Jump to content

తుపాను/కైలాసేశ్వరుడు

వికీసోర్స్ నుండి

సత్యాలను గ్రహించడానికి ఈలాంటి మనవజీవితాతీత నిర్మల నిశ్చల ప్రదేశాలు అనుకూలములు. ఆ సమయంలో ఏవి నాలో చర్చించుకున్నా, నా కవి నిమిషంలో స్పష్టమైపోయినవి. ఇంతలో నేను స్టవ్ వెలిగించి నీళ్ళు కాచుకొని, ముఖసంమ్మార్జనం చేసి, కాఫీ కాచుకొని తాగుతుండగా స్వామీజీ నలుగురు సన్యాసులతో నన్ను వెతుక్కుంటూ అక్కడకు వచ్చారు. ఆయన నన్ను చూచి ఆశ్చర్యపడి నాయనా! ఒక్కడవు వచ్చావని ఆలోచించాను. కాని నాకు భయం కలగలేదు. అందుకని ధైర్యంగానే ఉంటిని, కాని వడగండ్లవాన కురియడంవల్ల దారి తప్పిపోతావేమోనని తెల్లవారగట్ల బయలుదేరి వచ్చాము అన్నారు.


ద్వితీయ భాగము

కైలాసేశ్వరుడు


1

హేమసుందరీదేవీ, ఇక్కడ నుంచి జరిగిన మా సమాచారం యావత్తూ స్వామీజీ వ్రాశారు. మళ్ళీ నేను వ్రాయనవసరం లేదు. ఆయన భాష గంగానిర్ఘరిణే. అదంతా ప్రతి వ్రాసుకొని ఈనా జీవిత చరిత్రలో రెండవ భాగంగా స్వీకరిస్తున్నా. ఈ భాగం కొద్దే, ఆ పిమ్మట, నేను నీ దగ్గరకు వచ్చేటంతవరకు జరిగినది. నాలుగు ముక్కలు నేనే వ్రాసి నా చరిత్ర పూర్తిచేశాను. ఈ చరిత్ర ఉద్దేశము చిట్టచివర నీకు నివేదించాను....

                                                                                                                      శ్రీనాథమూర్తి.
       
       
                                                                                                        స్వామీజీ  కథనము 
   
   శ్రీనాథమూర్తి  ఎంతో  ఉత్తముడు. అతన్ని చూడగానే  నాకదేమో  అనిర్వ్యాజమైన వాత్సల్యం కలిగింది.  కర్మదుర్విపాకంవల్ల అతని  భార్య  పోయినది. అతడు పశువై పోయాడు. ఈ  బాలకుని  ముందుజీవితం  అఖండ  నిర్ఘరిణీ  వేగంతో  ప్రవహిస్తూ, దేశాల  పుణ్యవంతం చేయవలసి ఉన్నది.
   శ్రీనాథమూర్తి  ఉత్తమశిల్పి  కాగలడు. ఈనాడతనికి  ఎవ్వరి  బోధలు  రుచించవు. అతడే  అతని దారివెతుక్కోవాలి. హిమాలయాలలోనే  ఈతనికి  దారి దొరుకుతుందని తోచింది నాకు. వెంటనే  అతన్ని  మాజట్టుతో  కైలాసం  రమ్మన్నాను. అతనితో నేను  వాదించదలచుకోలేదు. అతనికి అవసరం  వచ్చినప్పుడే  ఇది  దారి  అని  చూపిస్తారా. అది  నిశ్చయము. నారాయణ! నారాయణ! దివ్యభావాలకు  కూడా  అతీతుడైన  పరమేశా!  బదరీ క్షేత్రాంతరమూర్తీ, కైలాసక్షేత్రపాలకా, అనంతప్రభూ, మేమంతా కైలాసం  వస్తున్నాము. కైలాస  పర్వత  సందర్శన మహాపుణ్యం నీకే అర్పిస్తున్నాము తండ్రీ! సెలవా? 
   నాకిది  పదిహేనవసారి  కైలాసయాత్ర, కైలాసేశ్వరచరణాలకూ, నాకూ  ఏదో  విచిత్ర  పవిత్రసంబంధం  ఉండి వుండాలి. బదరీనాథ క్షేత్రంలోని అన్ని పుణ్యస్థలాలు శ్రీనాథమూర్తికి  చుపించినాను. నారదశిల, నృసింహశిల, వరాహశిల, గరుడశిల, కుబేరశిల అనే  పంచశిలలు: వహ్ని  తీర్థము, ప్రహ్లాదతీర్థము, నారదతీర్థము, కూర్మతీర్థము, ఋషిగంగ అనే పంచతీర్ధాలు: చరణపాదుక, శేషనేత్ర, వేదధార, మాతామూర్తి, వ్యాసగుహ, భీమశిల అను షట్ పవిత్రస్థలాలు అతనికి  చూపించి, శుభముహూర్తంలో కైలాస పర్వతోన్ముఖుల మయ్యాము.
   కొండ లెక్కుటలో అతి  జాగ్రత్తగా దారి  చూచుకోవలసివున్నది. అనేక  నదుల  లోయలు  దాటవలెను. వర్షాలు, వడగండ్లు  పడుట  ఎక్కువైనది. మానాఘాట్  ఈ  దారికంతకు  ఎత్తయిన  ప్రదేశం. ఇక్కడ  నిలుచుండి  శ్రీనాథమూర్తి నన్ను  చూచి  స్వామీజీ మనం  స్విడ్జర్లాండులోని బ్లాంకు శిఖరంకన్న ఎత్తయిన  ప్రదేశంలో ఉన్నామండీ అన్నాడు.
   ఆ  ప్రదేశానికి  ఎటువైపు  చూచినా  లోయలు  క్రిందకు  దిగిపోతున్నాయి. మేము  నిలుచున్న ప్రదేశం  అసలు  హిమాలయ శ్రేణికి వెన్నెముక. ఆ  వెన్నెముక  శ్రేణిలో ఎవరెస్టు,  గురుమాంధాతా, నందపర్వత, కాంచనగంగ, గౌరీశంకర, ధవళగిరి, గోడ్విను పర్వతశిఖారాలున్నాయి. అందులో  ఎన్నో  శిఖరాలు మాకు కనబడినాయి.
   మానాఘాట్  నుంచి  ప్రయాణాలు  చేసుకుంటూ  అడుగు  మాత్రం  వెడల్పుగల  దారుల  హిమపాత ప్రవాహాలపై  ప్రయాణించాము. ఒకచోట  ఆకాశమంటే పర్వతసానువు, ఈ  ప్రక్క  పాతాళమంటే లోయ. పర్వతాలు, నదులు, రాళ్ళూ, రోజుకు  ఆరు, ఎనిమిది  మైళ్ళకన్న ఎక్కువ ప్రయాణం చేయలేము. 
   
       
                                         
                                                                                                                         
           
               

ధాప్పానగరం హిమాలయ శ్రేణికి ఆవలివైపు పర్వతపాదాన ఉన్నది. ధాప్పానుండి పధ్నాలుగువేల అడుగుల ఎత్తునుండి పన్నెండువేల అడుగుల ఎత్తుకు జీలంనది లోయలోనికి దిగి, ఆనదీతీరాన చివలి చింగ్ గ్రామం చేరుకున్నాము. చివలిచింగ్ గ్రామమునుండి మూడురోజులు ప్రయాణం చేస్తూ జ్ఞానిమామండి నగరం చేరాము. ఈ నగరం పెద్ద వర్తకస్థానం. ఇక్కడే హిందూదేశ వస్తువులు, టిబెట్టువస్తువులు మారకం జరుగుతూ వుంటవి. ఇక్కడ చక్కని పాశ్మీనా ఉన్ని గుడ్డలు, శాలువలు కస్తూరి, శిలాజిత్తు, వున్ని మొదలైనవి తిబెత్తువారి అమ్ముతారు. ఆయుర్వేదౌషదాలకు పనికి వచ్చే ఓషధు లనేకం త్రివిష్టవులు ఈ నగరంలో అమ్ముతారు. వెండి బంగారము కడ్డీలుగా చేసి అమ్ముతారు.

   భరతదేశాన్నుంచి  నగలవస్తువులు, పగడాలు, ముత్యాలు, కుంకుమపువ్వు, తేయాకుడబ్బాలు, అత్తరు దినుసులు, అగరువత్తులు, ధూపసామానులు, పచ్చకర్పూరము, హారతికర్పూరము, బియ్యము, దూదివస్త్రాలు, ఇత్తడి, రాగి  మొదలైన  లోహాలు, అద్దాలు, దువ్వెనలు, దీపాలు, కొవ్వువత్తులు, సూదులు, కత్తెరలు, ఉక్కుసామానులు, ఇనుపసామానులు  ఇంకా  ఎన్నో  త్రివిష్టపానికి ఎగుమతి అవుతాయి.     
                                                                                                               2
   జ్ఞానిమామండిలో  మా  సరుకులన్నీ  తనిఖీచేసి, కొద్ది  పన్ను విధించారు  టిబెట్టు రాజ్యాధికారులు. ఆ  దేశంలో  నన్నెరిగినవారు చాలామంది వున్నారు. అక్కడ  ఉద్యోగులకూ, నాకూ చాలా  స్నేహం. అవసరమైతే  దారిలో  దొంగలు మమ్ము  బాధించకుండా వుండటానికి  కొంతమంది తిబెత్తుపోలీసువారిని రక్షకులుగా  ఇస్తామని   వారంటే  మేము  చాలామంది  వున్నాము. మాకేమీ భయంలేదని  నేనన్నాను.
   జ్ఞానిమామండీ నుండి  మా జట్టు  బయలుదేరింది. మధ్య గ్రామాలు  ఉన్నా  లేకపోయినా,  శ్రీనాథమూర్తిడేరా, రాజపుత్ర  జమీందారుడేరా వేస్తే మాకందరికీ బాగా సరిపోయేవి. గుఱ్ఱాలకూ, చమరీమ్రుగాలకూ టార్పాలిన్ తో డేరాలు తయారుచేసి  వాని  నందులో కట్టేసేవారం.  కూలీలకు  టార్పాలిన్ తో  చక్కని గుడారం  నిర్మించేవారం.
   ఆ ప్రకృతి  సౌందర్యం  వీక్షిస్తూ  మూర్తి సర్వమూ మరచిపోయేవాడు. అతని  ధ్యానమంతా ఏదో  మహాభావసందర్శనాభిలాషియై  ఉరకలు  పెట్టుతూన్నది.  ఈ  మకాంలో   శ్రీనాథమూర్తి  నా  దగ్గరకు  వచ్చాడు. స్వామీజీ! భగవంతుడంటే ఏమిటి? అని చిన్న బిడ్డలా  ప్రశ్నించాడు. ఈ  విషయమైన చర్చ అతడు  చేసుకోక, గ్రంథాలు  చదవక     ఆ  ప్రశ్నవేయలేదు. అతనిలో  ఈ  పరమభావాన్ని  గూర్చి  శిశుత్వం  వచ్చింది. అదే కదా సాధకుని ప్రథమ స్థితి!
   నేను: నాయనా, భగవంతుడొక  వ్యక్తీకాదు; అఖండ  మానవుడూ కాదు. 
   మూర్తి: విష్ణు, శివ, అమితాభ, జెహోవాది భావాలన్నీ  మానవుని శక్తికి  కొన్నికోట్ల కోట్లరెట్లు శక్తిగల మూర్తిని  భావించినవే కాదా  ఆండీ? 
   నేను: అలా  మనుష్యులు  భావిస్తున్నారు. ఒక్కొక్కప్పుడు తమకు సన్నిహితునిగా, పరమబంధునిగా   కూడ  భావిస్తారు.
   మూర్తి: అలా  భావించడంవల్ల  మానవునికి  స్వశక్తి నీరసించి, అస్వతంత్రత ప్రబలి  తన పురోగామిత్యానికి   తానే అడ్డుతగలడం కాదాండీ? 
   నేను: మనుష్య  దెందుకు  పురోగామి  కావాలి?
   మూర్తి: లేకపోతే  నశించిపోతాడు.
   నేను: ఋజువు చేయి.
   మూర్తి: ప్రకృతిలో  వస్తువులు  పెరగాలి. లేకపోతె నశిస్తాయి.
   నేను: సముద్రం  పెరుగుతోందా? కొండలు  పెరుగుతున్నాయా? ప్రపంచంలో  వున్న గాలి పెరుగుతోందా?
   మూర్తి: అవి  రూపాలు మారుతున్నాయి  గదాండీ.
   నేను: మనుష్యుడు  పెరుగునా? తక్కిన శక్తులు మారునా? ప్రకృతిలో  వస్తువులు పెరగాలి, లేకపోతే  నశించాలంటావేమి?
   మూర్తి: ప్రకృతి అంటే  చేతన ప్రకృతి  అని   నా  ఉద్దేశం. 
   నేను: ప్రాణంగలవన్నీ  పెరుగుతున్నాయి కదా?  పదేళ్ళనాటి  జనాభా నూటముప్ఫైకోట్లయితే, ఇప్పుడు ప్రపంచంలో  నూటయాభైకోట్లపై  చిల్లర  పెరగలేదా? అందులో  ఏ కొద్దిమందో తప్ప తక్కినవాళ్ళు భగవద్భావాన్ని  నమ్మినవాళ్ళే కదా? ప్రకృతిలో  మనుష్యులు తప్ప తక్కిన  ప్రాణి  కోట్లకు  భగవంతుడున్నాడని, లేడని భావాలు  లేవు కదా?  ఒకవేళ వున్నా ఉన్నదీ  లేనిదీ మనకు  తెలియదు. అనేకరకాల  ప్రాణికోట్లు  నశించాయి.  వానిలోంచో, విడిగానో కొత్తప్ర్రనికోట్లు ఉద్భవించాయి. వానికి  పురోగామి  కావాలని  గాని, ఆగిపోదామనిగాని  ఆలోచన లేదు. వాని  పెరుగు విరుగులు  ఆ  పురిగామిత్వం మీద  ఆధారపడి వుండలేదు. వాని  పెఉగు విరుగులు  ఆ  పురోగామిత్వం మీద ఆధారపడి వుండలేదు. కనుక నువ్వు  మనుష్యుని  పురోగామిత్వ తిరోగామిత్వాల విషయమై మాత్రమే కదా? 
   మూర్తి: అవునండీ, మనుష్యుడు  వృద్ధిపొందడమే, ఆరోగ్యవంతుడవడమే, సర్వసంపదలు సమంగా అనుభవించడమే కోరుతాడు. అంటే, మనుష్యు డార్థిక ప్రాణి. ఆర్థికంగా సమత్వం కోరుతాడు. అది రావాలంటే  భగవంతుడు, కర్మ, మోక్షం, నిర్యాణము, మళ్ళీ జన్మ  అనే  భావాలు అతని  పురోభివృద్దికి  అడ్డాలు కదా?
   నేను: అర్థిక  సమత్వం  కోరేవాడికి  భగవంతుడు  వద్దని  చెప్పాడా అంటే,  ఒక  మనుష్యునిలో   వున్న భగద్భావం   నువ్వు  ఆర్థికంగా సమంగా  ఉండకు అని బోధిస్తుందా?
   మూర్తి: అంటే, మనుష్యుడు తనలో వున్న  హెచ్చు  తగ్గులు  అది కర్మనుంచీ వస్తున్నాయనిన్నీ, కర్మ  కూడా  భగవత్స్వరూపమనిన్నీ, హెచ్చు  తగ్గులు  వుండడమే భగవంతుని  ఇచ్చ అనీ  నమ్మి, పెద్ద  అలసత్వం  సంపాదించుకొని,  తన ప్రయత్నాల నుండి  విరమించి, నిస్పృహ పొందుతున్నాడు  కదా అండీ? 
   నేను: ఇంతవరకు  భగవద్భావమే  లోకం అంతా  నిండివున్నదికదా. ఏ  చార్వాకులో , ఏ  ఇంగర్ సాల్  వంటి  వాళ్ళో  దేవుడు  లేడని  వాదించవచ్చు. అంతే. కాని  భగవంతుడున్నాడని  నమ్మేవారు  కోట్లు  వున్నారు. అయినా  ఒక పరిణామం నుంచి  యింకో  పరిణామం  వస్తూనే  వుంది. రాజ్యవిధానాలు, శాస్త్రవిధానాలు, జీవిత విధానాలు  అనేకం  మార్పులు  పొందాయి. ఆ  మార్పులన్నీ  చాలా  ఉత్కృష్టాలైన  మార్పులని  మీరంతా  వాదిస్తూనే  వున్నారు. భగవద్భావం ఎల్లా  తీసుకువచ్చిందా  మార్పులు? మీ  తండ్రి  భగవంతుని  నమ్మితే,  లేడని  వాదించగలిగిన  నీవెలా  ఉద్భవించగలిగావు? నువ్వు పురోగమ స్వరూపానివా? తిరోగమ  స్వరూపానివా? అలాగే  లెనిన్ తండ్రో,  తాతో  భగవంతుని నమ్మినవాడే కదా! ఆ  వంశంలో  భగవంతుని  నమ్మిన  లెనిన్  ఉద్భవించాడు?
                                                                                                                           
           
               

మూర్తి: నన్ను ఆలోచించుకోనియ్యండి.

   మూర్తి  నాకు  నమస్కరించి వెళ్ళిపోయాడు. ప్రజలు  భగవంతుడున్నాడని ఒప్పుకుంటే యేమి ఒలికింది. లేకపోతే  యేమి  నష్టమైంది?  భగవంతుని  పేరిట జరిగే ప్రాణహింస  అనంతం కదా. మనుష్య  హింసకే  వెరవని  భక్తులు  దేనికి వెరుస్తారు? మనుష్యుణ్ణి  పశువును  చేసే  భగవద్భావం కన్న, మనుష్యుణ్ణి  మనుష్యుడుగా  వుంచే నాస్తికభావమే నయం కాదా  అనుకుంటూ  కూర్చున్నాను.
మూర్తి ఒక్కడు  ఆ  లోయలలో కొండలలో  నడచి  కొంతదూరం  పోయాడు. మనుష్యుడు  ముందుకు నడచినా,  వెనక్కు నడచినా ఒక్కటే. వెనకా ముందు  లెక్కడున్నవి? తూర్పు ముందూ, పడమర వెనకా అవుతుందా?  తూర్పు పడమర  లీ  భూమిలో సూర్యుణ్ని బట్టి కదా. ఎవరు ఎట్లు నడచినా,  చుట్టు  చుట్టి  యథాస్థానానికే వస్తారు.

గోళాకారంగా ఉన్నదీ భూమి. గోళాకారంగా వున్నదీ విశ్వం. గోళాకారంగా సర్వశక్తులూ స్పందిస్తాయి. గోళాకారంలో ఏది మొదలు? ఏది పురోగామి? ఏది ఆశయం?

                                                                                                                3 
   
   మరల  నా కైలాసేశ్వరుణ్సి  సందర్శిస్తున్నాను. భోజనప్రియునకు  చక్కని మిఠాయిలు, వస్త్రప్రియునకు  పట్టువస్త్రాలు  ఏ  నరాలను  స్పందింపజేస్తాయో  కదా?  మనుష్యుడు  వాని  దర్శనమాత్రాన  ఉప్పొంగిపోతాడు. నాబోటి  జ్ఞానపిపాసులకు  కైలాససందర్శనము  అత్యంత  మాధుర్యాలను  జీవితమంతా  ఏల  ప్రసరింపజేస్తుందో  భౌతిక  వాదులకు  ఏమి  తెలుస్తుంది?
   మూర్తి  ఓ  కూలీని  వెంటబెట్టుకొని  లోయలో  ఎక్కడికో  పోయాడు అతనికి హిమాలయ  సందర్శనము  ఆనందం  సమకూర్చింది. రంగుల కళ్ళజోళ్ళతోనూ, కళ్ళకా రంగుల  అద్దాలజోడు లేకుండాను, సర్వకాలము  ఆ  శిఖరాలను, పర్వత సానువులను  పరిశీలిస్తూ  తన  చిత్రలేఖనాలు  విన్యాసం చేసివేస్తున్నాడు.
   మూర్తికి  కైలాసపర్వతముకడ  ఏదో విచిత్ర  పరివర్తనము  కలుగుతుందనే  నానమ్మకం. కైలాసపర్వతానికి  అనతిదూరంలో ధాన్యకటకసంఘారామం  ఉంది. దానిని ద్యూపాంగు సఘారామం అంటారు  తివిష్ట బౌద్ధులు. అచటి  సంఘారామాచార్యుడైన లామా  తొంబది ఏళ్ళు  దాటినవాడు. అఖండ విజ్ఞాని. సత్వసంపన్నుడు, ఆగతానాగతవేది. అర్హతుడు. ఆయన  మహా శిల్పి, చిత్రకారుడు.  నాకెన్నియో విషయాలు  పూర్వశిల్పాన్ని గురించి  బోధించారు.  ఆయనకడ  మూర్తిని  కొన్ని  నెల లున్చదలచు కొన్నాను. నేను కైలాస  ప్రదక్షిణం  చేసేటప్పుడు  మూర్తిని  నాతో తిప్పుతాను.
   మేము  అయిదురోజులు  దుర్గమమైన  జీలం నదిలోయలో  ప్రయాణం చేశాము. రావణహ్రదం చేరాము. మూర్తి  నాకడకు  పరుగునవచ్చి  స్వామీ,  ఈ  చెరువునేనా మానససరోవరం అంటారు?  అని  అడిగాడు.
   కాదుబాబూ, ఇది  రావణహ్రదం. ఈ  ప్రదేశాలలో  అనేక  మంచినీళ్ళ చెరువు  లున్నాయి.
   రావణహ్రదం!  కైలాసాన్ని  పెకలించి  తన లంకకు  తీసుకోనిపోవాలని ప్రయత్నించిన  రావణాసురుని  గాథతో  సంబంధం  వుందా స్వామీ? 
   అవును  మూర్తీ, నఖాలతో  తవ్వి కొండ  పెకలించాలని ప్రయత్నిస్తే అతడు  భంగపాటు పొందాడట. కాని  ఆ  త్రవ్వడం  వల్ల  ఈ  హ్రదం  ఏర్పడిందట.
    మనవాళ్లవి ఏమి  విచిత్ర  భావాలండీ! ప్రతిప్రకృతి వై చిత్ర్యానికి ఒక  చక్కని  గాథ కల్పిస్తారు.
    కల్పించడం  అంటే  నీ  ఉద్దేశం?
    లేనిది  సృష్టించడమనే!
    లేనిది  ఎవరికి?
    ........
    అందరికీనా?
    అవును.
    ఉందని  గుర్తించే వస్తువు  ఉందని  ఎల్లా  తెలుస్తుంది?
    చూపులు  చుస్తే, మనస్సు  గ్రహిస్తుంది.
    చూపులు చూచినా, మనస్సు గ్రహించకపోతే?
    చూచినా, ఒకటే, చూడకపోయినా ఒకటే.  
        
    అంటే__చూపులు నిమిత్తమాత్రం, మనస్సు  అసలుశక్తి  అని  గదా నీ వాదన. సరే, చూపులు లేకుండా మనస్సు గ్రహిస్తే?
    మనస్సు  గ్రహించడానికి  ఏదైనా  మార్గం  వుండి తీరాలండీ.
    మనస్సుపై  అధికారి  అనుకో. పైఅధికారికి   వచ్చే విన్నపాలు  క్రింద  వున్న  అధికార  సోఫానం  వెంట  వస్తవనుకో. ఆ అధికారే  క్రింద  అధికారులతో  సంబంధం              లేకుండా తానే స్వయంగా  విషయం దర్యాప్తు  చేసుకొని, విషయాన్ని  గూర్చి  తీర్పు  ఇవ్వగలడా?
    ఇవ్వగలడండీ. కాని  ఈ  పోలిక  సరియైంది  కాదు. తెలుపురంగు  ఒక వస్తువు  ఆధారం  లేకుండా  వ్యక్తం  కాదు.
    విశ్వంలో  విద్యుచ్ఛక్తి వుంది. అది  ఉపాధి  ద్వారా  వ్యక్తం  అవుతుంది. కాని  ఉపాధి కూడా  ఆ విద్యుత్  స్వరూపమే  అని  కదా  శాస్త్రజ్ఞులంటారు. అంటే విశ్వంలో  వున్న  ప్రతీ  అణువూ ఎలక్ట్రాన్, ప్రోటాన్ మొదలైన  సూక్ష్మాతి  సూక్ష్మశక్తికణాల  కూడికనేనా   మీ  ఉద్దేశం?  ఆ  విద్యుత్  వ్యక్తం  కావాలంటే  తనతో  చేయబడిన  వస్తువుద్వారా  వ్యక్తమవుతుంది. మనస్సు  నుంచే  సర్వప్రకృతీ  ఉద్భవించింది. సర్వప్రకృతిలోని  వస్తువు మనస్సు. ఆ  మనస్సు  ఒక  ఉపాధిద్వారాగాని వ్యక్తం  కాకపోవచ్చును. కాని మనస్సు  ఉపాధి  అవసరం  లేకుండా  వుండి, ఇతర  విషయాలను  గ్రహిస్తుంది కదా?  
                                                                                                                         
           
               

చిత్తం.

   అలాటి మనస్సు  సృస్టించిన  ఈ  విచిత్ర  భావాలు  వట్టి  కల్పనలెలా అవుతవి  మూర్తీ?  మనస్సు  ఇంద్రియాలను  ఉద్భవింపజేసినట్లే, భావాలనూ  ఉద్భవింపజేస్తుంది.  భౌతికమైన  ఈ  పదార్థా  లేలాంటి సత్యమో  భౌతికేతరమైన   భావాలూ  అలాంటివే. కనుక  ఒక  భౌతిక  విషయం    ఎంత  ఆనందదాయక  మౌతుందో, మానసిక మైన  ప్రపంచమూ  అంత  ఆనంద  దాయకమే!  శాస్త్రకారుడు  టిబెట్టును గూర్చి  తెలుసుకోవడానికి  ఎంతో  ప్రయత్నించాడు. అనేకులు  పరిశోధకులు  కష్టపడి, మారువేషాలతో  తిరిగి, ఈ  టిబెట్టు  రహస్యాలను  రవంత  గ్రహించారు.  అల్లానే  ఫలాని  నక్షత్రం  భూమికి  యిన్ని  వెలుగు సంవత్సరాల  దూరం  అంటే, ఈ  జ్ఞానం  మనుష్యున  కెందుకు  సంతోషం  కలిగించాలి?  ఎవరెస్టు  శిఖరము ఇరవై  తొమ్మిది వేలపై చిల్లర  అడుగుల  ఎత్తుంటే  ఏమి, అందుకు  ఒక వేయి  అడుగులు  తక్కువుంటే  ఏమి? ఆ  శిఖరం  తవ్వి  పసిఫిక్  మహాసముద్రం  పూడుస్తావా?  ఈలాంటి విషయాలు  తెలుసుకోవడం ఆనందం. అలాగే  శాతవాహనులు ఆంధ్రులా,  మహారాష్ట్రులా?  వారు ఎవరైనా, కొంపలు మునిగిపోవు. ఇదంతా  మానసికం,  అలా  మానసికంగా  గాథలు కల్పించడం  ఆనందకారణం. అందువల్ల  వచ్చే  నష్టమేమీ లేదు.  నా  ఉపన్యాసం  అవగానే  మూర్తి  నాకు  నమస్కరించి  ఆలోచనలతో  రావణహ్రదం  ఒడ్డున  కూర్చుండి  బొమ్మవేయడం  ప్రారంభించాడు.
       
                                                                                                            4 
   
   రావణహ్రద   సౌందర్యము, మానస  సరోవర   సౌందర్యముతో  సరిపోల్చలేము. రావణహ్రదంలో  ఆసురిక  సౌందర్యమూ, చిత్రిణీజాతి స్త్రీ మనోహరత్వము విలసితమౌతుంది.  మానససరోవర సౌందర్యం అలౌకికము. పద్మినీ  జాతి  స్త్రీవలె  ఆ సరస్సు  ప్రత్యక్షమౌతుంది.  సరస్వతీదేవి వలె  నాట్యం  చేస్తుంది. రాజహంసవలె  నడయాడుతుంది, యజ్ఞాగ్ని సశిఖాకాంతితో వికసిస్తుంది. మానవసరోవర  సందర్శనమాత్రాన  పూర్వకర్మ  పటాపంచ అవుతుంది. బ్రహ్మానందము సన్నిహిత  మవుతుంది.
   డెబ్బది రెండు  మైళ్ళ వైశాల్యం  గలిగి  నిర్మల  నీల  నీరాలతో  తెల్లటి  ఆ మంచుప్రదేశంలో  సతీదేవి  ధవళ   వక్షోజ  నీల  చూచుకం వలె  బిడ్డలైన  భక్తులకు  దర్శన మిస్తుంది. సకల  విశ్వాత్మికమగు  అధికమానసిక  ప్రతిబింబ  మీ  మానస  సరోవరం.  విశ్వంలో భూగోళము, విచిత్ర భగవల్లీలారంగము.  ఆ భూగోళంలో  భరతదేశం     విశ్వమాత. ఆ మాతకు వక్షోజాలు  హిమాలయాలు , హృదయం  బదరీనారాయణం,  మనస్సు మానస సరోవరం, శిరస్సు కైలాసం, సహస్రారం కైలాసశిఖరం. ఈ  రాజ  రాజేశ్వరి భావం, ఈ  కామకామేశ్వరీ భావం, నాబోటి  యోగవిద్యార్దులకే దృశ్యాదృశ్యం.
   శ్రీనాథమూర్తి  మానస  సరోవరాన్ని  చూచి  నిర్విణ్ణుడై  ఆ  దివ్య సౌందర్యం అతన్ని  ముంచెత్తగా, ఆనందం  అతన్ని వణికించగా, అశ్రుబిందువులు  గంగాధారలై  ప్రవహింప  నవ్వుతూ,  వెక్కివెక్కి  ఏడ్చినాడు. కొంతసేపటికి  సమ్మాళించుకొని, అతడు  యోగివలె  కౌపీనమాత్రధారియై, ఆ భయంకర  శైతల్యంతో  నాతోపాటు  మానస  సరోవరంలో  స్నానం చేశాడు.  ఒంటినిండా  బూడిద  పూసుకొని  శుభవస్త్రాలు ధరించి  నెగడి దగ్గర  కూర్చుండి  ఉత్త రాన  ఆకాశంలో  దివ్యదర్శనం ఇచ్చే  కైలసేశ్వర  శిఖరానికి  అభిముఖుడై,  పద్మాసనాసీనుడై, కన్నులు  మూసికొని  ధ్యానంలో  మునిగిపొయినాడు.
   నేననుకొన్న  ముహూర్తం  వస్తూవుంది.  ఆ తర్వాత  అతని  అదృష్టం. ఆ  ముహూర్తానికి అతన్ని సిద్దం  చేయాలి. అతనితో  వాదించాలి.  అతడు తనలో  తాను  చర్చించుకునే  విధానమే మార్చాలి.  ఇవి  నా కర్తవ్యాలు.  అలా ఏదో  ఒక  విచిత్రమైన యోగంలో  నిశ్చలుడైనాడు శ్రీనాథమూర్తి. ఆ  విచిత్ర  యోగంలో  ఇరవై నిమిషాలుండి, లేచి తిన్నగా  నా దగ్గరకు  వచ్చినాడు.  స్వామీ, ఈ  శుభ ముహూర్తంలో  నాకేదైనా  చిన్న  మంత్రం  ఉపదేశించండి.  నా జీవితంలోని  కల్మషం  కడిగి  నన్ను  పరమ జ్ఞానోన్ముఖునిగా చేయగలిగిన  మంత్రం  దయచేయండి! అని ప్రార్ధించాడు. వచ్చిందా పుణ్యముహూర్తం!  
    సరేనయ్యా, నీకు  దక్షిణమూర్తి  మంత్రం ఉపదేశిస్తాను. అది  ఒక లక్ష  నెమ్మదిగా  పునశ్చరణ చేసుకో. తర్వాత  ఓపిక  వుంటే  మంత్రం బీజాక్షర  లక్షలు  పునశ్చరణం  చేసి  శాంతిహోమమూ,  సంతర్పణా చేయిఅన్నాను. అతని  కా మంత్రం  ఉపదేశించాను.  ఆ సమయంలోనే  నూట ఎనిమిదిసారులా మంత్రాన్ని  నేను  చెబుతూ  అతని  చేత  పునశ్చరణ  చేయించాను.  మధ్యాహ్నం  పన్నెండింటికి భోజనాలయ్యాయి. 
   శ్రీనాథమూర్తి  దూరంగా  గోచరమయ్యే  కైలాస  పర్వతాన్ని, మానస  సరోవరాన్ని  చిత్రం వేసుకుంటూ  సాయంకాలం  నాలుగింటివరకు గడిపాడు.  ఈలోగా  సేవకులు  మా  గుడారాలు  చుట్టివేసి  గుర్రాలమీద ఎక్కించారు. మేము నాలుగున్నరకు  బయలుదేరి   రెండుమైళ్ళు  నడచి, ఆ సాయంకాలము  మానస  సరోవరానికి  వామతీరాన  వున్న  కొద్దిమంది  టిబెట్టు  లామాలున్న  ఒక  చిన్న  బౌద్ద  సంఘారమంలో  మకాం చేశాము.
   ఆ  రాత్రి  శ్రీనాథమూర్తి  జపం ముగించి  నా  దగ్గరకు  వచ్చి,  స్వామీ! ఈరోజుల్లో  మా లోకం  అంతా  అనేక  అనుమానాలతో  నిండివుంది. నిశ్చయాలు  ఒకరికీ  లేవు. ఒకవేళ  ఏదైనా  నిశ్చయం  వుంటే  అది పక్వంగాకుండా ఊదరకొట్టి పండించిన  అరటిపండులాంటి నిశ్చయమేఅన్నాడు.
    ఏమిటవి బాబూ! నాకు శక్తి  వున్నమటుకు  నీ అనుమానాలు  పోగొట్ట  ప్రయత్నం  చేస్తాను అని  జవాబిచ్చాను.
    మా  యువలోకంలో  ప్రపంచానికి  సరియైన  స్థితి  కమ్యూనిజం అనీ, అందుకు దారి  ప్రజావిప్లవం  వల్లనే  అనీ,  ఆ   దారిలో భగవంతుడు  లేడు. ఆ దారిలో  మతాలు లేవు. ఆత్మ వుందని  నమ్మం. మతగ్రంథాలు  మానసిక  వైపరీత్యాలు, వీటి  అన్నిటిపైనా ఆధారపడిన   కళ హీనము.  కళకోసం కళ  అనటం  క్షమింపరాని  ద్రోహం. ప్రజాభ్యుదయ  స్వరూపం  కాని కళ, నీరసుని  కూనిరాగాల వంటివి.
    ఆహింసలో  మగతనం  లేదు.  అది   మానవలోకాన్ని నాశనం  చేస్తుంది. సద్గుణాలు  సమయానుకూల  నటనలు మాత్రం.  పుణ్య  దయాధర్మ సత్యశౌచాలు వెనక్కులాగే  శక్తులు. ఆర్ధిక  సమత్వం, తర్వాత  రాజకీయ  సమత్వం  ప్రపంచాని  కంతకూ  సరియైన  ధర్మం. జాతులు అనవసరపు  అడ్డుగోడలు. దేశాలు భూగోళ భాగాలు మాత్రం. ఇవన్నీ  మాబోటిగాళ్ళ వాదనలు. మీ  అభిప్రాయం  సెలవియ్యాలి.
                                                                                                                         
           
               

మానస సరోవరతీరంలో నుంచుని దూరంగా ప్రత్యక్షమయ్యే కైలాస పర్వతాన్ని, మానస నిర్మల హృదయంతో ప్రత్యక్షం అయ్యే ఆ దివ్యపర్వత చ్ఛాయను చూస్తూ సర్వప్రపంచమూ మరచిపోవచ్చును. మానవ సరోవరానికీ, కైలాసానికీ ఉన్న శ్రుతి. పద్మానికీ సూర్యోదయానికీ వుండునా? సుందర శ్రీవిలసిత వనితా వక్షోజాలకూ, ముత్యాలహారానికీ వుండునా? విశాలదీర్ఘీ వినీల పక్ష్మాంకిత లోచనలకూ వాలుచూపులకూ వుండునా? సౌందర్యానికీ, ఆనందానికీ, పారిజాతానికీ, పరిమళానికీ వుండునా?

   ప్రభూ! కైలాసమూర్తీ! నీవే  ఈ పర్వత  ప్రభువువు. నీవే సర్వ లోకాశ్రయ పాదుడవు. నీవే  పరమ  సృష్టి  స్వరూప  నృత్య  వినోదివి. నీ బంగారు జంటలు  సర్వ  విశ్వ  ప్రసరిత ప్రాణకాంతులు. నీ  హస్తాలు  సర్వ  సృష్య్టాధార  చైతన్యాలు.  నీ త్రినేత్రాలు  సర్వశక్ట్యాత్మికవస్తు,  వస్తుసౌందర్యం, సౌందర్యానందాలు! ఓ  పరమేశ్వరా!  నీవు  యోగివి. యోగస్వరూపుడవు, యోగాతీతుడవు. నీవు మాతవు. మానమవు, మేయమవు. నీవు జ్ఞాతవు,  జ్ఞానమవు, జ్ఞేయమవు. ఓ  స్వయంభూ, నీకు  ఉనికి లేదు. నీకు  చేతనము  లేదు, నీవు మాత్ర మున్నావు. ఓ  సదాశివా!  నీవు కర్తవు, కర్మవు, క్రియవు. నీవు మహాకావ్యానివి . నీవు రసమవు, స్థాయీ సంచారీ, విభావానుభావ స్వాతిక  భావాలు నీవే. నువ్వు  చిత్రకారుడవు, కుంచెవు, వర్ణాలు, ఫలకానివి, చిత్రమవు నువ్వు వచనమవు. అన్వయానివి. నీవే  వ్యాకరణమవు. ఓ గుణాతీతా! నువ్వు  విరోధివి, స్నేహితుడవు, తండ్రివి, కుమారుడవు. నువ్వు దారివి, దారిన నడిచేవాడివి, గమ్యస్థానానివి. నిన్ను సందర్శించిన  పరమాద్భుతానందంలో, ఆటలలో  చిన్న బిడ్డల  ఆనందం, యువతీ యువకుల  ప్రేమానందము, కుటుంబికి సంవత్సము, పార్జనానందము, జ్ఞానికి విభూత్యానందము అణువులు మాత్రము. 
    కైలాసేశ్వరుని సందర్శిస్తున్న  శ్రీనాథమూర్తి  మన లోకంలో  లేడు. కొద్దిమంది  మాత్రమే  సందర్శించిన మహాదృశ్య  మాటాడు సందర్శించాడు. ప్రకృతిలోని  ఒక సౌందర్య ఖనిని  సందర్శించాడు. అతనిలోని అహంభావము,  గర్వం రేకెత్తాయి. అతనిలో కళాత్రుష్ణ గట్లుతెగి పరవళ్ళెత్తుతున్నది. అతనిలో ఎక్కడో దాగివున్న   నిశ్చలభక్తిలో  స్పందనం కలిగింది. ఈ  త్రివేణి  సంగమజ మహానదికి అతడు  నిజమైన  భగీరథుడు కావాలి!
   భోజనాలై   విశ్రమిస్తున్నప్పుడు, నా  దగ్గరకు వచ్చి  కూర్చున్న  శ్రీనాథమూర్తి వైపు తిరిగి,  బాబూ, నువ్వు నిన్న  అడిగిన  ప్రశ్నలకు  నాకు తోచిన  సమా ధానాలు కొన్ని చెబుతాను విను. ఆ  సమాధానాలు  నీ  సందేహహాలకు సరియైన  సమాధానాలు కావు. నీ  సందేహ నివృత్తి  నువ్వే  చేసుకునేందుకు  తోడ్పడుతాయి  అంతే. నీ సందేహాలూ, నా మాటలూ  సమన్వయంచేసి  ఆలోచించుకో. నీకే  నెమ్మదిగా  జవాబులు  దొరుకుతాయి అన్నాను.
    చిత్తం స్వామీజీ!
    భగవంతుడు  ఒక పెద్ద   మనుష్యుడుకాడు. అయితే  అతడు వున్నాడో, లేడో మనకు అక్కరలేదు.  ఆత్మ వున్నదని నువ్వు నమ్మవద్దు. ఆత్మానాత్మ  విచారణ. ఆస్తినాస్తి విచారణ, మానవ దైనందిన చర్యకు   సంబంధం కలుగజేసుకోనవసరములేదు. మతగ్రంథాలు చదవనవసరం లేదు. ఇక   అహింసనుగూర్చి,  పుణ్య, దయా, సత్యశౌచాలను గూర్చి  నేను స్పష్టంగా  మాట్లాడుతాను. జాతులను గూర్చి, దేశాన్ని గూర్చి చివర  నా అభిప్రాయం  చెప్పగలను. 
    చిత్తం. 
    హింస అంటే ఏమిటి? 
    మనుష్యుని  చంపడం, శారీరకంగా, మానసికంగా   మనుష్యుని  బాధ పెట్టడం. 
    కాబట్టి, మనుష్యుని  చంపడం  తప్పులేదు. చావగొట్టడం తప్పులేదు  మనుష్యుని  మానసికంగా  బాధ పెట్టడం  తప్పులేదు. అది మగతనం అది  మీ  వాదనా? 
    అంటే  ఏదైనా  మనుష్యలోకానికి  మంచిది  అని తోచిన  స్థితిని  తీసుకురావడానికి  అడ్డు అని  తోచే  మనుష్యులందరినీ  చంపవచ్చు, కొట్టవచ్చు, మానసికంగా బాధించవచ్చు. 
    ఇంకో  మనష్యులజట్టుకు వారికి  మంచిదన్నస్థితి-ఒకదాని  కొకటి  అడ్డంవస్తే  ఆ జట్టును  మీరూ, మీ జట్టును  వారూ  చంపుతూ  దారి  నిష్కంటకం చేయవచ్చునన్నమాట? ఈ రెండు జట్టులూ  సమానబలం  కలవి అయితే  ఒకదాన్ని  ఒకటి నాశనం  చేసుకొని  రెండూ మాయం కావాలి కదా! ఒకటి ఎక్కువబలం కలది  అయితే, రెండో దాన్ని నాశనంచేసి, తాను కొంత నాశనం అయి  తర్వాత  ముందుకునడవాలి. తీరా, ఆ  మంచిస్థితిని  పొందిన  తర్వాత  నాశనం  అయిన  జట్టు  తిరిగి  ఉద్భవిస్తే, మళ్ళీదాన్ని  నాశనం  చేస్తూ  ఉండాలి.  రెండోజట్టు  బలం  ఎక్కువయితే  ఈ జట్టు  నాశనం  అయిపోవాలి! ఇదేనా మీ  హింసాతత్వం? 
    అవునండి. 
   ఈ రకమైన  చరిత్ర  ఈ  మనుష్యలోకం  సంపూర్ణంగా నాశనం  అయినదాకా  ఉండాలని మీ వాదన! 
    అలా  ఉండాలని కాదు, ఉంటే ఉండవచ్చును. 
    అసలు  మనుష్యుడు , ఇంకో మనుష్యుని కోసం గాని, మనుష్యలోకం కోసంగాని ఎందుకీ  హింసంతా జరపడం?  
    అది  న్యాయం కాబట్టి! 
    న్యాయం అన్నదానికి అర్ధం ఏమిటి?  మనుష్యులకు  మంచిది  కాబట్టి  న్యాయం. మనుష్యులకు  ఇది  మంచిది  అని  నిర్ణయించేవారు  ఒక మనుష్యుడో  మార్క్సువంటివాడు లేక  చాలామందో__ ఇంటర్  నేషనల్__దీనికి  వ్యతిరేకంగా  హిట్లరో__ఒక మనుష్యుడు  లేక  నాజీపార్టో__వ్యతిరేకంగా నిర్ణయించవచ్చు! ఆ  మంచిదన్న  న్యాయంకోసం  నువ్వూ, నేనూ  ఎందుకు బాధపడాలి? 
                                                                                                                           
           
               

మనం అన్నదాంటో నేనూ ఉన్నాను కదాండీ. కుటుంబం బాగు అన్నదాంట్లో కుటుంబంలోని ప్రతిమనుష్యుడూ ఉన్నాడు. లోకకుటుంబంలో కూడా ఉంటాడు కదాండీ.

    ఇప్పుడు  రెండు  కుటుంబాలయ్యాయి కదా? ఈ  రెంటిలో ఏది సరియైన  న్యాయం?
    అందరికీ లాభించేది. 
    ఆ  విషయం నిర్ణయించే దెవరు? 
    అందరూ! 
    నాజీలూ, ఫాసిస్టులూ  యింకా  చాలామంది  అందులో  చేరారు కదా? 
    ఎక్కువమంది. ఒక్కడు  చెప్పినా   ఎక్కువమందికి నచ్చవచ్చును. 
    అంతేకాని, సర్వవిశ్వాన్ని  మధించి  తెచ్చిన  సత్యాలు  కావన్న  మాటేనా  ఇవి? 
    నేను  ఆలోచించుకొని రేపు  చెప్తానండీ. 
       
                                                                                                                   6
   
   శ్రీనాథమూర్తి  తిన్నగా డేరావదలి  మానససరోవర తీరానికిపోయి, అక్కడ మంచులేని  ఒక  రాతిబండమీద  కూర్చుని  ఉన్నాడు. శ్రీనాథమూర్తిలో  బాహ్యసౌందర్య పూజా  వాసనలు నిండి  ఉన్నాయి. ఆ  బాహ్య  సౌందర్యం  వెనకాల  మనస్సౌందర్యము, ఆత్మసౌందర్యము కూడా  ఉండాలి. ఈమూడు  సౌందర్యాలూ  మహోత్తమ  స్థితిలో  సంగమించడమే సంపూర్ణావతార భావము. ఆత్మసౌంధర్యంలేని  తక్కిన రెండు  సౌందర్యాలూ, మనుష్యుని  రాక్షసునిచేస్తవి. ఫ్రాంక్ ఐన్ స్టెయిన్ చే  సృష్టింపబడిన  రాక్షసుని  వంటివాడవుతాడు. ఒక  బాహ్యసౌందర్యం  ఉన్న  మనుష్యుడు జంతుసమానుడు. జంతువులో విలసించేది భగవంతుని  ప్రసాదమగు  ప్రకృతి  సిద్దగుణం (ఇన్  స్టింక్ట్) వల్ల వచ్చే మంచి చెడ్డలు  మాత్రం. ఆ జాతి  స్త్రీ  పురుషులలో  అది ఎక్కువగా  ఉండి మానవత్వ  సహజమైన  మనస్సు  తక్కువగా  ఉంటుంది. అలాంటివారిలో  ఆలోచన తక్కువ  ఉంటుంది.    
   ఆ  మధ్యాహ్నం  మేము  ప్రయాణం చేస్తున్నప్పుడు  జమీందారుడు  కూడా మాతో కలిసి  నడుస్తున్నాడు. ప్రొద్దుటి  ఆలోచనలు  నన్నింకా  వీడలేదు. నేను  శ్రీనాథమూర్తిని చూచి శ్రీనాథమూర్తీ! నీ  హృదయంలో  మానవ సౌందర్యం  పులకరాలు  కలుగజేస్తుంది కదా! నీ  హృదయంలో  సౌందర్యాన్ని  గురించి  ఉన్న  భావాలన్నీ నాకు  విందామని కుతూహలంగా  ఉంది. ఎందుకంటే, మనం  ప్రొద్దున చర్చించుకున్న విషయాని  కది  సన్నిహితం  అన్నాను.
   శ్రీనాథమూర్తి : స్వామీజీ!  మానవుని సౌందర్యం  ఎక్కువగా  వికసించేది స్త్రీ  మూర్తిలోనని  నా  ఉద్దేశము. ఈ  సౌందర్యంలో  మూడుభాగాలున్నాయి. మూర్తిసౌందర్యం, వర్ణం, ప్రాణవిలసనమును.
   జమీ : నలుపువర్ణం  అందంకాదనా నీ ఉద్దేశం?
   శ్రీనాథ : ఏ  రంగైనా  అది  అందంగా  వుండవచ్చును. అంటే  అందంగా  ఉండేందుకు రంగు మట్టితో  కలిపినట్లు బురదలా ఉండకూడదు.  రంగులో  మాంద్యం  ఉండకూడదు.  రంగులో ప్రకాశం, నైర్మల్యం ఉండాలి. అదే  వర్ణసౌందర్యం. అలాగే  మూర్తిసౌందర్యం  అంగాంగ శ్రుతి మేళనం ఉండాలి.
   జమీం : అంటే?
   శ్రీనాథ : అనురూపత అని  నా  భావం. ఒక పొడుగు  మనుష్యుడు  తల, ముఖము, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఫాలం, చేతులు, హస్తతలాలు, వేళ్ళు, ఛాతీ, నడుం, కటి, పిరుదులు, తొడలు, పిక్కలు, పాదాలు  ఆ పొడుగుకు తగినట్లుగా వుండాలి. పొడుగువానికీ, ఛాతీ బాగా వెడల్పున్న వానికీ  పొన్నకాయలాంటి  చిన్న తలకాయవుంటే అనురూప రహితమన్నమాట.
   నేను : ఈ  అనురూప  నిర్ణయం  ఎట్లాగ?
   శ్రీనాథ : అనేక  యుగాలనుండి మనం  మనుష్య  రూపం ఎరిగి, ఉత్తమ పురుషుడికి  ఇంత తల, ఇంతంత  కళ్ళు మొదలైనవి వుండాలని  నిర్ణయించాము.
   నేను  : అంటే  మంగోలులకు  ఒక రకం  అనురూపనిర్ణయం, నీగ్రోలకు ఇంకోటి  వుండవచ్చు  నన్నమాటేగా!
   శ్రీనాథ : చిత్తం.
   రాజ : బెలూచీలకు  ఒకరకం, కాబూలీలకు  ఇంకో రకం, పంజాబీలకు  వేరేరకం, బ్రాహ్మణులకు వేరు, ముస్లింలకు  వేరు అలా  వుండవచ్చన్నమాట.
   శ్రీనాథ : అవునండీ!  ఈ  తేడాలు  మానసిక  సౌందర్య, ఆత్మసౌందర్యాల నిర్ణయాలలోనూ  వుంటాయి.
   నేను : ఇంక  ప్రాణశక్తి  సౌందర్యం  ఏమిటి?          
     శ్రీనాథ : ఒక  మనుష్యుడు  మందకొడిగా  వుంటాడు. ఇంకొకడు  హుషారుగా వుంటాడు.  చాకచక్యంగా  వుంటాడు.  ఎక్కడ  ఈ  మూడూ  ఉత్తమంగా  సంయోగం  అవుతాయో, అక్కడ భౌతిక  సౌందర్యం  వుందని  మేమంటాము.  అంగాంగ సమప్రమాణత  వున్నంత మాత్రం  చాలదండీ. ఆ  అంగాంగాలు  పుష్టిలో  రేఖలలో  సమప్రమాణంగా ఉండాలి. మొగవాడికి  కండలుకట్టిన  దేహం అందం. స్త్రీకి  కర్కశత్వం పనికిరాదు. మెత్తదనము, రేఖాస్పుటత్వమూ వుండాలి. 
   నేను : ఎందుచేత  స్త్రీలో  ఎక్కువ  మనుష్య  సౌందర్యం  వుందంటావు? జంతువులలో,  పక్షులలో  మగవే ఎక్కువ  సుందరంగా  ఉంటాయి. కదా! కోడిపుంజు, నేమలిపుంజు, మగపులి, మగసింహము, ఆంబోతు ఎంత  అందంగా  ఉంటాయి? 
   శ్రీనాథ : చిత్తం. జంతు స్థితినిదాటి  మనుష్యుడు  పైకి  వచ్చాడు. జంతు, పక్షి కుటుంబాలలో  పనిబాధ్యత ఆడదానిది. మగది ఆడదాని  సంతోషం కోసం  మాత్రం. అందుకని  అందమూ, పాటా  మగదానికే  వుండాలికదా! ఇక  మనుష్యులలో  పురుషుడు పని  నిర్వహించేవాడు, స్త్రీ  పురుష ప్రీతికోసం. అందుకని  స్త్రీలోనే  అందం అంతా  చేరింది.
   నేను : పురుషులకూ, స్త్రీలకూ  సమానహక్కులు, సమాన బాధ్యతలు వచ్చిన్సప్పుడు పురుషుని కోసం  స్త్రీ  అంటావేమిటయ్యా!
   శ్రీనాథ : స్త్రీ  పురుషులు  సమాన  కర్మపరంతంతులైన వెనుక  నెమ్మదిగా  సౌందర్యం  ఇద్దరికీ  సమమౌతుందేమోనండీ!                                                                                                                           
           
               

జమీం : అది ఎల్లాగయ్యా! పనివల్ల సౌందర్యం తక్కువ, పని లేని వారికి సౌందర్యం ఎక్కువా అన్నావుకదా! స్త్రీ పురుషు లిద్దరూ సమానంగా పనిచేసేటట్టయితే ఇద్దరిలోంచి అందం నశించిపోతుందేమో! అంటే మానవ జాతిలోంచే అందం పోతుందేమో?

                                                                                                                   7
   
   మా నడకా, మా  సంభాషణా  రెండూ  సాగుతూనే  వున్నాయి. మాదారి  మానససరోవరతీరం ప్రక్కనే, పర్వత సానువులమీద  ఎగుడు దిగుడు రాళ్ళ ప్రక్కగా, గుట్టలమీదుగా ఉన్నది. కొన్ని చోట్ల మంచుకరిగి  నీరుగా  ప్రవహించి  చిన్న, పెద్ద  పతనాలుగా  మానససరోవరం చేరుతున్నాయి. చిన్న చిన్న వాగులు, ఆ  వాగులు  దాటుతూ  మనుష్యుడు  మాత్రం  నడవగలిగిన  ఆ దారిలో  పూవులు  పూచే  చిన్న  గుబురులమధ్య  ప్రయాణం  చేస్తున్నాము. సరోవరానికి  ఉత్తరంగా  కైలాసశిఖరం బంగారు రంగులతో  ప్రజ్వరిల్లుతూ  బంగారు కమలంలో  పరమశివుడు పద్మాసనస్థుడై  యోగసమాధిలో  ఉన్నట్లు  దర్శనమిస్తున్నది.
   నేనాపవిత్ర  సందర్శనానందంలో పులకరించిపోయి చూడు మూర్తీ! ఆ  సౌందర్యం, ఆ  కైలాసశిఖరం, కనకాంభోజగతం, నవేందుమకుటం, కైలాస ప్రభుం! అన్నట్లుగా  ఉన్నది. ఆ సౌందర్యాన్ని  వర్ణించగలమా?  అన్నాను.
   శ్రీనాథమూర్తి : ఆ  దృశ్యం  అద్భుతంగానే  ఉన్నదండీ, పదినిమిషాలలో  ఒక చిన్న బొమ్మ  వేసుకొని  మిమ్ము  కలుసుకొంటాను.
   నేను : అల్లాగే  మూర్తీ, మేమంతా ముందుకు సాగం. అదిగో అక్కడ కూర్చుంటాము. మన మకాం  ఒక  అరమైలు  మాత్రం ఉంది.
   శ్రీనాథమూర్తి  పదినిమిషాలలో  బొమ్మ  పూర్తిచేసి, ఆ ప్రకృతి సౌందర్యం, ఉప్పొంగిపోతూ వీక్షిస్తున్న  మమ్మల్ని కలుసుకొన్నాడు.
   నేను : మూర్తీ! మనుష్యుని ఆరాధన  మూడు  మోస్తర్లు. ప్రకృతిలో  శక్తులను గమనించి, ఆ  శక్తులకు అతీతమైన  ఒక ఆధారం  ఉందని  సిద్దాంతానికి వచ్చి, సుఖదుఃఖాలకు అతీతమైన  ఆ స్థితిని చేరడానికి  ప్రయత్నించడం ఒక రకమైన  ఆరాధన. దీన్నే జ్ఞానమార్గం అంటారు.
   జమీందారుడు : నాకు  కష్టాలు కలిగించవద్దని మొక్కుకుంటే  ఆ  కష్టాలు రాకపోవడం  జరుగుతూ  ఉంటుంది కదాండీ స్వామీ? 
   నేను : అవునండీ, దాన్ని గురించి చెప్తాను. రెండవది, నువ్వు  ప్రకృతి శక్తులను గమనిస్తావు. దాని  అపారాద్భుతత్వము  నీలోని మానసిక  శక్తులను  స్పందించి నీకు ఆనందం  కలుగజేస్తుంది. ఆ  ఆనందంలో  నువ్వు  ఆ అద్భుతాన్ని ఆనందంగా  వర్ణిస్తావు. అది మామూలుగా చెప్పితే  నీకు మొదట  కలిగిన  ఆనందం  కలుగదు. అందుకని నీలోని  ఆనందాన్ని  వ్యక్తీకరించగల  విధానం, విపరీత  రచనా  విధానమే. అదే సంగీతం, అదే కవిత్వం, అదే చిత్రలేఖనం, నాట్యం, శిల్పమున్నూ.
   శ్రీనాథ : స్వామీ! ఈ  కళలలో  భగవంతుడు, మనుష్యుడూ, ఎక్కువగా  వస్తారేమండీ?
   నేను : వస్తున్నా! మూడవ మోస్తరు  ఇలా వచ్చింది. మనుష్యుడు  ప్రకృతి  శక్తులను  చూచాడు. ఆ శక్తులను  ఆరాధిస్తే తనకు మేలు  వస్తుంది అనుకున్నాడు. లేకపోతే  ఆ శక్తులీతన్ని నాశనం  చేస్తాయి. అనుకున్నాడు. వరుణ, ఇంద్ర, అగ్ని మొదలైన  శక్తులను పూజించాడు.  యాగాలు చేశాడు. ఇది  భయజనితారాధన.  ఈ  ఆరాధన  హీనస్థితిలో  ఉన్న మనుషులలో  ఎక్కవ.
   శ్రీనాథ : తిరుపతి వేంకటేశ్వరుని మొక్కు, మంత్రాల  పునశ్చరణ ఏమిటండీ?
   నేను : విను, అదే  చెప్పబోతున్నది.  ఈ  మూడు  మోస్తర్లు, ఒక దానితో ఒకటి  సమంగాగాని, ఒకటి  ఎక్కువగాగాని సంగమం అవుతాయి. జ్ఞానమార్గం, సౌందర్యమార్గం లేక  ప్రపత్తి  మార్గం  లేక ప్రపత్తి మార్గం సమంగా  కలిసి  విసిష్టాద్వైతం, ముస్లింమతం, ఆదిశైవము మొదలైనవి వచ్చినవి. సౌందర్య మార్గం ఎక్కువై వామాచార శాక్తేయం, గౌరాంగమతం, సూఫీమతం వచ్చాయి.పూర్తిజ్ఞానమార్గం, హీనయాన  భౌద్దం, చార్వాకం, వైశేషికం, కాపిలమున్నూ,జ్ఞానం  ఎక్కువై  అద్వైతం వచ్చింది. 
   జమీం : భయాదారంవల్ల, అమ్మవారి జాతర్లు, మొక్కుబడులు వచ్చాయి అంటారు.
   నేను : జ్ఞానమార్గం, భయమార్గం, భక్తిమార్గం అన్నీ  కలసి  వేలకు వేలు  విధానాలు ఉద్భవించాయి.
   శ్రీనాథ : ఇప్పుడు  శాస్త్రజ్ఞానం వృద్ది  అయినందువలన, మతం యొక్క  భవిష్యత్తు పరిణామం ఏమవుతుంది స్వామీజీ?
   నేను : శాస్త్రజ్ఞానం ఎక్కువౌతున్నది నిజమే. మూఢత్వం  చొరనీయని  విజ్ఞాన మతాన్ని  ఇంకా  బాగా  అర్ధం చేసుకుంటాడు. మతం అనేది  శాస్త్రజ్ఞానంలోని లోట్లు  వెదికికాబట్టి  దేవుడున్నాడు అనదు. అలా వాదించడం జ్ఞానమార్గం నాశనం  చేయడమే  అవుతుంది. ఉత్తమ  మతం  ఎప్పుడూ శాస్త్రజ్ఞానాన్ని ఉపాధిగా  తీసుకుంటుంది. శాస్త్రజ్ఞాన పర్యవసానంవల్ల మతంలోని  ఉత్తమ  భావాలకు  ఎక్కువ  గట్టితనం  వస్తుంది.
   మా  ముగ్గురనూ  నిశ్శబ్దత  ఆవరించింది. ఇంతలో  మకాం  ప్రదేశం వచ్చింది. చీకట్లు  ఆవరిస్తున్నాయి. మేము  మా  బస  ఏర్పాటులలో మునిగిపోయాము. సర్వవిశ్వాన్ని స్పందించే భావాలు  సముద్రంలోని  అలలు ఉప్పొంగిపోతున్నవి. ఆ  తరంగాల  అంచులు  లోకాలోక  ప్రదేశాలపై విరుచుకుపడుతున్నాయి.
   
                                                                                                                8
   
   పాశ్చాత్యుల  శాస్త్రజ్ఞానాన్ని సంపుటీకరణం చేసి  శ్రీనాథమూర్తికి ఆరాత్రి  నిరూపించాను.  శాస్త్రజ్ఞానం  అంటే  ఏమిటి? ప్రకృతిని దర్శించి, ప్రకృతిశక్తి విధానాలను  పరిశోధనద్వారా  నిరూపించి, ఆ నిరూపణ  నిర్ధారణ చేసి. ఆ  నిర్ధారణ  సోపానాలతో నూతన  మార్గాలు, నూతన సత్యాల అన్వేషించడం శాస్త్రజ్ఞానం. ఇది  పాశ్చాత్య విధానం.
   శ్రీనాథమూర్తి : భారతీయుల  విధానం  ఎలాంటిదండీ?                                                                                                                           
           
               

భారతీయుల విధానం ప్రస్తుతం అలా ఉంచుదాము. భారతీయులు అతీంద్రియదృష్టిద్వారా జ్ఞానం సంపాదించారు. ఆ దృష్టీ, ఆ జ్ఞానం ఇంకో విచారణలో చెప్పుకుందాం. ప్రస్తుతము పాశ్చాత్య ఖండస్థులైన ఉత్తమశాస్త్రజ్ఞులు ఇంతవరకు నిర్దారణచేసిన శాస్త్రజ్ఞానం ఏమిటి? వారు పదార్ధాన్ని గురించి అర్ధవాదం ఎట్లాచేశారు? వారి శక్తివాదము, జీవవాదము, పరిణామము, మనశ్శాస్త్రము, ఆయిన్ స్టెయిన్ గారి పరస్పర సంభందవాదము, అన్నీ క్రోడీకరించుకొని, ప్రాచ్యసంస్కారానికి అవి సన్నిహితమూ, వ్యతిరేకమా అనేవి నిర్ధారణ చేసుకుందాము.

   శ్రీనాథమూర్తి : చిత్తం. మా  యువకులలో  సంపూర్ణ  పాశ్చాత్య జ్ఞానమూలేదు, ప్రాచ్యజ్ఞాన పరిచయం అంతకన్నా లేదు.
    పాశ్చాత్య శాస్త్రజ్ఞానం అర్ధంచేసుకోవాలంటే, శాస్త్ర  పరిభాష  పూర్తిగా  రావాలి. అ భాషవెనకాల వున్న  సంపూర్ణభావం  ద్యోతకంకావాలి. ఇప్పటికి  అనేకులు  పాశ్చాత్య శాస్త్ర  పండితులకే  ఆయిన్ స్టెయినుగారి పరస్పర  సంబంధవాదము పూర్తిగా  అర్ధంకాదట!
   శ్రీనాథమూర్తి : మా  కళాశాలలో  పాఠాలు  చెప్పే  ఎమ్. ఎస్. సి  మొదటి శ్రేణివారయిన  గురువులకే  కొన్ని  పాశ్చాత్య శాస్త్రజ్ఞాన  విషయాలు  అగోచరాలండీ.
    కాదామరి, ఇంక  ఆ  పాశ్చాత్య సిద్దాంతాల  పరిశోధన చేయగల  శక్తివుండాలి. పరిశోధనకు  తగిన  వుపకరణాలు వుండాలి. ఇవి  భౌతిక  వాదానికి  వుండాలి. అని  నేనంటే, ప్రాచ్యజ్ఞానానికి తెలివితేటలు అక్కరలేదని గాని, వుపకరణాలు అక్కరలేదనిగాని  నా  ఉద్దేశంకాదు. ఏ సిద్దాంతం అర్ధం చేసుకోవాలన్నా  అతినిశితమైనబుద్ది  కావాలి. ఇంక  పాశ్చత్యుల పరిశోధనోపకరణాలు, భౌతికమైన  వస్తువులు, ప్రాచ్యుల వుపకరణాలు అధిమానసిక, ఆధ్యాత్మికములు. అవి  కొద్దిమందికే లభ్యం. కొలదిజ్ఞానవంతులకు  పాశ్చాత్య  శాస్త్రజ్ఞానమూ, భారతీయ  శాస్త్రజ్ఞానమూ  రెండూ  ఛాయామాత్రంగా  అర్ధం  అవుతాయి. నేను  నా  పూర్వాశ్రమంలో  ఎమ్. ఏ. నే. నేను పదార్ద విజ్ఞానశాస్త్రము  పుచ్చుకున్నాను. నేనూ  నీకుమల్లేనె నీబోటి  అనేక  యువకుల  మల్లేనే మన  శాస్త్రాలను, మన  ఆధ్యాత్మిక  విచారాన్ని  నిరసించినవాణ్ణే. నా  గురువుగారి  పరమకరుణవల్ల నిజం  తెలుసుకొనడానికి  అర్హత  సంపాదించుకొన్నాను.
   శ్రీనాథమూర్తి మోములో  ఆశ్చర్యరేఖలు  ప్రసరించాయి. అవును; నేను  ఎమ్. ఎ. నని  తెలియడం  అతనికి  ఆశ్చర్యం కాదా?
   శ్రీనాథమూర్తి : చిత్తం.
    శాస్త్రజ్ఞానం కొంతవరకు  వచ్చింది  అంటే  ఇంతవరకు  రూఢి అయిన  శాస్త్రజ్ఞానమూ, ఇంకనూ  మిగిలిపోయినదీ రెండూ  భాగాలున్నాయి. మూడో భాగం  కొంతఅయి, కొంత  కానివిషయం. అవి అర్ధచ్ఛాయారూపాలు(పీనంబ్రా) వంటివి. ఈ  భాగంలో  మానసికశాస్త్రం, సాంఘీఖశాస్త్రం, జీవశాస్త్రం లుంటాయి. నిర్ధారణంగా వచ్చే  శాస్త్రజ్ఞానం రసాయన, పదార్ధ  విజ్ఞానశాస్త్రాలు  వుంటాయి. ఒక కుక్క  మరుసటి నిమిషంలో ఏమి చేస్తుందో  శాస్త్రదృష్ట్యా చెప్పలేము.  కాని  పడి సంవత్సరాల తర్వాత  చంద్రగ్రహణం ఎక్కడ, ఎప్పుడు, ఏ  రీతిగా  వస్తుందో  చెప్పగలం. కుక్క విషయంలో  ఆలోచనాతీతమైన  బుద్ది  అనేక శక్తి  ఒకటి  వస్తుంది.ఒకటి : శాస్త్రం  ఉన్న  సత్యాలను  వివరిస్తుంది. రెండు : శాస్త్రం  ఆ వివరణలు పూర్తిగా  అర్ధమయ్యే రూపంగా  కొద్ది  మాటలతో  వ్యంజనగా ఎక్కువ  అర్ధం యిచ్చే  పారిభాషిక పదాలు, వచనాలు, విచారణ సోపానాలు  ఇస్తుంది. మూడు : శాస్త్రం ప్రతి  పదార్ధమూ శక్తి అని  అత్యంత  సమ సూక్ష్మ  రూపాలకు పృధక్కరణం, విభజనం చేస్తుంది. అంటే ఒక పదార్ధ  స్పటికాన్ని (నత్రజని అనుకుందాము ) అణువులుగా  (మాలె క్యూల్సు) మార్చి, ఆ అణువులను  పరమాణువులుగానూ, (ఆటములు),  ఆ  పరమాణువులను శక్తి  రూపమై  విద్యుత్ కణాలైన ధనకణము (ప్రోటాను), రుణకణము (ఎలక్ట్రాను) లుగా  విభజిస్తుంది. అల్లాగే  జీవశాస్త్రంలో  రక్తం  ఎఋపు  కణాలు,  తెలుపు కణాలు, జీవకణాలు (సెల్సు)  ఆదిమ  జీవపదార్ధము (ప్రోటోప్లాజము) గా  విభజిస్తుంది శాస్త్రం.
   జమీందారు : స్వామీజీ, నా కివి  అన్నీ  తిక్కగా  ఉన్నాయి. ఓ పటాన అర్ధం కావటంలేదు. నాకు కావలసింది ఒక్కటే విషయం. పాశ్చాత్య  శాస్త్రజ్ఞానం  భగవంతుణ్ని, అంటే ఆత్మశక్తిని నిరూపిస్తుందా?
   నేను : జమీందారుగారూ ! నా వాదన ఏమిటంటే, పాశ్చాత్యశాస్త్ర  ప్రకారం  భగవద్బావం  బాగా నిరూపణ  అవుతుందనే! అందుకనే  పాశ్చత్య శాస్త్రజ్ఞానం యావత్తూ  నాలుగు  ముక్కలలో చెప్పి, భగవద్భావానికి ఆ శాస్త్రం ఎందుకు  అవసరమో  నిరూపిద్దామని ప్రారంభించాను.
   జమీం : చిత్తం  స్వామీజీ! మీరు కానీయండి. నాకు శక్తి  ఉన్నంత మట్టుకు  వింటాను. లేకపోతే చల్లగావెళ్ళి పడుకుంటాను.
   నాలుగు  : శాస్త్ర సత్యాలను  వివరించడంలో  సంపూర్ణ, అంటే  చరిత్ర రూపమైన, వివరణ చేస్తుంది.  విశ్వం  ఎప్పుడూ  స్పందిస్తోంది, మారుతోంది. శాస్త్రం  సత్యం చెప్పేటప్పుడు  ఒక పదార్ధమూ, ఇంకోపదార్ధమూ, పదార్ధమూ, శక్తీ  పరస్పరంగా మార్పులు  తీసుకువస్తాయి అన్నప్పుడు  సూర్యకుటుంబ, నక్షత్ర చరిత్రలు కలుపుకొని  చెబుతూ ఉండాలి. అయిదు : రసాయన భౌతిక శాస్త్రాలలో ఏలాగు , ఏది అని మాత్రం ప్రశ్నలు వస్తాయి. జీవ, మానసిక  శాస్త్రాలలో ఎందుకు అన్న ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. ఆరు : శాస్త్రం ఎందుకు  అన్న ప్రశ్నకు  జవాబు ఇవ్వాలి. ఆ  జవాబు  పూర్ణం  కాకపోవచ్చును. ఇది అయివుండవచ్చును  అను ప్రత్యక్షవాదాఢారము       (ఎంపిరిసిజం), పూర్వవాదానుమానాధారము (ఎప్రయోరీ) అయివుంటుంది. ఏడు : శాస్త్ర ప్రశ్నలు, ఏమిటిది ఇది ఎలా జరుగును?  ఏ విధంగా  సంభవించింది? దీని చరిత్ర ? ఈవిధంగా  వుంటాయి.
   ఈవిషయం  దగ్గరకు వచ్చేసరికి  మూర్తీ, నేనూ  చిన్నపులి  అఱుపు  విన్నాము. అతడు  ఉలికిపడ్డాడు. జమీందారుడు గుఱ్ఱు పెట్టి  నిద్రపోతున్నాడు. అది గమనించి  శ్రీనాథమూర్తి పకపక  నవ్వాడు. అతన్ని పడుకోమని  నేను యోగాభ్యాసం  ప్రారంభించాను.
   
                                                                                                                 9
   
   విద్యుచ్చక్తి , అయస్కాంతం  దగ్గరకు  ఎక్కువ  చలనం  పొందినట్లుగా, కైలసేశ్వరుని సమీపించిన కొలదీ  మాలో  విషయ  విచారణ  ఎక్కువైంది. ఎక్కువ సన్నిహిత సంబంధాలున్న మూడు విభాగాలవుతుంది  మానవ చైతన్యం. భౌతిక  ప్రపంచం  ఏమిటి  అని తెలుసుకోవడం  ప్రకృతిలో  ఉన్న  అద్భుతదృశ్యాలు ,  సంఘటనవల్ల  మానవునిలో  హృదయం స్పందించి,  సౌందర్య పిపాస  రేకెత్తి  ఆనందం కలగడం, భౌతికాతీతమైన  భగవంతుని  లీలలో  తన్మయత్వం  పొందడం. ఈ  మూడు  మానవ చైతన్యాలకూ వ్యతిరేక  స్వరూపాలు  కూడా స్పందన  భాగాలే. శాస్త్రం ఖండసత్యం  అని వాదించడం, శాస్త్రం లొంగకపోవడం, లలిత కళలు  మానవనీరసత్వం  అన్నవాదన, భగవంతుడు  లేడనువాదన.                                                                                                                             
           
               

మర్నాడు తెల్లవారగట్ల మా ప్రయాణం సాగింది. మేమందరము ఏదో అనిర్వచనీయమైన ఆనందంలో మునిగిపోయాము. కైలాసపర్వత ప్రకాశం మా జన్మలనంతా ఆస్లావిస్తున్నది. ఆ తేజస్సు మా జీవితంలో ప్రతి అణువునా ప్రసరిస్తున్నది. తత్కారణరూపమైన దివ్యమత్తత మమ్మల్ని అలమిపోయింది. కైలాసపర్వతముఒక మహాదేవాలయంలా వుంటుంది. విమానం, ముఖమండపము అన్నీ కలిపి ఒక పరమ నిర్మాణం.

   సంతత  ఘనీభూత  హిమపూతాచ్చమైన  ఈ  దివ్యపర్వతము పార్వతీ పరమేశ్వరుల  నిలయమా? ఇరవై మూడువేల  పైచిల్లర  అడుగులు ఎత్తున్నదని అంచనా వేయబడిన  ఈ  పర్వతశిఖరము  మానవ సంచారణాతీతము! ఆ  దివ్యగోప్యప్రదేశాలలో  గణేశుడు, కుమారుడు, నందీశ్వర  భృంగీశ్వరులు, వీరభద్రుడు  పరమ  శైవానందంతో  నాట్యం చేస్తూ వుంటారా?  పరమశివుడు, పవిత్రనృత్య  తాండవేశ్వరుడు, దివ్యరుద్ర వీణాతంత్రీ  గానవినోది,  యోగీశ్వరేశ్వరుడు,  పరమదరిద్రుడు,  నిత్యభిక్షాటనమూర్తి , శ్మశానవాటీనివాసి, నిత్యశివసుందరుడు. ఎంత  అందమైన  భావము! ఎంతో  మహోత్తమోత్తమ భావము! 
   కైలాసేశ్వర  పర్వత  శిఖరదృశ్య  సందర్శనాభిముఖుడైన  శ్రీనాథమూర్తి  వైశాఖాదిత్య  మధ్యాహ్న చండకిరణ స్పష్ట హిమఖండములా కరిగిపోయినాడు. అతని కన్నుల  అశ్రుధారలు యమునా  గంగానదులై ప్రవహించాయి. గాఢ ప్రేమవిధాన నాథసందర్శనమందు యోషవలె అతడు వెలిగిపోయినాడు. మానస సరోవరం  తీరంలో  మంచునిండిన ఆ  బండరాళ్ళలో, కైలాస శిఖరం ఎదుట మోకరిల్లి  సాష్టాంగమైపోయినాడు. అతడు గజగజ వణికినాడు.  పరుసవేది స్పృశించిన ఇనుమువలె  అతడు  తప్తజాంబూనందలా  ప్రజ్వరిల్లిపోయినాడు. అంతకుముందు  మాడిపోయినట్లున్న  అతని రంగు  హిమాలయ పర్వతాలలోకి చొచ్చి  వస్తున్నప్పటినుంచీ, మళ్ళీ  మునుపటి  బంగారుఛాయ  తెచ్చుకుంది. ఈనాడు, అతడు ఆ  దివ్యోదయ సంధ్యాక్షణంలో తేరిపార చూడలేకున్నాడు. ఒక నిత్య యౌవనం అతనిలో  తేజరిల్లింది. అతని పూర్వవాసనలన్నీ  ఒక్కసారిగా  ఆకురాలుకాలంలో  అకురాలినట్లు రాలిపోయినవి. అతని  ఆత్మ ఒక మహాసూర్యగోళమై తేరి చూడరానట్లయినది.
   
   ఓ పరమేశ్వరా! అతనిపై నీకు  కరుణ  జనించినదా? అతని జన్మలోక  కల్యాణంలో  ఉత్తమ  నాయకత్వం  వహించబోతున్నదా? 
   శ్రీనాథమూర్తి  లేచి  అలాగే నిలుచుండినాడు. అతడింతలో  చైతన్యరహితుడై పోయినాడు. పదిహేను నిమిషాలట్లు సమాధిలోకి  వెళ్ళిన  వెనక  నేను  ప్రణవనాదోచ్ఛారణ చేశాను.  అప్పుడు  కళ్ళుతెరచి నాదగ్గరకు  పరుగెత్తి  వచ్చినా  కాళ్ళకడ సాగిలపడి  నా పాదాలు  గ్రహించి,
                                                      కైలాసేశ సమారంభాం
                                                      శంకరాచార్య మధ్యమాం 
                                                      అస్మదాచార్య పర్యంతాం
                                                      వందే గురు పరంపరా
                                           అని  చదువుతూ  కన్నుల  వెల్లువైనాడు.
                                           చంద్రికా నాతూనిలా కనబడినాడు.
    శ్రీనాథమూర్తీ, నీకీ కైలాస పర్వత  సందర్శన పుణ్యకాలంలో శర్వరీ భూషణం అనే  పౌరుష  నామం  ఇస్తున్నాను. నువ్వు  దర్శించిన  మహాభావాన్ని  చంద్రునిలా  వెదజల్లు. 
                                                కరచరణకృతంవా, కాయజం  కర్మజంవా
                                               శ్రవణనాయనజంవా  మానసంవాపరాధం
                                               విహిత  మవిహితంవా సర్వమేతత్ క్షమస్వ
                                               జయజయ  కరుణాబ్ధే శ్రీమహాదేవశంభో.
   
                                                                                                              10
   
   శర్వరీభూషణుడైన శ్రీనాథమూర్తి  ఆ  సమాధిలో  నిశ్చలత్వం దర్శించాడు.  ఆ నిశ్చలత్వం  రూపొంది, తనువు చాలించిన  అతని భార్య  శకుంతలామూర్తి  అయిపోయిందట.  ఆ  శకుంతలామూర్తి  నవ్వుతూ  ఒక పాలరాతి విగ్రహంలా  మారిపోయిందట. ఆ  విగ్రహం  వేయి విగ్రహాలైనదట.  ఆ  విగ్రహాలన్నీ  లోకంలోని  దైన్యమూర్తులుగా, కర్షకులుగా, బీదలుగా, ప్రసిద్దకవులుగా, గాయకులుగా, నాయకులుగా  మారిపోయినవట. అప్పుడొక  దివ్యవాక్కు అతనికి  వినబడినదట.
    ఓయీ  శ్రీనాథా, త్యాగమే  మానవదివ్యత్వము, శాస్త్రమే జ్ఞానము, కళేభక్తి, వేదాంతమే మతము, ఈమూడూ  నాలోనే సమన్వయము. ఒక దానికొకటి  సంబంధం లేనట్లు వున్నా  అవి నాలో  లయమవుతున్నాయి. నేనే సర్వమతాలు, నేనే సర్వకళలు. వీని నిజమైన  అర్ధంకావాలంటే  ప్రతి విషయాన్ని  సమ్యక్ దృష్టితో  సందర్శించాలి.
   ఈ ముక్కలు  తన జీవితంలో  మారుమ్రోగుతుండగా శర్వరీ భూషణుడైన శ్రీనాథమూర్తి కళ్ళు తెరిచాడట. త్యాగంచే ప్రియమైన వాడు  త్యాగతి. అతడు త్యాగతి  శర్వరీభూషణుడౌగాక!
   సర్వకాలం కైలాసపర్వత సందర్శనము, తదానందము. పర్వత ప్రదక్షిణం ప్రారంభించాము. మా జట్టులోని  కొందరు  గంటకోసారి  కైలాసేశ్వరునికి  సాగిలపడుతూ  ప్రయాణం  చేస్తున్నారు. త్యాగతి శర్వరీ భూషణ  శ్రీనాథమూర్తి చేతులు  జోడిస్తూ  ఆ ఇరుకు  ఎగుడు దిగుడు  హిమపూరిత  వృక్షరహితపథంలో  నడుస్తున్నాడు. ప్రార్థనలు, భజనలు, నమక చమక గానాలు, ఆదిశంకరప్రణీత  శివానందలహరీ పవిత్ర  శ్లోకపఠనాలతో కైలాస పర్వతంచుట్టూ  మూడువారాలు  ప్రయాణం చేశాము. కొన్నిచోట్ల  రాత్రిళ్ళు  గుహలలో  మకాంచేయవలసి  వచ్చింది. హిమాలయాలకన్న  ఇక్కడ  గాలిఎక్కువ, చలిఎక్కువ; అంతా మంచుమయం. మధ్య మధ్య  అనేక  జాతులపూవులు, లతలుమాత్రం  తమసుగంధాలను  వెదజల్లుతూ వికసించి ఉన్నవి. తిరిగి తిరిగి  ప్రదక్షిణ  ప్రారంభస్థలానికి  వచ్చి  చేరాము.                                                                                                                           
           
               

కైలాసపర్వత పాదమునందు నిశ్చలమై ప్రత్యక్షమయ్యే మానస సరోవరంలో స్నానాలు సలిపి, అక్కడినుండి బయలుదేరి మూడురోజులలో ద్యూపాంగు బౌద్ద సంఘారామం చేరాము. అచ్చటి లామాలు మాకు ఆతిథ్యమిచ్చారు. వచ్చిన రోజు సాయంకాలం శర్వరీభూషణ శ్రీనాథమూర్తిని కులపతికడకు తీసికొనిపోయి ఆయనకు నమస్కారం చేయించాను.

                                                                                                                   11
   
   ద్యూపాంగు సంఘారామం  ఆంధ్ర  శాతవాహన సామ్రాజ్య రాజధానీ నగరమైన  ధాన్యకటక  సఘారామం  పేరున  నెలకొల్పబడింది. ద్యూపాంగు  అంటే  టిబెట్టు  భాషలో  ధాన్యకటకం  అని అర్ధం. ద్యూపాంగు  బహుశః  ఆరవశతాబ్దంలో భారతీయులైన  బౌద్దసన్యాసులు  టిబెట్టు  వలస బోయి అక్కడ నెలకొల్పి  వుంటారు.  ఆంధ్ర మహాయాన  బౌద్ద  సంప్రదాయం  ఇక్కడ  నుండే టిబెట్టు అంతా  ప్రసరించింది.  ఆంధ్రశిల్ప చిత్రలేఖన సంప్రదాయాలు  ఇక్కడ నుండే త్రివిష్టప్రదేశం  అంతా  శాఖలల్లుకుపోయినవి. అనేక ఆంధ్ర  గ్రంథాలు తిబెత్తుభాషలో  అనువదించబడ్డాయి. అవన్నీ ద్యూపంగు  సంఘారామంలో వున్నాయి.  మా అద్వైత్వానికి  పనికి వచ్చే  గ్రంథాలెన్నో త్రివిష్టప భాషలో  వున్నాయి అక్కడ.
   శ్రీనాథమూర్తి శిల్పి, చిత్రకారుడు, కవి. చక్కని కంఠంతో  తాను  రచించుకొన్న పాటలు  పాడగలడు. ముఖ్యంగా శిల్పి  పాశ్చాత్య విధానంలో  అందమైన  బొమ్మలెన్నో  మైనంతో  ప్లాస్టరు సుద్దతో  విన్యాసం  చేశాడు. అతనిలో  ఆశక్తి  వుత్తమ రూపంతో  గర్భితమైవుంది.    
   పాశ్చాత్య విధానమూ, భారతీయ విధానమూ  ఈ  రెంటి  విషయమై నాకూ శ్రీనాథమూర్తికీ   చక్కని  వాదోపవాదాలు  జరిగాయి  అతడు పాశ్చాత్య విధానమూర్తమైన శిల్ప, చిత్రలేఖన, వాస్తు  శాస్త్రాలను గూర్చి  అఖండంగా చదువుకొన్నాడు. ఆ  చదువుకొన్న  రోజులలో  ఆ సంప్రదాయాల  సంపూర్ణ భావం  తెలియకపోయినా, ఈనాడీ కైలాసపర్వత  నిశ్చల పవిత్రజ్యోత్స్నా స్నాతుడైన అతని మనస్సు  అతినిశితమై, వెనుకటి చదువును ప్రతిభతో  స్మృతికి తెచ్చుకొని, సూక్ష్మభావాలు కూడా  సమన్వయం చేయించగలిగింది. అందుకనే  అతణ్ణి భారతీయ  విధానానికి  మార్చగలను  అనే నమ్మకం  నాకు బాగా  కలిగింది. ఒక సంప్రదాయంలో పండితుడైన  వ్యక్తి వేఱొక   సంప్రదాయం  బాగా  అర్థంచేసుకోగలడు. పాశ్చాత్య సంగీత విధానంలో  పండితుడై స్వర, శ్రుతి, తాళ, లయలను  బాగా  అర్థంచేసుకోగలడు. మొదట  పాశ్చాత్య శిల్పచిత్రకళాశయాల రహస్యం  ఏమిటో చెప్పమని శ్రీనాథమూర్తిని కోరాను.
   శ్రీనాథమూర్తి  వుపక్రమించాడు. మేమంతా సఘారామ  మధ్య  గృహంలో  చేరాము. ఆశ్రమవాసుడైన  శిల్ప  చిత్రాచార్యులు, కొదరు పండిత లామాలు చేరారు. నాకు తిబెత్తు భాష  బాగా వచ్చి వుండడం వల్ల  శ్రీనాథమూర్తి   సంభాషణ  అంతా  వారికి  ఎప్పటికప్పుడు  భాషాతరీకరణం  చేసి  చెప్పినాను.      స్వామీజీ, మానవప్రకృతిలో  జంతుప్రకృతి ' ఆహార  నిద్రా భయమైధునాని' అన్నది  ప్రథమ  అనే  తామన్నారుగదా. దానిపైన తనేమిటి, తనచుట్టూ ఉండే సమస్తమూ  ఏమిటి అనే  జిజ్ఞాన వస్తుంది మనుష్యునికి. అది  మనస్సుకు  సంబంధించింది. ఇదీ  తామే  అన్నారు. మనస్సు  ఎలక్ట్రాను ప్రోటానుల నుండి  వచ్చిందా? లేక భౌతిక  పదార్ధము  మనస్సు  నుంచి వుద్భవించిందా? అనే విషయాన్ని గురించీ  తామే  చర్చించారు. ప్రాణశక్తి ఎలక్ట్రాన్ ప్రోటానుల  కలయికవల్ల  ఎలా  రాదో, ప్రాణశక్తి  మనస్సు  యొక్క  భౌతిక శక్తిపైన  వచ్చిన  రెండో  రూపమైన  శక్తిమాత్రమో  అవన్నీ తామే సెలవిచ్చారు. మనస్సు యొక్క  మూడోశక్తి, సౌందర్యదర్శనానందం. ఈ ప్రకృతిలో  దృశ్యంగాని, మానవ చరిత్రలో  సఘటనగాని సౌందర్య  వంతమై  ప్రత్యక్షమైతే, స్మృతికి వస్తే  మనుష్యుడు  ఆనందం  పొందుతాడు.  ఈ మూడోశక్తి  సౌందర్యాధనశక్తి  అని తామే సెలవిచ్చారు. ఈ మూడు శక్తులను గూర్చీ పాశ్చాత్య పండితులందరూ  తమ భావాలను  పూర్తిగా  చెప్పారు.
    అవును  శ్రీనాథమూర్తీ! ప్లేటో, అరిస్ టాటిల్  దగ్గరనుంచి, అతి ఆధునిక  రష్యాతత్త్వవేత్తలవరకు నిర్వచించిన  వాదనలు  మన రసవాదం అన్నీ పూర్తిగా విచారించి  చెప్పవలసిన ముక్కలే!
    చిత్తం. ఆవేశ  రూపమైన  సౌందర్యపూజ   శాస్త్రాతీతమని  జేమ్సునర్లీ అంటాడండీ. కాని సౌందర్య  పూజ    మానవ  భౌతిక  సంబంధమని వాదించేవారూ  లేకపోలేదు. ఈ  రోజులలో  ముఖ్యంగా  రాజకీయ, ఆర్ధిక, శాస్త్ర, పారిశ్రామిక వాతావరణాలు  మనుష్యుని  పూర్తిగా  కమ్మివేసి  ఉన్నప్పుడు, సౌందర్యానికీ, ఆర్థికోపయోగ  భావానికీ,  రాజకీయ భావాలకూ, శాస్త్రభావాలకూ ఎక్కువ చుట్టరికం  వచ్చింది. ఎంత అయినా  సౌందర్య  విచారణా, ఆనందమూ మనస్సుకే అని  అందరూ  ఒప్పుకుంటారు. లలితకళ లెందుకు  అన్న విషయం ఉద్భవిస్తుంది. అప్పుడే ఇది  మానవ  ప్రకృతి  అని నిర్థారణ  చేశారు.
   ఈ మానవ  ప్రకృతికి  మఖ్యమైన  గుణం, తానే ఆ  సౌందర్యాన్ని సృష్టించాలని ఇచ్చ  కలగడం, అది సృష్టించడం. ఆ  తర్వాత  తానుగాని ఇతరులుగాని  అలా సృష్టించిన సౌందర్యాన్ని  దర్శించి ఆనందించడం. ఇంతవరకూ  పాశ్చాత్య శాస్త్రజ్ఞులందరూ ఒప్పుకుంటారు స్వామీ!
    అవును, ఈనాటి  వారి  ఉపయోగవాదం  త్రివిష్టపశిల్పులైన సన్యాసులకు  చిట్టచివర  నువ్వు  చెప్పితీరాలి.  ఆ తర్వాత  త్రివిష్టప పండితుల  అభిప్రాయా లేమిటో తెలుసుకుందాము. 
    చిత్తం, పాశ్చాత్య  సౌందర్యతత్వం  మనవి చేసుకుంటాను. ఈలోగా  లలితకళలంటే  పాశ్చాత్యుల భావమూ, సిద్దాంతాలూ  మనవి చేసుకుంటాను. కళ మనుష్యుని పని.  ప్రకృతిలోని  వస్తువును  మనుష్యుని ఉపయోగం కోసంగాని, మనుష్యుని  సంతోషం కోసంగాని, మనుష్యుని వెఱ్ఱికోసం కాని మార్చడం, కలపడం కళ అని పాశ్చాత్యులు పేరు పెట్టారు. ఇక్కడ  కూడా  తత్త్వవేత్తలు ఇప్పటివరకు  రెండు పక్షాలుగా  వాదిస్తున్నారు. ప్రకృతిలో  లేని పని  ఏదయ్యా అని కొందరు  అంటారు. అవి వేదాంత విషయాలుగా  రావచ్చును అంటారు కొందరు. కాని పనిని గూర్చి  ఆలోచించి, విధానం నిర్థారణ  చేసికొనిగానీ, కొంతవరకూ నిర్థారణ చేసికొనిగానీ మనుష్యుడు  చేసే  పని  కళే.                                                                                                                            
           
               

ఆ సభలో కూర్చున్న వారందరూ నిశ్శబ్దంతో శ్రీనాథమూర్తి మాటలు వింటున్నారు. శ్రీనాథమూర్తే అతి జాగ్రత్తగా ఆలోచించుకుంటూ తన అభిభాషణ నడుపుతున్నాడు. నేను శ్రీనాథమూర్తి వాక్యాలు, మనస్సు, వాదన అన్నీ పూర్తిగా గమనిస్తున్నాను.

   శ్రీనాథమూర్తి  లలితకళ  అంటే  ఏమిటో  నిర్వచనం  చేశాడు.  అలా మనుష్యుడు చేసిన  పనులలో  అంటే, కళలలో  కొన్ని వట్టి  ఆనందం  కోసం మాత్రం చేసిన  పనులు ఉంటాయి. అవి  సౌందర్య  స్వరూపాలైతే  లలితా కళ అంటారు.  స్వామీజీ   సెలవిచ్చినట్లు  మనుష్యునిలో  వున్న సౌందర్యతత్వం  ఈ  లలితా కళలకు  ఆధారం. ప్రకృతిలో  వున్న  రంగులూ  మూర్తులూ, ధ్వనులూ, ప్రకృతిలోని  కదలికా  అతని సౌందర్యోపాసనకు  ఆధారాలయ్యాయి. అవే చిత్రలేఖన,  శిల్ప, సంగీత, కావ్య, నాట్యాదులయ్యాయి. మనుషునిలో  పశుత్వం ఎంత  నిజమౌ, ఈ  సౌందర్యతత్వమూ  అంతే  నిజము. కొందరు కొన్ని పనులు చేయగలిగి, కొన్ని  చేయలేనట్లు ,  మనుష్యులలో కొందరు  కళాస్రష్టలు, కొందరు కళానందులు,  కొందరు కళకు ప్రక్కనుంచి వెళ్ళిపోయే వారు__మూడు రకాలుగా  ఉన్నారు.
    కళ  ఆనంద  సముపార్జన  నిమిత్తం ఉద్భవించింది.  ఆ రకపు  ఆనందం  లలిత కళానందం. ఇది పూర్తిగా  మనుష్యుని  సౌందర్యారాధన  గుణంపై ఆధారపడి  ఉంది.
   నేనప్పుడు  శ్రీనాథమూర్తిని  చూచి,  మూర్తీ, పాశ్చాత్యకళలలో  దుఃఖరూపమైనవి, అసహ్యరూపమైనవి, హాస్యరూపమైనవి  లలితకళారూపాలున్నాయే?  అని ప్రశ్నించాను.
    నిజమే  స్వామీ! ఎలా  అయితే  మనుష్యుడు  తనకు  కావలసిన ఆహారాన్ని వాంఛింఛి, సంపాదించి, అది  తింటోంటే  ఎంత  సంతోషపడతాడో, అలాగే  సౌందర్యానందంకోసం సౌందర్యవస్తువులు సంపాదించీ, చూచీ ఆనందపడతాడు. భోజనంలో ఆరు  రుచులు  ఉన్నాయి. తీపి, కారం, ఉప్పు, పులుసు, చేదు, వగరున్నూ, తీపి అసలు రుచి. అలాగే, లలితకళలలో సమ్మక్  స్థితి  అనే రుచి  అసలు  సౌందర్యం  చేదు లాంటిది  విచారం, కారంలాంటిది కోపం, ఉప్పులాంటిది హాస్యం, జుగుప్స వగరు  వంటిది, అని నా  అభిప్రాయమండీ. 
   నేను: చాలా బాగా చెప్పావు. నీ పోలిక  చాలా  అందంగా  వుంది. తర్వాత కానీ ! 
    చిత్తం, ప్రథమంలో మనుష్యుడు  తన చుట్టూవున్న  ప్రకృతిలోని రంగులు మోస్తరు,  తనకు దొరికిన  రంగు  మన్నులు, రంగు పూవులు  మొదలైన  ఉపకరణాలతో ప్రకృతిలోని  రూపాలను,  ప్రకృతిలోని రంగులను  అనుకరిస్తూ  తానున్న గుహల గోడలపై  జంతువుల బొమ్మలు, జంతువులను, మనుష్యులు  వేటాడే బొమ్మలు వేసేడు. మట్టితో జంతువుల, మనుష్యుల బొమ్మలు చేశాడు. ప్రకృతిలోని ధ్వనులు  అనుకరిస్తూ  సంగీతం పాడాడు. గంతులు వేశాడు. భాష కల్పించుకున్నాడు. ఆ భాషతో  తనలో  కలిగిన ఆనందాన్ని వెలిబుచ్చాడు. అది ప్రాథమిక  కావ్యమయింది.  
   ఒక టిబెట్టులామా నెమ్మదిగా  మనుష్యుడు  దేవతలతో  నుండి  వుద్భవింపలేదా?  అని  ప్రశ్నించాడు.
   ఈ  బాలకుడు  చెప్పే మాటలు  పాశ్చాత్యుల భావాలు  మాత్రం.  అవి  తామందరూ  విని  తర్వాత  నా  మాటలు  విని  ఈతనికి  తమ కళలు  నేర్పేందుకు  అనుమతించాలని  నా  ప్రార్ధన! అని  నేనా లామాకు  మనవి చేశాను.  ఆయన ఊపాడు,  శ్రీనాథమూర్తీ,  నువ్వు కానీ! అన్నాను.
    లలితకళ అంటే  మనుష్యుడు  సౌందర్యాన్ని  సందర్శించినప్పుడు, ఆ  సౌందర్యానందం, చిత్ర, శిల్ప, శబ్ద, స్పందన  రూపాలుగా  సృస్టించడమే. లలితకళా, చిత్రశిల్పాలు  దృశ్యకళలు, సంగీత కవిత్వాలు శ్రవ్యకళలు. నాట్యం  దృశ్యశ్రవ్యకళ, లలితకళలు ప్రకృతి  సందర్శన స్మృతులవల్లా, మానవ జీవిత  సందర్శన  స్మృతులవల్లా వచ్చినవి గనుక,  ఆ కళలు  ప్రకృతికీ, మానవునికీ సన్నిహితంగా  వుండాలి అంటారు. కాబట్టి  పాశ్చాత్య కళాకారులలో చాలామంది భౌతిక  సత్యవాదులు. ఈ కైలాసం  సృష్టించాలంటే, కైలాసం ఎక్కువ  అందంగా  కనబడేకాలంలో అంటే  ఈ రుతువు, ఈ మాసం, ఈ రోజు  ఈ సమయంలో  ఒకానొక  వైపునుంచి చిత్రం వేస్తారు. అందుకనే  పాశ్చాత్యుల  కళ ఎప్పుడూ నూత్న  మార్గాలు  అన్వేషిస్తూనే  ఉంటుంది.  పాశ్చాత్యుల  కళ  దినదినమూ, మార్గం  అధిగమించిన కొలదీ, వృద్ది అవుతూన్న కళ.  ప్రకృతిని  సరిగా  అనుకరించాలన్న ప్రయాసతో  వివిధ విధానాలు వచ్చాయి. అదే  భౌతిక  సత్యవాదము (రియలిజం).  మూల సత్యవాదము (ఇంప్రెషనిజము), అఖండమూల సత్యవాదము (పోస్టుఇంప్రెషనిజము), అతి వాస్తవికత(సర్ రియలిజం)మొదలైనవి.
   నేను అప్పుడు  శ్రీనాథమూర్తిని చూచి,  భౌతికసత్యాన్ని  అనుకరించడమే మొదటినుంచీ  పాశ్చాత్య  చిత్రకారుల  కృషి అంటివి.  పారలౌకిక  సత్యాన్ని  అనుసరించాలని పాశ్చాత్యాదేశాల్లో  ప్రయత్నం జరగలేదా? అని ప్రశ్నించాను.
   అతడు నన్ను  చూచి స్వామీ, అలాంటి ప్రయత్నాలు  చాలా మాట్లు జరిగాయి.  గాని  అవి  పారలౌకికం  అని చెప్పలేము. అవన్నీ భౌతిక  సత్యవాదానికి వ్యతిరేకంగా వచ్చినవే.  మన దేశంలోని  ఆధ్యాత్మిక భావజనితమైన  ఆదర్శ  వాదానికీ, పాశ్చాత్యుల  ఆదర్శ  వాదానికీ (ఐడియలిజం)చాలా తేడా ఉందనుకుంటాను అన్నాడు.  
                                                                                                           13
   
   తర్వాత  శ్రీనాథమూర్తి పాశ్చాత్యుల  ఆశయవాదం  అంటే ఏమిటో  స్పష్టం  చేశాడు.  ఆశయవాదంలో పాశ్చాత్యులకు  మూడు భేదాలున్నాయి  సాదారణ లౌకికం, వేదాంతపరం, లలితకళా పరమున్నూ. లౌకికపరమైన అర్ధం  ప్రతి  విషయమూ  సంపూర్ణత  పొందడం, ప్రజారాజ్యం  అంటే  నిజమైన  ప్రజారాజ్యంగా ఉండడం.  ఇంక వేదాంతపరంగా  ఉన్న  భావం ఏమిటంటే, భావమూ, వస్తువూ ఒకదాని కొకటి  అత్యంతాంతరింగిక సంబంధం  కలవి అన్న వాదన. మనుష్యుని  జ్ఞానం  లేక వస్తువు లేదు  అన్న వాదన. ఈ వాదన  మన  జ్ఞాన  మార్గానికి  సన్నిహిత సంబంధం  కలిగి ఉంటుందనుకుంటాను. ఈ వాదానికి  వ్యతిరేకం  వస్తువు  వేరు, మనుష్య జ్ఞానం  వేరు  అన్న  వాదన.                                                                                                                            
           
               

ఇంక లలితకళా విషయంలో ఆశయవాదం ప్రాపంచకంగానే ఉంటుంది. భౌతిక సత్యం ఇల్లా ఉండాలని ఊహించి, ఆ సత్యానికి సన్నిహితమైన రూపం ప్రకృతిలో వెదికి, దానిని నిరూపించడం ఆశయ వాదం. ఈ ఆశయవాదం ఇంకో రకమూ వుంది. భగవంతుని శక్తి ప్రకృతిలో వుందనీ, అది కళాస్వరూపం చేయడంలో వర్ణాలకలయిక , రేఖలసామ్యత మూర్తుల విన్యాసమూ, కర్మశాంతతా ఇవన్నీ జాగ్రత్తగా పాటించాలని చెబుతుందనీ, రస్కిను మొదలగువారు వాదిస్తారు.

   శ్రీనాథమూర్తి  భౌతికసత్యం  కళకు  జీవమన్న పాస్చాత్యవాదనను  గూర్చి  వర్ణించాడు. వాస్తవిక  జగత్తు  మానవభావ  రహితమై  ఈ  స్థితిలో  వుటుందని మనుష్యుడు  విచారణ చేసి  కునుక్కోవాలట. అది కళా స్వరూపంగా  సృష్టించాలట. త్రివిష్టపసన్యాసు లీతని  అభిభాషణ  అంతా శ్రద్దగా ఆలకించారు. ఆ  విషయం  అతడు  పూర్తిచేసేటప్పటికి  రాత్రి  పన్నెండు గంటలయినది. ఆ తర్వాత  అందరమూ విశ్రమించడానికి లేచాము.
   ఆ మర్నాడు  శ్రీనాథమూర్తి  నా దగ్గరకు వచ్చి  పాదాభివందనం చేసి,  గురుదేవా, నిన్న నేను  పాశ్చాత్యభావాలు  తమ కందరికీ  విన్నవించి  వెళ్ళిన తర్వాత,  నా కెంతసేపటికీ  నిద్రపట్టలేదు. లేచి సహస్రముఖ బుద్దదేవ  చైత్యమందిరానికిపోయి, ఆ విగ్రహం ఎదుట  పద్మాసనం వేసి  కూర్చుండి  మినుకు మినుకుమనే  ఆ  దీపాలకాంతిలో ఆ విగ్రహమహాభావం,  సౌందర్యం  అవలోకిస్తూ, ఏదో  ఆనందంలో  మునిగిపోయివుంటివి.
    ఇంతలో  ఆ విగ్రహం  మాయమై  కైలాసపర్వతం  దర్శనమైనది. అప్పుడే  ఒక మహాభావం  నాకు వినబడినట్లయింది.  మూర్తీ!  భారతీయ కళావిధానం ప్రాచ్యతెండవాసుల సౌందర్యదర్శనాధారం. కాలాతీతమై, వ్యక్తిగత మూర్త్యతీతమైన భావాన్ని  నిరూపించి  భారతీయ కళ. నూత్నాశయాలు, భావాలు సంప్రదాయంలో విన్యాసంచేయి, ప్రకృతిని ఆధారం చేసుకో. దేహం, మనస్సు, ఆత్మ ఒకదాన్ని  ఒకటి  చంపకూడదు. ఈ మూడు ఒకే మహాభావం  యొక్క  త్రిమూర్తిత్వం సుమా! భావ  రాగ తాళాలు సమ్యక్  స్థితిపొందడం నిజమైన  సంగీతం. అలాగే  రంగు, రేఖ, మూర్తి, భావంసమ్యక్  స్థితి పొందిన  చిత్రలేఖనం. రేఖలూ,  మూర్తీ, భావము  సమ్యక్ స్థితి  శిల్పం' అని నాకు  వినపడినట్లయిందండీ.  నాకేదో  వివశత్వం కలిగి  కన్నీళ్ళు దొనదొన జారిపోయాయి. గురుదేవా! నాకున్న అనుమానాలు  పోయాయి. తమ ఆదేశము  ప్రకారము  నడుస్తాను. సెలవు దయచేయండి అని నివేదించుకున్నాడు.
   నేను: నాయనా! నీలో  ప్రపంచం  పూర్తిగా మాయంకాలేదు. నీ బోటివాళ్ళు భౌతికంలో, సత్యశివసుందరత్వాన్ని ప్రదర్శించి  ఆధి భౌతిక, ఆధిమానసిక,  ఆధ్యాత్మికాలకు సమన్వయం చేయడానికి  ఉద్భవించారు. ఆ ధర్మాన్ని  నువ్వు  విసర్జించకూడదు. నీ శకుంతల  నీకు  వేరేరూపంలో ఈ  జన్మలోనే  దర్శనం ఇస్తుంది. ఆమె, ఈమె  అని  నీకే హృదయగోచరమవుతుంది. ఆమెతో  ఏడాదిపాటు  నీ కథ చెప్పకు. నీ జీవిత పరమావధికి తోడు నీడకావాలి. శక్తిలేని శక్తుడెట్లా? సరస్వతిలేని  బ్రహ్మ ఉండునా? మానవ ధర్మయుద్ధం స్త్రీ, పురుషులు కలిసి  చేయాలి. పారలౌకికయుద్ధం  మాబోటివారు నిర్వహిస్తారు. ఏడాదయిన వెనుక  నీ  చరిత్ర  చెప్పుకో. ఏది  ఎట్లా  సంభవించినా, నీ ధర్మం  నువ్వు మానకు. ప్రజాసేవ  నీ ధర్మం. అది లలితకళల ద్వారా  నువ్వు చేయాలి. నువ్వు  ఈ ఆశ్రమంలో  కొన్ని నెలల పాటు  వుండు. నేను కైలాసపర్వతేశ్వరునకు  నమస్కరించి  హిమాలయాలకు వెళ్ళిపోతాను. సెప్టెంబరునెలలో  నువ్వు  నేపాలు వెళ్ళు. అక్కడకు వెళ్ళే  అనువులన్నీ నేను చూస్తాను. అక్కడి శిల్పమూ, చిత్రలేఖనమూ పరీక్షించు. నవంబరు నెలలో  నన్ను  హరిద్వారంలో కలుసుకో. అప్పటికి  మీ  అమ్మగారు  హరిద్వారం వస్తారు. నువ్వు ఏప్రిల్ నెలవరకూ  నా దగ్గర హరిద్వారంలో ఉండు. తర్వాత  మీ  అమ్మగారితో  హిమాచలయాత్ర చేయి.  ఆ  తర్వాత  మీ గ్రామం  వెళ్లు. అక్కడనుండి  నీకు  ఏది ధర్మమనితోస్తే అదిచేయి. 
   ఈ ముక్కలు  నేను  చెప్పుతుండగానే  శ్రీనాథమూర్తి  కరిగిపోయినాడు. అతడు  నా  కాళ్ళకడ  సాష్టాంగపడి, కళ్ళనీళ్ళు  కారిపోవగా  తమ ఆజ్ఞ  అక్షరాలా  నిర్వహిస్తాను  గురుదేవా! అన్నాడు.
   
                                    14  
   
   స్త్రీగాని, పురుషుడుగాని  ప్రపంచ సాంస్కృతిక  పురోగమనానికీ, సంతతాభ్యుదయానికీ  ఆధారశక్తి రూపం కావాలి. ఈనాడు  భరతదేశంలో స్త్రీ  అత్యంత  హీనదశలో ఉంది. పురుషుడు ఎంతచదువుకున్నా నిజమైనధర్మం దూరంగానే  వుంచుకొన్నాడు. ఎన్ని ఉద్యమాలు వచ్చినా, భారతదేశ యువకునిలో  పశుత్వం  ఎక్కువ అవుతోంది గాని  తగ్గటంలేదు. ఇప్పటికి ఆడది ఒక్కతే  ప్రయాణం చేయలేదు. మూగదేవుడులా గృహంలో  బాధలుపడుతూ త్యాగభారం కొండలుకాగా  నడుము వంగిపోయి  జీవిత ప్రయాణం సాగిస్తోంది. పురుషుడు ఆత్మదర్శనంకోసం ఎన్నో  కడగండ్లుపడి, హీనస్థితిని  కూడా పొందుతూ, కష్టాలపాలవుతూ, పశువుగా  కూడా  అవుతూ, చివరకు విజయమైనా పొందుతున్నాడు, లేదా  విజయాభిముఖుడై  నశించిపోతున్నాడు.    
   ఇంక  భరతదేశంలో బీదలస్థితి  తలుచుకొంటే నాబోటి  నిస్సంగులు  కూడా  లజ్జపడి, తలవంచుకోవలసి వస్తోంది. లక్షాధికారులు, భూస్వాములు, పారిశ్రామిక వేత్తలు  ఇంకా ధనం, ఇంకా ధనం  అని బీదల  మాన ప్రాణాలను  తమ  ధనక్షాంక్షాయజ్ఞానికి ఇంధనాలు చేస్తున్నారు. ముప్పది  అయిదు  కోట్ల  జనాభాలో  ఇరవై  అయిదు  కోట్లు  కటిక బీదవాళ్ళు; అయిదు కోట్ల  ముప్పాతిక  బీదవాళ్ళు; మూడు కోట్లు  సగం బీదలు; ఒక కోటిన్నర  కొంచెం ధనవంతులు; అరకోటి ధనవంతులు; కొన్ని వేలమంది  మాత్రమే  కోటీశ్వరులు.
   ప్రపంచం అంతా  అల్లాగే వుంది. అయినా  ఆసియా  దేశాలలో  ఈ దుర్గతి  ఘోరాతి ఘోర  స్వరూపంలో  ప్రత్యక్షమౌతుంది. ఎన్ని కోట్ల జనానికో, పెద్దలకు, పిల్లలకు, స్త్రీలకు, పురుషులకు కట్టగుడ్డా, తిన తినతిండీ, పండ పక్కాలేదు. తండ్రీ కైలాసప్రభూ! రష్యా  భౌతికంగా  ఈ భయంకర సమస్యను  ఎదుర్కోవడానికి  ప్రయత్నం  చేస్తూంది. బౌద్దధర్మము మానసికంగా  తృప్తి  తీసుకొని రావడానికి  ప్రయత్నం  చేసింది.  ఈ  రోజులలో  భరత  దేశాన  దారిద్ర్యం లేనేలేదు. ఆ  బౌద్దమతం _జపానుకు కర్కశత్వమూ, చీనాకు  నిద్రమత్తూ, సింహళానికి  ఆశానేర్పింది. వట్టిమతంవల్ల, ఆధ్యాత్మిక  చింతవల్ల భౌతికమైన  ఈ  దుర్భరస్థితి  పోతుందా శ్మశానదేవా? భౌతిక మానసిక  పారమార్ధిక  సమన్వయత లేనినాడు ఏ దేశమైనా  ఉత్తమస్థితికి ఎలా వస్తుంది?  ఈ  ఆలోచనలతో  త్యాగతి  శర్వరీభూషణుడైన  శ్రీనాథమూర్తినీ, నా శిష్యులైన కొందరు  సన్యాసులనూ ద్యూపాంగు  సంఘారామంలో  ఉంచి, నేనూ, రాజపుత్ర జమీందారుడూ, అతని అనుచరులూ  భరతదేశానికి బయలు దేరాము. 
                                                                                                                             
           
               

రాజపుత్ర జమీందారుడు, కపూర్ బహదూర్, శ్రీనాథమూర్తి దగ్గరకు పోయి, శ్రీనాథమూర్తిగారూ! నమస్కారం. మీవంటివారి సహవాసం ఇప్పించినందులకు స్వామీజీకీ, ఈ కైలాసప్రభువునకూ నేను ఆత్మాభివందనాలు అర్పిస్తున్నాను సుమండీ. మన స్నేహం ఇంతటితో ఆగిపోకూడదు. మీరు మా జమీకి రావాలి. మా ఆతిధ్యం స్వీకరించాలి. మా ఇంటిలో ఎన్నో రాజపుత్ర చిత్రలేఖనాలూ, మొగలు చిత్రలేఖనాలూ ఉన్నాయి. అవన్నీ మీరు చూడాలి. అవే కాకుండా కొన్ని స్ఫటికశిలా శిల్పాలూ, కొన్ని లోహ శిల్పాలూ, అనేక కళాపూరిత వస్తువులూ ఉన్నాయి. అవన్నీ మీరు చూడాలి. పూర్వకాలపు సంగీత వాద్య విశేషాలు వున్నాయి. నేను అర్పించబోయే కొన్ని వస్తువులు టాము స్వీకరించాలి అని మనవి చేశాడు.

   శ్రీనాథమూర్తి కళ్ళనీరు  తిరుగుతుండగా  జమీందారుగారికి  నమస్కారంచేసి, జమీందారుగారూ! నేను  వాక్కు  కర్మల  ద్వారా తమ కప్పుడు  కష్టం కలిగించి ఉండవచ్చు. మన ప్రయాణంలో తమ స్నేహం  పూర్తిగా  అర్ధం చేసుకోలేకపోయాను. తమ  స్నేహానికి  నన్ను అర్హుణ్ణి చేసింది  నా గురుదేవుడే.  ఈ  దేహమున  ప్రాణాలు  తమ  మధుర  స్నేహాన్ని  ఎప్పుడూ  వాంఛిస్తూంటాయి. త్వరలోనే  మీ  భవనానికి  మా  అమ్మగారితో కూడా  వస్తాను. స్వామీజీని, మిమ్మల్ని, ఈ  స్వాములను వదలి  ఉండడం కష్టం! అయినా గురుదేవుల  ఆదేశం  నేను  ఉల్లంఘించలేనుకడా! తమ అందరి దగ్గరా సెలవుఅన్నాడు.
   జమీందారుడూ, శ్రీనాథమూర్తీ  కౌగిలించుకొన్నారు. శ్రీనాథమూర్తి  నా పదాలకు  నమస్కారం చేశాడు. తక్కిన  స్వాములందరికీ పాదాభి వందనాలు అర్పించాడు. కూలీ లందరకూ మంచి బహుమతులు ఇచ్చాడు. అందరమూ బరువయిన హృదయాలతో  విడిపోయాము.
   శ్రీనాథమూర్తి ముందుయుగం వాడు. అతడు తప్పక  అసలు నిజం కనుగోనడానికే పుట్టాడు. కైలాసేశ్వరుడు అతనికి  చిరాయురారోగ్యాలు, ధర్మనిరతీ, సత్యదీక్షా, పురోగమనశక్తీ ప్రసాదించుగాక!
   ఓం తత్ సత్        
       

సౌందర్య దీప్తి

1

(హేమసుందరీదేవీ! ఇక్కడనుంచి నేనే నా కథను సాగించి పూర్తి చేస్తాను__శ్రీనాథమూర్తి.)

   సౌందర్యారాధన మానవుని  వీరత్వమా?  కళ  మానవునకు  అవసరమే  లేదా?  కళారూపం  ఈలా  ఉండాలని  కళాస్రష్టలకు  ఆజ్ఞలు  ఇవ్వడం  కళకు  మంచిదా, నష్టమా? ఈ  రకం  సాహిత్యం  ఉండాలి, ఈ రకం చిత్రలేఖనం ఉండాలి, శిల్పం ఈ మార్గాల  నడవాలి అని చెప్పడానికి అధికారం  ఉందా?
   నా గురుదేవుడు  జమీందారుగారితో, అనుచరులతో  బయలుదేరి భరతభూమికి ప్రయాణమై వెళ్ళిపోయారు. నాతో వారి శిష్యులు  ముగ్గురు  మాత్రం ఉన్నారు. స్వామీజీ  వెళ్ళుతోంటే తల్లినిబాసే బిడ్డవలె తల్లడిల్లి పోయాను. ఆ  చలిలో, ఆ నిశ్శబ్ద వాతావరణంలో కైలాస  పర్వత కాంతులు  ప్రసరిస్తూ  ఉండగా  స్వామీజీ,  వారి అనుచరులూ  మమ్ము వీడ్కొని ప్రయాణం సాగించారు.
   మా స్వామీజీ  చూపులు  కైలాస పవిత్ర  సందేశాలు. నా కవి  పది ఏనుగుల బలము  ప్రసాదించాయి. స్వామీజీ నా కనులకు  కనబడేతంట వరకూ  ఆ చిన్న  పర్వత  శిఖరం  మీద  చూస్తూ  నిలుచున్నాను. నా దగ్గర ఉన్న  దూరదర్శక యంత్రంతో చూస్తూ  నిలుచున్నాను. వారు లోయలో దిగినప్పుడు  కనబడరు. మిట్టలు ఎక్కినప్పుడు  కనబడినారు. ఆ  యంత్రానికి  కూడా  కనబడనంత దూరం వెళ్ళారు. ఎండ తీక్షణంగా  సాగింది.  నేనో  పెద్ద  నిట్టూర్పు వదలి  ఆశ్రమంలోకి  వెళ్ళిపోయాను. లోపల నా గదిలో కూర్చున్న క్షణంనుండీ  నా కనేక రూపాలయిన  ఆలోచనలు  ఉద్భవించి మాయం  కాసాగినాయి.