దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/భారతీయులు ఏం చేశారు?-1

వికీసోర్స్ నుండి

కేవలం ఉదాహరణకు మాత్రమే వారి పేర్లు వాళ్ల ప్రఖ్యాతిని గురించి పేర్కొన్నాను. మిగతా మూడు రాజ్యాలకంటే కేప్ కాలనీలో రంగుద్వేషం, మరియు భారతీయుల యెడ వ్యతిరేకత తీవ్రంగా లేకపోయినప్పటికీ, మిగతా ప్రాంతాల ప్రభావం పడకుండా వుండటం సాధ్యం కాదుగదా | అందువల్ల అక్కడ కూడా నేటాలు వలెనే భారతీయుల ప్రవేశం, వ్యాపారం మీద ఆంక్షలు విధిస్తూ ఇమిగ్రేషన్ రెస్ట్రిక్షన్ ఆక్టు, మరియు డీలర్స్ లైసెన్సు ఆక్టు ప్యాసయ్యాయి

మొత్తం మీద దక్షిణాఫ్రికాలో భారతీయుల కోసం తెరిచియున్న ద్వారాలు బోయర్ యుద్ధం నాటికి పూర్తిగా మూసుకున్నాయని చెప్పవచ్చు ట్రాన్స్‌వాల్‌లో భారతీయుల ప్రవేశం పై విధించబడిన 3 పౌన్ల ఫీజు తప్ప మరే ఆంక్షలేదు కాని నేటాలు, కేప్ కాలనీల హార్బర్లు భారతీయులకు ప్రవేశాన్ని నిషేధించాయి యిక ట్రాన్స్‌వాల్ చేరాలంటే భారతదేశాన్నుంచి వెళ్లే భారతీయులు ఎక్కడా దిగడానికి వీలులేదు. ఒక్కమార్గం వున్నది. పోర్చుగీసు వారి హార్బరు డేలాగోవావేలో దిగి ట్రాన్స్‌వాల్ చేరవచ్చు. అయితే అక్కడ కూడా తెల్లవారి రాజ్యాల వలెనే కొద్దో గొప్పో భారతీయులకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించబడ్డాయి. యీ పరిస్థితుల్లో కొద్ది మంది భారతీయులు మాత్రమే పలుకష్టాలు సహించి, లంచాలు యిచ్చి నేటాలు. మరియు డేలో గోవావే, హార్బర్లలో దిగి ట్రాన్స్‌వాల్‌కు చేరుతూవుండేవారు




6

భారతీయులు ఏం చేశారు? -1

గత ప్రకరణాల్లో తమ మీద జరుగుతున్న దాడులను ఎదుర్కొంటూ భారతీయులు గైకొన్న చర్యలను గురించి కొంత తెలుసుకున్నాము అయితే సత్యాగ్రహప్రారంభాన్ని గురించి బాగా తెలుసుకొనుటకు, భారతీయుల రక్షణ కోసం చేసిన ప్రయత్నాలను గురించి వ్రాయడం అవసరమని భావిస్తున్నాను.

1893 వరకు దక్షిణాఫ్రికాలో స్వతంత్ర భారతీయుల్లో భారతదేశప్రజల హితాన్ని రక్షించగల చదువుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా వున్నది ఇంగ్లీషు తెలిసినవారిలో ఎక్కువ మంది క్లర్కులు తమ వృత్తి నెరవేర్చగలంతవరకే వారికి ఇంగ్లీషు తెలుసు ఆర్జీలు వ్రాయలేరు. పూర్తి సమయం తమ యజమానుల కోసం వెచ్చిస్తూ వుండేవారు. దక్షిణాఫ్రికాలో జన్మించిన, ఇంగ్లీషు తెలిసినవారు కొందరున్నారు. వాళ్లు గర్‌మిటియాల సంతతికి చెందినవారు. వాళ్లు కొద్దిగా యోగ్యత పెంచుకొని కోర్టుల్లో దుబాసీలుగా ప్రభుత్వ నౌకరీలు చేసుకుంటున్నారు. భారతీయుల స్థితిచూచి సానుభూతిని మాత్రమే వెల్లడించి వూరుకునేవారు. అదే వారు చేయగలిగిన గొప్ప సేవ

గిర్‌మిటియాలు. గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన వారు అధికంగా ఉత్తర ప్రదేశ్ మరియు మద్రాసుకు చెందిన వారు స్వతంత్ర భారతీయుల్లో గుజరాత్‌కు చెందిన మహమ్మదీయ వ్యాపారస్తులు హిందూ గుమాస్తాలు, మెహతాలు వున్నారు. వీరు గాక కొద్దిమంది పారసీ వ్యాపారస్తులు, క్లర్కులు వున్నారు. దక్షిణాఫ్రికా యందంతట వున్న పారసీకుల సంఖ్య 30 లేక 40 మందిని మించి లేదు. స్వతంత్ర్య వ్యాపారుల్లో నాలుగోవర్గం సింధీలు సింధీలు భారతదేశం వదిలి బయటికి వెళ్లి ఫాన్సీ గూడ్సు వ్యాపారులుగా గుర్తింపు పొందారు. పాన్సీ గూడ్సు షాపుల్లో వారు ప్రత్యేకించిపట్టు, జరీ సామాను, నగిషీ చెక్కిన అద్దాలు, చందనం, రకరకాల ఏనుగు దంతాల పెట్టెలు, యిటువంటివే గృహ సంబంధమైన వస్తువులు అమ్ముతూ వుంటారు వారి దగ్గర సొమానుకొనే వారంతా అక్కడ సామాన్యంగా ఆంగ్లేయులే

గిరిమిటియా కార్మికుల్ని తెల్లవాళ్లు కూలీలని పిలిచేవారు. కూలీ అంటే బరువులు మోసే కార్మికుడన్నమాట కూలీ శబ్దం బాగా ప్రచారం పొందింది గిరిమిటియా కార్మికులు సైతం మీరెవరు అని అడిగితే కూలీలం అని సమాధానం చెబుతూ వుండేవారు. ఆ తరువాత మెల్లమెల్లగా భారతీయులందరికీ కూలీ అనే శబ్దం రూఢమై పోయింది. ఇంగ్లీషువాళ్లు భారతీయ వకీళ్లను కూలీవకీళ్లు అవి, భారతీయ వ్యాపారస్తుల్ని కూలీ వ్యాపారస్తులని అనడం ప్రారంభించారు. యీ విశేషణం వాడటం తప్పని చాలా మంది ఇంగ్లీషు వాళ్లకు తెలియదు. అయితే చాలా మంది తిరస్కారభావం ప్రకటించడానికే కూలీ అనే శబ్దం వాడుతూ వుండేవారు. యిది చాలా మంది భారతీయులకు యిష్టం లేదు. అందువల్ల స్వతంత్ర భారతీయులు తాము గిర్‌మిటియాలం కామని చెప్పి ప్రత్యేక గుర్తింపుకోసం ప్రయత్నిస్తూ వుండేవారు. అందువల్ల స్వతంత్ర భారతీయులు, గిర్‌మిటియా కార్మికులు. గిర్‌మిటియా ప్రధనుంచి ముక్తి పొందిన వారు అను తేడా దక్షిణాఫ్రికా భారతీయుల్లో బయలు దేరింది

దుఃఖ సముద్రాన్ని అరికట్టుటకు స్వతంత్ర భారతీయులు ముఖ్యంగా ముస్లిం వ్యాపారస్తులు పూనుకున్నారు. గిర్‌మిటియా కార్మికుల సహాయంగాని, గిర్‌మిటియా ప్రధనుంచి ముక్తి చెందిన వారి సహాయంగాని వారు తీసుకోలేదు. అలా చేయాలనే భావం కూడా అక్కడ ఎవ్వరికీ తట్టలేదు. తట్టినా వాళ్లను చేర్చుకుంటే కార్యం చెడిపోయే ప్రమాదం వున్నది అసలు దాడి జరుగుతున్నదంతా స్వతంత్ర భారతీయ వ్యాపార వర్గం మీదనే కనుక రక్షణ దృష్ట్యా కూడా యిలా భావించడం జరిగింది. యిటువంటి కష్టాలు ఎన్ని వచ్చినా, ఇంగ్లీషురాకపోయినా, ప్రజా సేవా రంగంలో పని చేసిన అనుభవం పొందక పోయినా, స్వతంత్ర భారతీయ వ్యాపారస్తులు మాత్రం కష్టాల్ని గట్టిగా ఎదుర్కొన్నారని చెప్పక తప్పదు వాళ్లు ఆంగ్ల బారిష్టర్ల దగ్గరికి వెళ్లి వాళ్ల చేత అర్జీలు తయారు చేయించి ప్రభుత్వానికి పంపించారు ప్రతినిధి బృందాల్ని కూడా పంపించారు. అవకాశం వున్న ప్రతిచోట వారు అన్యాయాల్ని తీవ్రంగా ప్రతిఘటించారు. 1893 వరకు స్థితి యిలాగే వున్నది

ఈ పుస్తకాన్ని అర్థం చేసుకొనుటకు పాఠకులు కొన్ని తేదీలు జ్ఞాపకం పెట్టుకోవడం అవసరం పుస్తకం చివర ముఖ్య ఘట్టాల అనుబంధంలో వాటి తేదీలతో బాటు యివ్వడం జరిగింది. వాటిని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వుంటే అక్కడి సత్యాగ్రహ చరిత్ర తేలికగా బోధపడుతుంది 1893 నాటికి ఆరెంజ్ ఫ్రీ స్టేటులో భారతీయుల అతీగతీ లేకుండా పోయింది. ట్రాన్స్‌వాల్‌లో 1885 నాటి బిల్లు యందలి 3వ నిబంధన అమలులోకి తేవడం జరిగింది. నేటాలులో కేవలం గిర్‌మిటియాలు మాత్రమే వుండుటకు వీలుగాను, మిగతా భారతీయులు వుండుటకు వీలులేని విధంగాను నిర్ణయాలు గైకొనుటకు జవాబుదారీ ప్రభుత్వ ఏర్పాటుజరిగింది. 1893 ఏప్రిల్ మాసంలో భారతదేశం వదిలి నేను దక్షిణాఫ్రికాకు బయలుదేరాను నాకు గిర్‌మిటియాల చరిత్ర తెలియదు. నేను స్వార్ధం కొసమే అక్కడికి వెళ్లాను డర్బన్‌లో పోర్‌బందరుకు చెందిన ముస్లిం దాదా అబ్బుల్లా పేరిట ఒక ప్రసిద్ధ వ్యాపార సంస్థవున్నది. అంత ప్రసిద్ధిగల వ్యాసారసంస్థ మరొకటి వీరికి పోటీగా వున్నది. ఇది పోర్‌బందర్‌కి చెందిన తయ్యబ్‌హాజీఖాన్ మహమ్మద్ గారి వ్యాపార సంస్థ అది ప్రిటోరియాలో వున్నది దురదృష్టవశాత్తు వీరిద్దరిమధ్య కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది దాదా అబుల్లా గారి భాగస్వామి ఒకడు పోర్‌బందరులో వున్నాడు. నావంటి క్రొత్త బారిష్టరు దక్షిణాఫ్రికా వెళితే తమ కేసు కొంత సులువుగా సాగుతుందని భావించాడు నావంటి అనుభవంలేని క్రొత్త బారిష్టరు ప్రవేశించడం వల్ల తమ వ్యాజ్యం దెబ్బతింటుందని ఆయన అనుకోలేదు. అక్కడ కోర్టుకు వెళ్లి నేను వాదించనవసరం లేదు. వారి పక్షాన వాదిస్తున్న ధురంధరులైన వకీళ్లకు, బారిష్టర్లకు దుబాసీగా వుండి కేసుల్ని గురించి వివరాలు చెబుతూ సహకరించాలి నాకు క్రొత్త అనుభవాలు గడించాలనే కోరిక వున్నది. యాత్ర చేయడం నాకు యిష్టమే బారిష్టరుగా పని చేస్తూ నా దగ్గరికి కేసులు తీసుకు వచ్చే దళారులకు కమీషన్ యివ్వడం నాకు విషంతో సమానంగా వున్నది కారియావాడ్ (సౌరాష్ట్ర) యందలి గొడవలు, కుట్రలు చూచి నాకు చిరాకు వేసింది. ఒక సంవత్సరం కాలం మాత్రమే ఒప్పందం చేసుకున్నాము యీ ఒప్పందం నాకు నచ్చింది. యిందునాకు కలిగే నష్టమేమీ లేదు రాకపోకలకు, అక్కడ వుండుటకు అయ్యే ఖర్చంతా దాదా ఆబ్దుల్లాయే భరిస్తారు. యిది గాక పని చేసినందుకు 105 పౌండ్లు పీజు విడిగా యిస్తారు. యీ ఏర్పాటంతా కీర్తిశేషులు మా పెద్దన్నగారు చేశారు. వారు నాకు పిత్రుతుల్యులు వారి సౌకర్యమే నా సౌకర్యం నేను దక్షిణాఫ్రికా వెళ్లడం వారికి యిష్టం అందువల్ల నేను 1893 మేలో డర్భన్ చేరాను.

ఇక బారిష్టర్ దర్జాను గురించి నన్ను అడగాలా? నా లెక్క ప్రకారం ఫ్రాంక్ కోటు, నెక్‌టై మొదలగు వాటిని ధరించి దర్జాగా ఓడ నుంచి డర్బన్ హార్బరులో దిగాను దిగంగానే నా కండ్లు తెరుపుడు బడ్డాయి దాదా అబ్దుల్లా గారి భాగస్వామి నేటాలును గురించి పోర్‌బందరులో నాకు చెప్పిన మాటలకు. యిక్కడ నాకు కనబడ్డ దృశ్యాలకు ఎంతో వ్యత్యాసం కనబడింది అయితే యిందులో అతని దోషం ఏమీ లేదు. నిరాడంబరత్వం, అమాయకత్వం ఆయనకు వాస్తవపరిస్థితులు తెలియక పోవడం అందుకు కారణం నేటాలులో భారతీయులు అనుభవిస్తున్న కష్టాలు ఏమిటో ఆయనకు తెలియవు తెల్లవాళ్లు చేసే అవమానాలు వారికి ఆవమానాలని అనిపించలేదన్నమాట అక్కడ అడుగు పెట్టిన నాడే భారతీయుల ఎడ తెల్లవాళ్లు అవలంభించే అవమానకరమైన చేష్టలు ఏమిటో నాకు బోధపడ్డాయి

నేటాలు చేరిన పదిహేనురోజుల్లోనే నాకు ఎన్నో కటు ఆనుభవాలు కలిగాయి త్రోవలో దెబ్బలు తినవలసి వచ్చింది. హోటళ్లలో వుండటానికి అక్కడచోటు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది. అక్కడ హోటళ్లలో చోటు దొరకడం అసంభవం ఆ ఘట్టాల వివరాల్లోకి నేను పోదలచలేదు. ఆకటు అనుభవాలు నా రోమరోమానికి హత్తుకు పోయాయని మాత్రం చెప్పగలను నేను ఒక్క కేసు విషయంలో పని చేయుటకు అక్కడకు వెళ్లాను. అందు నాకు స్వార్థం వున్నది అనుభవంగడించాలనే ఉత్సాహం వున్నది. అందువల్ల ఆ సంవత్సరమంతా కటు అనుభవాలు అనుభవిస్తూ సాక్షిగా వుండిపోయాను. నా కార్యక్రమ ప్రారంభం అప్పటినుంచి జరిగింది నా స్వార్థం కోసం దక్షిణాఫ్రికా రావడం నాకు విశేషమనిపించలేదు అవమానాలు, తిరస్కారాలు లభించే చోట వుండి ధనం సంపాదించడానికి నా దృష్టిలో విలువ పోయింది యాత్రలు చేయాలనే కోరికకూడా తగ్గిపోయింది అది నాకు సుతరామూ యిష్టం లేదు. నేను ధర్మ సంకటంలో పడిపోయాను నా ఎదుట రెండు మార్గాలు వున్నాయి. భారతదేశంలో వున్నప్పుడు ఏమాత్రమూ తెలియని దక్షిణాఫ్రికా పరిస్థితుల్ని కండ్లారా చూచి, అనుభవించి సంవత్సరంపాటు చేసుకున్న ఒప్పందం ప్రకారం వుండి, ఆ తరువాత తక్షణం భారత దేశానికి తిరిగి వెళ్లిపోవడం ఒక మార్గం. అక్కడ వుండి ఏది ఏమైనా సరే ప్రారంభించిన పని పూర్తి చేయడానికి పూనుకోవడం రెండవ మార్గం. నేను విపరీతమైనచలిలో, మెరిత్స్‌బర్గ్ రైలుస్టేషన్లో, రైల్వే పోలీసుల దెబ్బలు తన్నులు తిని, యాత్రను ఆపి వేసుకొని రైలునుంచి దిగి, వైటింగ్ రూములో కూర్చొని వున్నాను నా సామాను ఎక్కడ వున్నదో నాకు తెలియదు. ఎవరినైనా అడుగుదామంటే ధైర్యం చాల లేదు. మళ్లీ అవమానం జరిగితే? మళ్లీ తన్నులు తినవలసి వస్తే? అట్టిస్థితిలో చలికి గజగజ వణుకుతూ కూర్చున్న వాడికి నిద్ర ఎలా పడుతుంది? మనస్సు ఆలోచనల సుడిగుండంలో చిక్కుకున్నది యోచిస్తూనే చాలా రాత్రి గడిచింది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇక్కడ నుంచి పారిపోవడం పిరికితనం చేబట్టిన పనిని నేను పూర్తి చేసితీరాలి వ్యక్తిగతమైన అవమానాలు సహించి, తన్నులు తినవలసి వచ్చినా తిని నేను ప్రిటోరియా చేరి తీరాలి యిదే నా నిర్ణయం ప్రిటోరియా నా కేంద్రస్థలి అక్కడే దాదా అబ్దుల్లా వ్యాజ్యం నడుస్తున్నది. నా పనులు చేసుకుంటూ భారతీయులు పడుతున్న కష్టాల్ని తొలగించుటకు చేతనైనంత సహాయం చేయాలి యిట్టి నిర్ణయానికి వచ్చిన తరువాత నాకు కొద్ది శాంతి లభించింది. నాకు క్రొత్త శక్తి కూడా కలిగినట్లనిపించింది. అయినా నాకు నిద్ర పట్టలేదు

తెల్లవారగానే నేను దాదా అబ్దుల్లా కొట్టుకి, రైల్వే జనరల్ మేనేజరుకు టెలిగ్రాములు పంపాను యిద్దరి నుంచి సమాధానం వచ్చింది. దాదా అబ్దుల్లా, అప్పుడు నేటాలులోవున్న వారి భాగస్వామి సేఠ్ అబ్దుల్లా హాజీ ఆదమ్‌ఝబేరీ యిద్దరూ భాగా స్పందించారు. వేరువేరు చోట్ల, మార్గంలో గల తమ భారతీయ ఏజంట్లకు నాకు ఏర్పాట్లు చేయమని టెలిగ్రాములు పంపించారు. వారు జనరల్ మేనేజర్ని కూడా కలిశారు. స్థానిక ఏజంటుకు యిచ్చిన వారి తంతి నందుకొని మెరిత్స్‌బర్గ్‌లో నివసిస్తున్న భారతీయ వ్యాపారస్తులు వచ్చి నన్ను కలిశారు వారు నాకు ధైర్యం చెప్పారు యిలాంటి కటు అనుభవాలు తమకు కూడా ఎన్నో కలిగాయనీ, అయితే మేము వీటికి అలవాటు పడిపోయాము కనుక మాకు ఏమీ బాధ అనిపించదు అని చెప్పారు. వ్యాపారానికి సున్నితమనస్సుకు పొంతన కుదరదని, అందువల్ల డబ్బును, డబ్బుతో పాటు యిట్టి అవమానాలను రెండిటినీ గల్లాపెట్టెలో పెట్టడం నేర్చుకున్నామని కూడా చెప్పారు. ఆ స్టేషనులోకి సింహద్వారం నుంచి భారతీయుల్ని లోనికి రానీయరని, టిక్కట్లు తీసుకునే చోట కూడా యిబ్బందులు తప్పవని చెప్పారు. ఆ రాత్రికి వచ్చిన రైల్లో నేను ప్రిటోరియాకు బయలు దేరాను నేను చేసుకున్న నిర్ణయం గట్టిదో ఓటిదో తేల్చుకోవాలని అంతర్యామి యగు పరమేశ్వరుడు పూర్తిగా నన్ను పరీక్షించాడు. ప్రిటోరియా చేరే లోపున యింకా అవమానాలు సహించవలసి వచ్చింది. దెబ్బలు, తన్నులు తినవలసి వచ్చింది. అయితే యివన్నీ నా నిర్ణయానికి బలం చేకూర్చాయి

ఈ విధంగా 1893 లో అనుకోకుండా నాకు దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయుల దుస్థితిని చూచి స్వయంగా ఆనుభవించి తెలుసుకునే అవకాశం లభించింది. అవకాశం దొరికినప్పుడు ప్రిటోరియాలో గల భారతీయులతో యీ విషయం చర్చించాను వారికి పరిస్థితిని తెలియజేశాను అంతకంటే మించి నేను ఏమీ చేయలేదు. దాదా అబ్దుల్లా గారి కేసును గురించి పని చేయడం. దక్షిణాఫ్రికా యందలి భారతీయుల కష్టాలు తొలగించుపనిచేయడం యీ రెండూ ఒకేసారి చేయడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చాను. రెండుపనులు ఒకేసారి చేయడమంటే రెండిటినీ చెడగొట్టడమే అవుతుంది. 1894వ సంవత్సరం వచ్చింది. ఒక్క సంవత్సరం గడిచిపోయింది. అబ్దుల్లా గారికేసుకూడా పూర్తి అయింది. నేను డర్బన్ తిరిగి వచ్చాను. భారత దేశం వచ్చి వేయుటకు సిద్ధమయ్యాను దాదా అబ్దుల్లో నా కోసం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరో నా చేతికి "నేటాల్ మెర్క్యురీ" అను పత్రికను అందించారు. ఆ పత్రికలో నేటాలు అసెంబ్లీలో జరిగిన చర్యల వివరమంతా ప్రకటించబడింది. భారతీయులకు ఓటింగు హక్కు ఇండియన్ ఫ్రేంచైజ్ అనుశీర్షికను వ్రాసి యున్న కొన్ని పంక్తులు చదివాను. అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో భారతీయులు అడుగు పెట్టేందుకు వీలులేకుండా చేస్తూ వారికి ఓటింగు హక్కును నిరాకరిస్తూ వెంటనే ఒక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నదని అపత్రిక వల్ల తెలిసింది. అంటే భారతీయుల ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్నమాట ఆ వివరమంతా సన్మాన సభకు వచ్చిన వారికి చదివి వినిపించి, అందువల్ల కలిగే పరిణామాల్ని కూడా విడమరిచి చెప్పాను యీ విషయమై యదార్థాలు నాకు సవివరంగా తెలియవు తెల్లవాళ్ల యీ ప్రయత్నాన్ని తీవ్రస్థాయిలో ఎదుర్కోవడం అవసరమని భారతీయులకు ఉద్బోధించాను వారంతా అందుకు అంగీకరించారు. అయితే మేము తిన్నగా ఉద్యమం నడపలేము, దయయుంచి ఒక్కనెల రోజులు మీరు యిక్కడ వుండండి అని వారంతా నన్ను కోరారు. యీ ఉద్యమం నడుపుటకు ఒకటి రెండు మాసాలు నేటాలులో వుండుటకు అంగీకరించాను ఆనాటి రాత్రి అసెంబ్లీకి పంపుటకు అర్జీ తయారు చేశాను బిల్లు ఆమోదాన్ని కొంత కాలం ఆపి వుంచమని తంతి అసెంబ్లీకి పంపించాము వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేశాము సేఠ్ అబ్దుల్లా హాజీ అదమ్‌ను ఆ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకున్నాము. పైన తెలిపిన టెలిగ్రాం వారి పేరటనే పంపించాము అందువల్ల బిల్లు పఠనం నేటాల్ అసెంబ్లీలో రెండు రోజులు ఆగిపోయింది ఆ అర్జీ దక్షిణాఫ్రికా అసెంబ్లీ అధికారులు నేటాలు అసెంబ్లీకి పంపించారు. అది భారతీయులు దాఖలు చేసిన మొదటి ఆర్జ దాని ప్రభావం బాగా పడింది. అయినా అసెంబ్లీలో బిల్లు ప్యాసు అయిపోయింది ఆ వివరాలు నాలుగో ప్రకరణంలో వ్రాశాను ఇది దక్షిణాఫ్రియందలి భారతీయులందరికీ. ఉద్యమం నడుపుటకు కలిగిన ప్రధమ అనుభవం దానితో వారి ఉత్సాహం పెరిగింది. ప్రతిరోజూ సభలే రోజురోజుకు జనం ఆ సభల్లో విపరీతంగా పొల్గొన సాగారు అవసరమైన దానికంటే అధికంగా ధనం వసూలు చేశారు. నకళ్లు తయారు చేయుటకు. సంతకాలు చేయించుటకు వాలంటీర్లు పెద్ద సంఖ్యలో లభించారు. వాళ్లు తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి పని చేశారు. యీ ఉద్యమంలో గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయులు కూడా పాల్గొన్నారు. వారందరికీ ఇంగ్లీషు వచ్చు. అంత అందమైన అక్షరాలతో వ్రాయగలిగినవారే వారంతో రాత్రింబగళ్లు కష్టపడిపనిచేశారు ఒక్క నెలరోజుల్లో 10 వేల మందితో సంతకాలు చేయించి పెద్ద అర్జీ లార్డ్ రిప్పన్‌కు పంపించారు. దానితో నా పని పూర్తి అయింది

ఇంటికి వెళ్లిపోతానని అందరికీ చేప్పాను ప్రారంభించిన ఉద్యమం భారతీయుల్లో క్రొత్త చైతన్యం తెచ్చింది. వాళ్లు వెళ్లవద్దని, ఉద్యమం విజయవంతం అయ్యేవరకు వుండమని నన్ను వత్తిడి చేయసాగారు. నేటాలు ప్రభుత్వం భారతీయుల్ని వెళ్లగొట్టడానికి పూనుకున్నది మనం పంపిన మంత్రి ఏం సమాధానం పంపుతాడో ఎవరి కెరుక? మా ఉత్సాహం చూచారు కదా పని చేయడానికి మేము సిద్ధంగా వున్నాము. కాని మాకు మార్గదర్శకుడు కావాలి. లేకపోతే చేసిందంతా వ్యర్థమైపోతుంది. అందువల్ల యిక్కడ వుండటం మీ ధర్మం అని వాళ్లు స్పష్టంగా చెప్పారు. భారతీయుల హక్కుల రక్షణకై అక్కడ స్థిరంగా ఒక సంస్థ అవసరమని అందుకు నేను వుండటం అవసరమని నాకూ అనిపించింది. కాని ఎక్కడ వుండాలి, ఎలా వుండాలి అనునది నాకు సమస్యగా మారింది. జీతం యిస్తామని వాళ్లు అన్నారు కాని నేను జీతం తీసుకొని పని చేయనని స్పష్టంగా చెప్పివేశాను ప్రజాసేవా కార్యక్రమాలు జీతాలు తీసుకొని చేయకూడదని నా నిశ్చితాభిప్రాయం అందులో యీ ఉద్యమానికి పునాది వేసింది నేను ఆ రోజుల్లో భారతీయుల గౌరవమర్యాదలు యినుమడించేలా నేను దర్జాగా వుండాలని భావించేవాణ్ణి అయితే అలా వుండాలంటే బాగా డబ్బు కావాలి భారతీయులకు మేలు కలిగించు సంస్థలో పని చేయడం, ప్రజలపై వత్తిడి తెచ్చి వాళ్ల దగ్గర దబ్బు వసూలు చేయడం, రెండో వైపున జీవన భృతి కోసం వాళ్ల మీద ఆధారపడటం యీ రెండూ పొసగని విషయాలు యిలా చేస్తే పని చేసే నాశక్తి కూడా తగ్గిపోతుంది. యీ కారణంవల్ల, మరికొన్ని కారణాల వల్ల ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించుటకు జీవన భృతికై ఎవ్వరి దగ్గర జీతం రూపంలోనైనాసరే డబ్బు తీసుకోను అని చెప్పి వేశాను. అయితే ఒక మార్గం వారికి చెప్పాను. “మీలో కొందరు ప్రముఖ వ్యాపారస్తులు మీవకాల్తా పనిని నాకు అప్పగించండి అందుకు అడ్వాన్సుగా (వకీలు ఫీజు) డబ్బు యివ్వండి అలా అయితేనేను యిక్కడ వుంటాను మీరు ఒక సంవత్సరానికి యివ్వవలసిన ఫీజును ముందుగా యివ్వండి ఒక సంవత్సరం యిలా పని చేద్దాం. తరువాత జరిగిన పనుల్ని గురించి యోచిద్దాం సరీగా వున్నదనుకుంటే ఆ తరువాత కూడా యిలాగే చేద్దాం " అని చెప్పాను నేనిచ్చిన సలహాను సంతోషంగా అందరూ అంగీకరించారు నేను నేటాల్ సుప్రీంకోర్టులో వకాల్తా సనదుపుచ్చుకొనుటకై అర్జీ దాఖలు చేశాను నేటాల్ లాసొసైటి అంటే వకీళ్ల సంఘం నా అర్జీని వ్యతిరేకించింది నేటాలు చట్ట ప్రకారం నల్లరంగు గోధుమరంగు గల వాళ్లెవ్వరికీ వకీలు సనదు ఎట్టి పరిస్థితుల్లోను యివ్వడానికి వీలు లేదని వారు వాదించారు నా అర్జీని నేటాల్ యందలి ప్రసిద్ధ వకీలు కీ. శే. శ్రీ ఎస్కంబ్ సమర్థించారు వారు అటార్నీ జనరల్ తరువాత నేటాలుకు ప్రధాన మంత్రిగా కూడా పని చేశారు. వకీళ్ల సంఘాసికి చెందిన ఏ బారిష్టరూ, ఫీజు తీసుకోకుండా వకీలు సనదు కోసం దాఖలు చేసుకునేవారి అర్జీని సమర్థించకూడదని అక్కడి రివాజు శ్రీ ఎస్కంబ్ దాదా అబ్దుల్లా గారి వకీలు కూడా వకీళ్ల సంఘంచేసిన వాదనను సీనియర్ కోర్టు నిరాకరించి నా అర్జీని అంగీకరించింది. యీ విధంగా వకీళ్ల సంఘం నా ఆర్జీని తీవ్రంగా వ్యతిరేకించడం, వాళ్ల అంగీకారం లేకుండానే నా అర్జీకి అంగీకారం లభించడం వల్ల నా పేరు అక్కడి పత్రికల్లో ప్రముఖంగా చోటు చేసుకుంది నాకు మంచి ప్రచారం లభించింది దక్షిణాఫ్రికాకు చెందిన పలుపత్రికలు నేటాలు వకీళ్ల సంఘాన్ని ఎగతాళి చేశాయి. కొన్ని పత్రికలు నాకు అభినందనలు తెలిపాయి

సేర్ అబ్దుల్లా హాజీఆదమ్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీకి స్థిరరూపం యివ్వబడింది నేను అప్పటి వరకు భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించిన ఏ సమావేశంలోను పాల్గొన లేదు. కాని దాన్ని గురించి చాలా విన్నాను హింద్‌దాదా (తాత) దాదాభాయీనౌరోజీ గారి దర్శనం నేను చేసుకున్నాను నేను వారిని పూజించేవాణ్ణి అందువల్ల భారత జాతీయ కాంగ్రెసుకు నేను భక్తుణ్ణి అయిపోయాను యీ కాంగ్రెస్ పేరును ప్రచలితం చేయాలనే కోరిక కూడా నాకు కలిగింది. నావంటి అనుభవంలేని వ్యక్తి క్రొత్త పేరు ఎక్కడి నుంచి తేగలడు? తప్పు జరుగుతుందేమోననే భయం కూడా నన్ను వెంటాడుతున్నది. అందువల్ల అక్కడి కమిటీ వారికి "వేటాల్ ఇండియన్ కాంగ్రెస్" అని పేరు పెట్టమని సలహా యిచ్చాను. భారత జాతీయ కాంగ్రెస్‌ను గురించిన నా అసంపూర్ణ జ్ఞానాన్ని, నేను అసంపూర్ణంగానే నేటాల్ యందలి భారతీయులకు అందజేశాను. చివరికి 1894 మే లేక జూన్ మాసంలో నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ స్థాపన జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్‌కు, నేటాల్ కాంగ్రెస్‌కు మధ్య ఒక తేడా వున్నది. నేటాల్ కాంగ్రెస్ సంవత్సరానికి 365 రోజులు పని చేస్తుంది. సంవత్సరానికి 3 పౌండ్లు రుసుము చెల్లించిన వారు యీ కాంగ్రెస్ మంబర్లు అవుతారు. దాతలు ఎక్కువ సొమ్ము యిచ్చినా స్వీకరించి వారి పేర విరాళంగా జమ చేస్తారు ఎక్కువ సొమ్ము చెల్లించమని అందరినీ కోరడం జరిగింది. ఆరు లేక ఏడు మంది మెంబర్లు సంవత్సరానికి 24 పౌండ్లు కూడా యివ్వడం ప్రారంభించారు 12 పౌండ్లు యిచ్చే వారి సంఖ్య ఎక్కువగా వున్నది. ఒక నెల రోజుల్లో నేటాల్ కాంగ్రెస్‌లో 300 మంది మెంబర్లు చేరారు. వారిలో హిందువులు, మహమ్మదీయులు క్రైస్తవులు. పారసీకులు మొదలగు అన్ని మతాలవాళ్లు వున్నారు. నేటాలునందు నివసించే వివిధ ప్రాంతాల వారు కూడా వున్నారు మొదటి సంవత్సరం పని బ్రహ్మాండంగా జరిగింది. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, తమ తమ వాహనాల్లో కూర్చొని. దూరదూర గ్రామాలకు క్రొత్త మెంబర్లను చేర్చుటకు చందాలు వసూలు చేయుటకు వెళ్లేవారు అడగంగానే జనం చందాలు వెంటనే యిచ్చేవారు కాదు. వారికి వివరమంతా చెప్పవలసి వచ్చేది. ప్రజలకు చెప్పాలంటే చెప్పేవారికి రాజకీయ పరిజ్ఞానం అవసరం కదా అందువల్ల జనం విషయాన్ని అర్ధం చేసుకునేవారు యిదిగాక నెలకొకసారి నేటాల్ కాంగ్రెస్ సమావేశం జరుగుతూ వుండేది ఆ సమావేశంలో జమాఖర్చుల వివరాలు ప్రతిపైసకు లెక్కలు తెలియజేయడం, మెంబర్లంతా అంగీకరించడం, ఆ నెలరోజుల్లో జరిగిన ఘట్టాలు వివరించడం, ఆ వివరమంతా మినిట్స్ బుక్కులో వ్రాయడం జరుగుతూ వుండేది మెంబర్లు రకరకాల ప్రశ్నలు అడగతూ వుండేవారు. క్రొత్త కార్యక్రమాల్ని గురించి చర్చలు జరుగుతూ వుండేవి దీనివల్ల ఎన్నో లాభాలు కలిగాయి. ఎప్పుడూ మాట్లాడి ఎరుగనివారు మాట్లాడటం నేర్చుకున్నారు. ఉపన్యాసాలు కూడా జాగ్రత్తగా యివ్వసాగారు యిదంతా అక్కడి భారతీయులకు క్రొత్తగా వున్నా. కొద్ది కాలంలోనే అందుకు వారంతా అలవాటు పడిపోయారు. యింతలో లార్డ్‌రిప్పన్ నేటాలు బిల్లును నిరాకరించాడని వార్త వచ్చింది. దానితో భారతీయుల మనోబలం పెరిగింది. సంతోషం కలిగింది. వాళ్లకు ఒక గట్టి నమ్మకం ఏర్పడింది

బయట ఉద్యమంతో పాటు, ఆంతరంగిక సంస్కరణలు జరపాలనే భావం కూడా భారతీయులకు కలిగింది భారతీయుల నడవడి, ఆచార వ్యవహారాలను గురించి దక్షిణాఫ్రికా యందంతట వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా సాగుతూ వుండేది. దానికి తెల్లవాళ్లే కారణం భారతీయులు మురికి వాళ్లు లోభులు వ్యాపారం చేసే ఇంట్లోనే వుంటారు. వాళ్ల గృహాలు మురికి కూపాలు గాలి వెలుగు తొంగైనా చూడవు. తమ సుఖాల కోసం, విశ్రాంతి కోసం కూడా డబ్బు ఖర్చుపెట్టరు యిలాంటి మురికివాళ్లతో అసహ్యించుకోవలసిన భారతీయులతో తెల్లవారు ఎలా సయోధ్యతగా వుందగలరు. యిదీ తెల్లవాళ్లు భారతీయుల మీద చేసే ఆరోపణలు యీ ఆరోపణల నుంచి బయటపడవలసిన ఆవశ్యకతను గురించి అందుకు తీసుకోవలసిన చర్యలను గురించి భారతీయులు ఉపన్యాసాలు యివ్వడం ప్రారంభించారు. యీ చర్చలన్నీ మాతృ భాష (గుజరాతీ) లోనే జరిగేవి

దీనివల్ల నేటాల్ జనానికి ఎంతటి రాజకీయ సాంఘిక జ్ఞానం కలిగిందో పాఠకులు ఊహించుకోవచ్చు. నేటాల్ కాంగ్రెస్ ఆధ్వర్యాన గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయుల బిడ్డలకు అందులోను నేటాల్‌లో పుట్టి ఇంగ్లీషు నేర్చినా సవయువకులకు విద్యా బోధన జరుపుటకు ఒక విద్యా సంస్థ (నేటల్ ఇండియన్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్) స్థాపించారు పేరుకు మాత్రం దానికి కొద్ది చందా నిర్ణయించారు. అలాంటి భారతీయ యువకుల్ని ఒకచోట చేర్చడం, పరస్పర పరిచయాల ద్వారా ప్రేమను పెంచుకోవడం, భారత దేశం అంటే ఎమిటో చెప్పి వారి హృదయాల్లో దేశభక్తిని పెంపొందింపచేయడం సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం స్వతంత్ర భారతీయ వ్యాపారులు కూడా వారిని ప్రేమిస్తున్నారని, వారికి వ్యతిరేకులుకారని బోధ చేయడం, వ్యాపారుల హృదయాలలో కూడా అట్టి భావం నెలకొల్పడం ఆ సంస్థ యొక్క రెండవలక్ష్యం నేటాల్ కాంగ్రెస్ దగ్గర పెద్ద మొత్తాలు చేరాయి ఆ డబ్బుతో సంస్థకోసం సొంతభూమిని కొన్నారు. తద్వారా సంస్థకు మంచి ఆదాయం లభించింది

ఈ వివరాలన్నింటిని కావాలనే నేను పేర్కొన్నాసు యీ వివరాలన్నీ తెలియకపోతే దక్షిణాఫ్రికా భారతీయులు పెద్ద ఉద్యమానికి ఎలా సిద్ధమైనారో, ఎలా ఉద్యమం సాగించారో అర్ధం కావడం కష్టం నేటాల్ కాంగ్రెస్‌కు కలిగిన కష్టాలు ఎన్నోవున్నాయి. ప్రభుత్వాధికారులు ఎన్నిసార్లు ఎన్నోరూపాలలో దానిమీద దాడులు చేశారు. వాటినుంచి అది సురక్షితంగా బయటిపడింది ఇటువంటి విషయాలు చాలా పున్నాయి. కాని వాటిని వివరణ తగ్గించవలసివచ్చింది. అయితే ఒక్క విషయం యిక్కడ చెప్పక తప్పదు భారతజాతి సదా అతిశయోక్తులనుంచి రక్షణ పొందింది. జాతియందలి దోషాల్ని, వాటిని తొలగించుకొనే విధానాల్ని గురించి కృషి జరుగుతూనే వున్నది. తెల్లవాళ్ల ఆరోపణల యందలి సత్యాన్ని తక్షణం అంతా అంగీకరించేవారు. స్వాభిమానాన్ని, స్వాతంత్ర్యాన్ని రక్షించుకుంటూ తెల్లవాళ్లకు అవసరమైన సహాయసహకారాలు అందించుటకు కూడా సంస్థ సిద్ధపడేది అవసరమైన సమాచారం మాత్రమే దక్షిణాఫ్రికా పత్రికలకు విడుదల చేసేవారు. భారతీయుల మీద విచ్చలవిడిగా అనాలోచితంగా చేయబడే ఆరోపణులకు సమాధానాలు వెంటనే ఆయా పత్రికలకు పంపబడుతుండేవి

నేటాల్‌లో నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ వున్నట్లే, ట్రాన్స్‌వాల్‌లో కూడా భారతీయుల సంస్థ ఒకటి ప్రారంభమైంది. ట్రాన్స్‌వాల్‌లోగల ఆ సంస్థ నేటాల్ కాంగ్రెస్‌కు లోబడి లేదు. అది స్వతంత్రంగా పనిచేస్తున్నది. రెండు సంస్థల అభిప్రాయాలలో కూడా కొద్ది తేడా వున్నది. అయితే యిక్కడ ఆ వివరాల్లోకి పోను ఇలాంటిదే ఒక సంస్థ కేప్‌టౌనులో కూడావున్నది నేటాల్ ట్రాన్స్‌వాల్ సంస్థల నియమావళుల ననుసరించి దాని నియమావళిలేదు అయినా మూడు సంస్థల లక్ష్యం ఒక్కటే మూడింటి కార్యక్రమాల పరమావధి ఒక్కటే

1894వ సంవత్సరం గడిచిపోయింది. నేటాల్ కాంగ్రెస్ చరిత్ర యొక్క ఒక సంవత్సరం 1895 మధ్యకాలంలో గడిచిపోయింది. నా వకాల్తా పని కక్షిదారులకు నచ్చింది. అందువల్ల నేటాల్‌లో నేనుండవలసిన కాలం యింకా పొడిగించబడింది. 1896లో అక్కడి భారతజాతి అనుమతిపొంది నేను ఆరుమాసాలపాటు భారతదేశం వచ్చాను. ఆరుమాసాలు పూర్తికాకముందే నేటాలు నుంచి తంతివచ్చింది. నేను వెంటనే నేటాలుకు వెళ్లక తప్పలేదు అక్కడ 1896-97లో జరిగిన ఘట్టాలను గురించి వేరే ప్రకరణంలో వివరిస్తాను


7

భారతీయులు ఏం చేశారు? - 2

నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ యొక్క కార్యక్రమాలు స్థిరపడ్డాయి రెండున్నర సంవత్సరాలు నేను నేటాలులో గడిపాను దక్షిణాఫ్రికాలో నేను వుండాలనుకుంటే కుటుంబాన్ని భారతదేశాన్నుంచి తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చాను. భారతదేశం వెళ్లి రావాలని కూడా నాకు కోరిక కలిగింది భారతదేశంలో తిరిగి నేటాలు విషయాలే గాక, దక్షిణాఫ్రికాకు చెందిన మిగతా అధినివేశ రాజ్యాల్లో గల భారతీయుల స్థితిగతులను గురించి కూడా భారత ప్రజలకు తెలియజేయాలని భావించాను కాంగ్రెస్ నాకు ఆరు మాసాల సెలవు యిచ్చింది. నాకు బదులుగా నేటాలుకు చెందిన ప్రసిద్ధ వ్యాపారి కీ. శే. ఆదంజామియా ఖాన్ సెక్రటరీగ నియమితులైనారు. వారు కాంగ్రెస్ కార్యక్రమాలు ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు. వారికి ఇంగ్లీషు బాగా వచ్చు అనుభవంద్వారా ఇంగ్లీషులో కార్యక్రమాలు నడపగల సామర్థ్యం గడించారు. గుజరాతీ భాష మామూలుగా వారికి వచ్చు వారి వ్యాపారం హబ్షీల మధ్య జరుగుతూ వుంటుంది. గనుక జూలూభాష వారు నేర్చుకున్నారు. హబ్షీవారి అలవాట్లు వారికి బాగా తెలుసు వారిది శాంత స్వభావం అందరితో కలుపుకోలుతనంగా వుండటం వారి విశేషం మితభాషి ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానో చెబుతాను బాధ్యతాయుతమైన పదవిని నిర్వహించాలనే ఇంగ్లీషుభాషాజ్ఞానం విద్వత్తు ఎంత అవసరమో, అంతకంటే