తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/ఆంధ్రకవిత - పురాణయుగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

6

ఆంధ్రకవిత-పురాణయుగము

నన్నయతిక్కనలు

పురాణముల రచనము, ఆ రచనముల చెల్లుబడి ప్రబలముగా సాగిన కాలఖండమును పురాణయుగ మని వర్తమానులు వ్యవహరించుచున్నారు. అటువంటి కాలఖండములను యుగము లనుటకంటె శకము లనుట వ్యవహారార్థానుగుణ మనుకొందును. ఇట్లు మార్చిన పురాణశకము, ప్రబంధశకము అని కాని, మటొకవిధమున కవులనుబట్టి పేర్కొన్న నన్నయశకము, తిక్కనశకము అని కానీ అనుట యవును. అందఱును ఇప్పుడు యుగ' మనియే వ్యవహరించుచున్నారు గాన నేనును అలాగే అనుచున్నాను. ఆంధ్రపురాణరచన సంస్కృతపురాణరచనానుసారిగా సాగినది గాన ఆంధ్రరచనాపద్ధతిగ వివరించుటకు ముందు సంస్కృత సంప్రదాయానుస్మరణము కౌంత ఆవశ్యకమే అవును. సంస్కృత పురాణములు తద్రచనాకాలమునాఁటి విద్వద్విజ్ఞానమునకు సర్వస్వములు. వేదములలో సర్వవిద్యలును అంకురప్రాయములుగా ఉండఁగా పురాణములలో అవి కొంత కొంత విరివిగా వెలసే ననవచ్చును. “సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ, వంశానుచరితం చేతిపురాణం పంచ లక్షణమ్" అని సృష్టి విధము, ప్రళయముల తీరు, రాజవంశముల చరిత్రలు, మన్వంతరకథలు, మహర్షుల చరిత్రలు మొదలగువానితో పురాణము లుండునని లక్షణము ఉన్నను, పురాణములలో ఇంకను ఎన్నో దేశచరిత్రలు, వైద్యము, జ్యోతిషము, నీతి, ధర్మ కామశాస్త్రములు, వ్యాకరణాలంకార సాహిత్యాది శాస్త్రసంప్రదాయములు మొదలయినవి కొంతకొంత సంగ్రహము గాను, కొన్నిచోట్ల విరివిగానుకూడ వర్ణితములై ఉన్నవి. అగ్నిపురాణములో వ్యాకరణము, వైద్యము, జ్యోతిషము మొదలయిన వెన్నియో ఉన్నవి.

ఇట్టి పురాణములు సంస్కృత భాషామాత్ర పరిజ్ఞానము గల జనసామాన్యమునకుకూడ అర్ధము కాఁదగినట్లు సులభభాషలో, ప్రాయికముగా సులభమైన అనుష్టుప్ఛందస్సులో తేలిక వాక్యాన్వయములతో తేటగా ఉండును. వ్యాసులవారి రచనలలో తఱచుగా 'చ, వై, తు, హీ' అని పాదపూరణపు పొల్లుపదము లున్నవి అనికూడ పండిత పరిహాసమున్నది. పురాణ సామాన్యరచన ఇట్లు ఉండు నసుట సంగతయేకాని, కొన్ని పట్లు పురాణములలోనివే, సంప్రదాయ పరిజ్ఞానము లేనిచో ప్రౌఢపండితులకు కూడ కొఱకరానీకోయ్యలు, ఉక్కుసెనగలు అనఁదగినవిగా ఉన్నవి. పురాణములలోని కెల్ల భారత భాగవతములు. రామాయణము ప్రధానమయినవి. రామాయణ భారతములు కావ్యేతిహాసము లనబడినను, పురాణము లనికూడ సామాన్య వ్యవహార మున్నది. తెలుఁగున అవి పురాణములే అనుచున్నాము. ఉక్కుసెనగలు పై మూఁడు గ్రంథముల లోను, అందులో మఱీభారతమున ఉన్నవి. భారతములోని ఉక్కుసెనగలకు వ్యాసఘట్ట మని పేరు. మచ్చు చూపుచున్నాను.


పశ్యః పశ్యతి పశ్యన్త మపశ్యస్తంచ పశ్యతి,
అపశ్యస్తావ (త్యాద?) చక్షుష్యాత్ పశ్యాపశ్యా న పశ్యతః
చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ,
హూయతేచ పునర్యాభ్యాం సమే విష్ణుః ప్రసీదతు.


ఈ విధముగా పురాణములు వివిధ విషయములతో, వివిధ రచనలతో అరణ్యములవంటి పై ఉండును. అర్వాచీనము లయిన కావ్యనాటక ప్రబంధాది రచనలు పురాణారణ్యములనుండి ఉద్ధరించి సేకరించి తీరిదిద్ది నాటిన యుద్యానములవంటి వసఁదగును. పురాణములలో కావ్యనాటక ప్రబంధాదిరచనల పొలుపులు సుకుమార దృశ్యములై ఉండునుగాని, కావ్య నాటకాదులలో పురాణరచనములలోని శాస్రాంశ భీకర దృశ్యము లుండవు. ఇటువంటి సంస్కృత పురాణ ఫక్కీ ననుసరించి తెలుఁగు పురాణరచన

వెలసినది. నన్నయ మొదలుకొని శ్రీనాథునిదాఁకఁగల కవుల యాంధ్ర గ్రంథ రచన పురాణయుగరచన యనఁదగినది. ఆకాలమున ప్రాయికముగా ఆంధ్రమున పురాణరచనలే వెలసినవి. కవిత్రయము, మారన, పాల్కురికి సోమనాథుఁడు, భాస్కరాదులు, నాచనసోమన, శ్రీనాథుఁడు, పోతన, సింగన పురాణకవులలో ప్రధానులు, పురాణకవిరచనలను గూర్చి ప్రసంగించినప్పు డీయందఱ విషయమును రావలసినదే అయినను ముందు ముఖ్యులయిన భారత కవిత్రయమువారినిగూర్చి మాత్రమే యిప్పటి నా ప్రశంస.


కవిత్రయమువారు దైవభక్తులు, సదాచారులు, ఉత్తమ పండితులు, కవితాతపస్సు చేసి వారు కాంక్షితార్థములను అంతర్వాణియు ద్బోధము లతో నందుకొని కావ్యరచన కావించినారు. తర్వాతి సర్వాంధ్ర కవికుటుంబములకు వారిపవిత్ర వాక్కులు నిక్షేపములయి దొరకిన బంగారునక్కులు, ఆమువ్వుర రచనములతో తెలుఁగున వెలసిన మహాగ్రంథము భారతము.దాని మూలగ్రంథము అయిదువేలయేండ్లనాటి భారతీయ చరిత్రాంశములు గల ప్రాంతగ్రంథమే అయినను సర్వ ప్రపంచమునను దాని పలుకుబడి చెల్లుబడి అగుచునే యున్నది.

వ్యాసకృతిని మహాభారతమును నన్నయ యిన్ని లక్షణములు

 గలదానినిగా వర్ణించినాఁడు.
“ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని
యధ్యాత్మవిదులు వేదాంత మనియు
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రం బని
కవివృషభులు మహాకావ్య మనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని
యైతిహాసికు లితిహాస మనియు
పరమపౌరాణికుల్ బహుపురాణా సముచ్చ
యం బని మహింగొనియాడుచుండ


వివిధవేదత త్త్వవేది వేదవ్యాసుల
దాదిముని రాశరాత్మజుండు
విష్ణుసన్నిథుండు విశ్వజనీనమై
పరగుచుండఁ జేసె భారతంబు",

ఇట్టి సంస్కృత భారతమును,


“సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకవితార్ధయుక్తిలో
నారసి మేలునా నితరు లక్షరరమ్యత నాదరింప నా
నారుచిరార్థ సూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారత సంహితారచన బంధురుఁ డయ్యె జగద్ధితంబుగాన్. "


నన్నయ పైతీరున సర్వశాస్రాధాకలితముగానే కాక భారతమును ప్రసన్నరచనతో మహాకావ్యలక్ష్యముగాఁగూడ తెనిఁగించిన ట్లేర్పడును. కనుకనే యాతనికి వాగనుశాసన బిరుదము కల్గెను. సంస్కృతమున పురాణములు, కావ్యనాటకాదులు అన్నియు వెలసినపిదప ఉపక్రమించిన దగుటచేత తెలుఁగుపురాణరచన తనలోనే సంస్కృత సర్వకావ్యరచనా చమత్కారములను ఇముడ్చుకోవలె ననుయత్నముతో సాగినది. ప్రాచీనుఁడు గణపతిదేవుఁ డనుకవి "ఆంధ్రకావ్యపథము దీర్చిన నన్నయభట్టుఁ గొలుతు" నన్నాఁడు. నన్నయభారతము చదివినచో అందులో భాషా కవితాలక్షణ పరిష్కారములను ప్రయత్నపూర్వకముగా నన్నయ లక్ష్మీకరించినట్లు కాననగును.


 “పాయక పాకశాసనికి భారతఘోరరణంబునందు నా
రాయణు నట్లు వాణసధరామరవంశవిభూషణంబు నా
రాయణభట్టు వాఙ్మయ దురంధరుఁ డీకృతి కష్టుడున్ సహా
ధ్యాయుఁడు నేనవాఁ దభీమతంబుగఁ దోడయి నిర్వహింపఁగాని


ఈ పద్యము ద్వితీయ తృతీయ చరణములందు నారాయణ పదము "ర" యతి ఖండా ఖండములుగా స్వరష్యంజనములతో రెండు దెఱంగుల

నుంచుట లక్షణ విశేష నిరూపణార్థముగదా! ఇట్టి వెన్నేని విశేషాంశ ములను నన్నయ రచనలో చూపవచ్చును.


శరత్సమయమున సరళముగా సమప్రదేశమున ప్రవహించు తెలినీటి తేటవాకవలె సన్నయరచన సుప్రసన్నమై, చాటుమాటులు లేనిదై. కరతలామలకముగా తనలోఁగల సర్వార్ధములను ప్రవ్యక్షముగా గుర్తింప నిచ్చునదై, సుఖప్రవేశమై, సుస్వాద్యమై నిర్వక్రగతితో నెగడుచుండును. వ్యాసభారతరచనలో 'చ, వై, తు, హు' లున్నట్లు అక్కడక్కడ నన్నయ రచనలో 'మానుగ, పాయక, పర్వగ, ఇమ్ముల' మొదలగు పాదపూరణపు పొల్లుపదము లుండును. గ్రంథగ్రంథులు నన్నయరచనలో నుండవు, నన్నయ్యశయ్య వంటి పురాణశయ్య కావ్య గౌరవము కలది - భాగవతకర్త కొక్కని కేతక్క మఱి యితర పురాణయుగాంధ్రకవుల కెవ్వరికీ దక్కలేదు. నన్నయ పురాణ శయ్యాసౌభాగ్యమునకు లక్ష్యము నొక్క గీతపద్యమున గుర్తింపవచ్చును.


 ఎల్లవారు నెఱుఁగ నొల్లని ధర్మువు
బేల నీకుఁ దేలుప నేల వలసె?
చికుతవానీ కింత దముగంటి పలుకులు
సన్ని వృద్ధజనము లున్నచోట?"


రాజసూయమహాధ్వరము జరుగునపుడు భీష్ముడు ధర్మరాజుతో 'సఖిలలోకపూజ్యు నచ్యుతుఁ బూజింపు' మనఁగా శిశుపాలుఁ డుపాలంభన పరుండయి యధోక్షజు నాక్షేపించుచు ధర్మరాజు కిట్లనుచున్నాఁడు,


“అవనీనాథు లనేకు లుండఁగ విశిష్టాచార్యు లార్యుల్ మహీ
దీవిటుల్ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీసాథ! గాంగేయ దు
ర్వ్యవసాయంబునఁగృష్ణుఁ గష్టచరితున్ వాయుఁ బూజించి నీ
యవివేకం బెఱిగించి లిందఱకు దాశారుండు పూజార్హుడే?"

ఈ పద్యమున ననుప్రాసము, నక్షరసౌభాగ్యము, శయ్యయొయ్యార మునుమాత్రమే కాక దాశారుండు = పల్లెలు బోయలు మొదలగువారికిఁ దగినవాడు, వారిలో విహరింపఁదగినవాఁడు, లేక భృత్యతకు, నౌకరీకి తగిన వాఁడు శ్రీకృష్ణుఁడు పూజార్హుడగునా యనియు నాక్షేపము. దాశార్హ పదమునకు రెండర్థము లున్నవి. పల్లెకారీలకుఁ దగినవాఁ డనియు. నౌకరీకిఁ దగినవాఁ డనియు; జెడ్డ యర్థము. దశార్ణదేశభవుఁ డని మంచి యర్ధము. .

'ఇతనికిఁ గూర్తురేని ధన మిత్తు రభీష్టములైన కార్యముల్
మతి నొసరింతు రిష్టుఁ డని మంతురు గాక మహాత్ములైన భూ
పతులయు వీప్రముఖ్యుల సభన్ విధిదృష్టవిశిష్ఠపూజనా
యతికి ననర్హుననర్హుడని యచ్యుతు నర్చితుఁజేయుఁ బాడియే?"


ఇక్కడ ధర్మరాజుతో భీష్ముఁడు అచ్యుతుఁ బూజింపు మనునప్పు డుపయోగించిన యచ్యుతపదమునే శిశుపాలుఁడు వెక్కిరింపుగా నర్థాంతర మునఁ బునఃప్రయోగము చేసినట్లు విధిదృష్టవిశిష్ట పూజనాయతికి ననర్హుడు. ఇట్టి యాయచ్యుతని నర్చితునిఁజేయుట పాడిగాదు అని శిశిపాలుని భావము. భీష్ముని పలుకులలోని యచ్యుతపదమునకు ఆ చ్యుతుడు అని అర్ధాంతరము గలుగుట ప్రాచీన వ్యాకరణసంప్రదాయ సమ్మతము. ఈ పద్యమునఁగూడ నక్షరరమ్యత, యనుప్రాస చమత్కృతి దైవాటియున్నవి. ఈ శిశుపాలకథాఘట్టమెల్ల శబ్దార్ధ గాంభీర్య కలితమై రసోత్తరమై యున్నది.


"అవమాన్యున్ సభలోన చూన్యుఁ డనిసౌహార్దంబునం గౌరవ
స్థవిరప్రేరణ నిన్నుఁ బాండుతనయుల్ తప్పంగఁ బూజించి ర
య్యవివేకాస్పదులైన పాండవులు మోహాంధుండు భీష్ముండుఁగే
శవ! నీవుం గడగుండు నాకు నెదురై సంగ్రామరంగంబునన్",

ఇందు నాల్గవచరణమున 'కే' యని కేక, 'శవ నీవుంగడగుండు' అని నింద. ఇట్టిచోట్లనెల్లం బలుకుబడిలోనే యర్థ విశేషములు పదచ్ఛేదభేద ముచేఁగల్పించి గంభీర భావభేదములకు ఝడితిస్ఫూర్తి గూర్చుట నన్నయ నైపుణ్యము. కారకాన్వయ కౌటిల్యముతో నర్థవిశేషములను సాధించుట - నన్నయ తీరు కాదు.


భారతకథోపాఖ్యానాదులలోని పాత్రముల భావములు, సంభా షణములు చాల ప్రాతకాలపుని గావునఁ గొన్నిచోట్ల వ్యంగ్య వక్రోక్యాది కవితా కౌటిల్యములు లేనివిగా, నమాయికములుగా నున్నవి. అట్టివానిని తెలిఁగించుటలో నన్నయ తిక్కనలు విభిన్నరీతుల నాశ్రయించిరి. నన్నయ తన నాఁటికే వెల్లివిరిసియున్నవయినను కావ్యాలంకారశాస్త్ర సంప్రదాయముల గాపాడినాఁడు. తిక్కన యాయా పాత్రములఁ దననాఁటివానినిగాఁ గొన్నిచోట్లఁ గావ్వౌచితీ నిర్వహణార్థమై మార్చుకొని, తననాఁటి కావ్యాలంకార శాస్త్ర సంప్రదాయముల కనుగుణముగాఁగథానిర్వహణము కావించినాఁడు, నన్నయ రచన మూలానుసారియై, మౌధ్ధ్య మాధుర్యమనోజ్ఞమై, యార్షమై యున్న దనుట కొకటి రెం డుదాహరణములు.


నన్నయ శకుంతలోపాఖ్యానరచన కావ్యాలంకారౌచితీరీతినిఁ జూడఁగా గ్రామ్యతా దోషజుష్ట మనఁదగియుండును. వ్యాసుఁడే దాని నిట్లు రచియించినాఁడు. అమాయికములైన సత్యకాలపుమునిపల్లెలపిల్లల ముగ్ధ మధురసంభాషణములను మూలానుసారముగా తెలిఁగించుటే లగ్గని నన్నయ భావించి యట్లు రచించియుండును. తిక్కన యగుచో సాపట్టుల వ్యంగ్యవక్రోక్తి కల్పనాశిల్పముల నెట్టుకొల్పి నవ్యకాలికరీతిని కావ్యశయ్యతో కల్పించి యుండెడివాఁడేమో! నాటక రూపమున నా కథ నట్లే కాళిదాసు మార్చివేసినాఁడు కదా! “ఏను కచుం డనువాఁడ మహానియమసమన్వితుఁడ బృహస్పతి సుతుఁడన్" అని చెప్పుకొని శుక్రుని శుశ్రూషించిన కచుని శుక్రపుత్రియైన దేవయాని ప్రేమించి యిట్లు కోరినది.


“నీవును బ్రహ్మచారివీ వినీతుఁడ వేనును గన్యకన్ మహీ
దేవకులావతంస రవితేజ వివాహము నీకు నాకు మున్
భావజశక్తి నైనయుడి పన్నుగ నన్ను బరిగ్రహింపు సం
జీవనితోడ శుక్రుదయఁ జేయుము నాకుఁ బ్రియంబు నావుడున్",


అని కోరి కచునిచే నిరాకృతయైన దేవయాని దైవకృతముగాఁ బిదప యయాతి మహారాజు పాణిగ్రహణము కావింపఁగా నన్నతీరు మౌగ్ధ్యమాధుర్యభాసురమేకాని నవ్య కావ్యాచితరీతిని రోత గొల్పునదే. ఇట్టి సందర్భముననే, అనఁగా మాయావటుఁడు పార్వతిని భార్యవు గమ్మనీ కోరు సందర్భమున శృంగారరసభావ శ్లేషచమత్కార గర్భితముగా


"కీయ చ్చిరం శ్రామ్యసి గౌరి, విద్యతే మమాపి పూర్వశ్రమసంచితం, తపః, తదర్ధభాగేన లభస్వ కాంక్షితం వరం తమిచ్ఛామి చ సాధు వేదితుమ్"


అని కాళిదాసు రచన కావించినాఁడు. శ్రీనాథుఁడు దానిని దెలిఁ గించుటలో కాళిదాసు మార్గమును పీడనాడి అలంకారశాస్త్ర సంప్రదాయ వాసనల నెఱుఁగనివారినిగానే పార్వతీవటులను భావించి నన్నయఛ్ఛాయనే అనుగమించినాఁడు.


 "ఏనును బ్రహ్మచారిఁ దరళేక్షణ నీవును గన్య వెంతకా
లానకు నీకుఁ బెండ్లియె ఫలంబగునేని విచారమేల స
మ్మానముతోడ నన్ను మునీమాన్యు వివాహముగమ్ము లెమ్ము కా
దేని తపంబులోని సగమిచ్చెద మాను తపోఽ భిమానమున్",

నన్నయ భారత భాష నాగమసూత్ర స్మృతి భాషనుగా భావించుచోఁ దిక్కనభాషను గాళిదాసకావ్యభాషనుగాఁ బరిగణింపవచ్చును. నన్నయ దొక ఋషిమార్గము. తిక్కన దొక రసమార్గము.


“విలువిద్య నొరులు నీక
గలముగ లేకుండ నిన్నుఁ గజపుదు నని మున్
జలికితిరి నాక కాదీ
త్రిలోకముల కధికుఁ జూచితిమీ యొకయెఱుకన్".


ఈ పద్యమున నాల్గవచరణము తొల్త జగణపు టుయ్యాల యూపులో తర్వాతికవు లనేకులు హాయిగా ఊగ సాగినారు. ఈ యూపులో పింగళి సూరన్న ఎట్లూఁగినాఁడో గుర్తింపుఁడు,


“ఆపు డించుక తడ వన్య
న్యపాణి సంస్పర్శ సంభృతానంద స్తం
భపరీతాత్మత నుండిరి.
ప్రపంచమంతయును మఱచి పయున్ సతీయున్".


శ్రీనాథ పెద్దనాది కవీశ్వరులు చంపకోత్సలాది పద్యములలో మూఁడు నాల్గు చరణముల నొక సంస్కృత సమాసపు జాడింపున జాడించి హాయిహాయి యనిపింతురు. ఈ హృద్యపద్యవిద్యకు నన్నయ ఆద్యగురువు,


 “ఆలయక ధర్మశాస్త్రములయందుఁ బురాణములందుఁ జెప్పు సు
త్పలదళనేత్ర విందుమ యుపత్యము మే లని కావునన్ యశో
నిలయులఁ బుత్రులం బడయు నీ కొనరించెద సంగతాంగుళీ
దళవిలసన్మదీయకరతామరసద్వయయోజితాంజలిన్". >

“అనుపమ కార్ముకాది వివిధాయుధ విద్యలయందుఁ గోవిదుం
డసఁగ సజయ్యుండై పరగు నర్జునుఁ బోలఁగ నన్యు లెందు లే
రను జనఘోష ముచ్చరితమయ్యె మరుచ్చలితోచ్చవీచి ని
స్వనముఖరాబ్ధివేష్టితవిశాలమహీవలయాంతరంబునన్. "


 "అతులవిభూతితో మణిమయాభరణద్యుతు లొప్పఁగా శత
క్రతుఁడు శచీసమేతుఁడయి కాంచనచారువిమానమాలికా
గతదివిజోత్తముల్ గొలువఁగా కొలువుండు వరాప్సరోఽజింగనా
యతవిలసత్కటాక్షకు సుమార్చీతసుందరవక్త్రచంద్రుఁడై. "


రసము, భావము, రీతి అనునవి మూఁడును ముప్పిరి గొని, జిగిబిగులతో ముచ్చట్లుగొల్పు పద్యములు ఇవి మూఁడును చూఁడుడు:


 "ప్రకటితకోపవేగమునఁ బద్మదళాయతనేత్రముల్ భయా
నకతరలీలఁ దాల్చె నరుణద్యుతి నుద్యతమై త్రిశాఖమై
భ్రుకుటి లలాటదేశమునఁ బొల్చెం ద్రీకూటతట త్రిమార్గగా
సుకృతిఁ బ్రభంజనప్రియ తనూజున కంతకమూర్తి కచ్చటన్, "

"ధారుణి రాజ్యసంపద మదంబునఁ గోమలిఁ గృష్ణఁ జూచి రం
భోరు నిజోరుదేశమున నుండఁగఁబిల్చిన యిద్దురాత్ముడు
స్వారమదీయ బాహుపరివర్తితచండగదాభిఘాతభ
గ్నోరుతరోరుఁ జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్"

“పిలువంగఁబడక సభలకు,
బలిమిం జని పలుకు పాపభాగుల లోకం
బులకు జనవేడి పలికెదు;
పలువా! యెఱుఁగవు పరాత్మపరిమాణంబుల్."

ఈ క్రింది పద్యపు కడపటి చరణములో విశేషణములు విశేష్యమునకు తర్వాత నుండి ఒకదానికంటె నొకటిగా గుణోత్తరములై అవిమృష్టవిధే యాంశమనియు, పతత్రకర్ష మనియు నెన్నికగన్న కావ్యదోషములకు వ్యతిరేకముగా కావ్యగుణోదాహరణతను కల్పించుచున్నవి.


“సుతజననోత్సవంబున విశుద్ధయశుండు యుధిష్ఠిరుండు సం
భృతహృదయప్రమోదుఁడయి పెంపున నిచ్చె సువర్ణభూషణ
ప్రతతులు గోధనాయుతము బ్రాహ్మణ ముఖ్యలకున్ నిరంతర
వ్రతులకు వేదవేదులకు వారిజ సంభపునట్టివారికిన్.


ఈ విధముగా నన్నయరచనలో పలుపోకల గుణ విశేషములను పరిగణింపవచ్చును. ఆయనరచన రసధారల యూటపట్టు, ఆంధ్రకవుల కాతఁడు "మధుమయఫణితీనాం మార్గదర్శీ మహర్షి:!"


నన్నిచోడాదికవీశ్వరు లాయనరచనల నెన్నిటినో పుడికిపుచ్చు కోన్నారు. నన్నయ నన్నిచోడుల పద్యము లివి రెండు చదువుఁడు.


"తడంబడఁబడియెడు రవమును
బడి కాలెడు రవము గాలిపలుదేఱుగుల ప్ర
స్పెడురవమును దిగ్వలయము
గడుకొని మ్రోయించె నురగకాయోళితమై."

"గిరిసుతమైకామాగ్నియు;
హరుమైరోషాగ్నియుం దదంగజుమై ను
దుర్ఘకాలాగ్నియు రతీమై
నురుశోకాగ్నియును దగిలి యొక్కట నెగసెస్"


తిక్కన, శ్రీనాథుఁడు, పోతన, పెద్దన మొదలగు మహాకవులు నన్నయరచనములలోని పల్కు పొలుపులను పెక్కింటిని బరిగ్రహించినారు. నన్నయరచన ధర్మోదాత్తము. కర్ణాటకములోని జైనభారత పుటలజడి తెలిసినవాఁడు గనుక తెలుఁగు నాఁటిలో వ్యాసభారత ధర్మవిశేషములను వెలయుంపఁ గోరి అతఁడు కావ్యరచనకు కడఁగినాఁడు. భారతము నీతిశాస్త్ర గ్రంథ మని ప్రఖ్యాతి గన్నది. నన్నయ భారత భాగములోని నీతిపద్యములు రీతిహృద్యములు; సౌలభ్య సుందరములు. తెలుఁగు కవు లందిరిలో వచన రచన నన్నయ చేసినట్లు మరియే కవియు చేయలేకపోయినాఁడు. ఆ వచనరచనలో పలుకుబడి బహుమనోహరము. వాక్యములు సులభమయినవి. అనుప్రాసపు రెట్టింపు లం దుండవు. వచన ఖండముల పరిమాణము మితమై పులకండములఁ బోలియుండును. ప్రపంచభాషలలో ఆంధ్రభాషకు, ప్రపంచకవితలలో ఆంధ్రకవితకు ఏదేని అర్హస్థానము అబ్బందగిన యోగ్యత కలదేని ఆ యోగ్యతా విస్తర భార మెల్ల నన్నయ భారత భాగమే మోయవలసిన దగును. ఆ పుణ్యమూర్తికి వందనము. ఆయన కాశ్రయమిచ్చి పోషించిన చాళుక్య రాజరాజు కీర్తిపతాక చిరస్థాయి!


“మదమాతంగతురంగముఖ్యపదసంపన్నుండు సన్నయ్య తొ
మ్మిదినూర్ణేండ్లకు ముందుజూ పె కవితోన్మేషంబు సర్వాంధ్రసం
పద పెంపొంద చళుక్యవల్లభుఁడు సామ్రాజ్యాభిషిక్తుండుగా
నది నాబోటికి నేఁటికబ్బునటి వ్యాఖ్యానింప నాఖ్యానమున్"


నన్నయ్యతర్వాత భారతరచనమును బూరించిన తిక్కనసోమయాజి నన్నయరచనమును దిన్నగా నెఱిఁగినవాఁడే అయినను నన్నయ్య శళ్యూని భాగ్యమున ప్రసన్నతను పాటింపక, సంస్కృత భారతపు వ్యాసఘట్టములను బోలిన గ్రంథగ్రంథుల నధికముగా గూర్చి, కవితా మర్మముల నధికముగా జొప్పించి పురాణరచనాసౌలభ్యమును గోల్పడినాడు. వర్షా సమయమున

నొడుదుడుకు నేలలనుండి సుడులు దిరుగుచు మడుగులు మాటులుగలిగి లోతు తెలియనీయని కలకనీటి పోటుతో ప్రతిపదమును జాగ్రత్త వహించినఁ గానీ దాఁట వీలుగొల్పని వక్రగతులతో సాగు గంభీరనదీ ప్రవాహమువలె తిక్కనరచన సుప్రసన్నమై వెనుకకు ముందుకుఁ దిరుగు వాక్యోపవాక్యములయు, కారకాన్వయముయు కౌటిల్యముతో ఇంక నిందేమి విశేషము గలదో యని సహృదయులు ప్రతిపదము సందేహముతో ఆచియాచి చూచిచూచి మఱీ చదువవలసిన తీరుస చిక్కులు గొలుచు జిగిబిగితో నుండును, ఇది పురాణఫక్కికాదు. మటి దివ్యకావ్యఫక్కి, కవితామర్శ మిందెక్కువ. వక్రోక్తులు, ఆర్థాలంకారములు, వ్యంగ్యము నిం దధికముగా నుండును. ఇందుకు లక్ష్యము నొక్క గీతపద్యము సుదాహరించుచున్నాను. విరాటపర్వ ద్వితీయాశ్వాసమున కీచకుఁడు ద్రౌపదిపై తమక మాపుకొనలేక నీచవాంఛను వావిడిచి వెల్లడించినాఁడు. అప్పు “డబ్బోటి కలుషించియు దుర్వారంబైన పరిభవవికారంబు దోఁపనీయక వెరవుతోడన తప్పించు కొనవలయు నని" యిట్లన్నది.


“చనునె యిమ్మాటలాడ సజ్జనుల కాఁడుఁ
బుట్టువులతోడ నీవును బుట్టినాఁడ
వట్లుఁ గాకయు హీనవంశాభిజాత
నైన పతివల్ని నగు నన్ను నడుగఁదగునె?"


“అన్నా ! కీచకా ! సత్పురుషులు పరస్త్రీల నిట్లు కోరవచ్చునా? అంతేకాక ఆఁడుతోడుగలవాఁడు మఱీజాగ్రత్తగా నుండవలెనుగదా! నీవు సజ్జనుఁడవు. సుధేష్ణవంటి యాఁడుతోడుగలవాఁడవు, నీవిట్టి చెట్టపలుకులు పలుకరాదే ! ఇట్లు కోరఁగూడమికి నీ యోగ్యతాంశము లివి రెండే కాదు. మణి నా యయోగ్యతాంశములును రెండున్నవి. నేను హీనవంశసంజాతను, మగనాలను, ఉన్నత వంశము గర్హించు ననియు, ఆఁడుతోడు చెడనాడు ననియు, అక్కకుకూడ నీగతి పట్టవచ్చు ననియు, నీ విషయమున నీవు వెఱవవలెను. నావిషయమునఁగూడ, నీచజాతి దనీ, మగఁ డెఱిఁగిన దండించు నని నీవు వెఱవవలెను", అని సామాన్య ముగా తోఁచు బాహ్యార్ధము. ఇక్కడ లోఁతయిన యర్థాంతరము నున్నది.


“సజ్జనుఁడు, ఆఁడుతోడుగలవాఁడు ఇట్టి మాటలాడఁడు. ఇట్టి చెట్టలాడుచున్నావు గాక! నీవట్లుగాక దుర్జనుఁడవు. ఆఁడుతోడులేని వాఁడవు నయితివి! 'నాకు సజ్జనతాపేక్షలేదు, ఆఁడుతోడుకలిమి నేను పాటించువాఁడను గాను!” అందువేమో! (సుధేష్ణ వీనికి తగిన యాఁడుతోడే, తన పాడునడత కామెనుగూడ తోడుపఱచుకొన్నాఁడుగదా!) అయితే నీవట్లగుదువుగాక! హీన! ఓరి నీచుఁడా! వంశాభిజాతను! పవిత్ర క్షతీయ వంశజాతను! యజ్ఞాగ్ని సంభూతను! అయిన పతివల్నిని, అఖండ పరాక్రములయిన భర్తలుగల దానను! నన్ను నటరా నీవు కోరునది! నా వంశపు యోగ్యతను, భర్తల యోగ్యతను దెలియక వదరుచున్నావు. ఈ రెండు యోగ్యతలు నిన్ను నాశపఱుపఁగలవురా" అని యర్థాంతరము!

పాఠకులు పై రెండర్థములలో కీచక సైరంద్రీపాత్రములను జూచి సాధారణముగా తొలి సువ్యక్తార్తమును సైరంద్రిలో దాగియున్న ద్రౌపదీపాత్రను గుర్తించి, లోఁతుగా రెండవ యంతరార్థమును గ్రహింపఁ గల్గుదురు. లోఁతుగా యోచింపఁజాలనివారు తొలి యర్థమునే గ్రహింతురు. కీచకుఁడు మదనపిశాచగ్రస్తుఁడై యాత్రపాటుతో నున్నాఁడు గాన తొలియర్ధన అనే గ్రహింపగల్లెను. ద్రౌపదీ తాను భావించునది రెండవ గంభీరార్థమునే! తిక్కన యీ రెండర్దముల ననుగత పఱిచి శ్లేషధ్వన్యర్థ చమత్కారముతో పద్యమును గూర్చినాఁడు. పయిపద్యమున 'అయిన

పతివల్ని' ననుచోటను, 'అడుగఁదగునె' అనుచోటను అర్థవిశేషములు న్నవి. (అయిన యింటివారు ఇత్యాదులు చూచునది) అయిన = చెల్లి వచ్చిన, ప్రఖ్యాతిగాంచిన - భర్తలుగలదాన నని (అటువంటివారి విషయమై అడిగేదేమిటి " ఇత్యాదులు చూచునది. ), ప్రశ్నస్మరణమే చేయరానిదాన నని ఆర్ధవిశేషములు. ముద్రణములం దీపద్య మిట్లున్నదిగానీ యిందు తిక్కనకూరు కొంత మార్పుచెంది ఉండు ననుకొనుచున్నాను. 'అట్లు గాకయు' అనుచోట అటు తర్వాతి సముచ్చయపు టరసున్న- 'కాకయు' అనుచోటి 'యు' స్వారస్యమును సంపాదింపఁగల్గియే యున్నది. ఇంక 'యు' వ్యర్ధము. తిక్కన "అట్లుఁగాకయో హీన" అని రచన చేసి యుండును. తొలి యర్ధమున “అట్లుఁగాక - అయో-హీనవంశాభిజాతను అనియు, రెండవ యుర్ధమున అట్లుఁగాక - ఓహీన అనియు ఛేదము ససిపడును.


“అని విడఁగఁబల్కిన న
మ్మనుజాధముఁ డంతఁ బోక మదనోన్మాదం
బునఁ దన్ను నెదిరి నెఱుఁగక
వనితకు నిట్లనియెఁ గారవంపుఁ బలుకులన్",


తర్వాతి యీ పద్యములోఁ దన్ను నెదెరిని - పాదప్రహారము చేయుదానిని ద్రౌపదిని అనియు కవి పొసగించినాఁడు. ఇట్లు తిక్కన భారతపురాణరచనమున ప్రబంధపక్కితో వక్రోక్తి చమత్కృతులు. శ్లేషభంగులు, అనన్వయాభాసములు, గడుసు పొసగింపు కూర్పుతీర్పులు లెక్కకు మిక్కిలి యయియున్నవి. అత్యంత శ్రద్ధతో పరిశీలింపఁగా ఒక్క విరాటపర్వ ద్వితీయాశ్వాసముననే ఎన్నో శబ్దార్ధచమత్కారములు ప్రస్తుతపు ముద్రణ ములలో, ప్రాఁతలలో ఆపరిశీలితములుగా చెడిపోయినవి, చక్కఁబఱుప వలసినవి, గాన వచ్చినవి. తిక్కన చేసిపలుకుల మెలపులతోఁ గవితామర్మములతో సంస్కృతమున వ్యాసుఁడు చొప్పించినట్లు పెక్కుచోట్ల గ్రంథ గ్రంథులను చేర్చినాఁడు.


"గురునిమాట సరకుగొనమి దుశ్శీలత
పిట్టఁ బుడుక గోరుఁ బిసుకఁ ద్రుంప
గరవ మరుగు టుదయకాలాస్తమయ సమ
యముల ఖానుఁ జూచు టాయు వడఁచు."


ఈ పద్యమునఁ గవితా మర్మ మున్నది. క్రొత్తవా రీపద్యము నర్థమును గుర్తింపఁజాలరు. వృద్ధవిద్వాంసుల మూలముననో, సంస్కృత మూలము మూలముననో గుర్తింపవలసినది దీనియర్థము. 'అష్టమర్టీ తృణచ్ఛేదీ నఖఖాదీ చ యోనరః' అను మూలమున కిది తెనుఁగు. పిట్ట, పుడుక, గోరు అనఁగా లోష్టము, తృణము, నఖము, అనువానిని పిసుకుటకును, త్రుంపుటకును, కఱచుటకును, అలవాటుపడుట ఆయువును హరించు నని యర్థము. తిక్కన దీనిని 'బెడ్డ చిదుప, పుడక విరువ, గోరు గరవ, మరుగుటుదయ' అని సులువుగాఁ గూర్పవచ్చును. అయినను నిందు యథాసంఖ్యాలంకారము చేర్చి పిట్టపుడుక గోరు అనుచోఁ బెట్టను బట్టుకోనఁగోరునట్టి యని యనన్వితార్థాభాసచిత్రమును గల్పించి పాఠకులను లోఁతుయోచనకుఁ బాల్పఱచినాఁడు.మటియు,

"అనిన నలు గాలివాన గోవును నశేష
శబ్దముల మంత్రమును లోహజాతీఁ గాంచ
నమును మనుజుల విప్రుండు సమధికత్వ
భాజనము లండ్రు వేదప్రపంచవిదులు. "

తెలుఁగుకూర్పుమటలుఁగు లెఱుఁగనివారైనచోఁ బ్రౌఢ సంస్కృత పండితులు సైతము ఈ పద్యమున నలుఁ డేమిటి, గాలివాన యేమిటి అనన్వితముగా నున్న వేయని యంగలారురు. తిక్కన యిక్కడఁ జతుష్పాత్తులని కానీ, నాలుగుకాళ్ళ జంతువులని కాని సులువుగా ననలేఁడా? అనఁగలఁడు కాని నలుఁడు, గాలివాన అన్న ప్రసిద్ధ పదముల ఝడితీస్ఫూర్తిగలిగి పాఠకుల కన్వయము తోఁచి లోఁతైన యోచనతో తదాభాసచిత్రము గోచరించునట్లు కవితోమర్మ మిక్కడఁ గల్పించినాఁడు.


సంస్కృత భాగవతమును బలుకూరులు పురాణము చెప్పిన యొక బ్రౌఢసంస్కృతపండితుఁడు ఆంధ్రభాగవతముసుగూడఁ బురాణము చెప్పుచు 'ఓదము త్రవ్వి జీవనపుటోలమునంబడి' అన్న పోతన్నపద్యమున కర్ధము చెప్పుఁగుదరక “యిక్కడఁ బుటీల శబ్దమున కర్ధము తెలియలేదు. సంస్కృతాంధ్ర నిఘంటువులలోఁ బటోలపద మున్నదికాని పుటోల పదము లేదు. ఇందేదో తప్పున్నది” అని చెప్పెనంట! తెలుఁగు మఱుఁ గులెటిఁగిన సహృదయుఁ డొకఁడు "మదపుటేనుఁగువంటి దీపదము. మదము - ఏనుఁగు సమసించినట్లు జీవనము - ఓలము అను పదములు సమసించినవి. ఓల మనఁగా నర్ధమిది" యని చెప్పి యా సంస్కృత పండితునకు సహాయపడెనఁట! ఇది యెనుబది యేండ్ల క్రిందట నిజముగా జరిగినకథ! మా నాయనగారు చెప్పఁగా విన్నాను.

“నీతలపేసు గంటి నొకనేర్పున శౌరికి లంచమిచ్చి సం
ప్రీతుని జేసి కార్యగతి భేదము సేయఁగఁ జూచె,దింత బే
లైతిగదే సుమేరుసదృశార్ధముఁ జూచియు బార్ఖుఁ బాయునే
యాతఁడు క్రీడిభక్తియును నచ్యుతు పెంపును నీ వెఱుంగవే?"

శ్రీకృష్ణుఁడు రాయబారము వచ్చినపుడు విదురుఁడు ధృతరాష్ట్రునితో సంభాషించు సందర్భములోని పద్యమిది. ఇచ్చట నీతలంపును నే నెఱుఁ గుదును అను ముఖ్యార్ధమే కాక అది నీ తలలో పేనువంటిది సుమా అను నర్ధాంతరముకూడ నున్నది. ఇక్కడఁ దిక్కన యెఱిఁగియే తల పేను శబ్దచిత్రమును గూర్చినాఁడు, ఇటువంటి శబ్దార్థ చిత్రములను దిక్కన్న రచనమున నెన్నింటినేని లెక్కింపవచ్చును. ఆమధ్య నెల్లూరు తిక్కన వర్ధంతిసభలోఁ దిక్కన రచనావిశేషములనుగూర్చి చర్చ జరిగినట్లు పత్రికలలోఁ జదివితిని. విరాట ద్వితీయాశ్వాసమున సైరంధ్రాని గూర్చి కీచకుని ప్రలాపములలోఁ దిక్కన యు/అర్ధ దూషితముగా దీనిఁ బొందఁ గాంచు తెలుఁగు నా కెయ్యది యొక్కో' అని కూర్చె ననియు నది కీచక పాత్రోచిత మని యొకరును, దీనిఁ బొంద' యనుచో నశీలార్ధము పరిగణింప నక్కరలే దని మణికొందఱు ననిరఁట! ఇప్పుడు ప్రచారములో నున్న తిక్కన విరాటపర్వముద్రణము లాలేడింటలోఁ బార మిట్లే ముద్రితమై యుండుటచే నీ యనర్థము వచ్చినది. తిక్కన రచన మిట్లుండదు. ఈ పద్యము పై నాలుగు సీసచరణములందును దీనిజన్మంబున, దీనివల్లుఁడు. దీని నామాకృతి, దీని వసించుట యని సైరంద్రీవాచక సర్వనామము షష్ఠీసమాసగతమైయుండఁగూర్చి గీతలో మాత్రము దీనిఁబొంద' అని వ్యస్తముగా, సపక్రమముగా, నశీలస్ఫోరకముగాఁ దిక్కన కూర్పుఁడు. కాన ఇక్కడఁగూడ దీనిపొందుఁ గాంచు తెలుఁగు నా కెయ్యది యొక్కొ" అనియే యుండవలెను. విరాటపర్వముద్రాపకు లెల్లరును “దీనిఁబొంద" యనియే గ్రహించుట యనుశోచనీయము. తిక్కన “బొందను" ప్రయోగింపలేదు. లేఖకులు, ముద్రాపకులు ప్రమాదపుబొందఁబడిరి. విరాటపర్వద్వితీ యాశ్వాసము ననే తిక్కన కవితామర్మములును, బద లాలిత్యములును,

గడుసరికూర్పు నేర్పులును సెన్నో యప్రౌఢులైన లేఖకపాఠక ముద్రాషకుల మూలమునఁ దార్మారై కానవచ్చినవి. దేసి తెలుఁగు మఱుఁగులెటింగిన ప్రౌఢాంధ్రపండితులు గాని గుర్తింపరాని వగుటచే ననేకపాఠములు తిక్కన రచనలో నట్లు తార్మారైనవి.


"తన్వంగి మవ్వంపుఁ దసులత నెసగెడు
నునుగాంతి వెల్లువ మునుఁగండాలం
గీసలయహస్తకెంగేల నేపారు క్రా
మ్మించను లేయెండ మిగులఁ బర్వం
గమలాస్య ముదుమొగంబు లేమెఱుఁగుల
మొత్తంబుపర్ చుట్టు ముట్టి కొనఁగ
ధవళాక్షితాంగలి తలుచుకెప్పుల చెన్ను
కప్పునుచీకటి గవియుదేర
బెగ్గలం అంతకంతకు సగ్గలించి,
యొదవి చెమ్మట, చిత్తంబు సెదరి, యెందు
మెలగఁ దలఁపేది, యా సింహబలుఁ డనంగు
పట్టి యాడెడు జంత్రంబుపగిది నుండే",


ఈ పద్యము నెత్తుగీతియందుఁగల యసమాపకక్రియల నాల్గింటిని సీసపునాలుగు పాదములకు యథాసంఖ్యముగాఁ గూర్చుకొని యర్థమెరుఁగఁ దగును. కాంతివెల్లువ కీచకుఁడు మునుఁగునట్లు ప్రవహింపఁగా వానికి బెగ్గల మంతకంతకు నగ్గలమైనది. లేమెఱుఁగుల మొత్తమను సైన్యము చుట్టు ముట్టుకొనఁగా జిత్తము సెదరినది. కసుఱైప్పల కప్పనుచీఁకటి క్రమ్ముకొనగా నెందును మెలఁగలేక పోయినాఁడు. ఇందుఎత్తుగీతి పై యర్థమున కనుగుణముగా ముద్రణములందుఁ గానరాదు. మఱియు నింకొక పద్యమున, “కేలిమై నొక్కటలీలఁ గ్రేళ్లుఱికెడు వాలుగుసోగల నేలుదెంచి" అని యున్నది. 'ఏలుదెంచి', యనుట తిక్కన ప్రయోగముకాదు. ఏఁగుదెంచు, జనుదెంచు, పుత్తెంచు, తోతెంచు ఇత్యాదిగా గత్యర్థ సంబంధములగు ధాతువులమీఁదనే 'తెంచు' ధాతు వనుప్రయుక్త మగుట భాషలోఁ గొనవచ్చును. తక్కిన మూఁడు చరణములలోను తెగడి, తూలంద్రోలి, ఉక్కడంచి యున్నవి గనుక యిక్కడఁ గూడఁ దదను గుణముగా 'నేలిదించు' - అవహేళనము చేసి యని దుర్ధము. ఇంకొకటి


"సమదవారణము జంగమలత వెనుకొని
సరభసంబునం జనువిధమునం
గ్రూరదానవుఁడు భూచారి నిర్ణరకాంతం
బొదువ రయమ్మునఁ బోవుభంగి
గృధ్రము సుకుమార నాగాంగనం
బటుగతి నొడియంగఁ బాఱుకరణీయ
బ్రబలబిడాలంటు బాలశారికమీంద
నడరి సత్వరమున నరుగుమాడ్కి
సింహబలుఁ డత్యుదగ్రతఁ జిగురుబోండి
పజ్ఞుఁ గడువడి దగిలి కోపంబు గదుర
నొడిచి తలపట్టి తిగిచి మహోగ్రవృత్తి
గోంకు కొసరించుకయు లేక కూలంచె".


ఈ పద్యమున ద్రౌపది కుపమానములుగా మూఁడు చరణములలో జంగమలత, భూచారి నిర్జరకాంత, సుకుమార సాగాంగన యనునవి భూలోకదుర్లభము లున్నవి. నాల్గవ చరణమునఁగూడ నట్లేకదా యుండ వలెను. మఱియు మూఁడు చరణములలోను ద్రౌపద్యుపమానపదములు ద్వితీయాంతములుగా నున్నవి. నాల్గవచరణమునఁగూడ నట్లే కదా యుండవలెను. ఈ తీరునఁజూడఁగా - "ప్రబలబిడాలంబు భారతీశారిక నడఁప సత్వరమున నరుగుమాడ్కి" అని యుండుట బాగు, ఈ 'భారతీ శారిక' పదము 'భారతీదేవి ముంజేతి పలుకుఁజిలుక' వంటిది.

కీచకుఁడు ద్రౌపదిఁగూర్చి చేయు నసందర్భాలాపములలో నీక్రిందిది యొకటి.

"చిత్తము మెచ్చి సౌవలనఁ జిక్కగ వెండియు నాలతాంగి య
చ్చోత్తినయట్లు నాకుఁ దన యుల్లము తెల్లము సేయకున్కిదా
సత్తణిఁ క్రొత్త కాన్పుగుట నడ్డము సొచ్చిన సిగ్గు పెంపు న
సుత్తలమందఁ జేయుటకునో తలపోసి యెఱుంగ నయ్యెడున్. "

ముద్రణములో నీపద్య మిట్లున్నది. తిక్కన పలుకుబడి గాని, యర్థపుసొంపుగానీ యిందుఁ బొందుపడకున్నది. ఇది యిట్లుండగాఁ దగు నని నాతలంపు:

“చిత్తము మెచ్చి నావలనఁ జిక్కఁగ వెండియు నాలతాంగి య
చ్చొత్తినయట్లు నాకుఁ దన యుల్లము తెల్లముసేయకున్కి దా
నత్తణి క్రొత్తకానగుట నడ్డము సొచ్చిన సిగ్గుపెంపా? న
న్నుత్తల మందఁ జేయుటగునో? తలపోసి యెఱుంగ నయ్యెదన్. "

రాయబార మరుగునప్పుడు కృష్ణునితో ద్రౌపది తన భంగపాటును జెప్పు పలుకులలో-


"అంతలుసేసి పోసడిచి యక్కట సంజయచేతఁ జెప్పి, పు
త్తెంతురె? యిట్టి యూఱట మదింబ్రియమందే యుధిష్ఠిరుండు దా
సంతన యూళు లేవురకు నైదు సుయోధనుఁ టిచ్చునొక్కొ? ఈ
కంత కృపావిహీనమతి నాతఁడు నేచునె యన్నదమ్ములన్."<poem>

ఇందు 'ఈకంత' అనుచోఁ గొందఱు వికటార్ధములనుగూడఁ జెప్పుదురు. ఇక్కడ 'ఒక్కంత కృపావిహీనమతి నాతడు నేచునె యన్నదమ్ములన్' అన్న పాఠము సుందరము. ఇంతవఱకు నే నిప్పుడు వెల్లడించిన సంస్కరణ ములలో నిదియొక్కటి తక్క దక్కిన వెల్లను తిక్కన హృదయము నూహించి నేనే చేసినవికాని వ్రాతప్రతులఁజూచి చేసినవి కావు. ఈ తీరునఁ జూడఁగా చేసి తెలుగు మఱుఁగులలో సాటిలేని నేర్పుతో మెలఁగనేర్చిన తిక్కన సారస్వత భాండారమగు భారతభాగమును ససిగా నుపయోగించు కొనుటకు సమర్ధమైన సహృదయపండిత గోష్ఠి జరగవలెను. ఇట్టి పరిశీలనము జరుగనిచోఁ దిక్కన పదప్రయోగలాలిత్యము సరిగా బరిజాతము కాజాలదు.

తిక్కన రచనలో నింకొక వింతతీరు కూర్పును వివరించుచున్నాను. ఆంధ్రకవితారచనమున వాక్యముల నసమాపకములుగా పద్యముననుండి పద్యమునకు సాగునట్లు కూర్చుట కలదు. అనఁగా నొక వాక్యము రెండు భిన్న పద్యములలో ననుగతమై యుండు నన్నమాట. పద్యావసానమునకుఁ బద్యోపక్రమమునకు నడుమఁ గొంతవిశ్రాంతి యుండును. ఒక వాక్య ముచ్చరించునపుడుగూడ సడుపు విశ్రాంతి యుండఁదగుసు గనుక ఆకూర్పు అసందర్భముగాఁ దోఁపదు. కాని రెండు భిన్న జాతివియగు పద్యములలో నొకసమాసపదమునే సంధించి కూర్చుట చాల విడ్డూరముగా నుండును. ద్విపదములు, రగడలు మొదలగువానిలోను, మాలికావృత్తముల లోను నాల్గుచరణములకుఁ బద్యము ముగియదు కాన వానిలో నట్లుండవచ్చును గాక, భిన్నజాతిపద్యముల యవసానారంభములలోనే ప్రధానముగా సంహిత పాటింపవలసిన సమాసపదము తిక్కన రచనలో నున్నది.

“ఒకటి యడిగెదఁ గృప చిగురొత్తం జెప్పు
వలయు మీరు మాయింటికి వచ్చి యొక్క
ప్రక్క క్రిందుగ నిరువదియొక్క దినము
లనఘ! నిద్రించి తదిమొదలైన నీదు


చరితం బద్భుతము మునీ
శ్వర! దీనికిఁ గారణము విచారమున కగో
చర మెఱిఁగింపు మనుడు నా
ధరణీవల్లభునితో నతం డిట్లనియెన్":


'నీదు-చరితము' అన్న సమాసపదము రెండు భిన్నజాతి పద్యముల యంతాదులలో సున్నది. నన్నిచోడ మహాకవికూడ నిట్లోకచోఁ బ్రయోగించి నాఁడు,

"వ........ అనేక పురుషరత్నా కీర్ణంబై వెలుంగుచున్న -
సభలో - దానవదూత గాంచె విలసజ్జాజ్వల్యమానంబులై

(కుమార సం. 10, ఆశ్వా)</poem>


'వెలుంగుచున్న సభలో' అన్న సమాసపదము - సంహిత గలిగి యుండవలసినది. వచనావసానమునఁ గొంతగాను (వెలుంగుచున్న), ఉత్పలమాలాపద్యారంభమునఁ గొంతగాను (సభలో) విడఁబడియున్నది.


"రవిపదాహతిం జెడియుండు రాజువోలె
నని సరోజములొందఁ జక్రాహ్వయములఁ
జెట్ట లాడుటకని వికసిల్లుటకును
వెల్లనైనట్లు చుక్కలు వెలరువాఱె". (కుమా. గి ఆ)


దిద్దవలెను. అర్ధము కుదరక గ్రుడ్లుమిటకరించి కోట్టుకొని యెట్టకేల కిట్టు కవిపాఠము కనిపెట్టఁగలిగినాను.

  • రవిపదాహతీఁ జెడియుడురాజు వోయె

నని సరోజములొద్దఁ జక్రాహ్వయములు
చెట్టలాడుట, కవి వికసిల్లుటకును,
వెల్లనైనట్లు చుక్కలు వెలరువాఱె",


ఉడురాజు = నక్షత్రాధిపతి, చంద్రుడు, ఉడిగిపోవు = ముగిసిపోవు రాజు అనికూడ, ఉడుఁబోత పిందె వంటిది. విరోధియైన యుడు రాజు పడిపోవుట నాకసమున కెగసి చక్రవాక పక్షులు చూచి యా సంతోష వార్తను మిత్రములైన సరోజముల యొద్దకి వచ్చి చెట్టలాడుటకును = పడిపోయిన జంద్రుని నిందించుటకును, మఱియు నుత్సాహముతో టెక్కలల్లా డు(ర్చు)టకును ననియు. అవి = మిత్రములయిన యా సరోజములు, వికసిల్లుట కును = వాని చెట్టలాట కుప్పొంగుటకును, వికాసము చెందుటకును, నవమానము చెందీ తెల్లపోయినట్లు చంద్రుని మిత్రములైన నక్షత్రములు కాంతిహీనములై వెలవెలఁ బోయినవి.

కవి హృదయము పైయట్లు గోచరింపఁగా నాకవి నాకుఁ గనకాభి షేకము చేసినాఁ డన్నంత సంతోషముతోఁ దోఁగినాఁడను. మఱికొన్ని,

"ఆయషనీరు హోద్గతల తాంతవినిర్గతసౌలభప్రవా
హాయత సాంద్రమై ఫలితమై యొగిఁబర్విన డాయఁబోవసుం
బాయను రాకచుట్ట మధుపవ్రజ మాలిక లుండె నొప్పి పు
షాయుధు కాలఁజుట్టు మరుఁ డాయసవప్రము పెట్టినట్టిదై"

(నవమాశ్వాసము. 298 ప)

దీనికి నా సంస్కరణము:


"ఆయవనీరు హోద్గతల తాంత వినిర్గత సౌరభప్రవా
హాయతి సాంద్రమై ఫలితమై మొగిఁ బర్వీన దాయఁబోవనుం
బాయను రాక చుట్టి మధుపవ్రజమాలిక లుండె నొప్పి పు
ప్పాయుధుశాల చుట్టు మధుఁ దాయసవము పెట్టినట్టులై".

పుష్పాయుధశాల కధికారియైన వసంతుఁ డాయాయుధశాలలోని కెవరికిని రాకపోకల వీలు లేకుండుటకు చుట్టును నినుపకోట పెట్టినట్లు భృంగమాలికలు పూలచెట్లను జుట్టి యున్నవి. పూచీన చెట్లు పుష్పాయుధ శాలలు. మధుఁడు తదధినేత. ఇందులోఁబుష్పాయుధుశాల, మరుఁడు ఉండుట యసంగతము.


"సుజనజనైకభూషణము శూరత దుర్జనదూషణంబు స
ద్విజవాబుధాశ్రితప్రతతి వేడుకఁబ్రోపును రాజ్యచిహ్న గా
క జలమహాభి షేకమునఁ గట్టిన పట్టము వీజనంబు భూ
భుజులక కాక యిన్నియును బుంటికినైనను లేవె చూడఁగన్"

దీనికి నా సంస్కరణము.

"సుజనజనైకభూషణము శూరత దుర్జనదూషణంబు స
ద్విజ విబుధాశ్రితప్రతతి వేడుకఁబ్రోవును రాజ్యచిహ్న గా
క జలమహాభషేకమునఁ గట్టిన పట్టము వీజనంబు భూ
భుజులక కొక యిన్నియును బంటికినైనను లేవె చూడఁగన్",

“వనధి నీ రెల్లఁ గొనిపోవఁ గని సహింప
కజ్ఞతతి గిట్టపట్టిన నరుగ నోపు
కోలి దొంతులు గోనిపడియున్న కారు
మొగుళులనఁ జూచి తటభూమి మొగళు లనురె".

(11 - 120 ప)

దీనికి నా సంస్కరణము

"వనధినీ రల్లఁ గొనిపోవఁ గని సహింప
కబ్ధితటీ గిట్ట పట్టిన నరుగనోప
కోలి దోంతులు గొనిపడియున్న వారు
మొగుళులనఁ బూచి తటభూమి మొగళు లమరె".

అభికిఁ జుట్టు నఖోతటి కాపలా కాయుచున్నట్లును, సముద్రము లోని నీటిని మెల్లగాఁ బై పైకి మేఘము లెత్తుకొని పోవుటకుఁ జూచి యా యఖితటి యా మేఘముల గిట్టలను (వానకాళ్ళను) బట్టి యీడ్చి క్రిందఁబడవేయఁగా నవి దొంతులు గొని పడియున్న వన్నట్లు సముద్ర తటమున మొగలిచెట్లున్నవి. ఆ మేఘములలోని మెఱపులా యనునట్లు మొగలి పూవులున్నవి.


"తను వస్తాంబుదంబు సితదంతయుగం బధిరాంశు లాత్మగ
ర్జన మురుగర్జనంబు గరసద్రుచి శుక్రశరాసనంబు నై
చన మదవారిపృష్టి హితసస్య సమృద్ధిగ నభవేల నాల
జను గణనాథుఁ గొలు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్".

దీనికి నా సంస్కరణము

“తను వనితాంబుదంబు సితడంతముఖం విచికాంశు వాత్మగ
ర్జన మురుగర్జనంబు గరసద్రుచి శక్రశరాసనంబు నై
చన మదవారి వృష్టి హితసస్య సమృద్ధిగ నభవేళ నాఁ
జను గణనాథుఁ గొల్తు ననిశంబు నభీష్ట ఫలప్రదాతగాన్"


విఘ్నేశ్వరుఁ డేకదంతుఁడు కొన సితదంతయుగంబని యుండ రాదు. అచిరాంశువు మెఱుపు. అది ఉపమానము కాన అప్పుడప్పుడు మాత్రమే కన్పడునదిగా నుండవలెను. సితదంతముఖం బసుటలో నోరు తెఱచినప్పు డగపడుట, మూసినప్పు డగపడకుండుట దంతాగ్రమునకు కలిగి యచిరాంశుసామ్యము సిద్ధించును.


"ముదమున సత్కవి కావ్యము
నదరఁగ విలుకానీ పట్టినమ్మును బరహ్మ
ద్బి మై తలయూఁపింపని
యది కాష్యమె మలరి పట్టినదియును శరమే?"

(1ఆ - 41 ప)

వ్రాతప్రతిలో నీపద్య మిట్లున్నది.

 "మదమున,.......... కావ్యము
సదరంగ విలుకాని పట్టినమ్మునుం బరహ్మ
ద్భిదమై తలయూపింపని
యది గావ్యమె మరీ పట్టినదియున్ శరమే".


దీనికి నా సంస్కరణము


“ముదమునఁ గవికృతి కావ్యము
నదరున విలుకొని పట్టినమ్మును జరహ్మ
ద్భిదమై తలయూపును, బెజ
యది కావ్యమే చెప్పుల, బట్ట నదియున్ శరమే?"


ముదముతోఁ గవి రచించిన కావ్యమును, అదరుతో వీలుకాని పట్టిన యమ్మును ఒరుని హృదయభేదనము గాచించి తలయూపించుసు. అట్లుకానిచో, రచించినంతమాత్రముచే నది కావ్యముకాదు. చేతం బట్టినంతమాత్రముచే నది శరముసు గాదు. కావ్యమును, శరమును రెండును బరహృదయభేదనము చేసి తల యూపించునవే కాని కావ్యము దానిని ముదముతోఁ జేయును, బాణ మదరుతోఁ జేయును. ముద్రిత ప్రతిలోని, వ్రాతప్రతిలోని పాఠములకు సరసాన్వయము కుదురలేదు.


"జా నఖి పశుపతి నుటకవి
ధాన మహారంభుఁడైన దక్షుం డను న
జ్ఞానికి ముసుకొని వచ్చును
మానంబున నమర సతివిమానము వచ్చెన్"

దీనికి నా సంస్కరణము.

“జానటి పశుపతి నుతిక వి
తానమహారంభుఁడైన దక్షుం డను న
జ్ఞానికి మునుకొని వచ్చున
మానం జన నమర సతివిమానము వచ్చెస్".

(2 ఆ. 150ప)