తుపాను/సౌందర్య దీప్తి

వికీసోర్స్ నుండి

చేసుకోలేకపోయాను. తమ స్నేహానికి నన్ను అర్హుణ్ణి చేసింది నా గురుదేవుడే. ఈ దేహమున ప్రాణాలు తమ మధుర స్నేహాన్ని ఎప్పుడూ వాంఛిస్తూంటాయి. త్వరలోనే మీ భవనానికి మా అమ్మగారితో కూడా వస్తాను. స్వామీజీని, మిమ్మల్ని, ఈ స్వాములను వదలి ఉండడం కష్టం! అయినా గురుదేవుల ఆదేశం నేను ఉల్లంఘించలేనుకడా! తమ అందరి దగ్గరా సెలవుఅన్నాడు.

   జమీందారుడూ, శ్రీనాథమూర్తీ  కౌగిలించుకొన్నారు. శ్రీనాథమూర్తి  నా పదాలకు  నమస్కారం చేశాడు. తక్కిన  స్వాములందరికీ పాదాభి వందనాలు అర్పించాడు. కూలీ లందరకూ మంచి బహుమతులు ఇచ్చాడు. అందరమూ బరువయిన హృదయాలతో  విడిపోయాము.
   శ్రీనాథమూర్తి ముందుయుగం వాడు. అతడు తప్పక  అసలు నిజం కనుగోనడానికే పుట్టాడు. కైలాసేశ్వరుడు అతనికి  చిరాయురారోగ్యాలు, ధర్మనిరతీ, సత్యదీక్షా, పురోగమనశక్తీ ప్రసాదించుగాక!
   ఓం తత్ సత్        
       

సౌందర్య దీప్తి

1

(హేమసుందరీదేవీ! ఇక్కడనుంచి నేనే నా కథను సాగించి పూర్తి చేస్తాను__శ్రీనాథమూర్తి.)

   సౌందర్యారాధన మానవుని  వీరత్వమా?  కళ  మానవునకు  అవసరమే  లేదా?  కళారూపం  ఈలా  ఉండాలని  కళాస్రష్టలకు  ఆజ్ఞలు  ఇవ్వడం  కళకు  మంచిదా, నష్టమా? ఈ  రకం  సాహిత్యం  ఉండాలి, ఈ రకం చిత్రలేఖనం ఉండాలి, శిల్పం ఈ మార్గాల  నడవాలి అని చెప్పడానికి అధికారం  ఉందా?
   నా గురుదేవుడు  జమీందారుగారితో, అనుచరులతో  బయలుదేరి భరతభూమికి ప్రయాణమై వెళ్ళిపోయారు. నాతో వారి శిష్యులు  ముగ్గురు  మాత్రం ఉన్నారు. స్వామీజీ  వెళ్ళుతోంటే తల్లినిబాసే బిడ్డవలె తల్లడిల్లి పోయాను. ఆ  చలిలో, ఆ నిశ్శబ్ద వాతావరణంలో కైలాస  పర్వత కాంతులు  ప్రసరిస్తూ  ఉండగా  స్వామీజీ,  వారి అనుచరులూ  మమ్ము వీడ్కొని ప్రయాణం సాగించారు.
   మా స్వామీజీ  చూపులు  కైలాస పవిత్ర  సందేశాలు. నా కవి  పది ఏనుగుల బలము  ప్రసాదించాయి. స్వామీజీ నా కనులకు  కనబడేతంట వరకూ  ఆ చిన్న  పర్వత  శిఖరం  మీద  చూస్తూ  నిలుచున్నాను. నా దగ్గర ఉన్న  దూరదర్శక యంత్రంతో చూస్తూ  నిలుచున్నాను. వారు లోయలో దిగినప్పుడు  కనబడరు. మిట్టలు ఎక్కినప్పుడు  కనబడినారు. ఆ  యంత్రానికి  కూడా  కనబడనంత దూరం వెళ్ళారు. ఎండ తీక్షణంగా  సాగింది.  నేనో  పెద్ద  నిట్టూర్పు వదలి  ఆశ్రమంలోకి  వెళ్ళిపోయాను. లోపల నా గదిలో కూర్చున్న క్షణంనుండీ  నా కనేక రూపాలయిన  ఆలోచనలు  ఉద్భవించి మాయం  కాసాగినాయి. నాలోని కళావిషయకరమైన  ప్రశ్నలకు  శిల్పాచార్యులైన  ఆ త్రివిష్టప బుద్థ  భిక్షాచార్యులే  సంశయం తీర్చాలి.  పెట్టిన శుభముహూర్తమునుంచీ  శిల్ప, చిత్రలేఖనాలు నేర్చుకోవడం  ప్రారంభించాను.  నేను జూను, జులై, ఆగస్టు  నెలలు ద్యూపాంగు  సంఘారామంలో ఉన్నాను. దారుఫలకంమీద  సన్నని ఉల్లిపొరగుడ్డ  అంటించి,  అది  చిత్రలేఖనానికి అనువుచేసి ,  దానిమీద చిత్రించడం ఒక విధానం. గుడ్డమీదనే  చిత్రించడం  రెండవ విధానం. నేపాలునుండి వచ్చిన  చేతి తయారు కాగితాలమీద  చిత్రించడం మూడవ రకం.  ఈ విధానాలన్నీ నేర్చుకున్నాను. మా గురువుగారు  శిల్ప గ్రంథాలు  రెండు నాకు విపులంగా  వ్యాఖ్యానంతో  చెప్పారు.  మా గురువు గారికి  హిందీ రాదు.  స్వామీజీ శిష్యులయిన  ఒక స్వాములవారు  మా ఇరువురి  మధ్యా  ద్విభాషి అయ్యారు.
   దారుశిల్పం, లోహశిల్పం  తిబెత్తు వాసులకు  ఎక్కువ  ఇష్టం. నేపాలులోనూ అంతే. స్వదేశంలోనే  శిలాశిల్పం  నేర్చుకోవాలి అని సంకల్పం చేశాను. మా గురువుగారు  ఒక దినం  నన్ను ముఖ్యాచార్యులైన కులపతి కడకు  తీసుకొని  వెళ్ళారు. వారు నాకు  లలితకళలను  గూర్చి  ఉపదేశించారు!
    నాయనా! నువ్వా  రోజున చెప్పినట్లుగా  లలిత కళలు ఆనందం కోసం  కదా  మనుష్యునిలో ఉద్భవించాయి!  సరే, ఆ ఆనందం  కూడా  మనుష్యునిలో  ఊరికే ఉద్భవించలేదు అతని  పురోభివృద్దికే  అతనిలోవున్న  సమస్త ఉత్తమ  గుణాలూ తేజరిల్లుతున్నాయి. అట్టి అనందం  అనేది పిచ్చివానికి మాత్రం  వుంటుందేమో! తన జీవితంలో  భాగమైన ఉత్తమ విషయాలు  కళా స్వరూపంతో  దర్శన  మిచ్చినప్పుడు మనుష్యునికి  నిజమైన ఆనందం  కలుగుతుంది.
    ఆకలివేసి, ఆ ఆకలి  తీర్చుకొనుటకు  భోజనంచేస్తే, ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం  తుచ్ఛమే అగుగాక. కాని, ఆకలి తీరడం భౌతికాభివృద్ది కొరకేకదా! ఆనందమూ, భౌతికాభివృద్దీ రెండూ కలసి వున్నాయి  ఆకలి తీరడంలో!  అలాగే  ఆనందం  ప్రయోజనంలో  పరమార్ధం కూడా  వుండి తీరుతుంది.   
    కాబట్టి కళను  ఉత్తమ  ప్రయోజన  స్వరూపంచేస్తే   మానవ  పురోభివృద్దికి  ఎంతో  మహోత్తమ  కళ అవుతుంది.
    స్వామీ! కళాస్రష్ట  సర్వస్వతంత్రుడుకదా, అలాంటప్పుడు అతన్ని ఈ రకంగా  కళ  వుండాలి అని   ఎవరైనా  నిర్భంధింపగలరా?  అన్న ప్రశ్న  నన్ను  బాధిస్తోంది అని  అ లామాను  ప్రశ్నించాను.
   అ వృద్ద  సన్యాసి  చిరునవ్వు  నవ్వాడు. ఆ మందిరం  అ నవ్వులతో వెలిగిపోయింది.
   
           
                                                                                                                  2
   
    నాయనా! నిజంగా  మనుష్యునికి  సర్వ  స్వాతంత్ర్యం వుందా? పుట్టిన దేశం, కుటుంబం, కాలం అతని  స్వతంత్రాన్ని చాలా వరకూ  అరికట్టలేదా? భారతీయుడైతే బానిసగానే పుట్టుతున్నాడుగదా, అప్పుడాతనికి స్వతంత్రం వుందా?  మనుష్యుడు తన  గుణగణాలకి తానే ఆనకట్ట కట్టుకోవాలి గదా? తన స్వాతంత్ర్యం  ఇతరుల  స్వాతంత్ర్యం దగ్గర ఆగాలి కదా?  మానవ ధర్మం, ప్రేమ,  దయ, సత్యమూ, శీలమూ  తన  స్వాతంత్ర్యాన్ని అరికట్టుతాయిగదా!  మనుష్యుడు  పిచ్చివాడయితే విషం పుచ్చుకుంటాడెమో?  కట్టిపెట్టి నరుక్కుంటాడా మంచివాడు? కఱ్ఱ పెట్టి కొట్టుకుంటాడా? అల్లాగే తన కుటుంబానికి, తనకు, తన దేశానికి, సర్వధర్మాలకు వ్యతిరేకమయిన పనులు  చేస్తాడా? అలాంటి కవిత్వం, చిత్రలేఖనం  సృష్టించగలడా? 
    స్వామీ! కేవల  సౌందర్యారాధన రూపమయిన  కవిత్వం  ఎందుకు రాయకూడదు?  సంపూర్ణ  సౌందర్యారాధన  మనుష్యునికి  హాని  కలిగిస్తుందా? 
    సౌందర్యారాధన లేనిదే  కళలు పుట్టనే  పుట్టవుకదా బాబూజీ! కళాత్మకు  సౌందర్యారాధనే మూలశక్తి. ఆ  ఆరాధన ప్రకృతి సౌందర్యారాధనగా, మానవ సౌందర్యారాధనగా, మానవ సృష్టి సౌందర్యారాధనగా,  మానవ చిత్త, గుణ, ఆత్మ సౌందర్యారాధనగా, మానస చరిత్ర  సౌందర్యారాధనగా  వుంటుందిగదా!
    చిత్తం. నా  వుద్దేశంలో,  మానవుడు తన్నే నాయకుణ్నిగా చేసుకొని, తన  ప్రేమ విధానాన్ని నాయికనుచేసి  కావ్యం  సృష్టించవచ్చునా? 
    తప్పకుండా! తన మనస్సు  లేనిది, లలితకళలే లేవుకదా! వస్తువు, దర్శనము చేయువాడు__ఈ ఇరువురి  సంబంధంలో  నుంచి  కదా లలిత కళలు వచ్చేది. ఆ కళలు  రెండు  రకాలుగా సృష్టిస్తాడు. ఒక  దానిలో  వస్తువు  వెనక  తాను  దాక్కొంటాడు.  ఇంకొకదానిలో తానే ప్రత్యక్షమౌతాడు. వస్తుగుణ, మానవ భావ ప్రదర్శనాలు సంపూర్ణంగా  శిల్పి  హృదయ  ప్రదర్శనాలే కదా!
   శృంగారరసానికి స్థానం ఏదండీ? 
    శృంగారరసం కళలో ప్రథమస్థానం వహిస్తుంది. సౌందర్యారాధనే శృంగారరసం. ఉత్తమ శృంగారం  భక్తి. భగవంతుని  అర్చించే భావము మనుష్యునిలో  స్త్రీ  భావము, భగవంతునిలో పురుషభావము  ఆరోపించుకొని గదా భక్తియొక్క శిఖరిత భావం  సృష్టించుకొన్నాడు  మనుష్యుడు! 
   ద్యూపాంగు ఆంధ్రసంప్రదాయ  పరంపరాను గతస్వరూపం  తాల్చింది. ఆంధ్రుణ్ణయిన నేను  అక్కడి  విద్యార్ది నయ్యాను. నా  ఆంధ్రదేశంలో ఇప్పుడు  శిల్ప  చిత్రకళలు  అధోగతిలోవున్నాయి. అవి  పునరుద్దరించడం నా  ధర్మము. దామెర్ల  రామరాయుని  చిత్రలేఖనాలు అనేకం  చూచాను. ఆ ఉత్తమ  పురుషుడు  ఆంధ్రసంప్రదాయం  పునరుద్దరింప  ప్రయత్నం  చేశాడు. ఆ ప్రయత్నంలో  కొంతవరకూ  జయంపొందినాడు. కాని  సిద్ది  లంభింపకుండా అవతారం  చాలించాడు. అందుకనే  అతని  చిత్రాలలో పరిపూర్ణత వచ్చే  స్థితి ద్యోతకం అవుతుంది. వర్ణాలు  ప్రాథమిక  స్థితి  దాటుతున్నాయి. రేఖలలో కర్కశత్వం వీడుతూవుంది. అంగవిక్షేపాలు  లాలిత్యం తాల్చబోతున్నాయి. భావమేళనము పూర్ణత  వహించబోతున్నది. చిత్రాలకు  వ్యక్తిత్వం  వస్తూ ఉన్నది. ఎంత  రసవత్తరమైనా  చిత్రానికీ, చిత్రంలోని పాత్రలకూ వ్యక్తిత్వం ఉండాలి. రామావతారం, కృష్ణావతారం  ఎంత సంపూర్ణ వ్యక్తిత్వ చిత్రాలు! కాళిదాసుని  మేఘసందేశం  వేరు, రఘువంశం  వేరు. అలాగే మనుచరిత్ర వ్యక్తిత్వం వేరు, పారిజాతాపహరణ వ్యక్తిత్వం  వేరు.  ప్రవరాఖ్యుడు, మాయాప్రవరాఖ్యుడు, సర్వోచి ముగ్గురూ  మూడు వ్యక్తులు  అలాంటి  వ్యక్తిత్వం  రామారాయుని  చిత్రాలలో  తేర వెనకనుంచి అవతరిస్తున్నది. అతనికి కృష్ణలీలచిత్రము, సిద్దార్థ యశోధర  చిత్రము  రెండూ ఒకటే. కృష్ణుడికీ, సిద్దార్థుడికీ ఏమీ  తేడాలేదు. యశోధరకూ  ఆమె చెలి కత్తెలకూ ఏమీ తేడాలేదు.  ఆ దోషం  అతని  చిత్రాలన్నింటిలోనూ  మాయం కావడం  ప్రారభించిన  మహోత్తమ  క్షణాల్లో  ఆంధ్రుల  దురదృష్టం వల్ల  ఆతడావతారం చాలించాడు. రవివర్మలో ఇంకా ఎన్నో  దోషాలున్నాయి. రామారాయుని  చిత్రకళ అంతా  కలిపితే  ఒక వ్యక్తిత్వం ఉంది. ఒక మహాతపస్సు  అతని  కళ.
                                                                                                                           
           
               

మూడు నెలలూ ద్యూపాంగు సంఘరామంలో గడిపాను. అక్కడి గురువులు నాకు దారి చూపించారు. ఆ దారిని నడిచి, మజిలీలు చేసుకుంటూ గమ్యస్థానం చేరవలసింది నేను. గురువులందరికడా, కులపతికడా సెలవు తీసుకున్నాను. వారి ఆశీర్వచనాలు పొందాను. మా స్వామీజీ ఆదేశం ప్రకారం ఆ ప్రదేశంలో, చలిలో, ఆ కొండలలో, లోయలలో ప్రయాణంచేస్తూ నేపాలు చేరుకున్నాను. మా గురువుగారి కరుణవల్ల నేపాలు ప్రభుత్వంవారు వారి దేశంలోనికి నన్నూ, నాతో ఉన్న సన్యాసులనూ రానిచ్చారు. నేపాలులో పదిరోజులు ప్రయాణం చేసి కాట్మాండు నగరం ప్రవేశించాము.

   కాట్మాండులో అనేక  దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల వాస్తునిర్మాణం అనేక రీతులుగా  ఉన్నది. భౌద్ధదేవాలయాలు, హిందూదేవాలయాలు  ఉన్నాయి. నేపాలులో  భారతీయ  శిల్పవిధానం ఒక విచిత్ర  పరిణామం పొందింది. భరతదేశంలో అలజడి  సంభవించినప్పుడల్లా కొన్ని కుటుంబాలు నేపాలు  చేరుతూ వచ్చాయి.  వీరికీ, ఆ ప్రదేశంలో  ఉన్న పూర్వవాసులకూ సంబంధాలు కలిగి  మిశ్రమజాతులు  ఉద్భవించాయి. అలాగే  మతాలు  మిశ్రమం  పొందాయి. నేపాలులోని  మధ్యలోయ  ఒకప్పుడొక మహారసస్సట. ఆ సరస్సును  మంజుశ్రీ   శాతవాహనుడనే  ఆంధ్ర  మహారాజు  కొండలు  బ్రద్దలుకొట్టి  దారిచేసి నదులుగా  మార్చి  గంగానదికి ఉపనదులు  చేశాడట.
   ఒకనాడు  ఇక్కడ  ఆంధ్ర శాతవాహనులు  రాజ్యంచేసినట్లు చిహ్నాలు  చాలా ఉన్నాయి. గోదావరినది, కృష్ణానది ఈ  దేశానికి  ఈవలావల ఉన్నాయి. ధాన్యకటకనగరము, -ప్రతిష్టానగరము రెండు పట్నాలున్నాయి. ఇక్కడ శాలివాహనశకము చాలా గౌరవస్థితిలో  ఉన్నది. నేపాలు శిల్పంలో  కూడా పూర్వాంధ్ర సంప్రదాయం మిళితమై ఉండిన  గురుతు  లీనాటికీ  కనబడుతాయి. 
                                                                                                              3
   
   1931వ  సంవత్సరం నవంబరు  నెలలో నేపాలునుండి బయలుదేరి బెంగాలు చేరి, అక్కడనుంచి  హరిద్వారం  వచ్చాను. వచ్చీరాగానే మా గురువుగారి  ఆశ్రమానికి  వెళ్ళి వారి పాదాలమీద  వ్రాలాను. నేను నేపాలునుంచి ఎప్పటికప్పుడు  స్వామీజీకి ఉత్తరాలు  వ్రాస్తూండేవాడిని. ఇండియాలో  కాలు పెట్టగానే స్వామీజీకి  నేను వస్తున్నానని తంతి  ఇచ్చాను. నన్ను  ఆశీర్వదిస్తూ  స్వామీజీ చిరునవ్వు  నవ్వుతూ, నన్ను లేవనెత్తి, ఆసనంమీదే  కూర్చుండుమని సైగచేశారు. నేను కూర్చోగానే  స్వామీజీ నన్ను  కుశల ప్రశ్నలడిగి, నేపాలుదేశ  యాత్రా  విషయాలన్నీ  తెలుసుకున్నారు. నేపాలునుంచి  స్వామీజీకి నేను  వ్రాసిన  ఉత్తరాలతో కలిపి  మా అమ్మగారికి  ఉత్తరాలు  వ్రాయడం  సాగించాను. వానిని  స్వామీజీ  ఎప్పటికప్పుడు  భట్టిప్రోలు పంపిస్తూ  ఉండేవారు. నేను  భరతభూమిలో కాలు పెట్టగానే,  స్వామీజీ నేను వస్తున్నానని మా అమ్మగారికి  తంతి ఇచ్చారు. నేను వచ్చిన మరునాడు  మా అమ్మగారు  హరిద్వారం వచ్చారు. నేను స్టేషనుకు  వెళ్ళి, బండి వెతుకుతూ, మా అమ్మగారూ, మా సుబ్బులూ కలసి  బండి  దిగడం చూచి అక్కడకు  పరుగెత్తాను. ఇద్దరూ నన్ను ఒక్క  నిమిషం  తేరిపార చూచారు!
    ఒరే బావా! అంత  మారిపోయా వేమిటిరా? 
    ఏం  మరానురోయి! జబ్బుగా లేదుకదా, కొంపదీసి! 
    ఛా! ఛా! ఏం పాడుమాట. నీ  చిన్నతనంలోని  వెన్న ముద్దలరూపం నిరుడు మాడి నల్ల పడిపోయినది. చిక్కిపోయి, మొగాన్ని నల్లని మచ్చలు, కళ్ళ కింద  నలుపులు, ముడతలుపడి, జుట్టు అక్కడక్కడ  తెల్లబడి, నలభై  ఏళ్ళా అన్నట్టుగా కనబడ్డావురా! ఇప్పుడు నీ ఇరవై  ఏళ్ళరూపూ  కనబడుతోంది. జుట్టు  బాగా  నల్లబడింది. ఏదో గంభీరత ఉంది నీ రూపుల్లో  మోము వెలుగుతున్నట్లుందిరా!     
   మా అమ్మ, అప్పుడు  నన్ను చూచి, నాన్న! నీ  ఆరోగ్యం  ఇప్పుడు  చాలా బాగుందిరా! నిన్ను ఆనవాలు  కట్టలేకపోయానురా! 
   నేను : అమ్మా! నా  ఆరోగ్యానికేమీగాని, నువ్వు  బొత్తిగా  చిక్కిపోయావే!
   అమ్మ : నీకోసం ఏదో బెంగ. మళ్ళీ స్వామీజీని  తలుచుకొని ధైర్యంగా  ఉండేదాన్ని. ఈవాళ  నిన్ను  చూడగానే  నాకు  కలిగిన  ధైర్యం వేయి ఏనుగుల  బలం ఇచ్చిందిరా! 
   మా  అమ్మా, నేనూ  స్వామీజీ  దగ్గర  నెలరోజులు వున్నాం. అనేక విషయాలు  వారితో చర్చించేవాణ్ణి.  స్వామీజీ  ప్రతి విషయమూ పండు ఒలిచి  చేతికిచ్చినట్లు చెప్పేవారు. స్వామీజీకి విపరీత మేధ. వారు ఆంగ్లదేశము, యూరోపు, అమెరికా  అన్ని దేశాలు  తిరిగారు. శాస్త్రపరిశోధన ఈనాటికి  ఎంతవరకు  వచ్చిందో వారికి  పూర్తిగా  తెలుసును. మేము వారి ఆశ్రమంలో  ఉన్న  నెలరోజులూ అనేకమంది శిష్యులువచ్చి  స్వామీజీ  దర్శనం  చేసి వారి  మాటలు  విని  ఆనందించి వెళ్ళిపోతూ  వుండేవారు. 
   మా సుబ్బులు తిరిగి  భట్టిప్రోలు వెళ్ళిపోయాడు. మా అమ్మగారిని  తీసుకొని  శీతాకాలమని జగన్నాథం  వచ్చాను.  ఫిబ్రవరి నెల  వచ్చేవరకు  జగన్నాథం, భువనేశ్వరం, కోణార్కం, సాక్షిగోపాలం, శ్రీకూర్మం, ముఖలింగం మొదలైన ప్రదేశాలన్నీ చుచాము.
   నేను నేపాలునుండి  హరిద్వారం రాగానే  నా చిత్రలేఖనాలన్నీ మా గురువుగారు  పరిశీలించారు. నేను కైలాస పర్వతం  చేరేవరకూ  వేసిన బొమ్మలు ఒక రకం  అన్నారు. అక్కడనుంచి  వేసిన  బొమ్మల  స్వరూపమే మారిపోయిందట.  హిమాలయ  పర్వతాలలో  మొదటి  యాత్రాస్థలాల్లో ఉన్న ఎత్తేనా మొదటిభాగం  బొమ్మలట. రెండవభాగం బొమ్మలు, హిమాలయం నడిగడ్డపై ఉన్న  ఎత్తును  తెలియజేస్తాయట.  1932ఫిబ్రవరి  నెలలో  కలకత్తాలో  నా చిత్రాలన్నీ  ఒక ప్రదర్శనం  ఏర్పాటు చేశారు స్వామీజీ. వాటి ఖరీదులు  ఆయనే  పెట్టారు. స్వామీజీని, ద్యూపాంగు  ఆశ్రమాన్ని, ఆశ్రమంలో  శిల్ప  గురువును  రచించిన  చిత్రాలు కొన్ని, కైలాస  పర్వతేశ్వరుని  చిత్రాలు కొన్ని, నేపాలు  కొన్ని నేను అమ్మనన్నాను.                                                                                                                           
           
               

నా బొమ్మలన్నీ నూట డెబ్బది ఎనిమిది ఉన్నాయి. నేను తీసిన స్కెచ్చిలు మూడు వందల ఏభై ఉన్నాయి. నేను అమ్మదలచుకోనివి తప్ప తక్కిన బొమ్మలలో అయిదు తప్ప తక్కినవన్నీ అమ్ముడై నాకు పదివేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు వచ్చినాయి. మోడరిన్ రివ్యూ, అమృతబజారు పత్రిక, స్టేట్సు మన్, వంగబాణి మొదలైన వంగ భాషా పత్రికలు నా చిత్రలేఖనాన్ని చాలా ప్రశంసించాయి. నా చిత్రాలలో కొన్నిటి ప్రతిరూపాలు కూడా ఆ పత్రికలో ప్రకటించాయి. ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, ఈ పత్రికలను చూచి వార్తలు ప్రకటించాయి. వీనిలో నా పేరు టి. శర్వరీభూషణ్ అని పడింది. నా వారెవ్వరికీ శ్రీనాథమూర్తే ఈ చిత్రకారుడు అని తెలియదు. మార్చినెలలో మా అమ్మా, నేనూ తిరిగి హరిద్వారం చేరుకున్నాము. అక్కడ పంచలోహాత్మకంగా కొన్ని విగ్రహాలు పోతపోశాను. నచ్చనివి తిరిగి కరిగించి వేశాను. నేపాలులో విగ్రహాలు పోతపోయడం, అవి బాగుచెయ్యడం, మెరుగు పెట్టడం నేర్చుకున్నాను.

   మార్చి  నెలాఖరున  మా అమ్మా, నేనూ, మా సుబ్బులు హిమాలయ  యాత్ర  ప్రారంభించాము.  మా  అమ్మకు  బదరిలో  జ్యోతిర్దర్శనము చేయించాలని  నా కోర్కె.  మా అమ్మ, నేనూ కలిసి బదరీక్షేత్రం ముందర దర్శించాము. అక్కడినుండి  కేదారేశ్వరం,  కేదారంనుండి గంగోడ్తరి, గోముఖం, అక్కడినుండి  యమునోత్తరి సందర్శించాము.  మాతో  మా సుబ్బులు  రావడం నా  కెంతో ఆనందమయింది. మా అమ్మగారి  ఆనందానికి పరిమితిలేదు. ఆమెకు  నిజంగా  వేయి ఏనుగుల  బలం  వచ్చినట్లే  అయింది.
       
                                                                                                                4
   
   1931 నుంచి  నాకు  ఎనిమిది సంవత్సరాలు  ఎడతెగని  కళారాధనే. అననుభూతమైన  సౌందర్యదీప్తిలో  స్నాతుడనై  ఆ  సౌందర్యారాధనకే  దేశాలు తిరిగాను.   నా దేశంలో  జరిగిన  స్వాతంత్ర్య యుద్దాన్ని గూర్చి  మా సుబ్బులు  నాకంతా  చెప్పాడు. గ్రంథాలయాలకుపోయి 1930  మార్చి  నుండి  ప్రారంభమైన  దండి సత్యాగ్రహ  లవణయాత్రనుగూర్చీ, దేశం  అంతా  అనేక  లక్షల  దేశభక్తులు   ఈ స్వాతంత్ర్య సమరాగ్నిలో ఆహుతైన విషయమూ తెలుసుకొన్నాను. 
   నా శకుంతల  నన్ను  విడిపోయిన దుఃఖంలో  మునిగిపోయి, పశువునైనా చుట్టూ  జరిగే  మహాశాంతి  సమరంలోని  దివ్యసందేశము గ్రహించలేకపోయాను. ' ఎవ్వరీ  మహాత్ముడు? ' అన్న ప్రశ్న అప్పుడు  వేసుకున్నాను.  నేను చదువుకునే  రోజులలో  మహాత్ముని గురించి  నాకు తెలియకపోలేదు. అఖిలభారత జాతీయ  మహాసభ  ఉందనీ తెలుసును. ఖద్దరు  సంగతీ  ఎరుగుదును.  నేను తొమ్మిదేళ్ళ  బాలుడుగా  ఉన్న రోజులలో గుంటూరు  జిల్లాలో జరిగిన  ప్రథమ  సత్యాగ్రహ  చరిత్ర  పూరాణగాథలా విన్నాను. ఉప్పు సత్యాగ్రహ  యుద్ధం  అనేక  రామాయణ  భారతాదుల  సంపుటి! భారతీయాంగనలు వేలకు వేలు  జైళ్ళకుపోయారు. దెబ్బలు తిన్నారు, అవమానాలు పడ్డారు,  ప్రాణాలు అర్పించారు.  ఆ  యుద్దచరిత్రలో  ఆంధ్రదేశమూ  ప్రశంసాపాత్రమైన పాలు పుచ్చుకుంది. నా దేశానికి  స్వాతంత్ర్యం, నాదేశం  తన తొల్లింటి  ఔన్నత్యదశకు రావడం ఇవి  నా  సర్వజీవితమూ  నిండిన  ఆలోచనలు.
    సుబ్బులుబావా! నా  శకుంతల  నన్ను  వీడిపోయింది. ఆ  దేవిని  నేను  ఎప్పుడు  కలుసుకోగాలనో  నాకు తెలియదు.  ఆమెను కలుసుకోగలిగే పవిత్రత  నేను  సంపాదించుకోవాలి.  పశువులా  సంచరించిన ననుర  స్వామీజీ రక్షించాడు. ఇంక తరువాయి పని నాది. ఆ  రోజుల్లో నన్ను  కంటికి రెప్పలా కాపాడిన  నిన్ను  మరచిపోలేనురా! యింక  మా కొల్లిప్న విషయాలు, భట్టిప్రోలు విషయాలు  సావకాశంగా చెప్పు అని ద్వితీయ హిమాచల  ప్రయాణారంభంలోనే అడిగాను.
    మీ మామగారూ, అత్తగారు  కొల్లిపరలో  ఉండలేక, మీరు వెళ్ళి పోయినట్లే  వెంటనే  మదరాసు  వెళ్ళిపోయారురాబావా! మీ  అత్తగారికి చాలా జబ్బు చేసింది. వైద్యానికి  మంచిది  అని చెన్నపట్నం చేరారు. అక్కడ  వాళ్ళ  చిన్నమ్మాయికి  చదువు చెప్పించుకుంటూ  ఉన్నారు. అక్కడే  మైలాపురంలో  ఒక చక్కని మేడ కొనుక్కున్నారట!   నేను చెన్నపట్నం  వెళ్ళలేను. మా మావగారినీ,  అత్తగారినీ చూస్తే నేను  ముక్కలయిపోతాననే  భయం  నన్నువదలలేదురా! 
    అది నీ   యిష్టం. ఇంతకూ నువ్వేమి  చేయదలచుకున్నావు? 
    హరిద్వారంలో  స్వామిదగ్గరగా  ఉండి  కొంతకాలం  గడుపుతాను. ఇక్కడ  రెండేళ్ళపాటు  సంస్కృతం  చదువుకొంటాను.  బొమ్మల విషయము  చూచుకొంటాను. భారతీయ కళలకు  సంస్కృత సాహిత్య  మహాసముద్ర మథనం  కొంత ఉండాలి. ఏమంటావు? 
     నీ యిష్టంరా! కాని  మధ్య మధ్య  భట్టిప్రోలు  రావా ఏమిటి? బందరూ  అవీ  వెళ్ళి వదినలను, వారి పిల్లలను, మీ బావగార్లను చూస్తూ వుండు మరి? 
    అయ్యో  రానాయేమిటి! ఏడాదికి ఒకసారైనా వస్తాను, అక్కయ్యల నిద్దరినీ చూడను మరి! వాళ్ళను, మా  మేనకోడళ్ళను, మా మేనల్లుళ్ళను చూచి  నూరు  సంవత్సరాలయినట్లు ఉందిరా! 
    అత్తయ్య  కూడా  ఇక్కడే  వుంటుందా? 
    ఆ! ఇక్కడ  నేనున్నంతకాలమూ  వుంటుంది. నేను యెక్కడికైనా  మా అమ్మరాలేని  ప్రదేశాలకు  వెడితే  మాత్రం, మా అమ్మను  భట్టిప్రోలు పంపుతాను. 
   మా  హిమాలయయాత్ర  పూర్తికాగానే  మా సుబ్బులు  వెళ్ళిపోయాడు. నేను రెండు సంవత్సరాలు  హరిద్వారంలో  సంస్కృతం  దీక్షతో  చదువుతూ  పంచకావ్యాలూ  లఘుకౌముదీ పూర్తిచేశాను.  ఆ  రెండు సంవత్సరాలలో  ఒకసారి, మా పెద్దక్కగారి  ఊరు బందరూ, మా చిన్న  బావ  వుద్యోగం  చేసే  నరసారావు పేటా వెళ్ళాము. మా పెద్దబావగారు  బందరులో  వకీలు. నెలకు రెండు మూడు  వందలు  వృత్తిలో  వస్తాయి. పొడుగ్గా  వంగిపోయినట్లు  వుంటాడు. వారికి సాలుకు  మూడు  నాలుగువేల  రూపాయలాదాయం  వచ్చే వసతీ వుంది.
                                                                                                                             
           
               

మా పెద్దక్కగారి పేరు వెంకటరంగమ్మ. ఆమె కొంచెం పొడుగ్గా బలంగా వుంటుంది. అచ్చంగా మా నాన్నగారి పోలిక. తన కుటుంబం' తన భర్త, తన చుట్టాలు తప్ప ఇంకోవిషయం ఏమీ తన కక్కరలేదు. ఆవిడకు ఆ ముప్పది ఒకటో సంవత్సరానికే ఆరుగురు సంతానము. ప్రథమ సంతానం ఒక కొడుకు. వాడిప్పుడు స్కూలు ఫైనలు పాసై ఇంటరు సీనియరు చదువుతున్నాడుల్. వాడు చక్కని బొమ్మలు వేస్తాడు. మేనమామ పోలికే అని వాణ్ణందరూ అంటారు. వాడి పేరు విశ్వనాథం. వాడి తర్వాత ఇద్దరాడ పిల్లలు. పెద్దదానికి పెళ్ళి అయినది. దాన్ని గుడివాడ ఇచ్చారు. దాని పేరు సరోజిని. మా రెండో మేనకోడలు సరళకు శారదాశాసనం వస్తుందని తొమ్మిదవ ఏటనే మా బావ నేను కాశీలో వున్న రోజుల్లో పెళ్ళిచేశాడు. మా అమ్మ అప్పుడు బందరు పెళ్ళికివెళ్ళి వచ్చింది. తర్వాత కొడుకు రామకృష్ణుడు, ఆ తరువాత కూతురు శారద, ఆ తర్వాతా కూతురే. దాని పేరు లక్ష్మి అని పెట్టారు. అది పాలబిడ్డ, పిల్లలందరూ కడిగిన ముత్యాలులా వుంటారు.


                                                                                                          విష్కంభము 
       
                                                                                                                 1 
   హేమసుందరీదేవి   త్యాగతి  చరిత్ర  ఇంతవరకూ చదివేసరికి  తెల్లవారిపోయింది. ఒక్కొక్కభాగం,  ఒక్కొక్క ప్రకరణం  చదవడం, ఏదో ఆలోచనలో మునిగిపోవడం ఈ రకంగా  సాగింది ఆ బాలిక  చదువు. లోకేశ్వరి  ఆమె చదవడం  చూచి, చూచి  నిదురకూరింది.  బాగా తెల్లవారగానే  లోకేశ్వరికి  మెలకువవచ్చి,  చటుక్కునలేచి, క్రిందకుఉరికి,  అయ్యో ఎంత  పొద్దుపోయిందే హేమ్! నేను  ఈవాళ  చెప్పవలసిన  పాఠాలు  తయారుచేసుకోలేదు. స్నానం  చెయ్యాలి. తల దువ్వుకోవాలి. అయ్యరుగారికి  ఫలహారాదులకు  ఏమీ  అందివ్వలేదు. అమ్మ  ఏమనుకుంటుందో? అంటూ  గదితలుపు  తీసి  పరుగెత్తింది.  హేమసుందరి  లోకేశ్వరి  అన్న  ముక్కలే  వినిపించుకోలేదు. ఆమె హృదయంలో  కోటి  ఆలోచనలు  నిండిపోయాయి. ఒక మహాసభకు  చేరిన  మహాజనంలా  ఆమె ఆలోచనలు  మూగాయి. ఆ జనాని కంతకూ  ఉపన్యసించే  ఉపన్యాసకునిలా  ఒక్క విషయం  మాత్రం  అన్నింటికన్నా  ముందుగా  అడ్డం  వస్తూన్నది. త్యాగతి తన బావ. ఇంత వరకు  తాను ఫలానా  అని  చెప్పకుండా  తనదగ్గర  అలా మెలగడానికి  కారణం ఏమిటి?  కారణం! కారణం! కారణం! రేపు అతన్ని  ఏమని  పలకరించగలను?  అతనితో  ఎంతో  మహత్తరమైన  చరిత్రకూడా వస్తూ వున్నది. ఆ సుశీలతో  సంబంధం  కలిగించుకోవడం తన అక్కగారి  దివ్యస్మృతికి  అపశ్రుతి, ద్రోహం అర్పించాడా?  ప్రేమ  ఉత్కృష్టం అయితే, ప్రేమ నిధానం దుర్మరణానికి పాలయితే, అంత  అథోగతిలో  పడాలా ఏ  వ్యక్తయినా? స్త్రీని  అంత  నీచంగా  తన  కాంక్షలు  తీర్చే  బజారు  వస్తువుగా మాత్రం చూచాడు!  అయితే  ఆ వెనక  అతడు  పడిన  బాధ? తన ఆవేదన  నుంచి  అతడు  పారిపోయిన  మోస్తరు?  స్వామీజీ  అతనికి  సందర్శన  మీయకపోతే, ఆతని గతి  ఏమయి  ఉండును! గంగానదిలోపడి  ప్రాణం పోగొట్టుకొని ఉండును! ఆ  దుఃఖంతో  అతని తల్లీ  ప్రాణం  వదిలేసి ఉండును. 
   ఏడాదికావచ్చింది  ఇతడు తన జీవితచరిత్రలో ప్రవేశించి! ఈతడంటే తనకున్న  భావాలేమిటి?  తన  స్నేహితులతో, స్నేహితురాండ్రలో  త్యాగతే గొప్పవాడు. ఆతడు  చిత్రకారుడనీ, శిల్పిఅనీ  తాను  బాగా ఎరుగును. కాని  అతడెవరో  తన  తలిదండ్రులకు  మాత్రం  పూర్తిగా  తెలిసి ఉండాలి.  ఆమె తన స్నేహితులతో  కూడి  త్యాగరాజనగరంలో వున్న ఆతని  శిల్పశాలకు  ఎన్నిసారులో  వెళ్ళినమాట నిజమే! రెండు మూడు సార్లు  త్యాగతి  తల్లి  తన అక్క  అత్తగారులా  వచ్చి తన్ను  దగ్గరకు తీసుకోవటం  తానేదోరకంగా  అర్థంచేసుకుంది. ఆ  రోజుల్లో  తన అక్క  అత్తగారు  తమ్ము  చూడడానికి  కొల్లిపరనుంచి  వచ్చిందని తాను అనుకున్నది. ఆమె  త్యాగతి  తల్లి  అని ఎరుగదు. త్యాగతికి  తల్లి వున్న  సంగతే  తనకు తెలియదు. లోకేశ్వరికి  ఈ విషయం  ఎప్పటినుంచి  తెలుసును?
   ఎక్కడైనా  ప్రపంచంలో, ఈ  1941వ  సంవత్సరంలో, ఒకడు తానెవరో  తన  మరదలకి  తెలపకుండా  వుండగలడా? ఇది  కథ అనుకున్నాడా, సినీమా అనుకున్నాడా? ఇందుకు  తానేమి  చెయ్యాలి? తన అమ్మ  నీరసస్థురాలు, ఎప్పుడూ జబ్బుతో మూలుగుతూ వుండేది. తన అక్క  శకుంతలా దేవి మాయమైపోవడంవల్లనే    తన   తల్లికి   అలాంటి   జబ్బుస్థితి   సంభవించింది.  అలాంటి  జబ్బుమనిషి  త్యాగతితో మాట్లాడుతూ   బాగా  తేరుకుంది.  తల్లిదండ్రులుకూడా  తన కాతనగూర్చి  చెప్పకుండా  ఎల్లా  వుండగలిగారు?  తన ఒక్కదానికే  ఈ విషయం  తెలియకుండా  వుంచడంలో వుద్దేశం  ఏమిటి?  లోకేశ్వరిగూడా తెలుసునా?  అందరూ తన్ను  మోసం  చేయదలచుకొన్నదానిలో అర్థం  ఏమిటి?  తాను పరీక్ష ప్యాసయింది  1940 సంవత్సరం ఏప్రిల్ నెలలో.  ఈ  రోజు  ఫిబ్రవరి 1941సంవత్సరం. త్యాగతి  తనకు  ప్రథమ  పరిచయం  అయినది 1939డిశంబరు 26వ  తారీకు. ఆ  తారీకు తానెప్పుడూ మరచిపోలేదు.
   అడయారులో  అఖండోత్సవం  జరుగుతున్నది.  దేశదేశాలనుండి  ప్రతినిధులు, ప్రేక్షకులు  వేలకువేలు  వచ్చారు. ఆ  రోజున  రుక్మిణీ అరండేలుగారి  నాట్య  ప్రదర్శనం  సాయంకాలం ఆరు నుండి  ఎనిమిదిన్నర  వరకూ జరుగుతుంది. ఆ  ప్రదర్శనం  చూడడానికి ముందే  పదిరూపాయల  టిక్కెట్లు కొనుక్కొని  హేమసుందరి  జట్టువారూ,  ఆమె తల్లిదండ్రులూ  వచ్చారు. లోకేశ్వరి వచ్చింది. లోకేశ్వరి అని పేరు  హేమ పెట్టింది. ఆమె ప్రతి విషయం  తెలుసుకోవాలని  పుస్తకాలు  తింటుందట. అందుకు లోకేశ్వరి  అని హేమ  పేరు పెట్టింది.  ఆ పేరే  అందరూ  ఎరుగుదురు. అసలు  పేరు వెంకటరత్నమ్మ. కల్పమూర్తి అసలు పేరు  శ్రీనివాసరావు. కల్పించనన్నా  కల్పించలేనివాడనిన్నీ, ఏ  ప్రథమ  రాతి  యుగానికో  చెందినవాడనిన్నీ చెప్పి  కల్పమూర్తి  అని పేరు  పెట్టింది హేమ. నిశాపతి అసలు పేరు   జగపతిరావు. నల్లగా ఉండే  మనుష్యుడు  వట్టి  'నిశ' వంటివాడు కాబట్టి  అతడు  నిశాపతి  అని హేమసుందరి  నామకరణం  చేసింది.  తీర్థమిత్రుడు పేరు  జానకిరామమూర్తి  అతని  చిన్నతనంలో  అతని  తల్లిదండ్రులు  యాత్రలు  చేసేటప్పుడు  తమ  బాలుణ్ణికూడా  తీసుకువెళ్ళారని అతడు  కోతలుకోస్తూఉంటే  అతనికి  తీర్థమిత్రా అని  బిరుదనామం  ఇచ్చింది కొంటెపిల్ల  హేమ. అవే  సార్థక  నామాలయ్యాయి! ఆ  రోజున  సోఫీ, లోకేశ్వరి, ఈ  ముగ్గురు పురుష స్నేహితులూ   హేమ తలిదండ్రులతో అడయారుకు   అయిదుగంటలకే  వేంచేశారు. అక్కడ  అడయారు కళాక్షేత్ర బాలబాలికలు రచించిన చిత్రలేఖనాలు  ప్రదర్శించారు. ఆ ప్రదర్శనం చూద్దామని  వీరంతా  అక్కడికి  వచ్చేసరికి  వీరికి  ఎదురుపడ్డా  డొక పురుషమూర్తి.
                                                                                                                           
           
               
అతడు అయిదడుగుల  తొమ్మిదంగుళాలున్నాడు. బలసంపద  గలవాడు, పొడుగాటి ఖద్దరు  పట్టులాల్చీ తొడుగుకొని, ఖద్దరుపంచె కట్టుకొని, ఖద్దరు  గుజరాతి  టోపి ధరించి, చక్కని  చేతికఱ్ఱతో  ప్రత్యక్షం  అయ్యాడు. వీరి  జుట్టు  చూడగానే, అతడు రెండంగలలో వీరి దగ్గరకు వచ్చి, వినాయకరావుగారికి, ఆయన భార్యకూ  వంగి  పాదాలకు  నమస్కరించాడు.
    ఓహో  త్యాగతి  శర్వరీభూషణుడా! ఎప్పుడు వచ్చావోయి, మన దేశాన్నుంచి?  అని వినాయకరావుగారి  కళ్ళనీళ్ళు తిరిగిపోతూ  వుండగా  అతన్ని కౌగిలించుకొన్నాడు.  కంటినీరు  జలజల ప్రవహించుపోతూ  వుండగా  నాయనా!  ఎన్నాళ్ళకు చుచామోయ్ నిన్ను! గుంటూరునుంచే  వచ్చావా? అక్కడ  మా మరిదిగారు కులాసాగా వున్నారా?  నా తండ్రీ!  ఇన్నాళ్ళకా  నువ్వు  మమ్మల్ని  చూడడానికి  రావడం?  అని  ప్రశ్నలు  కురిపించింది  హేమతల్లి  వెంకటరామరాజ్యలక్ష్మమ్మగారు.  హేమసుందరీ, ఆమె స్నేహితులూ   ఆ నూత్న పురుషుని  తెల్లబోతూ చూచారు.
   
                                                                                                                 2 
   
   వినాయకరావుగారు :  కన్న  నాన్నా,  ఈయన  మనకు  చాలా దగ్గర  చుట్టం. చిన్నతనంలో  మనదేశం   విడిచి  ఉత్తరానికి  వెళ్ళి వుంటున్నారు. ఇప్పుడు  మనదేశంలోనే  ఉంటారు. చిత్రకారులు, శిల్పిన్నీ. 
   త్యాగతి  శర్వరీభూషణుడు అలా  నమస్కారం  చేస్తూ నవ్వుతూ  నిలుచుని  వున్నాడు.
   వినా : నీ   చిన్నతనంలోనే  మన  యింటికి  తరచుగా  వస్తూ వుండేవారు.
   హేమ : అవును. నేను ఆ మధ్య  రెండుమూడుసార్లు  ఈయన పేరు  ఆంధ్రపత్రికలో  చదివాను. ' శిల్పకళ మళ్ళీ ఆంధ్రదేశంలో  విజృంభించాలి' అనే  వ్యాసం  వ్రాశారు. అదీగాకుండా  'పాశ్చాత్యశిల్పం' అనే నాలుగైదు  వ్యాసాలు  భారతిలో ప్రచురించారు.
   త్యాగతి : అవునమ్మా, నేనే  ఆ వ్యాసాలు ప్రచురించింది.
   కల్పమూర్తి : శిల్పం అంటే  మీరు  దేనితో  చేస్తారండీ? 
   త్యాగతి :  లోహం, పాలరాయి, నల్లరాయీ, ప్లాస్టరు  అన్నింటితోనూ చేస్తాను.  ఈ   ఊళ్ళో  దారుశిల్పం   నేర్చుకుందామని ఒకటి రెండు సంవత్సరాలు వుండదలచుకొన్నాను.
   హేమ : అయ్యా  త్యాగతిగారూ! నాకూ  మిమ్మల్ని  బాగా  ఎరిగి  వున్న  స్మృతి  కులుగుతోంది. కానీ  ఎప్పుడో, ఎలాగో  చెప్పుకోలేకుండా వున్నాను.
   త్యాగతి : నీ కప్పుడు  చాలా  చిన్నతనం!
   హేమ : మా స్నేహితులను  మీకు  ఎరుకపరచ అనుజ్ఞ ఇవ్వండి. మా నాన్నగారూ, అమ్మగారూ మీకు  చిరపరిచితులేగదా! వీరు  తీర్థమిత్రులు.  అసలు పేరు జానకిరామమూర్తి, మా సంఘంలో తీర్థమిత్రులు.  ఈ ఊళ్ళో  వీరికి  జీవన్ లాల్, దయాలాల్  కంపెనీలో  ముఖ్య  లెక్కదారుపని.  వీరు కల్పమూర్తిగారు, నిరుద్యోగులు, పిల్లజమీందారులు. అసలుపేరు  శ్రీనివాసరావు, మా సంఘములో  కల్పమూర్తి. వీరు నిశాపతిరావుగారు.  అద్భుతగాయకులు, ఉత్తరాది  సంప్రదాయంలో  అబ్దుల్ కరీంగారి తర్వాత  వీరే. అసలు పేరు  జగపతిరావు, మా పేరు  నిశాపతిరావు....
   త్యాగతి : జగపతిరావుగారు వీరేనా? వీరి పేరు  ఉత్తరాదిని  చాలా ప్రచారంలో ఉంది. ఉత్తరాదివారు వీరిపాటంటే  చెవికోసుకుంటారు. 
   హేమ : అయితే  ఎంతమందికి  చెవులు  లేవండీ?
   అందరూ పకపకా నవ్వినారు. త్యాగతి  ఒక్కొక్కరికే  నమస్కారం  చేస్తూ  కరస్పర్శనం చేశాడు. 
   హేమ : ఈమె  సోఫీ.  అచ్చమైన  ఆంగ్లయువతి. ఈమె  తండ్రి  తాతల  నుంచీ ఇక్కడే ఎస్టేటులు  కొనుక్కొని భారతీయ  జమీందారులయ్యారు. ఈమె  ఇంగ్లండులో పుట్టింది. ఇక్కడ వైద్య  పట్టభద్రురాలు కాదలుచుకున్నది. సంపూర్ణ నామం  మిస్ సోఫియా విలియమ్స్. సర్ డబ్ల్యు విలియమ్స్ గారి  ఏకైక పుత్రిక.
   త్యాగ : నమస్కారం మిస్ సోఫీగారూ , క్షేమమా?
   సోఫీ : మీరు  క్షేమమా?
   ఇద్దరూ  కరస్పర్శ  కావించుకొన్నారు.
   హేమ : ఈమె   మా లోకేశ్వరి, ఆలు పేరు  దూర్వాసుల  వెంకటరత్నమ్మగారు. బి. ఏ. ఇంటరులో  మేం  ఇద్దరం  సహపాఠకులం. మా సంఘంలో  ఈమె  పేరు లోకేశ్వరి.
   త్యాగ : నమస్కారం అండీ లోకేశ్వరిగారూ!
   లోకే : నమస్కారం  శర్వరీభూషణ్ గారూ!
   హేమ : మీరీ  ప్రదర్శనం  చూచారా?
   త్యాగ : మూడుసారులు.
   హేమ : మంచి బొమ్మలున్నాయా? త్యాగ : ఉన్నాయి. బాలబాలికల  బొమ్మలు. వారి  ఈడుకు  తగినట్లే  ఉంటాయి. అందులో  కొందరు  నిజంగా  అత్యుత్తమ  కళావేత్తలు కాగల  సూచనలు చూపించారు. రండి  లోపలికి  వెడదాము.
   హేమకు  ఆ  నూత్న  పురుషుణ్ణి చూడడంతోటే  ఏదో అనిర్వచనీయమైన ఆనందం  కలిగింది. కల్పమూర్తి ఈ కొత్తమనిషి చాలా  పెద్దమనిషి. మంచి విజ్ఞాని  అని అనుకున్నాడు.  ఈయనకు  ఇరవై  అయిదు సంవత్సరాల ఈడు  ఉండవచ్చును. ఈయన  స్నేహపాత్రుడు అనుకున్నాడు. ఎవడు బాబూ వీడు! నియోగులలో  త్యాగతి  ఇంటి పేరు  ఎవరికి  ఉందీ? వీడు వట్టి బాబులురాయుడులా ఉన్నాడు. వీణ్ణి కాస్త దూరంగానే  వుంచాలి అని  అనుకున్నాడు తీర్థమిత్రుడు.  వీడికి కాస్త  సంగీతం అంటే  ఇష్టమేమో? అయినా మన సంగీతం  వినాలి. వీడి బడాయి కనుక్కోవాలి మనం! సరే మనకెందుకు  ఎవడు ఎవడైతే  నేమిటి?  అని నిశాపతి  తలపోసుకున్నాడు. సోఫీ త్యాగతి  మోము ఒకసారి  తీక్షణంగా  చూచింది.  ఇతడు  పాశ్చాత్యదేశాలు  చుచాడా? మనజట్టుకు  తగినవాడే. ఈయన  శిల్పాలు చూసి, ఈతని  తాహత్తు ఎంతో  గ్రహించాలి అని అనుకుంది. లోకేశ్వరి  మాత్రం  త్యాగతి  కళ్ళల్లో తన  స్నేహితురాలిని  అతడు చూచిన  పూజాకాంతులు  చటుక్కున  చూడగలిగింది.  గంభీరమైన  అతని కంఠం  ఎంతో  మధురమైనది అనుకుంది. ఈతనికి  భార్యాబిడ్డలున్నారా? అని ప్రశ్నించుకొన్నది. ముసలాయన  వినయకరావుగారు  అమ్మయ్యా, కాస్తయితే  అసలు పేరు  చెప్పేద్దునేమో!  ఆశ్వత్థామా హతః, కుంజరః!  అనే అబద్దము  చెప్పడమా?  కష్టమే! అనుకున్నాడు. నాతండ్రి  శ్రీనాథమూర్తి! ఎంత ఠీవిగా ఉన్నాడు. నా కన్నతల్లి, నా బంగారుతల్లి,  నా ప్రాణం శకుంతల  ఈతనితో  పిల్లలతో నడుస్తూ వచ్చునుగదా! అని ఆలోచించింది, హేమతల్లి. ఆ  ఆలోచన  తట్టగానే, ఆమె కళ్ళనీరు గిఱ్రున  తిరిగాయి. ఎవరికీ తెలియకుండా  కొంగుతో  కన్నీళ్ళు తుడుచుకొంది.
   వారందరూ  లోనికి పోయినారు. హేమకు  ఎందుకో  పట్టలేని  అనందం కలిగింది. త్యాగతిని ఒక్క నిమిషం వదలలేదు.  చక్కగా, మధురంగా, గంభీరంగామాట్లాడే అతని  సంభాషణ  వింటూ  ప్రదర్శనచిత్రాలూ, వస్తువులూ చూచింది.   ఆ మనిషీమూర్తి  ఎత్తయిన  పర్వతశిఖర శీతలంగా  హాయిగా ఉన్నది.  చక్కని  చామంతి  అత్తరు  పరిమళము  అతని  మూర్తిలో నుంచి  ప్రసరిస్తున్నది.  అతనిలో ఏదో మహాశాంతి  ఆమెకు  తోచింది. ఆ  తిరగడంలో  ఆమెకు  కొంచెం  అతనిచేయి  తగిలినప్పుడు  ఆమెకేదో వివశత్వం కలిగింది.
   
                                                                                                                    3
   శ్రీమతి  రుక్మిణీదేవిగారి  నాట్యం  తంజావూరులో  విజృంభించిన ఆంధ్ర  సంప్రదాయనాట్యం. అలరింపు,  జతి, తానవర్ణము, కొన్ని  పదములు  ఆమె  అభినయించినది. ఆ  నాట్యంలో  ఉండే  అందాలు  శిల్పదృష్టితో  త్యాగతి వర్ణించి  హేమకు  చెప్పాడు.  ఉత్తరాది  నాట్యాలు  అంతకన్న  అంతకన్న లాలిత్యం  తాల్చి సంగీతంలా  ఎక్కువ  మధురమైపోయాయి.  మా శిల్ప  శాస్త్రానికి  నాట్యం  నేర్చుకోడం  చాలా ముఖ్యం. ఆరునెలలు  నేను కథక  సంప్రదాయం నేర్చుకున్నాను  అని  త్యాగతి  ఆమెతో  అన్నాడు.
    కథక్  అనీ, కథకళి అనీ,  భరతనాట్యం అనీ, కూచిపూడి  అనీ, మనిపురం అనీ నాట్యానికి పేర్లు  పెట్టారు. ఆ రకాలు  చూచాను. అవి అల్లా ఎందుకుండాలో  నాకు తెలియదు, చెప్పేవారూ లేరు. నేను వారినీ వీరినీ  అడిగి తెలుసుకోనూలేదు.
    పేరులు ఎందుకువచ్చాయో, అని  ఎల్లా రూఢి  అయ్యాయో, నేను  కొంచెం  తెలుసుకున్నానమ్మా!  అన్ని విధానాలూ  నేను   బాగా  అర్థం చేసుకున్నాను.  ఈ పేరులన్నీ  ఈ మధ్యనే  వచ్చాయి.  అని  ప్రజలలో  వాడుకలోనికి  వచ్చి  రూఢి అయిపోయాయి. 
   హేమా, ఈ  నూతన  పురుషుడూ  అంత స్నేహంగా  మాట్లాడుకోడం  హేమ తల్లిదంద్రులకూ , సోఫీకి  తప్ప  ఇంకెవ్వరికి  ఇష్టం లేకపోయింది. తీర్థమిత్రుడు  మండిపోయాడు. నిశాపతి పళ్ళు బిగించాడు. కల్పమూర్తికి  గుండె నీరసించింది. హేమకు  ఏ. ఐ. సి. ఎస్సో భర్తకావాలి  అని  లోకేశ్వరికి  పెద్ద కోర్కె. ఎవరీ త్యాగతి? ఎక్కడనుండి దాపురించాడు. అని  ఆమెకు  భయం  అంకురించింది. హేమసుందరీ  ద్వితీయుడై  త్యాగతి  రుక్మిణీదేవి నాట్యంలోని అందాలు  చూస్తూ, హృదయం పరవళ్ళెత్తగా తక్కిన సకలలోకమూ  మరిచిపోయాడు.
   మహదానందం  అతని హృదయంలో  ప్రతిధ్వనిస్తుండగా,  ఆ ప్రతిధ్వనికి హేమ  హృదయం  శ్రుతిగా   దడదడ  కొట్టుకొన్నది. యెన్నడూ ఎప్పుడూ  కలగని  యవ్వనానందం  ఆమెను  అలమివేసింది.  ఆ ఆనందానికి  రుక్మిణీదేవిగారి  పాదతాళగతులు  రూపము కల్పించినట్లా బాలకు తోచింది. రుక్మిణీదేవి  భంగిమలో  ఆనందసముద్రవీచికల   రేఖలు కనబడినవి. రుక్మిణీదేవి హస్తాభినయనంలో  సృష్టిలోని  సౌందర్యానికి వ్యాఖ్యానాలు  గోచరించాయి. రుక్మిణీదేవి  కన్నులు  తిప్పుటలో  మానవజీవిత  మహారహస్యాలు నర్తిస్తూ  దృశ్యమైనవి.
   హేమసుందరి  ఇదివరకు  రుక్మిణీదేవి  నాట్యాలు  ఎన్నిసారులో  చూచింది. ఒక ఉత్తమాంగన  నృత్యకళను అత్యంత ప్రజ్ఞతో  ఆరాధిస్తున్నది అన్న విషయం  తప్ప  ఆమెకు  ఇంకోభావం ఇదివరకెన్నడూ కలగలేదు. ఇప్పుడేవో అర్థాలు, ఏదో  మహత్తరశిల్పం  ఆమె  బ్రతుకంతా నిండినట్లయినది. హేమ కిదివరకు  సంగీతం  నేరుచ్చుకోవాలని దీక్ష  కలుగలేదు. తండ్రిగారు  శకుంతలకు నేర్పించి  ఉండడంవల్ల  ఈమెకు సంగీతము  నేర్పించలేదు. ఆమె  ఏ  సంగీత  సభలకూ  వెళ్ళలేదు. రేడియోలో  సంగీతం వస్తే   ఏదో వినేది. నిశాపతి  సంగీతం కూడా  ఆమెకంత  ఆనందం కలిగించలేదు. ఉత్తరాదిపాటలో గొప్పవాడైన  తెలుగువాడు  తనకు  స్నేహితుడు అన్న  బడాయి  మాత్రమే  ఆమెకు  తెరలువీడి ఎదుట  ఒక పరమాద్భుత  గాంధర్వలోకం ప్రత్యక్షమైనది.
   నిశాపతి సంగీతమంతా ఆమె  హృదయంలో  మరల స్వనించినది. రుక్మిణీదేవి నాట్యానికి హంగుగా  పాడే  ఆ  నాదస్వరమూ, వాయులీనమూ సర్వ మధురాలూ, లయమై, జిడ్డులతో గట్లుపొర్లి ప్రవహించినట్లామెకు తోచినవి. తానెందు కిన్నాళ్ళూ సంగీతం నేర్చుకోలేదో! తానేకళలూ  నేర్చుకోలేదు. కవిత్వం నీరసమని  తోసివేసింది. పత్రికలలో  కథలూ, పద్యాలూ పాటలు, సాహిత్యవ్యాసాలూ, కళాప్రవచనాలూ ఎప్పుడూ  చదివేదికాదు. ఎంతసేపూ  రాజకీయాలూ, దేవుడులేడనే  వ్యాసాలూ, శాస్త్ర సంబంధ వ్యాసాలూ చదివేది. తెలుగుభాష  చదువుకోమని లోకేశ్వరి  పోరు పెట్టడంచేతా,  ఎందుకు వచ్చాయో  తెలుగు  పేపర్లన్నిటికీ  నూటికి యనభై  పైన  మార్కులు రావడంచేత,  ఆమె తెలుగు ఆనర్సు తీసుకుంది. ఆ ఆనర్సు పరీక్షకు  సంబంధమైన  తెలుగుమాత్రం  ఆమెనేర్చుకుంది. అందులో మొదటి తరగతేమిటి, విశ్వవిద్యాలయానికి మొదటగానే తాను కృతార్ధురాలు కావచ్చును.  ఆమెకు తెలుగన్నా, సంస్కృతమన్నా అభిమానం వుండి ఆ విషయం  చదవడం  ప్రారంభించలేదు. కేవలం  పరీక్షకోసమే!
   అలాంటిది  నేడు  తెలుగు  ఎంత  మధురమైనది! తాను తెలుగులో  ఎందుకు కవిత్వంచెప్పరాదు? సంస్కృతం దేవభాష. సంస్కృతసాహిత్యం సాహిత్యలోక  పరమావధి,  అనే  ఆలోచనలు  ఆమెను  నిండిపోయాయి. భగవంతుడున్నాడు. అతడు పరమ దయాస్వరూపుడు, ఆనందరూపుడు, సౌందర్యనిధి అనే భావాలు  ఆమెపై  జడివానలా  వర్షించాయి. యెవ్వరో  ఇంకో  వ్యక్తి  తన్ను  అలమి  తనలో  ఇంకిపోయి,  తన సర్వస్వము నిండినట్లామెకుతోచింది. అప్రయత్నంగా ఆమె  త్యాగతి  భుజంమీద  చేయివేసింది. త్యాగతి గజగజ  వణికిపోయినాడు. అతనికి  కళ్ళలో నీరు తిరిగినది. కదలక స్థాణువులా నాట్యం  చేస్తున్నట్లే నటించినాడు.  ఆ  విచిత్ర  దినము  హేమ  ఎన్నడూ మరచిపోలేదు. త్యాగతిని  ఎప్పుడూ రమ్మని  కోరేది. అతనిచే పాఠాలు కూడా  చెప్పించుకునేది.  ఈనాడు  త్యాగతికథ ఇంతవరకూ  చదవగానే  ఆమెకు  భయమూ,  సంతోషమూ అన్నీ ఒక్కమాటే కలిగాయి. హేమ త్వరగా స్నానాదికాలు నిర్వర్తించి, భోజనాల  ఇంటిలోనికి  వెళ్ళి  రెండు ఇడ్డెన్లూ, పెసరట్టు ఒకటీ  ఆరగించి, కాఫీ తాగి తన స్వంత  పరిచారికకు  తాను  పదిగంటల వరకూ  ఎవ్వరికీ  కనబడనని చెప్పి, తన చదువు గదిలోకి  వెళ్ళిపోయింది. అక్కడ రేడియో పెట్టుకొని  రికార్డు సంగీతం వింటూ  మనస్సులోని  ఆలోచనలు పరిపరివిధాల పోతూవుండగా, త్యాగతి కథ తీసిది. వెనుకటి  పేజీలు   మళ్ళీ  ఒకసారి  తిరగ  వేసింది. చదవడం ప్రారంభించింది.

                                                     సౌందర్య దీప్తి

మా చిన్నక్క మా అమ్మపోలిక. కొంచెం నాజూకైన అమ్మాయి. నాకన్న మూడు నాలుగేళ్లమాత్రం పెద్దదిలా కనబడుతుంది. వడవడ వాగుతుంది. పదిమందితో కలుపుకు తిరుగుతుంది. అందరికీ తల్లోనాలిక. అందరి వ్యాపారాలూ తనకే కావాలి. తన వ్యాపారాలందరికీ కావాలి. రహస్యం దాచుకోలేదు. భర్త తహసిల్ దారునిపని చేస్తున్నాడు, ఇంకేమీ! ఆవిడ దర్జాకు ఏమీ లోటులేదు. మా చిన్నక్క పేరు అలివేలులక్ష్మి. ఆవిడకు యిద్దరే బిడ్డలు. ఇద్దరూ కొడుకులే! కూతురు కోసం సరదాపడి ప్రతి అమ్మవారికి మొక్కుకుంటుంది. మా పెద్దక్కయ్య రెండోకూతురును మా చిన్నక్కయ్య తెచ్చుకొని పెంచింది. ఆమె పెండ్లికి పీటలమీద బందరులో తానూ తన భర్త కోటేశ్వరరావుగారూ కూర్చున్నారు.

   ఆమె ఇద్దరి కొడుకులలో  పెద్దవాడు  స్కూలు ఫైనలు చదువుతున్నాడు. రెండవవాడు తర్డుఫారం చదువుకుంటున్నాడు. మా పెద్దబావగారైన కలపటపు మధుసూదనరావుగారు నేనంటే  ప్రాణం  ఇచ్చేవారు.  మా  చిన్నబావ  దావులూరి  కోటేశ్వరరావుగారు మాత్రం  నాకు  సర్వకాలం నీతులు  బోధించడం, చివాట్లు పెట్టడం సాగించారు.
    ఒరే బావా! లక్కరాజువారి వంశానికీ, శేషాచలపతిగారిపేరుకూ  అప్రతిష్ట  తెస్తావేమిట్రా?  అని  భోజనం  దగ్గర  నన్నడిగారాయన.  మా చిన్నక్క సర్రుమని  అందుకుంది.
    ఓహో! దావులూరి వారి వంశానికి  మీరు ప్రతిష్ట  తెస్తున్నారుకదూ!  లక్కరాజువారి వంశానికి  లేకపోతే  పరవాలేదులెండి అని ముగించింది.
    బాగుంది. తమ్ముడంటే  ఎంత  ఆపేక్ష  అమ్మాయిగారికి! తమ్ముడికి  నీమీద  ఇంతేనా ఆపేక్ష  ఉందీ? వెళ్ళి కాశీలో కూచుని, ఉత్తరాలులేక,  అందరినీ ఏడిపించి కైలాసము గియలాసము  తిరిగి వచ్చాడు. బలేబలే
   నేను నెమ్మదిగా  ఆ మాటలు మాన్పించి,  బావా! నాగార్జున  కొండ శిల్పాలు  అంతకన్నా ప్రభుత్వంవారు  బాగా  ఉంచలేరా ఏమిటి?  ఆ రోడ్డు బాగుచేయించకూడదా? అని ఎత్తాను.     బావ: అది పల్నాడు తాలూకారా!  పైగా  ఆ శిల్పాలను  బాగా ఉంచే  బాధ్యత అఖిల  భారతీయ ప్రభుత్వం వారిదిగాని మాకేమీ సంబంధములేదు.
   నేను: బావా!  నీ తాలూకాలో  పూర్వకాలంనాటి  విగ్రహాలు  ఏవైనా  అమ్మకానికి  ఉంటె  చూద్దూ! పాతనాణేలు  కూడా  వదలకు.
   బావ: ఒరే శ్రీనాథం!  నీకు మొన్న  కలకత్తా ప్రదర్శనంలో పదివేలు  వచ్చాయటగా?
   నేను: డబ్బు  సంపాదించడం ఎంత సేపు  బావా! దేశానికీ, జాతికీ సేవ  చేయాలిగాని!
   బావ: గొప్ప  మానవ  సేవకుడవు దొరికినావు! నిన్నూ, నీ కుటుంబాన్నీ పోషించుకొని, ఇతరులను  బాధించకుండా ఉంటే, అదే  దేశ సేవా, మానవసేవాను.
   చిన్నక్క : కాస్తమాటంటే ఏవో  పెడర్ధాలు చేసుకొని ఉడుకుబోతుతనం పడతారెందుకండీ?  
          
   బావ: నాకా  ఉడుకుబోతుతనం, నీకా?  నీ తమ్ముడు  చిన్నారి చిట్టీ, బుల్లాలకూచీ అనుకున్నావా?
   మా బావ పకపకా  నవ్వారు. మా చిన్నక్కకు చాలాకోపం వచ్చింది.
   చిన్నక్క: ఎందుకండీ  ఆ నవ్వు? మా తమ్ముడు  వచ్చినప్పటి నుంచీ చూస్తున్నాను. వాణ్నీ ఒక్కరీతిగా  దులిపిపోస్తున్నారు!
   బావ: ఓసి  నీ  వెఱ్ఱి కాలా! వాణ్ని  నేనేమంటున్నానే!  నాకు  మా బావమరిది  గొప్ప  చిత్రకారుడూ, శిల్పీ అంటే గర్వం లేదనుకున్నావా? కాని  నా ఆపేక్ష  కొద్దీ నాలుగు  ముక్కాలు  సలహా  చెప్పాను. నీ  కెందుకూ అంత కోపం?
   యింతట్లో మా అమ్మ  గుమ్మం  చాటుకు  వచ్చి, అల్లుళ్ళ ఎదుటపడి  మాట్లాడే  అలవాటు  లేదు కాబట్టి, చాటునుండే   అమ్మడూ!  అల్లుడుగారు  మాత్రం  ఏమన్నారు? ఒక్కడే బావమరిది  అవడంచేత ఏదో  సంసారం  నిలబెట్టమనీ, దేశాలుపట్టి పోవద్దనీ చెప్పారు. అంతకన్న వారేమన్నారు?  అన్నది.
   ఓహోహో  శ్రుతిమించి రాగాన  పడుతోంది  అని ఆలోచించుకొని  బావా  నేవు చెప్పిన  మాటలూ బాగున్నాయి!  అక్క  అన్న  మాటల్లోనూ తప్పులేదు. అమ్మా బాగానే  చెప్పింది. నేను స్వామీజీని  నమ్ముకున్నాను. వారు ఎలా నాకు  సలహా  ఇస్తే  అలా చేస్తాను. మీరెవ్వరూ ఏమీ దిగుళ్ళు పెట్టుకోవద్దు  అన్నాను.
   బందరు వెళ్ళినప్పుడూ  ఇల్లాగే  వచ్చింది సభాషణ.  మా పెద్దబావ  నేను వెళ్ళిన  రాత్రే, నన్ను తన ఆఫీసుగదిలోకి పిలిచి  ఒరే శ్రీనాథం! ఏమిటి నీ ఉద్దేశం?  పోయినవాళ్ళను బ్రతికించుకోలేము. శకుంతల అచ్చంగా  దేవతే!  నువ్వు మళ్ళీ ఒక  ఇంటివాడవైతే, ఆ దేవి  ఎంతైనా  ఆనందపడుతుంది. నువ్వు మళ్ళీ హరిద్వారం అత్తగారితో  కలిసి  వెళతానంటున్నావు.ఆస్తి  అంతా  కంగాళీచేసి   వదిలావు. మీ పెద్దక్కకు  నువ్వు  రాసిన భూమి, ఏమీ  పుచ్చుకోను  పొమ్మంది. నువ్వు  ఏమనుకున్నావో  ఏమోకాని, నువ్వు అల్లా  పత్రం  రాసి  రిజిస్టరీ పంపించిన మర్నాటి నుంచీ  నెలలు, నెలలు  తలుచుకొని  ఏడుస్తూవుండేది. నువ్వూ, అత్తగారూ వచ్చిన దగ్గర నుంచి  కాస్త  ఆమాత్రంగా  ఉంది. మా మరదలూ, తోడల్లుడూ విషయం నేను చెప్పలేనుగాని, నీ ఆస్తిలో  మీ పెద్దక్కకు  సంబంధించినంత మట్టుకు  ఒక్క సెంటుభూమి   ముట్టుకోదు. ఆ మాట తెచ్చావా మళ్ళీ  మూర్ఛలు, హిస్టీరియా  ప్రారంభం  అవుతాయి   అని కొంచెం సన్నసన్నాగా  చివాట్లు  పెట్టాడు.

పెద్దబావా! నరసారావు పేటలో మా చిన్నక్కా, చిన్నాబావా కూడా నన్ను చివాట్లు పెట్టి వదిలారు. మనం సావకాశంగా కూర్చుని మాట్లాడుదాం బావా! నువ్వు వకీలువు, నీ సలహా నాకు పూర్తిగా కావాలి అన్నాను.

   బందరులో  ఉన్న రోజులలో  కృష్ణాపత్రికకు వెడుతూ, కృష్ణారావుగారితో  మాట్లాడుతూ ఉండేవాడిని.  ఆయన భారతీయ  శిల్పాన్ని గురించి నాకు పండు ఒలిచినట్లు చెప్పారు. రోజూ వారపత్రిక ఆఫీసులో దర్భారు  జరుగుతూ  వుండేది. వారు  గాంధీతత్వాన్ని గూర్చీ, శంకరవేదాంతము  అరవిందవేదాంతము సమన్వయంచేసి  వెండిపళ్ళెంలో మల్లెపూవు  పేర్చినట్లు చెప్పారు. ఆయనా  జైలుకువెళ్ళివచ్చారు. బంగారుఛాయ, బలమైన స్థూలకాయం, విశాలమైన  కాటుకకళ్ళు, గరుడనాసిక,  గాభీరమైన  ఫాలము, కోర తలపాగా, యవ్వనుని  వుత్సాహమూ,  మహాఋషికున్న జ్ఞానమూ, దేశభక్తీ  ఆంధ్రులలో మకుటాయమానమైన మనిషి. సభలలో  మాట్లాడరు.  మాట్లాడితే  గోముఖసంభవదివ్య  గంగాఝరీవేగమే! విడిగా స్నేహితులందరూ కూడిన  సాయంకాలంలో  చిన్నబిడ్డవలె అల్లరీ  చేయగలరు, యువకునిలా వుత్సాహమూ  ప్రకాశింపచేస్తారు. మానససరోవరనీలజలస్నిగ్థత, కైలాస పవిత్రపర్వత మహోన్నతి తమ  మాటలలో  చూపిస్తారు. ఆయన  కృష్ణాపత్రికలోని  సంపాదకీయ వ్యాసాలూ  ఆంధ్రదేశానికి భాష నేర్పాయి. నవ్య  సాహిత్యపరులకు దారి చూపించాయి.  వారి సభలో  కైలాసము, త్రివిష్టపం, ఆయా దేశాల కళలు, ఆచారాలు, సంస్కృతీ  అన్నీ  మనవి చేశాను. ఇవన్నీ రెండు  మూడు వ్యాసాలుగా వ్రాసి  తమ పత్రిక  కిమ్మని వారు నన్ను కోరారు. అది ఆజ్ఞగా  శిరసావహించాను.
   కృష్ణపత్రిక  ఆఫీసులోనే  పట్టాభి  సీతారామయ్యగారిని దర్శించాను. మేధాసంపన్నత్వంలో  కుబేర   వైభవానికే  అప్పిచ్చే  అఖిల  భారతీయ  ప్రఖ్యాత  పురుషు డీయన.  ఈయన  జ్ఞాపకశక్తి  ఒక  పరమాద్భుత  సంఘటన. చిన్నతనాననుండి ఆయన  తెలుసుకున్న  రాజకీయ  విషయాలు,  తేదీలు పేరులతో సహా  జ్ఞాపకం. ఏ  విషయమైనా  హృదయానికి  హత్తుకునేటట్లు చెప్పగలరు. కాని మన  సంభాషణ  ఆయనకు  చప్పగా  వుంటుంది. అడిగే ప్రశ్నలూ చప్పగా  వుంటాయి. అందుచేత  ఆయనే  సంభాషణ   ఎత్తుకునేటట్లు  చేయాలి. అంత  మేధ వుండడంచేత, ఆయనకు  హృదయం లేదని  అపవాదు వేస్తారు.  మహాత్మునకు  హృదయం  లేదంటే ఎంతో  ఆయనకు లేదన్నా అంతే. ఇంటి దగ్గర ఆయన  చిన్నబిడ్డలతో   ఆడుకొంటూంటే  చూచిన నాకు  కళ్ళనీళ్ళు చెమరించాయి.
   సన్నగా  శలాకులా ఆరోగ్యంగా  అయిదడుగుల  ఆరంగుళాలుంటారు. నెరసినజుట్టు, మధ్య బట్టతల, నాయకుల మాటలు, చేష్టలు  ఆయన  అభినయిస్తే, అసలు  వారినే  మూడుమూర్తులా ప్రత్యక్షం చేస్తారు. వైద్యులలో  చక్రవర్తి అయినా, న్యాయశాస్త్ర  విషయంవస్తే  న్యాయవాడులకే  పాఠాలు నేర్పుతారు. ఆంధ్రదేశంలో  నాయకులైన కోలవెన్ను రామకోటేశ్వరరావు   గారిని, కొండా  వెంకటప్పయ్యపంతులుగారిని, గొల్లపూడి సీతారామశాస్త్రి  గారిని, బులుసు  సాంబమూర్తిగారిని, ప్రకాశంగారిని, బ్రహ్మాజోస్యుల  సుబ్రహ్మణ్యంగారిని  కలుసుకున్నాను, మాట్లాడాను.
   ప్రసిద్ద  కవులైన  వెంకటశాస్త్రిగారినీ, కృష్ణమూర్తి శాస్త్రులుగారినీ, చిలకమర్తివారినీ, వడ్డాదివారినీ, భాషావేత్తలయిన  గిడుగురామమూర్తిగారినీ,  నవకవులలో  వుద్దండులైన రాయప్రోలు సుబ్బారావుగారినీ, శివశంకరశాస్త్రిగారినీ, దేవులపల్లి  కృష్ణశాస్త్రిగారినీ, విశ్వనాథ   సత్యన్నారాయణగారినీ, నండూరి సుబ్బారావుగారినీ, వేదుల సత్యన్నారాయణశాస్త్రిగారినీ, కథకచక్రవర్తి  మునిమాణిక్యం నరసింహారావుగారినీ, మహాకవి  చింతాదీక్షితులుగారినీ, హాస్యరస సామ్రాట్టు మొక్కపాటి నరసింహశాస్త్రిగారినీ, నోరి  నరసింహశాస్త్రిగారినీ  కలుసుకొని  హృదయమార  మాట్లాడినాను.
   కాటూరి  వెంకటేశ్వరరావుగారు  మహోత్తమ  ప్రౌఢకవి. ఆయన కవి పింగళి లక్ష్మీకాంతంగారు  మధురకవిమూర్తి. వీరిద్దరి  జంటా జయ విజయముల వంటి  జంటే.
   దేవులపల్లి  వారిని  కాకినాడలో  కలుసుకున్నాను.  కుఱ్ఱవాణ్ణయినా  నన్ను ఎంతో  గౌరవంచేసి  ప్రేమతో  నింపారు. ఆయన  ప్రపంచంలో  సర్వసౌందర్యాలూ పూజించే  సౌందర్యకవి.  ఆయన  జీవితమే  సౌందర్యం. గుంటూరులో వేదుల సత్యన్నారాయణశాస్త్రిగారిని  కలుసుకున్నాను. ఆయన కవిత్వం  అమృత ప్రవాహం.  అప్పుడే  మాధవ పెద్ది  బుచ్చిసుందర రామశాస్త్రిగారిని కలుసుకున్నాను. ఆయన కవిత్వం  గంగా  ప్రవాహమే. నేను కొల్లిపర వెళ్ళలేదుగాని రేపల్లెవెళ్ళి  నోరినరసింహశాస్త్రిగారిని కలుసుకొని  మాట్లాడాను. ఆయన కవిత్వం  మిశ్రమపాకం. నన్ను తమ్మునిలా హృదయాని కద్దుకున్నారు. ఏలూరువెళ్ళి  నండూరి సుబ్బారావుగారిని  కలుసుకున్నాను. వకీలు వృత్తిలో  సంపూర్ణంగా  దిగిపోయి, సాహిత్యసేవ తగ్గిస్తున్నాడాయన.  ఆయన ఎంకిపాటలు ఎవరో  గంధర్వాంగన పాడినట్లే పాడి, నాకు  వినిపించారు. ఆయన పాటలు  నాకు వివశత్వం  కలిగించాయి. ఎంతో మహోన్నత భావాలు. నాయికా నాయకులు  జానపదులు. ఎంకి ఒక దేవతే! వారింటిదగ్గరే నండూరి సుబ్బారావుగారి  వేలువిడిచిన అన్నగారు భావరాజు  సుబ్బారావు  గారిని  కలుసుకున్నాను. ఆయన కొవ్వూరు సంస్కృత  పాఠశాలా  కులపతిత్వం వదలి  సత్యాగ్రహంచేసి  జైలుకువెళ్ళివచ్చారు. ఆయన  మహా  పండితుడు, ఉత్తమకవి, నాకు కవిత్వాన్ని  గురించి, శిల్పకళను గురించి యెన్నో  మహత్తర  విషయాలు  బోధించారు.
   విశ్వనాథ సత్యన్నారాయణగారు  మహాకవి  శిరోభూషణుడు. ఆయన ప్రతిభ శాంత మహాసముద్రము వంటిది. ఆయన  ధార శివసముద్ర కావేరీ జలపాతంవంటిది. ఆయన  మహాకావ్యాలను  సృష్టించగలరని నేనాశించాను. గుంటూరులో  తల్లావఝలవారిని దర్శించాను. ఆంధ్రదేశంలో కవుల  నందరినీ  ఒక సంస్థగా  చేయాలని  ఆయన  ప్రయత్నం. ఆయన సకల భాషావేత్త, మహాపండితుడు, అఖండకవి. ఆయన్ని చూస్తేనే కవిత్వం ఉద్భవిస్తుంది. ఆయన  శిల్పమూ  నేర్చుకున్నారు. రామిరెడ్డిగారినీ, బసవరాజు అప్పారావుగారినీ కలుసుకున్నాను. బసవరాజువారు ఒక మహాసంస్థ. ఆయన అతి  తీయగా పాడగలడు. ఆయన పాటలు  సర్వవిధాలా క్షేత్రయ్యను జ్ఞాపకం  చేస్తాయి. రామిరెడ్డిగారి కవిత్వం  తీయటిధార. అద్వితీయ ప్రతిభ. ఆయన  బాణి ఆనందవాణే! ఈయన్ను  చూచి  శ్రీకృష్ణదేవరాయుణ్ణి తలుచుకున్నాను.                                                                           

ఈ కవుల తర్వాత నాకు ఎక్కువ సన్నిహితం అయినవారు కురుగంటి సీతారామయ్యగారు. ఈయన తంజావూరులో పూడిపోయిన ఆంధ్రకావ్య మహాసంస్కృతిని బయటకు తీస్తున్నారు. వీరి పాండిత్యం అప్రతి మానము. వీరితో ఉజ్జీ పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రిగారు. ఆయన స్నేహంలో చిన్నబాలుడు. వీరు ఎన్నో మహత్తర గ్రంథాలు తెలుగులోనికి అనువదించారు. వీరిద్దరూ రెండు హిమాలయ శృంగాలు.

   ఆ  రోజుల్లోనే ఏదో  కారణంవల్ల బందరు  వచ్చిన  వేటూరి  ప్రభాకరశాస్త్రిగారిని దర్శించాను. ఆయన మహాకవే, ఉద్దండపండితుడే. అంతకన్న  ఆయనలోని  ఏదోశక్తి ఆయన్ను అపర  నాగార్జునాచార్యునిలా  కనిపింప చేసింది, నా కథంతా  ఆయనకు  నివేదించాలని ఏదో ఆవేదన కలిగి  మనవి చేశాను. ఆయన  నాయనా! నీ శకుంతలను నువ్వు  ఇంకో రూపంలో కలుసుకుంటావు. ఏమీ  సందేహంలేదు. మీ గురువుగారు చెప్పిన  మాటలన్నీ నిజంఅన్నారు.
   గుంటూరులో  శారదానికేతనం అని  బాలికా  జాతీయ  విద్యాలయం  ఒకటి వుంది. అది స్థాపన  చేసినవారు  పురాణ దంపతులైన  లక్ష్మీనారాయణుల  వంటి  లక్ష్మీనారాయణులు. ఉన్నవ లక్ష్మీబాయమ్మగారూ, వారి భర్త  ఉన్నవ లక్ష్మీనారాయణగారున్ను  ఈ ఉత్తమ విద్యాలయం  స్థాపించారు. లక్ష్మీనారాయణగారు బారిస్టరు. గాంధీ మహాత్ముని  సత్యాగ్రహ సమరంలో  వృత్తిమాని జైలుకువెళ్ళి, జైలులో  మాలపల్లి అనే నవల  వ్రాశారు. ఆ  నవల  తెలుగు నవలా  చరిత్రలో  రెండవ యుగానికి  గోపురద్వారం. ఆయన ఎన్నో  జానపద  గీతాలు  ప్రోగుచేశారు. తీయని  నుడికారంలో  పాటలల్లుతారు.
   ఆంధ్ర  చరిత్రకున్న తెరలన్నీ తొలగించి తీయని భాషలో  సమగ్ర చరిత్ర ఇచ్చిన  చరిత్ర చతురాసన  చిలుకూరివారినీ; సుందరమూర్తీ, ప్రతిభాశాలీ, నవనీతహృదయుడూ  అయిన  మల్లంపల్లివారినీ; నిశితబుద్దిశాలి, దూరదృష్టిగల నేలటూరి వెంకటరమణయ్యగారినీ; కాలం తెరలు బలవంతంగా లాగిపారవేసే  ధృతముష్టి  భావోర్వగి  భావరాజు  కృష్ణారావుగారినీ  కలసికొన్నాను. శిల్పికి వెనకాలే  బలం  కవిత్వమూ, సంగీతమూ, నాట్యమూ, చరిత్రా, భారతీయ  సంస్కృతీ అవడంవల్ల ఈమహామహుల కలసికొన్నాను. ఇంక  చూడవలసింది ఆంధ్రగాయకులను, చిత్రకారులనూ, శిల్పులనూ.
   
                                                                                                                       7
   
   ఆంధ్ర సంగీత  పాఠకులలో పేరెన్నికగన్నవారు వాగ్గేయకారరత్న హరినాగభూషనంగారు. ఆయన వాయులీనవాద్యము  ఆనందవీచి, కంఠము మధ్యమ శ్రుతిస్వరూపం. ఆయన సనాతనచారి, గాంధీ శిష్యుడు. సంగీతం విద్యగాని  కళ కాదంటారు. అన్ని  కళలూ జగత్కళ్యానానికి వుపయోగిస్తే విద్యలౌతాయి.  తుచ్ఛానందంకోసం  అయితే, వట్టి హీనకళలౌతాయి.  కళ అన్నంతమాత్రంలో హీనమనే అర్థంలేదు.  కల్యత  ఇతికళా  అని కదా!
   సంగీతంలో  అపర  త్యాగరాజు. నాగభూషణంగారు  భక్తుడే. కాని ఆవేశి, కొంచెం కోపం. ఆ కోపమే  లేకపోతే మూడుమూర్తులాత్యాగబ్రహ్మ  అని చెప్పతగిన  గాయకుడు. ఆయన పాట  వింటూ  సర్వమూ  మరచిపోయి పరవశత్వంతో కరిగిపోయినాను. ఏ  దివ్యామృతమో నన్ను  ముంచెత్తింది.
   గాయక సార్వభౌమ పారుపల్లి  రామకృష్ణయ్యగారు నిజంగా  సార్వభౌముడే. ఆయనను వింటేనే కంఠంలో  సంగీతదేవి  ఆవర్భవిస్తుంది. వీరితో పాటు వారణాశి బ్రహ్మయ్యగారు,  బలరామయ్యగారు  సంగీతకళానిధులు.  వీరికి  నారద  తుంబురులు అని పేరు  పెట్టుకొన్నాను. యువకుడైన  క్రోవి  సత్యనారాయణగారు  గానావేశి.  ఈయన స్వరావతారమే!
   బందరులో  కోటయ్యగారనే  గానతపస్వి  వుండేవారు. ఆయన  కుమారులిద్దరూ  చాలా  పేరుపొందారు. ఆరోజుల్లోనే  తుమురాడ  సంగమేశ్వర శాస్త్రి  గారి  సంగీతం  విన్నాను. వీరు   అపర  సరస్వతీదేవి అవతారమే. ఆయన  వీణతోనే వుద్భవించారా? ఏమి  పరమాద్భుతంగానం!  ఏ రాగమైనా, ఏ  తాన  వర్ణమైనా, వేదాలైనా  సర్వమూ దివ్యరూపంతో  ప్రత్యక్ష మాయన  అంగుళీతంత్రీ సంయోగంవల్ల.
   విజయనగరంలో  ద్వారం వెంకటస్వామి  నాయుడుగారి ఫిడేలు విన్నాను. ఫిడేలు  భారతీయవాద్యంకాదు. కాని  ముత్తుస్వామి  దీక్షితుల కాలం  నుండి  వాయులీనం    భారతీయమైపోయింది. నా కాలేజి  దినాలలో  గోవిందస్వామిపిళ్లెగారి వాయులీనం   విని  ఆశ్చర్యం పొందాను. నేను  వెంకటస్వామినాయుడుగారి  పాటవిని  గంధర్వలోకం  ప్రత్యక్షం  చేసుకున్నాను.
     సంగీతం ప్రథమంలో జీవితానికి  ప్రత్యక్షం  అయినప్పుడు  మనలోని కల్మషాలన్నీ పైకి  వుబికివస్తాయి.  అప్పుడు  మనుష్యుడు  పశువు. అతనిలోని  ఆహార  నిద్రా  భయమైధునపకృతులు శతసహస్రబలంతో  విజృంభిస్తాయి. ఆ స్థితిలోనే  అనేకులు  అధోగతి  పాలైపోయారు.  ఈ సత్యం  అన్ని కళలకూ వర్తిస్తుంది. నాటక ప్రదర్శనంలో   కళలలన్నీ ప్రాథమికస్థితిలో వుండడంచేత కళావేత్తలందరూ  పశువులలానే వర్తిస్తారు. అందుకనే సినిమాలలో కూడా  నీతినియమాలు  వుండవు. ఈ  ప్రాథమికస్థితి దాటిన  కళావేత్త స్వచ్ఛభూములలో అడుగులిడతాడు. అప్పుడాతడు వున్నత హిమాలయ పథాలలోనే విహరిస్తాడు. ఈ  ఆలోచనలతో మా అమ్మగారితో  బయలుదేరి హరిద్వారం  కైలాసాశ్రమానికి వచ్చాను. మా అక్కగార్లిరువురూ  నా ఆస్థి స్వీకరించమని స్పష్టంగా  తేల్చేశారు. ఈ సంగతులన్నీ  స్వామీజీతో  మనవి చేసి  సలహా  అడిగాను.
    నాయనా! ధనం  నీకు  బరువుగా  ఉంటే మీ  అక్కగార్లిద్దరకూ బలవంతంగా ఇవ్వడం  ఎందుకు? గర్భదారిద్ర్యంతో క్రుంగిపోతూ ఉన్న  కోట్లకొలది భారతీయులు  లేరా?  వారికి  ఉపయోగించే సంస్థ  ఒక దాన్ని నిర్మించరాదా? 
    స్వామీజీ! మాబోటి  యువకులలో  కొన్ని భావాలున్నాయి. అవి కొన్ని  తమకు మనవిచేసి ఉన్నాను. భరతదేశం సర్వవిధాలా ఉత్తమస్థితికి  పోవాలంటే, బీదలకు నల్లమందు  మత్తునిచ్చే ధర్మసంస్థలు మానివెయ్యాలి. వారందరినీ  ముష్టి మాన్పించి, వారికి  చదువులో, కృషిలో  పెద్దకులావారితోబాటు  సమంగా  విద్యాసముపార్జనము  ఆర్ధికస్థితి ఉండేటట్లు చెయ్యాలి అని. అన్నదాన సమాజాలు, వస్త్రాదాన  సమాజాలు, బీదల  సహాయసంస్థలు అన్నీ  నల్లమందు  దానాలు. బీదవారు జీవితసమస్యలకు ఎదుర్కొనే  కర్మవీరులు కాకుండా  అడ్డంవస్తూ వున్నవి.  ప్రపంచంలోకెల్లా  మహోత్తమదేశం  కావలసిన చీనా  ఎలా  నిజమైన  నల్లమందువల్ల  హీనదేశమైందో, అలా భరతదేశం  ధర్మంఅనే  నల్లమందు  ఎక్కువ  ఆరగిస్తోంది. అల్లానే బీదవారూనూ. బీదవారు ధనసంపాదకమైన  పెట్టుబడి  సొమ్ముగా  ఈ ధర్మాన్ని  చేసుకున్నారు. అదే భారతభూమి అధోగతికి కారణం అని మా నమ్మకం.                                                                                                      

అబ్బాయీ! నీ వాదన అంతా నా కర్థం అయింది. కాని తన శాయశక్తులా పనిచేస్తూ కుటుంబపోషణ చేసుకుంటూఉన్న ఒక సంసారి నాశనం అయ్యాడు. అతనికి సహాయంచేసే సంస్థ ఒకటి ఉండాలికదా! సరియైన సమయానికి సహాయం లభిస్తే అతడు అందుకుపోతాడు. లేకేపోతే నాశనమేకదా! చాలా బీదవాళ్ళు చదువుకునేందుకు సర్వవిధాలా సహాయంచేసే సంస్థ కావాలి. అదీగాక అన్నదాత సమాజాలు, విద్యాదాన, వస్త్రదాన సమాజాలు, నల్లమందు ఇంజెక్షను ఇచ్చేవికావు. ఇచ్చేదాత సదుద్దేశంతో చేస్తున్నాడు. అదీగాక అన్నదానం పుచ్చుకున్న బీదవాడు మానవాభ్యుదయ యుద్ధం చేయడానికి బ్రతికి ఉంటాడు. సదుద్దేశ పూర్వకమైన ప్రతిపనీ మానవ కళ్యాణానికి సోపానం అవుతుంది. నువ్వు వాదించేది కమ్యూనిస్టువాదన. కమ్యూనిస్టులు కోరే సర్వ ప్రజాసమరాజ్యస్థితి రావాలంటే, ఆ రాజ్యం తీసుకురాగలిగే వీరుళ్ళుంటేగదా! ఒక విద్యసంస్థ బీదవారికే చదువు చెప్తోంది అనుకో, ఆ బీదవారు కూడా, దేశహీనస్థితి పోవాలని కృషిసల్పే విద్యావేత్తలలో చేరుతారు కదా! అదీకాక వారి విద్యావేత్తృతలో తమ ఇది వరకు బీదస్థితి స్మృతి బలప్రధాన శక్తిగా కలిసిపోయి వారిని మరింత ఉత్తమవీరులుగా చేయకలుగుతుందకదా!

                                                                                                                    8
   
   నా  శిల్పదీక్షకు  సర్వతోముఖమైన శక్తి  తెచ్చుకోవాలని  కాబట్టి  చీనా, జావా  మొదలైన  మంగోలు  జాతుల  దేశాలు;  పర్షియా, టర్కీ మొదలయిన సిధియనుజాతి దేశాలు; కకేషియనుజాతి  యూరోపుదేశాలు; అమెరికాదేశమూ  చూచి రావాలని  సంకల్పం  చేసుకొని  స్వామీజీని  సలహా అడిగాను. స్వామీజీ అత్యంత సంతోషంతో  అనుమతి ఇచ్చారు. అందుకు ప్రయత్నాలు  ప్రారంభించాను. స్వామీజీ సహాయంవల్ల  నేను బర్మా, జావా, బలిద్వీపము  చూడడానికి  ప్రభుత్వంవారు యాత్రాపత్రికలు (పాస్ పోర్ట్సు) ఇచ్చారు. డచ్చి ప్రభుత్వంవారు, ఫ్రెంచి  ప్రభుత్వంవారు అనుమతి  పత్రాలు  (వీసాలు) ఇచ్చారు.
   1934 సంవత్సరం మార్చి నెలలో నేను కలకత్తాలో  ఓడ  ఎక్కి రంగూనులో  దిగాను. రంగూనులో ఒక  అరవ  హోటలులో  మకాం పెట్టి నగరం  అంతా తిరిగాను. అక్కడ  లక్కపనిచేసే  కార్ఖానాలు, దారుశిల్పాలు చేసే కార్ఖానాలు  చూచాను. అక్కడ  పనివాళ్ళకు కొంత ధనం  బహుమతిగా  ఇచ్చి, ఆ  పని  నేర్చుకున్నాను. తెల్లటి  పాలరాతితో  రంగూనులో  చక్కటి  బుద్ధవిగ్రహాలు చెక్కుతారు. ఇత్తడి, రాగి పాళ్ళు ఎక్కువ  వున్న  కంచుతో  విగ్రహాలు  పోతపోస్తారు.
   ప్రాస్యమైన  ఆర్యశిల్పానికి, మంగోలియను  శిల్పానికీ  చాలా  తేడాలున్నాయి. ప్రపంచంలో  సృష్టి  అయిన  వస్తువులన్నీ  మూడు  ముఖ్య  జాతులుగా వుంటాయని నా వాదన. సత్వ, రజస్, తమోగుణావృతాలయినవా  మూడు జాతులు: లోహంలో బంగారు, వెండి, ప్లాటినమ్  మొదలగునవి  సత్వగుణ భూయిష్టాలు. రాగి, మాంగనీసు మొదలైనవి రజోగుణ సంభవాలు. ఇనుము, సత్తు, సీసం  మొదలైనవి  తమోగుణజాలు. అలాగే జంతువులలో  ఆవు, ఏనుగు, లేడి, గుఱ్ఱము   సత్వగుణంలోంచి   వుద్భవిస్తే, సింహం, పులి, తోడేలు  రజోగుణంలోంచీ; ఎనుము, గాడిద, ఎలుగు మొదలైనవి  తమోగుణంలోనుంచీ వుద్భవించాయి. మనుష్యులలో తెల్లజాతివారు సత్యగుణంలోనుంచీ, రంగులజాతివారు  రజోగుణంలోనుంచీ, నల్లజాతులు తమోగుణంలోనుంచీ  వుద్భవించారని  నా వుద్దేశం.  ఆయా జాతులలో  మళ్ళీ మూడేసి  అంతర్జాతులు  వచ్చాయనీ,  వీనిలో  వీనికి కలయికలు కలిగాయనీ నా దృఢనమ్మకం. మంగోలియను జాతులవారు రహస్యాచార వర్తనులు, మతంలో  వారికి గోప్యతాంత్రిక కర్మకలాపం బహుఇష్టము. వారి కళలలోనూ ఈ  ఛాయలూ, తచ్ఛాయాజనితమైన  అలంకారశిల్పమూ వుంటుంది. వారి  బుద్ధుడు అవతారమూర్తియైన శాక్యసింహుడు మాత్రంకాక, లక్షల చేతులు కలిగిన  మహాబుద్దుడు.  నేపాలులో, త్రివిష్టపంలో, బర్మాలో, కంబోడియాలో, జపాను, చీనాలలో  ఈ  విచిత్రశిల్పం  ప్రత్యక్షమౌతుంది. బర్మావారికి  స్పష్టమైన  గాఢమైన  రంగులు  ఇష్టం. గులాభి పసిమి రంగులు వారికీ  ఎక్కువ  ఆనందం  కలుగజేస్తాయి.
   బెంగాలువారిలా  ఆర్య, నీగ్రో, మంగోలియను రక్తాలు మిశ్రమం అయ్యాయి. అందుకనే  బెంగాలువారి రంగులు, రేఖలు, ఆచారాలు, శాక్తేయంగా, తాంత్రికంగా వుంటాయి. బెంగాలు  వారికి శోకరసం యెక్కువ  ఆనందం ఇస్తుంది. ఈ ఛాయలన్నీ బర్మాలో  ప్రత్యక్షం అవుతాయి. బర్మాలోని  అలంకారశిల్పం అత్యంతమై, అసలు భావాన్ని  ఒక్కొక్కప్పుడు దిగమింగుతూ వుంటుంది. దారుశిల్పమూ, వెండి నగిషీపని బర్మావారికి  బహుఇష్టం. రంగూను అంతకూ శిరోభూషణం భావేదగాన్ పగోడా. పగోడా అంటే గోపురం. భాషా సాంప్రదాయంలో గోపురం, పగోరం అయి, ర, డ  అవును  కాబట్టి పగోడా  అయినది.  స్థూపాలనే  పగోడా లంటారు. రంగూను  పగోడా  ఎత్తు 48 అడుగులు. బుద్ధధాతువులను తీసుకొనివచ్చి, రంగూను, మాండలే, పెగూలలో స్థూపాలను నిర్మించారు పూర్వ భారతీయ శిల్పులు.
   ఆంధ్రులే  ఇక్కడకు  వలసవచ్చారు. ప్రథమాంధ్రులను క్లింగులని అంటారు. కళింగులే క్లింగులయ్యారు. వారే  ఈ భౌద్ధసంప్రదాయాలను  ఈ సువర్ణ దీవికి  తీసుకొని వచ్చారు.  ఆ తర్వాత  కాకతీయులకాలంలో, కాకతీయ  రాజకుమారులు  సైన్యాలతోవచ్చి పెగూ  ప్రాంతం  అంతా నెగ్గి, అమరపురం, అవపురం, పెగూ నిర్మించారు. వీరిని  ఇప్పటికీ  తైలింగులంటారు. రంగూనులోని భౌద్ధస్థూపం  షేగాను  పెగోడా  మహాద్భుతమైన  శిల్పరూపం. స్థూపపాదంనుంచి శిఖరంవరకూ బంగారు రేకులతో  మాలామాచేశారు. ప్రార్థన చేసేందుకు  స్థూపంచుట్టూ  1400 అడుగుల  చుట్టుకొలతను  అద్భుతమైన  వసారా  ఉన్నది. ఈ  స్థూపంలోని దారుశిల్పం లోకానందదాయకమైనది. రంగూను, పెగూ, ఆవా, అమరపురం, మాండలేలు దర్శించి, అనేక  కళావస్తువులుకొని, హరిద్వారం స్వామీజీ  ఆశ్రమానికి  పంపి మార్చి నెలాఖరుకు సింగపూరువెళ్ళాను. సింగపూరులోనూ  భారతీయ సంస్కృతి అన్నివిధాలా  ప్రత్యక్షం అవుతుంది. మలయ ద్వీపమే మలయ! ఇప్పుడీ  ద్వీపవాసులు  ఎక్కువమంది మహమ్మదీయులు.  చాలామంది చీనా వారూ  వలస వచ్చారు.                                                                                                                           
           
               

సింగపురంనుంచి జావాలో బటేవియాపట్నం చేరుకున్నాను. బటేవియానుంచి రైలుమీదా స్టీమరుమీదా, బయలుదేరి బోరోబదూరు చేరుకున్నాను. యువద్వీపము నిండా భారతీయులు. ముఖ్యంగా ఆంధ్రుల సంస్కృతి విలసిల్లిపోయినది. కథాసరిత్సాగరంలో ఆంధ్రవణిక్కులు యువద్వీపాలు వర్తకానికి వలసకు వెళ్ళినట్లు వ్రాసిన ఆ చిహ్నాలు, ఆ రాజ్యాలు ఇప్పటికీ యువద్వీపం అంతా నిండి వున్నాయి. బోరోబదూరు ఆంధ్రుల సొత్తయిన మహాయానపు బిడ్డ. ఏ ఇక్ష్వాకుల కాలంలోనో యువద్వీపానికి వలస వచ్చిన ఆంధ్రులు, బోరోబదూరులో ఈ మహానిర్మాణం కావించి ఉంటారు. బోరోబదూరు స్థూపం ఇటుకలతో, మన్నుతో కట్టలేదు. ఒక కొండనే స్థూపాకారంగా నిర్మించారు. ఆ కొండలో ఒక ప్రక్కతమ ఆంధ్రదేశాన్నుంచి తీసికొనివచ్చిన బుద్ధధాతువును ఆంధ్రులు స్థాపించి ఆ కొండనంతా పరమాద్భుత శిల్పాకారంగా నిర్మించారు.


                                                                                                                  9
               
   మంగోలియను జాతులు  పసుపచ్చంగానూ, ఎఱ్ఱగానూ, వుంటారు. బర్మావారు, చీనావారు, జపానువారు, లాప్ లాండ్ వారు, సైబీరియావారు, గ్రీన్ లాండువారు పసుపచ్చగా వున్నారు. అమెరికా  ఇండియనులు  ఎఱ్ఱ జాతివారు. భూమిమీద భూభాగం ఏర్పడేటప్పుడే,  ఉత్తర ఖండంలోనే ఎక్కువగా ఏర్పడిందని నా వుద్దేశం. శాస్త్రజ్ఞులు  అట్లాగే చెప్పుతారు.  ఆ  ఉత్తర  భూభాగము మూడు చక్రాకారపు చీలికలుగా ఏర్పడింది.  ఉత్తర  సముద్రము  భూమి; మధ్యోత్తర సముద్రము, భూమి; మధ్య  దక్షిణ  సముద్రము, భూమి: దక్షిణసముద్రమూ. ఈ  విధముగా  మధ్యభూమి  మహోత్తమ పర్వతమయమైనది: ఉత్తర, దక్షిణ భూములు  సమతలాలు. మధ్యమోన్నత పర్వతాలున్నూ, మధ్యభూభాగంలో స్వతగుణులైన ఆర్యులుద్భవించారు.
   మహామేరు (ఇప్పటి పామీడు) దానికి  శాఖలు, హిమాలయం, ఆల్టాయి, సులేమాను, హిందూకుష్ లలో శుద్ధసాత్వికులు, వేద పవిత్ర  మంత్ర దర్శకులు వుద్భవించారు. కాకసస్ మధ్యస్థమైన  తురుష్క పర్వతాలూ, ఆల్ప్సు పర్వతాలలో  రాజసిక  సాత్విక జాతి అయిన ఆర్యులు, వుత్తరఆల్ప్సు, అట్లాంటిక్  పర్వతాలలో (అవి ఇప్పుడు సముద్రగర్భంలో వున్నాయి) అమెరికా  మధ్య  పర్వతాలలో  తామసిక  సాత్వికులు  ఉద్భవించారు. అలాగే ఉత్తర  భూఖండంలో  సాత్విక  రాజసికులు చీనాలోనూ, రాజసిక రాజసులు  పసిఫిక్ సముద్రంలో మునిగిన  భూఖండంలోనూ, తామసిక రాజసులు  కెనడా, అట్లాంటిక్, యూరపు  భాగాలలోనూ  వుద్భవించారు. దక్షిణ భూఖండంలో, దక్కనులో, సింహళంలో అరేబియా సముద్రగర్భంలో  ఇంకిన భూమిలో  సాత్వికతామసులు, దక్షిణ  ఆఫ్రికా  అట్లాంటిక్ అమెరికా  భాగాలలో  రాజసిక  తామసులు, దక్షిణ పసిఫిక్ భాగ  ఆస్ట్రేలియా, బోర్నియో,  న్యూజిలాండు, దక్షిణ  అమెరికా  భాగాలలో  తామసిక  తామసులు  వుద్భవించారని నాకు సంపూర్ణ నమ్మకము.
   రాజసికార్యుల  సంతతివారు ఇప్పటి యూరపుఖండవాసులు.  రాజసికార్య  సాత్విక  రాజసుల మిశ్రమ  సంతతివారు  హిట్టెటులు,  డెమిటెక్ లు, యూదులున్నూ. సాత్వికార్య, సాత్వికరాజసుల సంబంధీకులు  సింధుతీరవాసులు, చాల్దియనిలు, ప్రాచీన  ఈజిప్టువారు. వీరే  అసురులు.  సాత్వికార్య, రాజసిక  రాజసుల  సంబంధులు  ఈనాటి  బర్మా, బెంగాల్, వురియా, అస్సాంవారు. వీరే  ప్రాచీన గాంధర్వులు. సింధుతీరవాసుల  సంతతివారు దాక్షిణాత్య నెల్లాలులు, పూర్వాంధ్రాసురులు.  తామసిక   రాజసురులు  ఈనాటి అస్సాం  నాగులు.
   ఈ  మిశ్రమాల  వైచిత్ర్యం ఆయా దేశాల  శిల్పాలలోనూ దృశ్యం అవుతుంది. బోరోబదూరులోని శిల్పంలో  ఆంధ్రార్యా  సాత్వికత్వమూ,యవద్వీప మిశ్రమ  రాజసమూ సంపూర్ణంగా కనబడతాయి. కొన్ని శిల్పాలు  పూర్తిగా  ఆంధ్రార్యులు శిల్పించినవే. ఆ శిల్పాలకూ,  అమరావతీ, నాగార్జున కొండ  శిల్పాలకూ ఏమీ  తేడాలేదు.  బోరోబదూరు  బుద్దుడూ, నాగార్జున  బుద్దుడున్నూ ఒకటే. ఈ  స్థూపంపైకి  వెడుతూంటే, మెట్టు మెట్టు ఎక్కుతూంటే, ప్రథమ  శ్రేణులలో పక్షులు, జంతువులూ, లతలూ వుంటాయి, తర్వాత శ్రేణులలో  ప్రక్త్రుతి దృశ్యాలు,  మానవ జీవిత దృశ్యాలు, ఇంకనూ  దానబుద్దదేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఈ  శిల్పాలన్నీ వరసగా పెడితే  మూడు మైళ్ళ పొడుగు వుంటాయి.  మధ్య మధ్య   వుండే  బుద్ధదేవుల మూర్తి విధానం  గమనిస్తే  తూర్పునవున్న బుద్దులు  అక్ష్యోభ్యులు.  వీరు ధ్యానబుద్దులు, వరముద్రాలంకారులు. పచ్చిమ భాగాన  అమితాధిబుద్దులు  పద్మాసవస్థులు, చిన్ముద్రా పద్మముద్రాలంకారులు. వుత్తరపువైపు అమోఘసిద్ద బుద్దులు అభయముద్రాలంకారులు.  
   ఇక్కడే ప్రజ్ఞాపరిమితాదేవి శిల్పం  వుండేది.  ఈమెను  శిల్పించిన  మహాశిల్పి  యవద్వీప సుందరికిని, ఆర్యశిల్పికిని వుద్భవించినాడు. ఆమెలో ఆర్య సౌందర్య రేఖలు, గాంధర్వ  సౌందర్యరేఖలూ  యమునా గంగా నదులు సంగమించినట్లయ్యాయి. ప్రజ్ఞాపారమిత శిల్పము  జగత్ప్రక్యాత శిల్పాలలో  ఒకటి.  ఆమెను  నేను  ప్రేమించాను, పూజించాను.
   ఈ రోజులలో  స్త్రీ  భావాన్ని  పూజింపసాగాను.  అందమైన స్త్రీ, మధురకంఠి.  విలాసాలప్రోవు.  వీరందరూ  నా  శకుంతలలోని  ఛాయలయ్యారు. ఏ  సౌందర్యోజ్వల స్త్రీ  అయినా  నాలో  కామేచ్ఛ ఏమాత్రమూ వుద్భవించలేదు.  ప్రకృతిసౌందర్యదర్శన  పులకితుడై, పరవశత్వం చెందే సౌందర్యోపాసిలా  స్త్రీ  సౌందర్యోపాసినిమాత్రమయ్యాను. జగత్ స్త్రీ! ఎంత విచిత్రమైన  భావం. వివిధ  సౌందర్యాత్మకమయిన  పరమ  శబలత్వ మోములో  మూర్తీభవిస్తుంది. ఏ  సీమలో  ఆమె  నర్తిస్తుందో  ఆ సీమలోని  సౌందర్యాలన్నీ  పూలలా ఏరి  తన్నలంకరించుకొంటుంది. ఏ కాలంలో  తాను నాయిక  అవుతుందో,  ఆ కాలంలోని సౌందర్యాలు పరిమళాలు చేసి తాను సుభిక్ష అవుతుంది. సామ్రాజ్య భావపూర్ణ స్త్రీలో  ఆడపులి  అందాలు  చూస్తాము.  భారతీయ  కాంగ్రెసులో వంగోలుసీమ ధవళ  దేనువులు  దర్శిస్తాము. సోవియట్  రష్యాలో పొలందున్నే బాడబి కన్నుల  విందు చేస్తుంది. కాటకంలో కడుపు వెన్నెముక  కంటుకుపోయి,  ఎముకలపోగై  చంటిబిడ్డకు  పాలులేక, వేలాడే పాలతిత్తులు వడలిపోయిన  భీభత్సంలో  కాటకసుందరి. ఆ  తల్లే  మనుష్యులలోని సర్వకరుణలు స్పందించి అతణ్ణి కర్మవీరుణ్ణి చేస్తుంది. బర్మాలో, సింగపూరులో,  మంగోలియనుజాతి స్త్రీ  సౌందర్యాన్ని నేను దర్శించాను. ఉత్తమస్థితిలో స్త్రీలు  బర్మాలో చుట్టాలు కాలుస్తారు. ఆమెదే నిజమైన బర్మా పరిపాలనం. ఆమె సర్వసంస్థలకు  దానధర్మాలు చేసే వ్యక్తి. అలంకారంలో ఆమె ముందు. సంగీత మామే సొత్తు. నాట్య  మామే హక్కు.  చదువులో ఆమెది  మొదటి పంక్తే! భారతదేశంలో  వెనక ఎలా  సరస్వతి, శారద, గజలక్ష్మి, మందాకినీ, భూమాతా, పౌష్యలక్ష్మి, విద్యుల్లతాంగీ అయి స్త్రీ  వున్నదో, జావాలోనూ ఆమె  అలా  ప్రజ్ఞాపారమిత అయింది.  జావాకు  వలస  వచ్చిన  భారతీయులచే   ఆ  ప్రజ్ఞాపారమితాదేవే సకల  సంస్కృతీ విలసింపజేసింది.
   ఆ భావాలతో  బోరోబదూరు  శిల్పలక్ష్మికి  సాష్టాంగపడ్డాను. సాష్టాంగమునుండి లేచి నిలుచుండగానే డచ్చిభాషలో నన్నొక  యవదీపపాశ్చాత్యసుందరి  మీరు భౌద్దులా? అని పల్కరించింది. నాకు డచ్చిభాష రాదు. యవద్వీప భాషా రాదు. నేను  తెల్లపోయి  ఇంగ్లీషులో  నాకు  మీ భాష రాదు  అని  జవాబు  చెప్పాను. ఆ బాలికతో  వున్న  ఒక పెద్ద  డచ్చి  దేశస్థుడు  మీది హిందూ దేశమా?  అని  ఇంగ్లీషులో ప్రశ్నించాడు.  ఆ  డచ్చి  పెద్దమనుష్యుడు నన్నట్లు పలకరించగానే నాకు ఎంతో  గర్వం కలిగింది. 
    అవునండీ, నేను  భారతీయుణ్ణి. శిల్ప విద్యార్థిని.  ఆంధ్రుణ్ణి. ఆంధ్రదేశం,  మదరాసుకు ఉత్తరంగా  ఆరువందల  మైళ్ళు  పొడుగు, మూడు వందల వెడల్పున్న భూమి. అక్కడి  శిల్పచరిత్ర తూర్పు  ప్రపంచానికంతకూ దేశికత్వం వహించింది. అందులో ఒక చిన్న ఖండమే ఈ శిల్పము  అని  అన్నాను.                                                                                                                           
           
               

ఆనందం. నేనూ, నా కొమార్తె ఈ బాలికా శిల్పులమే. మేము మీ భరతదేశం యావత్తూ తిరిగి వచ్చాము. ఈ బాలిక విల్హె ల్మినా. నాపేరు డిజాంగ్. ఈ బాలిక తల్లి హెర్ ఫాన్ వాగేనార్ గారి కుమార్తె. వాగేనార్ ఈ దేశంలో ఒక రాజు. ఆయన ఒక జావారాజు తనయను పెళ్లి చేసుకొని , ఆ అమ్మాయి ఆ రాజుకు ఒక్క సంతానమే అవడంచేత, తానే జమీందారుడయ్యాడు. ఇదీ మా చరిత్ర. పొద్దుటినుంచీ ఇక్కడే వుండి, ఈ బొమ్మల ప్రతిరూపాలు లింఖించుకుంటోంటే చూచి, మీ రెవరో తెలుసుకొని, మీకు సహాయం చేయాలని మా అమ్మాయి నన్ను వేపుకుతింది, మీ చిత్రాలు మేము చూడవచ్చునా?

    చిత్తం!
    నా  చిత్తుచిత్రాల  పుస్తకాలు  వారికిచ్చాను. ఆ  బొమ్మలన్నీ కొన్ని వందలుంటాయి. తండ్రీ కూతుళ్లిద్దరూ ఒక అరగంట  చూశారు. ఆయన   నా   మొగంవైపు చూడగానే  అయ్యా, నా  పేరు  త్యాగతి శర్వరీభూషణ్  అన్నాను.
   అయ్యా భూషణ్ గారూ! మీ బొమ్మలన్నీ  ఇప్పుడు చూడలేము. ఇక్కడ  బంగాళాలో  మా నివాసం.  మీరు ఇక్కడ  వుండదలచుకొన్నన్ని రోజులు  మా ఆతిథ్యం  స్వీకరింప ప్రార్థన.  మీరు మాతో వున్నప్పుడు సావకాశంగా ఈ  బొమ్మలన్నీ చూస్తామండీ అని ఆయన  నన్ను వేడుకొన్నాడు.
   నేను  వారితో  బంగాళాకు వెళ్ళాను. నా సామానూ  బంగాళాలోనేవుంది. అయితే  నా స్వంతవంట మాని  వానితో నాకై  తయారుచేయించిన  శాకాహారం మాత్రం  తీసుకుంటూ వారికి  అతిథినయ్యాను.
   విల్హె ల్మినా బటేనియా కాలేజీలో  చదువుకుంది. శిల్పంలో ఎక్కువ  ఇష్టం వుండడం చేత  బటేనియా శిల్పవిద్యాలయంలో శిక్షణ అలవరించుకుంది. ఆమె హాలెండు, యూరపు, ఇంగ్లాండు, ఇండియా, బర్మా, చీనా, జపాను, ఆంగకర్ వాటు  మొదలయిన  ప్రదేశాలన్నీ తండ్రితో  కలిసి మూడేళ్ళు  యాత్ర చేసింది. విల్హె  ల్మినా లిఖించిన చిత్రాలన్నీ చూచినాను. డిజాంగ్ గారు నన్ను  వారి  శిల్పాలను  చూచుటకు బటేనియాలో తమ  నివాసానికి  రమ్మని  ఆహ్వానించారు. నేను ఇండో  చీనాకు  వెళ్ళేటప్పుడు బటేనియా ఎల్లాగ  వెళ్ళవలసి వున్నది గనుక  సరేనని వారి ఆహ్వానము అంగీకరించాను.
   డచ్చి  వరవర్ణులకున్న ప్రకృతి సౌందర్యపూజ, జవాసుందరులకున్న  పారలౌకిక విషయానందము  ఆ  బాలికలో  చక్కగా  మిళితం అయ్యాయి. ఆమెలో  రెండు  అందాలు మేలుకలయిక  పొంది, ఆమెకు  దేవ గంధర్వ సౌందర్యము  ప్రసాదించాయి.  ఆ  బాలికకు  ఇంగ్లీషు  బాగా అర్ధం  అవుతుంది.  కాని తాను  నట్టుతూ  మాట్లాడుతుంది. భారతీయ  శిల్పంలోని రహస్యాలు  వాళ్లకు  పూర్తిగా  తెలియవు. వాన్  అయికు, నాన్ డైక్ మొదలయిన  చిత్రకారుల  రక్తమూ, ఆంధ్రశిల్పుల  రక్తమూ, యవద్వీపవాసుల రక్తమూ  ఆమెలో సంయోగం పొంది, భారతీయ శిల్పం అంటే ప్రేమను  కలిగించాయి. అది వట్టి  అలంకార  శిల్పంమాత్రం  అనే భావాన్ని  కలుగజేశాయి.  ఈ  రెండు   భావాలు  ఒక్కొక్కప్పుడు శ్రుతి అవుతాయి. ఒక్కొక్కసారి  అపశ్రుతిగా  తుపాను  పుట్టిస్తాయి. విల్హె ల్మినాతోను,  ఆమె తండ్రితోనూ  నేను  మూడు రోజులు వాధించాను, బోధించాను. విల్హె ల్మినా నా వాదన పూర్తిగా  అర్థంచేసుకొని  భారతీయశిల్పం  నేర్చుకోవడానికి  సంకల్పించుకొంది. నేను వారితో జావాలోని  తక్కిన  శిల్పక్షేత్రాలన్నీ తిరిగాను.
   బోరోబదూరునుంచి మేము  ప్రాంబనాన్ వెళ్ళాము.  ఈ గ్రామం  సురకర్త  నగరజిల్లాలో ఉన్నది. యోగ్యకర్త నగరానికి  సమీపం. రెంటికీ రైలుమార్గం వుంది. ప్రాంబనాన్ అంటే  గురువులున్న  గ్రామం అని అర్థమట.  ఈ  మహాగ్రామంలో  157 చిన్న  గుళ్ళు మూడు  కక్ష్యంతరాలలో  వున్నాయి. లోని  కక్ష్యంతరంలో  ఆరు పెద్ద  గుళ్ళు వున్నాయి. మధ్య దేవాలయం  శివపార్వతులది,  శివుడు  జగద్గురువుగా, మహాకాలుడుగా  విగ్రహాలున్నాయి. దుర్గ, గణేశ విగ్రహాలున్నాయి. బ్రహ్మవిగ్రహమూ, విష్ణువిగ్రహాలూ ఉన్నవి. ఇక్కడ శిల్పం  ప్రథమ  ఆంధ్ర  చాళుక్య  శిల్పాన్ని  పోలి  ఉంది. ఈ  విగ్రహాలలో  ఎల్లోరా,  మహాబలిపుర  విగ్రహాలలోని, విజయవాడ గణేశ  విగ్రహాలలోని  మహోన్నత శక్తి,మహాప్రజ్ఞాత్మిక రచన  దృశ్యమౌతున్నది.
   అక్కడినుండి  చండిజాగో, విష్ణువర్ధన చాళుక్యుడు నిర్మించిన  గుడికి  వెళ్ళినాము. చండి  అంటే  గుడి. ఇక్కడి శాసనాలు  దేవనాగరలిపిలో  ఉన్నాయి.  ఇక్కడ  మకరతోరణాలు లేవు. గాంధర్వశిల్పంతో  మిళితమైన  భారతీయశిల్పం  దృశ్యం  అవుతుంది. చండీజాగో దగ్గరనే  సింగోస్సారి చండి, కిదాల్ చండి, జాబుంగ్  చండీలు  ఉన్నాయి.
   వీటి అన్నిటికన్న ఉత్తమమైన  దేవాలయం  కేదిరి చండి. ఇచ్చట  శిల్పం అత్యంత లాలిత్యం  చేకూర్చుకొని యవద్వీప వాసనలు రూపం  తాల్చింది. ఈ దేవాలయాలన్నీ  తూర్పుజావాలో  ఉన్నాయి. ఈలాంటి  దేవాలయాలు  యవద్వీపం అంతా  నిండి  ఇక్కడకు పూర్వభారతీయులు ఎంత విరివిగా  వలస  వచ్చేవారో  తెలియజేస్తున్నవి. అనేక శిల్పాలు  హాలెండు, జర్మనీ  మొదలయిన  ప్రదేశాలకు  తరలించుకుపోబడినాయి. పాశ్చాత్యులు  ఎవరికి  తోచినరీతి వారు  చరిత్రలు రాసారు. భారతీయులకీ  అఖండ  భారతచరిత్ర అవసరంలేదా? ఆంధ్రులంతకన్నా అలసులు. ఈ  దేశాలే  రారు. మన దేశంలో చరిత్రకారులు దేశాలు తిరుగుతారుగనుకనా! వారు, ఎవరో రాసిన  గ్రంథాలు, భావాలు చూచి, స్వకల్పిత గాథలతో చరిత్ర  నింపుతారు. ఈ  దౌర్భాగ్యస్థితి ఎప్పటికి అంతమవుతుందోగదా!
       
   
                                                                                                       10
       
   ఆ  యాత్రలన్నీ  ముగించుకొని  నా  స్నేహితులైన  డిజాంగ్, విల్హె ల్మినాలతో బటేనియా చేరాను. మా యాత్రల  పొడుగునా విల్హె ల్మినాకూ, నాకూ ఎంతో  స్నేహం అయింది. ఒక జాతికి  ఇంకో జాతికి  స్నేహం కుదర్చగలవారు, ఇరుజాతుల్లోని వనితామణులే. భారతీయ నారీమణులు. విదేశీయులతో సంపర్కం  కలుగజేసుకునే  ఆచారం  భరతదేశంలో  లేకపోవడం ఆ రోజుల్లో  నా కెంతో  టీరనిలోటు అనిపించింది. విల్హె ల్మినా  నేనంటే  చూపిన  గౌరవము, ఆదరణ  వర్ణనాతీతము. అమెరికాలో  వివేకానంద రాజర్షిని గౌరవంచేసి  అఖండ  స్వాగతం  ఇచ్చింది  అమెరికా  నారీమణులు. వారికి చదువు ఉన్నది, స్వేఛ్చ ఉన్నది.                                                                                                                           
           
               

భారతీయస్త్రీ ఒక విదేశీయుని కలుసుకోలేదు, అతనితో మాట్లాడదు. సంస్కృతిని గూర్చి చర్చించ లేదు. సరోజినీదేవీ, విజయలక్ష్మి, దుర్గాబాయి, కమలాదేవిగార్లవంటి ఏ నలుగురైదుగురో తక్క విదేశ యాత్రికులతో మాట్లాడే వనితలేరీ? మన ఇంటికి వారిని పిలువలేము. మన మతం మనకు అడ్డం. మన ఆడవాళ్ళ హృదయంలో ఉత్తములైన పరదేశీయులతో వారివారి విజ్ఞానాలను గూర్చి మాట్లాడాలని, వారిని హృదయమారగా ఆదరించాలనీ ఉంటుంది. కాని వారికి సావకాశాలెవరు ఇస్తారు?

   ఈనాడు  మన బాలికలు  చదువుకొంటున్నారు. ఈ  విద్యావంతులైన బాలికల జీవితం ఒక మహోద్యమం  అనే  విషయజ్ఞానం  భారతీయులకు  లేనేలేదు. వారికి  పురుష భేదభావమింకా  వదలలేదు.  ఆ  భావంవల్లనే  పురుషుణ్ణి ఆదరించడం మానేస్తారు. ప్రేమించిన వానితో  మాత్రం  ఆ భావం  ఉంచుకొని, తక్కినవారు  తమతోటి  మనుష్యులకే భావం వారి జీవితాల నిండలేదు. భారతీయ  పురుషులలోనూ  ఈ తుచ్ఛభావం  నశించలేదు. ఒక  స్త్రీ  తనవేపుచూస్తే,  ఒక స్త్రీ  తన్నుపలకరిస్తే, ఒక స్త్రీ  తనలో ఒంటిగాఉంటే, ఈ  హీనపశుత్వభావాలు పురుషుల  హృదయాలను  గగ్గోలు  పెడతాయికదా!
   నేనూ, విల్హె ల్మినా  మాత్రం  యెన్నోసార్లో  దేవాలయాలకడకు పోయి బొమ్మలు  వేసుకుంటూ  ఉండేవాళ్ళం.  అలాంటి  సంఘటన  వచ్చినప్పుడల్లా  నా   గుండె  ఉలికులికిపడేది.  నా  ఒళ్ళువేడెక్కేది.  ఏవేవో చెడు ఆలోచ నలు  నన్ను  నిండేవి. దిజాంగ్ గారు తన కుమార్తెను ఒంటిగా  నాతో పంపి, నాతో అంతకాలం  ఒంటిగా  వుండేటట్లు చేయడంలో, నేనాతని  తనయను ప్రేమించవచ్చుననే భావంతోనే పంపారా  అనుకున్నాను. ఎంత  హీనమైంది నా హృదయం!  ఈలాంటి  ఆలోచనలు  భారతీయ లొక్కరికే కలుగుతాయా, లోకంలోని  పురుషులందరికీ కలుగుతాయా?  అని ప్రశ్నించుకున్నాను. నాలో  తుచ్ఛభావాలకు  తావులేదనుకున్న నాకీ  ఆరాటం యెందుకు? ఈ  పశుత్వం  ఉద్భవించిందేమిటి?
   విల్హె ల్మినాలో  ఏదో  సమ్మోహనశక్తి వున్నది.  ఆమె  అందంలో  మహత్తరమైన  విశిష్టతవుంది. ఆమె నాలోని సర్వసౌందర్యపిపాసలు  రేకెత్తించింది. ఆమె  జావా భాషలో  చిత్రమైన  పాటలు  పాడుతూంటే పదికోకిలల తీయటిగొంతుకలు కలిపి  పాడినట్లు  నాకు పులకరాలు కలిగాయి. ఆకలిలాంటిదే  స్త్రీవాంఛ అని నేనెట్లా  అనుకోను? నా  శకుంతల వెళ్ళిపోయి  నా  కనేక  విధాల అడ్డంవస్తూ  ఉన్నదా? ఉత్తమ కార్యోన్ముఖునికి  స్త్రీవాంఛ అడుగడుక్కి  అడ్డంతగిలే  కంటకారణ్యం.  అందుకనే భార్య  అనే  ఉత్తమ సంస్థ  ఉద్భవించిందికాబోలు! నాకీ  దుష్టవివశత్వం మాన్పింది విల్హె ల్మినా కన్యయే!
   ఒక రోజున  మేమిద్దరము చండి  కేదిరిలో  ముఖ్య  దేవాలయంలో  బొమ్మలు వేసుకుంటున్నాము. విల్హె ల్మినా తండ్రి  గుడి అంతా చూచి, ఆ  ప్రాంతాన వున్న  ఇతర కట్టడాలను పరీక్ష చేయడానికి  వెళ్ళినాడు.
   విల్హె : భూషణ్! మీ  దేశంలో  చిత్రలేఖనంగాని, శిల్పంగాని అభ్యసించే స్త్రీలు  ఉన్నారా? భారతదేశం మేము వెళ్ళినప్పుడు మాకెక్కడా శిల్పవిద్యార్దినులు కనబడనేలేదు!
   నేను : మీరు శాంతినికేతనం వెళ్ళారా ?
   విల్హె : రవీంద్రనాథ టాగోరువారి ఆశ్రయమేనా ?
   నేను : అవును. అక్కడ చాలామంది విద్యార్థినులు చిత్రకళను, కొందరు శిల్పకళను నేర్చుకుంటున్నారు.
   విల్హె : నేనూ,  మాతండ్రిగారు  అక్కడ  విద్యార్దినుల  చుచాము. అందరిలో  ఒక బెంగాలీ అమ్మాయితో నేను బాగా  స్నేహం చేశాను. ఆ  బాలిక  మీ దేశంలోని యువకులు చాలామందిమీదా, పెద్దవారిమీదా కొన్ని  నేరారోపణలు  చేసింది. బాలిక  చదువుకోవడంవల్ల భారతీయ  యువకునిలో  పశుత్వం  రేకెత్తించిందని ఆమె నాతో చాలా  గాఢంగా చెప్పింది.  చదువుకొనేందుకు బాలిక  సిద్దమైనదంటే, ఆమె దుష్టబుడ్డితోనే ప్రారంభిస్తుందని  అనేకుల అభిప్రాయమట.  కళాశాలలకు యువతులు వెడుతోంటే అనేకులు యువకులు  ఈలల  వేస్తారట.  యువతులు  వినేటట్లుభరింపరాని మాటలంటారట. ఇవి  పెద్దలకు  చెబితే  ఆ  బాలికలో  ఏదో  లోటు లేకుండా  బాలురు అలా  అల్లరి ఎందుకు చేస్తారు?  అని పెద్దవారు అనుకుంటారట. 
   నేను : నీవు చెప్పిన  వాటిలో  చాలా నిజముంది. ఈ  విషయాలు  పంజాబులో  ఎక్కువ. కొత్తగా  బాలికల చదువు  ప్రారంభించడంచేత  ఈలాంటి సంఘటనలు వచ్చాయి. దేశంలో  ఇదివరదాకా బంధుత్వంలేని యువతీ యువకులు మాట్లాడుకోరు. అంత దూరంగా  ఉన్న  సుందరుడు నేడు చదువు ద్వారా  సన్నిహితులు  కాగానే  బాలునిలో అప్పుడే  పొడచూపిఉన్న  యవ్వన రక్తం  ఉప్పొంగి, అతనిలోని  పశుత్వం  బయటకు  వస్తున్నది. కానిమాకూ  ఈ  ఉద్యమం  బాగా  ఆచారమై,  మా జీవితంలో  భాగమయితే మావాళ్ళూ  ఎంతో గౌరవం  చూపించగలరు. అమెరికా  విద్యార్ధుల చరిత్ర  వింటోంటే  మా  హీనత్వమూ  కాటుకకొండ  దగ్గర మసిలా కనబడుతుంది.
   విల్హె ల్మినా  చిరునవ్వు నవ్వి  భూషణ్ ,  నువ్వు నా అందం  చూచి  మరులు కొన్నావని ఎంచి  ఈ  ముక్కలనలేదు. నీ  మర్యాద, నీ  లలితమైన  హృదయం, నీలోన విరక్తిభావం చూచి  ఆశ్చర్యపడుతూ  అన్నముక్కలివి. నువ్వు  నేనంటే  కొంత  ప్రేమ  చూపించి, కాస్త దగ్గరకు  చేరితే, ఆ ఆనందం అనుభవిద్దామని రహస్యంగా  వాంఛించాను. అంతకన్న నాకు  వేరే దుష్టభావాలు కలుగలేదు. ఒక్కసారి  కూడా  నువ్వు  నా అందం  తేరిపార  చూడ లేదని నాకు కోపం కూడా  వచ్చింది. నాలో  యవద్వీప స్త్రీ  రక్తం వుంది. మా  వాళ్ళు  తలుచుకుంటే  ఏ  మనిషి  హృదయాన్నైనా చూరగొనే మంత్రాలెరుగుదురట. నాలోని  డచ్చి రక్తం  నన్ను  వాటికి  దూరం  చేసింది. పట్టలేక  ఈ రకంగా అడిగాను  అన్నది. నేనాశ్చర్యం  పొంది  కించపడిపోయాను.                                                                                                                           
           
               
                                                                                                                    11
   
   నా  మోమునందు  నర్తించిన కించపాటూ, అవమానమూ  విల్హె ల్మినా జూచింది.  నా ప్రక్కకు వచ్చి కూరుచుంది.  నా  చుట్టూ  వేయివైచి తన హృదయానికి  అడుముకొని, కుడిచేత్తో  నా గడ్డం పట్టి,  నా  మోమెత్తి,  భూషణ్, ఈ విషయంలో  నువ్వొక్కడివే  ద్రోహివికావు.  నేనూ  ఆ నేరం  చేశాను. నాకు నిన్ను  గురించి  ప్రణయాత్మికమైన   ఆలోచనలు  కలిగినమాట నిజం. నీ మాటలలో గాని,  నీ చర్యలలో కాని  ఒక యువతి  హృదయం  చూరగొనేందుకు చేసిన  ప్రయత్న స్పర్శ అయినా  లేదు. ఆడవాళ్ళకి  కళలు వుంటాయి. వనిత తన కలలు గాఢంగా  దాచుకొంటుంది, తేల్చదు. లోపల అగ్నిజ్వాలలతో మండిపోతున్నా, పైకి  మంచుగడ్డలా కనబడగలదు. నేను  బాలికను. మలయారక్తం నాలో వుంది. నిన్ను వాంఛించాను. నీజీవితంలో భాగస్వామిని అవుదాము అనుకున్నాను. నా  డచ్చితనము నన్ను హేళన చేసింది. మన  ఈ  స్నేహంలో  పవిత్రత  మన యిద్దరం  పాడుచేయవద్దు. పాడుచేయ్యలేము కూడా!  నేను పెళ్లి చేసుకోబోయే  యువకుడొకడున్నాడు.  ఈ  జీవితంలో, నీ  ఈ  జావాయాత్రలో  మనిద్దరి  స్నేహం ఆఖరేమో? మళ్ళీ  మన  జీవితాలు  తారసిల్లుతాయో,  లేదో!  ఈ  పవిత్ర క్షేత్రంలో ఒక్కసారి  మన కాంక్షను  వూతం చేద్దాము అని  నన్ను గాఢంగా హృదయానికి అదుముకొని, తల వెనకకువాల్చి, అస్పష్ట ధ్వనితో నన్ను  గాఢంగా ముద్దు పెట్టుకో అంది. నేనామెను  నా హృదయానికి  తనివితీరా అదుముకొని, గాఢమైన  చుంబనా  లామె  పెదవులపై కురిపించాను.
   ఇరువురము విడిపోయాము. అదే మాలోని  కాంక్షల పుట్టుక, నాశనమున్ను. అంతకన్న మేము  వాంఛించ లేదు.  మనసుల కలయిక మాత్రమే  కోరిన మాకు దేహముల కలయిక  అవసరమే  లేకపోయింది. అక్కడి నుంచి  మా స్నేహము  నానాటికి  పవిత్రమైపోయింది. అలాంటి  ఉత్తమ  సంఘటనలే  మనుష్యుని  జీవితంలోని దివ్యక్షేత్రాలు.
   బటేవియా వెళ్ళాము. అక్కడి డిజాంగ్ గారి ఇంటిలో  నా మకాం బటేవియా యాత్ర  ప్రథమ దర్శనంలో  చూచినదానికన్న  ఈనాడు చక్కని  రూపముతో  ప్రత్యక్షం అయింది. విల్హె ల్మినా  శిల్పాలలో, చిత్రాలలో ఏదో  ఒక  మహానుభూతికై నిరీక్షిస్తున్న  ఆవేదన  ఉంది. జావా పల్లెటూరి దృశ్యాలు  ఆమె అనేకం  చిత్రించింది. బటేవియా  రేవులో  ఉన్న ఓడలు, నావలు, సరంగులు, నావికులు, కూలీలు, బజారులు, దుకాణాలు  ఎన్నో చిత్రాలామె  లిఖించింది. అన్నిటిలోనూ  ఆ నిరీక్షణే దృశ్యమౌతుంది.
    దేనికోసం  నిరీక్షిస్తున్నావు మీనా!  (అది ఆమె  తల్లిదండ్రుల ముద్దు పేరు).
    నీ  చిత్రాలన్నీ  ఆ నిరీక్షణే  తెలియజేస్తున్నాయి?  అని ఆ బాలికను  ప్రశ్నించాను.
    భూషణ్! నే నేమి చెప్పగలను? ఏదో మా జావాకు  వస్తుంది. అది  ఉపద్రవమో, శుభమో!  ఆ  నిరీక్షణ నాలో  నిండి ఉంది. నాతోటి  మా ప్రజలందరిలోనూ  ఆ  నిరీక్షణే  చూస్తాను.
   మీనా! నిజం. మన దేశాలన్నీ  సంపూర్ణ  స్వాతంత్ర్యం  కోసం  నిరీక్షిస్తున్నాయి, మీరు మాత్రం  హాలెండు సామ్రాజ్యం వాంఛిస్తున్నారా? ప్రపంచంలో సామ్రాజ్యకాంక్ష మారణ మేఘంలా  ఆవరించుకొని ఉంది.  అది ఎప్పుడు  పోతుందా  అని ప్రతి  మానవ  హృదయమూ  నిరీక్షిస్తోంది. ఆఖరికి  సామ్రాజ్యవాదుల హృదయంలోనూ  ఆ   నిరీక్షణ  అప్పుడప్పుడు కొంచమైనా  తల ఎత్తక మానదు.
    నిజం, భూషణ్! నీ భావం  నా  కర్థమయింది. నా హృదయం పూర్తిగా  గ్రహించావు.
   ఆమె  ఒక నిట్టూర్పు విడిచి, నా  చేయి స్పర్శించి  విసవిస  లోనికి వెళ్ళిపోయింది.
      
   ఆమెను వివాహం కానున్న యువకుణ్ణి  చూశాను. అతడును  డచ్చి తండ్రికీ, జావాసుందరికీ  ఉద్భవించిన మిశ్రమ  జాతివాడు. విల్హె ల్మినా  అంటే ప్రాణమే  అతనికీ.  ఆమె  నడచినచోట పూవులు చల్లుతాడతడు. ఆమెను గూర్చి  సగర్వంగా, పూజ్యభావంగా నాతో  ఎంతో   చెప్పాడు. నేనాతనికి  కళలంటే ఏమిటో బాగా  నేర్చుకొమ్మనీ, ఆమె  కానందం సమకూర్చడమేఅతని  కర్తవ్యమనీ  బోధించాను. ఒక  వారం  రోజులు  వారి ఆతిథ్యం స్వీకరించి ఓడ ఎక్కి సయామూ, ఫ్రెంచి ఇండోచీనా యాత్రకు బయలుదేరాను.
                                                                                                                  12
   నేను, బోరోబదూరు  మొదలైన  జావా  శిల్పక్షేత్రాలను దర్శించగానే డిజాంగ్ గారితోనూ, విల్హె ల్మినాతోను  బలిద్వీపం చూచాను. బలిద్వీపంలో జావా  ద్వీపంలోకన్నా  ఎక్కువ  భారతీయాంధ్ర చిహ్నాలున్నాయి. అక్కడి మనుష్యులలో, వారి  ఆచారాలలో, ఎక్కువ  ఆంధ్రత్వం  ఉంది. బలిద్వీప  వాసులు  పూర్తిగా హిందువులు. వారి శిల్పంలో  గాంధారరీతి కనిపిస్తుంది. హిందూ దేవతలనే  వారు పూజిస్తారు. వారి నాట్యాలన్నీ కూచిపూడి సంప్రదాయానికి మాకృత అయిన ఆంధ్ర సంప్రదాయానికి ఉద్భవించినవే. ఈ  ద్వీపాలలో భారత, రామాయణ వీధి నాటకాలు ఎంతో ఉత్తమ స్థితిలో వున్నాయి. ఈ  నాటకాలకి  వాంగు ప్రదర్శనము  అని పేరు.
   జావా రాజులు  మహమ్మదీయులైనా వారి ఆచారాలు హిందూ ఆచారాలే.  వారిని రాజులంటారు.  వారి కోటలో  ఈ  రామాయణ  భారత  నాటకాలు  అచ్చంగా  మన కూచిపూడి  విధానంలో  ప్రదర్శింపబడుతాయి. అర్జునుడు, రాముడు వారికి ఉత్తమ  నాయకులు.
   జావాలో ఆంధ్రదేశపు తోలు బొమ్మల వంటి  తోలుబొమ్మల కళ కూడా ప్రదర్శిస్తారు.  ఆంథ్రదేశంలోవలెనే  జావాలోను రామాయణం, భారత గాథలు ప్రదర్శిస్తారు. మన తోలుబొమ్మల ప్రదర్శనంలోవలెనే  హనుమంతుడు  రామాయణంలోనూ, అర్జునుడు భారత  కథలోనూ  ప్రాముఖ్యత  వహిస్తారు. తోలుతో  బొమ్మలుచేసి,  రంగులువేసి, అలంకరించి, తెల్లని తెరపై కెక్కించి, వెనుక దీపాలుంచి,  ఒక్కొక్కరే  సంగీతాలు పాడుతూ, ఒక్కొక్క  పాత్ర  నాడిస్తూ  ఈ  ప్రదర్శనం జరుపుతారు. బొమ్మలలో  కొంచెం  మంగోలియనుతనం వచ్చింది. అయిన  డిజాంగుగారితో, విల్హె ల్మినాతో  ఈ  ప్రదర్శనాలకు వెళ్ళినప్పుడు  వారికి  భారతదేశానికీ, యవద్వీపాదులకూ ఉండే  సంబంధం  అంతా ఆ  తోలుబొమ్మలాట. వాంగ్ నాట్య  విధానమూ,  సవిమర్శనంగా  వ్యాఖ్యానించి చెప్పాను. విల్హె ల్మినా  ఆశ్చర్యం పొందింది.
    భూషణ్!  మీ దేశం  నేను యాత్రలో  తిరిగినప్పుడు ఈ  అద్భుతాలు చూపించినవారు లేకపోయారు. ఎన్ని  నిధులున్నాయో  మీ  నాగరికతలో! అన్నది.
    అవునమ్మా! భారతదేశాన్ని  పూర్తిగా  అర్థం   చేసుకోవాలంటే, అసలు  భారతదేశం చూడాలి. అది  ఇంకా  తొల్లింటి  ఉత్తమరూపంలో కాకపోయినా, ఆ  రూపాన్ని  సర్వవిధాలా  దృశ్యం  చేయగలిగే  రూపంలో  పల్లెటూళ్ళలో  ప్రత్యక్షం అవుతుంది. 
 అయితే మీ దేశం  మళ్ళా  రమ్మంటావా? 
 తప్పకుండా,  ఈ పట్టు  స్వయంగా నేను మీ  కుటుంబానికి  దర్శకుణ్నయి, నా  దేశం  చూపిస్తాను. 
  కృతజ్ఞులము. ఓహో! ఆ  పవిత్ర  దినం కోసం  ఎదురుచూస్తూ  వుంటాను.
   డిజాంగ్ : మా  అమ్మాయికి  పెళ్లికాగానే,  దంపతులిద్దరూ   హనీమూన్ మీ దేశంలోనే  గడుపుతారు.
   తండ్రి  మాటలకు  విల్హె ల్మినా  సిగ్గుపడింది.     
   నేను  బటేవియా  ఓడ ఎక్కి  చక్కని  ఓడ  ప్రయాణం  చేస్తూ, సైగాను  పట్టణంలో  దిగాను. అచట  మూడురోజులునుండి  డిజాంగ్ గారి  ఉత్తరాలతో  వారి స్నేహితులైన  కొందరు  ఫ్రెంచి అధికారులను  కలుసుకొన్నాను. నాకు ఫ్రెంచి రాదు. కాని  ఒక తెలుగు  అరవ  మద్రాసీ సోదరుడు వీరి  కచ్చేరీలో  గుమాస్తాగా వున్నారు. ఆయన  మా ఇద్దరిమధ్యా దుబాసీ అయ్యాడు.
   సైగానులో  చాలామంది తెలుగువారు, ఎక్కువమంది  అరవవారూ  ఉన్నారు.  సైగానునుంచి బయలుదేరి  టోన్లేసావ్  చేరుకున్నాను.  టోన్లేసావ్  పెద్ద మంచినీళ్ళ చెరువు. దానిలో సయిమ్ రీవ్  అనే నది  పడుతుంది. సయిమ్ రీవ్ నదీ  సరస్సు ఒడ్డున  ఈవలావల  అంగోర్ వాట్, అంగోర్  ధామ్ లనే శిల్ప క్షేత్రాలున్నాయి. ఆ  ప్రదేశాలన్నీ చూచి, ఓడెక్కి ఇండియా చేరి  హరిద్వారం  వచ్చాను. ఆరు నెలలు  ఏకదీక్షతో  పనిచేసి, నేను తల పెట్టిన  పన్నెండు పంచలోహ  ప్రతిమలు  తయారుచేశాను. ఈ  పనికి సహాయం కాశీనుంచి ఒక మంచి  లోహకారుని  రప్పించాను. విగ్రహాలు చాలా  బాగున్నాయని స్వామీజీ  ఎంతో  ప్రశంసించారు.  ఆ  పన్నెండు  విగ్రహాలున్నూ; బర్మా, జావా. బలి, కాంభోజ దేశాలలో నేను రచించి సంపూర్ణం చేసిన  చిత్రాలు నలభై ఎనిమిదిన్నీ  1935 ఫిబ్రవరి నెలలో  ఢిల్లీలో  ప్రదర్శించాను. ఆ  ప్రదర్శనం  కూడా చాలా  జయప్రదంగా  జరిగింది.  బొమ్మలు ఎన్నో  ఖర్చైపోయినవి. ఒక మహారాజు  త్యాగతీ మందిరమని  తన విశాల  భవన మాలికతో ఒకటి  ఏర్పాటుచేసి,  నా చిత్రాలు ఒకేసారి  ఇరవై  కొన్నారు. విగ్రహాలలో  ఎనిమిది  కొన్నారు. ఈ అమ్మకంవల్ల నాకు ఆరువేల  ఎనిమిది  వందల  రూపాయలు వచ్చాయి. 


   స్వామీజీ నన్ను చూచి  నాయనా! నీ శిల్పవిద్యాభ్యాసం పూర్తి కావాలంటే  నువ్వు  చీనా, జపాను, అమెరికా, యూరపు, ఈజిప్టు  పర్షియాలు కూడా తిరిగి  రావాలి సుమా అన్నారు.
    స్వామీ! మన  సంప్రదాయాలకు  పూర్తిగా  వ్యతిరేకమయిన పాశ్చాత్య  దేశాలకు  పోవడం నాకంత  ఇష్టం లేదండీ. 
    ఓయి వెఱ్ఱిశిల్పీ! పాశ్చాత్యులు మనుష్యులుకారా! ఏ  మహత్తర  శక్తివల్ల భారతీయులు  ఉద్భవించారో, ఆ  మహత్తర  శక్తివల్లనే సర్వ మానవ ప్రపంచమూ ఉద్భవించింది. అందరికీ పశుధర్మము సమానం. మానవ  ధర్మమైన  శాస్త్రజ్ఞాన పిపాస  సమానం. దివ్యధర్మమైన కళాతృష్ట సమానం. ఇంక  మార్గాలు  దేశ  కాల  పాత్రలనుబట్టి వేరవుతాయి. కొన్ని నదులు  ఉత్తర  సముద్రాలలో, కొన్ని తూర్పు  సముద్రాలలో, కొన్ని దక్షిణ సముద్రాలలో,  కొన్ని పడమటి సముద్రాలలో లయమౌతున్నవి. కొన్ని నదులు  మహాసరస్సులలో  లయమౌతున్నాయి. ఈనాడు  సరస్వతీనది భూమిలోనే  ఇంకిపోతున్నవి. అలాగే  ప్రజాజీవిత ప్రవాహాలున్ను.
    స్వామీ! చోరుల జీవితం  కూడా  ఉత్తమమేనా? 
    దొంగలు  నాల్గురకాలు. ఒకడు  తిండిలేక దొంగతనం చేస్తాడు. ఒకడు తిండి ఉండి లాభం కోసం  దొంగ అవుతాడు. మరొకడు దొంగతనం జబ్బులవల్ల చేస్తాడు. ఇంకోడు మంచి చేస్తున్నాననుకొని  దొంగతనం చేస్తాడు. ఇంకోణ్ణి   చంపడానికి వచ్చే మనుష్యుని చేతిలోని ఆయుధాన్ని, అతనికి తెలియకుండా  దొంగతనం చేస్తాడనుకో! దానివల్ల ఒక ప్రాణం  రక్షించినవాడయ్యాడుకదా? అది మంచిదా  చెడ్డదా?  కనుక  ఇవన్నీ  మనం  సమన్వయం  చేసుకోవడంలో ఉంది. కారణంలేని  సంఘటన  ఏమీ  ఉండదు. అయినా  సమ్యక్  దృష్టి కలిగిన  ప్రతివాడూ జీవితంయొక్క సర్వధర్మాలు  గరుడని చూపులతో  చూడాలికదా! 
   నేను మౌనం  వహించి  స్వామి  మాటలలోని  అంతరార్థం  గ్రహించుకుంటూ  కూచున్నాను.
   మా  అమ్మగారికి  నేను  పాశ్చాత్య దేశాలు  వెళ్ళటం ఇష్టంలేక  పోయింది. స్వామీజీ  ఆమెను  సమాధాన  పరచారు.
   1915 అక్టోబరు నెలలో  బయలుదేరి  నేను  బొంబాయిమీదుగా ఓడమీద  ప్రయాణమై బాస్రా చేరుకున్నాను.  పర్షియా దేశము, మెసపొటేమియా మందు  చూచటం ముఖ్యమనుకున్నాను.  పర్షియా  నేటి  ఇరాను, పూర్వకాలపు పారశీకము; భరతదేశంలో  అత్యంత పురాతన కాలం  నుండీ  గాఢ సంబంధాలు  సంపాదించుకున్నది.
   వేదకాలంనాటి  అసురదేశము, పురాణకాలంనాటి గాంధారము అది. ఈ దేశానికీ, ఆంధ్రదేశానికీ  ఏదో  సంబంధం  ఉంది. ఈ  రోజున  ఆంధ్రులు  అయిసరమజ్జా అని  అంటూంటారు. అది  అహురమజడా  యొక్క  మారురూపమేమో, ఇవన్నీ నా  విపరీతాంధ్రత్వంలోని  వెఱ్ఱికొమ్మలని స్వామీజీ నవ్వుతూ అనేవారు. నేను  నా వాదన  నిజమనేవాడిని.  నిజమయి ఉండవచ్చునని స్వామీజీ  అన్నారు.
   బాస్రాలో దిగి, బాగ్దాదుపోయి,  అక్కడ  మకాం  పెట్టుకొని, టైగ్రీస్, యూఫ్రెటీస్ నదీ తీరాలలోనూ,  దూరంగావున్న ప్రాచీన  సుమేరు దేశ, చాల్డియన్దేశ,  అసురదేశ  మహాసిల్పాలన్నీ చూచాను. ఎన్నో శిల్పాలు  యూరపుఖండ రాజ్యప్రదర్శనశాలల్లో  అమెరికా  ప్రదర్శన శాలల్లో! టర్కీ ప్రదర్శనశాలలోనూ వున్నాయి.     ఈ పూర్వ  సంస్కృతులు క్రీస్తుపూర్వం5,000 బి. సి. నుంచో, ఇంకా అంతకన్న  ప్రాచీనాంగో ప్రారంభం అవుతాయి. అనేకులు  పాశ్చాత్య పండితులు,  సర్వ ప్రాచీన చరిత్ర  సామాగ్రి సమగ్రంగా పరిశీలించి చరిత్రలు  వ్రాశారు. గ్రామాల  కచట  ఊరు, నిప్పూరు, శిరివూరు, అసూయ  అని పేర్లు  ఉన్నవి. వీరు  భరతదేశంనుంచి వలస  వచ్చారని  పాశ్చాత్య పండితులు  కొందరు  వాదిస్తారు. సుమేరు  పర్వత  ప్రాంతం నుంచి  సింధుతీరంలో  ఉన్న వారుగనుక వీరికి  సుమేరులని  పేరు వచ్చిందని  నా  ఉద్దేశం. వీరిదేవుడు  సూర్యుడు. సుమేరియలను  సమితి, లేక  సేమిటక్ జాతివారు  ఓడించి, వారి దేశంలో  రాజ్యాలేర్పరచారు. ఆ  తర్వాత  పర్షియానుంచీ, సింధునదినుంచీ వచ్చారు. ఆ తర్వాత  పర్షియను  మీడులు  ఆ దేశం ఆక్రమించారు.  ఈ  రాజ్య  పరంపరల  చిహ్నాలు  మహాశిల్పాలై, మెసపొటేమియా, పర్షియాలలో వున్నాయి.                                                                                                                           
           
               

వీరి తర్వాత అసుర రాజ్యాలు వచ్చాయి. వారినే అస్పీరియను లంటారు. వీరు సుమేరియనుల తర్వాత వచ్చారు. అక్కడినుండి సేమిటక్, హిట్టయిట్ రాజ్యాలు వచ్చాయి. మన దేశంలో సింధునదీ తీరంలో మొహంజాదారో బయల్పడిన సంస్కృతికీ, ఈ సంస్కృతికీ చాలాచుట్టరికం వుంది. యూఫ్రటీస్, టైగ్రీస్ నదుల మధ్యదేశమే ఆదాము అవ్వల ఈడెను దేశమట. ఇవన్నీ నెలరోజులలో చూచుకొని, నేను పర్షియాదేశం వచ్చాను. మొదట టెహరాన్ వెళ్ళి అచ్చట విహ్నలే చూచాను. దారిలోనే బాబిలోనియా అను పట్టణం చూచాను.

   ఇరాన్  అంటే  ఆర్యను  అన్నమాట. ఇరాన్  దేశము  అంటే  ఆర్యదేశమనే! పర్షియా చుట్టూ ఎత్తయిన  కొండలున్నాయి. ఆ  కొండలలో  రాజులు  తమ  శవాలను  పాతిపెట్టడానికి గుహలు  నిర్మించుకొన్నారు. ఆ  గుహాముఖాలంతా అద్భుత  శిల్పసంస్కృతి నిండి ఉన్నది.
       
                                                                                                               13
   
   లోక  సౌందర్యము  మూర్తికట్టిన లోకశిల్పం దర్శించిన  ప్రతి  రసహృదయుడూ  రాకాచంద్రకిరణ కాంతిస్నాతమైన  చంద్రశిలలా  కరిగి పోతాడు. గాఢ కామేచ్ఛతో సుందరియైన ప్రియురాలి  శయన మందిరానికి  పోయిన  నాయకునిలా ఆర్ధ్రజీవియైపోతాడు. బాగ్దాదు పట్టణం  వెళ్ళినప్పుడు  ఆ  విధులన్నీ  తిరుగుతూ  అరబ్బీనైట్సు కథలకు  పుట్టినిల్లయిన హారోన్ అలఠాషిద్ గారి భవనం  ఊహించుకొన్నాను. ఆనాటి  దివ్యసుందరుల  గాథలు  కళ్ళకు  కట్టాయి. నిజంగా  ఆ దేశంలోని వనితలందరూ సుందరులే. సాయంకాలాల్లో వారి మేడలపైన కొందరు  బాలికలను  చూచాను. అరబ్బీనైట్సులోని  హౌరీలు నా ముందు  నాట్యం  చేసినట్లే అయింది.

. నన్నూ ఏ ఉత్తమ కుటుంబ యోషారత్నమయినా ఈ పూట మా యింటికి భోజనానికి రండి అని పిలిచి చక్కగా ఆ తివాసులపై కూర్చుండబెట్టి తీయటి షరబతులను, రోజా పన్నీటిని కలిపి హుక్కా అందిస్తూ, డల్ సిమియరు వాద్యం తీగెల తన రింగారు పొడుగాటి వేళ్ళతో మీటుతూ, దానిమ్మపండు గింజల ఎరుపు పెదవుల కదుపుతూ, బుల్ బుల్ గొంతుకతో పాడుతూ నన్ను ఏ అప్సర లోకమో తీసుకొనిపోవునాఅని ఊహించుకొన్నాను.

   నా  చిత్రలేఖనాలు, బ్రిటీషు అధికారి భవనంలో  ఉన్న  ఒక  అరబ్బీ ఉద్యోగి  చూచి చాలా  ఆనందించాడు. ఆ  అరబ్బీ  ఉద్యోగి  ఆక్సు ఫర్డు విశ్వవిద్యాలయంలో  ఎం. ఏ. పరీక్షలో  కృతార్థుడైనాడు. ఇంగ్లీషు ఆంగ్లేయుల  వలెనే మాట్లాడగలడు. ఆయన  పేరు  ఖాలిద్-ఇబినె ఒమారుగారు. ఆయన  ఇంటికి  నేను ఒక రోజున  తేనీటి విందుకు  అతిథి నయ్యాను. ఆయన  సహోదరి టర్కీదేశ రాజధాని  ఆంకారాలో బి. ఏ. చదువుకొంటుంన్నది. ఆమెకు  టర్కీలో  పరదాలేదు. కాని  బాగ్దాదులో  పరదా ఉన్నది. ఆమె తన  ఇంటిలో చదువుకున్న  వారికడను, నూత్నాచార పరులకడను పరదాపాటించదు. సకల అరబ్బీయ రాజ్యాలు కలిసి  ఒక యుత్తమ సంయుక్తరాజ్యంకావాలని ఆమె వాదన. అమెరికా  సంయుక్త  రాజ్యాలవంటి సంయుక్త  రాజ్యసంస్థ ఉండాలని  ఆమె వాదించింది.  అనేక శాస్త్రవిషయాలలో  ఆమెకున్న  అసమాన జ్ఞానం  నాకు ఆశ్చర్యం  కలిగించింది. ఆమె  చిత్రలేఖనము కూడ  ఆంకారాలో నేర్చుకొనుచున్నదట. తమ  దేశములో  బయల్పడిన  అతి ప్రాచీననాగరికతను గూర్చి  బాగా  చదువుకొన్నది. ఆమెయే సుమేరు. చాల్డియా, అస్సీరియా ఎలామైటు, ఇరానియను సంస్కృతులగూర్చి  నాతో  చాలాకాలం చర్చించింది.
   ఇరాఖ్ లో  దొరికిన  పూర్వ  సంస్కృతిని  పాశ్చాత్యులందరు తమ దేశాలకు తరలించుకొనిపోవుట  కామె ఎంతయో విచారము  వెలిబుచ్చుతూ  తనకే  శక్తియుండిన, పాశ్చాత్యదేశాల  మ్యూజియంలో ఉండిన  శిల్పవస్తు  కోటిని  తిరిగి  తీసుకొనివచ్చి  బాగ్దాదులో ఒక పెద్ద  ప్రదర్శనశాల నిర్మించి అందులో  ప్రదర్శింతుననియు  చెప్పినది. ఆమె  పేరు  అజరా-బిన్-తె ఒమార్. నేను  మీతో  పూర్తిగా  ఏకీభవిస్తానన్నాను.
   అజరా : మీ  దేశంలో  మా  ముస్లిం  స్త్రీలు  ఏ  స్థితిలో  ఉన్నారు?
   నేను : మా దేశంలో  ముస్లిం స్త్రీలు చాలా  వెనుకబడి ఉన్నారు. పరదా  పోలేదు. కొంతమంది  పెద్ద కుటుంబంవారూ, ఉద్యోగులూ పరదాలు తీసివేశారు. ఖోజాలు మాత్రం  చాలా  ముందుకు  వచ్చి  ఉన్నారు.
   అజరా : మా  అన్నగారు  చాలాసార్లు   బొంబాయి, కరాచీ, ఢిల్లీ  మొదలయిన ప్రదేశాలు వెళ్ళివచ్చారు. ఆయన  తెలుసుకొన్నవన్నీ నాతో చెబుతూ వుంటారు.
   నేను  ప్రభుత్వ  వ్యవహారాలవల్లనూ, సరదాగానూ మూడుసార్లు మీ దేశం తిరిగాను. మా చెల్లెలుకూడా  ఒకసారి  భారతదేశం తిరగాలనుకొంటోందిఅన్నారామె అన్నగారు.
   నేను :  వారు తప్పకుండా  వచ్చి  మా దేశం అంతా తిరగాలని  నేనూ కోరుతున్నాను. మాలో ఉత్తమ కవి  ఇక్బాల్ గారూ, ఉత్తమశిల్పి చాగతాయి గారూ ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. నాకు  మీ  అరబ్బీయ సంస్కృతంలో ఏదో  పరమ  మధురమైన  మార్దవము కనపడుతుంది. నిజంగా  ఆలోచిస్తే, ఒక సంస్కృతి  ఇంకో  సంస్కృతికి  వ్యతిరేకంగా ఉండగలదా అనుకుంటాను.
   అజరా : అక్కడ  మా  ముస్లిం కవులు  మీ దేశభాషలలో కవిత్వం  ఏమన్నా వ్రాశారా?
   నేను  : ఎంతోమంది వ్రాశారమ్మా! బంగాలీలో నజురుల్  ఇస్లాం గారూ, గుజరాతీలో  షయదాగారూ , తెలుగులో  ఉమర్-ఆ-లీ-షా గారు కవిత్వాలు వ్రాశారు.
   వారిదగ్గర శలవు పుచ్చుకొని  అజరాకన్య అందమునకు మనస్సులో జోహారులర్పిస్తూ  నా బసకు  వచ్చేశాను.
   
                                                                                                          14
   పుణ్య  ప్రదేశాలలో  మహామధురకవి  ఒమారుఖయ్యాం   జీవించిన  పవిత్ర ప్రదేశాలు ప్రత్యక్షం అవుతాయి అన్న  ఏదో  పులకరింపు, ఏదో మహానుభూతి నాకు వివశత్వం కలిగించినవి. ఎవరో కొద్దిమంది ఒమారు పేరు  ఎరుగుదురు. ఆ  మధురకవి పేరు  వారి కవసరములేదు. ఆయన వేదాంతమూ  వారి మతానికి  దూరం. ఆయన సున్నీ, వారు షియాలు. అతని పేరు ఒమారు. పరిషియాకు విరోధి అయిన  ఖాలిఫ్ ఒమారును జ్ఞాపకం  చేస్తుంది  ఆ  అమృతకవి పేరు.                                                                                                                           
           
               

నేను నిషావూరు వెళ్ళాను. నిజంగా ఈనాడు ఆ నగరంలో వెనకటి సౌందర్య నిషాలేదు. నేడది నిశాపురం. ఈనాడు అక్కడ ఒమారు చెప్పినట్లు చక్కని కుండసామాను చేస్తారు. ఒమారు వర్ణించిన అందమైన బజారులు ఈ రోజున ఏవి? అతను చదివిన మదస్రా ఏది? అతడు వర్ణించిన మైదానం ఎక్కడ? ఒమారు గోరీ చూచాను. అక్కడ ప్రసిద్ధుడైన ఫరీద్-అద్-దీన్ గోరీని చూచాను. ఆయన గోరీ పక్కనే ఇమామ్జడాహ-మహరుఖ్ మసీదూ చూచాను. చక్కని నీల గుంబాజ్ తో ఆ మసీదు సుందరమైన శిల్పరూపం. ఆ మసీదు ఆవరణలో తోటలో ఒమారు గోరీ, ఉన్నది. అతడు తన భవిష్యత్తు చెప్పుకొన్నట్లు అతని గోరీ పూవుల వర్షం కురిసేచోటనే ఉన్నది. నాకు కన్నీరు తిరిగింది.

   నిషాపూరు అత్యంత పురాతన నగరం. క్రీస్తుశకం మూడవ  శతాబ్దంలో నస్పేనియన్  రాజు  ఒకడు  ఈ నగరాన్ని నిర్మించాడు. నవషిపూరు నిషాపూరు అయింది. క్రీస్తుశకం1038లో పెల్ జుకీ వంశీకుడు టుగ్రిల్ బేగ్  ఈ నగరం  రాజధానిగా  చేసుకొని  రాజ్యం స్థాపించాడు.  టుగ్రిల్ బేగ్ షా అన్న మనుమడు  మాలిక్ షా  కాలంలో  నిషాపూరులో  ముగ్గురు  సహాధ్యాయులు మిత్రులు ఉండేవారు. వారే మహాకవి  ఒమారూ, మహామంత్రి నైజామ్. ఆలీ-ముల్కో, హషీషిన్ జట్టు(స్వర్గం చూపిస్తానని కోటీశ్వరులకు చక్కని బాలికలున్న భూతలస్వర్గం  చూపి  వారి ఆస్తి  లాగి  చంపేవారు). నాయకుడు  హిసారు ఇ-సభాహయన్ను. ఈ  ముగ్గురిలో  ఎవరు జీవితంలో  ముందుగా  అభివృద్ధిలోకి వస్తారో, అతడు  తక్కినవారికి  సహాయం చేయాలని వారు మువ్వురూ రక్తశపథాలు తీసుకున్నారట. ఆ శపథాలు నిలుపుకున్నారు.
   ఒమారు చనిపోయిన  కొన్ని సంవత్సరాలకు  ఈ  పట్టణాన్ని మొగలులు  పూర్తిగా  దోచి నాశనం చేశారు. ఆ  తర్వాత  పునరుద్ధరింపబడి మళ్ళీ వృద్ధిపొందిందీ నగరం. ఆయనా భూకంపాలు, టర్కోమానుల  దోపిళ్ళు  ఈ తోటల  నగరాన్ని  రూపుమార్చి నేటి బీద నగరాన్ని  లోక స్మృతిపథానికి అర్పిస్తున్నవి. ఈనాటి  ఇరుకు  సందులు, దుమ్ము బజారులతో నిండిన  ఈ  నిశాపురం, ఆనాటి ఒమారు  నగరానికి  స్మృతిచిహ్నం మాత్రం.    
   ఒమారు ' రుబియాట్ ' గ్రంథం చక్కని  బొమ్మలున్నది   నా   దగ్గర  ఉంది. అందులో  ఒమారు గోరీ తోటలోని  గులాబీపూవుల రేకులు  కొన్ని  ఉంచాను, ఒక చక్కని  శిల్పరూపమున  మృణ్మయకలశము చిన్న ప్రార్థన రత్నకంబళి ఒకటీ, ఇంకను  కొన్ని  వస్తువులు, ఆ  ప్రదేశంలో  దొరికిన  పూర్వనాణేలు కొన్ని సంపాదించి, వెంటనే   పరిషియను  ముస్లిములకు పవిత్రమైన మాషాద్ పురం చేరుకున్నాను.
       ఏది ఒమారు తిరిగిన  సారాయి  దుకాణం? ఏ  తోటలో  తిరిగినాడు? వెలుగు కిరణాలు పడిన  సుల్తానుగారి భవనగోపురంఏది? ఎక్కడ ఒమారు? అని ఆలోచించుకుంటూ నాలుగు  గుఱ్ఱాల ప్రయాణపు బగ్గీమీద మాషాద్  చేరుకున్నాను. దారిలో హసనాబాద్  చూచి  అబ్బాద్ షా  గోరీ  చూచాను.
   ఇరాన్ లో  షియా ముస్లింలకు మాషాద్  అత్యంత  ముఖ్యమయిన పవిత్రప్రదేశం. ఇక్కడ వారి  ఎనిమిదవ  ఇమామ్ రిజాగారి దర్గా ఉన్నది. దీనిని వీరు మక్కాతో  సమంగా చూస్తారు. నజాఆలీ  నగరంలోని  దర్గా, కల్బరాలోని  హుసైన్ దర్గా కూడా వీరికి పవిత్ర ప్రదేశాలు. రిజాఇమాం మొహమ్మదువారి తర్వాత  ఎనిమిదవ  ఇమాం. ఈయన కుహార్  ఆరోన్ రషీద్  ఖాలిఫ్ గారి కూతుర్ని యిచ్చి వివాహంచేసి  గౌరవించారు. ఆలీ - రషీద్ కుమారుడు మామాన్ గారు  రిజగార్కి  విషం ఇచ్చి చంపించి  వేశారు. ఖాలిఫ్  హరోనుగారి  గోరీ, రిజాగారి  గోరీ  దగ్గరే  ఉంది.          15
   నేను మాషాద్  పట్టణాన్నుంచి ఇంకో పారసీక మహాకవి  పుట్టి నివసించిన  ప్రదేశం చూద్దామని టస్  నగరం  చేరుకున్నాను.  టస్  నగరం ' అవెష్టా ' పారశీక మతగ్రంథమంత  పురాతనం. ఆ  పవిత్ర  గ్రంథములో ఉన్న తుపా మహానాయకుడు. అతడు  తురాన్  దేశవిజేత. ఆయనే  ఈ నగరం దర్శించాడు. మంగోలులీ నగరాన్ని  పూర్తిగా  ధ్వంసం చేశారు. కాని నేడు  ఎంత  శిధిలమైవున్నా, పిరదౌసీ  మహాకవి  ఈ  నగరంలో  జన్మించిన కారణాన ఈనాటికీ ఈ ప్రదేశం  లోకానికంతకూ  పవిత్రం. అయింది.
   ఒమారు ఖయ్యాం మహాకవి  అని పారశీక ప్రజలకు  తెలియకపోవచ్చును గాని  పిరదౌసీని యెరుగని  పారశీకుడొక్కడైనా లేడు. నన్నయ్య, తిక్కన్న, పోతరాజులను ఎలా  సర్వాంధ్రులు పూజిస్తారో అలాగే  పిరదౌసీని ఇరానీయులు పూజిస్తారు. పిరదౌసీ  క్రీ/శ 935సంవత్సరంలో  టస్ నగరంలో జన్మించాడు. 1025లో అక్కడే  చనిపోయాడు. బ్రతికివున్న 90సంవత్సరాలలో  అనేక  సుఖాలు, కష్టాలు, జీవిత విజయాలూ, దుర్గతులూ అనుభవించాడు. గౌరవమూ, అగౌరవమూ పొందాడు. ఆ  మహాకవి  ప్రపంచోత్తమ  గ్రంథాలలో షానామా అనే  ఉత్కృష్ట కావ్యాన్ని రచించాడు.
   పిరదౌసీ అంటే 'స్వర్గధామం' అని  అర్థం. ఈతడు అత్యంత పురాతనమైన  ఇరానియన్ వంశాలవాడు. అరబ్ సంస్కృతిని  టస్ నగరమూ, ఇరానూ భరించలేక  పోయింది. దేశం  అంతా  తిరుగుబాటు చేసింది. ఆ తిరుగుబాటు యొక్క  దీప్తకంఠమే పిరదౌసీ. ప్రాచీన  వీరుల ధీరోదాత్తత, మా దేశం గొడ్డుపోలేదన్న  దేశభక్తి  అకుంఠితమై, మహాగంభీరమై  అతని వాణిలో ప్రవహించింది. ఈ  ధీరగాథాలాపనంలో ఈతని  పూర్వీకుడు  డకీకి కవి. కాని  టుర్కోమాన్ హంతకుడొక డాతని ప్రాణం దొంగబాకుకుగురి చేశాడు. ఆ డకీకి కవి  స్వప్నంలోవచ్చి  తాను  ప్రారంభించిన పని  పిరదౌసీని సంపూర్ణం  చేయమని  కోరినట్లు పిరదౌసీ  చెప్పుకున్నాడు


   జరాతృష్టుని  గూర్చి వేల పద్యాలలో పాడిన డకీకి కవిత్వం తన 'షానామా' లో పిరదౌసీ చేర్చుకున్నాడు. ఈ  గ్రంథం ప్రారంభించేసరికి  పిరదౌసీకి 40ఏళ్ళున్నాయి. ఒక్క  కొడుకూ పోయాడు. ఆ  విచారగానమూ  ఈ  ఉత్కృష్ట కావ్యంలో  శోకరాగాలు పాడుతుంది. ఒక్క కూతురు అతని  జీవితాంతంవరకూ  పరిచర్యచేస్తూ  బ్రతికివుంది. ఈ  మహాకావ్యం తలపెట్టి  పిరదౌసీ  గజనీ  మొహమ్మదు  రాజసభకుపోయి  అక్కడ  సభారత్నమై అరవై వేల ద్విపదలుగా షానామా  రచించాడు.  ఆ  గ్రంధాన్ని గజనీ మొహమ్మదు చాలా  గౌరవించి, తగిన  పారితోషికమిస్తానని  అన్నాడు. కాని  గజనీస్తులాను అరవై వేల  వెండి నాణేలు మాత్రం పంపాడట. అరవై వేల బంగారు దినారాలు వస్తాయని పిరదౌసీ ఆశించాడు. దానితో  ఈ  డెబ్బది  ఏండ్ల ముసలి కవికి కోపంవచ్చి  ఆ  నాణేలు తన సేవకులకు  పంచి  తాను దేశం వదలి  పారిపోయాడు.                                                                                                                           
           
               
మొదట తన్ను  గజనీ మొహమ్మదు తన  రాజసభా  కవిరత్నాలలో  ఒకణ్ణిగా తీసుకున్నప్పుడు  పిరదౌసీ  ఆ  సుల్తాన్ పై  ఆత్యద్భుతమైన పద్యాలల్లాడు.  నేడు కోపంలో  ఆ భాగం అంతా  షానామా  నుంచి  తీసివేశాడు. పైగా గజనీని  హేళనచేస్తూ భయంకర  హాస్యకావ్యం ఒకటి  రచించాడు. పదేళ్ళు  నిలువనీడలేక తిరిగి చివరకు  లూబరిస్తాను సుల్తాను సభాకవిగా అతడు చేరాడు. ' యూసుఫ్ జులైఖా' అనే  కావ్యం  రచించి   ఆ  సుల్తానుకు  అంకితం  చేశాడు. తన  ప్రాణం  టస్ నగరంచేరి అక్కడ  దుఃఖంతో ప్రాణాలు  విడిచాడు.
   అక్కడ గజనీమొహమ్మదు  పారిపోయినప్పటినుంచీ  కించపడి తన మంత్రిన్నీ, పిరదౌసీ ప్రాణస్నేహితుడూ  అయిన  ఆల్ మియమాందీ సలహా  పాటించి  తనకడనుండి  పారిపోయిన  ఇరవై  ఏళ్ళకు  అరవై వేల  బంగారు  దీనారాలు  ఒంటెలపై  ఎక్కించి ససైన్యంగా  పంపించాడు.  ఆ  సమయంలోనే పిరదౌసీ  శవాన్ని  తీసుకుపోతున్నారు. పిరదౌసీని  అతని  తోటలోనే  సమాధిచేశారు. షియా అవడంవల్ల  సాధారణ  ముస్లిం సమాధి స్థలంలో  కొందరు  మతకర్తలు అడ్డం  పెట్టారట.
   ఎక్కడ ఉన్నదీ మహాకవి గోరీ? నగరం  అంతా  హంపీ శిథిలాలకన్న పాడైన స్థితిలో  వున్నది. అక్కడ కొందరు  ఇది అని నగరపు  గోడల దగ్గర  ఒక స్థలం  చూపించారు. ఆ  ప్రదేశమేనని జనశ్రుతివస్తూ  వుంది. ఓ  మహాకవీ! నీ  కవిత్వమే ఆకాశాన్ని  అంటే దివ్యభవనం నీకు  నీ  దేశస్థులే ఒక భవనం కట్టలేకపోయారా? నువ్వు  సర్వదేశాలకు వినిపించిన  ఉత్తమ  కావ్యం  మసక  మసకలాడక దెసలన్నీ నింపే కాంతై వెలుగుతూ వుంది. ఆ  సాయంకాలం  ఆ  శిధిలాలలో  కూరుచుండి పిరదౌసీకి  నా  హృదయాంజలి అర్పించాను.
                                                                                                                16
   1935 డిశంబరు  నెలాఖరుకు  ఈజిప్టు చేరాను. పిరమిడ్లు, తీబ్సు, కొనారక, మొపిస్ పట్టణాలలో ఉన్న ప్రాచీన ఈజిప్టుదేశ  సంస్కృతి  దర్శించి, 1936 జనవరిలో  గ్రీసుదేశం  చేరాను. ఏథెన్సు, స్పార్టా, ఒలింపను, కారిస్తు, డెల్ఫీ మొదలయిన  ప్రదేశాలు చూచి ఇస్తంబోలు పట్టణం చూచాను. అక్కడ నుంచి బెల్ గ్రేడ్, సోఫియా  పట్టణాలు  చూచి, ఇటలీ చేరుకున్నాను. ఇటలీలో  రోము, వెనీసు, ప్లారిన్సు, నేపిల్సు మొదలయిన  శిల్పక్షేత్రాలు దర్శించి ఉత్తరాఫ్రికా మొరాకో  1936 మార్చిలో చేరాను. ఫెజ్, ట్యూనిస్, సహారాలో  చాలా కొద్ది భాగం చూచుకొని,  అక్కడ నుండి స్పెయిను వెళ్ళి  మాడ్రిడ్ పట్టణం, అల్హంబ్రా మొదలయిన ప్రదేశాలన్నీ చూచాను.
   1936 ఏప్రిల్ నెలాఖరున పారిస్ పట్టణము  చేరాను. పారిస్ లో  లోవరి  ప్రదర్శనశాలలో రోజులు  గడిపి, మార్సలే, వార్సైల్, రీమ్సు దేవాలయం మొదలయినవి దర్శించాను.
   మే  ఉత్సవాలకు  రష్యా  చేరాను. రష్యా దేశంలో  శిల్పక్షేత్రాలను  చూడడానికి,  నవీన సాహిత్యం,  శిల్పం దర్శించడానికి  పూర్తిగా  ఒక నెలా ఇరవై రెండు  రోజులు  పుచ్చుకున్నది.  
   జూను  నెలాఖరుకు  నార్వేచేరి జూలై  పదవతారీఖువరకు  నార్వే, స్వీడనులు చూచి, ఇంగ్లండు, స్కాట్లండు, వేల్సు, ఐర్లండులు  దర్శించడంలో ఆగస్టు  పూర్తయింది. సెప్టెంబరు మూడవ తారీఖున బెల్జియంలో దిగాను. బెల్జియం, హాలెండు, డెన్మార్కులు చూచేసరికి అక్టోబరు పదిహేనవ  తారీఖు వచ్చింది. మళ్ళీ లండను  మహానగరంపోయి, అక్కడ  అక్టోబరు ఇరవై తారీఖున  ఏర్పాటు చేసిన   నా  చిత్ర లేఖన ప్రదర్శన సమయంలో  వున్నాను. ప్రదర్శన విషయంలో  అనేక  పత్రికలు అనేక రకాలుగా  మెచ్చుకుంటూ వ్రాశాయి.
   1936 డిశంబరు నెలలో మళ్ళీ  నా  దేశం చేరుకున్నాను. దేశాలు తిరగడం ప్రారంభిస్తే, అది  నల్లమందలవాటైపోతుంది. 1937-38 సంవత్సరాలు రెండూ  మా  అమ్మగారితో  భారతదేశ క్షేత్రాలన్నీ దర్శించాను.
   ఇన్ని  దేశాలు  తిరిగినది నన్ను  కర్మవీరుణ్ణి చేసుకొనేందుకే కాదూ? ఏదో నాలో  అసంతృప్తి బయలుదేరింది. ఒక్కొక్క  మహాశిల్పమే దర్శించి  నా  అల్పత్వాన్ని  తలచికొని నిట్టూర్పులు పుచ్చాను. నాలో శిల్పం శక్తి ఎంత? ఏమి  నేను రచించాలి? ఏ  మహాభావ్యం మూర్తించగలను?  యూరపులో  ఈ  ఆవేదనే  అనేక  వెర్రితలలు వేసింది. డాడాయిజము, సర్ రియలిజము, క్యూబిజము, సింబాలిజము, ప్రిమిటిజము ఇలా అని, వారికేమీ తెలియని, స్థిమిత హృదయంకాని స్థాయి చిక్కని ఆరాటంలో అన్ని వైపులకూ శిల్పులూ, చిత్రకారులూ పరుగులిడుతున్నారు. దేశకాల పాత్రలను  పట్టి మార్పులు రావచ్చును. శిల్పంఅంతా ఒకేనది కావాలి. ఆ  నందికొండల్లో ఒకవిధంగా ప్రవహిస్తుంది. బయళ్ళలో  ఇంకోవిధంగా యానం చేస్తుంది. వేసవికాలంలో నీలజలాలతో కృశాంగి అవుతుంది. వానాకాలంలో  మహావేగియై  గట్టులుపొర్లి ప్రవహిస్తుంది,  అంతేకాని  సంవత్సరానికో  కొత్తనది వానచూరుకాల్వలా బయలుదేరదు. అసంతృప్తి, ఆవేదనా కళలలో  సిద్ధిని ప్రసాదించవు. నా దేశం  తిరగటములోనే  నా  జీవియొక్క స్థాయీ భావం ప్రత్యక్షం అయింది. అది దూరదూరాననే! ఆ  స్థాయిని నాకు సన్నిహితం  చేసుకోవడం ఎలాగు? యూరపునుంచి వచ్చినప్పటినుండీ  ఈ  అసంతృప్తి నన్ను  హత్తుకుపోయింది. ఒక చిత్రము పూర్తిగా  రచింపలేను, ఒక శిల్పమూ పూర్తిగా విన్యాసం చేయలేదు. గీతాలుగా కొన్ని, రంగులు పులుముడులుగా కొన్ని, రూపం తేలని మూర్తులు, భావం తేలని కలయికలు, స్పుటత్వం తాల్చని కుంచెసారింవులైపోయినవి.
   నేను  స్వామీజీ   దగ్గరకుపోయి,  స్వామీజీ! నాలోవున్న  కళ నాశనం  అవుతున్నదా?  అని అడిగాను.
    ఓయి శిల్పి! నీలో  సగం లోటుగా ఉంది. నువ్వు  పాశ్చాత్యకళలు  దర్శించావు. విల్హె ల్మినా, సుశీలతో చేసిన  స్నేహచరిత్ర రహస్యం  కొంచెం  నాతో చెప్పావు. నీలో లోటయిన ఆ సగమేమిటో నువ్వు  గ్రహించలేకపోయావా?  నీ యూరపు  యాత్రలలో, ఏదో  వాంఛ  నిన్ను  వెంబడిస్తూన్నట్లు భావించాను అని  నాతో చెప్పావు.  అంగకరువాటులోని నాట్యస్త్రీ శిల్పం  దగ్గర  కన్నులు నీరు  తిరిగినవి అన్నావు. పాలం పేట నృత్యమూర్తి దగ్గర  ఏదో మహత్తరమైన  బాధ అనుభవించానన్నావు. శ్రీనాథమూర్తీ! నీ పరీక్షా  సమయం  ఇంకా  దాటలేదోయి, నువ్వు నీ అర్ధభాగాన్ని  వెదికి  వెదికి  ప్రత్యక్షం  చేసుకో! ఆ  తపస్సుతో, ఆ  దర్శనంతో  నీకు సిద్ది  సంభవిస్తుంది అని స్వామీజీ  నాకు   ఉపదేశించారు. ఆయన  మాటలు  నాకేమీ అర్థంకాలేదు.                                                                                                                           
           
               
                                                                                                                   17
   నా శకుంతల  నన్ను వీడి ఏడు  సంవత్సరాలైంది.  ఆమె  నేను దర్శించిన  ప్రతి ఉత్తమ  శిల్పంలోనూ  నాకు  ప్రత్యక్షమయ్యేది. పాశ్చాత్య శిల్పాలలో  ఆమె విలాసాలు  చూచాను.  1938 ఏప్రిల్ లో  బయలుదేరి  చీనా, జపాను దేశాలు దర్శించినప్పుడు, జపాను శిల్పవిన్యాసంలో  హృదయమూ, చీనా  శిల్పాలలో  ఆమె  యోగమూ ప్రత్యక్షముయ్యాయి.  భారతీయ శిల్పంలో నా  శకుంతలాదేవి దివ్యత్వమే  నా  బ్రతుకును  పవిత్రం  చేస్తూ  ఎదుట  గోచరించినది.
   చీనా, జపాను దేశాలు తిరిగి తిరిగి  మళ్ళీ  వస్తూంటే  నాకు  అంగకరువాటు శిల్పమూ, బోరోబదూరు శిల్పమూ  తిరిగి  దర్శించాలని  కోర్కె కలిగింది. అంగరువాటు  ప్రయాణం  అంతా నా మనోవేధిలో  ప్రత్యక్షం  అయింది. అంగకరువాటులో,  అంగకరు థాములో పదిహేను రోజులు మకాము చేసి  ఆ  శిల్పమూ, ఆ గుడుల అందమూ  అన్నీ  గమనించాను.  ఈ  శిథిలాలయాలున్న  ప్రదేశమంతా, ఒకనాడు మహాపట్టణం.  కాంబోడియా లేక  కాంభోజ దేశానికి  ఇది  రాజధానిగా  ఉండేది.  తమ సంస్కృతిని పరదేశాలలో ప్రజ్వలింపచేసి, అనాగరికమై, రాక్షసమై వున్న  ఆ  దేశాలను నాగరికతతో  నింపిన  పూర్వ  భారతీయులు మహోత్తములుకదా!
   ఎక్కడ మలయా ద్వీపము! ఎక్కడి భారతదేశం!  ఆస్ట్రేలియా, అమెరికాలను నెగ్గి, అక్కడ రాజ్యాలు నెలకొల్పడానికి  పాశ్చాత్యులు ఎంతో కష్టపడ్డారు. కాని భారతీయులు ప్రజలను తమవారిగా చేసుకొని, వారితో  సంబంధబాంధవ్యాలను నెరపుతూ  నూతనరాజ్యాలు నెలకొల్పారు. మలయా, జావా, బోర్నియో, సుమత్రాలన్నీ మలయద్వీపలుగా  పరిగణింపబడేవి. ఇండోచీనా కూడా  మలయ ద్వీపమనే  పూర్వనామం.  ఈ  దేశంలోకి  భారతీయులు  వచ్చేసరికి,అనాగరులైన  మంగోలియనుజాతి  అన్నాములను, చీనానుండి రాజ్యం పేరను  వచ్చిన  దక్షిణ  చీనావారును ఈ దేశం అంతా  నిండి  ఉండేవారు. భారతదేశ  తూర్పుతీరస్థులైన కళింగ, చాళుక్యాంధ్రులు అంతకుముందు శాతవాహనకాల, తదనంతరకాల ఆంధ్రులను ఇండోచీనా తీరంచుట్టి చీనాదేశం  ఓడ  వర్తకానికి వెడుతూ  ఈ  దేశంలో కొన్ని  ప్త్రదేసాలు  తమ  మకాములుగా  చేసుకున్నారు.
   ప్రథమాంధ్రులు  ఈ  దేశవాసులకు  క్ష్మేరులు అని పేరు  పెట్టి  రాజ్యస్థాపనం చేశారు. వీరు  విష్ణుకుండిన వంశీకులై ఉండవచ్చును.  ఈ  రాజ్య వంశీకులు క్ష్మేర  రాజ్య  కన్యల వివాహమాడి, తమతోవచ్చిన క్షత్రియులనట్లే చేయించారు. వీరితో బ్రాహ్మణులు వలస వచ్చారు. రాజులలో  శ్రుతవర్మ యశోవర్మలు  ప్రఖ్యాతి గాంచారు. సముద్ర  మధ్యదేశమని   మన  పూర్వీకులు  తలవడంచేత  దీనికి కంబుజ లేక  కాంభోజ దేశం  అని  పేరు పెట్టారు. ఈ  కుటుంబాలు  రెండై, రెండు రాజ్యాలు స్థాపించాయి. ఆ  నూతన  ద్వితీయ రాజ్యం  పేరు  చంప.
   తోస్లే సావ్, తోయధి  అనదగిన మహాసరస్సు. ఈ  ఆంధ్ర వంశీకులే ఇప్పటికీ ఫ్రెంచివారికి  మాండలీకులై  ఈ  రాజ్యాన్ని  రాజ్యం  చేస్తున్నారు. వీరి  ఆచారాలు  తెలుగువారి ఆచారాలే. నొంఫే పట్టణం  ఇప్పటి రాజధాని.  ఆనాడు అంగకరరాజులు (కవచథరులు) వారి స్థానం  అంగకరవాసమనీ,  అంగకరణామమనీ  రెండుగా  ఆ  మహాపట్టణం  విభజించారు. బ్రాహ్మణులలో ప్రసిద్ధిగాంచినవాడు కంబుజుడను బ్రాహ్మణుడట.  అతడే  ఈ  రాజ్యము  క్రీస్తు వెనుక  అయిదవ శతాబ్దిలో స్థాపించాడు. తర్వాత  దివాకరుడను బ్రాహ్మణుడు పదవ  శతాబ్దంలో  ఈ  రాజ్యం  రెండుగా  చీలినప్పుడు మళ్ళీ  కలపడానికి  కారకుడయ్యాడు.
   ఇప్పుడు అంగరధామంలో  జయవర్మ  క్రీ.శ. 900 లో  కట్టించిన గుళ్ళు  చాలా  కనబడుతాయి.  ఈ  గుడులచుట్టూ ప్రాకారం  నాలుగుమైళ్ళ పొడుగు  వుంటుంది.  గోడ ఎత్తు ముప్పది  అడుగులు  వుంటుంది. ఇక్కడే  మహారాజ మందిర చిహ్నాలు  కూడా  కనబడతాయి.  ఈ  ప్రాకారానికి  చుట్టూ అయిదు గోపురాలున్నాయి. ఈ  గుళ్ళలో కాంభోజ దేశస్థాపకుడైన కంబుజ బ్రహ్మణునియందు  భక్తిని  తెలపడానికి  నిర్మించిన   బయాంలేక  బ్రహ్మగుడి ముఖ్యమైనది. బ్రహ్మ నాలుగు తలలు చెక్కిన  యాభై శిఖరాలీ గుడి  ఆవరణంతా నిండి వున్నాయి. లోపల బ్రహ్మ విగ్రహం  వుండేది. తర్వాత  బుద్ధవిగ్రహం పెట్టినారు. ఈ  గుళ్ళలో అలంకారశిల్పం  అత్యంత శ్రుతి స్వరూపమై, శక్తివంతమై ప్రత్యక్షం  అవుతుంది.  రామాయణ గాథలు, నాట్యస్త్రీలు , ఈ  గుళ్ళల్లో, మండపాలలో  నిండి వున్నాయి.     అంగకరవాసంలోను  క్ష్మేరశిల్పం,  వాస్తుసంపద ఉత్తమంగా  ఉంది. ఈ  గుళ్ళ ఆవరణ 6080 చదరపు గజాలుంటది. ఆవరణ  చుట్టూ  లోతయిన  అగడ్త వుంది. ఇదీ బ్రహ్మగుడే. ఇక్కడా  బౌద్దమతం  ప్రవేశించింది. కాంభోజ  భాషలో  సంస్కృతభాష మిళితమైపోయింది. కాంభోజ  దేశాన్నుంచి  సయాము దేశమూ ప్రవేశించింది  రాజులు పేరులు  సంస్కృతపు పేరులే! ఈ గుళ్ళలో  నాగము  మహోన్నత  రూపంపొంది అద్భుత సాక్షాత్కార మిస్తుంది. పదిహేనురోజులుండి,  ఆ  విగ్రహాల  చిత్రాలన్నీ గీచుకొని, ఓడ  ఎక్కి మన దేశం చేరుకున్నాను. నా  జావాయాత్ర, కాంభోజ యాత్రలు ఎప్పటికీ  మరచిపోలేను.
   మా అమ్మగారిని  భట్టిప్రోలునుంచి  తీసుకుని హరిద్వారం  చేరి, ఒక్కొక్కశిల్పం సంప్రదాయం రీతిగా, నేపాలు, టిబెట్టు, బర్మా, జావా, బలి, కాంభోజ  శిల్పాలు  పంచలోహాలతో అడుగు ఎత్తున  పోతపోశాను. విల్హె ల్మినా  కన్య, సుశీలాదేవి  నా  శకుంతలలోని అంతర్భాగంలా  అనుకున్నాను. కాలం కర్కశ  వక్రాలకు శ్రుతిరూపం  కల్పించి, సౌందర్యమే మన స్మృతికి తీసుకువస్తూ వుంటుంది. మనుష్యుడు  పశువైననాడు కర్కశుడు: అతడు  మనుష్యుడైననాడు  శ్రుతిరూపం పొందుతాడు. దివ్యుడైననాడు సుందరమూర్తే  అవుతాడు.  దివ్యుడంటే భగవంతుడని   నా ఉద్దేశం  కాదు.  దేవత అవుతాడనీ కాదు  మహోత్తమ  మనుష్యుడు అవుతాడని. లోకం  అంతా  ఉత్తమస్థితిలో  వుండాలనీ, సర్వసమత్వం కావాలనీ  ఎంచేవాడే ఉత్తమ మనుష్యుడని నా ఉద్దేశం. కాని  ఆ  కోర్కెలన్నీ  చంపుకొని  నేను తంతి  ఇవ్వడంవల్ల  నన్ను సింగపూరులో  కలుసుకొన్న విల్హె ల్మినా,  డిజాంగులనూ, విల్హె ల్మినా  భర్తనూ చూచినాను.  విల్హె ల్మినా నాకు  నమస్కరించి  శర్వరీభూషణ్, నీ స్నేహంవల్ల   నా  శిల్పానికీ, చిత్రలేఖనానికి  ఏదో  మహత్తర  సౌందర్యం వచ్చిందనే డచ్చి విమర్శకులు ప్రశంసిస్తున్నారు.  నీ  గురుత్వం  ఎప్పుడూ  మరచిపోలేను. నిజమైన జావాతనం  నా  శిల్ప చిత్రాలలో  వెళ్ళివిరిసి  పోతున్నదట!  అని కంట ఆనందభాష్పాలు కమ్ముతుండగా పలికింది. ఆమె  రచనలన్నీ  నాకు  చూపించింది. నన్ను బటేవియా వచ్చి  తమ ఇంట్లో  వుంచమన్నది. ఆమె భర్త కూడా  నన్నెంతో  ప్రార్థించాడు. కాని  నాదేశం  మీద  మనస్సు  ప్రవర్తిస్తున్న  నాకు  మా అమ్మా, నా దేశమూ, నా గురువూ ఎదుట  కనబడుతూ  వుండడంవల్ల వారి కోర్కె  పాలింపలేకపోయాను. వారందరు గాఢ ప్రేమ పూర్వకంగా నాకు వీడ్కోలిచ్చారు. మా ఓడ  సాగింది.

ఆ రాత్రి ఓడ సైకట్టుమీద అడ్డకడ్డీల నానుకొని ఆశ్వయుజ శరత్కాలపు వెన్నెల కెరటాలను, దూరాలను ముత్యాల కాంతిలో తేల్చి ఆడిస్తుండగా నా చరిత్ర అంతా తలుచుకుంటూ నిలుచున్నాను. ఆ రాత్రి ఓడపై తట్టుమీద అడ్డకడ్డీల నానుకొని ఆశ్వయుజ శరత్కాలపు వెన్నెల కెరటాలను, దూరాలను ముత్యాలకాంతిలో తేల్చి ఆడిస్తుండగా నా చరిత్ర అంతా తలుచుకుంటూ నిలుచున్నాను. ఎంతకాలం నా శకుంతలను వదలి నేను ఈలా శిల్పమనీ, చిత్రమనీ కాలక్షేపంచేస్తూ ఉండను? ఈ జీవితం వృథా అనిపిస్తుంది. రష్యాలో, ఆ కార్మిక కర్షక మహారాజ్యంలో కూడా ప్రేమలేని బ్రతుకు ఎవరు బ్రతుకుతున్నారు? కర్మకు ఎంత పవిత్రత వారు ఆపాదించుకుంటుంన్నారో, ప్రేమకూ అంత పవిత్రతే ఉందనుకుంటారు. సన్యాసులు ఏ మంత్రంబలం చేత స్త్రీ స్నేహం లేకుండా ఉండగలరో! పశుధర్మమైన స్త్రీ సంపర్కం వేరు, పవిత్ర ధర్మమైన ప్రేమవేరు. ఏనాడు నా శకుంతల నా జన్మకు స్థాయీభావం అయిందో, ఆనాడే నా బ్రతుకూ సాత్ధకమయింది. నేడా స్థాయిలేని ఈ జీవితం నా కెందుకు? ఆమెను మరచిపోయేందుకు ఎంతదూరం పరుగెత్తగలను? ఈలోకంవీడి ఇంకో నక్షత్ర కుటుంబంలోని గ్రహానికి పారిపోతే నా శకుంతలను విడిపోయిన నా దుఃఖం నన్ను వదులుతుందా? శిల్పమూ, చిత్రలేఖనమూ మత్తు మందులే అవుతున్నాయి. స్వామీజీ సన్నిధిని నాకు కొంత ఉపశమనం కలిగేమాట నిజమయినా, ఆ తర్వాత ఒంటిగా ఉన్నప్పుడు నా దేవి నాకు మరింత స్పష్టంగా ప్రత్యక్షం అవుతుంది.

   కొలంబో చేరి  సింహాళం అంతా తిరిగాను.  అనూరాధపురంలో, సిగిరియాలో, కాండీలో  నాకేమీ  ఉపశమనం  కలుగుతుంది. ఈ  శిల్పయాత్ర  నా  ఆవేదన  మరింత  ఎక్కువ  చేసింది. మనుష్యుని  సర్వజీవిత  రసజ్ఞత్వంలోంచి ఉద్భవించిన మహాసౌందర్యం  నా శకుంతల  సౌందర్యానికీ   ఎలా సరిపోతుంది  అనుకున్నాను. ఎందుకీ అంతులేని  యాత్ర? 
                                                      ఎంతకాలం  నేను  తిరిగేదీ
                                                      ఓ  దివ్యమూర్తీ
                                                      అంతమే  నా  యాత్ర  మాన్పేనా?
                                                      శిల్పమంతా నిండి ఉన్నది
                                                      చిత్రలేఖన నిండి  ఉన్నది
                                                       నీవులేని బ్రతుకు  ఆవల
                                                       భావి  ఎందుకు? కళల తపనేలా?
                                                       ఓ  దివ్యమూర్తీ
                                                       నన్ను   విడిచి  నేను  పరుగేలా?
   
           
                                                                                                               18
   ఎక్కడికి  వెళ్ళినా, ఎక్కడ తిరిగినా  నా గురుదేవుడైన  కైలాసానంద మహర్షి  దగ్గరకు నేను  చేరవలసిందే. నాకు ఇరవై  తొమ్మిదవ  ఏడు  వచ్చింది. ఎన్నో  బొమ్మలు వేస్తున్నాను, ఎన్నో శిల్పాలు  రచిస్తున్నాను. మరి మనశ్శాంతిలేదు. నా  శకుంతల  నా పక్కన  ఉండి  నేనీ  అఖండ  శిల్పయాత్ర  చేస్తూ, ప్రపంచ శిల్పచరిత్రలో ఒక్క  అణువుగానైనా  నా  శిల్పాన్ని అర్పించగలిగితే నాకు ఆవేదన  లేకుండా  ఉండేది. అందుకనే  కాదా అన్ని  రసాలలోకి  ఉత్తమం శృంగారరసం అన్నారు. లోకకల్యాణంగా, విశ్వశ్రేయంగా  కావ్యం, శిల్పం  రచించేవారు ద్వంద్వంగా  వుండే  చేయాలి.  స్త్రీ  పురుషు లిద్దరూ కలిస్తే  సంపూర్ణ  మానవత్వం వస్తుంది. రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, అర్థనారీశ్వర, వాణీ బ్రహ్మాది భావాలు నాకా  రోజుల్లో  తరిమి తరిమి  వెంటవస్తూండేవి.  నా  శకుంతల  నాతో  లేనినాడు  నాకీ  కర్మంతా ఎదుకు? 
   ఈ పెద్ద  ప్రశ్నతోనే  నా  గురుదేవుల్ని చేరుకున్నాను. మా అమ్మ అక్కడ నా కోసం ఎదురు  చూస్తూంది.  నా ప్రయాణం  ఒక్కొక్కటి  అయినప్పుడల్లా మా అమ్మ  ప్రాణాలు స్వామీజీ  పాదాల దగ్గర  ఉంచుకొని  వుంటుంది. ఆవిడ  నా కోసం  ఎంత  బాధపడుతున్నదో.  ఈ  బాధలూ  ధైర్యాలూ వెలుగు నీడల్లా  ప్రతి మనుష్యుని  జీవితంలోనూ వుంటాయి.  మనుష్యుడు  ఈ వెలుగు  నీడల్ని  తానైనా  కల్పించుకుంటాడు,  లేదా  భగవంతుడయినా  కల్పిస్తాడు. 
   కైలాసాశ్రమంలో  నేనూ, మా అమ్మా  ఒక నెలరోజులున్నాము. స్వామీజీ  దగ్గర  వుండి నా  శిల్పరచనా, చిత్రరచనా  సాగిస్తున్నా, నాలోని  ఆవేదన  ఏమీ తగ్గదు.  రాత్రిళ్ళు నిద్రపట్టదు.  నా  హృదయంలో  శాంతిలేదు.  నా  శకుంతల  నన్ను  వీడిన రోజుల్లో నేను పడిన  నరకయాతనకూ, ఈనాటి ఈ బాధకు చాలా  భేదం  వున్నది. ఆనాటిది ఒక కత్తిదెబ్బ వంటిది, బుఱ్ఱచితుకగొట్టే గదాఘాతం వంటిది.  ఒక  రైలు  ప్రమాదం వంటిది. ఆరు నెలలు తిండిలేని  ఆకలి బాధ వంటిది.  చలిలో  బట్టలులేని  బీదవాని  మహాదుఃఖంవంటిది. ఈనాటి బాధో? 
   హరిద్వారంలో  నాలుగు  నెలలుండి  రూరిక్కుగారి శిష్యత్వం చేద్దామని మా అమ్మా, నేనూ పంజాబు రాష్ట్రంలో హిమాలయాలలో  ఉన్నకులూ  చేరుకున్నాము. ఒక బంగాళా  అద్దెకు  తీసుకొని  అక్కడ  మకాంచేసి  రూరిక్కుగారి మహాశిల్ప ఛత్రచ్ఛాయలలో శిల్పమూ, చిత్రలేఖనమూ నిజంగా  నేర్చుకున్నాను. రూరిక్కుగారికి  నా  జీవిత  చరిత్ర  యావత్తు మనవి చేశాను. వారు  తమ  అగ్నియోగాన్ని  నా  కుపదేశించి, వారు  వ్రాసిన  గ్రంథం  ఇచ్చారు.  వత్సా! నీ చరిత్ర  విచిత్రమైనదే! ఏ  మహాశిల్పం సాధించుటకు నువ్వు జన్మించావో అది సాధిస్తావు  అని  ఆశీర్వదించారు. రూరిక్కుగారి చిత్రలేఖనంలో  ప్రాచ్య ప్రతీచీ  సంప్రదాయం  సంశ్లేషజనితమైన  ఒక  మహా సంప్రదాయం ప్రత్యక్ష మవుతుంది. ఎన్నిగంటలో రోజూ వారి  బొమ్మలు  చూస్తుండేవాడిని. ఎంతో ఆనందం కలిగేది. 

తిరిగి 1939 జూలై నెలలో హరిద్వారం కైలాసాశ్రమంచేరి స్వామీజీ దగ్గర దీపావళి వరకు మా అమ్మా, నేనూ వున్నాము. దీపావళి వెళ్ళిన రెండు రోజులకు మా అమ్మ నా దగ్గరకు వచ్చింది. ' నాన్నా! ఇప్పటికన్నా నీ యాత్రలు పూర్తి అయ్యాయా! '

' ఏమి చెప్పగలనే, నా జీవితమంతా ఇలా తిరగడమే అవుతుందేమో! నా జన్మ నాకు వృధా అనిపిస్తోంది.'

' అదేమిటిరా? నీకు వచ్చిన పేరు, ప్రతిష్ట ఇంకోరికి ఉందా? ఇంతకన్న ఏమి కావాలిరా? '

' ఎందుకమ్మా పేరు? '

ఇంతలో స్వామీజీ మా దగ్గరకు వచ్చారు. ఆయన మోము ఉదయ కాలారుణ కిరణ స్నాతమైన కైలాస శిఖరంలా మెరిసిపోతున్నది. ఆయన చిరునవ్వుతో లేచి, ప్రణమిల్లిన మా ఇద్దరినీ ఆశీర్వదించి, కూర్చుండమన్నారు, మేము ఇద్దరము కూర్చున్నాము.

స్వామి : మూర్తీ! నీ బ్రహ్మచర్యాశ్రమం పూర్తి అయ్యే రోజులు వచ్చాయి.

మా అమ్మ ఆనందంతో విరిసిన మోముతో స్వామీజీవైపు చూచింది.

నేను మాత్రం వారి మాటలకు ఆశ్చర్యం పొందాను. నాకు నా శకుంతల కాక ఇంకెవరు కావాలి? సుశీలాదేవితో నాకు సంభవించిన ఆ తుచ్ఛ దేహసంబంధం చాలు. నా దేహం కోసం ఏ అందమైన బాలికతో సంబంధం పెట్టుకున్నా, గట్టితనంలేని నా మనస్సు విపరీతమైన వేదన బడి నన్ను నాశనం చేస్తుంది. లేదూ, ఒకవేళ ఆ సంబంధం వివాహ స్వరూపంగా వచ్చినా, ఆ వివాహం నామమాత్ర వివాహమే అవుతుంది.

స్వామి : మూర్తీ! నా మాటలు నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకు. నువ్వు తిన్నగా మీ అమ్మగారితో నీ దేశం వెళ్ళు. అక్కడ శకుంతలాదేవి పేరున నెలకొల్పదలచుకొన్న పాఠశాల విషయం అంతా చక్కని ఏర్పాట్లు చెయ్యాలికదా! అందుకు మీ కొల్లిపర వెళ్ళు. నీ భార్య ధాతువుమీద నువ్వు నిర్మించిన సమాధి దర్శించు. అక్కడ నీకు ఏ విధంగా తోస్తే ఆ రకంగా చేయి.

' చిత్తం స్వామీజీ. '

మేమిద్దరం కొల్లిపర చేరుకున్నాము.

                                                                              19

మా మామగారి మేడ పాడుపడినట్లుగా ఉంది. ఆ వెన్నెట్లో ఏదో పురాతన కట్టడాన్ని చూస్తున్నాను అనుకున్నాను. మేడలో కొన్ని గదులలో తమ సామానంతా దాచుకొని, తక్కిన భాగమంతా ఎవరికో ఊరికే కాపురం ఉండమని మా మామగారిచ్చారట! అక్కడినుండి, నా దేవి స్మృతికై కట్టిన తులసికోట చేరాను. ఈ ప్రదేశాలన్నీ నేనూ, శకుంతలా సంచరించనవే! ఇవన్నీ నాకు పవిత్ర ప్రదేశాలు. శకుంతలా పాదస్పర్శాంకితమైన ఈ పుణ్యదేశం నాకు పూజార్హం. ఇక్కడే ఆమె పేరున ఉత్తమ స్త్రీ విద్యాలయం నెలకొల్పాలి. ఆమెకై ఒక దేవాలయం నిర్మించాలి. ఆ దేవాలయంలో నేను నా జీవయాత్ర ముగిసే వరకు భక్తితో పూజిస్తూ ఉండగలనుకదా అని ఏదో ఒక విచిత్రమైన ఆనందంతో నిశ్చలత పొందగలిగాను.

నేను ఇంక ఈ దేశంలో చేయవలసింది అదే. ఘనశృంఖలాబద్దయై తీరని వ్యధతో క్రుంగి ఎముకల ప్రోగు మాత్రంగా ఉన్న నా తల్లికి విముక్తి తెచ్చేటందుకు అఖండ సత్యాగ్రహ తపస్సు చేస్తున్న మహాత్మాగాంధీ గారికి అనుచరుణ్ణయి శకుంతలాదేవి నామస్మరణం చేస్తూ నా జీవయాత్ర ముగించవలసి ఉన్నది. నా దేవి మహాత్ముని జగవదవతారమూర్తి అని భావించుకొని, ఆయన ప్రతిరూపాన్ని తాను ఎప్పుడూ పూజించేది. నా శకుంతలకున్న దేశభక్తి నాకు లేకపోయిందే! నా దేశం కోసం నా కళాభి మానం ఆహుతింప లేకపోయానే ఇంతవరకూ. ఎంత స్వార్థపరుణ్ణయి తిరిగినాను! మీరు కళలు మానవద్దు, దేశభక్తినీ మానవద్దు. మీ కళలతో మీ దేశాన్ని అర్పించలేరా? కళలతో మానవులకూ, దేశానికీ, భగవంతునికీ కూడా పూజ చెయ్యవచ్చు కాదండీ అని శకుంతల ఒకనాడు నాతో అన్న ముక్కలు విద్యుల్లతా రూపంతో నా హృదయంలో ప్రత్యక్షం అయ్యాయి. అంత చిన్నతనంలో ఎంత ధర్మపూరితమైన ఆలోచనలు నా దేవికి!

ఎంతసేపూ ఆ రోజుల్లో, ఆమె దేహాన్నే వాంఛించాను. ఆమె దేహ సౌందర్యమే నా మతికి మత్తు కల్పించేవి. ఆమె నాకోసం ఎన్ని సిగ్గుచేటు పనులన్నా చేసేది. కాని ఎప్పటికప్పుడు అమృతపు చిరునవ్వులు నవ్వుతూ ఇవేమి చిత్రాలండీ! ఇదంతా తప్పుకాదుటండీ? అనేది. ఆమె సంయోగ సుఖం ఒల్లని యోగిని అని కాదుగాని, ఆమె ఆనందం ఏదో ఉత్తమస్థితి నందిన భౌతికానందం. నేను తుచ్ఛ పశుత్వానందం పొందే వాడిని. నా ఆనందంలోని మత్తు ఆమెకు నవ్వు తెప్పించేది. ఆమె దేహం అణువు అణువునా గాఢచుంబన వర్షంతో తడిపివేస్తోంటే ఆ బంగారు దేహం ముడుచుకొని పోయినట్లయ్యేది. ఆ దేహంలో ప్రతి అణువూ సిగ్గుపడేది. ఆమె ముద్దులు అమృత స్పర్శలు. నేనెంత ప్రయత్నించినా ఆమె ముద్దుల వల్ల నేననుభవించిన ఆనందం నా ముద్దులవల్ల పొందలేకపోయేవాడిని. ఆమె కౌగిలింతలో అతి గంభీరమైన పరిమళపు ముంపు ఉండేది. నా సంశ్లేషములలో వట్టి గాఢత మాత్రం ఉండేది.

కాలం వెళ్ళిన కొలది నాలోని పశుత్వం మానవత్వంగా పరిణమిస్తుందని ఆమె అనుకునేది కాబోలు. లలిత హృదయులైన కొందరు స్త్రీలు తమ దైవమైన భర్తలు తమవల్ల ఏలాంటి ఆనందం పొందినా తమకది మహాభాగ్యమనే అనుకుంటారు. నే నెప్పుడైనా నా పశుత్వం వీడి మనుష్యుడనై ఆమెతో చరించినపుడు ఆమె నిజమైన ఆనందంతో పరవశత్వం పొందేది! అలాంటి దేవి నావంటి నిర్భాగ్యునకు ఎందుకు దక్కుతుంది? ఆమె వెళ్ళిపోయిన తర్వాత నా పశుత్వం హరించింది కాబోలు. శిల్పకళద్వారామూక్షం కావాలని కైలాస పరత్వపాద పవిత్ర ప్రదేశంలో నేను అనుభవించిన మహాయోగం నా శకుంతల సహాయం లేకుండా ఎలా కొనసాగించగలను? మా మామగారూ, అత్తగారూ కొల్లిపర నా వలెనే మళ్ళీ చూడలేక మద్రాసులోనే కాపురం పెట్టారట. అక్కడ ఒక మేడ కొనుక్కొని మా మరదలికి చదువు చెప్పిస్తున్నారట. నా శకుంతలవలెనే హేమ సుందరి చాలా తెలివైన బాలిక అనీ, చక్కగా పరీక్షలన్నీ విజయంపొందుతూ, బి. ఏ. ఆనర్సు తెలుగూ, సంస్కృతమూ పరీక్ష ఇవ్వబోతున్నదనీ, పదునాలుగో ఏటే స్కూలు ఫైనలు పరీక్షకు వెళ్ళి గణ్యమైన విజయం పొందిందనీ, ఇంటరు కూడా మొదటి శ్రేణిలో మొదటి కొద్ది మందిలో నెగ్గిందనీ నాకు కొల్లిపరలో తెలిసింది.

   ఇదివరదకా, మా మామగారినీ  అత్తగారినీ చూడలేక  పిరికిపందనై, దక్షినాదియాత్ర చేసినప్పుడు కూడా మదరాసు  తప్పించుకొని తిరిగాను. ఈనాడు  వారి మేడ  చూస్తుంటే మా  మామగారినీ, అత్తగారినీ  చూచి, వారి పాదాలమీద  పడి  నా కంటినీరుతో  అభిషేకం చేసి  పొంగిపొరలి రాబోయే నా దుఃఖానికి  విడుదల ఇద్దామని ఏదో  తీవ్రకాంక్ష పుట్టింది.
   కొల్లిపరలో  డిశంబరు నెలలో  రెండు  వారాలవరకూ ఉన్నాను. శకుంతలా  విద్యాలయం స్థాపించే విధానం అంతా  ప్రణాలికలు తయారుచేస్తూ, శారదానికేతనం వెళ్ళి  లక్ష్మీనారాయణ దంపతులతో సంప్రదిస్తూ  పనిలో  మునిగిపోయాను. మా మేనమామ  కుటుంబంవారు, మా అక్కయ్యల  కుటుంబాలవారూ వెళ్ళిపోయారు. నేనూ, మా అమ్మే  మా ఇంటిలో మకాం. ఆ రోజుల్లో నా శకుంతలాదేవి  విగ్రహం పంచలోహాలతో పోతపోశాను.  శుద్ధ భారతీయ విన్యాసంతో,  లలితాదేవి స్వరూపంతో దివ్యమూర్తిలా శకుంతల రూపం తాల్చింది. ఆమె  మోములో ఆనాడామెను నేను పూజించిన పవిత్ర  ముహుర్తంనాటి  గంభీరహాసము  ప్రత్యక్షం  అయింది. నా శిల్ప జీవితంలో ఆ విగ్రహం  పూర్తి అయిననాడు నేను పొందిన  సంతోషం ఇంకెప్పుడూ పొందలేదు. మర్నాడు  ఆ విగ్రహం చూస్తుంటే  నా మామగారినీ, అత్తగారినీ చూడాలని  భరింపరాని ఆవేదన కలిగింది. వెంటనే  మా అమ్మ  దగ్గరకు వెళ్ళాను. ఆవిడ  ఇది వరకు వారిని రెండు మూడుసార్లు చెన్నపట్నం వెళ్ళి చూచి  వచ్చింది.
    అమ్మా! నేను చెన్నపట్నం వెళ్ళి మామగారినీ, అత్తగారినీ చూడాలని నాకు బుద్దిపుట్టింది.
    తప్పకుండా వెళ్ళు నాన్నా! ఇన్నాళ్ళు నువ్వు వారిని చూడకపోవడం ఏమీ  బాగాలేదు. ఇప్పుడయినా నీకా బుద్ది పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది బాబూ! వెళ్ళు. నువ్వు దేశాలు తిరిగినప్పుడు  నేను రెండు మూడుసార్లు చెన్నపట్నం  వెళ్ళి వచ్చాను. 
   ఆ మర్నాడే బయలుదేరి  చెన్నపట్నం  వెళ్ళాను. పట్టణంలో  మెయిలు దిగగానే ఏవేవో ఆలోచనలు నన్ను  సుడిగాలిలా  చుట్టివేశాయి. వెళ్ళి  తిన్నగా వుడ్ లాండ్సు హోటలులో  మకాం పెట్టాను.  ఆ రోజు సాయంకాలం ఒక  టాక్సీకి  ఫోనుచేసి, రప్పించుకొని, గుండె మోగిపోతుండగా మా మామగారి  ఇంటికి  బయలుదేరాను. ఆ  దంపతుల నిద్దరినీ ఎలా  చూడగలనని  ఒక భయం, అక్కడ  నా  శకుంతల కనబడుతుందేమో అన్న ఏదో  మతిలేని ఆశా నన్ను కారు ఎక్కుతుండగా వణికించి వేశాయి. నా  హృదయం దగ్గర  ఎప్పుడూ బంగారు గొలుసున వేలాడే శకుంతల  బొమ్మ  పైకితీసి కళ్ళకద్దుకొని,  కారులో  కూర్చుని, పొమ్మని కారు అతనికి చెప్పాను.
       
                                                                                                               20
   తిన్నగా  మా కారు వెళ్ళివెళ్ళి  ఆళ్వారు పేట  నాలుగు  వీధుల  మొగనుంచి పిఠాపురం డేన్మోరు  భవనానికి  ఇవతల  కొత్తగా కట్టిన  ఒక చక్కని మేడ  దగ్గర ఆగింది. అప్పుడే  ఆ  మేడముందర ఉన్న  పోర్టికోలో నిలిచి వున్న కారు ఎక్కడానికి లోపలినుండి నా శకుంతల  ఒక అమ్మాయితో  కలిసి వస్తూన్నది.
   శకుంతల! శకుంతల! నా తల  తిరిగి  నా కళ్ళు  బైరువులు కమ్మి  ఒక్క నిమేషం మైమరపు  కలిగింది. శకుంతల  బ్రతికివుందా! నిజమా! ఆ  అమ్మాయి  లిద్దరూ నా కారువైపు  చూచి, తమ కారెక్కినారు. ఆ  కారు వెంటనే సాగి పోర్చి ముందరున్న  ఎడమ మార్గంలోనుంచి పోయి  చుట్టూ వున్న  తోటదాటి  గుమ్మందాటి వెళ్ళిపోయింది. నాకు భరింపరాని దుఃఖం  వచ్చి, కంటనీరు జలజలా ప్రవహించిపోయింది. నేను గుండె  దిటవు పరచుకొని, నన్నూ, లోకమునూ వీడి వెళ్ళిపోయిన శకుంతలాదేవి  మళ్ళీ ఎలా  వస్తుందనీ, ఆ బాలిక  నా మరదలయి వుంటుందనీ నిశ్చయం చేసుకున్నాను. కారు ముందుకు  జరిగి, వెళ్ళిపోయిన  కారు  స్థలంలోకి  వచ్చి ఆగింది.
   మొగం జేబురుమాలుతో బాగా  తుడుచుకొని, కండువా సర్దుకొని, మా కారు డ్రైవరు తలుపు  తలుపు తీయగా, కారులోంచి దిగి, మెట్లెక్కి, హాలులోనికి అడుగిడి, అక్కడ  వున్న  సోఫాలో కూర్చున్నాను. ఇంతటిలోకే ఒక  బోయీ, హాలులోకి వచ్చి, స్వామీ! ఎవరికోసం దయచేసినారయ్యా?  అని నన్ను  ప్రశ్నించాడు.
    వినయకరావుగారున్నారా? 
    చిత్తమయ్యా! 
    స్నేహితులొకరు గుంటూరు జిల్లానుంచి వచ్చారని చెప్పు. 
    చిత్తం అని అతడు లోనికిపోయి  చెప్పినాడు కాబోలు. వెంటనే ఆయన  ఒక కఱ్ఱచేత  ఆనుకుంటూ నడిచి వచ్చారు. ఆయన  ఎంతో  చిక్కారు. కళ్ళు  లోతుకుపోయాయి. ఆ  విఘ్నేశ్వరత్వమే లేదు.  బుగ్గలు వేలాడుతున్నాయి. మొగంలో  దుఃఖ రేఖలు  స్థిరత్వం తాల్చాయి.
   నేను లేచి  నుంచొని వారి  పాదాలకు నమస్కరించాను. ఆయన  నావైపు తేరిపార చూస్తూ  కూచోండి బాబూ! మీ  పేరు? మిమ్మల్ని ఎక్కడనో  చూచినట్లే ఉంది. పెద్దవాణ్ణయ్యాను  జ్ఞాపకశక్తి తగ్గిపోయిందండీ. 
    నన్ను  ఎక్కడ  చూచినట్లున్నారు?  
    మీ మాట  కూడా  నాకు  బాగా  తెలిసినట్లే  ఉంది. ఉండండి  నాయనా, నాయనా! నువ్వు....నువ్వు  శ్రీనాథ....మూర్తివి కావూ....?  ఆయన  గజగజ వణికిపోయారు.
   నేను  లేచి ఆయన దగ్గరకు వెళ్ళి  ఆయన పాదాల దగ్గర కూర్చుండిపోయాను.
    అవును  మామగారూ....నేను....శ్రీనాథమూర్తినే! మామగారి కళ్ళనీళ్ళు జలజల ప్రవహించాయి. ఆయన  నన్నదిమికొని, మాట డగ్గుత్తికపడి నాయనా....ఎన్నాళ్ళకు....వచ్చావోయి? ....అయ్యో! .... అని  మాట రాక ఊరుకున్నారు.
                                                                                                                  

నా కళ్ళవెంట ప్రవాహాలు కట్టిన దుఃఖాన్ని దిగమ్రింగి, ఎక్కడలేని ధైర్యంతో మామగారూ! దేశాలు తిరిగి తిరిగి ఈనాటికి మిమ్ము కలుసుకోగలిగాను అన్నాను.

   ఆయన  తన తీవ్రశోకాన్ని  ఆపుకొని  అయ్యో తండ్రీ! నీకూ మాకూ కలిగిన లోటు  ఎన్నిజన్మాలకు పూర్తి అవుతుంది? నేనూ, మీ  అత్తగారూ  హేమను  చూస్తూ ప్రాణాలు నిలుపుకున్నాము. హేమ యిప్పుడే లోకంతో  సినిమాకు వెళ్ళింది. 
    కారు మీద  వెళ్ళింది హేమా అండీ? 
    అవును!
    అత్తగారు ఏమి  చేస్తున్నారు ? 
    ఏదో పనిలో  మునిగివుంటుంది. శకుంతలను తలచుకొని  కుళ్ళిపోని రోజుందా ఆవిడకు  బాబూ ఏదో  వ్యావర్తి పెట్టుకొని, దుఃఖం  దిగమింగుతూ  ఇద్దరం కాలక్షేపం చేస్తున్నాము. 
    లోకం  ఎవరండీ? 
    లోకమా?  హేమతో  చదువుకున్న అమ్మాయి. మనింట్లో అమ్మాయిలా అయింది. వదలలేక  ఇక్కడే  వుండమన్నాం. ఆ అమ్మాయి  వెన్న వంటి  మనస్సుతో  మీ అత్తగారినీ, నన్నూ, కనిపెడుతూంది. హేమకు అక్కగారు మాయమైన  లోటు తీరుస్తోంది. 
    అలాగా అండీ! అత్తగారికి  నేనని  ఒక్కసారి  చెప్పితే, ఏమి కంగారు పడతారో? 
    అవును  నాయనా! నువ్వు  బొత్తిగా  మారిపోయావు.  ఆ  నున్నటి  తనం  అంతా పోయింది. మీ అమ్మగారు  నీ విషయం  అంతా  చెప్పింది. ఎంతకాలం  నువ్వు అల్లా వుంటావు? వెళ్ళిన  నా తల్లి  మళ్ళీ రాదుకదా?  మీ  అత్తగారూ, నేనూ  మీ అమ్మగారికి మా కోర్కె ఒకటి చెప్పుకున్నాము. మీ అత్తగారికి, మా తల్లిపోయిన  దుఃఖంతో  పాటు  నువ్వు  ఏమయిపోయావో అని దుఃఖమే. నువ్వు దేశాలు  తిరగడం, నీ  జబ్బు  సంగతీ అంతా  మీ మామయ్య నాకు ఎప్పటి  కప్పుడు  ఉత్తరాలు రాస్తూనే వున్నాడు. ఈపాటికి నువ్వు  ఓ  ఇంటివాడవై,  నా  కన్నతల్లి  ఆత్మకు శాంతి ఇవ్వవోయి  తండ్రీ!  
    అత్తగారికి  మీరు  వెళ్ళి  నెమ్మదిగా  నారాక సంగతి చెప్పుతారా? 
    దగ్గర ఉండి వంటలక్కలతో వంట చేయిస్తూ ఉంటుంది అంటూ, ఆయన లేచి కఱ్ఱ పుచ్చుకొని  లోపలికి  వెడుతూ నువ్వు కూడా రా!  అన్నారు.
   నా భుజంమీద  చేయి వేసుకొని  ఆయన నెమ్మదిగా నడుస్తూ, లోపలి  హాలు దాటి, హాలు  వెనుక వసారాలోకి  తీసుకువెళ్ళారు. ఇంకో  చిన్నహాలులోంచి మేడ వెనక  వున్న వంట  ఇంటివైపు చూస్తూ ఏంచేస్తున్నావు?  అని  కేకవేశారు.
    వస్తున్నా  అని మా అత్తగారు  జవాబిస్తూ ఈవలికి మేడనుంచి వంట ఇంటిని  కలిపే చుట్టు వసారాలోకి వచ్చారు. నేను కొంచెం  వెనక్కు తగ్గి  నీడలో  నుంచున్నాను.
    మన ఇంటికి చుట్టాలు వచ్చారే. 
    ఎవరండీ వారు? అని ఆమె  నావైపు  తేరిపార చూచారు.
   మా అత్తగారెంత చిక్కిపోయారు!  కాంతివంతమైన ఆ కళ్ళు తగ్గిపోయాయి. ఫాలంమీద  రేకలు! జుట్టు కొంత  నెరసిపోయింది!
    ఇతన్ని  ఆనవాలు  పట్టగలవా? ముందుకురా  బాబూ! 
    ఎక్కడో  చూచినట్లే వుంది ! 
    నేనూ ఆనవాలు కట్టలేకపోయానే! దేశాలు తిరిగి తిరిగి వచ్చాడు. 
    ఏమిటి! మూర్తా? మూర్తే!.... అని గబుక్కున  కూలపడిపోయారు. నేను పరుగెత్తుకువెళ్ళి చటుక్కున ఆవిణ్ణి పట్టుకు నాతొడమీద ఆవిడ తల పెట్టి పడుకోపెట్టుకున్నాను. వంటింటిపక్క సామాను కొట్టులో  ఏవో సర్దుతున్న  ఒక అరవ  వంట బ్రాహ్మణుడు పరుగెత్తుకొని వచ్చి, మేడలోనికి పరుగెత్తి, వాసన మందుసీసా  ఆమె ముక్కున  దగ్గర పెట్టాడు. మా అత్తగారికి మెలకువ  వచ్చింది.
       
                                                                                                               21
   ఆ అత్తగారు నెమ్మదిగా లేచారు.  నాయనా! శ్రీనాథమూర్తీ! నా  తండ్రీ! ఎన్నాళ్ళకు మమ్మల్ని  చూడడానికి వచ్చావోయి?  అని  గద్గద  స్వరంతో  అన్నారు. నాకూ కన్నీళ్ళు  తిరిగాయి. నాచేతి సహాయంతో  ఆమె లేచింది. నా ఆసరాతో  తూలుతూ ఇవతలి  హాలులోకి నడిచింది. అక్కడ  ఉన్న తివాసీమీద మేమంతా కూర్చున్నాము.
    దేశాలు తిరిగి తిరిగి  వచ్చానండీ అత్తయ్యా! అన్నాను.
   అత్తగారు : ఎన్నాళ్ళకు  అత్తయ్యా అనే  ముక్క విన్నాను నాయనా! మమ్మల్ని అలా వదలి వెళ్ళావు, మీ అమ్మగారిని  వదలి ఉందువా?
   మామగారు : ఏదో ఇప్పటికైనా వచ్చాడు. అతని దుఃఖం  అతనిది, ఇంతకూ మన బంగారుతల్లి   వెళ్ళిపోయింది.
   నేను తలవాల్చుకొని మాటలాడలేక ఊరకొన్నాను. అత్త : మూర్తీ, నాకెన్నాళ్ళనుంచో  ఉన్న కోర్కెను  నువ్వు పాలిస్తావని  ఉవ్విళ్ళూరిపోయాను. లాభంలేదేమోనని భయపడుతూ  కుళ్ళిపోతున్నాను. మీ మమగార్కీ  అదే కోర్కె.

మామ : అవును మూర్తీ! మా హేమ పెద్దదయింది. బి. ఏ. ఆనర్సు పరీక్షకు వెడుతుంది. దానికి నువ్వే మూడుముళ్ళూ వెయ్యాలి. ఈ మా కోర్కె ఊరికే వచ్చింది కాదు మూర్తీ! ఈ విషయం మీ అమ్మగారికి ఇదివరకే చెప్పాము. అక్కగారు మీ స్వామీజీతో ఈ విషయం అంతా చర్చించిందట. అందుకు వారు సంతోషంతో అనుమతి యిచ్చారట. ఈ కోర్కె మావల్ల నువ్వు వినాలని కాబోలు స్వామీజీ ఈ విషయాన్ని గూర్చి నీతో మాట్లాడాను అన్నారట.

నేనేమీ పాలుపోక కూర్చున్నాను.

మామ : హేమ పెద్దదయింది. పెద్దపిల్లలకు సంబంధాలే దొరకటం లేదు. సంబంధాలు దొరుకుతాయి, దొరకవు అన్న ప్రశ్న లేనేలేదు. ఆ రోజుల్లో ఈ ఊరు పారిపోయి వచ్చి హేమ చదువులో పైకి వెళ్ళటం ప్రారంభించిన దగ్గరనుంచీ నీకు దాన్నిచ్చే కోర్కె మా యిద్దరికీ కలిగింది.

అత్త : మొగపిల్లలులేని మాకు నువ్వే కన్నకొడుక్కన్న యెక్కువగా అయ్యావు. ఒకేసారి ఇద్దర్నీ పోగొట్టుకోమంటావా మూర్తీ ?

మామ : నాయనా? నువ్వు రావడంతోటే మొదట భరింపలేని దుఃఖం కలిగింది. కాని ఆ వెంటనే మా శకుంతల బ్రతికి వచ్చినట్లే అయింది. అప్పుడే మీ అతగారు ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నారో చూడు!

అత్త : నాయనా! నాకు భగవంతుడు ప్రత్యక్షం అయి ఏం కావాలి వరం అంటే ఈ కోర్కె ఒక్కటే నాకు వరం అవుతుంది. నా కింకేమీ వద్దు.

మామ : హేమ పెరుగుతున్నకొద్దీ అచ్చంగా శకుంతల పోలికలన్నీ దానిలో మూడుమూర్తులా ప్రత్యక్షం అయ్యాయి. కాని, అది అవతారమూర్తి. ఇది అల్లరిపిల్ల!

అత్త : హేమకు మేమంటే వెఱ్ఱి ఆపేక్షకాని చెప్పినమాట వినదు. గట్టిగా చెప్పలేం కదా నాయనా! ఈ చదువు చెప్పించాము. ఏం చదువులో!

మామ : అన్నీ ఏవో విచిత్ర పద్ధతులే! వీళ్ళనీ వాళ్ళనీ అందరినీ పోగుచేస్తుంది. సినిమాలంటుంది, టెన్నిసు ఆట అంటుంది, షికారులంటుంది, టీ పార్టీ లంటుంది. ఇదీ ఈనాటివాళ్ళ చదువుల ఫలితం తండ్రీ! నువ్వే మా హృదయంలో హేమకు భర్తవు. మా ఇద్దరి కోర్కె తీర్చుబాబూ!

అప్పటికి ఆప్రియదంపతులు గుక్కతిప్పుకున్నారు. నాకు అనుకోని, ఆలోచింపని అతిక్లిష్టమైన సమస్య ఒకటి తెచ్చి పెట్టారా దంపతులు. స్వామీజీ వరకు ఈ విషయం వెళ్ళిందా? అదేనా ఆయన ముక్కలకు అర్ధం! అచ్చంగా శకుంతల పోలిక! ఓహో! నా శకుంతలే తిరిగి వచ్చిందా! నా దేవతామూర్తి తిరిగి ప్రత్యక్షం అయిందా! అని ఆవేదన పడిపోయాను గదా హేమను చూడగానే. ఇంత విచిత్రమైన పోలిక వచ్చిందేమిటి? కవలపిల్లలలోనన్నా పోలికలు కొంచం తేడా వుండవచ్చును. మెరుములా నాకు హేమ కనబడిన పదిక్షణాల్లో నా గుండె చలనం ఆగిపోయింది! కైలాసేశ్వరుడు ఈ పోలిక హేమ కెందుకిచ్చాడు? ఇంత విచిత్రమైన పోలిక ఎలా సంభవమైంది? అదే నడక! ఆ చూపులే! మళ్ళీ నాదేవి ప్రత్యక్షం అయింది అనుకున్నా! నేను నమ్మలేదు. నా ఊపిరే ఆగిపోయింది. భ్రమ అనుకున్నా! లోకమే తిరిగిపోయింది....ఆ వెంటనే అత్తగారు, మామగారూ, ఋషి దంపతుల వంటివారు ఈ మాటలేమిటి?

   నా గుండెలో నా కుడిచేయి  నా శకుంతల  బొమ్మపై వేసి, ఒక  నిమేషం కళ్ళు మూసుకున్నా!  మాటియ్యండి. నేనే హేమను, హేమే నేను! మీ కోసం హేమలో  ఎదురుచూస్తూ ఉన్నాను. ప్రాణమూర్తీ! అమ్మకూ, నాన్నకూ  మాట ఇవ్వండి అని నా హృదయంలో మాటలు  మారుమ్రోగినట్లయినది.  
    అత్తయ్యా! ఈవిషయం నేనెప్పుడూ అనుకోలేదు. నా కసలు  మళ్ళీ పెళ్ళి చేసుకోవాలన్న  భావం  ఎప్పుడూ కలగలేదు. కాని  మీ ఆజ్ఞ పాలించడంకన్న నాకు ఉత్తమమైన  కార్యం ఇంకోటిలేదు.
   అత్త : నా తండ్రీ! నాకు ప్రాణం లేచివస్తోంది. నా తల్లి  తిరిగి  బ్రతికి వచ్చినట్లే  అవుతున్నది. మళ్ళీ  నువ్వు  మమ్ము విడిచి  ఎక్కడకూ వెళ్ళకు తండ్రీ. మీ అమ్మగారిని  ఎలా  క్షేత్రాలు తిప్పావో అల్లాగే  మమ్మల్నీ తిప్పుగాని,  మా  ఇద్దరినీ నువ్వు  వదలనని  మాట  ఇవ్వు మూర్తీ!
   మామ : నాయనా! మీ  అత్తగారి  మాటలన్నీ వేదవాక్యాలు. నీ కోసం  ఈ  తొమ్మిదేళ్ళూ  యెక్కువ కుమిలిపోయింది!
   నేను : మామయ్యగారూ! నేను ఇక  మీ ఇద్దర్నీ వదలి  వెళ్ళనండీ. ఈ ఊరే వచ్చి  మా అమ్మా, నేనూ కాపురం  పెడతాం. ఒకటి మాత్రం  నాకు తోస్తోంది. నేను ఫలానా అని హేమకు తెలియనీయకండి. అలాంటి  ఆలోచన ఎందుకో  నాకు ఘట్టిగా తట్టింది. ఎవరో  చుట్టం  అని చెప్పండి. ఏ  అడయారులోనో, ఏ  సందర్భంలోనో  నాకూ, ఆమెకూ పరిచయం కలుగజేయండి. ఇప్పుడు వద్దు.
   మామ : అదీ బాగానే వుంది. పెళ్ళంటే  దాని ఆలోచనలు  విపరీతంగా  ఉన్నాయి.
   అత్త : పెళ్ళే చేసుకోనంటుంది. అదేమాట  చిన్నతనాన్నుంఛీ! పెళ్లి అంటే  ఏడ్చేది  అతికోపంతో  గుడ్డలు  చింపుకునేది. నేనూ, మీ మామగారూ  భయపడి  దాని దగ్గర  పెళ్ళిమాటే తల పెట్టడం  మానివేశాము.
   నేను : అందుకనే....ఆమె....నన్ను....పెళ్లి చేసుకునేటట్లు  నేను చేసుకోవాలికదా!........ చదువుకున్న పిల్ల! వాళ్ళకు  విచిత్రమైన  ఆలోచనలు ఉంటాయి.        మా  మామగారూ, అత్తగారూ కొంచెంసేపు  మౌనం వహించారు. మా అత్తగారు  కన్నీరు కారుస్తూనే ఉంది. కన్నీళ్ళు  తుడుచుకుంటూ,   నాయనా! ఎప్పుడు వచ్చావూ? ఇప్పుడు బండేముందీ! ఎక్కణ్నుంచీ?  అని ప్రశ్న  వేసింది.
    నేను  ప్రొద్దున  మెయిలులో  వచ్చానండీ....తిన్నగా  మీ ఇంటికి  రాలేకపోయాను.అదీ మంచిదే అయింది. వుడ్ లాండ్స్ లో  దిగాను, కొల్లిపరనుంచే  వచ్చాను. అక్కడకువచ్చి రెండు నెలలు  కావచ్చింది. అక్కడ పాఠశాల పెట్టించాలని ప్రయత్నం చేస్తున్నా అని  జవాబిచ్చాను. మా మామగారు  నాయనా  తిన్నగా  ఇక్కడకు వచ్చేసేయి   అన్నారు.
   నేను : అలావద్దండీ. మనం ఇప్పుడునుకొన్న  పని ఆలోచించి చేయాలి. నేను నాల్గురోజులుండి, మంచి యిల్లు మాట్లాడుకొని, ఇంటికి వెళ్ళి అమ్మను తీసుకొని వస్తాను. రేపు అడయారు ఉత్సవాలు కదా! అక్కడకు మీరంతా రండి. అక్కడ హేమను కలుసుకుంటాను.
   అత్త : నాయనా నువ్వు ఫలానా  అని హేమకు తెలియజేయక  పోవడం మంచిదా! సరే  ఆలోచిద్దాం....రేపు పదకొండు గంటలకు మా ఇంటికి రా! అప్పటికే  అమ్మాయీ, లోకేశ్వరీ వెళ్ళిపోతారు.
   హేమా! ఇదీ నాకథ. ఎంతో ఆలోచించి  ఈలా చేశాను. నేను మీ బావానని ఒక ఏడాది  పాటు చెప్పకుండా వుండడం బ్రహ్మయజ్ఞం అంత పని  అయింది. మీ పాపారావు  బాబయ్య  రావడం  భగవంతుని  ఆజ్ఞలాంటిది  అయింది. ఆయన  ఇంక  ఈ  నాటకం  చాలించమన్నాడు. లోకేశ్వరి ఒక నెల క్రిందటే  నేను ఫలానా అని అనుమానపడింది.  నన్నడిగింది. నిజం ఒప్పుకొని, కారణం చెప్పాను. ఆమె  సంతోషంతో  మా కుట్రలో  చేరింది. నా పని  కుట్రవంటిదే! నువ్వులేని  సమయాలలో  నేనూ,అత్తగారూ, మామగారూ  ఈ  విషయాలే  మాట్లాడుకొనేవాళ్ళం.  నాకు తిబెత్తులో వచ్చిన బిరుదు   త్యాగతి శర్వరీ  భూషణ్  అనే పేరుతో  అడయారులో  నిన్ను దర్శించాను. నీ త్యాగతి  ఈలాంటివాడు హేమా!