Jump to content

తుపాను/త్యాగతి కథ

వికీసోర్స్ నుండి

బాబయ్య నవ్యసాహిత్య కవుల్లో ఒకడు. ఆయన కవిత్వం అచ్చంగా రాయప్రోలు సుబ్బారావుగారి కవిత్వంలాగే ఉంటుంది.ఆయన మా అక్కను వర్ణించి చెప్తూవుంటే నా కళ్ళు చెమరించి,నా గుండె దడదడ మని,ఈలాంటి అక్కను ఎట్లా పోగొట్టుకున్నానా అని,నేను రహస్యంగా కళ్ళనీళ్ళు కుక్కుకునేదాన్ని.

    పాపారావు బాబయ్యకూ,మా త్యాగతికీ ఎందుకో విపరీతమైన స్నేహం. మా నాన్నగారు,మా అమ్మ మా త్యాగతితో అంత చనువుగా ఉండడం మా స్నేహితలో కాని కందరకూ ఆశ్చర్యము వేసేది.ఎవ్వరీ త్యాగతి?

    ఓ రోజున మా లోకేశ్వరి,మా పాపారావు బాబయ్యతో చాలాసేపు మాట్లాడి, నా దగ్గరకు వచ్చింది. ఆ రోజున లోకేశ్వరి హృదయంలో ఏదో రహస్య విషయం ప్రవేశించిందని ఆశ్చర్యపడ్డాను.

    మా బాబాయి గుంటూరు వెళ్ళిపోయాడు సకుటుంబంగా.ఆయన కుమార్తెలు-నా చెల్లెళ్ళు-వనకుమారి, రాగామాలికాదేవి నన్ను కౌగిలించుకునిఅక్కా గుంటూరు ఒక్కసారి రావే!పెదనాన్నగారు మదరాసు కదలరు.నువ్వూ మదరాసు కదలవు!వెడితే విశాఖపట్నం ఉపన్యాస పరీక్షకు వెళ్తావు,బొంబాయి వెడతావు,కలకత్తా వెడతావు.గుంటూరుకూ యూనివర్సిటీ వచ్చిందిలే,నీ చదువు పూర్తి అయింది.మా చదువులు చూడడానికయినా రావే!అని అన్నారు.

    వాళ్ళిద్దరినీ కౌగిలించుకొని,ముద్దులు పెట్టి,ఎన్నో బహుమతులు ఇచ్చి పంపాను.రైలుకు వెళ్ళి ఇంటరులో కూచోబెట్టి వచ్చాను.ఇంటికి రాగానే మా లోకేశ్వరి నా చేతిలో ఓ కట్ట పెట్టింది.

    హేమం ఇదంతా ఈ రాత్రే చదువు! నా చేతికి ఈ ఉదయమే వచ్చింది.స్చూలులో పాఠాలు ఎల్లా చెప్పానో,కాని వ్రాత పుస్తకం మాత్రం పూర్తిచేశానుఅని పారిపోయింది.ఆ చక్కని బైండు పుస్తకంపై పేరు చూస్తే 'త్యాగతి కథ'అని వుంది.అది చూడగానే ఎందుకో నా చేతులు వణికినవి.నా కపోలాల చిరుచెమటలు పట్టినవి.





త్యాగతి కథ


              

1



సముద్రంలో ఎక్కడనో ఒక అలపుట్టి,పైకి ఉబికి, లోతులకు దిగి ప్రపంచ సంచారానికి బయలుదేరినది. మహా నక్షత్రగోళంలోంచి విడివడి ఒక తేజఃఖండము తన ప్రథమ గ్రహస్థితిని పొందినది.గుంటూరు జిల్లా తెనాలి తాలుకా బట్టిప్రోలు గ్రామంలో ఇప్పటికి ముప్పైఏళ్ళ క్రితము ఒక విచిత్ర ముహూర్తములో నా మొదటి యేడ్పులోకము.రాత్రి నక్షత్రాలు విన్నవి. ఆ ఊరు మా మేనమామల ఊరు. మా అమ్మకు నేను నాల్గవ కాన్పు.

మూడవ కాన్పు మా స్వంత గ్రామమైన కొల్లిపరలోనే సంభవించినది.కుమారుడు పుట్టి నష్టపడినాడట.కాబట్టి నా జననం మా మేనమామ గారింటనే. జాత తండ్రి గండాన పుట్టినాను కాబోలు! నా మూడవ యేటనే తండ్రి దిక్కులలో లీలమైపోయినాడు.

    సాలుకు ఏడువేల రూపాయ లాదాయము వచ్చే ఆస్థికి నేనోక్కన్నే కుమారుడను నవడంచేత,జనకుణ్ణి చంపింనవాడనని నన్నందరూ హేళన చేసి నప్పటికినీ నా చిన్నతనం మాత్రం రాజభోగంగా జరిగిపోయింది.నన్ను చూచుకుని మా అమ్మ దుఃఖమంతా దిగమ్రింగి అహల్యాబాయిలా రాజ్య పరిపాలన చేసింది.వీధిలోనికి వచ్చి మొగం చూపించకపోయినా భూములు కౌలు కీయడంలో,తమలపాకుల తోటలు మగతా వసూలు చేయడంలో, మా అమ్మ పడి యెకరాల స్వంత వ్యవసాయము పర్యవేక్షణ చేయడంలో మా అమ్మ గారు వీరనారీమణిలాగే ప్రవర్తించేవారు.నేను నిద్రపోతున్నా నను కొన్నప్పుడు ఒక్కొక్క రాత్రివేళ తన భర్తను తలచుకొని వాపోయిన సమయాలు నేను కని పెట్టినవి ఉన్నవి.అప్పుడు నేను పక్కమీదనుంచి గబుక్కున లేచి మా అమ్మ మెడ కౌగిలించుకొని అమ్మా,ఏలవకు, అమ్మా ఏలవకుఅని నేనున్నూ ఏడ్చేవాడనట.

    దూరదూరాన్నుంచి దర్శించిన విగ్రహంలా నా తండ్రిగారు జ్ఞాపకం.ఆయన ఎడమచేతికి నాలుగు ఉంగరాలుండేవి. పొడుగాటి మీసాలు,చెవులకు రవ్వలకమ్మలు, కోలమోము ,చక్కని చామనచాయ,తీక్ష్ణమైన చూపులతో నన్ను చూస్తూ పైకెత్తి నాన్నా నీవు పుట్టావు,ఇక నేను వెడతానుఅని ఆయన అన్నమాటలు ఇప్పటికీ నాకు ఏవో వేదమంత్రాలూ తోస్తూ ఉంటవి.

    మా అమ్మ అంత అందమైనది కాదు. కళ్ళల్లో ఉన్న ప్రేమ కాంతులు తప్ప కనుముక్కు తీరుల్లో సౌందర్యము తక్కువ.కాని మాతృదేవతా కాంతులెప్పుడూ ఆమె ముఖంలోంచి ప్రసరిస్తూ ఉంటవి.నాకు జ్ఞానం వచ్చినప్పటినుంచి తెల్లటి వస్త్రము కట్టుకొని ముసుగు వేసుకున్న రూపమే!కాని, సర్వభూషనాలంకృతయై, సౌభాగ్యవంతమైన ఆమె కురులు జడగా ముడిచి,సిగచుట్టుకొని,బనారస్ చీర కట్టుకొన్న ఆమె రూపము నేను మా యింట్లోని ఫోటోలలో మాత్రమే చూచినాను.పూజా పీఠము ముందు కూర్చొని జపం చేసుకుంటుంటే మా అమ్మ పీతాంబర ధారిణియైన యోగినీ దేవతలా ఉండేది.

    ప్రతి పండుగకీ మా అక్కయ్యలిద్దరూ వస్తుండేవారు.మా పెద్దక్కయ్య నాకన్నా పదేళ్లు పెద్ద. మా రెండో అక్కయ్య నాకన్నా ఏడేళ్ళు పెద్ద.నా నాల్గవయేటను మా పెద్దక్క గారు తన అత్తగారూ రైన బందరుకు కాపురానికి వెళ్ళినది.మా పెద్దక్కగారి పెళ్ళి మా తండ్రిగారే చేసినారట.నాకేమీ జ్ఞాపకం లేదు.నా ఐదవ ఏటను మా చిన్నక్కగారి పెళ్ళి జరిగినది.పెళ్ళివారు గుంటూరునుంచి తరలివచ్చినారు.మా మేనమామ వై పువారు,మా అన్నదమ్ములవారు మమ్మాదుకొని వివాహం అత్యంత వైభవముతో చేసినారు.అప్పుడే నావడుగు కూడా అయింది.

మా అమ్మ నా చదువుకొరకు రేపల్లెలో కాపురము పెట్టినది.అక్కడా మాకు పెద్ద కామాటంగానే ఉండేది.మా క్లాస్ మాస్టరే నాకు ప్రయివేటుగా చదువు చెప్పేవాడు.క్లాస్ లో మొట్ట మొదటిగా ఎప్పుడూ ప్యాసవుతూ ఉండేవాణ్ణి.సెలవలకు ఇంటికి రావడమంటే ఎంతో సరదాగా ఉండేది.తోటల వెంట తిరగడం,పోలాలవెంట తిరగడమంటే నా చిన్న హృదయం ఎగిర గంతువేసేది,నాకు కమ్మవారబ్బాయిలు,రెడ్లబాలకులు,బ్రాహ్మణార్బకులు చాలామంది స్నేహితులుందేవారు.వీళ్ళందరికీ నాయకుణ్ణి నేను. తెనాలిలో సెకండుఫారం చదువుతున్న సూరపరెడ్డీ,వెంకట్రామయ్యచౌదరీకూడా నా మాటంటే గీచినగీటు దాటేవారుకారు.నా కోసం మా అమ్మ ఎప్పుడూ ఏదో చేస్తూనే ఉండేది.మినపరొట్టో,చేగోడీలో,పకోడీలో,జంతికలో ఏవో అవి మూటలు పట్టుకొచ్చి,నా స్నేహితులకు విందులు,ఫలహారాలు పెట్టేవాణ్ణి. ఏ స్నేహితినింటికి వెళ్ళినా ఆ స్నేహితుని పెద్దలందరూ ఎంతో ప్రేమతో నన్ను పలకరిస్తుండేవారు.

    ఆ రోజుల్లో కూడా ఢుంటి వినాయకరావుగారు నేనంటే చూపించే ఆపేక్ష నిరుపమానమైంది. ఆయనకూ,మా తండ్రికి పరమ స్నేహము.ఆయనకు పిలక ఉండేది.పద్దతి నియోగ మంటే అపరిమితమైన ప్రేమ.నందిరాజు దీక్షితుల వారంటే ఎంతో భక్తి.నియోగ మహాసభలకు వేలకు వేలు ఖర్చు చేస్తుండేవారు.మా తండ్రిగారికి పద్దతియందు నమ్మకముండేది కాదట.మా నాయనగారిని శ్రీ దై వాద్వైతమతస్థాపక దీక్షితులు గారెప్పుడూ హెచ్చరిస్తుండేవారట.పద్దతి నవలంబించిన వినాయకరావుగారికిని,పద్దతి నవలంబించని మా తండ్రిగారైన శేషాచలపతిగారికిన్నీ కృష్ణార్జునుల మైత్రివంటి గాఢ స్నేహమని పెద్దలు చెప్పుతుండేవారు.

    ఢుంటి వినాయకరావుగారు నేను కనబడగానే ఒరే మూర్తీ!అని దగ్గరకు పిలిచి,ఒళ్లో కూర్చో పెట్టుకొని,నా తలను వ్రేళ్ళతో సవరిస్తూ నీకు మీ అమ్మగారి పోలికలు,మీ నాన్నగారి తెలివితేటలన్నీఉన్నాయిరా.పరీక్షలన్నీ ఫస్టుగా ప్యాసై గొప్పవాడి వై లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకో అని అనేవారు. ఈ ముక్కలు ఎన్ని వేలసార్లన్నారో ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే వుంటవి.

    నా చిన్నతనంలో చంటిబిడ్డలంటే అసహ్యం.వాళ్ళు బట్టలు మలినం చేస్తారని పెద్దక్కగారి బిడ్డల్ని ఎప్పుడూ ఎత్తుకునేవాణ్ణికాను.దూరంనుంచి ఒక వేలుతో ముట్టుకునేవాణ్ణి.మేనమామగారి బిడ్డల్ని అంతే.అలాంటి నా చిన్న హృదయానికి ఒక బాలికంటే అదేదో విపరీతమైన అనురాగముండేది.ఆ బాలిక పుట్టినప్పటినుంచి నీ పెళ్ళాము నీ పెళ్ళా మని వాళ్ళ అమ్మా,నాన్నా కూడా నన్ను వేళాకోళం చేసేవారు. ఆ చిన్నప్పటిమాటే నాకు పరమవాక్కయినది. నా అయిదవ ఏటను ఆ బాలిక జన్మతాల్చినది.పాలబుగ్గలపైన వున్న ఆనాటి నా కళ్ళకే,పొత్తిళ్ళలోని ఆ వెన్న ముద్దల బాలిక సర్వ

సౌందర్యాలకు నిధి అని తోచేది. ఆ బాలిక తల నిలపడం వచ్చిన అయిదోనెలనుంచి కూడా నే నెక్కడ పడవేస్తానో అనే భయంతోనే ఎత్తుకుంటుండేవాణ్ణి.ఎంత ఏడ్పులో ఉన్నా ఏడవకు అని నేననగానే ఆ పాప ఊరుకునేది.ఆ అమ్మాయి వినాయకరావుగారి ప్రథమ సంతానం.

వినాయకరావుగారి ప్రథమ భార్య,బిడ్డలు లేకుండానే ఇరువది యైదవయేట కాలము చెందినది.అప్పుడే రెండవభార్యను చేసుకోన్నారట.రెండవ భార్యకు చాలా కాలమువరకు కాన్పురాలేదు.శేషాచలపతితో వియ్యమందుటకై నా నాకు బిడ్డలు కలుగలేదే అని ఆయన దిగులు పెట్టుకునేవారట,మా తండ్రిగారు పోయిన రెండేళ్ళకు వారి ప్రథమ పుత్రిక ఉద్భవించినది.అందాల ఆ చిన్నపాప నేనేత్తుకొన్నప్పుడు చాకలి తెచ్చిన బట్టలైనాసరే ,ఆమె అశుభ్రపరచినా మాట్లాడకుండా ప్రక్కనే ఉన్న మా యింటికి గిరుగెత్తుక వెళ్ళి ఆ బట్టలు విడిచి శుభ్రమైన బట్టలు కట్టుకొని వచ్చేవాడిని.మేము రేపల్లెచదువుకు వెళ్ళేసరికి శకుంతల తప్పటడుగులు వేస్తుండేది.మొదటిసారి సెలవలకు వచ్చినప్పుడు,ఆమె ముద్దు మాటలు మాట్లాడినది.రెండవసారి సెలవలకు వచ్చినప్పుడు,మొదట నన్ను చూచి క్రొత్తచేత సిగ్గుపడినా రెండవదినం నా మెడచుట్టి నన్ను వదిలింది కాదు.

 బంగారపు తొనల ఒళ్ళు,ఒత్తుజుట్టు; ఆ జుట్టు వెనక్కు తీసుకోవటము తెలిసేదికాదు.జుట్టు మధ్యనుంచే కళ్ళతో చూస్తూ మాటాడేది. బావ వత్తేలు బితకత్తులు తెత్తిపెత్తాడునాన్నా బావను పెల్లి తేతుకుంతా అని అంటూ వుంటే దేహ మనఃప్రాణాలతో కాంక్షించి పెళ్ళిచేసుకొన్న నవయౌవనుని హృదయంలా నా హృదయము దడదడ మనేది.పాలకడలి పొంగులో పైకుబికిపోయేది.

 నేను పదేళ్ళ కుర్రవాడిని.ఆమె అయిదేళ్ళ బాలిక.మే మిద్దరం చిన్నతనాన్నుంచీ ఒకే కంచంలో తినడ మలవాటు. వాళ్ళింటికి వెళ్ళినా వాళ్ళమ్మ ఒకే వెండికంచంలో మాకు అన్నం పెట్టేది.ఒక్కొక్కప్పుడు మా ఇంట్లోనే రాత్రులు నా మంచం మీదనే,నా ప్రక్కన పడుకొని నిద్ర పోయేది.మానిద్దురలో ఆమె నాన్నగారు వచ్చి ఎత్తుకొని తీసుకుపోయేవారట.వాళ్ళమ్మ ఏమి పెట్టినా నాకు పెట్టకుండా తినేదికాదు. నేనేమి సంపాదించినా శకుంతలకు పెట్టకుండా తినేవాణ్ణికాదు.

         నేను విన్న కథలు, చదివిన కథలు ఆమెకు చెప్పేవాణ్ణి.ఆమెకు వాళ్ళ అమ్మమ్మ చెప్పిన ఈగ పేరు మరచిన కథ,రాజుకు ఏడుగురు కొడుకుల కథ,పేను కథ,కాకీ పిచ్చుక కథ తన తియ్యనైన లేత మాటలతో,

పేదరాసి పెద్దమ్మా
పెద్దమ్మ కొలుకా
కొలుకుచేతి గొడ్డలా
గొడ్డలికొత్తే చెత్తా
చెత్తుమీద వాలిన పిత్తల్లాలా

పిత్తలు తాగే నీల్లా
నీల్లల్లో తిరిగే తేపల్లాలా
తేపల్ని పత్తే జాలరివాలా
నా పేలేమితి?

    అని కథ చెప్పుతుంటే, నా ఆ చిన్ననాటి దశలోనే ఆ మాటలతో కలిసిపోయి ఏలోకాలలోకోపోయేవాడిని.ఆమె ఆకథ ఎన్ని మారులుచెప్పినా క్రొత్త అందాలతో కనబడేది. గుజ్జనగూళ్ళ ఆటలాడే వాళ్లము.నేను బువ్వ వండుతాను,నీవు క త్తేరుకు వెళ్ళిరాబావాఅని ఆమె అన్నప్పుడు ఆ బొమ్మరిల్లే మహాభవనమై,ఆ వేయించిన కందిపప్పే పంచభక్ష్య పరమాన్నాలై,ఆమె నా దివ్యసుందరి గృహిణియై,రాజ్యభారము వహించిన ఒక ఉన్నతోద్యోగిని నేనై,అవ్యక్తంగా క్రీనీడలలో నాకా రోజులల్లో మహదాశ్చర్యమైన ప్రపంచ మొకటి ప్రత్యక్షమయ్యేది.ఒక్కొక్క ఏడు నాకు పై పడుతున్న కొలది,మాయందొకరికొకరికున్న ప్రేమ ద్విగుణీకృతమయ్యేది.

    ఒక రోజున మా స్నేహితులకు ఆట యుద్దమునుంచి నిజమయిన యుద్దము వచ్చినది.తోలు బొమ్మలాట చూచిన ఫలితమది.ఒక జట్టు పాండవులు,ఒక జట్టు కౌరవులు.నేను అర్జునుణ్ణి.పడిపోయిన దుర్యోధనుడి తలపాగా కోస్తున్నట్టు నేను నటిస్తున్న సమయంలో,ఆ దుర్యోధనుడి జుట్టు కొంచెము లాగినాను.పధ్నాలుగేళ్ళ రెడ్డిపిల్లవాడుకోపముతో లేచి,అయిదువేళ్ళు అంటేట్టు చెంప పెట్టు ఇచ్చినాడు. ఒక నిమిషం తెల్ల బోయినాను.రెండవ నిమిషం కళ్ళనీళ్ళు తిరిగినవి,మూడవ నిమిషం వెర్రి కోపంవచ్చి పొట్ట మీద తన్నినాను. ఆ మరునిమిషంలో వాడి జుట్టు నేను,నా జుట్టు వాడు పీక్కోవడము గ్రుద్దుకోవడం,తన్నుకోవడం,స్నేహితులందరు చుట్టూగూడి నవ్వడం,ఈ మహా యుద్దంలో ఎక్కడనుంచివచ్చిందో శకుంతల.వాళ్ళ నాన్నగారి పేపబెత్తము పట్టుకొని గబగబవచ్చి దడదడ ఆ రెడ్డి స్నేహితుణ్ణి నాలుగు తగిలించింది.సోగలైన ఆమెకళ్ళు అప్పుడు స్పులింగాలు ఆర్చినవి.మహాగ్నిహోత్రాలై వెలిగినవి.మా బావను కొడతావా?వెధవా!నిన్ను చంపేస్తానని మహాకోపముతో పలికినది. ఆ రెడ్డి బాలుడు తెల్లబోయి, నా జుట్టు వదిలినాడు.నేను తెల్లపోయి వాడి జుట్టు వదిలినాను.

    నన్ను థర్డు ఫారంలోకి వేసినప్పటికి నాకు పండ్రెడవయేడు.శకుంతలకి ఏడవ ఏడు.బావతో వెళ్ళి రేపల్లెలో చదువుకుంటానని ఆమె పోరు పెట్టింది. పుత్రికమీద ప్రేమతో వినాయకరావుగారు రేపల్లెలో కాపురము పెట్టి,పిల్లను అక్కడ ఆడపిల్లల బడిలో చేర్పించినారు. అప్పుడామెకు కలిగిన సంతోష ముత్తుంగతరంగములైనది, మా మాస్కూళ్ళ నుంచి రావడం తోనే మేము కలుసుకొనేవాళ్ళం.నాకు సంగీతం చెప్పించు నాన్నా అని ఆ పదేళ్ళ బాలిక సంగీతం కూడా ప్రారంబించింది.రోజూ క్లాస్ లో చదువుకొన్న పాఠాలు నాకు ఒప్పచెప్పేది.పాఠంలో ఏ మాత్రం అనుమానం వచ్చినా నన్నడగవలసిందే.

ఆ చిన్ననాటి రోజుల్లోనే నేను బి.ఏ.చదువుతున్న కుఱ్ఱవాడ్ని అన్నట్టు సంచరించేది.

    తన చుట్టాలతో మాట్లాడేటప్పుడు మా బావకు సంగీతం బాగా వచ్చును.మా బావ కథలు బాగా చెప్పుతాడు, మా బావ ఎంతో తెలివైనవాడు,మా బావ అన్ని క్లాసుల్లోను ఫస్టుగా ప్యాసవుతాడు అన్న అసదృశమైన ఆమె పూజలో నేను జవహర్ లాల్ నెహ్రూ అంతటివాణ్ణా అనుకోనేవాణ్న.తెలియకనే ఆ చిన్ననాటి కళలు,ఆ భావాలు,ఆ చిత్రాలు కాశీపటముల పెట్టెలోని బొమ్మలవలె అవ్యక్తమైన మధురమై తిరిగిపోయినవి.పెద్దవారి మాటల్లా ఆడబోయిన మాటల్లో అర్ధము లేదు,అర్ధవత్క్రుతులు మాత్ర మున్నవి.ఆ నీడలలో గాఢతమస్సులు లేవు సందె వెలుగులు పరిమళపూర్ణాలై లేచిపోతుంటవి.ఆ రోజులలో గ్రీష్మాతపములు లేవు.సువ్యక్తదినకాంతులు లేవు.నిష్కల్మష ప్రేమలు,నిర్మల హృదయాలు!
   
జాబిల్లి వంకలో చదలేటి ఊటలున్నవి. చుక్కల వెలుగులో మక్కువగల మహిమలున్నవి. పండుగలే ప్రపంచ రాజకీయాలు.ఆటలే జీవితపు గాఢకష్టాలు. ఆనందమే జీవిత పరమావధి. ఆ రోజులలో చేయి కలుపువారు బాలకృష్ణుడు,బాలరాముడు.మంచినీటికై మబ్బుల జంతువులు. అవి ఆవులో తేనెల ప్రోవులో !

    ఓ చిన్న బాలికా!నీ చిన్ని అందాలచేతులే ఆనాటి నా మొరకు చేతులను పట్టుకొని నన్ను నెమ్మదిగా నడిపించినవి.మా దొడ్డిలోని గులాబి మొగ్గల ఎరుపులను సేకరించుకొని వంకారులు తిరిగిన నీ చిన్ని పెదవులు,ఆనాడు దివ్యమంత్రముల నెన్నో ఉపదేశించినవి. సోగలై దివ్యత్వమునే కూర్చుకొన్న అద్బుతములైన నీ కళ్ళ కాంతులు ఈ సృష్టిలోని ఏవో రహస్యాలను వెలుగులతో దూరదూరాన చూపించినవి.

చిన్ననా డో జేమచెట్టున
చిట్టచివరకు ఎక్కి పళ్ళను
చిలకలా తింటున్న నన్నూ
చిట్టిదానవు చూచి గంతున
చేరగా పరుగిడుచు వస్తివి.
నీలిపావడ కూర్చు కుచ్చులు
గాలిలో నర్తించే శంపా లీలలో!

పసిడి దేహం తొనలు మెరిసెను
పాణికీ బంగారు గాజులు,
పిల్లకాసుల పేరు గల గల

కంఠమున గొలుసుల్లు పేటలు
చిక్కుపడి పులిగోరుతోనే
చేదిరియాడెను హృదయసీమను.
        
దువ్వపోయే కురులు గోటను
తొలగచేస్తూ పరుగవస్తివి.
ఘల్లుమన్నాయ్ కాళ్ళగజ్జలు
ఝల్లుమన్నది చిన్న గుండె.

చెట్లపళ్ళూ కోయనన్నూ
'చిన్నబావా,చూడు చూడూ
దోరపండు ఒకటి ఇయ్యవ్
మారు పెడతా తాయిలమ్మూ
        
మాట నిజ 'మన్నావు.
'తాయిలమ్మా నాకు వద్దూ,
మాయమాటలు నేను విన్నూ
పెళ్ళి ఆడ్తా బావ నిన్నని
వేయి చేతిలో చేయి 'అన్నా.

మాటలో అర్ధాలు తెలియదు
మాటలో మంత్రాలు ఎరగము
మిన్ను మొగమై చూచు కన్నుల
చిన్ని సిగ్గులు నాట్యమాడెన్.
చెట్టునుంచీ దుమికి, చెంగున

జేరి నిన్నూ బాలరాణిని,
చేర్చితిని నా చిన్న హృదయం,
లజ్జపడి, గద్గదిక మైతిని.
జేబులో ఉన్నటి పళ్ళూ
చేతిలో ఉన్నటి గుటకలు

మోకరిల్లి దోసిళ్ళు పట్టితి
మోమువంచితి శోకహృదినై.
చిట్టి చూపులు చిన్ని చేతులు
చెంప లట్టీ మోము నెత్తీ
'చిన్న బావా నిన్నెపెళ్ళి
మాటయిస్తా మాట తప్పను
పళ్ళకోసమే కాదు నిజమూ
పళ్ళచెట్లూ సాక్ష 'మన్నావూ!

కళ్ళలో ఆడేను చుక్కలు
గళములో చేరాయి బరువులు
బాల హృదయం మధురమౌతూ
కలలు కన్నాదీ!

    నేను హైస్కూలు క్లాసులు మూడూ,గుంటూరులో టౌను హైస్కూలులో చదివినాను. గుంటూరులో మొదట నేను చేరినప్పుడు అరండల్ పేటలో మేము కాపురమున్న చోటునుండి హైస్కూలుకు చాలా దూరమవడం చేత మా అమ్మ నాకొక చిన్న సైకిల్ కొనిపించి ఇచ్చింది. నా సైకిల్ బి.ఎస్.ఎ.తళతళలాడుతూ వేటకుక్కలవలెనున్న నా సైకిల్ ను చూస్తే నాకెంతో గర్వంగా ఉండేది. లాంతరు,గంట,క్యారియర్,స్టాండ్ మంచి ఖరీదు గలిగిన లూకాస్ కంపెనీవారివి.గుఱ్ఱపు జీనులాంటి జీను-బ్రూక్స్ సాడిల్, ఇంకా ఇతర అంగసౌష్టవాలు కలిగి పందేనికి ఉరక బొయ్యే అరబ్బీ గుఱ్ఱంలా, ఉండేది.ఆ బండిమీదే తొక్కడం నేర్చుకొన్నాను. ఒక్క రోజులో వచ్చిందా విద్య నాకు అప్పటికింకా పొట్టిగానే ఉండేవాణ్ణి అయినా ఆ సైకిల్ మా ఇంటికి వచ్చిన మరుసటి క్షణంనుంచి, నాకూ, దానికీ గాఢ స్నేహం కలిగింది.నా మనస్సులోని భావం గ్రహించి నడిచేది.వెళ్ళితే మేఘాలమీద పరుగు,లేకపోతే వెనక్కు నడిచినట్టు నడక. నాకే ఎదురు సలహా చెప్పేది. ఎంతటి జనసమ్మర్ధమైనా, దారి ఎంత ఉక్కిరి బిక్కిరిగా ఉన్నా,బళ్ళూ,జట్కాలు, కార్లు వత్తిడి ఎంత ఎక్కువగా ఉన్నా,అతి నేర్పుతో వట్టిగించుకొంటూ నన్ను తేల్చుకొని పోయేది.నేను మీద చేయి వేస్తే ప్రేమతో ఉప్పొంగేది.రాత్రిళ్ళప్పుడు నేను సైకిల్ తొక్కి వెళ్ళుతుంటే ఏదైనా గొయ్యికాని, రాయికాని ఎదుట ఉన్నప్పుడు, టాను బ్రేకు పడినట్లు ఆగిపోయేది. ఎప్పుడూ సైకిల్ ను బాగుచేసుకునేవాణ్ణి. బాగుచేసు కొన్నప్పుడు సైకిల్ పకపకమని నవ్వేది.

నేను సైకిలెక్కి తొక్కి వెళ్ళుతూ అందరూ నన్నే చూస్తున్నట్టు భావించుకోనేవాణ్ణి. అందరి కళ్ళు నా సైకిల్ మీదే ఉన్నట్టుగా తోచేది. నా సహాధ్యాయ ఎవరడిగినా, నేను నా సైకిల్ ఎప్పుడూ ఇయ్యలేదు.నేను క్లాసులో ఉన్నప్పుడు రెండుసార్లిద్దరు స్నేహితులు నా సైకిలెక్కి త్రొక్కాలని ప్రయత్నించారు. కాని ఎక్కిన తక్షణమే తల్ల క్రిందులుగా పడి గడ్డం బ్రద్దలు కొట్టుకొన్నవా డొకడు,ఎడమ ముంజేయి విరగగొట్టుకొన్నవా డొకడు! నా సైకిల్ కు రంగై నా చెదరలేదు.

    అలాంటి నా సైకిల్ మా శకుంతలకు చూపేటప్పటికి, నాతో పాటు ఆనందంతో పొంగిపోయింది. పెడలు అందకపోయినా పరికిణీ వెనక్కు విరిచి కట్టుకొని అతి సునాయాసంగా సైకిల్ త్రొక్కడం నేర్చుకొన్నది. మా ఊళ్లో కాలువగట్టుమీద డొంకల్లో మా శకుంతలను కూర్చోపెట్టి సైకిల్ త్రొక్కుతుండేవాణ్ణి. ఇది ఫోర్తుఫారం సెలవలకి నేనింటికి వెళ్ళి నప్పుడు జరిగిన సంగతి.

నాతో గుంటూరు చదువుకు రావాలని తండ్రి గారితో పోరు పెట్టిండి. కాని ఇంటిదగ్గరే ప్రయివేటుగా చదువు చెప్పించారు వినాయకరావుగారు.
    
                                                                                                               o o o

    ఆ రోజు ఉదయం తోటనుంచి హేమ ఏదో ఒకవిదమైన తొందరతో ఒకవిదమైన సిగ్గుతో, ఒకవిధమైన పరుగుతో ఆమెకు సహజమైన గంభీర నదీ ప్రవాహంవంటి నడకగాక, భయము నిండిన నడకతో తోటలోంచి నా దగ్గరకు వచ్చిన క్షణంలో, నాయీ చిన్ననాటి జీవితము అద్భుతవేగంతో ప్రత్యక్షమై, మాయమైపోయింది. ఆమెను తోటలో తీర్ధమిత్రుడు తనధూర్తత్వముతో బాధించినాడని నాకామేను చూడగానే అర్ధమైనది. పురుషులలోని పశుత్వము తన కోరలకు ఆడదాని వేడినెత్తురు తగిలితేగాని, తృప్తి అనేది పొందరు. చక్కని గులాబీపువ్వును చేతికిస్తే కొందరు రసిక శ్రేష్టులు రేకు రేకు త్రుంపి, కొన్ని చేతుల్తో నలిపి, కొన్నిటిని పళ్ళతో కొరికి, ఆ సుందరకుసుమాన్ని అయిదు చిటికలలో రూపుమా పేస్తారు. మనోజ్నమానినీ జీవితాన్ని కూడా మనుష్యపిశాచుల కొందరు ఖండఖండాలుగా చీల్చి, నలిపి గిరవాటు వేస్తారు. తీర్ధమిత్రుడు ఎంతటి కర్పూరశలాకలాంటి శరీరం కలవాడో అంతటి కఠినహృదయుడు. అతని జీవిత రేఖలన్నీ హేమ కుసుమదేవి చూచాయగా కని పెట్టినట్టే తోస్తుంది. కాని ఏమో?
    అయినా నిప్పుతో చెలగాటాలెందుకాడుతుందో? చపలాక్షులైన స్త్రీల హృదయం ఎంతటివారికైనా అగోచరము కదా? హేమాదేవి తీర్ధమిత్రుని ప్రేమిస్తున్నదా? అయితే ఆ ప్రేమ ఎలాంటిది? నా దివ్యదేవతైన శకుంతల చెల్లెలు తుచ్చప్రేమకు దాసురాలు కాగలదా?

    దివ్యదేవీ శకుంతలా! నువ్వు నడిచినది సర్వకాలము పవిత్రవ్యోమ నదీతీరాలే కదా! దివ్యలోక వాసినినైన మహాదేవివి నీవు. కారణ మాత్రుణ్ణయి నీ జీవితంలో ఒక అణుమాత్రం పంచుకొన్నాను నేను! మళ్ళీ నా మనస్సు నా చిన్ననాటి కథమీదికి పోయింది.

                                                                                                                   o o o

    శకుంతల ఎప్పుడూ అబద్దము చెప్పి ఎరుగదు. కాని తియ్యటి ముద్దు మాటలతో చిన్నపిల్లలకు తగిన హాస్యపు సంభాషణలతో సర్వకాలమూ సంతోషముతో ఉప్పొంగిపోయేది. ఆమె వేళాకోళాల కందరము గురి ఔతుండేవాళ్ళము. వాళ్ళమ్మమ్మ మా ఊరు వచ్చినప్పుడనేది అమ్మమ్మా! నీ ఆచారంకోసం ప్రపంచమంతటా తడిపేట్టున్నావే! మనింటి ముందర గేటును బిచ్చగాడు ముట్టుకోవస్తే అంటైపోయిందని, గేటు కడిగి వేస్తావే! వంటిల్లున్నందుకు ఇల్లంతా కడిగించవేం అని, నేనొకరోజున యిప్పుడే వస్తానని తోటకు వెళ్ళి మూడుగంట లాలస్యంచేసి వచ్చాను. మూర్తి బావా! ఇప్పుడే వస్తానన్నావు,ఇప్పుడంటే ఎన్నిగంటలో? అన్నది. నేను తెల్లబోయినాను. ఆమె పకపకా నవ్వినది.

ఆ నవ్వులలో వెన్నెలలు విరిసినవి. ఉదయకాలపు ఎర్రని కిరణాలు ప్రసరిస్తుంటే కృష్ణానది చిరుకెరటాలలో ఆ నవ్వు అన్నివేపులా ఆక్రమించినది. ఆ నవ్వులలో కోకిలలు పాటలు పాడినవి. తమలపాకుతీగె లేత ఆకులు తొడిగినది. మా అమ్మగారి పూజావేదికపైన చిత్ర చిత్ర పుష్పముల ఆ నవ్వు సౌరభాలను వెదజల్లినది.

    నేను ఊళ్ళో ఉన్నానంటే, నిమిషానికో వింతకై సేత చేసికొనేది. ఈ పరికిణీ బాగుందా బావా? ఈ చొక్కా అందంగా ఉందా? అని నేనేదో సమాధానం చెప్పినదాకా అడిగేది. నేను బాగుండ లేదంటే బట్టలు మార్చుకొనివచ్చేది. నేను బాగున్నాయంటే గంతులు వేసుకుంటూ వాళ్ళమ్మమ్మ వద్దకు పోయి అమ్మా, ఓ అమ్మా ! నా బట్టలు బాగున్నాయన్నాడే బావ! అనేది అట్లాగటమ్మా! బావ మెచ్చుకున్నాడటమ్మా! నా తల్లివిగా అని వాళ్ళమ్మ సంతోషముతో మాట్లాడేది.

    ప్రతి ఆభరణమూ నేను మెచ్చుకోవలసినదే. లేకపోతే ఆ నగ ధరించేది కాదు. ఒక్కొక్కప్పుడల్లరితో తన హారాలన్నీ నా మేడలో వేసి బావ నగలు పెట్టుకొంటే ఎంత అందంగా ఉంటాడు. రా! రా!మా అమ్మ చూస్తుందని నన్ను వాళ్ళమ్మగారివద్దకు తీసుకుపోయేది.

     అమ్మా. బావ పెండ్లికొడుకులా లేడటే!

     బావ పెళ్ళికొడుకు లాగున్నాడు, నీవు పెళ్ళికూతురుళా ఉన్నావు.

       నాతో వేళాకోళా లాడొద్దమ్మా!

       నీతో నాకు వేళాకోళాలేమిటే పిచ్చితల్లీ! నిజం చెప్పాను

       అబ్బా! నాకు సిగ్గువస్తుంది అని తుర్రున పారిపోయింది.

                                                                                                                3.
      విష్కంభము

    హేమసుందరి ఇంతవరకు ఆ వ్రాతపత్రికని చదువుకొన్నది. ఆమె హృదయం ద్రవించిపోయింది. ఏమిటీ,త్యాగతి తన బావగారా! త్యాగతి పేరేమిటి? ఎంత తన్ను మోసపుచ్చినాడు! తన తల్లిదండ్రులూ ఆ మోసం లోనే చేరారూ! ఏమిటి దీనికంతకూ కారణం? ఎందుకీ సంవత్సరము పాటూ త్యాగతి తనకు బావగారని తెలపకపోవటం? అందుకనే తన తండ్రి కతడంటే అంత ప్రేమ, అంత గౌరవం! తన తల్లి అతడు వచ్చాడనేప్పటికే ఎంతో ఆనందంతో పొంగి అల్లుణ్ణి చూచుకొన్నట్లు చూచుకోవడము.
 
త్యాగతికథ చక్కని పట్టుబైండు పుస్తకంలో వ్రాసి వుంది. ఆ పుస్తకం నిండా భారతీయ చిత్రలేఖనా విధానాన అలంకారచిత్రములు నిండి యున్నవి.తన అక్కగారి చిన్ననాటి చిత్రములు, తన బావగారి చిత్రము,తండ్రిగారివి, తల్లిగారివి ఎన్నో ఉన్నవి. వాని అన్నింటిలో తన అక్క చిత్ర మెక్కడ రచింపబడినా అది ఒక దేవలోకసుందరి చిత్రంలా ఉన్నది.

తన పడకగదికి ముందున్న చదువు గదిలో హేమం సోఫాలో పడుకుని, తలకు ఎడమప్రక్కగా చిన్న రోజుచెక్కబల్ల మీద పద్మములో నుంచి వచ్చే కర్ణికలా ఉన్న విద్యుద్దీపం వెలుగున,ఆ పుస్తకం చదువుకుంటున్నది. కథ రెండు ప్రకరణాలు జరిగేసరికి హేమం ఎందుకో పడుకుని చదవలేక పోయింది. పుస్తకం హృదయాని కద్దుకుంది. ఆమె కళ్ళ వెంట జలజల నీటి బిందువులు రాలినవి. తన శ్ర్ముతిపథంలో చిన్ననాటి రోజులలో సంచరించిన దేవవీరుడై వెలిగి, దేశాలు తెగించి పారిపోయిన తన మూర్తిబావే త్యాగతా! ఆ ప్రశ్న ఆమె ఆశ్చర్యమున లీనమై ఆమె హృదయమునకు మరియు ఆందోళన తెచ్చినది. ఈ సంఘటనలోని మహా రహస్య మేమిటి? ఆమె తీవ్రాలోచనలలో మునిగినది. ఒకసారి కోపం ఒకసారి విషాదం ఆమెను ఆలమివేసినవి!
   త్యాగతీ! ఎంతవాడవయ్యా నీవు! నిన్ను బావా అని పిలవాలా? లేక త్యాగతీ అని సంబోధించాలా ? అహో! ఎంత అందంగా కథ మొదలు పెట్టాడు. బావ అనే మాటలో ఉన్న ఏదో చిత్రానుభవము ఆ కథా సౌదర్యములోనుంచి తొణికిసలాడి, వెల్లువలై ప్రవహించి వచ్చి, తన్ను ముంచివేసింది.
   ఈ రహస్య వ్యక్తతలోనుండి బయటపడిన బావ తనకు ఎక్కువ సన్నిహితుడా? లేక తన స్నేహితుడై తనకు  పెట్టని కోటయై, వివిధ రీతుల గురువైన త్యాగతీ తన హృదయంలో ఇంతలో ఏకీభవించడంలేదేమి?
   చిన్నతనాన్నుంచి తన అక్క తన కొక దేవతే. ఇప్పుడు ఆ అక్క చరిత్ర ఎంత చక్కగా వర్ణించాడు ఈ కవి! తన బావకవి. త్యాగతి శిల్పి మాత్రమని తాను విన్నది.అతని చిత్రాలూ,ఏవో తన ఇంటికి తెచ్చి చూపించిన లోహవిన్యాసాలు తక్క, ఇతరాలు తానెప్పుడూ చూడలేదు. ఆ లోహ శిల్పాలు కొత్త అందాలతో, భావాలతో నిండి, మనోహరంగా ఉన్నవి. తానీ లోహశిల్ప విధానము నేపాలులో నేర్చుకొన్నానని త్యాగతి చెప్పినాడు, తన చరిత్ర పూర్తిగా ఒక్కనాడైనా అతడు చెప్పలేదు. కారణము? పాపారావు బాబయ్య రాగానే ఏదో సంచలనము కలిగినది. ఆ కారణంగా తన కీ గ్రంథము వచ్చి వుంటుంది. 
   హేమసుందరి ఆ గ్రంథము మూసివేసి హృదయమునకు మరల నొకసారి అద్దుకొని, ఇటునటు పచారుచేసినది. ఒకమారు పడకగదిలోనికి పోయి, హృదయమున నా గ్రంథ ముద్దుకొనియే  ఆమె తన మృదుల పల్యంకముపై బోర్లగిల పండుకొన్నది.
లోకేశ్వరికి మొదటినుంచీ ఈ రహస్యము తెలుసునా? తన అక్క అత్తగారు తమ్ము చూచుటకు రెండు నెలల క్రిందట వచ్చినది. ఆవిడ తన్నెంతో ఆదరించినది. తన్ను కౌగిలించుకొన్నది. ఉన్నంతసేపూ తనదగ్గరనే తన్ను

కూర్చుండబెట్టుకొన్నది. తన కామెను చూచినప్పుడెంతో జాలి కలిగినది. తన కోడలికై, దేశాలు పట్టిపోయిన కొడుకుకై ఆమె హృదయము ప్రక్కలై యుండుననీ, ఆమె జీవచ్చవంలా ఉన్నదనీ తాను భావించి ఆమె దగ్గరగా టాను ఒదిగిపోయినది.

    హేమం అచ్చంగా శకుంతల పోలిక అని ఆమె అన్నప్పుడు తాను ద్రవించిపోయినమాట నిజం. టాను ఇంతైనా భేదం లేకుండా అన్ని మూర్తులా అక్క పోలిక అని అందరూ అంటూ వుంటే పొందిన విచిత్ర భావాల కంటే, అక్క అత్తగా రన్నప్పుడు పొందిన ఆనందమేదో విలక్షణమై, ఇతమిత్థమని తేల్చరానిదైపోయినది.

    త్యాగతి తన బావని కల్పమూర్తికీ, తీర్ధమిత్రునికీ, నిశాపతికి సోఫీకి తెలియనే తెలియదు. తెలిసిఉంటే తనకూ తెలిసిపోయి వుండును. లోకేశ్వరి ఇంత రహస్యము దాచుకోగలిగిందా? తల్లిదండ్రుల ఉద్దేశ మేమిటి? ఆమె హృదయంలో ఏదో ఆలోచన పుట్టింది.ఆమె మోము కెంపెక్కింది. ఆమె మోములో చిరునవ్వులు నృత్యమాడినవి. ఆమె హృదయం అమితవేగముగ పరుగులువారింది. వెంటనే ఆమెకు కోపం వచ్చింది.కోపము తల్లిదండ్రులపై, త్యాగతిపై, లోకేశ్వరిపై-అందరిపై వచ్చింది. వెంటనే తన కోపానికి తాను నవ్వుకొంది. మంచం నుండి లేచి గ్రంథము తీసికొని చదవడానికి సోఫాపై చేరింది.
 

                                                                                                (త్యాగతి కథ తిరిగి ప్రారంభము)

    
    దసరా సెలవులకు నే నింటికి పోయినప్పుడు టెన్నిసు లాగు, షర్టు ధరించి, నీలపు వెనీషియన్ కోటు ఎడమ మోచేతి వంకలో చమత్కృతిగా వేసుకొని, కాలికి టెన్నీసు జోడు తొడుక్కొని, చేతిలో టెన్నీసు రాకేట్టుతో మా ఊళ్ళోదిగాను. బండి దిగి మా యింటికి వెళ్ళకుండానే శకుంతల యింటికి గబగబ వెళ్ళినాను. బావా, యిదేమి వేషమోయ్ అని పరుగెత్తుకొని వచ్చి అతి ఆనందంగా శకుంతల నన్ను బావ పెద్దవాడవుతున్నాడు. నేనూ పమిట వేసుకుంటానంటే మా అమ్మ కోప్పడుతుంది, నీవు బంతి ఆడుతున్నావా? నాకు కూడా నేర్పుతావా బావా?

    నేను: టష్. ఆడవాళ్ళు బంతి ఆడకూడదు. ఆడవాళ్ళు ఒప్పులకుప్పా వొయ్యారి భామా, చెమ్మ చెక్క చేరెడేసి మొగ్గా ఆడుకోవాలి.

    శకుం: పోనీలేమ్మా! నాకు నేర్పకపోతే నేను నేర్చుకొంటున్న సంగీత పాటలు నీకు వినిపించనే వినిపించను. నాకు సంగీతం మాష్టరు వచ్చాడని నీకు తెలియదుకాబోలు! నీ బ్యాట్ కంటే నా వీణ చాలా అందంగా వుంటుంది.నా వీణ నీకు చుపిస్తానా? నాకు సరిగమలు వచ్చాయ్. స్వరజతులు

మూడయ్యాయ్. మా మాష్టర్ నాకు ఎంతో తొందరగా సంగీతం వస్తుందన్నాడు.
   నేను: అంతా బడాయ్! నీకు సంగీతం కూడా వస్తుందా!
   శకుం: నీకు బంతి ఆట వస్తుందా! బడాయికి బ్యాట్ తెచ్చుకొన్నావు.
   నేను: గుంటూరు వచ్చి చూడు తెలుస్తుంది.
   శకుం:నేను సంగీతం పాడుతుంటే వచ్చి విను!
   నేను: ఓ తాయిలంగారికి నేను తెచ్చిన బొమ్మలన్నీ యిస్తావా?
   శకుం: నేను తాయిలంగారికోసం కుట్టిన జేబురుమాళ్ళు యిస్తానా
  

నేను: నాకూ ఉన్నాయి కావలసినన్ని జేబురుమాళ్ళు.

శకుం: నాకూ ఉన్నాయి కావలసినన్ని బొమ్మలు.

నేను: అయితే నేను తక్షణం యింటికి వెళ్ళిపోతాను.

శకుంతలకు కన్నీళ్ళు తిరిగినయి.

   అమ్మా, మూర్తి బావ నా మీద కోపం వచ్చి నా జట్టు ఉండకుండా వెళ్ళిపోతున్నాడే! అని కళ్ళనీళ్ళు తుడుచుకొంటూ కోపంతో గిర్రున తిరిగి లోపలి హాలులోకి వెళ్ళిపోయింది. గుమ్మం దగ్గరే వాళ్ళ   నాన్నగారు నుంచుని  ఏమిటి తల్లీ! బావమీద కోపం వచ్చిందా? అని గబుక్కున ఎత్తి గుండె  కదుముకొన్నారు. నా హృదయం ద్రవించిపోయింది. నా కంఠము బరువెక్కినది. పైకిరాని నా కంటినీరు నా  కళ్ళను మండించినవి. తండ్రి మెడ కౌగిలించుకొని శకుంతల వెక్కి వెక్కి ఏడుస్తూ, ఆయన భుజములో  మోమును దాచుకొన్నది.
   వినాయకరావుగారు  ఇదేమిటోయ్, ఎప్పుడూ లేనిది,ఇద్దరూ దెబ్బలాడుకొన్నారు! ఏమిటా తగాదా? అని ప్రశ్న వేశారు.
   శకుంతల గభాలున తండ్రి మెడ చుట్టిన చేతులు వదిలి,క్రిందకు జారి నా దగ్గరకు పరుగెత్తుకొని  వచ్చి,బావా నామీద కోపము పోలేదూ? అని  అడిగినది.  నాకు కోపము లేదు: వేళాకోళంగా  అన్నాను అని నవ్వాను. నే నివ్వాళ   మీ  యింట్లోనే భోజనం చేస్తాను. రా, మా యింటికి పరుగెత్తి  వెళ్ళి, నా పెట్టేతీసి నీ బొమ్మల్ని ఇస్తాను. ఆ పెట్టెంతా నీ కోసం తెచ్చిందే! వెళ్ళిరామా, మామయ్యగారూ!అని తలవాల్చే వినాయకరావు  మామగారి  నడిగినాను. పరుగెత్తుకొని వెళ్ళండి అని ఆయనగా రన్నారు. చేతులు చేతులు పట్టుకొని, మా హృదయాలు కలిసి మెలిసి, మా నవ్వులు పైకి పొర్లి  ప్రవహించి మేము గాలిలో మా యింటికి తెలిపోతిమి.
నాకు పదమూడవ యేడు జరుగనప్పుడే, వినాయకరావుగారికి రెండవ కుమారిత జన్మించినది. శకుంతల ఒక్క నిమిషం చెల్లెలిని వదిలి ఉండేది కాదు. చెల్లెలికి హైమావతి అని వినాయకరావుగారు నామకరణం చేసినారు. హేమకుసుమదేవి అని ముద్దు పేరయినది. చెల్లెలిని వడిలో పడుకో పెట్టుకొనేది. చెల్లెలి ప్రక్కలో పడుకోనేది. చెల్లెలి మాటలే సర్వదా నాతో చెప్పేది. ఒకనాడు

నావద్దకు పరుగెత్తుకొని వచ్చి బావా, ఎన్నాళ్ళకు నాకో చెల్లాయ్ పుట్టిందోయ్! నన్ను అక్క అని పిలుస్తుంది. నేనంటే ఆనమాలు కడుతూవుంది. ఎంత తెలివైందనుకొన్నావ్! ఆకలేస్తే కానీ ఏడవదు అని గబగబా చెప్పింది.

     నాకు వాళ్ళ చెల్లాయి అంటే అసూయ పుట్టింది. నా మీదుండే ప్రేమంతా వాళ్ళ చెల్లాయిమీదే శకుంతల చూపిస్తుందని బాధపడ్డాను. ఏదైనా వంకతో ఆమెను ఆటలకు తీసుకుని పోయ్యేవాణ్ణి. చెల్లాయి కబుర్లు చెపుతుంటే యితర విషయాల్లోకి ఆమె మనస్సునుతిప్పుతుండేవాణ్ణి.

    నేను గుంటూరు స్కూలు ఫైనలు క్లాసులో చేరడానికి వెళ్లేసరికి హేమకుసుమానికి రెండో యేడు వచ్చింది. మా చెల్లాయి నొకమాటేత్తుకొని మరీ వెళ్ళు బావా అని నన్ను బరబర ఉయ్యాల దగ్గరికి శకుంతల లాక్కొనిపోయినది. రెండు చిటికెలు వేసి 'హేం! హేం' అని పలకరించి శకుంతలను మా యింటికి లాక్కొనిపోయినాను. ఆ రోజున మే మిద్దరము ఒక నిమిషమైనా విడిచి ఉండదలచుకోలేదు. శకుంతల పాఠాలకాదినము శెలవే పుచ్చుకొన్నది.

    నాతో బాటు నా పెట్టేలన్నీ సర్దినది. అత్తయ్యా! నేను మడికట్టుకు వచ్చి నీకు ఆవకాయలవీ సర్దిపెట్టనా అని అడిగింది. మా అమ్మ అక్కరలేదు నా బంగారుతల్లీ. నేనే సర్దుకొంటానమ్మా, నీవు బావకు సహాయం చేయి. చెల్లాయ్ ఆడుకొంటూ ఉందా? మేము దసరా వచ్చే సరికి చెల్లాయ్ నడవడం ప్రారంభిస్తుందిలే. వారానికో ఉత్తరం రాస్తుండేం అని మా అమ్మ అన్నది.

     తప్పకుండా రాస్తానత్తయ్యా, బావచేత నాకో ఉత్తరం రాయిస్తుండండి. నేను నిరుడు రాసిన నాలుగింటికీ ఒక ఉత్తరానికే జవాబిచ్చాడు. యివ్వేళ వస్తుంది, రేపు వస్తుందని ఎదురు చూచి ఉత్తరం రాకపోతే నాకు ఏడ్పు కూడా వచ్చేది.

     ఈ పట్టు బావ ఉత్తరం రాయకపోతే బావతో మాట్లాడకు.

     నేను మాట్లాడుతానా! గుంటూరు వెడతాను. స్నేహితులతోనూ టెన్నిస్ ఆటలతోను మునిగిపోయి నన్ను మరచిపోతాడు.

     అమ్మా,శకుంతల మాటల్ని నిజమని నమ్ముతావేమో ? ఏమిటీ రాసేదని, నేను నిరుడు రాయలేదు.ఈ యేడు తప్పకుండా రాస్తాను.

                                                                                                                        4

     హేమా, నీవా నా డంత పాపవు, ఈనా డంత బాలికవు. ఆనాడు ఈనాటి అద్భుతమూర్తిగా ప్రత్యక్షమౌతావని నే నూహించుకోనైనా ఊహించుకోలేదు. ఇంగ్లీషు బాలికలవలె ఇట్టి స్వేచ్చామూర్తియైన విచిత్ర వ్యక్తిని కాగలవని నీవు ఉయ్యాలలో కాళ్ళూ చేతులు యెగరవేస్తూ కేరింతలాడేటప్పుడు, కలనైనా కనలేదు.

    ఆ ఉదయాన్ని జరిగిన సంఘటన వలన నిశాపతి క్రుంగి కూలిపోయి శర్వరీభూషణరావుగారూ, అందరికన్నా నన్నే ఆమె ఎక్కువగా ప్రేమిస్తుందని అనుకొన్నాను, అపవిత్రమైన నా జీవితాన్ని పవిత్ర పథాలకు మళ్లించినాను:

వివాహము వాంఛించినాను. కల్మష రహితురాలైన పవిత్రురాలైన ఆ బాలిక తన మోము అటు త్రిప్పినది. నేను బ్రతికి ఉండీ బ్రతుకని వాడనే.... అని కంటనీరు పెట్టినాడు. నే నతనికడకు రెండంగలలో వెళ్ళి నిశాపతిరావుగారూ, నేను మీకో అద్భుత రహస్యాన్ని చెబుతున్నాను. హేమేకుసుమదేవి అసలు పేరు హైమావతి. ఈ బాలిక నా మరదలు. చాలాకాలం ఉత్తరాదిని సంచరించి వచ్చిన నన్నానవాలు పట్టలేదు. ఈ బాలిక చిన్నతనంలోనే, నేనూ మా అమ్మగారు ఉత్తరాదికి వెళ్ళిపోయినాము. ఆమెను వివాహము చేసుకొనుటకు మీరు మిక్కిలి అర్హులని నా నిశ్చితాభిప్రాయం. అయినా యీ బాలికలో కల్మషం లేదు. అబద్దము చెప్పలేదు. ఆమె అభిప్రాయము మార్చరానిది. నీ ఆవేదనల్ని ఉత్తమ క్షేత్ర సందర్సనంలో నెమ్మది నెమ్మదిగా మాయం చేసుకోవచ్చు. అదీకాక పరమ రహస్యము మనుష్య్డుడు గ్రహించలేడు. తన్ను ప్రేమించిన వారున్నారని అతనికీ తెలియదు. మీ హృదయం మీ ఆత్మా అర్ధం చేసుకొన్నా ఒక ఉత్తమవ్యక్తి ఉన్నది సుమండీ! ఆమె ఎవరో మీకే ముందు వ్యక్తం అవుతుంది. దాపురించిన కల్మషాన్ని దహించుకోవాలంటే మన చుట్టూ దావానలాన్ని చెలరేగ చేసుకోవాలిఅని అస్పష్టమైన మాటలతో ఆయనకు కూడా వినబడనంత మెల్లగా చెప్పినాను. నిశాపతి మరునాడు మైసూరులోని నందిపర్వతానికి ప్రయాణమైపోయినాడు.

అడ్డు రానంతవరకు మనుష్యుడు మహాప్రతాపవంతుడు. ఇనపజోళ్ళు తొడుక్కొని నడిచే మనుష్యుడు నేలక్రింద నలిగిపోయే కోమల స్వరూపాల్ని చూస్తూ వికటానందంలో ఊగిపోతాడు. ఆ ఇనపజోళ్ళను కూడా ఛేదించే కఠినత్వం అడ్డుతగిలినప్పుడు, కంటినీటితో తనకుతానే జాలిపడుకుంటూ కూలిపోతాడు.

నేను స్కూలుఫైనలు పరీక్షనిచ్చి, మా అమ్మగారితో కొల్లిపరవచ్చిన కొద్దిరోజులకు మా మేనమామతో, మా అన్నదమ్ములవారితో వినాయకరావుగారు మా యింటికివచ్చి, తన పెద్దకుమార్తె శకుంతలను నాకు వివాహం చేయుటకు సంకల్పించామనిన్నీ, మునుపటి విధంగా కాబోవు అత్తగారింటికి తరచుగా వెళ్ళడము మానినాను. మాయింట్లోనూ పెళ్ళిపనులు ప్రారంభించినారు. వివాహము వైశాఖ శుద్ధి దశమినాడు. ఒక నాడు మా పురోహితుని భార్య మా అమ్మగారి దగ్గరకు వచ్చి ఏవో మాట్లాడుతున్నది. ఆ ప్రక్క గదిలో కలలు కంటున్న నాకీ మాటలు వినిపించాయి. 'వాళ్ళిద్దరి స్నేహము అలాంటిదండి. నేను కాపరానికి వచ్చి యిప్పటికి నలభై ఏళ్ళయినది. అప్పటినుంచీ వీళ్ళద్దరి స్నేహ మెరుగుదును. కృష్ణార్జునుల్లా ఉండేవారు. వినాయకరావుగారికీ, మీ వారికీ సంతానము కలిగినప్పటినుంచీ వియ్యం అందడమనే గాఢమైన కోర్కె మీ రెరగనే ఎరుగుదురు. ఆ కోర్కె యిప్పటికి ఫలించినందుకు శేషాచలపతిరావు గారు కళ్ళారా చూచి ఎంతో ఆనందించి ఉందురు. కళ్ళెంట నీళ్ళు పెట్టకండమ్మా. శుభసమయంలో మంచిదికాదమ్మా. ఎప్పటి దు:ఖాలప్పటికి భగవంతుని చేతిలో విడిచి సంసారము మోస్తూనే ఉండాలి.' ఆ మాటలు వింటూనే నేను లేచి మా తండ్రిగారి ఫోటో దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళల్లోనికి దీర్ఘంగా పారకించి చూచినాను. నాకు కళ్ళనీరు తిరిగింది. ఏదో భక్తీ, ఏదో సంతోషము నన్నావహిస్తున్నవి.

శుభముహూర్తంలో కన్యాదాన ఫలం చూరగొంటూ, వినాయకరావుగారఖండ వైభవంగా తమ ప్రధమకుమార్తె వివాహము చేసి ధన్యుణ్ణయాననుకొన్నారు.

ఠీవిగా ఆలంకరించుకొని మే మిద్దరము ముత్యాల పల్లకిలో ఊరేగినాము. మా అక్కగార్లిద్దరూ ఆడబిడ్డ లాంఛనాలకై చెరియొక వేయి రూపాలయ మూటలు అతిగర్వముగా అందుకొన్నారు. ఆ ఐదురోజులు మా అమ్మగారు బయట కానరాలేదు. ఆమె లోలోన ఏమి కుళ్ళికుళ్ళి దు:ఖించినదో, పైకి మాత్రం అతిశాంత గాంభీర్యాలతో వచ్చిన చుట్టాలను వేయికళ్ళతో కనిపెట్టి చూచినది. శకుంతల నా ఎడమ చిటికెనవ్రేలు పట్టుకొని నాతో అగ్నిహోత్రముచుట్టూ ఏడడుగులూ వేసినది. వసిష్ఠులు మా చేత ఏ మంత్రాల్ని పఠింపచేశారో కాని ఆ పవిత్ర మంత్రాలకుకూడ అతీతమైన మహామంత్రభావమే నన్నప్పుడొక ఋషితుల్యుని చేసినది.

నా చిన్ననాటి యీ అందాలబాల నాతో ఈ జీవితమార్గాన్ని ఏమె కాదు ఏడుకోట్లడుగులున్నూ నడవవలసిందే! ఆమె అడుగు లతిసుకుమారములైనవి. పవిత్రరేఖా చిహ్నితములు. ఆ అడుగులపైన ఎర్రటి పారాణి నా హృదయంలో రాగాలు దిద్దినది. అన్నట్లు నా శకుంతల దేవివలె ప్రకాశించినది.

'నేనూ, శ్రీనాధమూర్తి బావా వచ్చినాము, తలుపుతీయండి' అని ఆమె అన్న పలుకులు, న న్నంతవరకూ ఆవరించుకొని ఉన్న బాల్యత్వాన్ని క్రిందకు లాగి పారవేసినవి. నేనప్పుడు పురుషుణ్ణయి, 'నేనూ, శకుంతలా వచ్చినాము, తలుపు తీయం'డని నెమ్మదిగానూ అతి గంభీరంగాను సుమంగళీ సమూహము ఎదుట పలికితిని.

నేను  : వెర్రిఅమ్మాయీ, నేనూ అందరితోటి వాణ్ణే! ఈ లోకంలోని పరమ రహస్యాలన్నిటిలోనూ సంచరించాను. పరమ పవిత్ర ప్రదేశాలలోనూ సంచరించాను. ఆ అనుభవము తప్ప నాలో ఇంకేమీ లేదుసుమా.

    నామాటలకు ఆమె ఆలోచనలో నిమగ్నమయినది. నేనూ ఆలోచనా లీనుడ నయ్యాను. ఆ ఆలోచన లటుంచి మళ్ళా కథ ప్రారంభిస్తాను.

నేను స్కూలు ఫైనలు పరిక్షలో డెబ్బదికి తక్కువ కాని మార్కులతో కృతార్థుడనైనాను. అమ్మాయి కాలు పెట్టిన వేళ మంచిది, అబ్బాయి ప్యాసయినాడు అన్నారు. మా మామగారు నేను చెన్నపట్టణములో చదవడము మంచిదని నిశ్చయము చేసినారు. మా మామగారు, మా అమ్మా, నేనూ ముగ్గురము కలిసి చెన్నపట్టణము వెళ్ళినాము.

    చెన్నపట్టణము బయలుదేరే పూర్వము శకుంతలను చూచి, మాట్లాడి వెళ్ళాలని నాకు కోరిక కలిగినది. ఇదివరకు ఒక్క నిమిషము కూడ వదలి ఉండేవాళ్ళము కాదు కదా! మా వివాహమే మాకు అడ్డము రావాలా! ఏమీ టీ సిగ్గు? భార్యా భర్తల కీ సిగ్గు ఎందుకో ? వారిద్దరికీ రాబోయే స్త్రీ పురుష సంబంధము వలన జనించి ఉంటుంది. కాని రాను రాను నవ వధువున కదీ అలంకారమైన ఆనందము సమకూరుస్తుంది. ఈ వ్రీడ నవ వధూవరుల నడమ తేరా కావడమే కాక, వధూవరుల యిరువురి చుట్టూ తెర అవుతుంది.

                                                                                                      బాలవే నీ వెపుడు
                                                                                                      గోలవే బేలవే!
                                                                                                      పరమ సౌందర్యాలు
                                                                                                      పడతి నీ కన్నులే
                                                                                                      కన్నుల్లొ దాగెనే
                                                                                                      కమ్మని సిగ్గొకటి.
                                                                                                      బాలవే....
                                                                                                      ఉదయసంధ్యల ఎరుపు
                                                                                                      పెదవుల్ల తేనెలే
                                                                                                      తేనెలో ఒదిగింది
                                                                                                      తీయతీయని సిగ్గు.
                                                                                                      బాలవే....
                                                                                                      తంత్రుల్లు మీటుతూ
                                                                                                      తలవాల్చి పాడుతూ
                                                                                                      ననుముంచు నీ పాట
                                                                                                      నవ్వు వెన్నెల సిగ్గు.
                                                                                                      బాలవే....
                                                                                                      నీలి కనురెప్పలో మేలమాడే సిగ్గు
                                                                                                      అందాల నీ పెదవి అలమిపోయిన సిగ్గు
                                                                                                      దివ్య గాంధర్వాన నవ్యమయ్యే సిగ్గు
                                                                                                      సిగ్గులను మాలగా చేర్తువే నా గళము?
                                                                                                      బాలవే....

మా అత్తగారే మే మిద్దరము కలుసుకోవడానికి కారణభూతురాలైంది. శకుంతల గదిలో ఉందని మా అత్తగారు నన్ను బలవంతాన గదిలోనికి త్రోసింది. ఆమె తల దువ్వుకొని బొట్టు పెట్టుకొంటున్నది. నేను వెనకాలే వెళ్ళి శకుంతల కళ్ళు మూశాను. ఆమె మూర్తినంతా మెరుములా సిగ్గు ప్రసరించి మాయమైనట్టు ఎదుటి నిలువుటద్దములో స్పస్టమైకనబడినది. ఆమె పెదవులలో చిరునవ్వు మధుర లాస్యము లాడినది. అతి స్పష్టమైన పెదవి కదలికతో బావ అన్నది. ఆ పెదవు లతికోమలములు. ఆ పెదవుల వట్రువులు, ఎరుపురంగులు, ఆ పెదవులలోని ఆర్ద్రత, ఆ పెదవులలోని నునుపుగీతలు చూస్తూ ఆ బాలిక తలను నా భుజంమీదికి వంచుకొని వణికిపోతూ, సిగ్గుపడుతూ, ఉప్పొంగుతూ, కరిగిపోతూ ఆ నునులేత వెలుగుల జిలుగు పెదవులను ఒక్కసారి ముద్దు పెట్టుకున్నాను. కళ్ళ నుంచి చేతులనూ తీసినాను.

    ఆమె మోము ఎంత ప్రపుల్లమైపోయినది! ఆమె తల వాల్చుకొని చెన్నపట్టణము నుంచి ఉత్తరం....

    నేను : నువ్వూ ఎప్పుడూ ఉత్తరాలు రాస్తుంటావా?

    ఆమె : నేనూ, అమ్మా ఎప్పుడో చెన్నపట్నం వ్సస్తాము.

    నేను : స్టేషణకు వచ్చి నిన్ను కారుమీద ఇంటికి తీసుకుపోతాను.

    దీర్ఘాలై, నల్లనైన కనువెంట్రుకలతోడి రెప్పల నొకసారి పైకెత్తి క్రిందకు చూచినది.
    
    నేను : ఇలారా. సోఫామీద కూర్చుండి మాట్లాడుకొందాము.

    ఆ సోఫామీద కూర్చున్నాము. మా మౌనమే అనేక విషయాలను మాట్లాడినది, మా మౌనమే పాటలు పాడినది. మా మౌనమే మే మింతలో విడిపోవు దుఃఖాన్ని అశ్రువులుగా రాల్చినది. ఆమె చేతులు రెండూ నా చేతులలో ఉన్నవి.

            
                                                                                                                          6


    నా చేతులు అందమైనవి. నా వ్రేళ్ళు అంత అందమైనవికావు. అవి పోడుగాటివి, బలమైనవి, సూక్ష్మస్పర్సకలవి. నా చేతులు చూచిన ఇద్దరు ముగ్గురు పెద్దలున్నారూ, ఈ అబ్బాయివి డాక్టరు చేతులు అని, బాహ్య రూపంలో కూడా ఎట్టి సూక్ష్మమైన తెడాలనైనా, ఎట్టి అవ్యక్త స్పందనాన్నైనా స్పృశించినంత మాత్ర్రాన తెలుసుకోగలిగిన వ్రేళు! వ్రేళ్ళతో చేయగలిగిన పని ఏలాంటి దృఢమైన దైనా, ఏలాంటి సున్నితమయినదైనా నాకు పండు వొలిచినట్లే.

    ఇంటర్ పూర్తిచేసి డాక్టరు చదువుకు వెళ్ళుదామని సంకల్పము నాకు. మదరాసులో ఒకనాడు నేనూ నాస్నేహితులు కొందరూ కలిసి సిద్దప్ప శిల్పాశ్రమానికి వెళ్ళినాము. సిద్దప్పగారు కొడగుదేశపు ఉత్తమకులీనుడు, ఆయన పాశ్చ్యాత్య దేశాలకుపోయి పాశ్చ్యాత్య శిల్పవిద్య సర్వతోముఖంగా నేర్చుకొని వచ్చినాడు. ఇటలీలో, పారిస్ లో అతనికి బహుమతులు, యోగ్యతాపత్రాలు

అనేకము సంర్పించబడినవి. అతని శిల్పకళా వైదగ్ద్యాన్ని పొగడుతూ పాశ్చ్యాత్య దేశాలలోని వివిధ పత్రికలు ప్రశంసించాయి.

స్వదేశానికి వచ్చిన వెనుక హిందూదేశమంతా సంచారం చేసి మదరాసు నగరంలో శిల్పాశ్రమం ఒకటి స్థాపించినాడు. మహారాజులు, కోటేశ్వరులు, ప్రసిద్దులు, రాజకీయవేత్తలు అనేకులు తమ తమ మూర్తుల్ని పాలరాతిలోనో, లోహంలోనో, రాతిలోనో రూపం పోందించుకొన్నారు. పాశ్చాత్య శిల్పవిధానంలో భరతదేశంలో అతన్ని మించినవారు లేరు. అతని యశము తీగలల్లుకుపోయినది. అతని విగ్రహాలలో పాశ్చాత్యుల కందరాని ఏదో స్పర్శ భారతీయమైనది; ఆశయ స్వరూపమైనది ఉన్నదని రసజ్ఞులు భావించి, ఆయన విధానాన్ని సంభావిస్తారు. ఆయన నిర్మించిన శిల్పాశ్రమము గౌరవము సముపార్జించి, అనేక విద్యార్ధులను వివిధ ప్రాంతాల నుండీ ఆకర్షిస్తూ ఉంటుంది.

    ఆ రోజున మేమంతా ఆయన ఆశ్రమాన్ని దర్సించినాము. సిద్దప్పగారు రచించినవీ, విద్యార్ధులు రచించినవీ ఎన్నో విగ్రహాలట ఆనందంతో సందర్శించినాము. ఆశిల్పదేవాలయంలో నాహృదయం చైతన్యం తప్పింది. ఏదో నిర్వచింపరాని ఆనందము నన్ను ముంచివేసింది. నాలోన నేను పొంగి, నాలోన నేను తాండవించి, నాలోన నేను భువనాలకు ప్రాకిపోయినాను.

    మట్టితో, మైనంతో పాఠాలు నేర్చుకొంటున్న విద్యార్థుల పరిశ్రమ చూచి నా వ్రేళ్ళలో ఏదో వణకు, ఏదో విద్యుల్లత ఉద్భవించింది. నాలోన వివిధ మూర్తులు అస్పష్టమై నాతిదూరాన గోచరించాయి.

    ఒక విద్యార్ధి దగ్గరనుండి మైనంలా తయారుచేసిన మట్టిముద్ద ఇంత తీసికొని ఎదురుగా ఉన్న ఒక విగ్రహ శిరస్సును అనుకరిస్తూ, పది నిమిషాలలో తల నొకదాన్ని రచించినాను. ఇంతలో శిల్పగురువు మాకడకు వచ్చి ఒక నిమేషము నా రచనను పరిశీలించి చూచినారు.

    మీ చేతిలో అపారమైన శిల్పశక్తి గర్భీకృతమై ఉన్నది, ఇదివరకు మీ రీ విద్యను అభ్యసించి ఉన్నారా?

    లేదండీ.

    ఆయన నన్ను కళ్ళల్లో కళ్ళుగా ఒక క్షణము చూచినాడు. నా కేదో ఆనందము! ఏవో కాంతులు నన్ను చొచ్చినవి.

    మీరు మద్రాసులో ఏం చేస్తున్నారు?

    నేను ఇంటరు చదువుతున్నాను ప్రెసిడెన్సీ కాలేజీలో.

    నా అదృష్టము! కళాశాల చదువులో మీకు తీరుబడి ఉన్నప్పుడు డల్లా ఈ ఆశ్రమానికి వస్తే ఈ ఉత్తమ విద్యను మీకు చెలియలుగా అర్పించగలను.

    ఎంతో కృతజ్ఞుణ్ణి.

      ఆనాటినుంచీ ఒక మహాయోగంలో దీక్షాపరుడ నయ్యాను. సిద్దప్ప గురువర్యులు నాలోని పాతాళగంగను పైకి వుప్పొంగించి, ప్రవహింప చేశారు. మను

ష్యుని బాహ్యమూర్తి, లోనిమూర్తి, కంఠాది అవయవాల కండరాలు, నరాలు, రక్తనాళాలు, అంతరింద్రియాలు, ఎముకలగూడు వాని స్వరూపాలు అన్నీ నా గురువులు నాకు వుద్బోధించినారు. జంతువులు, పక్షులు, వృక్షాలు, వాటి మూర్తులు, అంగాంగ సౌందర్యమూ వారు పరిశీలించి ఉపన్యసించారు. సిద్దప్పగారి ప్రతిభాపూర్ణ దేశికత్వములో దినదినాభి వృద్దినంది నావ్రేళ్ళు పరమేష్టి సంకల్ప రూపాలే అయినవి. విశ్వకర్మ దేవుని దివ్యహాసము నాలోన వెన్నెలలు నిండించినది. సూక్ష్మవిన్యాసాలు తీర్చుటలో, స్తూలాంగిక భంగిమలు దిద్దుటలో, భావాలు సర్వమూర్తిలో ప్రతిష్ట చేయుటలో ప్రవీణుడ నయినాను.

   దసరా సెలవలకు మా ఊరు  వెళ్ళువరకు మైనముతోనూ, మట్టితోనే అభ్యాసము చేసినాను. నేను విరచించే మట్టిబొమ్మలకన్న నా ఆత్మేశ్వరీ దివ్య విగ్రహము ఎదురాడలేని సందేశము  నాకు  కనిపించినది.
   దసరాకు  తప్పక రమ్మని ఆ బాలిక  నాకు వుత్తరాలు వ్రాసినది. ఉత్తరాలలో ఇదివరకు బావా అని సంబోధించేది. వివాహం అయిన వెనుక ఏ  సంబోధనము లేకుండా చిత్రంగా వ్రాయడం సాగించినది. బావా అని ఎందుకు వ్రాయకూడదని నా ఉత్తరం పృచ్ఛచేసింది. అందుకు జవాబు రాలేదు. కాని తాను క్రొత్తగా  అవలంబించిన  విదానంతోనే  ఉత్తరాలు  వస్తున్నాయి ఏమిటీ  ఉత్తరాలు! ఆ ఉత్తరాలంటే అంత ఆనంద మెందుకో! ఆ పదకొండేళ్ళ బాలికకు ఉత్తరాలు వ్రాయడం  ఎంత చిత్రంగా అలవడింది!
                                                                                       కొల్లిపర, 18-9-1925
   శ్రావణ మంగళవారం నోములు బాగా జరిగాయి. వరలక్ష్మీ పూజకు అత్తగారు రావడం మా అందరకు ఎంతో సంతోషమైంది. మీరే కొన్నారట చీర!  మనదేశంలో అలాంటి చీరలు ఫాషనుకాలేదు. కానీ ఎంత అందంగా ఉంది!  అంత ఖరీదు ఎందుకు పెట్టారు?  చబుల్ దాసులో కొన్న ఆ కొత్త ఫాషను గొలుసు  మెళ్ళోవేసుకొని అత్తయ్యగార్కి దణ్ణం పెట్టితే ఆమె కళ్ళ నీళ్ళు నా తలపై  వెచ్చగా పడ్డాయి. దసరాకు తప్పక రావాలి. వదినగార్లి రువురూ వస్తారు.
                                                                                             చిత్తగించవలెను
                                                                                                 శకుంతల.
   
                                                                                                         7                   
   
   ఉత్తరాలు మనస్సులో ఎందుకు ఆనంద  తరంగాలు విరిగిపడ జేస్తాయో? కొందరి  స్నేహితులకన్న  వారి  ఉత్తరాలు ఎక్కువ  ఆనందం సమకూరుస్తవి. కొందరు స్నేహితులూ, ఉత్తరాలూ సాయంత్రం బంగారు కాంతిలా, వెన్నెల తుంపురుల్లా, నిలువెల్లా పూలు  వికసించిన  పొగడ  చెట్టులా ఆ ఆనందం ప్రాభృతం ఇస్తారు.
శకుంతల ఉత్తరాలను ఏమని వర్ణించుకోను? పరీక్ష ప్యాసు అయ్యావు అని చెప్పే వార్తాపత్రికను కూడ ఉత్తరాలతో పోల్చడానికి వీలు లేదు. హిమా

లయ పర్వతోత్తుంగ సానుప్రపతద్గతంగా నిర్ఘరీ సందర్శనా నందమును ఆ ఆనందానికి పోల్చవచ్చునని ఊహించుకొంటాను.

    దసరాకు కొల్లిపర వెళ్ళినపుడు, మా ఊరు నాకు వేరై కన్పించింది. కొల్లిపరలో ఎన్నో కొత్త అందాలు చూచాను. ఇప్పుడనుకుంటాను-శకుంతలను ఆ రోజుల్లో అలా ఆరాధించే వాణ్ణే. దానిలో ఉండే నిజతత్వం ఏమిటి అని! ఆ పూజ స్త్రీ పురుష సంబంధమయినదా? నాలో ఉదయిస్తూ ఉన్న పురుషత్వము ఆమెలో ఉదయిస్తూ ఉన్న స్త్రీతత్వాన్ని ఆశించినదా? ఆలాగు స్త్రీని ఆశిండమే అయితే, స్త్రీత్యోదయం నవనవలు సాగుతూ మిసమిసలాడే నా సహాధ్యాయినులు ఎంతమందో వున్నారే! అందమయినవారున్నారే! ప్రౌఢతనాన్ని పరిమళింపచేసే చమత్కారిణు లున్నారే! వారంతా స్త్రీలుగా వాంఛనీయులుగా నాకు ప్రత్యక్షం కాలేదే!
 
కానీ అసలు ప్రేమ మాత్రం స్త్రీ పురుష సంబంధమనే విచిత్ర స్థితిలోంచే ఉద్భవించిందని కొందరు విచిత్ర వాత్స్యాయనుల వాదన. శకుంతలా స్వరూపమే నన్ను దివ్యుణ్ణి చేసిది. అది స్త్రీ పురుష ప్రేమైతేనేమి ఇంకో విచిత్ర తత్త్వమైతేనేమి? నాకు సర్వమూ ఆ పదనొకండేళ్ళ బాలికే!

    మా అత్తగారూ, శకుంతలా కలసి దసరా బొమ్మలు ఒక గదిలో అలంకరించారు. శకుంతలకు నేనూ ఒక పెట్టెడు బొమ్మలు పట్టుకొని వచ్చాను. విక్టోరియా మందిరములో అమ్మే కొండపల్లి బొమ్మలు, ఇత్తడి బొమ్మలు, వెండి బొమ్మలు, మైసూరు గంధం బొమ్మలు, తిరువాన్కూరు దంతంబొమ్మలు రకరకాలవి ఆ పెట్టెనిండా నిండివున్నవి. నూరురూపయలై తేనేమి? కలలు ఊటలూరే బొమ్మలు అవి.

    నాకు జపాను బొమ్మలంటే అసహ్యం. కీ ఇస్తే పరుగులెత్తేవి, తల ఆడించేది, గంతులు వేసేవి, పల్టీలు కొట్టేవి, కప్పలు, పక్షులు, సర్కస్ మనుష్యులు, గుఱ్ఱాలమీదవాళ్ళు, మోటారుబళ్ళు, సైకిళ్ళు, అమ్మా అనేవి- తక్కువరకం సంతోషం కలుగజేసేవి, హీనమైనవి అని నాకు మా గురువు గారైన సిద్దప్పగారు ఉద్భోధించారు. ఆ వాదన బాగా నా బుఱ్ఱకెక్కింది. వారన్నారు గదా,

    పాశ్చ్యాత్య దేశాల్లో వారు ఏదో విధంగా కళ అలుముకు ఉంటేనే గాలి బొమ్మలను గౌరవించరు. డ్రెస్డ్ న్ చీనా బొమ్మలు, చీనా జేడ్ బొమ్మలు, ఇటలీ వెండి బంగారు బొమ్మలు, కర్రబొమ్మలు అన్నీ కళాకాంతులు వేదజల్లెవి. పెద్ద పెద్దలు తమ మందిరాలు అలంకరించడానికి కొన్ని వందల పౌనులు ఇచ్చి కొంటారు. దేశ ప్రదర్సనశాలల్లో కూడా అలంకరించిన వేలకొలది కాసులు ఖరీదుచేసే బొమ్మ లున్నవి. ఓడల బొమ్మలు, చరిత్రలో ప్రసిద్ది కెక్కిన ఓడల నమూనాలు, బ్రిటీషు ప్రదర్శన శాలలో నూరులున్నవి అని.

    ఈ ముక్కలు నా తలకు బాగా పట్టినవి. శకుంతల గదిలో పుదుచ్చేరి బొమ్మలు, తిరుపతి చందనం బొమ్మలు, జపాను, జర్మను, ఇంగ్లీషు బొమ్మలు ఉన్నవి. ఆ పుదుచ్చేరి బొమ్మలంటే నాకు ఉద్భవించిన రోత రోహిణికార్తే గాడ్పులా

విసిరింది. శకుంతల చిరునవ్వుతో, పూజా నయనాలతో సగర్వంగా నాకా బొమ్మలు చూపించింది.

    ఎలా వున్నాయి?

    సరే, సరే. నేను పెటేడు బొమ్మలు నీకు బహుమతి పట్టుక వచ్చాను. అవన్నీ మనం అలంకరిద్దాం.

    నేను సర్దిన ఈ బొమ్మలు బాగాలేవూ?'

     చాల బాగున్నాయి! కాని ఈ పుదుచ్చేరి బొమ్మల రకాలు అందరి ఇళ్ళల్లో ఉంటూనే ఉన్నాయి; మనింట్లోనూ అవే పెడితే గొప్పకాదు. నేనో విచిత్రమైన బొమ్మవేసి పట్టుకొచ్చాను. అది మధ్య పెట్టి, ఈ పుదుచ్చేరి బొమ్మలు కొన్ని దాచేసి అద్భుతంగా అలంకరించాలి బొమ్మలు.

    నే నలంకరించిన వానిలా బాగా లేకపోతే?

    శకూ! యిలా చూడు, నా కళ్ళల్లోకి చూడు. కోపం వచ్చిందీ? ఓ అమ్మాయిగారు ఒకరికి ఓ ఉత్తరంలో నేను శిష్యురాలనై బొమ్మలు తయారుచేయడం నేర్చుకుంటా అని వ్రాశారు. శిష్యురాలు, గురువుగారికి బొమ్మ అలంకరించడం బాగా వచ్చునని అనుకోవద్దూ?

    శాకుంతల పకపక నవ్వింది. గురువుగారికి నమస్కారం.

    సత్వర శిల్పకళా ప్రాప్తిరస్తు. నా నవ్వు శకుంతల దివ్య హాసంలో లీనమైపోయింది.

    శకుంతలా, నేనూ బొమ్మ లలంకరించడంలో ఉల్లాసప్రవాహంలో తెలిపోయాము. మా అత్తగారు రాజ్యలక్ష్మమ్మగారు వచ్చి తొంగిచూసింది.

    శకూ! బావకు తలంటిపోయాలి, చెల్లాయి హారతిస్తుందట. ఈ బొమ్మల గదిలో వున్నారంటే ఈపాటికి పరుగెత్తుకుని ఇక్కడికి రాక పోయిందా!

    తప్పటడుగులు వేసుకుంటూ బంగారు పనస తొనల హేమంగారు నేను చెన్నపట్నంనుంచి వచ్చానుగదా అని. బావ వత్తాలు బావ వత్తాలు అని చక్కావచ్చింది. ఎత్తుకుంటే మళ్ళీ సిగ్గుపడింది.

    ఆ రోజుల్లో నన్ను బావా అని పిలిచిన హేమకుసుమ నేడు నన్ను ఆనవాలే పట్టలేకపోయింది. నేను బావగా హేమకుసుమను చూచి నది ఆఖరుసారి ఆమెకు తొమ్మిదేళ్ళున్నప్పుడు. నా రూపు రేఖా విలాసాలు పూర్తిగా మారిపోయినవి. నాలో ఒక కొత్తదనం వచ్చినది. నా ముఖం లోని గుండ్రని నున్నని రేఖలుపోయి తీక్షణమైన స్పష్టరేఖలు ప్రత్యక్ష మైనవి. తొమ్మిదేళ్ళకు తర్వాత అడయారులో ఆమె నన్ను మరల చూచినది. నన్ను వెనక చూచినట్టామెకేమీ స్ఫురణలేదు. అక్కా బావల గాథ ఒక పురాణ గాథలా ఆమెకు స్పృహ ఉంది ఉండాలి.

                                                                                                                      8

    చెన్నపట్టణంలో మా మావగారి భవనంలో అక్కడక్కడ గోడల అలంకరించి వున్న శకుంతలా శ్రీనాథమూర్తుల ఛాయాచిత్రాలు అనేకం ఉన్నాయి.

అందులోని శ్రీనాథమూర్తికి, ఈనాటి త్యాగతికీ యెంతో తేడా వుంది. నన్ను నేను ఆనవాలు పట్టుకోలేకపోయినాను.

    సముద్రపు ఒడ్డుకు నేనూ, కల్పమూర్తీ సీతాసుందరి అనే హేమ స్నేహితురాలు ఒకతే, నలుగురూ హేమ కారు నడుపుతూండగా వ్యాహ్యాళికి వెళ్ళినాము. నున్నటి మెరీనా రోడ్డుమీద హేమ ఆక్సిలేటరుమీద గట్టిగా నొక్కింది. మా ముందు కార్లు నిమిసములో వెనుకపడ్డవి. రోడ్డు పక్క నిలబడ్డ కార్లు అన్నీ కలిసి ఒక మాలికై పోయాయి. అంత వేగంతో వెళ్తూన్న కారునుచక్కగా వేగంతగ్గించి, మైలాపూరు వీధుల వెంట తీసుకొనిపోయి, అడయారు నదిదాటి అడయారు కెల్లెటు సముద్రతీరం దగ్గర ఆపింది హేమకుసుమ.వెనుక సీటులో కూచునిఉన్న నేనూ, కల్పమూర్తీ దిగి ముందు కూచునిఉన్న సీతాసుందరికిన్నీ, హేమకుసుమకున్నూ తలుపులుతీసినాము.
 
నీలాలైన ఆ సముద్ర కెరటాలు మమ్మాహ్వానించినవి. సముద్రం హోరులో భై రవరాగాలాపన పరమాద్భుతమై నాకు వినిపించింది. మేఘాలు లేని నీలాకాశం, కొంచెం పడమటకు వాలి ఉన్న సప్తమినాటి చంద్రుడు, వెన్నెలకిరనాలల్లో భై రవరాగమూర్తికి ప్రణయదేవినైన దేవక్రియా రాగిణీదేవి తన కిన్నెరీకంఠమును సవరించుకొని శ్రుతి కల్పినది. నేనా బంగారపు ఇసుకమీద తక్కిన మువ్వురివెనకా శకుంతలా స్మృత్యారాధన శాంతిలో నిశ్చలుడనై కూర్చుంటిని.

    ఆ విచిత్ర బాలిక హేమ నీకు ప్రజ్ఞాపరిమితి అని ఆ బౌద్దాచార్యులు నాకు సెలవిచ్చినారే? అతడు తన దివ్య శక్తితో ఈ బాలికను పార చూచినాడు. ఈ బాలిక కొరకేనా నన్నా పవిత్ర త్రివిష్టవ ప్రదేశాలనుండి పంపించినది? ఆ కైలాసపర్వతముల దివ్యభూతముల నుండి ఈమె కొరకేనా నేను వచ్చినాను? చదువుకొన్నది, కళారహస్యాలర్ధము చేసికొంటుంన్నది. అత్యంత సూక్ష్మగ్రహణ శక్తి గలది. ప్రతిభావంతురాలు. ఐనా యీమెలో ఏమిటో లోటు. ఇంకనూ చిన్నబిడ్డా? ఈ బాలిక పరమాద్భుత బాహ్య సౌందర్యమూ, ఆ సౌందర్యంలో వదిగింపబడిన ఒక తేజస్సూ అన్నింటికన్నా నా దివ్య దేవీమూర్తికి సరిపోవు పోలికలూ న న్నీమెకు దాసుణ్ణి చేసినవి. నా హృదయ మామె తెలిసికొనలేదు. ఆమెకు నా పైని ఉన్న భావము నాకు సువ్యక్తము. హేమకుసుమదేవీ! నీలో తుపాను చెలరేగబోతున్నది.

    చంద్రుడు పశ్చిమానికి దిగుతున్నాడు. వాళ్ళు మువ్వురూ కిలకిల లాడుతున్నారు. హేమ త్యాగతీ! రావయ్యా, అంతా బడాయే అన్నది.

          
                                                                                                             * * *
               
శకుంతల ఫోటోలను చూచి నా హృదయంలోని ఆమె మూర్తిని తలుచుకొని ఒక శిల్పం వెనుక రచించాను. మాగురువుగారు సెబాసన్నారు. కాని అసలు శకుంతలను ఈ బొమ్మను ఎలా పోల్చగలం? ఆ బొమ్మను ఆ దసరా బొమ్మలమధ్య అలంకరించాను. ఆ బొమ్మ చుట్టూ నేను మదరాసు నుంచి తీసుకువచ్చినవి, శకుంతల బొమ్మల్లోని మంచివి అమరించినాను. ఉదయమే శకుంతల

హేమను తీసుకువచ్చింది. తన బొమ్మను చూచుకొని ఆశ్చర్యపడిపోయింది. ఆమె చిన్న హృదయంలో ఎలాంటి భావాలు ఉదయించాయో! ఆమె తేజస్సుతో వెలుగుతూ ఒక దివ్య పూజామూర్తిలా తన చెల్లెలి చెయ్యి పట్టుకొని నిలిచిపోయినది. పండుగైన వెనుక చెన్నపట్టణం వచ్చాను.

    రోజూ పదిగంటలకు కళాశాల తెరుస్తారు. కార్లమీద వచ్చేవారున్నారు. ఆడపిల్లలూ, మొగపిల్లలూ, విక్టోరియా హాష్టలులోనూ ట్రిప్లికేసులోనూ ఉండేవారంతా నడిచేవస్తారు. ఎక్కువభాగం సైకిళ్ళమీద వస్తారు. విద్యార్ధినులు కొందరు రిక్షాలమీద కూడ వస్తూంటారు. గంటకొట్టి, పని ప్రారంభించే లోపుగా వరండాలో తిరుగుతూంటాము. క్లాసుల్లోకే వెళ్ళి కూచుంటూ ఉంటాము. బాలికలు మాత్రం వారి విశ్రాంతి మందిరంలో వుంటారు.

    మా విద్యార్దులు ధరించుకునే దుస్తులు మాత్రం ఎంత వివిదత్వాన్నైనా ప్రదర్శిస్తూంటాయి. ఇంగ్లీషు డిన్నరు పార్టీకి వెళ్ళే మొదటి తరగతి ఆంగ్లో సాక్సన్ దొరలారా తయారై వస్తాడొకడు. ఫస్లుక్లాసైన సాంబారయ్యరులా తయారై వస్తాడొకడు. గాంధీ సేవాసంఘంలోకి వెళ్ళే అహింసావాదిలాగ ఖద్దరులాల్చీ, ధోవతి, టోపీ పెట్టుకొని ఒకడు, వారం రోజులై మడతలుపోయి దుప్పటిగుడ్డల్లా ఒదులైన డ్రాయర్స్ తొడుక్కొని రైల్వేదొరల కోట్లంటి కోట్లు ధరించి ఈరెండింటి! గూడా అపశ్రుతి అయ్యే టై తగిలించుకొని ఒకడు, పూర్వాచారానికి విరుద్దంగా వుండడాని కిష్టంలేక ఉంచుకున్న సందెడు కురులనూ హేట్ల క్రింద దాచడానికి వీల్లేదు గాబట్టి, మా సంస్కృతం అయ్యరు మాష్టారుల బ్రహ్మాండమైన తలపాగావంటివి చుట్టుకు వచ్చే విద్యార్ధులు కొందరు.


    ఆక్స్ ఫర్డులోనూ, హార్వర్డులోనూ ఇంకా ఇతర ఇంగ్లీషు, అమెరికన్ కళాశాలల్లో విద్యార్ధులందరికీ ఒకటే రకం డ్రస్సు వుంటుందని విన్నాము. కాని హిందూదేశంలో ఏ యిద్దరు విద్యార్ధులకూ ఓకే రకమైన దుస్తులు మాత్రం ఉండవు. దుస్తుల విషయంలో మాకున్న భిన్నత్వం మరే జాతిలో ఎప్పుడూ, ఎక్కడా ఉండదని ఘంటాపథంగా చెప్పవ్సచ్చు.

    కాలేజీకి వచ్చే విద్యార్దినులంతా ఎంతో అందంగా అల్సంకరించుకొని వస్తారు. వారు కట్టే చీరల్లో, ధరించే రవికల్లో, అలంకరించుకొనే భూషణాలలో, తలమీద మనోజ్ఞంగా తురుముకొనే పువ్వులలో ఎంతో వివిదత్వమున్నా, అద్భుతమైన సుందరత్వము తొణికిసలాడుతూ ఉంటుంది. వారి అలంకారాల్లో ఒక విధమైన అమెరికా ఉంటుంది.

    మాలో అన్ని బాషలవారూ వున్నారు. తెలుగువారు, అరవవారు, కన్నడులు, మలయాళులు, సిరియన్ క్రిష్టియన్లు, సిరోయన్ యూదులు, యూరేషియన్లు, తంజావూరి మహారాష్ట్రులు, పారశీకులు, మహమ్మదీయులు, హిందువులు, భౌద్దులు, ఆర్యసమాజిస్టులు, వైష్ణవులు, హైందవ క్రిష్టియనులు, ఒకరనగా నేమిటి, మా కాలేజీ ఒక ప్రపంచమే! భాషలను బట్టి, మతాలననుసరించి, జిల్లాలను లెక్కించుకొని స్నేహాలు జట్టులు ఏర్పడుతూంటాయి. సాధారణంగా తెలుగువాళ్ళు ఒకటౌతారు. అందులో జిల్లాలు తేడాలు వస్తుంటాయి కూడా.

    ఇది మాకూ, ఆచార్యులవారలకూ ఉండే సంబంధము సారె తంతి అల్లికవంటిదే. వా రెవరో మే మెరుగము. మే మేవర మో వా రెరుగరు. క్లాసులోకి వెళ్ళి కూచోగానే ఆచార్యులవారు చక్కగా వస్తారు. అటెండెన్సు తీసుకుంటారు. అక్కడ నుంచి ఆయన ఉపన్యాసం ప్రారంభిస్తారు. అతి జాగ్రతైన విద్యార్దులు అది నోట్సు తీసుకుంటారు. మధ్యరకంవారు శ్రద్దగా వింటారు. ముడోరకంవారు వింటూ వుంటారు, వినకుండానూ ఉంటుంటారు. నాలుగో రకంవారు నావల్స్ ఏదో చదువుకొంటూంటారు. ఐదవ రకంవారు నిద్రపోతారు, ఆచార్యులవారు కని పెట్టకుండాను ! ఇంతకన్న మాకూ, ఆచార్యుల వారికీ ఉండే సంభంధం ఏమి ఉంది?

                                                                                                                         9

    నేను లెక్కలూ, పదార్థ విజ్ఞానశాస్త్రమూ, రసాయనశాస్త్రమూ పాఠ్యములుగా ఏరుకున్నాను. క్రొత్తలో ప్రెసిడెన్సీ కళాశాల అంటే భయమే వేసింది. కాని, విద్యార్ధుల వివిధత్వమే ఆ భయాన్ని చాలా తీసివేసింది. నేను జాగ్రత్తగా వేసుకున్న సూటును చూచి ఎవరేమనుకుంటున్నారో అనే ఆలోచన, నేను వట్టి కొల్లిపర మనిషిని గ్రహించారేమో ననే భయము. మా విద్యాశాలనుంచే వచ్చిన ఇంకో విద్యార్డీ, నేనూ ఒకరి కొకరు సహాయమా అన్నట్టుగా ఒక నిముషమైనా వదలకుండా క్లాసులోనే కూచోవడం, క్లాసు వదలగానే ఇంకో క్లాసుకు వెళ్ళడం. ఈరకంగా ఉండే వాళ్ళము. అక్కడినుంచి కొంచెంగా బరిమీదపడ్డాను. మదరాసంటే భయం వదిలింది, ప్రెసిడెన్సీ కళాశాల పాతపడిపోయింది. మూడు మాసాల పరీక్షలో కొంచెం బాగానే మార్కులు పై కాయితలమీదికి వచ్చేటట్టు చూసాను. కాని అరవ వాళ్ళతో పోటీ చేయటమంటే మాత్రం హడలే. తెలుగువాళ్ళలో నేను మొదటివాడ నై, అరవవాళ్ళలో ఇంగ్లీషులో పదిమందికి వెనుక ఉన్నాను. సాంబారులో ఉందేమో ఆ మహత్తు! ఆవకాయ పదోప్లేసు తప్ప ఇంకే మివ్వగలదు?

నా స్నేహితుని పేరు విశ్వనాధం. అరిపిరాలవారు. మంచివాడు,నా కతడు అర్జునుడు, నే నాతనికి కృష్ణుణ్ణ్ని. ఇద్దరం లేకుండా చెన్నపట్నంలో తిరగనేలేదు. ఆనర్సు ఐదవ తరగతి చదువుతూన్న మా చుట్టాలలో ఒకాయన నన్ను తన అండకు జేరదీసుకున్నాడు. డబ్బుగల చుట్టం, పలుకుబడిగల స్నేహితుడూ ఎవరికయినా వాంఛనీయులేకదా! వీరిద్దరే గాకుండా నాకింకా నలుగురైదుగురు దగ్గరగా చేరిన స్నేహితులేర్పడ్డారు. మదరాసు చదువూ, జీవితమూ చక్కగా సాగింది.

    సిద్దప్పగారి ఆశ్రమానికి ఎలాగో అలాగు తీరిక చేసుకొని వెడుతూనే ఉన్నా. సతీర్దుడైన మా చుట్టమే నన్ను సిద్దప్పగారి ఆశ్రమానికి తీసుకువెళ్ళినాడు.' ఒరే! మూర్తీ ! కళలో మునిగిపోయావంటే చదువు సముద్రంలో కలుస్తుంది. అవతల బొమ్మలేస్తున్నావు. ఒక పక్క టెన్నీసు దంచేస్తున్నావు.

ఇంక మూడోపక్క చదువు పిండికొట్టేస్తా నంటున్నావు. విరాటరాజు కుమారుడవు మాత్రం కావద్దు నాయనా!'

    ' నువ్వు నన్ను ఈ చదువు మహారథం ఎక్కించి బృహన్నల మాత్రం కావద్దని మనవి.'

    ' ఓరి పిట్టపిడుగా! వేసావూ బ్రహ్మాస్త్రం?'

    నేను : టేన్నిసంటే జ్ఞాపకం వచ్చింది. మామయ్యా, నేను 'బి' కోర్టులో ఒకర్ని సవాలు చేయాలని వుంది. వీలయితే ' ఎ' కోర్టులోనే ఎవరి నయినా సవాలు చెయ్యాలని వుంది. మా జిల్లాలో హైస్కూలు టోర్నమెంట్స్ లో నేను ఫస్టు ప్రయిజు కొట్టింది నీకు తెలిసే ఉంటుంది. నా ఆట చూస్తున్నావు. నాకేమైనా ఛాన్సు ఉందంటావా?

    అచ్యుతరావు : ఏ కోర్టునేనా ఛాలెంజిచేసే వీళ్ళు నీకున్నాయి. నే ఆట చూసాను. కాని, కొద్దిరోజుల్లో యం. యు. సి., యం. సి. సి. టోర్న మెంట్లున్నాయి. ఆ పందేలలో మంచి దిట్టమయిన ఆటగాళ్ళు ఆడుతారు, అవి చూసి కొన్ని మెలుకువలు నువ్వు నేర్చుకోవలసి వుంటుంది. 'బి' కోర్టులో కొంచెం మధ్యరకంవాణ్ణి సవాల్ చెయ్యి, కాని రాక్షసుడిలా మాత్రం పరిశ్రమ చెయ్యాలి.
                                 
    నాకు టెన్నిస్ ఆట వచ్చునని తీర్ధమిత్రడికీ, కల్పమూర్తికీ, హేమకుసుమకూ ఏమి తెలుస్తుంది? మదరాసు రాజధాని కళాశాలకు జరిగే పందేములలో నే నొక సంవత్సరం మొదటిపందెం నెగ్గాననిన్నీ, ఆ యేడే యం. యు. సి. పందెములలో గూడ ప్రథమ వీరుణ్ణయ్యాననీ వీళ్ళకు తెలియదు.

    ఒకరోజున హేమకుసుమ టెన్నిసుకు తన స్నేహితురాలయిన సోఫీని పిలిచింది. ఆమె రాలేదు, నిశాపతి దేశాంతర్గతు డై నప్పటినుంచి టెన్నిస్ ఆడుటకు ఇతర స్నేహితులు చాలామంది వస్తూండేవారు. అతడున్నప్పుడూ వచ్చేవారనుకోండి. ఇప్పుడు సర్వసాధారణముగా వస్తున్నారు.

    ఈ రోజున ఆటకు వీరు ముగ్గురే ఉన్నారు. హేమకుసుమ చాలా బతిమాలింది. నన్ను 'ఒక్కసారి బాటు చేతితో పట్టుకొని ఆడవయ్యా' అని. నేను టెన్నిస్ ఆట మానెయ్యడానికి అనేక కారణాలున్నాయి. నా చరిత్ర వికసించినకొలదీ అవీ ద్యోతక మౌతవి, తీర్ధమిత్రుని కన్నులలోని అపహాస్యపు కాంతులు చూసినా నాకు ఆడాలనే హుషారు కలగలేదు. నేను రెండు చిరునవ్వులు విసిరివేసి ఊరుకున్నాను. ఇంతలో హేమకుసుమ నా దగ్గరకు సుడిగాలిలా పరుగెత్తుకొని వచ్చింది. ఆమెతో సుగంధాలునూ పొర్లుకొని వచ్చినవి. నా యెదుట నుంచుని, నా రెండు చేతులూ పట్టుకున్నది. భోరున వానకురిసి మేఘములు విడివడిపోయిన నిర్మలయామినీ వదనంతో ముత్యాలయిన తారకలులూ ఆమె కన్నులు నా కన్నులలోనికీ ఉజ్వలిస్తూ చూచినవి. ఆ కన్నులలో ఒక అద్భుతమైన ప్రశ్న ఉన్నది. ఒక్క నిమేషం నేను సర్వ ప్రపంచం మరచిపోయినాను. ఆ కన్నులలో హిమాలయ శిఖరాలపై ఆకాశనీలాలు కనబడినవి.

ఆ దీ ప్తనీలాలలో మహాదూర పథాలను దర్శించినాను. ఆ దూరపథాలలో ఏదో దివ్య గాంధర్వము విన్నాను. ఇంతలో ఆ విశ్వము నాకు దూరమైనది.నవ్వే ఆమె కన్నులే! ప్రజ్వలించే ఆమె కన్నులే! అప్పుడామే మనోహరమైన నాసిక కనబడినది. ఫాలసముద్రపు ఆకులాంటి ఆమె ఫాలము కనబడినది. సర్వకాలమూ కలలు కంటూ,పాటలు పాడుకొంటూ, నృత్య మనోహరాలౌతూ, ఉషాబాలిక హృదయపు పొంగులౌతూ ఆమె పెదవులు కనబడినవి.

    ఈ విచిత్ర సంఘతనంతా ఒక నిమేషంలో జరిగింది. నా కది ఒక దివ్యానందతత్వ మైనది.

    ' సరే, హేమా! నీ కోసం ఆడుతా. పద కోర్టులోకి. నన్ను చూచి మాత్రం నవ్వకండి. చిన్నతనంలో ఎప్పుడో ఆడాను.'

    తీర్ధమిత్రుడు : మేమంతా వున్నాము గాదయ్యా నీకు సహాయముచేయడానికి.'

    ' మీ సహాయం వల్ల నాకు చిన్నతనంలో చేతనైన ఆ కొద్ది ఆటా తగలడుతుందేమో. పిల్చి తద్దినం కొనుక్కోకుండా మాత్రం చూసుకోండి' అని అంటూ నేను టెన్నిస్ కోర్టులోనికి వెళ్లాను.

    ఆట ప్రారంభించాము. నేనూ కల్పమూర్తీ ఓ పక్షాన, తీర్ధమిత్రుడూ హేమకుసుమా ఒక వైపున. నాలో కొంచెం భయం ఉదయించింది. నా చేతికి బ్యాటే కొత్త అనిపించింది. కల్పమూర్తిని కుడివైపున ఉండమన్నాను. తీర్ధమిత్రుడు ఆట ప్రారంభించాడు. కల్పమూర్తి నాకేమీ ఆట రాదన్న ఉద్దేశంతో కోర్టంతా తానే విజృంభించి విశ్వరూపం తాల్చాడు. అతని తప్పి జారివచ్చిన బంతుల్ని నేను తీయలేకపోయాను.' మీకు ఆట వస్తోందండో' అని తీర్థమిత్రుడు కేకవేశాడు. హేమకుసుమ కళ్ళల్లో ఏదో బాధ కనిపించింది. నేనూ మా వై పున కుడివై పు కోర్టుకు వెళ్ళినప్పుడు హేమకుసుమ నాకు వీలుగా పాయింట్లు తీసేట్టుగా సర్వీసు చేసింది. ఆ పాయింట్లు కొత్తగా నేర్చుకొనే వాడైనా తీయగలడు. ఐనా మేమే ఓడిపోయినాము. కల్పమూర్తి సర్వీసు గేము ఒక్కటే మాకు. తక్కిన రెండు గేములూ వారివి. ఇక నేను సర్వీసు చేయవలసి వచ్చింది. వారి కోర్టులో కుడివైపున నా కెదురుగా మూలగా తీర్థమిత్రుడు వానలులేని వర్షాకాలపు ఆకాశంలోని అపహాస్యంలా మొగము పెట్టుకొని నిల్చున్నాడు ఆ బ్యాటు అక్కడ ఉంచి, కల్పమూర్తి డజను బ్యాటుల్లోంచి నిశితమైన కృపాణంలోని కాంతుల్లాంటి తీగలు కలిగి ఉన్న దానిని, భీమసేనుని గదలాంటి సమున్నతమైనదానిని, మంచి పొంకాలున్న పారశీకాశ్వము యొక్క వేగం గలదాన్ని బ్యాటును తీసుకొన్నాను. కోర్తులోనికి వచ్చినాను. సాధారణంగా ఏ గొప్ప ఆటగాడూ సెట్టుకాకుండా బ్యాటు మార్చడు. నా పని మరింత అపహాస్యానికి పాలై ఉంటుంది. తీర్థమిత్రుని కండ్లలో నా కివన్నీ కనిపించనేలేదు.

సర్వీసు చేశాను. బంతి తీర్థమిత్రునికి కనబడలేదు. 'ఫాల్ట్' అనడానికి కూడా వీలులేదు. తీర్థమిత్రుడు వెల్ల మొగము వేసినాడు. కోర్టు మార్చినాను.

రెక్కలు చాచుకొని విచిత్రగతిలోవచ్చి భూమినివాలే హంసలా నా బంతి హేమకుసుమకు వెళ్ళింది. ఆమె ఆ బంతిని నాకే తిరిగి పంపించింది. ఆమె పంపిన సంగతే ఎరుగును గాని తిరిగి నా వల్ల పంపబడి అతని కుడికాలి జోడుయొక్క ముందుభాగాన్ని ముక్కలు చేసిన తీవ్ర సంఘాతము తీర్థమిత్రునికి తెలియదు.

    ఎవ్వరీతడు! ఈ ఆట యెక్కడిది! అని ఆశ్చర్యపడుతున్నట్లు కల్పమూర్తి తాను ప్రేక్షకుడై పోయినాడు. వారలకు మళ్ళీ గేము లేకుండా అరగంటలో సెట్టయిపోయినది. తమ్మలమిన ఆశ్చర్య విభ్రమాలలో మినిగిపోతూ చైతన్య రహితుల్లా వచ్చి కుర్చీమీద చతికిలబడ్డారు, కల్పమూర్తీ తీర్థమిత్రుడూ హేమకుసుమదేవీ. నేను కోర్టులోనే బ్యాటు పుచ్చుకొని సైంధవ వధనాటి అర్జునుడులా తల పైకెత్తి ఆకాశం చూస్తూ త్రివిష్ట పధాన్ని ధ్యానిస్తూ నిలుచుండిపోయినాను.
    
                                                                                                            o o o
                   
    అలాంటి టెన్నిస్ ఆట నాది. ఆ ఆటలో పేరు సంపాదిస్తూ మా రాజధాని కళాశాలకు ఎన్నో, కప్పులు, వెండిడాళ్ళు బహుమతులు తెచ్చాను ఆ రోజుల్లో మా హృదయాల్లో ఏమి భావాలు ఉద్భవిస్తాయి? చదువు, పెద్దవాళ్ళని గూర్చి అపవాదులు మాట్లాడుకోవటం, స్నేహితులతో తిరగటం, సినిమాలకు వెళ్ళడం, సాయంకాలం బీచివాహ్యాళీ- ఇవీ మా పనులు. పెద్దకవులూ విమర్శకులూ కాళిదాసుని, షేక్స్ పియిరును చీల్చి చండాడే వాళ్ళం.

    నేను : ఒరే! షేక్స్ పియరు ముందర కాళిదాసు దివిటీ ముందర దీపం వంటి వాడురా.

    అచ్యుతరావు : నక్కపుట్టి నాలుగువారాలు కాలేదు. తుఫాను గిపాను దానికేం తెలుసురా. నువ్వు కాళిదాసును చదివావూ?

    నేను : ఆ! వీరేశలింగంగారి తర్జుమాలు చదివాగా?

    అచ్యు: ఏడిశావుగా!

    విశ్వ : ఒరే శ్రీనాథం! నీకా అభిప్రాయం ఎలా వచ్చిందో కాని,షా ముందరా. ఇబ్సెను ముందురా, వీళ్ళిద్దరూ పనికిరారురా.

    ఈలా వెళ్ళేవి, మా వాదనలు. అంతే! లోతుల్లేవు. పిచ్చిభావాలు, గట్టిగా పట్టవస్తే ఒక్క విషయం తెలియదు.

                                                                                                                    10

    ఈ రోజులలో మదరాసు పట్టణము ఎరుగాని వాళ్ళెవరున్నారు! ఆంధ్రదేశంలోని రెండు కోట్లన్నర జనాభాలోను ఏడాదికి ఏ ఏభై వేల మందో మదరాసు చూస్తూనే వుంటారు. వ్యాజ్యాలకు హైకోర్టు అప్పీలు ఉంటుంది గదా! వైద్యానికి చెన్నపట్నం పెద్దచెయ్యి. విశాఖపట్నంలో ఒక్క పాశ్చాత్య వైద్యవిధానమే వుందిగాని చెన్నపట్నంలో గొప్ప ఆయుర్వేద వైద్యులూ, మళయాళ వైద్యులూ, యూనానీ వైద్యులూ, దేవీ సిద్దభస్మమూ, ఒకటేమిటీ, అన్ని

వైద్యాలూ అక్కడ వున్నవి. రామేశ్వరాది యాత్రలకు, తిరుపతి యాత్రకు, చెన్నపట్నం వచ్చి తీరాలి గదా!

    ఈ రోజులలో సినిమాలు కూడా వచ్చాయి. ముఖ్యపట్న మే కాకుండా తెలుగు అరవ టాకీలకు హాలీవుడ్ కూడాను చెన్నపట్నం. కంపెనీ మేనేజర్లు, మెంబర్లు, డై రెక్టర్లు, అర్టు డై రెక్టర్లు, మ్యూజిక్ డై రెక్టర్లు, యాక్టర్లు, తారలు, తారలతో, వుండే పక్షీంద్రాది హంగుజనం! వీరేమిటి, వారేమిటి, అదో మహాప్రపంచం. అదీ కాకుండా రేడియో ఒకటి వచ్చింది. ఇవి ఇల్లా వుంటోంటే పులిమీద పుట్ర అన్నట్లు బై రాగి టిక్కెట్లు వచ్చి పడ్డాయి. జేబులో పదిరూపాయలు వున్నవారు ఎలాగో చెన్నపట్నం వచ్చి పడాల్సిందే. కిస్టమస్ లో జరిగే కాన్ఫరెన్సులకు లెఖ్కేమిటి? ఆంధ్రదేశంలో ఏ కాన్ఫరెన్సు ఎక్కడ నెగ్గకపోయినా చెన్నపట్నంలో నెగ్గి తీరుతుంది. సంగీతసభలు, ప్రదర్శనాలు, స్వదేశవస్తు ప్రదర్శనాలూ! ఇవన్నీ యిలా వుంచి సర్వకాల సర్వావస్థలయందు వర్తకం వుండితీరింది గదా!

    చదువుల కోసం తక్కువ వస్తున్నారా చెన్నపట్నం! చెన్నపట్నం చదువు చెన్నపట్నం చదువే! మెడికల్ కాలేజీలు, ఇంజనీరిగ్ కాలేజి, లా కాలేజీ లున్నాయి. రాయలసీమవారంతా చెన్నపట్నం రావలసిందేగదా.

    కాని నేను చదువుకొనే రోజులకున్నూ ఇప్పటికిన్నీ చెన్నపట్నం చాలా మారిపోయింది. 1915లో పిచ్చి పిచ్చి హోటళ్ళు వుండేవి చెన్నపట్నం నిండాను. సత్యరాజాచార్యులవారు దేశయాత్రకు వెళ్ళినప్పుడు చూచిన దుడ్డు పుచ్చుకుని భోజనం వేయబడును అనే రకం హోటళ్ళు, ఎండిపోయిన పచ్చిపప్పు, చెండాలపు వాసనకొట్టే నెయ్యి, ఏవో కూరముక్కలు నాలుగు ఉడకబెట్టి ఇంత ఉప్పూ, కారం చల్లిన శాకాలూ, నిన్నటి పప్పు ఇవ్వాళ వేసిన సంబారూ, వీటన్నిటికన్న సిరోమాణిక్యంలా కన్నడ తైరు! అందుకనే, విక్టోరియా హాష్టల్లో సీట్లకోసం పొట్టుపొట్టయి పోయే వారట.

    కాఫీ హోటళ్ళు లో ఇడ్డేన్లమీద నెయ్యి వేసేవారు కాదట. కావలిస్తే పుష్కరం రోజుల్నించి పకోడీలు వేయిస్తున్న నువ్వులనూనె (లేకపోతే ఆముదం అనుకోండి) అలాంటిది ఇడ్దేన్ మీద వేసుకునేవారు. కాఫీ తప్పకుండా జిడ్డు ఆముదం. ఆ పరమ దౌర్భాగ్యపు కాఫీని ఎత్తి తాగాలని దేబ్బలాడేవారు అయ్యరు. అక్కణ్ణించి తెలుగు విద్యార్థులు గ్రేట్ వార్డిక్లేరు చేశారట. అన్నంలో వేసిన నెయ్యిని వాసనచూట్టం, అయ్యర్ పళ్ళు మైలు దూరంలో పడేటట్లు పెఠేల్మని కొట్టడం, మంచి నెయ్యి వెయ్యకపోతే ఇడ్డెన్లు వాడి ముఖాన వేసి రుద్దడం, శుభ్రంగా కడుపునిండేటట్టు కాఫీ కరచీ త్రాగడం. అయ్యరు ఆ అన్నాడా, ఆ కాఫీకప్పు అతని నోట్లోవేసి కడుపు లోపలికి దూర్చడమే.
 
దెబ్బలాటకు తెలుగు కుర్రాళ్ళకి క్రాఫులు బాగా పనికివచ్చేవిట. అరవ వాళ్ళని హతమార్చడానికి కుడుములు బాగా దొరికేవట. కన్నడ తైరు వేశాడా, ఆ తైరూ అన్నం యావత్తు అయ్యర్ని తలంటేవారుట. అప్పణ్ణించిటండీ చెన్నపట్నంలో నిజమైనమార్పులు రావడం ప్రారంభించాయి. వెన్న

నెయ్యీ, పాలు తోడెట్టిన పెరుగూ, పోపులు పెట్టిన కూరగాయలూ, చక్కని పిండివంటలున్నూ. ఎక్కడో గుహలోని హోటళ్ళు మాయమైపోయి, వసతికీ భోజనానికీ చక్కని ఏర్పాట్లున్న రాజభవనాలు రావడం సాగించాయి. పొద్దున్నా సాయంత్రం ఒక వందరకాల కారం, తీపిసరకులు. ఈ రోజులలో పెద్ద పెద్ద కాఫీహోటళ్ళలో దొరుకుతాయి.

    ఇవన్నీ మా అచ్యుతరావు మాకు ఉద్భోధించి చెప్పి కనక చెన్నపట్నం మనదిరా అన్నాడు మీసం దువ్వుతూ!

     రేపు ఆంధ్రరాష్ట్రం వస్తే చెన్నపట్టణం మన తెలుగు రాజ్యానికి ముఖ్యపట్నం అన్నమాట, అంతేనా?

     నిశ్చయంగా.

     అయితే, ఉన్న అరవాళ్ళందర్నీ ఏంచేద్దాము?

     కూయమ్ మహానదీగర్భవీచికాసమర్పణమస్తు.

     తథాస్తు.

    అస లీ సంభాషణంతా రావడానికి కారణం శకుంతల దగ్గర నుంచి నాకు వచ్చిన ఉత్తరం నేను చదువుకొంటోంటే ఒక అరవ మహా పెద్ద మనిషి కో స్టూడెంట్ తొంగిచూసి క్షమించండి, సార్! అని ఇంగ్లీషులో అన్నాడు. నా క్షమార్పణ వాడి చెంపమీద పెళ్ళున తగిలింది. తరువాత ఏం జరుగుతుందో ఏమోనని భయపడి మా అచ్యుతరావు మామయ్యతో చెప్పుకున్నాను.

     ఏమీ పరవాలేదురా. మన అరవ సోదరులకి ధైర్యం అనే వస్తువు రామేశ్వరం దగ్గరే నిలబడిపోయింది. వాడు అధికార్లతో ఫిర్యాదు చేస్తే ఎక్కడ నువ్వు సాగదీసి తంతావో అని భయం. యిలా కొంచెం కొంచెం మధ్య మధ్య మనం విజ్రుంభిస్తేగాని మన ప్రావిస్సు మనకు రావొద్దూ!

    ఈ చెన్నపట్నములో మహాభయంకరమైన దారిద్ర్యం. ఈ మహా పట్టణారణ్యంలో ఎక్కడో ఒకమూల ఏ ప్యాకేజీ పెట్టి బాపతు బతుకులో, వీధి తుడవగా మూల పోగుచేసిన తుక్కో నిప్పుచేసుకొని, పొద్దుణ్ణించీ సాయంత్రందాకా రిక్షాలు లాగి, కూలికి బరువుబండ్లు లాగి, అణా డబ్బులు సంపాదించుకొని అర్ధణా బియ్యం గంజి కాచుకొని, తక్కిన అర్ధణా డబ్బులతో జీవిత పరమావధి నిర్వర్తించుకొనే అతికరుణమైన దారిద్ర్యము కోటి చేతులు జాపి తిరుగుతోంది.

    ఎప్పుడైనా సరదాపుట్టి తోటి విద్యార్ధులతో బజార్ల వెంబడి తిరిగినప్పుడు నాకు కళ్ళంబట రహస్యంగా సుడిగుండాలు తిరిగేటట్టు చేసే కుష్టు రోగుల బాధలు, వికలాంగులైన బిచ్చగాళ్ళ కష్టాలూ, గుండె తరుక్కుపోతూ ఉండేవి.

    సాధారణంగా సినిమాలలోనూ నవలలు మొదలైనవి చదువుకోవడంలోనూ మనస్సు సంతోషంతో గంతులు వేసేది. కథలోని కథానాయకుని హృదయంలా నా హృదయమున్నూ సముద్రతీరంలో రాత్రి ఒంటిగా చీకట్లలో ఉన్నప్పుడు విచిత్ర గాంధర్యాలు ఆలాపించేది.

    నేను ఇంటరు సీనియరు చదువుకునేటప్పుడు మా శకుంతల వ్యక్తురాలయిందని మా అమ్మగారికి ఉత్తరం వచ్చింది. ఆ వార్త నాకు సిగ్గు కలిగించింది.

ఎవరికైనా ఈ వార్త తెలిస్తే నన్ను హేళన చేస్తారేమోనన్న భయం. శకుంతల నాకు క్రొత్తదై తోచింది. ఆమె నా ఆలోచనాపధానికి వచ్చినప్పుడు నా కామె దూరమైపోయిందని భావించాను. ఇప్పుడామె నాకు స్నేహితురాలు కాదేమోనని భయం వేసింది. ఇప్పుడామె సిగ్గు పడుతున్న భార్య అయినది.

    ఆమె నాకు ఉత్తరములు వ్రాయుట మానింది. అది నా కెంతో భాదా, అశాంతి కలిగించింది. ఈ యేటి పండుగలకు వెళ్ళినప్పుడు శకుంతల నన్ను చూచి తుర్రున పారిపోయింది. శకుంతల ఏదని నే నడిగితే అందరూ నన్ను చూచి నవ్వేవారు. నా స్నేహితురాలైన శకుంతలకూ, నాకూ ఏదో విచిత్రమైన అడ్డము వచ్చి వాలింది. తెరచాటున నీడగామాత్ర మామెను నేను దర్శించేవాణ్ని. ఎందుకు ఈ విచిత్రమైన అవమానం నాకని నేను కలతపడిపోయాను.

                                                                                                                  11

    నాకునూ హేమకుసుమకునూ ఈ తీరెన్నాళ్ళు? ఓ తెరచాటున మూర్తీ! తేరా చీల్చబడదా? ఒక్క మహాపవిత్రమైన ప్రేమకు అతి నీరసుణ్ణయి, తన నీరసత్వానికి లోకాన్ని తిట్టుకునే తిట్టుకునే పాపినై, ఆ నీరసత్వపు కసిని కాశీపట్నపు గల్లిలలో బురదలో తొక్కి పంకిలం చేసుకున్న మూఢుణ్ని నేను. అయినా అత్యంతానందంతో ఈ లోకాన్ని మహానటనంగా చూడగలుగుతూ ఉన్నాను. చూడలేకా ఉన్నాను.

    శకుంతలను మరచిపోలేని నేను, నా శకుంతలను తన చెల్లెలైన హేమకుసుమలో దివ్యలీలా వినోదినిగా ఆ పవిత్ర ముహూర్తంలో చూచినప్పణ్ణుంచీ సాక్షిగాను ఉండలేను, జీవిత సమరోన్ముఖుడనూ కాలేను. కాని ఏదో మహాశాంతి. ఏదో దివ్యశీతలము, ఏదో పరమాద్భుత నన్ను పొదివికొని నా చేతులనుపట్టి ముందుకు తీసుకొని పోతున్నది.


                                                                                                              * * *

    నేను బి.ఏ., జూనియర్ చదువు పూర్తిచేసి వేసవికాలంలో కొల్లిపర వచ్చినప్పుడు నాకు పందొమ్మిదవ ఏట, మా శకుంతలకు పదునాలుగవ ఏటను ఇర్వురకు పునస్సంధాన మహోత్సవం జరిగింది. ఈ ఏడాదిలో శకుంతల అందం సెలయేటి ఊటలా విజృంభించింది. విశాలమైన ఆమె కళ్ళు అరమూతలు వహించినవి. ఆ కళ్ళలో నిర్వచింపలేని మాధుర్యాలు నర్తించింనవి. ఆమె మోమున స్నిగ్దత పరీమళపూరితమైనది. మంచుతో కూడుకొనిన ఫాల్గుణ మాసపు ప్రత్యూషారుణకాంతిలా అతి ఆర్ద్రత తాల్చినది.

ఆ మహోత్సవంలోని ఆమె సిగ్గు చెట్టును పండగా కోసిన జహంగీరు మామిడిపండు రుచిని మించినది. ఆమెకు ఎక్కడలేని నెమ్మది అలవడినది. ఎచ్చటనూలేని ఫామేదాతనం హత్తుకుపోయినది. ఇదివరకామే మాటలో ఎప్పుడూ కని విని ఎరుగని ఒక ప్రసన్నత, ఒక ఉత్కంఠత, ఒక గంభీరత, ఒక మధురత తీగెలల్లుకొనిపోయినట్లయినది. ఆ మూడు రోజులు మే మిర్వురము సర్వలోకాలను మరచిపోయినాము.

    మనుష్యుని జన్మలో అంతటి ఆనందము ఉండునా! ఆనంద కల్లోలముయొక్క పరమశిఖరము ఆ రోజులు. మాయిద్దరి జీవితముల ఆ ఆనందమే కరుడుకట్టి, శిల్పరూపమై శాశ్వతముగా సృష్టి ఉన్నంత వరకూ ఉండిపోయెడిదేమో!

    ఎలాగు పరీక్షలకు చదివానో, ఎలాగు కాలేజీరోజులు గడిపానో, అదంతా ఇప్పటికీ నాకు స్పష్టంగా తోచని ఒక్క మహాస్వప్నం. సెలవిచ్చేటప్పటికి కొల్లిపరలో హాజరు. సెలవలిట్టే పోయేవి. కొల్లిపరలో ఉంటే ప్రతిరోజూ ఇరవై నాలుగు గంటలూ మతిలేని ఒక మహామధురత, అనంతమై తీవ్రమైన మానసిక మత్తత.

    శకుంతలను ఒక్క నిమిషము విడిచి ఉండలేకపోయితిని. ఆమె నా కౌగిలిలో వదిగి వుండని క్షణములే కొలదిగా ఉండేవి. మాకు నిద్రలు లేవు. ఆహారాలు లేవు. అనిమిషత్వమూ ఆనందామృత భోజనము. దసరా సెలవలై చెన్నపట్నం వెళ్ళవలసివచ్చినప్పుడు మాకు ప్రాణములే లేవు. శకుంతలా నేనూ కళ్ళనీళ్ళ ప్రవాహాలైనాము. మహాకవులు రచించిన విరహము మాకు పేలవమై తోచినది!

    చెన్నపట్నమునుండి నేనూ, కొల్లిపరనుంచి శకుంతలా రోజు రోజూ ఉత్తరాలే! ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా వుత్తరంరాసి ఉత్తరం పోస్టులో పడగానే మళ్ళీ వుత్తరం ప్రారంభించి, చదువులుపోయి, నిద్రలుపోయి, సర్వమూ ఒకే బాధయైపోయినది. ఆనాటి నా విచిత్రస్థితి ఒక దివ్యోన్మాదమై ఉండునని అనుకొంటాను.

    నేను కృష్టమస్ కు వెళ్ళినప్పుడు మా ఆనందం ఇంద్రియ పరిమూఢత నుంచి దివ్యానందస్వరూపమైన చేతనత్వస్థితికి వచ్చింది. పాటలు పాడుకొన్నాం. నాట్యాలాడినాము. గిలిగింతలు పెట్టుకొని సెలవులు వారనవ్వుతూ, నవ్వలేక వుక్కిరిబిక్కిరవుతూ, అల్లరులలో దొర్లి పోయినాము. రాత్రిళ్ళు చలిలో, వెన్నెలలో పై డాబామీద కూర్చొని చక్కని కాశ్మీరు శాలువలో వదిగి గాఢమైన తియ్యటి కథలు చెప్పుకున్నాం. పెకాడుకున్నాము. చదరంగ మాడుకున్నాం. కాలువగట్టున మా మామిడితోటలోకి వెళ్లి ఒకరోజల్లా గుజ్జనగూడు లాడుకొన్నాము. ప్రేమికుల చుంబనములో వుండే మహామంత్ర మేమిటో, గంగోత్రిలో గంగానదీ ప్రథమ జలబిందువులు స్రవించి గానీ, వసంతకాలములో మల్లెపొదలో మొట్ట మొదటి మొగ్గ వుదయించి వికసించడంగానీ, దాహబాధాత్మకమైన శాలి భూమిపై తొలకరిజడి అవతరించడం గానీ యవ్వన ప్రణయపూరిత చుంబనానికి పోల్చలేము.

    దివ్యసౌందర్యపూరితమైన శకుంతల మోములో అప్పుడప్పుడే వికసించినా గులాబీరేకుల పాటలవర్ణ మున్నది. వికసించే నందనవన పారిజాతపుష్పాల తేనియలను స్రవింపజేసుకొని సురభిళమై, సురుచిరమై, సాద్భుతమయిన ఆ యధరచుంబున దానము ఊహాతీతమయినది, భావాతీతమయినది, ఆనందాతీతమయినది.

కర్కశమయి, గాఢకాంక్షాపూరితమయిన నా దృఢపరిష్వంగంలో అందాలకు నిధి, ఆశలకు పరమావధి శకుంతలాబాల బిగిగా వదిగిపోయి, అక్కడనే వుద్భవించినట్లయిపోయినది. ఆమె ప్రతిఅణువూ నా ప్రతిఅణువులో లీనమయిపోయి, ప్రథమప్రణయానికి థివ్యసాఫల్యము చేకూర్చింది.

    ఇంక శకుంతలా నేనూ విడివడి ఉండలేము. విడివడి వుంటే మా ప్రాణాలే విడివడిపోతవి. ఇద్దరం ప్రయాణమయినాము. చెన్నపట్నంలో ఆ మూడునేల్లూ మూడు నిమిషాలై పోయినవి. చదువు పుస్తకాలలోనే ఆగిపోయినది. స్నేహమనే మాట మరచిపోయినాను. సిద్దప్పగారి ఆశ్రమము కలల వెనకాలే దాగిపోయినది. బీచికి వెళ్ళినాము. సినిమాలు చూసినాము. శకుంతలకు రోజుకు ఒక కన్విందర్పించుకొన్నాను. చెల్లారామ్ కొట్టులో సగం చీరలూ, రవికెలూ మా యింట్లోనే వున్నవి.

                                                                                                             12
            

      చెన్నపట్నంలో ఒక రోజున నేనూ శకుంతలా భోజనము చేసి తాంబూలాలు వేసుకుంటూ మా పడక గది ముందరి హాలులో కూర్చున్నాము.

    శకుంతల నన్ను చూచి, ఆమె విశాలనయనాలు వాలుగన్నులు కాగా ఆమె దీర్ఘవినీలపక్షాల వెంట జారే నవ్వుతో చూపులు నాపై ప్రసరించి,

    'ఈ ఇంగ్లీషు సినిమాలలో ప్రేమని చెప్పుతారే ఆ ప్రేమ ఏమిటండీ ?'

    'నీకు నా మీద ఉండే భావం!'

    'నేను ఒప్పుకోను! నాకు మీ మీద ఉండే ప్రేమ ఏలాంటి దంటారు?'

    'ఇంకా మరీ ప్రేమ!'

    'మీకు నామీద ఉన్న ప్రేమ?'

    'మరీ మరీ ప్రేమంటాను!'

    'ఈ రెండింటికీ తేడా ఏమిటి?'
    
    'ఇంకా ప్రేమకు, మరీ ప్రేమకు తేడా ఏమిటని నీకు తోస్తుంది శకూ ?'

    'బాగా ఉన్న పిండివంట ఇంకా వడ్డించు అనే మోస్తరు ప్రేమ నా ప్రేమని మీ భావం!'

    'సరిగ్గా గ్రహించావు, నా రాణి!'

    'అయితే మరీ ప్రేమంటే మీ కిష్టమున్న వస్తువును మరి కాస్త వడ్డించుకు తినడమన్న మాటా?'

    'అసలు అర్ధం చెప్పుకున్నావు!'

    'మీరెంత చెప్పండి, ఇంగ్లీషు సినిమాలలో చెప్పే ప్రేమ అసలు ప్రేమ కాదు.'

    'ఏమి? ఎందుకు కాదు పంతులుగారు?'
 
    'బ్లాక్ పైరేటు అనే బొమ్మకు వెళ్ళామా మనం మొన్న? అందులో ఆ రాజుగారి కూతురుకి నాయకుని మీద మొదట కోపం, తర్వాత ఇష్టం! అదేం ప్రేమండీ ?'

    'ఎలా ఉండాలంటావు?'

    'అతన్ని చూడగానే ఆమెకు, ఆమెను చూడగానే అతనికి సర్వ ప్రపంచమూ మాయమైపోవాలి. ఆమెకోసం అతడూ, అతనికోసం ఆమె జన్మించాలి, జీవించాలి.'

    నేను ఆశ్చర్యంతో మౌనం వహించి ఆమెవంక తేరిపార చూచాను.

    'ఒక స్త్రీ కోసం పురుషుడూ, ఒక పురుషుని కోసం స్త్రీ అనాది నుంచీ జన్మల్లో ప్రయాణాలు సాగిస్తూ వుంటారు. ఇద్దరూ ఒకళ్ళకోసం ఒకళ్ళు జీవిస్తారు. వాళ్ళిద్దరూ ప్రతిజన్మలోనూ కలుస్తూ ఉంటారు. ఆ కలుసుకున్నప్పుడు వాళ్లిద్దరే. ఇంక ఎవ్వరూ వాళ్లకు వుండరు. ప్రపంచం మాయమైపోతుంది.

    'వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి వీల్లేకుండా ఒకరు అమెరికాలో, ఒకరు ఇండియాలో పుడితే? లేక ఇద్దరూ వేరు వేరు కులాలలో పుడితే?'

    'ప్రేమదేవత ఎప్పుడూ అలా చెయ్యదు. అమెరికాలో ఆమె పుట్టితే ఇతడు ఎక్కడ పుట్టినా అక్కడక్కు పోతాడు. వేరు వేరు కులాల్లో పుట్టితే, వాళ్ళ ప్రేమ కులాలను మించిపోతుంది!'

    'రామీ, చండీదాసుల ప్రేమలానా?'

    'అవును. వాళ్ళ ప్రేమ తుచ్ఛం కాదు. వారు పెళ్ళిచేసుకొని మనోవాక్కాయకర్మల వారు ఒక్కరిలో ఒకరు లీనమైపోతారు. పెళ్ళిచేసుకునే వీలు లేకపోతే బ్రహ్మచర్యం అవలంబిస్తారు.'

    'లోకంలో అన్ని ప్రేమలు అలా ఉన్నాయంటావా?'

    శకుంతల మోము దివ్యహాసంతో వెలిగిపోయింది. కుర్చీనుంచి లేచి నా దగ్గరకు వచ్చి నా పాదాలకడ కూర్చుంది.

    లేచి నడిచి వస్తూవుంటే వెన్నెల కిరణాలన్నీ ముద్దకట్టి ప్రవహించి వచ్చినట్లుగా కనబడింది. ఎంత మహోత్తమ ప్రేమ ఈమెది! ఈ పదునాలుగేళ్ళ పడుచు, సౌందర్య పరమావధి అయిన అందాలబాల నన్ను ప్రేమిస్తున్నదన్న భావం నాకు భయమూ కలిగించింది, అమృతత్వమూ ఇచ్చింది.

    ఆమెని నా హృదయానికదుముకున్నాను. నాకు మైమరపు కలిగింది! ఆమె సువాసనలహరి! ఆమె సర్వరసాధిదేవి! ఆమె ఆనంద విశ్వమూర్తి! ఆమె సౌకుమార్యం నా మొరకుతనంలో నలిగిపోయినది.

    ' దేవీ! ఈ దేహము శాశ్వతము కాదుగదా ? దేహానందం కోసం కదా భార్యాభర్తల సమాగమం! దేహానందం తుచ్ఛం కాదా ?'

    ' అలా అంటారేమిటి ?' ఆమె మాటలు నా చెవిలో బుల్ బుల్ పాటలూ స్వనించాయి. ఆమె తన పెదవులతో నా చెవిని ముద్దుగొని, ' దేహానందం, మనస్సు ఆనందానికి పునాది కాదండీ? మనస్సూ దేహమూ ఆత్మకు పునాది. మొన్న నాతో విద్యుచ్ఛక్తిని గూర్చి, మీరన్నీ పచ్చె లేదా ఏమిటి? తీగైనా వుండాలి, గాలైనా ఉండాలి, మరో వస్తువయినా ఉండాలి ఆశక్తి ప్రవహించడానికని మీరనలేదూ?' అన్నది తల ఊపాను.

    ' విద్యుచ్ఛక్తి ఆత్మ అనుకోండి, మదేహాలు అందుకు ఉపాధికాదూ? మీరు దొంగలు, నాకు పాఠంచెప్పే విధానం కాబోలు ఇది.'

    ఆ మర్నాడు సాయంకాలం బీచికి పోయాము. యిద్దరం కెరటాలు చూస్తూ కూచున్నాము. సర్వప్రపంచము మమ్మల్నిద్దరినీ తేరిపార చూస్తూ ఉంది. అందరికళ్ళూ ముఖ్యంగా నా శకుంతలమీదే!

    ' నా ' శకుంతల అంటే నేను కొన్నానని కాదు. నా కృష్ణ పరమాత్మ అంటే ఎంతో, నా శకుంతల అన్నా అంతే!'

     వెన్నెల, కెరటాలమీద వాలి కెరటాలకు జీవం పోస్తున్నది.

    ' ఆ వెన్నెల, కెరటాలమీద ప్రేమలా వాలుతున్నది కాదండీ!'

    ' శకూ! కెరటాలలో కుడా ప్రేమికులున్నారు సుమా?'

    ' అదే కాబోలు ఒక పెద్దకెరటం వెనకాల ఒక చిన్న కెరటం వస్తూ ఉంటుంది.'

    పెద్ద కెరటం భార్య, చిన్న కెరటం భర్త .'

    ' అబ్బా! అన్నీ తప్పులు చెప్పి, నాచేత వాగించాలని మీ ప్రయత్నం, నేను మీకన్న పెద్ద దాన్నా?'

    ' భర్త వెంట భార్య వస్తుందన్నా?'

    ' ఇద్దరూ కలిసివస్తారు. మధ్య మధ్య ఒక పెద్ద కెరటం వస్తూ వుంటుంది. అది భార్యాభర్తలిద్దరూ ఏకమై రావటం.'

    ఎలాగో బి. ఏ. పరీక్షలు పూర్తిచేసుకొని, సామానూ, గీమానూ అంతా సర్దుకొని, మా అమ్మా, శకుంతలా, నేనూ కొల్లిపర వచ్చాము. మేఘ సందేశమైన వెనుక, శాపముతీరి ప్రియురాలిని కలుసుకొన్న యక్షుడు, ప్రియురాలితో విహరించే అతిమహానందం కూడా కుంటుపడే దివ్యానందంతో నేనూ శకుంతలా ఆ వేసవికాలంలో కొల్లిపరలో గడిపాము.

    నిజమైన ప్రవరుణ్ణి కలుసుకొన్న వరూధినీయోష పొందు అద్భుతానందం, నన్ను కూడివున్న శకుంతలాదేవి పరమానందము ఎదుట, జీవకళా కాంతిరహితమై పోవలసినదే.'

    శకుంతల రోజుకు మూడుసారులు స్నానం చేసేది. నీళ్ళలో పన్నీరు కలుపుకొనేది. ఒంటికి అత్తరులు అలముకొనేది. రోజుకు నాలుగుసార్లు చీరలు మార్చేది. ఉదయం ఉప్మా, ఇడ్లీ, పెసరట్టు, దోసె ఏదో చేసేది. కాఫీ అమృతమే. చెన్నపట్నంలో అరవపురంద్రుల సావాసం చేసి నేర్చుకుంది. ఆ గురువులను మించిపోయే పాకంతో తానూ తయారుచేసేది. సాయంకాలం మళ్ళీకాఫీ, రకరకాల పిండివంటలు చేసేది. రోజూ మా మామగారు ఫలహారానికి రావాలి. మా హేమం అస్తమానమూ మా యింటిలో ఫలహారాలను రుచి చూడవచ్చేది. నా శకుంతల అత్తగారికి సేవ,మడిగట్టుకోడం రాత్రిళ్ళు వంటా, మా ఇల్లంతా కలకలలాడిపోయింది.

13

    ఒకనాడు మా పురోహితుణ్ణి నాకూ నా శకుంతలకూ సరిపోయిన మంచి ముహూర్తం పెట్టుమన్నాను. ఆ ముహూర్తము రాత్రప్పుడు ఉండాలన్నాను. ' ఎందుకయ్యా శ్రీనాథమూర్తీ ' అని ఆయన నవ్వుతూ నన్నడిగినాడు.

    ' అది వేరే సంగతి. మీరు ముహూర్తం పెట్టండి. అన్ని రకాల బాగుండేది' అన్నాను. ఆయన వై శాఖసుద్ద తదియనాడు రాత్రి 8-30 గంటలకు ముహూర్తం పెట్టినాడు. అ ఉదయమే శకుంతలను తలంటించు కొమ్మన్నాను. నేనూ తలంటింపించుకొన్నాను.

చెన్నపట్టణం నుంచి ఆరోజు ఉదయానికి తెనాలికి నా పేర వేలకొలది గులాబిపూలు వచ్చే ఏర్పాట్లు చేశాను. చుట్టుప్రక్కల గ్రామాలనుంచి బుట్టలు బుట్టలు మల్లెమొగ్గలు వచ్చేటట్టు చూచినాను. అనేక రకాలైన పళ్ళు చెన్నపట్నం నుంచి వచ్చినవి. చబుల్ దాసునుండి నగల ప్యాకెట్టు వచ్చినది. నూట యాభై రూపాయల బెంగుళూరిచీర జిలుగులు తళుకులున్న వికుసుంబాపువ్వు వంన్నెకలది కొన్నాను. దానిమ్మ పూవురంగు పట్టురవిక కుట్టించాను.

    మా పురోహితుడు పెట్టిన ముహూర్తం పదినిమిషా లుందనగా శకుంతలను ఆ చీర పసుపు పెట్టి కట్టుకొమ్మన్నాను. ఆ రవిక తొడుక్కోమన్నాను. మా గదిలో తూర్పువైపు గోడదగ్గిర కమలపుపట్టు వేశాను. ఆ పీట పైసరిగ పూలపట్టు రూమాలు పరచినాను, దానిపై వేయి గులాబిపూవులు చల్లినాను. ఆ పీటపై శకుంతలను కూర్చోమన్నాను.

    ' ఇదేమిటండీ?'

    ' శకూ, నేను చెప్పినట్లు చెయ్యి , దీనిలో ఒక పరమార్థముంది. అది తర్వాత చెప్తా!'

    శకుంతల వెరగుపడిన చిరునవ్వుతో ఆ పీటలమీద కూర్చున్నది. ఆమె మోము కోలనైనది. స్నిగ్ధమై, మెత్తనై, కమల కుట్మలాలైనవి ఆమె చెక్కిళ్ళు. వెడదలై, సోగలై, నల్లని పొడుగాటి రెప్పలు కరిగిన వామె కన్నులు. సమంగా వచ్చి చిట్టచివర సెలయేటి వంపు తిరిగిన దామె ముక్కు. పల్చనై, వెడల్పు తక్కువైన కనకాంబర పూపుటము లామె ముక్కు పుటములు. కుడిముక్కు పుటాన ఏడురవ్వల బేసరి ఉంది. పై పెదవి పై భాగము ఒత్తుగా వికసించైన కాశ్మీర కుసుమ క్షేత్రంలా ఉంది. మధ్య నొక్క చిన్న పాలయేరులా ఉంది. ఉదయించే సూర్యుని పై అంచు వంపుకు, అందాలు దిద్దే పై పెదవి రేఖకు రెండు వంపుటంచులు. ఆ పైపెదవి సూర్యకిరణాలు ప్రసరించిన పాలసముద్రపు వీచిక. వీచికల తాకుడుచే మధింపబడి, తేరిన వంపు వెన్నె రేఖపై అరుణకిరణాలు ప్రసరించిన క్రింద పెదవి, కొంచం విడివడిన ఆ రెండు పెదవుల మధ్య, తఱిమెన పట్టిన ఆణిముత్యాల వరుస ఆమె పళ్ళు. వసంతకాలపు మధ్యాహ్నాలమాల ఆమె పళ్ళు వరుస. పాలసంద్రంలోని సహస్రకమలముకుళ మామె చిబుకము.

ఆకసపు లోయలోని స్వర్ణది ఆమె కంఠము. ఆమె బుజాలు ఉదయ సాయంకాలాలు. లోకంలోని మధురాలు సేకరించి, కరిగిన బంగారులో ఒలికించి, పోతపోసి, మొనలుతేల్చి, ఆ మొనలపై స్విన్నత నందిన సరస్వతీ కంఠహారసోణ రత్నాలు పొదిగినవి ఆమె ముగ్ధవక్షోజాలు. ప్రాణముపోసి కొన్న బంగారువర్ణం ఆమె దేహకాంతి, శిల్పుల తపఃఫలం ఆమె రూపం.

    ఆమెను పూజించాను.ఆమెకు షోడశోపచారాలు అర్పించాను. మల్లె పూలు వర్షము కురిపించాను. గులాబిపూలు ధారలు కట్టాను. మాలతీ జాజీ మాధవీ పుష్పాలు దోసిళ్ళర్పించాను. ఆణిముత్యాలు గుప్పిట సేసలు చల్లాను. నగల అర్పణలిచ్చాను. ఆమె ఎదుట మోకరిల్లాను. మృదులాలై, సౌందర్య శ్రీలు చెన్నారే, ఆమె చిన్నారి పాదాలు నా హృదయాన్ని చేర్చుకొని ఫాలానా అదుముకొని ప్రతివేలు, పాదము యావత్తూ తనివోవ ముద్దు పెట్టుకొన్నాను.

    ఆమెను సువ్వున పూలమాలలా యెత్తి నా హృదయాని కద్దుకొని, తీసుకొనిపోయి, మా తల్పం మీద పరుండబెట్టాను. ఆమె వివశయై ఈ లోకంలో లేదు. ఆమె మోము దివ్య కాంతులు ప్రసరిస్తున్నవి. ' శకుంతలా! శకుంతలా!' అని భయముతో, డగ్గుత్తికతో పిలిచాను. ఆమె చైతన్య రహితయై మారు పలకలేదు. ' శకుంతలా! శాకుంతలా!' అని అస్పష్టంగా వణికిపోతూ, నా కన్నుల నీరు జల జల వర్షిస్తుండగా పిలిచాను.

    ఆమె చిరునవ్వు నవ్వుతూ కన్నులు తెరిచింది. బంగారు వెన్నెల కిరణాలైన ఆమె చేతులు రెండూ నావైపు చాచి ' నేను మీ పూజకు తగుదునా ప్రాణేశ్వరా!' అన్నది.

    ' నా సర్వస్వము, నా తపస్సు, నా జన్మాశ్రయం, నీ పాదాల మ్రోలకాదా శకూ!'

    ' ఈ కల వినండి! మీరు పూజించగానే, నేనో గంధర్వ బాలికనై ఒక విమానంలో ఎగిరి వెడుతున్నానట. ' నా ప్రాణేశ్వరుడేడీ' అని దిక్కులు చూస్తూ వణికిపోతూ విమానంమీద కూర్చున్నాను. ఆ విమానం తిన్నగా చంద్రలోకం పోయిందట. అక్కడ ఓ కలవపూవుపై నామూర్తే పవళించి నిదురపోతూన్నదట. నేను వెళ్ళగానే ఆమూర్తి పెదవులు కదిపి ' నేను పూర్ణరూపాన్ని. నువ్వు నాలోసగం. పూర్తిగా మన తపఃఫలాన్ని నువ్వెలా అనుభవిస్తావు?' అన్నదట! భయపడి ఆమె పాదాలమీద వాలానట. ఇంతట్లో మీరు ' శకుంతలా!' అని దూరాన్నుంచి నన్ను పిలిచినారు, విని కూడా లేవలేకపోయాను. మళ్ళీ మీ పిలుపు వినబడింది. లేచాను. ఇంతలో నాకు మెలకువ వచ్చింది. నాకు చాల భయం వేసిందండీ.!'

' శకుంతలా! నువ్వు లేవకు, తలగడపై చెయ్యి ఉపధానం చేసుకొని పడుకో! నీ మీద నా పాట నీకు అంకితం ఇవ్వాలి, నీవు రాణివి, నేను నీ కవిని.

' ఓ దేవీ! నీ దివ్యజన్మకే నాడు సర్వస్వమ్ము ఇత్తునో! నా జన్మ,నా బ్రతుకు, నా కలలు ఏ జీవితాద్భుత రహస్య మ్మొ ప్రత్యక్ష మొనరింపవచ్చేనో ప్రజ్వలిత మొనరింపవచ్చేనో! ఆ దివ్య సిద్ధియే నీవునై ఆ దివ్య మోక్షమే నీవునై నీ పరమ పాదాబ్జముల నేను! నీ పవిత్ర హృదయాన నేను.'

   అని పాడి, మంచముకడ  మోకరించి, పరుపు  అంచుననున్న  ఆమె పాదాలపై  నా మోము నంచినాను. ఆమె లేచి  నా చేతులు  రెండును పట్టి  తనకడకు  లాగుకొని, నీరు తిరుగు కన్నులు  వాన వెలిసిన చంద్రకాంతిలా  మెరిసిపోవ, నా మోము చూస్తూ ' మీరు  నా దేవుళ్ళు, నా సర్వస్వమూ మీలోని  భాగం,  మిమ్ము  మీరు పూజించుకొంటారా? మనం  ఇద్దరం కలిసి పూర్ణ రూపం  అవుతాము. ఆ పూర్ణపురుషునిలోని దివ్యత్వం మీరు, నేను మానవత్వాన్ని, నేను మిమ్ము పూజించాలి. అదే  కాదూ, సీతా, సావిత్రీ  మొదలైన  వాళ్ళు  చెసిందీ?  అదే నిజం!' అన్నది.        

శకూ! పురుషుడు ఇంతవరకు మనుష్యుడు. ప్రపంచంలో కృషి చేసేవాడతను. అతని జాతికి అమృతత్వం ఇచ్చి, అతనికి వెనకాల బలమైన స్త్రీ అతనిలోని దివ్యత్వం.

    ఈ రోజున  నాలో  ఏదో  పవిత్రత  వచ్చింది, మీకూ, నాకూ అర్థం  కాని  ఏదో మహాభావం  నాలో చేరినట్లు నా కల  నాకు భావం  కలిగిస్తున్నది
                                                                                                                     14
మా అత్తగారైన వెంకటరావమ్మగారు శలాకలా పొట్టిగా, బంగారు బొమ్మలాంటి మనిషి. ఎంత ఈడువచ్చినా చిన్న బిడ్డలా ఉండే కాయ శరీరం కల ఆరోగ్యవంతురాలు. చారెడేసి కళ్ళూ, ఉంగరాలు తిరిగిన జుట్టూను. ఎనిమిది కాన్పులు వచ్చినా ఇద్దరు బిడ్డలు మాత్రమే బ్రతికి ఉన్నారు. అయినా ఆమెలోని యవ్వనపు బిగి ఏమాత్రమూ సడలలేదు. తల్లీ, పెద్ద కొమరిత కలిసి వస్తూఉంటే అప్ప చెల్లెళ్ళలా ఉండే వాళ్ళు. ఆమె వెర్రిబాగుల మనిషి. ఆమెకు లోకంలోని వాళ్ళందరూ మంచివాళ్ళే. అనవసర సంబంధాలు కలుగచేసికొనేదికాదు. కాని తన దృష్టి పథంలోకి వచ్చిన వాళ్ళనందరినీ నిష్కలష్మమైన ఆ పేక్షతో చూచేది. భర్త అంటే ఎంతో గౌరవం, భక్తి.

    లోకంలో సర్వసాధారణంగా రెండవ వివాహం భార్యలకు, భర్తలు దాసానుదాసులుగా ఉంటారు. తన భర్త అలా ఉండటానికి వీలులేకుండా చేసింది మా అత్తగారు. వినాయకరావుగారికీ, రాజ్యలక్ష్మమ్మగారికీ మధ్య ఇరవై సంవత్సరాలు తేడా ఉన్నది. అందులో మా అత్తగారు బంగారు తీగలాంటి మనిషిన్నీ, మా మామగారు విఘ్నేశ్వరుని పేరు సార్ధకం చేసుకునే శరీరం కలవారున్నూ అవడం చేత మా అత్తగారు మా మామగారి కన్నా ఏ నలభై ఏళ్ళో చిన్నదిలా కనిపించేవారు.

    మా మామగారు, వినాయకరావుగారు ఉత్తములు. ఉదాత్త హృదయం, ఉత్కృష్టరూపం కలవారు.
అయిదడుగుల పదకొండంగుళాల ఎత్తు. ఆ ఎత్తుకు తగిన లావూ, పుష్టీ కలవారు. అని మూలిగి ఎరుగని మంచి ఆరోగ్యం కలవారు. శుభ్రమయిన భోజనమూ , శుచివంతమయిన నడవడి, సూక్ష్మగ్రహణ శక్తి, ఉత్తమ ఆలోచనలూ వినాయకరావుగారిని మా చుట్టుప్రక్కల గ్రామాలలోకి ముఖ్యపురుషుణ్ణి చేసినవి. ఆయన పలుకుబడి అనంతము. మా జిల్లాలో ఆయన్ను గౌరవం చెయ్యనివారు లేరు.

    కొంచెం బొజ్జ ఉన్నా అతిసునాయాసంగా ఎంత దూరమైనా నడవగలరు. తన స్వంతపనుల్లో కూలీలతోపాటూ, పాలేళ్ళతోపాటూ, తానూ రాక్షసునిలా పనిచేసేవారు. భోజనప్రియ లవడంచేత మా మామగారు సమస్త శాకపాకాదులూ, చివరకు విదేశీయ జాతులు కూడా తన దొడ్లో పండించుకొనేవారు. ఏ ముష్టి లక్ష్మీనారాయణగారినో సలహా చేస్తూ ఉండేవారు.
    మా మామగారు ఎక్కడ ఏ మీటింగు జరిగినా హాజరు. జాతీయవాది, ఖాదీవస్త్రవాది. సీతారామశాస్తురుగారు వైదీకైనందుకు కొంత విచారించినా, కాంగ్రెసువాదై నందుకు సంతోషిస్తూ ఆయనకు ఎంతో సహాయం చేస్తూవుండేవారు. గాంధీమహాత్ముడు అవతార పురుషుడని నమ్ముతాడుగాని, హరిజనోద్దరణ విషయంలో ఆయనకు బాగా తెలియదేమోనని అనుమానపడ్తాడు.

       ఆహితాగ్ని, అచారసంపంన్నుడు, ఆచారాలవల్లనే భరతవర్షం ఈ మాత్రమైనా బ్రతికి వుందని ఆయన వాదిస్తాడు. మా మామగారింట్లో ఎప్పుడూ నిత్యదేవతార్చన, జపతపాలు జరుగుతూ వుండేవి. ఏడాదికి మూడు నాల్గుసార్లయినా ఏ సత్యనారాయణ వ్రతమునో పేరు చెప్పి, చుట్టాలందర్నీ పిల్చి, బట్టలూ, పాత్రలూ, బహుమతులూ పెట్టి, బ్రాహ్మణులకు తదితర వర్ణాలవారికి పంచభక్ష్య పరమాన్న భోజనాలు పెడుతూ వుంటారు. ఒక రోజున నన్ను కబురంపించారు. మూర్తీ, నువ్వు బి.ఏ. ప్యాసయిన తర్వాత ఏం చేస్తావు? అని అడిగారు.

     నాకు గవర్నమెంటు ఉద్యోగంమీద ఏమీ నమ్మకం లేదండీ!

     అయితే బి. ఎల్. కు వెడతావా?

     ప్లీడర్లు వృత్తంటేనే నాకు అసహ్యం. మనిషినీ, ఆత్మనూ చంపుకోవాలంటే ప్లీడరువృత్తి తీసుకోవాలి గాని లేకపోతే గడకఱ్ఱ చివరతో నయినా దాన్ని ముత్తదానికి వీల్లేదని నా గాఢమైన నమ్మకం.

     ఆ విషయంలో నేను నీతో ఏకీభవిస్తానోయ్. ధర్మశాస్త్రాలెరగనివాళ్ళూ, ఆచార వ్యవహారం సంగతు లెరగనివాళ్ళూ ప్రజాసామాన్యం యొక్క ఆశయాలూ, భావాలూ గ్రహించలేనివాళ్ళూ మన మతాలను గురించి వాదించడం, వాళ్లల్లోంచి వచ్చి, తమ చుట్టూ గోడలు కట్టుకొన్న మునసబులూ, జడ్జీలూ, మన మత విషయాల్లో తీర్పు చెప్పడం, మన దురదృష్టం కొద్దీ ఏర్పడ్డ ఒక విచిత్ర సంఘటనగాని ఇంకోటికాదు. ఇంతకూ నువ్వేమాలోచన చేసినట్లు?

     పెద్దలు సంపాదించి, మా తండ్రిగారు వృద్దిచేసిన ఇంత ఆస్తి ఉన్నది. ఆస్థికోసం కాదుగదాండీ నేను వుద్యోగం చెయ్యవలసింది. ఇంత వ్యావర్తికోసం. శిల్పకళంటే నాకు చాలా ఇష్టం. అసలు వైద్యానికి వెళ్దామనుకున్నాను. ఈ శిల్పకళయందుండే అభిరుచిచేత, నా దారి ఆ వైపు మళ్ళింది. ఈ ఊళ్లోనే ఒక శిల్పాశ్రమం ఏర్పాటుచేసి, కళాసేవ చేద్దామని సంకల్పం ఉంది.

     అదీ బాగానే వుంది. ఇవతల వ్యవసాయమూ చూచుకుంటూ ఉండవచ్చును . శిల్పాన్ని మళ్ళీ పునరుద్దరించడము చాలా గొప్పకార్యం.

     అదే అనుకుంటున్నానండీ మీ ఆశీర్వచనం వుంటే. ఆ విషయమూ, స్వంత వ్యవసాయ విషయమూ ఆలోచన సాగింది నాకు. మనం స్వంత వ్యవసాయం ఎలా చేయించగలం? చదువుకున్నవారు స్వంత వ్యవసాయం చేయించగలరా? ఎందుచేత చేయించగూడదు? సర్వాధారమైన భూదేవికి వ్యవసాయం వల్ల సన్నిహితులంకామా? సర్వకాల యవ్వనంతో సకల సౌరభావృతిదివ్యగర్భ అయిన ధరత్రీమాత తన దగ్గిరకు చేరిన అనుగు బిడ్డలకు సర్వసృష్టి రహస్యాలనూ ఉపదేశింపదా?

పూర్వకాలం నుంచీ ఆశ్రమాలలో ఉండి, విద్యపూర్తిచేసికొని, పల్లెటూళ్ళలో భూమాత ఒడిలో పెరిగిన మహాశిల్పులే అజంతా, ఎల్లోరా, వాతాపి మొదలైన గుహలను నిర్మించారు. ధాన్యకటక, నాగార్జునకొండ మొదలైన పవిత్ర స్థలాలలో స్థూపాలను నిర్మించారు. కాకతీయ శిల్పులు, పల్లవ శిల్పులు, చాళుక్య శిల్పులు, విజయనగర శిల్పులు ఈ మహాభాగులే! సత్య నాగారికతలోబడి, నకనకలాడే పురుషుల్లా కొట్టుకుంటూ ఉన్న పట్టాన వాసస్థులకు శిల్పహృదయం ఏమి తెలుస్తుంది? కర్కశమైన ఒక గింజను భూమిలో పాతి, లాలిత్యము ఒరుసుకొనిపోయే సర్వవర్ణనము పేతమైన మొక్కను భూమిలోనుంచి తీసుకొనిరాగలిగిన కర్షకుడు విద్యావంతుడే అయినట్టయితే ఉత్తమశిల్పి కాకుండా ఎట్లా ఉండగలడు?

    ఈ ఆలోచనలతో శకుంతల దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లాను. ఓ హృదయసింహాసన రాజ్నిగారూ! ఇలా వినండి. నాకేసి చూడండి. ఆ అందమైన నీలితెరలు జిలుగులాడే తమ కళ్ళనిలా తిప్పండి. తళుకులు ప్రసరిస్తూ మధువులు దొంగిలించే ఆ పెదవులను అట్టే నా వైపుకు తిప్పకండి.అన్నీ మరచిపోవలసివస్తుంది.అందుచేత ఆ పెదవులను కాస్త బిగించండి. ఏదీ తమ బంగారులతలు, ఆ రెండు చేతులూ ఇల్లా ఇవ్వండి. కాస్త ఈ మెడచుట్టూ గట్టిగా చుట్టనివ్వండి. లేత తమలపాకు చెవిని నా పెదవి దగ్గర పెట్టండి. ఒక రహస్యం చెప్పాలి.

     రహస్యం చెప్పబోతున్న ఓ పెద్దమనిషిగారూ! నా చెవి కొరికేస్తారా ఏమిటి? రహస్యం చెప్పడం మానేసి నా కళ్ళూ, బుగ్గలూ, జుట్టూ, ముక్కూ తినేసేటట్టున్నారు. నా ఎముకలు విరుగుతున్నాయి. అంత గట్టిగా అదుముతారేమి? అబ్బ! వుందురూ, ఇదా మీరు చెప్పే రహస్యం. అందుకనేనా అంత గబ గబ పరుగెత్తుకొచ్చారు....

     రహస్యమూ! ఈ ఊళ్లోనే ఒక శిల్పాశ్రమం మనం ఏర్పరచుకోడం నిశ్చయం చేసాను. మామగారు చాలా ఫాస్టుగా ఉందంన్నారు. రవీంద్రనాథ టాగూరుగారి శాంతినికేతనం గూడా దీని ముందర ఎందుకూ పనికిరానినటు వంటిదనే ఆశ్రమం పెట్టాలి. మన కొల్లిపర దేశదేశాలనుండి తండోప తండాలుగా జనం వచ్చి ఈ పవిత్ర క్షేత్రాన్ని కొలిచి వెళ్లేటట్టు చెయ్యాలి.

     ఇక్కడుంటే తోస్తుందా మీకు? మన ఊళ్లో బీచిలేదు. సినిమాలు లేవు. టెన్నిసాటలు లేవు. అయినా బొమ్మలు చేయడం మీ కెంతో ఇష్టంగా? నా బొమ్మను మాత్రం అస్తమానం వేయకండేం!

     ఓయి వెర్రిదానా! ప్రపంచంలో నీకన్న అందమయిన వాళ్ళెక్కడున్నారు? సరస్వతిగా, లక్షిగా, లలితాదేవిగా, నిన్నే మూర్తిస్తాను. ఒక్కొక్క శిల్పికి ఒక ఆశయ దేవత వుంటుంది.

     మీకైనా సిగ్గు వుండాలి. ఆ మాటలు అలా వుంచండి. ఇక్కడుండటం బాగానే వుంటుంది. మా అమ్మ సంతోషపడుతుంది. హేమ బావగారిని వదిలి ఒక్క నిమిషం ఉండలేదుకూడా! కాబట్టి నేను మీ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాను.

                                                                                                                     15

    ఇంతట్లో ఏడేళ్ళ బాలిక మా హేమకుసుమ అక్కడికి పరుగెత్తుకు చక్కా వచ్చింది. అదేమిటే అక్కా! బావ అట్లా గట్టిగా పట్టుకుంటాడు నిన్ను? మంచి బావకాడు. నన్నెత్తుకుని అస్తమానం నలిపేస్తాడు. బావతో మాట్లాడకూడ దనుకుంటాను. కాని ఎంతో మంచి కథలు చెప్తాడు. నాకూ అస్తమానం బావను చూడాలనే వుంటుంది. బావకు అమ్మ ఫలహారాలు చేసిందటా. త్వరగా తీసుకురమ్మంది మీ ఇద్దర్నీ.

    హేమకుసుమ ముద్దులు మూటకట్టే బాలిక. అచ్చంగా అక్కగారి పోలిక. ఆ ఈడులో శకుంతల ఎలావుండేదో అలాగే అచ్చుగుద్దినట్టు హేమకుసుమా వున్నది. కాని మహా అల్లరిపిల్ల. తన ఈడుకు మించిన ఆలోచనలు,కొంటె మాటలు. ఎవరిని పెళ్లి చేసుకుంటుందో కాని ఆ భర్తను సంతలో అమ్ముకు చక్కా వస్తుంది. నేనంటే విపరీతమైన ఆపేక్ష అక్కగారిని ఒక్క నిమిషం వదిలి వుండలేదు. ఎన్ని రాత్రిళ్లో మా దగ్గరే పడుకొని నిద్దరోతుండేది. మా అత్తగారు వచ్చి, ఆమెను ఎత్తుకొని తీసుకు వెళ్ళుతూ వుండటం జరుగుతూ వుండేది.

  • * *

   
    హేమకుసుమా! ఆనాటి దివ్యస్వప్నంలోనుంచి ఈ 1941 ఫిబ్రవరి నెలలోనికి వచ్చినాము. మహాయుద్దము లోకాన్ని భయంకర రాక్షసిలా కబళిస్తూ ఉన్నది. వేలకొలది గ్రీసువాళ్ళు, ఇటలీవాళ్ళూ, ఫ్రెంచివారూ, ఇంగ్లీషువారూ, జర్మనులూ అనుదినమూ ఈ రాక్షసికి ఆహుతులై పోతున్నారు. జగత్సంహారమైన ఘోరయుద్దం వల్ల గాని మనుష్యులు తమతమ కాంక్షలకు తృప్తి ఇవ్వలేరా? ప్రేమ అనేది వట్టి హుళక్కేనా ? మానవుని జీవితమంతా రక్తం పీల్చుటకేనా? ప్రేమ అనే పల్చనిపొర లోకాన్ని మాయ చేసేందుకే కప్పుకొని ఉంటాడా మనుష్యుడు? సౌందర్యోపాసి అని మనుష్యుణ్ణి పిలవడం ఒక భయంకరమైన అసత్యమా? నా చిన్నతనంలో జరిగిన మహాయుద్దంకన్న ఈ యుద్ధం ఇంత భయంకరమై పొయిందేమి? మహాత్ముని పవిత్ర వ్రతము ఏనాటికయినా సఫలత పొందగలదా?

    హేమకుసుమ తనతో యుద్ధంమాటే తీసుకురావద్దంటుంది. ఆడవాండ్లను సాసనసభికులుగా ఏర్పాటు చేస్తే, ఏ దేశమూ యుద్దాలతో దిగదని వాదిస్తూంటుంది. వాళ్ళు శాంత వ్రతులట. ఆనంద జీవికలట. రసపిపాసలట. అట్టివాళ్ళు లోకాన్ని సౌందర్యంతో నింపుతారట. వాళ్ళ మాతృ హృదయము యుద్ద పిశాచాన్ని లోకంలో లేకుండా తరిమివేస్తుందట.

    తీర్థ : హేమా! ఆడవాళ్ళు కాళికాస్వరూపిణిలు కూడా కదా!

    హేమ : అది మీకు కవులై వ్రాసిన వ్రాతగానీ, ఎంత నీచ స్త్రీ అయినా నోటి యుద్దముతో సరిపెడుతుందిగాని కత్తిగట్టి యుద్ధం చేసే స్త్రీ ఎవతయ్యా త్యాగతీ!

    తీర్థమిత్రుడు : మొన్న ఉమెన్ అనే ఇంగ్లీషు ఫిల్ము వచ్చింది గదా! అందులో ఆడవాళ్ళు జుట్టూ జుట్టూ పట్టుకొని దెబ్బలాడలేదు టయ్యా!

    నేను :అది కథ. మనం కల్పించుకున్నది. ఆడమళయాళం స్త్రీలు యుద్ధం చేశారనీ, అమెజాను స్త్రీలు యుద్ధం చేశారనీ పురాణాల్లో చెప్పుకునాము. అంతేగాని యుద్ధం అంటే ప్రీతిపొందే స్త్రీ ఉంటుందని హేమతోపాటు నేనూ నమ్మను.
 
వినాయకరావుగారు: నిజమేనయ్యా త్యాగతీ! మనుష్యులలో ఉండే సంహారశక్తిని కాళికాస్వరూపిణి క్రింద వర్ణించాముకానీ, రక్తం కళ్ళ చూచేందుకు వెరవనిది మగవాడే! అంత కష్టం వస్తే స్త్రీ తన నాశనమే కోరుతుంది. కాని ఎదుటివాణ్ణి తన్ను అవమానపరచే పురుషుణ్ణయినా, స్త్రీ నాశనం కోరలేదు. ఎంతో అవసరం వచ్చినాగాని స్త్రీ కత్తికట్టలేదు. పూరాణాల్లోని సత్యభామ, ప్రమీల, కైక క్షణమాత్రం విక్రమం చూపించారు. వాళ్ళు పూజ్య చరిత్రలు. చరిత్రలో ఉండే ఝాన్సీలక్ష్మీబాయి, రుద్రమదేవి యుద్ధంకన్న శాంతమే యెక్కువ ఆశించారు.

    కల్పమూర్తి : అవునండీ మామగారూ, అహల్యాబాయి యుద్దం లేకుండా ఎంత ప్రేమతో రాజ్యం పాలించింది?

     హేమకుసుమ : నేను ఆడవాళ్ళు ప్రపంచశాంతి కోరారన్నాను. ఆ మాత్రానికే మీరు ఆడవాళ్ళని పిరికిపందల క్రింద జమకట్ట చూస్తున్నారు. మీ కెప్పుడూ మేము బానిసలుగా వుండాలేమి?

    రాజ్యలక్ష్మమ్మగారు : ఓసి వెర్రితల్లీ! నీకెందుకమ్మా పౌరుషం? ప్రేమను కోరే ఆడవాళ్ళు బానిస లెట్లా అవుతారమ్మా!

    హేమకుసుమ : ప్రేమ! తేమ! లోకంలో ప్రేమ వుందంటావా? ఓ వెర్రమ్మా! మనుష్యుడు అవసరం వచ్చినప్పుడు నాలుగు తీపి మాటలు మాట్లాడుతాడు. దానికి ప్రేమని ఓ చిచ్చు పేరు పెట్టాడు. మనం అంతా పశువులం. పశుధర్మం నిర్వర్తిస్తాం.

    వినాయకరావుగారు : ఏమో! బొత్తిగా ఈ కాలం దానవై పోయావు. ఈ నాటి వాళ్ళ భావాలు మా ముసలవాళ్ళకేమీ అందవుగదా!

    నేను : అవునండీ, వీళ్ళంతా నవజవానులు. చల్ చల్ రే నౌ జవాన్! కత్తిగట్టు నౌ జవాన్! గజ్జెకట్టు నౌ జవాన్.

    హేమకుసుమ : దద్దమ్మలా పడుకోకు నౌ జవాన్.

    కల్ప : యుద్ధం వచ్చి ధన మాన ప్రాణాలు రక్షించుకోవలసి వచ్చినప్పుడు తప్పక స్త్రీ కత్తి పట్టవలసిందే! రాష్యాలో స్త్రీలు యుద్దానికి సిద్దమట! కాని........

    హేమ : కాని లేదు, అర్షణాలేదు. స్త్రీ యుద్ధం కోరదు. స్త్రీకి యుద్ధం అక్కరలేదు. కాని ఇంతవరకు స్త్రీని పురుషుడు అణగదొక్కి ఉంచాడు. పురుషుడు తన కామప్రీతితో ఏవో కొన్ని అధికారాలు దయచేశాడు. ఆయన మాకు ఇచ్చిన గ్రుహాధికారం ఆయన ఇచ్చిందేమిటి? మాకు ఇవ్వక అతనికి తప్పలేదు. పిల్లలను కనేవాళ్ళం, పెంచేవాళ్ళం. వంట చేసేవాళ్ళం. అందుకని గృహాధికారం లేకపోతే ఆ అధికారమూ పురుషుడే ఉంచుకొని ఉండును. ఎంతమంది పురుషులు స్త్రీలను అవమానాలు చేయలేదు? బట్టవిప్పించి దుర్యోధనుడు అవమానం చేస్తే,జూదంలో పందెంపెట్టి ధర్మరాజు అవమానం చేసాడు. అంతే మనుష్యులు. ఏ విషయంలోనైనా స్త్రీ పురుషులు సమానులే! మేమూ యుద్ధం చేస్తాం. దేహబలం అవసరంలేని సైన్సురోజు లివి.

    నేను : అవును హేమా! నువ్వు చెప్పిందంతా నిజం. నేను కాదనను. ఒక సంగతి మాత్రం చెప్తాను. ఎవరి దోషం వారే అనుభవిస్తారు! మనం ఇంగ్లీషు వాళ్ళని అని ఎలా లాభంలేదో అల్లాగే స్త్రీలు పురుషులను అని లాభంలేదు. నీలో నీరసత్వం ఉంటే రోగాలు దాపురిస్తాయి. రోగాలు అందుకే వున్నాయి. అలాగే హిందూదేశం నీరసంగా ఉండడంవల్ల యవన, హూణ, మ్లేచ్ఛ, తురుష్క, ఫ్రెంచి, డచ్చి, ఆంగ్ల జాతులవారు వచ్చి చేసారు. నువ్వు వారిని తరలించేయి. ఎవరూ కాదనరు. నీలో జబ్బుల్ని కుదుర్చుకోవూ! అలాగే! ఆడవాళ్ళు నీరసులవడంవల్ల మగవాళ్ళు అధికారాలన్నీ వహించారు. వారితో యుద్ధం చేయి, వారి మనస్సులు కరిగించు వారితో సమానం అని పనిచేసి చూపు. నీ స్థానం నువ్వు ఆక్రమించుకో!

    హేమ : అదే చేసి చూపెడతాం!

    నేను : ఎక్కడి మాటలు, మీ పౌడర్లు మీరు వదలరు. మీ కులు కులు మీరు మానరు. మీ సొగసులు మీరు మరచిపోరు. మీ అలంకారాలు మీరు అవతల పారవేయరు.

    తీర్థ : అలంకారాలు అడ్డం వస్తాయా?

    నేను : రావు! రావు! అలంకారం అయ్యేవరకు అవసరాలు ఆగుతాయి కాలం నిలిచే ఉంటుంది!

    ఈ హేమ ఆ రోజున హేమ బాలికగా అల్లా అంటూంటేనే మేము మా కౌగిలింత వదలినాము. నేను హేమనెత్తి ముద్దులు కురిపించాను.

     అల్లరిపిల్లా! ఇంకో పది సంవత్సరాలు ఉండు. నీకు ఈ లాంటి కష్టాలు వస్తాయిలే అన్నాను.

    హేమ : నేను పెళ్లి చేసుకోనుగా!

    శకుంతల : వద్దే నాన్నా నీకు పెళ్లి! మీ బావవంటి మొగుడు నీకు దొరికితే ఈలాగే వేపుకు తింటాడు.


                                                                                                                         16

    అందరి జీవితంలోనూ అంతే! మూలసూత్రం ఒకటే. నదులూ పర్వతాలు, సముద్రమూ జీవితయాత్రను తమ ఇచ్చివచ్చిన దారులకు తీసుకొని పోతవి. ఒక్కొక్క నది ఒక్కొక్క రీతిగా మనుష్యులను నడుపుతుంది. కృష్ణానది శిల్పులనది. గోదావరి కవులనది అన్నారు. పెన్నా తుంగ భద్రలు విక్రమజీవన మిస్తాయట. కావేరి గాంధర్వానకు అమృత జీరలు వరమిస్తుందట. గంగానది తపస్వినియట. యమున భక్తిమాల.

    నేను కొల్లిపరకు అనతిదూరంలో కృష్ణానది ఒడ్డున శిల్పాశ్రమం నెలకొల్పాలని నిశ్చయించాను. అందు భూమి, ఆలయాలు, విహారాలు, మందిరాలు, గృహాలు నిర్మించడానికి లక్ష రూపాయలు అవుతాయనుకొన్నాను. అక్కడే మా మామగారి భూమి ఉన్నది. ఆ భూమి చక్కని తోట అవుతుంది. అలాటి ఆశ్రమం కలలు కంటున్నాను.

    కాని ఆ కల లన్నిటికి కౌస్తుభమణి నా శకుంతల. నా శకుంతల ముందు కాళిదాస శకుంతల కామధేనువు ముందు నందినీ ధేనువే! గౌరీశంకర శృగం ముందు కాంచనగంగ మాత్రమే. శకుంతలకు పదహారు సంవత్సరాలు వచ్చాయి. అమృతంలో కడిగి తుడిచిన బంగారు కమలంగా వికసించిపోయింది. ఆమె బంగారు ఛాయలో పాలసముద్రం ఛాయ కలిసిపోయింది. ఆమె కన్నుల ఆకాశంలో స్వర్గధామాలు నృత్యాలు సల్ఫినవి. ఆమె పెదవుల మందారాలలో విష్ణుహస్తాలంకారలీలా పద్మమధువులు చేరుకొన్నవి. ఆమె గానసుధలో సరస్వతీదేవ్యంగుళీ సంతతవర్తిత పల్లకీశ్రుతులు మేళవించాయి.
 

ఆమెను తేరి చూడజాలక నేను, ఆమె ఎదుట మోకరించి నేను ఆమెను హృదయాన ధరించి నేను, ఆమె జీవిత కిరీటాలంకృత సార్వభౌముణ్ణి నేను. ఆమెతో కృష్ణానదిలో నావపై విహరించాను. ఆమె కోసం చిన్న మొటారుకారు తెప్పించాను. ఆ కారులో అమరావతి, నాగార్జున కొండ, ఓరుగల్లు, ఔరంగాబాదు, ఎల్లోరా, అజంతాలు విహరించాను. ఆమె మెచ్చిన బొమ్మ నాకు ఆశయము ఆమె ఆనందం పొందిన పటాలు నా హృదయ ఫలకాన, ఆమె ఆలపించిన రాగం నా జీవిత విపంచిలో, ఆమె నడచిన నడక నా ఆత్మపథాల.

    శకుంతలాదేవీ! అందాలబాలా! ఆనందదేవీ! అమరకన్యా! ఆనాడు నీకు జ్వరము వచ్చిందా! మనం దేశాలు తిరిగివచ్చిన నెలరోజులకేనా? నాకు నీ దర్శనానందంలో శతాంశం అనుభవానికి రాలేదే! నీ జన్మకాంతులు నాపై సహస్రాంశం ప్రసరించలేదే? నీ ప్రేమామృతకలశాం బోధిలో ఒక్కకణము నా జన్మలో ప్రసరించలేదే? ఇంతలోనేనా నువ్వు జ్వరతల్పం అధివసించావు ? దేవీ! నీ భక్తునిపై, నీ సేవకునిపై, నీ స్నేహితునిపై, నీ భర్తపై, నీలోని భాగానిపై, అప్పుడే విరక్తి వచ్చిందా దేవీ! దేవీ! నా ఆత్మేశ్వరీ! నా ముక్తేశ్వరీ!

    అది టైఫాయిడ్ జ్వరమట! ఎక్కడనుంచి వచ్చిందా జ్వరం? అది మృత్యుకీలగాని జ్వరం కాదట! ప్రపంచంలోని వైద్యులందరూ నీకు వచ్చిన జ్వరాన్ని తగ్గించలేకపోయారా? మదరాసు వైద్యవృషబులు పెదవులు విరిచారా? నువ్వు ఏమైపోయినావు?

    మా శకుంతల వెళ్ళిపోయింది. తపస్సు చేయగా ప్రత్యక్షమైన దేవి వరమీయకుండానే అంతర్ధానం అయిపోయింది.

    ఏమి జరిగింది? మా యింట్లోలేదా? ఆమె పుట్టింటికే వెళ్ళలేదా? వైద్యాలు హుళక్కా? మంత్రాలు చచ్చుమాటలా? మొక్కుబళ్ళు మొరకు తనాలా! దేవుళ్ళు రాళ్ళా? లోకంలో ధర్మంలేదా? నేను ఎవరికీ మాటలోనన్నా కష్టం కలిగించి ఎరగనే! నాకున్నవి ఉత్తమ ఉద్దేశాలే! నా దివ్యమూర్తి ఏమయింది? చిన్ననాటినుంచీ నన్ను తన నీడలో పెంచుకున్న నా తేజస్విని ఏ దేశం పోయింది? ఎందు కీ సూర్యుడు? సన్యాసి సూర్యుడు! ఎవరికి కావాలి ఎండ?

    ఇది నా యిల్లా? ఈమె నా అమ్మా ? వీ రెవరు? నా శకుంతల తండ్రే! అయ్యో మహాభాగా! నీ కడుపున ఉద్భవించిన అమృతకలశాన్ని ఎవరు ఎత్తుకుపోయారు? గరుత్మంతుడా! రాక్షసుడా! పిశాచా నరహంతకుడా? నేను తపస్సు చేసి సంపాదించిన వరం ఏదీ ? ఎవరు తీసుకొన్నారు? నా వరం నా కివ్వండి. నా వరం! నా జీవిత పరమావధి? నా సర్వం. నా.... నా....


                                                                                                        * * *

    ఓ హేమదేవీ! ఈ నా కథ నీకోసం రాస్తున్నా. నువ్వు చదివే రోజు వస్తుంది. నీతో సహవాసం చేస్తూ నిన్ను గమనిస్తూ, రోజూ నా కథ రాస్తున్నాను.

చివరిదాకా చదివిందాకా నన్ను గురించి అభిప్రాయాలేమీ నిర్మించుకోకు. ఆ రోజు రాగానే నీ చేతికి ఈ గాథ వస్తుంది, అంతా చదివి నన్ను అర్ధంచేసుకో.

    నేను శ్రీనాథమూర్తిని. నేనే త్యాగతిని. త్యాగతి పేరేమిటి? ఎందుకా పేరు నాకు వచ్చింది? ఎవరిచ్చారు? ఎందుకు నీతో మొదటి నుంచీ నా నిజకథ చెప్పలేదు? యివన్నీ నీకు మనవి చేసేరోజు ఇది. నువ్వు నా శకుంతలకు చెల్లెలివి! నా శకుంతలా, నువ్వూ ఏకగర్భజలు. ఎంత చిత్రము! నా దుఃఖాన్ని నువ్వు ఊహించలేవు. నేను మాత్రం ఇప్పుడు ఊహించుకోగాలనా?

    నేను నాదేవి వెళ్ళిపోయినా తర్వాత పదకొండు రోజులు స్పృహలేక జీవచ్ఛవంలా ఉన్నాను. ప్రాణం పోలేదు. నన్ను కారుమీద వేసుకొని డాక్టరు ఆమంచర్ల చలపతిరావుగారు, గోవిందరాజుల సుబ్బారావుగారు తెనాలి చేర్చారు. అక్కడ ఒక మేడలో పెట్టారు. మా అమ్మనూ నాతో వైద్యానికి తీసుకువచ్చారు. ఆమెకు నాదేవి అంతర్ధానమైన రోజునుంచే మూర్ఛపట్టుకుంది. ఆమెకు తిండిలేదు. సర్వకాలం కళ్ళవెంట నీళ్ళు. మా కిద్దరకూ పరిచర్యకు మా అక్కగార్లిద్దరూ వచ్చారు.
           
        
                                                                                                               విష్కంభము

    ఇంతవరకు ఆ వ్రాతపుస్తకం చదివేటప్పటికి హేమకుసుమ వెక్కి వెక్కి ఏడుస్తూ సిఫామీదనుంచి లేచింది. తూలుతూ వెళ్లి మంచం మీద వాలిపోయింది. చిన్ననాడు సంభవించిన అక్కగారి అకాల మరణ కథ అంతా కళ్ళకు కట్టిపోయినది. అక్కగారిని తానూ చిన్ననాడెంత ప్రేమించినది!

 ఆ ప్రేమపరీమళాలు ఈ నాటివరకూ తన జీవితపథాలన్నీ ఆక్రమించలేదా? ఆమె తన కెప్పుడూ దేవబాలికలానే మనఃపథాల ప్రత్యక్షమవుతూ ఉండేది. ఆమె దుఃఖము భరించలేకపోయింది. కన్నీళ్లు అఖండధారలైనవి. గుండె బరువెక్కినది. అబ్బా అని ఆమె దుఃఖించింది. అక్కా యెక్కడికి పోయావే అని రోదించింది.

    ఈ భాద భరించలే ననుకొంది. తన గదిలో ఉన్న విద్యుత్ ఘంటికకు మీట నొక్కినది. ఆ గంట పరిచారిక గదిలో మోగింది. ఆ అమ్మాయి పరుగెత్తుకొని వచ్చింది. తలుపు ఎలాగో తీసి హేమకుసుమ మళ్ళీ మంచం మీద వాలింది.

     ఏమిటండీ అమ్మా! ఎందుకు అలా ఉన్నారు? ఆ కొల్లిపర నుంచి చిన్నతనములోనే వీళ్ళతో మదరాసు వచ్చిన ఆ బాలిక అడిగింది.

     త్వరగా....వెళ్లి....లోకాన్ని....తీసుకురా!

    ఆ పనిగత్తె వెళ్లి అయిదు నిమిషాలలో లోకేస్వరుని తీసుకువచ్చింది. లోకేశ్వరి రాగానే హేమ ఆ బాలికను గట్టిగా కౌగిలించుకొని ఇనుపమడించిన దుఃఖంతో వణికిపోయింది.

     హేమ్! ఏమి టా ఏడ్పు ? మతిపోయిందా? మీ అక్క చనిపోయి పదకొండు ఏళ్లయింది.

    ............

     నీ స్థితికి అర్ధం ఉందా? ఇది హిస్టీరియాగాని ఇంకోటి కాదు ? ఇంత నీరసురాలివయ్యా వేమిటి? ఇంతకన్న అవమానం ఇంకోటి ఉందా? పుస్తకం చదువుతూ అంత ఏడుస్తారా ఎక్కడన్నా! లే, కళ్ళు తుడుచుకో. నేను ఈ రాత్రి నీ దగ్గరే పండుకుంటాను.
 
లోకం, త్యాగతి మా బావ. మా అక్క ఎంత....

     మీ అక్క దేవత. పది హేను రోజుల క్రిందట ఈ పుస్తకం త్యాగతి నాచేతి కిచ్చాడు. అందులో చదివిన విషయాలు ఎవ్వరికీ చెప్పవద్దన్నాడు. నేను చదివి పొందిన బాధ, దుఃఖమూ వర్ణించలేనిది! హేమా, మనం చదువుకొన్నవాళ్ళం. మనకూ, మూర్ఖునికీ కూడా దుఃఖం ఒకటే, అయినా మనం దిగమింగి లోపల కుళ్ళుతాం. వాళ్ళు పైకి ఏడ్చి బాధనుండి విముక్తులవుతారు. అంతే తేడా! నీ దుఃఖం పవిత్రమైంది. నువ్వలా ఏడ్వడం మంచిదే. కాని దుఃఖాన్ని కూడా మనం సాక్షులమై దర్సించాలిగాని, మనం కూడా దుఃఖంలో భాగమైతే ఇంకేముందీ? లే! కాఫీ చేసి తీసుకురానా?

     నేనూ వస్తాను వంటింటిలోకి: పద

    హేమ లోకేస్వరుని కౌగిలించుకొనే వారిద్దరూ వంటింటిలోకి వెళ్ళారు. హేమకు కంటెదుట ఆమె అక్క కనిపించింది. ఆమె చిన్న నాడు తనపై చూపిన గంభీర ప్రేమ కల్లగట్టింది. అక్కా! నువ్వు ఎందుకు బ్రతకలేదు. నీ కిప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు ఉంది వుండును. నీ బిడ్డలు పరమ సౌందర్యమూర్త్లులుగా ఉందురు. నీ ప్రేమలో నేను ఎన్ని జీవిత రహస్యాలు తెలిసికొని ఉండేదాన్ని అని హేమ అనుకొంటూ కన్నీటి వెల్లువ తుడుచుకుంటూనే ఉంది. లోకేశ్వరి వెనక్కు తిరిగి చూస్తూనే కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ కాఫీ తయారుచేసి హేమకు ఒక కప్పు ఇచ్చింది. ఇద్దరూ చెరో కప్పు కాఫీ తాగి మళ్ళీ పడకటింటిలోనికి వచ్చారు. అక్కడ క్రిందపరచిన తివాసీలపై పరిచారిక పడుకొని నిద్దుర పోయినది.

    ఒకరి దుఃఖం ఇంకొకరికేమి అర్ధమవుతుంది! ఆమెకు యజమానురాలి ఆవేదన ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత సానుభూతి నాళాలు స్పందనం కాగా కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అది మానవ సహజం. లోకేశ్వరి విద్యుద్దీపం చిన్నది వెలిగించి, పెద్దది అర్పి, పరిచారికను లేపి,వెళ్ళిపడుకోమని చెప్పి , తలుపు వేసి, పందిరిమంచముపై హేమ పక్కన పండుకొని,ఆమెను గట్టిగా హృదయాని కదుముకొంది. హేమకు నిద్రపట్టదు. లోకేశ్వరికి నిద్రపట్టదు. వారేమీ మాటలాడుకొనలేదు. గంటకు లోకేశ్వరికి నిద్ర పట్టింది.

    త్యాగతి, శ్రీనాథమూర్తి, తన బావ, తన అక్క ఎక్కడ వుంది? అంతవరకు అక్క బ్రతికి వున్నట్లు, తాను చిన్న బిడ్డ అయినట్లు హేమ భావిస్తూ

ఆనందపడింది.ఒకనాడు మాయమైన ఒక అనుభూతి మరలివచ్చి మరల మాయమైంది. నెమ్మదిగా లేచి సోఫామీదకు పోయి త్యాగతి పుస్తకం తెరచి అక్కగారి బొమ్మను కళ్ళకద్డుకొని తిరిగి కథ చదవటం ప్రారంభించింది.
    
                                                                                                                       17

    నాకు ప్రాణంమీదకు వచ్చిందని మా మేనమామ కస్తూరి రఘురామయ్యగారు కుటుంబంతో వచ్చి వాలారు. మా అమ్మగారికి పోయే ప్రాణం, వచ్చేప్రాణం. కొల్లిపరలో మా అత్తగారు మూడురోజులు ఏమీ స్మారకం లేకుండా పడివున్నారట. మా మామగారు వేదాంతి. సర్వసముద్రాలుగా పొంగివచ్చిన దుఃఖాన్ని అగస్త్యుడిలా మింగివేసినారు. లోకులను దహించివేసే దుఃఖాన్ని శివుడులా కంఠంలో దాచుకొన్నారు. నడపవలసిన తంతు నడిపినారు. కంట నీరులేదు. కీళ్ళు పొదిగించిన కొయ్యబొమ్మ. కాని భోజనం లేదు. మూడు రోజులలో నల్లగా వున్న ఆయన జుట్టు తెల్లబడిపోయింది. బుగ్గలు వాలిపోయాయి.ఒళ్లంతా సడలిపోయింది. కళ్ళు గుంటలు కట్టినాయి.

    మా అత్తగారి పుట్టింటివారూ, ఇంకా దేశంనిండా వున్న సర్వబంధువులూ వచ్చి వాలారు. కోటీశ్వరశర్మ, శాస్త్రిగారు వచ్చారు. ఆయన వేదాంతం కురిపించారు. ఎవరు ఏమి చెప్పినా మామగారికి ఏమీ వినిపించలేదట. కుమార్తె ఆఖరు క్షణాలల్లోనన్నా నేను వెడుతున్నాను. మీ_అ_ల్లు_ణ్ణి_ సర్వ _కాలాలు_కనిపెట్టి_ఉండండి_నేను మళ్ళీ వస్తా_నేను _ పూర్తిగా వెళ్తున్నానా ఇక్కడే_ఉంటాను_ఆ_య_న్ను_మీకు_కొ_డు_కు. అ_మ్మ_దుఃఖం_వ_ద్దు_చెల్లెల్ని_కా_పా_డు_ఆ_య_న_పాదజలం_ఇ_వ్వం_డి_పుణ్యం_నా....కు_అని, మంచంమీద కొయ్యై స్పృహ ఏమీలేని, నా చేయి తీసుకొని కళ్ళకద్డుకొని దేవీ_వస్తు_ న్నా!అని మాయమైన విషయమే ఒక్క లిప్తవ్యవధైనా లేకుండా ఎదుట కనబడుతూ ఉండేదట ఆయనకు. ఒక్క పరమ సుశీల లోకాన్ని వదిలి మా అందరి ప్రాణం తనవెంట రాబోతే ఆపుచేయించింది కాబోలు.

    మా వైద్యులు, నా కాంతిదేవత ప్రాణం కాపాడలేనివారు నా ప్రాణం, మా అమ్మ ప్రాణం, మా అత్తగారి ప్రాణం కాపాడారు. నాకు ప్రాణం మీదకు వచ్చిందంటే, మా అమ్మ బ్రతికింది. హేమ తల్లి దగ్గరకు పోయి, అమ్మా, అక్కతోబాటు నువ్వు వెళ్ళకే. నేనెల్లాగా! అమ్మా, అమ్మా అని అంటే మా అత్తగారు బ్రతికింది.

    నేను మొండివాణ్ణి, తుచ్చుణ్ణి, పాపిని. నాకు ప్రాణం ఎందుకు పోతుంది! నాలో విషబీజలు ఉండడంచేత, పరమ పవిత్ర చరిత్ర నా శకుంతల వెళ్ళిపోయింది. నేనామె సంపర్కంవల్ల పవిత్రుణ్ణి కాలేనంత పాపిని అవడం వల్ల నా శకుంతల వెళ్ళిపోయింది.


 

    నాకు కొంచెం తిరిగి నడిచే ఓపిక వచ్చేటప్పటికి మూడు నెలలు పట్టింది. మళ్ళీ కొల్లిపర మొన్న మొన్నటి వరకూ వెళ్ళలేదు. ఎంత మంది బ్రరిమాలినా వెళ్ళలేదు. నేనూ నా ఉజ్వల సౌందర్యదేవీ విలాసాల జీవించిన ప్రదేశం ఆమె లేకుండా ఎలా వెళ్ళగలను.

    మా అమ్మ పేర పదిహేనెకరాల సుక్షేత్రం వ్రాశాను. ఇల్లు వ్రాశాను మా అక్కగార్లిద్దరకు చెరొక పది ఎకరాల భూమీ వ్రాశాను. శకుంతల పేరున ఒక మహిళా విద్యాలయం పెట్టడానికి ఇరవై ఎకరాల భూమి వ్రాశాను. మిగిలిన పదెకరాల భూమి అమ్మి అ ఇరవై వేలు మా అమ్మగారి పేరున బ్యాంకిలో వేశాను. బ్యాంకిలో నా సొమ్ము పద్దెనిమిదివేలు పెట్టబోయే మహిళా విద్యాలయానికి భవన నిర్మాణానికి ఇచ్చాను.

ఇవన్నీ అమలులోనికి రావడం పదేళ్ళయిన వెనుక.అందాకా నా మేనమామను, నా స్నేహితుడైన డాక్టరు సుబ్బారావుగారిని, తెనాలిలో పెద్ద వకీలైన వెంకట్రామయ్యగారిని ట్రస్టీలు చేసి ఆస్థి పెంచవలసిందని ఆ దస్తావేజులో వ్రాసి, ఎవరకీ తెలియకుండా రిజిష్టరుచేసి, మిగిలిన తొమ్మిదివేల ఆరువందల రూపాయలు చేతితో పట్టుకొని కాశీ మా అమ్మతో వెళ్ళిపోయాను.

    మా అమ్మగారికి పుట్టింటివారూ, మా అమ్మమ్మ ఇచ్చిన ఆస్తి పన్నెండెకరాల సుక్షేత్రమైన మాగాణి ఉంది. ఆ రోజులలో సాలుకు పది పన్నెండు వందల ఆదాయం వచ్చేది.

    కాశీ వెళ్ళాము. మా అమ్మ ఏమీ అనలేదు. నే నేది చెబితే అదే నన్నది. కాశీలో ఊరుచివర ఒక చిన్న బంగాళా నలభై రూపాయలకు అద్దెకు తీసుకున్నాను. మా బంగాళా విజయనగర భవనానికి కొద్ది దూరంలో ఉంది. నాకు స్నేహితు లవసరం లేదు. నాకు చుట్టాలు అక్కర్ లేదు. నాకు పుస్తకాలు వద్దు, కళ వద్దు, నాకు భగవంతుడు వద్దు. భక్తి అక్కరలేదు. భగవంతుడు? ఎవ్వరీ భగవంతుడు? ఎక్కడ? పరమాత్ముడట! దీనజన రక్షకుడట! కరుణామయుడట! ఆపద్భాంధవుడట!

    హ్హా హ్హా! ఏమివెఱ్ఱి మనవాళ్ళకు? భగవంతు డెవడు? మనందరిపై ఓ పెద్ద అధికారా? ఇప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడే కష్టపెడితే అనుకోవచ్చు. ఎప్పుడో కొన్ని జన్మలక్రింద చేసిన తప్పుకు ఇప్పుడా మనల్ని శిక్షించడం? ఎంతమంది అలాంటి అధికారులు? ముస్లింలకు ఒకరు, క్రైస్తవులకు ఒకరు, బౌద్దులకు ఇంకొకరు, హిందువులకు కోటిమంది! ఎందుకీ పాడు దేవతలు, దెయ్యాలు.

    దేవతలు వేరు, దేవుళ్ళు వేరు. వేదాంతుల దేవుడు ఎమీ చెయ్యలేని బ్రహ్మపదార్ధము! మన కర్మ మనమే అనుభవించవలసి వస్తే మనకు తెలిసే అనుభవించే శిక్ష కర్ధం ఉంటుంది. ఒకణ్ణి చంపితే చంపినవాణ్ణి ఉరి తీస్తారు. అదీ శిక్ష. దొంగతనం చేస్తే ఖైదు వేస్తారు. అనంతమైన కాలంలో, సృష్టిలో కోటి కోటి సంవత్సరాలు పురుగైతేనేమి, పుడకైతే నేమిటి?

    నా దేవిని బ్రతికించలేని దేవుళ్ళు నా కెందుకు? నిజమైన ఆనందం చూచి ఓర్వలేని దద్దమ్మలు లోకాలను ఏలుతున్నారు. మనుష్యునికి మూఢత్వ మెందుకు?

ఎందుకీ లక్షల కొలది గుళ్ళు గోపురాలు? క్షేత్రాలూ తీర్థాలూ? ఎందు కీ మొక్కుబళ్ళు. నిలువుదోపిళ్ళు? యాత్రలెందుకు? పవిత్ర నదుల స్నానాలట! స్నానాలు మురుగు గుంటలలో చేయకూడదా?

    నా హృదయంలోని నీరసాలు పోయాయి. నా దేవుళ్ళు నా శకుంతలతోనే పోయారు. వాళ్ళమీద యుద్ధం ప్రకటించాను. నాకు వాళ్ళతో నిమిత్తం ఏమిటి? భక్తట! ఓహో! మెదళ్ళలో రాళ్ళు పొదిగించుకుని, భక్తిని బయలుదేరే చచ్చుదద్దమ్మలకు బుద్ది చెప్తా! ప్రపంచములో న్యాయం మోక్షంకోసం కాదు. నా పళ్ళు బిగించి, నా గుప్పిళ్ళు ముడిచి దేవుళ్ళ రాజు విశ్వేశ్వరుడి మీద మొదటి యుద్ధం ప్రారంభించాను.
    
                                                                                                              18

    శకుంతలాదేవీ! నీవు నాకు లేకపోయినావు. ఎక్కడకు పోయినావు? ఎక్కడకు పోయావు దేవీ? నిన్ను గాఢంగా కౌగిలించుకొన్నప్పుడు నా కెంత ఆనందం కలిగేది? ఎంత విచిత్రానందం! ఎన్నిరకాల కౌగిలింతలు చూపావు నాకు? ఒక రోజున వెనుకనుంచి వచ్చి కన్నులు మూశావు.నా కన్నులు కప్పిన ఆ పూవుల మెత్తదనాన్ని కర్కశం చేసానా నేను? అవి చేతులా దేవీ? పరిజాతాపహరణంలోని పద్యాలకు స్నిగ్దత్వం, లాలిత్యం నేర్పే అద్భుతరూపాలు కావా? నా వీపుమీద వాలిన నీ ఉరోజస్పర్శామృతము నా వంటికి వివశత్వం కలిగించలేదా? నా మెడచుట్టూ చేతులు చుట్టావా శకుంతలా?

    ఒకనాడు నిద్రపోయినట్లు నటించి, నేను నీ మీద వాలినప్పుడు నా కన్నులు మూసి, నా తల నిమిరి, నా నొసట ముద్దాడినావా? అది వట్టి చుంబననమా, జీవితం కూలంకుషంగా కదిపివేసే పరమవర ప్రసాదంగాని, నేను సోఫామీద కూర్చొని బొమ్మల పుస్తకం వకటి చూస్తూవుంటే, నా వళ్లోవాలి వదిగిపోయి, నా హృదయాన నీ మో మద్దుకొని, నా విశాలవక్షంలో నీ మోము తిప్పుతూ పుణికినావే! ఆనాడు నేనేమైపోయాను? ఆనందమే క్షీరమైతే, ఆ క్షీరం మథించిన నవనీతం కడుపార సేవించిన శ్రీక్రిష్ణుణ్ణేనా నేను!

    శకుంతలరాజ్ఞీ! నా హృదయం నీ హృదయంలో గాఢంగా అదుముకొని నిధ్రపోయేదానవు. నిద్రలోనై నా అటు తిరగడానికి వీలులేకపోయేది. నీవు కదలక చిన్న పాపవలె గాఢనిద్ర పోయేదానవు. నేను కొంచెం కదిలితే, ఆ నిద్దర్లోనే నన్ను అల్లుకునేదానవు.

    నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎన్ని యుగాలు చూచినా తృప్తి తీరుతుందా దేవీ? ఆ కళ్ళ అందాలు వర్ణించగలనా? కాటుకకళ్ళు ఎంత వెడల్పు అవి. ఆ వెడల్పుకు తగిన కనీనికలు, ఆ కనీనికలలో ఎంత లోతులు. ఎంత గాఢ నీలాలు? అరమూతలతో చెన్నారే ఆ కళ్ళు దూరాననుండి మాత్రం దర్శింప గలిగేవాణ్ని. కన్నులు నావైపు తిప్పి నా శకుంతల నన్ను చుస్తే నేను ఎదురు చూడలేక

పోయేవాణ్ణి. ఆమె కన్నులు బొమ్మలలో వేయగలిగిన చిత్రకారుడు లేడు. మొలేరాంకాని, అజంతా చిత్రకారులు కాని ప్రయత్నించినా వాని అందాలలో ఒక అంశమాత్రం చిత్రించగలరో లేదో!

    మా ఆనందంలో దేహవాంఛ లేదనను. నాకు పూర్తిగా ఉంది. కాని దేహాతీతమైన ఏదో మహత్తరానందము నన్నా రోజులలో ముంచెత్తేది. నాలోని ప్రతిఅణువు పులకరించిపోయేది. ఆమెపై కామవాంఛ లేకుండానే నే నామే ఎదుట ఉంటేనే చాలనిపించేది. ఆమె దేహసౌందర్యము తనినోవ చూచి ఆ అనుభూతి మత్తతలో మైమరచేవాణ్ని. ఆమె నాయెదుటే అలంకరించుకోవాలి, ఆమె సిగ్గుతో కుంగిపోయేది. ఈ లాటి వేళలలో మీరు నాకు కొత్తఅని కాదండీ అని శకుంతల అనేది. ఆమెకు సిగ్గు మాత్రమే! నిలువుటద్దం ఎదుట ఆమెనూ, గ్రీకు వీనసు విగ్రహాన్నీ నిలుచుండబెట్టితే వీనస్సే తేలిపోయేది.

    ఆమె చెవులు, భుజాలు, నడుం, జఘనము, పాదద్వయం ఊహించుకోలేని పరమమూర్తిత్వంలోని దివ్యశ్రుతులే! ఇవన్నీ నాకు సన్నిహితంగాలేని ఒక క్షణం లేదు. రాత్రిళ్ళు నాకు నిద్రలేదు. నా ప్రక్కలోని సర్వలోక నిధి ఏది? ఆమె నా ప్రక్కనే ఉందనుకొని, గుండె నీరయి, నీరసపడి, కన్నీరు మున్నీరై వెక్కి వెక్కి ఏడ్వలేక, అసురుసురయిపోతూ ఉండే వాణ్ని. ఎవరు నా దుఃఖము తీర్చేది? నా శకుంతలే నా దుఃఖము తీర్చగలదు! మనుష్యులు మరల బ్రతికివస్తారా? ఆమె దేవతై నా దగ్గరకు రాకూడదా? ఆమె ఆత్మ నా కౌగిలింతలో ఇనుమకూడదా?
 
ఆమె నా దగ్గరకు వచ్చినట్లు భావించుకొని ఒళ్ళు ఝల్లుమని, ఆమెను ఆ భావంలోనే బిగియార కౌగిలించుకొని, మోమును నా మోముకు చేర్చి, ఎఱుపు వెన్నెల పూవులైన తీయ పెదవులను గాఢంగా ముద్దు పెట్టుకొనేవాణ్ని. ఆమె చీరలు, రవికలు, బాడీలు, లోపరికిణీలు, వల్లెలు నగలు బీరువానుండి తీసి పెట్టెలలో సర్ది వెంట తీసుకువచ్చాను. ఆ చీరలు నా హృదయానికి అడుముకొనేవాణ్ని. అవే గాఢంగా కౌగిలించుకొని పడుకొనేవాణ్ని! ఆ రవికలపై ముద్దులు కురిపించేవాణ్ణి. ఆ నగలు తలపై ధరించేవాణ్ణి. ఈ కర్మకాండ ఇంటిదగ్గర ఉన్నంత సేపూ జరిగేది.

    ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయేవాణ్ని. నా ఏడ్పుకు నేను అడ్డురాలేదు. నన్ను నేను సమాధానం పెట్టుకోదలచుకోలేదు. ఏడ్చి ఏడ్చి ఏడ్చి ప్రాణం పోవాలనే ఆశించాను. పోతుందనుకునే ముహూర్తాలూ ఉన్నాయి. అప్పుడు వికాటానందం పడి! మృత్యుదేవీ! రా అని అరచాను.

    శకుంతలా ! ఇవి నీ నగలు, ఇవి నీ చీరలు, ఇవి నీ రవికలు. ఏమి చెయ్యను వీనిని! నీతో నన్ను ఎందుకు సహగమనం చెయ్యనియ్యలేదు? ఈ చీరలతో, నగలతో సహగమనం చేయకూడదూ! ఇవన్నీ పోగుచేసి కిరసనాయిలతో తడిపి వానిని నా గొంతువరకు పేర్చుకొని, ఒక్క అగ్గిపుల్ల వెలిగించుకోకూడదా, అని ఆ ప్రయత్నం ప్రారంభించాను.

ఛా, ఆమె చీరలు నా అపవిత్ర దేహంతో ఎందుకు దహించుకుపోవాలి? అని ప్రశ్నించుకొన్నాను. ఒక చీర చాలు. అంతా సిద్దం చేసుకున్నాను.

                                                                                                                       19

    పాతగుడ్డలూ, కొన్ని దుప్పట్లు పోగుచేశాను.వాని నన్నిటినీ కిరసనాయిలలో తడిపినాను. నా చొక్కా, నా పంచె కిరసనాయిలలో తడిపినాను. అన్నీ సిద్దపరచి, గదిలో వస్తువులన్నీ అంటుకునే ఏర్పాటు చేశాను. ఉత్తరాలు అందరికీ వ్రాశాను. మా శకుంతల ఫోటో ఒకటి తీసి గంటలకొలదీ హృదయాని కద్దుకొని నా చదువుగదిలో కూర్చున్నాను.

    శకుంతలా!నా ప్రేమ నీచమైంది కనుక నీతో రాలేకపోయాను! ఒకరో ఇద్దరో తప్ప మనుష్యులలో ప్రాణప్రియవెంట ప్రాణము వదలినవారెవరు? మగవాళ్ళకు ప్రేమ తక్కువ. మగవాళ్ళు కర్కశ హృదయులు. మగవాళ్ళు రాక్షసులు. నా శకుంతలను వదలి ఇన్నాళ్ళు బ్రతికి ఉండగలిగిన నేను పరమ పాపిని.

    నా పళ్ళు బిగించుకొన్నాను. కళ్ళు జేవురించాయి. మనస్సు నిశ్చలం చేసుకున్నాను. ఆ ఫోటోతో జేబులో అగ్గిపెట్టెతో మేడమీద నా సహగమన మందిరానికి వెళ్ళడానికి హాలులో మెట్లదగ్గరకు పోయాను.

    ఇంతలో వంటింటిలోంచి మా అమ్మగారు వచ్చి నాయనా, ఈ రోజుకు కూరలేమీ తెప్పించలేదేమి బాబూ! ఏమి చెయ్యమన్నావు తండ్రీ! అన్నది.

     నాకు ఆకలి లేదమ్మా! సాయంకాలం తెస్తాను. అప్పుడు కూర వండ వచ్చునులే! అని మెట్లెక్కిపోయాను. నా సహగమనపు గదిలోకి వెళ్లాను.

    ఇంతలో నా వెంటనే మా అమ్మగారు కూడా వచ్చి, గదిలో ప్రవేశించింది. అంతా కలయచూచింది, నా తండ్రీ, ఇదేమిరా బాబూ! అని మూర్ఛలో విరిగి పడిపోయింది.

    నేను తెల్లపోయినాను. వెంటనే ఆమె కడకు ఉరికి ఆమెను లేవనెత్తి గబగబ మేడహాలులోనికి తీసుకువచ్చి పనిమనిషిని పెరేట్టిపిలిచాను. నీళ్ళు, నీళ్ళు! అని కేకవేశాను. మాతో కొల్లిపరనుంచి వచ్చిన పనిమనిషి నీళ్ళు పట్టుకొని పరుగెత్తుకొని వచ్చింది.

    కాశీలో చాలాకాలంనుంచి ఉన్న ఒక తెలుగు బ్రహ్మణ యువకుని, సహాయంగా ముప్పది రూపాయలు జీతం యిచ్చి ఏర్పాటు చేశాను. ఆ అబ్బాయి మేడమీదికి పరుగిడి వచ్చాడు. అతన్ని డాక్టరు అని కేకేసి చెప్పాను. అతడు వెంటనే పరుగెత్తిపోయినాడు. ఈలోగా నీళ్ళు పెట్టి నుదురూ, తలా తడుపుతూంటే మా అమ్మకు మెలకువ వచ్చింది. ఆమె మాటలాడలేక పెదవులు వణికిపోగా నా చేయి గట్టిగా పట్టుకొని, మళ్ళీ మూర్ఛపోయింది. గురక, నోట నురుగు, చేతులు కొంకర్లు, పళ్ళు బిగిసి పోయాయి.

    అయ్యో! మా తల్లి ప్రాణం విడుస్తుందా? అమ్మా! ఎంతటి ఛండాలపు కొడుకును కన్నావు? గుండె దడదడమంటూ, కళ్ళనీళ్ళు కారిపోగా డాక్టరు గారి కోసం ఎదురుచూస్తున్నాను. నీళ్ళతో మా పనిపిల్ల అమ్మ తల తడుపుతూనే ఉంది.

    ఇంతట్లో కారు చప్పుడైంది.డాక్టర్ను వెంటబెట్టుకొని గంగాధరుడు వచ్చాడు. నేను వణికిపోతూ అమ్మ విషయం చెప్పాను. నా కిరసనాయిలు గతి సంగతి చెప్పలేదు. ఆయన పరీక్ష చేశాడు. ఏదో మందుగొట్టం తీసి ఇంజక్షన్ ఇచ్చాడు. ఒక చిన్న గొట్టం బద్దలుకొట్టి ముక్కుకడ వాసన చూపించాడు. అమ్మ మళ్ళీ కళ్ళు తెరచింది.

     అమ్మా డాక్టరుగారు వచ్చారు. నీకు ఇంజక్షన్ ఇచ్చారు. నేను నీకు నా శకుంతల సాక్షిగా, నువ్వనుకున్న పని చేయనని ఒట్టు పెట్టు కుంటున్నా అమ్మా! అన్నాను.

    డాక్టరుగారు నన్ను చూచి, ఇంగ్లీషులో ఏమయ్యా మీ అమ్మ గారికి హృదయం చాలా నీరసంగా ఉంది. అది తాత్కాలికమే. నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలి. రెండు మూడు ఇంజక్షనులు ఇస్తాను. మందుకు సీసా పంపించండి అన్నాడు. మందుకోసం ఆయన వెంటే మా గంగాధరుడు వెళ్ళినాడు.

    మా అమ్మ ఎదుటే నీళ్ళబాల్చీ తెప్పించి కిరసనాయిలు గుడ్డలన్నీ నీళ్ళల్లో వేశాను. మా అమ్మకు బాగా కులాసా చిక్కేవరకూ నేను కొంచెం ఎచ్చు తగ్గుగా, సర్వకాలాలూ, ఆమె దగ్గరే ఉన్నాను. కిరసనాయిలు బట్టలన్నీ పదిసార్లు సబ్బు నీళ్ళల్లో ఉతికించి బాగుచేయించి చాకలివానికి వేశాను.

    మా అమ్మ పదిరోజులైన వెనుక నన్ను పిలిచి, నాయనా,నిన్ను చూసుకునే ఇన్నాళ్ళు బ్రతికి ఉన్నాను. లేకపోతే మీ నాన్నగారు పోయిన వెంటనే నా ప్రాణాలు పోయివుండేవి. శకుంతలకు నువ్వు ఈలాంటి దుర్మరణం పాలవడం ఇష్టమౌతుందనా? ఇక నేను నిన్నెలా నమ్మను తండ్రీ! అని కళ్ళనీళ్ళతో అన్నది.

అమ్మా, నాలో మండిపోతున్న దుఃఖంకొద్దీ ఏ పిచ్చి పనులున్నా చేస్తానేమో కాని, నా ప్రాణం మాత్రం తీసుకోను. నీ పాదాలసాక్షి, నాన్న గారి స్ర్ముతి సాక్షి, శకుంతల మృతిసాక్షి!

     సరే నాన్నా! మనస్సు మాత్రం కుదుటపరచుకోవద్దూ? ఆడదాన్ని. నేను మీ నాన్నగారు వెళ్ళిపోయిన వెనుక నీ కోసం కదా బ్రతికి ఉంటిని. నాయనా, చచ్చినవాళ్ళతో చస్తామా? అయితే ప్రపంచం అంతా ఇదివరకే నాశనం అయిపోయి ఉండును కదా? ప్రేమలు లేకే ప్రజలు బ్రతికి ఉన్నారా? ఎంత ప్రేమైనా, బ్రతికి ఉన్నవారి విషయంలోనే మనధర్మం పాలించవద్దా నాన్నా! ఏదో వ్యావర్తులు పెట్టుకో! కాశీ వచ్చింది మరి కాస్త గుండె బద్దలు కొట్టుకోడానికనా? తల వాల్చికొని అమ్మా, నన్ను నమ్ము అన్నాను.
    
                                                                                                                        20

    కాశీపట్నం విచిత్రంగానే ఉంటుంది. పట్నంలో ఒక్క వీధీ పెద్దది కాదు. అన్నీ వంకర టింకర గల్లీ లే. గంగానదీ తీరం పొడుగునా అన్నీ

స్నానఘట్టాలే- దశాశ్వామేధం, కేదారం, మణికర్ణిక, హరిశ్చంద్ర_ అంతటా వేలకొలది మెట్లు. గంగానదికి వానకాలంలో వరదలు. వేసవికాలంలో వరదలు. శీతాకాలంలో మాత్రం నీరు నీలంగా ప్రవహిస్తుంది. ఇదివరకు నా నమ్మకాలన్నీ మరిచిపోయాను. ఈనాడు నేను నాకే వేరయ్యాను. నాకు గంగానది ఏమీ పవిత్రంగా కనబడలేదు. నాకది నదీ, మురుగు కాల్వల కలయిక లాగ తోచింది. నాకు విశ్వేశ్వరుడు భారతీయుల మూఢత్వ హిమాలయ పర్వతానికి శిఖరంలా కనిపించాడు. ఇక్కడ అన్నపూర్ణ అన్యాయాల ముద్ద. అన్యాయాలుచేసి, అబద్దాలాడి, మోసాలుసలిపి కాశీవాసులు అన్నం సంపాదిస్తారు. అదే కాబోలు అన్నపూర్ణ, విశాలాక్షి, డబ్బు, డబ్బు, డబ్బు,! విశ్వేశ్వరుడికి డబ్బు, పూజారులకు డబ్బు, పండారులకు డబ్బు, గంగాపుత్రులకు డబ్బు, చచ్చినవారు అగ్నికి ఆహుతి కావడానికి డబ్బు! ఏదో నెమలి పింఛం నెత్తిమీద పెట్టి ఆశీర్వదించి, డబ్బు అడుగుతాడు: ఇవ్వకపోతే నానా తిట్లు తిడతాడు. నీ మోక్షం కోసం, నేకు సర్వసంపదలు రావడం కోసం కుంకం ఇచ్చేవాడు: విభూతి ఇచ్చేవాడు, పువ్వులిచ్చేవాడు. అవి అక్కర్లేదంటే శాపనార్ధాలు! పండాలకు, గంగాపుత్రులకు నీటి నియమాలు లేవు. అబద్దాలకు వెరవరు. మోసం చేయడానికి వెనుదీయరు. వాళ్లకు భక్తిలేదు, భయంలేదు. ఎప్పుడూ కనబడే విశ్వేశ్వరుడు వాళ్ళనేం చేస్తాడు? ఆ విశ్వేశ్వరుడు ఒక పెద్ద మోసం అని వాళ్ళకు పూర్తిగా తెలుసు.

    ఆ విషయం నేనూ తెలుసుకున్నాను. నేను బురదనీళ్ళు అభిషేకం చేసినా ఊరుకున్నాడు: కళ్ళు పూవులు నెత్తిమీద వేసినా ఊరుకున్నాడు. ఏ రాయి ఊరుకోదు?

    భారతీయుల కిలాంటి మూఢనమ్మకాలు ఎందుకు వచ్చాయి? ఎవరో కెమల్ పాషావంటి మహానుభావుడు హిందూమతానికి కావాలి! యజ్ఞోపవీతాలు పోవాలి, కులం తేడాలు చావాలి, మొక్కుబళ్ళు నశించాలి, పూజలు మాయం కావాలి, యాత్రలు ఎగిరిపోవాలి, తీర్థాలు, కుంభామేళాలు, పుష్కరాలు, అర్దోదయాలు, వైకుంఠ ఏకాదశులు, కృత్తికా నక్షత్ర ప్రవేశాలు, పండుగులు,పబ్బాలు రూపుమాసి మండిపోవాలి.

    ఓయి వెఱ్ఱిదేవుడా నీ పని అయింది. నేను కత్తి గట్టాను. నాబోటివాళ్ళు ఈదేశంలో అప్పుడప్పుడు ఉద్భవించకపోతే చెలరేగిపోదువు నువ్వు. నీకు సిగ్గులేదు, నీ భక్తులకు లజ్జలేదు. నువ్వు బానిసత్వానివి. నీ వల్ల ప్రపంచంలో కోటి యుద్దాలు వచ్చాయి. కోటి కక్షలు ఏర్పడ్డాయి.

    ఏం చేయగలిగావు నువ్వు ? ఓయి విస్సయ్యా! నీ పెళ్ళాం విస్సంమ్మను ఎంత అవమానమైనా చేసావు. నేను శివపురాణం, స్కందపురాణం వ్రాసే గంజాయిదమ్ముగాణ్ణి కాదు. మద్దతు పీల్చేవాణ్ని కాదు. భంగు తాగేవాణ్నికాదు. నువ్వు లోకమోసానివిరా విస్సయ్యా! నీ తమాషా నేను కనుక్కుంటాను. నువ్వు ఉంటే నా శకుంతలను ఎందుకు తీసుకుపోయావు? నువ్వు లేవు, లేనేలేవు.
   

ఇదే నా పాట. ఇదే నా ఉద్యమం. నేను విశ్వేశ్వరునిపై సాగించిన యుద్ధం అన్ని రంగాలలో విజృంభించింది. నా చిన్నమాట సంభవించిన ప్రపంచ యుద్ధం ఈ యుద్దమంత సర్వతోముఖంగా నడవలేదు. అసలు నాతో యుద్ధం చేసేందుకు ఏడీ ఈ మగవాడు విశ్వేశ్వరుడు! దద్దమ్మ, హీనుడు, సిగ్గులేనివాడు, పాషండుడు, షండుడు! రమ్మనండి. త్రిపురాసుర సంహారం చేశాడట. రాత్రిళ్ళు నాలో కామం ప్రకోపింపసాగింది. నా శకుంతలా వియోగం నాకు తీరని బాధ. నాకు కలిగే కామవాంఛకు నేనే సిగ్గుపడ్డాను. కాని శకుంతలా స్మృతియే నా కామవాంఛా ప్రవాహానికి ఆనకట్ట అయింది.

    ఏమిటి నీతి? ఎందుకు ? నా ప్రేమంతా వెళ్ళిపోయిన ఒక పరమ బాలికకు ధారపోశాను. ఇంక నా కామవాంఛా ప్రవాహానికి ఆ పవిత్ర బాలికా ప్రేమభావం ఎందుకు అడ్డం రావాలి? నా ప్రేమను హరించిన ఈ దేవుళ్ళను అవమానం చేయాలంటే స్త్రీ వాంఛయే ఉపాయమనే నిశ్చయానికి వచ్చాను. ప్రసిద్ది కెక్కిన ఉత్తరాది భోగంవాళ్ళ ఇళ్ళకు వెళ్లాను. చెమటలు పట్టాయి. పది రూపాయలు నర్పించుకొని పారిపోయి వచ్చాను. ఆ మహాపట్నంలో కొందరు సంసారిణిలు కూడా ధనంకోసం ఈ వృత్తి చేస్తూ ఉంటారు. యాత్రికులే వారికి విటులు. అట్లని అన్నిరకాల విటులను చేరనివ్వరట.

    అలాంటి వారిలో ఒక పండా రెండవ భార్యతో నాకు స్నేహం కుదిరింది, ఆ అమ్మాయికి నా ఈడే ఉంటుంది. చాలా అందంగా ఉంది. ఉత్తరాది సంగీతం చక్కగా పాడేది. చీరెలని, రావికలని రెండు వందల రూపాయలు ఆమెకోసం ఖర్చుచేశాను. అయిదారుసారులు అప్పుక్రింద పాతిక, ముప్పై, పదిహేను సొమ్ము ఇచ్చాను. ఆ అప్పు తిరిగి వస్తుందని కాదు. ఆ వంకపెట్టిగాని ఆ అమ్మాయి డబ్బు పుచ్చుకోనేది కాదు. భర్తకు మా యిద్దరి స్నేహం తెలుసును. ఇద్దరం అల్లరి చేసేవాళ్ళం, పాడుకునే వాళ్ళం. ఆ అమ్మాయికి తెలుగు వచ్చును. ఎందుకంటే ఆవిడభర్త, తెలుగువాళ్ళ పండాలలో ఒకడు. ఆమె పేరు సుశీలాదేవీ! ఆమె నాతో చెప్పడం ఇంతవరకూ నా వంటి స్నేహితుడామెకు దొరకలేదట. కాశీ విశ్వవిద్యాలయంలో చదువుకునే ఇద్దరు తెలుగు విద్యార్థులు అప్పుడప్పు డామెకడకు వస్తారట. ఆమెకు కామసంబంధం ఉందట. వాళ్ళు డబ్బు బాగానే ఇచ్చేవారట. నే నామె జీవిత పథంలోకి రాగానే ఆమె వాళ్ళిద్దరినీ ఇకరావద్దందట! ఎంత స్నేహం అయినా సుశీలాదేవితో ఇంతవరకు కామసంబంధం కలిగించుకోలేకపోయాను. ఆట పాటలతో, కేరింతలతో సరిపోయేది.

ఒకరాత్రి సుశీలాదేవి తమి పట్టేకపోయింది. నామీద వాలిపోయింది. నా మొగమంతా ముద్దులు కురిపించింది. బంగారు తీగలాంటి తన శరీరం నా శరానికి అతిగాఢంగా, గాఢంగా అదిమివేసి అలుముకుపొయింది. నాలోని కాంక్షలు వక్కసారిగా విజృంభించినాయి.
    మూర్తీ! మూర్తీ! నాకోర్కె తీర్చు. నీకోసం బ్రతుకుతున్నా! అన్నది ఆమె. నాకు వళ్ళు  తెలియలేదు. ఇంతలో  మెలకువ  వచ్చింది! ఏది నాకు మెలకువ  తెచ్చిందో  తెలియదు. అంతే!
   నాకు బొటబొట కళ్ళనీళ్ళు కారిపోయినవి. మంచంనుండి. జీవచ్చవంలా  లేచాను. నా చొక్కా తొడుక్కొన్నాను. సుశీలాదేవి లేచి జాకెట్టు తొడుక్కొని  చీర కట్టుకుంది.
     మూర్తీ!  కోర్కెతీర్చకుండా వెళ్ళిపోతావా?  నేనేం చేశాను? నేను స్వచ్ఛమైన దానిని కాననా నీ ఉద్దేశం? అవును; మాబోటి  నిర్భాగ్య  జీవితాలలో నిర్మలత్వం  ఎక్కడ వస్తుంది!
    సుశీలా! నీతో సహవాసం చేసి, నీమతి విరిచిన  తప్పునాది. అంతే! నేను ఇప్పుడు స్త్రీ  పురుషధర్మం నిర్వహించకుండా వెళ్ళిపోవడానికి  నువ్వు కారణం కాదు. నేనే కారణం. నాలో భయం  దాగి వుంది. పూర్వవాసనల నీరసత్వం  నన్ను కుంగదీస్తున్నది.
    నువ్వు  నా స్నేహం చేసినప్పటినుంచీ ప్రేమనేది  ఏమిటో తెలుసుకున్నా, ప్రేమకు ఫలం యివ్వవా నాకు?  నేను ప్రేమించగలిగినవాడు దొరికితే  చక్కని కొడుకుని, అందంమైన బాలికను కందామని  యెదురు చూస్తున్నా, ఈరోజు  నాప్రేమ తృప్తి, నా ప్రేమ ఫలం వాంఛించి సిద్దమయ్యాను. మూర్తీ! నువ్వలా  వెళ్ళిపోతావా?  నా  జన్మలో ఇక రాజపుత్ర సానపు ఎడారులేనా?
    సుశీలా, నన్ను  ఆలోచించుకోనీ, నీకు భర్త  వునాడు! యిద్దరు విద్యార్ధి స్నేహితులున్నారు....
    నోరుముయ్ మూర్తీ! నీ నిర్ధయవల్ల  నన్ను  చంపేయడమే కాకుండా, నన్ను దెప్పుతున్నావా? మీ మగవాళ్ళంత  తుచ్ఛులు ఎక్కడన్నా ఉన్నారా?  పట్టుకుపో నీ డబ్బూ, నీ విచ్చిన బట్టలూ.  ఆడడానికి అభిమానం  లేదనుకున్నావా?
    సుశీలా! నా చరిత్రంతా నీకు చెప్పలేదు.  రేపు సాయంకాలం  వచ్చి, నా జీవితం యావత్తూ నీకు నివేదిస్తా. నువ్వే నాకు  న్యాయాదిపతివి   అవు! ఇంతకన్న  ప్రస్తుతం మాట్లాడలేను.
   అని విసవిస వాళ్ళింటిలోనుంచి వచ్చేశాను. ఆ గల్లీలలో తిరిగి తిరిగి ఇంటికి చేరుకొన్నాను. అప్పటికి పదిగంట  లవుతుంది. రోజూ పదకొండు గంటలలోపుగానే  ఇంటికి చేరుకొనేవాణ్ణి. ఏవో రెండు మెతుకులు  నోట్లో వేసుకొని  పడకగదిలోకిపోయి, మంచంమీద కూలిపోయాను. పాపం సుశీల  కామవాంఛతీర్చలేకపోయాను. నా పిరికితనానికి  నన్నే తిట్టుకున్నాను. ఎందుకు వచ్చిందో  ఈ  పిరికితనం? ఎందుకామె వాంఛ తీర్చకూడదు? దేవు ళ్ళకే ఎదురు తిరిగిన నేను పుణ్యపాపాలూ, నైతిక ధర్మాలు  గణించడం ఏమిటో? నాకా భావాలు  నా శకుంతలతోనే  వెళ్ళిపోయాయి. కాని పిరికితనం పోలేదు. పిరికితనం యుద్దంలో పరాజయం తెస్తుంది. దేవుళ్ళతో యుద్దం  చేయడంలో  పిరికితనం  తిరిగి  ఎదురువచ్చిన  నారాయణాస్త్రం  వంటింది.
   దేవుళ్ళతో యుద్ధం  మన హృదయరంగంలో పూర్వ నమ్మకానికీ  అందుకు వ్యతిరేకం  అయిన విప్లవభావాలకూ యుద్థమేకదా! నా  ముందు వేలకొలది పూర్వీకుల  నమ్మకాల కోటలు బురుజులతో ఆకాశం  అంటే  అతి మందపు  గోడలతోటున్నాయి.  నాకు బలం నాబోటివాళ్ళే, పాశ్చ్యాత్యులలో కొందరూ, అంతే! 


   ఆ  గోడలు  నాకు సుశీల  గదిలో కనుపించాయి. నా దగ్గర యంత్రాయుధాలు తక్కువగా ఉన్నాయి. సుశీల  అందం బలం యివ్వలేదు. ఆ గోడల మీద  నా శకుంతలను భావించుకొన్నాను కాబోలు.
   తెల్లవార్లూ  నిద్రపోలేదు. పక్కమీద దొర్లుతూ ఉన్నాను. తల వేడెక్కి ఉంది. ఉడుకెత్తిన  నా రక్తం  చల్లారలేదు. సుశీల  వాక్యాలు నా గుండెను అదరించివేసాయి. లేచి రెండు మూడుసార్లు వీధి తలుపు దగ్గరకు వెళ్లాను, సుశీల దగ్గరకు వెడదామనే! మళ్ళీ సిగ్గుపడి వెనక్కు చక్కా  వచ్చాను.
                                                                                                                21
   సుశీలాదేవి ఇంటికి వెళ్ళడమే మానివేశాను. మానివేసిన మూడురోజుల్లో సుశీల భర్త  మా యింటికి వచ్చాడు. అతణ్ణి చూడగానే నేను సిగ్గుచేత    నేలలోనికి కుంగిపోయాను. ఏ తగాదా వస్తుందో  అని భయపడిపోయాను.
   సుశీల భర్త పేరు జగత్ రాం పండా. జగత్ రాం పండాకు  సుశీల రెండవ భార్య.  భార్య కోరిన  కోర్కెనెరవేర్చడం అతని తపస్సు. ఆమె సంతోషంగా ఉంటే విశ్వేశ్వరుడు ప్రత్యక్షమైనట్లే అతడు  సంతోషించేవాడు.
    పండిట్ జీ! నా భార్య భయంకరమైన జ్వరంతో పడిపోయింది.జ్వరం సంధితో ప్రారంభించింది. సర్వకాలం నీపేరే  గొణుక్కుంటుంది.  వచ్చాడా శ్రీనాథమూర్తి?  అనే  ప్రశ్న బాబూజీ! నువ్వు  వెంటనే ఒక్క సారి  మా యింటికి  రావాలి. నా సుశీల  నన్ను విడిచి  వెళ్ళిపోతే ఒక్క నిమిషం  బ్రతకలేను. నువ్వు వెంటనే రావాలి. నన్నూ, నా భార్యనూ బ్రతికించు, నా బగ్గీమీద  పోదాం రా బాబూజీ!
   ఆ మాటలు  వింటోంటే నా ప్రాణాలే  పోయాయి. నా శకుంతలతో  పాటు  దేశంలో ఉన్న ఆడవాళ్లందర్నీ చంపడానికే పుట్టానా అని వణికిపోయాను. వెంటనే బయలుదేరాను  జగత్ రాం పండా ఇంటికి. ఇల్లంతా చుట్టాలతో కిటకిటలాడుతూ ఉంది. ఆపట్నంలో  ప్రసిద్దికెక్కిన  ఆయుర్వేద వైద్యుడు వైద్యరాజ్  పండిత్ బోలానాథ్  రిగి మంచం దగ్గర  ఉన్నాడు సుశీల మంచంపై ఇటూ అటూ  కొట్టుకొంటూ ఉన్నది. ఆమె కళ్ళు  అరమూ తలుగా  ఉన్నాయి. ఆమె మాడుపై  ఏవో  మందుపట్టీ  వేశారు. వైద్యుడు  రోగి  నాడి పరీక్ష చేస్తున్నాడు.     
                                                                                                                           జగత్ రాం పండా, నేనూ గదిలోనికి రాగానే  వైద్యుడు  మావైపు  నావైపు తీక్షణంగా చూచి,  నువ్వేనా  శ్రీనాథమూర్తివి? అని అడిగినాడు.  చిత్తం పండిట్ జీ  అన్నాను.
    ఈమె బ్రతకాలంటే  నీలో ఉంది, ఈవిడకు జ్వరం మెదడుకు పట్టింది, గుండె చాలా నీరసంగా ఉంది. నువ్వు ఈగది  అత్యంతావసరాలకుగాని  వదలకుండా రాత్రింబగళ్ళు మందు లివ్వడం, మంచినీళ్ళివ్వడం,  వగైరా  అన్ని పనులు  చేయాలి. అప్పుడు  ఈ  అమ్మాయి  బ్రతకడానికి  సావకాశాలు ఉన్నాయి. లేకపోతే  రెండు రోజులకన్న  ఎక్కువ పూచీ  పడలేను.
   నేను, గుండె రణభేరీ వాయిస్తూవుండగా సరేనని  తల ఊపాను.
    శ్రీనాథ్! నువ్వు నాకు బిడ్డనీయకుండా....వెళ్ళిపోతావా?....ఇన్నాళ్ళనుంచీ....నామీద  ప్రేమ....దొంగ....ప్రేమా అని గొణుగుతున్నది  సుశీల.
   నాకు  చెమటలు పట్టాయి. ఆ   వైద్యుడి ముఖం  చూడలేకపోయాను  సుశీల  మంచం మీద  ముఖం వాల్చుకుని  కూచున్నాను. ఆమె  చేయి నా రెండు  చేతులతో పట్టుకున్నాను. కళకళ  కాగిపోతోంది  ఆమె వళ్ళు.
    ఆమె  నుదుటి మీద  చేయివేసి, ఆమె చెవిలో 'సుశీలా' అని పిలుస్తూ ఉండు. తల్లిలా, కుమారునిలా నువ్వు  సంచరించాలి. జ్వరం తగ్గి తెలివి వచ్చిన తరువాత  మందులు  మారుస్తాను అన్నాడు వైద్యుడు.
   ఆమె నుదుటిమీద చెయివేశాను. అబ్బా!  నాకెన్ని పరీక్షలు?  ఇలాగే నా శకుంతలను  నా కోసం బ్రతుకు  అని  ప్రార్థించాను. అయ్యో  శకుంతలాదేవీ! నా కెలాంటి పరీక్షలు  పెట్టావు  ప్ర్రాణేశ్వరీ! 
   సుశీల చెవిలో  సుశీలా! నేను శ్రీనాథమూర్తిని, నీ కోసం వచ్చాను. నెమ్మదించు సుశీలా! అని  కళ్ళనీళ్ళు కారిపోతూ  వుండగా   పిలిచాను.
   సుశీల కొంచెం  శాంతించింది. కదలకుండా పడుకుంది. నేను నా చెయ్యి  ఆమె నుదుటిమీద అలానే ఉంచాను. ఆ గదిలోకి  ఎవ్వరినీ  రాకుండా  భర్త  గుమ్మందగ్గర కాపలా! నేనూ, వైద్యుడు లోపల. వైద్యుడు  పాశుపతాస్త్రము అనే  మందు ఇస్తున్నాను. ఇది ఇచ్చిందగ్గర నుంచి చాలా జాగ్రత్తగా  ఉండాలి నాయనా! అన్నాడు. ఏమిటా జాగ్రత్త  అని భయపడి పోయాను. తేనెలో రంగరించి, ఆయన ఆ మందు  సుశీల  నోరుతెరచి  నాలుకకు రాచినాడు, ' నేను మళ్ళీ వస్తా'అని చెప్పి వైద్యుడు వెళ్ళిపొయినాడు. పండా గుమ్మం దగ్గరే  రాయిలా  కళ్ళనీళ్ళతో  సుశీలవైపు  చూస్తూ, చేతులు నలుపుకుంటూ  నిలుచున్నాడు. సుశీల  చెవిదగ్గర  నా  నోరుంచి  సుశీలా! నేను శ్రీనాథమూర్తిని, నువ్వు మా అందరికోసం బ్రతకాలి. సుశీలా! నేను ఇదివరకే  ఎంతోకష్టం అనుభవించాను. సుశీలా! నా నెత్తిపై  ఇంకో చావు కూడా  పెట్టకు సుశీలా!అన్నాను. నా కంటినీరు ప్రవాహాలై  కారిపోయినాయి. 
   సుశీల నా వైపు తిరిగి  వచ్చావా? మూర్తీ, నా పెదవులు ముద్దు పెట్టుకో  అన్నది.
   భర్త  నాకు నమస్కరిస్తూ, పెట్టుకోండి బాబూజీ! అన్నాడు పాపం!
   నేను కాగిపోయే సుశీల పెదవులను  ముద్దెట్టుకున్నాను. సుశీల జ్వరంలోనే  చిరునవ్వు నవ్వుతూ నావైపు  తిరిగి  నా చుట్టూ  చేయిచుట్టి వళ్ళో తలపెట్టి  చంటిబిడ్డలా నిద్రపోయింది. నేను కదలలేదు, నడుం నొప్పి పెట్టింది.  ప్రాణాలు  క్రుంగిపోతున్నవి.  అలాగే కదలకుండా  కూర్చున్నాను. ఒక గంటకే కొన్ని వేల గంటలు  కూర్చున్నట్టు తోచింది.కాళ్ళు గుది కట్టినవి. రక్తం స్రవించడం  మానింది, వీపున  సూదిపోటులు  సుశీలకు  చెమటపట్టుట  ప్రారంభించింది.
   ఇంతట్లో  వైద్యరాజు  వచ్చాడు. నెమ్మదిగా నన్ను చుట్టిన చేయి  సడలించి, నాడి పరీక్ష చేసాడు. రోగి బ్రతికే ఆశలున్నాయి. బాబూజీ, మీరు నెమ్మదిగా తలతీసి  ఆ దిండు పైన  పెట్టండి. అన్నాడు, నే   నామె  తలను దిండుపైన  పెట్టాను. సుశీల కళ్ళుతెరచి ' ఆకలి ' అన్నది.  వైద్యుడామెకు  పళ్ళరసం  ఇప్పించాడు, నేను మంచంమీదనే కూర్చొని  వున్నాను. సుశీల నన్ను చేరి, గట్టిగా అదుముకొని మరల నిద్రపోయింది.


                                                                                                                  22
   సుశీలాదేవికి  జ్వరం నిమ్మళించింది. కాని  ఆ నీరస  స్థితినుంచి  కోలుకొనేటప్పటికి ఆమెకు  మూడు నెలలు పట్టింది. ఆమెకు బలం పట్టి  ఊడిపోయిన జుట్టు  మళ్ళీ గిరజాలులా వచ్చేటంతవరకూ అంట భయపడలేదు నేను. ఆడుతూ పాడుతూ  కాలం బుచ్చాను. ఆ కొద్దిరోజులూ శకుంతలా స్మృతి కొంత వెనక్కు పడింది.
   అలసటపడి  ఇంటికివచ్చి  నిద్దురపోయేవాణ్ని. సుశీలచేత వేళకు మందులు తినిపించడం, సుశీలకు ఒళ్ళు మసాజ్ చేయించుకునేటట్లు చూడటం, పళ్ళరసాలు, పాలు  మొదలైనవి తినేటట్లు  చూడడం, ఇది నా నిత్య కృత్యం. ఆ  రోజుల్లో  నాకామె స్నేహితురాలు. ఆమెను నేను  వాంఛించలేదు. ఆమె నన్ను వాంఛించలేదు. నాకా గొడవే  మనస్సుకు తట్టలేదు. కాని దేశంలో  సంచరిస్తున్న  అనేక భావాలు  ఆనాళ్ళలో నా ఎదుటపడ్డాయి. నేను బి. ఏ. సెకండు  క్లాసులో  విజయం పొందినా  ఇంకా  బాలుణ్ణే ఒక్క భార్య  విషయంలోనే  పురుషుణ్ని.
   నేడు కొంత  కాశీ విశ్వవిద్యాలయ విద్యార్థుల స్నేహం  లభించింది. సుశీల ఇంటికి వచ్చిన ఆంధ్ర విద్యార్థులతో నాకు స్నేహం లభించింది. వాళ్ళిద్దరూ  సామ్యవాదులు, వాళ్లకు కారల్ మార్క్సు జగద్గురువు. అల్లా అని అంటే మీద విరుచుకుపడతారు. అతడు విజ్ఞానవేత్త అని, 'గతితార్కిక ' శాస్త్ర పరిశోధనలచేత, ఇలా ఉంటె నిజమైన శాంతి ప్రపంచంలో  ఏర్పడుతుందని కాని పెట్టినాడని  వాళ్ళ వాదన. 
   నేను: అవి  శాస్త్ర  రీతిగా  ఉన్నాయని  ఎల్లా  చెప్పగలవు రామకృష్ణా?
   రామ: మనకు ఆలోచనా శక్తి ఒక రీతిగా వుంటుందా?
   నేను: అందరి ఆలోచనా శక్తి ఒక రీతిగా వుంటుందా?
   విశ్వమూర్తి : (ఇంకో స్నేహితుడు) అందరికీ సమానమైన  రాజకీయాధికారం, సమమైన  అర్థస్వామ్యం, ఉత్తరోత్తరా  ప్రపంచ రాజకీయాందోళన  సమసిపోతుంది గదా?

నేను : ఓయి వెఱ్ఱబ్బాయి! అంతటితో మన సమస్య పూర్తవుతుందా? ఒకడు ఎక్కువ అధికారాలు వాంఛిస్తాడు. ఒక సంఘం ఎక్కువ భాగం ఆశిస్తుంది. ఒకదేశం ఎక్కువు లాభం కోరుతుంది. అప్పు డీ సమానత్వం ఏమౌతుంది?

   రామ : ఏమోయి మూర్తీ! నీ వాదం వితండంగా ఉంది. మనం ఇల్లు కట్టించుకుంటున్నాము. పెద్ద భూకంపం వచ్చి ఇల్లు పడిపోతుందనుకో అన్నట్టుగా మాట్టాడుతున్నావు.
   విశ్వ : మనుష్యుల్లోని  నీరసత్వాలవల్లా, అన్యాయ  కాంక్షలవల్లా ఇప్పటి భయంకర స్థితి  ప్రపంచానికి  దాపురించింది. అవన్నీ  పరీక్షచేసి మానవ నైజం  సంపూర్ణంగా  గ్రహించి  కారల్ మార్క్సు తన 'డెస్ కాపిటల్' రచించాడు.
   నేను : అవునయ్యా! సరిగా 'డెస్ కాపిటల్' గ్రంథంలో వున్నట్లు రష్యా సోవియట్ రాజ్యం స్థాపన అయిందంటావా విశ్వం?
   విశ్వ :  ఏ  ఉత్తమ  విషయమైనా  ఆచరణలో పెట్టేటప్పటికి  కొన్ని తాత్కాలికాలూ, స్థానికాలూ, అయిన  మార్పులు  వస్తూనే  ఉంటాయి. గాంధీగారి  తత్త్వం  ప్రకారం కాంగ్రెసు  నడవ కలుగుతోందా మూర్తీ?
   నేను : అందుకనే నేను  చెప్పేది, ఆచరణ వేరు, ఆశయాలు వేరుగా ఉంటాయని, కనుక  ఏనాటికైనా  కారల్ మార్క్సు ఆశయాలు వృధా అవుతాయి.
   ఇలా  మా  ముగ్గురికీ  వాదనలు ప్రబలాయి. నా మనస్సులో ఉన్న ఆశయాలన్నీ నా శకుంతలతోనే  వెళ్ళిపోయాయి. నాకు  బోల్షివిజం అయినా ఒకటే, గాంధీయిజం అయినా ఒకటే. ప్రపంచంలో కొట్టుకు తినడానికి మనుష్యుడూ, జంతువులూ ఉద్భవించారు. ఎవరి వస్తువులు వారు  కాపాడుకొంటూ  వుంటారు. కొట్టుకు తినడానికీ, కాపాడుకోవడానికీ ఎప్పుడూ యుద్ధం. అందుకనే వెనుకటి  ప్రపంచ యుద్ధం వచ్చింది. అనే నమ్మకం స్థిరపడి పోయింది.
   నా  స్నేహితులు  నాకు చదువుకోమని అనేక గ్రంథాలు యిచ్చారు. రహస్యంగా రాష్యానంచి అనేక కరపత్రాలు వస్తూవుండేవి.కూలీలను రైతుకూలీలను, బీదరైతుల్నీ లేవదీయడం, కోటీశ్వరులను  జమీందారులను కూల్చివేయడం, ప్రజా విప్లవం తెచ్చి  సోవియట్  ప్రభుత్వం స్థాపించడం, ఇవి  ఆ కరపత్రాలలో ఉండే ముఖ్యవిషయాలు. ఒకసారి అన్ని దేశాలలో స్వామ్య రాజ్యాలు స్థాపన కావాలి  అని భావించాను.ఒకసారి ఏ రాజ్యంలేకుండా దేశాలన్నీ నాశనం కావాలనుకున్నాను. కాని అన్నింటికీ  వెనకాల  చిన్ననాటి నుంచీ మా శకుంతలతో బాటు  పూజించిన  మహాత్మాజీ ఆహింసాభావం నన్ను  వదలక  దెయ్యంలా పట్టుకుంది. 
   సుశీల నానాటికీ  తేరుకుంది. ఓరోజు సాయంకాలం  నేను సుశీల యింటికి వెళ్లాను. నా మనస్సులో ఆవేదనలు అణిగి ఉన్నాయి. నాకు అంత చైతన్యంకాని, హుషారుకాని లేక, ఏదో బొమ్మలా  తిరుగుతూ ఉన్నాను. మా అమ్మ ఏమిచేసి పెడుతుందో ఏంతింటున్నానో   నాకా రోజుల్లో  తెలియనే తెలియదు. అప్పటికి సుశీలకు  జబ్బు నెమ్మదించి నాలుగు నెలలు అయింది. వసంతకాలం  రోజులు. మత్తుదినాలు. ఆరోజు సాయంకాలం సుశీల యింటికి వెళ్ళగానే  ఆనాలుగంతస్థుల పూర్వకాలం  మేడపై, డాబామీద కుండల్లో  పూల మొక్కల మధ్య, తివాసీ పైన  పరచిన  దిండ్లమీద ఆనుకొని పడుకొని ఉంది.
   నే  నామె దగ్గరకు వెళ్లాను. ఆమె  ఒయ్యారం, కులుకు, అప్పుడే వస్తూన్న గిరజాలజుట్టు, కొత్తరకం! వేసవికాలంలో  హిమాలయాలలో  పొంగివచ్చే శైవాలినిలాంటి క్రొత్తదనంతో వరూధినిలా ఒరిగివుంది. నేను రాగానే ఇలారా, మూర్తీ!అంది.
   నేనామె దగ్గరకు వెళ్లి  కూర్చున్నాను. ఆ డాబామీద  వాళ్ళు  ప్రక్క డాబామీద వాళ్ళకు కనబడకుండా చుట్టూ  ఎత్తుగా  తడికెలు  కట్టి  ఉన్నాయి.మూర్తీ! నీకోసం బ్రతికా సుమా! అని ఆమె అన్నది.       
                                                                                                                      23
   నేను మౌనంగా  సుశీల ప్రక్కనే  కూచున్నాను. నా శకుంతల  కూడా ఇలా బ్రతకరాదా? ఆమె బ్రతికితే! ఓ దౌర్భాగ్యుడా! నీ కంత పవిత్రవరం  ఎక్కడ దక్కనురా! ఓయి ఛండాలుడా! సర్వరసపరిపూర్ణ  మహాభావం గ్రహించే   ప్రతిభ  ఎక్కడరా? ఓయి  నష్టాత్ముడా! ఆ  అప్రతిమాన సౌందర్యనిధిని అనుభవింప నీ  వెక్కడ తగుదువురా! ఓయి మురికి గోతుల  పొర్లాడేపందీ! నీకా  అసదృశ దివ్యతేజస్సు  భరింపశక్తి ఎక్కడరా?
   సుశీల నాతో ఏమి మాట్లాడిందో తెలియదు. కొంత మనస్సు ఇటు తిరిగేటప్పటికి  సుశీల నన్ను గట్టిగా, అప్పుడే పొంగి మరల తమతొల్లింటి పీనత్వం  సంపాదించుకొనే వక్షోజాలను అదిమి నామోమంతా  ముద్దులతో  ముంచివేస్తున్నది. ఈ హీనావస్థ నాకు నేనై తెచ్చుకున్నాను. నాగోయి నేను  తవ్వుకొన్నాను. నాకు మతిలేదు. శకుంతలా స్మృతి మాయమైంది, ఏదో శూన్యభావమే నా ఎదుట, నాచుట్టూ , నాలో! 
   సుశీలాదేవి, ఎన్ని విలాసాలు, కురిపించిందో! నాకు చైతన్యం ఏది? ఆమె నా లాల్చీ విప్పి అవతలవేసిన సంగతి నాకు తెలియదు. చిన్నపిల్లవాడి   వలె ఊరుకున్నాను కాబోలు! లాల్చీలోపల బనీను విప్పుతుంటే ఊరుకున్నాను కాబోలు! సుశీల ఉదయకాల  హిమాచలసానువుల నాక్రమించిన సువర్ణమేఘశకలంలా  నన్ను  ఆక్రమించి ఉండగా  మెలకువ వచ్చింది. నాలో ఇంతకాలం  అణచి పెట్టబడిన  అతి పురుషత్వ వాంఛలు ఉప్పొంగిపోయినాయి.


                                                                                                           *        *        *
   రాత్రి  ఎనిమిదిగంటలు  కొట్టుతుండగా  ఇద్దరమూ  మామూలు మానవత్వానికి  వచ్చాము. సుశీల  మోము  అత్యంతానందంతో  చిరుగాలులు  వీస్తూ ఉండగా కలకలలాడే  వెన్నెల రేయిలో  కలువపూవులా ఉంది. నేను మనో నీరసత్వంతో అక్కడనుంచి  లేచివెళ్ళి  పక్కమేడ  డాబామీద ఆట లాడుకొంటున్న బాలికలను చూస్తున్నాను.
   ఇది మహాదోషమా?  దోషరహితమా?  పుణ్యమా, పాపమా? శకుంతలా స్మృతి ఒక్కసారిగా ఎగిరివచ్చి నామీద వాలింది. ఆమె పేరు ఉచ్ఛరించడానికి  అర్హత  తీసివేసుకున్న  ద్రోహం చేశాను  నేను. హీనుడను, హీనుడను, హీనుడనయ్యా!  చెవిలో గింగుర్లు పెట్టినవి.
   పుణ్యమేమిటి, పాపమేమిటి? అన్న భావం  వచ్చింది. ఎంత నీరసుణ్ణి. నాకు నేనే శత్రువునా? విరోధినా? ప్రబలహంతకుణ్ణా?  సుశీల ఎరుపెక్కిన  బంగారు కమలంలా నా దగ్గిరకు  వచ్చి  డాబా  పిట్టగోడ   నానుకున్న నాపక్క  నిలబడింది.
                                         

నువ్వే నా భర్తవు మూర్తీ? ఇక నిన్ను వదలలేను. నేనేమి మాట్లాడగలను?

    మూర్తీ! ఈ రోజు  నేను  తల్లినయ్యే  సన్నాహంలోనూ ఉన్నాను. నీకు భార్యనయ్యే మధుర  సంసిద్దతలోనూ  ఉన్నాను. నేను సర్వదేవతలను దేవీమూర్తులను  ప్రార్ధించా! నువ్వు ఈ  వాళ  నా భర్త కావాలని, నేను  గవ్వ లక్కకు మొక్కుకున్నా కూడా! నా కోర్కె ఫలించింది. నువ్వు నాకు  బంగారు  పాపాయిని యిస్తావు.
   నా గుండె  గుభేలుమని  ఆగిపోయింది. నేను  యెంత  పని చేశాను! ఈమెకు  ఈ దొంగరకమైన భర్తనయ్యాను. నా శకుంతలను  రెండవసారి  చంపుకున్నాను. సుశీల తన తుచ్ఛవాంఛను (కాదేమో) తీర్చుకోవడానికి  దేవతల్ని  ప్రార్ధించి నెగ్గింది. నా దేవిని నేను బ్రతికించుకోలేకపోయాను. నా ఒళ్ళు గజగజ  వణికింది. సుశీల  నామీద చెయ్యివేసి,  అమ్మో! నీ  వళ్ళు  ఈలా  కాలిపోతుందేమిటి! రా లోపలి  రాఅని  నా  చేయిపట్టి, నా చుట్టు  చేయి వేసి నన్ను తనకు గాఢముగా  అదుముకొని క్రిందకు తీసుకువెళ్ళింది.
   ఎల్లా వెళ్ళానో! నాకేమీ తెలియదు. మెదడు వేడెక్కింది. ఒళ్ళు తిరుగుతోంది. కళ్ళు  మూతపడిపోయినాయి. ఆమె  నాకు  కాశ్మీర శాలువలు కప్పింది. మెత్తటి ఉన్ని పచ్చడము కప్పింది. శీతాకాలములో వాడుకొనే  రగ్గు కప్పింది. నా ఒణుకు  తగ్గలేదు.
   నాకు   107 డిగ్రీల  జ్వరం వచ్చిందట. మా అమ్మకు  కబురు వెళ్లిందట. మా అమ్మ  దాక్టరుకోసం గంగాధరుణ్ణి కబురు పంపిందట.  ఆయన కారుమీద  ఆ ఇంటికివచ్చి  నాకు  మెదడుమలేరియా  అని నిశ్చయించేశాడట. ఆ ఇంట్లో చావు  బ్రతుకుల  మధ్య  ఇరవై  రోజులున్నానట. మా అమ్మ మా మేనమామకు  టెలిగ్రాం  ఇచ్చిందట.
   మా మేనమామ  పరుగెత్తుకొని  కాశీ  వచ్చాడట. ఆ ఊళ్ళో  ఉన్న ఇద్దరి పెద్దడాక్టర్లను, అలహాబాదులో వున్న పెద్దడాక్టర్ని  పిలిపించారట. మా మేనమామ  నా కోసం  ఆ రోజుల్లో వేలు  ఖర్చు చేశాడట. వైద్యమే నన్నారోజుల్లో  బ్రతికించింది. ఆయుర్వేదం నన్ను మనుష్యుణ్ణి చేసింది. సుశీల ఆ రోజుల్లో తిన్నగా తిండి తినలేదట. మా అమ్మతోపాటే  నాకు సపర్య చేస్తూ  ఉండేదట. నాకు జ్వరం  నెమ్మదించడం  సుశీల  పిచ్చిదానిలా  చేసిన, ఒక పిచ్చిపని  వల్లనేనట.
                                                                                                             24
   సుశీల ఇంటిలో  నేనలా జ్వరంవచ్చి   పడి   ఉండడంవల్ల, సుశీలకు మతి పూర్తిగాపోయి, గవ్వలక్కకు మొక్కుకొని, అన్నపూర్నకూ, డుంఠి వినాయకునకూ అనేక పూజలు  చేయించింది, ఏడ్చింది, దొర్లింది.
   ఒకరోజు  రహస్యంగా  ఒక హిమాలయ  వాసి  సన్యాసి ఒకాయన దగ్గరకు  పోయిందట. ఆయన  మన్ను నలపిస్తే  అదేమందన్న ప్రతీతి  ఆ  మహానగరమంతా వ్యాపించి  వుంది. ఆయనకు సుశీల తనింటికి వచ్చిన  ఓ  తీర్థవాసికి  చాలా జబ్బుగా ఉందనీ,  అతడొక్కడే  బిడ్డననీ, తల్లీ కొడుకూ కలిసి వచ్చారనీ, ఆ  బాలకుణ్ని  రక్షిస్తే  వాళ్లదారిని వాళ్ళు పోతారని  చెప్పిందట. పైటకొంగున  ముడిగట్టిన  పాతిక రూపాయలా సన్యాసి  చేతిలో పెట్టిందట.
   ఆ  సన్యాసి  తన సంచిలోనుండి  ఒక  మందు  తీసి, అది  కొంచెం  మాత్రచేసి తనవంటి  బూడిదతీసి  పూసి,  ఇది యియ్యి  బ్రతుకుతాడు.  ఈ  రాత్రి  ఇంకో పాతిక రూపాయలు   పట్టుకురా అన్నాడట. ఆ  మాత్ర  ఎవ్వరూ చూడకూండా  నాచేత  మింగించిందట. నాకు  స్పృహేలేదట. ఆ  సన్యాసికి  పాతిక రూపాయలు  పంపించిందట. ఇది రాత్రి జరిగిన పని. ఆ  తెల్లవారగట్ల, నాకా జ్వర  తీవ్రతతో  కడివెడు  విరేచనమై, కాళ్ళు చేతులు చల్లబడి వాతం కమ్మింది. ఇంగ్లీషు వైద్యులు  వచ్చి  గ్లూకోజు మొదలైన  వేమేమో ఇంజక్షను లిచ్చారట. లాభంలేదని  చక్కా బోయారట. అప్పుడు  జగత్ రాం పండాను  సుశీల పోరుపెట్టి, కవిరాజ్  వైద్యరాజు  పండిత బోలానాథ్ ను  రప్పించిందట. మా  అమ్మ నేను  చచ్చిపోయాననే మూర్ఛపోయింది. మా  మామయ్య మాత్రం  విపరీత  ధైర్యంతో మా అమ్మకు  ఉపచారం చేయిస్తున్నాడు. నేను బ్రతుకుతానన్న ఆశ అతనికీ పోయిందట.
   బోలానాథ్ వచ్చి  నాచేయి  నాడిచూచి, అయ్యో మనిషిని  అక్రమంగా  చంపారని  వాతరాష్ట్రం, వాతగజకేసరి, వాతజ్వరాంకుశం, సూతికాభరణం, సన్నిపాతం, కస్తూరి, మహాపాశుపతం,  గరళం, నవరత్న చింతామణి, అన్నీ కలిపి  నూరి, బొడ్డుకు పట్టు, మాడుపై చిన్న గాయం చేసి  అందుపై పట్టు, గుండెలకు పట్టు వేయించి, ఒళ్ళంతా  వెల్లుల్లిపాయి  పసుపూ  తేనే నూరించి రాయించి, అరగంట అరగంటకు  పై  మహాపాశు పతాదుల మందే నాలుకకు  రాయించినాడట.


   93 డిగ్రీల వాతం! ఇరవై  నాలుగు  గంటలయిన తర్వాత  నెమ్మదిగా  వేడి  అందుకొంది.  ఇంకో  ఇరవైనాల్గు  గంటలకు  నాకు  వేడి  97 డిగ్రీలకు  వచ్చి, నాడి  కొంచెం బాగుపడిందట. మా   అమ్మకూ  ఆయనే  వైద్యం  చేసాడు.
   వైద్యుడు  అంతా  అయిన తర్వాత  నిజం   తెలుసుకొని  సుశీలను బాగా  చీవాట్లు పెట్టి, తర్వాత  ఆ మందే ఆ మహాజ్వరాన్ని  మళ్ళించలిగిందని  మెచ్చుకున్నారట్ట. ఆ సన్యాసికోసం  నాకు  మహావాతం  చేయగానే పరుగెత్తితే అతడక్కడ  లేడట.
   ఆ  జబ్బు  నెమ్మదించగానే  ఒక రాత్రివేళ నాకు  మెలకువ వచ్చింది. సుశీల నా మంచం ప్రక్కనే  కుర్చీలో కూర్చుండి, నిద్రవచ్చి,నా  నా మంచం మీద తలవాల్చి  గాఢనిద్రపోతున్నది. ఆ గదిలో  వేరొకచోట  చాపపైన మా అమ్మ  నిద్రపోతున్నది. గుమ్మం   అవతల  చావడిలో  మా మేనమామ  మంచం  మీద  పడుకుని  నిద్రపోతున్నాడు.   
   శకుంతల వచ్చి  నన్ను  లేపినట్లు  కల  వచ్చి   అయ్యో, బ్రతికి వచ్చిందా? అనుకుంటూ  చెమటలుపట్టి, శకుంతలా అంటూ లేచాను. నా మాట  ముద్దమాటలా వచ్చింది.
   అందరూ   ఒక్కసారి  లేచారు. మా అమ్మ   నా దగ్గ్గరకు  పరుగిడి వచ్చి నాయనా  బతికావురా!అని   కంటనీరు  కారిపోతూ  ఉండగా, వెక్కి వెక్కి ఏడ్చి  నన్ను కౌగలించుకుంది. మా మేనమామ  అక్కా, ఊరుకోవే! వాడు బతికాడు. అదే పదివేలు.  కొంచెం కులాసా  చిక్కగానే  మా ఊరు  మనం  అంతా  వెళ్ళవచ్చును అంటూ  కళ్ళనీళ్ళు  వరదలు కట్టించాడు. సుశీల  కంటనీరు  జడివానగా, విశ్వేశ్వరా తండ్రీ! నీ  దయే  ఇదంతా! అంటూ వణికిపోయింది. 
                                                          

జగత్ రాం పండా కళ్ళు నులుముకుంటూ పరుగెత్తుకుని వచ్చాడు. ఎంత సంతోషం! ఓ విశ్వేశ్వర ప్రభూ! నువ్వు రక్షించావు మమ్ముల నందరినీ! అని చేతులతో మొగం కప్పుకొని నవ్వుతూ, ఏడుస్తూ, కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ దేవతార్చన గదిలోకి పరుగెత్తాడు.

   నాకు కొన్ని రోజులవరకూ  ముద్ద మాటలే! కొన్నినాళ్ళ  వరకూ   భోజనం సయించలేదు. మా  అమ్మ  ఇంత  రససింధూరం, మిరియాలూ నూరి మాత్రలు చేసి వేసేది. పులికడుగు చారు పెట్టేది.  అప్పటినుంచి నాకు ఆకలి పుట్టింది. అన్నీ తినాలని బుద్ది పుట్టింది.  అతి జాగ్రత్తగా  నాచేత  పథ్యం చేయించారు. ఆ  పట్టు పట్టు  ఆరు నెలలకు  కోలుకున్నాను.  నాకు జబ్బు నెమ్మదించిన  నెలరోజులకు నేనూ, మా అమ్మా  నా ఆరోగ్యం  కోసం  హిమాలయాలలో'మస్సోరీ' వెళ్ళవలసిందని  డాక్టరుగారు  సలహాయిచ్చారు. మా మేనమామ  తన కొడుకు  కస్తూరి  సుబ్రహ్మణ్యాన్ని పంపించాడు. సుబ్రహ్మణ్యం  నాకన్న  రెండేళ్ళు  పెద్ద. అంత పెద్ద చదువు  లేదు. కాని చాల  మంచివాడు.  వ్యవహారవేత్త. మా  హేమ అతన్ని చూచింది, రండు మూడు సార్లు. (జ్ఞాపకం తెచ్చుకో హేమా) 


   మేమంతా ఆ  వేసవికాలం  జూన్ నెల  వానలవరకూ మస్సోరీ  నగరంలోనే ఉన్నాము. మేము మస్సోరీ  వెళ్ళేటప్పుడు సుశీల  ఎంత ఏడ్చిందో  వర్ణించలేను. నన్ను  అమిత  గాఢంగా  నన్ను కౌగలించుకొని  వదలలేదు. ఆమెకు  ఏడవనెల  గర్భం. ఆమె భర్త  జగత్ రాం పండా  అన్ని ముచ్చట్లు జరిపించినాడు.
   మూర్తీ! నువ్వు  నా జీవితంలోంచి  వెళ్ళడానికి వీలులేదు. నువ్వు బ్రతికావు! నేనూ బ్రతికాను.  నువ్వు  మస్సోరి నుంచి  ఇక్కడికే రా. మా  ఇంట్లో ఉండు. ఉంటావుకదూ?  అని  ఎంతో  బ్రతిమాలింది. నే  నామేను  ముద్దుపెట్టుకొంటూ తప్పక  వస్తాను సూసీ అని  వీడ్కోలిచ్చాను. నే నాక్షణంలో  ఏమీ  ఆలోచన చేయలేని  నల్లరాయిలా అయిపోయాను.
   మస్సోరీలో మొదటి  రెండు మూడు వారాలు నేనూ,  మా సుబ్బులు బావా  మహా  ఆనందంగా  గడిపాము. సుశీల, శకుంతలా  ఎవరూ నా హృదయంలో  లేరు.  ఆ  తర్వాత  నాకు కాశీ  విషయాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. రాత్రిళ్ళు  నిద్రపట్టకపోవడం  తిరిగి ప్ర్రారంభించింది.   
   బలం  త్వరలో  పట్టడంచేత  ఆ  మహాపర్వత  సానువులన్నీ మా  సుబ్బులుతో  తిరిగేవాణ్ణి, దూరాన మాకు  ధవళహిమ కిరీట సుందరాలైన  ఆ  పర్వతరాజు  శిరము  లెన్నో  గోచరించేవి. ఆ  కొండల్లో  ఒక్కొక్క రోజు  గంటలకొలదీ  నడిచేవాళ్ళము? చెట్లను   కోసిన  ఆపిల్సుపండ్లు, దానిమ్మపండ్లు, ద్రాక్షపండ్లు  విపరీతంగా  తినేవాణ్ణి. నడిచి నడిచి వచ్చి, సొమ్మసిలి నిద్రపోయేవాణ్ణి. ఈ  నడకలు  శకుంతలా సుశీలలను దూరంగా తోలటం  కోసమే! నాలో  సుడిగాలులు  వీస్తున్నవి  మా  సుబ్రహ్మణ్యానికేం  తెలుసును!
   నెలరోజు లుండేటప్పటికి, మస్సోరీ  నాకు విసుగు పుట్టించింది. ఆ ప్రపంచంలోనే  నొంటి వాణ్ణయ్యాను. నా శకుంతలను మరచి, ఒక విధంగా స్వైరిణి  అయిన  సుశీలతో   కామవాంఛ తీర్చుకున్న  ద్రోహిని నేను. శకుంతల  నాపై  దీనదృష్టులు   పరుపుతోన్నట్లే  భావించేవాణ్ని.
   సుశీల మాత్రం  ఏం తప్పుచేసింది? ఆమె  ధర్మం  ఆమె నిర్వర్తించింది. నేనే నీరసుణ్ని. ఏమిటా   ప్రేమ? ప్రేమకోసం  జీవితాలు  బ్రహ్మచర్యానికి  అంకితం  చేస్తారా?  వెనుకటి  కథలే  నిజమైతే  విశ్వామిత్రుడు  మేనకతో,  వేదవ్యాసుడు మరదళ్ళతో  నిర్వహించిన  ధర్మం ఏమిటి? పుణ్యపాపాలూ సత్యంలా  సర్వకాలాలూ  ఒకేరీతి ఉండాలి. అవి కాలాన్ని బట్టి  మారితే  సుశీలకూ నాకూ, ఆ  సాయంకాలం  సంభవించిన  కామవాంఛా  నిర్వహణం  పాపం ఎలా అవుతుంది?
   నెమ్మదిగా నా  ఆలోచనలు  నశించాయి: ఒక విధమైన  స్థాణుత్వం  వచ్చి చేరింది.  మూర్ఖుడు  సర్వప్రపంచంపైన   అమితక్రోధం వహించినట్లుగా నాకు  అన్నింటిమీద  కోపం ఆవహిల్లింది.  మా  సుబ్రహ్మణ్యంపై  ఉదయాత్తు సాయంకాలం  వరకూ  నాకు విసుగూ, కేకలూ ప్రబలాయి. మా  అమ్మపై  కస్సు బస్సులు  సాగించాను. ఆమె  నే  నెన్నన్నా  ఎప్పుడూ నవ్వుతూ చాకిరి చేసేది, మా  సుబ్బులు   గంగిగోవులా  ఏమీ  మాట్లాడకుండా  నాకు పరిచర్య చేసేవాడు.  సేవకులమీద కోపం, బండివాళ్ళపై,  కూలీలపై  అందరిపైన కోపం,  మా అమ్మ  రహస్యంగా  కంట నీరెట్టుకొనేదట.   బక్కకోపం  ఎక్కువైంది  మా  వాడి  కని, అన్నీ  భరించేది. మా  అమ్మ.


   నే నిక  మస్సోరీలో  ఉండలేనురా అంటే మా సుబ్బులు కాశ్మీరం పోదామన్నాడు. కాశ్మీరం పోయాము.  అందరి కళ్ళబడే  షాలిమారు  ప్రమదావనం, డాలు సరస్సు, జీలంపై కాశ్మీరు  నౌకాయాత్రలకన్న, అక్కడ అనంతంగా  పండే  పళ్ళయినా  తినడానికి పైసాలేని  బీదవాళ్ళ   స్నేహం ఎక్కువయింది.  నా దృష్టి   ఎప్పుడూ  అందమైన  స్త్రీలమీదనే. ఎన్ని వస్త్రాలు  ధరించిన  జవ్వనినైనా నా  మనస్సులో  విగతవస్త్రను చేసి  ఊహిస్తూ, నా  నీరసత్వానికి పళ్ళు  కొరుక్కుంటూ ఉండేవాణ్ని.
   అయోధ్య  ప్రాంతాల  స్త్రీలు పట్టపగలు   ఆడవాళ్లచేత స్వల్ప  వస్త్రాచ్చాదితలు   మాత్రమై  వళ్ళు   వట్టించుకోడం  చూస్తూ నా రాక్షస హృదయానికి  ఆనందంగా  సమకూర్చుకున్నాను. అలాగే  ధనం ఇచ్చి, చక్కని పిల్లలను  శ్రీనగర్  గల్లీలలో  ఏరితెచ్చి,  అక్కడ  నా కేర్పడిన  నేస్తం  ఒక స్త్రీ  వ్యాపారిణి ఇంట్లో  రహస్యంగా  వాళ్ళను  దిగంబరం చేసి, ఆ  బంగారు  మాలామా  దేహాంగాలను తనినోవ  స్పృశిస్తూ  ఆనందం పొందేవాణ్ని. వాళ్ళూ తమ దేహాలు  కామతృప్తికి  బాలి యివ్వకుండా, ఆ బలివల్ల  వచ్చే  రుసుంకన్న స్పర్శానందం  ఇచ్చే  రుసుం  ఎక్కువగా  దక్కడానికి సంతోషిస్తూ, నాకు  సలాములుకొట్టి, నా చెంపలు  తాకి మొటికలు విరుచుకుని  వెళ్ళిపోతూ ఉండేవారు.
   ఈ  నా  పిచ్చిచేతలు మా  సుబ్బులుకు  చూచాయగా తెలిసాయి. ఓ  సాయంకాలం  నావపై తట్టుపైన  కూర్చుని  డాలు సరస్సులోని అందాలు  ఖాళీ చూపులతో చూస్తున్న నా దగ్గరకు మా సుబ్బులు  చేరాడు.
                                                            

ఒరే మూర్తి బావా! ప్రపంచంలో అనేక కష్టాలు పడ్డవాళ్ళూ ఉన్నారు. భార్యలు పోయినవాళ్ళూ ఉన్నారు. వాళ్ళు మతులు పోగొట్టుకుంటారురా! పోనీ ఏమీ తెలియని పిచ్చికాదు, ఇదేమి పిచ్చి నీకు?

    సుబ్బులూ, నా  వ్యవహారాలలో  నువ్వు జోక్యం కలుగజేసుకోకు. నేను చావడానికి  సిద్దంగా ఉన్నప్పుడు, మీ నాన్న  వచ్చి నన్ను  బ్రతికించాడు, ఆ  పని  నవ్వు పూర్తి చేసావు.  మామయ్యకూ,  నీకూ  నా దేహం వలిచి  ఇచ్చినా  బాకీ  తీరదు. నిజమే. అంత మాత్రాన  నా  జీవితానికి   మీరు నాథులు కారు, నేను  మీకు బానిసను  కాను.
   అల్లా  నువ్వు  మాట్లాడితే, నేనేం చెప్పను?
    నువ్వేం  చెప్పక్కరలేదు. నేను వినక్కరలేదు. లేనిపోనివన్నీ కలుగజేసుకొని  నాకు  ఈ  కాస్త  సంతోషం  లేకుండా చేయకు. 
   అయితే సరే! నేను  రేపే  బయలుదేరి మా ఇంటికి  వెడ్తాను. నువ్వు ఏమయితే, నాకేం గావాలి?  కాని  నీ  విషయం తలచుకొని  అత్తయ్య పడే వేదన  చూస్తూంటే  నా  గుండె  తరుక్కు పోతుంది.!
   మా  అమ్మా, మీనాన్నా  నన్ను కాశీలో  చచ్చిపోనివ్వకపోయారూ, బాధ విరగడై  పోవునుగా?  మీ  కందరికీ  ఒకటేమాట చెప్తున్నాను. నేను బతకాలని  మీకుంటే  నా దారిని  పోనీయండి, లేదంటారా, ఇంత విషం  తెచ్చి  నాకు పెట్టండి!
   మా  సుబ్బులు  ఒక్కసారిగా  లేచి  బొటబొట  కన్నీళ్ళు  కారుతూ ఉండగా  క్రిందకు  వెళ్ళిపోయాడు. నా  కోపం  ఆర్థ రాత్రి   పన్నెండు గంటలవరకూ చల్లారలేదు.
    ఓయి  వెధవ  దేవుళ్లోయి ఈ  అవస్థ నాకేమిటఱ్ఱా! అని  పొలికేక  పెట్టాలని  బుద్ది పుట్టింది నాకు.
                                                                                                                 26 
   ఇక   కాశ్మీరంలో  ఉండలేకపోయాను. మే  నెల  రెండవవారం  ప్రవేశించింది. దేశం  ఏమయితే నాకేం  కావాలి?  కాంగ్రెసు విజయం  పొందకపోతే  ఏమి కావాలి? స్వరాజ్య పార్టీ వారు  శాసనసభల్లో మొగ్గలు  వేస్తోంటే ఏమి కావాలి? 
   మా  అమ్మ  మరీ చిక్కిపోయింది. కాశ్మీరంనుంచి  తిన్నగా బయలుదేరి  లాహోరు వచ్చాము. లాహోరులో  హిరానుండీ   వెళ్ళి  చూశాను. ప్రపంచంలో  అంత ఘోరమైన భోగంవీధి లేదనుకుంటాను. ఆ  మండీలోకి  టంగామీదనే  లాహోరు  చేరిన  మధ్యాహ్నం  వెళ్ళాను. టంగావాడు ఒక  శిక్కు సోదరుడు, నా వైపు  దయార్ద్రదృష్టులు పరపి,
    బాబూజీ! కీఖరాబ్  రాస్తే  దేవిచ్ ఫజ్ర్  దేయా? (బాబుగారూ! చెడ్డతోవ పట్టారేమిటి?)
   నేను  మౌనం.
   త్వడ్డీ  జిందగీ  దీలోడ్ నై?(జీవితం  బాగుచేసుకోవాలనే ఉద్దేశము  నీకు లేదా?)
   నేను: చుప్  రాహ్.  అప్ నీ  కిస్మత్  దా  బాదుషా  మై  యా  తూ?  (ఊరుకో, నా  భాగ్యాన్ని నిర్మించేవాణ్ని నేనా, నువ్వా?)
                  టంగామనిషి  పెదవి విరిచి   ఊరుకున్నాడు. మే  మా  గల్లీలో ఆగాము. నే  నాతనికి  డబ్బిచ్చి  దిగాను. బండిమనిషి  బండితోలుకు వెళ్ళకుండా   అక్కడే ఉన్నాడు.  నేను  దిగి  ఇటూ అటూ చూస్తూ ఉన్నాను. వెంటనే  ఎదురుగా  ఉన్న  మేడలోంచి నలుగురు   ముసల్మాను  భోగం పిల్లలు  నన్ను చుట్టుముట్టారు. 
   ఒకతె: తు  కిన్నా సోణా ఐ!  అప్నేమకాందేవిచ్   ఆ  సడ్డీకూవ్  సూరతీ వేక్. (ఎంత అందంగా  వున్నావయ్యా  నువ్వు, మా  ఇంట్లోకి  వచ్చి  మా  అందాన్ని చూడు.) 
   నేను  తెల్లబోయాను! 
   ఇంకొకతె:  అపనే  సడ్డాగీత్  సుణు!  నాచ్  నా  వేక్! అపనేఘర్ మే ఫలోందేవిచ్, కిసీ ఏక్ నూ  చుణ్ లే! (మా  సంగీతం విను! మా  నాట్యం  చూడు, మా  ఇంట్లో  మంచి  పండ్లలో  ఒక పండు రుచి చూడు)
   అని అంటూ  ఆ  నలుగురూ  నన్ను  బరబరా తమ  మేడమీదకు  లాక్కొని పోయారు. అక్కడ నన్ను  నలిపేశారు.  నా  జేబులో  చేయిపెట్టి  ఒకతె  నా పర్సు  లాగేసింది.  అయిదారుగురు  నాకు  ఊపిరాడకుండా నులిమివేశారు. తుదకు  ఒకతె  ఓ  సోణియో! త్వన్ను  కాదేఢర్?(ఓ  అందకాడా!  ఎందుకు నీకు భయం) అంటూ  దరిజేరింది. తక్కినవాళ్ళు  నవ్వుకుంటూ  తలుపు  వేసేశారు. నాకు ముచ్చెమటలు  పట్టాయి.
   ఎలా లేచానో ఆ అమ్మాయిని  తోసేసి;  నాకేతెలియదు.  గది గుమ్మం  తెరచి, అక్కడ ఎవరూ  లేనందుకు  సంతోషిస్తూ,  సగం  ఏడుస్తూ  వీధి గుమ్మం దగ్గరకు  పరుగెత్తుకొని  వచ్చాను.  అక్కడ  ఆ సిక్కుటాంగా  సిద్దంగా  ఉంది. అందులోకి  ఉరికాను. ఆ  చుట్టు ప్రక్కల  మేడ  వరండాలాలోనికి   ఆడవాళ్ళందరూ మూగి  పక పక నవ్వడం  ప్రారంభించారు. ఆ  శిక్కు టాంగామనిషి మాట్లాడకుండా  మేం  ఉన్న  సత్రం దగ్గరకు  తీసుకొని పోయాడు.
   నేను  ఇంట్లోకి వెళ్ళి  ప్రాణం పోయినట్లు  భావించుకొని, నా  పరుపు వాల్చి, పండుకొని  వెక్కివెక్కి  ఏడ్చాను. నాకింతటి అవమానం  కలగాలా? ఇది నాకు పరాభవమా?  అవమానమా? నాలోని కోపం  నన్ను  దహించివేసింది, ఏం  ప్రతీకారం  చెయ్యగలను?  కూడా పట్టుకువెళ్ళిన   యాభై రూపాయలు  పోతేపోయేయి, కాని  వాళ్ళని  నేను ఏమి   చెయ్యగలను? ఆ  హీరామండీ (రత్నాలవిఫణి) ఏమి  రత్నాల బజారు?
   ఆ  నాడు  నే  ననుకోకపోయినా తర్వాత  నన్ను నేను   తర్కించు కొన్నప్పుడు  మహాత్మాజీ స్త్రీ  విషయంలో  అన్న  ముక్కలూ, మహాత్మాజీకి  స్త్రీ  మండలివారు  సమర్పించుకొన్న మనవీ  ఎన్నిసార్లో  జ్ఞాపకం వచ్చాయి. ఆ  రోజుల్లో  పశువునై ఉన్న  నాకు   క్రోధమే  ప్రధానమై  నన్ను  పూర్తిగా  మండించింది.
   
                                                                                                             27    
   
   లాహోరులో  మూడురోజులు మాత్రమే  ఉన్నాము.  అక్కడినుంచి బయలుదేరి సింధునదీతీరంలో  ఉన్న  సుక్కూరుకు  వెళ్ళాము. నా  ప్రయాణాలకు అర్ధంలేదు. యాత్రావిశేషాలు  చూడాలనీ  కాదు, దేశంలోని   ప్రసిద్ద  ప్రదేశాలను  చుద్దామనీ  కాదు. నాలోని  భరింపరాని  వేదనే  నన్ను  ఎక్కడికో  తరిమివేస్తున్నది.  ఎక్కడికో  అంతుదొరకని  యాత్ర? ఎందుకీ  అనంతమైన  వేదన? నా  శకుంతల  నాకు  ఎక్కడ  ప్రత్యక్షం  అవుతుంది?  

నా రూపం మారిపోయింది. నేను నల్లబడ్డాను. నా మొగం చిక్కిపోయింది. నా జుట్టు ఊడిపోయి కోడిజుట్టులా అయింది. నా నుదురులో గీతాలు బ్రహ్మరాతలా కఠినమై, స్పష్టమై, చెరపరాని తీవ్రత తాల్చినవి కాబోలు!

   నేనద్దం చూచుకోవడమే  మానేశాను. నాకు  బట్టలవిషయంలో  శ్రద్ద  సంపూర్ణంగా  మాయమైపోయింది. ఏ  దుస్తులు  ధరించేవాణ్ణో,  అవి మాసినవో, శుభ్రంగా ఉన్నాయో, లేవో  అనే  భావమేలేదు.
   మా  సుబ్బులు ఒరే బావా! అన్ని  మంచి బట్టలున్నాయి, ఈ  మాసిన  బట్ట  లెందుకు  కట్టుకుంటావురా? అన్నాడు.
    ఏ  బట్టలైతే  నేమిలేరా? ఇప్పుడు  నే నందంగా కనబడకపోతే  కొంపలు  మునిగిపోలేదు!
   ఏమిటో, నువ్వు  తెలిసినవాడవూకావు.  తెలియనివాడవూకావూ.  తెలిసీ  తెలియని  నరుదెల్ప  బ్రహ్మదేవుని వశమే?  అని  చెప్పినట్లు  ఉంది  నీ  వ్యాపారం.  నీకు  నేనేం  చెప్పగలను?? నీసంగతి చూచి, అత్తయ్య  కుళ్ళిబోతోంది! 
    సుబ్బులూ! మీరంతా  నామీద  ఎందుకు ఆపేక్షగా   ఉంటున్నారో  నాకర్ధం  కావడంలేదు. నేను లోకానికి  క్షయపురుగును.  నేను  పరమ చండాలాన్ని. నన్ను  లోకమంతా కలిసి  వెలేసి  నిర్జనారణ్యానికి  తోలివెయ్యాలి. నాకు   చావనేది  లేదు. ఇలా  ఏదో  మొండివాడిలా  కఱ్ఱలా,  మొద్దులా పురుగులా  బ్రతికి  నా  అన్నవారినల్లా  ఏడిపించి, ఏడిపించాక, ఎక్కడో  పనికిమాలిన  చావు  నానొసట  రాసివుంది. దానికి  నువ్వు  బెంగ పెట్టుకోవడ మెందుకు, అమ్మ  కుళ్ళిపోవడ  మెందుకు? 
    నీ  ఉపన్యాసం పూర్తి అయితే  అంతే  చాలురా, నీ  ఇష్టం సుమా! నువ్వు  ఏ  భగవంతుని  దయవల్లనైనా  మామూలు  మనిషివైతే, తిరుపతివెళ్ళి  నూరురూపాయలు  అర్పించుకుంటాను. 
    ఓ  వెఱ్ఱికాయా!  భగవంతు  డెక్కడున్నాడురా?  మనుష్యునిలోని నీరసత్వంవల్ల దేవుడున్నాడని, తమకు  తెలియని, తమకు మించినవీ, వాడికి  పేర్లు పెట్టి  అర్ధంకాక  తప్పుకుంటున్నారు. ఎవరా దేవుడు?  
   
    మనుష్యులలో  పెద్దవాళ్ళూ, చిన్నవాళ్ళూ, తెలివైనవాళ్ళూ, తెలివితక్కువవాళ్ళూ  అని తేడాలున్నాయంటావా? 
    ఆ !
    అలాగే  మనుష్యులకు మించిన  వ్యక్తులుండ వచ్చునంటావా? 
    అన్నీ  ఉండవచ్చును, లేందే? 
    లేరని  నీ కెల్లా  తెలుసును? 
    ఉన్నారని  నే  కెల్లా తెలుసును? 
    ఉన్నారని  అనేకమంది  పెద్దలు చెప్పుతున్నారు.
    లేరనీ  చెపుతున్నారు.
    మనం ఇంగ్లండు  వెళ్ళలేదు; అయినా ఇంగ్లండు ఉందని  మనం  ఒప్పుకుంటున్నామా?  
    వంకాయలు  ఈ రైలులో  లేవు. అయినా  వంకాయలనేవి  ప్రపంచంలో  ఉన్నాయని  ఒప్పుకుంటున్నామా? 
    అల్లాగే  ప్రపంచంలో  కొందరు  దేవతల్ని  దర్శించారు. కొందరు  దర్శించలేదు, దర్శించినవాళ్ళు  దర్శించినట్లు  చెప్పారు, దర్శింపని  వాళ్ళు  లేరని  వాదించారు! 
    అంత  చవకగా లేదు  వాదన. లోకంలో  వంకాయలున్నాయని  ఎరగనప్పుడు వాదనేరాదు. కొందరు చూచారు, తిన్నారు. వానిని గూర్చి ఇతరులకు ఋజువు చేశారు. ఆ  ఋజువుచేసే విధానం, జ్ఞానంకల ప్రతివాడూ ఒప్పుకునేది. కాబట్టి లోకం  అంతా  ఒప్పుకుంటుంది.
    అయితే మనం  నమ్మదగిన  పెద్దలు __రామక్రిష్ణ పరమహంస, వివేకానందుడు, రమణమూర్తి, అరవిందఘోష్ , మహాత్మాజీ  మొదలైన వారు  స్పష్టంగా  దేవుడు  ఉన్నాడనిన్నీ తమ  కా  అనుభవం  కలిగిందనీ చెప్తారే. అంతకంటే ఋజువు ఏం కావాలి? 
    ఓయి  పిట్టపిడుగా! ఆ  పెద్దలు  మంచివాళ్ళే! కాని  వాళ్ళు  ఓ  విధమైన  పిచ్చివాళ్ళు. పిచ్చివాళ్ళకు మనస్సులో  అనేకమైన  భావాలూ  ఉదయిస్తూ  వుంటాయి. అవన్నీ  వాళ్ళకు నిజంగానే  కనబడతాయి. అంతమాత్రంచేత  దేవుడూ, దెయ్యమూ వుందని  ఏల  నమ్ముతాము?
   లాహోరు  నుంచి సాయంకాలం  బయలుదేరి  తెల్లారేసరికి  సక్కర్ (మనవాళ్ళు  సుక్కూర్ అంటారు) చేరాము.  సక్కర్ లో  మూడు రోజులుందామనుకున్నాము. అక్కడ  నా  పశుత్వానికి  తృప్తినిచ్చింది స్నానాలరేవు. సింధ్ లో ముసల్మానులు  ఎక్కువ, హిందువులు తక్కువ. వీళ్ళకు పూర్వ  పారశీక  యవన పహ్లవాదుల  సంపర్కం ఎక్కువ  వుంటుంది. సింధ్ లో పరదాలేదు. కొద్దిమంది  నవాబుల   కుటుంబాలలో   వుందేమో?  సింధు  స్త్రీలవి  చంద్రబింబాలలాంటి   గుండ్రటి మొహాలు.  వాళ్ళు  పైజామాలు  ఉపయోగిస్తారు. కాశ్మీర్  పంజాబులలో  సిల్వాల్ లాగు  ఉపయోగిస్తారు, అవి  వదులుగా  వుంటాయి.
   సుక్కూరులో  సింధునదికి  స్నానానికి  పోయాము.  అక్కడ  ఆడవాళ్ళు  ఎంత పెద్ద కుటుంబాల  వాళ్ళయినా  స్నానం చేసేటప్పుడు   పైనున్న చొక్కాలన్నీ  తెసేస్తారు. ఒక చిన్న తుండు కట్టుకొని  నీళ్ళలోకి దిగుతారు. జవ్వనుల  బంగారు  వక్షోజాలు  కాశ్మీర పూవులలాంటి  చూచుకాయలతో నీళ్ళతో మేలమాడుతాయి. ఒక  స్నానం కాగానే  మెట్లమీదకు వచ్చి  కూర్చొని, సబ్బుతోగాని, పిండితోగాని  సిగ్గు  లేకుండా  ఒళ్ళంతా  రుద్దుకుంటారు. ఆడవారికీ , మొగవారికీ ఘట్టాలు ఒక్కటే! స్నానమంతా అయి ఒళ్ళు మొగవారి ఎదుట  సిగ్గు లేకుండా శుభ్రంగా తుడుచుకొని  చొక్కా వేసుకొని, పైజమా తొడుక్కొని  ఆపైన కండువా  (దుప్పటా అంటారు) వేసుకుంటారు.  
   మూడు రోజులనుకున్న  మకాము  ఆరు  రోజులయింది. రోజూ  స్నానాల  ఘట్టానికి  ఉదయమే వెళ్ళి, పదింటికి, పదకొండింటికి  ఇంటికి వచ్చేవాణ్ణి. మా  సుబ్బులు  ఆడవాళ్ళ  ఆ  దృశ్యాలు  చుస్తే  ఎవరైనా తంతారేమోనని  భయపడ్డాడు. మా  అమ్మ  నానాటికి  చిక్కిపోతోంది. ఓనాడు నన్ను  నాన్నా! లక్నో, హరిద్వారం, హృషీకేశం  చూద్దామురా?  అన్నది.
   మే  రెండవ వారంలోనే  సుక్కూరు  నుంచి  షికార్  పూర్, కరాచీ, క్వెట్టా  చూడకుండానే  చిన్న బండిమీద  ఢిల్లీ, అక్కడనుంచి ఆగ్రా, ఆగ్రానుంచి కాన్పూరు, లక్నో చేరుకున్నాము.  లక్నో  అయోధ్యలు  చూచి హరిద్వారం  చేరుకున్నాము. ఎండలో  మాడిపోయాము.
                                                                                                                   
                                                                                                                  28
   నా  హృదయానికి, నా మనస్సుకు, నా బుద్దికి  వనితాలోకం తప్ప  ఇంకొకటి దృశ్యం  కావటమేలేదు. ఆడవాళ్ళ ద్వారా  భగవంతుని పైనా,  ప్రపంచంపైనా  కసి తీర్చుకోవాలి. ఆస్తిపోయినవాడికి  లోకంలో ధనమంతా   వాడి ఆస్తే. అలాగే  భార్య పోయిన  నాకీ  స్త్రీ  దాహం  విపరీతం అయింది. దాహం తీర్చుకోలేని  వ్యాధి  పీడితునిలా  ఆ  వనితా  జలధివెంట  తిరగడమే కాని, అందులో  మునగలేదు.
   శుఠను  కాలేని  శుద్ధ  హీనాత్ముణ్ని.  నన్నీ  నారీలోకమంతా  హేళన చేస్తోందని భావించాను. వాళ్ళను హేళన చేశాను.  మా  ప్రయాణాల్లో వాళ్ళు వింటూండగా  మా  సుబ్బులుతో   ఆడవాళ్ళను   ఎత్తిపొడవడం, వాళ్ళను శంకించడం, దుర్భాషలాడడం సాగించాను. కొందరు  మగవాళ్ళు  ఆ  మాటలను  వింటూ  నన్ను  ఎత్తిపొడిచారు, కొట్టవచ్చారు. ఒకసారి రైలు  కుడా   ఆపుచేసేటంతవరకు వచ్చింది.
    అప్పుడే  ఒక మహిళారత్నం  నా  వైపు  తిరిగి, పూర్వీభాషలో  ఓ అబ్బాయీ! ఇందాకటినుండీ   నీ    పేలుడంతా వింటున్నాను. నీ మొగం  చుస్తే  జబ్బుతో ఉన్న మనుష్యునిలా  కనబడుతున్నావు.  మీబోటి  తుచ్ఛులు  మా  స్త్రీలను  చేసే  అవమానం  మితిమీరిపోతూ ఉంది.  నీకు కనబడేది  స్త్రీల దేహమా, వాళ్ళ అందమా?  వాళ్ళ తెలివి  అంతా   వాళ్ళ  అందమైన  అంగాలలో ఉందా?  వాళ్ళు భోగవస్తువులా?   వాళ్ళు పురుష  వాంఛలు తీర్చడానికి పుట్టారా?  నీ  తప్పుల  హిందీ  ప్రలాపాలు  వింటూంటే  నువ్వు  మదరాసి వాడిలా కనబడుతున్నావు.  మదరాసీ మగవాళ్ళు  మా ఉత్తరాది  మగవాళ్ళకన్న   పెద్దమనుష్యు లనుకున్నాను.  ఛీ! ఛీ! ఏమి  బ్రతుకయ్యా నీది!
    రా, నీకు  ఆడవాళ్ళు  పశువులో, దద్దమ్మలో, శక్తి  రూపిణులో చూపుతా, మా  లక్నో  స్త్రీ మండలి  అఖేడాకు. నీలో   ఇంతైనా  మానవత్వం  ఉంటే ఈలాంటి  నీచ ప్రలాపాలు  కట్టిపెట్టి  నోరు  సర్వకాలం మూసుకుని  ఉండే  ప్రయత్నం  చేయి. లేదంటావా, నేనే  నాలుగు  లెంపకాయలు  తగిల్చి  నీ  జబ్బు  కుదురు స్తాను అంటూ ఆమె   నా వైపు  క్రోధారుణ నయనాలతో  చూచింది.
   మా వాడు  ఆమెకు  నమస్కారంచేసి, అమ్మా! మావాడు  చాలా జబ్బులో ఉన్నాడు. రెండుసార్లు చచ్చి బ్రతికాడు. అతని మనస్సు సరీగా లేదుఅన్నాడు.
    ఒరే  సుబ్బులూ  నీ కెందుకురా  నా  గొడవ? అన్నాను. ఇంతలో  లేచాడో గాహర్వాల్ రాజపుత్రుడు. ఇస్ లుచ్చేకి బాత్ సున్కర్,మేరా  బదన్  జల్ రహా హై.(ఈ  తుచ్ఛుని మాటలు  వింటోంటే నా వళ్ళు  మండిపోతుంది) అంటూ నాదగ్గరకు వచ్చాడు.  నేనూ లేచాను. 
   నా పూర్వబలం పూర్తిగా పోలేదు. ఇద్దరం  ఇంకో నిమిషంలో  ఎంత కొట్టుకొందుమో, మా సుబ్బులూ, నన్ను  చివాట్లు  పెట్టిన  ఆ  లక్నో  వీరనారీ  లేచి  మా ఇద్దరి మధ్య అడ్డం వచ్చారు. వాళ్ళిద్దరూ  ఆ రాజపుత్రునికి  సర్ది చెప్పారు.
   మా అమ్మ  లేచి  ఆ రాజపుత్రునికి  నమస్కారం చేస్తూ  కళ్ళనీళ్ళు కారిపోతూ ఉండగా  తెలుగులో  అయ్యా, వాడు నాకు ఏకపుత్రుడు. రెండు  సార్లు చచ్చి బ్రతికాడు. మనస్సు సరిగాలేదు. రక్షించు నాయనా! వాడి మీద దేబ్బపడితే  చచ్చిపోతాడు. వాడు చస్తే  నా  ప్రాణం  వెంటనే పోతుంది అంటూ  గజగజ  వణికిపోయింది.
   ఆ  రాజపుత్రుడు నెమ్మదించి ఫరవానై  మాయీ! అని కూర్చున్నాడు. నేనూ కూర్చున్నాను.  రైలు హరిద్వారం  వచ్చింది. హరిద్వారం గంగానదికి  కుడివైపున ఉంది.  హిమవత్పర్వతాల  వెలువడి గంగానది ఆర్యావర్త  సమపథాలలో   ఇక్కడనే  ప్రవేశిస్తుంది.  స్టేషనులో దిగాము. ఓ  గంగాపుత్రుడు  మమ్మల్ని  సత్రంలోకి  తీసుకుపోయాడు. వెంటనే గంగకు పోయి  హరికాచరణ్ ఘట్టంలో  స్నానం చేశాము. నేను  స్నానం చేయడం  పుణ్యంకోసం కాదు. అది  హరిచరణ ఘట్టమైనా  ఒకటే  అసురచరణ ఘట్టమైనా  ఒకటే. స్నానంచేసే ఆడవాళ్ళూ, వేసవికాలంలో  స్నానవాంఛా  తప్ప  మరేమీలేదు. మా  అమ్మగారూ, సుబ్బులు  అతిభక్తితో  స్నానంచేసి  అయిదారు  రూపాయలు  ఖర్చు చేశారు. వాళ్ళు దగ్గిరనే ఉన్న  గంగాద్వార  మందిరంలోకి వెళ్ళారు.  నేను బజారు  చూసుకుంటూ  సత్రంలోకి వచ్చి  కూర్చున్నాను.
   ఇక్కడ  హరిద్వారంలో  రకరకాల  సుందరాంగులు  నా కంట పడ్డారు. ప్రపంచం స్త్రీ  సౌందర్యంతో  నిండినట్లే  నాకు  కనిపించింది. రైలులో  ఆ లక్నో  వనిత  అన్న  మాటలు  నా మనసు  కలత పెట్టుతున్నవి. నాకు  ఆ రాజపుత్రునిమీదా  ఆ లక్నో  స్త్రీమీద  పట్టరాని కోపం  లోపల కతకుత లాడుతున్నది.  మేము ఉన్న గదిముందు   వరండాలో  బోనులోని జంతువులా తిరుగుతున్నాను.     నాకు  లోకంమీద  కసి తీరలేదు.  దైవం మీద  కసి తీరలేదు.  ఏమి చెయ్యను?  దేవుడి గుళ్ళల్లో  దొంగతనాలు  చెయ్యనా?  రాత్రిళ్ళు   దేవుళ్ళ విగ్రహాలను  ముక్కలు చేయనా? హరిచరణమట!  హరిణనేత్ర  చరణం కాదూ? స్నాన  ఘట్టంలో  రాతిమీద  ఓ  చచ్చు  అడుగు చెక్కి, అది  హరిచరణం అనేవాడు  ఒక శుంఠ.  అది చెక్కించినవాడు  మరో శుంఠ. అది  నమ్మి పూజించినవాడు  అంతకంటె  శుంఠ.  ఈ     శుంఠలందరు   దేశాన్ని   దద్దమ్మ, చచ్చమ్మ, కుంకమ్మ  దేశాన్ని చేసి   పాడుచేసి  పారేశారు.
   
                                                                                                                  29
   హరిద్వారం వచ్చిన మర్నాడు తెల్లవారగట్ల  తిన్నగా  స్నాన ఘట్టానికి  పోయాను. ఏమిటా హరిచరణం?  దానికి  నా  చరణప్రహరణం  ఇస్తే ఏమవుతుంది?  స్నానఘట్టానికి వెళ్ళడంతోటే  అక్కడ  అప్పుడే స్నానం చేస్తూన్న  సాధువు లెవ్వరూ  చూడకుండా,   ఇతర  దొంగభక్తు లెవ్వరూ  కనుగొనకుండా హరిచరణాన్ని  నాలుగు తన్నులు  తన్నాను. ఏమి చేయగలిగిందా చరణం? విష్ణుచక్రం రాలేదే? గరుత్మంతుడు  తన్నుకుపోలేదే? పాంచజన్య   శంఖారావాలు   భూనభోంతరాళాలు     వ్రక్కలు చెయ్యలేదే? లోకం తలక్రిందులు  కాలేదు, సముద్రాలు పొంగిరాలేదు.  మిన్ను  విరుచుకు పడలేదు. నక్షత్రాలు  డుల్లలేదు. హ్హా! హ్హా! హ్హా! ఓయివెఱ్ఱి  విష్నుపదమా! నన్నేం  చేస్తావు. నువ్వు  నువ్వా దద్దమ్మ పంగనామాల   వాళ్ళను  ఏడిపిస్తావు?  నన్నేం  చేయగలవు?  నాకు నువ్వంటే  భయమా?                                                                                                                           
           
               

వికటహాసంతో వచ్చి మెట్లమీద కూర్చున్నాను. నా ఎదుట శకుంతల నీళ్ళల్లో స్నానమాడుతున్నట్లు కనిపించింది. ఇదేమిటి! నా శకుంతల ఎక్కడనుంచి వచ్చింది? కళ్ళు నులుముకుని చూచాను. ఆమె అక్కడనే స్నానం చేస్తూంది. లోతు అని భయం లేకుండా నిర్భయంగా స్నానం చేస్తూంది. నేను చూస్తుండగానే తన రవిక విప్పి నీళ్ళల్లో పడవేసింది. అది గంగా ప్రవాహంలో కొట్టుకుపోయి మాయమైపోయింది. శకుంతల కట్టుకున్న చీర, ఆ కొట్టుకుపోయిన రవిక, ఆమె పూజించిన రోజున నేను అర్పించినవే!

   ఆమె  నిర్భయంగా  అంతలోతు నీళ్ళలో  ఆ  ప్రవాహవేగా  వర్తములలో మునుగుచు  తన ఘన  కచభారాన్ని విప్పి  ఆ  సౌభాగ్యం గంగానదికే  అందం ఇస్తూండగా  స్నానం  చేస్తూంది. నాకు  శకుంతలా  అని పిలవడానికి  మాట రాలేదు.  కఱ్ఱలా, రాయిలా, మొద్దులా, ఆ  మెట్లమీద  అలాగే కూర్చుండిపోయాను.  ఆమెరెండుమూడు సార్లు వెనక్కు తిరిగి  నన్ను చూచి, చిరునవ్వు నవ్వింది. ఆ  నవ్వులో  ఎన్నికోట్ల  సౌందర్యాలు  నర్తించాయి!  ఆ  మందహాసంలో  ఎన్ని వెన్నెల్లు  వికసించాయి!  ఆ  నవ్వు పెదవుల ప్రక్క  సొట్టలలో   ఎన్ని పూవులు  ప్రోవులై   కురిసిపోయాయి.  ఆమె  నా  ఎదుట  సిగ్గులేక  ఆ  నీళ్ళలో  భయంలేక  చీర  విప్పి, చేతుల్తో చుట్టచుట్టి  ఆ  ప్రవాహానికి  అర్పించివేసింది.  ఆమె  ఆ  దెపమెలతో  నెమ్మదిగా  నా వైపుకు  రాసాగింది. ఎందరో స్త్రీలు , పురుషులు  ఆ  హరిచరణఘట్టం మూగిపోతున్నారు.  ఆమె   ఘనవక్షోజద్వయ మప్పుడే   నీటి  బయటకు  వచ్చింది.  అమ్మయ్యో! శకుంతలా! తప్పు తప్పు  అంటూ  ఆ  నీళ్ళల్లో  ఆమెవైపు ఉరికాను. శకుంతల  దీనహస్తాలుపరుస్తూ,  వెనక్కుపోవడం  ప్రారంభించింది.  ఆమె  కంఠంవరకు  పోయింది. గడ్డం  మునిగిపోయింది. పెదవులు మునిగిపోయాయి. నేను  రెండు బారలలో  అక్కడకుపోయాను.
   నా శ........కుం........త....ల  మునిగిపోయింది. నేనా ప్రవాహంలో  ఆమె దగ్గరకుపోయి, ఆమె  మునిగిన చోట  మునిగి, పైకితీసి  రక్షించుకోవాలనే  ఆతురతతో  ఒక్క  ఉదుటున  అక్కడకు పోయి  ఉరికాను. ఆ  తర్వాత  ఏం  జరుగుతుందో  నాకేమీ  తెలియదు........
    బాబా! నీ  శకుంతల  కోసమే  అల్లా  ప్రాణాలు  తీసుకోవడమే?   అని స్పష్టంగా తెలుగుభాషలో  ఓ  సన్యాసి  నన్ను ప్రశ్నించాడు.
   నేను లేచి  కూర్చుండి   నా  శకుంతల  ఏది?  ఆమె  మునిగి పోయిందా? అయ్యో!  అన్నాను.
    బాబా!  ఎందుకట్లా  కంగారు పడతావు?  నీ  శకుంతల  లేనేలేదు.  నువ్వు  భ్రమపడ్డావు. నీటిలో  ఉరికావు.  నీ  చిత్తవృత్తే  నన్నిలా  చేసింది, నాయనా!
   నేను  నా చుట్టూ  మూగిన  జనాన్ని చూశాను.  మా  అమ్మ, మా  సుబ్రహ్మణ్యం నన్ను  పొదివి పట్టుకున్నారు. మా అమ్మ  దుఃఖంతో  వణికిపోతూ  కుంభవృషిలా  కంటినీరు  కారిపోతూవుండగా  నాకేసి  దీనదృష్టులు, ఆ  తలముసుగు  సందులోంచే, పరపుతూ  నన్ను కౌగలించుకొని ఉంది.
    బాబా! చుచావా  మీ  తల్లిగారి   దుఃఖము.  మీ   బావగారి   దుఖమున్నూ? నీకు  ప్రపంచం   మీదా,  భగవంతునిమీదా  ఎందుకీ   ప్రళయకాలం  వంటి కోపం ? నువ్వు  భగవంతుణ్ణి   అవమానం చేస్తే,  ఆ   భగవంతునికి   కోపం  వస్తుందనా  నీ ఉద్దేశం!  ఓయీ   మొరకుమనిషీ!   కోపం  నిన్నే దహిస్తూన్నది. నీ  చదువు  నీకు ఊరట  కలిగింపలేదు.  నీ  యాత్రలు  నీకు  శాంతినివ్వలేదు.  నీకు  స్త్రీ  తుచ్ఛమైన  వస్తువు   మాత్రం. నీ  భార్య   గనుక,   ఆమెను  నువ్వు  నీ   ప్రేమ  పాత్రమైన  కుక్క కన్న  ఎక్కువగా  చూచి అదే  ఒక దివ్య ప్రేమ అనుకున్నావు. ఆమె  దివ్య లోకాలకుపోతే , నీ  వస్తువు. నీ  స్వంత  ఆస్తి, నువ్వు అత్యంతగా ప్రేమించిన  నీ  ప్రేమ  నిధానంపోయిందని, భగవంతుని  మీద  మండిపోతున్నావు  అంతేనా?
                                                    సద్గురురాయా  ఎటువంటి  కలగంటినీ
                                                      నిర్గుణమందే  గుణముల రంగులు 


                                                      రంగులలోనే గంధము చూస్తిని 
                                                      సద్గురురాయా ఎటువంటి కలగంటినీ
   అని  మా గురువుగారు  పాడినట్లు  నీ  బ్రతుకు ఒక  పాడు కల అయింది  బాబా!
   సన్యాసి  మాటలు  వింటూంటే  నా  కాశ్చర్యము  కలిగింది. ఇవన్నీ  మా  అమ్మ ఆయనకు  చెప్పిందనుకున్నాను. అమ్మా, మా  సుబ్బులు ఆయన కేసి తెల్లబోయి చూస్తున్నారు. ఉన్నట్టుండి మా అమ్మ  ఆయన  కాళ్ళమీద పడి   స్వామీ  మా అబ్బాయిని  రక్షించండి బాబూ!  అని వాపోయింది.
   
                                                                                                                     30
   ఆ   స్వామి   తనతో  మమ్మల్ని తమ  ఆశ్రమానికి  తీసుకుపోయారు.
   ఆ ఆశ్రమంలో  అయిదారుగురు  స్వాములున్నారు.  అందులో ఇద్దరు  గోసాయీలు. స్వామి మమ్మల్ని  తన నివాస భాగంలోనికి  తీసుకుపోయి  అక్కడ  ఉన్న  కృష్నాజినాలమీద  మమ్మల్ని  కూచోమని, తాను లోనిగదులలోనికి వెళ్ళారు. మేము  ముగ్గురము మాటలు లేకుండా ఆ చాపపై కూర్చున్నాము. ఇంతవరకు    నా  స్థితి  ఇలాంటిదని  చెప్పలేను.
   నేను గతంలో ఉరుకుతూండగా  తానూ, మా  అమ్మ గంగ  వడ్డుకు పరుగెత్తుకు వచ్చామనీ;  అలా పరుగెత్తుకు  రావడానికి  కారణం, నా ప్రక్క మీద నేను లేకపోవడమేననీ:  నేను  గంగలో ఉరికి  ప్రాణం తీసుకుంటాననీ  వాళ్లకు  భయంవేసే వచ్చారనీ:  వాళ్ళు వచ్చీరావడంలో  ఈ  స్వామి  గంగలో నీ వెనకే  ఉరికి నన్ను  నిమిషంలో   ఒడ్డుకుచేర్చడం  చుశామనీ; నేను పది నిమిషాలు ఒళ్ళు తెలియక     పడి  ఉండడంచూచి, మా    అమ్మ  ఘొల్లున ఏడ్చిందనీ; ఆ    స్వామి మా  అమ్మతలపై  చేయివైచి  అమ్మా! నీ  కుమారునికి  ఏమీ  భయంలేదు. అతని జీవితం పూర్తిగా మారిపోయి, మళ్ళీ  యధాప్రకారమవుతాడు. అతని భవిష్యత్తు  భాగుంటుం'దని  చిరునవ్వుతో  ధైర్యం  చెప్పారనీ, ఇంతలో  నేను కళ్ళు తెరిచాననీ  దారిలో సుబ్బులు నాకు చెప్పాడు.
   నా కిదంతా  ఆశ్చర్య  మనిపించింది. ఎవ్వరీ   స్వామి? ఆయన్ని చూచేంతలో  నాకూ  ఏదో  శాంతి కలగడమేమిటి?  ఇదంతా నాలో అణిగి ఉన్న  నీరసత్వమేనా? నా ఆవేదన ఓ వెఱ్ఱి  బోడిగుండుస్వామి అన్న మాటలతో  చల్లారిపోవడమా? నా  హృదయం  అందుకు  సంసిద్దపడి ఉంది కాబోలు. ఇన్ని యుగాలనాటినుంచీ  ఉన్న  ఈ  మూర్ఖభావాలు  ఒక్కసారిగా  పోతాయామరి?  కాషాయాంబరాలు  ధరించు   ఓ   మాయకాడు  కంటబడగానే, సాష్టాంగ   దండ ప్రణామాలు చేయడానికి  అందరమూ సిద్దమౌతాము. అలవాటు చేసుకొన్నవాడికి ఎదుటివారి  హృదయం   నిమిషంలో అవగతం  అవుతుంది. ఈ  సన్యాసులు  ఆ  విద్యలో  పరమ ప్రవీణులు. ఆ   గంగలోపడి  నా  శకుంతలతో  పోనీక  ఈతడు నన్ను  రక్షించడ మేమిటి? ఇంతలో  స్వామి  లోపలనుంచి  మావద్దకు  వచ్చారు.  మేమంతా  లేచి  నుంచున్నాము.  స్వామీజీ  మోము అంత  అందమైనది  కాదు. కాని ఆ  మోములో  ప్రసరించే  అద్భుతమైన  కాంతులు  నేను  వర్ణింపలేనివి, అవి  ఆ  గదంతా  వెలిగించినట్లే  నాకు తోచింది.  ఆరడుగుల పొడవు,   డబ్బపండు  చాయ, ముప్ఫయి  ఏళ్ళు  పైన  ఉండవచ్చును.  నాకు  మాత్రం ఆయన  ఇరవై ఏళ్ల  యువకునిలా  కనుపించారు. మమ్మల్నందరినీ   కూర్చుండ నియమించి, స్వామీజీ  చిరునవ్వుతో  నావైపు  చూచి, బాబా! నా  ఈడు   యెంతని   నీ  ఉద్దేశంఅన్నారు.
   నేనాశ్చర్యంతో  చిత్తం! చిత్తం! ముప్ఫయి  ఉండవచ్చును అన్నాను.
    నా  కిప్పుడు  ఏభై  ఆరేళ్ళు!  నీ  వంత   ఆశ్చర్య  పడనక్కరలేదు. మా  గురువుగారికి  తొంబది ఏళ్లున్నాయి. ఆయన  నాకన్న చిన్నవారుగా కనబడతారు. నీ  హృదయంలో  అనుమానాలు   పూర్తిగా వదలలేదు. వదిలితే   నువ్వు అందరితోపాటే  అవుతావు. మూర్తీ!  నీ  పేరు నాకు మంత్రశక్తివల్ల  తెలియలేదులే....మీ  వాళ్ళే చెప్పారు, నీ  భార్యపోయింది.
   నీ  భార్యను  నువ్వు  అతిగాఢంగా  ప్రేమించావు. దాంతో నువ్వు  డ్రైవరులేక  పరుగెత్తే   మొటారుకారు  వయ్యావు. ఆ  కారు చివరకు గంగలో ఉరికింది. నువ్వు వట్టి  భ్రమవల్లనే గంగలో ఉరికావని నాకు  తెలుసును. బాబా! నేను నీకోవైద్యము  చెబుతాను. నువ్వు  నాతో  కైలాసయాత్రకు  రా. మీ అమ్మగారు, ఈ సుబ్రహ్మణ్యం  మీ మేనమామల  ఊరు  వెడతారు.
   మా అమ్మ  భయంతో  చేతులు  జోడించి, స్వామీ, మా  అబ్బాయిని  నేనెలా వదలి ఉండగలను? అన్నది. 
   అమ్మా! భయపడకండి. నన్ను నమ్మండి.  ఆరునెలల్లో  మీ అబ్బాయి  తిరిగి  మీ  ఇంటికి వస్తాడు. ఈలోగా  మీకో  చిన్న మంత్రం ఉపదేశిస్తాను. అది మీరు  పునశ్చరణ చేసుకుంటూ  ఉండండి.
   మా అమ్మ స్వామివైపు చూచింది. ఆయన మోము, పాదాలు రెండుసార్లు  తిలకించింది. తమ  ఆజ్ఞకు  నేను బద్దురాలను అన్నది.
   నాకిదంతా ఆశ్చర్యంగా వుంది. నేను కైలాసమూ  రాను, గియలాసమూ, రాను అనడానికి సిద్దంగా ఉన్నాను. స్వామీజీ నావైపు చూచి, బాబా! నువ్వు నాతో  కైలాసపర్వత  దర్సనానికి   రా. అక్కడ అందమైన  ఆడపిల్ల   లెవరూ  లేరు. నువ్వు భక్తితో  ప్రార్థనలు  చేయనక్కరలేదు.  నీకు దైవము వద్దు.  నేను  దైవాన్ని  నమ్ము అని నీతో  ఒక్కమాటూ అనను. ఆ మాట నీకు ఇస్తాను. కాని  క్షతమైన నీ  హృదయానికి  శాంతి  ఆ  ప్రయాణంలో  లభించి  తీరుతుంది. నీ  మనస్సులో  ఉన్న  అనుమానాలు  ఆ నిర్మల  నిశ్చల  ప్రదేశాలలో  నివృత్తి అవుతాయి.  ఆ  ప్రదేశాల  అందమే నీకు  భోజనం అవుతుంది. ఆ  ప్రాంతాలనుండి  మనం  తిరిగి వచ్చిన  తర్వాత  నీ  ఇష్టం వచ్చినట్లు  నువ్వు సంచరించు. నా  అభ్యంతరం  లేదు. నేను నిన్నేరకమైన  వాగ్ధానమూ  ఇమ్మని కోరను అని అత్యంత  గంభీరంగా  పలికినారు. నేనవశుడనై  తప్పక వస్తానండీఅన్నాను.     
   
                                                                                                           విష్కంభము
   హేమసుందరి త్యాగతికథ ఇంతవరకు  చదివేటప్పటికి తెల్లవారగట్ల  రెండున్నర అయినది. ఎంత విచిత్ర  సంఘటన! త్యాగతి  అలా  అయినాడా? తన బావ స్త్రీనాథమూర్తేనా  ఈ  త్యాగతి? ఎన్ని భాదలు తెచ్చి పెట్టుకున్నాడు. అతన్ని  గర్హించాలా, లేక  అనుక్రోశించాలా? ఆమె ఆ పుస్తకాన్ని  పక్క  సోఫామీద  పెట్టింది. సుశీల  విషయంలో  అతడు  పప్పులోకాలు  వేశాడు! కాని  అతడేమి  చేయగలడు? కాశ్మీరంలో, లాహోరులో, సుక్కూరులో  అతని పోకడలు  అసహ్యంగా,జుగుప్సారకంగా ఉండలేదా? స్త్రీ   అంత  చులకనా? స్త్రీ  అంటే అంత  పశుభావమా? కాని  ఈ  గ్రంథం  ఇంత  బట్టబయలుగా  త్యాగతి  రాయడంలో  ఉండే పరమార్ధ  మేమిటి? ఈ  గ్రంధం అచ్చు వేస్తాడా?
   ఆ  గ్రంథాన్ని మళ్ళా  తీసింది. మొదటి  పేజీ  చదివింది. ఈ  నా  తుపాను  హేమకుసుమదేవికోసం  మాత్రమే! ఆమె  నేను ఎవరినో తెలియక  నన్ను గురించి   అనేక ఊహలు ఊహించుకొంటున్నది. ఇంక  నేను  రహస్య  వ్యాజాన  అసత్యదోషాన్ని  ఆచరిస్తూ ఉండలేను. నేను చేసిన  పని గురువు  ఆదేశం మీదనే! నీకు  ఉచితమని  తోచిన  మరుసటి క్షణంలో  నీ  రహస్యం  నీ  వాళ్ళకు  చెప్పుఅని గురువుగారన్నారు. అయినా ఆ కాలపరిమితిని కూడా  నేను  కావాలని దాటబుచ్చాను.
    హేమసుందరితో  స్నేహం వాంఛించాను.  నాలో  బయలుదేరిన సమస్యను  నేను విడదీయలేకపోయాను.  ఆ  కారణంచేత    నా  గురువు అజ్ఞా ప్రకారం  కొన్ని నెలల  క్రిందటనే  హేమకు  నా విషయం  యావత్తు పూర్తిగా  చెప్పుదామని ప్రయత్నం చేశాను.
   కాని,అలా  చేయలేకపోయాను. ప్రచ్ఛన్నంగా  ఉండి  మాయవేషం  వేసిన  దోషం నన్ను పూర్తిగా అలముకొన్నది.  ఆ   దోషానికి నేనే  భాద్యుణ్ని.
   అయితే   హేమా! నా  కథ  చివరివరకూ  చదువు. అప్పుడు నన్ను క్షమించు అంతే  నేను కోరేది.
   తన కోసమేనా? త్యాగతి  ఈ  కథ  వ్రాసింది?  అతని ఉద్దేశం?
   హేమ అలా ఆలోచనతో కూర్చుండపోయినది.  త్యాగతి అంటే  ఏవేవో  స్వప్న సౌధాలు కట్టడం   ప్రారంభింది. అతడంటే  ఏవేవో విచిత్ర  భావాలు   తనకు  కలగడం  ప్రారంభించాయి. అతన్ని  తాను....ప్రేమిస్తున్నానా  అనుకుంది. అతడంటే  తనకున్న  గౌరవం   అప్రతిమానమైన  స్థితికి వచ్చింది.
   అతడు  తన బావ  శ్రీనాథమూర్తేనని  తెలియగానే హేమసుందరి  అత్యంతాశ్చర్యంలో   మునిగిపోయింది. అతని  కథ తెలుస్తున్న కొలదీ  ఆమెలో ఏవేవో విచిత్రభావాలు కలిగి  అణగిపోతున్నవి. అతని ఆ  జీవితానికి ఈనాటి త్యాగ తికీ ఏమి  సంబంధం ఉంది?
   లోకేశ్వరి మంచంమీద  లేచి కూర్చున్నది.
                                                                                                                           
           
               

హేమా! ఎంతసేపయింది నువ్వులేచి?

    చాలా సేపయింది. కథ మళ్ళీ చదవడం  ప్రారంభించాను.
    కళ్ళు  విప్పగానే  నిన్ను  చూచి అదే అనుకున్నాను. నాకు మాత్రం వెఱ్ఱినిద్ర  పట్టింది. యింకా  మత్తు వదలలేదు. కాసేపు  నిద్రపోతా. నువ్వు  పుస్తకం పూర్తికాగానే లేపుతావు కదూ?
   ఈ  ముక్కలంటూనే లోకేశ్వరి  ప్రక్కమీద  వాలిపోయింది. పడుకున్న పదినిమిషాల్లో లోకేశ్వరి నిదురకూరిందనే  హేమ  భావించుకుంది. కాని లోకేశ్వరికి  నిదురపట్టలేదు.  ఆమె అతిగాఢమైన   నిద్రలో  మునిగి పోయినట్టు నటించడం ప్రారంభించింది.
   హేమసుందరి  త్యాగతికథ   మళ్ళీ తీసింది. మళ్ళీ సోఫాపై  నుంచి లేచి వెళ్ళి కూజాలో  నీళ్ళు తాగివచ్చి,  చదవడం ప్రారంభించింది.

   
                                                                                                     o           o           o
   స్వామీజీ  బోధనలు వింటూ మా అమ్మ   హరిద్వారంలో   వారం రోజులు  ఉంది.  నేను  కైలాస  ప్రయాణానికి   వలసిన  సన్నాహాలన్నీ  స్వామీజీ సలహా  ప్రకారం  చేయడం  ప్రారంభించాను.
   వేడికి ఉన్ని దుస్తులు  కుట్టించుకున్నాను. చేతులకు  తోలు తొడుగులు  కొనుక్కున్నాను. దారిలో భోజనానికి వలసిన  సామగ్రి  సేకరించాను  మాతో  వచ్చేందుకు  ఒక  లేప్చాను  మాట్లాడుకొన్నాను. హృషీకేశం  వెళ్ళగానే  అక్కడ  మా  సామాను  మోసుకువచ్చేందుకు  హిమాలయపు  పొట్టి గుర్రాన్ని  ఏర్పాటు  చేసుకున్నాను. సిగరెట్లు, చుట్టలు, అగ్గిపెట్టెలు  దిట్టంగా  సేకరించాను. ఒక డబ్బా కిరసనాయిలు ప్రైమస్ స్టవ్ నూ కొన్నాను.
   నా  యాత్రాసంరంభం చూస్తూ  స్వామిజీ   నవ్వుకుంటూ ఉండేవారు. ఢిల్లీకి వ్రాసి ఒక చిన్న  డేరా  ఖరీదుకు తెప్పించుకున్నాను. ఆ  డేరాకు రెండు గుఱ్ఱాలు  అదనంగా  మాట్లాడాలట. ఒక చిన్న  మహారాజుకైన ఖర్చు అయినది. నా  సరంజామా  పూర్తికాగానే  మేమంతా హృషీకేశ్   నగరం  వెళ్లాము. 
   మా తల్లి  కుడా నాతో ప్రయాణమయితే  స్వామీజీ వద్దన్నారు. అందుకు చాలా కారాణాలున్నాయన్నారు. మా  అమ్మ  స్వామీజీ  ఉపదేశ  ప్రకారం  హృషీకేశ యాత్ర  పూర్తిచేసుకుని  గయ, కలకత్తా, పూరీలమీదుగా భట్టిప్రోలు వెళ్ళడానికి నిశ్చయం  చేసుకున్నది. మా అమ్మ  నన్ను తన గదిలోకి  రమ్మని, నాన్నా! నాకు నువ్వు  నమస్కారంచేసి  చాలా రోజులయింది రా. ఒక్కసారి నాకు నస్కారం చేయరా! అన్నది.
   మా  అమ్మగారి  ప్రేమ పోగిపోయి, నన్ను ముంచెత్తింది. కరిగిపోయిన  హృదయంతో  అప్రయత్నంగా, నేల సాగిలబడి,  ఆమె పాదాలు రెండు  స్పృశించాను. దీర్ఘాయురస్తు. బహుసంతాన  ప్రాప్తిరస్తు. నాన్నా! నువ్వు తిరిగి వచ్చేవరకు నా పంచప్రాణాలు నీతోనే  ఉంటవి. ముందు సంవత్సరం మనమిద్దరం  వేసవికాలంలో మళ్ళా హిమాలయ  యాత్రలు చేద్దాము. ఇప్పుడు నేను జగన్నాథం మీదుగా భట్టిప్రోలు  వెళ్ళి,అక్కడ  నీ కోసం  ఎదురు చూస్తుం టాను అంటూ కన్నీళ్ళు తిరుగుతుండగా  కళ్ళుమూసుకొని  ఆశీర్వచన హస్తం  చాపి నిల్చుని ఉంది,పిమ్మట నా తల, హృదయం, భుజాలు, మోము తడివి, పెదవులు కదుపుతూ  నిశ్శబ్దంగా  ఆశీర్వదిస్తూ నాన్నా  వెళ్లి సర్దుకోఅన్నది.
   మా  ప్రయాణం ఏదో కొత్తలోకంలో  వలె పదివేల అడుగుల  ఎత్తున వుంటుంది, పదిహేనువేలు, ఇరవైవేల అడుగులవరకూ  ఎత్తు  పెరుగుతూ ఉంటుంది. హిమాలయాలను  తలచుకొంటూ, మా  అమ్మను  తలచుకొంటూ  గంగ ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాను. గంగామాయీ, మా అమ్మా  ఒకటిగా నాకు తోచారు.  నా  హృదయకలశం   ఏవో  వింత భావాలతో  నిండి  పోయింది. యేవో   తెలియరాని   వేదనలు, అర్ధంకాని  కాంక్షలూ, తెరచాటున ఉన్న   మూర్తులూ, నా  జీవితాన్ని  మూలమంటా   కదల్చివేస్తూ  ముందుకు వచ్చినట్లయింది.
   ఎవరి  బాధలు ఎవరికీ తెలుస్తాయి? ఆవేదనలు కాని, ఆనందాలు కాని  వ్యక్తి సంబంధమైన  గోప్యాలు. నేను  ఈ  ప్రపంచంలో  ఒక్కణ్ణే అయిపోయాను. దుఖంకానీ, సంతోషంకానీ, ఆవేదనకానీ అవి ఎవనిలో ఉద్భవించాయో  వానికే  తెలియకుండా  ఉంటాయి కాబోలు. అవి వ్యక్తం చేసుకున్న  కవీ, చిత్రకారుడూ, ప్రతి  సహృదయుని హృదయంలోనూ పతిద్వనిస్తారు. ఇదే  కాబోలు  వ్యక్తిగత  సృష్టిలోని  విశ్వత్వము.  ఆ  అఆలోచనలో  నాకు కృష్ణశాస్త్రి ఆవేదన అర్ధమైంది. ఆ మహాకవి  మధురుమైన  ఆవేదన  అంతా  అందుకోలేని  సౌందర్యం కోసం, ఆనందం కోసమే కదా! మహాకవీ నువ్వూ నావలెనే  వేదన పడ్డావా?  
   మనుష్యుడు  కోరే  ఆ  సౌందర్యం  ఏమిటో? అది స్త్రీ  స్వరూపంగా ఎక్కువ  సన్నిహితం కావచ్చును. అంతకు తక్కువ, ప్రకృతి సౌందర్యం కావచ్చును.  వీటికి  కొంచెం తక్కువగా మానవజీవిత  సౌందర్యం కావచ్చును.  కాని వీటి  అన్నిటినీ  మించిన  దేనికోసమో  మనలో  ఈ  ఆవేదన సర్వకాలమూ  ఉంటుంది. ఆ  ఆవేదన  మన బ్రతుకుకు  సన్నిహితంగానూ, అతీతంగానూ కూడా  ఉంటుంది.  ఈ  ఆవేదననే  విశ్వనాథ  సత్యన్నారాయణ కవి  సమ్రాట్టు  శ్రీకృష్ణనిర్వేదంగా  పాడాడు. ఈ  ఆవేదన  రసస్వరూపం తాల్చబోయే  దోరపండువంటి  భావం. పండగానే కావ్యం అవుతుంది. ఏవో  నా భావాలు   నా  తల  త్రిప్పివేసినవి. ఎదుట కేదారగౌళ పాడుకుంటూ  గంగానది  ప్రవహిస్తుంది.  గంగానదీ! నీలో  వున్న ఆవేదన ఏమిటీ  అని  ప్రశ్నించాను. అలా  సంతతజన్మయై, సంతత  వేగవతియై, సంతత జీవితయై, సంతత మరణయై, ఏదో మహాభావము సర్వవిశ్వానికి ప్రసరింపచేస్తూ ఉంది.
    గంగానదీ  నీ రహస్యము  నేను నీ దారి పొడుగునా ప్రయాణించి, నీ  పుట్టుపూర్వోత్తరాలు  గ్రహించి   నాలో  నీ ఘురీవేగ రాగిణీ స్వరాలాపన  శ్రుతిని  లయింప చేసుకుంటానమ్మా!  నువ్వూ, మా  అమ్మే  నా  ప్రపంచం. నా కింకేమీ అక్కరలేదు. ఈ  స్వామీజీ  నా  చేయి పట్టుకుని  నీ  మాతృహృదయా కాశ  యానం చేయిస్తాడు. నీ  ప్రవాహ  రహస్య  గాథను  అవగతం  చేస్తాడు అని అస్పష్టవాక్కులతో  అనుకున్నాను.
                                                         నీవు పుట్టెదవోయి!
                                                          నీవు నడచెదవోయి! 
                                                          నీలోన ఝురులుగా
                                                          నీలోన  వరదలై
                                                          నేనే  ప్రవహింతునోయీ!అని గంగ  పాడినట్లయింది.                                                                                                                           
           
               

వారిద్వారం చేరుకున్నాము. మా అమ్మగారు కాశీలో, ప్రయాగలో, బృందావనంలో, గోవర్ధనంలో, హస్తినాపురంలో, లక్నోలో, అయోధ్యలో మనుష్యుల సంపర్కం ఎక్కువ. కాని హరిద్వారం వచ్చేసరికి దేవతా సంపర్కం కలుగుతున్నది అన్నది.

   హరిద్వారానికి  పూర్వపు పేరు  మాయావతి. మాయావతి పట్టణ శిథిలాలు  ఇప్పటికీ  చూస్తే  హరి ద్వారానికి  సంబంధించే కనబడుతున్నవి.  పట్టణంలో  కొంతభాగాన్ని  మాయాపురి  అనే పిలుస్తారు. హరిద్వారంలో  గంగానది  అందమే వేరు. గంగానదిలో  మాత్రు భావం  పొంగిపోతూ ఉంటుంది. యమునలో ప్రియురాలి భావం  పరవశత్వం కలిగిస్తుంది. గంగ జ్ఞాన  స్వరూపిణి, యమునా  ప్రేమస్వరూపిణి.  అంతర్వాహినియై, సరస్వతి విజ్ఞానరూపిణి. పూర్ణగంగామాయి తేజోరూపిణియై, ప్ర్తాపంచిక  పథాల విహరించడానికి అవతరించిన మోక్షదేవి అన్నారు మా  స్వామీజీ.
   హరిద్వారంలో   హిందువులు  కానివారు  ఆస్తి  సంపాదించకూడదు. ఒక్క  మసీదుగాని, చర్చిగాని  హరిద్వారంలో  లేవు.  హరిద్వార పట్టణ  సరిహద్దులలో  మాంసము  తినరాదు.  చేపల పట్టరాదు.  పక్షుల హింసింపకూడదు.   సారాయి మొదలైన  మత్తుపదార్దాలు  పట్టణంలోకి రారాదు.  ఈ  నిబంధనలన్నీ  ఇతర  పుణ్యస్థలాల్లో లేవు.  నేను సిగరెట్లు  పట్టణం బైటనేకొనుకున్నాను. ఇచట  బ్రహ్మచర్యాశ్రమాలు  ఎన్నో  ఉన్నాయి. ఇక్కడనుండి  యాత్రికులైన  స్త్రీ పురుషులు  కామసంపర్కం  వదలివేస్తారు.  హిమాలయ  వాసులకే  అది  ఆరోగ్యకరమటగాని, ప్రయాణీకులకు  రోగకారణ  మౌతుందట. వేదాధ్యయనం  ప్రతిచోటా   వినబడుతూ  ఉంటుంది. ఇక్కడ  ఉచ్ఛారణ వేరు. మన  ఆంధ్రుల  ఉచ్ఛారణమే  స్పష్టంగా, సలక్షణంగా  ఉంటుంది. వానప్రస్థాశ్రమాలు,  గురుకులాలు, ఆయుర్వేద  కళాశాలలు  ఎన్నో ఉన్నవి.
   మేము  మదరాసీ  ధర్మశాలలో మకాం పెట్టాము. మా  సుబ్బులుకు  ఈ  పట్టణం  కన్నుల  వైకుంఠంగా  ఉంది. వాడి  ఆనందం  వర్ణనాతీతం. గంగాద్వార దేవాలయం  ఉండేదని  హుయన్  త్సాంగు  వ్రాశాడు. ఆ  దేవాలయం  ఇప్పటకీ  అక్కడ  ఉన్నది. గంగాద్వారం  తర్వాత ప్రసిద్దికెక్కిన  స్థలం బ్రహ్మ కుండం.  ఇక్కడ  బంగారు  వెండి పాత్రలలో  అస్తులు కలుపుతారు.  బ్రహ్మ ఇక్కడ  తపస్సు చేశాడు. ధర్మాంగదుడు  పామై  ఉన్నప్పుడు   అతని భార్య  అతన్ని  ఇక్కడకు తీసుకువచ్చి  స్నానం చేయించగానే, అతడు శాపంపోయి  అందమైన  రాజకుమారుడయ్యాదట. ఈ  కథ  నిజమై  ఉండాలంటాడు   మా  వెర్రి  సుబ్బులు. తల్లీకుమాళ్ళు  ఒకళ్ళనొకళ్ళు  కామించుకోగానే  కుష్టురోగులయ్యారట. అప్పుడు  బుద్ది వచ్చి  దేశాలు తిరిగి  తిరిగి  ఈ  బ్రహ్మకుండలో స్నానం  చేసేసరికి,  వారి   పాపాలు  క్షయమై  యథారూపాలు  పొందారట.
   గంగానది  ఇక్కడ  రెండు  పాయలౌతుంది;  ఆ  చీలికలను  ధార అంటారు. చండీపర్వతం.  ప్రక్కనే  దక్షిణంగా  ప్రవహిస్తుంది. రెండవధార  శివాలిక్ పర్వతం  ప్రక్కగా వచ్చి, హరిద్వారం, మాయాపురం, కనఖల పట్నం పవిత్రంచేసి,  చండీధారతో  కలుస్తుంది.  ఈ  ఉత్తరధార  శివాలిక్ పర్వతాన్ని  స్పృశించినచోట  బ్రహ్మకుండం ఉంది. బ్రహ్మకుండం  దిగువగా  గంగాద్వారాలయం, హరిచరణఘట్టం  ఉన్నాయి.  గంగ  విష్ణుపాదజ  అనే  భావానికి  చిహ్నం ఈ  హరిచరణ  ఘట్టం.  భారతదేశంలోని   సంస్థానాధీసులు  ఈ  రోజులలో  క్షేత్రాలన్నిటా  మెట్లు,  ఇనుప  గొలుసులు  మొదలైన  అనుకూలా  లెన్నో  చేశారు.
   బ్రహ్మకుండానికి  దక్షిణంగా  గోఘట్ట తీర్థముంది.  గోహత్యాపాతకం  పోతుండట. దత్తాత్రేయ  మహర్షి  ఇక్కడే  తపస్సు  చేశాడట. ఆ  తర్వాత  కుశాతీర్ధముంది. తర్వాత  విష్ణుతీర్థము, తర్వాత  బిల్వపర్వతము,  ఇంతటితో శివాలిక్  పర్వతం  ఆఖరు. ఇక్కడ బిల్వకేశ్వరుడు  వెలిసి  ఉన్నాడు. మయాపురం దగ్గిర  గణేశతీర్థము,  నారాయశిల తీర్థము  ఉన్నాయి. చండీ  ధార  ప్రక్కనున్న  చండీపర్వతం  మీద  చండీ  దేవాలయం ఉంది.  పర్వత పాదం కడ  గౌరీశంకర  దేవాలయం  ఉంది. అక్కడే  ఇల్లేశ్వర  దేవాలయం ఉంది. హరిద్వారానికి ఎదురుగా  ఈ  చండీపర్వతముంది.
   మా  సుబ్బులు  నన్నీ  తీర్థాలన్నీ  తిప్పాడు. మా  అమ్మగారు  అన్ని దుఖాలు  మరచిపోయి, నేను   కైలాసం నుంచి   తిరిగి వచ్చేవరకూ  ఇక్కడే ఉందామనుకొన్నది. కాని  స్వామీజీ  ఆవిడ  హరిద్వారంలో  ఉన్నంతకాలం  ఉండి, భట్టిప్రోలు  మాత్రం  వెళ్ళాలని  ఆదేశం ఇచ్చారు.
   స్వామీజీని  కలుసుకొన్న పదవరోజున  మేమంతా  భీమగోడాతీర్థానికి వెళ్ళాము.   ఇదే  మా  కైలాస  యాత్ర  ప్రారంభం.  మా  అమ్మగారూ, సుబ్బులూ  హృషీకేశం  వరకూ   వస్తారు.  అక్కడ  మేమంతా  మూడురోజులుంటాము.  ఆ  తర్వాత  హిమాలయం ఎక్కుతాము.  ఇది  మా  ప్రయాణం  ఏర్పాట్లు. మా  యాత్ర  సాగిన  తర్వాత  కూడా   మా  అమ్మగారూ, సుబ్బులూ  కొన్ని రోజులు  హృశీకేశంలో  మకాంచేసి,  హరిద్వారం  వెళ్ళి  అక్కడ  ఇంకా కొన్ని రోజులుండి, ఇంటికి వెడతారు.
   మొదట సప్తస్రోతతీర్థము వెళ్ళాలి. హరిద్వారానికి  మూడుమైళ్ళు  తూర్పుగా  వెళ్ళాలి. ఇక్కడ  గంగానది  ఏడుపాయలుగా  చీలింది.  సప్త స్రోతంలో  ఏకాంతవాసం చేసే  ఋష్యాశ్రమాలు    చాలా  ఉన్నాయి. ఇక్కడనుంచి  హరిద్వారానికి  దక్షిణంగా  కనఖలతీర్థం  వెళ్ళాము.  కాళిదాసు  తన   మేఘసందేసంలో  ఈ  నగరాన్ని  అందంగా   వర్ణించాడు. ఈ   కనఖల పురం  దగ్గిర  పతితపావనేస్వర, తక్షేస్వర, తిలవథేశ్వర    మహా  దేవాలయాలున్నాయి. ఇక్కడే  సతీకుండం  ఉన్నది.  సతి  ఇక్కడ  దక్షయజ్ఞశాలలో  ప్రాయోపవేశం  చేసింది.  ప్రక్కనే  దక్షేశ్వరాలయమూ ఉన్నది. ఇవన్నీ  చూచుకొని  భీమగోడాకు పోయాము. అక్కడ  స్నానంచేసి  హరిద్వారం  వచ్చి రైలెక్కి  పదిహేనుమైళ్ళ  దూరంలో  ఉన్న  హృషీకేశం చేరుకున్నాము.
   
                                                                                                                    32
   
   హృషీకేశం  ఎంతో  విచిత్రమైన  పట్టణం.  అక్కడ  శ్రీరామ  మందిరము, భరతాలయాలను దర్శించినాము.  మా స్వామీజీ  మా  కోసం  చేసిన  సదుపాయాలు  అన్నీ  ఇన్నీ కావు.  ఎవరీ  స్వామీజీ? వీరు పూర్వాశ్రమంలో,  నెల్లూరు జిల్లా కావలిపుర వాసులు. వారింటి   పేరు  ధనికొండవారు.  వారి పూర్వాశ్రమం  పేరు  నారాయణరావుగారు. ఎం. ఏ; బి. ఎల్. పరీక్షలో  కృతార్ధుడై, నెల్లూరులో  న్యాయవాది పనిచేస్తూ, 1909లో  భార్య, ఇద్దరు  కుమాళ్ళూ, తండ్రీ ఇన్ ప్లూ ఎంజా జబ్బువల్ల మరణిస్తే, జీవితాన్ని రోసి, హిమాలయాలకు వచ్చి  బదరీ, కేదార, గంగోత్రి, గోముఖ  యమునోత్రి, సత్పథాతి  యాత్రలుచేసి  హృషీకేశంలో  అఖిలానంద  భారతీ   స్వాములవారి  శిషుడై, ఆశ్రమం  తీసుకొన్నారు.
                                                                                                                           
           
               

నారాయణరావుగారు ఉన్నంతకాలం తన కుటుంబం సంపాదన తప్ప ఇంకేమీ ఎరగడు. ఆశ్రమం తీసుకొన్న తర్వాత, సర్వకాలం తపస్సు, పఠనం ఇవి ఆయన పనులు. గురువులు వీరికి కైలాసనంద భారతీ యని నామకణం చేశారు. వీరు ఆశ్రమం పుచ్చుకొని ముందు కైలాస పర్వత సందర్శనమూ, మూడుసారులు ఆ మహాపర్వతానికి ప్రదక్షిణమూ చేసివచ్చారట. ప్రతి సంవత్సరమో, లేకపోతే రెండేళ్ళ కొక పర్యాయమో కైలాసానందులు, కైలాసయాత్ర చేసి వస్తూ వుంటారు. ఒక్కొక్కప్పుడు ఒక ఏడాదంతా కైలాసపర్వతం దగ్గర ఉన్న బౌద్దాశ్రమాలలో నివసిస్తూ తపస్సు చేసుకొంటూ ఉంటారు.

   కైలాసానందులు  సాంగవేదులై,  ప్రస్థానత్రయశాంతి  చేశారు. భాష్యత్రయం  గళగ్రాహంగా  వచ్చును. పాంతజలం  మొదలైన  యోగగ్రంధాలు క్షుణ్ణంగా  వచ్చును. తపస్సువల్లనో  ఏమో  వారికి  ఏకసంధా  గ్రాహిత్యం  అతి సులభంగా అబ్బింది. షడ్డర్శనాలు, మతేతర  దర్శనాలు పూర్తిగా వచ్చును.  రామక్రిష్ణ  మఠంవారి   గ్రంథాలు,  సత్సంఘ గ్రంథాలు,శిక్కుమతస్థుల గురు  గ్రంథ  సాహెబ్జీ ఉప ఉపదేశాలు, ఆగమాలు, పాశ్చాత్యుల వేదాంతాలు అన్నీ  సర్వకాలం  చదువుతూ  ఉంటారు.  హరిద్వారంలో  వీరు  మానస  సరోవరాశ్రమం  ఏర్పాటు చేశారు. ఆ  ఆశ్రమంలో  గ్రంథాలయం  ఉంది.  అన్ని భాషలూ  నేర్చుకున్నారు.  త్రివిష్టపపు  వ్రాత గ్రంథాలెన్నో సముపార్జించారు.  అనేకమంది  సన్యాసులు  వీరి ఆశ్రమానికి  గ్రంథపఠనంకోసం  వస్తారు. వీరి  శిష్యులు  దేశం  అంతా  వున్నారు. కోటీశ్వరులు, మహారాజులు, దరిద్రులు  యెంతోమంది  వీరి   శిష్యులు. బీదసన్యాసులకు  సర్వసహాయాలు  చేస్తూ ఉంటారు. వీరు  పూర్తిగా  అహింసావాదులు. గాంధీగారు  అవతార పురుషులనే వీరి  ఉద్దేశ్యం. మూడు నాలుగు సారులు  వీరా మహాత్ముని  సందర్శించారు.
   వాదనలో  మా  స్వామీజీని  జయింపలేము. వాదన  అవసరంలేకుండా  హృదయానికి  అమృతభోజనం   ఆరగింపజేస్తారు. వారి  ఉపదేశాలల్లో, వీరి మహాత్మ్యం  చాలా  గొప్పదని  హరిద్వార   హృషీ  కేశాదులలో  అనేకులు మాతో చెప్పారు. హాస్యంచేసి  నవ్విస్తారు.  మోమాటం లేకుండా  అన్ని  విషయాలు చెప్పుతారు.  ఎప్పుడు కునుకుతారో  నేను  కని పెట్టలేకపోయాను. ఎప్పుడూ  చదువుతూనో,  జపం చేసుకుంటూనో  కనబడుతారు.  స్వామీజీ  మంచి  గాయకులు,  సైగల్ గొంతును  మించిన  తీపి మందిరం  గొంతుతో  జపాదులు లేనికాలాల్లో, ప్రయాణం  చేసేటప్పుడు,  రాత్రిళ్ళు  యెప్పుడూ తత్త్వాలు పాడుకుంటూ  ఉంటారు.
   హృషీకేశం నుంచి  దేవప్రయాగ  వెళ్ళాము. మోటారు బస్సుపై పదిహేను  గురు స్వాములు, మా  స్వామీజీ, నేనూ  ఒక  రాజపుత్ర  జమీందాడుడూ, సిబ్బందీ, అందరము  అరవై  నలుగురము. ఒక  జట్టయి  హిమాలయ యాత్ర ప్రారంభించాము. ఇంతవరకు  స్వామి   నాకేమి  బోధించ  ప్రయత్నించలేదు. నేను  ఆయన్ను  ప్రశ్నలూ వేయదలచుకోలేదు.  మా  అమ్మగారి  దగ్గిరా, మా  సుబ్బులు  దగ్గిరా  సెలవు పుచ్చుకొని, బస్సుమీద  దేవప్రయాగ చేరాము. మా  అమ్మగారు  ఎంతో  ఉత్సాహంతో  అత్తవారింటికి కొడుకు  వెల్లేటప్పుడుండే  సంతోషంతో సుఖంగా వెళ్ళి, కైలాసేశ్వరుని  దయచేత  కులాసాగా  తిరిగిరా  నాన్నా అని  ఆశీర్వదించింది.
   ప్రయాగ  అంటే  నదీ  సంగమ  క్షేత్రం.  అలహాబాదు  మనుష్య ప్రయాగ, అలకనందా భాగీరధీ  సంగమం  దేవప్రయాగ. కర్ణ, నంద, రుద్ర, విష్ణు ప్రయాగలున్నాయి. అసలు గంగానది  భాగీరథి. భగీరథుడు గంగోత్రి  కని పెట్టినాడు. కాబట్టి  భాగీరథి అని పేరు వచ్చింది.  ఉన్న ప్రయాగలన్నీ అలకనందానదికే ఉన్నాయి.  భాగీరథిలో చాలా నదులు  కలుస్తున్నా  వాటికి ప్రయాగలనే  పేర్లు లేవు. అలకనందలో  మందాకిని  నది కలిసేచోటు రుద్రప్రయాగ.  అలకనందలో  పిండారీగంగ  కలిసేచోటు  కర్ణప్రయాగ; నందప్రయాగలో  నందానది   అలకనందలో  సంగమించే పుణ్యస్థలం. విష్ణుప్రయాగలో  విష్ణుపాదజ  అయిన  విష్ణుగంగ  లేక  ధౌళీగంగ  అలకనందలో కలుస్తుంది. మందాకిని ఆకాశనది, కేదారనాథ క్షేత్రం దగ్గర   ఈ  నది పుట్టిన  స్థలము.  అలకనంద  అలకాపురం దగ్గర  పుట్టింది. అది  మానవులు  దర్శింపలేని  హిమాచల  శృంగస్థలము.  బదరీ  నారాయణానికి  యెగువగా పన్నెండు  పదమూడు  మైళ్ళదూరంలో  ఈ  అలకాపుర  ప్రదేశం ఉంది. ఒకప్పుడు యక్షజాతి  మనుష్యులు (ఈనాడూ  దారి  పొడుగునా  వారు  కనిపిస్తారు) పొట్టి మంగోలీ జాతివారు, టిబెట్టు జాతికి చుట్టాలు, అక్కడ  ఉండేవారనీ, హిమాలయాలలో  ఎప్పుడూ  సంభవించే  హిమపాతాలవల్ల   ఆ  పట్టణం  పూడిపోయిందనీ   నా  ఉద్దేశం. కాళిదాసుని  మేఘసందేశయాత్ర కూడా  ఇక్కడికే  వస్తుంది.  ఇక్కడినుంచే కైలాసపర్వతానికి  దారి  ఉంది.
       
                                                                                                                   33
   
   హృషీకేశంగాని,  ఆ  తర్వాత  మా  ప్రయాణంలో   మకాములుగాని  నన్ను  కప్పిన  మంచుతెరలను  చీల్చలేకపోయాయి. నాగుర్రాన్ని  నేను  ఎక్కదలచుకోలేదు.  కూడ  ఉండడం   మంచిదని ఎంచాను. మురికిరేతి, లక్ష్మణ  ఝాలా, గరూర్హ  చట్టీ, పూల్ వారీ, గులార్ చట్టీ, నయీమోహన్, చహోటీ బిజానీ, బర్హిబిజానీ,  కుండు చట్టీ, బందర్ ఖేల్, మహదేవ్, నెమాల్ చట్టీ, కండీ చట్టీ, వ్యాసఘట్టం, ఉంరాసు  ప్రదేశాలన్నీ  మోటారు  బస్సుమీద   వెడుతూ చూశాను.  బస్సు  ప్రయానంలేని  రోజుల్లో, ఈ  మజిలీలన్నీ మకాములు  చేసుకుంటూ, దేవప్రయాగ చేరుతారు. మా  జట్టులోని  వారొకరు  నాకీ  ప్రదేశాలన్నీ చూపిస్తే, 'ఉహూ' అంటూ చుచానేగాని  నా  మానస ఫలకం  మీద  ఇవేవీ చిత్రితం కాలేదు.
   దేవప్రయాగలో  ఒక దినం  ఆగి, అక్కడ మా కూలీలనూ, గుర్రాలనూ  కలుసుకొని  మర్నాడు  తెల్లవారగట్ల లేచి   విశాలబదరీనాథ్ కి  జై య్  కైలాసేశ్వర్  స్వామీజీకి  జై  అని  మా  ప్రయాణం  సాగించాము.  తెల్లవారగట్లకే  వెలుగు బాగా వచ్చింది.  చలిలేనేలేదు.  కొద్దికొద్ది  దూరాలే  ప్రయాణం  సాగంచవలసి ఉన్నది.  నీరు  కాచి  త్రాగుచుంటిమి.  ఒక  సన్యాసి  వంట బాగా తెలిసినాయన  మా  కందరకూ  వంట  చేస్తున్నాడు.  ఆ  రాజపుత్ర  జమీందారు   జట్టుకు  వారి  వంటమహరాజ్  ఉన్నారు.                                                                                                                               
           
               

మేము లక్ష్మణఝాలా వంతెన దాటకుండానే గంగానది పడమటి ఒడ్డునే మొటారుమీద వచ్చాము. నాకై ఐదువేల రూపాయలు మాత్రం ఉంచుకొన్నాను. తక్కిన రూపాయలు హరిద్వారంలో బ్యాంకులో వేసి తెనాలికి మా అమ్మగారి పేర హుండీ ఇచ్చాను. ఆ అయిదువేలలో మూడువేల రూపాయలు నా పేర బ్యాంకిలో వేసుకోమని స్వామీజీ సలహా ఇచ్చారు. కైలాసం వెళ్ళేదారిలోనూ, నేపాలులోనూ బ్రిటీషు వెండి రూపాయలు బాగా చలామణీ ఉంది. నేపాలులో నేపాలూ ప్రబుత్వం బ్యాంకులో మన నోట్లకు వారి డబ్బు మార్చుకోవచ్చునట. తిబెత్తులో మాత్రం మన సోమ్ముకే ఎక్కువ విలువట. నాతో ఉన్న రెండువేల రూపాయలకు, వేయిరూపాయలు వెండి నాణేలు ఉంచి, ఆ రూపాయలు ఒక ట్రంకులో పెట్టి, ట్రంకుకు దిట్టమైన ఆగ్రా తాళాలు వేశాను. తక్కిన వేయి రూపాయలలో, 20 రూపాయలు కాసులక్రింద మార్చి ఉంచాను. నూరురూపాయలనోట్లు అయిదు ఉంచుకొన్నాను. వెండి చిల్లరగా యాభై రూపాయలుంచుకొన్నాను. తక్కిన నాలుగు వందల ముఫ్పై రూపాయలు కూలీలకు, కూలీల ఏజన్సీ వారికిచ్చాను. ఈ అయిదువేలు కాక మందులకని, భోజనసామగ్రులకని, పెద్దగూడారానికని, స్టవ్ కని, విద్యుచ్ఛక్తిటార్చీలకని, కిరసనాయిలుకని, మూడు చలికోట్లకు, రగ్గులకు, బనీనులకు, చేతితొడుగులకు, విద్యుత్ బాటరీలు రెండింటికి, సూదులకు, దారానికి, తళుకు గాజుపూసలకు, తళుకు నగలకు, వెండినగలు చిన్న చిన్న వానికి రెండువేల రూపాయలు ఖర్చుచేశాను. ఇందులో కొన్ని స్వామీజీకి కొనమన్నవి, తక్కినది నా ఆలోచన. నేను కొన్న మందులతో ఓ చిన్న ఆస్పత్రి పెట్టవచ్చును.

   హేమా, ఇవన్నీ   ఎందుకు  ఇంత  విపులంగా  రాస్తున్నానో  విను.  నాలో   ఉన్న  ఏదో  తీవ్రవేదన, గాఢాందోళనము  అణుచుకోడానికే  ఇవన్నీ  కొన్నాను. మందులజాబితా  ఇస్తే మరీ నవ్వుకుంటావు.  ఇవి  కొనేటప్పుడు   నా  తెలివితేటలు చుపించాలనే  అహంకారం  కూడా   ఉంది.  లేకపోతే  రకరకాల  ఇంజక్షన్లు,  మూడువిధాలైన ఇంజక్షన్ గొట్టాల  పెట్టెలూ,  ఆ  గొట్టాలకు  తగిన  అరడజను   సూదులు  కొనడం  ఏమిటి?  మాత్రలు, అరిష్టాలు, అసవాలు, లేహ్యాలు, తైలాలు-ఒకటేమిటి! ఒక చిన్న  ఆంగ్లవైద్యశాల   నాతో వచ్చింది. ఇలా  ఏ  మహారాజూ  ప్రయాణం   చేయరని  మా  స్వామీజీ   అంటూ  నవ్వుకొనేవారు. 
   బయలుదేరేముందు   హరిద్వారంలో  ఒక  డాక్టరుగారి  స్నేహమూ, ఒక  ప్రసిద్ధ ఆయుర్వేద  వైద్యుని  స్నేహమూ  చేశాను. ఆయుర్వేదవైద్యులు,  హిమాలయాలలో  ఆయుర్వేద వైద్యం  బాగా  పనిచేస్తుందని  ముఫ్పై రకాల  కుప్పెలు  ఇచ్చారు. మా  స్వామీజీకి  ఆంగ్లవైద్యమూ, ఆయుర్వేదవైద్యము కూడా  బాగా  వచ్చును.  ఆయన  ఒక్కమాటు  నన్ను   చూచి  చిరనవ్వు  నవ్వి  బాబా! భగవంతుని  నమ్మినవారికి  మందు  లెందుకయ్యా? అన్నారు.  నేను  వెంటనే  భగవంతుని  నమ్మినవారికి  మందులు  కావాలికదండీ! అన్నాను. స్వాములవారు  పకపక  నవ్వారు.
   
                                                                                                                   34
   ప్రతి  మకాములో  స్నానంచేస్తూనే ఉన్నా, నేను  గంగలో  మాత్రం  స్నానం  చేయటం  లేదు. ఇన్ని నీళ్ళు  కాచుకొని  స్నానం  చేసేవాణ్ణి. మాతో  వచ్చే  రాజపుత్రజమీందారు, ఆయన  వర్గమూ  నన్ను చూచి  ఆశ్చర్యం పొందారు.  ఎందుకీ  జంతువు మనతో?  అనే  ప్రశ్న వారందరూ  లోపల  వైచుకొన్నారు కాబోలు, మా  స్వామీజీ  బిల్వకేదారం  దగ్గర  వారిని చూచి   ఈ  అబ్బాయిని  ఆరోగ్యంకోసం  నాతో  తీసుకొని  వెడుతున్నానుఅన్నారు.
   జమీం : గంగాస్నానంకంటె   వేరే  ఆరోగ్యకరమైన   విషయం  ఉందాండి?
   స్వామి : ఆరోగ్యం  కుదిరినకొలదీ  గంగాస్నానం   ప్రారంభిస్తాడీ బాలుడు.
   జమీం  : చాలా  ఆరోగ్యంగా  కనబడుతాడు.
   స్వామి  : దేహారోగ్యం    రెండుమూడుసారులు    చెడిపోయింది. ఇప్పుడాతనికి నరాల జబ్బు.
   జమీందారుడు, కారణంలేక  స్వామీజీ   నా  తరపున  వాదించరని  ఎంచి  కాబోలు  అంతటితో  ప్రశ్నలు మానేశాడు. అవసరం  అవుతుందని  నేను కొన్న పన్నెండు  కప్పుల  ధర్మాస్ ప్లాస్క్ లో ప్రతి   ఉదయ  మకాములోనూ   టీ   చేయించి  పోసి   ఉంచేవాడిని. నాలుగు కప్పుల  ప్లాస్క్ లో,  నా  కోసం  కాఫీ స్వయంగా  తయారుచేసుకొని  పోసి  ఉంచేవాడిని.
   కైలాసానంద  స్వామీజీ  ఆ   దారిలో  అందరికి  పరిచయయే  అందరు  ఆయన్ను  గౌరవించేవారు. మా  నడకలో  ఎన్ని  మకాములవరకో  స్వామీజీ  ఇంకా కొందరు  సన్యాసులూ,  జమీందారుగారి జట్టులో కొందరూ  ముందుపోతూ  ఉండేవారు.  నేను  నెమ్మదిగా  నా  ఆలోచన  లేమిటో  ఇప్పటికీ  నాకు  జ్ఞాపకం  లేవు.
   మలాస్ చట్టీ, రాణీబాగ్, కొల్టా, రామాపురం,  బిల్వకేదార్ మకాములు గడిచి శ్రీనగరం  చేరుకున్నాము.  శ్రీనగరంలో  కాలాకంబళీ  వాలా  సత్రంలో  మకాము చేశాము. కలాకంబళీవాలా   ఒక  సన్యాసి.  ఈయన  హిమాలయ  యాత్రలు  చేసేటప్పుడు  పడేభాదల్ని గమనించి, అక్కడినుంచి  దేశమంతా తిరిగి  చందాలు  వసూలుచేసి, హరిద్వారంలో, హృషీకేశంలో,  దేవప్రయాగలో, శ్రీనగరంలో, ఇతర  మకాములలో  ధర్మశాల లేర్పాటు చేశాడు. ఈయన పెట్టించిన  సత్రాలలో  బీదలకు, సన్యాసులకు  సదావర్తులిస్తారు. వైద్యానికీ  ఏర్పాటులు  చేయబడినాయి.   నల్లటి  కంబళీ  కప్పుకుని  ఉండేవాడు  గనుక  ఈ  సన్యాసికి  కాలాకంబళీవాలా అని పేరు వచ్చింది. ఈయన  బ్రహ్మసాయుజ్యం  పొందిన  తరువాత, ఈ  మహామహుని  ఉత్తమకార్యం కొందరు  పుణ్యవంతులగు  సన్యాసులు కొనసాగించారు. 
   శ్రీనగరంనుంచి  బయలుదేరి  సుకృత, భట్టినేర, కంకార, వార్కోట, గులాటిరాలులు మకాములు  చేసుకుంటూ  హృషీకేశంలో  బయలుదేరిన  నాల్గవరోజు  ఉదయానికి  రుద్రప్రయాగచేరాం. రుద్రప్రయాగలో  మందాకిని అలకనందలో కలుస్తుంది. గంగోత్రి  పోదలుచుకున్నవారు  దేవప్రయోగ దగ్గరనుండి  భాగీరధి నది  ఒడ్డునే  ప్రయాణం  చేసుకుంటూ  పోవలసి  ఉన్నది. యమునోత్రి  పోదల్చుకున్నవారు గంగోత్రి  దారిలో  విడిపోవాలి.
                                                                                                                           
           
               

రుద్రప్రయాగనుంచి మందాకిని ఒడ్డునే కేదారనాథ్ కు యాత్ర చేస్తారు. అలకనందా తీరాన్నే రుద్రప్రయాగనుంచి ఆ సాయంకాలమే ప్రయాణం సాగించి, శివానంద వెళ్ళేసరికి నాకు గాడ్పు కొట్టినంత పనైంది. కాఫీ మధ్య మధ్య నాలుగు సారులు తాగాను. ఆ రాత్రి శివానందిలో మకాం వేశాం. తెల్లవారగట్లనే బయలుదేరి హరి ఆశ్రమం. ఖమెరాలలో ఆగకుండా గౌచాల్ చేరాము. ఇక్కడవరకు విమానాలు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సాయంకాలం బయలుదేరి, పిండారిగంగ అలకనందలో సంగమించే కర్ణప్రయాగ చేరాము.

   నందప్రయాగ  వచ్చేదారిలో  హిమాలయవాసులైన  లేప్చాల జట్టు  ఒకటి  మా  కెదురైంది. వాళ్ళు  రోడ్డు ప్రక్కనే చల్లటి మామిడిచెట్ల  నీడలో మద్దళం వాయిస్తూ పాడుతూ  నాట్యం చేస్తున్నారు.  అందులో  ఒక  అమ్మాయి  అచ్చంగా  గంధర్వ బాలికలా  ఉంది. బంగారు చాయ, గుండ్రటి మోము, స్పుటరేఖా  సమన్వితమైన  దేహమూ  నన్ను  పరవశుణ్ణి  చేశాయి. వరూధిని కూడా  ఈలాంటి  బాలికే  అయి ఉండాలనుకున్నాను. ఆమె బట్టలు  రంగు రంగులతో  ఒక  చిత్రవిధానంలో వున్నాయి, తడుపుట, ఆరవేయుట ఎగరనే ఎగరవు.  నగలూ లేవు. ఏమి అందము!  నేనా  నాట్యం  చూస్తూ  ఆ చెట్లనీడనే  కూర్చున్నాను. నాతో  రాజపుత్ర  జమీందారుడును  కూర్చున్నాడు. ఆ  రాజపుత్ర  జమీందారుని  పేరు  రాజగోవిందసింహకపూర్   బహదూర్,  ఈయనకు  నలభై  అయిదేళ్ళుంటాయి.  పొడుగాటి  మనుష్యుడు. బంగారానికి  వన్నెదిద్దే చాయ.  గరుడనాసిక, కోలమోము, బవిరి  గడ్డంతో  ఏ  ధర్మరాజునో, అర్జునుణ్ణో తలపించే  అందం  కలవాడు. మా  ఇద్దరి  సంభాషణ హిందూస్థాన్  భాషలో  జరిగింది.
   బాబూజీ! ఆ  అమ్మాయి  ఎంత చక్కగా  పాడుతోంది. కోయిల  కంఠం కాదా?
   అవును  రాజబహదూర్! ఆ   నాట్యం   చూస్తోంటే  ఊర్వశి  నృత్యం  ఈలాగే  వుండేదేమోనని  అనిపిస్తోంది.
   ఊర్వశి  నృత్యం  ఎందుకు  జ్ఞాపకం  వచ్చింది మీకు? 
   మనం  ఊర్వశి పుట్టిన  స్థలం  చూడబోతున్నాం గాదా  అండి? 
   అదేక్కడండోయ్?!
   నరనారాయణాశ్రమమైన  బదరికా క్షేత్రమే  కదాండి. నరనారాయణులు  తపస్సు చేసుకొంటుంటే, ఆ  తపస్సు  చెడగొట్టడానికి ఇంద్రుడు  రంబాదులను పంపిస్తే  చిరునవ్వతో  నారాయణుడు  తొడ చరవగానే,  ఊర్వశి  ఉద్భ వించిందట.  ఆమె  పరమాద్భుత దివ్య  సౌందర్యాన్ని  చూచి  రంబాదులు  పారిపోయారట. ఇంద్రు  డామెకు  దాసుడయ్యాడట.
   
                                                                                                                    35
   
   ఆ  బాలిక  నాట్యం  మనోహరంగా  ఉంది. మమ్మల్ని మెప్పించాలని  మరీ  చక్కగా  పాడుతూ, చేతులూ  కళ్ళూ  తిప్పుతూ  నాట్యం చేసింది. ఆమె   అలా నాట్యం  చేస్తూ, చేస్తూ  నాదేవి  శకుంతలగా మారిపోయింది.  ఎప్పుడు  నేర్చుకుంది   నా  శకుంతల  నాట్యం?  నా   శకుంతల   ఊర్వశి కాదు  గదా? ఏదైనా  శాపం పొందివచ్చి, శాపం తీరగానే  వెళ్ళిపోయిందేమో? పురూరవుణ్ణి, అర్జునుణ్ణి  ఆమె   ప్రేమించింది.  పురూరవుడు  ఆమెను  ప్రేమించాడు. అర్జునుడు ప్రేమించలేదు.  మా  తెలుగు  కవులలో  ఉత్తముడైన  దేవులపల్లి  ఊర్వశీభావాన్ని అత్యంతము  ప్రేమించి, సర్వకాలం  విరహవేదనపడుతూ ఉంటాడు.
   అప్సరోభావం  అద్భుతమనినా  ఉద్దేశం హేమా!  అప్సరసలు  అమృతంతో, లక్ష్మితో  ఉద్భవించినవాళ్ళు, పాలసముద్రం  అంటే  విశ్వ సౌందర్యం. ఆ  సౌందర్యాన్ని  మధిస్తే  సౌందర్యమూర్తములైన   వస్తువులు  ధవళమై, వెలుగుతూ  ఉద్భవించాయి. శక్తి  సౌందర్యం  కౌమోదికి, నాద సౌందర్యం  పాంచజన్యం, కాంతి సౌందర్యం కౌస్తుభం, మహాపథ  దిక్సౌందర్యం  ఐరావతం, జీవితాభీష్ట  సౌందర్యం  చింతామణి, వేగ సౌందర్యం  ఉచ్చైశ్రవము, వితరణ  సౌందర్యం  కల్పవృక్షము, నృత్యకళా సౌందర్యమూ, కామ  సౌందర్యమూ అప్సరసలు,  పరమేశ్వర రూపసౌందర్యం లక్ష్మి, కాలాతీతత్వ   సౌందర్యం అమృతం. ఈ  భావాలు  నాకు తర్వాత  తర్వాత  కలిగాయి.  పరమ కామము, పరమ నృత్యమూ  ఊర్వశిలో  సౌందర్యోజ్వల  రూపాయలయ్యాయి. 
   నాట్యం  కాగానే  ఆ  అమ్మాయి  నా  దగ్గిరకు  వచ్చి పైస యాచించింది.
   ఆ అమ్మాయిలోని బిగువులు  చూచి  నే నామెను  నా  మనస్సులో  విగతవస్త్రతను చేసి  ఆ  అందాలు  చూశాను.  నా  కళ్ళలో,  ఆమె   దిగంబరత్వాన్ని  చూచింది కాబోలు  ఆ  అడవిపిల్ల  సిగ్గుపడుతూ,  చిరునవ్వు  నవ్వుతూ వాళ్ళ  జట్టుకడకు  పరుగెత్తింది.  తక్కిన  అమ్మాయిలు ఫక్కున  నవ్వుతూ ఆ  బాబుని  చూచి  కన్నేసినావా?  యని  వేళాకోళం   చేశారు.
   నాకా  భాష  తెలియనట్లు  నటిస్తూ  కొన్ని  నగలు, ఇన్ని  సూదులు, దారం కట్టలు   ఆ  అమ్మాయికి  బహుమతి ఇచ్చాను.  తక్కినవారికెవ్వరికీ కోపం రాకుండా సూదులు, దారపు  ఉండలు  పంచి  ఇచ్చాను. హిమాలయ   పర్వతవాసినులకు సూదులు, దారపు  ఉండలూ  అంటే  మహా  ఆనందం. రోట్టయినా మానుతారుగాని  సూదులు, దారాలూ వదలరు.
   ఎవడో  మహాదాత  బయలుదేరాడన్న వార్త  ఆ  పర్వత ప్రదేశాలలో  మారుమ్రోగింది కాబోలు, ప్రయాణం  పొడుగునా  భూటియాలు, లేప్చాలు మొదలైన  పర్వతవాసుల  స్త్రీలు,  బాలబాలికలు పైసా, నగలియ్యి, సూదియ్యి, దారమియ్యి అని  నన్నే పట్టుకున్నారు.  నాకు  వాళ్ళు  నిజమైన  గంధర్వ, కిన్నెరీ, యక్షబాలికలై తోచారు.
   నాలో కామవాంఛ, కాశీలో  మణికర్ణికా  ఘట్టంలోనే  మాయమైంది. అనాచ్ఛాదిత  స్త్రీమూర్తి  సౌందర్య  సందర్శనాకాంక్ష  పూర్తిగా  నన్ను  నిండిపోయింది. లోయలో ప్రవహించే  నదీ   సౌందర్యానికీ, ఈ  పర్వత వర్ధనుర సౌందర్యానికీ  ఏదో  విచిత్రసామ్యం  కనిపించింది. స్త్రీ  మూర్తివినా నాకా  పర్వతంలో  ఏదీ పులకరాలు  కలుగజేయలేదు.  స్వామిజీ ఈ  మార్పు  చూస్తూనే  ఉన్నారని  నా  అభిప్రాయం. ఏమీ   చూడనట్టే  కనబడ్డారు. ఆ  విలక్షణ  సౌందర్యం  విన్నా  నాకా  క్షేత్రాలు  అర్థరహిత మయ్యాయి.
   మా దారి  వెంబడిలో  ఎక్కువమంది  బదరీనాథం నుంచి  తిరిగి వచ్చినవారే కనబడ్డారు. కొందరు  గంగోత్రి  వెళ్ళ  సంకల్పించుకొన్నవారు, కొందరు  కేదార  యాత్రోన్ముఖులు. కొంచెం  పొద్దేక్కునప్పటికీ  నంద  ప్రయాగ  చేరాము. నందప్రయాగలో  సాయంకాలం వరకూ ఉండి, ఆ   పెద్ద  గ్రామం  పూర్తిగా  దర్శించాను. ఆ  పర్వత వాసుల  జీవితం  కనుగొనడమే   నా  ఉద్దేశం. నందప్రయాగ  దగ్గర  నందానది  అలకనందలో చేరుతుంది. సాయంకాలానికి  కోహాడ్ చేరాము.                                                                                                                           
           
               
                                                                                                                    36

ఉదయమే చమోలీ చేరి, అక్కడ బసచేసి చీకటిపడేవేళకు మత్ చట్టీ చేరాము. మత్ చట్టీ పరిసరాలన్నీ తోటలే. ఇక్కడ నుంచి హిమాలయాలని పిలువచ్చును. అక్కడ ఆ రాత్రి మకాంచేసి, తెల్లవారగట్లకు సియాసీన్ చేరాము. అచ్చట హిమవత్పర్వత సౌందర్యం కొంచెం రుచి చూడ ప్రారంభించాను. అలకనంద రెండు ఎత్తయిన పర్వతాల మధ్య నుండి అత్యంతాశ్చర్యకరంగా ప్రవహిస్తూంది.

   నేను   ఈ   స్వాములతో, ఈ   రాజపుత్ర  జమీందారుతో  కలిసి  హిమాలయాలలో   ప్రయాణం  చేస్తూవుండడం  నాకే  ఆశ్చర్యం  కలుగజేసింది. ఎందుకు  ఈలా  ప్రయాణమైనాను? ఎట్లా తీసుకురాగలిగారు  ఈ  స్వామీజీ?  మా  అమ్మ  ఏదీ?  ఈలాటి  ఆలోచనలు  ఎక్కువయ్యాయి. నేను  హిమాలయ  పర్వత శ్రేణిలో కరిగిపోతే? నా  కేదైనా  జబ్బుచేస్తే?  పీడ విరగడై పోతుందికదా!  ఈలా   పరిణమించిందేమిటి  నా  చరిత్ర?  నా  ఆస్తినంతా  అమ్ముకున్నాను, మా  ఊళ్లో  శకుంతల  పేరిట  విద్యాలయం కట్టమన్నాను. తాడూ, బొంగరం  లేనివాణ్ణయ్యాను. నాకూ, లోకానికీ సంబంధం శకుంతలే. నాకూ, జీవితానికి  నా  శకుంతలాదేవే  పెనవేసిన  బంగారుత్రాడు. ఆ  త్రాడు  తెగిపోయిది.  నేను  త్రాడుతెగిన  గాలిపటంలా  ఆకాశాన  ఎగురుతున్నాను. ఏ  గాలి కొడితే  ఆ  గాలికి  ఎగిరాను.  ఇప్పుడీ  కొండల్లో  ఏ  గాలికో కొట్టుకు వెడుతున్నాను.
   హల్ చట్టీ, గరూల్ గంగా, పాతాళగంగా, గులాబ్ కోటీ, కుంబార్ చట్టీ చేరాము. హరిద్వారం  దాటి   155 మైళ్ళు  వచ్చాము. ఎదురుగుండా మంచు కప్పిన పర్వత  శిఖరాలు, చలీ. ఎంత  చక్కని  దృశ్యం!  కన్నుల  పండువ  చేస్తున్నది. నాకేమి  బుద్దిపుట్టిందో  నా పెట్టెలో ఉన్న  బొమ్మలు  వేసే  స్కెచ్చి పుస్తకము, రబ్బరుముక్క, పెన్సిలు  తీశాను.  అయిదారు  బొమ్మలు  వేశాను. చమరీ  మృగాలను  తోలుకువెళ్ళే   మనుష్యులు, ఆ  సన్నని  ఇరుకు  దారి, క్రింద అలకనంద  మహావేగంతో  ప్రవహించడం? రాళ్ళు, మంచు, హిమానీజలాలు, స్వాచ్ఛ నీలాకాశం, ఏలాగు వేగవంతాలై  నావేళ్ళు ప్రసరించి పోయినవో కాని  ఎంతో  చక్కని  బొమ్మలు  ఉద్భవించాయి. మా  రాజపుత్ర  జమీందారుని, స్వాములందరినీ, కూలీలను, మా పొట్టి గుఱ్ఱాలను  అన్నీ  బొమ్మలు వేయడం  ప్రారంభించాను. లేప్చాలు, భూటియాలు, గర్ష హవాళీలు,  ఆడవారు, వారి పనులు,  నాట్యాలు  అన్నీ వేయసాగాను. మా  జట్టంతా  ముందు  వెళ్ళింది. నేను వెనకాలే  వస్తానని, బొమ్మలు  గీసుకుంటూ  నెమ్మదిగా   వెళ్ళాను.  యాత్రికుల  జట్టు లెన్నో  జ్యోతిర్దర్శనం  చేసుకొని  వస్తూన్నావట, ఏమిటో  ఆ  జ్యోతి?  
   
   బదరీనారాయణస్వామి  గుడి  పదివేల   అడుగులపై చిల్లర  ఎత్తు  ఉండడం  చేత  శీతాకాలంలో   ఆ  ప్రదేశం  అంతా  తెల్లటి  వెన్నలాంటి  మంచుతో కప్పబడి  పోతుంది. అందువల్ల  ఆ ప్రదేశంలో  ఎవ్వరూ  ఉండలేరు.  దేవుళ్ళ  ఉత్సవవిగ్రహాలు  తీసికొని, పూజారులు  జోషీమఠంలో వచ్చి ఉంటారట. కొందరు  నందప్రయాగ వెళ్ళి  ఉంటారట. దీపావళి  అమావాస్య  వెళ్ళగానే  స్వామి దేవాలయంలో  ఒక  అంగడిలో   ఆవునెయ్యి  అయిదు శేర్లు పోసి, వత్తి  ఉంచి, జ్యోతి  వెలిగించి,  తలుపులుమూసి,  తాళంవేసి, సీళ్ళు వేస్తారట.  మళ్ళీ  ఏప్రియల్   నెలలో  సుభదినంనాడు  ద్వారాలసీళ్ళు తెరచి, తలుపులు  తెరిస్తే   బదరీనారాయణజ్యోతి  వెలుగుతూ  వుంటుందట. అనేకులు  పెద్దలూ, పిన్నలూ  ఆ  జ్యోతిని  సందర్శించడానికే  ఆ  రోజున  వస్తారట.  బదరీ  విశాలలాల్  జీకి జైయని  పరవశత్వంతో  జ్యోతిని  దర్శనం  చేసుకొని  నమస్కరిస్తారట.  ఈ   జ్యోతి  ఆరునెలలు  మంచుచేత  కప్పబడి  పూడిపోయిన  గుళ్ళో  ఎల్లా  వుంటుంది?  శాస్త్రదృష్యా  అది  అసంగతము. ,మంచుచేత  కప్పబడిన  బొగ్గుపులుసు  గాలిని  వదలుతూ ప్రాణవాయువు  అంతా  అయిపోవడం చేత  ఆరిపోవాలి.  అదీగాక  అయిదు శేర్లు నేయి దీపం  రెండు  రోజులలో  వెలిగి  దీపం  కైలాసం  అంటుతుంది.  అలాంటిది   దీపం ఆరదు, నెయి యింకా శేరు  మిగులుతుందట!
   ఇది  దేవతల  మహత్తు  అంటారు! మంచుచే  కప్పబడిన  అతిశీతల  వల్ల  కర్చుచేసే  ప్రాణవాయువూ,  నెయ్యికూడా  తక్కువేమో! ఈ  విచిత్రం  కూడా తప్పక  శాస్త్రాని  కందుతుందనే  నా  ఉద్దేశం.  హిమాలయ ప్రయాణం  ఆరోగ్యదాయకమని  మన  పూర్వులు  బడరీకేదారాది  యాత్రలు  చేశారని  నా  ఉద్దేశం. ఈ  మాత్రం  ఆలోచించడం  ప్రారంభమైంది  నాలో,  ఇంతలో  మాజట్టు  వెనకాలే   జోషీమఠం  చేరాను.  ఎన్నో  దేశాలవారు  యాత్రకు  వస్తున్నారు. బిడ్డలు, యవ్వనులు,  పెద్దలు,  ముసలివారు నిర్భయంగా  భక్తితో  ఈ  కష్ట  మార్గాల  వేలకొలదీ  సంవత్సరాలనుండి  ఈ   యాత్రలు  చేస్తున్నారు. పాండవులు  ఈ దారిని  వెళ్ళారు.  మహాఋషులనేకులు  ఇక్కడే వాసం చేశారు.  ఈనాటికీ  ఈ  జనం  వస్తూనే  ఉన్నారు.  పండాలు,  గర్హవాల్  సంస్తానోద్యోగులు, బ్రిటీషు  ప్రభుత్వోద్యోగులు  ఇక్కడ  వాసం    చేస్తున్నారు. భోజన పదార్థాలు  సంపాదిస్తున్నారు,  వంటలు  చేసుకుంటుంన్నారు.  ప్రేమించుకుంటుంన్నారు. ఆనందిస్తున్నారు,  కష్టాలుపడుతున్నారు, ధుఃఖిస్తున్నారు, స్త్రీ  పురుషులు   కామించుకొంటున్నారు, బిడ్డలను  కంటున్నారు.
   ఓహో! ఈ  హిమాలయ  ప్రపంచానికీ,  క్రింద  భారతీయ  విశాలసమ  ప్రదేశాలకూ ఎంత  తేడా!  హృదయాలు  దోషకళంకపూరితాలై  ఉంటాయి అక్కడ. జీవితం  కర్కశమై, చెడుదారులనే  ఆశిస్తుంది.  ఈ  హిమాలయాలలో,  ఈ   ఎత్తయిన కొండలలో, ఈ  రాళ్ళలో, మంచుగడ్డలలో, అతిశీతలపు  నదులలో, హెచ్చుతగ్గులలో  జీవనం  ఎంత  ఆర్ద్రం?  ప్రేమమయం.  ఈ   అతి  కర్కశభూములలో  ఎంత  నిధానమైన, కల్మషరహితమైన  జీవితాలివి అనుకున్నామ.
   
                                                                                                             37
   
   అడవులనిండా  తెల్లగులాభీపూలు, పర్వత  గ్రామాలలో  బంగారు  గులాభీపూలైన యవ్వనవతులు.  ఆ  అడవులలో,  ఆ  లోయలో, ఒకప్రక్క  మహోన్నత  పర్వతాలు, ఒకప్రక్క  పాతాళ   ప్రదేశంలో  మహావేగంతో,  సంతతగంభీరాగ  హృదయంతో  ప్రవహించి పోతున్న  అలకనంద.
   జోషీమఠం  చేరాము.  జోషీమఠం  పెద్దబస్తీ.  ఊరంతా తిరిగి, చమరీ  మృగపుతోళ్ళు,  పెద్దపులితోలు  ఒకటికొన్నాను. తెల్లచిరుతపులి  తోలు సంపాదించాలని  కోర్కెకలిగింది.  అక్కడ    ఆ    గాంధర్వశిల్పులు  రచించినచిత్రాలు, దారుశిల్పాలు కొందామనుకుంటే, స్వామీజీ తిరుగుదారిలో కాని,  మా  అమ్మను  తీసుకుని  రెండవసారి  ప్రయాణం  చేసినప్పుడు  కాని  కొనవచ్చునన్నారు.
                                                                                                                         
           
               

జోషీమఠం నుంచి విష్ణుప్రయాగ చేరాము. తర్వాత పాండుకేశ్వరము, లంబర్ ఘట్టీ, హనుమాన్ చట్టీలలో మకాములు చేసుకుంటూ బదరీ దర్శన ప్రదేశం చేరాము. అందరికీ తన్మయత్వాలు కలిగి విశాల్ బదరీ లాల్ జీకి జై అని పర్వతశిఖరాలు మారుమ్రోగుతూ ఉండగా నాట్యం చేసినంత పనిచేశారు. మా స్వామీజీకి ఒడలు తెలియలేదు. ఆయన ఒక రాతి బండమీద పద్మాసనం వేసుకొని, బదరివైపు తిరిగి సమాధిలోనికి పోయినారు. అందరూ నిశ్శబ్ధం వహించారు. నేను జాగ్రత్తగా ప్రక్కనున్న ఒక సానువును కొంతవరకు నా ఇనుపమొనకఱ్ఱ సహాయంతో ఎక్కి, అక్కడ కూర్చుని బదరీనాథ్ వైపు దృష్టిపరచి, ఆదృశ్యం గమనిస్తున్నాను.

   ఈలా  క్షేత్రాలని పేరుపెట్టి, భారతీయులు తిరిగే దేశాలు  ఈ  నాగరికత  ఏమిటి? ఏమిటీ  బదరీనాథం? ఇక్కడ  నరనారాయణులు  తపస్సు చేశారా?  ఏమో?  శకుంతలా!  నన్ను వదలి  ఎందుకు వెళ్ళావు?  ఈ  నరనారాయణులు  నిన్ను  బ్రతికి  ఉండునట్లు చేయలేకపోయారా?  మంగళగౌరి,  శ్రావణలక్ష్మి,  ఎన్ని పూజలు చేశావు!  నా  శకుంతలా! నా  దివ్యసుందరీ, నా  ఆత్మేశ్వరీ, నా  జీవిత  సింహాసనరాజ్ఞీ!  ఏమయిపోయావు దేవీ!  నాకు   కనబడవా........?    
   ఇలా  అనుకున్నానో  లేదో, నాకు దిగువగా రోడ్డు ప్రక్క తపస్సు  చేసుకునే  స్వామి  శకుంతలగా  మారిపోయారు. శకుంతలదేవి చటుక్కున లేచింది. ఇటూ అటూ  చూడకుండా బదరివైపు  ప్రయాణం  సాగించింది.  నాకా  అతిశీతల  ప్రదేశంలో  చెమటలు పట్టాయి.  ఆమె  అతివేగంతో  నడిచింది.  ఆకాశంలోకి తేలిపోయింది.  అలా  తేలుకుంటూ  బదరీనారాయణ  విశాలలాల్ జీ మందిర  శిఖరంలో  కలిసి  మాయమైపోయింది.  నాకు కళ్ళనీళ్ళు  జల జల  ప్రవహించి పోయినాయి.
   బదరీనాథా! నువ్వేనా  నా  శకుంతలవు?  నువ్వేనా?  అది ఎలా  సంభవించిందీ?  తండ్రీ  నువ్వున్నావా?  నా  శకుంతల  ఉన్నదా? నేనున్నానా?  నా స్వామీజీ,  నా శకుంతలా, నా బదరీ  అన్నీ ఒకటేనా?  ఇది  ఏమివెఱ్ఱి? నాకీ  విచిత్ర  పర్వత  ప్రదేశాలలో  మతి  తిరిగిపోతున్నదా? క్రిందకు  దిగివచ్చాను.  స్వామీజీ  లేచి  బదరీనాథ్ వెళ్ళారని  అక్కడి  వారందరూ  చెప్పారు.  నాకు   గుండె  గతి  తప్పి  పోయింది.  కన్నుల నీరు  కారిపోయింది.
   అందరమూ  బయలుదేరాము.  బదరికి  ఒక్కొక్క  అడుగు  ముందర  బడుతూన్నది.  బదరికి   ఈవలావల  నరనారాయణ పర్వతాలున్నవి.  దిగువ   మహావేగంతో  అలకనంద  ప్రవహిస్తున్నది. విశాల బదరీలాల్జీకీ  జై అని కేకలు  ఆ  ఉదయకాలంలో   ఏవో  మహారాగాలతో  వినిపించాయి.  ఆ  శ్రుతులలో  ఏవో  దివ్యసంగీతాలు, ఆ  సంగీతాలు  స్వరాలై, ఆ స్వరాలలో  కలిసి  శకుంతల కంఠం  తీయతీయని  పాటపాడుతూ నాకు  వినబడింది.  నరనారాయణ పర్వతాలూ,  బదరీనారాయణ దేవాలయమూ  కళ్ళారా చూస్తూ  నిలుచుండి పోయాను. సంగీతం వినబడుతూనే వున్నది.  తక్కిన వారు  జయజయధ్వానాలు  పలుకుతూ  నడిచి పోతున్నారు.  నేను మాత్రం  అదృశ్యయై ఉన్న  ఆ  దేవి  సంగీతం వింటూ నిలిచిపోయాను. ఆ  సంగీతం  అతిమధురమైనది.  గాఢతమవేదనా  భరితమైనది.  ఆ  గాంధర్వమును,  కిన్నెరలతో  కలిసి  పాడుతూ  గంధర్వాంగనలతో  నృత్యంచేస్తూ  శకుంతలాదేవి  అమృత  ప్రవాహాలు  దెసల నింపుతున్నది కాబోలు? ఆ  పాట  ఇదియని చెప్పలేను.  ఆ  రాగమిట్టిదని  గ్రహించలేకపోయాను. ఆ  తాళ మేదియో  హృదయమునకు  వ్యక్తంకాలేదు. 
   ఎంత  ఆనందరూపమైనది  ఆ పాట! ఆ  పాటలో మంచుగడ్డలు  కరిగిపోయినవి.  ఆ  స్వరకల్పనలో  నదులు ఉద్భవించి  ప్రవహించినవి. ఆ రాగారోహణలో  హిమాలయ శిఖరాలు  ఆకాశంలోకి  చొచ్చుకుపోయాయి. అవరోహణలో  పుష్పవన  వాటికలు  ఆ లోయలలో వికసించి  సురభిళాలైనవి. నేనో మంచుకొండనైతిని. ఎన్ని  కల్పాలనుండో  నాలో  పేరుకొనియున్న  హిమపర్వతాలు, వేడినే ఎరక్క ఇంకనూ పేరుకుపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. నా  హృదయంలోని  చైతన్యం  గడ్డకట్టుకుపోయినది.  ఆనాటి  నా మంచుగడ్డ  బ్రతుకుపై  ఒక్క సూర్యకిరణం  పడి,  ఆ  మంచుగడ్డ  శకలాలలో ఏడు  వర్ణాలుగా  రూపం పొందింది. లోకం  వర్ణమయమైంది.  నా బ్రతుకు  ఆ కిరణకాంతి  ప్రసరింపువల్ల  నెమ్మదిగా కరగడం  ప్రారంభించింది. గజగజ  వణికిపోయాను. నాకు మెలకువవచ్చి  తొందర  తొందరగా బదరి చేరాను. జనుల కోలాహలం  ఆ  పర్వతాలలో ప్రతిధ్వనిస్తూ ఉన్నది.
   నేను  వెళ్ళీవెళ్ళగానే బదరీనాథ ఉష్ణకుండంలో  స్నానంచేసి వేయి  ఏనుగుల బలంతో  వచ్చి,  ఉన్నిదుస్తులు  ధరించి  బదరీనాథ స్వామి  దర్శనానికి  వెళ్ళాను. ఆ  దేవాలయంలో  జరిగే  తంతంతా చూచి  ఇంటికి తిరిగి  వచ్చి  నిద్రపోయాను. ఏమిటి నాకీ హిమాలయ ప్రయాణం?  ఈ  బదరీనాథ  యాత్ర  ఎంత విచిత్రంగా  పరిణమించింది. ఈలాంటి  మహా  విచిత్ర  స్థలాల్లో  మనుష్యుడు ఎన్ని  దేవుళ్ళనైనా కల్పించుకోగలడు! నాకు మాత్రం  బదరీనాథుడు  మనుష్యుడు చెక్కిన విగ్రహంలాగే  కనిపించాడు.  కాని మనుష్యుడు  ఎంతో  కష్టపడితేనే  గాని,  తన  మనస్సులోపుట్టిన ప్రపత్తి భావాన్ని  నిర్మలమూ, నిశ్చయమూ, చేసుకోలేడు. ఎన్ని  యుగాలనుంచి  ఈ బడరీనాథుడు  ఈ  మంచుకొండల  ప్రదేశంలో  వెలసివున్నాడో!  పాండవులీ  శీతల ప్రదేశానికి వచ్చారట!  క్రీస్తు పూర్వం కొన్ని  వేల  ఏళ్ళ  క్రింద  ఆర్యులు  ఉత్తర  భూములలో  బదరికాశ్రమాన్ని  నిర్మించుకొన్నారు.  ప్రపంచానికి  పదివేల  అడుగులపై చిల్లర  యెత్తున, ఎక్కడో  అలకనందానదీ  జనన ప్రదేశాలలో  ఈ  మహాక్షేత్రం, మణిపూసలా పొదగబడివుంది.
   
                                                                                                                38
   
   మరునాడు  స్వామీజీ బ్రహ్మకపాలంలో  నాచేత  మా  తండ్రిగారి శ్రాద్ధం  పెట్టించారు.  బ్రహ్మకపాలంలో  శ్రాద్ధం  పెడితే  మళ్ళీ  ఆ పితరులకు  శ్రాద్ధాలు పెట్టకూడదట. ఎందుకంటే  బ్రహ్మకపాల  శ్రాద్దంవల్ల  పితరులకు మోక్షం  వస్తుందట.  ఒకసారి  మోక్షంవస్తే  మళ్ళీ  పితరులను  ఎలా  ఆహ్వానిస్తాము?  ఏది  ఏమయితేనేమి  ఒక  గొడవ  వదలిపోతుంది. అందుకనే నేను  ఒప్పుకున్నా.  స్వామీజీ  కూడా  నీకిష్టమైతేనే పెట్టు,  యిష్టం  లేకపోతే మానెయ్యి! అన్నారు. అందులో వుండే  లాభాలాభాలు చూసే  నేను ఒప్పుకున్నాను. స్వామి దర్శనము, పూజలు  అన్నీ  ఏదో గౌరవంకోసం  చేయించాను. నాకు  దేవుళ్ళమీద  గౌరవము  కంటే  ఆ  ప్రదేశాలమీద  ప్రేమ యెక్కువైంది. నా  వెనకాల  ప్రసరించి వున్న  వెలుగు  నీడల్ని  మరచిపోయాను. ఎత్తయై, స్నిగ్ధహిమంతో  నిండి, స్వచ్ఛమూర్తులతో  ప్రాపంచిక సంబంధమేమీ  లేకుండా ఆ  రహస్య  ప్రదేశాలలో  ఆకాశపథగభీరవదనులైన  శీతనగేంద్రశిఖరదేవులు  నన్ను  పూర్తిగా  తమ  హృదయానికి  హత్తుకొన్నారు.  వారితో నా  ఆవేదనలు  మూగభాషలో చెప్పుకొన్నాను.  ఎలాగైనా  ఆ  శిఖర మూర్తులను  చేరాలనే  కాంక్ష  నా  కెక్కువైంది. చలి లెక్కచేయలేదు. రాత్రిళ్ళు మంచు కురుస్తున్నా వంటినిండా బచ్చుకోటులూ,  తోలుకోటులూ   తొడుగుకొని   ఆ వెన్నెలలో  బదరిలో  ఒంటిగా తిరిగాను. స్వామీజీ  నన్ను  చూచి ఏమీ  అనలేదు.
   శీతలతీవ్రత  వర్ణింపలేను.  వెన్నవలె  మంచు కురుస్తూ ఉన్నది. ఒంట్లో  రక్తం ప్రవహించడానికి,  అటూ ఇటూ  పచారుచేస్తూ  తెల్లవారగట్ల  మంచు కురవడం  ఆగగానే  అలకనంద పుట్టిన ప్రదేశానికి బయలుదేరాను  ఒక్కణ్ణే, దారి మంచుపడి  వుంది. నా  కాళ్ళకు  పెద్ద జోళ్ళున్నాయి. హిమాలయ ప్రయాణపు జోళ్ళు, వాడిసూదులున్నవి  తొడుగుకొని, సంచినిండా బిస్కట్లు, చిన్నస్టవ్వు,  కాఫీపొడుం, పాలడబ్బా వేసుకొని బయలుదేరాను. ఒక్కణ్ణి వెళ్ళాలనే  దీక్షపట్టి వెళ్ళాను. స్వామీజీకి  ఒక  చీటీ  వ్రాసి  బయలుదేరాను.
   చీకటిలేదు. ఒక రకమైనసంధ్య.  నిశ్శబ్ధం  లోకమెల్లా  ఆవరించి ఉంది.  దారితప్పిపోతుందని భయపడలేదు, ప్రాణానికి భయపడలేదు. ఆ  చుట్టుపక్కల లోయలలో  ఏ  దారైనా  బదరీనాథ్ కే చేరుతుంది.  ఏదైనా  అలకనందలో  కలుస్తుంది.  చేతిలో  ములుకఱ్ఱ ఉన్నది. నడక సాగించాను.  కొండప్రక్కనే మనుష్యులునడిచే  దారి,  దారికి దిగువ  ఎక్కడనో అలకనంద  సంగీతం  పాడుకుంటూ  ప్రవహిస్తున్నది.  ఎదురుగా,  వెనకగా, ప్రక్కగా ఆకాశాన్నంటే కొండలు. ఒకచోట   కొంచెం  దిగుతున్నా, మొత్తం ఎక్కటమే. పదకొండువేల అడుగులనుండి  పధ్నాలుగువేల  అడుగుల  దూరం ఎక్కాలి. అక్కడ వున్నది  అలకాపురం.
   తెల్లవారగట్ల  నాలుగింటికి  బయలుదేరి  తెల్లవారేసరికి బదరికి ఆరుమైళ్ళు  ఎగువకు  ఎక్కాను. అక్కడ ఆ అతిశీతలంలో  దారిప్రక్క  ఒక  పెద్ద రాతిపై కెక్కి   కూర్చుండినాను.  ఆకాశంలో  వెలుగు  పూర్తిగా  వచ్చింది. ఎఱ్ఱటి  కిరణాలు మబ్బుల్ని వివిధాంతరాలైన  బంగారు  రంగులతో,  నారింజ రంగులతో  అంతటా కమ్మివేశాయి. పేరు  తెలియని  కొన్ని  హిమాలయ శిఖరాలు గులాబిరంగులు  తాలుస్తున్నవి.  అలకనంద  లోయలో  మాత్రం  చీకట్లు  పూర్తిగా పోలేదు.  పర్వతసానువుల  పరచివున్న తెల్లటిహిమం, ఉన్నకాస్తవెలుగునూ  ద్విగుణీకృతం చేసి, లోయలను  వెలిగిస్తున్నది. 
ఏమీ ఆలోచనల్లేని ఆనందంలో మునిగిపోయాను. ఏమి చూస్తున్నానో నాకు తెలియదు. ఎన్నో వింత వింతలైన పక్షులు, ఎన్నో విచిత్ర గాంధర్వ గీతాలు ఆలపించుకుంటూ ఎగిరిపోతున్నవి. వానిని గమనించకుండానే కూర్చుంటిని. ఎన్నో మనోహరమైన పుష్పాలు కని విని ఎరుగనివి ఆ కొండ చరియలలో

తలెత్తి లేచి నవ్వి, పరిమళాలు వెదజల్లుతున్నవి. ఇవేమీ నాకు గోచరం కానేలేదు.

    వసుధారా జలపాతాలు చాలా అందంగా ఉంటాయట. అని నా తిరుగుదారిలో సందర్శిస్తామని ఏర్పాటు చేసికొని అలకనందా జనన ప్రదేశాన్ని ఎనిమిదిగంటలకు చేరాను. ఏమి ఆ ప్రదేశసౌందర్యము! దేవత లిక్కడ వాసం చేశారంటే అపనమ్మక మేముంది? ఎచ్చట చూచినా మంచుకొండే. ఒక మహా సమప్రదేశంలా వుంది, అలకాపురీద్వారమైన హిమఖండ ప్రదేశం. ఆ హిమపు బయలునకు ఎక్కాలంటే ఇంకా రెండు మూడు వందల అడుగులు వట్టి మంచుగడ్డ ఎక్కాలి. ఆ గడ్డకట్టిన మంచు పర్వతం క్రిందనుంచి అలకనంద ప్రవహించి వస్తూ వుంది.

    మంచుగడ్డలు విరిగి ఆ నదీకన్య ఒడిలో పడుతున్నవి. ఆ నిర్మల నిశ్చల మహాశీతల ప్రదేశంలో గొంతెత్తి పాటపాడ బుద్దిపుట్టింది నాకు.

ఓహో! అలకనందా! అమరవాహినీ!
అమృత రాగిణీ! విమల మోహినీ!
సుందరాంగీ! వ్యోమగామినీ! ఆనందరూపిణీ!
ఓహో అలకనందా! అమరవాహినీ!
ఎచ్చటనే నీ దివ్య జన్మము
ఎచ్చటనే నీ బాలికా కేళీ
ఎచ్చటే నీ ముగ్దలాస్యము
ఎచ్చటే ఓ అలకనందా!
మనము లెరుగని హిమప్రదేశము
మనసు లెరగని గగన పథముల
జనన మొందిన సుందరాంగీ!
మనుజ పథముల కేలవస్తివి?
జలజలా ప్రవహించిన స్తివి
గలగలా ప్రవహించి వసివి
పంకిలమ్మగు నరుల బ్రతుకున
మహారాగము పాడుకుంటూ
పరమపూత విచిత్ర పర్వత
సానువుల శిఖరాన్ని మధ్యా
స్వచ్ఛపన్నీరాల ఝురులతో.

ఈ పాట ఆ యక్షప్రదేశాలలో మారు మ్రోగింది. ఆ పాటకు అలకనంద ఆనందమందినదా? అలకనందాదేవీ? ఈ భావం మనస్సులో తట్టిన మరుక్షణంలో అలకనందా, నా శకుంతల ఒకటేనా? అన్న ఆలోచన ఉద్భవించినది. శాకుంతలాదేవీ, అలకనందా ఒక్కటే! ఆమె మరల నదీ రూపమెత్తి ఇక్కడకు చేరిపోయింది అనుకున్నాను.

                                                                                                             39
   
   అక్కడినుండి  అలకనంద  ఆడుకునే ఆ ప్రదేశం  దర్శనం చేద్దామన్న మహాకాంక్ష పుట్టింది నాలో.  ఆ  తొమ్మిది  గంటలకు  ఆ  కొండ  ఎక్కడం  ప్రారంభించాను. ఎలా  ఎక్కానో,  ఎన్నిసారులు తూలి  పడబోయానో, జారానో, కూర్చున్నానో, దేకానో  తెలియదు.  పదిగంటలయ్యేలోపున  ఆ  అలకాపుర  ప్రదేశం  చేరాను. ఆ  ప్రదేశం  పద్దెనిమిదివేల  అడుగుల ఎత్తున  ఉంటుంది.  చుట్టూ ఇరువది  మూడు, ఇరువది నాలుగువేల అడుగుల  శిఖరాలెన్నో  అనంతంగా  కనబడినాయి. గాలి  అతివేగంగా విసురుతూ ఉంది. మంచుతో  నిండి, తెల్లటి నెరసిన  జుట్టు  శిఖలుగా ముడివేసిన  యోగి తపస్సు చేసుకొంటున్నట్లున్నది. ఒక చిన్న  కొండప్రక్క  ఉన్న  చిన్న గుహలో  చేరి, బిస్కత్తులు తిని,  థరమాస్  ప్లాస్కులోని కాఫీ  తాగి, స్కెచ్ తీసి పులకరాలతో  ఒక బొమ్మ  వేశాను. ఆ బొమ్మ  మధ్య  నాట్యమాడుతూ  ధవళాలక  అలకనందానది తోచినది. ఆనదీసుందరమోము మా  శకుంతల మోమే!                                                                                                                             
           
               

అలకనందా చిత్రము నేను వేయాలనే వేయలేదు హేమా! అలా వచ్చింది. ఆ గడియలలో అలా అలా ఎందుకు వేశానో నాకే తెలియదు. ఎంత అందంగా వచ్చింది, ఆ రూపం! నాతో ఐక్యముకాని నూత్న యవ్వన దినాల శకుంతలారూపం. ఒళ్ళు బంగారము, జుట్టు బంగాము, ధరించిన వస్త్రాలు హిమధవళాలు. హిమమే వస్త్రాలుగా నేసిన సౌందర్య మా రేఖలలో వంపులలో దృశ్యమైనవి. ఎటుచూచిన హిమం. లోయలలో దేవదారు వృక్షాలు, ఘనీభూత హిమవృత పర్వతసానువులలో అంతర్వాహినులై అనేక దివ్యనదీబాలలు. వారెప్పుడూ బాలలే. నిర్ఘరీసుందరులు కొందరు. నిత్య యౌవనులు. త్రిదశ ప్రౌఢాంగనా స్థితి పొందేవారు. గంగా యమునానది నదీమతల్లులు.

   హిమాలయంలో  ప్రతిప్రదేశం  ఎవరు  తిరుగగలరు? ఆ రహస్యాలను  ఎవరు  తెలిసికొనగలరు?  మహాకవులీ  మహాప్రదేశాలను వర్ణించి  వర్ణించి, చాలలేకపోయినారు. మనుష్య దేశాలమధ్య  మనుష్యుల కందని  మాయా ప్రదేశమై  విస్తరించి  ఉన్న  ఈ  విచిత్ర  పంథాలలో  మనుజునకు పనియేమి?  మనుష్యుని  దుఃఖాలు,  ఆనందాలు, ఆవేదనలు, కాంక్షలు, సంతృప్తులు హిమాలయేశ్వరునకు  తెలియనవసరమేమి? అని అతని పాదాలనైనా అంటునా? 
   ఆ  స్థలంలోని  మహాదానంద  మత్తతలోనుంచి విదల్ఛుకొని, ఎట్లుదిగానో, లోయలోనికి ఎల్లానడిచానో, ఏ దిక్కున  వచ్చానో,  మెలకువ వచ్చేసరికి  శతధారదగ్గర ఉన్నాను. శతధారా  సౌందర్యం  వర్ణనాతీతమే. అక్కడ  నూరుధారలు నూరువివిధ శ్రుతులతో నారదమహతీ వీణానాదం  చేస్తూ పడుతున్నవి. అచ్చటి పూవులలో  ఒక మహాపుష్పము  నాకు దర్శనమిచ్చింది. ఆ పుష్ప సౌందర్యం  నేనేమి వర్ణించగలను? తెల్లని రేకులు, కాశ్మీర కుసుమవర్ణ  హృదయం  రెండువందల పుటాలున్న   కమలాలకన్న  పెద్దది. ఎన్నో తుమ్మెదలు  ఆ పుష్పంలో   వాలుతున్నవి.  మత్తెక్కి  వెళ్ళిపోతున్నవి. ఆ పుష్పపు  సువాసన  ఇతర పరిమళాలను చిన్నబుచ్చుతుంది. అదే  పారిజాత కుసుమము అనుకున్నాను. పుష్పస్వరూపము  ఒక  మహోత్తమ నక్షత్రస్వరూపమై వెలుగుతున్నది. ఆ పువ్వును నేను  సంపాదించగలిగిననాడు, అని  నా హృదయంలో  ఒక మెరుపు  ప్రసరించింది.


                                                                                                                    40
   
   అలకాపుర  బాహ్యసౌందర్య చిహ్నం  సత్పథసరోవరం. ఆ  సరోవరం  మైలున్నర విశాలం. అత్యంత  శుభ్రనీలజలపూర్ణము. అలకాపురంలో మధ్యనుండేది  చంద్రకుండము. దానికావల మైలుదూరమున సూర్యకుండము. అంత ఎత్తున  సత్పాథాది  సరోవర  కుండాలలో, వేడినీటి ఊటలు  గర్భమందుండుట  చేతనే, నీరు ఆ  అతిశీతలంలో కూడా  పెరుకోకుండా ఉన్నాయి. అలకాపురీ ద్వారమైన  ఆ  హిమసమతల ప్రదేశాన్ని చక్రతీర్థమంటారు. ఆ  చక్రతీర్థంలో మానవవాసన  పూర్తిగా కరిగిపోతుంది. ఏదో  అననుభూతశాంతి హృదయాల నావరిస్తుంది. నాకా  చక్రతీర్థ నిత్యవాసత్వం  ఏల  లభించకూడదన్న గాఢవాంఛ జన్మించింది! సత్పథ  సరోవరతీరాన  నిలుచుండి, ఆ  మధ్యాహ్నాన  ఎదుట  హిమాలయాలను  దర్శిస్తే  అవన్నీ  ఎక్కడికో, ఏ  పధాలకో  తీసుకొని పోయే  స్పటిక  సోపానపంక్తిలా  కనపడ్డాయి.  ఈ  దృశ్యానికే  స్వర్గారోహణ  దృశ్యమని  పేరు.
   సూర్యకాంతిలో  ఆ  పర్వతాగ్ర  ప్రదేశాలు వెండి, రత్నసోపానాలులా కనిపించాయి.  ఇక్కడనుండే  పాండవులు  స్వర్గారోహణము కావించారట. ఆ  సోపానాల  నెక్కుచు  అనంత  పథాలకు  వెళ్ళిపోగలనా?  మానవాతీత   పథసందర్శనం మానవులలో   ఉన్న  మానవత్వాన్ని  నాశనంచేసి, వారికి  మానవా తీతసత్వాన్ని  అర్పిస్తుంది?  ఆ  మానవాతీతత్వం  అనుభవించగలం. వర్ణించలేము. ఆ  ఆనందానుభవమే  అమరత్వమేమో!
   తోడు  దారెరిగిన మనుష్యుడు  లేక  ఎవ్వరూ  ప్రయాణం  చేయలేరట. అయినా  అంతకుముందే  ఒక  సన్యాసులజట్టు  ఒకటి  ఆదారిని ప్రయాణంచేసి  ఉండడంచేత  వారి ప్రయాణం  జాడలు  స్పష్టంగా  కనబడినవి. అదీగాక  ఆ సన్యాసులను, ఆ  దారినిగురించీ  ఆ  దృశ్యాలను గూర్చీ  పూర్తిగా  తెలుసుకున్నాను.  అందుకనే  నాకా  దారి సుగమమైంది.  తిరిగి చక్రతీర్ధము  వచ్చి, ఇంకను దిగి  శతధారల  సందర్శించునప్పటికి  నాలుగైనది. వడగళ్ళు కురియుట  కారంభించినవి. అత్యంత  శీతలవాయువు  వీవదొడగని. నా  కాఫీ అంతా  అయిపోయినది. బిస్కట్లు అయిపోయినవి. ఒక బండరాతి  క్రింద  దూరి, చమరీమృగంలా నేను  మోసే  సామానులు దింపి, గాలిరాకుండా  ఒక గొంగళీ అడ్డుపెట్టి, నా  స్టవ్ వెలిగించి, వెలగకాయంత ఉన్న నాలుగు  వడగళ్ళేరి  నీళ్ళుకాచి, కాఫీ తయారుచేసుకొని త్రాగాను. సిగరెట్టు వెలిగించి  రెండుగంటలలాగే కూర్చున్నాను.  చీకటి  అలముకుపోయింది. ఉన్ని  గొంగళి కోటుక్రింద వున్న  తోలుకోటులోపల ఉన్నిదుస్తులు నాకు  చలి  బాధను  కలిగించలేదు.  ఒక గంట  కురిసి  వడగండ్లవాన  వెలిసింది.  గాలి  జోరుమాత్రం తగ్గలేదు. వేసవికాల మవడంచేత  దారి  పూడుకుపోదని  మాత్రం ధైర్యం.
   తీర్థయాత్రకు  పోయేవారంతా  రానూ, పోనూ  మూడురోజులు  ప్రయాణం  చేస్తారు. నే  నున్న  తావుకు  దిగువను  పదునొకండు మైళ్ళ  దూరంలో  బదరీపురం  ఉంది. ఈ  కొంచెం  దూరంలోనే సర్వమానవ  జగత్తు నాకు  వేలకొలది  మైళ్ళు  దూరమైపోయినట్లే తోచినది.
   ఒక  చిన్న  జంతువు  దాగేటందుకు  మాత్రం  సరిపోయే  ఆ స్థలంలో  ఇన్ని ఎండు చితుకులు  పోగుచేసి  వంటచేశాను. దేవదారుపుల్లలు బాగా  మండుతూ సువాసనాధూపాలను ఎగజిమ్ముతున్నవి. ఆ  విచిత్ర  నిశ్చలతలో నాకు  సంపూర్ణమైన  మెలకువే. నిద్ర  రానేలేదు.  మత్తయినా కలగలేదు. ఎన్ని ధ్వనులు  నిండివున్నా  అవన్నీ  ఆ  నిశ్చలతలో  అంతర్భాగాలయ్యాయి.   అలాగే  కూర్చున్నాను.  నాచేతి  గడియారంలో  రెండు అయ్యేసరికి  నిప్పు ఆరిపోయింది. ఆ  చీకటిలో, ఆ వెలుగులో, ఆ  చీకటి  వెలుగులలో అలానే  కూర్చుండి వున్నాను. నడుం నొప్పి  పెట్టలేదు.  ఆలోచనలు ఆఖరయ్యాయి.  బుద్ధి  నిశితత్వం తాల్చింది. స్పష్టమయిన ఆలోచనలు మొక్కలు మొలిచి  వృక్షాలై  పుష్పాలు పూచినవి.

ఏ విషయమైనా మనుష్యుల బుద్దిమీదనే ఆధారం. బుద్ది ననుసరించి సిద్దాంతం. సిద్దాంతాన్ననుసరించి మనుష్యుల ఆచరణ ఉంటుంది. అన్ని ఆచరణలకు అతని స్వీయసిద్ధాంతాలు ఆధారం కాకపోవచ్చును. అవి చిన్న పనులు. అప్పటి తాత్కాలిక పరిస్థితుల ననుసరించి ఉంటవి. కాలానికి మనుష్యుడు దూరమవడమేకదా అయిన్ స్టీన్ నాల్గవపథము. ఆకాశంలోని కొన్ని నక్షత్రాలకు మూడువేల సంవత్సరాలనాటి భూమిలోనాని చరిత్ర కనబడుతూ ఉంటుంది. కొన్ని తారలకు నూరు సంవత్సరాలనాటి చరిత్ర. ఇంక కొన్నింటికి ఏడాది క్రిందటి చరిత్ర దర్శనము అవుతూ ఉంటుంది. ఒకే క్షణంలో ఈలాంటి కాలవ్యత్యాసాలు విశ్వంలోవుంటే, సంఘటన, సందర్శనము మనుష్య మనుష్యునికి తేడాలుగా వుండాలి? అందులో వివధ హృదయాలకు దృష్టి వైవిధ్యమూ, గ్రహణవైవిధ్యము అనంతరూపాలుగా వున్నవి. ఈ వైవిధ్యస్థమై, వైవిధ్యాతీతమైన ఒక సత్యమేదో ఉండాలి కదా? అది భౌతికానుభవంలోనే ప్రత్యక్షమవుతున్నప్పుడు, బుద్దికతీతమైన మహాసత్య మొకటి ఉండాలికదా? ఈ సత్యము ఇతరులెవ్వరూ బోధింపలేరు. ఎవరికి వారే గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి. గురువు మార్గం మాత్రం చూపిస్తాడు.

   జనసమ్మర్ధంలో సంగీతం  వినబడదు. జనం హోరులో  ఆలోచన  ఏకధారకాదు. కళాశాల  శాస్త్రపరిశోధనాలయము  వీధిలో  పెట్టగలమా? అలాగే సత్యాలను  గ్రహించడానికి  ఈలాంటి  మనవజీవితాతీత నిర్మల నిశ్చల ప్రదేశాలు  అనుకూలములు.  ఆ  సమయంలో  ఏవి  నాలో చర్చించుకున్నా, నా  కవి నిమిషంలో  స్పష్టమైపోయినవి. ఇంతలో నేను స్టవ్  వెలిగించి  నీళ్ళు కాచుకొని, ముఖసంమ్మార్జనం చేసి,  కాఫీ  కాచుకొని  తాగుతుండగా  స్వామీజీ  నలుగురు సన్యాసులతో  నన్ను  వెతుక్కుంటూ అక్కడకు వచ్చారు. ఆయన  నన్ను  చూచి  ఆశ్చర్యపడి నాయనా!  ఒక్కడవు  వచ్చావని ఆలోచించాను.  కాని నాకు భయం కలగలేదు. అందుకని ధైర్యంగానే ఉంటిని, కాని  వడగండ్లవాన కురియడంవల్ల  దారి  తప్పిపోతావేమోనని తెల్లవారగట్ల  బయలుదేరి  వచ్చాము అన్నారు.


ద్వితీయ భాగము

కైలాసేశ్వరుడు


1

హేమసుందరీదేవీ, ఇక్కడ నుంచి జరిగిన మా సమాచారం యావత్తూ స్వామీజీ వ్రాశారు. మళ్ళీ నేను వ్రాయనవసరం లేదు. ఆయన భాష గంగానిర్ఘరిణే. అదంతా ప్రతి వ్రాసుకొని ఈనా జీవిత చరిత్రలో రెండవ భాగంగా స్వీకరిస్తున్నా. ఈ భాగం కొద్దే, ఆ పిమ్మట, నేను నీ దగ్గరకు వచ్చేటంతవరకు జరిగినది. నాలుగు ముక్కలు నేనే వ్రాసి నా చరిత్ర పూర్తిచేశాను. ఈ చరిత్ర ఉద్దేశము చిట్టచివర నీకు నివేదించాను....

                                                                                                                      శ్రీనాథమూర్తి.
       
       
                                                                                                        స్వామీజీ  కథనము 
   
   శ్రీనాథమూర్తి  ఎంతో  ఉత్తముడు. అతన్ని చూడగానే  నాకదేమో  అనిర్వ్యాజమైన వాత్సల్యం కలిగింది.  కర్మదుర్విపాకంవల్ల అతని  భార్య  పోయినది. అతడు పశువై పోయాడు. ఈ  బాలకుని  ముందుజీవితం  అఖండ  నిర్ఘరిణీ  వేగంతో  ప్రవహిస్తూ, దేశాల  పుణ్యవంతం చేయవలసి ఉన్నది.
   శ్రీనాథమూర్తి  ఉత్తమశిల్పి  కాగలడు. ఈనాడతనికి  ఎవ్వరి  బోధలు  రుచించవు. అతడే  అతని దారివెతుక్కోవాలి. హిమాలయాలలోనే  ఈతనికి  దారి దొరుకుతుందని తోచింది నాకు. వెంటనే  అతన్ని  మాజట్టుతో  కైలాసం  రమ్మన్నాను. అతనితో నేను  వాదించదలచుకోలేదు. అతనికి అవసరం  వచ్చినప్పుడే  ఇది  దారి  అని  చూపిస్తారా. అది  నిశ్చయము. నారాయణ! నారాయణ! దివ్యభావాలకు  కూడా  అతీతుడైన  పరమేశా!  బదరీ క్షేత్రాంతరమూర్తీ, కైలాసక్షేత్రపాలకా, అనంతప్రభూ, మేమంతా కైలాసం  వస్తున్నాము. కైలాస  పర్వత  సందర్శన మహాపుణ్యం నీకే అర్పిస్తున్నాము తండ్రీ! సెలవా?