దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/ఇంగ్లాండులో ప్రతినిధి బృందం

వికీసోర్స్ నుండి

సత్యాగ్రహం బలహీనుల ఆయుధమని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. అసలు సత్యాగ్రహం ఆయుధాల బలప్రయోగానికి ముందుయిచ్చే శిక్షణ అనికూడా కొందరు అంటున్నారని విన్నాను. యిది సరికాదు. మరోసారి స్పష్టంగా చెబుతున్నాను ఎటువంటి గుణాలు గల సత్యాగ్రహులు కనబడ్డారో నేను వివరించలేదు. అసలు సత్యాగ్రహం అను భావంయొక్క గూఢార్థం ఏమిటో వివరించాను ఆవిధంగా సత్యాగ్రహి అంటే ఎలా వుండాలో స్పష్టంగా వివరించాను. ఈ ప్రకరణం వ్రాయడానికి గల ఉద్దేశ్యం క్లుప్తంగా మరో మారు వివరిస్తాను ట్రాన్స్‌వాల్ యందలి భారతీయులు ఏశక్తిని ప్రదర్శించడానికి పూనుకున్నారో, ఆశక్తిని గురించి ప్రజలకు స్పష్టంగా బోధపరుచుటకు ప్రయత్నించాను. ఆశక్తిని పాసివ్‌రెసిస్టెన్స్ అని పిలిచే శక్తితో అపోహపడి కలిపి చేయకూడదనీ, అందువల్లనే జాగ్రత్తగా యీ శక్తిని ప్రకటించగల శబ్దం కోసం వెతకవలసి వచ్చిందనీ చెప్పాను దానితోబాటు సత్యాగ్రహంలో అప్పుడు ఏఏ సిద్ధాంతాల్ని చేర్చామో కూడా వివరించాను




14

ఇంగ్లాండులో ప్రతినిధిబృందం

ట్రాన్స్‌వాల్‌లో ఖూనీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరెవరకి అర్జీలు దాఖలు చేయాలో వారందరికీ దాఖలు చేశాము ట్రాన్స్‌వాల్ అసెంబ్లీ మాత్రం స్త్రీలకు సంబంధించిన నిబంధనను తొలగించింది. కాని మిగతా బిల్లు గెజెట్‌లో ప్రకటించబడినట్లుగా అంగీకరించబడింది. అయినా అప్పుడు భారతజాతిలో గట్టిదనం, ఉత్సాహం, ఆవేశం, శక్తి సామర్థ్యాలు వుండటం వల్ల దాన్ని ఎవ్వరూ లేక్కచేయలేదు. దానితో ప్రభుత్వం అందుకు సంబంధించిన చర్యలన్నీ చట్టరీత్యా గైకొనాలని నిర్ణయించింది. అప్పటివరకు ట్రాన్స్‌వాల్ రాజ్యం "క్రౌన్‌కాలనీ"గా వున్నది. క్రౌన్‌కాలనీ అంటే సామ్రాజ్యంలో వున్న అధినివేశ రాజ్యం అన్నమాట అంటే బ్రిటిష్ సామ్రాజ్యాధిపత్యం క్రిందవున్న బాధ్యత కలిగిన చిన్న ప్రభుత్వం అంటే చట్టరీత్యాను, పరిపాలన దృష్ట్యాను బ్రిటిష్ ప్రభుత్వానికి లోబడియున్న రాజ్యమన్నమాట అందువల్లనే అధినివేశ రాజ్య అసెంబ్లీ ప్యాసు చేసిన చట్టాల్ని సైతం బ్రిటిష్ సామ్రాజ్య చక్రవర్తి బ్రిటిష్ రాజ్యాంగం రీత్యా సరికాదని తోస్తే నిరాకరించవచ్చు. కాని బాధ్యత కలిగిన పెద్ద దేశాలైతే అక్కడి అసెంబ్లీ ప్యాసుచేసిన చట్టాన్ని చక్రవర్తి అంగీకరించాల్సిందే ట్రాన్స్‌వాల్ చట్టం చక్రవర్తి సంతకం కోసం ఇంగ్లాండు వెళ్లుతుంది. కనుక ఇంగ్లాండుకు ప్రతినిధి బృందం వెళ్లాలని అంతా భావించారు. అయితే భారత జాతిప్రతినిధిబృందం ఇంగ్లాండుకు వెళ్లితే, అది తన బాధ్యతను పూర్తిగా నిర్వహించాలికదా! ఇక యీ బాధ్యత నాపైన పడింది. నేను ఆసోసియేషన్‌కు మూడు సలహాలు ఇచ్చాను

(1) మనం యూదుల నాటకశాలలో అందరిచేత ప్రతిజ్ఞ చేయించాము అయినా తిరిగి ప్రముఖ భారతీయుల చేత వ్యక్తి గత ప్రతిజ్ఞల్ని తీసుకోవాలి దానివల్ల వాళ్లకు కలిగే యిబ్బందులు వాళ్ల బలహీనతలు ఏమిటో మనకు తెలుస్తాయి. ఇలా చేస్తే మనం నిర్బయంగా ఇంగ్లాండు వెళ్లగలుతాము అధినివేశాల రాజ్య మంత్రికి, భారతమంత్రికి యిక్కడి మన పరిస్థితుల్ని గురించి నిర్భయంగా చెప్పగలుగుతాము

(2) భారత ప్రతినిధి బృంద సభ్యులకు అయ్యే ఖర్చులకోసం ధనం సమకూర్చుకోవాలి

(3) ప్రతినిధి బృందంలో తక్కువమంది సభ్యులు వుండాలి

ఈ మూడువ సూచన చాలా ముఖ్యమైనది. ఎక్కువమంది జనం వెళ్లితే ఎక్కువ పనిజరుగుతుందని, ఆ విధంగా వెళ్లడం వల్ల వ్యక్తిగతంగా గౌరవం పెరుగుతుందని సామాన్యంగా జనం భావిస్తూ వుంటారు. అది తప్పని, జాతికి సేవ చేయడానికే గాని సన్మానం కోసం కాదని, తక్కువమంది వెళ్లితే ఖర్చులు కూడా తగ్గుతాయని స్పష్టంగా చెప్పాను నా యీ మూడు సలహాల్ని అంతా అంగీకరించారు. ప్రజల సంతకాలు మళ్లీ తీసుకోవడం ప్రారంభించాము చాలా మంది ప్రతిజ్ఞ పత్రాల మీద సంతకాలు చేశారు. నాటకశాలలో మౌఖికంగా ప్రతిజ్ఞచేసిన వారిలో కొందరు లిఖిత ప్రతిజ్ఞ పత్రం మీద సంతకం చేయడానికి వెనుకంజ వేయడం నేను గమనించాను. నిజానికి ఒకసారి ప్రతిజ్ఞచేస్తే దానికి కట్టుబడి వుండాలి. కాని బాగా యోచించి ప్రతిజ్ఞచేసిన వాళ్లే సమయం వచ్చినప్పుడు వెనుకంజవేయడం, మౌఖికంగా చేసిన ప్రతిజ్ఞా పత్రం మీద లిఖితరూపంలో సంతకం చేయవలసి వచ్చినప్పుడు కొందరు జారుకోవడం కూడా జరిగింది. మేము అనుకున్నంత ధనం ఖర్చులకోసం అందింది అయితే ప్రతినిధిబృంద సభ్యుల్ని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు పెద్ద యిబ్బంది కలిగింది. నా పేరు అందులో వున్నది. నా వెంటయింకా ఎవరెవరు రావాలి" నిర్ణయించుటకు ఎక్కువ సమయం పట్టింది. చర్చలతో చాలా రాత్రిళ్లు గడిచాయి. సంస్థల్లోను, సంఘాల్లోనూ వుండే చెడు అంతా మాకు బోధపడింది. మీరు ఒక్కరే వెళితే సంతోషిస్తామని కొందరన్నారు. అందుకు నేను అంగీకరించలేదు దక్షిణాఫ్రికాలో హిందూ ముస్లిముల సమస్య లేదు. కాని యిద్దరికీ వైషమ్యం లేదని పూర్తిగా చెప్పలేము. అయితే అక్కడ నెలకొనియున్న విచిత్రమైన పరిస్థితులవల్ల మతవైషమ్యం నిషాలేదని చెప్పవచ్చు. అక్కడి భారతీయులందరూ అరమరికలు లేకుండా పరిశుద్ధ హృదయంతో జాతికే సేవ చేశారు. జాతికి నిష్ఠ, నిజాయితీలతో మార్గం చూపించారు. నాతో బాటు యిద్దరు సభ్యులు వస్తే చాలనీ, ఒక మహమ్మదీయుడు వుంటే మంచిదని చెప్పాను వెంటనే కొందరు మీరు జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అందువల్ల మీతోబాటు ఒక హిందువు కూడా వుంటే మంచిదని అన్నారు ప్రతినిధి బృందంలో ఒక కొంకణి, ఒక మేమన్ ముస్లిం వుండాలని కొందరు సూచించారు. హిందువుల్లో ఒక పాటీదారు, ఒకఅనావిల్ తెగ వారు వుండాలని కొందరి సలహా అయితే చివరికి అంతా విషయాన్ని అర్థం చేసుకోని నాతో బాటు శ్రీ హజీ వజీరలీ గారిని పంపడానికి ఏక గ్రీవంగా నిర్నయించారు

శ్రీ హజీ వజీరలీ సగం మలైవాసి ఆయన తండ్రి భారతీయ ముస్లిం, తల్లిమలై దేశస్థురాలు వారి మాతృభాష డచ్ ఇంగ్లీషుకూడా నేర్చుకున్నారు కనుక డచ్, ఇంగ్లీషు భాషలు బాగా మాట్లాడగలరు ఇంగ్లీషులో ఉపన్యాసం చేస్తున్నప్పుడు ఎక్కడా ఆగవలసిన అవసరం వారికి వుండదు. పత్రికలకు బాబులు వ్రాయడంలో కూడా దిట్ట ట్రాన్స్‌వాల్ బ్రిటిష్ అసోసియేషన్ మెంబరు చాలాకాలాన్నుంచి ప్రజాకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హిందుస్తానీ భాషకూడా బాగా మాట్లాడగలరు. ఒకమలై స్త్రీని వివాహం చేసుకున్నారు చాలామంది బిడ్డలు కలిగారు. మేమిద్దరం ఇంగ్లాండు చేరుకొని పని ప్రారంభించాము భారతమంత్రికి అందజేయవలసిన అర్జీని మేము ఓడలోనే తయారుచేశాము ఇంగ్లాండు చేరి దాన్ని అచ్చువేయించాము అప్పుడు అధినివేశ రాజ్యాల మంత్రిగా లార్డ్ ఎల్గిన్ వున్నారు. భారతమంత్రి లార్డ్ మోర్లే మేమిద్దరం ముందు దాదా భాయి నౌరాజీగారిని కలిశాము తరువాత వారి ద్వారా భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ కమిటీ వారిని కలిశాము. వారికి మాకేసు వివరం చెప్పాము అన్ని పార్టీల సహకారంతో పని చేస్తామని వారికి చెప్పాము దాదాభాయి నౌరాజీ కూడా మాకు యిట్టి సలహాయే యిచ్చారు. బ్రిటిష్ కమిటీకి మా అభిప్రాయం నచ్చింది. మేము సర్ మంచెర్టీ భావన్‌గరీ గారిని కలిశాము వారు కూడా మాకు ఎంతో సహాయం చేశారు. వారు. దాదాభాయినౌరోజీ గారు యిద్దరూ మీరు విభిన్న పార్టీల మెంబర్లను కూడా వెంట బెట్టుకొని లార్డ్ ఎల్గిన్‌ను కలవమని చెప్పి, ఒక ఆంగ్లో ఇండియన్ నాయకత్వాన వెళ్లి కలవడం మంచిదని కూడా చెప్పారు. సర్ మంచేర్జీ కొన్ని పేర్లుకూడా చెప్పారు. వారిలో సర్‌లెపట్ గ్రిఫిన్ గారి పేరు కూడా వున్నది. యిక్కడ పాఠకులకు ఒక విషయం చెప్పడం అవసరం యిప్పుడు సర్ విలియం విల్సన్ హంటర్ జీవించి లేరు వారు జీవించి యుంటే దక్షిణాఫ్రికా యందలి భారతీయుల స్థితిగతులను గురించి బాగా తెలిసిన వారు గనుక వారే ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించియుండే వారు. అలా కాకపోతే వారే లార్డ్ సభకు చెందిన మంచి గట్టి నాయకుణ్ణి ప్రతినిధి బృందానికి నాయకునిగా నియమించి యుండేవారు మేమిద్దరం సర్‌లెపల్ గ్రిఫిన్‌గారిని కలిశాము వారు భారతదేశంలో నడుస్తున్న రాజకీయ ఉద్యమానికి వ్యతిరేకులు అయితే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మా వ్యవహారాల యెడ ఆయనకు అభిరుచి కలిగింది. అందువల్ల మొహమాటానికి కాకుండా హృదయపూర్తిగా మాకు సహకరించేందుకు అంగీకారం తెలిపారు. వారు కాగితాలన్నీ చదివారు. మా పరిస్థితుల్ని బాగా అర్థంచేసుకున్నారు. ఇంకా యితర ఆంగ్లోఇండియన్లను యితర పెద్దల్ని కలిశాము సాధ్యమైనంత వరకు ఎవ్వరినీ వదల లేదు. మా ప్రతినిధి బృందం స్వరూపం మారిపోయింది అంతా వెళ్లిలార్డ్ ఎల్గిన్‌ను కలిశాము మాటలన్నీ శ్రద్ధగా విన్నారు. తన సానుభూతిని ప్రకటించారు. తన యిబ్బందులు కూడా తెలియజేశారు. దానితోబాటు శక్త్యాను సారం మీరు తప్పక సహకరిస్తానని మాట యిచ్చారు. మా ప్రతినిధి బృందం లార్డ్ మోర్లేని కూడా కలిసింది వారు కూడా చూ యెడ సానుభూతి చూపించాడు. వారి మాటల సారం ముందే తెలియజేశాను సర్ విలియం వెడ్‌బర్న్ గారి కృషి వల్ల భారత దేశ వ్యవహారాలతో సంబంధం వున్న బ్రిటిష్ లోకసభ సభ్యుల సమావేశం ఒకటి అక్కడి లోకసభ దర్బారు హాల్లో జరిపాము మేము వారందరికీ సభాముఖంగా మాగోడు వినిపించాము అప్పుడు ఐరీష్ పార్టీ నాయకుడుగా శ్రీ రెడ్‌మండ్ వున్నారు. ప్రత్యేకించి వెళ్లివారిని కూడా కలిశాము. బ్రిటిష్ లోక సభకు చెందిన అన్ని పార్టీల ముఖ్యమైన మెంబర్ల నందరిని కలిశాము ఇంగ్లాండులో మాకు భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ కమిటీ వారి సహాయం అమితంగా లభించింది. అయితే అక్కడ ఒక యిబ్బంది కలిగింది. ఆకమిటీ సమావేశాల్లో కొందరు, కొన్ని భావాలుకల వారు మాత్రమే పాల్గొంటూ వుంటారు. ఆ సమావేశాల్లో పాల్గొనని వాళ్లు చాలా మంది మాకు అమితంగా సాయం చేశారు. అట్టివారందరినీ ఒక చోట కలిపి, వారందరి సహకారంతో, ఐక్యతతో పనిచేస్తే మాకృషి ఫలిస్తుందని భావించాము అందుకు అంతా సంతోషంతో అంగీకరించారు. ఒక స్థాయీ సమితి ఏర్పాటుకు పూనుకున్నాము

ఏ సంస్థకైనా ముఖ్యుడు కార్యదర్శి ఆసంస్థ లక్ష్యాల యెడ పూర్తిగా విశ్వాసంగల వ్యక్తియే ఆ సంస్థకు కార్యదర్శిగా వుండాలి అతడు పూర్తి సమయం ఆ సంస్థపనులకోసం వెచ్చించాలి. సంస్థను సడపగల శక్తి కలిగి యుండాలి ఎ.ఎల్.వాచ్. రిచ్ యందు పైగుణాలన్నీ వున్నాయి. వారు దక్షిణాఫ్రికా వాసి, నా ఆఫీసులో క్లర్కుగా పని చేశారు. యిప్పుడు వారు లండన్‌లో బారిష్టరీ పూర్తి చేస్తూ వున్నారు. ఈ పని చేయాలనే కోరిక కూడా వారికి కలిగింది. దానితో మేము యీ పనికోసం దక్షిణాఫ్రికా బ్రిటిష్ ఇండియన్ కమిటీ అనుపేర ఒక స్థాయీ సమితిని ఏర్పాటు చేయడానికి సాహసించాము ఇంగ్లాండు, తదితర పాశ్చాత్య దేశాలలో మంచి పనుల్ని విందుతో ప్రారంభించే (నాదృష్టిలో అసభ్యకరమైన) విధానం ఒకటి వున్నది. బ్రిటిష్ ప్రధానమంత్రి ప్రతి సంవత్సరం నవంబరు 9వ తేదీన మెన్షన్ హౌస్ అని పేరుగల వ్యాపారస్థుల ఒక పెద్ద కేంద్రంలో ప్రపంచాన్నంతటిని ఆకర్షించగల ఒక ఉపన్యాసం యిస్తూ వుంటాడు. తద్వారా సంవత్సరం పొడుగునా తాను చేయబోయే కార్యక్రమాల రూపురేఖల్ని వివరిస్తాడు భవిష్యత్తును గురించిన తన అంచనాలను ప్రకటిస్తాడు. లండన్ నగర లార్డ్ మేయరు బ్రిటిష్ మంత్రి వర్గ సభ్యులకు, తదితరులకు ఆ భవనంలో పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. విందు పూర్తికాగానే మద్యం సీసాలు బిర బిరా బైటికి వస్తాయి. యజమానుల, అతిధుల ఆరోగ్యాభివృద్ధి పేరట అంతా మద్యం తెగ తాగుతారు. ఈ కార్యక్రమం శుభ, అశుభ (పాఠకులు తమకు యిష్టమైన శబ్దాన్ని గ్రహించవచ్చు) తతంగం బాగా సాగుతున్నప్పుడు కొందరు ఉపన్యాసాలిస్తూ వుంటారు. అందు బ్రిటిష్ సామ్రాజ్య మంత్రి వర్గంటోస్టు (ఆరోగ్యాభివృద్ధి కోసం యిచ్చే ఆశీస్సు) కూడా చేరుస్తారు. అందుకు సమాధానంగా బ్రిటిష్ ప్రధానమంత్రిగారి ఉపన్యాసం సాగుతుంది ప్రజాకార్యక్రమాల్లో యిట్టి విందుల ఏర్పాటు జరిపినట్లే, ఏ గొప్ప వ్యక్తితో మాట్లాడలన్నా కూడా యిదే విధంగా విందుకు ఆహ్వానిస్తారు. భోజనం చేస్తున్నప్పుడో, లేక భోజనం అయిపోయిన తరువాతనో అసలు సంభాషణను ప్రారంభిస్తారు. మేము కూడా అనేక సార్లు యీ విధానాన్ని పాటించవలసి వచ్చింది. అయితే పాఠకులు ఒక్క విషయం తెలుసుకోవాలి భోజనాల సమయంలో త్రాగకూడని పానీయం మేము త్రాగలేదు. తినకూడని (మాంసం) పదార్థం మేము తిన లేదు. ఈ పద్ధతి ప్రకారం మేము ఒకసారి మధ్యాహ్నభోజనానికి మమ్ము సమర్ధించిన వారందరినీ ఆహ్వానిందాం ఒక వందమంది మిత్రులకు విందు ఆహ్వానం పంపించాము వారందరికీ కృతజ్ఞతలు చెప్పడం, వారిదగ్గర సెలవు తీసుకోవడం, ఒక స్థాయీ సమితిని ఏర్పాటు చేయడం ఆ విందు ఏర్పాటుకు లక్ష్యం పద్ధతి ప్రకారమే భోజనానంతరం ఉపన్యాసాలు జరిగాయి. స్థాయీ సమితికూడా ఏర్పడింది ఈ కార్యక్రమంవలన మా ఉద్యమానికి ప్రచారంతో బాటు బలం కూడా లభించింది.

ఈ విధంగా ఆరువారాలు ఇంగ్లాండులో వుండి కార్యక్రమాలు నిర్వహించి, మేము దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చాము మదీరా చేరేసరికి మాకు శ్రీ రిచ్ పంపిన తంతి అందింది. బ్రిటిష్ మంత్రి వర్గం చక్రవర్తికి ట్రాన్స్‌వాల్ అసెంబ్లీ అంగీకరించిన ఏషియాటిక్ ఆక్టును నిరాకరించమని సిఫారసు చేసినట్లు లార్డ్ ఎల్గిన్ ప్రకటించారు " అని ఆతంతిలో వున్నది మాసంతోషానికి అంతు లేకుండా పోయింది మదీరానుంచి కేప్‌టౌను చేరుటకు 14 లేక 15 రోజులు పడతాయి. ఈ రోజుల్ని అమితానందంతో గడిపాము భవిష్యత్తులో మిగతా బాధల్ని తొలగించుటకు ఏమేమి చేయాలో అనేక ఆకాశహర్మ్యాలను వెర్రివాళ్ల వలె నిర్మించాం మేము కట్టుకున్న గాలిమేడలు ఎలా కూలిపోయాయో తరువాత ప్రకరణంలో వివరిస్తాను

ఈ ప్రకరణాన్ని ముగించే ముందు ఒకటి రెండు స్మృతులను యిక్కడ వ్రాయడం అవసరం ఇంగ్లాండులో ఒక నిమిషం సమయాన్ని సైతం మేము వ్యర్థం చేయలేదు. పెద్ద సంఖ్యలో సర్క్యులర్లు తయారుచేయడం, అచ్చు వేయడం, సరిదిద్దడం, వాటిని పంపడం మొదలగు పనులు ఒక్కచేతితో ఎలా జరుగుతాయి? అందుకు బయటివారి సాయం అవసరమైంది డబ్బు ఖర్చు చేస్తే యిట్టి సాయం సామాన్యంగా లభిస్తుంది కాని 40 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను, వాలంటీర్ల ద్వారా అయితే యిట్టి పనులు విజయవంతం అవుతాయి అదృష్టం వల్ల అట్టి పరిశుద్ధ సహకారం ఇంగ్లాండులో మాకు లభించింది. అక్కడ చదువుకుంటున్న అనేక మంది భారతీయ విద్యార్థులు మాకు అండగా నిలచారు. వారిలో చాలామంది ఉదయం, సాయంత్రం, సొమ్ము తీసుకోకుండా మాకు సాయం చేశారు వారిలో ఒక్కరు కూడా గౌరవ ప్రతిష్టల్ని ఆశించ లేదు. పేర్లు. చిరునామాలు వ్రాయడం, నకళ్లు వ్రాయడం, పోస్టల్ బిళ్లలు అతికించడం, ఉత్తరాల్ని పోస్టు చేయడం మొదలుగా గల పనులన్నీ చేశారు. అట్టి వారందరినీ మరిపించివేయగల నిష్కామ సేవి సిమండ్స్ అనుపేరుగల ఆంగ్లయువకుడు అతణ్ణి దక్షిణాఫ్రికాలో మొట్టమొదటిసారి కలిశాను భారత దేశంలో కొంతకాలం వుండి వచ్చిన మంచి మిత్రుడు భగవంతుడు ఎక్కువ ప్రేమించిన వాళ్లను త్వరగా తన దగ్గరికి పిలిపించుకుంటాడు అని ఇంగ్లీషులో ఒక సామెత వున్నది. వరడు: ఖభంజకుడగు యీ ఆంగ్లేయుణ్ణి కూడా యమదూతలు అతడు యెవ్వనంలో వుండగానే తీసుకు వెళ్లారు. పరదు:ఖభంజకుడు అను వివేషణ ప్రయోగానికి ఒక కారణం వున్నది. ఈ ఆంగ్ల యువకుడు బొంబాయిలో వున్నప్పుడు. 1897లో ప్లేగు జబ్బు సోకిన వారిమధ్య నిర్భయంగా తిరుగుతూ వాళ్లకు సాయం చేశాడు రోగంతో బాధపడుతున్న జనం మధ్య జంకకుండా తిరుగుతూ వాళ్లకు సేవచేసిన అతనికి మృత్యుభయం కలుగలేవు నిర్భయం అతనిరక్తంలో ప్రవేశించింది. జాతి ద్వేషంకాని, రంగుద్వేషం కాని అతడికి లేదు. అతడు స్వతంత్రమైన స్వభావం గల వ్యక్తి సత్యం ఎప్పుడూ అల్పపక్షం అనగా మైనారిటీ పక్షంవైపునే వుంటుందని అతని సమ్మకం నమ్మకంతోనే జోహన్స్ బర్గులో ఆతడు నా దగ్గరికి వచ్చాడు నవ్వుతూ "మీ పక్షం పెద్దదైపోతుంది. అప్పుడు నేను మీకు దూరమైపోవడం ఖాయం మెజారిటీ పక్షం చేతుల్లోపడితే సత్యం కూడా అసత్యమైపోతుంది అందువల్ల నేను అప్పుడూ మీకు దూరమవుతాను" అని అంటూవుండేవాడు. అతడి మాటకు గొప్ప అర్థం వున్నది జోహన్స్‌బర్గు చెందిన ఒక కోటీశ్వరుడు సర్ జార్జిఫెర్రర్‌కు నమ్మకమైన సెక్రటరీగా పని చేసేవాడు. షార్ట్‌హాండు నేర్చుకున్నాడు. మేము ఇంగ్లాండులో వున్నప్పుడు హఠాత్తుగా అక్కడికి వచ్చాడు. ఆయన నివాసగృహాన్ని నేను ఎరుగను మేము ప్రజాకార్యక్రమాలు నిర్వహిస్తూ వుంటాము కనుక మా పేర్లు పత్రికల్లో వస్తూ వుండేవి ఆ ఆధారంతో సిమండ్స్ మమ్ము వెతికి పట్టుకున్నాడు. శక్త్యాను సారం సాయం చేస్తానని మాట యిచ్చాడు. "చపరాసీ పని యిచ్చినా చేస్తాను వ్రాత పని అవసరమైతే నావంటి నిపుణుడు మీకు దొరకడం దుర్లభం పిలవగానే వచ్చి వాల్తాను ' అని చెప్పాడు. మాకు పైరెండు పనులు చేయగల వ్యక్తి అవసరం ఈ ఆంగ్లయువకుడు రాత్రింబవళ్లు మాకోసం కష్టపడి పనిచేశాడని చెప్పగలను రాత్రి పన్నిండు లేక ఒంటిగంటవరకు టైపురైటరు దగ్గర కూర్చొని టైపు చేస్తూ వుండేవాడు. సందేశాలు చేరవేయడమే కాక ఉత్తరాలు పోస్టు చేసే పనికూడా తానే నవ్వుతూ చేస్తూ వుండేవాడు. అతడికి నెలకు 45 పౌండ్ల ఆదాయం వుండేది ఆ డబ్బంతా స్నేహితుల కోసం ఖర్చుపెడుతూ వుండేవాడు. అప్పుడు అతడికి 30 సంవత్సరాల వయస్సు వుండి వుంటుంది. పెండ్లిచేసుకోలేదు జీవితమంతా పెండ్లి చేసుకోకుండా వుండాలనే నిర్ణయానికి అతడు వచ్చాడు శ్రమకు ఫలితంగా కొద్దిగా సొమ్ము తీసుకోమని నేను మరీ మరీ చెప్పాను కాని అతడు అంగీకరించలేదు. "నేను యీ సేవకు సొమ్ము తీసుకుంటే ధర్మచ్యుతుడనై పోతాను" అని అంటూ వుండేవాడు. నాకు బాగా జ్ఞాపకం అది చివరిరాత్రి కాగితాలు సామాన్లు సర్దుకునేసరికి రాత్రి 3 గంటలైంది సిమండ్స్ కూడా రాత్రి 3 గంటల దాకా మాతో బాటే వున్నాడు. రెండో రోజున మమ్మల్ని ఓడ ఎక్కించి మరీ వెళ్లాడు. ఈ మా వియోగం ఎంత విషాదకరమైనదో వర్ణించలేను. పరోపకారం కేవలం గోధుమ రంగు గల వారి సొత్తు మాత్రమే కాదని తెలుసుకున్నాను ఇక ప్రజల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికోసం ఒక్క ముఖ్య విషయం పేర్కొంటున్నాను ప్రతినిధి బృందానికి అయిన ఖర్చు విషయమై జాగ్రత్తగా వున్నాము సోడా తాగినా ఓచరు సంపాదించి జాగ్రత్తగా వుంచాము ప్రతి పైసకు లెక్క వ్రాశాము ఎన్నో టెలిగ్రాములు పంపాము వాటన్నిటి రశీదులు జాగ్రత్తగా వుంచాము ఆయాఖాతాలలో జ్ఞాపకం వున్నంత వరకు ఖర్చు వివరాలు వ్రాశాము చిల్లర ఖర్చులు అని వేరే ఖాతా పెట్టలేదు. సామాన్యంగా ఏమో ఖర్చులు పెట్టి, జ్ఞాపకం లేక నాలుగైదు షిల్లింగుల ఖర్చును చిల్లర ఖాతాలో వ్రాస్తూ వుంటారు. ఆపని మేము చేయలేదు జీవితంలో ఒక్క విషయం స్పష్టంగా తెలుసుకున్నాను తెలివితేటలు పెరిగినప్పటి నుంచి ట్రస్టీలమని, బాధ్యత కలిగిన వాళ్లమని మనం భావిస్తూ వుంటాము తల్లితండ్రి వున్నంతకాలం వారిచ్చిన డబ్బుకు. వారు అప్పగించిన పనులకు సంబంధించిన వివరాలు వారికి తెలుపుతూ వుంటాము అలా చేయడం మన కర్తవ్యం మన మీద కల నమ్మకం వల్ల వాళ్లు మనల్ని లెక్క ఆడగరు. అంత మాత్రాన మనం ఊరుకోకూడదు. మనం గృహస్థులమైనప్పుడు భార్య, బిడ్డలకు మనం బాధ్యులం అవుతాము మన సంపాదనకు మనం ఒక్కరమే కాక, మన కుటుంబ సభ్యులు కూడా బాధ్యులు అవుతారు. వాళ్ల కోసం ప్రతిదమ్మిడీకి లెక్క మనం వ్రాయాలి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభిస్తే బాధ్యతలు బాగా పెరిగిపోతాయి సామాన్యంగా స్వయం సేవకులు కానీయండి, కార్యయకర్తలు కానీయండి, మనం పని చేస్తున్నాము, కదా! అందుకైనా లెక్క వ్రాసి అందరికీ చూపనక్కరలేదు అని భావిస్తూ వుంటారు. మనం తప్పుపని చేయం కనుక అంతా మనల్ని సమ్మితీరాలి అని కూడా భావిస్తూ వుంటారు. అలా భావించడం శుద్ధ తప్పు లెక్క వ్రాసి వుంచడానికి, నమ్మకానికి అపనమ్మకానికి సంబంధం లేదు. అసలు లెక్క వ్రాసి వుంచడం ప్రతి వాడికర్తవ్యం అలా చేయకపోవడం పెద్ద తప్పే ఏ సంస్థలోనైనా మనం పని చేస్తున్నప్పుడు ఆ సంస్థ యొక్క పదాధికారులు ఏ కారణం వల్లనైనా మనల్ని లెక్క ఆడగకపోతే అదివారి దోషమే అవుతుంది. జీతం పుచ్చుకొని పనిచేస్తే వాళ్లు ఎలా లెక్కలు వ్రాసి వుంచాలో, అలాగే జీతం పుచ్చుకోని స్వయం సేవకులు కూడా లెక్కలు వ్రాయాలి అతడి పనియే అతనికి ముట్టే జీతమన్నమాట చాలామంది దీన్ని పట్టించుకోరు. అందువల్ల యీవిషయాన్ని యిక్కడ వ్రాశాను యింత చోటు యీ విషయానికి యిచ్చుటకు సాహసించాను