ధనాభిరామము/పీఠిక
పీఠిక
ధనాభిరామమును నీప్రబంధమును రచియించినకవి. నూతనకవి సూరన. ఈతఁడు తన్నుగూర్చి గ్రంథములో నిట్లు చెప్పుకొనియున్నాఁడు.
చ. అనువుగ భారతాంబునిధి యందఱుకుం దగదీఁద నందులో
ఘనకవితామృతంబు చవిగాంచిన తిక్కనసోమయాజి పా
వనతరమైనయట్టి కులవర్ధనుఁడన్ మహిఁ బేరుగల్గు నూ
తనకవి సూరయాహ్వయుఁడ ధర్మగుణప్రతిపాలనీయుఁడన్.
సీ. విస్తీర్ణవిభవయాపస్తంబసూత్రుఁడ
కాశ్యపగోత్రవిఖ్యాతయశుఁడ
ఘనత ననంతసేనుని మల్లయామాత్య
పౌత్రుఁడ తిప్పయప్రభునిసుతుఁడ
పార్వతీశుభగర్భపాధోనిధికినిసం
పూర్ణచంద్రుఁడ రాజపూజితుఁడను
రాజార్ధశేఖర పూజావిశేషసం
ధా నైకచిత్తుఁడ మానధనుఁడ
గీ. భద్రవైభవశ్రీవీరభద్రలబ్ధ
జనితచాతుర్య కావ్యలక్షణవిచిత్ర
విపులవాచాసమగ్రసంవిశదమతిని
సూరయామాత్యతిలకుఁడ సుకవివరుఁడ.
అనంతసేనుఁడు
మల్లయ
తిప్పయ-పార్వతమ్మ
సూరయ-
ఈతఁడు వీరభద్రస్వామి కృపాకటాక్షముచేఁ గావ్యకవితావిశేషములను గ్రహించి ప్రసిద్ధుఁడైనవాడు.
కాలము
ఈ గ్రంథములో రచనాకాలము చెప్పఁబడకున్నను కవి స్తుతినిఁబట్టి యీకావ్యరచనాకాలము నిర్ణయింపవీలగుచున్నది. కవిస్తుతిలో నిట్లు కలదు:--
చ. అలఘుని శబ్దశాసనపదాంకితుఁ దిక్కనసోమయాజి ని
శ్చలమతి శంభుదాసు బుధసన్నుతు నాచనసోమనార్యు, చె
న్నలరిన చిమ్మపూఁడి యమరాధిపు భాస్కరు రంగనాథునిం
దలతు నపూర్వచిత్రకవితామహనీయసమగ్రచిత్తులన్.
చ. ఇరువదియాఱువీక్షణము లెన్నఁగ నాలుగువక్ర చేష్టలిం
పరుదుగ నేడు భ్రూనటన లర్వదినాలుగు దోర్విలాసముల్
సరసతఁ జూపి హంసవృషసామజవాయసశుద్ధసంగతుల్
పరువడి ముట్ట నిల్పె సితపంకజలోచన పాడుచుండఁగన్.
ఇది రెండవయాశ్వాసమున 46-వ పద్యముగాఁ గొలదిమార్పుతో నీగ్రంథమందే యున్నది. కాఁబట్టి నూతనకవి సూరన క్రీ. శ. 1360–1550 మధ్యవాఁడని మనకుఁ దెలియుచున్నది. ఇంతకంటె స్పష్టముగా నిర్ణయముచేయుటకు వేఱొక యాధారము గలదు. సూరనకవిత్వమును శ్రీ వీరభద్రగురుకటాక్షముచే గ్రహించినాఁడు. ఈవీరభద్రగురుఁడు ముదిగొండ వీరభద్రుఁడు, రత్నశాస్త్రమును రచియించిన భైరవకవి “ముదిగొండ శ్రీవీరేశునకు భక్తచింతామణికిన్" అని యాగ్రంథ ములో చెప్పినాఁడు. భైరవకవి క్రీ. శ. 1440 ప్రాంతము వాఁడు. కాఁబట్టి నూతనకవి సూరనయు, క్రీ. శ. 1450 ప్రాంతమువాఁడనియు పూర్వకవులలో నొకఁడనియు నిశ్చయింప వచ్చును.
గ్రంథవిషయము
ఈ గ్రంథము దాక్షారామభీమేశ్వరునికిఁగృతి. ఇందలికథ గతానుగతికమగు ప్రబంధకథగాక, మానవజీవితముతో సంబంధించినది. మనుష్యునకు రూపము ధనము రెండును నావశ్యకములే యని యిది నిరూపించును. కథసారాంశ మిది “రూపము హెచ్చని మన్మథుఁడును, ధనము హెచ్చని కుబేరుఁడును వాదించి, దాక్షారామక్షేత్రమునఁ దమవాదముల నెగ్గించుకొనుటకు వచ్చిరి. అచ్చట రూపమువల్ల మన్మథుడు స్వాధీనపఱచుకొన్న స్త్రీని, ధనమువల్ల కుబేరుఁడు స్వాధీనపఱచుకొనెను. అంతమన్మథుఁడు భీమేశ్వరునిఁ బ్రార్థింపగా నాతఁడు ప్రత్యక్షమై మానవులకు ధనము రూపము రెండును నావశ్యకములే యని సమాధానపఱచి, వారివాదమును మాన్పెను.” కావున నీకృతి కేవలసాంఘికవృత్తమునకు సంబంధించిన ప్రబంధమనియు, నిట్టి గ్రంథములు మనభాషావాఙ్మయములో కొలఁదిగామాత్రమే యున్నవనియు, నిదియే యీప్రబంధప్రాశస్త్యమనియు నెఱుఁగఁ దగియున్నది.
కవితావిశేషములు - అనుస్మృతులు
తిక్కనసోమయాజినిఁ బేర్కొనుటచేత, నాతని ప్రథమ గ్రంథములలో నొకటియగు విజయసేనమునుండి యీక్రింది పద్యపాదమును గ్రహించియున్నాఁడు.
తిక్కన :-
సీ. మదనవశీకార మంత్రదేవత దృష్టి
గోచరమూర్తిఁ గైకొనియె నొక్కొ
(ప్రబంధరత్నా. 50 పు. 159 ప.)
సూరన:-
సీ. మదనవశీకారమంత్రరూపము లన
మెలఁగెడు తొలుకారుమెఱుపు లనఁగ
(2. ఆశ్వాసము.)
ఈ పద్యమున రెండవపాదమున మొదటిదళమునగల
“సీ. నడపాడ నేర్చిన నవకంబు లతలన” అనునది
సీ. నడపాడనేర్చిన నవకంబు నునుతీగ
అను కేయూరబాహుచరిత్రలోని 5 వ ఆశ్వాసమున గల పద్యపాదమున కనువాదము.
ధనాభిరామము:-
ఉ. పువ్విలుకానిఁబోలిన యపూర్వమనోహరమూర్తివాఁడహో
యెవ్వఁడొ కో...అనునది
ఉ. పువ్విలుకానితోడ సరిపోలెడు చక్కదనంబుగల్లువాఁ
డెవ్వఁడొకో...
అను శ్రీనాథమహాకవి యాంధ్రనైషధకావ్య ద్వితీయాశ్వాసమునుండి గ్రహింపబడినది.
విసుగుపుట్టించువర్ణనలు లేక, చక్కనికథాసరళితో సముచిత శృంగార వర్ణనలతోఁగూడిన యీ ప్రశస్తకృతిని యింత వఱకు ప్రసిద్ధిఁగాంచకుండుటజూచి నేఁడు, రెండుమూఁడు ప్రతులచే సరిచేయింపఁబడిన గ్రంథము నాధారముగఁగొని దీనిని ముద్రించి ప్రకటించితిమి. ఆంధ్ర మహాజను లెల్లరు నీరసవత్కృతి నాదరింతురుగాత!
ఇట్లు
వావిళ్ల వేంకటేశ్వరులు.
- ↑ చూ. ప్రబంధరత్నావళి - 482 పద్యము. 141 పుట.