Jump to content

ధనాభిరామము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

తృతీయాశ్వాసము

క. శ్రీమత్పర్వతపతిపు
   త్రీమహితాననసరోజదినకర వరసు
   త్రామచతురాస్యదాక్షా
   రామ శ్రీభీమనాథ రాజార్ధధరా. 1

క. విన నవధరింపు ధనధుం
   డనిమిషపతియొద్ద సభికు లందఱు వినఁగా
   మనసిజునితోడ నాడిన
   తవపరమగుప్రతినఁ దీర్ప ధరణికి వచ్చెన్. 2

సీ. మెరుఁగారుమువ్వన్నె మెఱయు బెబ్బులితోలు
           కటితటిదిండుగాఁ గప్పె నడుమ
    పద్మరాగప్రభాపటలంబు విలసిల్లు
          డంబైన వొడ్డియాణంబుఁ బెట్టి
    కర్పూరరజముతోఁ గలహించు నునుభూతి
          సర్వాంగములయందుఁ జాల నలఁది
    పొలుపొంద నవరత్నములకాంతి వెదజల్లు
          కుచ్చలగంతమైఁ గుదురుకొలిపి
    శిరము ముత్తెలవిరులును శింగినాద
    మమర వజ్రాలకామాక్షు లర్థిఁ దాల్చి
    నొసల కస్తూరిబొట్టిడి యెసఁగ యోగి
    రాజరూపంబుఁ దాల్చె నారాజరాజు. 3

గీ. క్రమముతోడుత నవనిధానములుఁ గదిసి
   శిష్యులై తన్ను సేవింపఁ జిత్రలీల
   నాదినాథుండు దా నైన యట్లు నిలిచె
   నేచి జను లెల్ల నంతంతఁ జూచి మ్రొక్క. 3

శా. సాక్షాద్బాలశశాంకమౌళి యని యాశ్చర్యంబుతో నందఱున్
    వీక్షింప న్నిధులోలి ఛాత్రగణమై వేమాఱు సేవింపఁగా
    యక్షాధీశ్వరుఁ డేఁగుదెంచె మది నత్యుక్తప్రయత్నంబుతో
    దాక్షారామను భాగసీమను మహోద్యన్ముక్తిసద్భావకున్. 4

చ. పరిఘలవగ్రసంఘముల భర్మ్యవినిర్మితసౌధవీథులన్
    విరచితగోపురావళుల విశ్రుతరత్న సుగేహపఙ్క్తులన్
    సరసతఁ జూడ నొప్పె సురనాథపురంబునఁ బోలఁజాలు బం
    ధురవరకామినీమణి వినూతనపేటికి దక్షవాటికిన్. 5

వ. అరుదెంచునపుడు. 6

సీ. క్రమమున బాలభారద్వాజములు వచ్చి
              చేరువపచ్చనిచెట్లవ్రాలె
    తొలఁగక చమదు...తునుమయసంబును
              యెడమదిక్కుననుండి కుడికి వచ్చె
    కలకల మని పక్షి గలిసి పై జేసెను
              కదిసి ముందర క్షేమకారి యాడె
    బాగొందఁ బూర్ణకుంభము లెదురుగా వచ్చె
             కల్యాణ మగుచోట గౌళి వలికె
    యేచి గణికాసమూహంబు లెదురు వచ్చె
    మంచిమాటలు వినవచ్చె మించి కెలన

    వెడల ననుకూలవాయువుల్ విసరె మీఁద
    మేటిధనదుండు శ్రీదక్షవాటి చొరఁగ. 7

వ. ఇట్లు దనకు నైన శుభసూచనంబు లగుశకునంబులం గనుం
    గొని తనకార్యంబు సఫలం బగుట తథ్యం బని మనంబున
    నిశ్చయించి శిష్యులుం దానును గుహ్యకేశ్వరుండు భీమేశ్వ
    రునగరు కేతెంచి. 8

సీ. పొలుపొంద నెలనెలఁ బూచి వెన్నెలచల్లు
              చిన్నిపువ్వులఁ దాల్చువన్నెకాని
    మెరవడి కమ్మ తెమ్మెరతావి మెఱుగెక్కు
              వడగల తొడవుల తొడవువాని
    మురియుచుంగులు దీర్చి మువ్వన్నె నునుఁదోలు
             గప్పుపుట్టము మొలఁ గట్టువాని
    వడఁకు గుబ్బలరాచవారిముద్దులపట్టి
            సామేన నిడుకొన్న బూమెకాని
    యేచి తెల్లనిగిబ్బపై నేఁగువాని
    బొసఁగ ముమ్మొన కైదువ పూనువాని
    మించి యెందును దానయై మెలఁగువాని
    వేలుపుల కెల్లఁ బెద్దయై వెలుఁగువాని. 9

ఉ. సాని చకోరలోచనల చక్కనివట్రువగుబ్బచన్నులన్
     మీనపతాకముద్రలు సమేళముగాఁ జిలికించి మించి యా
     పూనినవేడ్కలం బొదలుచుండెడి వేడుక కాని దక్షవా
    టీనిలయున్ సితాంబుజపటీరశుభాంగుని భీమనాథునిన్ . 10

వ. భక్తిపూర్వకంబుగా దర్శించి యద్దేవుని యనర్ఘ్యమణిని
    కరంబులం బూజించి గంధపుష్పనైవేద్యషోడశోపచారంబు

     లాచరించి హస్తకమలంబులు మొగిచి నిటలతటంబున ఘటి
    యించి యిట్లని స్తుతియించె. 11

          జయజయ సకలసురాసురపూజితపాదారవింద భవ
    దమలంకృత దివ్యదేహ, దేహజదర్బాంధకారోగ్రచండ
    మార్తాండా, తాండవక్రీడా సముద్దండ విభ్రమభ్రమణ
    చకిత సకలదిశాచక్ర చక్రధర నయనాంబుజ పూజిత పాద
    పంకజాత, జాతివృద్ధి క్షయాదిరహిత ప్రభావభాసురనిత్య
    కల్యాణ ధాత్రీధర చటులకోదండదండధరోద్రేకభుజబలా
    టోపసంహార హారఘనసారనీహారపటీరమందార హీరడిండీర
    మందార మందారవర్ణ వర్ణిత వేదవేదాంతశాస్త్రాగమపురా
    ణేతిహాస సముదయావలోకన శిక్షితభక్తలోక లోకలోచన
    సుధాంశు ధనంజయనేత్ర నేత్రానలభస్మీకృతపంచబాణ,
    బాణాసురపూజిత, జితపురత్రయీశ చతురగంధర్వా
    గంధర్వగానామృతానూనవిభవ భవకంజాతసంఘాత గంధ
    సింధూర సింధూరవిమలచర్మాంబరా...కనదిమకుటశోభిత
    విశేష శేషపతి మదిమలయ లయకాలమూర్తి ప్రభావి
    భాసిత సితకిరణదశదిశ కిరణిధరణిజల గగనహుతవహపవ
    నాత్మజవిలసితాష్టమూర్తిప్రభావ భావనాతీత యతీతా
    నాగతవర్తమాన జ్ఞానావధాన యవధానాశివంధ్యం నత
    త్వరహస్య పరమయోగీంద్ర హృత్పద్మ కర్ణికామధ్యనివాస
    వాసవైశ్వానరవైవస్వతవాసవారివనధీశ వాయువై
    శ్రవణి ప్రముఖదిక్పాలక నిరంతరసేవిత నిఖిలైశ్వర్య మూల
    స్తంభ సంభోద్భవ మహత్వమహిమాద్యంతరహిత హిత
    భక్తజనమందార దారువనస్థాన మునిజనకామినీమనో

   విభ్రాంతకారణ దిగంబరాకారసంచార చారుతరశృంగార
   శృంగారాది నవరసాలంకారదివ్యావతార తారకాధీశ్వర
   శకాధర ధరాధరకన్యకాముఖకమలభృంగ భృంగీశపటు నట
   క్రీడావినోదసంతుష్టచతుర చతురవిహీనదక్షసవనక్రియా
   సంహారదక్ష దక్షపురీశ్వరా యీశ్వరా మహాదేవా దేవాది
   హృధ్భీమా భీమేశ్వర యీశ నమస్తే నమస్తే నమః.12

ఉత్సాహ.--
   సామగానలోలగజనిశాటదుర్మదాంతకా
   సామజాస్యజనక! ఫాలచంద్రజూటశంకరా
   కామితార్థఫలదచారుకాద్రవేయహారసు
   త్రామవినుత రజతశిఖరిధామ భీమలింగమా! 13

వ. అని స్తుతియించి యా దేవుని నైవేద్యంబునకు సువర్ణనిష్కం
   బులు నూరుపూజరులం బిలిచి యిప్పించి యక్కడఁ గదలి
   వచ్చి రంగమధ్యంబునం గూర్చుండి. 14

గీ. ఘనత భీమేశ్వరునిసమ్ముఖంబునందు
   నాట్య మతిచిత్రముగ నాడునలినముఖుల
   కెల్ల మణిభూషణములు శోభిల్ల దివ్య
   వస్త్రములు నిచ్చె నచ్చోటివారు భ్రమయ. 15

క. మేలిమిఁ గని జూచెడునటు
   సోలుచుఁ దనలోన మిగులఁ జొక్కుచు జోగి
   మేళము వారికి నెల్లను
   జాలఁగ ముడిగట్టి ధనము చాలఁగ నిచ్చెన్. 16
[1]

క. అదిగాక భీమనాథుని
   వదలక కొలుచున్నవారవనితల కెల్లన్
   ముదముగఁ జీరలు సొమ్ములు
   వెదజల్లినరీతి నిచ్చె విస్మయ మొదవన్. 17

వ. అక్కడఁ గొంతతడ వుండి భీమేశ్వరునిముఖమంటపంబునకు
   నేతేర ముందర శిష్యులు గొందఱు రయంబునం జని నవనీ
   హారవాఃపూరంబులు చిలికించి మృగనాభిపంకంబున సమ్మార్జ
   నంబుచేసి కెలంకుల మణిరంగవల్లికలు దీర్చి రత్నకంబళంబులు
   పరచి హంసతూలికావిరచితంబులగు వెలిపట్టువొరగు నిలిపి,
   చిత్రాంశుకంబులు మేలుకట్లు గట్టినతత్ప్రదేశంబున కేతెంచి
   సుఖాసీనుఁడై యుండె నప్పుడు. 18

గీ. ఇతఁడె మనపాలిభీమేశుఁ డిన్ని యేల
   యనుచు వెనువెంట నేతెంచి రాదరమునఁ
   గోరి యాదేవదేవునిఁ గొలిచియున్న
   సానిరమణులు భోగముజలజముఖులు. 19

క. బాగుగఁ గడువాసించిన
   బాగాలునుఁ దెల్లగానుఁ బండినయాకుల్
   ప్రోగులుగఁ బోసి వలసిన
   లాగున వీడెములు వెట్టు లక్షలు వెలయున్. 20

వ. అప్పుడు దక్షవాటికాపురంబున గలజనంబులు మహాద్భుతా
   నందచేతస్కులై యాతని నాలోకించి. 21

సీ. నిటలాంబకముచేతి నిశితశూలము దాఁచి
             జగతి కేతెంచినశంభుఁడొక్కొ

    గరుడవాహనము శంఖముఁ జక్రము దొఱంగి
             వినువీథి విహరించువిష్ణుఁ డొక్కొ
    జిగిమించు నాలుగుమొగములు దొలఁగించి
             యీరీతి నున్న వాగీశుఁ డొక్కొ
    కనుపట్టు తనవేయుగన్నులు నడఁచి యీ
             నటన దాల్చినసురనాథుఁ డొక్కొ[2]
    నిట్టి యైశ్వర్యమహిమయు నిట్టి సిరియు
    నిట్టి చాతుర్యబుద్ధియు నిట్టి విభవ
    మిట్టి తేజంబు నరులకు నేల కలుగు
    మనల రక్షింప వచ్చినమాయగాక. 22

చ. తనరినసిద్ధముఖ్యులు ముదంబున దగ్గఱి శిష్యసంఘమై
    తను నిరువంకలం గదిసి తద్దయుఁ గొల్వఁగ నాదినాథుఁ డీ
    యనువున ధారుణీవలయ మక్కట చూడఁగవచ్చెఁ గాన యం
    దును మఱియూరజోగులకుఁ దోరపుటీమహి మేల కల్గెడున్. 23

వ. అని సకలజనంబులుం గొనియాడుచుండ నంత. 24

చ. కలువలు నిక్క దమ్ములమొగంబులు ముచ్చ ముడుంగ, నింగి జు
    క్కలు మొనకట్ట మొత్తములు గట్ట విహంగమపఙ్తి నిద్దమున్
    నెలకొని చారుకోకముల నెమ్మనముల్ వెగడొంద నన్నిది
    క్కులఁ దమసంబు వర్వ రవి గ్రుంకెను పశ్చిమదిక్తటంబునన్. 25

వ. ఆలోన. 26

చ. తపసికిఁ గంటిపాప, కుముదంబులజీవనరక్ష, పెద్దవే
    లుపుతలపువ్వు, మేలిసురలోకము పాలిటి బువ్వ, లచ్చితో
    రపుసయిదోడు, చుక్కలకు రాజు మనోజుని మేనమామ,నాఁ
    గ పసఁ దొలంక చందురుఁడు గానఁగవచ్చెను పూర్వదిక్కునన్. 27

వ. సిద్ధుం డారాత్రి పురంబులోనం గలవిద్యలవారినెల్ల
   రావించి వివిధవస్తువ్రాతంబులఁ బ్రీతులం జేసియుండెనంత. 28

చ. మనసిజుఁ డోడు నింక ననుమానము లేదని చాటురీతీ మే
    దిని విహగవ్రజంబు నలుదిక్కులఁ గూయఁగ నన్యతేజముల్
    పొనుఁగుపడంగ నెంతయును బొందుగ నిండి వెలుంగువేడ్కతో
    నినుఁ డుదయాచలంబు తుద యెక్కి జగంబులు చూచి మ్రొక్కఁగన్. 29

వ. ఇట్లు సూర్యోదయం బగుటయు సిద్ధవరుండు సముచిత
   క్రియలు దీర్చి శిష్యులు సేవింప నుండె నప్పుడు. 30

ఉ. చూతములందు సిద్ధుని విశుద్ధచరిత్రుని బుణ్యవర్తనున్
     వీతసమస్తకల్మషుని విశ్రుతవైభవుఁ డంచు నందఱున్
     గౌతుక మొప్ప నిష్ట మగుకానుక లెల్లనుఁ గొంచువచ్చి సం
     ప్రీతి సమర్పణంబు లొనరింపుచు వేడుకనుండి రక్కడన్. 31

వ. మఱియు నప్పుడు. 32

సీ. వడి నాలుబిడ్డల విడిచివచ్చిన విటుల్
             ద్రిమ్మరులై భూమిఁ దిరుగువిటులు
    కులశీలవర్తనంబులఁ బాసినవిటులు
            వెస లంజసందులు వెదకువిటులు
    చెడి గుళ్లపంచలు చేరియుండెడువిటుల్
            పలుకకుండినఁ బోని పందవిటులు

    కలహంబె బ్రతుకుగాఁ గాలుదువ్వెడివిటుల్
             చేరి యాసలఁ బని సేయువిటులు
    వెళ్లి పోలేక మోములు వ్రేల్చు విటులు
    నింటి చుట్టునుఁ దిరుగాడు గొంటువిటులు
    [3]బాస లిచ్చినతెర ధూపార్తివిటులు (?)
    మొదలుగాఁగల విటులెల్ల ముద మెలర్ప. 33

వ. చనుదెంచి సద్వినయభయభక్తిపూర్వకముగా సాష్టాంగ
   దండప్రణామంబు లాచరించి నిలచినఁ జూచి సిద్ధముఖ్యుఁడు
   వారలతారతమ్యంబులకుఁ దగినవిత్తంబు లొసంగినఁ జేరి
   సేవచేయుచుండి రంత. 34

క. అనువుగ నతనిమహత్త్వము
   విని నానాజాతిఁ గల్గువేశ్యలు మోదం
   బున వచ్చి మ్రొక్కి నిల్చినఁ
   గనుఁగొని సిద్ధుండు వారిఁ గరుణాదృష్టిన్. 35

సీ. కమ్మలు పచ్చలకడియాలజోళ్లును
            పతకంబు మొలనూలు బాహుపురులు
   పుంజాలదండలు పూదెలకడియాలు
            ముంగరల్ రాకట్టునుంగరములు
   ముత్యాలపేరులు మొలనూళ్లు డోరీలు
            కుంటెనల్ నీలాలకంటసరులు
   ముంగామురంబులు మొగపులతీఁగెలు
           సందులదండలు సరపణులును

    బసిఁడియెత్తులు నేవళా ల్బన్నసరులు
    చేరుబొట్లును తాళీలు చెవులపువులు
    కదలుమట్టెలు పిల్లాండ్లు మొదలుగాను
    బుడమి వెలసిననవరత్నభూషణములు. 36

సీ. వెల్లలు నీటంచు వెలిపముల్ కరకంచు
            పట్లును జిబులును పదకడములు
    మంజిష్ఠుకిముకముల్ మాదావళంబులు
           కర్పూరవన్నెలు ముత్తెసరులు(?)
    తోఁపులు బిరనెతులు గజపొప్పళ్లు
           వ్రాఁతలు పతినిలురాయగళులు
    జాళిలు చెరఁగులు సామంతవిధులును
           కావులు దసలిలు ఖండసరులు
    సర్వశృంగారములు చిర్తచౌకములును
    చిన్న కస్తూరిమళ్లును. ..లుకచారు
    వన్నియలు మంచిబొమ్మంచువన్నియలును
    మొదలుగాఁ గలచీరలు ముదమెలర్ప. 37

గీ. అగురుగంధము పన్నీరు మృగమదంబు
    పునుఁగుఁ గుంకుమ పచ్చకప్పురము చాఁదు
    గోవ జవ్వాది మొదలుగాఁ గోరి కలర
    పరిమళద్రవ్యములు వెట్టి బంధురముగ. 38

గీ. అర్థి నేతెంచి తను వేడినట్టివారి
    కెల్ల వలసిన వెల్లను గొల్లలుగను
    యిచ్చి యందరిమనసుల మెచ్చఁజేసి
    తనమహత్త్వంబు చూపె నాధనదవిభుఁడు. 39

వ. ఇవ్విధంబున తనధనంబుచేతఁ బురంబునం గలజనంబులం దన
   వశ్యంబు చేసికొని మహామహిమతోనుండ సుగుణావతియొద్ది
   దాసి యొక్కతె యక్కడికివచ్చి చూచి యివ్విధం బంతయు
   దనయక్కకుఁజెప్పెదఁగాక యని రయంబున నేతెంచి సుగుణా
   వతి తల్లి యగువిటరంపముతోడ నిట్లనియె. 40

ఉ. చెచ్చెర నీకు నేమనుచుఁ జెప్పుదు సిద్ధు డొకండు నూరికిన్
    వచ్చి వినూత్నరత్నవరవర్ణితభూషణదివ్యమూర్తియై
    మచ్చిక భీమనాథుముఖమంటపసీమ వసించి చూడఁగా
    వచ్చినవారి కెల్లను నవారితవస్తువు లిచ్చు మెచ్చుగన్. 41

చ. వదలక సిద్ధుఁ డెంత ధనవంతుఁడొ నీవటువచ్చి చూడు మా
    యెది మనవాడసానులకు నెల్లను దివ్యసుగంధవస్తువుల్
    పదకము లాదిగాఁ గలుగుభాసురరత్న విభూషణాదు లిం
    పొదవఁగ నిచ్చెఁ జేరి వినయోన్నతి నందఱు భక్తిసేయఁగన్. 42

క. పురి గలవారాంగనలం
   దరుదుగ విటసంఘములకు ననురాగముతో
   వరరత్నభూషణాంబర
   పరిమళసంచయము లొసఁగె బంధురలీలన్. 43

క. అతిముదమున మనసుగుణా
   వతిఁ జూచిన మిగుల మెచ్చి వరరత్నసమం
   చితభూషణాదు లిచ్చును
   హితమతి మన్నించు సిద్ధుఁ డిందఱికంటెన్. 44

వ. అనిన విని యత్యద్భుతాక్రాంతచిత్తయై కువిట విషవల్లి
   యగు లంజతల్లి క్షణంబును నచట నిలువఁ దాలిమిలేక
   వేదనం బొరలి యేవిధంబుననైన నతనిం దమగృహంబునకుం

   దెచ్చి యల్లునిం జేసికొని సకలధనంబులనుం గొందునని
   దాసియుందానును సిద్ధునిం డాసి దండప్రణామంబు చేసినం
   జూచి యాతండు వారికిం దగినవస్త్రభూషణంబు లొసఁగిన
   నవ్విటరంపంబు పునఃపునఃప్రణామంబు లాచరించి హస్తం
   బులు మోడ్చి యిట్లనియె. 45

సీ. ఇల జాణ లగువారు నీదక్షవాటికి
            వత్తు రేఁ జూడనివారు లేదు
    యీరాజసక్రియ యీవైభవస్ఫూర్తి
            యీదానగుణము మరెవ్వ రందు
    కని యెఱుంగము వినియును నేమెఱుంగము
            జెప్పఁ జిత్రము మీవిశేషమహిమ
    ధర్మాత్ముఁడవు భవద్దర్శనంబునఁ జేసి
            యందఱు జాలఁ గృతార్థులైరి
    చేర నీసేవ సత్తుగాఁ జేయునట్టి
    వారలకు నెల్ల ఘన మైనవైభవములు
    రూఢి మాపాలిభీమేశ్వరుండ వీవె
    శ్రీకరోన్నతగుణధుర్య! సిద్ధవర్య! 46

క. విచ్చేయుఁడు మాయింటికి
   చెచ్చెర నీవేళ భిక్ష సేయఁగవలయున్
   మెచ్చుగ శిష్యులు మీరును
   సచ్చరితానందవిభవచాతుర్యనిధీ! 47

వ. అనిన సిద్ధపుంగవుం డిట్లనియె. 48

చ. తలకొని వేడ్కతో నవనిధానములుం దనయొద్ద నెప్పుడున్
    గల వదిగాక శిష్యులముఖంబున వచ్చుసమస్తవస్తువుల్

    పిలచిన నెవ్వ రింటికిని భిక్షకుఁ బోము ప్రియంబుతోడుతన్
    పిలిచితి గాన వచ్చెదము పేరును మీచరితంబుఁ జెప్పుమా.

వ. అనిన విటరంపంబు నిట్లనియె. 50

మ. కమనీయంబుగ నాడఁ బాడఁ జదువంగా నేర్పు వీణాదివా
     ద్యముల న్నైపుణిసొంపు నింపఁగఁ గళాస్థానాంశుతంత్రంబులన్
     సుమనస్ఫూర్తిమనోజకేళి విటులం జొక్కింపంగా నేర్చు వి
     భ్రమసౌందర్యములందు చాల సరిచెప్పన్ లేరు నాపుత్రికిన్. 51

వ. మీ రిచ్చోటికి విచ్చేయు టెఱుంగదు, ఇంతకు దేవర
   చిత్తంబు రా సేవ సేయ నేర్చునని తనకులస్థానపౌరుషంబులు
   కూఁతురు వినయవిద్యావిభోగరూపాతిశయంబులు ప్రియం
   బున విన్నవింపఁ దరహసితవదనుండై యిట్లనియె. 52

చ. పనివడి నీవు మమ్ము భయభక్తిని రమ్మని పిల్వ రాకమా
    నిన క్రియగాదు వచ్చెదము నేఁటికి తప్పదుగాని వారకా
    మినులనివాసదేశములు మేలివిటాలికిఁ దానకంబుచే
    కొని యొకఁడున్న నచ్చటికిఁ గూళతనం బనఁగాదె వచ్చినన్. 53

వ. అనిన విటరంపం బిట్లనియె. 54

ఉ. ఇంతను మాన మేమిటికి నిచ్చ మదీయగృహాంతరంబులో
    నెంతటివానికి న్నిలువ నెట్లగు నామది నెంచలేకయే
    రంతును జేయవచ్చు విటరంపము ముందర నెన్న నేఁటికిన్
    గంతునినైన నుద్దవిడి గాసిలఁబె ట్టిలు వెళ్లఁగొట్టెదన్. 55

వ. అనిన యట్లకాక యని సుగుణావతికి నవరత్నభూషణాంబర
   సుగంధపుష్పతాంబూలాదు లొసంగి వచ్చెదంగాని ముంద
   రం బదమన్న నతనియొద్ద తనదాసింబెట్టి ముదంబున నరిగి

   తదీయనివాసంబు నలంకరించి నతనిరాక కెదురుచూచు
   చుండె ఇట సిద్ధుండు తన్ను సేవింప వచ్చినసకలజనంబుల
   యథోచితప్రకారంబుల వీడ్కొలిపి శిష్యులు గొలిచి
   రా నేగుదెంచిన సుగుణావతితల్లి యత్యంతసంతోషంబున
   నెదుర్కొని పసిండికలశంబుల నుదకంబు దెచ్చి పాదంబులు
   కడిగి సౌధాగ్రభాగంబున మణిపీఠంబు నునిచి. 56

ఉ. అల్లుఁడు వచ్చె వీఁడె మనయక్కర లెల్లను దీఱె రండు మీ
    రెల్లను మ్రొక్కుడంచుఁ దమయింటంగలందఱఁ దెచ్చి చూపినన్
    సల్లలితాంబరాది మణిచారు విభూషణదివ్యగంధముల్
    కొల్లలుగాఁగ నిచ్చె నివె కొండని సిద్ధవరేణ్యుఁ డింపునన్. 57

వ. అప్పుడు 58

గీ. పసిమి గలక్రొత్తయిప్పపూరసముఁ దిగిచి
    ఖండశర్కరతోఁగూడ వండి మిగుల
    మేలికర్పూరరజముతో మిళితమైన
    మంచిసారాయి రయమునఁ గొంచు వచ్చి. 59

వ. ఇచ్చిన నతండు ననర్ఘ్యమణినికరస్థాపితం బగుకొప్పెరఁబట్టి
    యాస్వాదించి లెస్సగాదని పారజల్లిన నాచిప్పయుం దొలంగ
    వైచినం బుచ్చికొని లక్షనిష్కంబులు దీనికి వెలగాదని
    యతని యౌదార్యగుణంబులు గొనియాడుచుండ సిద్ధుండు
    దాని కిట్లనియె. 60

క. జగతిఁ గలవిద్యలన్నియు
   నగణితముగ నేర్చు ననుచు ననురాగముతోఁ

    బొగడితి వెక్కడ కేఁగెను
    సుగుణావతిఁ దెమ్ము మాకుఁ జూడఁగవలయున్ . 61

క. అనిన విటరంపమును సి
   ద్ధునిపాదంబులకు మ్రొక్కి తొయ్యలి నిదె దో
   డ్కొని తెత్తు లోన నున్నది
   యని కదలె విడంబనంబు నంతయు మెఱవన్. 62

సీ. వాడుఁబువ్వులుఁ బెట్టి కూడదువ్వినయట్టి
             చింపిజుంజురుగొప్పు చెంప వ్రేల
    నీరెండగన్నుల నిండి కాటుకజూలు
             నూడు రెప్పలవెంట నొడ్డగిలఁగ
    విచ్చుటాkgలఁ బెట్టి విరివిగాఁ జేర్చిన
            చెవులు భుజంబులం జేరి వ్రేల
    సమ్మతంబుగ సంబికమ్మపాదంబుల
            నలరిన పేరులు నఱుతఁ గ్రాల
    రమణ మీఱఁగఁ జిరుతచౌకములు ముదుగుఁ
    దొగరుఁ బుట్టంబు కటితటిఁ దొంగలింప
    మద్యపానంబునను మేను మఱచి మఱవ
    నట్టి నటనల విటరంప మరుగుదెంచె. 63

చ. పనివడి యెండమావులనుఁ బట్ట వడిన్ వడఁగండ్ల గుళ్లు గ
    ట్టను గలి వెన్న దీయను విడంబముతోడుతనింద్రజాలముల్

    గొనకొని పన్నమంచు వగఁగుంచమునం గొలువంగఁ జట్టురా
    తను మరినార వల్వను ముదంబున నేర్పరి యెన్నిచూడఁగన్. 64

[4]వ. ఇట్లు చనుదెంచి చేతోజాతచాతుర్యనూత్నలావణ్య
    మధురామృతపయోధివీచికాసముదయంబులం బ్రియంబులం
    దేలుచు సోలి పారవశ్యంబునం బొందియున్న సుగుణావతిం
    జూచి యిట్లనియె. 65

క. మనసున మీరున్నారా
   యని చూడవు నిట్టివారి నక్కట చెలులన్
   ఘనమతి మన్నింపవు కై
   కొన వీతని వలలఁ జిక్కి కువలయనేత్రీ! 66

మ. విను బాలామణి! యేమి చెప్పుదు జగద్విఖ్యాతిగా శిష్యు లే
   పున సేవింపగ సిద్ధుఁడొక్కరుఁడు సొంపుల్‌ మీఱ నీయూరికిన్
   చనుదెం చిప్పుడు రత్నభూషణతతుల్ చాలంగ వారాంగనా
   జనసంఘాతవిటాలి కిచ్చె మది నుత్సాహంబు సంధిల్లఁగన్. 67

క. మనవాడవనిత లందఱుఁ
   గనకాంబరమణిసుగంధఘనవస్తువులన్
   దనిసిరి మఱి నీవొక్కతె
   వును దక్క పురంబులోన నుత్పలనేత్రీ! 68

వ. ఏ నచ్చటికిఁ జూడంబోయిన మన్నించిన వస్తుసంచయంబు
   చూడు మివే యని ముందరం బెట్టి సిద్ధముఖ్యుండు మననిల

   యంబున కేతెంచి యింటిమొగసాలవసియించి యున్నవాఁడు
   చూచివత్తువుగాక రమ్మనినఁ దల్లికి సుగుణావతి యిట్లనియె. 69

ఉ. ఏలవినూత్నరత్నచయ మేల సుగంధవిశేషవస్తువుల్
    చాలవె యింట నున్నమణి జాలసముజ్జ్వల భూషణావళుల్
    పోలఁగ వీనితోటి రతిఁ బోల సమున్నతి యెన్ని చూడఁగాఁ
    గేళి యొనర్చు జోగులను గిట్టరు చెప్పకు తల్లి మ్రొక్కెదన్. 70

ఉ. ఈగతి మాయ సేయుచును నెప్పుడు యక్షిణిచేత వస్తువుల్
    ప్రోగులుగాఁగఁబెట్టుదురు పోలవు చూచిన విద్యలన్నియున్
    బాగులు గావు యేటికివి పట్టనుఁ బెట్టను డాఁచవచ్చునే
    జోగుల కిట్టిరత్నములు సొమ్ములుఁ గల్గునె ధారుణీస్థలిన్.71

చ. పలుకులు వేయు నేమిటికిఁ బాయఁగఁజాలను తల్లి వీనికౌఁ
    గిలి మహనీయచారుమణికీలితభూషణరత్నపంఙ్త్కితో
    వెల యగునాతఁ డిచ్చుపదివేలును వచ్చెను పోయి యిప్పుడే
    చెలువుగ భిక్ష చేసి తగ సిద్ధుని నంపుము చాలు నన్నియున్. 72

వ. అనిన తల్లితో నాడుచుండుసమయంబున సిద్ధవరేణ్యుఁ డ
    పూర్వ మణిభూషణాంబరంబులు సుగంధాదివస్తువులు
    పుత్తెంచిన నవియును సుగుణావతిముందటం బెట్టి యిట్లనియె. 73

ఉ. కోకిలవాణి నీకు నివె కొమ్మని పంపెను సిద్ధముఖ్యుఁ డీ
    కోకలు భూషణంబులును కోరినమంచిసుగంధవస్తువుల్
    కైకొని పెట్టుదేహమునఁ గాదని నేటికి వెఱ్ఱి జిడ్డ! యీ
    పోకలఁ బోవనేల విను పొందుగ నీకును బుద్ధి చెప్పెదన్ 74

ఉ. తేటల మాట లాడి, తరితీపులు చేసి, విటాలిఁ గూడి యె
    చ్చోటికిఁ బోవనీక తన సొమ్ముగఁ గైకొని యెల్లసంపదల్
    వాటముగా గణించి తనవారలఁ బ్రోచుట కీర్తిగాక యే
    పాటను వారకాంతలకుఁ బంతముగా నొకనొద్దఁ జిక్కినన్. 75

చ. చిలుకలఁ బావురంబులను చింకల హంసల చక్రయుగ్మముల్
    వెలివెలు నాదిగాఁ గలుగువింతగుపుల్గులఁ బెంచి మిక్కిలిన్
    గలుగఁగఁజేసి పెంచుటలు కన్నులఁ గానక వీనికిన్ వృథా
    వలచుట కా సువర్ణమణివర్గము లందుట గాక కోమలీ. 76

ఉ. నాయకి నెమ్మి నీ వనుదినంబు ఘటింపక విత్తమబ్బు నే
    ప్రాయము రూపసంపదయు భవ్యసమున్నతిదేహకాంతియున్
    బోయినయంతమీఁదమఱిపోఁకయుఁబుట్టదువారకాంతకున్
    వేయునుఁ జెప్ప నేమిటికి వేగన సిద్ధునిఁ జూడు భామినీ. 77

క. ఇటు నీకు వలచి తిరిగెడు
   విటసంఘము లెల్లఁ గూడి విని మది నవ్వన్
   కటకట! వలచితి వేటికి
   కుటిలాలక కులములోనఁ గొఱఁతలు సుమ్మీ. 78

క. నేరుపుతో నౌఁగాదను
   వారెవ్వరు లేరు వారవనితల కెల్లన్
   ధారుణిఁ దల్లులె గర్తలు
   వారింపను బుద్ధి చెప్ప వనరుహనేత్రీ. 79

క. నీతోడికామినీమణు
   లాతతమతితో గడింప నచటికిఁ జని వి
   ఖ్యాతిగఁ గన్గొని తెలియుమ
   యీతెఱఁగున వలచినారె యిందునిభాస్యా. 80

వ. అని యనేకకప్రకారంబుల హేతుదృష్టాంతంబులు చూపి
    చెప్పిన నప్పొలంతి మనసు దిరుగంబడి సిద్ధుఁ జూచు వేడ్కఁ
    దగిలి తదీయభూషణంబులు దాల్చి యిట్లనియె. 81

చ. అరుదుగఁ దల్లి వచ్చి మన కద్భుత మందఁగఁ జెప్పినట్టి యా
    పురుషుని సిద్ధపుంగవునిఁ బొందు దలిర్పఁగఁ జూచి వత్తు నా
    వరమతి నీపురిం గలుగువారలు పూజలు సేయనొప్పఁ దా
    నిరవుగ వచ్చినాఁడు మనయింటికి నిప్పుడు భిక్ష సేయఁగన్. 82

వ. అనినఁ జేతోజూతుం డాయింతిమొగంబు చూచి వీక్షించి
    యిట్లనియె. 83

చ. భవముల కాలయంబులు, కృపామతిహీనులు, దుష్టవర్తనల్
    సువినయమార్గవర్జితులు, నూనృతదూరులు, సాహసోదయుల్
    భువిఁ గలయెల్లమాయలకు బుట్టినయిండ్లవి చూడ నద్దిరా
    శివశివ వారకాంతలను జేరిన దోసము గాదె యెప్పుడున్. 84

చ. అనువుగ దక్షువాటి నహహా! చెలి మిక్కిలి జాణవంచు స
    జ్జనవిటసంఘముల్ మిగుల సన్నుతి సేయఁగ నిందు వారకా
    మినుల మఱెవ్వరిన్ మదిని మెచ్చఁగ నిన్నుగుఱించి చూడ వ
    చ్చినపస దక్కి కూళపని సేసితి నీవ యెఱుంగు దన్నియున్. 85

చ. ఇరవొకయింతలేక ధనమిచ్చి వరించిన నీక యుండినన్
    సరసత మీఱ నొక్కనివసంబుననుండి ధనంబు చూచి తా
    నొరుకడ కేఁగఁ జూచి తిది యొచ్చెముగాదె యెఱుంగ నేర్చినన్
    దరుణిరొ వారకామినికి ధారుణిలో వివరించి చూచినన్. 86

చ. విను నీవుండినయంతగాలమును నే వేవేలు దెచ్చిచ్చినన్
    ధననాథుం డరుదెంచెనేని పిలువం దథ్యంబు రమ్మంచు నన్
    గొనుచు న్వచ్చిట నీవు ధనమున్ యాసించి పోఁజూచెదే(?)
    మనువాడ న్నిను వారకాంతలకు సత్యం బెద్ది లోకంబునన్. 87

క. అతులనవరూపవిద్యా
   చతురత్వము చూడవైతి జలజానన స
   మ్మతి మీఱ ధనముఁ జూచితి
   క్షితి వారాంగనల నెందుఁ జేరఁగఁ బాసెన్. 88

క. సుగుణ వనుకొందు మఱి నీ
   సుగుణత్వము విడిచి జోగిఁ జూడఁగఁ జనుటే
   సుగుణితన మెన్న నేటికి
   సుగుణావతి సుగుణతనము చూచితి మిచటన్. 89

వ. అనిన విని మారుమాటాడం జూలక సుగుణావతి యూర
    కుండిన నధికకోపావేశంబున లేచి సకలపాతకజాత యగు
    లంజమాత యిట్లనియె. 90

ఉ. పల్లవకోటిచే సకలభాగ్యములుం గొనితెచ్చి పెట్టి యి
    ల్లెల్లనుఁ బ్రోచుబిడ్డను మరెక్కడ వెళ్లఁగ నీక కూడి రం

    పిల్లఁగ మాయసేసి వలపించితి బాలకిఁ బిల్వవచ్చినన్
    మల్లు లెసంగఁజూచెదవు మానుషమే యిది మాకుఁ జెప్పుమా. 91

ఉ. మందులమాయలన్ జెనటిమంత్రములందగఁగూర్చిభూమిలో
    నెందఱియొద్ద నీ భ్రమల నేర్పడఁ బెట్టితి వారు చాల రీ
    సుందరి వెఱ్ఱిఁ గొల్పి యిలుచూఱగఁ దింటివి యీగిలేదు నీ
    పొందులు గట్టిపెట్టి వెడపోకలు మాని తొలంగు వేగనన్. 92

చ. పటువగు నీదురూపమును బ్రాయము నేర్పును మేలువిద్యలున్
    సటవెట మాకు నేల మణిజాలములో కనకాంబరాదు లో
    నటనలు సేసి పోయెదవు నాకడఁ జెల్లవు కట్టిపెట్టి మీ
    కటకట లంజపెట్టుభువిఁగల్దె యెఱుంగవుగాక యేమియున్.93

ఉ. పెట్టినవాఁడవో సతికిఁ బ్రేమతొ సొమ్ములు చాలఁ దెచ్చి చే
    పట్టినవాఁడవో పనులపట్టున నాపద లెల్ల మాన్చి ఛీ
    రట్టున కోడ వేమియును రా దొకపైకము చాలుఁజాలు నీ
    పట్టువు దోతొలంగు విటపంతముగా దిట నుండ మిండఁడా! 94

వ. అని నిష్ఠురభాషణంబుల నతనిమనంబును దూరంబలికి
    సుగుణావతి నచ్చోటువాపి సిద్ధునిసమ్ముఖంబునకుఁ దెచ్చె నట
    మరుండును మనంబున లజ్జించి దాని యిల్లువెడలి తనలోన. 95

ఉ. ఎన్నడు లేనియింద్రుసభ కేటికిఁ బోయితిఁ బోయి యందులో
    నున్నతబుద్ధినై కలసియుండఁగ నేరక వచ్చి యూరకే
    కిన్నరనాథుతోడఁ దమకించి యదేల ప్రతిజ్ఞ సేయ నేఁ
    డెన్నికమీఱ నాకమున కేగుట గాదు తలంచి చూచినన్. 96

క. ఇన్నియు నన నేఁటికి మఱి
   పన్నగభూషణుని హరుని ఫాలాక్షుని న
   త్యున్నతమతి సేవించెద
   సన్నుతశివలోకవిభవసౌఖ్యము గల్గున్. 97

సీ. విషమలక్ష్యంబులై వినువీథిఁ జరియించు
             త్రిపురంబులను సంహరించినాఁడు
    భువనభీషణమహాద్భుతవిషానలమును
             భక్షించి జగము రక్షించినాఁడు (?)
    భయదోగ్రతరతీవ్రలయకాలమృత్యువు
             నెఱయ రూపడగించి నిల్చినాఁడు
    విధువిరించ్యాదులు వెదకి కానఁగ లేని
            తత్త్వమై పొడవునఁ దనరినాఁడు
    సురలు నసురలు సంయమీశ్వరులుఁ జేరి
    కొలువ నన్నియుఁ దానయై వెలసినాఁడు
    రూఢి శ్రీదక్షవాటీశ్వరుఁడు హరుండు
    శాశ్వతోన్నతమూర్తి భీమేశ్వరుండు. 98

వ. అని తలపోసి సకలలోకాధీశ్వరుండు నగరు కేతెంచి యా
   దేవునకు సాష్టాంగదండప్రణామంబు లాచరించి హస్తంబులు
   మొగిడ్చి నిటలతటంబున ఘటియించి యిట్లనియె. 99

[5]దండకము. శ్రీమన్మహాదేవ దేవేంద్రసంస్తుత్య నిత్యానిరా
   కార నిశ్శంక ఓంకారతద్రూప దేవాద్రిచాపా మహాభక్త
   సల్లాప విధ్వస్తపాయా జయాటోపనీహార శైలేంద్రపుత్రీ
   ముఖాంభోజసప్తాశ్వ సర్వేశ్వరా దేవగంధర్వ గానా

   మృతాలోల కారుణ్యసంశీల గంధేభచర్మాంబరా సర్వదర్వీక
   రాధీశ కేయూరసృత్యాంకకోటీర కర్పూరసంకాశ ఆకాశ
   కేశాయ యీశ మహోక్షాధిరూఢాయ విరూపాక్ష ధక్షా
   ధ్వరాధ్యక్ష శిక్షానికాపేక్ష సద్భక్త సంరక్ష పద్మజనీరేజగ
   ర్భామర వ్రాతమౌనీంద్ర సంఘాత సంపూజితాంఘ్రి ద్వయో
   పేత గంగానదీజూటసంఫుల్లలాలాట స్ఫురత్కోటిసూర్య
   ప్రభా భాసురాకార శూలాయుధా భూతనాథ మహాదేవ
   యుత్పత్తికిం గర్తవై రాజసం బొప్పఁగా బ్రహ్మవై సర్వలో
   కాభిరక్షస్థితిం జాలి యాత్మైకభావంబునం బద్మనాభుండవై
   సర్వసంహారక్రియా తామసస్ఫూర్తిచే మించి రుద్రుండవై
   భూతాంతరవ్యాపివై నిండి బ్రహ్మాండహస్తాల్ వినోదంబుగా
   మేనఁ బుట్టింప ద్రుంపన్ మదిం జాల విస్ఫూర్తిచే చంద్ర
   సూర్యాగ్ని వాతావనీ వ్యోమకాండాత్మ రమ్యాష్టమూర్తి
   క్రియ న్మించి చిద్రూపమైయుండి నీరూప మేరూపముం గానఁ
   గా లేక అధ్యాత్మవిద్యామహోల్లాసులై సంయమీంద్రుల్
   మనఃపంకజాతంబుల న్మిమ్ము భావించి సేవింతు రెల్లప్పుడున్
   దేవ మీదివ్యతత్వస్వరూపంబు వర్ణింప శక్యుండనై కాల
   కాలాంతక ఫాలనేత్ర భవత్పాదసేవాసమగ్రైకచిత్తుండనై
   యుండ నాకుఁ బ్రసాదింపు దిగ్వాస కైలాసవాసా కృపావేశ
   శ్రీదక్షవాటీపురాధీశ భీమేశ యీశా నమస్తే నమస్తే
   నమస్తే నమః.100

వ. ఇట్లని స్తుతియించిన. 101

సీ. ఇమ్మూడు వంకలయేరు సొంపులు మీఱ
             జడలసందున నిండి కడలుకొనఁగఁ
    జెలువంబు దళుకొత్తఁ జెరివిన తలపూవు
             నెలకొని మొలక వెన్నెలలు చల్ల
    జదలేటితనుగాటువులు గ్రోలెడవేయు (?)
            చుంగులతలపాగ దొంగలింప
    పడఁకుగుబ్బలిరాచవారిముద్దులపట్టి
            పెరిమతో సామేన బిత్తరింప
    చాలఁ జూపట్టె ముత్తెపుచాయ నమరి
    కెరలి యాడెడిరంకెల గిబ్బ నెక్కి
    వేలుపులు చేరి కొలువంగ వేడ్క మించి
    మొదలి వేలుపు వెడవిల్తుమ్రోల నిల్చె. 102

క. ద్రాక్షారామపురాధిపుఁ
   డక్షయుఁ డబ్జభవపంకజాక్షులతోఁ బుం
   డ్రేక్షుశరాసనునకుఁ బ్ర
   త్యక్షంబై నిలిచె దివిజు లందఱుఁ జూడన్. 103

వ. సిద్ధరూపంబు వన్ని దిక్పతులలో నున్నకుబేరుని కమ్మరునిం
   జూపి యిట్లనియె. 104

క. ధనమున నీ వధికుండవు
   తను వగురూపమున శంబరాంతకుఁ డధికుం

    డెనసినవేడుక నిరువురు
    వినుఁడు సమం బరసి చూడ విశ్వములోనన్. 105

గీ. రూపు లేకున్న జగములో రూఢి లేదు
   ధనము లేకున్న మఱియు సంతకును గొఱఁత
   వలయురూపంబు ధనము నవశ్య మఖిల
   మానవులకును సురలకు మాన కిపుడు. 106

వ. అని మీలోపల మీకు విరోధంబు వలవదు. యథా
    పూర్వంబునఁ గూడియుండుం డని యిరువుర నొక్కటి చేసి
    వారలకు వలయుకోరికల నిచ్చి సర్వేశ్వరుఁ డంతర్ధానంబు
    నొందె. తనమూర్తి త్రిలింగాకారంబున భీమేశ్వరుఁడుగా
    వసియించి పూజలు గొనుచుండె, సకలదేవతలు యథా
    స్థానంబులకుం జనిరి. అందలి నారులు రూపధనాధిక్యంబుల
    మించి తొల్లిటియట్ల సుఖంబున నుండిరి. 107

క. వినయమున నీచరిత్రము
   వినినం జదివినను మిగుల వేడుకతో వ్రా
   సినవారి కెల్లఁ గలుగును
   ఘసపుత్రవిశేషవిభవకామితఫలముల్.108

శా. కుంభీంద్రాసురవిక్రమక్రమపటుక్రూరరవాటోపసం
    రంభప్రాభవభంజనోగ్రతరవీరస్ఫారకేళీభుజా
    స్తంభస్తుత్య! సమస్తలోక మహితోద్యచ్ఛైలకన్యాధిపా!
    యంభోజప్రభవామరేంద్రనుతదాక్షారామభీమేశ్వరా! 109

క. కీలాలజసంభవగో
   పాలార్చితపాదలోక! పరమేశ్వర! గో
   పాలకసంసేవిత! గో
   పాలమహాదేవ! రజతపర్వతసదనా. 110

స్రగ్విణి

   మౌనిలోకార్చితామ్నాయ! గంధర్వసం
   దానదేవాద్రికోదండనీలాంబరా
   దీనరత్నాకరా దివ్యతేజోమయా
   దానవారిప్రియా దక్షవాటీశ్వరా.

గద్య. ఇది శ్రీ వీరభద్రకృపాలబ్ధకవితావిశేషమహితచారిత్ర
    తిప్పయామాత్యపుత్ర నూతనకవిసూరయప్రణీతం బైన
    సకలజనాభిరామం బగుధనాభిరామం బనుమహాకావ్యంబు
    సర్వంబు తృతీయాశ్వాసము.

__________
  1. ఇది ముద్రితప్రతులందుఁ గానరాదు.
  2. దేవలోకము పవియు దేహిచిహ్నము వీడి దేవేశుఁడైన దేవేంద్రుఁడొక్కొ.
  3. వెఱచి నోరెత్తకుండెడి వింతవిటులు ము. ప్ర.
  4. ఇది ముద్రితప్రతిలో లేదు.
  5. ఇది ముద్రితప్రతిలో లేదు.