Jump to content

దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/అహమద్ ముహమ్మద్ కాఛలియా

వికీసోర్స్ నుండి

చేయాలని ప్రకటన వెలువడింది. మధ్య యిన్ని రోజుల గడువు భారతీయులపై దయతో యివ్వబడలేదు. ఆచట్టానికి సామ్రాజ్య ప్రభుత్వ ముద్ర అవసరం అందుకు సమయం కావాలి గదా1 అంతేగాక అందు కోసం ఫారాలు, పుస్తకాలు, అనుమతి పత్రాలు తయారు చేయాలి వేరు వేరుచోట్ల ఆఫీసులు తెరవాలి. దానికోసం కొద్ది గడువు ఇచ్చారు



16

అహమద్ ముహమ్మద్ కాఛలియా

మా భారతీయుల ప్రతినిధి బృందం సభ్యులం ఇంగ్లాండు వెళ్లుటకు బయలు దేరాం అప్పుడు దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న ఒక ఆంగ్లేయ యాత్రీకుడు వచ్చి నన్ను కలిశాడు. ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం అమలు చేసిన ఖానీ చట్టాన్ని గురించి మా ఇంగ్లాండు ప్రయాణాన్ని గురించి నావల్ల తెలుసుకొని "అయితే మీరు కుక్కబెల్టు (డాగ్ కాలర్) ధరించడాని వ్యతిరేకిస్తున్నారన్నమాట" అని అన్నాడు. ఆ ఆంగ్లేయుడు ట్రాన్స్‌వాల్ ప్రభుత్వపు చట్టాన్ని కుక్కబెల్టుతో పోల్చాడన్నమాట అతడు ఆ మాట ఖూనీ చట్టాన్ని సమర్ధిస్తూ, భారతీయుల యెడ తనకు గల తిరస్కార భావాన్ని వెల్లడించడానికే అన్నాడో, లేక దక్షిణాఫ్రికా యందలి భారతీయుల విషయంలో ట్రాన్స్‌వాల్ ప్రభుత్వాన్ని ఎమర్శిస్తూ, మా యెడ సానుభూతిని ప్రకటిస్తూ అన్నాడో అప్పుడు నేను నిర్ణయానికి రాలేకపోయాను ఇప్పుడూ రాలేకపోతున్నాను ఆయితే ఏ మనిషి మాట్లాడిన మాటకైనా అతడికి అన్యాయం జరిగేలా అర్థం తీయకూడదని నా అభిప్రాయం అట్టి నీతిసూత్రం ప్రకారం భారతీయుల యెడ సానుభూతిని ప్రకటించేందుకు వాస్తవ స్థితిని యీ మాటల్లో చిత్రించాడని భావిస్తున్నాను. ఒక వైపున ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం భారతీయులకు కుక్క బెల్టు కట్టుటకు ప్రయత్నిస్తూ వుంటే, మరో వైపున యీ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవడమా, బెల్టు ధరించకుండా ప్రభుత్వ వక్రనీతిని ఎలా ఎండగట్టడమా అని భారతజాతి కృషి చేస్తున్నది. ఇంగ్లాండు. భారతావని యందలి సహాయకులగు మిత్రులందరికీ అక్కడి పరిస్థితిని తెలుపుతూ జాబులు వ్రాస్తూ వున్నాము అసలు సత్యాగ్రహ పోరాటానికి బయటి బలాలకంటే, అంతరంగిక బలమే రామబాణంలా పని చేస్తుంది. కనుక జాతిని జాగృతం చేయుటకు, జనాన్ని క్రియాశూరులుగా తయారుచేయుటకు. జాతినాయకులు తమ సమయాన్ని వెచ్చించ సాగారు

సత్యాగ్రహాపోరాటం జరుపుటకు ఏ సంస్థను ఉపయోగించాలా అను ప్రశ్న బయలుదేరింది. ట్రాన్స్‌వాల్ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ సభ్యుల సంఖ్య చాలా ఎక్కువగా వున్నది చాన్ని స్థాపించి నప్పుడు సత్యాగ్రహ పుట్టుక జరగలేదు. ఒకటి కాదు, రెండు కాదు, పలుచట్టాలకు వ్యతిరేకంగా సంస్థ పోరాడింది. ఇంకా పోరాడవలసిన అవసరం వున్నది. చట్టాలకు వ్యతిరేకంగా పోరాడటమే గాక, అనేక రాజకీయ సాంఘిక, తదితరరంగాలలో కూడా రకరకాల పనులు ఆ సంస్థ చేస్తున్నది. ఆ సంస్థ మెంబర్లంతా సత్యాగ్రహపోరాటం ద్వారా ఖూనీ చట్టాన్ని ఎదర్కొంటామని యింకా ప్రతిజ్ఞ గైకొనలేదు. బయటి ప్రమాదాలను గురించి కూడా యోచించవలసిన ఆవసరం వున్నది. సత్యాగ్రహపోరాటాన్ని ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం రాజద్రోహంగా పరగణించి సత్యాగ్రహ పోరాటం సాగించే సంస్థల్ని నిషేధిస్తే? అట్టి స్థితిలో ఆ సంస్థలో పనిచేసే సత్యాగ్రహులు కాని మెంబర్లు ఏంచేయాలి? సత్యాగ్రహం ప్రారంభంకాక పూర్వం సంస్థకు దాతలు యిచ్చిన ధనాన్ని ఏంచేయాలి? వీటికి సమాధానం వెతకాలి సుదీర్ఘ చర్చలు జరిపి చివరికి అశ్రద్ధ, అశక్తి తదితర కారణాలవల్ల సత్యాగ్రహంలో పాల్గొనని వ్యక్తులను ద్వేషించకూడదని, వాళ్లతో స్నేహంగా వ్యవహరించాలని, సత్యాగ్రహం తప్ప తదితర కార్యక్రమాల్లో వాళ్లతో కలిసి పనిచేయాలని అంతా ఒక నిర్ణయానికి వచ్చారు

ఇటువంటి పలు సమస్యలను గురించి చర్చించి యిప్పుడున్న సంస్థల ద్వారా సత్యాగ్రహపోరాటం జరపకూడదని, అన్ని సంస్థలు సత్యాగ్రహ పోరాటానికి శక్తినిబట్టి సహకరించాలని, సత్యాగ్రహాన్ని మినహాయించి మిగతా కార్యక్రమాలన్నింటికి సంస్థలు సహకరించాలని అంతా నిర్ణయానికి వచ్చారు తరువాత సత్యాగ్రహులంగా కలసి “పాసివ్ రెసిస్టెన్స్ అసోసియేషన్" లేక సత్యాగ్రహ మండల్ అను పేరట క్రొత్త సంస్థను స్థాపించారు. ఇంగ్లీషు పేరువల్ల అప్పటికి సత్యాగ్రహం అను పేరు యింకా నిర్ణయం కాలేదని పాఠకులు గ్రహించవచ్చు. ఆ తరువాత జరిగిన కార్యక్రమాల వల్ల, యీ క్రొత్త సంస్థను స్థాపించినందువల్ల భారతజాతికి ఎంతో మేలు జరిగింది. అలా జరిగియుండకపోతే సత్యాగ్రహ పోరాటానికి నష్టం కలిగి యుండేదే చాలా మంది యీ క్రొత్త సంస్థలో మెంబర్లుగా చేరడమే గాక డబ్బుకూడా బాగా యిచ్చి సహాయం చేశారు

డబ్బు లేని కారణంగా ప్రపంచంలో ఏ సంస్థ మూత పడదని. ఆగిపోదని, నిస్తేజపడదని అనుభవంవల్ల తెలుసుకున్నాను. అయితే ప్రపంచంలో సంస్థలు డబ్బు లేకుండానే నడుస్తాయని భావించకూడదు నిజాయితీ కలిగిన సచ్చరిత్రులు నడిపే సంస్థలకు డబ్బులోటు వుండదు దానంతట అదే లభిస్తుంది. దానితోబాటు డబ్బు వరదలా వచ్చిపడితే యిక ఆ సంస్థకు పతనం తప్పదని కూడా అనుభవం వల్ల తెలుసుకున్నాను. ఈ అనుభవాలన్నిటి వల్ల నేను మూల ధనం బాగా పెంచి, దాన్ని నిల్వచేసి, తద్వారా వచ్చే వడ్డీతో సంస్థల్ని నడపడం మహాపాపమని అనలేనుగాని, అది అనుచిత చర్య అని మాత్రం అనగలను ప్రజాసంస్థలకు అసలు ప్రాణం ప్రజలే ప్రజలు కోరినంత వరకే యిట్టి సంస్థలు, పనిచేయాలి మూలధనం సంపాదించి దానివడ్డీతో నడిచే సంస్థలు ప్రజాసంస్థలుగా వుండవు. అవి స్వేచ్ఛా సంస్థలుగానో, నియంత్రిత సంస్థలుగానో అయిపోతాయి. ప్రజల విమర్శలనే అంకుశం దానికి వుండదు. వడ్డీ సాయంతో నడుస్తున్న పలు ధార్మిక, సాంఘిక సంస్థలు ఎంతగా కుళ్లిపోయాయో చర్చించుటకు యిక్కడ తావు లేదు. అయితే యిది అందరికీ తెలిసిన విషయమే

ఇక మనం అసలు విషయానికి వద్దాం సూక్ష్మాతిసూక్ష్మ వాదనలు చేసి ఈకకు పీకలు పీకడం, మీనమేషాలు లెక్క పెట్టడం వంటి పనులు. కేవలం వకీళ్లు, ఆధునిక విద్య గడించిన వేత్తలేకాక, అక్షరం ముక్క రాని వాళ్లు అజ్ఞానులు అనుకున్న వాళ్లు కూడా చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో యీ అనుభవం నాకు కలిగింది. మొదటిసారి ప్యాసైన ఖూనీ చట్టం నిరాకరించబడింది. కనుక యూదుల నాటకశాలలో చేసిన మన ప్రతిజ్ఞ నెరవేరింది అని కొందరు క్రొత్త వాదన లేవదీశారు. ప్రతిజ్ఞాపాలన యందు వెనుకంజ వేసిన వాళ్లకు యీ వాదనసాకుగా దొరికింది. అయితే వాళ్ల వాదనలో కొంత సత్యం వున్నది. కాని దాన్ని చట్ట రూపంలోగాక, అందలి చెడును ఎదిరించిన వారికి మాత్రం, యీ వాదన నచ్చలేదు. వీటన్నిటినీ గమనించి, రక్షణ దృష్ట్యానేగాక, జాతిలో యింకా జాగృతి కలిగించాలని, జనంలో వచ్చిన బలహీనతలను తొలగించాలని భావించి మళ్లీ క్రొత్తగా జనం ప్రతిజ్ఞ చేయడం మంచిదనే నిర్ణయానికి నేను వచ్చాను. అందుకోసం పలుచోట్ల సభలు జరిపి ప్రజలకు బోధ చేశాము. తిరిగి ప్రతిజ్ఞ కూడా చేయించాము ప్రజల ఉత్సాహంలోగాని, ఆవేశంలోగాని ఎట్టి మార్పు రాలేదని తేలింది.

జూలై మాసంలో విధించబడిన గడువు దగ్గరికి వచ్చింది. జూలైనెల చివరి తేదీన ట్రాన్స్‌వాల్ రాజధానీ నగరమైన ప్రిటోరియాలో భారతీయుల పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం ఇతర పట్టణాలనుంచి కూడా చాలామంది ప్రతినిధుల్ని ఆహ్వానించాం. ప్రిటోరియా యందలి మసీదు ప్రాంగణంలో సభ కోసం ఏర్పాట్లు జరిగాయి. సత్యాగ్రహం ప్రారంభమైన తరువాత జనం సభల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన సాగారు అందువల్ల యిండ్లలో సభ జరపడం సాధ్యం కానందున మసీదుల విశాల ప్రాంగణాల్లో సభలు ఏర్పాటు చేయడం ప్రారంభించాం. ప్రిటోరియా పట్టణంలో గల భారతీయుల సంఖ్య 1300 వరకు వున్నది. వారిలో 10000 మంది జోహన్స్‌బర్గు, ప్రిటోరియాల్లో వుంటున్నారు. వారిలో 6000 మంది వచ్చి సభలో పాల్గొన్నారు అని అంటే ప్రపంచమందలి ఏదేశంలోనైనా యిది పెద్ద సంఖ్యగా పరిగణింపబడుతుంది. సామూహికంగా జరిగే సత్యాగ్రహాన్ని మరే షరతు మీద జరుపుటకు వీలు లేదు. ఏ సత్యాగ్రహం కేవలం అందులో పాల్గొను సత్యాగ్రహుల శక్తిపై ఆధారపడి నడుస్తుందో, ఆసత్యాగ్రహాన్ని గురించిన శిక్షణ వారికి గరఫకపోతే అది నడవదు. అందువల్ల యింత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న జనాన్ని చూచి మేము ఆశ్చర్యపడ లేదు బహిరంగ సభలు విశాల మైదానాల్లోనే జరపాలని నిర్ణయించాము అందువల్ల డబ్బు అధికంగా ఖర్చు కాలేదు చోటు లేనందున ఎవ్వరూ తిరిగి వెళ్లిపోవలసిన అవసరం కలుగలేదు. మరో విశేషాన్ని కూడా పేర్కొనడం అవసరం మా సభలన్నీ ప్రశాంతంగా నడిచాయి. సభలో పాల్గొనే జనం ఉపన్యాసాలన్నింటిని శ్రద్ధగా విన్నారు. సభ ప్రాంగణంలో చిపర నిలబడి వున్న వాళ్లకు ఉపన్యాసం వినబడకపోతే బిగ్గరగా మాట్లాడమని వక్తల్ని, కోరుతూ వుండేవారు. ఇట్టి సభల్లో కుర్చీలు వుండేవి కావని పాఠకులు గ్రహింతురుగాక అంతా నేల మీదనే కూర్చోనేవారు చిన్న వేదిక మాత్రం ఏర్పాటు చేసేవాళ్లం దాని మీద సభకు అధ్యక్షత వహించే అధ్యక్షుడు. ఉపన్యాసం యిచ్చే వక్త, మరిద్దరు ముగ్గురు ముఖ్యలు వుండేవారు. ఆ వేదిక మీద ఒక చిన్న టేబులు, రెండు మూడు కుర్చీలు, స్టూళ్లు వుండేవి

ప్రిటోరియాలో జరిగిన యీ సభకు అధ్యక్షత. బ్రిటీష్ ఇండియన్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడు అయిన యూసఫ్ ఇస్మాయిల్‌మియా వహించారు. ఖూనీ చట్ట ప్రకారం అనుమతి పత్రాలు తీసుకోవలసిన గడువు సమీపిస్తున్నది. అందువల్ల ఆవేశం ఎంత వున్నా భారతీయులు మాత్రం చింతా క్రాంతులైనారు. అదే విధంగా శక్తి సామర్థ్యాలు ఎన్ని వున్నా జనరల్ బోధా జనరల్ స్మట్సులు కూడా పైకి బుకాయిస్తున్నా లోలోపల అమిత చింతా క్రాంతులైనారు. ఒక జాతినంతటినీ బలవంతంగా వంచి అణచడం ఎవ్వరికీ సాధ్యం కానిపని అందువల్ల జనరల్ బోధా యీ సభలో మాకు నచ్చచెప్పమని శ్రీ . విలియం హాస్కిన్‌ను పంపించాడు. శ్రీ హాస్కిన్‌ను పదమూడవ ప్రకరణంలో పాఠకులకు పరిచయం చేశాను సభ శ్రీవిలియం హాస్కిన్‌కు ఘనంగా స్వాగతం పలికింది. ఆయన ప్రసింగిస్తూ "నేను మీకు మిత్రుణ్ణి మీకందరికీ యీ విషయం తెలుసు నా సానుభూతి మీయెడ కలదని చెప్పనవసరం లేదని భావిస్తున్నాను నాకు శక్తి వుంటే మీ కోరికలన్నింటిని అంగీకరింప చేయాలని వున్నది. అయితే యిక్కడి సామాన్య తెల్లవారి వ్యతిరేకతను గురించి వేరే మీకు చెప్పనవసరంలేదని అనుకుంటున్నాను ఇవాళ నేను మీ దగ్గరికి జనరల్ బోధా కోరినందున వచ్చాను వారి సందేశం మీకు వినిపిస్తున్నాను. భారత జాతి అంటే ఆయనకు గౌరవం వున్నది భారత జాతి భావాలు ఆయనకు తెలుసు అయినా ఆయన నేను ఏమీ చేయలేని స్థితిలో వున్నాను ట్రాన్స్‌వాల్ యందలి తెల్లవారంతా యిట్టి చట్టం అవసరమని భావిస్తున్నారు. భారత జాతి చేయవలసిందంతా చేసింది గౌరవాన్ని రక్షించుకున్నది. అయినా భారతజాతి కోరిక నెరవేరలేదు. చట్టం ప్యాసైంది. ఇక భారత జాతి యీ చట్టాన్ని అంగీకరించి తమ విశ్వాసపాత్రతను, శాంతి స్వభావాన్ని వెల్లడించడం అవసరం ఇక యీ చట్టమందలి కొద్ది చిన్న పెద్ద నిబంధనల్లో మార్పు అవసరమని భావిస్తే స్మట్స్ వినడానికి సిద్ధంగా వున్నారు అని చెప్పాడు. ఈ విధంగా, జనరల్ బోధా సందేశాన్ని చెప్పి శ్రీ హాస్కిన్ మీరు జనరల్ బోధా సలహాను విని పాటించమని నాపక్షాన చెబుతున్నాను ప్రభుత్వం యీ చట్టం మీద గట్టిగా నిలిచియుందని నాకు తెలుసు ప్రభుత్వాన్ని ఎదిరించడమంటే తలను గోడకు కొట్టుకున్నట్టే అవుతుంది. భారత జాతి చట్టాన్ని వ్యతిరేకించి అనవసరంగా కష్టాల్నికొని తెచ్చుకోవద్దని, నాశనం కావద్దని సలహా యిస్తున్నాను అని చెప్పాడు. వారిచ్చిన ఉపన్యాసాన్ని అక్షరం అక్షరం అనువదించి నేను జనానికి వినిపించాను. నా పక్షాన కూడా జనాన్ని హెచ్చరించాను. చప్పట్ల ధ్వని మధ్య శ్రీ హాస్కిన్ సభ నుంచి వెళ్లిపోయాడు

ఇక సభలో భారతీయుల ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రకరణానికే గాక, నిజానికి ఈ చరిత్రకే నాయకత్వం వహించిన నాయకుణ్ణి ఇక పరిచయం చేస్తున్నాను సభలో ప్రసంగించిన వారిలో కీ. శే. అహమద్ ముహమ్మద్ కాఛలియా ఒకరు వారిని ఒక కక్షిదారుడుగాను, రెండు భాషలు వచ్చిన దుబాసిగాను నేను ఎరుగుదును వారు. ప్రజా కార్యక్రమాల్లో ప్రముఖంగా పాల్గొనలేదు వారికి ఇంగ్లీషు బాష కొద్దిగా వచ్చు అనుభవంద్వారా ఆభాషా జ్ఞానాన్ని బాగా పెంచుకున్నారు. మమ్మల్ని తన ఆంగ్లవకీళ్ల దగ్గరికి తీసుకు వెళ్లినప్పుడు యిద్దరి మధ్య తానే దుబాసిగా వ్యవహరించే వారు అయితే వృత్తిగా గాక, ఒక మిత్రునిగా దుబాసిపని చేస్తూవుండే వారు బట్టలు అమ్మకం చేస్తూ తరువాత తన సోదరునితో కలిసి భాగస్వామిగా వుండి చిన్నస్థాయిలో వ్యాపారం ప్రారంభించారు. ఆయన సూరత్‌కు చెందిన మేమన్‌జాతి వారు సూరత్ జిల్లాలో జన్మించారు సూరత్‌కి చెందిన మేమన్ తెగవారికి ఆయనంటే గౌరవం ఆయనకు గుజరాతీ కొద్దిగా వచ్చు కాని అనుభవం ద్వారా యీ భాషాజ్ఞానాన్ని కూడా బాగా పెంచుకున్నారు. వారి బుద్ధిమాత్రం కడు చురుకైనది ఏ విషయాన్నైనా యిట్టే గ్రహించి వేసేవారు కోర్టు కేసుల యందలి చిక్కుముడుల్ని విప్పదీయడంలో ఆయన ప్రతిజ్ఞచూచి నేను చాలా సార్లు నివ్వెరబోయాను వకీళ్లతో సైతం చట్ట నిబంధనల్ని గురించి నిశితంగా చర్చిస్తూ వుండేవారు. వకీళ్లు సైతం ఆయన వాదనల్ని విని వాటిని గురించి శ్రద్ధ వహించేవారు. ప్రతాపంలోగాని, నిష్ఠవిషయంలో గాని ఆయనను మించిన వ్యక్తిని నేను దక్షిణాఫ్రికాలోగాని, భారతదేశంలో గాని చూడలేదు. జాతి హితంకోసం ఆయన తన సర్వమూ త్యాగం చేశారు ఆయన సంభాషించిన ప్రతిసారి ఏకవచన ప్రయోగం చేస్తూ వుండేవారు ఆయన నిష్టకలిగిన మహమ్మదీయుడు సూరత్‌కు చెందిన మేమన్ల మసీదుకు సంబంధించిన ట్రస్టీలలో ఆయన కూడా ఒకరు. అయితే హిందూ మహమ్మదీయుల్ని సమంగా చూచేవారు. సమస్యలు వచ్చినప్పుడు మత మౌఢ్యంతో ముస్లిములను సమర్ధించి ఆయన హిందువులను తెగడిన ఘట్టం ఒక్కటి కూడా లేదు. నిర్భయుడు నిష్పక్షపాతి అందువల్ల అవసరమైనప్పుడు హిందువులకు. మహమ్మదీయులకు వారి వారి దోషాలు చెప్పడానికి వెనుకంజ వేసేవాడు కాడు ఆయన చూపించిన నిరాడంబరత్వం, అభిమాన రాహిత్యం అనుసరించుటకు అనుకూలమైనవి ఎన్నో సంవత్సరాల గాఢ పరిచయం వల్ల కీ. శే. అహమద్ కాఛలియా వంటి పురుషుడు భారత జాతికి లభించడం గొప్ప విశేషంగా నేను హృదయపూర్తిగా భావిస్తున్నాను ప్రిటోరియాలో ఉపన్యసించిన వారిలో ఆ నరపుంగవుడు కూడా వున్నాడు. ఆయన క్లుప్తంగా ఉపన్యాసం యిచ్చాడు. "ప్రతి భారతీయునికి యీ ఖూనీ చట్టం ఏమిటో తెలుసు దాని అర్ధం మనందరికీ తెలుసు శ్రీ హాస్కిన్ ప్రసంగం శ్రద్ధగా విన్నాను. మీరంతా కూడా విన్నారు. నాపై ఒక్క ప్రభావం పడింది. వారి ప్రసంగం విన్న తరువాత నేను చేసిన ప్రతిజ్ఞ యింకా గట్టి పడింది ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం ఎంత శక్తివంతమైనదో మనందరికీ తెలుసు అయితే యీ ఖూనీ చట్టం కంటే మించి యింక వాళ్లు చేసేది ఏమిటి ఈ ప్రభుత్వం మనల్ని జైళ్లలో పెడుతుంది మన ఆస్థుల్ని జప్తుచేసి అమ్మివేస్తుంది. మనల్ని దేశాన్నుంచి బహిష్కరిస్తుంది. ఉరితీస్తుంది. వీటన్నింటిని నవ్వుతూ మనం సహించగలం, కాని యీ ఖూనీ చట్టాన్ని మాత్రం సహించం సహించలేము అంటూ ప్రసంగం ముగించాడు. ఆ సమయంలో అతడు పొందిన ఉత్తేజాన్ని నేను జాగ్రత్తగా గమనించాను ఆయన ముఖం ఎర్రబడింది. ఆయన సిరస్సు, ముఖమందలి నరాలు రక్త ప్రసారం వల్ల ఉబ్బాయి ఆయన శరీరం వణికింది. తన కుడిచేతివ్రేళ్లను కంఠం మీద నిమురుతూ ఒక్కసారిగా గర్జించాడు. 'నేను ఖుదాను సాక్ష్యంగా పెట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను ఒట్టుపెట్టుకుంటున్నాను ప్రాణాలైనా అర్పించివేస్తాను కాని యీ ఖూనీ చట్టం ఎదుట తలవంచను ఈ సభకూడా యిట్టి నిర్ణయమే చేయాలని కోరుతున్నాను " అంటూ ఆయన కూర్చున్నాడు. తన కంఠం మీద కుడి చేతివ్రేళ్లను నిమురుతూ వున్నప్పుడు కొందరు చిరునవ్వు నవ్వడం నేను చూచాను నేను కూడా వారితో కలిసి చిరునవ్వు నవ్వాను మాటల్లో చూపినంతశక్తి చేతల్లో కాఛలియా చూపించగలడా అనే సందేహం నాకు కలిగింది. ఆ సందేహాన్ని గురించి వ్రాస్తున్నప్పుడు యిలా ఎందుకు వ్రాశానా అని నాకు సిగ్గువేస్తున్నది అమహాసంగ్రామంలో తమ ప్రతిజ్ఞను అక్షరశ: పాలించిన భారతీయులందరిలో కాఛలియా సేర్ సదా ముందు వున్నాడు. ఏనాడూ ఆయన ముబంలో రంగు మారడం నేను చూడలేదు బిగ్గరగా చప్పట్లుకొట్టి సభ ఆయన ఉపన్యాసాన్ని సమర్థించింది. అప్పటికి కాఛలియాను గురించి నేను తెలుసుకున్న దానికంటే, జనం ఎక్కువ తెలుసుకున్నారని నాకు బోధపడింది. వారిలో చాలామందికి చింపిరి గుడ్డల్లో గల ఆముత్యాన్ని గురించి బాగా తెలుసు శ్రీ కాఛలియా చెప్పింది చేస్తాడని. చేసిందే చెబుతాడని వాళ్లకు తెలుసు సభలో యింకా ఆవేశంతో నిండిన ఉపన్యాసాలు కొందరు యిచ్చారు. నేను కాఛలియా ఉపన్యాసానికే అధికంగా ప్రాధాన్యం యిచ్చాను. ఆయన ఉపన్యాసం భవిష్యద్వాణిగా రూపొందడమే, అందుకు కారణం ఆవేశంతో ఉపన్యాసాలు యిచ్చిన వారలో చాలా మంది తమ మాట మీద నిలబడలేక పోయారు. ఆ పురుష సింహాన్ని మృత్యువు 1918లో అనగా సత్యాగ్రహ పోరాటం ముగిసిన నాలుగు సంవత్సరాల తరవాత భారతజాతికి సేవ చేస్తూ వున్నప్పుడు తన ఒడిలోకి తీసుకున్నది

కాఛలియా సేర్‌ను గురించిన ఒక సంస్మరణను మరో చోట వ్రాయడం సాధ్యం కాదు కనుక యిక్కడే వ్రాస్తున్నాను టాల్‌స్టాయి ఫాఠమును గురించి పాఠకులు యిక ముందు చదువుతారు. అక్కడ సత్యాగ్రహుల కుటుంబాలు వుంటున్నాయి. జాతి ప్రజలకు ఒక ఉదాహరణగా చూపాలని భావించి, తన కుమారుణ్ణి నిరాడంబరతను నేర్చుకోమని ప్రజా సేవ ఎలా చేయాలో తెలుసుకోమని చెప్పి ఫారంకు కాఛలియా పంపించాడు. అది చూచి మిగతా మహమ్మదీయులు కూడా తమ బిడ్డల్ని చదువు కోసం ఫారంలో చేర్చారు కాఛలియా కుమారుడి పేరు . అప్పుడు అతడిక్ 10 లేక 12 సంవత్సరాల వయస్సు వుంటుంది. స్వభావరీత్యా అలీ వినమ్రుడు కొద్దిగా చంచలుడు, సత్యవాది సరళహృదయుడు అయితే కాఛలియా సేర్ గతించిన తరువాత, సత్యాగ్రహ పోరాటం ముగిసిన తరువాత ఆ బిడ్డను కూడా దూతలు దేవుని దర్బారుకు తీసుకు పోయారు. ఆ పిల్లవాడు జీవించి యుంటే తన తండ్రికి నిజమైన ప్రతినిధి అయ్యేవాడని నా అభిప్రాయం