాణము విత్తము గొందు రంగనల్.65

క. బిసరుహలోచను లెందును
   పసిడికి తులతూగువలపుబ్రకటింతు రిలన్

    రసికుని గలయగ నొల్లరు
    కుసుమాయుధకేళి నెంతకోవిధుఁ డైనన్.66

వ. మరియు ధనప్రభావంబు వినుము.67

సీ. ధన మింటిలో త్రవ్వి తండంబు లై యున్న
          సకలధాన్యంబులు చాలగలుగు
    ధాన్యంబు లింటిలో తరగక యుండెనా
          యిచ్ఛాపదార్థంబు లెల్లగలవు
    యిచ్ఛాపదార్థంబు లెల్ల భోగించిన
          మదగర్వములు మేన ముదిరియుండు
    మదగర్వములు మేన ముదిరియుండిన చాల
          కామవికారంబులు కాలు ద్రవ్వు
గీ. కదిసియంతంత కామవికారములను
    సతుల గవయంగ గోరుదు రతిముదమున
    చక్కదనములు చతురత చక్కబెట్టు
    కాగ ధనమూల మన్నియు కథల దేల.68

సీ. రాజిత శ్రీలచే రాజ్యంబు లేలించు
           ఘనమైనదుర్గముల్ గలుగజేయు
     నుత్తమాశ్వములను నొగిదోలి యాడించు
           మదగజంబుల నెక్కి మలయజేయు
     పసమించు బంగారు పల్లకీలెక్కించు
           నాందోళికంబుల నలర జేయు
     ధవళంపు ముక్తాతపత్రముల్ బట్టించు
           వింజామరంబులు వీవజేయు

గీ. చటులసామంతమంత్రీశసరసవీర
   భటనటానేకమంగళపాఠకాది
   మహిమఁ గలుగంగఁ జేయును మానవులకు
   ధనము చాలంగఁ గలిగిన ధరణిలోన.69

చ. మదనునిగాఁ దలంతు రిల మానిను లెల్లరు సత్కవీశ్వరుల్
    పదపడి కర్ణుఁ డీతఁడని ప్రస్తుతి సేయుదు రెల్లదిక్కులన్
    మదవదరాతివర్గములు మానుగఁ గవ్వడి యండ్రు భూప్రజల్
    మదినరనాథుఁ డందురు సమస్తము ద్రవ్యముఖంబు చూచినన్. 70

క. చుట్టములు గానివారలు
    చుట్టాలము మీకు ననుచు సొంపు దలిర్పన్
    నెట్టుకొని యాశ్రయింతురు
    గట్టిగ ద్రవ్యంబు చాలఁగలరే బంధుల్.71

క. కాదనరు ధనము గలిగిన
    మేదిని నెటువంటివారి మెలఁకువ మనుజుల్
    శ్రీదొలఁగిన నూరంచుల
    కైదువ గలజోదునైనఁ గైకొన రెందున్. 72

సీ. వేదంబు లాగమవితతపురాణముల్
          శాస్త్రంబు లితిహాససముదయములు
    భాష్యంబు వేదాంతపద్ధతు లధ్యాత్మ
          వాసనల్ యోగంబు లాసనములు
    కావ్యజాలము లలంకారనాటకములు
          పదములు నసమానపద్యసరణి
    నియమంబులు కవిత్వనిర్ణయంబులు మంత్ర
          మంజులగానముల్ తంత్రములును

గీ. నింద్రజాలంబు మొదలుగా నెల్లకళల
   నభ్యసింతురు మానవు లవనిలోనఁ
   గోరికలు మీఱ నెల్ల చేకూరుకొలఁది
   నుడువ వెఱపగు విత్తంబుగడనకొఱకు.72

వ. అని విత్తప్రభావంబు ప్రకటించిన విత్తాధీశ్వరునకుఁ జిత్తజాతుం డిట్లనియె.73

క. పనిపడి మాటికి మాటికి
   ధనముఖ్యము లైనవస్తుతతి దా నిత్యం
   బని యందఱు విననాడితి
   వినమెన్నఁడు నిట్టి క్రొత్త విశ్వములోనన్.74

సీ. ప్రాణమిత్రునినైనఁ బగవానిగాఁ జేయు
          నఱమి ప్రాణముమీఁద నలుఁగఁజేయు
    కొఱఁ గానియతిలోభగుణము పుట్టగఁజేయుఁ
          దోడఁబుట్టినవానిఁ దొలఁగఁజేయు
    నరయఁ బాపంబుల కాలయంబుగఁ జేయు
          సత్యమార్గంబుల సమయఁ జేయు
    వివరింప గురుజనవిద్వేషిగాఁ జేయు
          దుష్టవర్తనమునఁ దొడరఁ జేయు
గీ. వసుమతీచక్రమున నెంతవారికైన
    దగిలి ధనకాంక్ష యెన్నివిధంబులకును
    దెచ్చునదిగాన యిన్నియుఁ దెలియ వినుము
    ధనము పాపస్వరూపంబు తథ్య మరయ.75

చ. జలదము గాడ్పుచందమున చంద్రికబాలమెఱుంగువీచికల్
    తలఁప ననిత్యవస్తువులు ధారుణిలోపల నంతకంటెఁ జం

    చలములు సంపదల్ దలఁపఁ జాలధనంబు నిజంబుగా మదిన్
    జెలఁగి నుతింప నేల సురసిద్ధసమూహము చూచి నవ్వగన్.76

వ. అని యర్ధంబు నిరర్థకంబుగా నాడిన రతీశ్వరునకు గుహ్యకేశ్వరుం డిట్లనియె.77

చ. చక్కనివారిలో మిగులఁ జక్కనివాఁడ వటంచు నుబ్బుతో
    నెక్కుడుగాగ నెన్నితి రతీశ్వర! రూపము నెన్నఁ జూచితీ
    వక్కట ద్రవ్య మేటికని యొప్ప దటంచుఁ బ్రతాపసంపదన్
    నిక్కము నేల వ్రేలెదవు నిర్జరవల్లభుఁ డూరకుండఁగన్.78

చ. తరమిడి యిన్నిమాటలు వృథా పని లేవు సమస్తవైభవో
    త్కర మగుదక్షవాటిపురిఁ గల్గుధరాస్థలిలోనఁ బోయి నీ
    నిరుపమరూపసంపదయు నేర్పునఁ జూపుము నేను వచ్చియా
    పురవరసీమఁ జూపెదను భూరిధనంబున నామహత్వమున్.79

చ. ననవిలుకాఁడ యింద్రుఁడు వినంగను జెప్పెద నెవ్వరోడినన్
    గొనకొని దేవలోకమునకు న్వెలియంచు కుబేరుఁడెంతయున్
    గనలి ప్రతిజ్ఞ బల్కినను గైకొని రోషసమగ్రచిత్తుఁడై
    మనసిజుఁ డట్లకాకయని మారుకుమారు ప్రతిజ్ఞ బల్కినన్. 80

ఉ. ధారుణి దిర్దిరం దిరిగెఁ దల్లడ మందెను దిక్కులన్నియున్
    వారిధులు న్గలంగె గిరివర్గము లెల్లను గ్రుంగె నష్టది
    గ్వారణపఙ్క్తి బెగ్గిలియె వారిజమిత్రుడు తప్పఁ గ్రుంకె జం
    భారి దలంకె నిర్జరగణావళి వేదనఁ బొంద నయ్యెడన్. 81

వ. ఇవ్విధంబున మారకుబేరులు రూపధనాధిక్యంబులు నిరూ
    పించి యత్యంతక్రోధాయత్తచిత్తులై ప్రతిజ్ఞలు సేసినఁ
    దనలోఁ జింతింపుచు నెవ్వరి నేమియు నననేరక దేవపతి
    గొలువు విడచి నిజవాసంబునకుం జనియె సురగరుడగంధర్వ

    సిద్ధవిద్యాధరు లాదిగా గలరంభాదికామినీసందోహంబును
    దమతమతావులకుం జని రంత.82

శా. గంధానేకపదానవాధిపమహోగ్రక్రోధసంహారద
    ర్పాంధీభూతజలంధరాంతకబలాహంకారచండక్రియా
    సంధానప్రబలాంధకారపటలీసప్తాశ్వశశ్వన్నభ
    స్సింధుస్ఫారజటాగ్రసీమమహితశ్రీదక్షవాటీశ్వరా.83

క. ప్రణతాంబుజసంభవసుర
   గణవల్లభ యక్షసిద్ధగణమకుటలస
   న్మణికాంతిప్రచురనిజచ
   రణకోమలపంకజాత రాజార్ధధరా.84

మాలిని. భవతిమిరపతంగా! భవ్యగంగోత్తమాంగా!
    వివిధగుణవిహారా! వేదవేదాంతసారా!
    రవిశశిశిఖినేత్రా! గ్రావకన్యాకళత్రా!
    దివిజనుతమహేశా! దివ్యమూర్తిప్రకాశా!85

గద్య. ఇది శ్రీ వీరభద్ర కృపాలబ్ధ కవితావిశేషమహితచారిత్ర
   తిప్పయామాత్యపుత్ర సరసజనవిధేయ నూతనకవి సూరయ
   నామధేయప్రణీతంబైన ధనాభిరామం బనుమహాప్రబంధం
   బున ప్రథమాశ్వాసము.

  1. ఈపద్యము కొన్నిప్రతులలో కానరాదు.