ధనాభిరామము/ద్వితీయాశ్వాసము
ద్వితీయాశ్వాసము
—♦♦♦♦§§♦♦♦♦—
క. శ్రీశైలకన్యకాధిప
యాశీవిషనాథశోభితాంగద నతవా
గీశ ఘనసారహిమసం
కాశా శ్రీదక్షవాటికాభీమేశా. 1
వ. దేవా విన నవధరింపుము.2
క. ఆమని చనుదెంచెను బే
రామనియై సకలభూరుహావలిసొబగుల్
రామనిశుకపికభృంగ
స్తోమములగు నంతకంత సొంపు వహింపన్. 3
మ. వినుతానోకహకుంజమంబు లలతన్ విస్ఫూర్తిఁ బొందంగ న
త్యనురాగంబున భృంగకీరకలకంఠారావముల్ మ్రోయఁ గ్రొ
న్ననవిల్కానికి సున్కిపట్టగుచు నానాగంధముల్ నిండె మ
న్ననతో వచ్చె వసంతకాలము జనానందంబు గావింపుచున్.4
చ. అలినివహంబుకోరికె పికావళికీతగుప్రాణరక్ష రా
చిలుకలజీవనస్ఫురణ చిత్తజవైభవరాజ్యలక్ష్మి చె
న్నలరు సమీరణంబులకు నర్మిలికూట మనంగ వేడుకన్
మలయుచు నేగుదెంచె మధుమాసము మారమనోవికాసమై. 5
ఉ. చందనమాతులుంగహరిచందనసాలరసాలపాటలీ
కుందకపిత్థచంపకముకుందవటార్జున రావిబిల్వమా
కందహరీతకీవకుళకాంచనదాడిమనింబభూజముల్
గ్రందుకొనంగఁ జూచి తగఁగాచి ఫలించె వినోదమొప్పఁగన్.6
సీ. మదనునియాస్థానమంటపంబు లనంగఁ
జూతపోతంబులు సొంపు మీఱె
నంగజరాజ్యసింహాసనస్థలు లనఁ
బున్నాగములు చాలఁ బొలుపు మీఱె
ననవిల్తుశృంగారనాట్యశాల లనంగ
వకుళంబు లెంతయు వన్నెచూపె
నతనునిక్రీడాగృహంబులో యన నొప్పి
మాధవీనివహంబు మహిమఁ దనరె
గీ. శంబరారాతిపటుశస్త్రశాల లనఁగ
లీలఁ జూపట్టె జాతిమల్లియనికుంజ
పుంజముల మించుమంజుళపుష్పలతల
శ్రీకరంబును సకలసౌభాగ్యకరము
నగుచు విలసిల్లె ధరణిఁ జైత్రాగమంబు.7
సీ. మంజులనవలతాకుంజపుంజమ్ములు
రంజిల్లు ధారాధరంబుగాఁగఁ
జంచరీకాటోపఝంకారములు మహో
ద్దండభీషణగర్జితములుగాగఁ
గాలితాకున నేల రాలుపూమొగ్గలు
కడిమిచే వడిగండ్లకరణిగాఁగఁ
దోర మెయ్యెడలేక దొరఁగుపూదేనియ
విడువక జడిగొన్న వృష్టిగాఁగఁ
గీ. దాకి వ్రాల్తొడిమెలఁ గూడి తరులనుండి
జారుపూసోన సోనపుంజములుగాఁగ
నంచితస్ఫూర్తి నీవసంతాగమంబు
ధరణి వర్షాగమంబు చందము వహించె.8
సీ. వివిధగంధానూననవమంజులోత్పల
కుసుమసౌరభములు గ్రోలిగ్రోలి
కలితసౌరభగంధకాసారసుస్థిర
వీచికావలిఁ గొంత దేలిదేలి
కమనీయపరిమేళఘనతసారంబుల
సోన లందందెల్ల సోలిసోలి
విలసితోజ్వలితకోమలచారుసహకార
పల్లవంబులమీఁద వ్రాలివ్రాలి
గీ. విటవిటీసంఘముల మీలవేఁటకాఁడు
రతిమనోనాథుసంగడీఁ డితఁ డనంగ
కలను శృంగారవరవాటికల నమర్చె
నద్భుతానందరీతిఁ జైత్రాగమంబు. 9
వ. మఱియు మిసమిసైనపస దొలంకు కిసలయంబుల కసికాట్లు
గాఁ గఱచి తొగరునుం బొగలెక్కి మిగులజిగినిగుడఁ జిగు
రాకు జొంపంబుల కంపంబులు లేక సొంపుననసమశరవిజయ
ప్రయాణకాహళులభంగిఁ జెలంగి సంగతిమీఱఁ బంచమ
స్వరాభిప్రాయంబున వాయెత్తి కూయుకోయిలంబును మధు
దసంచలితంబు లగుపరిపక్వఫలంబులు కొంచక చంచుపుటం
బులఁజించి దట్టంబులయిమిట్టించి తొరఁగుఫలరసబిందుసందో
హంబు నాకంఠపూరితంబులుగా గ్రోలి సోలి తుమ్మెదలు
కొమ్మలతుదకెక్కి నిక్కి చక్కెరవిలుకానిరాణివాసంబుల
వీణానినాదంబులభాతి రీతిగా నెలుఁగెత్తి పలుకుచిలుకలును
నికుంజపుంజంబుల రంజితమంజుళకుసుమమంజరులు గ్రందు
కొని చిందుమకరందంబులు కుత్తుకనిండుగా భుక్తిగొని
మత్తిల్లి చిత్తజాతుని విజయశంఖంబులవడువున మెండు
కొని మ్రోయుగండుతుమ్మెదలపిండును సూనశరసేనకు
గ్రోలుగా వివిధనవకుసుమపరిసరంబుల విడియింపుచు నింపు
దొలంకక నవలతానురక్తకీజనశీక్షావిచక్షణవిభ్రమారంభం
బుల విజృంభించి పురవరోద్యానవాటికా శిఖరాంతంబుల
వెలయుకమ్మదెమ్మెరలును వికసితకమలకువలయకుముద
సౌగంధికగంధబంధురకబంధపూరితంబు లగుకాసారంబుల వేసారక
బిసరసంబులం బ్రియుల కందిచ్చుచుఁ గూలంబులను
కూలంబులయి సురాళంబులం మెలంగుమరాళంబులం గలిగి
విశ్వజనానందకరంబును వనలక్ష్మీమానసోల్లాసంబు నగు
మధుమాసంబు పుత్తెంచిన.10
క. సూనాస్త్రుడు ధనపతితో
దా నాడినయట్టి ప్రతిన ధర చెల్లింపన్
బూని చనుదెంచి వేగన
భూనుత మగుదక్షవాటిపురవరమునకున్.11
వ. ఆపురం బెట్టిదనిన.12
చ. సరసిజబాంధవుం డరుగుచక్కటి: దొర్కొని చిత్తరూపబం
ధురవరకేతనోత్పలవినూతనతోరణచారువైభవ
స్ఫురణఁ దనర్చి వైరినృపపుంగవకభేద్యమై తగ
న్గురుతరలీల నప్పురము కోటలు చూడఁగ నొప్పు ధారుణిన్.13
క. చెలువలరుపరువులోతును
గలిగి విశుద్ధాంబువులను గమనీయంబై
జలరాశి చౌకఁ జేయుచుఁ
బలు తేఱఁగుల పరిఘ లమరుఁ బట్టణసీమన్.14
సీ. పరిఘాదిలోతును బరపును నెల్లెడ
నేడువారాసుల నేలుకొనును
వస్త్రసమున్నతి వదల కద్భుతముగా
నాకాశమండలం బదుముకొనుచు
కడ లేనిమేడలపొడవు భానునితోడ
మించి యొక్కట నావరించుకొనును
గృహములవిభవంబు గీర్వాణసౌఖ్యంబు
వేడుకతో కడు వాడుకొనును
గీ. నవనిధానంబులను మహోత్ససమునయము
నింపు సొంపొందఁ దనలోన నిముడుకొనును
ననుచు నందఱు గొనియాడ నవనిలోన
సాటి కెక్కెను శ్రీదక్షవాటిపురము.15
ఉ. కోరిక మీఱ నప్పురముగోపురముల్ గగనంబు ముట్టి యిం
పార నతిక్రమించినభయంబునఁ ద్రోవయు గానరాక పెం
పారసి పద్మబాంధవుఁ డహర్నిశముం దనరూపు రూఢిగా
సోరణగండ్లలోఁబరపుచుం దగఁ జూపును కాలమానముల్.16
ఉ. మెచ్చులు మీఱ నప్పురము మే లగుహర్మ్యతలాగ్ర సీమలం
జెచ్చెర నాడుబాలికలచిత్తము లుబ్బఁగ వచ్చి వేడ్కతో
నచ్చరలేమలం గలిసి యద్భుతవాక్యవిశిష్టవైఖరిన్
ముచ్చటలాడుచుండెదరుమోదముతోడుతఁగూడినిచ్చలున్.17
ఉ. మేలిమి నాకగేహముల మించినయుజ్జ్వల శాతకుంభర
మ్యాలయదివ్యగేహసముదంచితకుడ్యవిచిత్రరత్నసం
జాలసుదీప్తి వర్వఁగ నిశాభయ మెన్నఁడు లేక వైభవ
శ్రీ లలితోన్నతస్ఫురణఁ జెంది చరింతురు మర్త్యు లప్పురిన్.18
మ. మదధారల్ గురియంగ భూతలము సమర్ధంబుగాఁ బంక మై
చెదరన్ గర్వము మించియష్టమదముల్ చెన్నగ్గలింపంజయా
స్పదమై జంగమశైలసంఘమున నుత్సాహంబు సంధిల్ల స
మ్మదలీలాగతి నుండునప్పురములో మాతంగముల్ వేడుకన్.19
చ. కసమునఁ జూపరాక యెదఁ గైకొని ధీయనఁగాలుమించి యా
కసమునకైనఁ బాఱి జవగాఢసమున్నతసత్త్వమూర్తులై
యసదృశలీలఁ జిత్తరువునందు లిఖింపగ రానిరూషముల్
పసఁ దళుకొత్తనశ్వములు బాగగునప్పురిఁజెన్ను లెన్నగన్.20
క. బంధురవిభ్రమమదపు
ష్పంధయబకచక్రహంసపటుకలనవసౌ
గంధికవికచనవాంబుజ
గంధంబుల నొప్పుఁ బురముకమలాకరముల్.21
శా. సారంబై నవపల్లవ ప్రసవగుచ్ఛస్వచ్ఛవల్లీమత
ల్లీరమ్యోరుశలాటుసత్ఫలరసల్లీలాసముల్లాసశృం
గారాపూరవసంత వైభవరమాకల్యాణదామంబులై
యారామంబులు మించు నప్పురములో నాకల్పసీమంబులై.22
సీ. మలసి నిర్మలనూత్న మకరందముల సోలి
చల్లనికుసుమవాసనలు గ్రోలి
విమలకాసారాంబువీచికావళిఁ దేలి
సహకారతరువులజాడ వ్రాలి
పృథులవిశేషపుష్పితలతావలిమాలి
కాసమూహంబులఁ గవిసి వ్రేలి
బంధురగతి నన్యగంధంబులను గ్రోలి
కొన్నిసుగంధంబు గోరి యేలి
గీ. జగములకు నెల్ల నానంద మగుచు మేలి
మతులసౌరభ్యశైత్యమాంద్యముల సోలి
విలసిత శ్రీలఁ గనుపట్టు వేలవ్రోలి
సరిసరిత్తుల విహరించుఁ జల్లగాలి.23
సీ. మదనవశీకారమంత్రరూపములన
మెలఁగెడుతొలుకారుమెఱుపు లనఁగ
నడపాడ నేర్చిన నవకంబులతలనఁ
బొలుపొందువెన్నెలబొమ్మ లనఁగఁ
బసమించులావణ్యరసమూలము లనంగ
లాలితకనకశలాక లనఁగఁ
జేతంబుఁ దళుకొత్తుచిత్రరూపము లన
రమణీయతరరత్న రాసు లనఁగ
గీ. మూర్తు లలరించునవకంపు మొలక లనఁగఁ
బలుక నిలిచినఁ గపురంపుఁబలుకు లనఁగఁ
గలికిమరుచేతి ముద్దురాచిలుక లనఁగఁ
జాల వెలసిరి యప్పురిచంద్రముఖులు.24
క. నిగనిగ మనియెడిమేనులు
దిగదిగ నడచినను నొగిలి తెగియెడునడుముల్
జిగిబిగి గలకుచములు నగు
మొగములుఁ దముఁ బొగడఁ బురమువనితలకెల్లన్.25
సీ. వేదశాస్త్రాగమవిపులనానాధ్వర
ప్రావీణ్యయుతు లైన బ్రాహ్మణులును
బాహుబలాటోపపటువిక్రమోద్దండ
జయరమాధిపు లైనక్షత్రియులును
వివిధవస్తువ్రాతవిక్రయక్రయమహా
వైభవోన్నతు లైనవైశ్యజనులు
నిత్యధర్మక్రియాసత్యవిశేషవ
చోవిశారదు లైనశూద్రవరులు
గీ. నటవిటానేకసామంతభటసుమంత్ర
పుష్పలావికగాయకపుణ్యసతులు
గలిగి యమరావతీపురి కలరు సాటి
ధరణి సౌఖ్యంబులకుఁ జూటి దక్షవాటి.26
వ. ఇట్లు సకలసౌఖ్యములకు జన్మస్థానంబన సర్వంసహాకాంతకు
దర్పణంబనఁ దనరి లోకాభిరామం బగుదాక్షారామంబుఁ
గనుంగొని యత్యంత సంతోషాయత్తచిత్తుండై చిత్త
జాతుండు దరియం జనునప్పుడు.27
సీ. కమనీయతరకచ్ఛపములు మీఁగాళ్లుగా
సైకతస్థలికటిస్థలముగాఁగ
భాసురావర్తవిభ్రమరీతి నాభిగా
వరకోకములు కుచద్వయముగాఁగ
విదితశంఖములయొప్పిదము కంఠమ్ముగా
మోవి పద్మముసొంపు మొగముగాగఁ
దళుకుబేడిసమీలు ధవళనేత్రములుగా
నవకంపుఫేనంబు నవ్వుగాఁగ
గీ. ఘనత తనయందె పుణ్యముల్ గలుగు ననుచు
వీచికాహస్తములు సాచి వేడ్కఁ బిలుచు
ముక్తికామినివిధమున మురియుచున్న
సప్తగోదావరముఁ జూచె శంబరారి!28
ఉ. శ్రీవిలసిల్ల సంస్మరణఁ జేసిన యాగఫలంబు గల్గు సం
భావన మీఱఁ జూచినను బాపము లెల్ల నడంగు నేదెసన్
బోవక తీర్థమాడినను బొందు శుభంబులు చారుసప్తగో
దావరిసింధుకున్ సవతు ధారుణి లేవు తలంప వాహినుల్.29
వ. అని కొనియాడుచు నాపుణ్య సింధుబంధురంబుగ
నవగాహన మ్మొనర్చి.30
క. ధనమూలము లగుసొమ్ములు
తనువునఁ దగఁ బెట్టుకొనిన ధనదునితో నా
డినప్రతిన తప్పునో యని
యని దాని దిరస్కరించె నతనుఁడు వేడ్కన్.31
సీ. లాలితబిసతంతుజాలసంధానవి
చిత్రాంశుకంబులఁ జెలఁగఁ గట్టి
పసిఁడివన్నెలతోటి పదనిచ్చి గలపిన
పూదేనెగంధంబు పొసఁగ నలఁది
తనమోహనాస్త్రసంతతి యైనచల్లని
పరిమళమిళితపుష్పములు ముడిచి
కామినీజనవశీకరమంత్రయుత మైన
పూదేనెతిలకంబుఁ బొందుపఱచి
లలితనిజరూపరేఖావిలాసచతుర
విక్రమారంభసంరంభవిపులవిభవ
విక్రమాటోపనిఖిలదిగ్విజయబాహు
దర్పమేర్పడ నిలిచెఁ గందర్పు డపుడు.32
క. అతనుండయ్యును జగములు
కుతలము గుడువంగఁ జేయుకుసుమాస్త్రుడు స
మ్మతి తనువు దాల్చి వచ్చెను
గుతలము దానింక నతలకుతలము గాదే.33
క. వరసౌందర్యము గలిగిన
పురుషులకును బెట్టనేల భూపణములు భా
సురతరరూపముకంటెను
కర మరుదుగ భూషణంబు గలదే జగతిన్.34
క. లావణ్యములకు మూలము
భావజుఁ డామీద వన్నె పచరించినఁ జూ
చేవిధిని నిలుతురో యిక
భూవలయములోనఁ గలుగుపొలఁతులు దలఁపన్. 35
వ. ఇట్లు సూనశరుండు మానవరూపంబుఁ దాల్చి నిల్చి తనకుఁ జెలి
కాఁడగు పటువిటపికులచాటివాటికాంతుం డగువసంతుండు
భృత్యసమ్మదబంధురభావంబున ఠీవిమీఱ నోలగంబు
నడుపురూపుగాఁ గరంబు మూపునం గీలించి దంటతనంబున
వెంట నేతేర నిక్షుశరాసనుండు దక్షవాటికాకటకఘంటా
వీథిం జనుదెంచునప్పు డతనిం గనుంగొని పౌరులు దమలోన.36
సీ. పొందుగాఁ దనమేనికందు పోవఁగఁ జేసి
యిటకు నేతెంచెనో హిమకరుండు
హయముఖాకృతి మాని యలకుసుందరరూప
కోవిదుం డగునలకూబరుండొ
తనరూపు రేఖలు దాల్చి యిచ్చోటికి
నిజరూపమున వచ్చునిషధవిభుడొ
కలితలావణ్య రేఖావిలాసస్ఫూర్తిఁ
బ్రబలిననిర్జరపతిసుతుండొ
గీ. యుగ్రపటుతీవ్రనిటలాంబకోగ్రదహన
శిఖలు నేరియనినూతనచిత్తభవుఁడొ
కాక వివరించి చూచిన లోకమునను
నిట్టిరూపంబు మనుజుల కేలగలుగు.37
ఉ. పువ్విలుకానిఁ బోలినయపూర్వమనోహరమూర్తివాడహో
యెవ్వడొకోయితండు మనమెవ్వరుచూడనివాడుకాడు శ్రీ
నివ్వటిలంగ మన్మథుడు నేరుపుమీఱను మర్త్యరూపమై
యివ్వసుధాస్థలిన్ జనులనెల్ల భ్రమింపఁగ వచ్చెనోజుమీ.38
వ. అని యందఱు నద్భుతానందచిత్తులై విలోకింపఁజిత్తజాతుండు చనుదెంచి.39
సీ. గురుతరం బగుచిత్ర గోపుర ప్రాకార
మహితకాంచనమణిమంటపములు
ప్రత్యగ్రరచనాసుబంధబంధురశాత
కుంభరత్నోజ్వలకుంభములను
భూరినిఖిలవాతపూరణతోరణ
చాతుర్యవృషభేంద్రకేతనములు
పటహభేరీశంఖపటుఘంటికానేక
భీషణాటోపనిర్ఘోషణములు
గీ. కలితకర్పూరగుగ్గులగంధసార
భూసురామోదకరధూపవాసనలును
మహిమదనరిన భీమేశుమందిరంబు
గాంచి ముందర నేతెంచెఁ బంచశరుడు.40
వ. మఱియు నక్కడ.41
ఉ. తాళములు స్మృదంగములు దండెలు జంత్రము లావజంబులు
న్కాళెలు వాళికంబు లొక కట్టునఁగూర్చి శ్రుతుల్ నిబద్ధిగా
నాళతిఁజేసి లేమలు సమంచితవైఖరిఁగూర్చి పాడఁగా
లాలితనర్తనక్రమవిలాసవిశేషము లుల్లసిల్లగన్. 42
చ. కడువడిఁ దాళరూపజము కాహళమర్దళలాశక్రోలుచె
న్నడరుచు వీణ దండ మొసలన్నియు నొక్కటిగా నొనర్చి పై
బడగ శ్రుతు ల్సమంబుగ నిబద్ధిగఁగూడి సుతానమాసము
ల్తడబడకుండ జూచి భరతస్థితి దప్పక మేళనంబునన్. 43
క. పటు వగుధ్రువయును జంపెయు
మటెమును చెన్నగుసుభద్రమానితచంచ
త్పుటమును మొదలుగ మరి వి
స్ఫుటమతి నూటొక్కతాళములు విలసిల్లన్.44
క. శ్రీపురుష రాగ భేదము
నేపార నెఱింగి వేళ నెన్నికమీఱన్
రూపించి పాడి రపుడు వి
రూపాక్షునిమ్రోల చిత్రరూపులు గలుగన్.45
చ. ఇరువదియారువీక్షణము లెన్నఁగ నాలుగువర్ణచేష్టలన్
బిరుదుగ నేడుభూనటన లర్వదినాలుగురోర్విలాసముల్
సరసతఁ జూపి హంసవృషసామజవాయసశుద్ధసంగతుల్
పరువడి ముట్ట నిల్చి సితపంకజలోచన లాడుచుండగన్. 46
సీ. మురువు లివియు నేర్పు మోహంబు గల్గును
మీఱఁ బుష్పాంజలి మేర జేసి
కరముఖబాహూరుకటకావిశేషము
కరవిభవంబులు గరిమఁ జూపి
తోడుత ఘట్టితోద్భూతాది పదవిశే
షంబులబాగుల సరవి నెఱపి
కలిత బాహ్యాంగచక్రకములక్షణములు
భ్రమరులు పచరించి బంధురముగ
తానమానంబులును బంధుస్థానములును
దివ్యగీత ప్రబంధసంధానతాళ
చతురగతులగుభావరసంబు లలర
నాట్య మొనరించి రింతులు నయ మెలర్ప.47
క. అంగంబుల మెరవడి ప్ర
త్యంగంబుల చెప్పెదను నుపొంగంబులు నా
సంగతిత్రివిధభరతమ
తంగాదిమునీశ్వరులమతము విలసిల్లన్.48
క. శిరమును వక్షస్థలమును
గరతలమును మఱియుఁ బార్శ్వకటినాదంబుల్
సరసాంగంబులు దప్పక
యిరువురు వేర్వేర నిర్ణయించిరి మొదలన్.49
గీ. చారుగళబాహుతుండోరుజానుజంఘ
లెన్నఁ బ్రత్యంగములు వాని నెల్ల నెఱిఁగి
బహువిధంబుల నెఱపిరి భరతశాస్త్ర
లక్షణంబులు దళుకొత్త లాస్యకంబు.50
క. విలసద్భూషణసుందర
ములు సానువవరకపోలములు దక్షయమున్
వెలయు నుపాంగంబులు ని
శ్చలతను వెన్నెత్తి తతులవిభ్రమ మెసఁగన్.51
వ. ఇవ్విధంబునఁ బ్రమదాదిజనులు నృత్యంబులు సలుపుచుండ
భీమేశ్వరునియవసరంబువేళ చనుదెంచిన.52
సీ. పంకజోదరపద్మభవసహస్రాక్షులు
సేవింతు రేదేవుఁ జిత్త మలర
వ్యాసగౌతమభరద్వాజాదిమును లెల్లఁ
బూజింతు రేదేవుఁ బొలుపు మీఱ
నొగి హరిశ్చంద్రాదు లగుచక్రవర్తులు
కొలుతు రేదేవునిఁ గోర్కు లలర
భరత రామాదిభూపతులు పదార్గురు
నర్చింతు రేదేవు నారతంబు
నట్టి దేవుని శివుని నీహారశిఖరి
కన్యకావనసంఫుల్ల కమలహంస
దక్షవాటీశ్వరుని హిమధామఖండ
ధరుని భీమేశ్వరుని బురహరుని హరుని.53
వ. భక్తితోడను దర్శించి పంచామృతంబున నభిషేకంబుఁ జేసి.54
చ. జలరుహసంభవామరులు సన్నుతి సేయఁగనేర రెందు ని
చ్చలు మఱి వేదశాస్త్రములు సంస్తుతి సేయఁగ లేవు కోరి ని
శ్చలమతు లైనయాదిమునిసంఘము సంస్తుతి సేయలేరు నా
యలవియె మిమ్ముఁ జేరికొనియాడమహేశ్వర పార్వతీశ్వరా.55
వ. అని స్తుతియించి యద్దేవుని సమ్ముఖంబు వెడలి యాస్థాన
మంటపప్రదేశంబున నిలిచి.56
గీ. వరుస నా వేల్పు సేవింప వచ్చియున్న
చారుతరమూర్తు లప్పురిజలజముఖులు
సానెరమణుల వీక్షించి సంతసమున
సరసవిటచిత్తసంచారి శంబరారి.57
ఉ. మానవులెల్ల మెచ్చఁగను మక్కువమీఱగ భీమనాథుతో
మానుగఁ బెండ్లియాడి బహుమానమునన్ విహరింపుచున్ కళా,
స్థానములే విశేషగుణదానగుణంబులు మించినట్టి యా
సానిచకోరలోచనల శంబరవైరట చూచి వెండియున్.58
చ. కలకల నవ్వుమోములును కల్కివిలాసము మొల్కచన్నులున్ ,
చిలుకలపల్కులన్ గెలిచి చెన్ను వహించిన ముద్దుమాటలున్ ,
దళతళ మించుటద్దముల చక్కని చొక్కపు కంఠ భాగముల్,
గలిగి సమ స్తసౌఖ్యములకందువలో యన నొప్పు కామినుల్. 59
శ. నాయకరమణీమణులకు
నాయకమో యనఁగ దసరి నలి సౌందర్య
శ్రీయన నభిరామంబై
తోయజదళనేత్రి మహిమతో విలసిల్లన్.60
చ. మొలక మెఱుంగు జాజి విరిముత్యపుజిల్లి పశిండి బొమ్మరా.
చిలుకలకొల్కి మోహనవశీకరమంత్రము మించుచొక్కపుం
గలికి చకోరనేత్రి పసగల్గినరత్నశలాకకాంతి చే
నలరినచంద్ర రేఖ యనునంగనఁ జూడఁగ నొప్పు ముందటన్.61
ఉ. పెంపుడుగాక హీనులకుఁ బిల్చు మనస్సుదిగాక మిక్కిలిన్
దెంపరిగాక నట్టితరితీపుదిగాక విరాలిగాక యే
రంపలగొడ్కుగాక బలురాయిడికత్తెయుఁగాక యెప్పుడున్
సొంపుగ నింతలేనియెడ జూదరికత్తెయుగాక యెంతయున్.62
ఉ. వెన్నెల నాడఁబాడఁ జదువంగల కావ్యముఁ జెప్ప వ్రాయఁగాఁ
గిన్నెరమీట వీణెయును గీర్తితబుద్ధిని బట్టురూపము
న్సన్నుతి కెక్కె వైభవవిశాలగుణోజ్వలచారుమూ ర్తితో
నన్నిట నేర్పరైన సుగుణావతిఁ జూచె మరుండు వేడుకన్.63
సీ. పెంపారుతననారివైరికుంతలములు
చెఱుకుసింగిణివింటిపేరిబొమలు
మీనటెక్కెము వేరిమెఱుగారు నేత్రము
లలరుతూపులతోడి యక్షియుగము
విజయశంఖము పేరి వినుతకంఠంబులు
తేరి వాహకముల పేరిపల్కు
లారుతూణంబుల పేరింటిజంఘలు
మూలబలము వేరి మురియు నడుము
గీ. ... ... ... ... ... ... ... ... ... ... ...
... ... ... ... ... ... ... ... ... ... ...
లమర తనచిన్నె లన్నియు నద్భుతముగ
మించి వేడ్కలు దయివారఁ బంచశరుడు.64
క. తనతూపులనే వలసెను
వనజాయతనేత్రిచిత్ర వరమీనము పెం
పునఁ దగిలి వెతను బెట్టెను
మనసిజుఁ డను వేటకాడు మహిమ దలిర్పన్. 65
వ. అప్పుడు.66
ఉ. ఆతరుణీలలామ ప్రియమంది ముదంబునఁ జూచె సద్గుణో
పేతుని సూనశస్త్రముఖభేదనమాససమానినీవిట
వ్రాతుని సర్వలోకహితవశ్యకరోజ్వలచారురూపవి
ఖ్యాతవినిర్మలస్ఫురితకాటనకేతునిఁ జిత్తజాతునిన్. 67
క. వరసౌందర్యముఁ గల్గిన
పురుషులకును వలచు టరుదె పొలఁతుక ధరలో
మరు డిఁక గెల్చునొ యనుచును
సరి ఖేచరు లెల్ల నొక్కసంగతిఁ బల్కన్. 68
వ.అప్పుడు మన్మథుండు సుగుణావతి తనకు వశంబగుట
యెఱింగి యచ్చోటుఁ బాసి కదలి భీమేశ్వరుని ముఖమంట
పంబునఁ గూర్చుండె నంత విలాసినీజనంబులు ముదంబున
నద్దేవుని యవసరంబు దీరి తమతమమందిరంబుల కేగు మనుజ
భావంబున నున్న భావసంభవు నీక్షించి.69
చ. నలుడో శశాంకుడో దివిజనాథునికూరిమినందనుండొ కా
కలనలకూబరుండో ప్రియమారఁగమానవరూపుఁదాల్చి తా
నిలను దరించ వచ్చినరతీశుఁడొ యన్నియుఁ జెప్ప నేల మీ
చెలువము మర్త్యులందు విలసిల్లఁగ నేర్చునె బ్రహగూర్చునే.
సీ. కాంక్షించి కన్నులకరు వెల్లఁ దీర డ
గ్గరి వీనిఁ జూడనికన్ను లేల
బిగియారం గౌగిటఁ బెనగి వీనురమున
చక్కగాఁ గదియనిచన్ను లేల
కళలు దైవాఱ వేడ్కలు మీఱఁగా
వాని వరుస రమింపనివయ సదేల
సరససల్లాపభాషణముల వీనితో
సరిప్రొద్దు పుచ్చనిజన్మమేల
వీఁడు వెలియైనరూపంబు విభవములును
వన్నెలును నేల సతులకు వసుధలోన
ననుచుఁ దలపోసి రప్పు డత్యంతవిరహ
వేదనలఁ బొంది రప్పురి వెలవెలఁదులు.71
వ. ఇవ్విధంబున వారవధూతిలకంబు లందఱు దలంచుచుఁ దమ
తమనివాసంబులకుఁ జని రట సుగుణావతి మందిరంబున కేగి
యత్యంత విరహ వేదనాయత్తచిత్తయై యేకాంతంబునం గూడక
నిజనివాసంబున నుండె నప్పుడు.72
ఉ. రూపము గానరాక మఱిరూఢికి నెక్కి జగత్రయంబు సం
తాపము బొందఁజేసిన ప్రతాపము గల్గినతియ్యవింటిజో
దేపున రూపు దాల్చి ధర కేగి చరించినఁ జూచి యింతు లే
రూపున నిల్తురో గలికి రూఢివ నీమరుసేఁత లన్నియున్.73
గీ. చంద్రజూటునిదేహంబు సగము చేసె
విష్ణునురమున గంతులు వేయఁ జేసె
నురికి బ్రహ్మను నోరెత్తకుండఁ జేసి
నింతులన నెంతవారలు కాంతునకును.74
క. మునుకొని జగములు పొగడఁగ
ననువుగ నెటువంటివారినైనను గాల్పున్
ఘనత గలమాయదారట
తనపనిఁ దాఁ జేసికొనఁడె ధర్మకుఁ డంతన్.75
క. ఆరామామణి యంగజు
నారసి కన్నారఁ జూచినప్పటివలె నిం
డారఁగ విరహసమున్నత
భారము మేనికిని మిగిలి పరవశ యగుచున్. 73
క. గాలము మ్రింగిన మత్స్యము
పోలిక రమణీలలామ పొగులుచు మిగులం
దూలి పువుశయ్యం బొరలుచు
జాలింబడె మరుని యింద్రజాలము చేతన్ .74
సీ. కనుకలితోటెత్తెఁ గాంతాశిరోమణి
తలపోయుచుండెను దరళనయన
కాంక్షల కడు డస్సెఁ గామినీతిలకంబు
వర్ణింపఁగా వచ్చె వనజనయన
తమకించె గవయ నెంతయును గోకిలవాణి
సిగ్గు చక్కంబెట్టె జిగురుబోణి
ప్రియము రెట్టించంగ నియమించె మానిని
వలపున శోషించె వరవధూటి
యతనిధ్యానంబుఁ జేసె రాయంచమిన్న
ముదముతో తన్ను మఱచెనో మోహనాంగి
తనరి యది దశావస్థల ననుసరించి
యంగజునిఁ జూచి గుందె నాయతివ యపుడు.75
ఉ. వాడెను మోముదమ్మి తనవారల నెవ్వరిఁ దేరిచూడఁగా
నూడెను గన్నుదోయికిని నూర్పులు దట్టములయ్యె మేనికిన్
గూడెను తాపమగ్గలము గోరియు హారము నేను ధైర్యమూ
టాడెను మేను డస్సి విరహాగ్నిని గంజదళాయతాక్షికిన్.76
ఉ. పొరిపొరి వెచ్చసూర్చుఁ దలపోయుమనంబునఁ దాల్మి లేకలో
విరవిరబోవు మిన్నరయుఁ బేరున బిల్చినయట్టివారల
న్వెరవిడి వీడనాడుఁ గడువేదన బొందును వారిజాస్యయున్
గరములు బుణ్కుకొంచు మఱి కామినియుండెననేకరీతులన్.
సీ. సఖియకుఁ జెలితోటి సఖ్యం బసఖ్యంబు
ముదితకు రాయంచ మురువు బరువు
పొలతికి నడ చూడ పోతంబు భూతంబు
చెలువకుఁ జెంగావివలువ బలువు
నాతికి వీణానినాదంబు భేదంబు
పడతికి విరజాజిపరుపు నెరుపు
సతికిఁ జల్లనిగంధసారం బసారంబు
భామకు రాచిల్కపలుకు నులుకు
కువలయాక్షికి కోయిలకూత ఘాత
మోహనాంగికి తుమ్మెద మ్రోత రోఁత
వెలది కీరీతి నంతయు వింతలయ్యె
నంగసంభవుఁ గనుగొన్న యంతనుండి.78
వ. ఈవిధంబున విరహవేదనం జిక్కి వివశత్వంబునం బొందిన
సుగుణావతిం జూచి యొక్క చెలియ యిట్లనియె.79
ఉ. సన్నుతిసేయఁగా దగినసానికులంబునఁ బుట్టి ప్రాయమున్
వన్నెయు వాసియున్ సుగుణవర్తన రూపముగల్లి సంపదన్
యెన్నికమీఱఁ గన్నులకు నింపగువారల బొందఁగల్గి యో
కిన్నరకంఠి నీదుమది కింపగుకారణ మేమి చెప్పవే. 80
గీ. నీవివేకమహిమ నీరాజసంబును
నెందు కేగె నేడు యిందువదన
చేరి మాకు బుద్ధిఁ జెప్పితి విన్నాళ్లు
నిన్ను దెలుపవశమె నీరజాక్షి. 81
క. నీమనసు గలదు యేమిట
భామామణి యడుగ నీకు భయ మది యేలా
ప్రేమమునం దెచ్చి బెట్టెద
భూమండలిసఖుల నన్ను బోలంగలరే.82
వ. అని బుజ్జగించి తనపయంట చెఱంగునఁ గన్నీరుదుడిచి కురుల
నులుదీర్చి భూషణంబులు చక్కసంధించి మధురాలాపంబు
ప్రియంబునం గూర్చి యడిగిన నచ్చెలితో సుగుణావతి
యిట్లనియె. 83
ఉ. కోరికె భీమనాయకునిఁ గొల్చి వినోదముతోడ నుండగా
మారునిఁబోలునట్టిసుకుమారుఁడుమంచివయస్సువాఁడు నిం
పారఁగ నేగుదెంచిన ప్రియంబునఁజూచినయంత నుండియున్
వారిజనేత్రి వానికి నవశ్యము చిక్కితి, బెక్కు లేటికిన్. 84
ఉ. వేడుకతోడ వాని కనువిచ్చి నయం బనయంబు మీఱఁగాఁ
జూడకయున్నఁ జిత్తమున రూఢి రతీతమకంబు పుట్టగా
కూడక కూడి కోర్కులును కూరిమిమీఱఁగఁ గామవార్థి నో
లాడక యుండి లోనివిరహాగ్ని నడంపఁగవచ్చునే చెలీ. 85
క. ననుఁ జూచి వలతు రందఱు
వనితా నే వల్వ నేంతవానికి నైనన్
వినుమా యేమని చెప్పుదు
ననవిల్తుడు నాకు సాక్షి నలినదళాక్షీ.86
గీ. ఇన్ని మాటలు పనిలేద యెన్ని చూడఁ
దెలియఁజెప్పెద నిటువానిఁ దేకయున్న
మానవతి కిక వెనుకను మాన మేల
ప్రాణమునకును సందేహపడును జూడ.87
వ. నాకు నీవు కావలసినదాన వేని వేగిరంబ వాడున్న
చోటుకుం జని తోడితెమ్మనిన నది యిట్లనియె.88
ఉ. అక్కట వాసివన్నె గలయట్టికులంబునఁ బుట్టి రూపుచే
నెక్కుడు భాగ్యసంపదల నెన్నఁగ నెక్కినదాని కంతలో
నెక్కడివానికిన్ వలచి తెవ్వరొ వానికులంబు విన్న వా
రొక్కట నవ్వరే విడువు ముత్పలలోచన నీకు మ్రొక్కెదన్.89
ఉ. నిచ్చలు నిండ వల్లభులు నీకడ గానఁగలేక కానుకల్
దెచ్చి తమంత గ్రందుకొని తేకువ మోసలు గాచుచుండగాఁ
జెచ్చెర వారలం ఘనము సేయక డాయకయూరకున్న హా
యొచ్చెముగాదె నీకునుబయోరుహలోచనయీపురంబునన్.90
చ. కలికితనంబు మీఱఁగ వికారముతోడ మనోజకేళి ని
శ్చలతమకంబు వుట్ట విటసంఘముఁ దెచ్చి యొసంగు నీమహో
జ్వలమణిభూషణాదిఘనవస్తువులం దనురక్తిగాక తా
వలచుట పంతమే ధరణి వారవధూమణికిం దలోదరీ!91
వ. అని యనేకప్రకారంబులం దెలిపిన రుచియింపనిచందంబున
చెలిపలుకులు హితవుగాక మదనావలోకనవిరహవేదనా
క్రాంతశాలి యగునాకాంత క్షమాక్షరంబులఁ జెలి కిట్లనియె.92
ఉ. ఎన్నికమీఱఁ గన్నులకు నింపగువాని రమింప లేని య
త్యున్నతరూపసంపదయు నొప్పగుజవ్వన మేల చెప్పెదన్
వన్నెగ నే గడింపనిసువస్తువు లేమియు భూమిలోపలన్
పొన్నసుగంధి యున్నవని బోల్ప గుణంబు తలంపవచ్చునే.93
క. కాదనక వారకామిని
గాదే యలరంభ వలచి కానలవెంటన్
బోదె నలకూబరునకున్
వాదింపఁగ నేల జగతి వలచినపనికిన్.94
ఉ. ఏటికి రత్నభూషణము లేటికి దివ్యసుగంధసంపదల్
యేటికి భామినీమణుల యిచ్చయెఱుంగని యావిటాధముల్
యేటికి నామనంబునకు నింపగువానిని దేకయుండినన్
బోటిరొ యింక ప్రాణములు పొల్పుగ నిల్వవువానిఁదేఁగదే.95
వ. అని ప్రియంబుగూర్చి వానిందెచ్చిన నీకు మెచ్చుగలదనిన
నయ్యేణలోచన పచ్చవిల్తుం డున్న యెడకు వచ్చిన సుగుణా
వతి దనలో నిట్లనియె.96
క. చనునొకొ చెలి యచ్చటికిని
ననునొకొ నామాట లెల్ల నాతనితోడన్
వినునొకొ వివరము పుట్టను
గొనకొని యలపనికి నియ్యకొనునో లేకన్. 97
ఉ. వచ్చునొ రాడో యిచ్చటికివచ్చి నిజంబుగ నన్నుఁజూచి లో
మెచ్చునొ మెచ్చడో పిదప మెచ్చిన రమ్మని కౌఁగిలించునో
యిచ్చలుమీఱ వేడుకను నిద్ధరలోపల నాకుఁ గీర్తిఁ దా
దెచ్చునొ తేఁడొకో యనుచు ధీర దలంక కలంకులోపలన్.98
వ. అని తలపోయుచుండె నంత సుగుణావతి బంపిన చెలి చని
భీమేశ్వరుని ముఖమంటపంబునకుఁ బ్రవేశించి తత్ప్రదేశం
బున నున్న కొన్ననవిల్కాని నీక్షించి యాశ్చర్యసంతోష
ప్రేమాతిశయంబులు తనమనంబునం బెనంగొన సుగుణావతి
చెప్పినమాటలు నిజంబుగా నెఱిఁగి యతని నాలోకించిన
భామినీమణులు చిక్కక తక్కుదురే యని తలంచి 'యేను
నితనికి వలచియుండితినేని ప్రాణసఖి కార్యంబు దక్కదని
సరసురాలును వివేకియుం బ్రౌఢాంగనయుం గావున మనసు
దిరుగ నూలుకొలిపి ధైర్యంబు దెచ్చుకొని యిట్లనియె. 99
సీ. ఎందుండి వచ్చితి రెవ్వరు మీపేరు
యెక్కడి కేగుదు రేఱుఁగఁ జెపుడు
ప్రేమతోడుత విచారించియుఁ జూతుము
వరుస నిందరుగనివారు లేరు
నీరూపురేఖలు నీరాజసంబును
నరులయందును బుట్ట వరసిచూడ
జర్చింప దేవతాంశమువారు గాఁబోలు
దురుగాని యన్ననితరులుగారు
పొందుమీఱఁగ మీర లీపురమునకును
వచ్చియుండినఁ జూచినవారికెల్ల
నతులసంతోషమును జాల నద్భుతంబు
వదలి హృదయంబులందును ముద మెలర్ప.100
క. విచ్చేయుము మాయింటికిఁ
జెచ్చెర పుష్పములు మంచిగంధము విడెమున్
బుచ్చుకొని వత్తు రంటిని
నిచ్చట నుండంగ మీకు నేటికి ననఘా.101
వ. అనిన మందస్మితసుందరవదనారవిందుండై యిందిరానంద
నుం డిట్లనియె. 102
ఉ. వారిజపత్రలోచన యవంతిపురంబుననుండి వచ్చితిన్
బేరు మనోహరుం డనఁగఁ బెంపువహించినవాఁడ నెన్నఁగా
ధారుణి నెల్ల విద్యలకు ధామ మనం దగుదక్షవాటి యిం
పారుసుఖోపవాసమని వచ్చితిఁ జెప్పఁగఁ జూచు వేడుకన్.
వ. విను మే నొక్క రాజపుత్రుండ నితండు మదీయమిత్రుం.
డొకకారణంబున వచ్చితి మిటకు నని తనవృత్తాంతంబుఁ జెప్పి,
నీవెవ్వరిదానవు నీపే రేమనినఁ దత్కాంతామణి సంతో
షించి యిట్లనియె. 104
చ. వలచితి వేను మాయలను వారగసేయఁగ నట్టిబా
సలున్ వడివడిఁజేసితేని యెడసేయరు పల్లవకోటిఁ జేరి య
గ్గలముగ మానమున్ ధనము గైకొని తక్కుదు రెంతవారికిన్,
వలువరు పాపపుంజములు వారవధూమణు లేమి చెప్పుదున్.105
గీ. ఒకరివద్దనుండి యొక్కట నొక్కని
కన్నుసన్నఁ జేసి కడురయమున
గవయ నొకనిమోహకార్యంబు లొక్కని
యెడల నిలుపుకొందు రింతు లెల్ల.106
గీ. ఎంత ప్రొద్దైన లంజవారింటి కెల్ల
ముందు వెల పంపకను బోవరాదు గాన
తరుణి యీవేళ మాచేత ధనము లేదు
యిందు జాణల కౌచిత్య మెఱుఁగవలయు. 107 .
వ. అదియునుంగాక కార్యార్థంబుగా వచ్చితి మింతియేగాని
యిచ్చోటికి వచ్చినవారముం గాము నీవు ప్రియంబుగూర్చి,
రమ్మనివచించెదవు మదీయప్రకారంబు వినుము భవదీయ
మందిరంబునకు వచ్చి సుగుణావతిం గలసి సుఖంబున నుండు
వాఁడ నింతియెకాని పచ్చపైకంబు నేను వెచ్చంబునకుం బెట్ట
సమర్థుండఁగాను. అదియునుంగాక యెంత ధనవంతుడు వచ్చిన
తన్ను నుపేక్షించిపోయిన మాకుంగాదు అప్పుడు విడుచుట
కంటె రాకయుండుటే లెస్స యీవిధంబంతయు మీ
యక్కకుం దెలియఁ జెప్పి రమ్ము పొమ్మనిన యక్కొమ్మ
యక్కమ్మవిల్తునిం వీడ్కొని సుగుణావతికడ కేగి యిట్లనియె.
చ. తరుణిరొ నీవు చెప్పిన విధం బటు తప్పదు పోయి చూచితిన్
ధరణితలంబులోన నతిధన్యుఁడు చక్కనివాడు వాఁడెపో
పురుషులలోన వాని సరిబోల్పను జెప్పను జూపరాదు బో
పరమవివేకసార యొకపాటి మనుష్యులఁ జూచి మెత్తువే.109
క. తనపేరు తగ మనోహరుఁ
డని చెప్పి యవంతినుండి యరిగితి మిటకున్
ఘన మగుసిరిగలయింటను
జనియించితి ననియె నతడు చందనగంధీ. 110
క. నీరూపును నీవయసును
నీరసికత్వమును పేరు నేరుపుమీఱన్
గారవమున మాయింటికి
రారమ్మని బిలువ నతడు రాఁ డెంతైనన్.111
వ. అని మఱియతం డాడినతెఱంగంతయు పూసగూర్చిన యట్లు
చెప్పిన నప్పొలతి మూర్ఛిల్లి యద్దూతికారత్నంబు చేయు
శిశిరోపచారంబులఁ గొంతదడవుకుం దెలిసి చెలియం జూచి
యిట్లనియె.112
శా. ఓకాంతామణి యింత చేసితిగదే యూహింప నీధాత్రిలో
నీకంటె గడునేర్ప రెందుఁ గలదే నిక్కంబు చర్చింపఁగా
నే కార్యంబును జేయలే కిటకు నీ వీలాగునన్ వచ్చితే
నాకాంతుం గొనినత్తు నీవనుచు నే నమ్ముంటి తేవైతివే.113
శ. తనకంటె రూపవంతుని
దనకంటెను కులమువాని ధైర్యాధికునిన్
వనజాక్షి, యిందుఁ బిల్చితె
గనుగొన ధన మెంతయైన గలలోనైనన్.114
వ. సకలపదార్థంబు మనయింటను గలదు తానేమియు నీ
వలదు కుబేరునంత ధనవంతుడువచ్చినను తన్ను విడువ నని
చెప్పిన నచ్చెలి నయ్యంగజుకడకుం బోయి యిట్లనియె. 115
ఉ. తప్పక నీవు చెప్పినవిధంబున సామజయానతోడుతన్
జెప్పితి నన్నియుం దడవు సేయక యింటికి నేగుదెంచి మా
కప్పురగంధి చేకొనుము కాదన నేటికి నన్నిమాటలన్
జెప్పెడి దేల రమ్ము గుణశేఖర నీప యెఱుంగు దారయన్.116
క. ఇంగిత మెఱుఁగరు జాజులు
మంగలమున వేచనేల మానిని దయతో
డం గలసి గారవింపుము
సంగతి మీఱంగ నీవ సంపద మాకున్.117
క. మదిరాక్షి నీదు నీవికి
మదిలో నాసింప దెపుడు మానితగుణసం
పద చాలఁ గలదు గృహమున
ముదమున రావయ్య నీవు మోహనమూర్తీ. 118
గీ. నిన్ను వేడుకఁ గూడిన నీరజాక్షి
యెంత యిచ్చిన పరవిటు నేల గలయుఁ
గోరి వెన్నెలఁ గ్రోలుచకోరములకు
బరగఁ దక్కినరుచు లెల్లఁ బథ్యమగునె.119
వ. అని యనేక ప్రకారంబుల నొడంబఱచు బోటిమాటలకు.
దుంటవిలుకాడు సమ్మతించి సుగుణావతియింటి కేతెంచి. 120
చ. ప్రకటితబంధసంగతులు వ్రాసినచొక్కపుమేలుకట్టులన్
సఖియల మంచముంఖరచు చల్లనిపువ్వులపాన్పు బ్రోదిరా
శుకములు వీణెయుం సురటి యున్న రసొంపుగగల్గి పైఁ డిజా
లకముల మేడమీదను విలాససమున్నతి నొప్పు మెప్పుగన్.121
సీ. పాయక కమలసంభవుకూతుఁ జెఱబట్ట
నేడ్తెఱ వెనువెంట నేగువిధము
జంభాసురారియు సంభ్రమంబున వచ్చి
గౌతమునిల్లాలిఁ గవయు తెఱఁగు
తనతపోవిధి మాని ఘనపరాశరమౌని
కణఁగి యోజనగంధిఁ గవయురీతి
చందురుండును సురాచార్యునిసతిఁ జూచి
యరసి మోహించినయట్టిరీతి
నసమనయనుఁడు దారువనాంతరమునఁ
గాంతలను భ్రమియించెడు వింతలాగు
గోపికలఁగృష్ణుఁడలయించు క్రొయ్యదనము.
మింట పొసపరినిండ చిత్రించినాడు.122
వ. ఇట్టిచిత్రంబుల నొప్పినఘనసారకుంకుమసంకుమదకస్తూరి
కాగరుగంధసారమిళితపరిమళభోగంబును వివిధవిటపకుసుము
వికసితసంవాసితంబును నగుమేలిమైనలోపల ప్రవేశించి.123
క. విరహభరంబున నెరియుచుఁ
బరవశమునఁ జిక్కి పువ్వుపానుపుమీదన్
బొరలెడుసుగుణావతి న
మ్మరుఁడు విశేషముగఁ గలసె మక్కువమీఱన్.124
ఉ. కాలములున్ బ్రమాణముల కందువులున్ దగ జాతివశ్యముల్,
మేలిమిచూపులు జతురపేశల బాహ్యరతిప్రసంగముల్,
చాలనెఱింగి కూడుసరసంబులసేఁతల నీడుజోడులై
వ్రాలి తనూతనప్రకటబంధవిశేషము లెల్లఁ జూపుచున్.125
చ. కలికితనంబు లుల్లసితకాంక్షలు నిండి తొలంగు టొక్కబా
గులతమకంబు లింపొదవఁ గూరిమి చాలఁగ బుట్టఁ జేసి నే
ర్పులకడలేనికూటముల పొందగు మాటల బుజ్జగింపుచున్
గలసి పెనంగి రొక్కటను గాంతుడు కాంత యనేకభంగులన్.126
చ. వెస గళనాదమున్ మెఱసి వేడుక గాఢములై చెలంగఁగా
పొసఁగినహృద్యవాద్యములపోల్కి నితంబభరంబునందు వె
క్కసముగఁగింకిణుల్ మెఱయఁగాంతునియూరుతదగ్రవేదికన్.
బసదళుకొత్త భావనవపాత్రగ నాడె విచిత్రలీలలన్. 127
గీ. సరసగతులను మోహంబు పెరుగురతుల
తత్తరింతల నెడ లేనితమకములను
బగలు రేయును దెలియ నేర్పఱుపరాక
మరునిసేఁతల నితరంబు మఱచె రతుల.128
క. నానావిధముల మోహము
నానాఁటికిఁ బొదలఁ బొదల నవరసగతుల
న్మానము ప్రాణము ధనమును
మీనాంకుని సొమ్ముఁ జేసి మెలఁతుక యుండెన్.129
వ. ఇవ్విధంబునసుగుణావతి దినదినంబునకున్ రుచి మచ్చిక పెరుగఁ
బచ్చవిల్తునిం ఘనంబుగఁ జూచి సుఖం బుండె నంత.130
ఉ. ఖండేందోదితజూటపన్నగగతి గ్రైవేయబాహాబలో
ద్దండప్రాభవసాహసోగ్రపటువేదండాసురేంద్రాత్మకా
ఖండిద్యూతభవామరార్చితలసత్కారుణ్యపాథోనిధీ
చండీశస్తవనీయదక్షనగరీశా యీశ భీమేశ్వరా.131
క. బాణారి బాణాసురగిరి
బాణాసన బాణవరద ఫాలాక్ష జగ
త్ప్రాణాసన కంకణనుత
పాణీశ నుతీశ భక్తవత్సల యీశా. 132
గద్య. ఇది శ్రీ వీరభద్రకరుణావిశేషమహితచారిత్ర తిప్పయా
మాత్యపుత్ర సరసజనవిధేయ నూతనకవి సూరయనామధేయ
ప్రణీతం బయినసకలజనాభిరామం బగుధనాభిరామం బను
మహాకావ్యంబునందు ద్వితీయాశ్వాసము సంపూర్ణము.
___________