దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/ప్రధమ అంతఃకలహం

వికీసోర్స్ నుండి

17

ప్రధమ అంతఃకలహం

1907 జూలై1వ తేదీ వచ్చింది. అనుమతి పత్రాల్ని యిచ్చే ప్రభుత్వ కార్యాలయాలు వెలిశాయి. భారతజాతి పక్షాన అటువంటి ప్రతి ఆఫీసు ఎదుట పికెటింగు జరిషి, భారతీయుల్ని పత్రాలు తీసుకోకుండా ఆపాలని ఆదేశం యిచ్చాము తెల్ల ప్రభుత్వంవారి ఉచ్చులో చిక్కుకోవద్దని భారతీయుల్ని హెచ్చరించడం కూడా జరిగింది. ప్రతి వాలంటీరు ఒక బిళ్లను గుర్తుగా తగిలించుకోవాలి అనుమతి పత్రం తీసుకునే భారతీయుల్ని మాత్రం అవమానించవద్దని వాలంటీర్లకు నచ్చ చెప్పాము అట్టివారిని పేరు అడగండి అతడు తన పేరు చెప్పకపోతే అతడితో అసభ్యతగా వ్యవహరించకండి అట్టివారికి మనం తయారుచేసిన కరపత్రం యివ్వండి రక్తపు చట్టానికి లోబడితే, కలిగే ప్రమాదాల్ని గురించి వారికి చెప్పండి పోలీసులతో మంచిగా మెలగండి వారి జోలికి పోవద్దు పోలీసులు తిట్టినా, కొట్టినా సహించండి. ఒక వేళ దెబ్బలు సహించలేకపోతే అక్కడి నుంచి తప్పుకోండి అరెస్టు చేస్తే సంతోషంగా జైలుకు వెళ్లండి జోహన్స్ బర్గ్‌లో ఏమైనా జరిగితే తిన్నగా నాకు తెలియజేయండి. మిగతా చోట్ల అక్కడ నియమంపబడిన కార్యదర్శులకు తెలియజేయండి. వాళ్లు చెప్పిన ప్రకారం నడుచుకోండి కొద్ది మంది పికెటర్లకు ఒక నాయకుడు వుంటాడు. ఆనాయకుడి ఆదేశానుసారం అంతా నడుచుకోవాలి యిదంతా వాలంటీర్లకు నేర్పిన పాఠం

ఇలాంటి అనుభవం జాతికి మొదటిసారి కలిగింది. 12 సంవత్సరాలు దాటిన వారిని పికెటర్లుగా ఎన్నుకున్నారు. అందువల్ల 12 నుంచి 18 ఏండ్లవయస్సు గల యువకులు సైతం యీ దళాల్లో చేరారు. స్థానికకార్యకర్తలకు అపరిచితులైన వారిని ఎవ్వరినీ చేర్చుకోలేదు. అయినా ఎంతో జాగ్రత్తగా అంతావున్నారు. ఎవరైనా పత్రాలు తీసుకోవాలని అనుకుంటే, పికెటర్ల భయం వారికి కలిగితే అట్టివారికి హాని జరగకుండా చూస్తామని, ఒక వాలంటీరును కూడా వారికిచ్చి లోనికి పంపుతామని పత్రాలు తీసుకున్న తరువాత అట్టివారిని వాలంటీరు సురక్షితంగా బయటికి పంపుతాడని కూడా పలు పర్యాయాలు ప్రకటించాము కొందరు ఆ విధంగా ప్రయోజనం పొందారు కూడా!

వాలంటీర్లు ఎంతో ఉత్సాహంతో తమ పనులు నిర్వహించారు. ఎంతో జాగ్రత్తగా వున్నారు. వాలంటీర్లను పోలీసులు ఎక్కువగా బాధించ లేదని చెప్పవచ్చు. కొన్ని చోట్ల పోలీసులు బాధించితే వాలంటీర్లు సహించారు. ఈ కార్యక్రమాల్లో వాలంటీర్లు హాస్యరసాన్ని కూడా మేళవించారు. పోలీసులు కూడా అందుపాల్గొన్న ఘట్టాలు వున్నాయి. వాలంటీర్లు ఎన్నో ఛలోక్తులు విసురుతూ జనాన్ని నవ్వించుతూ వున్నారు. ఒకచోట రాకపోకలకు అడ్డు తగులుతున్నారని ఆరోపణ చేసి వాలంటీర్లను పోలీసులు అరెస్టు చేశారు ఆ విధంగా అరెస్టు అయిన వారి పక్షాన పకీళ్లను నియమించి ప్రజాధనాన్ని ఖర్చు చేయమని చెప్పడం కూడా జరిగింది. అన్నిటికీ సిద్ధపడే వాలంటీర్లు రంగంలోకి దిగారు. తరువాత కోర్టువారు అరెస్టు చేయబడిన వాలంటీర్లను నిర్దోషులుగా నిర్ణయించి వదిలి వేశారు. దాని వల్ల వాలంటీర్ల ఉత్సాహం బాగా పెరిగింది

ఈ విధంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పత్రాలు తీసుకునే వారికి హాని కలుగకుండా కాపాడినా వాలంటీర్ల దళాలకు తెలియకుండా ఒక రహస్య దళంగా ఏర్పడి కొందరు పత్రాలు తీసుకుంటే ఖబర్దార్ అంటూ జనాన్ని బెదిరించడం ప్రారంభించారు. ఈ విషయం తెలియగానే వాళ్లెవరో తెలుసుకొని, అట్టి అరాజకాన్ని అరికట్టుటకు ప్రయత్నాలు చేశాము దానితో బెదిరింపులు ఆగిపోయాయి. కాని ఆ ప్రవృత్తి సమూలంగా మాత్రం వీడిపోలేదు. దాని వల్ల భారత జాతీయ సత్యాగ్రహ సంగ్రామానికి కొంత నష్టం కూడా కలిగింది. అలా భయపడ్డ వాళ్లు ప్రభుత్వ సంరక్షణ కోరగా, వారికి అది లభించింది. ఈ విధంగా ఒక విషంకొందరి హృదయంలో బయలు దేరింది. వాళ్లు బలహీనుల్ని బెదిరించారు. వాళ్లను యింకా పిరికి వాళ్లను చేశారు. బయట పడకుండా రహస్యంగా యిట్టి పనులు చేసే వారంతా బలహీనులే బలహీనులు ఏదో విధంగా దెబ్బతీయాలని చూస్తూ వుంటారు

అయితే యిట్టి బెదిరింపులకు భారతీయులు భయపడలేదు. కాని పత్రాలు తీసుకున్న వాళ్ల పేర్లు బయటపడక తప్పదనీ, మిగతా వారి దృష్టిలో దిగజారిపోతామని అట్టివారికి భయం పట్టుకుంది. రక్తపు చట్టానికి తలవంచడం మంచిది అని అన్న ఒక్క భారతీయుడుకూడా నాకు కనబడలేదు. కొంత మంది కొత్త పత్రాలు తీసుకుందామని వెళ్లారు గాని, తమ పిరికితనానికి వాళ్లే బాధ పడ్డారు. ఇటువంటి ఘట్టాలు ఎన్నో జరిగాయి

ఒకవైపున సిగ్గు లజ్జ, మరోవైపున తమ వ్యాపారానికి దెబ్బతగలకుండా కాపాడుకోవడం యీ రెండిటి మధ్య వ్యాపారస్థులు కొందరు యిరుక్కుపోయి భాదపడ్డారు. కాని చివరకు వాళ్లు ఒక ఉపాయం కనుక్కున్నారు. అట్టివాళ్లు ఏషియాటిక్ శాఖాధికారి దగ్గరకు వెళ్లి మాట్లాడి, ఫలానా చోటఫలానా వారి సొంత యింట్లో రాత్రి 9 లేక 10 గంటల తరువాత అనుమతి పత్రాలు అందజేయండి. తీసుకుంటాం అని చెప్పి ఆయనను ఒప్పించారు. ఇలా అయితే తాము రక్తపు చట్టానికి లొంగిపోయినట్లు బయటపడదని వారు భావించారు. తామంతా జాతి నాయకులం గనుక, ఎవ్వరూ ఏమి చేయలేరు పని నడిచిపోతుందని వారు అనుకున్నారు. అందరిముందు సిగ్గు పడవలసిన అవసరం వుండదని, తరువాత బండారం బైటపడ్డా పరవాలేదని ఉహించారు

కాని వాలంటీర్లు జాగ్రత్తగా వున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం జాతికి అందిపోతూవున్నది. ఏషియాటిక్ ఆఫీసులో వున్న వాళ్లు కూడా అఖండులే ఇటువంటి రహస్య సమాచారం ఏమైనా వుంటే వాళ్లు సత్యాగ్రహులకు చేరవేస్తూ వుండేవారు. మరో రకం బలహీనులు కొందరు వుండేవారు. వాళ్లు తాము బలహీనులే అయినా నాయకులు బలహీనపడితే సహించ లేకపోయేవారు వాళ్లు తమకు తెలిసిన నాయకుల బలహీనతల్ని ఎప్పటికప్పుడు వాలంటీర్లకు తెలియజేస్తూ వుండేవారు. ఇటువంటి ఘట్టం ఒకనాడు జరిగింది కూడా ఫలానా రోజున. ఫలానరాత్రి, యిన్ని గంటలకు ఫలానా కొట్లో పత్రాలు ఫలానా ఫలానా వాళ్లు తీసుకోబోతున్నారు అని ఆఫీసుకు సమాచారం అందింది. ఆ వార్త అందగానే అట్టి వాళ్ల దగ్గరకు వెళ్లి అలా చేయవద్దని నచ్చచెప్పారు. ఆకొట్టు దగ్గర పికిటింగు కూడా చేశారు. అయినా నాటిరాత్రి 11 గంటలకు భారతీయ నేతలు కొందరు రహస్యంగా పత్రాలు తీసుకున్నారు. ఇలాంటి ఘట్టంవల్ల ఒక సిద్ధాంత ప్రకారం సాగుతున్న ఉద్యమానికి విఘాతం కలిగింది. మర్నాడే ఆ పెద్ద మనుష్యులపేర్లు పత్రికల్లో ప్రకటించబడ్డాయి. మనిషి పడే సిగ్గులజ్ఞలకు కూడా ఒక హద్దనేది వుంటుంది! దీనికంతటికీ కారణం స్వార్థమే స్వార్థం జడలు విరబోసుకునేసరికి మనిషి జారిపోతాడు. సిగ్గులజ్ఞలు అతణ్ని ఏమీ చేయలేవు ఈ విధంగా అంతఃకలహాలకు లోనై సుమారు 500 మంది భారతీయులు పత్రాలు పుచ్చుకున్నారు. కొద్ది రోజులు యీ తతంగం సొంత ఇళ్లలో జరిగింది. మెల్ల మెల్లగా అట్టివారిని చలివదిలి వేసింది ఆ తరువాత బహిరంగంగానే ఏషియాటిక్ ఆఫీసుకు వెళ్ళి అనుమతి పత్రాలు తీసుకోవడం ప్రారంభించారు



18

ప్రధమ సత్యాగ్రహఖైదీ

ఎంత కష్టపడ్డా 500కి మించి భారతీయుల పేర్లు రాకపోయేసరికి ఏషియాటిక్ శాఖకు సంబంధించిన అధికారులు భారతీయులను అరెస్టు చేయడం అవసరమని నిర్ణయానికి వచ్చారు. పాఠకులకు జర్మిస్టస్ పేరు తెలుసుకదా! అక్కడ భారతీయులు చాలామంది ఉంటున్నారు. వారిలో ఒకని పేరు రామసుందర్ పండిత్ అతడు చూచుటకు శూరుడు వీరుడుగా కనబడేవాడు వాచాలుడు కొద్ది సంస్కృత శ్లోకాలు అతడినోటికి వచ్చు ఉత్తర ప్రదేశ్‌కి చెందినవాడు కనుక తులసీ రామాయణ మందలి కొన్ని దోహాలు, చౌపాయీలు కూడా అతనికి వచ్చు పండిత్ కనుక జనం అతణ్ని