Jump to content

దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/భారతీయులు ఏం చేశారు?-2

వికీసోర్స్ నుండి

కక్షిదారులకు నచ్చింది. అందువల్ల నేటాల్‌లో నేనుండవలసిన కాలం యింకా పొడిగించబడింది. 1896లో అక్కడి భారతజాతి అనుమతిపొంది నేను ఆరుమాసాలపాటు భారతదేశం వచ్చాను. ఆరుమాసాలు పూర్తికాకముందే నేటాలు నుంచి తంతివచ్చింది. నేను వెంటనే నేటాలుకు వెళ్లక తప్పలేదు అక్కడ 1896-97లో జరిగిన ఘట్టాలను గురించి వేరే ప్రకరణంలో వివరిస్తాను


7

భారతీయులు ఏం చేశారు? - 2

నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ యొక్క కార్యక్రమాలు స్థిరపడ్డాయి రెండున్నర సంవత్సరాలు నేను నేటాలులో గడిపాను దక్షిణాఫ్రికాలో నేను వుండాలనుకుంటే కుటుంబాన్ని భారతదేశాన్నుంచి తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చాను. భారతదేశం వెళ్లి రావాలని కూడా నాకు కోరిక కలిగింది భారతదేశంలో తిరిగి నేటాలు విషయాలే గాక, దక్షిణాఫ్రికాకు చెందిన మిగతా అధినివేశ రాజ్యాల్లో గల భారతీయుల స్థితిగతులను గురించి కూడా భారత ప్రజలకు తెలియజేయాలని భావించాను కాంగ్రెస్ నాకు ఆరు మాసాల సెలవు యిచ్చింది. నాకు బదులుగా నేటాలుకు చెందిన ప్రసిద్ధ వ్యాపారి కీ. శే. ఆదంజామియా ఖాన్ సెక్రటరీగ నియమితులైనారు. వారు కాంగ్రెస్ కార్యక్రమాలు ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు. వారికి ఇంగ్లీషు బాగా వచ్చు అనుభవంద్వారా ఇంగ్లీషులో కార్యక్రమాలు నడపగల సామర్థ్యం గడించారు. గుజరాతీ భాష మామూలుగా వారికి వచ్చు వారి వ్యాపారం హబ్షీల మధ్య జరుగుతూ వుంటుంది. గనుక జూలూభాష వారు నేర్చుకున్నారు. హబ్షీవారి అలవాట్లు వారికి బాగా తెలుసు వారిది శాంత స్వభావం అందరితో కలుపుకోలుతనంగా వుండటం వారి విశేషం మితభాషి ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానో చెబుతాను బాధ్యతాయుతమైన పదవిని నిర్వహించాలనే ఇంగ్లీషుభాషాజ్ఞానం విద్వత్తు ఎంత అవసరమో, అంతకంటే నిజాయతీ, శాంతి, ఓర్పు, దృఢత్వం. సమయపాలన, సాహసం, వ్యావహారిక జ్ఞానం, అవసరం ఎంత విద్వత్తు వున్నా మిగతా విశేషాలు లేకపోతే ప్రయోజనం వుండదు. ఇది స్వానుభవం వల్ల నేను తెలుసుకున్న విషయం

1896 మధ్య కాలంలో నేను భారతావనికి వచ్చాను. నేను కలకత్తా చేరాను. ఆ రోజుల్లో నేటాలునుంచి ఓడద్వారా కలకత్తా చేరడం సులభం గిర్‌మిటియా కార్మికులు కలకత్తా నుంచో లేక మద్రాసునుంచో నేటాలు చేరేవారు కలకత్తా నుంచి బొంబాయివస్తూ త్రోవలో రైలు తప్పిపోయినందున, ఒక్క రోజు అలహాబాదులో ఆగవలసి వచ్చింది. అక్కడినుంచే నా పనిని ప్రారంభించాను పయోనీర్ పత్రికకు సంబంధించిన శ్రీ చేజనీని కలుసుకున్నాను ఆయన నాతో ఎంతో సుహృద్భావంతో మాట్లాడారు. అధినివేశ రాజ్యాల్లో వుంటున్న తెల్లవారి యెడ తనకు సానుభూతి కలదని ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే అక్కడి పరిస్థితుల్ని గురించి వ్రాసి యిస్తే పయోనీర్ పత్రికలో ప్రచురించి, దానితో పాటు తన అభిప్రాయంను ప్రకటిస్తానని మాట యిచ్చాడు. దానికి నేను తృప్తి పడ్డాను

భారత దేశంలో వున్నప్పుడు నేను దక్షిణాఫ్రికాలో వుంటున్న భారతీయుల పరిస్థితులను గురించి ఒక చిన్న పుస్తకం వ్రాశాను ఆ పుస్తకం మీద దేశంలో గల భారతీయ పత్రికలన్నీ సంపాదకీయాలు వ్రాశాయి. రెండు సార్లు ఆ పుస్తకం ముద్రించ వలసివచ్చింది అయిదు వేల ప్రతులు నేను విడుదల చేశాను. అనేక మంది దేశ నాయకుల్ని కలుసుకున్నాను బొంబాయిలో సర్‌ఫిరోజ్ షా మెహతా, న్యాయమూర్తి బదరుద్దీన్ తయాబ్జీ, మహాదేవ గోవిందరానడే మొదలగువారిని, పూనాలో లోకమాన్య బాలగంగాధరతిలక్, వారికి సంబంధించిన పెద్దల్ని ప్రొఫెసర్ భండార్కర్, గోపాలకృష్ణ గోఖలే, వారికి సంబంధించిన పెద్దల్ని కలుసుకున్నాను బొంబాయి, పూనా, మద్రాసుల్లో నేను ఉపన్యాసాలు, యిచ్చాను. వాటన్నిటి వివరాల్లోకి నేను పోదలచలేదు

అయితే పూనాలో జరిగిన ఒక ఘట్టం పేర్కొనక తప్పదు. దానికి మన సమస్యకు సంబంధం లేదు. ఇక్కడ బహిరంగ సభ, లోకమాన్య తిలక్‌గారి సలహా ప్రకారం జరిగింది. కీ. శే. గోఖలేగారికి దక్కన్ సభతో సంబంధం వున్నది అందరికంటే ముందు నేను తిలక్ మహారాజ్‌ని కలుసుకున్నాను పూనాలో జరుపవలసిన సభను గురించి తిలక్‌గారిని అడిగాను మీరు గోపాల రావును కలిశారా అని వారు నన్ను అడిగారు

మొదటి వారు ఏ గోపాలరావును గురించి అడుగుతున్నారో నాకు అర్ధం కాలేదు. అప్పుడు వారు. శ్రీ గోఖలేను కలిశారా? వారిని ఎరుగుదురా అని అడిగారు

నేను - వారిని యింత వరకు నేను కలవ లేదు. వారి పేరు మాత్రం విన్నాను వారిని కలుసుకుందామని అనుకుంటున్నాను

లోకమాన్యుడు , భారత దేశపు రాజకీయాలు మీకు తెలిసినట్లు లేదు

నేను - ఇంగ్లాండులో చదువు ముగించుకొని భారతావని వచ్చాను కాని యిక్కడ ఎక్కువకాలం వుండలేదు. వున్న కాలంలో కూడా రాజకీయ రంగానికి దూరంగా వున్నాను అది నా శక్తికి మించినపని అని అనుకున్నాను

లోకమాన్యుడు - అయితే నేను కొద్దిగా మీకు చెప్పాలి పూనాలో రెండు పక్షాలు వున్నాయి. ఒకటి సార్వజనిక సభకు సంబంధించినది. రెండవది డక్కన్ సభకు సంబంధించినది

నేను. ఈ విషయం నాకు కొద్దిగా తెలుసు

లోకమాన్యుడు- ఇక్కడ సభజరపడం తేలికయే మీరు పార్టీలన్నిటికి అక్కడి సమస్యలు తెలియజేయాలనీ, అన్నిటి సమర్ధన పొందాలని భావిస్తున్నారు. యిది నాకు నచ్చింది. అయితే సార్వజనిక సభకు చెందిన వ్యక్తి మీ సభకు అధ్యక్షత వహిస్తే డక్కన్ సభకు సంబంధించిన వాళ్లెవ్వరూ రారు డక్కన్ సభకు సంబంధించిన వారెవరైనా అధ్యక్షత వహిస్తే సార్వజనిక సభకు చెందిన వారెవ్వరూ రారు అందువల్ల మీరు తటస్థవ్యక్తిని అధ్యక్షుణ్ణిగా ఎన్నుకోండి ఈ విషయయంలో నేను సలహామాత్రమే యివ్వగలను యింకే సహాయం చేయలేను. మీరు ప్రొఫెసర్ భండార్కరును ఎరుగుదురా? ఎరుగకపోయినా మీరు వారిని కలవండి వారు తటస్థంగా వుండే వ్యక్తి వారు రాజకీయాల జోలికిపోరు. వారిని కలిస్తే, వారినే మీ సభకు అధ్యక్షులుగా వుంచాలని మీరు అనుకుంటారు. శ్రీ గోఖలేతో కూడా యీ విషయం మాట్లాడండి వారుకూడా నామాదిరిగానే మీకు సలహా యివ్వవచ్చు ప్రొఫెసర్ భండార్‌కరు అధ్యక్షత వహిస్తే యిరుపక్షాలవారు పూనుకొని సభను జయప్రదం చేస్తారు. నాసాయం మీకు పూర్తిగా లభిస్తుంది

లోకమాన్యుని సలహా గైకొని నేను శ్రీ గోఖలేగారిని కలిశాను. మొదటి కలయికలోనే వారు నా హృదయం మీద చెక్కుచెదరని ముద్ర ఎంతగా వేశారో గతంలో వ్రాశాను తెలుసుకోవాలనుకుంటే పాఠకులు యంగ్ ఇండియా లేక నవజీవన్ పాతపత్రికల్ని చదవవచ్చు. లోకమాన్యుని సలహా శ్రీ గోఖలేగారికి కూడా నచ్చింది. వెంటనే నేను భండార్‌కర్‌గారి దగ్గరకు వెళ్ళాను నేటాల్ భారతీయుల పరిస్థితుల్ని గురించి శ్రద్ధగ విని శ్రీ భండార్కర్ "నేను బహిరంగసభలకు వెళ్లను నేను వృద్ధుణ్ణి మీ మాటలు నన్ను అమితంగా ప్రభావితం చేశాయి. అన్ని పక్షాల సహాయం పొందాలని మీరు భావించడం ఎంతో సమంజసం అవసరం కూడా మీరు నవయువకులు భారతదేశపు రాజకీయాలు మీకు తెలియవు అందువల్ల యిరుపక్షాల వారికి చెప్పండి నేను బహిరంగసభకు అధ్యక్షత వహిస్తాను. వారిలో ఎవరైనా సభ జరుగుతుందని నాకు తెలియజేస్తే చాలు. నేను వచ్చి సభకు అధ్యక్షత వహిస్తాను" అని చెప్పారు

పూనాలో సభ జయప్రదంగా జరిగింది. ఇరుపక్షాల నాయకులు అందు. పాల్గొన్నారు. ఇరుపక్షాల నాయకులు సభలో ప్రసంగించారు. ఆ తరువాత నేను మద్రాసు వెళ్లాను. అక్కడనేను జస్టిస్ సుబ్రహ్మణ్య అయ్యర్, శ్రీ పి ఆనందాచార్యులు, హిందూ పత్రిక తాత్కాలిక సంపాదకుడు శ్రీ జి సుబ్రమ్మణ్యం, మద్రాస్ స్టాండర్డ్ సంపాదకుడు శ్రీ పరమేశ్వరన్ పిళ్లె, ప్రసిద్ధ వకీలు శ్రీ భాష్యం అయ్యంగార్, శ్రీ నార్టన్ మొదలగు వారిని కలిశాను అక్కడ కూడా ఒక పెద్ద సభ జరిగింది. మద్రాసు నుంచి నేను కలకత్తా వెళ్లాను అక్కడ నేను శ్రీ సురేంద్రనాథ్ బెనర్జీ, మహారాజా జ్యోతీంద్రనాధ టాగూర్. ఇంగ్లీషుమెన్ సంపాదకుడు కీ. శే. శ్రీసాండర్స్, తదితరులను కలిశాను కలకత్తాలో సభ జరుపుటకు ఏర్పాటు జరుగుతూవున్నాయి. యింతలో నేటాలు నుంచి 1896 నవంబరులో నాకు వెంటనే రండి అని తంతి అందింది. అక్కడ ఏదో వ్యతిరేకవ్యవహారం జరుగుతున్నదని బోధపడింది దానితో కలకత్తా సభను విరమించుకొని నేటాలుకు బయలుదేరాను బొంబాయి నుంచి బయలుదేరే మొదటి ఓడ మీద నాకుటుంబ సభ్యలతో సహా బయలుదేరాను ఆఓడను దాదా అబ్దుల్లా గారి వ్యాపారసంస్థ వారు కొన్నారు. వారు పలుసాహసకార్యాలు చేశారు అట్టి కార్యాల్లో నేటాలు, పోరుబందరు మధ్య ఓడ నడపడం నిజంగా సాహసకార్యమే ఆ ఓడ పేరు కుర్లాండ్ కుర్లాండుకు టిక్కట్టుకొన్నాను. ఈ ఓడ బయలుదేరిన వెంటనే అదే రోజున పర్షియన్ కంపెనీ వారి ఒక ఓడ నాదరీ కూడా బొంబాయి నుంచి నేటాలుకు బయలుదేరింది. ఈ రెండు ఓడల్లో కలిపి దక్షిణాఫ్రికాకు వెళ్లే వారు సుమారు 800మంది వున్నారు

భారతదేశంలో దక్షిణాఫ్రికా యందలి భారతీయుల స్థితిగతులను గురించి నేను చేసిన ప్రచారం తారస్థాయిని చేరుకున్నది. భారతదేశమందలి పత్రికలన్నీ సంపాదకీయాలు, వ్యాఖ్యలు ప్రచురించాయి రాయిటర్ పంపిన తంతులద్వారా విదేశాలకు చాలా సమాచారం అందింది. ఈ విషయం నేటాలు చేరిన తరువాత నాకు తెలిసింది. విదేశాలకు చేరిన సమాచారాన్ని అందుకొని అక్కడి రూటర్ ప్రతినిధి క్లుప్తంగా ఒక తంతి దక్షిణాఫ్రికా కూడా పంపించాడు ఆ తంతి ద్వారా పంపిన సమాచారంలో నేను చెప్పిన దానికి అతిశయోక్తులు అతడు జోడించాడు. ఇలాంటి అతిశయోక్తులు మనం అప్పుడప్పుడు చూస్తూనే వుంటాం. అయితే కావాలని చేస్తారా అంటే చేయరు. అనేక పనుల్లో మునిగివుండేవారు, తమకు గల ఉద్దేశ్యాలు. భావాలు లోపల పెట్టుకొని, పై పై విషయాన్ని చదివి దానిమీద వార్త వ్రాస్తారు. ఒక్కొక్కప్పుడు అట్టి వార్త వ్రాసిన వాడి ఊహయే గాని అదిసత్యం కాదు ఆవార్తకు వేరు వేరు చోట్ల వేరు వేరు ఆర్థాలు తీస్తారు. ఇదంతా సామాన్యంగా జరుగుతూనే వుంటుంది. ప్రజారంగంలో యిటువంటివి తప్పవు. అయితే వాటికి ఒక హద్దుకూడా వుంటుంది భారత దేశంలో వున్నప్పుడు నేను నేటాలుకు చెందిన తెల్ల వారిని విమర్శించాను. వారిమీద ఆరోపణలు చేశాను. గిర్‌మిటియా కార్మికుల పై విధించబడిన 3 పౌండ్ల తలపన్నును కఠినంగా విమర్శించాను బాలసుందరం అను గిర్‌మిటీయా కార్మికునిపై అతడి యజమాని చెయ్యిచేసుకున్నాడు. అతడి శరీరానికి చాలా గాయాలయ్యాయి. వాటిని నేను స్వయంగా చూచాను అతడికేసు నాచేతికి వచ్చింది. అతడి కష్టాల్ని గురించి నాకు తెలిసిన సమాచారు ప్రకారం యిక్కడ బాగానే చెప్పాను రూటరు ప్రతినిధి ఆవార్తను తారుమారుచేశాడు. అతడు పంపిన వార్త నేటాలు చేరేసరికి అక్కడ తెల్లవారు నామీద ఉగ్రులైపోయారు. ఈ విషయంలో నేటాల్లో నేను వ్రాసిన వార్తలే భారతదేశంలో కంటే తీవ్రంగా వున్నాయి. నేను భారతదేశంలో ఒక్కఅతిశయోక్తి కూడా చెప్పలేదు సామాన్యంగా మనం ఒక తెలియని వ్యక్తి ఎదుట, కొన్ని వివరాలు చెప్పినప్పుడు అతడు మనం ఉహించినదాని కంటే అధికంగా ఉహించికొంత కల్పించి వ్రాస్తాడు. వాస్తవానికి ఇండియాలో వున్నప్పుడు తగ్గించే అక్కడి వివరాలు చెప్పాను నేటాలులోవున్నప్పుడే కఠినంగా వ్రాశాను నేటాలులో నేను ప్రచురించిన వార్తలు అక్కడి తెల్లవాళ్లు చదివేవారు కాదు. చదివినా లెక్కచేసే వారు కాదు కాని భారతదేశంలో నేను చెప్పినట్లు రాయిటర్ విదేశాలకు పంపబడిన వార్తలకు ఎక్కడలేని ప్రాధాన్యం సంతరించుకున్నది. దానితో నేటాలు యందలి తెల్లవారిని పెద్ద భయం పట్టుకున్నది నా ప్రచారం వల్ల గిర్‌మిటియా కార్మికులు యిక రారని, వచ్చిన వాళ్లుకూడా వుండరని, యిప్పుడు తాముగడిస్తున్న లాభాలు తగ్గిపోతాయని అనుకున్నారు. అంతేగాక భారతదేశంలో నేటాలుకు చెందిన తెల్లవారు అవమానం పాలు అయ్యారని కూడా ఉహించుకున్నారు

నామీద మండిపడిపోయారు యింతలో నేను కుటుంబంతో సహాకుర్లాండు ఓడలో నేటాలుకు, వస్తున్నానని వాళ్లకు సమాచారం అందింది ఆఓడలో 300లేక 400 మంది భారతీయులుకూడా వస్తున్నారని తెలుసుకున్నారు. కుర్లాండు ఓడ వెనక నాదరీ ఓడకూడా వస్తున్నదనీ, అందులో కూడా యింతమందే భారతీయులు వస్తున్నారని వాళ్లకు తెలిసింది. ఈ సమాచారం వల్ల నిప్పులో నెయ్యి పోసినట్లయింది. దానితో ఘరీ పెట్రేగి పోయారు. పెద్ద సభలు చేశారు. పెద్ద పెద్ద తెల్లజాతి వారంతా ఆ సభల్లో పాల్గొన్నారు. ఓడలో వస్తున్న భారతీయులకు వ్యతిరేకంగా ప్రసంగాలు జరిగాయి కుర్లాండు, నాదరీఓడల్లో భారతీయులు నేటాలు తెల్లవాళ్ల మీద దాడి చేయడానికి వస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారు. 800 మంది భారతీయుల్ని నేను రెండుఓడల్లో నేటాలకు తీసుకువస్తున్నాని నామీద ఆరోపణ చేశారు. నేటాలును స్వతంత్ర భారతీయులతో నింపడానికి నేను చేస్తున్న ప్రధమ ప్రయత్నం యిది అని జనాన్ని రెచ్చకొట్టారు. అసలు మమ్మల్ని నేటాలులో దిగనీయవద్దని ప్రభుత్వమే రెచ్చగొట్టింది. ఈ జనాన్ని వాపసు పంపివేయాలని, అలాపంపకపోతే తెల్లవారే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మమ్మల్ని వెళ్లగొట్టాలని తీర్మానించుకున్నారు. యింతలో రెండు ఓడలు నేటాలు హార్బరుకు చేరాయి

1996లో మొదటిసారి భారతదేశంలో ప్లేగు వ్యాధి వ్యాప్తమైన విషయం పాఠకులకు జ్ఞాపకం వుండే వుంటుంది. నేటాబు ప్రభుత్వం దగ్గర మమ్మల్ని తిరిగి పంపించే అధికారం ఏమీలేదు. అప్పటికి ప్రవేశపత్రాల చట్టం యింకా అమల్లోకి రాలేదు. నేటాలు ప్రభుత్వం అక్కడి తెల్లవారికి బాగా అనుకూలం నేటాలు ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక మంత్రి కీ. శే. శ్రీ ఎస్కంబ్ ఆ కమిటీకి పూర్తి సహాయకారాలు అందిస్తూవున్నాడు. కమిటీని రెచ్చగొట్టేపనికూడా ఆయనే నిర్వహిస్తున్నాడు ఓడల్ని ఒక నిశ్చితమైన వ్యవధివరకు క్వారంటీన్‌లో వుంచుతారు. అంటే ఓడతోగల సంబంధాలన్నీ ఆపివేస్తారన్నమాట యాత్రీకుల్ని, వారి సామానుస ఓడలోనే వుంచివేస్తారు. హార్బరులో దిగనీయరు. ఈ నిర్ణయం హార్బర్‌కు సంబంధించిన ఆరోగ్యాధికారి ఆర్డరు ప్రకారం జరుగుతుంది ఈ అధికారాన్ని నేటాలు ప్రభుత్వం రాజకీయ కారణాలకు పుపయోగించుకున్నది. అంటే అట్టి అధికారాన్ని దుర్వినియోగ పరిచిందన్న మాట ఏ యాత్రీకునికీ ఏ విధమైన జబ్బు లేకపోయినా రెండు ఓడల్నీ 23 రోజులవరకు హార్బరులో ఆపి వుంచారు. ఈ లోగా తెల్లవాళ్ల కమిటీ తన పని సాగించింది. దాదా అబ్దుల్లా కుర్లాండుకు యజమాని నాదరీ ఓడ కూడా వారి ఏజంటుదే ఆయనను తెల్లవాళ్లు బెదిరించారు. భయపెట్టారు. రెండు ఓడల్ని తిరిగి ఇండియాకు పంపించి వేయమని ఆయన పై రకరకాలుగా వత్తడి తెచ్చారు. ఆశ కూడా పెట్టారు. తమ మాట వినకపోతే మీవ్యాపారాన్ని ఆపివేస్తామని కూడా భయపెట్టారు. కాని ఆయన పిరికి రకంకాదు. వాళ్లు తెల్లవాళ్లకు స్పష్టంగా చెప్పివేశారు. "మావ్యాపారం పోయినా సరే, నష్టపడిపోయినా సరే తలవంచం చివరి వరకు పోరాడుతాం అంతేగాని ఏదోషం చేసి ఎరుగని యీయాత్రీకుల్ని మాత్రం ఇండియాకు తిరిగి పంపం అట్టి పాపం మేము చేయం మీకు మీదేశంమంటే ఎంత అభిమానమో, మాకు మాదేశమంటే అంతే అభిమానం అనికూడా చెప్పివేశారు ఈ కంపెనీ వకీలు . ఎఫ్. ఏ. లాటస్ కూడా సాహసి యోధుడు

ఇదే సమయంలో అనుకోకుండా కీ. శే. శ్రీ మనసుఖలాల్ హీరాలాల్ నాజర్ (సూరత్ నగకాయస్థులు కీ. శే. శ్రీ నానాభాయి హరిదాస్ మేనల్లుడు) దక్షిణాఫ్రికా వచ్చారు. నేను వారిని ఎరుగను. వారు వచ్చారనికూడా నాకు తెలియదు కుర్లాండు, నాదరీ ఓడల్లో వచ్చిన భారతీయుల్ని నిజంగా,నేను తీసుకోరాలేదని చెప్పనవసరంలేదని భావిస్తున్నాను. వారిలో ఎక్కువ మంది భారతీయులు దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న పాతవారే కొంతమంది ట్రాన్స్‌వాల్ వెళ్లవలసినవాళ్లు అంతా యీ ఓడల్లో ఎక్కారు. ఈ ప్రయాణీకులను కూడా బెదిరిస్తూ తెల్లవాళ్ళు వార్తలు పంపారు. కెప్టెస్ వాళ్లు పంపిన హెచ్చరికల్ని యాత్రీకులకు చదివి వినిపించారు. "నేటాల్ యందలి తెల్లవారు ఉగ్రులైయున్నారు. అయినా లెక్కచేయకుండా భారతీయ యాత్రీకులు ఓడలు దిగి హార్బరులో అడుగు పెడితే ఒక్కొక్కణ్ణి విసిరి సముద్రంలో పారేస్తాం" అంటూ తెల్లవాళ్లు పంపిన హెచ్చరికల్లో వ్రాసి వున్నది కుర్లాండులో వున్నయాత్రికులకు ఆహెచ్చరికను నేను అనువదించి చెప్పాను నాదరీ యందుగల యాత్రీకులకు మరొకరెవరో అనువదించి చెప్పారు. అయితే రెండు ఓడలలో వున్న భారతీయ ప్రయాణీకులు తెల్లవాళ్ల యిట్టి హెచ్చరికను ఖాతరు చేయలేదు. “మేము చాలామందిమి ట్రాన్స్‌వాల్ వెళ్లాలి మిగతవారంతా నేటాల్లో చాలాకాలం నుంచి నివసిస్తున్న వారే మాకందరికీ నేటాలు హార్పరులో దిగే అధికారం చట్టరీత్యా వున్నది మీరు బెదిరిస్తున్న తీరును మేము అంగీకరించడం లేదు. మేమంతా యిక్కడ దిగుతాము అని సమాధానం పంపించారు. అప్పటికి నేటాల్ ప్రభుత్వం కూడా అలసిపోయింది అనుచితము, అన్యాయమూ అయిన ఆంక్షల్ని ఎంతకాలం అమలుచేస్తుంది? 23 రోజులు గడిచాయి. దాదాఅబ్దుల్లా పట్టు వీడలేదు యాత్రీకులు భయపడలేదు. అందువల్ల గతిలేక 23 రోజుల తరువాత ఓడలపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం తొలగించి వేసింది. హార్బరులోనికి ఓడలు ప్రవేశించవచ్చునని అనుమతి లభించింది. ఈ లోపున శ్రీ ఎస్కంబ్ తెల్లవాళ్లను శాంతపరచుటకు ప్రయత్నించాడు "డర్బనులో శ్వేత జాతీయులు చూపించిన ఐకమత్యం అద్భుతంగా పనిచేసింది మీరు చేతనైనంత చేశారు 23 రోజులు భారతీయుల్ని ఓడలు దిగకుండా చేశారు. ఇక శక్తి ప్రదర్శన విరమించడం మంచిది. ఇంగ్లాండునందలి పెద్ద ప్రభుత్వంపై మంచి ప్రభావం పడుతుంది. మీబల ప్రదర్శన వల్ల నేటాల్ ప్రభుత్వం పని తేలిక అయిపోయింది. ఇక మీరు భారతీయ యాత్రీకుల జోలికి పోవద్దు పోతే మాత్రం చేసిందంతా వృధా అవుతుంది నేటాలు ప్రభుత్వం ఇరుకున పడిపోతుంది. యింత చేసినా యాత్రీకుల్ని దిగకుండా మీరు ఆపలేరు భారతీయ యాత్రీకుల్లో చాలామంది పిల్లలు, మహిళలు వాళ్ల జోలికిపోతే ప్రపంచమంతా ఛీకొడుతుంది. భవిష్యత్తులో యిక భారతీయులనెవ్వరినీ దక్షిణాఫ్రికాలోపల అడుగుపెట్టనీయం ఆపని నేటాలుప్రభుత్వం చేస్తుంది మాటయిస్తున్నాను. అసెంబ్లీలో బిల్లుపెట్టి ప్యాసుచేస్తాం" అంటూ శ్రీ ఎస్కంబ్ వాళ్లకు చెప్పాడు. (అతడి మాటల సారాంశం మాత్రమే నేను యిక్కడ వ్రాశాను.) ఎస్కంబ్ ఉపన్యాసం విని శ్వేత జాతీయులు నిరాశ పడిపోయారు. అయినా ఎస్కంబ్ అంటే వున్న గౌరవంతో వాళ్లంతా వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఓడలు హార్బరులోకి ప్రవేశించాయి.

"మీరు పగటిపూట ఓడదిగ వద్దని, సాయంత్రం తరువాత కెప్టెనును పంపుతానని. ఆయన వెంట యింటికి వెళ్లమని" ఎస్కంబ్ నాకు కబురు పంపాడు. నాకుటుంబ సభ్యులు ఎప్పుడైనా దిగవచ్చునని కూడా కబురు వచ్చింది. ఇది అతడి ఆ దేశంకాదు, నాక్షేమం కోరి యిచ్చిన సలహా మాత్రమే వాస్తవానికి నేను ఎప్పుడైనా దిగవచ్చు. అయితే మంచిని కోరిపంపిన కబురు కనుక నేను వారి సలహాప్రకారం ఓడ మీద ఆగిపోయాను. నా పిల్లల్ని, భార్యను డర్భను నందలి ప్రసిద్ద వ్యాపారి, నా మిత్రుడు పారసీరుస్తుంజీ యింటికి పంపించివేశాను యాత్రీకులంతా దిగివెళ్లిపోయారు. అప్పుడు దాదా అబ్దుల్లా వకీలు, నా మిత్రుడు శ్రీ లాటన్ అక్కడకు వచ్చి నన్ను చూచి "ఇదేమిటి? మీరు దిగలేదేమిటి? అని అడిగాడు నేను శ్రీ ఎస్కంబ్ ఒక జాబు ద్వారా పంపిన కబురును గురించి వారికి చెప్పాను మీరు యిలా చీకట్లో దొంగవలె. దోషివలె రహస్యంగా దిగి వెళ్లడం నాకు యిష్టంలేదు మీకు భయంలేకపోతే నాతోబాటురండి ఏమీ జరగనట్లే మనిద్దరం కలిసి కాలి నడకన పట్టణం వెళదాం" అని అన్నాడు. వెంటనే అందుకొని నాకేమీ భయం లేదు. ఎస్కంబ్ యిచ్చిన సలహాను పాటించాలా వద్దా అనే ఆలోచిస్తున్నాను. ఇందు ఓడ కెప్టెస్ యొక్క బాధ్యతను గురించి కూడా యోచిస్తున్నాను అని చెప్పాను శ్రీ లాటిన్ నవ్వుతూ శ్రీ ఎస్కంబ్ మీకు ఒరగపెట్టింది ఏమీ లేదు. అతడిచ్చిన సలహాను పాటించవలసిన అవసరం ఏమీలేదు. అతడిచ్చిన సలహాలో కపటం లేదని నమ్ముటకు మీదగ్గర ఏ ఆధారమూలేదు. అసలు పట్టణంలో జరిగిన దానికి అతడే కారణం యిక్కడ ఏమేమి జరిగిందో మీకంటే నాకు బాగా తెలుసు (నేను మధ్యన తలఊపాను) పోనీ ఎస్కంబ్ యిచ్చిన సలహా మంచికోసమే అని అనుకుందాం దాన్ని పాటించినందున మీప్రతిష్ఠ పెరగదు తరుగుతుంది. భయపడి చీకట్లో దిగిపారిపోయాడని అంతా అంటారు. అందువల్ల మీరు సరే నంటే నాతోపాటు రండి ఓడ దిగి వెళదాం కెప్టెన్ మన మనిషే అందువల్ల ఆయన బాధ్యత మన బాధ్యతయే అతణ్ణి అడిగేదెవరు? దాదాఅబ్దుల్లాయే గదా అబ్దుల్లా సాహసం అద్భుతం అని అన్నాడు లాటన్ పగడీ (తలపాగా) పెట్టుకున్నాను పోదాం. పదండి' అని అన్నాను కెప్టెనుకు చెప్పి యిద్దరం ఓడదిగాం

శ్రీ లాటిన్ డర్భనుకు చెందిన పాత ప్రసిద్ధ వకీలు వారితో నాకు మంచి సబంధం వున్నది. కష్టమైన వ్యాజ్యాలు వస్తేవారి సాయం తీసుకునే వాణ్ణి. పెద్దవకీలుగా వారికే పని అప్పగించేవాణ్ణి ఆయన సాహసి మంచి ఒడ్డుపొడవుగల మనిషి

మేము నడుస్తున్న రోడ్డు డర్బను పట్టణానికి సంబంధించిన పెద్ద పేటలో నుంచి వెళుతుంది మేము సాయంత్రం 4 గంటలకు బయలుదేరాము. ఆకాశంలో మేఘాలు క్రమ్మి వున్నాయి అవి సూర్యుణ్ణి కప్పివేశాయి కాలినడకన రుస్తుం గారింటికి చేరడానికి ఒక గంట సమయం పదుతుంది ఓడనుంచి దిగంగానే కొంతమంది తెల్లజాతి పిల్లలు మమ్మల్ని చూచారు పెద్ద వయస్సు వాళ్లు ఎవ్వరూలేదు. ప్రత్యేకరకం తలపాగా ధరించాను. కనుక పిల్లలు నన్ను గుర్తు పట్టారు. "గాంధీ" గాంధీ" పట్టుకోండి, పట్టుకోండి, తన్నండి, తన్నండి అంటూ మమ్మల్ని చుట్టి వేశారు. కొంతమంది పిల్లలు రాళ్లు విసరడం ప్రారంభించారు. యింతలో మధ్య వయస్కులు కూడా వచ్చారు. మెల్లమెల్లగా దాడిచేసే జనం పెరిగిపోయారు. నడిచివెళ్లితే ప్రమాదం తప్పదని గ్రహించి శ్రీ లాటిన్ రిక్షాను పిలిచాడు. రిక్షా అంటే మనిషిలాగే చిన్న బండి అన్నమాట నేను ఎన్నడూ రిక్షా ఎక్కలేదు. మనిషిలాగే రిక్షా ఎక్కడం సరికాదని నా అభిప్రాయం కాని యిప్పుడు తప్పదు రిక్షా ఎక్కడమే ధర్మమని భావించాను భగవంతుడు రక్షించదలిస్తే పిడుగులుపడ్డా పరవాలేదు ఆను సూక్తిజ్ఞాపకం వచ్చింది. ఆరు ఏడు సార్లు నా జీవితంతో యిటువంటి ప్రాణాపాయం కలిగించే పరిస్థితులు వచ్చాయి. అయినా రక్షణ పొందాను అది నా ప్రతాపం కాదు, భగవత్ప్రతాపమే దక్షిణాఫ్రికాలో రిక్షాలు లాగేవాళ్ళంతా హబ్షీలే తెల్లవాళ్లు ఆ రిక్షావాణ్ణి యీ మనిషిని రిక్షా ఎక్కించుకున్నావంటే చావకొడతాం, రిక్షా విరగకొడతాం అని భయపెట్టారు. అందువల్ల రిక్షావాడు ఖా (వద్దు) అంటూ పారిపోయాడు నేనురిక్షా ఎక్కలేకపోయాను

ఇక నడిచివెళ్లాల్సిందే మరో మార్గం లేదు. మేము ముందుకు సాగేకొద్దీ తెల్లవాళ్ల గుంపు పెరిగిపోసాగింది. మేమిద్దరం వెస్ట్ స్ట్రీటులో అడుగుపెట్టాం ఒక బలిష్ఠుడైన తెల్లవాడు శ్రీ లాటిన్‌ను చేతులతో ఎత్తుకు పోయాడు నేనొక్కడినే మిగిలాను రాళ్లు, రప్పలు ఏదిబడితే అది నాకు తగలసాగాయి తలపాగా తీసి ఎవరోవిసిరిపారేశారు. ఇంతలో ఒక తెల్లజాతి బలిష్ఠుడు నా దగ్గరికి వచ్చి గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. కాళ్లతో తన్నాడు. నా కళ్లు గిర్రున తిరిగిపోయాయి. పడిపోతుండగా నాకు అక్కడేవున్న యింటిగేటు చువ్వ చేతి కందింది. అక్కడ కొంచెం శ్వాస పీల్చుకున్నాను. కొద్ది సేపటికి తెలివివచ్చింది. బయలు దేరాను ప్రాణాలతో యింటికి చేరతాననే ఆశ పూర్తిగా పోయింది. అయితే అప్పుడు కూడా నన్ను కొడుతున్న తెల్లవారు దోషులనే భావం నాకు కలగలేదు బాగా జ్ఞాపకం వున్నది

ఇట్టి ప్రమాదస్థితిలో నేను నడుస్తూ వుండగా యింతలో అటునుంచి వెళుతున్న పోలీసు సూపరింటెండెంట్ భార్య నా ఎదురుగా వచ్చింది మేమిద్దరం ఒకరినొకరు చూచుకున్నాం ఆమె బాగా పరిచితురాలే ఆమె ధైర్యవంతురాలు ఆకాశం మేఘావృతంగా వున్నది. సూర్యుడు అస్తమిస్తున్న సమయం ఆమె వెంటనే తనగొడుగు విప్పి నాకు కప్పి తను నా ప్రక్కన నడవసాగింది. ఒక మహిళను, అందులోను డర్బన్ పోలీసు సూపరింటెండెంటు భార్యను, తెల్లవాళ్లు అవమానించలేరు. ఆమెను కొట్టలేరు. అందువల్ల ఆమెను దాటి నాకు తగిలే దెబ్బలు తగ్గాయి. ఈ విషయం పోలీసు సూపరింటెండెంటు గారికి తెలిసింది . మీ రక్షణ కోసం పోలీసుల దళాన్ని ఆయన వెంటనే పంపించాడు. వాళ్లంతా వచ్చిరాగానే నన్ను చుట్టి వేశారు మా త్రోవ పోలీసు స్టేషను దగ్గరగా వెళుతుంది. అక్కడికి చేరేసరికి పోలీసు సూపరింటెండెంటు మా కోసం ఎదురు చూస్తూ నిలబడియున్నారు. పోలీసు స్టేషనులో నన్ను ఆగమన్నాడు. ఆయనకు ధన్యవాదాలు తెలిపి నేను వెంటనే యింటికి చేరుకోవాలి. డర్బన్ ప్రజలకయొక్క న్యాయప్రవృత్తి మీద, నా సత్యం మీద నాకు విశ్వాసం వున్నది. మీరు నా రక్షణకోసం పోలీసు దళం పంపించారు. అందుకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాను శ్రీమతి ఎలిగ్జాండరు నన్ను రక్షించారు" అని అన్నాను

అప్పటినుంచి నాకు ఎక్కువ శ్రమకలుగలేదు. రుస్తుంగారి యింటికి చేరుకున్నాను ప్రొద్దుగూకింది. మేర్‌లాండుఓడకు సంబంధించిన డాక్టరు దాజీ జర్‌జోర్ అక్కడ నాకోసం సిద్ధంగా వున్నారు. నాకు చికిత్స ప్రారంభించారు నాకు తగిలిన గాయాల్ని పరీక్షించారు. పెద్దగా గాయాలు తగలలేదు. కాని కనబడని గట్టి దెబ్బ తగలడం వల్ల నరాలు బాగా పీకుతున్నాయి. ఇంకా నాకు విశ్రాంతి తీసుకునే అదృష్టం కలుగలేదు. బయట రుస్తుంగారి యింటిని తెల్లవాళ్లు వేలాదిమంది చుట్టముట్టారు. రాత్రి కావడంవల్ల లుచ్చాలు, లఫంగాలు కూడా వారిలో చేరిపోయారు నీవు వెంటనే గాంధీని మాకు అప్పగించు లేకపోతే అతడితోబాటు, నిన్ను. నీ యింటిని, నీ కొట్టును తగలేస్తాం అని తెల్లవాళ్లు రుస్తుంగారికి వార్త పంపించారు. అయితే రుస్తుంజీ ఎవ్వరికీ భయపడేరకం కాదు. ఈ విషయం తెలియగానే పోలీసు సూపరింటెండెంటు తమ సి ఐ డి విభాగం అనుచరులతో అక్కడికి వచ్చి జనంలో కలిసిపోయారు. ఒక చెంచీ వేయించుకొని దాని మీద నిలబడి జనంతో మాట్లాడుతూ తెలివిగా రుస్తుంజీ యింటి ద్వారం వద్దకు చేరుకున్నారు ఆ విధంగా గేటు వారి ఆధీనంలోకి వచ్చింది. లోపలికి ఎవర్నీ జొరబడనీయకుండా జాగ్రత్త పడ్డారు. తన అనుచరుణ్ణి పిలిచి వెంటనే ముఖానికి రంగు వేసుకొని భారత వ్యాపారి దుస్తులు ధరించిలోనికి వెళ్లి గాంధీకి తను చెప్పిన సమాచారం అందజేయమని చెప్పాడు. అతడు లోనికి వచ్చి నన్ను కలిశాడు. "నీ ప్రాణం, నీ కుటుంబ సభ్యుల ప్రాణం, రుస్తుంజీ ఆస్థిని రక్షించతలుచుకుంటే తక్షణం వేషం మార్చుకొని కానిస్టేబుల్ దుస్తులు ధరించి మా మనిషితోబాటు క్రిందికి వచ్చి జనాన్నుంచి తప్పించుకొని బయటికి వెళ్లిపో రోడ్డు కొసన మీకోసం కారు రెడీగా వుంది. దానిలో కూర్చొని పోలీసు స్టేషను చేరి సురక్షితంగా వుండండి లేని యెడల యిక్కడ కాల్పులు జరుగుతాయి ఈ జనాన్నిఆపడం కష్టం నా మాటవిని తక్షణం దుస్తులు మార్చుకొని బయటపడండి" అని సూపరింటెండెంట్ చెప్పమన్న సమాచారం ఆ అధికారి నాకు చెప్పాడు నేను స్థితిని గ్రహించాను భారతీయ కానిస్టేబుల్ దుస్తులు ధరించాను రుస్తుం యింటినుండి బయటికి వచ్చి, ఆ పోలీసు ఆఫీసరు వెంట సురక్షితంగా పోలీసు స్టేషను చేరాను ఈ లోపున సూపరింటెండెంట్ అలెగ్జాండర్ పాటలు పాడి, హాస్యంగా మాట్లాడి జనాన్ని కొద్ది సేపు ఆపి వుంచాడు. నేను పోలీసు స్టేషనుకు సురక్షితంగా చేరానని తెలియగానే జనాన్ని యిలా అడిగాడు "మీకు ఎవరు కావాలి? "

"మాకు గాంధీ కావాలి"

"గాంధీ దొరికితే ఏం చేస్తారు?"

"తగల పెడతాం"

"ఆయన ఏం చేశాడని తగల పెడతారు ?"

“మమ్మల్ని గురించి ఇండియాలో చాలా అబద్దాలు చెప్పాడు. భారతీయుల్ని తీసుకు వచ్చి నేటాలును నింపివేయాలని భావిస్తున్నాడు "

"గాంధీ బయటికి రాకపోతే ఏం చేస్తారు "

"ఈ యింటిని తగలబెడతాం"

ఇంట్లో స్త్రీలు, పిల్లలు వున్నారు. (గాంధీ భార్య పిల్లలు వున్నారు. ) స్త్రీలను, పిల్లలను కూడా కాల్చి చంపుతారా? సిగ్గులేదా?"

"అందుకు మీరే బాధ్యులు అంతకంటే మరో మార్గం లేకుండా మీరు చేస్తున్నారు. మరెవ్వరి మీద మేము చెయ్యి చేసుకోము గాంధీని మాకు అప్పగించండి చాలు గాంధీని మాకు అప్పజెప్పకుండా ఎవరినొ చంపుతారా, సిగ్గులేదా? అని మీరు మమ్మల్ని అడగడం ఏమిటి ?"

సూపరింటెండెంట్ చిరునవ్వు నవ్వుతూ మీ మధ్యనుంచి యిప్పుడే గాంధీ వెళ్ళిపోయారు. గదా! ఇక ఎం చేస్తారు. అని జనాన్ని అడిగాడు జనం ఎగతాళి చేస్తున్నాడని భావించి అబద్ధం, శుద్ధ అబద్ధం అని అరిచారు అలెగ్జాండరు. "మీరు మీ యీ వృద్ధ సూపరింటెండెంట్ మాటల్ని నమ్మకపోతే ఒక పనిచేయండి మీలో ముగ్గురు నలుగురు ఒక కమిటీగా ఏర్పడి లోనికి వేళ్ల వెతికిరండి మీ కమిటీ మెంబర్లకు యింట్లో గాంధీ దొరక్కపోతే మీరంతా యిక్కడినుంచి వెళ్ళిపోవాలి అలా అయితేనే మెంబర్లను లోనికి పంపుతాను మీరు యివాళ ఆవేశపడి పోలీసు శాఖ మాట వినలేదు. దానివల్ల పోలీసుల గౌరవం పోలేదు, కాని మీ గౌరవం పూర్తిగా పోయింది. అందువల్ల పోలీసులు గాంధీని మీ మధ్యనుంచే తీసుకొని వెళ్లిపోయారు. మీరే ఓడిపోయారు అందుకు పోలీసులు ఏం చేస్తారు? పోలీసుల్ని నియమించింది. మీరేకదా! అందువల్ల పోలీసులు తమ కర్తవ్యం నెరవేర్చారు. జరిగింది యిదీ" అలెగ్జాండరు తీయగా, హాస్యంగా, తమాషాగా పై విషయాలు మెల్లమెల్లగా చెప్పేసరికి తెల్లవాళ్లంతా తెల్లబోయారు ఆయన చెప్పిన ప్రకారం ఒక కమిటీనిఎన్నికొని లోనికి పంపించారు. వాళ్లులోపలికి వెళ్లి తిరిగివచ్చి గాంధీలేడని, చెప్పివేశారు. తెల్లవారంతా ఎవరిదోవన వాళ్లు యిచ్చిన మాట ప్రకారం రుస్తుంజీ యింటికి హాని తలపెట్టకుండా వెళ్లిపోయారు. ఇది ది 1 జనవరి 1897 నాడు జరిగిన ఘట్టం

ఆరోజున ఉదయమె, యాత్రీకుల మీద విథించిన ఆంక్ష తొలగించిన తరువాత ఒక పత్రికా విలేఖరి నా దగ్గరికి వచ్చాడు. అతడికి భారతదేశంలో జరిగినవిషయాల్ని, నా పత్రికా ప్రకటనల్ని, సవివరంగా వివరించి, కాగితాల్ని కూడా అందజేశాను నేను చెప్పిన విషయాలలో అతిశయోక్తి లేదు. సత్యాన్ని మాత్రమే చెప్పాను. సత్యం చెప్పడం నా కర్తవ్యంగా భావించాను అని కూడా చెప్పాను మర్నాడు అక్కడి పత్రికలన్నింటిలోను నా వాంగ్మూలం సవివరంగా విస్తృతంగా వెలువడింది. చదువుకున్న తెల్లవాళ్లంతా తృప్తిపడ్డారు. అసలు విషయం అక్కడి వాళ్లకందరికీ తెలిసిపోయింది. పత్రికల వారంతా అక్కడి తెల్లవారిని సమర్థిస్తూ, నన్ను ఏమీ తప్పుపట్టకుండా గాంధీచేసింది సరియైన పనే తప్పు వార్తలను నమ్మడం సరికాదని వ్యాఖ్యలు ప్రకటించారు. దానితో అక్కడ నా ప్రతిష్ఠ పెరగడమే గాక, భారతజాతి గౌరవం కూడా ఇనుమడించింది అక్కడి భారతీయులు పిరికిపందలుకారని, భారతీయ వ్యాపారస్తులు గౌరవప్రదంగా తలయెత్తి వ్యాపారం చేసుకోవచ్చుననీ, చేసుకోగల సమర్దులని కూడా వారికి భావం కలిగింది

జరిగిన గొడవవల్ల జాతి ఎన్నో కష్టాలు సహించవలసి వచ్చింది. దాదా అబ్దుల్లాకు కలిగిన నష్టం ఇంతింత కాదు. అయితే దీనివల్ల చివరికి మేలే జరిగిందని నా భావం జాతికూడా తన శక్తి ఏమిటో తెలుసుకున్నది. దాని ఆత్మ విశ్వాసం పెరిగింది. శిక్షణ కూడా లభించింది. ఆ విషయాల్ని గురించి యిప్పుడు యోచిస్తే భగవంతుడు నన్ను సత్యాగ్రహోద్యమం నడుపుటకు తయారుచేస్తున్న సమయం అది అని అనిపిస్తున్నది

నేటాలులో జరిగిన యీ ఘట్టాల తీవ్ర ప్రభావం ఇంగ్లాండుపై పడింది శ్రీ చాంబర్లెస్ వెంటనే నేటాల్ ప్రభుత్వానికి తంతి పంపించి గాంధీగారిమీద దాడి చేసిన తెల్లజాతి వారందరి మీద కోర్టులో కేసు నడపమని, గాంధీగారికి న్యాయం జరపమని ఆదేశించారు. శ్రీ ఎస్కంబ్ అప్పుడు నేటాల్ ప్రభుత్వ అటార్నీ జనరల్‌గా వున్నారు. ఆయన నన్ను పిలిపించుకొని చేంబర్లెస్ పంపిన తంతి విషయం చెప్పాడు. ప్రమాదం తొలగినందుకు నాకు శుభాకాంక్షలు అందజేశాడు. మీకు గాని మీ జాతివారికి గాని దెబ్బలు తగలడం, బాధ కలగడం నాకు యిష్టం లేదు. తెల్లవాళ్లు మిమ్మల్ని కొడతారేమోనని భయపడి నేను మీరు పగలు దిగవద్దు అని సలహా పంపాను నా సలహా మీకు నచ్చలేదు. మీరు మి॥లాటస్ సలహా అంగీకరించారు. ఆందుకు నేను మిమ్ము దోషం పట్టడం లేదు. మీకు నచ్చినట్లు మీరు చేయవచ్చు తప్పులేదు చేంబర్లెస్ కోరిన విషయంతో నేటాలు ప్రభుత్వం ఏకీభవిస్తున్నది దోషులకు దండన విధించితీరాలి దాడిచేసిన వారిని మీరు గుర్తించగలరా అని ప్రశ్నించాడు

ఇద్దరు ముగుర్ని గుర్తించడం సాధ్యమే కాని ఒక విషయం స్పష్టంచేస్తున్నాను ఎవరో ఏదో అన్నాడని చెప్పేసరికి నమ్మి ఆవేశపడి నన్ను హింసించిన వారిపై ఏ మాత్రమూ నాకు కక్షలేదు కార్పణ్యం లేదు. వాళ్లమీద కోర్టులో కేసు పెట్టసు. నిజానికి యిందు వారి దోషం ఏమీ లేదు. తమ నాయకులు ఏదో చెబితే వాళ్లు నమ్మారు. నాయకులు చెప్పింది నిజమా అబద్ధమా అని ఆలోచించుటకు వారికి సమయం చిక్కలేదు నన్ను గురించి చెప్పుడు మాటలులు వినడం, వాటిని నమ్మడం, నా మీద వారు చేయి చేసుకోవడం సహజమే మందిని రెచ్చగొడితే సహజంగా యిదే జరుగుతుంది అసలు జరిగిన దానిలో తప్పంతా మీ తెల్లవారు ఎన్నుకున్న కమిటీది ఆ కమిటీకి బోధ చేసిన మీది మీ నేటాల్ ప్రభుత్వం వారిది. నేను భారత దేశంలో ఏమేమో మిమ్మల్ని అన్నానని రూటరు ప్రతినిధి ఎవరో వార్త పంపాడు. ఆ వార్త మీరు చదివారు. మీకు కోపం వచ్చింది. ఆ తరువాత నేను నేటాలు వస్తున్నానని మీకు తెలిసింది రాగానే మీరుగాని, మీ ప్రభుత్వం వారు గాని, మీ కమిటీవారుగాని నన్ను కలిసి వాస్తవం ఏమిటి అని అడిగి తెలుసుకోవద్దా? అట్టి అవసరమే లేదా? నా జవాబు విని మీరు ఒక నిర్ణయానికి వచ్చి యుంటే యింత రగడ జరిగి యుండేదేకాదు ఇదేమీ చేయకుండా నా మీద మీరు తిన్నగా చర్యతీసుకున్నారు. ఇందుకై మీమీద గాని, మీ కమిటీ మీద గాని నేను కేసు పెట్టదలచలేదు కేసు పెట్టడం ధర్మమే అయినా మీరు చేసిన దానికి కోర్టు ద్వారా మీపై చర్య తీసుకొనేలా చేయడం నాకు యిష్టం లేదు. నేటాలు యంచలి తెల్లవారి లధికారాల్ని రక్షించడం కోసం మీకు ధర్మమని తోచిన విధానాన్ని మీరు అనుసరించారు ఇది రాజకీయ వ్యవహారం నేను కూడా రాజకీయ రంగంలోనే మీతో పోరాటం సాగించవలసి యున్నది బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశం పెద్ద భూభాగమని, తెల్లవారికంటే ఎక్కువ జనసంఖ్య గలిగిన దేశమని, కనుక తెల్లవారికేవరికీ ఏవిధమైన నష్టము కలిగించకుండా తన స్వాభిమానాన్ని, అధికారాల్ని మాత్రమే భారతజాతి రక్షించదలుస్తున్నదని స్పష్టం చేయవలసిన అవసరం ఎంతైనా వున్నది" అని చెప్పాను

శ్రీ ఎస్కంబ్ - మీరు చెప్పిన విషయం నాకు అర్థమైంది. నాకు నచ్చింది కూడా మీపై దాడిచేసిన వారిపై కేసు పెట్టడానికి మీరు సిద్ధపడరని నేనూహించి యుండలేదు. మీరు కేసు పెట్టదలచి యుంటే నాకు ఏమాత్రము కోపం వచ్చి యుండేది కాదు. మీరు మీ నిర్ణయం ప్రకటించారు కనుక మీ నిర్ణయం మంచిదని చెప్పడం నా కర్తవ్యమని భావిస్తున్నాను ఇంత సంయమం కలిగిన మీరు మీ జాతికి పెద్ద మేలు చేయగలుగుతారు మీరు యీ నిర్ణయం ద్వారా నేటాలు ప్రభుత్వాన్ని కూడా పెద్ద యిబ్బందినుంచి తప్పించారని చెప్పక తప్పదు. మీరు కోరియుంటే మేము తప్పక తెల్లవారిని నిర్బంధంలోకి తీసుకొని శిక్షించియుండేవాళ్లం. దానితో వాళ్లు పేట్రేగిపోయి రభస చేసేవారు. ఇలా జరిగితే ఏ ప్రభుత్వమూ అంగీకరించదుగదా! ఇది సామాన్య మైనవిషయం కాదు కనుక కేసు పెట్టను అని నిర్ణయానికి మీరు వచ్చి యుంటే ఒక కాగితం మీద ఆ విషయం వ్రాసి నాకు యివ్వండి మనిద్దరిమధ్య జరిగిన సంభాషణ వివరం మాత్రమే మీ. చేంబర్లెస్‌కు వ్రాసి నేను నా ప్రభుత్వానికి రక్షణ కల్పించలేను మీరిచ్చిన పత్రమందలి విషయాన్ని తంతి ద్వారా వారికి తెలియజేస్తాను. మీరు అటువంటి బాబు యిప్పుడే వ్రాసియిమ్మని నేను కోరను మీ మిత్రులతో చర్చించండి మి. లాటిన్‌ గారి సలహాకూడా తీసుకోండి ఆ తరువాతకూడా మీరు మీ నిర్ణయం మీద స్థిరంగా వుండగలిగితే అట్టి జాబు వ్రాసి. నాకు యివ్వండి ఒక్క విషయం మాత్రం స్పష్టగా చెబుతున్నాను మీ మీద దాడిచేసినవారి మీద కేసు నడపడం యిష్టం లేదని మీరు మీ బుద్ధిపూర్వకంగా వ్రాసి యివ్వాలి అందుకు బాధ్యత మీరే వహించాలి. అప్పుడే నేను మీ జాబును ఉపయోగించగలుగుతాను "

"మీరు యీ విషయం మాట్లాడుటకు పిలిపించారని నేను ఊహించలేదు ఈ విషయమై ఎవ్వరితోను నేను చర్చించలేదు. చర్చించాలనే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. నేను శ్రీ లాటిన్‌గారి వెంట బయలు దేరి ఓడదిగి ముందుకు సాగినప్పుడే తెల్లవారు ఎంతటి కష్టం కలిగించినా వారిని తప్పుపట్టను అని మనస్సులో నిర్ణయించుకున్నాను. అందువల్ల నా మీద దాడిచేసినవారి మీద కేసు పెట్టడానికి ఆస్కారమే లేదు. నా మనస్సులో ఒక ధార్మిక ప్రశ్న బయలుదేరింది. మీరు అన్న ప్రకారం నా యీ సంయమంవలన నాజాతితోబాటు నాకుకూడాలాభం కలుగుతుందని భావిస్తున్నాను అందువల్ల బాధ్యతంతా నా నెత్తిన వేసుకొని యిప్పుడే మీరు కోరిన పత్రం వ్రాసి యివ్వదలిచాను" అని చెప్పాను

నేను శ్రీ ఎస్కంబ్‌గారిని ఒక తెల్ల కాగితం అడిగి తీసుకొని, అక్కడే వ్రాసి, వారికి ఆ పత్రం యిచ్చివేశాను


8

భారతీయులు ఏంచేశారు? -3

ఇంగ్లాండులో చేసిన పనులు

గతప్రకరణాల్లో భారతీయులు తమస్థితిగతులయందు మార్పులు తెచ్చుటకు చేసిన ప్రయత్నాలను గురించి, ప్రతిష్ఠను పెంచుకొన్న పద్ధతిని గురించి పాఠకులు తెలుసుకున్నారు. దక్షిణాఫ్రికాలో భారతీయుల సర్వాంగీణ వికాసానికి ఇంగ్లాండు నుంచి లభించ గలిగినంత సాయం పొందడానికి అవిరళకృషి చేశారు. భారతీయులు జరిపిన ప్రయత్నాల్ని గతంలో వివరించాను