తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/ఆంధ్రకవిత - ప్రబంధయుగము

వికీసోర్స్ నుండి

7

ఆంధ్రకవిత-ప్రబంధయుగము


ఆంధ్రకవితాకలా కాల రత్నహారమున శ్రీకృష్ణదేవరాయల కాల మొక తరళ రత్నము. ఆ మహారాజు సుకృతవిశేష మెట్టిదో కాని, యాంధ్రకవిత యతని పాలనకాలమున దివ్యవైభమనుభవించినది. దివ్య సౌందర్యము తీర్చుకొనినది. తిన్నని తీరుల దిద్దుకొనినది. ఔచితీ నిర్వాహ మలపఱచుకొనినది. సంస్కృతమునందుఁగాని, సాటి భాషలగు కర్ణాట ద్రవిడములందుఁ గాని కానరాని కావ్యవస్తుకల్పనపు మెల్పులను గల్పించుకొనినది. విక్రమార్కుని యాస్థానిలో నవరత్నము లున్నట్లు శ్రీకృష్ణదేవరాయని యాస్థానియం దష్టదిగ్గజము లనఁబడెడు కవులు వెలసి, 'నభూతో నభవిష్యతి' యనఁదగినట్లు వింతతీరున మహాప్రబంధములు విరచించిరి. ఆనాఁటి కృష్ణరాయఁ డాంధ్ర కవిరత్నరత్నాకరుఁడు. ఆ మహారాజు దక్షిణ హిందూదేశమునకెల్ల నేకచ్ఛత్రాధిపత్యము వహించి యటు కటకముననుండి యిటు కన్యాకుమారి దాఁకఁ గల దేశమెల్ల విజయయాత్రలోఁదిరిగి చూచినవాఁడు. కాన తనతిరిగిన దేశములలో గానవచ్చు కవిరత్నములనెల్ల 'రత్నహారీతు పార్ధివ' యన్న న్యాయము చొప్పునఁ గొనితెచ్చికొనెను. కృష్ణాతీరమున సద్దంకి నుండి మాదయగారి మల్లనను, కడపమండలముననుండి పెద్దనామాత్యుని, నెల్లూరిమండలమున నుండి నందితిమ్మనను, గుంటూరిమండలముననుండి పింగళి సూరన్నను, తెనాలి రామలింగని, నింక ననేకమండలములనుండి యనేకకవులను నార్జించి, తనసాహితీసభాంగణము నలంకరించుకొనెను. 'సాహితీ సమరాంగణ సార్వభౌముఁ" డనఁబరగెను. దశమశతాబ్దిలో నారంభమయి యిర్వదవ శతాబ్దిలో నేఁడు సాగుచున్న యాంధ్రకవితకుఁ బదునాఱవ శతాబ్ది ప్రథమపాదము సరిగా మధ్యస్థమేకదా ! అది యాంధ్రకవితా దివ్యస్రవంతికి గాంభీర్యము, లోతు చాలఁగాఁగల నట్టనడి యేటిపట్టు! చాళుక్యరాజరాజు, తెలుఁగు చోళరాజు మనుమసిద్ధి, కాకతీయ ప్రతాపరుద్రుఁడు, రెడ్డిరాజ సముచ్చయమునను నాశ్రయాసుక్రమమున సాగివచ్చిన యాంధ్రకవితకు శ్రీకృష్ణరాయని యాశ్రయము పై విధమున ననిదంపూర్వమయిన సభ్యుదయముఁ జేకూర్చిన గట్టి పట్టుగొమ్మ.

ఎడనెడ నన్నయాదుల పురాణరచనలలోను, నన్నిచోడని కుమార సంభవము, ఎఱ్ఱననృసింహషురాణము. మంచనకేయూరబాహు చరిత్రము, దొరకలేదు కానీ తిక్కన విజయసేనము, శ్రీనాథునిశృంగార నైషధము, దుగ్గననాచికేతోపాఖ్యానము మొదలగు కృతులలో రాయలనాటి ప్రబంధరచనావ్యాప్తి యించించుకగా మొలకెత్తినది. శ్రీకృష్ణరాయని కాలమునఁ బర్యాప్త వైభవముతో నిండారి వెలసిన ప్రబంధరచనా సంప్రదాయవాహినికిఁ దత్పూర్వరచన లెట్లెట్లూటకాల్వలయినవో యించుక వివరింతును.

పదునైదవ శతాబ్దిదాఁక నాంధ్రకవితారచన పురాణపరివర్తన ప్రాయమై యున్నది. కాని దానిలోఁ గవికి స్వైరవిహారమును గావింప నవకాశము తక్కువ. సంస్కృతపురాణములు ప్రాయికముగా సల్యార్థరచ నాపరము లగుటచేత నందుఁ గవికల్పితకథలలోవలె సౌచితీనిర్వాహ మంతగా నుండదు. మటియు నాపురాణకర్తలేవో పరమార్ధముల నిరూపించుటే ముఖ్యముగాఁ గొన్నవా రగుటచేతను, నౌచితి నంతగాఁ బాటింపకయుఁ బోయిరి. యుద్ధరంగమున గీతోపదేశము, నారణ్య శాంత్యానుశాసనిక పర్వములలోని కథాకల్పనములుఁ గావ్య శిల్పదృష్టితో జూడఁగా నౌచితిదూరము లగును. కాశీఖండమున నొకచోటఁ బతీవ్రతా ధర్మములు చెప్పుట పరమార్ధముగాఁ గొనుటచే లోపాముద్రతో వ్యాసుఁ డుపన్యసించుటలో నౌచితీభంగము పొటిల్లినది. ఇట్టివానిని బురాణములు దెలిగించువారు తొలఁగించుకొన వీలు కాదయ్యెను. కావ్యమున కౌచితి జీవగఱ! కావ్యమునకే యేమి? లౌకికమయిన సర్వవాగ్వ్యహారమునకును నౌచితి ముఖ్యమేకదా! దీనిని బాటించుటకుఁ గవికి స్వాతంత్ర్యముండ వలెను. అందుకే శాకుంతలాది నాటకములయందుఁ బురాణకథలకు మారులును, దద్రక్షకై 'అన్యథా వా ప్రకల్ప్యయేత్' అన్నశాస్త్రమును నేర్పడినవి. ఆంధ్రకవితాసంప్రదాయము ప్రాయికముగా సంస్కృతప్పు దీరు ననుసరించి పుట్టినది గాన సంస్కృతమునఁ బురాణములకుఁ దర్వాత వెలసిన కావ్యనాటకముల యవతార మాంధ్రమునకును నావశ్యకముగాఁ గవులకుఁ దోఁచెను. ఆ తలఁపు చొప్పుననే నన్నిచోడ కుమారసంభవ, కేయూరబాహుచరిత్ర, క్రీడాభిరామ, హరవిలాస, శృంగారనైషధ, శృంగార శాకుంతల, ప్రబోధచంద్రోదయాదు లాంధ్రమున వెలసినవి. మహాకావ్య పద్ధతిని వెలసిన కుమారసంభవ, శృంగారనైషధాదులుగాక నాటక పరివర్తనము లనఁదగిన కేయూరబాహుచరిత్ర, క్రీడాభిరామ, శృంగార శాకుంతలాదులు గూడ శ్రవ్యములుగానే, చంపూకావ్యములుగనే తెలుఁగున రచితములైనవి. నాటకములయందు వచనభాగ మెక్కువగా సంభాషణాత్మకముగా నుండును, సరిగా వానినీ దెలిగించుటలోఁ బొడిపొడి వచనము లట్లే తెలిగింపవలసియుండును. ప్రాచీనకాలమున దేశభాషా రచనలలో వచనరచనమీఁద నాదరము లేకుండెను. అందు రచనాశిల్ప మంతగా నుండ దని యప్పటివారి తలఁపుగాఁబోలును! నియమబద్ధములు గాని పొడివచనరచనలు తాళపత్రాదిలిపులలో వికృతిఁజెందకుండ

సంరక్షించుట యసాధ్యముగాఁగూడ వారు తలఁచియుండవచ్చును. ఇవియో కారణ మింక నేదో కాని నాటకాంధ్రీకరణమున వా రట్టి పొడిసంభాషణపువచనములఁగూడ పద్యరచనలలోనే జరపి యా నాటకములనుగూడ శ్రవ్యకావ్యములుగానే కావించిరి. కాని శ్రవ్యకావ్య ములకుఁ గల నానారసాలంకారవర్ణనాది మహాకావ్య పరికర పౌష్కల్యము నాటకాంద్రీకరణమునఁ జూపఁ బూనుట వైరస్య హేతువయ్యెను. కావ్యముల లోని యలంకారవర్ణనాది పౌష్కల్యపరిగ్రహముతో, నాటకములలోని శుభాంతతావ స్వైక్య నానారసోక్తిప్రత్యుక్తి చాతురీగ్రహణముతోఁ, బురాణ రచనములలోని రసైకపరములుగానే విపులాతివిపులమైన కథాఘట్టముల పరిత్యాగముతో, మిశ్రకల్పితేతివృత్తములతోఁ బొందుపడి కావ్యములులేని, నాటకములు లేని కొలుఁతను దీర్పఁగల రచనావిశేష మొకటి తెలుఁగున నావశ్యకమగుట నాంధ్రకవులు గుర్తించి యా యా గుణవిశేషములెల్ల కుదురుపడున ట్లే ప్రబంధరచనమును గావింపఁ దొడఁగిరి. ప్రబంధశయ్య యను పేరును జక్కన పేర్కొన్నాఁడు.


శృంగారనైషధ శాకుంతలాదులందు సంస్కృతమూలానుసరణ పారతంత్ర్యముతో సమకూడిన ప్రబంధరచనాసౌభాగ్య మీ విధముగా మనుచరిత్ర పారిజాతాపహరణా ముక్తమాల్యదాదులయందు స్వతంత్రమయి సర్వహృద్యముగా విజృంభించినది. ఈ ప్రబంధములలోఁ బురాణములలో లేని యోచితీనిర్వాహ కథావస్తు సంగ్రహణము లున్నవి, మహాకావ్యములలో గల నానారసాలంకారాష్టాదశవర్ణనా పౌష్కల్య మున్నది. నాటకములలోఁ గల సంభాషణాది చమత్కారము, వస్వైక్యము, కథానిర్వాహణములో స్వాతంత్ర్యము, సంకాది విభాగములంబట్టి యాశ్వాసాది విభాగములు సున్నవి. ఇట్టిప్రబంధములు వెలయుటచే నానాఁ డింక రఘువంశాదులవంటి మహా కావ్యములయుఁ, గాదంబర్యాదులవంటి గద్యకావ్యములయు, శాకుంత లాదులవంటి నాటకములయు నావశ్యకత తెల్గునకు లేకపోయినది.


ప్రబంధములలో విరివి సెందిన ప్రాచీనరచనాంకురములను గొన్నింటిని, బ్రబంధములలో నాటక కావ్యానుకరణములను గొన్నింటిని మచ్చున కుదాహరింతును. మార్కండేయపురాణకథ ప్రబంధ మార్గమున విరివిసెంది మనుచరిత్ర మయినది. అందు మృగవర్షనచమత్కారమెల్లం బినవీరన్న శృంగార శాకుంతలములోని మృగయావర్ణనమునుబట్టి పుట్టి పెరిగినది. వర్ణనలెల్లఁ గావ్యసంప్రదాయము ననుసరించి విపులముగా సాగినవి. వరూథినీ ప్రవర సంవాదము మేలయిన నాటకసంభాషణ చ్చాయను బొందుపడినది. శ్రీనాథుని కాశీఖండములోని 'గుణనిధి కథ' పాండురంగకవి నిగమశర్మోపాఖ్యానముగాఁ బెరిగినది. అంతేకాక యాకథ కందుకూరీరుద్రకవినోర నిరంకుశోపాఖ్యానప్రబంధముగానే విరివిసెందినది. పారిజాతాపహరణ ప్రభావతీ ప్రద్యుమ్నములు మహాకావ్య నాటక ధర్మముల కలయికతో వెలసినవి.


శ్రీనాథుని కాశీఖండపద్య మిది
“ముడువంగ నేర్తురు మూల దాపటికి రాఁ
జికురబంధము లింగ జీరువాల
జొన్న పువ్వులఁబోలు పొక్కిళ్లు బయలుగా
గట్టనేర్తురు చీర కటిభరమునం
దొడువంగ నేర్తురు నిడువ్రేలుఁ జెవులందు
నవతంసకంబుగా నల్లిపువ్వు
పచరింపనేర్తురు పదియాఱువన్నియ
పసిఁడి పాదంబులఁ బట్టువెంప
పయ్యెదయు సిగ్గుఁ బాలిండ్లఁ బ్రాకనీరు
తరుచు పూయుదు రోలగందంబు పసుపు
బందిక తెలు సురత ప్రపంచవేళం
గంచియఱవత లసమాస్త్రు ఖడ్గలతలు".

శ్రీ కృష్ణరాయని యాముక్తమాల్యదలో


“వీ డెంపుఁ బటు కేంపు విరిసి వెన్నెలగాయ
పరిగింజ నొకటఁ జిల్వరుస దోమ
సొరసి యెత్తిన మణుం గొందక మైనె నీ
గులుదేరఁ బసువీడి జలకమాడ
ముదుక గాకుండఁ బయ్యెదలోనఁ గేలార్బీ
కలయఁజంటను వెంటఁ గలప మలంద
రతిరయచ్ఛిన్న సూత్రమునఁ జిక్కక ముత్తె
ములు రాల గరగరికలు వహింపం
బొలసినని యెట్టి నరునైనఁ గులము దెలియఁ
బ్రభుత సెడి పల్లవుఁడు వేదవడిన నేద
నృపతి వెలియంతిపురముగా నెన్న మెలఁగ
భాసఁగృతి సెప్పవలంతు లప్పద్మముఖులు",


అన్న పద్యముగా మాఱినది.


ఇట్లు పొడిపొడిగాఁ బ్రాచీనాంధ్ర గ్రంథచ్ఛాయలు కృష్ణరాయల నాఁటి ప్రబంధములలో నెన్నంటినేని గుర్తింపవచ్చును. సర్వ ప్రబంధరచనా సౌభాగ్యములు పొసఁగియున్న 'పారిజాతాప హరణము'ను బురస్కరించుకొని ప్రబంధకవితావిశేషములఁ గొన్నింటిని బేర్కొందును. పారిజాతాపహరణకథాకల్పన మొక ప్రశస్తనాటక కథా కల్పనము! ఎట్లనఁగా -


శచీదేవినగరిలో దేవేంద్రుఁ డుండఁగా శ్రీకృష్ణుని దర్శించుటకై భూలోకమునకుఁ బోఁగోరి దేవర్షియగు నారదుఁడు ప్రభు వగు దేవద్రుని యనుజ్ఞ వడయుటకై యచటికి వెళ్లెను. అప్పుడు శచీదేవి కల్పవృక్షపు దివ్యకుసుమములను గోయించి తెప్పించి పార్వతీసరస్వతీరతిదిక్పాలక పత్నీప్రముఖ దివ్యాంగనల కాపుష్పములను పంపకములు పెట్టి పంపు చుండెను. కడమపుష్పములను దేవేంద్రునిహజారమున శయ్యకు నలంకారముగాఁ బెట్టించుచుండెను. అపుడు సన్నిహితుఁడైయున్న నారదునికిఁగూడ దేవేంద్రుని ప్రేరణమున శచీదేవి యొకపుష్పము నొసంగెను. ఆ పుష్పము నతఁడు 'శ్రీకృష్ణార్పణ మస్తు' అని గ్రహించి భూలోకమునకుఁ బోవుచుంటి నని విన్నవించుకొనెను. దేవేంద్రుఁ డది విని శ్రీకృష్ణునకును, నాతని దేవేరులకును జాలినన్నీ పుష్పముల నీయ శచీదేవిని గోరెను. శచీదేవి యివి దివ్యకుసుమము లనియు, వీని ధరింప దివ్యులేకాని భూలోకవాసు లనర్హులనియు నీ పుష్పముల గౌరవము నిల్పు టావశ్యక మనియు, భూలోకవాసుల కివి నాచేతి మీఁదుగా నొసంగ ననియు నీసడించి పలికెను. నారదుఁడు సత్యభామ పేరెత్తి యేమో సణుగుకొనుచు హజారమును వీడి భూలోకమునకు విచ్చేసేను. ఇది విష్కంభరూపప్రథమాంకపూర్వకథ.


పారిజాతాపహరణముస, బ్రథమాశ్వాసము ప్రథమాంకము. శ్రీకృష్ణుఁడు రుక్మిణియింట వినోదించుచుండుట, యపుడు సత్యభామ చెలికత్తెగూడ నచట నుండుట, నారదునిప్రవేశము, పారిజాత పుష్ప సౌభాగ్యవర్ణనము, శ్రీకృష్ణున కాపుష్పము నొసఁగుట, శ్రీకృష్ణుఁడు నారదసూచనలఁబట్టి కథారహస్య మెల్లఁ గనుగొనుట, నారదుని కనుసైగ చొప్పున రుక్మిణి కొపుష్పము నిచ్చుట - యిత్యాదికము కథావస్తువు. ద్వితీయాంక కథావస్తువుగూడ నిందుఁ గొంత గలసియున్నది. చెలికత్తె సత్యభామతో జరిగిన విషయముఁ జెప్పుటచేత సత్యభామ కోపము, శ్రీకృష్ణుని యనునయము, భూలోకమునకుఁ గల్పవృక్షమును బెఱికి కొనివచ్చునట్లు ప్రతిజ్ఞ సేయుట, స్వర్గగమనము ద్వితీయాశ్వాసే తివృత్తము.


తృతీయాశ్వాసమే తృతీయాంకము. స్వర్గవీథులలో శ్రీకృష్ణుని పయనము, ఇంద్రసత్కారము, ఇంద్రుని హజారమునఁ గాక శ్రీకృష్ణుఁ డదితిహజారమున విడియుట, శ్రీకృష్ణసత్కారాదికము, సత్యాశ్రీ కృష్ణుల వనవిహారాదికము నందలి కథాంశము.


చతుర్థాశ్వాసమే చతుర్థాంకము, పారిజాతోత్పాటనము, ఇంద్ర శ్రీకృష్ణసంగరము నిందలి కథాంశము.


పంచమాశ్వాసమే పంచమాంకము. సత్యభామ తన విభునిచే పారిజాతమును భూలోకమునకుఁ గొని తెప్పించి ద్వారకానగరమునం బ్రతిష్ఠించుట సత్యభామ పుణ్యకవ్రతము చేయుట-సత్యభామ శ్రీకృష్ణుని నారదునకు దానమిచ్చుట-పారిజాత పుష్పములను శ్రీకృష్ణుని పత్నులకు, ద్వారకావాసుల కెల్లరకునుగూడఁ బంచిపెట్టుట శ్రీకృష్ణుఁడు భూలోకమున నుండునంత దాఁక కల్పవృక్షము భూలోకమున నుండున ట్టేర్పాటగుట భూలోకవాసులకు సర్వసౌఖ్యములు సమకూడుట యిందలి కథాంశము. దీనిని నాటకముగా 'నారదవిజయ' మని కాని, 'శచీగర్వభంగ' మని కాని పేర్కొనఁదగును. నారదవిజయ మనుటయే యెక్కువ సంగతము విష్కంభాదిగా నేను జెప్పిన యీ కథాసూత్రమెల్ల నందితిమ్మనార్యుండీ ప్రబంధమున గుర్తింపఁదగినట్లు సూచించియే యున్నాఁడు. నరకాసురు నోడించి స్వర్గమును దనవల్లభునకుఁ గైవస మొనర్చిన సత్యభామమహోప కృతిని మఱచిన శచీదేవికి నారదుఁడు కల్పించిన గర్వభంగమిది! కథామధ్యమున,

“వినుఁడు సురేశ్వరు వనపాలకులు వార్ధం
బొడమిన యీ దివ్యభూరుహమున
కింద్రాణి యెవ్వతె? యింద్రుండు నెవ్వండు?
తోడి యిందిరను గౌస్తుభము నెవ్వం
డధీపుఁడై ధరియించె నతఁడె చేగౌనుఁగాక
తెకతేర యిది యేమి యొకరీ సొమ్మె ?
ఇదె నాదు విభునిచే నీ వదాన్యనగంబు
నాడియించుకొని యేఁగుచున్నదానం
బలుకు లేటికిఁ దా వీరపల్ని యేని
మీ శచీదేవి తనడు ప్రాణేశుఁడయిన
మఘవు నీటఁ దింపి సత్యభామావిధేయు
వలన మరలంగఁ గొనుట పోవానితనము".

అని సత్యభామ యనును.

ఈ విధముగాఁ బారిజాతాపహరణము నాటకధర్మమెంతో సంతనగా సవరించుకొన్న రుచిరప్రబంధము. ఇందు వాచ్యమయిన యీకథేతివృత్తమేగాక వ్యంగ్యముగా నింకొక కథేతివృత్తముగూడ నున్నది. పాచ్యకథలో శ్రీకృష్ణుఁడే వ్యంగ్యకథలో శ్రీకృష్ణదేవరాయఁడు. రుక్మిణీ సత్యభామలే తిరుమలదేవీచిన్నాదేవులు. కవియే నారదుఁడు. ప్రియుఁడగు కృష్ణరాయని యాదరతారతమ్యముచే సతులలోఁ బొర పేర్పడుట. ఆ పొరపును దీర్చి యానుకూల్యముఁ గల్గించి, నందితిమ్మనకవి శ్రీ కృష్ణరాయని తనచెప్పుచేఁతలకు దిద్దుకొనుటయే పుణ్యకవ్రతవిధానము. ఇట్లే మహాప్రబంధము వాచ్చేతివృత్తమునకుఁ జాటున ధ్వనిగా నింకొక యితివృత్తమును వెలయించుచున్న ధ్వనిప్రధానమైన యుత్తమ కావ్యము. ఇందు మహాకావ్యమున కుండవలసిన ప్రయాణోద్యాన వనవిహారజలక్రీడాదౌత్య యుద్ధాది వర్ణనలు బలవంతముగాఁ గావ్యత్వసిద్ధికై కల్పించిన వర్ణనలుగాఁ గాక నాటకకథలో సత్యావశ్యకముగా నపేక్షితము లయిన నాటకాంగములుగానే పొసఁగుట గొప్పచమత్కారము! కవి స్వతంత్రుఁడై యీ కథలోఁ దననాఁటి శ్రీకృష్ణదేవరాయల మహారాజ్య వైభవములతో జోడించి వర్ణించినాడు. ఇవి చదువుడు:


"అమరవిభుఁడు దూరమున నంబుజనాభునిఁగాంచి సంభ్రమో
ధమమునఁ జేతియంకుశముఖంబునం గుంభములూఁది కుంచితా
భీమచరణంబున న్మదకరిన్ డిగి యంసవిలంబికల్పచే
లము నడుమ నిగించుచు నిలానిహితాత్మ శిరఃకిరీటుఁడై. "


ఈ పద్యము"ఎదురైనచోఁదన మదకరీంద్రము నిల్పి, కేలూఁత యొసంగి యెక్కించుకొనియె” సన్నట్టు పెద్దనకుఁ, దనకు, నింక నితరకవులకు శ్రీకృష్ణరాయఁడు గజారూఢుడై యేఁగునప్పుడు జరగుచు వచ్చిన సత్కారములనుబట్టి పుట్టినది.


'జలరుహనేత్రుఁగాంచి సరసత్వము మీఱుఁగ నొక్క చేలుపుం
జిలుకలకొల్కి రాచిలుకచేఁ బిలికించిన సత్యభామ కా
కలికి తెఱంగు శౌరి కడకన్నుల సన్నలఁ జూ షేఁ గోపకం
దళకలుషాయితాక్షి వలనంబుల నా సతీ ద న్నదల్పఁగన్. "


ఈ పద్యము శ్రీకృష్ణరాయఁడు గజారూఢుఁడై దేవోత్సవాదులం దూరేఁ గునప్పు డనుభవించిన యనుభవవిశేషములకు జ్ఞాపకముగాఁ బుట్టినది


"కలికి నిడువాలుఁ గన్నుల
తళుకులు మణిదీపశిఖలుఁ దడఁబడ లక్ష్మీ
నిలయున కిచ్చిరి కొందబు
నెలఁతలు మౌక్తిక విచిత్ర నీరాజనముల్."


శ్రీకృష్ణదేవరాయని యంతఃపురానుభవముల కిది జ్ఞాపకము-

“దరమీలన్నయనంబులై గృహబపార్వారంబుల న్యాముకుం
జరము ల్గండమదభ్రమదృమరికా ఝంకార సంగీత వి
స్పురణల్ సూపుచుఁ గర్జతాళనినదంబు ల్నించ నీ మాగధో
త్కరముంబోలుచుఁ జూడనొప్పి నివె హస్తన్యాసము ల్మీఅంగన్.

" రాయలవారి మొగసాలలో జరుగు ననుభూతుల కిది జ్ఞాపకము .

“తామరలవ్రేటు లాడుచోఁ దరుణు లెత్తు
కరరుహాంకిత బాహువల్లరులు వొలిచే
బిరుదవర్ణావళీ పరిస్ఫురితమైన
పల్లవాస్త్ర జయస్తంభ పటలి యనఁగ" -

పొట్నూరు మొదలగు స్థలములందు రాయలవారు శాసనముల తోడి విజయస్తంభముల నెత్తించుటకు జ్ఞాపకముగా నీ పద్యము పుట్టినది. ఇట్టి పద్యముల నింక నెన్నింటినేని యెత్తి చూపవచ్చును.

“నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చుక
ప్పురవిడె మాత్మకింపయిన భోజన ముయ్యెలమంచ మెప్పుత
ప్పరయు రసజ్ఞ లూహ తెలియంగల లేఖకపారకోత్తముల్
దొరకినఁగాక యూరక శృతుల్ రచియింపు మటన్న శక్యమే?


అని పెద్దనాదు లనఁదగినట్లు శ్రీకృష్ణదేవరాయఁడు తన యాస్థానకవులకు రాజన మలవఱిచి వారిని బోషించినాఁడు గాన వారును నప్పటి రాజులయుఁ, జలయు సుఖానుభూతుల కనుగుణముగాఁ బ్రబంధములను రజోవృత్తి ప్రధానములుగానే రచించినారు. పురాణకృతుల లోని సాత్వికత యిందు సన్నగిల్లినది

కాలక్రమమున నీప్రబంధముల రాజసత విపరీతమై వెఱితలలు వేయఁ జొచ్చినది. ప్రబంధకవితారచనపు మహావైభవమునుగూర్చియే దిజ్మాత్రముగా నీ ప్రశంస.