తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/ప్రాచీనగ్రంథముల పలుకుబడికి మనపై చెల్లుబడి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

4

ప్రాచీన గ్రంథముల పలుకుబడికి

మనపై చెల్లుబడి


కవిత్వము, సంగీతము, నృత్యము, చిత్రరచన ఏ దేశములో ఏజాతిలో పెంపొందించుచుండునో ఆ దేశము, ఆ జాతి పాప ప్రవృత్తులకు దూరమై ఉండు నని, భగవదనుభూతికిఁ దగిన పరిపాకముగలదై ఉండు నని విజ్ఞు లందురు. తెలుఁగుజాతి, తెలుఁగుదేశము పైకళలో ముందడుగు వేయుచున్న దనియే నా నమ్మకము.

భారతదేశములోని అన్ని దేశభాషల సాహిత్యములును సంస్కృత భాషాసాహిత్యసంపద నాస్వాదించి జీర్ణించుకొని పుట్టి పెరిగినవే. మన తెలుఁగు సాహిత్యవాహినిలోకూడ తెలుఁగునాటివారి పలుకులతీరులు, తలఁపులతీరులు, కూర్పులతీరులు, ఫణితులతీరులు ఊట లూరఁగా ఊరఁగా స్వతంత్ర రచనలను సోనయేళ్లు కొన్ని జాలువాఱుచున్నను, సంస్కృతసాహిత్య ప్రవాహముకూడ అందులో ప్రధానముగా సాగుచునే ఉన్నది. నేఁటికిని, రేపటికిని ఉండఁగలదు.

వెన్నవలెం గరంగు సుకవిత్వము' చెప్పినవారు శ్రీశివశంకరశాస్త్రి గారు 'వకుళమాల' అని హృద్యకావ్యము నొకదానిని కూర్చినారు. ఆ వకుళమాలలోఁ గూడ భట్టుమూర్తిగారి యీక్రింది పద్యపుసువాసన గుబాళించుచున్నది.


కమనీయద్యుతిధామమా విమలముక్తాదామమా సేమమా
కమలామోదకు, తత్సఖీసమితికిం గల్యాణమా తన్మరా
ళ మయూరీ శుకశాజశారికల కెల్లన్ భద్రమా తెల్పుమా
ప్రమదారత్నము పేరుగా నేద నినున్ బాటించి ప్రార్థించేదన్,

కాళీదాసకవి మేఘసందేశ మని క్రొత్త తీరు కావ్యము రచింపఁగా, హనుమత్సందేశమును మనసులో ఉంచుకొని రచించె నన్నారంట- నాటి విద్వాంసులు.

నన్నయభట్టుగారు మొదలుకొని చిన్నయసూరిగారి దాఁక ఎన్నికగన్న ఆంధ్రకవులు రచించిన ప్రబంధముల పలుకుబడి విద్యావికేములు గల యాంధ్ర ప్రజల హృదయములపై విశేషముగా సాగుచున్నది.

రాములు, లక్ష్మణులు, భరతులు, రావణులు, విభీషణులు, సీతలు, కౌసల్యలు, కైకలు, మంధరలు,ధర్మరాజులు, ఉత్తరకుమారులు, ప్రహ్లాదులు, హిరణ్యకశిపులు, గుణనిధులు, నిగమశర్మలు, వరూధినీ ప్రవరులు, కరటకదమనకులు, సుగాత్రీశాలీనులు, ఆషాఢభూతులు, కీలోత్పాటులు మొదలగువారు పురాణ పురుషులు, ప్రబంధపురుషులు నేఁడును అనేక స్థలములలో అనేకులు గుర్తింపఁబడుచున్నారు.

సామెతలు గ్రంధములలోని కెక్కినట్లు గ్రంధములలోని పద్యములుకూడ లోకవ్యవహారములలోని కెక్కినవి. అసలు ఆంధ్రప్రజల నిత్యవ్యవహారములలోనే కవిత్వగానములు కలగలు పైయున్నవి. ఆంధ్రభాష పుట్టుకయే కవితాగానాత్మకము.

వినాయకచతుర్థి, నవరాత్రములు అను పండుగనాళ్ళలో బాలకులచే పద్యములు పాడించుట, ప్రబంధములు చేతఁబట్టించుట నే నెఱుఁగుదును.


“ధర సింహాసనమై నభంబు గొడుగైత ద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయములెల్ల వంది గణమై బ్రహ్మాండ మాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుతియై
వరుసన్ నీ ఘనరాజసంబు నిజమై పర్ధిల్లు నారాయణా. "


ఇత్యాది పద్యములు నేను చాల పసిప్రాయమున నేర్చుకొన్నవి. వివాహములలో రుక్మిణీ కల్యాణ పద్యములను ముత్తయిదువలు ఆనంద భైరవిరాగముతో నాలాపించుచుండుట అనేకు లెఱుఁగుదురు.

బడిపిల్లలు పాటపద్యాలు, ఆటవిడుపు పద్యాలు అనుపేర ప్రబంధ పద్యములు వల్లించుట పల్లెటూళ్లలో పరిపాటి. పెళ్ళిళ్లలో వరునిచేత తాటాకులమీఁద, ఇటీవల కాగితాలమీద "శ్రీయును కులమును రూపము ప్రాయము శుభలక్షణంబు" ఇత్యాది పద్యములను వ్రాయించుట ఆచారము. తెల్లవాఱుగట్ల ప్రబంధములలోని దశావతారపద్యములను పలువురు పల్లెటూళ్ళలో పారాయణము చేయుచుందురు. రంగనాధ రామాయణ ద్విపదలే రామాయణపుబొమ్మలాటలలో తోలుబొమ్మలాటవారు పాడుపాటలు, కనుకనే పల్లెటూళ్ళలో పారు రంగనాధరామాయణమును బొమ్మలాట రామాయణ మనుచుందురు. శైవుల శుభాశుభ సమయములలో బసవపురాణమును పారాయణ చేయుదురు. వానలులేనప్పు దూరి పెద్దలు విరాటపర్వమును పురాణము చెప్పింతురు. ఇవి సాహిత్య ప్రయోజనములకే కాక మతసంప్రదాయ వ్యవహార ప్రయోజనమునకై కూడ ఏర్పడిన ఆచారములు.


 పాత్రసంశుద్ధి కాజ్యం బుపస్తరించి
యూరకుండిరి యిది యేమీ యొక్క వీరు
కానరా విష్ణు శాకపాకములు నెదుర
మనకు నిజమయ్యె నల చందమామఘుటిక.


శ్రీనాథుని భీమఖండములోని పయిపద్యము "చందమామ రావే, జాబిల్లి రావే" అన్న పసిబాలకుల పాటనుబట్టి పుట్టినది. బాలకుల పొటతో పై పద్యార్థము మిళితమై ఉన్నది. నా చిన్ననాఁటి ముచ్చట ఒకటి, ఏదో అల్లరిచేయఁగా మాయమ్మ నన్ను గట్టిగా కొట్టినది. నేను ఎక్కడనో ఉన్న మా నాయనగారిదగ్గలు కేడ్చుచు వెళ్లితిని. నాగొడవ వెళ్లబోసికొంటిని. నే నింక ఇంటికి రా నంటిని, అమ్మమొగము చూడ సంటిని. కాశీఖండములోని గుణనిధి కథ చెప్పి మా నాయనగారు అందలి పద్య మిది చదివి వినిపించి అర్ధము చెప్పిరి.

 అరుణగభస్తిబింబ ముదయాట్రిపయిం బొడతేర గిన్నెలో
పెరుగును వంటకంబు వడపిందెలుసుం గుడువంగఁ బెట్టుని
గ్భరకరుణాధురీణ యుగుప్రాణము ప్రాణము తల్లియున్నదే
హరహర యెవ్వరీంకఁ గడుపారని పెట్టెద రీప్సితాన్నముల్


అమ్మ ప్రేమ ఆకళింపునకు రాఁగా తలగోఁకుకొనుచు ఏడుపు దిగమ్రింగుకొని నే నింటికి వచ్చితిని.

తెలుఁగురచన లనఁగా చిన్ననాఁటనుండియు నాకు బులుపాటము. తెలుఁగు పద్యములు వినుటకై చెవికోసికొనువాఁడను, గుజ్జనగూళ్ళతో పాటు తెలుఁగురచనల తీయదనమునుగూడ మా నాయనగారు నన్నాస్వాదింపించినారు. మా తోబుట్టువును అత్తవారింటికి అనిపిన సందర్భమున ఒకనాడు శ్రీనాథుని శృంగారనైషధములోని ఈ క్రింది పద్యము చదివి అర్థము చెప్పినారు.

ఉభయవంశలలామ మయ్యుత్పలాక్షి
అత్తవారింటి కరిగెడు నవసరమున
మాతృజనక సఖీజన భ్రాతృవిరహ
మధిపతి ప్రేమ జలరాశి కౌర్వమయ్య,

అర్ధ మాలోచించినకొలఁది ఈ పద్యము నా కాసందము గొల్పసాగినది. శ్రీనాథుని రచనలమీఁద నాకు చిన్ననాఁటనుండియు ఆదర మిట్టి పద్యములు వినుటచేతనే.

ఈనడుమ మాయింట నొకవివాహము జరిగినది. భోజన సమయమున నసాళమంటు తాళింపు పొగరుగల పెరుగు పచ్చడిని ఆస్వాదించి, నవ్యాంధ్రకవిమిత్రు లోకరు చదివినా రీశృంగారనైషధ పద్యమును.

మిసిమిగల పుల్లఁబెడుగుతో మిళితములగు
నావపచ్చళ్లు చవిసూచి రాదరమున
చుట్టుమని మూర్ధములు దాఁకి యెట్టుఁదనము
పొగలు వెడలింప నాసికాపుటములందు

ఇరువది యేండ్ల క్రిందట ప్రాచీన గ్రంథ సంపాదన కై తెలుఁగుదేశము' ఊరూర 'టూరు' చేయుచు, చాలకాలము విద్వదౌష్టి జరిపినపొఁడను గనుక, ప్రాచీన గ్రంథార్ధముల పలుకుబడి పల్లెటూళ్ళలో ఎంత చెల్లుబడి అగుచు నున్నదో నేను ఎఱుఁగఁగల్గిసాను. కొన్ని యెఱుకలు వివరింతును.

ఒక సంపన్నగృహస్థునియింట ప్రాచీన గ్రంథము లున్న వని విని అడిగి ఆహూతుఁడనై వారియింటికి వెళ్లితిని. ఆ యింటి యజమానునికి ధర్మపత్నీసమానురాలు, కళావంతురాలు, ప్రేయసి ఇంటనే ఉన్నది. నే నక్కడికి వెళ్ళఁగానే ఆమె మనుచరిత్రలోని యీ క్రిందిపద్యమును సాదరముగా, సంగీతముతో, సముచితహస్తాభినయముతో చదివినది.

వానీదీ భాగ్యవైభవము, వానీదీ పుణ్యవిశేష, మెమ్మెయిన్
వాని దవంధ్య జీవనము, హనిది జన్మము వేఱు సేయ కి
వ్వాని గృహాంతరంబున భవాదృత యోగిజనంబు పావన
స్నానవిధాన్న పాసముల సంతసమందుచుఁ బోవు నిచ్చలున్.

నేనన్నాను. "తల్లీ ! స న్నొక యోగిని జేసితివి. తంటా లేదుగాని, నీ వల్లభుని వాస్తవ ప్రవరునిగాఁ జేయుట సందర్భపడలే దమ్మా !”

ఆమె అన్నది “అయ్యగారూ ! నేను ప్రేమించినది వాస్తవముగా వాస్తవప్రవరునివంటివారినే. నా యేకాంత ప్రేమకు వశ్యులయిన యీ సహృదయులు కూడ వాస్తవప్రవరు లనియే అనుకొనుచున్నాను. అయ్యో పాపము! వరూథిని మాయాప్రవరుని ఎఱుఁగదు గాదండీ! ఎంత ద్రోహము! అయ్యా, ఇది చిత్తగించండి!

సీతాదేవిని రావణాసురుఁడు రామవేషము వేసికొని వచ్చి అమాంగల్యపటిచినట్లు ఏకవి అయినను కథ కట్టినచో విజ్ఞుల కందరికిని వెఱ్ఱులు, వేకులు ఎత్తవండీ! అంత రోతగానే కాదండీ ఉన్నది యిక్కడి సందర్భమూను? ప్రవరునిమీఁదనే ప్రాణము లర్పించి ఉన్న వరూథినిని అంతకుముం దామెను ప్రేమించి ఆమెచే ఛీ ఛీ అని చీవాట్లు తిన్నదొంగ ప్రవరవేషముతో వచ్చి చేటుకూర్చుట చండాలముగా లేదండీ! వరూధిని వెలయా లందురు! ఆమే ప్రవరుని ఏమి వెలకయి ప్రేమించినది! వేషధారి ప్రవరుఁడు ఏమి వెల యిచ్చి ఆమెను కొనుక్కొన్నాఁడు! ఆంధ్రకవితా పితామహుని అనుగ్రహము అట్లున్నదే!" అన్నది.

నేను “చాల చుఱుకుగా ఉన్నదే సల్లాపము” అనుకొనుచు, “సంస్కృతము బాగుగా చదువుకొన్న ట్లున్నావమ్మా" అన్నాను.

“మా నాయనగారు విద్వాంసులు. వారు నేర్పఁగా కావ్య నాటకములు కొన్ని చదువుకొన్నానండీ!" అనుచు నామే కాళిదాసు కవీంద్రునిమీఁదకూడ కంకరతాళ్లు విసరసాగినది. “చూడండి! శాకుంతలములో దుష్యంతునికి రంగప్రవేశము ఎంత సంతాపజనకముగా ఉన్నదో”.

"తా నేదో వేఁటకు వచ్చినాఁడు. ఆశ్రమమున కణ్వమహర్షి లేఁడు. ముగ్ధలు ఋషికన్యలు చెట్లకు నీళ్లుపోయుచున్నారు. అక్రమముగా ఆశ్రమప్రాంతమునకు వెళ్లి, ధీరోదాత్తుఁడుగా పొగడ్తగాంచవలసిన మహారాజు దొంగచాటుగా నక్కిఉండి ఆకన్యలను తొంగిచూచుట, 'సతాంహి సందేహపదేషు' అని తనతప్పును ఒప్పునుగా తానే పొగడుకొనుట మర్యాదగా ఉన్నదండీ! శకుంతలముఖాన తుమ్మెద వ్రాలఁగా ఆపన్నురాలిని రక్షించి రాజధర్మము నెఱపఁబోవుచున్నట్టు దర్పాలు పలుకుకొనుచు వంకరతలఁపుతో రంగప్రవేశము చేయుట బాగుగా ఉన్నదండీ?” అన్నది.

నేనిక శ్రుతి మించుచున్నది అనుకొని సంస్కృతాంధ్రరచనలలో ఆమెకుఁగల సాహిత్య చాతుర్యమునకు సంతోషము వెల్లడించి వచ్చినాను.

ఇంకొక ముచ్చట.

ఒక పూరియిల్లు. చిన్నది, తలుపు ఓరవాకిలిగా వేసి ఉన్నది. . లోపల ముసలమ్మ వడ్లు దంచుచున్నది. రోఁకటి పోటుతో పాటు.

“ఓరామ ఓరామ ఒయ్యారీరామ !
ఓరామ! ఓరామ!
ఓరామ! ఓరామ!"

అనుచు ఉచ్ఛ్వాసనిశ్వాసములతో రామనామస్మరణ జోడించు చున్నది - మధ్యాహ్నము ఒంటిగంట వేళ. ఇంట నామె ఒక్కరైయే. తాటాకు పుస్తకాలేవో ఉన్న వనఁగా చూడ వెళ్ళినాను. ఇంటిలోనికి అడుగు సాగక వాకిటనే ఉన్నాను. కొంతసేపటికి దంపుడు ముగియఁ గా చేటలో దంచిన బియ్యము చేర్చుకొని చెఱుగఁబోవుచు ఈ క్రిందిపద్యము చదివినది.

కలం దందురు దీనులయెడం
గలఁ డందురు పరమయోగిగణములపాలన్
కలఁ డందు రన్ని దెసలను
కలఁడు కలం డనెడువాఁడు కలడో లేడో |

నాలుగవ చరణము గద్దించుచు మఱి ముమ్మాఱులు చదివినది. ఇదే సందర్భమురా అనుకొని 'ఉన్నాఁ డమ్మా' అనుచు నేను లోపలికి వెళ్ళినాను. ఆమె ఆబియ్యముతో అటుతరువాత వంటచేసికొని భోజనము చేయఁబోవును. ఇట్లనుకొన్నాను. 'ఆహా! పోతరాజుగా రెంత పుణ్యాత్ములు. భాగవత మెందటినో పవిత్రాత్ములనుఁ జేయుచున్నదిగదా!" బ్రౌనుదొరగారి కెవఁడో దీనుఁడు ఈ క్రింది పద్యమును ఆర్జీగా 28 తెలుఁగుమెఱుంగులు

28

తెలుఁగుమెఱుంగులు


వ్రాసి పంపుకొన్నాఁడట.

లా వొక్కింతయు లేదు, ధైర్యము విలోలం బయ్యెఁ, బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను, మూర్ఛ వచ్చెఁ, దనువున్ డస్సెన్, శ్రమం బయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెఱుఁగమన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

బ్రౌనుదొరగా రా దీనుని కేదో కొంత సొమ్ముతోపాటు ఆ యర్జీమీఁదనే ఎండార్సుమెంటు'గా ఈ క్రిందిపద్యమును వ్రాసి పంపినారట.

ఏను మృతుండ నౌదునని యింత భయంటమనంబులోపలన్

మానుము సంభవంబు గల మానవకోట్లకు చావు నిక్కమౌల గాన హరిం దలంపు మిఁకఁ గల్గదు జన్మము నీకు రాత్రిపై మానవనాథ! చెందెదవు మాధవలోకనివాససౌఖ్యముల్</poem>

బ్రౌనుదొరగారికికూడ భాగవత మింత పరిచితమయినది !

ఇన్ని ఉదాహరణములను ఎందుకు చెప్పినా ననఁగా, మన తండ్రితాతల పోలిక చాలికలు మనలో ఏవిధముగా అనుగతములై వచ్చుచున్నవో - మనము వేషభాష లెంతమార్చినప్పటికిని - మన పూర్వుల గ్రంథములలోని భావములు, సంప్రదాయములు, రచనలు - మనమెంత క్రొత్త త్రోవలు తొక్కఁజూచుచున్నప్పటికినీ మనలో ఎట్లు కుదుర్కొన్నవో తెలుపుటకే. వానిని మనము విడనాడలేము. విడనాడనూ కూడదు అని యెఱి గించుటకే.