తుపాను/ప్రస్తావన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తుపాను

ప్రస్తావన

1

పూర్వకాలం నాల్గింటికి ప్రణయతత్వం ఏమితెలుసునా అని నా అనుమానం. ఏమీ తెలియదని నా దృడ నమ్మకం. పూర్వనాయికలు ప్రేమించారు. నాయకులకై విరహవేదన పడినారు. మదనజ్వర తాపోపచారాలు చేయించుకున్నారు. లేత అరిటాకు వీననలు, చిగురుటాకు పాన్పులు. ఆ మన్మథాకారుని చూడలేని కళ్ళు గాజుకళ్ళు అనుకున్నారు.అలాగే ఏమేమో కాంక్షలతో కుంగిపోయేవారు. వాళ్ళ ప్రేమ రైలు పట్టా ప్రేమ. ఒక మనిషిని ప్రేమించడం అంటే వాడితో దాంపత్యధర్మం అనుభవించాలన్న మాటేనా? తక్కిన వాళ్ళంతా అన్నలూ, తమ్ములూనా? అంతే ! కానీ యీ రోజుల్లో నాబోటి యువతులకు ' విచిత్ర భావ సంకీర్ణత' ఉన్నది. ఆనాటి యువతీ చరిత్రలో మానాటి యువతీ చరిత్ర ఒక అధ్యాయం కాలేదు. నాబోటి చదువుకున్న, నవయవ్వనంలో ఉన్న యువతులు కొందరం కలసి మా భాషలో ప్రేమ తత్వాన్ని తెలియజేసే పదం ఏమన్నా ఉందా అని ఆలోచించాము. పూర్వకాలములో స్త్రీలకు పురుషులకు ఉండే సంభందం రస స్వరూపంలో ఆలోచించారుగాని మానవజాతిలోని ఒక పెద్ద సమస్యగా ఆలోచించలేదు. ప్రేమ, ప్రణయం అనే పదాలలో ప్రణయానికి ప్రళయానికి ధ్వని సంభందం కనపడడంచేత, 'ప్రణయం' అనే మాటే బాగుందని అది ఏరుకున్నాం. ప్రేమ అనే పదం ' తేమ' అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దాన్ని తోసేశాము. ప్రణయానికి మేము చెప్పుకొన్న అర్ధం అపారం, అద్బుతం, అంత్యంత క్లిష్టం, అస్పష్టం, ఆశ్చర్యకరం.

                                                    2

నా ప్రణయవస్త్రములోని అల్లిక జంటపోగులతో, మూడు పోగులతో, రంగు రంగుల మూలవాటపు దూప్ చాహన్ కలయికతో నిండి ఉన్నది. నేను నలుగురిని ప్రేమిస్తున్నా, కాదు ప్రణయిస్తున్నా ననుకోండి. శ్రావ్యమైన కంఠం కలిగినది ఒకరు, మంచి రూపం కలిగినది ఒకరు, మాటలపోగు ఒకరు, మౌనం, కలిగినది ఒకరు. నిశాపతిరావు పేరును మాత్రం సార్ధకం చేసుకోడు. వట్టి నిశారావు అనవచ్చును. నల్లగా, సన్నగా , పొడుగ్గా ఉంటాడు. తెల్లని కళ్ళు, నవ్వితే తెల్లని పళ్ళు తప్ప చంద్రుని పోలిక అతనిలో ఎక్కడా లేదు. కాని అతని కంఠం మాత్రం ఉంది చూశారూ, మషామందర గంభీరతను మధించి తేర్చి తెచ్చిన వెన్నవంటిది. మనిషిని చూస్తే చీకట్లు కమ్ముతాయి. గొంతుక విప్పితే కువలయాలు విచ్చుతాయి. ఆ ప్రకాశంలో అతడు కలిసిపోతాడు.

నీ చేతులు కడుక్కుని ' స్వానిం కు బాటిల్సు ' నింపి వర్తకం చేసుకొనవచ్చు. నా తెల్లని చీరను అంటకు, చీర నల్లబడి పోతుంది అనేదాన్ని. ఇలా యేడిపిస్తూంటే అతనికి కళ్ళ నీళ్ళ పర్యంతమూ అయ్యేది. అతన్ని యేడిపించుకు తినటంలో ఇంతైనా జాలి కలిగేదికాదు నాకు.

అప్పుడు గొంతు విప్పాడా ప్రవహించేది ఒక గాఢపరిమలం మధురాతి మధురమైన మధువు., ఊళ్ళూ కోళ్ళూ యేకం చేసుకొని పరవళ్ళు త్రొక్కే మహానది. ఆ నాగస్వరం ఎదుట ఊగే పన్నగిని నేను సుడిగుండాలలో పడి కరిగిపోయిన చిన్న వాగును ! అతని గొంతుక సమ్మోగనాస్త్రం! దానిలో ఏదో తియ్యని బాధ ఉండేది. ఆ గొంతులో ఏరాగమో, ఏ పాటో ఆలాపిస్తూ, చైతన్యరహితురాలనైన నన్నా వేళ అతడేమిచేసినా దేహమూ, మానమూ,ప్రాణమూ అర్పించి ఉండేదాన్ని. ఆ గానదావానలం ముందర నా గర్యం కరిగిపోయి, నా రసజ్ఞత, నా హృదయము బయటికి స్రవించి ఆ మంటల్లో పడి బుగ్గయిపోవలసిందే.


ఇంత మహాశక్తి అతనికి ఉన్నా, అతనిలో ఒక పెద్ద లోటు ఉన్నది. నిశాపతిరావు పౌరుషం లో మార్దవం లేదు. అతనికి స్త్రీలు భోగ వస్తువులు మాత్రం అనుకుంటాడు. ' ఎలాంటి కౌశల్యము గలిగిన స్త్రీ అయినా, ఎలాంటి విజ్ఞానవతి అయినా, ఎంతటి విద్యా వంతురాలైనా అలాంటి స్త్రీ మరింత ఉత్తమమైన భోగవస్తువుగా మాత్రమే అవుతుంది' అని అతని వాదన. ఇట్టి తుచ్చ పశుత్వభావం కలిగి ఉండడం చేతనే పురుషుడయిన నిశాపతికిన్నీ, గానమూర్తియైన నిశాపతికిన్నీ సగమెరుక. స్త్రీని ముట్టుకుని గొంతుక యేత్తలేడు. గొంతుక సారించి స్త్రీని ముట్టుకోలేడు. స్త్రీ స్పర్శ మాత్రాన అతను పశువై పోతాడు. ఒళ్ళు వణికిపోతుంది. మధుపాన మత్తునిలా కళ్ళు కెంపు లెక్కి తూలిపోతాడు. కొంకర్లుపోయే అతని వేళ్ళు వనితావక్షాల పైకి ఊరువుల పైకి వాలబోతాయి.

అతని గొంతుక అంటే వెఱ్ఱి మొహంలో పడతాను. అతని గొంతుక ఆగిన మరుక్షణంలో నిండు మెలకువ వస్తుంది. నిర్వచింపలేని అతని మధుర గంభీర కంఠం నుండి స్వరమధు ప్రవాహాలు ప్రవహింపజేస్తూ అతడు ఆక్రమించివస్తే కిక్కురుమనకుండా సర్వార్పణ చేసి ఉండేదాన్ని.సంగీతం పాడుతూ గాఢ కాంక్షతో అతడు నన్ను ముట్టుకునేటప్పటికి అతని గొంతుక కొడిగట్టిన దీపంలా తుస్సున ఆరిపోయేది. అప్పుడు అతణ్ణి చూసి నా కళ్ళు కెంపులేక్కేవి. అతడు కుంగి వణికిపోయేవాడు. అందుచేత మే మిద్దరం ఒకళ్ళోకళ్ళం గౌరవించుకుంటూ దూరదూరంగా ఉంటూంటాము.

3

కల్పమూర్తి సింహంలాంటి మనిషి. అతని వక్షం విశాలమైనది. అతని భుజస్కంధం దిమ్మెసలాంటిది. అతని మెడ పోతబోసిన కంచు. బలం మూర్తికట్టి కోట్లకొలది వానలకు తడిసి, నునుపెక్కిన రాతిబండల్లాగ తిరిగిపోయిన చేతులూ, కాళ్ళూ, వీనికి తగిన ఉన్నత శరీరము, తీరైన ముఖము, కల్ప మూర్తి గ్రీకు అపోలోను మించిన సౌందర్య మూర్తి. కాని కల్పమూర్తి తన మెదడును క్రిందటి జన్మలో మరచిపోయి వచ్చాడు. చెప్పింది త్వరగా అర్ధం చేసుకోలేడు. అర్ధం చేసుకున్నది అతికిచలేడు, అటుకులేని అతని భావాలు అతన్నే కంగారు పెడతవి.

తండ్రి కావలసినంత సంపాదించి యిచ్చాడు. బంగారానికి ఏమీ కొదువలేదు. ప్రయివేటు మాష్టర్ల కష్టఫలితంగా అయిదవ పారం వరకూ ఈడ్చుకు వచ్చాడు. స్కూల్ ఫయినలు పరీక్షకు ఎంత గొప్పవారి అభి మాన మున్నా సున్నలికి మార్కులు కలిపి అతన్ని పైకి ఎట్టా నెట్టగలరు? అంతటితో చదువు చాలించాడు. అతని హృదయం నవనీతం. కల్ప మూర్తి ఒకళ్ళకి ఆవగింజంతైనా కష్టం కలిగించలేడు. పెద్ద డేనుకుక్కలా నా చీర కొంగుల వెనుకనే తిరుగుతుంటాడు. ఆ విశ్వాసము, ఆ భక్తి, ఆ వెఱ్ఱిపూజ, ప్రపంచ శిఖరితమైన అతని మూర్తి, అతని భాగ్యమూ చూసి, ఇంకో స్త్రీ అయితే అతనికి దాసాను దాసురాలు కావలసిందే. సమంగా కోలగా ఉన్న అతని ముఖం చూస్తాను. విశాలమైన ఫాలము, విస్త్రుతాలైన నేత్రాలు, విపంచి రూపంగా ఉన్న నాసిక, విల్లయి పగడాలు చేర్చుకున్న పెదవులు, వియద్గంగా వికసిత హేమపద్మ ముకుళంలాంటి చుబుకము, బంగారపు అతని ఒళ్ళు, అకల్మష హృదయం ప్రతిఫలించే అతని నవ్వూ చూస్తూ ముచ్చటపడిపోతాను. ఒక్క నిమిషం అతడు లేకపోతే నాకు తోచదు. అంతే!

దృడమైన తన బాహువులతో అతడు నన్నదుముకుంటాడనే ఊహ నాకు కంపరం పుట్టిస్తుంది. నా పెదవులను అతని చక్కని పెదవులతో, తనివితో తాకడం అనే ఊహ నన్ను కుంగచేస్తుంది. అతన్ని నా పురుషుడిగా, నా భర్తగా భావించుకోలేను. అతడు నా రసజ్ఞతకు ఆలంబ మైన ఒక వస్తువు మాత్రము.

మోటారు బాగా నడపగలడు. టెన్నిసులో యోధుడు, కుస్తీలో అందెవేసిన చెయ్యి. ప్రయాణాల్లో పెట్టెలు ఖాళీచెయ్యడం, టిక్కెట్లు తెప్పించడం, సర్వసౌకర్యాలను సమకూర్చడం అతనికి ఉగ్గుబాల విద్య. ఎంత కొత్త వాళ్ళయినా అతనికి భయంలేదు. వాళ్ళతో అతడు బాగా స్నేహం చేయగలడు. రైల్వే ఇంజనీర్లు, కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఎక్సైజు అసిస్టెంటు కమీషనర్లు, యినస్పెక్టర్లు_ఈ జాబితాకు అంతులేదు_అతని స్నేహితులు.

తమ తమ ప్రయాణాన్ని నాకు తెల్పడంలో నిశాపతికీ, కల్పమూర్తికీ చాలా తేడా ఉంది. " నీ అందం ఓ లక్ష గులాబీల పోగు హేమ సుందరీ దేవీ! నీ కళ్ళలోని గాటపుదమి నా కంఠంలోని అతి గభీరాలను గాన మధువుతో అంచులంటా నింపగలదు, మోహనమూర్తీ!" అంటాడు నిశాపతి.

" హేమా! నా సర్వస్వమూ నీది. సౌందర్యానికి నిగ్గులుదీర్చే దేవతా స్త్రీలు నీ ముందర వికారంగా ఉంటారు. మా అమ్మ నీవు ఎప్పుడు కోడలుగా వస్తావో అని కలవరిస్తూంది. ఈ కాలంలో చదువుల తేడాలు పరిగనించవలసిన అవసరం....అవసరం....లేదని నా మనవి. అది నిజం కాదూ? కాదూ! " అని అతి విశ్వాస పూరితమైన వృషభనయనాలతో నా పాదాలు పూజిస్తూ మోకరిల్లుతాడు కల్పమూర్తి.

  4                                               

కల్పమూర్తి నీడలా వస్తాడు తీర్ధమిత్రుడు. తీర్ధమిత్రుడు కర్పూర శలాక లాంటివాడు, ఆడదాని సౌందర్యమాతనిది. కళ్ళు కన్నన్ బాల కళ్ళలా నవ్వుతవి: కాంచనమాల కళ్ళలా కాంక్షిస్తవి: పుష్పవల్లి కళ్ళలా పులకరాల పూజలు సమర్పిస్తవి. ఎప్పుడూ నవ్వుతూంటాడు. ఉంగరాల అలకలు తేలు జుట్టూ, చిన్న ఫాలమూ, గుండ్రని మోమూ ఎప్పుడూ నవ్బ్వుతూనే ఉంటవి.సమమైన ముక్కు, కాయ శరీరము, ఉజ్వల శ్యామల చ్చాయ, స్పష్టతతాల్చిన మూర్తి. మిట్ట మద్యాహ్నపు లేత రావిచేట్టులా ఉంటాడు, పొట్టివాడు.

తీర్ధమిత్రునితో నడిచివస్తుంది సంతోష దేవత. విషాదంలో కూలి పోయినవారు కూడ అతడు వచ్చేటప్పటికి సంతోషాకాసంలో తేలిపోతారు. అతని అడుగుల చప్పుడు వినేటప్పటికి నా హృదయంలో సంతోషరాగాలు ఉద్బవిస్తాయి. నా పని ఇంతైనా నన్ను చేసుకోనివ్వడు. అతడు సమీపంలో ఉంటే తోచకపోవటమనేది దగ్గఱకు రాదు. ఎన్ని గంటలయినా గణ గణ మాటలాడుతాడు. అతనికి ఒక్క విషయమూ తెలియదు, తెలియని విషయమూ లేదు. అతడు ఏ పుస్తకమూ చదవడు, అన్ని పుస్తకాలూ చదివినట్లు కనపడతాడు. ఏ పత్రికా చూడడు, పత్రికలోని వార్తలన్నీ చెపుతాడు.

తీర్ధమిత్రుడు సంగీత పాటకుడు కాడు. అయినా తియ్యగా పాడగలడు, తన పాటల్ని తాను హార్మోనియం మీద వాయించగలడు. వాయించుకుంటూ పాడగలడుగాని అతని గొంతుకలో లోతులు లేవు. రాచుకున్న పది నిమిషాలవరకు మాత్రం సువాసనవేసే అత్తరులాంటిది అతని గొంతుక.

"ఆడమ్మాయి" వలె మాట్లాడుతాడు. " ఆడమ్మాయిలా " నడుస్తాడు. మామూలు మాటల్లో కూడా అతని గొంతుక ఆడగొంతుకే. స్త్రీ సహజమైన జాగ్రత్తతో అలంకరించుకుంటాడు. క్రీములు, పౌడర్లు, సెంట్లు రాసుకోవడంలో నాతో సమానమైన చెయ్యి. సిల్కులలో మునిగి, సిల్కులలో తేలుతాడు.

"కల్పమూర్తితో సమానమైన చెయ్యి టెన్నిసులో, బేస్ లైన్ ఆటలో ఇతన్ని మించినవారు లేరు. " చాపింగ్ " లో " హాఫ్ వాలీ " లో మహా మాంత్రికుడు. మా స్నేహితులు చాలామంది ఇతని ఆటని " జిడ్డు ఆట " అంటారు. గంటలకొద్దీ, సునాయాసంగా, చమటతో షర్టు సుంతయినా తడవకుండా టెన్నిసు ఆడగలడు. తాను "పాయింటు"తియ్యలేడు. ఇతర్లన్నీ తీసుకోనివ్వడు. ఇతన్ని నెగ్గాలంటే " స్మాష్ " తోటి, " నెట్ డ్రాఫ్" లతోటి, నెగ్గవలసిందే. ఒక్క కల్పమూర్తి తప్ప ఇతన్ని తెన్నిసులో గెల్చేవారెవ్వరూ లేరు.

తీర్ధమిత్రుడు కవిగాదు.కాని కవిత్వంలాంటి పాటలు అప్పటికప్పుడు కల్పించి పాడుతుంటాడు. వీళ్ళ పాటలోంచి ఓ పాదం, వాళ్ళ పాటలోంచి ఓ పాదం కలేసి విచిత్రమైన రుచులు అందిస్తుంటాడు. ఎవరైనా అతనికి కొత్తలేదు. ఎలాంటి వాళ్ళతోనై నా నిమిషంలో స్నేహం చెయ్యగలడు.

                                                  5
   

ఇంక, త్యాగతీశర్వరీ భూషణుడు కురూపీకాడు, అందమైనవాడూ కాడూ ఆలోచిస్తే అన్నీఅందమైన రేఖలే, అన్నీ చక్కని వట్రువలె. విలక్షణమైన విచిత్రమూర్తిత్వము అతని శరీర సౌష్టవములో ఉన్నది, అతన్ని మరవలేము. అతన్ని " త్యాగతి " అని మాత్రం పిలుచుకుంటాము.

నవ్వడు, నవ్వుకన్న విలాసమయినదేదో అతని పెదవుల్లో నాట్య మాడుతూంటుంది, అతని ఫాలన అతిగంభీరకాసారని శ్చలత గోచరిస్తుంది.

అతని మూర్తిలో ఏవో భావాలూ, ఏదో తీక్షత, ఏమో నమ్రత ప్రత్యక్షమవుతూ ఉంటవి.అతని కళ్ళు చిన్నవీ కావు; పెద్దవి కావు; కనుబొమ్మలకు దిగువగా లూతుగా ఉంటవి. అయినా వాటి మూర్తి మాత్రం అతి అందమైన తామర పువురేకలు, కనురెప్ప వెంట్రుకలు చాలా పొడుగు. కళ్ళలోని నీలిపాపలు స్పస్టమైన వర్ణము కలవి. ఆ కంటి పాపల్లో ఏవో వెలుగులు ఎప్పుడూ నాత్యమాడుతూంటవి. ఆ కళ్ళ ముందర ఎవ్వరూ అబద్దాలు చెప్పలేరు. అసత్యము ఆలోచింపలేరు. అతని చూపుల యెదుట నా హృదయం నగ్నమూర్తి అయిపోతూంటుంది.

త్యాగతి ఎప్పుడూ మాట్లాడడు. మాట్లాడాడా రెండు ఎత్తయిన కొండల మధ్యనుంచి ప్రవహించే మహానదుల గంభీరద్వనిలా ఉంటుంది.రాత్రి పన్నెండు గంటలకు నిశ్శబ్దంలో వినవడే సముద్ర ఘోషలా ఉంటుంది సెల్లో వాద్యం మందరం తీగలా ఉంటుంది. ఏ సంభాషణలలో నన్నా అతడు ఒక్క మాట చెప్పితే ఇంకెవ్వరూ జవాబు చెప్పలేరు. అందరూ నిరుత్తరులై పోవలసిందే. త్యాగతి అంటే నాకు భయం, భక్తి కూడాను. త్యాగతికి ఏ విధమైన ఉద్యోగమూ లేదు, కాని గొప్ప శిల్పీ, చిత్రకారుడూ. నాకూ, అతనికీ అడయారులో ప్రథమపరిచయం కలిగింది. అతని మూర్తిలోంచి ఏదో సమ్మోహన శక్తి నన్నాకర్షించింది. మా పరిచయం గాఢమై స్నేహంగా పరిణమించింది. సుర్యుడన్నా కాలం విషయంలో అశ్రద్దగా ఉంటాడేమో కాని త్యాగతి రోజూ సరిగా, సాయంత్రం అయిదు గంటలకి మా యింటికి వచ్చేవాడు.

త్యాగతికి ముప్పది సంవత్సరముల వయస్సు ఉంటుంది.ఖద్దరు తప్ప యితర దుస్తులు ఎప్పుడూ ధరించడు. ఆ దుస్తులు ఎప్పుడూ అందంగా కుట్టబడి ఉంటవి. అవి ఎంతో శుభ్రముగా ఉంటవి. త్యాగతి ఎప్పుడూ ఏదో అతిసున్నితమైన సువాసనా ద్రవ్యాన్ని ఉపయోగిస్తాడు. వేసవికాలంలో వట్టివేళ్ళ అత్తరు, వానాకాలంలో మల్లి అత్తరు, శరత్కాలంలో కేతకి, శీతాకాలంలో హేన్నా, వసంతంలో గులాబి అత్తరు వాడేవాడు. ఏనుగు తల చెక్కిన చక్కని పొన్నుకఱ్ఱ అతని చేతిలో ఎప్పుడూ ఉంటుంది.

త్యాగతికి నా రహస్యాలన్నీ చెప్పబుద్దివేస్తుంది; కాని ఏమీ చెప్పలేను.నా జీవితంలో ఎప్పుడైనా ఏ ఉపద్రమయినా సంభవిస్తే త్యాగతి పట్టుకొమ్మ కాగలడనే విపరీత ధైర్యం నన్నావవరించి ఉంటుంది, ఎందు కమ్మా నీకీ ధైర్యం అంటే అందుకు జవాబు చెప్పలేను.

                                                    6

ఈ నలుగురు స్నేహితులూ కొంచము హేచ్చుతగ్గుగా రోజూ మా యింటికి చేరుతూ ఉంటారు. అయిదుగురం కలసి సినిమాలకి పోతూ ఉంటాము. లేదా మా కారుమీదో మనోహర ప్రకృతి నాట్య ప్రదేశాలకి విహారార్దము వెడుతూంటాము.

ఆరోజు " గార్బో " నర్తకి నటించిన " క్వీన్ క్రిస్టినా " చిత్రాన్ని చూస్తున్నాం. ఇద్దరు ఐటు ఇద్దరు అటు మధ్య నేను, నా కుడివేపున కల్పమూర్తి, ఎడమవేపున తీర్ధమిత్రుడు. కల్పమూర్తి ప్రక్కన నిశాపతి వున్నాడు, తీర్ధమిత్రుని ప్రక్కన త్యాగతి వున్నాడు. మంచుతెరల మధ్య హోటలులో చిక్కుపడిపోయిన క్రిస్టినా రాణి అఖండ ప్రణయ సముద్రంలో పడిపోయింది. ఆ ప్రణయం యొక్క విచిత్ర స్థితి అభినయించదగినది ఒక్క గార్భోయే!

ఆమె ప్రణయం చూచి, తీర్ధమిత్రుని రక్తము వుప్పోంగి పోయింది. తీర్ధమిత్రుడు నా ఎడం చెవిదగ్గర పెదవి పెట్టి అన్నాడు: " దేవీ! మా జీవితానికి మహారాజ్ఞిని. లక్ష్మీని హృదయంలో మాత్రమే ధరించాడు విష్ణువు. శివుడు పార్వతిని అర్ధదేహంలో దాచుకున్నాడు.తన సరస్వతిని బ్రహ్మ నాలుక మీద మాత్రమే నాట్యమాడిస్తున్నాడు. కాని నిన్ను నేను నా జీవిత సర్వసము నింపుకొని పులకరించి భువనాలు నిండిపోతాను." "పిచ్చిమాటలు మాట్లాడక చిత్రం సరిగా చూడవయ్యా " అని విసుగుగా అన్నాను.

తీర్థమిత్రుడు మళ్ళీ నాచెవిలో "ఎన్నాళ్ళిల్లాగా ఒంటిగా వుంటావు? రాణీ క్రిస్టినా కూడా, తనకూ తన జీవితానికీ ఏమీ అడ్డం రానివ్వలేదు, చూడూ?"

"స్స్"

ఇంక కొంతసేపటికి కల్పమూర్తి నెమ్మదిగా నా చెయ్యి పట్టుకున్నాడు.

" ఎం మెత్తగా, నున్నగా ఉంది ! ఎంత అందంగా ఉంది ! " అన్నాడతను.

" మూర్తీ ! మీ రెవ్వరూ నన్ను కథ చూడనివ్వరేమిటి ? "

నా హస్తతలం అతని యెడమ చేతిలో ఒక్క నిమేషం ఇమిడి వుంది.

ప్రణయ కల్పనలు, కాంక్షాపూరిత అస్పష్టవాక్యాలు, నిగూఢతా నిబిడమైన వ్యంగ్యకలాపాలు, పుంఖానుపుంఖాలుగా నన్ను ముంచివేయగా నిశాపతి కారు నడుపుతూన్న నా పక్క కూర్చున్నాడు.

" నువ్వెవరవు ? మహాగాయకుని గాఢరాగానివి, నా గొంతుకలో మిన్నే రురవడై బంగారు ఝురులతో ప్రవహించి పోదువుగాని; నా హృదయంలోని మూర్చనల తాళాలకు ధిమి దిమింకిత నృత్యం సలుపుదువు గాని. "

" క్రిస్టినా చూచి అందరికీ మతిపోయినట్లుంది " అన్నాను నెమ్మదిగా. కానీ సౌస్టవములై , మేలిమి బంగారు చ్చాయలతో మిలమిలలాడుతూ ఉన్న వక్షోజాల వెనక దాగి ఉన్న నా యువతీ హృదయమ్ నిర్వచింపలేని ఆనందంతో వివశత్వం పొందింది.

ఎవరి ఇళ్లకడ వారిని దింపి, నేనూ, త్యాగతీ మా ఇంటికి చేరుకున్నాం. కారును షెడ్డులో పెట్టి ఇద్దరం ఇంట్లోకి వచ్చాం. సిగరెట్టు తీసి వెలిగించి పొగ వదులుతూ నాపక్క మౌనాలంకారుడై నడచి వస్తూన్న శర్వరీభూషణుని చూడగానే, నా మెదడులోని మత్తులు పటాపంచలైనాయి. ఆటలాడి అలసట పడిన చిన్న శిశువునై పోయాను.

ఉస్సురని నిట్టూర్పు అప్రయత్నంగా నా హృదయంలో నుంచి వచ్చింది. కొంచెం తూలి ముందుకు పడబోయాను, తల్లి చెయ్యిలాంటి చేతిని నా వీపున ఆనించాడు త్యాగతి.

' హేమూ ! క్రిస్టినా కథ ఎవరినైనా తలక్రిందులు చేస్తుంది. కొంచెం పళ్ళరసం తాగి ఏ ఆలోచనా లేకుండా పడుకొని నిద్రపో. సుడిగుండంలో దూకడం మొదట్లో ఆటగానే ఉంటుంది.

నా కేదో భయం వేసింది. త్యాగతి భుజంమీద చెయ్యివేసి ఒక నిమిషం కదలకుండా నుంచున్నాను.

త్యాగతి మౌనమే అత్యంత శమనమయింది.

ఇంట్లోకి వెళ్ళగానే సాత్కుడి బత్తాయిపండ్లు కోసి, రసం పిండి, వడబోసి, అందులో ద్రాక్షాసవం అరఔన్సు వేసి త్రాగమని నా చేతికిచ్చాడు త్యాగతి. నాకు కొంచం సత్తువ వచింది. మనస్సును ఏదో నిర్వచింపలేని ఆనదము ఆవహించినది.

నేను బట్టలు మార్చుకు వస్తాను. పదినిమిషాలు ఉండవూ? అని అంటూ లోపలికి పరుగెత్తాను.

నేను మళ్ళీ తిరిగి వచ్చెటప్పటికి నీలిపచ్చని ఎలక్ట్రిక్ దీపపు వెలుతురులో హాలులో పటమటిగోడకు వేళ్ళాడుతూన్న, తాను రచించిన నా చిత్రాన్ని చూస్తూ నిల్చుని ఉన్నాడు. తెల్లటి పట్టులాగున్నూ, మోకాళ్ళవరకు జీరాడుతూ ఉన్న తెల్లటి పట్టుచొక్కా తొడుక్కొని, తెల్లటి వల్లెతో గుమ్మం దగ్గర నుంచుని అతన్ని చూస్తున్నాను.

ఆ డ్రెస్సు నీ కందం అన్న ధరించి వచ్చావు?

నేను రావడం అతనికి తెలియదనే అనుకున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది.

ఇది పంజాబీ డ్రెస్సు.

పంజాబ్ వాళ్ళకి పంజాబు డ్రెస్సు అందం.

ఒకరికి అందమైనవి ఇంకొకరికి అందం కాకూడదా?

అందం అనేది వస్తుసంభందాన్ని బట్టి వుంటుంది.

ఆ సంబంధమే మనమూ చూపించకూడదా ?

అన్ని సంబంధాలు మనము చుపించగలమా? వాతావరణం ?

నువ్వూ భోజనానికి వస్తావన్నాను తెలుసునా? మంచిది అని అక్కడ ఉన్న ఓ సోఫామీద కూర్చున్నాడు. సిగరెట్టు ఆష్ ట్రేలో ఆర్పివేశాడు.

7

ఆ మర్నాడు త్యాగతి తప్ప మేమంతా టెన్నిస్ ఆడుకుంటున్నాము. కల్పమూర్తీ, నేనూ ఓ పక్కని ఉన్నాం. నిసాపతీ, తిర్ధమిత్రుడూ ఓ పక్కని ఉన్నారు. చెట్టుక్రింద క్యాంపు కుర్చిమీద కూర్చుని చెట్లఆకులు చూస్తూ త్యాగతి ఏ లోకాల్లోనో విహారం చేస్తున్నాడు. అతనివి చూచీ చూడని చూపులు. నిశాపతి కళ్ళతో నన్ను కబళిస్తున్నాడు. కల్పమూర్తి అక్షులతో అర్చిస్తున్నాడు. తీర్ధమిత్రుని దృష్టులు నా నిర్మల సౌందర్య స్నాతాలై సానందమ త్తత తాలుస్తున్నవి. త్యాగతి చూపులో ఏమీ గోచరించడం లేదు. అవి అపహాస్యం చేస్తున్నవో, అత్యంత పరశత్వం చెందుతున్నవో!

టెన్నిస్ అయాక అందరం వచ్చి త్యాగతి పక్కనే కుర్చీలమీద చతికిలపడ్డాం. మా సేవవకుడు అందరికీ పానీయాలు తెచ్చి అందించాడు.

తీర్దమిత్రుడు : స్త్రీ పురుషులు కలసి పాశ్చాత్య దేశాలలో టెన్నిస్ మొదలైన ఆట లాడడం,నృత్యం సల్పడం అవీ చేస్తుంటారే, పూర్వ కాలంలో మన దేశంలో యిలాంటి ఆచారాలేవన్నా ఉండేవా? ఏమీ కనపడవు.

నిశాపతి : పాశ్చ్యాత్య స్త్రీలు పురుషులు జంటగా సంగీతం పాడుతుంటారు. మన దేశాల్లో ఎక్కడ? కల్పమూర్తి : పాశ్చ్యాత్య దేశాల్లో స్త్రీ పురుషులు ఎక్కువ తక్కువలను చదువును బట్టి ఏర్పరచలేదు !

తీర్ధమిత్రుడు : ధనాన్ని బట్టా ?

నిశాపతి : వారికుండే తెలివితేటల్ని బట్టి.

నేను : ఎవరి ఉలుకు వారు బయట వేసుకుంటున్నారు.

త్యాగతి : (మౌనం)

కల్పమూర్తి : పాశ్చ్యాత్య దేశాలు మనకి వరవడా?

నేను : వారివల్ల మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయిగా!

త్యాగతి : (మౌనంతో సిగరెట్టుపొగ వదులుతున్నాడు.)

తీర్ధమిత్రుడు : మనలో లక్షలోట్లు ఉన్నప్పుడు యితరులు ఏర్పరచిన రాజబాటను సరిగ్గా నడిస్తే మనజీవితం సునాయాసముగా అవుతుంది.

నిశాపతి : మనదగ్గర మాత్రం వాళ్ళు నేర్చుకోవలసినవి లేవా ?

తీర్ధమిత్రుడు : ఒకటో రెండో మంచి సంగతులు కొన్ని నేర్చుకొనే ఉన్నారు.

కల్పమూర్తి : ఏమిటా ఒకటో రెండో ?

తీర్ధమిత్రుడు : కొద్దిగా వేదాంతం, అత్తరువులు గిత్తరువులు ఉపయోగించడం....

నేను : అయితే మనదేశం ప్రపంచానికి ఏమీ యివ్వలేదంటావా?

త్యాగతి : (మౌనంతో సిగరెట్టు ఆర్పి, సిగరెట్టు బూడిద గిన్నెలో వేశాడు.)

తీర్ధమిత్రుడు: అనారోగ్యాలు , చాతబడులు , దెయ్యాలు , దేవతలు , భయాలు నేర్చుకోమన్నావా ?

నేను : నీ వాదమంతా మనదేశం మీద అసహ్యత, పరదేశాలమీద భక్తితో బయలుదేరినవే కానీ,న్యాయాన్యాయ విచారణ దృష్టితో బయలుదేరింది కాదు.

త్యాగతి : ఒకదేసానికీ, ఒకదేసానికీ,సమానసంబందం కలిగి వుంటే, వారి ఆచారాలు కొన్ని వీరికీ, వీరి ఆచారాలు కొన్ని వారికీ వస్తాయి. అందులో కొన్ని చాలా అందంగానూ, కొన్ని చాలా అసహ్యంగానూ కనపడతాయి. బానిసలకీ, ప్రభువులకీ సంబంధంలో, బానిసలకి ప్రబువుల ఆచారాలు బాగున్నట్లు కనబడ్డం సహజం.

అందరూ మౌనం.

                                                   8

మర్నాడు పొద్దున్నే నేను నిద్రలేచి, మొహం కడుక్కుని, యివతలికి వచ్చేటప్పటికి తీర్ధమిత్రుడు తయారు. కాఫీ పుచ్చుకొని తోటలోకి షికారు వెళ్ళాం. మా యిద్దరి చుట్టూ దక్షిణపుతోట, నందనవనానికి పాఠాలు నేర్పే సోబగులాడి. ఆ వనదేవత మమ్మల్ని కౌగిలిస్తోంది. ఆ పువ్వుల సువాసనకు నాకు వివశత్వం కలిగిస్తున్నది. నా యౌవనం సాఫల్యానికై చేతులు చాస్తున్నది. రంగువేయని ఎఱ్ఱని నా పెదవుల్లో అమృతాలు ఆస్వాదనకై పరెవళ్ళు త్రోక్కినవి. నా మనసులో కల్పమూర్తి పూజా నయనాలతో మోకరించి నాడు. నా హృదయంలో నిశాపతి సంగీతం సురభిళమై ప్రత్యక్షమైంది. ఎక్కడో మబ్బుల వెనకాల శర్వరీభూషణుని మౌనము తారకాకాంతై మినుకు మినుకు మన్నది. ఎదుట తీర్ధమిత్రుడు.

చటుక్కున తీర్ధమిత్రుడు నన్ను కౌగిలించుకొనబోయినాడు. నేనాతని త్రోసివేసి ఇవతల కురికి, కొంచెం కోపంతో, కొంచం విసుగుతో, అబ్బా, ఉండవయ్యా ! అస్పష్టత వీడని నా హృదయం నాకు దారి చూపించడం లేదయ్యా అన్నాను.

  అక్కడ ఉన్న ఓ వనవేదికమీద కూలబడ్డాను, అప్పుడు అమ్మయ్యో....తీర్ధమిత్రుని కళ్ళల్లో ఏవో భయంకరమయిన కాంతులు తళుక్కున మాయమయ్యాయి. అది నా భ్రాంతి అయి ఉంటుంది. దైన్యహాస కాంతులు వెదజల్లుతూ, కరుణార్ద్రాలైన అతని కన్నులు కర్క శద్యుతు లెల్లా వెదజల్లగలవు? కానీ నాకా భ్రమ మాత్రం ఎందుకు కల గాలి ? తీర్ధమిత్రుడు ఒక నిట్టూర్పు విడిచి, ణా ప్రాణమే రూపం దాల్చిన యీ తన్వంగి నా దురదృష్టం చేత నా పూజను గ్రహించడం లేదు.

                                                                                                ఈ విధిని దాటుటే
                                                                                                    ఈ విధిని పొందు టే
                                                                                                    నా జన్మ తపసయ్యె
                                                                                                    నా ఉన్మనమే వృధా !
                                                                                                    కలువ పూ బాలికను
                                                                                                    కౌగిలింపగరాదు
                                                                                                    త్వరపడితేనే ఫలము
                                                                                                    దాపురించే నమాస !
                                                                                                    తంగేటి జున్నుకై
                                                                                                    పొంగిపోయిన నేమి ?
                                                                                                    భంగ మొనరించేటి
                                                                                                    భృంగాలు పొంచుండె

  రా, లోపలికి వెళదాం. స్నేహితులు వచ్చేవేళ అయింది అని తల వాల్చుకొని నడిచా.  ఈతని పూజ గొప్పదే కానీ అతని భార్య ఉన్నదే ! అనుకుంటూ అడుగులు తడబడుతూ లోపలికి నడిచాను.
                                                          9
  అక్కడ శర్వరీ భూషణుడు తాంబూలం వేసుకుంటూ యాలుక్కాయ వొలుస్తున్నాడు. కనురెప్ప వాల్చని గంభీరదృష్టులు అతడు నా పైన ప్రసరించినాడు. ఆ చూపులు నా గుండెలకి భయమును అద్దినవి, ఎప్పుడూ పొందని సిగ్గు శాలువలా నన్ను కప్పివేసినవి. త్యాగతి ఎవరని మేము నిశ్చయించుకొనే వాళ్ళం.
తీర్ధ : అతడు అఘోర సన్యాసి అని నా ఉద్దేశ్యం!

కల్ప : అతడు మంచివాడు. మనుష్యుని వెనకాల అతన్ని వెక్కిరించడం పురుష లక్షణం కాదు.

    నేను : ఆయనకూ, నాకూ పరిచయం కలిగినది ఈ ఏడాదిలోనే.అయినా ఎంత స్నేహితుడైనాడు.

    కల్ప : ఈవాళే ఆ ప్రశ్న మనలో పుట్టిందేమిటి?

    నిశా : ఆ ప్రశ్న నా మనసులో ఎప్పుడూ ఉండనే ఉన్నది.

    తీర్ధ : అడగనా నువ్వెవరని?

    నేను: అలాంటి తెలివి తక్కువ పనులు చేయకు.

    కల్ప: ఆయన ఎవరో పూర్తిగా తెలపటం అనే ఇటువంటి ముఖ్యమయిన విషయంలో ఆయన ఉదాసీనత వహించగలడా? ఎవరి రహస్యాలనైనా మనం మన్నించాలి.

    నిశా: ఈ ఏడాదినుంచీ రహస్యం వీడని స్నేహం అంత గొప్పదా మనం గౌరవించడానికి?

    నేను : అలాంటి స్నేహాన్ని నేను మాటాడకుండా గౌరవించాను కాదా? పైగా ఏమి రహస్యాలున్నాయి ఆయన జీవితంలో! మహాశిల్పీ, చిత్రకారుడూ అతడు.

    తీర్ధ : నిన్ను బట్టే మేమంతా గౌరవిస్తున్నాము; లేకపోతే....

    నిశా : ఈ జిడ్డు ఆముదం ఎవరిక్కావాలి ?

    తీర్ధ : తంటసాన్ని ఎవరు కోరుకుంటారు కావాలని!

    కల్ప: ఈ రోజున మన కందరికి జ్ఞానోదయం అవుతున్నది.

    నేను: అయితే మా తండ్రిగారి కతడంటే వున్న గౌరవం టంగు టూరి ప్రకాశంగారన్నా లేదు.

    తీర్ధ  : ముసలివాళ్ళు ముసలివాళ్ళని గౌరవిస్తారు.

    కల్ప : ఆయనకు ముప్ఫై, ముప్ఫైఒకటి కన్న ఎక్కువ వయసు వుండదు, ఇరవై అయిదేళ్ళ యువకునిలా వుంటాడు.

    నిశా : మామయ్యా గారు అరవై ఏళ్ల వారులా వుంటారా ? ముఫ్ఫై ఏళ్ల మూర్తిలా వుండరు మరీ!

    నేను : ఇదంతా శుష్కవాదన. ఏ కారణం అయితే ఏమి, త్యాగతి నా స్నేహితుడు.

    ఈలా ఒకనాడు త్యాగతి లేకుండా వాదన జరింగింది. అదంతా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఈ ఆలోచనలన్నీ త్యాగతి యాలక్కాయ నోట్లో వేసుకొనే లోపుగానే నా హృదయంలో మెరుముల్లా మెరసి మాయమైపోయినవి. తీర్ధమిత్రుడు పెదవులతో నా దేహాన్ని స్పృశించినంత మాత్రాన్నే నేను మైలపడి పోయాననుకునే చ్చాందసురాలిని కాను. ఇష్టతాయిష్టతలు యే కారణాలబట్టి యేర్పడతవో ? ఇష్టతాయిష్టతలు మానవ జీవిత చరిత్రకు యెన్ని రకాల ప్రకరణాలను సృస్టిస్తున్నవో? ఆడదాని జీవితము మగవాడి జీవితముతో కలిపి వేసుకోవడంతోనే

ఆఖరా? వారి సంఖ్యను వృద్ది పొందించడమే ఆడదాని కర్తవ్యమా ? ఆమె అందమైన కళ్ళు,సుందర రేఖాసమన్వితమైన ఆకార సౌష్టవం, పూర్ణాంగాలు, సిగ్ధవక్షాలు, అసమాన లావణ్యము, అద్బుత మాయాపూరిత జఘనము, బంగారు మోహర్ పూవుల లాంటి పాదాలు -ఇవన్నీ యెందుకు ? పురుష కామాగ్నికి ఇవన్నీ ఇంధనాలు కావలసి ఉంటే. ఆడది మగవాడికన్న నాలుగువేల సంవత్సరాలు వెనకాలపడి ఉన్నదన్నమాటే! పురుష జీవితానికి మహదాశయము స్త్రీ అని పురుషుడు కల్పించే రాతలూ, పాటలూ, స్త్రీని పురుషుడు మాయమంచులు కప్పి పశువుగా ఉపయోగించుకోవడాని కేనా? అందుకు స్త్రీ అభ్యంతరం చెప్పకతయారా

ఇంక నేను ఈ నలుగురు స్నేహితులతో సంచరించే విధానంలో ఉండే అర్ధం ఏమిటి? త్యాగతి నటించి, తక్కిన ముగ్గురూ నాలోని ఏ ఉత్కృష్టమైన ఆడతనాన్ని చూశారో యేమో, నన్ను గాఢమైన కాంక్షతో వాంచిస్తున్నారు. త్యాగతి మాత్రం....అతని హృదయంలో ఏలాంటి కోర్కేలున్నవో యెవరికి తెలుసు ?
    
                                                                                                                       10

    ఏ స్నానము చేస్తున్నప్పుడో నా యీ దేహముయొక్క అందము చూచుకొని నేనే ముచ్చటపడుతుంటాను. రెండు నిలువుటద్దాల మద్యన నిలిచి చూచుకొన్నాను నన్ను నేను. మోకాళ్ళవరకు సడలింపబడిన నా తలకట్టు ఒక మహామేఘంలా ఆవరించుకొంటుంది. గనిలోనుంచి తీసిన నీలాలలా మెరుస్తూ, చంద్రవంక నది ఎత్తిపోతలధారలా పతనాలవుతూ, క్రిష్ణవేణిలా ప్రవహిస్తూ, విరియపూచిన నీలమందార వృక్షంలా వికసిస్తూ, విడంబిస్తూ నా యీ తలకట్టు అద్భుతంగా దివ్యసంపదగా నన్ను అలంకరిస్తుంది.

    నా ఫాలం నిశ్శబ్దంగా ఉదయకాలపు చిరు ఎండలు ప్రతిఫలించే చెరువులోని బంగారపు నీరు, పూర్ణిమనాటి శారదాకాశము, బాగా వికసించిన తెల్లతామర పూవు రేకు, లేత తుని తమలపాకు. నా కనుబొమ్మల్లో చిన్న బిడ్డల నవ్వుని, రసోన్మత్తుడైన మహాకవి స్వప్నాల్ని చూస్తుంటాను. అవి నల్లని గండుకోయల పాటలు. నాసికామూలాన నాతిదూరముగా కోలగా ఉండి, విస్ఫారితమధ్యాలై, వసంత వర్ష బిందువులలాంటి పొడుగాటి కనురెప్పలచే పొదుగబడి పాతాళగంగా, నీలవర్ణ గంభీర కాష్టాయుతా లై, నన్నే సమ్మోహింపచేస్తున్నవి నా కళ్ళు.

    కారలైన్ డి ఆర్డెన్ పూవురేకులు, వేదులువారి గీతికలు, ప్రత్యూష పాటలకాంతీ, వికసిత కకుబాలు నా కర్ణాలు. మృదులా లై, కఠినాలై, నిర్మలహరితారుణ ప్రభా పుష్పగుచ్ఛాలై, రొహిణీ వర్ణోజ్వలహాసా లై , నాత్యున్నత నవనీతగోళా లై, నవతుషారార్ద్రజఫాకోరికమూర్తులై, ప్రణయ సర్వకలాళా మూలాలంకారాలై ప్రభావించుతూ, కైళికీవృత్తి ప్రధానలాస్య సమానాలై, అప్సరోంగ నా స్వప్న పూరితాలై, నా మిసిమి నవయవ్వనపు వక్షోజాలు నన్నే సంమ్మోహింప చేస్తున్నవి. హేమ ఫణిఫణా సదృశ హస్త తలాలలో కానీ, నవరత్న

కలశ జనితామృతధార లైన ఊరువులలో కానీ, సముద్రమీనమూర్తులైన నా జంఘులలో కాని, మోహనం కాని పొంకమే లేదు.
        
                                                                                                                        11

    బి. ఏ. తెలుగు ఆనర్సు మొదటి శ్రేణిలో నెగ్గిన మదరాసు యూనేవర్సిటీ పాండిత్యము నా సౌందర్యమును నేను మాత్రం వర్ణించుకొనిటందుకు పనికివచ్చినది. ఆ రోజున ఇదంతా రాసుకొని చింపివేసుకొన్నాను. ఆ వెర్రితనమంతా నాకు ఈనాడు మనస్సులో జ్ఞాపకం తెచ్చినాడు తీర్ధమిత్రుడు. పాశ్చాత్య స్త్రీల మోములవలె కనబడకపోయినా, సిగ్గుతో మోమంతా యెర్రటి రక్తంతో జేవురించిపోతూ ఉండగా, అడుగడుక్కీ తూలిపోతూ, యాలక్కాయ ఒలిచి నోట్లో వేసుకొంటున్న త్యాగతి వద్దకు నడచివచ్చాను. త్యాగతి వంచిన తల ఎత్తనేలేదు.

    త్యాగతి : నిశాపతిగారు ప్రొద్దున్న బొంబాయి ఎక్స్ ప్రెస్ కు వెళ్ళే ముందర ఆయన్ను నేను కలుసుకున్నాను. ఆయనకు అక్కడి నుండి ఢిల్లీ ప్రయాణమట.

    నేను : నిశాపతి మనలను స్టేషనకు ఎందుకు రమ్మనలేదో? ( అప్పటికి నా మనస్సును కుదుటపరచుకున్నాను,)

    తీర్ధమిత్రుడింతట్లో గబగబా మా వద్దకు వచ్చి ' నిజమే ' అని అంటూ ఉండగానే త్యాగతి అతని మాటకడ్డము వచ్చి అతని స్నేహితులతో చాల ముఖ్యమైన పనుండి బండి కదిలేవరకూ మాట్లాడి, కదలిన తరువాత ఎక్క వలసి వచ్చినదట మిత్రరావుగారూ! మరచిపోయినారేమండీ? అని అన్నాడు. యింతలో కల్పమూర్తి రేడియోలో అతని కంఠము ఎంత మధురంగానో వినబడుతుంది అంటూ వచ్చాడు.

    త్యాగతి : రేడియో సెట్టు హేమ ఇంకా కొనలే దెందుకో ?

    నేను : నాకు నువ్వు ఒక మాంచి సెట్టు కొని పెట్టగూడదూ ?

                                                                                                                       12

    ఒకనాటి వెన్నెలరాత్రి త్యాగతీ నేనూ మాత్రమే అడయారు నది గట్టుమీద వాహ్యాళికి వెళ్ళినాము. ఏటిని పొదుగుకొని యేటి నీటిలో ప్రతి ఫలించే జ్యోత్స్నలు త్యాగతి కళ్ళలో తాండవిస్తున్నవి. ఆ ముహూర్తంలో త్యాగతి మధుమాసశుభ్రాంశునిలా ఉన్నాడు.

     హేమకుసుమదేవీ ! అర్చకుని వై లక్షణ్యాన్ననుసరించే అతని పూజా, పుజాఫలము ఉంటవిసుమా ! ఉపాస్య దేవత క్రీగంటి చూపులకైనా అర్హుడగుటే మహా ప్రసాదం .

     అవునయ్యా, అర్చనకై వచ్చిన భక్తులందరికీ ప్రసన్నత కావాలి గదా ఆ దేవీ ?

     పూజా సౌలభ్యం వర ప్రసాద మెందుకు కావాలి  ?

     వరప్రసాదానికి నలుగురూ అర్హులైతే ?

ఒకేసారి నలుగురు అర్హులవడం ధర్మవిరుద్దం. ఏ ధర్మమూ అలా భోధించదు.

     సనక సనందనాదు లందరూ ఒకేసారి ముముక్షువులు కాలేదా ?

     సనక సనందనాదులు భక్తిభావం యొక్క అనేకత్త్వాన్ని మాత్రమే తెలియచేస్తున్నారు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క భక్తుడే భగవంతునిలో లీనమయ్యాడు. నరసింహమూర్తికి ప్రహ్లాదుడు, వామనునకు బలి, రామునకు హనుమంతుడు, కృష్ఠునకు అర్జునుడు.

    ఆయన మాటలు నన్ను దాటిపోతున్నవి. నదిలో ప్రతిఫలించే చంద్రుని నవ్వులు నిశ్శబ్దంతో దిశలను ఆవరిస్తున్నవి. మందమలయానిలుడు మాఘమాసపు లే చివుళ్ళ సౌరభాలను పన్నీరు చల్లుతున్నాడు. శిశిరాకాశ నైర్మల్యము చేతులుచాచి తన నీలి హృదయానికి సర్వప్రకృతిని అదుముకొంటున్నది. సర్వవర్ణాలలోని స్పష్టతా కరిగిపోయి యేకవర్ణములో కలసి పోతున్నది. త్యాగతి విశాలఫాలంలో పూర్ణకౌముది వల్ల అణగిపోయిన తారకా కాంతులన్నీ పుంజీభవించినవి. అప్పుడాతడు లో గొంతుకతో.

                                                                                                           గాలై ప్రసరిస్తే
                                                                                                             వాగై ప్రవహిస్తే
                                                                                                             మలయపవనమై
                                                                                                             మందాకినివై
                                                                                                             రారా నా రాజా !
                                                                                                             యీ రాజ్యంలో
                                                                                                              నే నొంటినిరా!
                                                                                                              కాంతై జ్వలియిస్తే
                                                                                                              శాంతై పులకిస్తే
                                                                                                              శరత్సుషమయై
                                                                                                              క్షపాహాసమై
                                                                                                              రారా నా రాజా !
                                                                                                              యీ రాజ్యంలో
                                                                                                               నే నొంటినిరా !
           అని పాడినాడు.

           ఎవరిదయ్యా యీ పాట ?

    
           నేనే రచించుకొన్న గీతిక యిది.


           ఏమయ్యా! నీవున్నూ తీర్ధమిత్రునిలా కవిలాగున్నావే !


నేనే కవి నెట్లా ? నా గొంతుక అవ్యక్తం, అస్పష్టం. ఏవో సంద్యా భావాలున్నవి. తీర్ధమిత్రుడంటావా, స్పష్టతతాల్చిన జ్వాలా శిఖవలె ప్రజ్వరిల్లుతూ ఉంటాడు.

                  అవి వెలుగులు కావేమో ! ఏదో తాటాకు, పాతగడ్డి మండించిన పొగచూరిన మంటల్లా ఉంటవి అని పకపక నవ్వాను. అతడు రాసిన పాట విను నీకే తెలుస్తుంది!

'బ్రతుకలేనే ఓ ప్రియా

కత లెరిగి నీ పెదవి

విత మెరిగి శ్రుతి మరచి

గతి తప్పి అడవిలో

వితము తెలియని నేను

బ్రతుకలేనే ఓ ప్రియా

కత లెరిగి నా పెదవి....'

    ఈపాట అతడు ఎందుకు రాసినట్లు ?

     ఈపాటలో నా అందాని కాతడు జోహారు లర్పిస్తున్నాడట !

     నిన్ను ముద్దు పెట్టుకున్నట్లు రాస్తాడే ?

    నిశాపతి ఢిల్లీకి వెళ్ళిన రోజున తోటలో అతనూ నేనూ తిరుగుతుంటే, తటాలున నా చేయి ముద్ద్దు పెట్టుకొని నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆ మరునాడు ఈ పాట రాసుకొచ్చి నాకు చూపించాడు.

     నీ యౌవనం సాఫల్యం అనుభవించలేదా? ఆ ముద్దు నీ అందానికి హారతి కాలేదా ?

     హారతో , నివేదనమో నాకు తెలియదుకాని, అతని స్నేహానికి ఆ ముద్దుకూ శ్రుతి కలిసింది కాదు. నాకు అసహ్యం వేసిందన్నమాట నిజం. ఆ రోజున నీవు బల్లవద్ద నుంచొని ఉండగానే, నేను డేటాలు నీటితో చేయి కడుక్కొనే వచ్చాను.

    త్యాగతి మాట్లాడకుండా తల క్రిందకు వాల్చుకొని చేతితో నీల మీద యేవో గీతలు గీస్తున్నాడు.

    అందరూ నాకర్ధమయ్యారు కాని త్యాగతి నా కర్ధంకాడు! అతని మౌనంలో యే మేమి భావాలు నిశ్చలపక్షాలు చాపి తెలిపోతున్నవో !

     నేను హైస్కూలులో విద్యార్దినిగా ఉన్నప్పుడు, ఇద్దరు, ముగ్గురు బాలకులు నన్ను ముద్దు పెట్టుకోబోయారు. నా చుట్ట మొకాయన, నా క్లాసు మేట్సు యిద్దరు. నాకు అసహ్యము వేసింది; ఏదో సంతోషము వేసింది. ఆ సంతోషముయొక్క తత్వముకాని, ఆ అసహ్యత యొక్క తత్వముకాని నాకీ నాటికీ తెలియడంలేదు. నా కనుబొమలు ముడివడడంలోని కోపం చూచి ఆ ముగ్గురిలో ఇద్దరు అక్కడనే ఆగిపోయినారు. నా కనుపాపలలోని సంతోషము చూచి కాబోలు ఆ ముగ్గురిలో ఒకడైన నా క్లాస్ మేటు రెండో సారి నన్ను కౌగిలించుకునే ప్రయత్నం చేయబోయాడు. అప్పుడు నాచేత లెంపకాయ తిన్నాడు. అంతటితో ప్రణయ కార్యకలాపము చల్లారి పోయింది.

    ఆ మాటలని ఆలోచనలో పడ్డాను. ఇద్దరం కొంతవరకూ మౌనంగా వున్నాం.

'ఒక్కొక్క నీ ఆలోచనలకు, ఒక్కొక్క దమ్మిడీ చొప్పున ఎచ్చేట్లయితే యీపాటికి కొన్ని రూపాయలై ఉంటాయి' అన్నాడు త్యాగతి.

    ఉలిక్కిపడి తలెత్తి 'ముఉడు దమ్మిడీలకంటే యెక్కువ యీయవలసి ఉండదయ్యా  ? కానీ ఇలా యీయి చెప్పుతా' అని నే నన్నాను.

    'ధనం పెట్టి ఆలోచనలను కొనుక్కోగలమా హేమం' అని విషాద వదనంతో ఏరువైపు చూచినాడు త్యాగతి.

                                                                                                                      13

    పది దినాలయిన వెనుక ఒక ఉదయమే నా కళ్ళలోని నిద్ర సగమావలకి పోయి మళ్ళీ వెనక్కు వస్తున్నది. ఆ ప్రత్యుషంలో,

'మేలుకొనుమీ

దివ్యసుందరీ!

మోహనాంగీ మేలుకో!

మేలుకో వాంఛప్రదాయిని

మేలుకోనవే సురభిళాంగీ

పూర్ణకాంతుల తేజరిల్లే

భువన మోహిని మేలుకో !

కలలు ఆపుము కళ్ళు తెరువుము

కలలుకన్నా విలువమీరిన

పూజ యిదిగో

వేగలే వరవర్ణినీ

వేగలే సువర్ణినీ!

    అన్న పాట ఘంటానాదమై వినబడింది. ఉలిక్కిపడి తొడుక్కున్న పట్టుకుచ్చులలాగు సవరించుకొని, లేచి, కళ్ళు నులుముకొన్నాను. చిత్రవర్ణ మైన పల్చని నా పట్టు చొక్కగాని, నా పట్టులాగు కాని, తప్తజాంబూనద కాంతులను వెదజల్లే నా శరీరచ్చాయలను దాచలేకపోతున్నవి.

'ఎవరూ' అని కేకవేశాను.

'ఎవరా? ఒక యోగి! దివ్యత్వం కోరే ఒక తపస్వి.'

'ఆ తపస్వి యిక్కడకు ఇప్పుడెందుకు వచ్చాడు?'

'వరం కోరడానికి...'

' ఏమిటా తపస్సు ! ఏమిటా వరం ? ఇక్కడా తపస్సూలేదు. సిద్దీ లేదు. తపస్వి వెళ్ళిపోవచ్చును. '

' ఇక్కడ లేవూ? ఏ దివ్యమూర్తి సాక్షాత్కారం కోసం ఇన్నాళ్ళు దివ్యగాంధర్వం ఉద్భవింపజేసానో, ఏ దివ్యమూర్తి నామ మంత్రం జపిస్తూ భ్రూయుగ్మం మధ్య చూపు నిలిపానో, అద్బుత సంకల్ప సమాధిలోనికి పోయానో, ఆ దివ్యమూర్తి ప్రసన్న అవుతుందని ఈ ఉదయమే నాకు ఆకాశవాణి వినబడినది. కాబట్టి,

' తెరవవే తలుపుల్లు. దేవీ
తెరువమేమే దివ్యహృదయము
తెరిచి యీ భక్తుణ్ణి త్వరలో
వ్స్రము లిచ్చీ వాంఛ లిచ్చీ
కరుణతో కాపాడు టేపుడో ?'

    ఏమా సంగీత మాధుర్యము! సైగల్ గొంతుకన్నా గంభీరత, అబ్దుల్ కరీం గొంతుక కన్న మాధుర్యం, పంక జమల్లిక్ గొంతుకకన్న గాఢసురభిళత, వసంత దేశాయి కంఠముకన్న సమ్మోహనత ........నిశాపతి యెప్పుడు వచ్చాడు? అతని గొంతు విని యెన్నాళ్ళైంది! నా పందిరిమంచం మీదనుంచి, విమానంలోనుంచి దేవకన్యలా ఉరికాను. నా వదులు జడ వీడి కెరటాలై, వడులై, సుడులై ప్రవహించింది. తలుపు చటుక్కున తీశాను. ఎదుట నిశాపతి, హృదయాభిరామంగా అలంకరించుకొని ఉన్నాడు.

    ' కరుణతో కాపాడు టెపుడో ' అంటూనే రాగం ఏ లోకాలకో పోనిచ్చి, సాలేగూడును దులిపినట్టుగా తలుపును తోసుకొని మాటాడకుండా అతితీక్షనపు చూపులతో, అతి తృష్టాపూరిత వదనంతో సున్నితమైన పట్టు దుస్తులలోంచి తొంగిచూచే నా అందాల యౌవనాన్ని పరిశీలిస్తూ ఒక్క నిముష మాట్లా ఉండి,

    ' ఎవ్వరికి యెప్పుడూ దొరకని నీ సూక్ష్మాచ్చాదిత ప్రాతఃకాల దర్సనం నాకు లభించింది' అని తమితో అస్పష్టంగా పల్కుతూ, సుడిగాలిలా నన్ను చుట్టివచ్చినాడు. రక్తం నా ముకంలోనికి పోటెత్తుకొచ్చింది. నా చూపుల్లో యెర్రమంచులు కప్పినవి నా వొళ్ళు వివశత్వం పొందింది. నా యౌవనం ఒక్కసారి ఉప్పెనలా యెగిసింది. వళ్ళు వేడెక్కిపోయింది. అప్రయత్నంగా ఒక అడుగు ముందుకు వేయబోయినాను. ఇంతలో నాకు ఫెళ్ళున మెలకువ వచ్చినట్లయింది. వెనక్కు అడుగు వేసి ఆయాసంతో తూలుతూ నా పందిరి మంచపు పక్క మీదకి వచ్చి పడ్డాను. నేను భరించలేని యేదో బాధ నన్నలమి, నన్ను మూలమంతా కదిల్చి వేసే యేడుపు నన్నావరించినది. ఎప్పుడూ నే నేడ్చి యెరుగను. అప్పుడు నిశాపతి భయంతో నా వద్దకు త్వరగా వచ్చినాడు. తెల్లబోయి అట్లే నిలుచుండిపోయినాడు.

    ' హేమం, నేను మృగంలా ప్రవర్తించాను. నన్ను క్షమించు. నా ప్రేమ అలాంటిది, అంత అద్బుతమైంది. అంత ఉత్కృష్టమైనది. సంగీత కచ్చేరి అయిందో లేదో ఢిల్లీనుంచి పరుగెత్తుకొచ్చాను.'

    ' ఓయి వెర్రివాడా, యీ దినం నాకేదో భయంకరమైన ఆనందం కలిగింది. నీవు నన్ను అలమికొని వచ్చినపుడు నాకేదో విపరీతానందమూ, వింత భయమూ ఆవరించినవి. అదే ప్రేమంటావా?'

    ' నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ పెదవుల్లోని ఆ మాటల్నేతనివి తీరా ఆస్వాదించి దివ్యసంగీతంగా వెదజల్లుదామనే కాంక్ష కలుగుతుంది.'

    నిశాపతి నా పాదాలకడ మోకరిల్లినాడు. అతని తల నా కాళ్ళకు తలగడం గ్రహించి నా కాళ్ళు రెండూ పైకి లాక్కొన్నా. ' నిశాపతీ , ఆ

సోఫాలో కూర్చో. అభిమానాలు, మాయలు లేకుండా మన యిద్దరి సంగతీ యిప్పుడే విచారించుకొని ఒక నిర్ణయాని కొద్దాము.' అని నేనన్నాను.

    ' ఆకాశనదీ స్వర్ణ పద్మాలు పోగుచేసి నిన్ను కైవసం చేసుకోవడానికి యే దివ్యుడూ తగడు. నేను హీనుణ్ణి, ఆశాజీవిని.'

    ' తగివుండటం ఉండకపోవటం నిర్ణయము అనేక విషయాల మీద ఆదారపడి వుంటుంది ' అని అంటూ కాశ్మీరపు పాష్మీనాశాల్వ నాచుట్టూ కప్పుకొన్నాను.

    ' చిన్నతనమునుంచీ నా గొంతుక అత్యద్బుతంగా ఉంటుందని అందరూ, అన్నారు. ఆ చిన్ననాడే తల్లిదండ్రులకి చెప్పకుండా, టిక్కెట్టు లేకుండా అలహాబాదు పారిపోయాను. నా గొంతుకలోని తీపితనాలు గమనించి అలహాబాదులోని ఒక సేట్ జీ ప్రసిద్దుడైన బాబూరావు త్రిపాఠీ దగ్గర సంగీతం నేర్చోకోమని నన్ను లక్నో పంపించాడు. ఏకదీక్షగా పదేళ్ళాయన వద్ద నేర్చుకొన్నాను. మూడేళ్ళు కస్టపడి సారంగి నేర్చుకొన్నాను. ఉత్తరాదిలో ప్రసిద్ది కెక్కిన అన్ని బాణీలూ కైవసంచేసుకున్నాను. మాయింటి పేరైన చతుర్వేదులను ' చతుర్వేది ' యని పెట్టుకొన్నాను. ఉత్తరాది ' చతుర్వేది ' వారు నేనూ ఒక్కటేనని ఉత్తరాదివారి ఊహ. ఇతడు మహోత్తమ గాయకులలో ముఖ్యుడు అని జేజేలు పొందాను. మద్రాసు వచ్చి నిన్ను చూసాను, నీకు దాసుణ్నయాను. అప్పటినుంచి మదరాసే నా ముఖ్యమకాముగా చేసుకొన్నాను. '

    ' అవును. ఇవన్నీ నాకు తీర్ధమిత్రుడే చెప్పాడు.'

    ' ఇవన్నీ తీర్ధమిత్రుడు నీకు చెప్పి ఉంటాడు. ఎవరైనా చెప్పివుండవచ్చు. కాని నే నిదివర కెవరికి తెరిచి చూపని కవాటాన్ని తెరిచి నా జీవితంలో అతి నిగూఢమైన చరిత్ర భాగాన్ని యీ దినము నీకు గోచరింపచేస్తున్నాను. అదే నా పరమ నివేదన నీకు. నా సంగీత కళాపరిశ్రమలో ఒక్కొక్క పథమే గడిచి పైకి పోతూండే రోజులవి. అందరూ నన్ను ప్రేమించేవారు, గౌరవించేవారు. నా ప్రతిభకు, నా శక్తికి ఆశ్చర్యపడిపోతుండేవారు. నాకు యౌవనం వచ్చింది. కళాజీవిని కామవాతావరణం యెప్పుడూ చుట్టుకొని, ఇంత సందుదోరికితే లోనికి ప్రవేసించి, అతని జీవితంలో తానే రాజ్యంచేసే స్తితిని తీసుకొస్తుంది. నా కంఠమహిమ, నా గానవై చిత్రి సందర్శించి యెందరో బాలికలు పాదక్రాంతలయినారు. నా బ్రహ్మచర్యాశ్రమం పాడు చేసుకొన్నాను. నా గానప్రజ్ఞతోపాటు నా కామతృష్ణ మహారణ్యం అయినది. ఇప్పటికినాలుగేళ్ళక్రితం నిన్ను చూచినంతవరకూ నా తుచ్చ జీవితము నన్ను పోదివికొనే ఉన్నది. అద్బుతములైన నీ కన్నులు నా వైపు తిరిగి, పరమ తేజాలైన నీ చూపులు నాపై ప్రసరించి ఆ పిశాచాన్ని దగ్ధం చేసివేసినై ఆనాటినుంచీ నీ రూపమే తల్చుకొంటూ, నీ నామమే జపం చేసుకొంటూ, నీకోసం నిజమైన బ్రహ్మచారినయ్యను. నువ్వు మన పెళ్లికై అనుమతియ్యి. నా గానశక్త, నా జీవితం నీ రెండు పాదాలదగ్గర సర్వార్పణము చేస్తున్నాను. '

నేను వంచిన తలెత్తి నిసాపతిని చూడలేకపోయాను.' నిశాపతీ, నీ స్నేహము నాకు పూర్ణిమనాటి వెన్నేలలాంటిది. నీ గానము నా జీవితానికే ఆధారమయింది. ఇదివరదాకా నా విషయంలో ఎప్పుడూ నిశ్చయం రాలేదు. స్త్రీ తన యిష్టం వచ్చినట్లు సంచరించవచ్చో, వివాహమే అవసరమో నేను తెలుసుకోలేదు. అవసరమైతే ఆ కోరుకోవలసిన పురుషుడేవరో నేను నిశ్చయించుకోలేదు. మనస్సు ప్రేమించే మనిషి ఒకరు, దేహం ప్రేమించే మనిషి యింకొకరు ఉంటారేమో; అదిన్నీ తెలియదు. కాని....నేను....నాకు....నీవంటే....విపరీతమైన....సో.....ద...ర....భావం మాత్రముండేదని....'

    నిశాపతి క్రుంగి నిట్టూర్పు పుచ్చి సోఫా హస్తం మీద నున్న తన హస్తంపైన తలవాల్చి, ధ్వని లేని గుండె బద్దలయ్యే యేడ్పులో ద్రవించి పోయినాడు. భయంతో అతని వద్దకే వెళ్ళలేకపోయాను.

    ఇంతలో ' అమ్మాయీ ! ఆరున్నరయినా క్రిందికే రాలేదని బోయీలు చెప్పటమువల్ల యెలాగున్నావో చూదామనివచ్చాను' అని మెట్లకు వెళ్ళే గుమ్మంలోనుండి అనిన త్యాగతి మాటలు వినబడినవి. ' ఇదిగో వస్తున్నాను. నిశాపతి వస్తే యేదో మాట్లాడుతున్నాను' అని నేను స్నానాల గదిలోనికి పరుగెత్తాను. నేను స్నానంచేసి బట్టలుకట్టి వచ్చేవరకు నిశాపతి యిదివరకు కూర్చున్నచోటనే కూర్చుని ఉన్నాడు.

    ' నా స్నానాలగాదిలోకి వెళ్ళి ముఖం కడుక్కొని రావయ్యా నిసాపతీ!నేను క్రింద ఉంటాను. నీకూ నాకూ యింతవరకున్న స్నేహము యింకను నిత్యమై, నిర్మలమై ఉండాలి! నిన్ను నా సహూదరునికన్నా యెక్కువగా నాకు....సన్నిహితునిగా చూస్తున్నాను' అంటూ మెట్లు దిగి వెళ్ళిపోయాను.

    నిశాపతి అక్కడే మ్రాన్పడి నిలుచుండిపోయాడు.

                                                                                                                       14

    నిశాపతి ప్రణయరాగాలాపంలోంచి త్యాగతి మాటలు నాకు పూర్తిగా మెలుకువ తెప్పించినవి. రేడియం చూపులు కలిగిన త్యాగతి చూపులకు కూడా నిశాపతికీ నాకూ జరిగిన సంగటన గ్రహించడానికి వీలులేని పద్దతిగా నేను మేడ దిగాను. త్యాగతి యేమీ తెలియనివాడిలాగే కనబడ్డాడు. అయినా నాలుగు రోజులు పోయిన తరువాత మేమిద్దరమే యింట్లో భోజనం చేసే ఓ మద్యాహ్నం వేళ, ' హేమాదేవి, నిశాపతిని నీవేమన్నావు?' అని అడిగినాడు.

    ' ఏమయ్యా, అలా అడుగుతున్నావు?'

    ' నిశాపతి మొన్న నాతో అంతా చెప్పినాడు.'

    ' ఏమి చెప్పాడు?'

    ' ఈ మహాయుద్ధంలో విజయ దివ్యమూర్తియై నిశాపతి మనకు కనబడతాడు. లేదా ఇంకనూ అదోగతికిబోయే పరమరాక్షసుడై మన కంటికి కనబడకుండా పోతాడు.'

త్యాగతి మాటలు నా కర్ధమవుతున్నా అర్ధం కానట్లే నటించాను. 'నిశాపతికీ యుద్దానికీ సంబంధ మేమొచ్చిందీ?' అన్నాను.

    ' మొన్ననే మొదలుపెట్టిన ఇంగ్లండు, ఫ్రాంసు, జర్మన్ నూతన సంగ్రామానికీ నిసాపతికీ యేమీ సంబంధం లేదని నీకూ తెలుసును నాకూ తెలుసును. నిశాపతి నిన్ను వాంచ్చించిన విషయమూ, నీవు కాదన్న విషయమూ నేను గ్రహించాను. నీ జీవితం ఒక ఆనందపధంలో విహరించాలంటే అతడు నీకు సరియైనవాడు. మొదటి దినాల్లో పరివ్రాజకుడై, సంగీత సత్యాన్వేషణలో, చీకట్లో దారి తడుముకున్నాడు. ఈనాడు నిశాపతి ఉత్తమ పధం చేరినాడు. అతన్ని వీ వెందుకు వివాహం చేసుకోగూడదో నా కర్ధం కావడంలేదు.'

    ' నీ దగ్గర మే మేమీ రహస్యాలు దాచుకొనేందుకు వీల్లేదన్నమాట, అతడు చెప్పినాడా నీవే గ్రహించావా?'

    ' అతడు చెప్పలేదు హేమా! ఈ రహస్యమతని కతి పవిత్రమైనది.'

    ' నీవే గ్రహించావూ? అప్పడే అనుకున్నాను! ఒక వస్తువు మంచిదే. ఆ వస్తువు నీ కిష్టమో లేదో ఏదైనా ఒక విచిత్ర సంఘటన జరిగినపుడు గాని తెలియదు.'

    త్యాగతి మౌనంగా ఉన్నాడు.

    ఆ రోజు ఉదయము ఢిల్ల్లీ నుంచి రావదముతోనే, తాను రాత్రెలాగో గడిపి ఉదయమే నేను నిద్రలేవకుండానే నన్ను వచ్చి లేపాడు. అంతకు ముందే ఎప్పుడో మా నాన్నగారిని కలుసుకొన్నాడట. మా అమ్మగారు కుశల ప్రశ్నలు వేసిందట.'

    ' మీ అమ్మగారి దయాంతఃకరణలు మమ్మల్ని ముంచి తేలుస్తునే! ఉంటవి.'

    ' అతని రాక నాకు చాలా సంతోషమైంది. నిద్ర మంచం మీద నుంచి వచ్చి తలుపులు తీశాను. తన ప్రేమ తెలుపుతూ నన్ను సుడిగుండంలా కౌగిలించుకోవాలని ప్రయత్నించాడు.'

    త్యాగతి మౌనం.

    ' మొట్టమొదటలో నా యౌవన రక్తం పొంగింది కాని, మరుసటి క్షణంలో నిశాపతి అంటే నాకేమీ ప్రణయం లేదని, అతడు నాకు పురుషుడు కాదని స్పష్టంగా, నిస్సందేహంగా తోచింది. అతన్ని ఆపుచేసి ఆ సంగతి....'

    ' అతనితో చెప్పావు. ఎంత కఠిన హృదయమమ్మా నీది? అయినా ధైర్యం కలదానవు. నీవు సంపూర్ణంగా నేటి కాలపు మనిషివి!'

    ' ఆ మర్నాడాత డెక్కడకో వెళ్ళిపోయినాడు.'

    ' ఔను. మైసూరులో నందిపర్వతానికి వెళ్ళినాడు. నీవు తిరుగులేని నిశ్చయానికి వచ్చినట్లేనా ? అతడు పెండ్లి చేసుకొంటానన్నాడు. నీవు కాదన్నావు. జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయ మిది, నీవు తొందర పడలేదుకదా?'

అలాంటి విషయాల్లో తొందరగానే నిశ్చయానికొస్తాము. రావడం తొందరే కానీ, వచ్చినది మాత్రం తిరగని నిశ్చయం.

    చాలా సేపటివర కిద్దరమూ మౌనంగానే ఉన్నాము.

    నా హృదయం మహతివీణే కాదు. మహామహతివీణె. వేయి తీగెలతో, వేయి మెట్లతో లోకాలు ఆవరించుకొన్న విప్రకృష్టమైన మహా మహతివీణె. ఆ అద్బుత పల్లకి తంతులలో తెలిసో తెలియకో పంచమ సర్వపూరితమైన ప్రాణ తంత్రిని మీటి నా జీవితాకాశంలో కాకలీ స్వరాలు మారు మ్రోగించినాడు త్యాగతి. ఎవరీ త్యాగతి? రాత్రల్లా సగం తెలిసిన నిద్ర. కలలుపూనిన కాళరాత్రి. గంభీర రూపాలు ఆవహిల్లిన అనంతదాయము. అందులో ఎచ్చటనో ఉన్నాడితడు.

                                                                                                                      15

    నాకు యిద్దరు యువతీమణులు స్నేహితులున్నారు. స్నేహితులంటే చాలా సన్నిహితురాండ్రై నాతో జీవికాజీవులులాగ మెలిగేవాళ్ళని నా అభిప్రాయం. వీళ్ళు కాక నాతో చదువుకున్నవారు, నా సతీర్డులు అయిన చెలిమికత్తెలు చాలామంది ఉన్నారు. అందులో కొందరు కొంచెం దగ్గరగా ఉంటారు, కొందరు కొంచెం దూరం, ఇంకా కొందరు ఇంకా కొంతదూరంలోను ఉంటారు.

    నేను కాలేజేలో టెన్నిస్ బాగా ఆడేదాన్ని. విద్యార్ధినీ బృందంలో నన్ను మించిన ఆటకత్తెలు లేనేలేరు, వరుసగా రెండేండ్లు నేనె ఛాంపియన్ షిప్ టెన్నిస్ కప్పు విజయం పొందాను. పరుగులో దిట్టమైన బాలికను. సంచి పందెము వగైరాలో ఒకటో స్థానమో, రెండో స్థానమో వచ్చేది. ఆ ఆటల సందర్బంలో ఎందరో బాలికలు స్నేహితురాళ్ళయ్యారు. వీరందరినీ కలుసుకుంటూ ఉంటాను. మా యింటికి విందుకు పిలుస్తూంటాను.

    నాకు అత్యంత సన్నిహితులయిన ఆ ఇద్దరు స్నేహితురాండ్రనూ ప్రాణ స్నేహితురాళ్ళంటాను. మా ముగ్గురిలో రహస్యాలు లేవు. అక్క చెల్లెళ్ళు కూడా అంత దగ్గరగా ఉండరు. అక్క చెల్లెలికి రహస్యాలు చెప్పకపోవచ్చును. చెల్లెలు అక్కకు చెప్పకపోవచ్చును. కాని ప్రాణ స్నేహితురాండ్రు మాత్రం తమ తమ రహస్యాలన్నీ ఒకరికొకరు చెప్పుకుంటారు.

    వెనుక కాలంలో ఆడవారిలో స్నేహితులు అంత సన్నిహితంగా ఉండేవారు కాదట. స్త్రీ తన రహస్యాలన్నీ ఎవరితోనూ చెప్పదనే అంటారు.అందులో నిజం లేకపోలేదు. మా హృదయాంతరాలలో ఉన్న రహస్యాలు సర్వాంతర్యామియైన భగవంతునికే తెలియనియ్యము. కాని చిన్నతనంలో ఈ స్త్రీ విద్యాదినాల్లో నెచ్చెలులకు కాస్త మా రహస్యాలు చెప్పుకుంటున్నాము.

    పురుషులు రహస్యాలు దాచుకోలేరు. ఏ స్నేహితురానితోనో ఎంత నిగూఢ రహస్యాన్నైనా చెప్పేస్తారు. స్త్రీ పురుష సంబంధాలైన రహస్యాలేవన్నా బయటపడ్డాయంటే పురుషుని వల్లనే. అవి సంపూర్ణంగా నమ్ముతాను. ఇంతకూ నాకు ఉండే రహస్యాలేమిటి? నే నేమీ వ్యాపారాలు చేయటంలేదు. ఇంక నాకున్న ప్రణయ కార్యకలాపం అంత నిగూఢమైంది ఏముందిగనకా?

అయినా నా మనసులో ఉన్న రహస్యభావాలు కాసిని, ఆ నా ఇద్దరు ప్రాణ స్నేహితురాళ్ళతో చెప్పుతూ వుండడం, వాళ్ళ హృదయాలు వాళ్ళు నాకు తెలియజేయడం మాకు పరిపాటే. మేం ముగ్గురం ఎక్కడో కలుస్తూనే ఉండేవాళ్ళం.

    అందులో ఓ అమ్మాయికి మద్రాసులో ఒక బాలికా పాఠశాలలో ఆంద్రోపాద్యాయిని పని అయింది. ఆమె రూపు రేఖా విలాసా లంటారా? ఉంటాయి ఒక మోస్తరు. ఆ అమ్మాయి అతి ఆడపిల్ల. చూపులో దగ్గర వస్తువులు కనబడతాయి. అందుకని షార్ట్ సైట్ అద్దాలు పెట్టుకుంటుంది. ఆ అమ్మాయికి నేనె లోకేశ్వరి అని పేరు పెట్టినాను. ఆ అమ్మాయి అసలు ఊరు ఒంగోలు. అసలు పేరు దుర్వాసుల వెంకటరత్నమ్మ. నెల్లూరులో తన చుట్టాల ఇంటికడ ఉండి చదువుకొని, స్కూలు ఫైనలు ప్యాసయి చెన్న పట్నం ఇంటరు చదువుకని వచ్చింది.

    అప్పటినుంచీ నాకూ, 'లోకా'నికీ చూపులతోనే ప్రేమ కుదిరింది. లోకం ఎంత తెలివైనది ! చెన్నపట్నంలో మాయింట్లోనే నాతోపాటే ఉండి చదువుకోమని పట్టుపట్టినాను. మా ఇంట్లోనే భోజనం చేసేది. మా నాన్న గారూ, మా అమ్మగారూ లోకం అంటే ప్రాణం ఇచ్చేవారు. కన్నా కూతురైన నాకన్న వాళ్ళిద్దరి దగ్గరా ఆమె ఎక్కువ చనువుగా ఉండేది. మాయమైపోయిన మా అక్కని మరపించేటంత ఆపేక్షగా వుండేది. మా అక్క ఫోటో తన గదిలో పెట్టుకొని పూలదండలు వేసేది. రెండు మూడుసార్లు మా అక్క బొమ్మను హృదయాని కద్దుకొని కంటినీరు పెట్టుకోవడం కూడా నేను చూశాను.

    లోకమే మా అమ్మనీ, నాన్ననీ సినిమాలకు, నాటకాలకు అడయారుకు, బీచికీ తీసుకువెడుతూ ఉంటుంది.

    మా అక్కను పూర్తిగా జ్ఞాపకం చేసుకోలేను. మా అక్క అమృత మూర్తట. దివ్య సౌందర్యవతట. నా ఆరవఏటనే మా అక్కకు పెద్ద జబ్బు చేసి వెళ్లిపోయింది. మా అక్క, నేనూ ఒక్కటే పోలిక. మా అక్క పోయేటప్పటికి పదహారేళ్ళది. నాకు పదహారేళ్ళు వచ్చినపుడు అచ్చంగా మా అక్కలాగే ఉన్నాను. మా ఇద్దరి ఫోటోలు పక్కపక్కగా పెట్టితే ఒక్కరి ఫోటోలే అని చెప్పవలసిందే. ఏ మాత్రమూ తేడాలేదు. ఆ రెంటికీ.

    మా బావను తలచుకుంటే ఏదో కలలో చూసిన మనిషిలా జ్ఞాపకం వస్తాడు. నన్నస్తమానం ఎత్తుకునేవాడు. మా అక్క అంటే ప్రాణం ఇచ్చేవాడు. మా అక్క మా బావనూ, మా బావ మా అక్కనూ ఒక్క నిముషమూ వదిలి పెట్టి ఉండలేకపోయేవారు.

    నా చిన్నతనంలో మా ఊళ్లోనే ఉన్న మా అక్కగారి అత్తగారింటికి వెళ్ళినా, మా అక్కా, బావా మా ఇంటికి వచ్చినా ఒక్క నిమిషం ఇద్దరూ వదిలి ఉండేవారా! నేను మా అక్క దగ్గరకు వెడితే ఇద్దరూ ఒక కుర్చీలోనే కూర్చునో, ఒక మంచంమీద ఇద్దరూ పడుకొని మాట్లాడుకుంటూనో ప్రత్యక్షం అయ్యేవారు.

ఈ ఈడులో ఆనాడు మా అక్కా, బావల ప్రణయం లోకాతీతమైనదని తెలిసింది నాకు. మా బావ ఇప్పుడెక్కడున్నాడో? బ్రతికివున్నాడో, లేదో ?

ఇంతకూ మా లోకం మా అక్కను ఒక దేవతగా యెంచి, ఆమె ఫోటోను పూజించేది. ఆ ఫోటోపై పూలూ, కుంకుమా చల్లేది. రోజూ ఆ చిత్రానికి పూలదండలు వేసేది.

ఇదంతా మా తలిదండ్రులను టోపీలో వేసుకునేందుకు కాదని నేను నిస్సందేహముగా చెప్పగలను. ఎందుకంటే, ఒంటిగా ఉన్నప్పుడు కూడా మా లోకం నేనుగాని, మా స్నేహితురాండ్రుగాని ఎవ్వరూ చూట్టం లేదను కొన్నప్పుడే అక్క బొమ్మ హృదయానికి అద్దుకొని కళ్ళనీళ్ళు తిరిగిపోతూ వుండగా, ఏదో పెదవులలో గొణుగుకుంటూ కుర్చీ మీద కూర్చొని ఉండేది. మా లోకానికి మా అక్క అంటే అంత ప్రేమ ఎందుకు కుదిరిందో? ఆ ప్రేమకు కారణం ఏమిటో తెలిసికోవాలన్న ప్రయత్నం చేశాను. నేను మా అక్కలా ఉంటానని, మా అక్క పోయేముందు మా బావతో తీయించుకున్న ఫోటోలో మా అక్క వేసిన వేషం నాకు వేసి, లోకం నా ఒళ్లో తల పెట్టుకొని కన్నీళ్ళు కార్చేది.

    ఒకరోజు నేనూ, లోకేశ్వరి నా విద్యామందిరంలో మాట్లాడుకుంటున్నాం. మందగమనంతో అవతరించినది నా రెండో ప్రాణ స్నేహితురాలు సోఫీ. సోఫీ భారతీయాంగ్లబాలిక, ఆమె తండ్రి నీలగిరిలో కాఫీతోటల యజమాని, లక్షాధికారి. తల్లి చిన్నతనంలో ఈమెను కని ఇంగ్లండులో చనిపోయింది. సోఫీ ఇంగ్లండులోనే చిన్న తరగతులు మాతామహుల ఇంట నుండి చదువుకుంది. తండ్రి ఆమెను వదిలి ఉండలేకపోయినాడు. కళాశాల చదువుకు హిందూదేశమే తీసుకువచ్చాడు. ఆమె నాతోపాటే ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంటరు చదువుకుంది. ఇప్పుడు నాల్గవ సంవత్సరము ఎం.బి.,బి. ఎస్. క్లాసు వైద్యకళాశాలలో చదువుతున్నది. తండ్రి, తాతలు ఇంగ్లండులోనే పుట్టినా జీవితాలు నీలగిరి కొండల్లో గడపతంచేత, వాళ్ళు సంపూర్ణంగా భారతీయులే అయ్యారు. సర్ విలియమ్స్ విలియంగారికి సోఫీ ఏకపుత్రిక, ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.

    నాకూ, సోఫీకి ఎందుచేతనో విపరీతమైన స్నేహం కుదిరింది. సోఫీ మగరాయుడు. రూపంలో గాడు సుమండీ! రూపంలో రతీదేవే! తండ్రి థియాసఫిస్టు అవడంచేత ఈవిడా థియాసఫిస్టే, అందువల్లనే ఆమెకూ నాకూ గాఢ స్నేహం అవడానికి కారణం అనుకుంటాను.

    నువ్వు నాతో ఇంగ్లండు రావాలి అని వేధిస్తూ ఉంటుంది.నాకూ వెళ్ళాలనీ ఉంది.

    యుద్ధం అవనీ సోఫీ!తప్పక వస్తాను అన్నాను.

     మనం ఇద్దరం నర్సులుగా చేరిపోదాం.

' నీకు నర్సుపనేమి కర్మం?రేపు డాక్టరు పరీక్ష పూర్తిచేసి, ఏ లేడీ మేజరుగానో వెళ్తావు.'

    ' అందాకా ఈ యుద్దం ఉంటుందా? ఈ జర్మనీ, ఇటీవల పస మనం కూడా కనుక్కోకపోతే ఎట్లా హేమ్ ?

    ' జర్మనీ వాడి చెయ్యి పైగానే ఉంది.రష్యను చావగొడుతూ చొచ్చుకుపోతున్నాడు.'

    ' ఎంత దూరం అట్లా వెళ్ళగలడని?'

    ' మీ ఇంగ్లీషువారూ, అమెరికావారూ తిన్నగా సహాయం చెయ్యక పొతే, రష్యా ఏం చేస్తుంది? రెండో రంగమో అంటే, నిద్రపోతో కూర్చున్నారు ఈ మిత్రమండలివారు. అవతల ఆఫ్రికాలో రోమెల్ విజృంభించింది. ఇంగ్లీషు వారిని పరుగెత్తించి అలగ్జాండ్రియా వద్ద తిష వేసుక్కూర్చున్నాడు.'

    ' ఎంతకాలం వేసుకుంటాడు హేమ్!నేనే వేవల్ నయితేనా అసలు, రోమెల్ ని రానిద్దునా!'

    ' చేతుల్తో స్వయంగా పీక నులుముదువా? లేక కొరడా పుచ్చుకొని వెనక్కు కొట్టి కొట్టి వదులుదువా?'

    అప్పుడు పుస్తకము చదువుకోవడము మాని లోకేశ్వరి మావైపు తిరిగి 'సోఫీ, ఈ యుద్ధం మా భారతీయులకు ఏమీ హృదయ స్పందన కలిగించడంలేదు. మాకు అవసరం కాని ఈ యుద్ధం సంగతి మా హేమ కెందుకు చెప్పు? అని అన్నది.

    సోఫీ : నీ మాటలు, అన్నీ ఎప్పుడూ యింతేనే!గాంధీ మహాత్ముని శిష్యురాలనంటావు. ఆయన పేరు కూడా పాడుచేస్తున్నావు. ఈ యుద్ధం భారతీయులకే కాదు, సర్వ ప్రపంచానికీని. మా బ్రిటీషు వాళ్ళు భారతీయుల్ని అన్యాయం చేయలేదని నేను అనను. మీ డండర్ హేడ్డుల సహవాసం చేసి నాలో ఉన్న బ్రిటీషుతత్త్వం అంతా చంపుకున్నాను. స్లేడుకుమారి శ్రీమతీ మీరాబెన్ గారే నా గురవయింది.దుర్మార్గ శక్తులు నీరసులమీద దాడి వెళ్తే ఆ దుర్మార్గుల మీద సాగించే యుద్ధం, భారతీయుల యుద్ధం ఎందుకు కాదు? భారతీయులు జర్మనీ పక్షం చేరారు కదా!

    లోకే : ఈజిప్టువా రెవరిపక్షం చేరారు? భారతదేశం ఈజిప్టుకన్నాతీసిపోయిందా! ఏం? మనదేశం జర్మనీపైనగాని, ఇటలీపైనగాని కత్తిగట్టి యుద్ధంచేసే స్తితిలో ఉందా? బ్రిటీషువారి పాలన పుణ్యమా అని, భారతీయులు ఎంత నీచస్థితిలోకి వెళ్ళారో అంత నీచస్థితిలోకి వెళ్ళారు. ఆ భారతీయుల పేరున తామే యుద్ధం ప్రకటించారు!

    హేమ : ఏమర్రో! రాజకీయ నీతంతా ఈ పూటే నిర్ధారణ చేసే టట్టునారు మీరిద్దరూను!ఏ త్యాగతిగారో వింటే ఏమంటారు?

    లోకేస్వరికి కొంచెము కోపం వచ్చింది.చురుకుగానే మాట్లాడడం సాగించింది. కాని, మా మాటవల్ల చప్పున కరిగిపోయి, సోఫీని కౌగిలించుకొని ' సొఫీ ! ఏదో కాస్త చురుకుగా మాట్లాడాను క్షమించాలి' అన్నది.

    సోఫీ లోకేస్వరిని గుండెకదుము కొని ' లో !నీకూ కోపము లేదు,నాకూ కోపము లేదు. నువ్వు వాదించడము ప్రారంభింస్తే నేనూ మళ్ళీ సిద్దంగా ఉన్నాను. వాదనలకు, ప్రేమకు సంబంధం యేమిటి?' అని కాక లీస్వరాన పలికినది'

    హేమం : బాగుందిలెండి నాటకం! మీ యిద్దరూ మన తీర్ధమిత్రుని లాగే వాదించారు.

    సోఫీ : తీర్ధమిత్రుడంటే జ్ఞాపకం వచ్చింది. నిశాపతి ఎక్కడా కనపడడం లేదేమిటి?

                                                                                                                      17

    ఈ ఇద్దరు స్నేహితురాండ్రూ ఆ నలుగురు పురుష స్నేహితులంటే నేనున్నంత ఎక్కువ అన్యోన్యంగా ఉండరు. చస్నువుగానే ఉంటారుకాని, ప్రాణ స్నేహంగా ఉండరు. ఒక్కొక్కప్పుడు ఏడుగురం కలిసి సినిమాలకు వెళ్తాం. ఒకనాడు ఏ ఎణ్నూరు రేపు బంగాలాకోపోయి, స్వంతంగా వంటలూ, పిండి వంటలూ చేసుకుని అల్లరిచేసి వస్తుంటాము.

మా లోకేశ్వరి మాత్రం నిశాపతి సంగీతం అంటే చేవి కోసుకుంటుంది. సోఫీకి,నిసాపతికి భారతీయ సంగీత సంప్రదాయాన్నిగూర్చీ వాద ప్రతివాదాలు జరుగుతూ ఉండేవి.సోఫీ పాశ్చ్యాత్య సంగీతం బాగా నేర్చుకుంది.ఆమె గొంతుక మంచి సోఫ్రానో, కాక లీస్వరయుక్తము.

    ఇంక నా సంగీతం అంటారా, నేను పట్నం సుబ్రహ్మణ్యంగారి శిష్యునికి శిష్యుడైనా నీలకంఠయ్యగారి దగ్గిర గాత్రం నేర్చుకున్నాను. కర్ణాటక బాణిలో అందెవేసినచేయనే నన్ను అంటారు. వీణ ఓ మోస్తరు బాగానే నేర్చుకున్నాను. మా లోకేశ్వరి కర్ణాటక బాణి అంటే అంత ఇష్టపడదు. కాని ఉత్తరాది బాణీ అంటే మహా ప్రేమ. నిశాపతి దగ్గిర శుశ్రూష నెరపి, చక్కగా పాడుతుంది. సినిమా పాటలు కన్నవీ బాలవీ, కురిషీద్ వీ, దేవికా రాణివీ,శాంతా ఆప్టేవీ, శాంతా హుబ్లికర్ వీ పాటలు అచ్చం వారివలెనే పాడుతూంటుంది. కళ్ళు మూసుకొని ఆ పాటలు వింటూంటే, ఆయా తారలు పాడుతున్నారని అనుకోవలసిందే!

    తీర్ధమిత్రుడు లోకేశ్వరి అంటే కొంచెం విసుక్కుంటాడు.కాని సోఫీ అంటే చెవి కోసుకుంటాడు.సోఫీని వెన్నంటుతాడు.ఆమె అందాన్ని పొగడుతాడు. ఆమె ఏదిచేస్తే అదే బాగుందంటాడు. అతణ్ని సోఫీ చివాట్లుపెడుతూ ఉంటుంది. అట్టే అల్లరి చేస్తేరెండు మూడు సార్లు చెంపకాయలు కూడా తగిలించింది.

కల్పమూర్తి లోకంతో స్నేహంగా ఉంటాడు.కాని సోఫీ అంటే కొంచం సిగ్గుపడతాడు!ఇంగ్లీషు గట్టిగా మాటలాడలేడు.కాబట్టి సోఫీ ఏమనుకుంటుందో అని అతనిభయం. అంచేత సోఫీ ప్రశ్నలు వేస్తూ ఉంటే ' అవును ' కాదు ' అనే అంటాడు. అయినా సోఫీ కల్పమూర్తి అంటే చాలా గౌరవం చేస్తుంది. అతనిమూర్తిత్వం గ్రీకులమూర్తిత్వం అంటుంది. అతడు పూర్వజన్మలో ఏ ఎథీనియన్ వీరుడో అని, ఆనందపడుతుంది. కల్పమూర్తి ఏ ఎన్నేరులోనో, సముద్రంలోనో ఈదుతూ ఉంటే, అతనితో పాటు ఈదుతూ, మా అందరికన్న ముందుపోతుంది.సోఫీ.

    నేనూ బాగానే ఈడుతాను. నేనూ మా సోఫివలెనే పాశ్చ్యాత్యుల ఈత దుస్తులు తొడిగి, ఈతకు వెడితే నాతో ఉంటాడు తీర్ధమిత్ర్డుడు.త్యాగతి సాదారణంగా ఈదడు. బాగా ఈత వచ్చునన్న సంగతి నాకేలా తెలుసునంటే ఓ రోజున మేమందరమూ ఎన్నేరులో పడవలమీద వెళ్ళి ఈత ప్రారంభించాము. త్యాగతీ, నిశాపతీ లోకేస్వరీ పడవలమీద ఉన్నారు.లోకేశ్వరికీ,నిశాపతికీ ఈత అంటే హడలు.

    ఇంతలో పక్కన వెళ్ళే ఓ పల్లెవారి పడవలోంచి ఓ పిల్లవాడు మమ్మల్ని తెల్లబోయి నిల్చుని చూస్తూ, నీటిలో పడ్డాడు.వాడు పదవ వేటికి దగ్గిరగా తేలుతున్న మా పడవలోంచి త్యాగతి నీటిలోకి ఒక్క ఉరుకు ఉరికి,ఆ కుఱ్ఱకుంక దగ్గరకు బార ఈతలో పోయాడు. వాడికీ ఈత బాగా వచ్చును కాబోలు బెండులా తేలుతూ ఈదుతున్నాడు.త్యాగతి దిట్టమైన ఈతకాడని అప్పుడు తెలిసింది.

                                                                                                                     18

    నిశాపతి వెళ్లిపోయాడని సోఫీ ప్రశ్న వేయగానే జవాబు చెప్పాను.

    సోఫీ :వెళ్ళిపోయాడంటే?

    నేను :నందిపర్వతం ఆ ప్రాంతాలకు వెళ్లిపోయాడట.

    లోకే :ఎందుకు వెళ్ళాడు ?

    నేను :సరే !మీ యిద్దరూ లాయరు ప్రశ్నలు వేస్తూ ఉంటే నేను జవాబు చెప్పకపోతే బ్రతకనిస్తారుగానకనా ! వినండి. నిశాపతి నన్ను ప్రేమించాడు. పెళ్ళి చేసుకోమని కోరాడు. నేను పెళ్ళిచేసుకోనన్నాను.అతడు కించపడి, వెళ్ళిపోయాడు.

    అక్కణ్నుంచి వాళ్ళప్రశ్నలు, నా జవాబు, జరిగిన సంగతి అంతా చెప్పాను.వాళ్ళు తెల్లబోయారు.

    సోఫీ :హేం,నీ కోసం ఏ నలుగురు పురుషులు కాసుకుని ఉన్నారంటావా?

    లోకే :తీర్ధమిత్రుడికి యిదివరకే పెళ్ళి అయినది.అతని భార్య చక్కని చుక్క.ముగ్గురు ముద్దులు గులికే వెన్నముద్దల పాపలు. రెండేళ్ళ వాడు అతనికి కొడుకున్నాడు. ఎనిమిదేళ్ళూ, అయిదేళ్ళూ గల బాలిక లిద్దరు. కనక తీర్ధమిత్రుడికీ, మన హేమానికి పెళ్ళేమిటి ?ఇక కల్పమూర్తి? హేమం తల్లి

దండ్రుల్ని అడిగితే వాళ్ళిద్దరూ తమ అభ్యంతరం లేదనీ, అమ్మాయి ఇష్టమనీ అన్నారు.ఈఅమ్మాయిగారు జవాబు చెప్పదు.పైగా కల్పమూర్తిని ఏడిపిస్తుంది.అతణ్ణి వదలదు. అతనికి ఆశా వదలదు.

    సోఫీ :పాపం,వట్టి వెర్రివాడు.త్యాగతి నాకో పెద్ద సమస్యగా కనబడుతాడు.

    హేమం :ఆంగ్ల స్త్రీలకు భారతీయ పురుషు లెప్పుడూ సమస్యలే వీళ్ళకు.

    సోఫీ :భారతీయ స్త్రీలకు ఆంగ్ల పురుషులు సమస్యలు కాదా అంట?
            
    లోకే :మీ మగవాళ్ళు మాకు సమస్యలు కారు. మా వాళ్ళే మాకు పెద్ద సమస్యలు. మీ జాతిమాత్రం మాకు పెద్ద సమస్య. మాదేశం మీ వాళ్ళు ఒదలరు.ఏవో మాటలంటారు. మీ జాతి మాట నిలబెట్టుకొనే జాతి అంటారు.మా విషయంలో మాత్రం మీ మాట నీటిమూటే !

    సోఫీ :భారతీయులు ఒక్కమాటమీద నిలుస్తారు!మీ గాంధీ గారికే రోజుకో కొత్త గొంతుక.ఇవాళ ఓటి అంటాడు,రేపు ఓటి అంటాడు.

    లోకే :గాంధీమహాత్ముణ్ణి అంత బాగా అర్ధం చేసుకున్నావు!

    నేను :మళ్ళీ మీ ఇద్దరూ వాదం మొదలు పెట్టారూ; మా మేడ కాస్తా కదలిపోయిందేమో చూస్తాను.అసలు త్యాగతి సంగతి మొదలుపెట్టి చటుక్కున గాంధీగారి దగ్గిరకు వచ్చి ఊరుకున్నా రేమిటి మీ యిద్దరూ ? ఇంతలో త్యగతే మా దగ్గిరకు వచ్చాడు.

    లోకే : మిమ్మల్ని గురించే మాట్లాడుతున్నారు.మీకు వెయ్యేళ్ళు ఆయుర్దాయం.

                                    19

   త్యాగతి : ఏమిటి అంత తీవ్రంగా మాట్లాడుతున్నారు?

    లోకే : గాంధీమహాత్ముని గురించి వాదన వచ్చింది,ఇద్దరికీ.ఆమె వాదన సంగతి త్యాగతికి విపులంగా చెప్పింది లోకేశ్వరి.

    త్యాగతి : హిమాలయాను గురించి వాదన వస్తే ఎంతో,మహాత్ముని గురించి వచ్చినా అంతే! అమ్మా సోఫీ,ఆంగ్లరాజ్యానికి చర్చిల్ ఎప్పుడు ముఖ్య పురుషుడు. అతను లేకపోతె ఆంగ్లేయులు యుద్ధం విజయం పొందటం దుర్ఘటంకదా! కాని, ఆయన చిత్తవృత్తులు మనం అర్ధం చేసికోగలమా?మా మాట అలా ఉంచు.మీ ఆంగ్లజాతిలోని ప్రముఖులు అర్ధం చేసికోగాలరా? అలాంటి సందర్భంలో ఆధ్యాత్మిక దేశమైన మా దేశంలో, ఆధ్యాత్మిక పురుషుడైన మహాత్ముడు మీకు అర్ధంకాడు.కాని మీలోని మహానుభావులనేకు లాయన్ను అర్ధంచేసికొన్నారు. అలాగే మాలో కొందరు చర్చిలును సంపూర్ణంగా అర్ధం చేసుకొన్నావాళ్ళూవున్నారు.

    నేను :భౌతికం, ఆధ్యాత్మికం అంటావు. ఏమిటా భౌతికమూ,ఆధ్యాత్మికమూ?

    త్యాగతి :హేమం !ఒక సంగతి అడుగుతాను. మనకూ,పశువులకూ తేడా ఏమిటి ?

    నేను :పశువులకు మెదడులేదు,మనకు మెదడు వుంది.

    త్యాగతి :పశువులకూ మెదడు వుంది కాని అది చిన్నది. మనుష్యుల మెదడంత క్లిష్టమైనదికాదు, సరే. మనుష్యుడూ తన బిడ్డల్ని ప్రేమిస్తాడు.జంతువులూ ప్రేమిస్తవి.ఆ రెంటి ప్రేమలో తేడా వుందా?

    సోఫీ :ఉండకేం ? జంతువు అవసరం ఉన్నంతసేపే, తర్వాత ప్రేమనే మరచిపోతుంది.

    త్యాగతి :కాని మనుష్యుడు జీవితం వున్న దాకా ఎందుకు ప్రేమిస్తాడు? చచ్చిపోయిన చుట్టాల్ని,స్నేహితుల్ని,గొప్పవారిని ఎందుకు ప్రేమిస్తాడు? దేశం అని ప్రాకులాడుతాడు,మానవలోకం అని గగ్గోలు పడతాడు. ఎందుకు సోఫీ?

                                                                                                                    20


    ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ ఉండే సంబందానికీ -మతానికీ ఏం చుట్టరికం ఉందీ? నైతికం అంటే ఏమిటి? కామపరమైన స్త్రీ పురుష సంబంధము నైతికంగా మానవుల్ని అధోగతిలో పడేస్తుందని ఎలా నమ్మగలము?

    ఈ ఆలోచనలు ఒంటిగా ఉన్నప్పుడల్లా నాకు వస్తూనే ఉన్నాయి.ఈ విషయాల గురించి నాతో సమానంగా ఆలోచిస్తుంటాడు తీర్ధమిత్రుడు.నైతికమనేది మానవులలో ఒకరి కొకరు కష్టం కలిగించకుండా ఉండటము.అందుకనే మనుష్యుణ్ణి మనుష్యుడు చంపడము తప్పైనా,వారూ వీరూ ఒప్పుకుంటే యుద్దంలో ఒకర్నొకరు చంపుకోవచ్చును.కాని అది దేశపరం కావాలి, అంతే.

    అలాగే స్త్రీ పురుష కామసంబంధము ఈ పక్షం ఆ పక్షం ఒప్పుకుంటే నీతిదూర మెట్లా అవుతుంది? పిలిచేవారు పిలవబడేవారు ఒప్పుకొని కదా భోజనానికి వెడుతున్నారు ?అల్లగే పిలిచేవారు పిలవబడేవారు ఒప్పుకుంటే, స్త్రీపురుష సమాగమం నీతిదూరం కాదనే నాకు తోస్తూ ఉంటుంది.

    ఈ విషయంలో నాకూ,త్యాగానికీ భేదాభిప్రాయాలున్నాయి.మా కల్పమూర్తి ఈ వాదన వచ్చేటప్పటికి చెవులు మూసుకుని పరుగెత్తాడు.ఈ వాదనలో సోఫీ నన్ను బలపరుస్తూనే ఉంటుంది. కాని ఆ బలపరచడం వట్టి వాదన కోసమేనని నా అనుమానం.లోకేశ్వరి మాత్రం తన అభిప్రాయ మేమిటో ఎప్పుడూ చెప్పదు.

    చదువుకోని భారతాంగనల్లో వివాహం ఐనా,స్త్రీ పురుష సంబంధము నైతికానికీ మోక్షానికీ,కొన్ని వేలకోట్ల యోజనాల దూరము ఉందని సాధారణాభిప్రాయం. మనోబలం కాస్త తక్కువగా ఉన్నప్పుడు కొందరు స్త్రీలు మగవాడి మాయలకు లోబడి,ఎప్పుడైనా తమ దేహాల్ని వాళ్ళ కప్పచెప్పడం ఉన్నది. యివి సాదారణ కుటుంబాలలో అప్పుడప్పుడు జరిగే రహస్య సంఘటనలు. అవి లోకానికి కొంచెముగా తెలియవచ్చును.తెలియక పోవచ్చును. అనేక యుగాలనుంచి వచ్చింది కాబట్టి కాబోలు ఈ నైతిక ఆధ్యాత్మికాభిప్రాయం,నేను నాలో ఎంత వాదించుకున్నా నాకు తెలిసియున్నూ తెలియకుండాన్నూ కూడా నా చుట్టూ గోడలు కట్టుతూ ఉంటుంది.

    నాకు ఒక్క పురుషుడున్నూ నచ్చడు,నాలో ఏదో ఒక మహత్తరమైన శక్తి ఉన్నదనీ,నాలోని స్త్రీత్వము అధ్బుతమైన స్వరూపము తాల్చినదనీ,నాలోని స్త్రీత్వము ఒక విధమైన పరిపూర్ణత పొందిందనీ నా చిన్న తనాన్నుంచీ మహావధికమగు భావము పెంపొందిస్తూనే వుంది.ఈ భావమే నా హృదాయలో గీటురాయిమీద గీసి వాళ్ళ పురుషత్వాన్ని పరీక్ష చేస్తుంటుంది,నా మనస్సు.

    నా పురుష స్నేహితులు నలుగుర్నీ ఆ గీటురాయిమీద గీసుకుని స్నేహం చేయలేదు నేను. ఏ కారణాలవల్ల వీళ్ళు నాకు స్నేహితులయ్యారా అని నేను ఆలోచిస్తూంటాను. అయితే స్నేహానికి కారణాలు వెతికితే దొరక్కపోవు.కొన్ని విషయాలు సంభవించడము కారణాలు చూసుకొని సంభవించవు.అవి సంభవించిన తర్వాత కారణాలు వెతికితే దొరుకుతాయి.

    ఆడదానికి ఒక ఆశయ పురుషుడు ఉంటాడు. నాకు వయస్సు వస్తోంది అన్నప్పుడు కామభావాలు కలిగేవి. కాని వాటి తత్వము నాకు ఏమీ తెలియదు.యవ్వనము పొందిన బాలకులు నన్ను చుస్తే నాకప్పుడు ఆనందం.వాళ్ళకు తెలియకుండా వాళ్ళని చూడడమూ ఆనందంగానే ఉండేది.ఈ వికారాలు అనేవి విచిత్రమైన పోకళ్ళు పోయేవి.కరకాగారు వ్రాసినట్లు భారతీయ స్త్రీలకూ,పురుషులకూ కామవికారాలు అంతంత దూరంలోనే ఉంటూ ఉంటాయి.

    ఇంతకూ నా ఆశయ పురుషుని రూపం నాకు దిజ్మాత్రంగానే నా భావ నేత్రాలకు గోచరించేది.కాని,ఇది అని నేను నిర్ధారణ చేసుకునే స్పష్టత లేకపోయేది.యవ్వనం ముద్దకట్టినవాడు, దేహం కండలు తిరిగి,నున్నగా గంధం చెక్కతో చెక్కిన పరిమళం,సౌష్టవమూ కలిగినవాడు.సంతతానందమూర్తి,గంభీర కంఠినర్తితగానం కలవాడు,కళామూర్తి,సర్వ విజ్ఞాన కోవిదుడు,ముఖ్యంగా ధనలేమిలేనివాడు,సకల సద్గుణసంపన్నుడు.

ఇల్లాంటి ఉత్తమ పురుషు దెవ్వరు,ఎక్కడ ? అతన్ని ఊహించుకొని నేనూ పాటలు రాసుకునేదాన్ని.

ఎచ్చటుంటివోయీ ఓ పురుషమూర్తీ!
ఏల రావైతివీవూ !
పసిమి పచ్చని బలము బంగారు పండునో
మిసిమి యవ్వనకాంతి మేలమ్ములాడునో?
ఎచ్చటుంటివోయి !
నీవేన నాధుడవు!నీవేనా ఈ శుడవు!
నీలోననే నేను నృత్య మయ్యేడి దాన
ఎచ్చటుంటివోయీ!


                                                                                                                  20

    మా అమ్మగారూ,మా నాన్నగారూ అదితికశ్యపులు!మా నాన్నగారి పేరు వినాయకరావుగారు.మా అమ్మగారి పేరు వెంకటరామమ్మ.మా అమ్మ మా నాన్న రెండవభార్య అని ఎవ్వరూ అనుకోరు.మా తలిదండ్రులకు నేనే ప్రాణం, నేనే బ్రతుకు. మా అక్క చిన్నతనంలో పోవడంవల్ల అప్పటికి ఆరేళ్ళ బాలికనైన నన్ను తీసుకవచ్చి,ఏడుస్తూ చివికిపోతూ మదరాసులో కాపురం పెట్టారు.మేము వచ్చిన రెండేళ్ళకు మైలాపురంలో అళ్వారు పేటలో పిటాపురంవారి'దేన్మోర్ హౌస్ 'స్థలాల్లో ఒక అందమైన మేడ కొన్నారు మా నాన్నగారు.
    
    సంగీతానికి ఒక మేష్టరు; ఇంగ్లీషు,లెక్కలు,ఫిజిక్సు,కేమిష్టరీ మొదలయిన వాటికి ఒక బి ఏ.; తెలుగు,సంవత్సరం, చరిత్ర,భూగోళంకు ఒక తెలుగు సంవత్సరం ఎం.ఏ.గారు-నాకు ముగ్గురుపాద్యాయులు.నా ఇష్టం వస్తే చదివేదాన్ని.లేకపోతే మానేసేదాన్ని.మా భవనంలో నేనే రాణిని.

    మా నాన్నగారికి అరవై రెండేళ్ళు వచ్చాయి.మా అమ్మకు నలభై మూడు.అయినా వాళ్ళిద్దరూ జీవికా జీవుల్లాగే ఉంటారు.మా నాన్నగారు కొంచెం బొద్దుమనిషి అయినా అట్టే అంత ముసలివానిలా ఉండరు.కాని,చిన్నతనంలో ఉన్న శక్తి అవీ లేవంటూ,ఏదో మూల్గుతూనే ఉంటారు.డాక్టరు వెంకటప్పయ్యగారు వారానికి మూడురోజులు మా ఇంటికి రావలసిందే.

    మా అమ్మగారు నలభై మూడేళ్లకే తల నెరిసిపోయి,పండులా అయిపోయింది.రహస్యంగా నాకు తెలియకుండా ఎంత ఏడ్చేదో!అందు కోసమే ఆవిడ కళ్ళకు ఎప్పుడూ జబ్బులే.ఎప్పుడూ కళ్ళ వైద్యమే!కళ్ళాస్పత్రి కోమన్ నాయరుగారు ఆమెకు ఎప్పుడూ ఏదో వైద్యం చేస్తూనే ఉంటారు.

    మా అక్క కోసం మా అమ్మ ఏడ్వని రోజులేదు.ఎవరైనా చుట్టాలు రావడం మా కందరికీ భయం.ఏ పండుగ వచ్చినా భయమే!నన్ను చూచి కళ్ళు తుడుచుకొని వెడనవ్వు నవ్వుతుంది.ఎందుకే అమ్మ ఆ కళ్ళనీళ్ళు అని అంటే తన కంటిలో ఏదోనలక పడిందంటుంది,అమ్మా మళ్ళీ ఏడుస్తున్నావూఅని నేనంటే ఛా! నేనేడ్చానా నాన్నా !నువ్వు వట్టి వెఱ్ఱి తల్లివి నాన్నా !నీకు అస్తమానం నా కళ్ళల్లో నీళ్ళే కనబడతాయిఅని అంటుంది.
  
    మా అమ్మా మా నాన్నా దుఃఖంచూసి,మా అక్క కోసం అంతా ఏడుస్తారు.ఆవిడ ఎంత మంచిదో అని అనుకుంటాను.మా అక్క పేరు శకుంతల.మా అక్క నాకు అంత జ్ఞాపకం లేకపోయినా మా అక్కను గురించి అన్ని కబురులు వినడంచేత,మా అక్కను చూచినట్లే ఉంటుంది నాకు.

    మా పినతండ్రి పినపాపారావుగా రున్నారు. వారు అప్పుడప్పుడు సకుటుంబంగా మదరాసు వచ్చి మా దగ్గిర ఓ పదిహేనురోజు లుంటూ ఉంటారు.మా పినతండ్రి అంటే మా నాన్నగారి పెదతండ్రికొడుకు.మా పాపారావు

బాబయ్య నవ్యసాహిత్య కవుల్లో ఒకడు. ఆయన కవిత్వం అచ్చంగా రాయప్రోలు సుబ్బారావుగారి కవిత్వంలాగే ఉంటుంది.ఆయన మా అక్కను వర్ణించి చెప్తూవుంటే నా కళ్ళు చెమరించి,నా గుండె దడదడ మని,ఈలాంటి అక్కను ఎట్లా పోగొట్టుకున్నానా అని,నేను రహస్యంగా కళ్ళనీళ్ళు కుక్కుకునేదాన్ని.

    పాపారావు బాబయ్యకూ,మా త్యాగతికీ ఎందుకో విపరీతమైన స్నేహం. మా నాన్నగారు,మా అమ్మ మా త్యాగతితో అంత చనువుగా ఉండడం మా స్నేహితలో కాని కందరకూ ఆశ్చర్యము వేసేది.ఎవ్వరీ త్యాగతి?

    ఓ రోజున మా లోకేశ్వరి,మా పాపారావు బాబయ్యతో చాలాసేపు మాట్లాడి, నా దగ్గరకు వచ్చింది. ఆ రోజున లోకేశ్వరి హృదయంలో ఏదో రహస్య విషయం ప్రవేశించిందని ఆశ్చర్యపడ్డాను.

    మా బాబాయి గుంటూరు వెళ్ళిపోయాడు సకుటుంబంగా.ఆయన కుమార్తెలు-నా చెల్లెళ్ళు-వనకుమారి, రాగామాలికాదేవి నన్ను కౌగిలించుకునిఅక్కా గుంటూరు ఒక్కసారి రావే!పెదనాన్నగారు మదరాసు కదలరు.నువ్వూ మదరాసు కదలవు!వెడితే విశాఖపట్నం ఉపన్యాస పరీక్షకు వెళ్తావు,బొంబాయి వెడతావు,కలకత్తా వెడతావు.గుంటూరుకూ యూనివర్సిటీ వచ్చిందిలే,నీ చదువు పూర్తి అయింది.మా చదువులు చూడడానికయినా రావే!అని అన్నారు.

    వాళ్ళిద్దరినీ కౌగిలించుకొని,ముద్దులు పెట్టి,ఎన్నో బహుమతులు ఇచ్చి పంపాను.రైలుకు వెళ్ళి ఇంటరులో కూచోబెట్టి వచ్చాను.ఇంటికి రాగానే మా లోకేశ్వరి నా చేతిలో ఓ కట్ట పెట్టింది.

    హేమం ఇదంతా ఈ రాత్రే చదువు! నా చేతికి ఈ ఉదయమే వచ్చింది.స్చూలులో పాఠాలు ఎల్లా చెప్పానో,కాని వ్రాత పుస్తకం మాత్రం పూర్తిచేశానుఅని పారిపోయింది.ఆ చక్కని బైండు పుస్తకంపై పేరు చూస్తే 'త్యాగతి కథ'అని వుంది.అది చూడగానే ఎందుకో నా చేతులు వణికినవి.నా కపోలాల చిరుచెమటలు పట్టినవి.

త్యాగతి కథ


              

1సముద్రంలో ఎక్కడనో ఒక అలపుట్టి,పైకి ఉబికి, లోతులకు దిగి ప్రపంచ సంచారానికి బయలుదేరినది. మహా నక్షత్రగోళంలోంచి విడివడి ఒక తేజఃఖండము తన ప్రథమ గ్రహస్థితిని పొందినది.గుంటూరు జిల్లా తెనాలి తాలుకా బట్టిప్రోలు గ్రామంలో ఇప్పటికి ముప్పైఏళ్ళ క్రితము ఒక విచిత్ర ముహూర్తములో నా మొదటి యేడ్పులోకము.రాత్రి నక్షత్రాలు విన్నవి. ఆ ఊరు మా మేనమామల ఊరు. మా అమ్మకు నేను నాల్గవ కాన్పు.