తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/ఆంధ్రకల్పవృక్షము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

3

ఆంధ్ర కల్పవృక్షము

నాచిన్ననాఁటిమాట. మాగ్రామమున ఒకసంపన్న గృహస్థుఁడు తన గొప్పతాటితోఁటను నఱికించి, ఆ తోఁట భూమికి కృష్యనుకూలత కల్పించినాఁడు. ఏమికర్మమో కాని కొలదీ కాలమునకే యాతని యింట నమంగళము లనేకములు కలిగినది. ఊరి పెద్ద లందఱు "తాటిచె ట్టనఁగా భూలోకకల్పవృక్షము. అట్టి తాటిచెట్లను ఎన్నింటినో, ఎన్ని తరాలనాడు నాటినవానినో నఱికించినాఁడు; చెడినాఁడు” అన్నారు. నేను పదేండ్ల బాలుఁడను. మానాయనగారిని "ఇంకను కొబ్బరిచెట్టునో, మామిడి చెట్టునో అంటే అనవచ్చునేమో కానీ తాటిచెట్టును 'భూలోక కల్పవృక్ష' మనుట యేమిటి" అని అడిగినాను. ఆనాఁడు వారు చెప్పిన విషయమునే ప్రధానపఱుచుకొని, యిటీవల దానికి ప్రోద్బలకముగా నాకు గోచరించిన విషయములనుకూడ చేర్చుకొని యీ వ్యాసము రచించుచున్నాను.

పూర్వము ఆంధ్ర దేశమున ప్రతిగ్రామమునను తాటితోఁపులు ధర్మార్థము తప్పకుండ నాటు సంప్రదాయ ముండెడిది. ఊరిపెద్దలు ఎనుబది తొంబది యేండ్ల ముసలిప్రాయము కలవానిని వెదకి పట్టుకొని వానిచే తాటిగింజలు నాటించువారు. ఆ నాటినవాఁడు నాటినతాడి కాపుపట్టులోఁగా తప్పక చనిపోవు నని ప్రతీతి. నాటిన తాటిచెట్టు ఇర్వదైదేండ్లకుఁగాని కాపుపట్టదు. నాటినవాఁ డంతదాఁక జీవింప వీలులేనివాఁడు గావుట కంత ముసలివానిని వెదకువారు. “ముత్తాడి" అనఁగా మూఁడుతాటి చెట్లతరములు చూచినవాఁడు. దీర్ఘాయుష్మంతుఁడు. తనయెఱుకలో నాటిన తాటిమొలక పెరిగి, 16

పండ్లు పండి, ఆ పండ్లగింజలను మరల నాటి అవి పెరిగి పండ్లు పండుటకు, వాని ననుభవించుటకు మనుష్యుడు దీర్ఘాయుష్మంతుఁడు కావలెను. మంచిపంటలు పండని, నీటివసతి లేని యెగుడుదిగుడు నేలలుకూడ తాటితోఁపులకు పనికివచ్చును. నాటిన తాటిమొలకలకు నీళ్లు పోయనక్కఱలేదు. మొక్క లెదుగుదాఁకనైన కాపుకాయ నక్కఱలేదు. తక్కువ నేలలోనే దగ్గఱదగ్గరగా ఎక్కువ మొక్కలు నాటవచ్చును. విత్తనము నాటినది మొదలుగా కాపుపట్టినదాఁకకూడ వానికే ధనవ్యయము ఏమియు చేయనక్కఱలేదు. నాటిన తర్వాత రెండు మూఁడేండ్ల నుండి ఆకులు, మట్టలు మొదలగువానివలన నుపయోగము లుండును. పూర్వకాలమున నొక గృహస్థుఁడు కొన్ని తాటి చెట్లు కలవాఁడైతే కట్టుబట్టతప్ప తక్కిన జీవితావశ్యకవస్తువు లన్నియు తాటిచెట్లనుండి సేకరించుకొని జీవయాత్ర గడపుకోగలుగువాఁడు. కాపురమునకు నిట్రాడుగుడిసె వేసికొన్నచో తాడి దూలము నిట్రాడవును! గోడలు పెట్టి కట్టు ఇల్లుయినచో తనాబీలు, దూలములు, స్తంభములు, కొమరులు, గుజ్జులు, వాసాలు, పెండెలు అన్నింటికి తాటిమ్రాను పనికివచ్చును. పై కప్పుకు తాటియాకులు పనికివచ్చును, కట్లు కట్టుటకు తాటినార పనికివచ్చును. ఇంట పఱచుకొనుటకు తాటియాకు చాపలు, సామానులు నిలువచేసికొనుటకు నానారకాల పెట్టెలు, బుట్టలు తాటియాకులతో చేయవచ్చును. నీళ్లు చేఁదుకొనుటకు తాటియాకుతో బొక్కెనలను చేయవచ్చును. తాటినార చేత్రాళ్లు మొదలగు త్రాళ్లు పేనుట కుపయోగపడును. తాటి మ్రాకులను రెండుగా చీల్చి నీళ్లు పాఱుటకు దోనెలుగా చేయవచ్చును. ఈ నెలు తీసి కోసి కుట్టిన యాకులు విస్తళ్ళుగా సుపయోగింపవచ్చును. తాటిముంజెలు. తాడిపండ్లు, తాటి (నిలువచేసిన పేసము) చాప, బుఱజగుంజు, తాటి తేగలు, తాటిబెల్లము, తాటికల్కండ, తాటిపానకము, తాటికల్లు ఆహార పానీయముల క్రింద పనికివచ్చును. తాటిపండ్లు శిష్టులు ఆహారముగా నుపయోగింపరాదని నేఁటివారు కొంద అందురు. కాని దానికి ప్రమాణము నే నెఱుఁగను. మున్యాశ్రమములో మునులు తాడిపండ్లను ఫలాహారముగా నుపయోగించువా రనుటను కాదంబరిలోని యీ క్రిందివాక్యము నిరూపించు చున్నది. జాబాలి మహర్షి యాశ్రమవర్ణమున “ఉటజాజిర ప్రకీర్ణశుష్యచ్ఛ్యా మాక ముపసంగృహీతామలక, లవలీ, లవంగ, కర్కంధూ, కదళీ, లికుచ, చూత, పనస, తాళఫల, మధ్యయనముఖరవటుజన" మిత్యాది.

తాటిమ్రాని తుండ్లు జాతీయళ్ళపై కుందులుగా నుపయోగపడును. తాటియాకులతో గొడుగులు గావింతురు. తాటి యీనేలు, జవటలు, జీబులు చీపుళ్లగును. గులక చండ్లు, ఎండుమట్టలు, జీబులు మొదలగునవి యెల్ల వంటచెఱకున కుపయోగపడును. ఈ పేర్కొన్న యుపయోగములెల్ల పామరనాగరకసాధారణ మైనవి.

ఇఁక తాటిచెట్టు ప్రాచీనాంధ్రుల సాగరకతకు జీవరక్ష. ఆంధ్రుల విద్యావిజ్ఞానములెల్ల తాళపత్ర గ్రంథరక్షితములై యున్నవి. తాటియాకులను చక్కఁగా నీనెలు తీసి, చుట్టలు చుట్టి, పేడనీళ్ళలో తేలికగా నుడుకనిచ్చి, నీడనార్పి నేఁడు కాగితముల రీములు నిల్వచేసికొన్నట్లు పూర్వులు గ్రంథములు వ్రాసికొనుటకై 'అలేఖము'లను పేర నిలువచేసికొనెడివారు. జాబులను, భారత భాగవతాది గ్రంథములను వ్రాయుటకు నీ తాటియాకుల సుపయోగించువారు. శతాబ్దములదాఁక నీ తాటాకు గ్రంథములు చెడిపోక యుండెడివి. 'జాబు'కు 'కమ్మ' అను పేరు తాటియాకునుబట్టి వచ్చినదే. ఈ తాటాకులను స్త్రీలు కర్ణాభరణములుగాను, కంఠాభరణములుగాను (మంగళ సూత్రము), చేతులలోను జబ్బలలోను మంత్రాక్షరములు గల

రక్షాబంధములుగాను పూర్వ ముపయోగించువారు. 'శతాబ్దముల దాక నీ తాటాకు గ్రంథములు చెడిపోక యుండెడివి. 'తాటంక' పదమునకు పాణిని సూత్రములలో నిష్పత్తిలేదు. తర్వాత 'ఉణాది' సూత్రములలో దానికి వింతగా నిష్పత్తి కల్పింపబడినది. తిరుపతిలో కపిలతీర్థాది పుణ్యతీర్థము లందు సువాసినులకు మూసివాయనము లిచ్చునపుడు ఆ మూసివాయనపు సామగ్రిలో తాటియాకుల చుట్టలనుగూడ ఉంచుదురఁట! ఆ చుట్టలు కంఠ, కర్ణాభరణ స్థానీయములు.

ఇవిగాక యింక నెన్నేని ప్రయోజనములను మనపూర్వులు తాటి చెట్టువల్ల పడయువారు. తాటి చెట్టు (నేఁడు కాకపోవచ్చుఁగాక) పూర్వకాలమున తెలుఁగువారికి కల్పవృక్ష మనుట సంగతమే కాదా? ఎజ్జాప్రెగ్గడ హరివంశములో తాటిచెట్టు నిట్లు వర్ణించినాఁడు. “వ. అప్పుడు--

 శా.కోలాహుల్ ఋజు తావిచిత్రయగు భోగశ్రేణి శోభిల్లఁ దా
తాళం బొక్కట నిర్గమించి వికసద్దర్వీవికాసంబుతో
గేళం గ్రాలెడినోయనంగఁ దనువుల్ గృష్ణంబులై యొప్పగా
ఖేలన్మూర్ధము లైన తాళతరువుల్ కృష్ణుండు వీక్షించుచున్.

మ.క్రమపాళంబునఁ గింపుతోడి నలుపెక్క న్మిక్కుటంబైన గం
ధము దిక్కుల్ సురభీకరింప రస మంతర్గామి యయ్యు న్వెలిం
గమియం గాఱుచునున్న చాడ్పున విలోకప్రీతి గావింప హృ
ద్యములై యున్నవి చూచితే ఫలము లీతాళద్రుమశ్రేణులన్,

తే. వీని నింపార గోవులు నేను గూడి
యెలమి యొలయ నాస్వాదింతు మెంత యేని!
వేడ్క యయ్యెడు రాల్పుము వేగవేగం
బ్రాంకి నీ లావు వెరవును భాసితముగ.

  • .

 క. ఎక్కఁ దడవు తాడుల మొద
లక్కజముగఁబట్టి యూఁతు నవె యేఱి కొనుం
డెక్కుడుగఁ బండ్లు మీరా
క్కొక్కని గుడువంగఁ జనుచు నుద్దతలీలన్.

తే. ఒక్క తరవాయి దొరఁకొని యొకటి నొకటిఁ
థుభుజాదండములఁ బట్టి పెలుచ నూంచె
చెఱుక విలువను నొల్లక యుటక వన్య
హస్తి నిజహస్తమునఁ జెరలాడునట్లు,"

తాటిపంటి నిగూర్చి శ్రీనాథుని పద్య మొక్కటి.
...
గీ “సంజకెంపును దిమిరపుంజంపునలుపు
గమియ బ్రహ్మాండభాండంబు గరము మెఱసె
పరమపరిపాకదళన్మంత బంధ మెడలి
పతనమగు తాటిపంటితోఁ బ్రతిఘటించి."

తాటితోఁపుల వెలయించుట మహాపుణ్యకార్యముగా ప్రాచీనులు తలుతు రనుటకు ఆర్నూ రేండ్లఫాంటి శాసనములు రెండు..... (దక్షిణ హిందూ దేశ శాససములు 9 వ వాల్యుంలో 278 పేజీ), 674 నెం. పిఠాపురము శాసనము. ...

".... తల్లి ధరణి, మొదలగుగాన యీ తాటి యెవ్వరు నాంటిరి వారు భూ! ప్రజలకు బుద్ధిన్ని మతివిశేషమున్ను ధర్మమున్ను చిఱుకుదురుగాను . తాజాకులనే పంచాంగములు, పురాణములు, శాస్త్రములు ధర్మకర్తలు వ్రా చదువంగాను అందున్నుండుంగాని బుద్ధిమాంటలం జెప్పరాదు గాన సక ధర్మాలకున్ను తాంటి వృక్షమే మూలము.”

(అదే పేజీలో 675 నెం. శాసనము}

 “సీ. నిండా నెవ్వనికీర్తి నిఖిలలోకంబుల
జంద్రికా విస్ఫారసాంద్రగరిమ
ఉండె నెవ్వనియింటఁ బుండరీకాక్షుని
ప్రాణవల్లభయైన పద్మనయన
పండె నెవ్వని కృపాపాథోధి నిలయెల్ల
ధాన్యసంపూర్ణ వదాస్య యగుచు
మండె నెవ్వనీ కోపమహిమానలంబుచే
నరివీరగేహంబు లక్షణంబు"


అనుచుఁ గొనియాడుదురు నిన్ను నఖిలసభల
వేమభూపాల కారుణ్య విమల పాత్ర
ప్రబలకరతేజ వాసయప్రభుతనూజ
మనుజదేవేంద్ర పోతకుమారచంద్ర !

సౌమ్య సంవత్సరం మొదలుగాను పిరాపురపు (సీ) మ (అ?) రస్తున్ను కుక్కుటేశ్వరంవాడ గయపట్టుగాన యిది పుణ్యభూమి అని “చత్వారి పుణ్యతీర్థాని దుర్లభానీ దురాత్మనామ్, కేదార మర్కతీర్థంచ ప్రయాగః కుక్కటేశ్వరః" ఈ పుణ్యస్థలమునందును (శివ) లింగమున్ను సూర్యదేవ... యాగలింగమున్ను వారణాసి విశ్వేశ్వరలింగమున్ను గవిరిదేవ (త) ను సహితమైన ప్రతిష్ఠలు అయిదు చేయించి ఱాళ్ళు కట్టించెను. ద్వాపరయుగమునొండు గొంతీదేవి ప్రతిష్ఠగాన మాధవయ్య నగరు సున్నము చేయించెను. లక్ష్మీదేవమ్మను, ప్రతిష్ఠ చేయించి జానగరు కట్టించెను, నాలుగు లక్షలున్ను, అలవైవేలు తాళ్లు నాటించెను. ఇటువంటి ప్రతిష్ఠలును. విష్ణుప్రతిష్ఠలున్ను చేయించిన పుణ్యపురుషుడు గాన వాసిరెడ్డి పోతినేడు జేయును (జి) దేవేంద్రుం డవును,

మంగళమహా శ్రీశ్రీ

  • * *