తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/తెలుఁగు తేటఁదనము

వికీసోర్స్ నుండి

5

తెనుఁగు తేటదనము


తేటతెనుఁగునుగూర్చి కొంచెమంత తెలుపుచున్నాను. ఆంధ్రద్రవిడకర్ణాటభాషలలో తెనుఁగుమాట ప్రసన్నమయినదిగా ఉండుటచేత 'తెనుఁగుతేట' అనియు, 'తేటతెనుఁగు' అనియు, 'తెనుఁగుతేనె' అనియు, దేశభాషలందు తెలుఁగులెస్స' అనియు నానుళ్లు పుట్టినవి. తెనుఁగు కీతేటదనము, లెస్సదనములు సంస్కృతప్రాకృతముల పాళ్లు సమరసముగా కలియుటవల్లను, ద్రవిడకర్ణాటకములకంటె తెలుఁగుమాట మార్దవ, సౌలభ్యములు కల దగుటవల్లను ఏర్పడినవి. ఈ తేటతెలుఁగు చచ్చుడివాని దగ్గఱనుండి జగద్గురువుదాఁక, ఉగ్గుపాలనాఁటినుండి ఉసు రుడుగు దాఁక, బాలశిక్షదగ్గఱ నుండి మోక్షవిద్య దాఁక అన్ని జాతులలో, అన్ని దశలలో, అన్నివిద్యలలో, క్షణక్షణ పరిణామముతో, నవనవవికాసముతో కలకలలాడుచుఁ, దొలఁకులాడుచు నున్నది. హెచ్చుకాలము లిపిరూపము పొంది నిలిచియుండ నక్కఱలేని సంభాషణాదులు, నవ్వుటాలు, తగవును మొదలయిన వాగ్వ్యాపారములను విడిచిపెట్టినప్పటికిని లిపిరూపము పొంది కొన్ని పురుషాంతరములదాఁక ఉండవలసిన వర్తకము, దేశపాలనము, ఆచారవ్యవహారములు, దస్తావేజులు, రాజశాసనములు, దానశాసనములు మొదలయినవానిలోను దేశము, భాష ఉన్నంతకాలము ఉండవలసిన కథలు, కళలు, పాటలు, పదాలు, నాటకములు, నానాశాస్త్రములు, కావ్యములు మొదలయినవానిలోను భాషాప్రవాహము పాయలువాఱి పాఱుచు, మాఱుచు, తేలుచు కావ్యసరస్సులలో నిండార్లుగా నెలకొనుచు నుండును. భాష కున్న ప్రయోజనము లన్నింటిలోను ప్రౌఢకావ్యరచన గూడ నొక యనుభావవిశేషముండవలెను. ఒక్క తార్కాణ చూపుచున్నాను. చల్లపల్లి జమీందారుగారి పట్టాభిషేకోత్సవపు నాళ్లలో హరికోటలో రాత్రులు

నాటకములు. పాటకచ్చేరీలు, బోగమాటలును, సాగుచుండెడివి. వచ్చిన పండితు లందఱును కోటలోని ఆటలు, పాటలు, నాటకములు చూడబోవుచుండెడివారు. మా గురువులు శ్రీ చెళ్లపిళ్లశాస్త్రులుగారు కోట వెలుపల మాలదాసర్ల వీథినాటకములు చూడఁబోవువారు. రాత్రి ఆ మాస్వాదించిన రసానుభవమును మర్నాఁడు పునశ్చరణ చేయుచు ఆనందీచుచు మాకు వినిపించి మమ్ము ఆనందింపఁ జేసెడివారు. వారు గుర్తించి చెప్పినప్పుడే వానిరుచి ననేకులు గ్రహింపఁగలిగెడివారు. వా రీమధ్య పత్రికలలో లోకాభిరామాయణములను మంచివాడుకపలుకుబళ్లతో ముంచెత్తినారు.

ఆంధ్రభాషలో ఆదికాలమునాఁటి కావ్యరచన ముడిసరకుభాషతో, దేశీచ్ఛందోరచనతో ప్రజాసామాన్యమునకు సులభముగా ఉండెడి దనియు, అదియే ఇప్పటి పాటలు పదాల వాడుక భాష అనియు నా నమ్మకము. నన్నయభట్టారకునికి పూర్వము శాసనములలో సీసగీతమధ్యాక్కఱలు పద్యములు కనఁబడుచున్నవి. వానిలో మధ్యాక్కఱను నన్నయాదులయిన ఆదికాలపు ప్రౌఢకవులు కొందటే కొంచెముగా పాటించినారు. ఆదికాలపు మధ్యాక్కఱ ఒకటి ఉదాహరించుచున్నాను.

"స్వస్తి సృపాంకుశాత్యంతవత్సల సత్యత్రినేత్
విస్తర శ్రీ యుద్ధమల్లుఁ డనవద్య విఖ్యాత కీర్తి
ప్రస్తుత రాజాశ్రయుండు త్రిభువనాభరణుండు సకల
వస్తుసమేతుండు రాజసల్కిభూవల్లభుం డర్ధి".


ఇందులో కొన్ని యక్షరములను జేర్చినను తీసివేసినను పద్యము పద్యముగానే ఉండునట్లు రచన ఉన్నది. పఠన ఫణితి తాలగతి కలదిగా గోచరించుట లేదు. సంగీత రుచి గుర్తించిన తెలుఁగుకవులు ఈ పద్యమును

ఎందుకు పాటించినారా అని సందేహించుచుండువాఁడను. అర్వాచీనకవులు దీనిని అందుకనియే విడిచిపెట్టినారు కొఁబోలును. ఒకనాఁడు మాయింటిలో మా అమ్మగారు ప్రాతఃకాలపుపాట లేవో పాడుచుండగా వినుచున్న నాకు అందొక పాటఫణితి చాల ఆనందజనక మయినది. నేఁటి కావ్యరచనల కనుకూలింపఁ జేసికొంద మని గణవిభజన చేసి చూతునుకదా అది మధ్యాక్కలు లక్షణము కలదయి యున్నది. మధ్యాక్కల పఠసఫణితి నా కపుడు తెలియవచ్చినది. దానిమాదిరి చూపుచున్నాను, చూడుఁడు

"అంతట రాములవారూ - అంగన సీతను గూడి
సంతసమందుచు వేగా - స్వపురమునకు చనుదెంచీ
తమ్ములతోడను గలసీ - నెమ్మది రాజ్యములేలే
ధర్మముతో ప్రజలెల్లా - తామరతంపరలైరీ".

ఇందు రెండు ఇంద్రగణములు, ఒక సూర్యగణము, రెండు ఇంద్రగణములు, ఒక సూర్యగణము - వెరసి ఆఱు గణములు కలది ఒక చరణము. మూఁడవ గణము కడపట సీసచరణదళమువలె మధ్యాక్కలు చరణము మధ్యకు విఱుగును. ఆదికాలపు కవులు పాటించిన సీస ద్విపద గీత పద్యములు కొంచెము మార్పులు చెందియు, చెందకయుకూడ స్త్రీబాల పురాదులు పాడుపాటలలో, పదాలలో నవచ్చుచున్నవి. స్త్రీలు పాడు శ్రావణ మంగళ వారపు పాట సీసపద్యమే.

శ్రావణామాసాన శుద్ధ పాడ్యమినాఁడు
మహలక్ష్మి ముత్యాల చీర గట్టి"

అని దాని మొదటి చరణము. మఱియు ద్విపద అను ఆదికాలపు రచన అనేక ఫణితి ప్రభేదాలతో పాటలలో, పదాలలో చేరియున్నది. ఒకటి రెండు ద్విపదఫణితి ప్రభేదములు చూపుచున్నాను.

"ఒకరూ కట్టిన చీరా ఒకరూ కట్టారూ
ఒకరూ తొడిగిన రైకా ఒకరూ తొడగారూ
ఒకరూ పెట్టిన నగలూ ఒకరూ పెట్టారూ
వార్నీ పొసగింపా నా వశమూ కాదనెనూ",

ఇది ద్విపదవికారమే.

“వెన్నెలబైలనే వేలసంఖ్యలనూ
పందిళ్ళు వేయించి పరమాపావనులూ"<poem>

ఇదియు ద్విపదయే

ఇట్లు ఒక ద్విపదయే పలురసములలో, పలుఫణితులలో వాడుక భాషలో పలుపాటలుగా వెలసినది.

ఆదికాలమునాఁటి పాటల ప్రభేదములను కొన్నింటిని పాల్కురికి సోమనాథుఁడు పేర్కొన్నాడు. వాని నన్నింటిని ఇక్కడ వివరింపఁగుజరడు. సంస్కృతాంధ్రములలో ప్రొఢభాషామయములైన భారత రామాయ ణాదులను చదివి, తత్కథా ప్రయోజనము ననుభవించువారికంటె వాడుకభాషలో పాటలు పదాలుగానున్న భారత రామాయణకథలను బొమ్మలాటలలో, వీధినాటకములలో వినియు, చూచియు ఆ ప్రయోజనము ననుభవించు ప్రజలు దేశములో చాల హెచ్చు. పై తీరున లోక సామాన్యమునకు అర్థముకాఁదగినదియు, తేట తెలుఁ గని. దేశీ తేలుఁ గులతో జానుతెలుఁ గని, అచ్చతెలుఁ గని ప్రాచీనులు పలుతెఱఁగులతో పేర్కొన్నదియు అయిన వాడుకభాషలో ఉన్న యందచందములు వ్యాకరణముతో దిద్ది తీర్చిన ప్రౌఢ గ్రాంథిక భాషలో పనుపడ వని ప్రాచీనులే పేర్కొన్నారు. తిరుపతిలో 15, 16 శతాబ్దులలో ప్రఖ్యాత కవీశ్వరులై సంకీర్తనాచార్యులనఁబరగిన తాళ్ళపాకవారు వందలకొలఁదీ పాటలను, పదాలను వాడుక భాషలోనే రచించినారు. పాటలు, పదాలలో వాడుక భాషయే యుండఁదగిన దనియు, దానిని ప్రౌఢవ్యాకరణ ప్రకారము

దిద్దితీర్చుట పువ్వును నలిపి వాసన చూపించుటవంటి దనియు 'సంకీర్తనలక్షణ' మను లక్షణగ్రంథములో వా రిట్లు చెప్పినారు.

 "పల్లవనారీమ్లేచ్ఛా
ద్యుల్లాసమనోజ్ఞ బంధురోక్తులు చవులై
చెల్లును గ్రామ్యములైనను
హల్లీ సకముఖ్యనాటకాదికఫణితిన్.

జగతిఁగల చెల్లుబళై,
సగిన భాషించునట్టి నానుడిపలుకుల్
తగ దన రహి చెడుఁ బువ్వుల
సొగసుడుగ బిసిగి కంపు చూపినభంగిన్."


ఈ లక్షణముచొప్పున యక్షగానములను నాటక ప్రభేదములలో ఉండు దేశిచ్ఛందోరచనావిశేషములను పేర్కొనుట కిక్కడ చోటు చాలదు. ఇంకను వాడుకభాషలో, ద్విపదలలో కాటమరాజు కథ, పల్నాటి కధ, కుమార రామునికథ, మణి క్రొత్తతరపుఁబదములయిన బొబ్బిలి కధ, దేశింగు రాజుకథ, లంకాసారథి మొదలయిన రసవద్రచనలు ఎన్నియో ఉన్నవి.


దేశము నలుముఖములను గాలించి మంచి మంచి పలుకు బళ్ళను, కథలను, సామెతలను, పాటలను, పదాలను, వింతశబ్దజాలములను సేకరించవలెను. అచ్చు రాకముందు అన్నిరకాల రచనలు తాటాకులమీఁ దను, నోటివాడుకలమీఁదను నెలకొని ఉండెడివి. అచ్చువచ్చిన తరువాత ప్రాయికముగా బ్రౌఢకావ్యరచనకే పరిపోషము కలుగుటచేత, ప్రాతకాలపు దేశిరచన లెన్నో అడగారిపోఁ జొచ్చినవి. ఆంధ్రభాష యందచందములు సరిగా గుర్తించుటకు వీని సర్వే యత్యావశ్యకము.