తుపాను/హేమకుసుమసుందరి
తృతీయభాగము
హేమకుసుమసుందరి
1
చిత్రమైన త్యాగతి కథ అంతా చదువుకుంది హేమసుందరి. కాబట్టి శ్రీనాథమూర్తి బావకుడా తన్ను వివాహం చేసికో సంకల్పించుకొన్న స్వయంవర నాయకులలో ఒకడా! అప్పుడే అనుకుంది. తాను త్యాగతిని ఆ హిమాలయం కొండలమీదనుంచి దింపాలని సంకల్పించింది. అదివరకే దిగి ఉన్నాడు. కల్పమూర్తి వగైరాదులవలె ఇతడూ ఒకడయ్యాడు.
ఆమె మొగం జేవురించింది. ఆడదంటే కబళించే ఇడ్డెనని మగ వాళ్ళ ఉద్దేశం. ఆడదే ఎందుకు మగవాళ్ళను ఎన్నుకోకూడడూ?
ఆమె లేచింది కూర్చుంది. మాట్లాడకుండ స్నానానికి వెళ్ళిపోయింది. స్నానంచేసి హేమ సత్యభామలా అలంకరించుకుంది. బావ అని తెలిసికోవడం ఆనందమూ అయింది. త్యాగతి అంటే తాను ఊహించుకునే ఏవో విచిత్ర పథాలన్నీ కరిగిపోయాయి.
కాని తన బావ చరిత్ర ఎంత వుత్కృష్టమైంది. తన అక్కకోసం ఎంత బాధపడినాడు. తనలో శకుంతలాదేవిని చూచాడా? అదీ నిజమే! తాను నూరుపోలికలా తన అక్కే! పడి ముఖ్యమైన వాటిలో మాత్రం సంపూర్ణమైన తేడా! తన అక్క బ్రతికి ఉంటే?
బ్రతికివుంటే నలుగురి పిల్లల తల్లి ఔను. ముసలిదానిలా తయారవును. తాను చూట్టం లేదూ, లోకంలో అందమైనవాళ్ళు అనుకున్న వాళ్ళని! తనతో చదువుకున్న అంబుజమ్మ అప్పుడే ఇద్దరి పిల్లల తల్లి. వట్టి ముసలినక్కలా ప్రత్యక్షమైంది. కాలేజీ పిల్లగా వున్నవాళ్ళు ఎంత టక్కుల టమారిలా గ్రేటా గార్బోలా, మార్లీ నీడిట్రిచ్చిలా, లీలాఛిట్నిసులా వుండేది? ఇప్పుడు ఐదు వందల సంవత్సరాలనాటి ఆడముత్తయిదువులా వుంది.
అదే ఆడదాని బ్రతుకు. మగవాడు టింగురంగా అని ముసలితనం వచ్చేవరకూ పెల్లికోడుకులానే వుంటాడు. మగవాడే ఎందుకు బిడ్డలను కనగూడదు? పోనీ ఆడది బిడ్డనుకంటే, పాలివ్వడం వంతు మగవాడి పాలిట ఎందుకు పడలేదో? అయినా తన అక్క దేవతా స్వరూపిణీ. ఆమె యౌవనంలో ఎలావున్నదో, బిడ్డలు కన్నతర్వాతా అలాగే వుండి వుండును. కాని, తన బావ ఇంత మహోత్తమ శిల్పి అయివుండునా? అప్పుడు ఇరువురు కలిసి ఈ దేశాలన్నీ తిరిగి వుందురేమో?
ప్రపంచంలో ప్రణయమో, ప్రళయమో యింత గడబిడ యెందుకు? రాజ్యాలు, అభ్యుదయం, కళలు, భగవంతుడు అన్నీ వెనకబడతాయి. ఈ ప్రేమ అనే తేమభావంవల్ల ఎడ్వర్డు చక్రవర్తి రాజ్యం వదులుకున్నాడు ఓ అమ్మాయినో, ఓ అవ్వనో చేసుకొనడానికి. యుద్ధం నడిపే నాయకుడు తనకు నచ్చిన ఆడది కనబడితే ఆ రోజు యుద్ధం ఆపాడన్నమాటే. నేపోలియను అంత వీరాధివీరుడు మేరి వారియోన్స్కావల్ల రష్యా యుద్దంలో తన్నులు తిన్నాడు. చివరికి నాశనమూ అయ్యాడు.
ఎందుకు స్త్రీల బ్రతుకు యిలా అయింది? తన బావ శ్రీనాథమూర్తి జీవితం అంతా శకుంతలా భావం నిండి వుందట? శిల్పం సృష్టించే మొనగాడు తానేనా? అందుకో శకుంతల కావాలా? దాని వెనుక సుశీలా, విల్హె ల్మినా, ఇంకా ఓ వేయిమంది ఆడవాళ్ళా? మహానుభావుడు! తాను శిల్పకళ ఉద్దరించకపోతే ప్రపంచం తలక్రిందులవుతుందా? ఈ నంగనాచి మాటలు ఆడది అనలేదా? సత్యరాజా అపూర్వ జైత్రయాత్రలో ఆడమళయాళం అద్భుతంగా వుంది. వస్తే గిస్తే ప్రపంచం అంతా ఆ పరిస్థితులు రావాలి. అప్పుడు శ్రీనాథమూర్తులు, గీనాథమూర్తులు భోగ పురుషులవుతారు. లేదా, వితంతువులై ముక్కులు తెగకోయించుకుంటారు.
రాష్యాయే తనకు బాగా నచ్చిందని హేమ అనుకుంది. ఆడది యెందుకు ఈ కులుకుల మిఠారి కావలసి వచ్చింది? పక్షుల్లో, జంతువుల్లో కులికేది మగపక్షి, మగజంతువూ. పనిచేసే కూలిపిల్ల నలుగురు మగవాళ్ళను పళ్ళూడకొట్టగల బలం కలది కూడా, మగవాడు కనబడేప్పటికి వాలుచూపులు చూస్తుంది. చిరునవ్వుల మాల పెదవులపై వేలాడ వేస్తుంది. పయిట జారవిడుస్తుంది. రష్యాలో మాత్రం ఆడది యుద్దానికి తయారైనా పక్కనున్న సైనికుడి పెదవులమీద ఇంత అధరామృతం కురిపిస్తూనే విరోధి గుండెల్లో అగ్నివర్షం కురిపిస్తుంది.
అన్ వింకర్సులో సింక్లెయిరు లూయీ వ్రాసినట్లు, దేశాల సర్వ వుద్యమాలూ నడిపే స్త్రీలు కూడా పక్కలోకి పశువు కావాలనే అంటారు. కాంగ్రెసు ఉద్యమంలో, యింకా అన్ని ఉద్యమాలల్లో, ఉత్తమనాయిక లెందరో అలాంటి కక్కుర్తుల పాలవటంలేదు? కాలేజీ బాలికల చరిత్ర ఒక పీడకలే! ఆడపిల్లలున్నారని మగవాళ్ళంతా భోగంవాళ్ళలా వేషాలు వేసుకొని అందరూ క్లార్క్ గేబుల్, ఫ్రెడ్ ఆప్టెయిరు, ఫ్రెడ్ మాక్ ముర్రే, డాన్ ఆమెచీలు ఆనుకుంటూ వస్తారు. అందుకు ప్రతిగా ప్రతి బాలిక హెడ్డీలా మేరీ, డయానా డర్బిన్, కాతరైన్ హెస్ బరన్ అనే అనుకుంటారు. ఛీ! ఛీ! 'వుమెన్ ' అనే చిత్రం ఆడవాళ్ళ స్వేచ్ఛా, నిరర్థకత్వం చాడటానికి తీశాడు మగాడు. గుడిపాటి వెంకటచలం చచ్చురాతల స్వేఛ్చ ఆడది అందరి మొగవెధవల పక్కలో పడుకునే స్వేచ్ఛ! దేశంలోవున్న ప్రతి ఆడదీ ఆ నాగమ్మగారి పక్క పండాలనా ఆయన ఉద్దేశం?
ఇంతకూ తనుమాత్రం ప్రపంచానికి అందాల అందాలబరిణ, చిన్నారి చిలక, పొన్నారి పోక అనిపించుకుందామని ప్రయత్నం చేయటం లేదా? అలా తనతోటి విద్యార్థినులలో ఎవరు చేయటంలేదు? నిజంగా ఆలోచిస్తే, సంసారా లల్లో వున్న ఆడవాళ్ళే నయమేమో! నలుగురు బిడ్డల తల్లులు కాగానే అందాల ఊర్వశిలా కనబడాలన్న వాంఛ చంపేసుకుంటారు. బడాయికి మాత్రం చీరలూ, నగలూ కావాలంటారు. తనతల్లి సంగతి చుస్తే అచ్చంగా పేదరాసి పెద్దమ్మలా వుంటుంది. తన అక్క అత్తగారు జుట్టంతా తీయించుకొని సన్యాసిలా లేదా! ఈ ఆలోచనలతో హేమ తల తిరిగిపోయింది. సరే ఇంతకూ త్యాగతి....కాదు....మూర్తి....బావ విషయంలో తన ధర్మం ఏమిటి?
2
శ్రీనాథమూర్తి తన చరిత్ర లోకేశ్వరి చేతుల్లో పెట్టి, హేమకిమ్మని చెప్పిన తర్వాత మూడురోజులు వరకూ మామగారింటికి రాలేదు. రోజూ వచ్చే మూర్తి మూడురోజులు ఎందుకు రాలేదా అని, వినాయకరావుగారు. కారుమీద త్యాగరాజ నగరంలో సైదాపేట దరిదాపుగా వున్న శ్రీనాథమూర్తి ఇంటికి వెళ్ళారు. శ్రీనాథమూర్తి ఒక చిన్న మేడ కొనుక్కున్నాడు ఆ మేడ పక్క వేరే ఖాళీస్థలమూ కొనుక్కున్నాడు. ఆ స్థలంలో శిల్పగృహ మొకటి కట్టించుకొన్నాడు. ఇదివరకే మూర్తి ఇంటికి పది పదిహేను సారులు వినాయకరావుగారూ, వెంకటరావమ్మగారూ వచ్చారు. మూర్తి కట్టించే శిల్పగృహము అప్పుడప్పుడు పర్యవేక్షణ చేస్తూ వుండేవారు వినాయకరావుగారు.
ఆయన కారువచ్చి గుమ్మం దగ్గర నిలవగానే త్యాగతి శర్వరీభూషనుడైన శ్రీనాథమూర్తి లోపలనుండి వెంటనే బయటకువచ్చి, మామగారిని ఆహ్వానించి, లోపలి తీసుకొనివెళ్ళి, తన అతిథి మందిరంలో కూర్చుండబెట్టాడు. ఆ అతిథిమందిరం ఎంతో అందంగా వుంది. అందులో ఒక సోఫాగాని, కుర్చీగాని లేదు. అడుగు ఎత్తు కోళ్ళున్న పెద్దబల్లలూ, ఆ బల్లలపై చక్కని బందరు జాతీయ కళాశాల రత్నకంబళ్ళూ, తివాచీల రంగులకూ, లతలకూ శ్రుతికలిపే అందమైన రంగులూ, లతలూ వున్న పట్టు దిండూ వున్నాయి. లలితంగా నీలవర్ణం పూయబడి వున్నవి. గోడలు. నాలుగు గోడలకూ నాలుగు పెద్దవి కైలాసశిఖర చిత్రలేఖనాలు వున్నవి. బల్లలకు ఎదురుగా అక్కడక్కడ లతలు చెక్కిన మూడుకొళ్ళ పీఠములు, వానిపైన ఆంధ్ర, హిందూ మొదలయిన దినపత్రికలు. భారతి, మోడరన్ రివ్యూ మొదలయిన మాసపత్రికలు, కృష్ణా, సండే టైమ్సు మొదలైనవార పత్రికలు చక్కగా అమరింపబడి వున్నవి. నాలుగు మూలల నల్లచేవ కఱ్ఱల అలంకారశిల్ప విన్యాసయుక్త పీఠికలపై మూర్తి రచించిన మూడడుగుల ఎత్తు రాతి విగ్రహాలు, తాండవకృష్ణుడు, నటేశ్వరుడు, నృత్యసరస్వతి, రంభా నాట్యము విగ్రహాలున్నాయి.
నాయనా, ఈ మూడురోజులు ఎందుకు మా యింటికిరాలేదోయి అని వినాయకరావుగారు శ్రీనాథమూర్తిని ప్రశ్నించారు.
నా చరిత్ర అంతా ఒక పుస్తకంగా రాశానండీ. అది హేమకు చదవమని అందచేశాను.
అమ్మయ్యో! ఇప్పటికైనా రహస్యం బయలుపరచావయ్యా! ఏడాది ఈ నాటకం నడిపావు. నీ దోషాన్ని మేమూ పాలుపంచుకున్నాము. ఇంకేముంది? మా హేమకు ఏమని జవాబు చెప్పను? నన్ను దూది ఏకేస్తుందయ్యా నాయనా!
నేను ఏం చెయ్యాలో నిర్ణయించుకొనే, ఆ పుస్తకం ఆమెకు పంపించా మామయ్యగారూ! హేమ నాకోసంగాని ఏదైనా వంకతోగాని మా యింటికి వచ్చేటంతవరకూ, మీ యింటికి రాను.
ఏమిటీ జర్మనీయుద్దం?
నేను హేమ హృదయంలోని అభిప్రాయాలతో మహాయుద్ధం చేస్తూనే ఉన్నాను. ఇంతవరకూ హేమదే విజయం! అందుకని ఈ ఎత్తు ఎత్తాను. దీని పర్యవసానం ఏమవుతుందో?
ఇందులో మాత్రం మా హేమ నెగ్గకుండా ఉంటుందా?
అదే నేనూ అనుకుంటున్నానండీ.
అయితే ఈలాంటి పని ఎందుకు చేశావు బాబూ?
ఇవన్నీ చివర విజయానికి మేట్లేనండీ!
ఏమో మూర్తీ! మీ అందరి హృదయాలు నాబోటి వాళ్ళకు అగమ్యగోచరం!
మీరు మీ కాలంలో మీ తాతగారి ఎత్తులకన్న కొత్త ఎత్తులు వేయలేదా?
ఎత్తులంటే జ్ఞాపకం వచ్చింది. ఈనాటి చదరంగం ఆటవేరు, మా రోజుల్లో ఆటవేరు.
మీ ఆటకన్న ఇంకో రకంగా మీ తాతగారి ఆట ఉండేదేమోనండి.
సరే మూర్తీ! నీవు యుద్దయాత్రకై ప్రవేశించిన దేశం నీకే తెలియాలి. కాని హేమ హృదయానికి బాధ మాత్రం కలిగించకు తండ్రీ!
మామయ్యగారూ! నేను ఆమె హృదయంలో చింతాకు కదలినంత బాధైనా కలిగించను. కాని ఆమే తనంత తాను బాధ కల్పించుకొంటోంది. అది ఒక రోజున ఆమెకు చాలా కష్టం కలిగించే పరిస్థితులవరకూ తెస్తుంది.
ఏమిటది మూర్తీ! నీవేమీ ఆ విషయంలో చేయలేవా ? ఆమె కొంచెం బాధపడినా నాపని హుళక్కయిపోతుంది బాబూ!
మీరేమీ గడబిడ పడకండి; నేను నా సాయశక్తులా హేమపై ఈగవాలనివ్వను.
అంతా నీదే భారం మూర్తీ! అన్నీ నీమీదే పెట్టుకొని ఉన్నాను. అమ్మ ఏంచేస్తోంది ? 3
నాలుగురోజులు త్యాగతికోసం చూచింది హేమ. అతడు రాకపోవడం తన కవమానమనుకొని మూడో రోజున అందరిమీదా, చిర్రు, బుర్రుమని విసుగుమాటలాడింది. త్యాగతి వట్టి పిరికివాడని అనుకుంది. ధైర్యస్థుడే అయితే మొదటే తాను ఫలానా అని చెప్పి, తన ప్రేమను సంపాదించ ప్రయత్నించవచ్చుకదా! దానివల్ల ఏమి నష్టం వస్తుందో అని ఆలోచించి, తానీ రకంగా అజ్ఞాతవాసం చేశాడు? ఎంత వెదకినా, తనకు మాత్రం త్యాగతి చేసిన పనిలో అర్థం కనబడలేదు.
ఒకవేళ త్యాగతి, ఎవరో పరాయివాడు అని అనుకొని అతనితో స్నేహం చేయడంవల్ల, అతనిమీద తనకు ప్రేమ కలుగుతుందని ఆలోచించి ఉంటాడు. అయితే తన ప్రేమకోసం ఇంత అసంద్దర్భానికి దిగటం కూడా త్యాగతిలో ఉందికాబోలు. అందుకనే సోఫీ, తీర్ధమిత్రుడు, నిశాపతి, ఇంకా తన సహాధ్యాయులైన కుఱ్ఱవాళ్ళు కొందరు త్యాగతి అంటే డాక్టరు హైడ్, జెకిల్ లాంటివాడు అని అనేవారు. కాని త్యాగతి, తన శ్రీనాథమూర్తి బావ అంతహీనుడెప్పుడూ కాడు. గాంధీమహాత్ముడు తన జీవిత చరిత్రలో అన్ని విషయాలు నగ్నంగా చెప్పాడు. అలాగే మూర్తి బావా చెప్పాడు. అతని ఆలోచనలూ, అతని జ్ఞానమూ, అతని కళాశక్తీ, అతని హృదయమూ, ఆత్మా నిర్మలమైనవి. లోకప్రఖ్యాతి సంపాదించిన పుట్టిన మహాపురుషులలో అతడు ఒకడు. అలాంటి ఒక ఉత్తమ పురుషుని పరోక్షంలో న్యాయవిచారణచేసి, శిక్ష వెయ్యడానికి ఎవరికి అధికారం ఉంది?
ఒకవేళ తన్ను ప్రేమించాడనుకున్నా, తనలో తన అక్కగార్ని చూచాడు. తన పోలిక అచ్చంగా తన అక్కపోలికే అవడంచేత తన్నతడు వాంఛించాడు. లేకపోతే తనకై తన్ను ప్రేమించకే ఉండునా? అది మాత్రం నిజమైన ప్రేమ అని ఎలా చెప్పగలం? తన్ను తననుగానే ప్రేమింపని ప్రేమను తాను మాత్రం ఎలా అందుకోగలదు? ఎంతమంది తన్న్జు భార్యగా, స్త్రీగా వాంఛించటంలేదు? అలాంటి సందర్భంలో తన బావలాంటి ఉత్తముడు తన్ను కోరి, ఆ కోర్కె ఫలవంతం చేసుకొనడానికి, ఏ ఆలోచనపైనో ఈ ఏడాదిపాటూ ఈలా, తనకూ, తన స్నేహితులకు మాత్రం మరుగుపడి ఉన్నాడన్న మాత్రంలో అతడంత దోషమేమి చేసినట్లు? అయినా ప్రేమ విషయాల చర్చ ఇప్పుడు తన కవసరమేమి? తనలో ప్రేమభావమే లేదుగదా! ఏదో భయపడి, తనకడకు ఈ నాలుగురోజులూ రావటంలేదు. ఎంత వీరుడైనా స్త్రీలకడ కుక్కపిల్ల అయిపోతాడు మగాడు. తానే వెళ్ళి తన బావను లాక్కురావాలి. ఈ నిశ్చయానికి ఎప్పుడు వచ్చిందో ఆ వెంటనే ఆ సాయంకాలం తన్ను అప్సరసలా కైసేసుకుంది హేమ. తన చిన్నకారులో ఎక్కి తానే స్వయముగా త్యాగరాజనగరం తన బావగారింటికి బయలుదేరింది. బండి శ్రీనాథమూర్తి ఇంటి దగ్గర ఆపింది. లోపలకు దబదబా వెళ్ళింది. ' అత్తయ్యగారూ!' అని కేక వేసింది.
ఎవరు? హేమా? అని త్యాగతి తల్లి వంటింటిలోనుంచి బయటకు వచ్చింది. ఆమె హృదయం భయంకర ఝంఝాతాడిత సముద్రంలా అయిపోయింది. ఇదివరకు అత్తయ్యగారూ అన్నమాట వేరు. ఈనాటి పిలుపు వేరు.
ఏమండీ అత్తయ్యగారూ, మీరు త్యాగతికి కూడా తల్లులట కాదూ? అని హేమ పకపక నవ్వింది.
అవునమ్మా,అవును. మూర్తి బావా, త్యాగతీ ఇద్దరూ నా కొడుకు లేనే తల్లీ! అని లోని భయం దాచుకొని, ఆమె చిరునవ్వతో జవాబిచ్చింది.
ఇన్నాళ్ళు, మీరు కూడా ఈ రహస్యం నా దగ్గర యెందుకు దాచారు?
మావాడు దాచే రహస్యం, నేను దాచనక్కరలేదా బంగారు బొమ్మగారూ?
మీరూ దొంగలేనా?
నేను దొంగనవబట్టేగా నా కొడుకూ దొంగవాడయ్యాడు.
అది నేను నమ్మను. కొడుకు దొంగతనాలు నేర్చుకొంటే, ఆతన్ని రక్షించడానికి తల్లికూడా ఆ పని నేర్చుకోక తప్పిందికాదనుకుంటాను. ఇంతలో హేమకు వెనక మధుర గంభీరములగు త్యాగతి వాక్కులు రేపు మా మరదలుగారు కొంచెం తక్కువ శిక్ష విధించవలసిందని ఈ ముఖ్యదోషి ప్రార్థిస్తున్నాడు అని వినబడినవి.
హేమ చటుక్కున వెనకకు తిరిగింది. శ్రీనాథమూర్తి చేతులు జోడించి తల వంచి, హాసవదనుడై, కొంచెము దేహము ముందుకు వంచి నిలుచుండి ఉండెను కాని అతని చిరునవ్వులో సీతను అరణ్యాలకు పంపిన శ్రీరాముని దివ్యశోకము వర్తిస్తున్నది.
హేమ పెదవులలో నవ్వు నృత్యము చేస్తున్నది. కన్నులలో పారిజాత పుష్పాన్ని నారదుడు రుక్మిణి కిచ్చిన దృశ్యం చూస్తున్నా సత్యభామ కోపము తాండవము చేస్తున్నది.
అతని హృదయంలో అనుమాన భయమూ, ఆమె హృదయంలో అభిమాన క్రోధమూ వానవల్లప్పలాడుతున్నవి. వీరిరువురుని తాపసి వృద్ద కౌశికవలె త్యాగతితల్లి చూస్తున్నది. కొంతవడికి త్యాగతి__
హేమ, నా తరపునా, మా అమ్మ తరపునా మమ్ము క్షమించాలని ప్రార్థిస్తున్నాను. ఈ దోషమంతా నాది. కాబట్టి ముఖ్యక్షంతవ్యుడను నేనే! అని కొంచెం విచారం రంగరించిన గంభీర వాక్యాలతో ఆమెను ప్రార్థించాడు.
బావా! ఎంత బాగుంది నిన్నిలా పిలవడం! అమ్మయ్యా, అనేశాను. అనడానికి నాకు చెమటలు పట్టాయి. అంత ప్రసిద్దికెక్కిన త్యాగతీ శర్వరీభూషణ్ గారు నాకు బావ అవడం అనే విషయం నన్ను వణికింది. మా అక్క లేకపోవడం ఇప్పుడు నాకర్థమయింది బావా! అని ఆమె కన్నుల నీరు తిరుగ పలికింది. త్యాగతి కన్నులనుంచి వర్షాలు కురియసాగాయి. త్యాగతి తల్లి శోకంతో వణికిపోయి కూలబడిపోయింది. శకుంతల కొరకు దుఃఖము గాలివాన అయింది.
ఎన్ని సంవత్సరాలనుండో అణగిన ఈ ముగ్గురి శోకమూ ఈనాడు పాతాళం వీడి వచ్చిన పాతాళగంగవలె పైకి పొంగిపోయింది. ఏవేవో భావాలన్నీ ఒక్కసారిగా పూర్వ పవిత్ర స్మృతివల్ల, చంద్రకాంతివల్ల చంద్రకాంతశిల కరిగినట్లు శోకఝరులయినాయి.
ఈబాలిక తన జీవితంలో, శకుంతల జీవితంలో ఒకనాడు భాగం పంచుకొన్నది. ఆ చిట్టి శిశువు ఈ రూపాన ఆ జీవితంలో ఇప్పుడు పాలు పంచుకోలేకపోతున్నది. అని త్యాగతి కరిగిపోయినాడు.
ఇన్నాళ్ళు దేశాలు తిరిగి, తన జీవితంలో భాగం పంచుకోక, ఈనాడు ఈ విచిత్రంగా తన బ్రతుకుదారుల ఈ బావ నడయాడడానికి తన అక్క లేకపోవడంకదా కారణమని హేమ వణికిపోయింది.
హేమా శ్రీనాథు లట్లు ఒకరికడ ఒకరు నిలుచుండినప్పుడు మొదటిసారి చూచిన శ్రీనాథుని తల్లికి, కొడుకు కోడలు అలాగే నిలుచుండి వేళాకోళాలు చేసుకున్న వెనకటిరోజులు ఒక్కసారిగా స్పష్టమై, కూలిపోయిందామె. అందులో హేమ అచ్చంగా శకుంతల పోలికే. 4
శ్రీనాథమూర్తి కన్నీరు తుడుచుకొని హేమా! ఈరోజు మా ఇంట్లో భోజనం చెయ్యాలి. నీవు మా అమ్మవంట ఎప్పుడూ చూళ్ళేదు. ఇంటికిపోయి చెప్పిరమ్మని మా బోయివాని కబురంపుతా; నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి. తర్వాత నిన్ను మీ ఇంటిదగ్గిర దిగబెడతానులే! మీ ఇంటిదగ్గర ఈ విషయాలన్నీ మాట్లాడడానికి తీరదు. అందరి స్నేహితులను చిన్నబుచ్చలేము అని సవినయంగా చెప్పాడు.
బావా! అత్తయ్యగారు ఎన్నాళ్ళనుంచి ఉన్నారు ఈ ఊళ్ళో?
నేను నీకు అడయారులో కనబడిన రెండు నెలలకు ఈ నగరం అంతా గాలించి, చిన్నదైనా, ఈ అందమైన మేడ కొనుక్కున్నాను. కొని దానిలోకి కావలసిన వస్తువులు చేయించుకుంటూ నెల రోజులున్నాను. ఆ తర్వాతే మా అమ్మను తీసుకొని వచ్చాను.
కాబట్టి మీ అమ్మగారు ఈ పదినెలలనుంచీ చెన్నపట్నంలో ఉంటున్నారన్నమాట.
అవును!
ఎంతవాడవు బావా నీవు! అత్తయ్యగారు మా ఇంటికివచ్చి మా ఇంటిలో రెండు మూడు రోజులు ఉండడము మా ఇంటిదగ్గర నుంచేనన్నమాట?
అవును?
మా ఇంటి దగ్గర అత్తగారున్నప్పుడు నీవు వచ్చి వారిని పలకరించకుండా ఉండేవాడవు. వారు నిన్ను పలకరించకుండా ఉండేవారు. మా అమ్మా, మా నాన్నా కూడా యేమాత్రమూ రహస్యం తేలనిచ్చేవారుకారు. చీమకాలంత అనుమానమన్నా మా కెవరికీ రాకుండా చూచారు మీరంతా, ఎంత రాతి గుండెలయ్యా మీ అందరివీని!
రాతిగుండెలో, నేతిగుండెలోగాని, మాకు బ్రహ్మవిద్యే అయింది హేమా ఈ రహస్యం దాచడానికి.
అసలు నీ ధైర్యం చెప్పాలి. నేనూ, మనవాళ్ళూ ఈ ఇల్లు మీ ఇల్లనుకోలేదు. నీ కళామందిరమే నీ ఇల్లనీ, నువ్వు ఘోటక బ్రహ్మచారివనీ, నీకు నీ అనేవాళ్ళున్నా వారికి, నీకూ సంబంధం సన్నదారం వంటిదేననీ, మేము అభిప్రాయపడి వాదించుకొనే వాళ్ళం!
త్యాగతి పకపక నవ్వుతూ ఈవాళ ఈ ఇల్లుమాది అని ఎల్లా తెలిసింది నీకు? అని అడిగాడు.
మా నాన్నగారు నాకు రహస్యం అంతా చెప్పారు. అందమైన ఆ ఇల్లు ఎవరిదయ్యా అని ఒకసారి నీ కళామందిరంలో నిన్ను అడిగాను జ్ఞాపకం ఉందా? అప్పుదేమన్నావు నువ్వు?
ఏమన్నాను, మా స్నేహితులదే. అ ఇల్లు ఎప్పుడోకొని నా కళామందిరానికి కలుపుకుంటాను అన్నాను.
ఓయి బావా, ఏమిటి ఈ సినిమాకథ అంతా!
అదే నీతో చెప్పాలి, రా! నా చదువుల గదికి. అమ్మా! హేమకు అన్ని వేపుడుకూరలు కావాలి. గోంగూర పచ్చడి మా ఇష్టం. కందిపొడి శేరులు గుటికాయాస్వాహా చేస్తుంది. వంకాయ పచ్చిపులుసు ఉల్లిపాయలతో జుర్రుతుంది. ఇక నీ ఇష్టం అమ్మా!
నాయనా! మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. వంటకాగానే పిలుస్తాను అని త్యాగతితల్లి లోనికి వెళ్ళింది. బోయివాడు త్యాగతి సైకిలు ఎక్కి మైలాపురం కబురు చెప్పడానికి వెళ్ళాడు. త్యాగతీ, హేమా ఆ చిన్న మేడలో పైనవున్న త్యాగతి చదువులగదికి పోయారు.
మేడమీద గదులన్నింటిలో ఆ గదే కొంచెం పెద్దది. గదిచుట్టూ గోద్రెజ్ బీరువాలు-కిటికీలు, ద్వారాలు తప్పించి తక్కిన గోడలను కమ్మివేస్తూ-అయిదడుగుల ఎత్తున అద్దాల తలుపులున్న ఆ బీరువాలు అలంకరించి ఉన్నాయి. నేలంతా బందరు జాతీయ కళాశాల రత్నకంబళ్ళు, అక్కడక్కడ పరుపులు, పెద్ద అజంతా దిండ్లు, పైకప్పు నీలం రంగూ, అజంతా అలంకార శిల్ప చిత్రలేఖనమూ, ఆ బీరువాలపైన అయిదారు సుఖపద్మాసనమూర్తులైన సరస్వతీ, లక్ష్మీ, బాలాత్రిపురుసుందరీ, శ్వేతతారా, ప్రజ్ఞా పారమిత మొదలగు దేవీవిగ్రహాలు తిబెత్తువి, నేపాలువి, బర్మావి, బలి, జావా, కాంబోడియా, చీనా, జపానువీ అలంకరించి ఉన్నాయి. ఎనిమిది కిటికీలకు, నాలుగు ద్వారాలకు జపాను, చీనా, జావా తెరలున్నాయి. ఆ గదికి చుట్టి మూడువైపులా వరండాలున్నాయి. ఆ వరండాలో చక్కని సోఫాలు, సోఫా కుర్చీలు మూడువైపులా ఉన్నాయి. ప్రతి సోఫాపక్కనా, సోఫాకుర్చీపక్కనా చిన్న అజంతా పీఠాలు పుస్తకాలుంచుకోడానికి ఉన్నాయి. ఆ పదునాలుగు బీరువాలలో సంస్కృత, ఇంగ్లీషు, రష్యా, జపాను, జర్మనీ, డచ్చి, ఫ్రెంచి, బంగాలీ, హిందీ, చీనా, ఉర్దూ భాషలలో వేదాంత, కావ్య, చరిత్ర, విజ్ఞాన గ్రంథాలున్నాయి. త్యాగతి ఆ భాషలన్నీ ఈ తొమ్మిదేండ్లనుండీ నేర్చుకుంటుంన్నాడు.
ఇదీ నా గ్రంథాలయం. నా కళా గ్రంథాలయం ఇదివరకు ఎన్నిసారులో నీవు చూచినదేకదా! పైన సోఫాలో కూర్చుందామా, లేక లోపల ఈ పరుపులమీద అధివసిద్దామా? అని త్యాగతి ప్రశ్నించాడు.
పైన ఆ సోఫాలమీదే కూర్చుందాము. అక్కడ ఆ పుస్తకాలలోని వాళ్ళూ, ఆ విగ్రహాలూ మన సంభాషణ వినడానికి వచ్చి కూర్చున్న పరాయివాళ్ళలా నాకు కనబడతారు బావా! అది అలా ఉంచు. ఇంత అందమైన మేడ, ఈ అపురూపమైన వస్తువులు, ఇంత చక్కని పుస్తకాలయం, ఈ మనోహరమైన అలంకారాలూ ఇన్నాళ్ళనుంచీ మాకు చూపించకుండా ఎలా ఉన్నావయ్యా! ఆమె ప్రశ్న కొంచెం బాధతో మిళితమయ్యే ఉంది.
5
ఇద్దరూ పై వరండాలో ఆ సాయంకాలాల్పారుణ కాంతులతో చెరి ఒక సోఫా కుర్చీపైన అధివసించారు. త్యాగతి ఒక సిగరెట్టు వెలిగించాడు.
హేమా, నేనేమీ రహస్యం దాచకుండా నా జీవిత చరిత్రా, నా హృదయమూ, అన్నీ నా గ్రంథంలో వ్రాశాను. ఈ ఏడాదినుండీ నీయీ ఆనందమయ జీవిత చరిత్ర గమనిస్తున్నాను. నువ్వు నీ మనస్సును నా విషయంలో అనాచ్చాధితంగా ఉంచుకో, అంతే నేను కోరేది.
అంటే నీ భావం ఏమిటి బావా?
ఏమీలేదు నేను నీకన్న పన్నెండేడుల పెద్దవాడిని. ముసలివాడిని. నువ్వు చిన్న పిల్లవు. నీ ఆశయాలు వేరు, నా ఆశయాలు వేరు. నేను అన్ని తలదెబ్బలూ తిని, బొప్పెలు కట్టిన శిరస్సుకు తలటోపీ అలంకరించుకొంటున్నాను. నువ్వు ఇప్పుడే విరిసిన హిమాలయపుష్పంలా ఉన్నావు. అందుచేత నువ్వు తలిదండ్రుల కోర్కె పరిపాలించాలని ఆలోచించిగాని: బావ దుఃఖానికి ఉపశమనం కలుగచేద్దామని అనుకొనికాని, దేవీ స్వరూపిణియైన అక్క ఆత్మకు నివేదన ఇద్దామనిగాని ఆలోచనలతో తొందర పడవద్దు, అని ఆత్మపూర్వకంగా నిన్ను కోరుకుంటున్నాను.
మీరంతా కలసి, ఈ కుట్ర పన్నడం ఎందుకూ? ఆ తర్వాత ఆ కుట్రంటే లెక్కచేయకు అని నాకు ధైర్యం చెప్పడం ఎందుకు? ఈ విచిత్రం ఎక్కడైనా ఉందయ్యా?
మానవ జీవితాలు ఒకదాని కొకటి సంబంధం లేకుండా ఉంటాయా హేమా? ఆ సంబంధాలవల్ల ఇతరులకు బాధ కలిగించుకోకుండా జాగ్రత్తపడాలిగాని!
ఏవో వేదాంత రహస్యాలు మాట్లాడక స్పష్టంగా మాట్లాడుదూ?
నేను నీ బావనయ్యాను. నా జీవితంలోని ఉత్తమ భాగాన్ని పోగొట్టుకున్నాను. ఆ భాగం మీ అక్క అవడంవల్ల నీకూ, నాకూ సంబంధం ఏర్పడింది. ఆ సంబందంవల్ల నీ జీవితానికీ, నా జీవితానికీ సంపర్కాలు, పరస్పర అభిమానాలూ, సహాయాలూ కావలసి వస్తాయి.
తెలుగులో మాట్లాడవయ్యా అంటే, అరవంలో మాట్లాడుతావేమిటి బావా!__ఎంత సులభంగా వస్తోంది 'బావా' అని నా నోటివెంట! నా చిన్నతనానికీ, ఈ ఈడుకీ మధ్య ఉన్న సంవత్సరాలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి! హేమా! నా కథ అంతా నీ స్నేహితులకు చెప్పు. కాని మీ అమ్మగారి, నాన్నగారి ఉద్దేశాలూ, నా భావమూ ఎవరికీ తెలియనీయకు. నా జీవిత చరిత్ర గ్రంథం ఎవ్వరికీ యివ్వకు. మీ లోకేస్వరిని మాత్రం చదువుకోనీ!
అప్పుడే ఆజ్ఞలు ప్రారంభించావూ!
అదేమిటి! త్యాగతి గుండె ఒక్కగతి తప్పింది.
ఏమీలేదు. మీ మగవాళ్ళలో ఆడది నా వస్తువన్న భావం ఎంత ఉదార హృదయం కలవాళ్ళకీ పోదని నా ఉద్దేశంలే!
అయ్యో రామా! ఇంతేనా నన్నిన్నాళ్ళు అర్థం చేసుకున్నది!
ఆ! బాగా అర్థం చేసుకున్నా! ఏడాది మౌనవ్రతాన్ని నీ కుట్రను దాచుకోడానికి ఆయుధంగా ఉపయోగించుకొని, ఈనాడు ఆ దొంగతనం బయలు పడితే, దానికి పవిత్ర భావాలు కల్పించేందుకు లాయరులా వడవడ వాగే ఉపన్యాస వాక్ ఝరీవేగం నా కర్థమయిందిలే బావా!
అని హేమ మూతి ముడుచుకొని చటుక్కున లేచి, ఆ డాబా వరండా గోడ నానుకొని ఇంటిచుట్టూ పూవులతో నిండి వున్న చేమంతుల జాతుల్ని గమనిస్తూ నిలుచుంది. ఆమెలో నిర్వచింపలేని మహావేదన ఆవిర్భవించింది. అనేక విధానాలుగా తన కుటుంబానికి బంధువైన కుటుంబంవాడై, అంతకుమించి తన తండ్రి ప్రాణస్నేహితుని కొమరుడై, తన అక్కకు ఆత్మలు కలిసిపోయిన భర్తలు, తన్ను ఏదో విచిత్రంగా అర్థం చేసుకొని, ఏడాదిపాటు ఈ విచిత్ర నాటకం ఆడినాడే? ఆమెకు కోపము పొంగిపొర్లి వచ్చింది.
త్యాగతి ఆలోచించుకున్నాడు. తాను చేసిందంతా తప్పనుకున్నాడు. శకుంతలలేని తన జీవితం చుక్కానిలేని పడవనుకున్నాడు. శకుంతలా లేదు! హేమసుందరి తన్ను ఎప్పుడూ సరీగా అర్థం చేసుకోలేదు. కానీ! ఏది ఏమయితే తనకేమి?
త్యాగతి మౌనియై, తలవాల్చుకొని ఆ కుర్చీలో కూర్చున్నాడు. అతనికి ఒకదాని వెంట ఒకటి ఆలోచనలు తరుముకొని వచ్చాయి. స్పష్టరూపంలేని ఆ ఆలోచనలు మాయమయ్యాయి. శకుంతల చిరునవ్వుతో ఎక్కడో మేఘాలలో నిలుచుండి కనబడింది. శకుంతలా! ఎందుకు నన్నిన్ని విధాల ఆరాట పెడతావు? అని అనుకొని ఆ దేవినే గమనిస్తూ తలవాల్చుకొని కన్ను మూసికొనే అలా కూర్చున్నాడు త్యాగతి.
ఇంతలో ఆమె విగ్రహం మాయమైపోయింది. ఒక్క పెద్ద నిట్టూర్పు వదలి తలెత్తి హేమసుందరి నిలుచుండిన ప్రదేశం చూచాడు. ఆమె అక్కడలేదు. ఆమె ఎక్కడికి వెళ్ళింది? మూడు వరండాలు, డాబాలు చూచాడు. గ్రంథాలయంలోనికి వెళ్ళాడు శ్రీనథామూర్తి. హేమ అక్కడ ఒక చదువుల పరుపుమీద వాలిపోయి, దిండులో మోముదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నది.
శ్రీనాధమూర్తి తెల్లబోయి, హేమా! అదేమిటమ్మా! నేను రాక్షసుణ్ణి! నన్ను క్షమించు. నీ జీవితంలోంచి నేను ఈనాడు వెళ్ళిపోతాను. నువ్వు నన్ను మళ్ళీ చూడగలిగే స్థితి వచ్చి రమ్మన్ననాడే వస్తాను అన్నాడు.
6
హేమ కళ్ళనీళ్ళు తుడుచుకొని లేచి, క్రిందకుదిగి వెళ్ళబోతూవుంటే శ్రీనాథమూర్తి హేమా! నీవు మొహం కడుక్కోవాలంటే, ఈ మేడమీద ఒక స్నానాల గది ఉంది, ఈలారా అని అక్కడకు దారిచూపినాడు. హేమ వెళ్ళి మొగం కడుక్కొని లోపలికివచ్చి, శ్రీనాథమూర్తి పడకగదికి ముందు చిన్నగదిలో ఉన్న అద్దం ముందర పీఠికపై కూర్చుని తన చేతిసంచి తెరచి అందులో ఉన్న చిన్న బంగారు భరిణలోని పౌడరు మొగమునకు చిన్న కుచ్చుతో అద్దుకుంది. ముందు జుట్టు సర్దుకుంది.
ఇంతవరకు శ్రీనాథమూర్తి వరండాలో నిలుచుండి ఆకాశాన కమ్మిన నక్షత్రాలను చూపులేని చూపుతో చూస్తూ, ఆలోచనలేని భావాలు కమ్ముకురాగా, వానిని క్రుంగిపోయిన మనస్సుతో గమనిస్తూ ఉన్నాడు.
హేమ అంతా సర్దుకొని త్యాగతితో మాట్లాడకుండా క్రిందకు దిగి వెళ్ళింది అక్కడనుండి. ఆ చిన్న మేడముందున్న తన చిన్న ఓపెల్ కారుదగ్గరకు పోయి, దానికి ప్రాణోద్దీపన చేయబోయే సమయంలో శ్రీనాథమూర్తి తల్లి రంగనాయకమ్మగారు వంటగదిలోంచి పరుగెత్తుకొని కారు దగ్గరకు వచ్చి హేమా, వెళ్ళిపోతున్నావా? అన్నారు.
రంగనాయకమ్మగారి గొంతులోని బాధ హేమకు సముద్రపు కెరటంలా కొట్టింది. ఎంతో సిగ్గుపడి ఆ బాలిక, లేదండీ అత్తయ్యా! కారులో పెట్రోలు కావలసినంత ఉందోలేదో చూస్తున్నాను అని ఒక చిన్న అబద్దం చెప్పి, వెనక్కు తిరిగి వచ్చి తొడుక్కున్న కాలిజోళ్ళు మళ్ళీ విప్పి, వంటింటిలోకి వెళ్ళిపోయింది. ఎందువల్లనో కోపం వచ్చిందినిన్నీ, ఆమె ఆ కోపంతో వెళ్ళిపోబోయి, తనమాటల కాగి, ఏదోవంక చెప్పినదన్న నిజము రంగనాయకమ్మగారూ గ్రహించకపోలేదు.
తను బావతో కలిసి భోజనముచేయుటా, చేయకపోవుటా? అని హేమ వంటింటిలో రంగనాయకమ్మగారు వేసినపీటపై కూర్చుండి ఆలోచింపసాగినది కూర్చున్న పీటఅంతా అలంకారశిల్పమయము. అలాంటి పీటలక్కడ నాలుగున్నవి. ఆ నాలుగూ ఉత్తమ శిల్పి ఎవరో రచించి ఉన్నాడు. కోళ్ళు మూడంగుళముల ఎత్తే అయినా, అవి వివిధ భంగిమలో ఉన్న ఏనుగులతో నిండి ఉన్నవి. పైబల్లమీద అంతా వెండిలతల నగిషీపని కర్రలోపొదిగించబడి ఉంది.
ఆ పని హేమసుందరి దీక్షతో గమనించడం చూచి, అమ్మాయీ!ఆ పీటలన్నీ మీ బావే స్వయంగా చేశాడు అన్నది.
ఆ ముక్కలకు హేమ ఆశ్చర్యం పొందినది. ఏమిటీ విచిత్రపు మనిషి, ఇంత అందమైనపని భోజనపు పీటలపై కూడా చేసినాడు! ఈ ఆలోచన ఆమెకు త్యాగతిపైన కోపాన్ని తగ్గించింది.
ఇంత చదువుకొని, తన బావ జీవితాన్ని తాను అపార్థం చేసుకునేటంత హీనురాలయింది. తాను వివాహసంస్థే పనికిరాదని వాదిస్తూన్న అతి నాగరికురాలై, ఏమో ఎందుకో తన బావపైన ఆగ్రహించడమా? తాను తన బావను పెళ్ళిచేసుకుంటే చేసుకుంటుంది, లేకపోతే లేదు. అంతమాత్రానికి ఏదో చదువురాని మొద్దులా, హృదయపథాల మంచు గప్పినదానిలా, చిన్న బిడ్డలా ఆ వెక్కి వెక్కి ఏడవడం ఏమిటి? తన త్యాగతి, తన శ్రీనాథమూర్తి బావ మహోత్తమ పురుషుడు. అలాంటివానితో ఏదో కాస్త ఆనర్సులో నెగ్గిన కొంచెం ఎర్రగా బుర్రగా ఉన్న తాను, దేశసేవ, సారస్వతసేవ, సంఘసేవ, కళాసేవ చేయలేని తాను, పిచ్చిమనిషిలా ఏడవడమా? ధైర్యంలేక, పిరికి అమ్మాయిలా పారిపోవడానికి సిద్దం అయితే! ఇదా తనబడాయి? కల్పమూర్తి దగ్గిర, తీర్థమిత్రునితో, నిశాపతి ఎదుట డాబులు కొట్టడం మాత్రం తనకు తెలుసునా? తనకు మాత్రం భాగ్యవంతురాలనని ఉన్న గర్వానికి లెక్కవుందా? తన అందానికీ, తన భాగ్యానికీ చేరిన వాళ్ళెక్కడ! అంకుఠితదీక్షతో సంఘానికి తన సర్వస్వము అర్పించే తన బావ ఎక్కడ!
ఆడతనం ఎన్ని రంగులు వేసినా పోదు! ఆడవాళ్ళూ, వారి నరాల జబ్బులూ ఒకటే! బడాయి లెక్కువ! ఛీ! ఛీ! తనకే బుద్దివుంటే, వెళ్ళి తన బావ కాళ్ళమీదపడాలి. అతను తన్ను పెళ్ళిచేసుకుంటేనే తన జన్మసార్ధకం అవుతుంది. ప్రేమా? తానెవరిని ప్రేమిస్తున్నదీ తనకే తెలియదు. ప్రేమ లేకపోతే భార్యగా బావకు సేవచేయడంకన్న తనకు మహోత్తమ భాగ్యం ఏమున్నది? బావ ఏమి చేయమంటే తానదే చేస్తుందిగాక!
హేమ లేచి అత్తయ్యా! నేను వెళ్ళి బావను తీసుకొని వస్తా అన్నది.
రంగనాయకమ్మగారు చిరునవ్వు నవ్వుతూ వెళ్ళు తల్లీ వెళ్ళు అంది.
రంగనాయకమ్మత్త ఎంత ఉత్తమురాలు. ఆ తల్లి పుణ్యమే ఈ బావ! ఏ తార చాయలో నినుగాంచె అని రాయప్రోలు సుబ్బారావుగారన్నట్లు బావను కన్నది. ఈ ఇంటిలో తాను కోడలై తన బావ ప్రేమను తాను పాలిస్తూ వుండడంకన్న ఉత్తమం ఏముంది? అనుకుంటూ మేడమీడకు గబగబ మెట్లెక్కి వెళ్ళి బావా! బావా! అని పెద్దకేకలువేస్తూ, నవ్వుతూ అతని గ్రంథాలయ మందిరంలోకి వెళ్ళింది. అతడక్కడలేడు. అతని పడక గదిలో లేడు, అత్తగారి పడకగదిలో లేడు. అలంకారపు గదిలో లేడు. వరండాలో లేడు.
ఆమెకు ఏదో భయం వేసింది తిన్నగా క్రిందకు దిగి, బావ మేడమీద లేరండీ అత్తయ్యా? అని వంటింటిలోకి వెళ్ళి చెప్పింది.
రంగనాయకమ్మగారు ఈవలకు వచ్చి ఒసే ముత్యాలూ! అని కొల్లిపరనుంచి తమతో వచ్చిన పనిమనిషిని పిలిచింది.
ఇక్కడున్నానండీ అంటూ ముత్యాలు వచ్చింది.
అయ్యగా రేరీ?
ఆరు బొమ్మలమేడ కెళ్ళారండీ అని ముత్యాలు జవాబు చెప్పింది.
నేను వెళ్ళి తీసుకువస్తానత్తయ్యా! అని హేమ ఈ మేడ తోటలో నుంచి, ఆ మేడ తోటలోనికి ఆ ఫిబ్రవరి చేమంతుల అందాలలో స్నాత అగుతూ, గబగబ చందాల నడకలతో వెళ్ళింది.
రెండు తోటలకు మధ్యనున్న చిన్న తలుపు తెరచుకొని, ఆ బాలిక దీపాలతో వెలిగే ఆ శిల్పభవనంలోకి పోయింది. ఇదివరకే ఆమెకు ఆ శిల్ప భవనం అత్యంత పరిచితము.
బావా! ఎక్కడున్నావు? అని ఆమె వణికే హృదయంతో లోనికి వెళ్ళింది.
త్యాగతి చిత్రమందిరంలో పద్మాసనంమీద కూరుచుండి, రెండు చిత్రాలు పక్కపక్కనే ఎదుట పెట్టుకొని కన్నులరమూతలుగా, ఏదో ధ్యానసముద్రలో ఉన్నాడు. అతని కన్నులు నీరు తిరుగుతూ నిశ్చలకాసారలలో సుడులలమినట్లున్నాయి.
7
హేమ వచ్చినట్లు త్యాగతి గ్రహించనేలేదన్నట్లు తదేకదీక్షతో పద్మాసనం వేసుకొని ఉన్నాడు. హేమ మెల్లగావెళ్ళి, అతని ప్రక్కను కూర్చుండి ఆ రెండు చిత్రాలు చూచింది.
ఆ రెండు చిత్రాలు హేమవే! కాదు-ఒకటి హేమే కాని, హేమ కాదా ఏమిటి? అన్నట్లూ ఉంది. ఆమె కన్నులలోని నీరు గమనించి హృదయంలో వణకిసోయింది. పైకి లేని ధైర్యం తెచ్చుకొని బావా! ఈ రెండు బొమ్మలూ ఎప్పుడు వేశావు?
హేమకు తెలియకుండా కంటనీరు తుడుచుకొని, కొంచెం డగ్గుత్తికతో హేమా! ఒకటి మీ అక్కది. ఆమె నన్నువదలి వెళ్ళబోయే ముందు స్థితి. రెండవది నీవు ఒకరోజున భోజనశాలలో పీటమీద కూర్చుండి, చక్కని మాటలు చెప్పుతున్ననాటి దృశ్యం.
అది నీజ్ఞాపకశక్తివల్ల వేసినదేనా ఏమిటి?
అవును హేమా!
సరే! ఇప్పుడీ చిత్రాలు అల్లాఉంచి, విషాదాంత నాటకంలో, ఆఖరు అంకంలో నాయకుడు పెట్టిన మొగం మానేసి, రా భోజనానికి ! అత్తయ్యగారు కనిపెట్టుకొని ఉన్నారు.
వస్తున్నా హేమా! అని త్యాగతి లేచాడు. ఆ చిత్రాలు రెండూ చిత్రాల అట్టల పుస్తకంలో పెట్టి తాళ్ళు ముడివేసి, ఆ అట్ట తీసుకొనిపోయి బీరువాలో పెట్టి తాళం వేసినాడు. తలుపులు వేసుకుంటూ, ఎలక్ట్రిక్ దీపాలార్పుకుంటూ, చేతిలోని ఎలక్ట్రిక్ టార్చిదీపం మీటనోక్కి దొడ్డిలోకి వచ్చే పక్కవాకిలి తలుపులువేసి, హేమసుందరికి దారి చూపిస్తూ, ఈవలి యింటికి తీసుకొని వచ్చాడు.
వారిద్దరు చేతులూ, కాళ్ళూ, మొగమూ కడుక్కొని, తువ్వాళతో తుడుచుకొని వచ్చారు. త్యాగతి హేమను గదిలోకివెళ్ళి అక్కడ తానుంచిన చీరా, రవికా భోజనానికి బట్టలు మార్చుకోమని కోరినాడు.
హేమ: అవి మా ఇంటిదగ్గరనుండి తెప్పించావా బావా?
త్యాగ : లేదుతల్లీ! అవి ఎక్కడివో నీవాగాదిలోకి వెళ్ళు గ్రహిస్తావు.
హేమసుందరి చర్రున త్యాగతివైపు చూసి,బావా! పేరుతో పిలవక తల్లీ అని పిలుస్తావే! నీ కథకూ, పిలవడానికీ ఏమీ శ్రుతికలవదు. అల్లా పిలవదలచుకున్నావా, ఆ పిలవడంలో వున్న అసలు భావం మరచి పోకుండా, నీవు నాకు నీకథ రాసిచ్చిన ఉద్దేశ్యం పూర్తిగా మరచిపో! ఇంకో రకంగా పిలువు అన్నది.
త్యాగతి తెల్లబోయి, హేమసుందరివైపు ఒక్కక్షణం తేరిపార చూచి కన్నులు మూసికొని క్షమించు హేమా! ఈ నాల్గయిదు రోజుల నుంచీ, నన్ను నేనే మరచిపోతున్నా! దీనికంతకూ నేనే పెద్ద అపశ్రుతిని అనుకుంటూ నెమ్మదిగా నడచి తనకై వుంచుకొన్న క్రిందనున్న ఒక చిన్నగదిలోకి వెళ్ళిపోయాడు.
హేమ తనమాటలకు తానే ఆశ్చర్యం పొంది, నేనిల్లా అయ్యానేమిటి? అనుకుంటూ త్యాగతి చూపించిన గదిలోకి వెళ్ళింది. ఆ గది ఒక శయన గృహంలా ఉంది. అందులో నిలువెత్తున తానే ఒక పాలరాతి విగ్రహమై నిలుచున్నట్లు పడమటి గోడకు దగ్గరగా, మధ్యగా ఒక పాలరాతి పీఠం మీద ఒక విగ్రహం నిలుచుని వుంది. దక్షిణంవైపు అందాల మూటైన పందిరి మంచం వుంది. ఉత్తరంవైపు బల్లలున్నాయి. వాటిపైన చక్కని కలంకారీ దుప్పట్లు పరచివున్నాయి. ఆ బల్లపై బంగారూ, వెండి, సామాను, అత్తరుదానూ, గంధపుగిన్నె, తాంబూల కరండమూ, పన్నీటి బుడ్డి, కుంకుమ భరిణ, పండ్లపళ్ళేలూ, పూవుల సెజ్జలూ వున్నాయి. తూర్పుగోడకూ, పందిరి మంచానికీ ఈవల ఆవల నిలువుటద్దాలున్నాయి. గోడలపై త్యాగతి, నిన్ననాడు రచించిన రాధాకృష్ణ, సీతారామ, సుభద్రార్జున, ఉత్తరాభిమన్య, పార్వతీ పరమేశ్వర, ఉషానిరుద్ద, రతీమన్మథ చిత్రాలున్నవి. ప్రతిదంపతుల చిత్రాలలోనూ ప్రేమమయిమయిన అద్భుత సంఘటన ఒకటి చిత్రితమై ఉంది.
ఇవన్నీ పరిశీలించి చూస్తూ, ఆ గదిలోనుండి తూర్పుగా ఇంకొక గదిలోనికి వున్నద్వారం తెర ఒత్తిగించి, ఆ గదిలోనికి వెళ్ళింది హేమ. ఆ గది తమ వస్త్రాదులు, ఇతర వస్తువులు వుంచుకునే గది. ఆ గది తూర్పు గోడకు రెండు కిటికీలున్నాయి. ఆ కిటికీలకు ప్రక్కనే రెండు అలంకారపు బల్లలముందు చక్కని కుర్చీపీటలున్నాయి. ఆ బల్లకు పెద్ద పెద్ద అద్దాలున్నాయి. ఒక బల్ల స్త్రీల అలంకారపు బల్ల, రెండవది పురుషులది, ఒకటి తన అక్కదై వుంటుంది. రెండవది తనబావదై ఉంటుంది. అందులో తూర్పు గోడపైన నిలువెత్తు ఛాయాపటంలో తన అక్కా, బావా వధూవరులుగా తీయించుకున్న ఫోటో పెద్దదిగా చేయబడిన బొమ్మ వున్నది. ఉత్తరపు గోడమీద ఆ దంపతుల గర్భాదాన మహోత్సవము నాటి జంట చిత్రము, నాలుగు అడుగుల ఎత్తున పెద్దది చేయబడి వున్నది. దక్షిణపు గోడమీద అంత పెద్దదే తనబావ అక్కను పూజ చేయుచున్నట్లున్న పటమున్నది.
తన అక్క్గగారి చిన్నఫోటో అద్దములోవున్న బట్టల బీరువా ఉత్తరపు గోడవైపున వుంది. దక్షిణపు గోడవైపున తన బావగారి చిన్న ఫోటో అద్దములో ఉన్న బట్టల బీరువా ఉన్నది. ఆగ్నేయమూలను బావగారికి కాబోలు మాసినబట్టలు వేయుటకు గవాక్షములున్న కఱ్ఱ పెట్టె ఉన్నది. ఈశాన్యమున అక్కగారి పెట్టె ఉంది. అక్కగారి పెట్టేలన్నీ అక్కగారి బీరువాప్రక్క ఉంచబడినవి. బావగారి తోలుపెట్టెలూ, ట్రంకులూ ఆయన బీరువాప్రక్క ఉన్నాయి.
ఈ గదిలోనుండి ఉత్తరంగా ఒక గుమ్మం ఉన్నది. అది ఒక చిన్న స్నానాలగదిలోనికి దారి. అందుండి పడమటివైపుకు దేహబాధా నివారణపు గదిలోనికి దారి ఉన్నది.
అలంకారపు గదిలో అక్కగారి బీరువాకు తూర్పుగా బట్టలు వ్రేలాడదీయు నాలుగు కఱ్ఱల పొడుగాటి స్టాండున్నది. అలాగే బావగారి బీరువాకు తూర్పుగా ఒక స్టాండు ఉన్నది. తన అక్కగారి స్టాండుపై ఒక చక్కని వంగపండు చాయ బెంగుళూరు చీరా, వంగపండు చాయ బెంగుళూరు రవికా ఉన్నవి. స్నానాలగదిలో వేడినీళ్ళూ, గంధపు సబ్బూ (వెండి పెట్టెలో)వున్నవి. స్నానాల పొడీ పెద్ద తువాళ్ళూ వున్నవి. వేడినీళ్ళలో సువాస నకూ ఆరోగ్యమునకూ వేసుకొను పొడిగల వెండి డబ్బా వుంది. ఈ గదులలో అన్నీ ఆకుపచ్చ దీపాలున్నవి. అలంకారపు గదిలో కాంతిగల ధవళదీపాలే వున్నవి.
హేమసుందరి చటుక్కున నీళ్ళుపోసుకొనవలెనని తలచి, తలుపు వేసుకొని, కంఠస్నావ మాచరించినది. స్నానమాచరించి, అక్క చీరకట్టుకొని, రవిక ధరించి బీరువా నిలువటద్దములోనూ, బల్ల అద్దములోను చూచికొని, దొనదొన కన్నీరు కార్చినది.
అక్కా, ఈ ఆనందం వదలి ఎందుకు వెళ్ళావు? నీకూ, నీభర్తకూ ఎంత ప్రాణమే! అని కుళ్ళిపోయింది. వెంటనే స్నానాలగదికి పోయి మొగం కడుక్కొని తుడుచుకొని, తలదువ్వుకొని, బొట్టు పెట్టుకొని, గది యివతలకు వచ్చినది.
శ్రీనాథమూర్తి తలుపునకు ఉన్న తెర వత్తిగించి వచ్చిన హేమను చూచిఅయ్యో! అని గబగబ ముందు హాలులోనికి పోయి సోఫాపై కూలబడ్డాడు. హేమ తెల్లబోయి వంటింటిలోనికి పోయింది. హేమను చూచి రంగనాయకమ్మగారు నిలువునా కూలబడిపోయినారు. 8
కూలబడిపోయిన రంగనాయకమ్మగారి దగ్గరకు హేమ పరుగెత్తుకునిపోయి, అత్తయ్యా! ఏమిటి, ఏమిటి? అంటూ మోముపై నీరు చల్లినది. వెంటనే రంగనాయకమ్మగారికి మెలకువ వచ్చినది. ఆమె లేచి కూరుచుండి, హేమా, చటుక్కున ఎందుకో నా తల తిరిగినది. ఏమీ భయంలేదు. మీ ఇద్దరికీ వడ్డిస్తాను. మీ బావను పిలు తల్లీ! అని అన్నది.
హేమకుసుమ అత్తయ్యా ! నేను మా అక్కచీర కట్టుకుని వస్తే అచ్చంగా శకుంతల అనుకొని, మీరూ, బావా కంగారుపడిపోయినారు. నన్ను పదిపుటాలు వేసినా మా అక్కను కాలేను. నేను వెళ్ళి బావను తీసుకువస్తాను, వుండండిఅని ముందుహాలులోనికి వెళ్ళింది.
కంటనీరు కారిపోతుండగా త్యాగతి సోఫాలో కూలబడి వున్నాడు.
ఏమయ్యా త్యాగతీ, నీకేమన్నా మతిపోయిందా! రా! ఆడవాళ్ళ కన్న అధ్వాన్నమైనావేమి! అని హేమ త్యాగతి భుజంమీద చెయ్యివేసి అడిగినది. త్యాగతి లేచి, కంటనీరు తుడుచుకొని, డగ్గుత్తికతో హేమా! ఈలాంటి హృదయవేదనలు వస్తూనే వుంటాయి. ఏదైనా ఒక విషాద సంఘటన జరిగినప్పుడు, ఈలాంటి బాధలు రాకుండా వుంటాయా! అని మళ్ళీ క్రిందనున్న స్నానాల గదికిపోయి మొగము కడుక్కొని, తువాలుతో తుడుచుకొని వంటింటిలోకి పోయి, పీటపై కూర్చున్నాడు.
హేమ వచ్చి, తన పీటపై కూర్చుంది. రంగనాయకమ్మగారు వడ్డన చేసింది. రెండు వేపుడు కూరలూ, కొబ్బరికాయ, పెరుగుపచ్చడీ, గోంగూర పచ్చడీ, ఉల్లిపాయ పచ్చిపులుసూ, ఆవడలూ, పరమాన్నమూ పిండి మిరియమూ,చారూ, పెరుగూ వరస వరసగా వడ్డించింది.
హేమ: అత్తగారూ, పండగ అనా ఏమిటి ఇన్ని చేశారు?
రంగ: నువ్వు రావడమే పండగ తల్లీ! ఎప్పుడో నీ చిన్నతనంలో ఆరేళ్ళపిల్లవై ఉన్నప్పుడు మా ఇంటి భోజనానికి వచ్చేదానవు. ఇన్నాళ్ళైన వెనక ఈ మాత్రం చేస్తే ఒక గోప్పటే! నాకేమీ తృప్తిలేదు తల్లీ!
త్యాగతి: మా అమ్మ అయిదు నిమిషాలలో ఆరు రకాల పిండి వంటలు చేయడమూ, అబ్బే అనడం మామూలే హేమా!
హేమ: అత్తయ్యగారి వంట ఎంత చక్కగా వుందీ! మా ఇంటిలో ఈ పోపు రుచి ఏది? ఏదో మా వంటలక్క వండుతుంది. ఇంత గొడ్డుకారం పారేసో. ఇంత ఉప్పు సముద్రం చేసో, మా ఇంట్లో ఖర్చుతగ్గిస్తూ వుంటుంది. మా నాలుకలు బండబారి పోయాయి.
రంగ: వదినగారు దగ్గిర వుండి చెబుతూనే వుంటారే?
హేమ: అస్తమానం చెబుతూ కూర్చుంటారా ఎవరైనా అత్తయ్యా? ఇంక నేను కాలేజీకి వెళ్ళే రోజుల్లో, మా అరవయ్యరు నాకూ, లోకానికీ వేరే చేసేవాడు. అరవ వంటలు మనం ఎరగమా! ఎప్పుడూ ఆ వుప్పు చప్పని కూరలే. నేనందుకనే ఊరగాయల పనే పట్టిస్తూ వుంటాను.
వారిద్దరి భోజనాలు అయ్యేసరికి తొమ్మిదిన్నర అయింది. హాలులోకి పోయి తివాసిమీద కూర్చుండినారు. వారి పనిమనిషి తాంబూలపు పెట్టె తెచ్చి, వారి దగ్గర ఉంచింది. హేమ తమలపాకులకు సున్నం రాచి, బావగారికి ఆకులూ, వక్కపోడుమూ, సువాసన ద్రవ్యాలూ ఇచ్చింది. తానూ వేసుకుంది.
హేమ: బావా! మనం ఇద్దరం ఈ వెంటనే ఏదైనా సినిమాకు పోదాం వస్తావా?
త్యాగతి: సినీమా! ఏ సినీమా?
హేమ: ఏదో సినిమా. లేదా, సముద్రపు ఒడ్డుకు షికారుకు పోదాం!
త్యాగతి: సరే! మా అమ్మతో చెప్పిరా! మా బోయీని తీసుకొని వెడదాం. సినిమా చూస్తున్న సేపూ కారులో వుంటాడు. అయితే నువ్వు మా ఇంటిలోనే పడుకోవాల్సి వస్తుందేమో!
హేమ: అలాగే పడుకుంటాను.
త్యాగతి: సినీమా నుంచి వచ్చేటప్పుడు మామయ్య గారితో చెప్పివద్దాం!
హేమ: అలాగే లోకాన్ని కూడా కొట్టుకు వస్తాను.
ఇద్దరూ, బోయీ వెనక కూర్చుండి వుండగా, కారు ఎక్కారు. హేమ తనపక్క త్యాగతి కూర్చుని వుండగా, కారు వేగంగా నడుపుకొంటూ వెస్ట్ ఎండ్ సినీమాకు కారు పోనిచ్చింది. ఆరోజు సినీమా 'పిగ్మి లియాన్' అనే చిత్రము. ఒక గ్రీకు శిల్పి ఒక అద్భుత సుందరమూర్తి అయిన జవ్వనిని శిల్పించి, ఆ శిల్పసుందరి అందానికి తానే ముగ్థుడై ప్రేమించాడు. అతని ప్రేమ దేవతలను కలచివేసే మహాదుఃఖ తపస్సయింది. అప్పుడు దేవతలు ప్రత్యక్షమై విగ్రహాన్ని వనితను చేశారు. అతని కోర్కె నెరవేరింది. ఆ కథను ఈ కాలానికి సమన్వయం చేసి బెర్నార్డుషా మహాకవి ఒక నాటకం రాశాడు.
ఆ కథలో ఒక ఇంగ్లీషు భాషావేత్త అయిన మహాపండితుడు భాషలోని యాసాలూ, గ్రామ్యాలూ ఎందుకు వచ్చాయి? ఎల్లావస్తాయి? అనే సమస్యను పరిశోధిస్తూ కూలివాళ్ళల్లోనూ, నికృష్టజీవులలోనూ తిరుగుతూ వుంటాడు. అప్పుడొక బాలిక మాట్లాడే కర్కశపు గ్రామ్యభాషను గమనిస్తూ ఉండగా ఒక పెద్ద మనిషితో పంతము వచ్చింది. ఆ పరిసరాలనుబట్టి భాష ఉన్నతి పొందడము, హీనస్థితికి పోవడము జరుగుతుందని భాషావేత్త వాదన. దానిపై వారిద్దరూ పందేలు వేసుకొని ఆ బాలికచే స్వచ్ఛమైన భాష మాట్లాడించగలనని భాషావేత్త ఆ బాలికను తన ఇంటికి తీసుకొనిపోయాడు. అతిప్రయత్నంచేసి అతడు ఆ బాలికకు ఉత్తమ సంస్కృతీ, ఉత్తమ భాష నేర్పుతాడు. బాలిక సంపూర్ణంగా మారిపోయి, ఏదో పెద్ద కుటుంబములో జన్మించిన సుందరివలె పెరుగుతుంది. నిద్దరపోయే ఆ బాలిక హృదయం మేల్కొంది. ఆమె తన గురువునే ప్రేమిస్తుంది. ఈ నవీన పిగ్మిలియాను తాను సృష్టించిన ఈ బాలికను తానే ప్రేమిస్తాడు. ఈ గాథను అత్యంత రసవత్తరముగా అమెరికా హాలీవుడ్ వారు చిత్రం తీశారు. మానవ జీవిత సమస్య త్యాగతి గుండెను కదిపివేసింది. హేమ ఆలోచనలో పడింది.
తిరిగి వస్తూంటే హేమ బావా! నేను ఆలోచించిన కొలదీ మగవాని అహంభావానికి అంతులేదు అని అనుకోవలసి వస్తుంది అని ప్రశ్నార్థకమైనమాట అన్నది. నీ ఉద్దేశం ఏమిటి? అని కదా ఆమె మాట. తానేమి చెప్పగలనని త్యాగతి అనుకొన్నాడు.
నువ్వలా అనుకోడానికి కోటి కారణాలు ఎప్పుడూ ఎదురుగా కనబడుతూ ఉంటాయి.
సరేలే, నీ గోడమీద పిల్లివాటపు కబుర్లు! షాగారి రాతల్లో మగవాడే స్త్రీని తయారుచేశాడు, అని చూపించకపోతే, ఒక స్త్రీ మూర్ఖుడైన కూలివానిని చూచి, వాణ్ణి ఎంతో నాగరికత కలవాణ్ణిగా మార్చి, వాణ్ణి తాను ప్రేమించి బాధపడినది అని చూపించకూడదూ?
అవును. అలానూ రాయవచ్చును. యేదైనా అసలు సత్యాన్నే ప్రదర్శిస్తాయి కాదా?
నేను అసలు సత్యంమాట తేనేలేదు, మగవాళ్ళకు అంతరాంతరంలోనూ, వాచ్యంగానో ఉన్న మేమే గొప్ప అనే అహంభావం వాళ్ళరాతల్లో, చేతల్లో, మాటల్లో, పాటల్లో, వ్యక్తం అవుతూ ఉంటుందని నా వాదన.
నిజమే! ఏ కారణంచేతనో పురుషుడు ప్రతి విషయంలోనూ ముందుగా పని ప్రారంభించాడు. అతనికి స్త్రీ ప్రేమ అన్నిటికన్న ముఖ్యంని అందుచేత తాను విడదీయదలచుకొన్న ప్రతి సమస్యకూ తమ నాయకుణ్ని చేసుకుంటాడు. తాను భావించుకొన్న స్త్రీని నాయికను చేస్తాడు. ఈ విధంగానే స్త్రీయే కావ్యాలు అల్లడం ప్రారంభిస్తే, ప్రతి సమస్యకూ తమ నాయికను చేసుకొని, తన హృదయంలో వున్న ఆశయ పురుషుణ్ని నాయకుణ్ని చేస్తుంది. 'సోఫో' కవయిత్రిని చూడు, తరిగొండ వెంకమాంబను, మీరా బాయిని చూడరాదూ!
అందరు స్త్రీ కవయిత్రులు నువ్వన్నట్లు చేయరు బావా! ప్రసిద్ది కెక్కిన పెరల్ బక్కు ' గుడ్ ఎర్తు ' ను రాసింది. ఆమె నాయకుడి గాథను రాసింది. నాయికలు ఇద్దరయ్యారు. ఆ కథ పెరల్ బక్కూ రాయవచ్చును. లేదా సింక్లెయరు లూయీ రాసినా రాయవచ్చును. 9
ఫిబ్రవరిలో రాత్రిళ్ళు చలిపూర్తిగా తగ్గదని, శ్రీనాథమూర్తి కారు ఎక్కేటప్పుడే ఒక చిన్న శాలువ తీసుకువచ్చాడు. సముద్రంలో వారు కారులోంచి దిగగానే, హేమ చుట్టూ ఆ శాలువ కప్పాడు మూర్తి.
హేమ పక పక నవ్వి అప్పుడే ఉదయించు చంద్రుణ్ని చూస్తూ, నువ్వూ, నేనూ, చంద్రుడూ, సముద్రమూ, నిశ్చలతా, చలీ, ఈ చక్కటి రాత్రీ! ఏదో సినిమాలో దృశ్యంలా ఉంది అన్నది.
విషాదగర్భితమైన చిరునవ్వు నవ్వుతూ త్యాగతి, సముద్రతరంగాలలో స్నానం పూర్తికావించి పైకి తేలిపోయే చంద్రుణ్ణి చూచాడు.
ఏమోయీ బావా! ఆ చంద్రుడూ, నువ్వూ ఒకే విధంగా వున్నట్టే కనబడతారేమిటి నాకు! అని హేమ ఇంకా నవ్వుతూ ముందుకు నడిచింది.
ఎన్ని నక్షత్రకాంతులున్నా, అతడు ఎప్పుడూ ఒంటిగా ఉంటాడనా?
మాట్లాడితే నీకు పురుషులు స్త్రీలై తోస్తున్నారేమిటి బావా? నీకు తారలే కావలిస్తే, ఈ ఊరునిండా సినిమా తారలే!
నేను ఎప్పుడూ ఒంటివాడినే హేమా!
జంట దొరకని మహాప్రళయపుటింటిలో ఒంటిగా ఉయ్యాలలూగే వాడవా?
బసవరాజు అప్పారావుగారి ఆ పాట ఎంతో అందంగా వుంది కదా హేమా?
నాకు పిగ్మిలియాన్ కథ ఎదుటగా ఆడుతూనే వుంది బావా! బసవరాజువారి పాటమీదకు పోవటం లేదు.
మగవాళ్ళ అన్యాయం తలుచుకుంటూ, మండిపడి పోతున్నావు కాబోలు?
ఆ! నేనే పిగ్మిలియాను అవుదామని ఉంది. ఏబోయినోచేత పుచ్చుకొని, వాడికి సంపూర్ణ సంస్కారమిచ్చి, కులం, సంప్రదాయం, పుట్టుక, గొప్పదనం అనీ, హుళక్కి అని చూపించదలచుకొన్నాను.
వాళ్ళిద్దరూ సముద్రపు అలలకు కొంచెం దూరంలో, ఇసుక ఒడ్డున కూర్చున్నారు. త్యాగతి పక్కగా చేరింది హేమ.
ఈ మాటలన్నీ ఎందుకుగాని బావా! నువ్వు అన్ని దేశాలూ తిరిగావు. మొత్తంమీద నీకు కలిగిన ముఖ్యభావం ఏమిటి?
వాళ్ళిద్దరూ ఆ కెరటాలు చూస్తూ కూర్చున్నారు. శాలువ తన చుట్టూ కప్పుకొని హేమ జరిగి త్యాగతిని ఆనుకొని కూర్చుంది.
ఏమిటీ విచిత్రమైన బాలిక! ఈమెకు జీవితం అంటే ఆవగింజంతైనా అర్థమైందా? ఒక మాటు అగ్నిశిఖలా భగ్గుమంటుంది. ఇంకోసారి అత్తరులా అలుముకుపోతుంది. తాను ఈ బాలికను వివాహం చేసుకొని ఆనందం అనుభవించకలడా? ఈ బాలికలోని చంచలత్వాన్ని నాశనం చేయగల శక్తితనకు వుందా? ఆమెలో భక్తీ, ప్రేమా, జీవిత మహాఝంఝామారుతాన్ని ఎదుర్కోగలిగే ధీరత్వమూ ఉద్భవింపచేయగల మగవాడు వేరే ఉన్నాడా? ఎందుకు వచ్చిందో ఆమెనోటివెంట ఒంటి చంద్రుని భావం. తానివి అన్నీ వదిలి తిన్నగా స్వామీజీ దగ్గరకు చేరుకొని, నిజమైన శాంతినిచ్చే తురీయాశ్రమం పుచ్చుకొని, జీవితసత్యాన్ని అన్వేషించే ప్రయత్నంలో దీక్ష పూనగూడదా?
బావా! నీ పూర్వకాలపు మౌనంజబ్బు మళ్ళీ ప్రవేశించిందా? నేనూ నా చరిత్ర రాశానులే! అది నువ్వు చదువు.
అదికాదు హేమా! నేను మదరాసు వచ్చాను. ఏడాదిపాటు మళ్ళీ జీవించాను. ఇక్కడ దారుశిల్పమూ, దంతశిల్పమూ విన్యసించడం నేర్చుకున్నాను. ఒక్క మాటలో, ఒక్కకనురెప్ప వాల్పులో నీ జీవితానికి అడ్డం వచ్చేపని ఏమీచేయలేదు. నీ స్నేహితురాండ్రతో, స్నేహితులతో నువ్వు స్వేచ్ఛానందంతో ఒక్క మధురమైన ఆటగానే, నీ జీవితం వెళ్ళబుచ్చుతూ ఉంటే, ఆ ఆనందం పుడిసిళ్ళ జుర్రుకొన్నాను. నీకు మన చుట్టరికం తెలియజేయకుండా; నీతోనూ, నీ స్నేహితులతోనూ, నీ ఈడు యవ్వనునిలా స్నేహంచేసి; నాలో ఉబికివచ్చిన అనుమానాలూ, జీవిత వైముఖ్యమూ నాశనం చేసుకొని, నా కర్తవ్యం నిర్మలరూపంతో ప్రత్యక్షం చేసుకొన్నాను. ఇంక నేను నా కర్మయోగంలో పూర్తిగా ప్రవేశించాలి. నాకు నువ్వు అనుజ్ఞ ఇస్తే మా స్వామీజీ ఆశ్రమం చేరుకుంటాను.
హేమ తెల్లబోయింది. తలతిప్పి త్యాగతి ముఖంవైపు ఒక్క నిమిషం తీక్షణంగా చూచింది. సరే బావా! నిన్ను మదరాసు వచ్చి నేను ఉండమనలేదు: తొమ్మిదేళ్ళు మా కెవ్వరికీ కనబడకుండా దేశాలు తిరగమని నేననలేదు. నీ ఇష్టమైతే నీ గురువుగారి ఆశ్రమానికే కాదు, ఉత్తర ధ్రువం వెళ్ళు. మధ్య నాకెందుకు? నేనా నీకు ఆజ్ఞలు ఇచ్చేదాన్ని? ఈ తొమ్మిదేళ్ళూ నా ఆనతిమీదే వున్నావా? అన్నది.
ఆ మాటలలోని కోపమూ గ్రహించాడు, ఆమె ఆ కోపపు మాటలలో కూడా తొణికిసలాడే తేనెలు హృదయమార గ్రోతులూ త్యాగతి,
హేమా నేనేది మాట్లాడినా తప్పు అర్థంచేసుకుంటావేమి కర్మం?అన్నాడు.
ఇక్కడ ఓ అబ్బాయి ఇల్లు కొనుక్కున్నాడట. శిల్పాశ్రమం కట్టించాడట! ఇవన్నీ వదలి, గురువు దగ్గరకు వెళ్ళి వున్న కుఱ్ఱవాడు దెబ్బలాడలేక పరుగెత్తుకువెళ్ళి తల్లికొంగులో దాక్కున్నట్లు వాళ్ళ గురువుగారి జాభ్రా గుడ్డల వెనక దాక్కుంటాడట!
త్యాగతి ఆమె మాటలకు పకపక నవ్వాడు. నీ కోపమూ అందంగా ఉంటుంది అన్నాడు.
నువ్వు నన్ను పొగడనక్కరలేదు. ఒక అమ్మాయిని తన వలలో వేసికొని, 'పెళ్లి 'అనే పేరుతో తన బానిసని చేసుకుందామని సంకల్పంతో ఆ తాయిలంగారే మదరాసులో ఏడాదిమకాం పెట్టి, ఆ అమ్మాయి ఏమీ తెల్పకుండా వుంటే, వాళ్ళ గురువుగారి దగ్గరకు పరుగెత్తాడట. నిశాపతి నంది పర్వతాలకు వెడితే, త్యాగతి హిమాలయాలకు పారిపోతాడట. కల్పమూర్తి వింధ్య పర్వతాలకు దౌడుతీస్తే, ఇంక ఇక్కడ స్పచ్ఛంద ప్రణయవాదిని అని బడాయి కొట్టుకునే చక్కని పెళ్ళామున్న తీర్థమిత్రుడూ, నేనూ మిగలాలా? నేనేమన్నా ఝాన్సీలక్ష్మినా, లోకంతో ఒంటిగా దెబ్బలాడటానికి?
హేమా! నేను వట్టి వాజమ్మనే! వేళాకోళంగా అంటే అంత కోప్పడతావేం అన్నాడు త్యాగతి. ఈ బాలిక ఎంత నవీన యుగహృదయ! మొమోటమే లేకుండా కర్ర విరిచినట్లు చెప్పేసింది. నిర్భయం! యింత హంగామా చేసి, అతి గోప్యంగా అతి జాగ్రత్తగా తాను సంచరిస్తే, రెండు మాటలలో తేల్చిపారవేసింది. ఇంక తాను మాత్రం తన పూర్వ విధానానికి ఏ రీతిగానూ, అణువు కూడా తప్పకుండా సంచరించాలి. ఇక తన కర్తవ్యం తన కళే! వీలయినంత జాగ్రత్తగా హేమను ఆమె ఎవరినో తానిష్టపడిన యువకుణ్ణి వివాహం చేసుకునేవరకూ, కనిపెట్టి వుండడమే తన యోగం అనుకున్నాడు.
వెడదామా హేమా?
నేనంటే అప్పుడే విసుగు వస్తోందా బావా? అవును, నేను శిల్పినికాను, నీతో కళలను గూర్చి చర్చించను. పోనీ అంత సంగీతమూ నేర్చుకొని ఒక్క పాటైనా పాడను. పాటలను గూర్చి, సాహిత్యాన్ని గూర్చీ నిన్ను ప్రశ్నలు వేయను. వేదాంతమును గూర్చి చర్చించలేను. ఇన్ని దేశాలు తిరిగారు బావగారూ, ఆయా దేశాల విచిత్రాలు చెప్పండి అని అడగను. ఎంతసేపూ సీతాకోకచిలుకలా ఇక్కడా అక్కడా వాలడమూ, టెన్నిసూ, సినిమాలూ, బాతాకానీ, బ్రిడ్జి అటా, స్నేహితులూ, స్నేహితురాండ్రూ, బీచి షికారూ, దొంగతనంగా అప్పుడప్పుడు సిగరెట్టూ, తుక్కునావెల్సూ ఇంతేగా నా జీవితం. ఈ సోదాబుడ్డితో నీకు విసుగుకాదా మరి?
హేమా!
మళ్ళీ ఇంకో ఉపన్యాసం ఇవ్వడానికి సిద్దం అవుతున్నావూ?
త్యాగతి పకపక నవ్వాడు. హేమ తన బావగారి రెండు చెంపలు తన అత్యంత మృదులమై, పరమ సౌందర్య రేఖలతో చెన్నారే చిన్న హస్తాలతో అదిమి పట్టుకొని, అతని కళ్ళల్లోకి తేరిపార చూచి, బావా! నీవంటి ఉత్తమ పురుషునకు నేను తగిన మరదలను కాను సుమా? అని అంటూ చెంపలు వదలి, వెళ్దాం లే అంటూ లేచి కారు దగ్గరకు గబగబ నడవడం ప్రారంభించింది.
10
మరునాడు ఉదయం తీర్థమిత్రుడు హేమసుందరి ఇంటికి వచ్చాడు. హేమ ఇంకా ఇంటికి రాలేదు, లోకేశ్వరీ లేదు.
పనిమనిషి, వాళ్ళిద్దరినీ రాత్రి త్యాగతిగారు తన ఇంటికి తీసుకుపోయారండీ. అమ్మాయిగారు ఆరింటిలోనే బోయినముండీ! అక్కడే ఆరు పడకంట అని తీర్థమిత్రునితో చెప్పింది.
అతడు తెల్లబోయాడు. అతని ముక్కుపుటాలు విప్పారినవి. త్యాగతి తన హేమకు టోపీ వేశాడన్నమాటే! వృద్ద జంబుకము! దొంగ! హీనుడు! నికృష్టుడు! ఎవడు వీడు? హేమసుందరిని తనకు కాకుండా చేయగలవాడు? తన శక్తి ఎరుగడు గాబోలు. ఈ దద్దమ్మా, ఈ శిల్పిగాడా, ఈ ముసలి గాడిదా తనకు అడ్డం వచ్చేది? అతడు చిరునవ్వు నవ్వుకున్నాడు.
ఒక్కొక్క కొత్త మన్మథవిజయం ఒక కొత్త రుచి సమకూరుస్తుంది. తాను ధరించిన స్త్రీ హృదయాలకు అఖండ దాక్షిణాత్య సినీ ఆకాశ ధళం ధళకమైన కనకలతా, ఒక్కొక్క బొమ్మకు లక్ష రూపాయలు తక్కువ కాకుండా పుచ్చుకునే తారారాణి కూడా కొలికిపూసలైనారు. ఎందుచేతనో హేమ తన రసికత్వానికి దాసురాలు కాక తప్పించుకొంటోంది. రతీనాధుని అస్త్రాలూ తన దగ్గిర ఎన్ని ఉన్నాయో, అన్నీ ఉపయోగించినా, పక్కనుంచి జారిపోతోంది. ఈ అమ్మాయి ఒక విచిత్ర స్త్రీ జాతికి చెంది. ఉండాలి! పాత మంత్రాలు ఇచట పారవు.
లోకేశ్వరి విషయంలో కొంచెం ప్రయత్నించినమాట నిజం. కాని ఆ తెలివి తక్కువ దద్దమ్మ తనంటే ఓ పురుగులా చూస్తుంది. తన శక్తులలో దిట్టమైనవి కొన్ని ఉపయోగిస్తే లోకేశ్వరి ఈనాటికి....కాని అసలు వస్తువుకోసం చూస్తూ ఈ వడ్డీల గొడవ తన కెందుకు? నాయికను కరిగించలేక దూతికను పట్టుకున్నట్టవుతుంది. తాను హేమతో స్నేహం ప్రారంభించిన ఈ రెండేళ్ళనుంచీ, జర్మనీయుద్ధం చేయవలసి వస్తోంది. ఒక పక్క ఆ పందిగాడు కల్పమూర్తి, ఓ పక్క లోకేశ్వరి, నిశాపతి ఒకడూ, నిశాపతి తన సంగతి, తన యుద్ద కార్యక్రమం గ్రహించిన అసాధ్యుడు. అందుకనే తానతిజాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. తీర్థమిత్రుడైన జానకి రామమూర్తి ఆ ఉదయం హేమసుందరి చిత్రానికి ఎదురుగుండా సోఫాలో కూర్చున్నాడు. హేమసుందరి ఎవరికైనా మతి పోగొట్టగల బాలిక. ఈ అందం వినాయకరావుగారి కూతురు కెల్లా వచ్చిందో అనుకున్నాడు. త్యాగతి ట ఏమిటీ చచ్చుపేరు. శర్వరీభూషణ్ చచ్చురకం బెంగాలీ పేరు. ఏడాదినుంచీ వీడి భోగట్టా ఏమీ తెలిసిందికాదు. చిన్న తనంలో వీళ్ళందరినీ బాగా ఎరుగునట. దేశాలన్నీ తిరిగాడట. యూరపు కూడా వెళ్ళాడని అప్పుడప్పుడు తేలింది. వీడు హేమ జీవితరంగంలో ప్రవేశించినప్పటి నుంచీ హేమ చాలా మారిపోయింది. నిన్న త్యాగతిగారి ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరూ పడుకోవడ మేమిటి? వాడు వట్టి బ్రహ్మచారికదా? ఏదో వుంది. అసలు ఈ రెండు మూడు రోజులూ హేమ ఈ లోకంలో లేదు. తాను వచ్చిన సంగతీ, వెళ్ళిన సంగతీ లెక్కచేయందే! కల్పమూర్తి ఈ రెండు మూడు రోజులూ వాజమ్మలా తెల్లబోయి తిరుగుతున్నాడు.
హేమను పలకరిస్తే ఎక్కడో మనస్సు పెట్టుకొని కట్టె విరిచినట్లు మాట్లాడింది. నిన్న సాయంకాలం ఒక్కర్తే తన ఓపెల్ కారుమీద ఎక్కడికో వెళ్ళిందంటే సోఫీ ఇంటికేమో అనుకున్నాడు తాను. ఇంతలో కల్పమూర్తి కారు అరుస్తూ, గుమ్మం ముందు పోర్చిలో ఆగినట్లు చప్పుడైంది. కల్పమూర్తి లోనికి వచ్చాడు.
తీర్థం, నువ్వా?
మూర్తీ! నిన్న సాయంకాలం ఎక్కడికి వెళ్ళిందో హేమ తెలుసా?
ఎక్కడికో ఒక్కర్తే వెళ్ళిందంటే, సోఫీ ఇంటికి కాబోలు ననుకొని, రాత్రి ఎనిమిదింటివరకూ చూచి చక్కాబోయాను.
త్యాగతిగారింటికి వెళ్ళింది. అక్కడే భోజనమట!
త్యాగతి హోటలు నుంచేగా కారియరు తెప్పించుకుంటాడు. ఆ భోజనానికి హేమ వెళ్ళవలసిన అగత్యం ఏమివచ్చింది చెప్మా? నాతో లోకేశ్వరి హేమ ఎక్కడికి వెళ్ళిందో తనకు తెలియదని చెప్పిందే!
లోకేశ్వరి నీతో చెప్పిందా? అయితే వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళలేదన్నమాట త్యాగతి?
త్యాగతి తీసుకు వెళ్ళట మేమిటయ్యా?
వాళ్ళ పనిమనిషి లోకేశ్వరిగారినీ, హేమగారినీ త్యాగతి వచ్చి రాత్రి తనింటికి తీసుకువెళ్ళాడని చెప్పిందేమిటి?
నాతో లోకేశ్వరి నిన్నరాత్రి ఎనిమిదిన్నర గంటలకు హేమ తన చిన్న కారుమీద ఒకర్తే ఎక్కడికో వెళ్లిందని చెప్పింది.
ఈ గొడవంతా ఎందుకూ? ఇద్దరం లోపలిపోయి కనుక్కుందాం రా!
ఈ మాట లంటుండగానే, హేమ కారు చప్పుడైంది. వాళ్ళిద్దరూ హాలులోంచి గుమ్మం దగ్గరకు రెండంగుళముల ముందుకు వెళ్లారు. లోకేశ్వరి వెనక సీటులో ఉంది. ముందు కారు నడిపే హేమ ప్రక్క, త్యాగతి కూర్చుని ఉన్నాడు. తలుపులు తీసుకొని హేమా, త్యాగతి ఒక్కసారిగా దిగారు. లోకేశ్వరి తర్వాత దిగింది. హేమ దిగుతూనే హల్లో తీర్థ్ ! హల్లో కల్ప్ ! మీ ఇద్దరి మొహాలు వెలిసిల్లినట్లున్నాయే! అవి చూస్తే, మా కోసం విరహతాపం పడుతున్నట్లుందే మీరు? అన్నది. పెద్దకారు డ్రైవరు వచ్చి హేమ కారును గారేజీలోనికి నడుపుకుపోయాడు.
లోకేశ్వరి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. హేమ త్యాగతిని చూచి బావా, నిన్న రాత్రి నాకు మీ ఇంటిదగ్గర భోజనమైతే, ఈ పగలు మాఇంటిదగ్గర భోజనం! మా సుందరమ్మగారి వంట నువ్వు ఈ రోజు రుచి చూడాలి. మీ అమ్మగారికి సైకిలుమీద వెళ్ళి....ఉండు మా కారును పంపించి అత్తయ్యగారినే ఇక్కడకు రమ్మంటాను అన్నది.
మా అమ్మ మాకు మామూలుగా కట్టే టాక్సీ మీద వస్తోందిలే! నేనూ, మా అమ్మా ఈ రోజు ఇక్కడ ఉండటానికి అప్పుడే నిశ్చయించు కొన్నాములే! అని చిరునవ్వు నవ్వాడు త్యాగతి.
తీర్తమిత్రునికీ, కల్పమూర్తికీ వీరిద్దరి మాటలూ ఏమీ అర్థంకాలేదు. బావా ఏమిటి అని ఇద్దరూ అనుకున్నారు.
త్యాగతిని మీకు మళ్ళీ ఎరుకపర్చాలి! ఈయన మా బావ ! ఇన్నాళ్ళనుంచీ ఏదో దేశాలు తిరుగుతున్నాడనుకున్న మా బావ ! శ్రీనాథమూర్తి అన్నది హేమ.
కల్పమూర్తి: మీ బావ అంటే శకుంతల భర్త శ్రీనాథమూర్తిగారా?
త్యాగతి: అవునండీ కల్పమూర్తిగారూ! అని నెమ్మదిగా కల్పమూర్తి చేయి అందుకున్నాడు. అతని మోములో విషాద రేఖలు ప్రసన్నత తాల్చినవి. అతడు తలవాల్చి నేను మా మామగారినీ, అత్తగారినీ చూడడానికి వచ్చాను. ఏలా వచ్చానో, అలా వెళ్ళిపోదామనుకుంటున్నాను అని తెలిపినాడు.
తీర్థమిత్రుడు : మీరు ఈ ఏడాది మా కెవరికీ తెలియకుండా ప్రచ్ఛన్నంగా ఉన్నారా?
త్యాగతి : అవునండి.
తీర్థ : ఆ ఉండడంలో మీ ఉద్దేశం?
త్యాగతి : అది నా రహస్యంలెండి.
తీర్థ : మీ రహస్యమా? ఏమిటా రహస్యం? ఏదో నాటకమో నవలో అన్నట్లు వున్నది. పదిరోజులు రహస్యం. నెలరోజులు, ఒక్క ఏడాదా!
త్యాగతి : ఎవరి రహస్యాలు వారికి ఉంటాయి కదాండీ. ఒక్క ఏడాదికాదు, జన్మంతా రహస్యంగా ఉండాలని ప్రయత్నం చేసినవారులేరా?
కల్ప : మా జిల్లాలో ఒకాయన సంసారం వదలివెళ్ళి, పదేళ్ళు దక్షిణాదిని ప్రచ్ఛన్నవేషంగా ఉండి, చివరకు ఇంటికి వచ్చాడు. ఎంత మందో ఆయన కోసం వెదికి, ఏమీ కనిపెట్టలేకపోయారు.
తీర్థ : అలాంటి చిత్రాలు ఉంటాయి కాబోలు! హేమ : నేను స్నానం చేసి వస్తాను. మీ రందరూ మాట్లాడుతూ ఉండండి. తీర్థం! నువ్వేమీ పెద్ద ఆశ్చర్యంలో పడి మా బావను హడల గొట్టకు. ఎలాగో దొరికాడు. మళ్ళీ ఏ దేశమో పోయాడా అంటే, కొంపలు మునుగుతాయి అని ఆమె పరుగెత్తినది.
11
త్యాగతి వినాయకరావుగారి అల్లుడనీ, చనిపోయిన పెద్దమ్మాయి శకుంతలమ్మగారి భర్త అనీ నెమ్మదిగా ఆ యింటిలోని నౌకర్లందరకూ, పనికత్తెలకూ, వంటవారికి తెలిసింది. వంటలక్కకు ఎడాదినాడు త్యాగతిగారిని చూసి వెంకట్రామ రాజ్యలక్షమ్మగారు మూర్ఛపోయిన దృశ్యానికి అర్థం తెలిసింది. ఆనోట ఆనోట త్యాగతిగారికీ చిన్నమ్మాయి హేమసుందరిగారిని ఇస్తారని గుసగుసలుగా తెలిసింది. అసలే నౌకర్లందరకూ త్యాగతిగారంటే ఎంతో ప్రాణం. అతనిలోని తేజస్సు, అతనిలోని నమ్రత, ఠీవి, ఉదార హృదయం, ఆయన శక్తులు, నౌకర్లందరకూ గౌరవమూ, ప్రేమ కలిగించాయి. నేడు వారందరికీ త్యాగతి అత్యుత్తమ పురుషుడే అనిపించినది.
లోకేశ్వరి స్నానంచేసి, బట్టలు ధరించి, తిన్నగా తన గదిలో పూజాపీఠం దగ్గరకు వెళ్ళింది. అక్కడ శకుంతల ఫోటో, పార్వతీ, లక్ష్మీ, అన్నపూర్ణాదేవుల విగ్రహాలున్నాయి.
శకుంతలక్కా! హేమ బావగారిని తెలుసుకుంది. నువ్వే నన్ను రక్షించావు. నీ చెల్లెలిని కూడా రక్షించావూ? నువ్వే పార్వతివి, అన్నపూర్ణవు, లక్ష్మీదేవివి, సరస్వతీదేవివి? హేమను గురించే నాకు భయం. శకుంతలాదేవీ! నీ ఇష్టంవల్లనేకదా, శ్రీనాథమూర్తి బావగారు హేమ దగ్గరకు వచ్చానని తన గ్రంథంలో వ్రాసుకున్నారు! అని కళ్ళనీళ్ళు తిరుగుతుండగా ఫాలాన్ని ఆ పీఠంమీద ఆనించి ప్రార్థించింది.
హేమసుందరి తాను త్యాగతిని వదలివెళ్ళి స్నానంచేస్తూ తన అందాన్ని చూసుకుంది. తెలుపుగులాబీల ఆ బంగారు వళ్ళు, బిగువులు తిరిగిన వక్షోజాలు, గులాబీరంగుల చూచుకాలు, వంకలు ఎంచలేని అంగరేఖలు ఇది తన ప్రథమ సంపద! అందంలో నసీముకాని, మెహతాబ్ కాని, బీనాకాని, రేణుకాదేవికాని, లీలాచిట్నీస్ కాని, వనమాల, బీగంపారా, నర్గీస్, కాంచనమాలలుకాని ఎవ్వరూ తనకడ మైలుదూరంలోనైనా ఉండడానికి అర్హత ఉందో లేదో! కుర్షీద్! సుబ్బలక్ష్మి, రోమలా, దేవికారాణి కన్నన్ బాలా, వసుంధర, జయమ్మలకున్న ఆకర్షణ శక్తికన్న తనకు నూరురెట్లు ఎక్కువ ఉన్నదన్నమాటా నిజం. తాను ఆనర్సులో మగవాళ్ళందరినీ మించి, విశ్వవిద్యాలయానికి మొదలుగా జయమంది, పతకాలూ, గౌరవమూ సంపాదించింది.
మూడునెలలైంది తన్ను వివాహంకాగోరి, ఒక అరవయ్యరు ఐ. సి. ఎస్, రాయబారము పంపించాడు. కాని తన తల్లిదండ్రులకూ తనకూ ఏమీ యిష్టం లేకపోయింది. సర్వవిధాలా పురుషునికి భోగ్యవస్తువుగా మాత్రం తన్ను తాను తయారుచేసుకుంది. ధనం ఉంది, చదువు ఉంది, అందం ఉంది, సంగీతం బాగా వచ్చు, ఏవో పాటలు రాస్తుంది, వ్యాసాలు రాసింది, రేడియోలో మాట్లాడింది, పాటలు పాడింది, ఒకటి రెండు రేడియో నాటకాలలో పాల్గొంది, అంతమాత్రాన తాను జీవిత కర్తవ్యం ఏమి నిర్వర్తిస్తున్నది ?
పురుషుడు జీవిత ధర్మం నిర్వర్తిస్తున్నాడు! నిర్వర్తించి? అలా జీవితంలో కర్మయోగి కావడమే మనుష్యుని ధర్మం. ఆడది? ఆడది మొగవాడికి చేదోడు, వాదోడు; అతని పురుషత్వానికి నాయిక. అతనికి పక్కవేసి, అతని బిడ్డలకు పాలిచ్చి, బువ్వపెట్టి, వాళ్ళకు నీళ్ళుపోసి, బట్టలుకట్టి పాఠశాలలకు పంపి, వాళ్ళకు ఆపత్తువస్తే ఆడుపులియై; రాత్రిళ్ళు నీళ్లు పోసుకొని, తల దువ్వుకొని, బొట్టు పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, పడకగదికి తయారై, అతని కామదాహానికి పెదవుల అమృతమిచ్చి, దేహమే భోజనంగా అర్పించి; అలసటపడి నిద్రపోయి, మధ్య పాలబిడ్డ ఏడిస్తే పాలు కుడిపి; తెల్లవారగట్ల లేచి, పాచిపనిచేసి, చేయించి, కాఫీ ఉపహారాదులు పురుషునికి అర్పించి, వంటకు తయారై, భోజనం ఆ మగవాడకి పెట్టి, అతడు వంటకాలు బాగున్నాయంటే సంతోషించి, అతడు వెళ్ళాక వంటిల్లు కడిగి, సర్ది, ఏవో రెండు మెతుకులు నోట్లో వేసుకొని; కొంచెం మేనువాల్చి, లేచి, రాత్రి భోజనానికి బియ్యం బాగు చేసుకొని, పప్పులు అవి బాగు చేసి, ఇతర పనులు చేసుకొని, పక్కయింటి అమ్మలక్కలతో నాలుగు కబుర్లు చెప్పి వాళ్ళనీ వీళ్ళనీ ఆడిపోసికొని;__తెలివి తక్కువదైతే, ఇంటిపక్క వుండే ఓ వెధవయ్య కళ్ళ కబళింపులకు గుటకులు మ్రింగి, హడలి బేజారై ; పెరిగి, జుట్టు అక్కడక్కడ నెరసి, అత్తగారై, కూతురు కాంక్షలతో తన కాంక్షలు మిశ్రమంచేసి, ఆపేక్షలతో అల్లుళ్ళను ముంచి కోడళ్ళను కత్తులు నూరి; అమమ్మయై; బామ్మై, పళ్ళూడి మనుమరాళ్ళనూ, మనుమలనూ ఆడించి; వివధయై బుఱ్ఱ గొరిగించుకొని, వంగిపోయి, వెఱ్రి ఆచారపరురాలై, ఆపేక్షలు మరచి, అందరికి గుండెలో నిద్రై, చావు రాక కష్టాలు రుచి చూచి, ఏడ్చి, చివరకు కళ్ళల్లో నీళ్ళులేక క్రుంగి, మునిమనుమల మనుమరాండ్ర బాధలకు లోనై, ఇనిమనుమల నెత్తి, ఇతరులు తన చావుకోర, తన చావుకై తాను దేవుళ్ళ ప్రార్ధించి పండై, ముగ్గి ముగ్గి, రాలిపోయి, గంపెడు సంసారపు తల్లి తల్లిగా పొగడ్తలనందే, ఆడదాని జీవితమేనా తానూ అనుభవించేది!
తన స్నానాల గదిలోనే తానొక నిలువుటద్దం అమరించుకొన్నది ఆమె అనుకుంది; ఆడదానికి తన అందం తాను చూచుకొని ఆనందించే వెఱ్రి వుంది. తన అందం ఆడవాళ్ళు చూచి ఆనందించాలి. మగవాడు చూచి ఆనందించాలని అనాచ్చాదితమైన తన దేహం సంపూర్ణంగా చూచి స్త్రీలు ఆనందించాలని కోరుతుంది, లేక అసూయతో వుడికిపోవాలని కోరుతుంది. అచ్ఛాదితా నచ్చాదితంగానో సంపూర్ణ నగ్నంగానో తన దేహం ఆ పురుషుడు చూడడంలేదని తాను మామూలుగా వున్నట్టు నాటకమాడుతూ, దర్సనం ఇస్త్రుంది. చటుక్కున ఎవరో చూస్తున్నారేమో అన్నట్లు నటించి, కంగారు పడినట్లుగాగాని, ఏమీ ఎరగనట్లుగాగాని సంపూర్ణాచ్చాదితం చేసుకుంటుంది. పరదాలో వుండి తొంగి చూస్తుంది. తనవారు లేనప్పుడు పరదా తీసివేస్తుంది. లోకాన్ని ఆశ్చర్యంలో తిలకించే బిడ్డలా నటిస్తుంది. పెద్దకళ్ళతో ఏమీ ఎరుగని లేడిలా చూస్తుంది. కళ్ళు అరమూతలు మూస్తుంది. నిర్భయంగా వున్నట్లు అభినయించి, మగవారితో మాట్లాడుతుంది మగవాడు తగిలినట్లు వులిక్కిపడుతుంది, తగిలినా ఏమీ ఎరుగనట్టు ఆవులా తన దారిని పోతుంది. స్త్రీ పొగడ్త వాంఛిస్తుంది. మాటలు లేని మెచ్చుకొనుట కుబ్బిపోతుంది. ధూపం కోరుతుంది. చిరుకోరికలతో గవ్వలాడుతుంది. పెద్ద కోర్కెలను రంగూను మోలుమేను పెట్టెలలో పెట్టి, అడుగున దాచుకుంటుంది, మనస్సు పసిఫిక్కు లోతులలో మాత్రం దాచుకుంటుంది. అది గాలికై ఎప్పుడైనా పైకి తొంగిచూస్తే అది ఎవరిదా అని తానే ఆశ్చర్యం వ్యంజనము చేస్తుంది. అబద్దములూ ఆడుతుంది. అవి నిజాలంటుంది. నిజాలని భ్రమింప చేస్తుంది. తానే నమ్ముతుంది, కావని అనుమానపడుతుంది. మెరుపులా జ్వలిస్తుంది. గాలిలా ప్రసరిస్తుంది, చినుకులా అణగి మణగి పోతుంది. చంద్రుడై శాంతి, సూర్యుడై కాంతి, తారయై భ్రాంతి మగవాని జీవిత పథాలలో కమ్మివేస్తుంది.
త్యాగతి ఒక నాడనినట్లు స్త్రీ మాయ, మాత; స్త్రీ బాలిక, ఫ్రౌఢ, అవ్వ; స్త్రీ చీకటి, స్త్రీ ఆకాశం; స్త్రీ అమృతమూ, మరణమూ.
ఏమిది! తన ఆలోచనలకు అంతులేదని హేమ అనుకొన్నది. "స్నానం చేసేటప్పుడు సతులకు, నిద్రపోయే పురుషులకు ఆలోచన లెక్కువ" యని త్యాగతి అన్నాడు. అతడే "స్త్రీ మొదట తన్ను ప్రేమించుకుంటుంది. తరువాత పురుషుణ్ణి ప్రేమిస్తుం"దన్నాడు. స్త్రీ తన కాంక్షలను చంపుకోకలిగినట్టు పురుషుడు చంపుకోలేడట. స్త్రీ ధరించడంలో భూమి అన్న పెద్దల వాక్యంలో తప్పులేదని త్యాగతి ఒకనాడు వాదించి తన్ను ఒప్పించాడు.
స్నానం పూర్తిచేసి, అలంకారపు గదిలోనికి పోయి, ఏదో చీరె చుట్టుకొని తల దువ్వుకొంది. ఇంతకూ తన్ను తాను ప్రేమిస్తోందా? ఇంకెవరినన్నా ప్రేమిస్తోందా? ఆమె చిన్న పట్టులాగు మొదట తొడిగి, తెల్లటి పట్టుపరికిణీ తొడిగి, పైన వుల్లిపొరలాంటి, పాము కుబుసంలాంటి తెల్లని మజ్లిన్ చీర, చక్కని లతలూ, అంచులూ కలదానిని ధరించింది. తెల్ల పట్టుబాడీ తొడిగింది. ఆ పైన తెల్లని బాడీస్ తొడిగింది. అప్పుడే వస్తున్న తెల్లని జాజిపూలు జడపైన ధరించింది. ముత్యాల జూకాలు పెట్టుకుంది. మెళ్ళో రవ్వల అడ్డిగె, ముత్యాల తారహారం ధరించింది. చేతులకు ముత్యాల గాజులు, ముత్యపుటుంగరము పెట్టుకుంది. అలంకారపు గదిలోని నిలువుటద్దాలలో చూచుకొంది. తలుపు తీసుకొని, "లోకం" అని కేకలు వేస్తూ బయటకు వచ్చింది.
12
"ఎందుకే హేమా!" అని ప్రతివచన మిస్తూ లోకం తనగది వీడి వచ్చింది; హేమాన్ని చూచి, లోకేశ్వరి ఆనందంలో వుప్పొంగిపోయింది. ఈ అలంకరించుకోవడం త్యాగతికోసమని లోకేస్వరికి తెలుసును. వీళ్ళిద్దరూ కలిసి, త్యాగతీ వాళ్ళు కూచున్న హాలులోకి వెళ్ళారు.
వీళ్ళిద్దరూ వెళ్ళేసరికే త్యాగతి కల్పమూర్తితో నెమ్మదిగా " ఎనిమిది సంవత్సరాలు దేశాలన్నీ తిరిగి , మా ఊరు చేరుకునేసరికి మా మామగారినీ అత్తగారినీ, హేమనూ చూడాలనీ ఆపజాలని కోర్కె పుట్టింది. వెంటనే ఈ ఊరు వచ్చి వీరిని కలుసుకున్నాను. హేమను పెళ్ళిచేసుకోవలసిందని వారిద్దరూ కోరారు. గురువు ఆజ్ఞా అదే! మా చుట్టాలందరూ కోరిందీ అదే! కాని హేమ హృదయం తెలుసుకోకుండా ఎలాగు? బావగారిని వివాహం చేసుకోవడము ధర్మంగా ఎంచి, హేమ ఒప్పుకోవచ్చును. లేదా, హేమకు వున్న అత్యంత నవీనాభిప్రాయాలతో నిరాకరించవచ్చును. అందుకని ఈ నాటకం నడిపాను. ఈ విషయం మీ హృదయంలో మాత్రం వుంచుకోండి" అని చెప్పినాడు. కల్పమూర్తికి ఒక రకమైన సంతోషము, ఓర్వలేనితనమూ రెండూ వెలుగు నీడలులా ప్రసరించాయి. లోకేస్వరీ, హేమ సుందరులు హాలులోనికి రాగానే త్యాగతీ , కల్పమూర్తీ ఇద్దరూ లేచారు. తీర్థమిత్రుడు అక్కడ లేడు.
హేమ : శ్రీనాథమూర్తిబావా! మనం కాలక్షేపంకోసం ఏ పేకాటో ఆడుకోవాలనీ, తుక్కునవలలు చదువుకోవాలనీ, బాతాఖానీ వేసుకోవాలనీ, కునుకుపాట్లు పడాలనీ, మొదలయిన కార్యక్రమం అంతా కట్టివేయదలచుకొన్నాను. ఈ క్షణంనుంచి హేమకుసుమసుందరి ఏమవుతుందో చెప్పుకో! నా పేరు ఇక్కడనుంచి హేమకాదు 'భీమ' కాదలచుకొన్నది. నేనూ ఓ అయిదేళ్ళ ప్రణాళిక వేశాను__నా బావదగ్గర చిత్రలేఖనం, శిల్పం నేర్చుకొనడం, రుక్మిణీ అరండేలుగారి కళాక్షేత్రంలో నాట్యం నేర్చుకొనడం, ఆంధ్ర మహిళా సభలోకి రోజూ వెళ్ళడం, బాలికలకు చదువు చెప్పడం__జీతం గీతం జాంతానై, దుర్గాబాయమ్మగారికి సర్వ విధాలా సహాయం చేయడం, మా బావదగ్గర ప్రపంచజ్ఞానం నేర్చుకోవడం-ఇదీ నా పంచవర్ష ప్రణాళిక !
త్యాగతి ' సెహబాస్ ' అని చప్పట్లు కొట్టాడు. అందరూ పకపక నవ్వారు.
త్యాగతి: హేమా ఈ నిశ్చయం మళ్ళీ మార్చుకోనని ప్రతిజ్ఞచేస్తావా?
హేమ: మా అక్క స్మృతి సాక్షిగా ఇదే నా ప్రమాణం బావా!
కల్పమూర్తి: బావా అనడమే అలవాటయినట్లు మాట్లాడుతోంది హేమం!
హేమ : ఏయి అబ్బాయీ! నన్ను ' హేమం గీమం ' అని పిలవొద్దు. హేమసుందరి అను. లోకేశ్వరి : మళ్ళీ ఆ సుందరి మాత్రం ఎందుకే? ' భీమశక్తి ' అని పేరుంచుకోరాదూ?
త్యాగతి: నేను ఆ పేరును బలపరుస్తున్నాను!
కల్ప: నేనూనూ!
అందరూ చప్పట్లుకొట్టి పకపక నవ్వారు. ఇంతట్లో తోటలోనికి వెళ్ళిన తీర్థమిత్రుడు అక్కడికి వచ్చాడు.
తీర్థమిత్రుడు: ఏమిటి హేమం ఈ గడబిడ అంతానూ? త్యాగతి గారు మీ బావగారట. ఏమండీ త్యాగతిగారూ! నా అభినందనాలు స్వీకరించండి.
త్యాగతి: స్వీకరించాను. కాని ఎందుకండీ ఆ అభినందనాలు?
తీర్థ: మా హేమకు మీరు బావగారుగా?
కల్ప: అది అంత గొప్ప ఉద్యోగమా ఏమిటి?
హేమ: అందుకు మా బావకు ఎంత జీతం ఇస్తానని నీ ఊహ తీర్ద్ !
లోకేశ్వరి: ' ఓ మరదలా!' అని పిలిచే హక్కు! అంతకన్న పెద్ద జీతం ఏం కావాలేం?
హేమ : చాలా బాగుంది. అయితే రోజుకు ఒకసారికన్నా ఎక్కువగా నన్ను ' మరదలా ' అని పిలవకు బావా!
లోకే: అది సగం జీతమే! నీచేత 'బావా' అని పిలుపించుకోవడం తక్కిన సగం జీతం.
హేమ: అయితే నేనూ, మా బావాను, రోజుకు ఒకసారికన్న ఎక్కువసార్లు 'బావా!' అని పిలవకూడదన్నమాట. లేకపోతే ఇండియా వైస్రాయికన్న మా 'బావకు' జీతం ఎక్కువౌతుందన్నమాట.
త్యాగతి : ఈ ఉద్యోగంలో వున్న విధులు?
తీర్థ: మీ మరదలితో కూడా తిరుగుతూ, చాకిరీలు చేసి పెడ్తూ వుండడం...
హేమ: దద్దమ్మ పనులకు నువ్వు మొదలు రకపువాడవు. కల్పమూర్తి వీటిల్లో నిసిందాయే. మా బావ వట్టి ఉత్తరాదివాడు. ఇంకా వీటిల్లో కొత్త. ఇక నాకు కావలసింది మా బావగారి గురుత్వం ఏం బావా! నాకు శిల్పం, చిత్రలేఖనం బహుభాషాకోవిదత్వం నేర్పుతావా?
తీర్థ: అంతకన్న ఆయనకు ఏం కావాలి? ఉత్తమ గౌరవోద్యోగం?
కల్ప: మన్ని పదిపుటాలు వేసినా అవి రావుగా మనకు.
లోకే: తీర్థమిత్రుడుగారు తలడువ్వుకోడం, పౌడరు అద్దుకునే విధానాలు అన్నీ బాగా నేర్పగలరు.
తీర్థమిత్రుడు లోపల మండిపోతున్నాడు. వీళ్ళంతా ఏకమయ్యారు. త్యాగతి చంటికుఱ్ఱవాడా?
ఈ ఆలోచన గ్రహించాడా అన్నట్లు త్యాగతి చిరునవ్వుతో, కల్పమూర్తి, లోకేశ్వరి, హేమల వైపు చూచి, మీరందరూ ఇవాళ తీర్థమిత్రుడు గారి పని పట్టేరేమిటి? ఆయన బక్కవాడు, సున్నితమైన హృదయం కలవాడు. నేను బండవాణ్ణి. నా పైన సాగించండి మీ ' బ్లిట్జు ' అన్నాడు.
హేమ: సరే కాసుకో బావా!
త్యాగతి: ఇప్పటికి నువ్వు బావా అని పిలవడం యిరవైయ్యో సారి.
హేమ: నువ్వు ఇవాళే నీ ఉద్యోగంలో చేరుతున్నావు కాబట్టి నిన్ను కొంచెం మభ్య పెట్టడానికి మొదటిరోజున జీతం ఎక్కువ ఇవ్వదలచుకొన్నాం.
త్యాగతి: నువ్వు రోజువారీ జీతం ఇవ్వదలచుకొన్నావా?
హేమ: నెలవారి జీతమే కాని రోజువారీ బహుమతి!
త్యాగతి: పేకబెత్తం బహుమతి మాత్రం చేయకు, ఆటల్లో జాజి పూవులు ఇస్తూ వుండు.
తీర్థ: ఆ పువ్వులన్నీ గుండెదగ్గర జేబులో వుంచుకొని త్యాగతిగారు నిట్టూర్పులు విడుస్తూ ఆనందం పొందుతూ ఆకాశమంటుతారు.
త్యాగతి : పూలవాసన చూసి పొంగిపోయానే!
గుండెకాడెట్టుకొని మండిపోయానే!
తీర్థ: మండిపోవడం ఏం కర్మమయ్యా!
త్యాగతి: విరహతాపం ఎక్కువై!
లోకే: మేమంతా అరటి ఆకులు, పచ్చకర్పూరం, మంచుగడ్డగా వేసిన మంచిగంధం, వట్టివేళ్ళ తడికలు జాగ్రత్త చేయాలా?
త్యాగతి : అవి నా విరహాగ్నికి వీవనలవుతాయి.
కల్పమూర్తి : ఏమిటో, మీరు మాట్లాడే భాష నాకు ఏమీ అర్ధం కావటంలేదు.
త్యాగతి : మేం మాట్లాడేది తెలుగుభాష. అందులో శిష్టవ్యావహారికం కూడా.
తీర్థ : శిష్టమో, కిష్టమో, ఈలాంటి వ్యావహారిక భాషలన్నీ వచ్చి స్వస్చమైన తెలుగుభాషను రొంపిలో ఊరతొక్కుతున్నాయి.
త్యాగతి: ఆ రొంపి, కస్తూరి పన్నీరు కలవడంవల్ల కలిగిన రొంపి. అవును. తీర్థమిత్రుడుగారు పేపర్లకు ఎప్పుడయినా వ్యాసాలు రాస్తే, శుద్ద వ్యాకరణ యుక్తంగా రాసి రొంపులు, బురదలు తగలకుండా పొడిగా ఉండే సహారా ఎడారి ఇసుకలో జాగ్రత్త చేస్తున్నారు.
తీర్థ : రొంపికన్న ఇసుక నయంకాదా అండీ!
త్యాగతి: ఇసుక, బూడిద, బుగ్గి చాలా మంచివి. బురదలో, రొంపిలో కమలాలు, కలువలూ పుడుతూ వుంటాయి.
తీర్థ: నత్తలూ, పురుగులూ, దోమలుకూడా పుడతాయి.
త్యాగతి: సృజనశక్తి అంటూ వున్న వాటిలో ఏవైన పుట్టవచ్చును. మృత్యురూపమైన ఇసుకలో, బుగ్గిలో పుట్టుకేది? నిత్యమరణమే.
తీర్థ: లుకలుకలాడే నీచ ప్రాణులు పుట్టడంకన్న, పుట్టకుండా వుండడం వుత్తమం కాదా?
త్యాగతి: అందుచే మానవ జాతి కంతకూ ఒక్కసారిగా పోటేషియం సైనైడ్ ఇస్తారా?
తీర్థ: పుట్టకుండా వుండడం మేము కోరతాముగాని, చావెందుకు కోరాలి?
త్యాగతి: అవును. చావును వేరే కోరటమెందుకు? పుట్టుకను మానిపిస్తే చాలు.
హేమ: మా తీర్థమిత్రుడికి కోపం వస్తోంది బావా! అతను భోజనానికి కూడా పోవాలి. 13
భోజనాలైన వెనుక హేమా, శ్రీనాథమూర్తీ, వినాయకరావుగారూ, లోకేశ్వరి లోపలి హాలులో కూర్చుండి, తాంబూలాలు వేసుకుంటున్నారు.
హేమ బావగారిని చూచి, బావా, నాకు నువ్వు ముహూర్తం చూచి శిల్పమూ, చిత్రలేఖనమూ ప్రారంభించు. నేను నీ శిల్పశాలకు రమ్మంటే అక్కడకు వస్తాను; ఇక్కడకు నీవు రాగలిగితే ఇక్కడకు వచ్చినా సరే నన్నది.
వినాయకరావుగారు: అమ్మడూ, నువ్వు బావ దగ్గరకు వెళ్ళే నేర్చుకోవడం ఉత్తమం కాదటే! అక్కడ పుస్తకాలుంటాయి, బావవేసిన బొమ్మలూ, తయారు చేసిన విగ్రహాలూ వుంటాయి. అవి కాకుండా అతడు సమకూర్చుకొన్న అందమైన విగ్రహాలూ, చిత్రలేఖనాలూ అన్నీ వున్నవి.
హేమ: నాన్నా ! నేను కూడా విగ్రహాలూ, చిత్రలేఖనాలు సమకూర్చుకోవద్దూ?
వినా: అట్లాగే తల్లీ! నేనెప్పుడన్నా వద్దంటానా?
లోకేశ్వరి: వివిధ దేశాల వాద్యాలదారులూ సమకూర్చుకోవాలి.
శ్రీనాథ: శిల్పరూపంలో ఉన్న వస్తువులు, శాసనాలు, నాణేలు, తాటియాకు పుస్తకాలు, అన్నీ చేర్చుకోవాలి. ఆ కళ్ళతో చూడడం ప్రారంభిస్తే మనకు నిజమైన కళాస్వరూపంకల వస్తువులు కనబడుతాయి.
లోకే: త్యాగాతిగారూ! నేనూ మిమ్మల్ని బావగారనడం ప్రారంభించవచ్చునా?
శ్రీనాథ: అదేమిటమ్మా లోకం? బావగారు అని అతి గౌరవం చేయాలా? చాల్లే! అల్లా అయితే నేను పలకనే పలకను, బావా అంటే చాలు.
హేమ: లోకానికి మా బాగా చెప్పావు బావా!
లోకే : కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ఎలాగైతేనేం నీకు ఓ బావ దొరికాడు, అస్తమానం బావా గీవా అంటూ కూర్చుంటానికి.
హేమ : ఆ కొబ్బరికాయలో సగం ముక్కను నువ్వు పుచ్చుకో! వట్టి కురిడీకాయ, నేనొక్కదాన్నీ నమలలేను బాబూ!
వినా: ఇద్దరూ తినేస్తే ఏమి బాగుంటుందర్రా. నలుగురికీ దేవుడి ప్రసాదం పంచాలిగాని.
హేమ : బావ ఏ దేవుడికి నైవేద్యం ఇవ్చిన కొబ్బరికాయమ్మా? వినా: కైలాసేశ్వరుడికి!
శ్రీనాథ: ఓహో నేను పారిపోవాలి బాబూ! ఈ బాలిక లందరూ నన్ను పంచుకుతింటారు కాబోలు. వినాయకరావుగారు పకపక నవ్వారు. అందరూ నవ్వారు. ఈ రెండు మూడు రోజుల నుంచీ తండ్రిగారెంతో సంతోషంతో వుండడం హేమ చూచింది. అసలు ఏడాది క్రిందట త్యాగతి వచ్చినప్పటినుంచీ, తలిదండ్రులలో మార్పురావడం కని పెట్టింది. కొంచెం చిరునవ్వు నవ్వడం; కాస్త ప్రపంచం అంటే ఏమిటో చూడటము; ఒకటీ, రెండు తెలుగు సినిమాలకు రావడం ఇవన్నీ కాలాన్ని బట్టి వచ్చిన మార్పులనుకుంది. తన తలిదండ్రులిద్దరూ తన బావను ఎంత ప్రేమించేవారో! తన అక్కనూ, అక్కలో సగం జీవితమైన బావనూ అమ్మా, నాన్న అద్భుతంగా ప్రేమించి ఉంటారు. లేకపోతే, ఈ చక్కని మార్పు వచ్చి ఉండదు అని హేమ ఆలోచనలో పడింది.
వినాయకరావుగారు భోజనం చేయగానే కాసేపు పడుకుంటారు. ఆయన లేచి తన గదిలోకి వెళ్ళారు. త్యాగతికి మేడమీద ఒక గదిలో పక్కవేసినారు. దానికి చుట్టాలగది అని హేమ పేరు పెట్టింది. ఆ గదిలో విశ్రమించడానికి త్యాగతి వెళ్ళి అక్కడి మెత్తటిపరుపు, తెల్లని దుప్పటి పరచి ఉన్న మంచంమీద మేను వాల్చాడు. రాత్రి హేమా, తానూ, లోకేశ్వరి తెల్లవారగట్ల నాలుగింటివరకూ మాటలాడుకుంటూనే ఉన్నారు. తన దేసాటనంలోని వింతల్నీ, విచిత్రాల్నీ గురించి వారిద్దరూ ప్రశ్నలువేయడం, తాను చెప్పడం అలా ఎంతో ఆనందంగా వెళ్ళిపోయింది. ఏదో జరుగుతుందని ఆలోచించి, ఏడాదిపాటు పాండవాజ్ఞాతవాసం చేస్తే, ఉత్తర అభిమన్యకుమారుణ్ణి ఉద్వాహం అవుతుందా? లేక నీ దారిని నువ్వు పోవయ్యా అని పంపించి వేస్తుందా? ఏమో అంతా భవిష్యద్గర్భంలో ఉంది. మనుష్యుడు ఉత్తరక్షనంలో ఇది చేస్తాడని మనం చెప్పగలమా? అతని మనస్సు మనస్తత్వశాస్త్రానికి కూడా అతీతము. తన మనస్సు తానెఱుగలేనివాడు ఇతరులను గురించి ఏమి చెప్పగలడు? కొంచెం మెచ్చుతగ్గునా చెప్పగలమేమో మనస్సుపోకడలు! ఆ పని జరిగితే జరగవచ్చును, లేకపోతే లేక పోవచ్చును అనగలం.
హేమ తిన్నగా తన గదికి వెళ్ళింది. మంచంమీద వాలింది. ఫ్యాను మీట నొక్కింది, పడుకొని కళ్ళుమూసుకొంది. తాను అలా అనేక విదాలుగా సంచరిస్తోందేమి? తనది వట్టి చంచలహృదయమా? ఒక మాటు బావ మీద కోపం. ఒకమాటు ఏదో వర్ణించరాని ఆపేక్ష. ఒకమాటు తానుచేసే పని సరియైనది అని అనుకోవడము, ఇంకోసారి అంతా అసంతృప్తే! ఒకసారి ఇంట్లో వుండ బుద్దివుండదు. ఇంతట్లోకే ఇంట్లోనే ఏవో తీయని కలలుకంటూ నిదురపోవ కోర్కె! స్త్రీలు బిడ్డలుకనే యంత్ర్రాలా? ఆడది వంట చేసి పెట్టే ఇక్మీ కుక్కరా? పనిచేసే దాసీదా? పురుషుని కామతృప్తి తీర్చే భోగినా? ఎవరో కొందరు స్త్రీలు భారతదేశంలో కూడా దారి చూపించాలి. సరోజినీదేవి బిడ్డలను కనికని విసుగెత్తి, ఆ పనిమానీ దేశ సేవకు దిగింది. కమలాచటోపాధ్యాయుని ఒక కొడుకును కంది. భర్తతో ఏమి సౌఖ్యము అనుభవించింది? పెళ్లి రద్దు చేసుకొని, ఆవిడ ఆవిడ దేశ సేవకు దిగింది. దుర్గాబాయమ్మ మొదటినుంచీ బిడ్డల గొడవ పెట్టుకోలేదు. తల్లిగా వుంటే దేశ సేవ చేయలేము. భార్యగా ఉంటే ఎంత తెలివైన స్త్రీ అయినా, భర్తకు బానిస కావాలి. అంటే తన ఉద్దేశం, స్త్రీ పదహారణాలు భార్య కావాలని ఎనిమిదణాలు దేశ సేవకాని, సంఘసేవ కాని, కళాసేవ కానిచేస్తూ తక్కిన ఎనిమిదణాలు భార్యగా వుండవచ్చునా? రెండూ కుదరవు! పోనీ స్త్రీ పురుషులిద్దరూ ఒకే రకం పని చేస్తూ, లోకకళ్యాణంకోసం పాటుపడరాదా అంటే హుళక్కి! తాను పెరల్ బక్, మదాంక్యూరీ, బ్రీటీస్ రైటు మొదలగు వాళ్ళ కథలు వినలేదా?
పోనీ రష్యాలో ఆడవాళ్ళస్థితి చాలా బాగుంది కాదా? భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలలో ఉండి తమ సోవియట్ రాజ్యానికి సేవచేయటం లేదా అంటే ! అసలు పెళ్లి ఎందుకు! ఆడదానికి ప్రథమ కర్తవ్యం ఉద్యోగ వృత్తి? వృత్తి సమస్య పరిష్కారం అయితే ఆ వెనుక వివాహం సంగతి చూడవచ్చును! పెద్దరికం స్త్రీకి వివాహం ప్రతిబందకమే! ఉత్తమ పురుషులకది ప్రతిబందకము కానప్పుడు ఉత్తమ స్త్రీలకది ప్రతిబంధకమౌతుందా? ఉత్తమ పురుషులకూ ప్రతిబంధకం కాలేదా? దాన్టీ, షేక్సుపియరు, గోథీ ముగ్గురూ మేరుపర్వతాలలాంటి పాశ్చాత్య సాహిత్యవేత్తల వివాహ జీవితం ఏమయినది? అలాగే నెపోలియన్, జూలియస్ సీజరు, అలెగ్జాండర్ మొదలైనవారి వివాహజీవితం యేమంత చక్కనైనది? ప్రస్తుతం తనకు వివాహం గొడవ అక్కరలేదు. బావగారిదగ్గర అన్ని కళలూ నేర్చుకోవాలి. సంఘ సేవకోసం మహిళా సభలో చేరాలి. ఆ తర్వాత చూచుకోవచ్చును. అయినా ఒకసారి తీర్థమిత్రునితో కలిసి నిదానంగా ఆలోచించాలి. ఈలాంటి ఆలోచనలు ఒకదాని వెనుక ఒకటి తరుముకురాగా నెమ్మది నెమ్మదిగా హేమసుందరిని నిదుర కూరింది.
14
హేమ మంచి ముహూర్తం తండ్రిగారిచేత పెట్టించుకొని, త్యాగతికి శిష్యరికం ప్రారంభించింది. విఘ్నేశ్వర పూజాదికాలు అయిన వెనక,
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః అని ఆమెచే చెప్పించి, శ్రీనాథమూర్తి తన మరదలికి శిల్పచిత్రలేఖనవిద్య ప్రారంభించాడు. ఆ రోజుననే ఆంధ్రమహిళాసభలో సభ్యురాలై గౌరవ ఉపాధ్యాయినిగా చేరింది హేమ. హేమను వారందరూ కలిసి వారంరోజులలో సహాయకార్యదర్సినిగా ఎన్నుకొన్నారు. హేమ ప్రసిద్ద చిత్రకారిణి, ఉత్తమ గాయకురాలు; ఫిడేలుపై మధుర గాంధర్వము ప్రవహింపచేయు శ్రీమతి కమలాదేవిగారితో స్నేహం ప్రారంభించింది.
కమల: కళోపానసకన్న ఉత్తమజీవితం ఏముంటుంది హేమసుందరీదేవీ !
హేమ : లోకం మాడిపోతూ ఉంటే, కళ అని కూర్చుంటే ఏమి ప్రయోజనం ? రోము తగులబడిపోతూ ఉంటే, నీరో చెక్రవర్తిలై రువీణపై ప్రళయాగ్ని తాండవగీతం వాయించడం ప్రారంభించాడట.
కమ: లోకంలో బాధలు లేకుండా ఎప్పుడుంటాయి! లోకం జీవించి ఉన్నది. కాబట్టి, క్షణక్షణం మార్పు పొందుతూ ఉంటుంది. ఆ మార్పులో ఆవేదన మిళితమై ఉంటుంది. ఆవేదన కళకు ఉద్దీపన కావాలి కాని, కళా జీవితాన్ని చంపేసేటట్లయితే, లోకంలో కళలు ఉద్భవించకుండా ఉందును కాదటమ్మా?
హేమ: అది కాదమ్మా అక్కా! మనుష్యులందరూ ఉత్తమ జీవితాన్ని ఆశిస్తారు. కళాజీవితమే ఉత్తమమయితే, అందరూ ఆ కళాజీవితాన్ని ఆశిస్తారుగదా! అప్పుడు మానవజీవితం ఏమైపోవాలి?
కమ: అందరూ కళాజీవితాన్ని ఆశించేమాట నిజం, కాని అది అందరికీ లభ్యంకాదు. పూర్వజన్మ సుకృతంవల్ల ఆ కళాశక్తి కొంతమందికే లభిస్తుంది. నేనెన్ని తంటాలైనా పడుతున్నాను. నాకా కళాశక్తి దూర దూరాన్నే ఉంటూ ఉంది.
హేమ: మీ నమ్రత అలా ఉంచండి, మీరు గానంలోను, చిత్రలేఖనంలోను నిపుణులు. కాని పూర్వజన్మ సుకృతం ఏమిటి? పూర్వజన్మం ఉందనీ, అక్కడి సుకృత దుష్కృతాలు ఈ జన్మకీ వస్తూ వుంటాయనీ ఎలా నమ్మడం? ఈ నమ్మకానికి శాస్త్రాధారం ఏది?
కమ: ఈలోకంలో మనం నమ్మే అనేక విషయాలకు శాస్త్రాధారం ఏది? అయినా వానిని సత్యాలుగా మనం నమ్ముతున్నాము, ఆచరిస్తున్నాము.
హేమ: ఏవని?
కమ: ఇప్పుడు మీకూ నాకూ స్నేహం కలిసింది. ఆ స్నేహానికి శాస్త్రాధారం ఉందా?
హేమ: నేను మీ సంఘంలో చేరానుకనుక మీకూ, నాకూ స్నేహం అయింది.
కమ: చేరితే ఏమి? నాబోటి సభ్యురాండ్రు యాభై మంది ఉన్నారు. వారందరితో కూడా ఎందుకు స్నేహం కాలేదు?
హేమ: మీరు కళామూర్తులు కాబట్టి, మీకూ నాకూ స్నేహం కుదిరింది. కమ: నాతోబాటు కళాసేవ చేసేవారు ఏడెననమండుగురు ఈ సంఘంలో సభ్యురాండ్రుగా ఉండిరాయేను. వారితో మీకు బాగా సంపర్కం కలుగుతున్న దాయెను. అయినా వారందరితోనూ మీకు స్నేహం కలిగిందా ?
హేమ: మీ వ్యక్తిత్వమూ, నా వ్యక్తిత్వానికి సంబంధం కలది కాబట్టి మీకూ ,నాకూ స్నేహం కలిగింది.
కమ: ఆ వ్యక్తిత్వం పూర్వజన్మ సంస్కారఫలితమే.
హేమ: కుటుంబ, దేశ కాల ప్రభావంవల్ల కాదా?
కమ: అది ఉండదనా! అలాంటి సంపర్కంలో మా చెల్లెలూ ఉండవచ్చును. ఆమె గుణం ఎందుకు వేరుకావాలి? అదే ఇద్దరు కవలలు పుట్టితే, జన్మంలో ఏ ఐదు నిమిషాలో తేడాగాదా, తక్కినవన్నీ ఒక్కటే ఉంటాయి. అయినా గుణగణాలలో, వ్యక్తిత్వంలో తేడాలు ఉంటున్నాయా లేదా?
హేమ: మీరు చెప్పే విషయాలు శాస్త్రంవల్ల నిర్ధారణ కావాలి కదా!
కమ: అవి శాస్త్రంవల్ల నిర్ధారణ చేసినప్పుడు ఆయా శాస్త్రాల మార్గాన ఈ సిద్దాంతాలకు వచ్చి వుండిరి.
హేమ: ఒక విషయం అల్లాంటిది చెప్పండి.
కమ: వేదంలో ఎన్నో సత్యాలున్నాయి. అవన్నీ ఈ రోజుకు నిజమేకదా! జ్యేష్ట పెద్దనక్షత్రం అన్నారు.
విష్ణుమండలానికి తారకాగోళాలన్నీ వెడుతున్నాయన్నారు. అవన్నీ నిజమని ఈరోజు శాస్త్రకారులు ఒప్పుకున్నారా లేదా?
హేమ: ఏమండీ అక్కగారూ, మీరూ అచ్చంగా మాబావకుమల్లేనే వాదిస్తున్నారే.
కమ: ఎవరు మీ బావ ?
హేమ: త్యాగతి శర్వరీభూషణ్ గారు.
కమ: అలాగా ! ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగన్న శిల్పి! మొన్న మదరాసు కళాసంఘంవారు ఏర్పాటు చేసిన శిల్పచిత్రకళా ప్రదర్సనంలో మూడు ప్రధమ బహుమానాలు పొందారు. మూటికన్న ఎవ్వరూ ఎక్కువ పొంద కూడదన్నారు. కాని, అన్ని ప్రథమ బహుమానాలూ ఆయన కొట్టేయవలసిందే !
ఆంధ్రమహిళా సభాభివ్రుద్దికోసం పని చేయాలని ఆవేదనతో హేమపట్నం అంతా తన కారుమీద తిరగడం , సబ్యురాండ్రను చేర్పించడం పెట్టుకుంది. నాలుగు వందలమందిని వివిధ విద్యాలయాలలో, కళాశాలలలో చదువుతున్న బాలికలను చేర్పించింది.
వసంతోత్సవాలు తలపెట్టి దుర్గాబాయమ్మగారితో కలిసి వసంతనాట్యం, వసంత నాటిక, వసంతపు ఆటలు, పోటీ పందేలు, వసంత చిత్రశిల్పకళా ప్రదర్శనం అన్నీ ఏర్పాటు చేసింది. ఆంధ్రులకు వసంతోత్సవం సంవత్సరాదినాడే బాగుంటుందని చెప్పింది. తాను నాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. నాట్యం నేర్చుకోవడానికి అసలు ఆంధ్రసంప్రదాయానికి బిడ్డ అని తంజావూరి విధానం; శిథిలమైన ఆంధ్ర సంప్రదాయము, కూచిపూడి విధానమని అదీ నేర్చుకొనసాగింది. రాక్షసి పట్టుదల! తాను' వనదేవి' యట. లోకేశ్వరి వసంతుడట. సోఫీ పారిజాతమట. మహిళాసభ బాలికలు కొందరు పూలబాలికలట. అలా వసంత నాటిక వ్రాయసాగింది. హేమ గీతా నృత్యనాటకం తానే తయారు చేసుకుంది. త్యాగతి చేత దిద్దించుకుంది. తన సొమ్ము వేయిరూపాయలు ఖర్చు కోసం అంచనా వేసుకుంది. హేమా, కార్యదర్శిని , దుర్గాబాయమ్మగారు , కమలాదేవిగారూ, ఇతరులూ కలిసి ఇంకో పదిహేనువందలు వసూలు చేసారు. ఆంధ్రకవయిత్రుల గోష్టి అని పెట్టింది.
ఆంధ్రదేశ ప్రసిద్ద కవయిత్రులు___ చావలి బంగారమ్మగారు, తల్లాప్రగడ విశ్వసుందరమ్మగారు, బసవరాజు సౌదామినీగారు, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారు, పులవర్తి కమలాదేవిగారు, కాంచనపల్లి కనకమ్మగారు, మధునాపంతుల రుక్మిణమ్మగారు, ఇందుమతీదేవిగారు, పులుగుర్త లక్ష్మీనరసమాంబగారు, మొదలైనవారిని, ఇప్పుడు నవ్యనవ్యమార్గాల కవిత్వం చెప్పే బాలికలను పోగుచేసి, కావ్యగోష్టి ఏర్పాటు చేసింది. రోజుకు ఇరవైనాలుగు గంటలయితే హేమ ముప్ఫై ఆరు గంటలు పని చేయడం మొదలు పెట్టింది. అలంకరించుకోవడం మానింది. బీచి షికార్లు పోయాయి. సినిమాలు మాయమయ్యాయి. ఒక్కొక్కప్పుడు ఇంటిదగ్గర భోజనమే మానింది., బలవంతంచేసి వాళ్ళమ్మగారిని తీసుకుపోయేది. సోఫీని లాక్కుపోయేది. లోకేశ్వరిని ఎత్తుకుపోయేది.
త్యాగతిని బావా , నాకీ పదిరోజులూ సెలవియ్యి అని అడిగింది. మూడు శిల్పాలు పూర్తికానివీ, ఒక బొమ్మ పూర్తి అయినదీ తాను రచించినవి ప్రదర్శనంలో పెట్టుకొనదలచుకొంది. తాను చిత్రించిన మూడు దృశ్య చిత్రాలు, భారతీయ విధానాన రచించిన చిత్రమూ ప్రదర్శనంలో ఉంచుటకు నిశ్చయించింది. రేపు సంవత్సరాది అనగా ఆ రాత్రల్లా ప్రదర్శనం ఏర్పాటైన మహిళాసభా బాలికా పాఠశాల మందిరంలోనూ , మహిళాసభ ఆవరణంలో, పందిళ్ళలో, తాత్కాలిక రంగస్థలంలోనూ దానవిలా తిరుగుతూ, పనిచేస్తూనేఉంది. అన్నీ పూర్తిచేసుకొని, తెల్లవారుతోందనగా ఇంటికి వచ్చి, తాను రెండుగంటలు నిద్రపోతాననీ, సరిగ్గా ఆరున్నరకు లేపమనీ తల్లితో చెప్పి, పక్కమీదవాలి కళ్ళుమూసుకొని చిన్నబిడ్డలా నిద్రపోయింది. 15
తూర్పు సముద్ర తరంగాలపై అరుణరాగాల నద్డుతూ, లోకంలో దారుణ యుద్దరక్తరాగం యింకా ఎరుపు చేస్తూ, నూతన మామిడిపూవుల వాసనలతో, మోదుగపూవుల దీప్తవర్ణంతో వృష సంవత్సరాది ఉదయించింది. ఆరున్నరకు తల్లిని లేపమన్నదిగాని, ఆరింటికే లేచింది హేమ.
అరగంటలో తలంటి నీళ్ళు పోసుకున్నది. లోకేశ్వరి మాత్రం మహిళాసభ పాఠశాల హాస్టలు విద్యార్థినులకు తెల్లవారగట్లనే తలంటు పోయిస్తూ ఉండి, తానూ అక్కడే తలంటుపోసుకుంది. ఏడుగంటలకు పెళ్లికూతురిలా హేమ ముస్తాబు చేసుకుంది. పెద్ద కారులో తాను కొత్త చింతపండు, కొత్తబెల్లం , చెరుకుముక్కలు, వేపపువ్వు, అరటిపండ్లు, మామిడిముక్కలతో తయారు చేయించిన సంవత్సరాది పచ్చడిని పెట్టించి, తానూ, తన తల్లీ బయలుదేరారు. సోఫీ పందిరి దగ్గరే కలుసుకున్నది.
ఆరు టాక్సీలలోనూ, తన కారులోనూ, సోఫీ కారులోనూ, ఇంకను ఆంధ్ర మహిళామణుల కారులలోనూ విద్యార్థినులు, ఉపాధ్యాయులు, కార్యవర్గమువారూ, దుర్గాబాయమ్మగారూ, వారి తల్లిగారూ, తక్కిన కుటుంబమూ అందరూ ఏడున్నర గంటలకు ప్రదర్శన మందిరము కడకు పోయినారు. అందరికీ పచ్చడి పంచినారు. అక్కడకు ఎందరో ఆంధ్ర వనితామణులూ, ఆరవ సోదరీమణులూ, ఇతర స్త్రీలు వచ్చినారు. ప్రదర్శనము తలుపులు వేసి యుంచి, ఆ తలుపులకు ఉమ్మడి వారిచే తయారు చేయించన వెండి తాళము వేయబడినది. మామిడితోరణాలు, పూలమాలలు ఆ ప్రదేశమంతా అలంకరించారు. అగరవత్తులనుండీ పరీమళ ధూపాలు సర్వదిశలకు ప్రసరిస్తున్నవి.
శ్రీమతి దుర్గాబాయమ్మగారు శ్రీ ఆనందనగరం మహారాణీగారిని ప్రదర్శనం ప్రారంభించవలసినదని, మహిళాలోకానికి వారి నెరుక పరుస్తూ వారి సేవ ఉగ్గడించారు. లలిత కళలన్నీ సుందరీమణుల సొత్తే అనిన్నీ, సంగీతం విషయంలో ఆంధ్రవనితలు దక్షిణాదివారికి, ఉత్తరాదివారికీ చాలా వెనుకబడి వున్నా, శిల్ప చిత్రలేఖనాలలో భారతదేశంలో ఆంధ్ర స్త్రీలు బెంగాలీవారితో సమంగా ఉన్నారనీ అందుకు నిదర్శనము శ్రీమతులు రత్నాల క్రిష్ణాబాయిగారు, కమలాదేవిగారు, దిగుమర్తి బుచ్చికృష్ణమ్మగారు, దామెర్ల సత్యవాణిగారూ, సీతాకుమారిగారూ, జంగం లక్ష్మీబాయమ్మగారూ, హేమసుందరీదేవిగారూ మొదలైన సోదరీమణులు ఉన్నారనియూ; ఈ ప్రదర్శనం ఇంత విజయవంతంగా జరగడానికి కమలాదేవి , హేమసుందరీదేవిగార్ల ఉత్తమ కృషేననీ మహారాణిగారు ఉపోద్ఘాతముగా చెప్పినారు. సోదరీమణులారా! చిత్రలేఖనము, కవిత్వము, శిల్పము, సంగీతము, నాట్యము, ప్రక్రుత్యనుకరణంగా ఉండవలెనా, లేక ఆశయ భావపూరితమై పూర్వసంప్రదయాత్మికంగా ఉండవలెనా అనే ప్రశ్న ఒకటీ; రచనా వస్తువు కళాకారులకు ఉత్తమమని తోచిన విషయం ఏదైనా ఉండవచ్చునా లేక దేశానికి ఆర్ధికంగా, రాజకీయంగా ఉపయోగించే విధానంగా వుండవలేనా అనే రెండవ ప్రశ్నా; ఇవి కళాప్రపంచంలో కళాస్రష్టలకు కలత పెట్టుతున్నవి. నా ఉద్దేశ్యంలో ఈ సమస్యలన్నీ రాజకీయ, సంఘీక, మత విషయిక వేదాంతులకు వదలి, ప్రస్తుతము ఆంధ్ర వనితామణులు చితలేఖ నాది సర్వలలిత కళల్లోనూ సిద్దహస్తులు కావడమే ప్రధాన ఆశయంగా ఎంచుకోవలసినదని కోరుతున్నాను.
కళావేత్తలయిన ఆంధ్ర సోదరీమణులు రచించిన శిల్పచిత్రాదికాలూ, కళావస్తువులూ ఆంధ్ర స్త్రీలే కొని వారికి శతాథికంగా ప్రోత్చాహం ఇవ్వవలసివుంది. మీరందరూ మన సోదరీమణుల కళావైభవం చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. మీ ఉత్సాహానికి నేను అడ్డం రాదలచుకోలేదు. ఈలాంటి ప్రదర్శనాలు ప్రతి సంవత్సరం చెన్నపట్నంలోనూ, ఇతర పట్టణాలలోనూ విరివిగా జరుగుతూ వుండాలని ఆశిస్తూ, ఈ ప్రదర్శనం తెరుస్తున్నాను అని మహారాణిగారు ముగించారు. సభ్యురాంద్రందరూ హర్షకరతాళధ్వనులు మిన్ను ముట్టించారు.
శ్రీ రాణీసాహెబాగారు తమ కందిచ్చిన రజితకండరములోని, వెండి తాళం తెరచి తలుపులు తోసినారు. తలుపులు వెనక్కు పోగానే గుమ్మంలో అడుగిడిన రాణీగారి తలపై పూలవర్షము కురిసింది. లోకేశ్వరి సోదరీమణులు లందరిపైనా పూలజల్లులు కురిపించింది. గుమ్మానికీవలావల నలుగురు బాలికలు నిలుచుండియుండిరి. లోపలికి పోయే ప్రతి సదస్యురాలికి ఒకరు గంధమూ, ఒకరు అత్తరూ, ఒకరు పుష్పదామమూ, ఒకరు బొట్టునూ అర్పిస్తున్నారు.
ఆ విశాలమందిర సౌందర్యం చూచి, ప్రేక్షకురాండ్రందరూ ఆశ్చర్యపడిపోయారు. హేమసుందరి తన బావగారైనా త్యాగతిగారి ఇంట్లోనూ, అతని శిల్పాశ్రమంలోనూ వున్న సర్వదేశాల ప్రాచీన, ఆర్వాచీన శిల్పాలూ, సర్వదేశాల పురాతన చిత్రలేఖనాలూ, అధునాతన చిత్రాలూ, అజంతా చిత్రాల ప్రతిరూపాలూ, రాజపుత్ర చిత్రాలూ, పళ్ళేలు, సేమ్మాలు, జేగంటలు, రత్నకంబళ్ళూ, కరండాలు, కలశాలు, దంతపేటికలు, గంధపు పేటికలు, దంతశిల్పాలు, మంచిగంధపు శిల్పాలు, తమలపాకు దానులు, ఆడకత్తెరలు, ఆట సామానులు, చదరంగపు బల్లలు, తెరలు, దుప్పట్లు, తలగడలు మొదలగు అలంకారపు సామానూ; శిల్పపు పనితనంగల బలల్లూ ఆమందిరానికి సౌందర్యరేఖలు తీర్చేతట్లు అలంకరించినది. ఇక ఆంధ్రకళావిదుషీమణులు రచించిన చిత్రాలు అత్యంత మనోహరంగా అమరింపబడి వున్నాయి. మొదటి బహుమానాలు, ద్వితీయ బహుమానాలు, విశేషబహుమానాలు, పొందిన శిల్పవస్తువులు, చిత్రాలు, చిత్రాలక్రింద వ్రాసి ఉంచబడినవి. కళావస్తువుల గురించి చిన్న పొత్తము అందముగ అచ్చోత్తింపబడినది. అందులో బహుమతులందిన శిల్పాదికాల ప్రతిరూపాలు కూడా ఉన్నాయి. ఎంత తొందరగా చూద్దామన్నా ఎవ్వరికీ కాలవ్యవది చాలలేదు. పదింటికి ఉగాది ప్రార్ధనవున్నది. ప్రారంభసభ వున్నది. అందుకై తీరికగా చూడవచ్చునని ప్రేక్షకురాండ్రు సభాస్థలం చేరుకున్నారు. పదిమంది యువతులు, వీణ , వేణు, నాదస్వరము, ఫిడేలు, సారంగి, ఇస్రాజ్, సితారు, మాండేలీను, తాంబూరా, వయోలా వాద్యాలు వాయిస్తూ వుండగా నలుగురు బాలికలు,
వృషాగమన కషాయితమ్మై గొంతు విడివడగా కొసరి కొసరి పుం స్కోకిలరావము దెసలముసరెనే.
అంటూ ఉగాదిపాట పాడిరి. శ్రీమతి దుర్గాబాయమ్మగారంత లేచి, వేదిక పైకివెళ్ళి, ఆ ఉత్సవానికి అధ్యక్షతవహింప దయతో అంగీకరించిన ఢిల్లీలో వాసంచేస్తూ ఒక జాతీయదినపత్రికకు సంయుక్త సంపాదకురాలైన ప్రసిద్ద ఆంధ్రమహిళ శ్రీమతి పద్మినీకుమారి. పి. హెచ్. డి. గారిని అధ్యక్షపీఠమలంకరింపకోరినారు.
16
అధ్యక్షురాలు పీఠమలంకరించుటకు వేదికపై వచ్చుటతోడనే హేమకుసుమసుందరి పుష్పదామం వారిమెడ నలంకరించింది. కంకణ క్వణిత కరతాళ ధ్వనులు చెలరేగాయి.
దుర్గాబాయమ్మగారు అధ్యక్షురాలిని గూర్చీ, మహిళామండలికి వారు చేసిన సేవనుగూర్చీ ప్రశంసావాక్యాలు చెప్పి , కంఠమెత్తి గంభీరంగా మహిశోద్యమం భారతదేశంలో మొదట ప్రారంభించింది అనిబిసెంటుగారినిన్నీ ఆ ఉద్యమం నానాటికీ వృద్దిపొంది, ఇప్పుడు సర్వభారతీయ మహిళా మహా సభ ఏర్పడి, అందుకు రాష్ట్రరాష్ట్రానికి, మండల మండలానికిశాఖలువెలసి, మహత్తరమైన సంస్థగా పరిణమించినదనిన్నీ; దేశం అంతా ఈనాడు మహిళాసంఘాలు, స్త్రీలకు క్లబ్బులు, కళాశాలలు, ఒక విశ్వవిద్యాలయము, సేవాసంఘాలు వనితలకు ఉదయించాయనిన్నీ; ఈ సకల ఉద్యమాల ఫలితంగా భారతదేశంలో జాతీయస్వాతంత్ర్యాది పవిత్ర ప్రయత్నాలలో స్త్రీలు పురుషులతోబాటు, ఒక్కొక్కప్పుడు వారికన్న అధికంగా దేశసేవచేస్తున్నారనిన్నీ; పవిత్ర స్త్రీల ఆశ్రమాలు మత్తు లక్ష్మీరెడ్డిగారు, యామినీపూర్ణతిలకమ్మగారూ మొదలగువారు స్థాపించి, దీన సోదరీమణుల నెందరినో ఉద్దరిస్తున్నారనీ: ఈ సర్వకృషి ఫలితంగా నేడు భారతదేశంలో, స్త్రీలకు వోటూ, శాసనసభా సభ్యత్వమూ, మంత్రిత్వమూ, చదువూ, ఉద్యోగాలూ, న్యాయవాదిని, వైద్యురాలు, ఉపాధ్యాయుని మొదలైన వృత్తులెన్నియో లభిస్తున్నవనీ; ఈ కృషి ఫలితంగానే శారదాశాసనము వచ్చిందనీ: అందువల్ల దేశంలో ఎంతో మార్పు వచ్చిందనీ: స్త్రీలకు ఆస్తి, బహుభార్యాత్వ నిషేధమూ, విడాకుల వాసనమూ రాగాలవనీ; తామందరూ ఇంతవరకు చేసిన ప్రయత్నం వట్టి నాందిమాత్రమేననీ, ఇంకనూ కొన్నివేల రెట్ల ఉత్సాహంతో స్త్రీలందరూ నడుంకట్టుకొని ప్రయత్నం చేయాలనీ; తామందరూ ఇంతవరకూ చేసిన ప్రయత్నం వట్టి నాందిమాత్రమేననీ, ఇంకనూ కొన్నివేలరెట్ల ఉత్సాహంతో స్త్రీలందరూ నడుంకట్టుకొని ప్రయత్నం చేయాలనీ: అప్పుడుగాని స్త్రీల ఆశయాలు నెరవేరవనీ చెప్పుతూ ఈ నూత్న సంవత్సరం మనలనింకోమెట్టు పైకి తీసుకువెళ్ళుగాక అన్న కోర్కెకు హేమకేసుమసుందరీ దేవివంటి తెలివైన బాలికలు ఈ సంఘంలో చేరటమే దృష్టాంతమనీ, ఈ ఉత్సవానికి ఆమె కారకురాలనీ ఈ శుభోత్సవ వేళ వారందరికీ, మహారాణి సాహెబు గారికీ ప్రసిద్ధురాలైన అధ్యక్షురాలికీ స్వాగతమనీ చెప్పి కూర్చున్నారు.
హర్ష ధ్వనులు సముద్రతరంగ ఘోషలై మిన్నుముట్ట అధ్యక్షురాలు లేచి తమ ఉపన్యాసం ప్రారంభించినారు.
దుర్గాబాయమ్మగారూ ! మహారాణిగారూ ! సోదరీమణులారా! ఒక్కొక్క మహాయుద్దము, ఒక్కొక్క మహోద్యమమూ,ఒక్కొక్కఅఖండమైన సాంఘీక వ్యవస్థా అన్నీ ఒకదానితో ఒకటి గాఢ సంబందంతో ఉదయిస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో ప్రళయయుద్ధం చెలరేగుతున్నది. మన దేశానికి తూర్పుఖండంలో కూడా మహాభయంకర ప్రళయం రాబోతున్నది. అమెరికా అధ్యక్షులు అది రాకుండా జపానువారి తలతిక్క మాన్పాలనీ, సంప్రతింపులవల్ల శాంతి సుస్థిరం చేద్దామని, ప్రయత్నం చేస్తున్నారు. కాని నా ఉద్దేశంలో వారి ప్రయత్నం నిష్ఫలమవుతుందనే. మనదేశంకూడా యుద్దదావాలనంలో మండిపోవచ్చును. ఈలాంటి ప్రళయం వచ్చే రోజుల్లో స్త్రీలను ఎదుర్కొనే సమస్యలు రెండున్నాయి.
ఒకటి: స్ట్రీ యథాప్రకారంగా ఆదర్శగృహిణయి, అందుకు తగిన చదువు నేర్చుకొని , చక్కని భార్యయై, భర్తకు కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, శయనేషు రంభా, క్షమయా ధరిత్రీ అయి అతనికి బిడ్డల్ని కని, పెంచుతూ వంటచేసి పెడుతూ వుండడమా; లేక తనదారి తాను చూచుకొని, తన కామత్రుప్తికీ, ఉత్తమ కార్యమైన జాతి అభివృద్ధికీ, తనకు నచ్చిన పురుషునితో తాత్కాలిక సంబంధమో , స్థిరసంబంధమో ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా , ఆరోగ్యశాస్త్రోచితంగా బిడ్డలను కంటూ వారిని ఉత్తమ విధానాన పెంచుతూ తానుకూడా ఈ జగల్లీలా మహా నాటకంలో పురుషునితో సమంగానో, ఇంకా అంతకన్న ఉత్తమంగానో కార్యయోగినియై లోక చరిత్రను కొనసాగించడమా? ఇది ఒక సమస్య.
ఇక రెండవ సమస్య: ఇది పూర్తిగా మనదేశానికి సంబంధించింది. మనదేశంలో అన్ని మతాలూ ఉన్నాయి. అన్ని వర్ణాలూ ఉన్నాయి. ముఖ్యమైన హిందూమతంలో కొన్నివేల అంతశ్శాకలున్నాయి. బ్రామ్మణులంటే __వంగ బ్రాహ్మణులు, బీహారు బ్రాహ్మణులు, ఆంధ్ర, మిథిల, మహారాష్ట్ర, తమిళ, మళయాళ, కన్నడ, గుజరాతు, సింధు, పంజాబు, గౌడ, కాశీ, కాశ్మీర, రాజపుత్ర, లక్నో, అస్సాం, సరస్వతీ బ్రాహ్మణులని ఉన్నారు. వీరందరికీ ఏమి సంబంధాలు లేవు. ఇంకా ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులలో అంతరాంతర శాఖలున్నాయి. ఒక్క ఆంధ్రులలో చూడండి: ఆరువేలవారు, ప్రాజ్ఞాడులు, కరణకమ్మలు, నందవరీకులు, గోలుకొండ వ్యాపారులు, ఋగ్వేదులు, సామవేదులు, యాజ్ఞవల్క్యులు, ఆరాధ్యులు అనే నియోగి శాఖలూ ఏ విధమైన సంబంధాలు లేకుండా ఉన్నాయి. వెలనాట్లు, తెలగాణ్యులు , కాసరనాట్లు, వేగినాట్లు, మురికినాట్లు, అనే వైదిక శాఖలున్నాయి. వీరిలో వీరికీ ఈ అంతరశ్శాఖలకూ ఇతర శాఖలతో సంభందాలులేవు. శ్రీ వైష్టవులు, గండికోటులు, మంగళం పాదులు, గంగవరంవారు, హెబ్బారువారు, మండయం, తుమ్ముకొండ, వడఘళ్ళై, తెంగలైలు, నియోగి వైష్ణవులు, అష్టగోత్రులు, ఆంధ్ర వైష్ణవులు శాఖలుగా ఉన్నారు. ఆరామ, పేరూరు, తుమ్మకొండ, ద్రావిళ్ళు అనే బేధాలుగల ద్రావిళ్ళు ఉన్నారు. మర్త్యులున్నారు. ఇది ఆంధ్రదేశంమాట. ఈలాగే ప్రతి రాష్ట్రంలోని బ్రాహ్మణులలో అంతశ్శాఖలున్నాయి.
శాఖాభేదాలు ఇలాగే క్షత్రియులలోనూ, వైశ్యులలోను వున్నవి. రాష్ట్రాల సంబంధాలు లేవు, ఇంక శూద్రులలో సచ్చూద్రులనీ, సాధారణ శూద్రులనీ రెండు తేడాలు. ఆ సచ్చూద్రులలో కొన్ని వందల తేడాలు. సాధారణ శూద్రులలో కొన్ని వందల తేడాలున్నాయి. ఆంధ్రదేశంలో సచ్చూద్రులలో రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, మున్నూరుకాపు, తెలగ , ఆదివెలమ, ముదిరాజు అనేవారున్నారు. రెడ్లలో మోతాడ, పాకనాటి, పంటరెడ్లు, భూమంచి రెడ్లు వగైరా ఎందరో ఉన్నారు. కమ్మవారిలో పెద్ద కమ్మవారు, చిన్న కమ్మవారు వున్నారు.
ఈలా కోటితేడాలతో వున్న మనదేశం ఆ తేడాలనన్నీ అల్లాగే వుంచుకొని, నాశనమైపోవడమూ, లేక మతము వ్యక్తిగతము, జాతిగతము కాదు: వివాహ, సాంఘీఖ, రాజకీయ, ఆర్థికాది వ్యవహారాలలో మతాన్ని బలంకోసం వుపయోగిస్తూ ప్రతిబంధకం కాకుండా చేసుకోవడమా? యిది రెండవ సమస్య.
మహిళామణుళారా! ఈ సమస్యలు లోక కళ్యాణ ప్రదంగా స్త్రీలే పరిష్కరించగలరు. స్త్రీలే శాసనసభలకు ప్రతినిధురాండ్రు కావాలి. అప్పుడు యుద్దాలు తలెత్తవు.మతకలహాలు పోతాయి.వర్గాకలాహాలు నాశనం అవుతాయి. ఈనూత్న సంవత్సరము స్త్రి ఉద్యమాలను, విజయగోపుర ద్వారం కదకు తిసుకోనిపోవుగాక. నన్ను మిరి మహొత్సవానికి అధ్యకు రాలిగా చేసినందులకుమీకు కృతజ్ఞరాలను,నమస్కారములు. మీకందరకు నా నూత్నవత్సరాభివాదాలు!" అని ముగించారు.సభ్యురాండ్రు హర్షధ్వనులతో ఆశలు నింపారు.
ఇంతలో హేమ లేచి "స్ర్తీ "అని తాను వ్రాసినమాట చదివింది. నూత్న సంవత్సరం మీదపాటకూడా ఆమె రాసిందే.
"స్త్రి "
"నిడురలేవే సోదరి!
కుడురుకనవే సోదరి! ఉదయ మందె శుభోద్యమంచిది
అదే వినంబడి తూర్యనాదము
ఆలపిస్తావా?
నిడురలేవే......
"సర్వవిద్యలు నివి కావే
సర్వకర్మలు నివి కావే
పర్వజేయు నుపర్వవిదిని
ఖర్వదిక్షా కాంతిపుంజము
నిడురలేవే....
పురుష హృదయము తట్టి పిలుపుము
పురుష ధర్మమూ బోధ చేయుము
పొలతి దారికి పురుషు డేలా
నిలువగాలడో అడ్డమ్తే తానూ
నిడురలేవే........."
అని దీప్తమధురకంఠంతో హేమ పడింది.
17
సంవత్సరాది సాయంకాల కార్యక్రమంలో, మొదటి ఒక పండితురాలు పంచాంగాశ్రవణం చేసి అందరూ అక్షతలు ప్రసాదించారు. తరువాత కవయిత్రుల గోష్టి జరిగింది. అందరికి వెండి కుంకుమ భారీణేలూ, రవికెల గుడ్డలూ,దారివాల్ శాలువాలూ బహుమతు లిచ్చారు.
అప్పడోక యువతీ లేచి హాస్యరసప్రదానంగా సంవత్సర ఫలితాలు, "ఏ వత్సరము సన్న చీరలు మాయమోతాయి ,ఉతక చీరలు నూటికి నూట యాభ్తేపాళ్ళుఖరీదులు పెరుగుతాయి. ఈ సంవత్సరానికి రాజులేడు, మంత్రిలేడు,సేనదిపతి అర్ఘాదిపతి, గోపాలుడు ఎవ్వరూ పురుషులు లేరు. అందరూ యుద్దానికి పోవడముచేత , వారి వారి భార్యలే ఆయా పదవులను అలంకరించారు. రాజు గురువుకాడు గనుక అతని భార్య తారాదేవి రాణి అయింది. అందుచేత సినిమా తరాలకు ఎక్కువ డబ్బు వర్షం కురుస్తుంది. స్త్రీలకు మేష్టరు పనులు ఎక్కువౌతాయి. ,అ,త్రిపత్ని శుక్రని భార్య తపస్సు చేసుకొంటూ ఉండడంవల్ల, దేవయానే ఆపనిచేస్తూ , బ్రాహ్మణుల కేవ్వరికి మంత్రంగాలు ఉండకూడ డని శాసించింది.! బ్రాహ్మణుల బాలికలు అందరూ నూతుల్లో, గోతుల్లో , నదుల్లో, కాలవల్లోపడి అపరాయయతులకు రాణులవుతారు. సేనాదిపత్ని శనిగారి భార్య నిద్రలో ఉండడంవల్ల, ఆడవారు ఒకర్నొకరు తిట్టుకోరు. తెల్లరంగంటే ఎక్కువ యిష్టపడతారు." అని చెప్పుతూ సభ్యురాండ్రను నవ్వులలో ముంచెత్తింది!
బహుమతులు వచ్చినవారి కందరికీ ఖరీదుగల వెండి వస్తువులను అధ్యక్షురాలిచే సభవారు ఇప్పించారు. ఆ వెనుక పలువురు సభ్యురాండ్రు విడాకుల చట్టం, బహుభార్యత్వ నిరసనా, స్త్రిలకూ బాలికలకూ వేరే కాళాశాలలు ఉండకూడదని, కుమార్తేలకు సమానాస్త్రి సంక్రణమ ఉండాలని, భర్త ఆస్తి భార్యకు అసంపూర్ణమ్తెన హక్కులతో రావాలనిమొదల్తెనవిషయాల గురించి ఉపన్యసించారు ఆ వెనుక అందరూ రంగాస్ధలం నుంచి దిగి, ప్రేక్షకస్థలంలో అధివసించారు. నాట్య నాటకాది కార్యక్రమం ప్రారంభం అయింది. రెండు తెరలు ఈవలావలనుంచి వచ్చి రంగస్థలాన్ని క్రమ్మివేసినది. ఆ తెరలు గాఢనీలమైనవి. ఆ తెరలకు పూలఅంచులూ, మధ్య కమలాలూ మిలమిలలాడుతూ వున్నవి.
అయిదు నిమిషాలు నిశ్శబ్దం ఆవహించింది. ఏమి జరుగుతుందో అన్న నిరీక్షణలో ప్రేక్షకురాండ్రూ, వేరే ప్రత్యేక స్థలములో ఆసనములు చూపబడిన పురుష ప్రేక్షకులూ మౌనం వహించారు. అక్కడక్కడ అమరింపబడిన విద్యుచ్చామరముల స్వనం మాత్రం శ్రుతిలా వినబడుతూంది. అప్పుడా నిశ్చలతలో ఒక్క జేగంట' ఖంగ్' మని మ్రోగింది. దానిని అనుసరిస్తూ శంఖారావం, వివిధ వాద్యాల ధ్వనులు ఒక్కరాగం ఆలపించాయి. రెండు తెరలూ ఈవలావలకు మాయమైనాయి. ప్రేక్షకుల స్థలంలో దీపాలు ఆరిపోయాయి. రంగస్థలంలో అస్పష్ట దీపకాంతులూ, బూడిదరంగులతో వెనక తెరలూ, పక్కతెరలూ, వున్నాయి. ఒక మొండి చెట్లు బొమ్మ రంగస్థలం మధ్యనే వున్నది. అప్పుడపశ్రుతి అనిపించే ఒక విషాదవాద్య మేళనము అస్పష్టంగా ప్రారంభమైనది. పోను పోను కొంచం స్పష్టమైనది. అంతలో వణికిపోతూ ఒక వృద్దుడు తెల్లటి గడ్డంతో, నల్లటి దుస్తులతో ప్రవేసించి కర్ర పుచ్చుకొని వంగిపోయి తిరుగుతూ,
వెళ్ళిపోయే ముసలి ఏడును
కుళ్ళిపోయిన పాత కాంక్షను
మళ్ళి ఎప్పుడో నాకు మీకూ
కళ్ళతో చూపుల్!
విక్రమాన్నై వేగలేచితి
ఆశ్రమాలు కోటిచేసి ప
రాక్రమంతో వాజినైతీ
రష్య చొచ్చాడూ! పాతమాటల చివరిపల్కును
తాత గీతం తుది స్వరాన్నీ
పాడుకొనుచూ, వణికిపోతూ
కాలమునపోదున్
అని పాడుతూ అంతకన్న అంతకన్న అస్పస్టమగు కాంతులతో తిరిగి కూలిపోయినాడు. అందరూ చూస్తూవుండగా దీపాలన్నీ ఒక్కసారిగా ఆరిపోయినాయి. రంగస్థలంలో గులాబి రంగులుప్రసరించాయి. మోడు చెట్టున చిగుర్లు ప్రసరించాయి. లేత జేగురు ఆకులు గాలిలో ఆడుతున్నాయి.అప్పుడొక బాల ప్రవేసించింది. ఆమె వేషం కోకిలవేషం!
నేనె కోయిలనమ్మ! నేనె ఆశనుకొమ్మ! కొమ్మ కొమశిల తిరిగి ' కో ' యందు ' కో !కో !కో ! పిలుతు నూత్నోత్సాహ కలిత మధుపాయలను, తలతు నా దేవుని వ సంతమూర్తిని ప్రేమ. నేనె వై తాళికుడ నేనె ప్రస్తావనను తన్వి! నాందీ సూత్ర ధారుణ్ణి నేనే!
అని పాడి కోకో అంటూ నిష్క్రమించింది. కాంతులు స్పష్టమయ్యాయి, ఆకులూ, కొమ్మలూ, చెట్టుకు తోచినవి. జంతుమేళము పూర్ణ స్వనయుక్తమైనది. అప్పుడు వివిధ వర్ణ, వస్త్ర, పుష్పాలంకారాయుక్తలై ఎందరో బాలికలు పాడుతూ ప్రవేశించారు. వారు పూవుల కన్యలు.
మల్లిక : స్త్రీలకు మాత్రం హక్కులు లేవా సిగ్గులు లేవా పురుషులకూ?
మాధవి :వనితకు మాత్రం ఆస్తి వలదటే ప్రాణం మానం పడతికి లేదా?
శేఫాలి:మహిళలకు శక్తులు లేవనకే మహిషమర్థని మహిళేగా!
మాలతి: కళలు లలితవే! చదువులు చేలివే!
కర్మలలోనూ కామినేప్రథమం!
అంతదీపాలు వంగపండు ఛాయదాల్చి రంగస్థలంలో దీపాలైనవి. 18
వంగపండుచాయతో నిండిన ఆ రంగస్థలంలోనికి వనదేవి వేషాన నాట్యంచేస్తూ హేమ ప్రవేసించింది. ఆమె చీర వంగపండుఛాయ; రవిక ఆకుపచ్చ. ఆమె అలంకారాలన్నీ పూలమాలలూ , ఆకులూ, పూలబాలిక లందరూ ఒకప్రక్క నాట్యరూపంగా నిలిచి ఉండిరి.
వనదేవి : వనదేవినే నేను వినుడమ్మ సుమసుతులు వనిత హక్కులు కోరు దినము వచ్చే నేడు. మగవాని ఆజ్ఞలో మసలితిమి ఇన్నాళ్ళు మన ధర్మముల మరచి మాయ ముంచెను నరుడు వన........ ఆర్యనారీ ధర్మ మడుగంటచేసాడు వేదకాలం మాట చేదయ్యే అతనికి వన........ వెనక చూపులు మాని వెళ్ళాలి ముందుకే బెదురూ చూపులు మాని కదలండి ముందుకే! వన........
ఆమె అభినయం వైదుష్యంలో కొంచెం లోటయినా, చాలా మనోహరంగా ఉంది. నాట్యము, నృత్యము, ప్రేక్షకులను రంజింపజేశాయి. ఆమె కంఠంలో ఎన్ని ఆకాశాల లోతులో , ఎన్ని ఉదయాల కాంక్షలో, ఎన్ని పూర్నిమల మాధుర్యాలో వున్నాయి. ఇంతట్లో సోఫీ పారిజాత కుసుమ వేషంలో వచ్చింది. ఆమె వేషం, ఇతరుల వేషాలు ఇలా వుండాలని త్యాగతే నిర్ణయించి , చిత్రం లిఖించి ఇచ్చాడు. సోఫీ మదరాసులో ఉన్న ముఖ్య ఆంగ్లకుటుంబ బాలికలతోబాటు ఒపెరా (గీతా నాటికలలో) నాయిక వేషం వేస్తూ ఉండేది. ఆ వేషాలలో గులాబీ కన్యవేషం ఒక నాటికలో వేసింది. ఆ వేషానికి కొన్ని మార్పులుచేసి శ్రీనాథమూర్తి పారిజాతకుసుమ వేషం వేశాడు సోఫీకి. ఆమె పాడవలసిన పాట శ్రీనాథమూర్తి పదిరోజులు కస్టపడి సాధ్యమైనంతవరకూ తెలుగునుడికారం పోకుండా ఆమెకు నేర్పాడు. పారిజాతపుష్పం నాట్యచేస్తూ,
సఖీ! వనదేవీ! వచ్చితినమ్మా పారిభద్రమును, సఖీ, వనదేవీ! స్వర్గమునుండీ తెచ్చితి నే నొక సందేశం భవి వనితలకూ! ధర్మం మరచిన స్వేఛ్చకోరుటే తలపబోకుడీ భువికాంతల్! ధర్మంపోతే, నీతులుపోతే, తరుణుల మనసులు గతులు తప్పితే, శృతిలోపించిన జగజ్జీవనం గతిమాలినదే వెతలకు సాకు
పూవులన్నీ : ఏమిటి నీతి ఏమిటి జాతీ జాతి నీతులే సతులకు విషముల్ నీతి పేరునా పురుషులు విషమూ జాతి పేరునా మతముల విషమూ
వనదేవి : మా నీతులు మేం నిర్మిస్తామూ మా ధర్మం మేం నిలుపుకొందుమూ పురుషుడు పలికే ధర్మమే విషమూ! పురుషుడు వ్రాసిన నీతే విషమూ! (ప్రవేశం లోకేశ్వరి వసంతుని వేషంలో)
వసంతుడు : ఓ చెలీ! వనకన్యా! ఓ దివ్యసుందరీ! నీకొరకు వెదకుతూ నీకొరకు విరహినై నిలువెల్ల పులకిస్తు కలలు కంటూ వస్తి ఓ చెలీ! వనకన్యా!
మాలతి : ఈ వేస మిది యేటి
ఎవరోయి నువ్వూ? పొగరెక్కి విరహమని
పొగులుచున్నావూ?
మాధవి: ఎవరోయి పురుషుడా ఎవరోయి నువ్వూ! మారాణి మాటెత్తి మతి లేని ఆటా?
మల్లిక : ప్రేమమాటల వరదు ప్రియుడ వెవరోయీ? కన్నుగానని మత్తు గంతులా ఇచటా?
శేఫాలి : మా చెలిని వెదకుతూ మసలబోకోయి తెలిసె నీ పోకిళ్ళు తొలగిపోవోయీ.
వనకన్య : నిలు నిలు మోయీ కలుషిత హృదయా! వలపు మాటలిక పలుకకుమోయీ! అన్నివాడలా అగ్ని కమ్మినది ప్రళయకాలమే ప్రణయావసరమ? నిలు నిలు మోయీ కలుషిత హృదయా! పూర్వ ఖర్మములు బుగ్గయినా కొత్త భావములు ఎత్తే మొలకలూ నిలు నిలు మోయీ కలుషిత హృదయా! 19
వసంత: నేనె పూర్వమును
నేనె నవ్యమును పూర్వము లేకే
నవ్యమెచ్చటే?
మూడుకాలములు
ముడిగొన్న క్షణం
నిత్యనూతనం
సత్యం నేనే
వయసు వార్ధకం
ఆశ నిరాశా
నామాంతరములు
నాకె శుభాంగీ
నేనె వసంత
నేనె అనంతం
నేను లేనిదే, నేను రానిదే నిత్యమృత్వువై నీవు నిలుతువే! పురుషుడు లేని పొలతి ఎందుకే నారికి నరుడు, నరునకు నారీ!
వనదేవి: రావోయి ఆమనీ, రావోయి నా ప్రియుడ ననుజేరి జగతికే నవ్యసృష్టీయరా!
కోకిల: కో! కో! కోకోకో కోకోకో కోకోకో ! కోకోకో! ఆకు రాలినవెంట అమరు ఎఱ్ఱని చిగురు అణగిపోయిన వశ్చరమువెంట వృషవచ్చె కో! కో! కో!
పూవులు: మా నాథులు భ్రుంగాలూ మాకై పాడుతువచ్చారూ
వనదేవి : పోయినది చీకటీ
వసంతుడు : పోయినవి గోలుసుల్లు ధర్మస్వాతంత్ర్యమ్ము దశ దిశలు వెలిగించె.
వాద్యమేళం తారాశ్రుతికి వాలి ఆగిపోయింది. సృష్టి స్వరూపమైన వీణాతానంమాత్రం వేగవంతమై వినిపిస్తుండగా, పూలజల్లులను పుష్ప బాలలు వనదేవీ వసంతులమీద జల్లుతుండగా తెరలు రంగస్థలాన్ని కప్పాయి. తెర ముందుకు మంగళహారతులతో బాలికలు వచ్చి సభ్యురాండ్రపై అక్షతలు చల్లారు.
హేమకుసుమసుందరీదేవిని ఆంధ్ర మహిళాలోకం అంతా ప్రశంసించింది. సంవత్సరాది ఉత్సవాలకు కల్పమూర్తీ, తీర్థమిత్రుడూ, వినాయకరావుగారూ, శ్రీనాథమూర్తీ మొదలయినవారు చాలామంది పురుషులు వచ్చినారు. స్త్రీ లోకం ఎక్కడికి వెడుతోం దని కొందరు పురుషులను కొన్నారు. మా బాగా మనందరినీ చెప్పుచ్చుకొట్టినారని కొందరు నవనాగరికులనుకొన్నారు. స్త్రీలలోనూ ఆశ్చర్యము పొందినవారూ, సంతోషంచినవారూ, 'ఏమో' అనుకున్నవారూ, పెదవి విరిచినవారూ ఉన్నారు. కాని ఏది ఏమైనా నాటకాది ప్రదర్శనాలన్నీ చాలా అందంగా జరిగాయని మాత్రం అందరూ ఆనందించారు. మొత్తంమీద హేమ నాటిక అందరినీ ఆలోచనలో ముంచింది. నాటకాన్ని గురించీ, ప్రదర్శనల్ని గురించి పత్రికలన్నీ ప్రశంసించాయి. ఉగాది ఉత్సవం వెళ్ళిన రెండురోజులకు పేపర్లన్నీ తీసుకొని; ఉదయం పదిగంటలకు లోకేశ్వరితో కలసి హేమ త్యాగతి ఇంటికి వచ్చింది. శ్రీనాథమూర్తి తన శిల్పభవనంలో వున్నాడని రంగనాయకమ్మగారు చెప్పగానే, ఇప్పుడే వస్తామని బయలుదేరి ఇద్దరూ మూర్తిబావతో మాట్లాడటానికి శిల్పభవనానికే వెళ్ళారు. శిల్పభవనం అజంతా చిత్రలేఖనంలో కనబడే భవన విధానంగా, అమరావతీ నాగార్జునకొండ శిల్పాలలో దృశ్యమయ్యే భవన విధానంగా నిర్మింపబడి ఉంది.
20
ప్రాంగణంలో మధ్య నాలుగుస్థంబాలు అచ్చంగా అజంతా స్తంబాలు, ప్రాంగణ ముఖరూపం అజంతా చైతన్య ప్రాంగణ ముఖంలా వున్నది. వితానము అర్థచంద్రాకృతి, మధ్య చైత్యభాగానికి ఈవలావల విహార ప్రాంగణాలు, చైత్యమందిరంలోకి పోవుటతోడనే ఎదుటు చక్కని స్పటికశిలా నిర్మిత బుద్ధివిగ్రహము, త్యాగతి పోతపోసిన పంచలోహాత్మక పద్మంపై ప్రత్యక్ష మవుతుంది. ఆ పద్మము పాలరాతి పద్మపీఠంమీద వున్నది. ఆ పీఠానికి ఈవలావల పద్మలతాకారములు, దీపవృక్షాలయిన సేమ్మేలు వున్నవి. వాని ప్రక్క ధూపకరండాలున్నవి. విగ్రహానికి ముందు పీఠాలపై పుష్పకరండాలూ, రజిత జలకలశాలూ వున్నవి. వానికి ముందు చిరుతపులి తోళ్ళు పరచివున్నాయి. చీనాదేశపు విగ్రహాలు, కలశాలూ పీఠికలపై ఈవలావల గోడల పొడుగునా అక్కడక్కడ అమరింపబడివున్నాయి. వానికి ముందు పూజాకలశాలూ, పూవుల పళ్ళెరాలూ వున్నాయి. ఆ మందిరంలో వితానమూ అర్థచంద్రాకృతిగానే వున్నది. వితానంమీదలతలూ, కుడ్యాలూ అన్నిటిమీదా బుద్ధజీవితగాధలూ మనోహరంగా చిత్రితమై వున్నాయి. పైన వితానంపై నాలుగు కాంతాయనాలు నీలివర్ణపు గ్లాసు ఫలకాలలో పొదిగింపబడి వున్నాయి. విగ్రహానికి ముందున్న మందిర భాగమంతా ఆక్రమించే బందరు జాతీయకళాశాల పెద్ద రత్నకంబళి పరచి వున్నది. ఈ చైతన్యమందిరం పొడుగు ముప్పది అరడుగులు. వెడల్పు పదునెనిమిది అడుగులు. పైన అర్థచంద్రాకృతిగా వుండే వితానమంతా కాంక్రీటుతో తయారు చేసినదే. చైతన్యమందిరానికి సింహద్వారం కాకుండా మూడువైపులా గోడలకు మధ్యగా మూడుద్వారాలున్నాయి. ఆ ద్వారాలకు మూడు టిబెట్టు తెరలున్నాయి. ఒకదానిపై అమితాభ బుద్ధమూర్తి చిత్రించివుంది. అమితాభుడూ, అమితాభుని సేవింపవచ్చిన బుద్దులూ, అర్హతలూ, బొదిసత్వులూ, పద్మాలలో ఆ దివ్యపథంలో కాంతి మేఘాలమధ్య గోచరమౌతున్నది. ఈ తెర ఎడమ చేతివైపు గుమ్మానికి వుంది. కుడిచేతివైపు, అంటే బుద్ధావిగ్రహానికి ఎడమవైపు గోడకున్న గుమ్మానికి వున్న తెరపై సిద్దార్థచిత్ర మున్నది. బుద్ధదేవుని వెనుక అలంకారరూపమైన బోధివృక్షము వున్నది. క్రింద కామదేవుడు, అతని కుమార్తెలు రాక్షసులు, పిశాచాదులు వున్నారు, పైన దేవులున్నారు. పద్మాలు, పద్మలతలూ, మేఘాలు అలంకార స్వరూపంగా వున్నాయి. విగ్రహం వెనుక వున్న గుమ్మంతెర శ్వేతతారాదేవి విగ్రహముతో వున్నది. ఆ చిత్రం వర్ణనాతీత మనోహరంగా వున్నది. పద్మాలూ, లతలూ, దేవిని కొలిచే పరివారదేవీ స్వరూపాలూ ఆ తెరపై చిత్రింపబడి వున్నాయి.
ఈ చైతన్యమందిరంలో కుడివైపు గుమ్మంలోంచి వెడితే, కళాగ్రంథాలయంలోనికి వెడతాము. ఎన్నో భూర్జపత్రగ్రంథాలూ, జపాను, చీనా గ్రంధాలూ, పాశ్చాత్య భాషలలో గ్రంథాలూ, తాళపత్రగ్రంధాలూ, దేవనాగరిలిపిలో, తెలుగు లిపిలో గ్రంథాలూ, శిల్ప చిత్రలేఖన నాట్య సంగీతాలను గూర్చి వున్నాయి. ఈ గదికి ప్రక్క చైతన్యమందిరాన్ని అంటి ఇంకొలున్నాయి. ఒకటి త్యాగతి శిల్పమందిరము, రెండోది చిత్రమందిరము. ఇటు చదువుకొనే గదివెనక, అందులో సగంవైశాల్యం గదిలో త్యాగతి శిల్పచిత్ర సామాగ్రి ఉంచుకొనే గది. అవతలవైపు అంతే కొలత వున్న గది విద్యార్ధులు నేర్చుకొనేందుకు వున్నది. ఈ చిన్నమేడ యాభైనాలుగడుగుల సమచతురస్రం. వెనుకప్రక్క ఈ యాభైనాలుగడుగుల పొడుగునా వసారా వుంది. ముందుభాగంలో విహారరూపంలో ఉన్న మందిరాలు రెండూ ఈవలావల, మధ్య చైత్యానికి వసారా లేకుండా ముందుకు చొచ్చుకువచ్చిన వితానాలున్నాయి. తలుపులు, వాతాయనాలు అన్నీ అజంతా విధానంలో ఉన్నాయి. శిల్పచిత్రమందిరాలన్నింటిలోనూ, గ్రంథపఠనమందిరంలోనూ ప్రాచీన రాజపుత్ర, మొగలు చిత్రలేఖనాలు, ఈనాటి వివిధ దేశ చిత్రలేఖనాలువున్నవి.
ఈ శిల్పభవనం వెనుక చక్కని భవనం ఒకటి ఉన్నది. అది యాభైనాలుగు అడుగుల పొడవు, ముప్పది అడుగుల వెడల్పూ ఉంటుంది. రెండు పొడుగాటి హాలులుగా అది భాగింపబడి ఉంది. ఒకటి శిల్పచిత్ర ప్రదర్శనశాల, రెండవది శిల్పకర్మాగారము. ఈ కర్మాగారము రెండు భాగాలుగా విబజింపబడి ఉంది. ఇవతల శిలాశిల్ప కర్మాగారము, అవతల లోహశిల్ప కర్మాగారము.
ఈ రెండు భవనాలూ నిర్మించడానికి శ్రీనాథమూర్తికి ముప్పది ఎనిమిది వేల రూపాయలైనవట! తాను నివసించేమేడ ఎనిమిది వేలకు కొన్నాడు. శిల్పభవనాల స్థలం నాలుగువేల రూపాయలైనదట. తల్లి కూడదీసిన రూపాయలూ, తన ఆస్తిగా వుంచుకొన్న భూమి అమ్మగా వచ్చిన రూపాయలూ, తాను రచించిన శిల్పచిత్రలేఖనాలు అమ్మగా వచ్చిన రూపాయలూ, అన్నీ ఖర్చు పెట్టినాడు. త్యాగతి ఇప్పుడు దైనందినపు ఖర్చు తల్లిగారికీ, అక్కగార్లకూ తానిచ్చిన ఆస్తులు ఆదాయముతోనూ, బొమ్మల వల్ల వచ్చిన ఆదాయమువల్లనూ!
హేమసుందరీ, లోకేస్వరీ కారుదిగి శ్రీనాథమూర్తి శిల్పమందిరంలో పనిచేసుకుంటూ వుండగా వెళ్ళినారు. లోకేశ్వరి కొంచెంసేపుండి వెళ్ళిపోయింది.
త్యాగతి : హేమా! ఏదైనా బొమ్మపై పనిచేస్తావా?
హేమ: చేస్తానుబావా! కాని ఉగాదినాటి మా సంగీతనాట్యం ఎల్లా ఉందో విమర్శనాపూర్వకంగా నీ అభిప్రాయం చెప్పావు కావేమీ?
త్యాగతి: ఈ రెండు మూడు రోజులనుంచీ చెబుతున్నానుగా హేమా!
హేమ : ఆ చెప్పావులెద్దూ! బాగుంది! అద్భుతంగా వుంది! చాలా చక్కగా వుంది అనేగా నువ్వు చెప్పింది.
ఇలాంటి అభిప్రాయాలు ప్రతి వెంకమ్మా, వెంకయ్యా ఇవ్వనే ఇచ్చారు. దీనికన్న మా తీర్థుడు నయం, ఆఖరికి మా కల్పమూర్తి నయం.
త్యాగతి మౌనంగా ' విప్లవస్త్రీ ' అనే బొమ్మ రచిస్తున్నాడు. తలెత్తకుండా బొమ్మను విన్యసిస్తూనే, వాళ్ళిద్దరూ ఏమన్నారేమిటి?
హేమ : వాళ్ళ అభిప్రాయాలు నీకెందుకు? నీ అభిప్రాయం చెబుదూ!
త్యాగతి : ఒకమ్మాయిగారు తాను నిర్వహించిన మహాకళాకార్యాన్ని అందరూ మెచ్చుకోవాలని ఆవేదనపడిపోతోందట.
హేమ : అందరూ మెచ్చుకొంటే ఎవరిక్కావాలి, మెచ్చుకోకపోతే ఎవరిక్కావాలి?
త్యాగతి : ఇంక ఏంకావాలి?
హేమ : పోదూ అంతా బడాయే! నీ అభిప్రాయం అడుగుతున్నాను గదా అని గర్వం నీకు మరీని!
21
త్యాగతి తలెత్తి తీక్షణంగా హేమవైపు చూశాడు. హేమా! నువ్వు నాట్యం నిన్న మొన్న ప్రారంభించినా , ఎంతో ఎంతో నేర్చుకొన్నదానిలా నాట్యం చేశావు. నాట్యంలో , అభినయంలో ఏవైన లోట్లు అప్పుడప్పుడూ వచ్చినా , అవి నా కళ్ళలాంటి దుర్భిణీయంత్రం కళ్ళవాళ్లకి తెలుస్తాయేమో! నీ చక్కదనమూ నీ సంగీతజ్ఞానమూ నాటకానికి ఎంతో అందం తీసుకువచ్చాయి.! లోకేశ్వరి వసంతునిలా, సోఫీ పారిజాతంలా బాగా అభినయించారు. రంగస్థలమూ, అలంకారమూ, దీపాల విధానమూ అన్నీ బాగున్నాయి అని చెప్పాడు.
హేమ : వారే, వా! అసలు నాటకం అందం చప్పవయ్యా అంటే, అన్నీ బాగానే ఉన్నాయి అంటావేగాని....
త్యాగతి : హేమా ! పాటలు బాగున్నాయి. చిన్ననాటకమైనా పొందికగా నడిచింది. ఈనాటి నాటకాలా? అవి నాటకాలు కావు. నాటక ప్రదర్శనం అంటే ఎవ్వరికీ శ్రద్దలేదు. రంగస్థల సౌందర్యం అవసరంలేదు. దీపాల గొడవ అక్కరలేదు. అలంకారాలు, ఉచితవేషాలు ఏమీ మనవాళ్ళకెక్కవు. ఇంతవరకూ మనవాళ్ళ దారిద్ర్యం ముఖ్యకారణం అనుకో.
హేమ : నువ్వు చెప్పినదంతా బాగానేవుంది బావా! కాని నేను రాసిన నాటక రచన గూర్చి చెప్పవేల? కవిత్వం ఎల్లా ఉంది? పాటలెల్లా ఉన్నాయి? భావాలెల్లా వున్నాయి?
త్యాగతి : పాటలు బాగున్నాయి. చిన్నదైనా గీతా నాటిక బాగా నడచింది. ప్రాచీన భావాలు పోవాలనీ, పోతున్నాయనీ: మాత్రు భావాలు రావాలనీ, వస్తున్నాయనీ; స్త్త్రీల బానిసత్వం పోవాలనీ, స్త్రీ పురుషుల కలయిక స్వాతంత్ర్యేచ్ఛమీద ఆధారపడి వుండాలనీ నువ్వు అందంగా , అంటే, రసవంతంగా రచించావు. అది మంచి కావ్యాల్లో ఒకటి. కాని నీ భావాలలో చాలా నాకు సరిపోవు.
హేమ : ఏమిటా భావాల కొరత? ఆడది బానిసగా వుండాలనేగా నీ భావం?
త్యాగతి: ఏమిటమ్మా బానిస, బానిసంటావు. ఏమిటా బానిసత్వం?
హేమ : బానిస కాక మా జీవితం ఏమిటి? తల్లిదండ్రుల ఒద్దికలో పెరుగుతుంటాము.
త్యాగతి : కాక స్వేచ్చగా పెరగాలనా?
హేమ : మాట కడ్డమురాకు. ఇంతట్లో పెళ్ళంటారు. వారు ఏర్పాటు చేసిన ఓ కుఱ్ఱవెధవనో, ముసలి వెధవనో పెళ్ళిచేసుకోవాలి. చెప్పిస్తున్న ఏదో చచ్చుచదువూ అంతటితో సమాప్తి. ఇక మొగుడు కుంక అధికారం ఆనాటినుంఛీ! వాడు గుమాస్తా అయితే ఈవిడ గుమాస్తా! వాడు ఉపాధ్యాయుడైతే, ఈవిడ ఉపాధ్యాయుని! వాడు ఎక్కడికన్నా తీసుకువెళ్తేవెళ్ళడం లేకపోతే పేడలా పడివుండడం. వాడు చస్తే ఈవిడ వెధవముండ! బోడిగుండూ! ఎవరికీ ఎదురు పోకూడదూ! పొద్దున్నే ఎవరి మొగమూ చూడకూదడూ! తెల్లబట్టలు! నగలులేని మోడు! వంటముండ, దాసీముండ! బోడిముండ.
త్యాగతి : అంత కోపమేమిటి? హేమ : ఆడది వీధిముఖం చూడకూడదు. వీధిలోకి వస్తే ఆడది విచ్చలవిడిగా తిరిగేది! సినిమాకు వెళ్ళే ఆడది అయితే బరిమీద పడిందంటారు. ఒక్కర్తీ రైళ్ళలో ప్రయాణం చేయకూడదు! ఒకవేళ వెళ్ళినా , ఆడవాళ్ళ పెట్టెలో ప్రయాణం చేయాలి. అన్ని సౌకర్యాలూ మగవాళ్ళకా? మొదటి తరగతులూ, సభలకు వెళ్ళడం, వాహ్యాళులకు వెళ్ళడం, ఆటలపోటీ పందేలలో పాల్గోనడమూ! మొగుడనే రాక్షసుడే ఉంటే ఆటకట్టా?
త్యాగతి : ఏమి చెయ్యమంటావు?
హేమ : ఏమేమి చెయ్యాలో మీరు చెప్పరు. మీకు ఆడవాళ్ళ గొడవే అక్కర్లేదు. పెళ్లాలయితే కావాలేం!
త్యాగతి : మేము ఎంత జాగ్రత్తగా ఆలోచించి చెప్పినా పురుషులుగానే ఆలోచించి చెప్తాము కాదా!
హేమ : ఓహో ! ఏం గర్వమూ? ఏమి అహంభావమూ? అయితే,మీరు హరిజనులుకారు, హరిజనోద్యమంమీద మీ అభిప్రాయం యెందుకిస్తారు? ఎందుకయ్యా ఈ డాబులు మాట్లాడతావు?
త్యాగతి : హేమా ! నీకు కోపం వస్తే చెప్పలేను. కుర్రవాళ్ళు చదువుకొనే రోజుల్లో , వాళ్లకు వాళ్ళ ఇష్టం వచ్చిన స్వేఛ్చ వుందనా? వివాహ విషయంలో వాడిమాట సాగుతుందనా? వాడి ఉద్యోగం విషయమై కూడా వాడికి స్వేఛ్చ వుందనా?
హేమ : లేదయ్యా! అట్లాగే ఒప్పుకుందాము. కాని వాడికి మొదటి నుండీ వుండే స్వేఛ్చ ఆడవాళ్ళకి ఇవ్వద్దంటావా?
హేమ : నీ వాదనలన్నీ చక్కగానే వున్నాయి. ప్రాపంచికంగా ఆలోచిస్తే , నా స్వాతంత్ర్యం నువ్వు తీసుకోవాలంటే నేను నీకన్న బలహీనుణ్ణి కావాలికదా! ప్రకృతి విషయం ఆలోచిద్దాం. ప్రస్తుతం ఆడవాళ్ళు బలహీనులు. అన్ని దేశాల్లో ఉండే పురుషులుధర్మమో, న్యాయమో , మంచో, చెడ్దో ఆలోచించి స్త్రీలకు వారు కోరినవన్నీ ఇవ్వాలి. స్త్రీలు పురుషులు ఇష్టపడకపోతే ఒక్క స్వేఛ్చ తీసుకోలేరు. స్త్రీలకు దేహబలం తక్కువ, ఆవేశబలం ఎక్కువ. ఏ విషయంలోనైనా స్త్రీలు పురుషులకు లొజ్జు. వంట చేయడంలోనూ గొప్ప వంటవారు పురుషులే! సంగీతంలో ఆడవాళ్ళ గొంతు బాగుండవచ్చు గాని, పాండిత్యం గంభీరతా మగవాళ్ళదే. శాస్త్రజ్ఞానంలో ఎవ్వరో ఒక్క మదాంక్యూరీ తప్ప పుట్టింది. కవిత్వంలో మొల్లలూ, సాఫోలూ, పెరల్ బుక్కులు, తిక్కన్న , తియాక్రటీస్, ఆప్టన్ సిం క్లెయర్లు ముందు దివ్విటీముందు దీపాలు. రాజ్యాలు పాలించిన చక్రవర్తినులలో ఒక్కరుద్రాంబ తప్పితే, తక్కీనవాళ్ళ చరిత్ర జుగుప్సా కరము. అలాంటప్పుడు స్త్రీలుకోరేస్వేఛ్చ ఎందులో? ఇష్టం వచ్చిన పురుషునితో అవినీతిగా సంచరించడంలోనా? డబ్బుతగులబెట్టి మూడుకాయలూ, ఆరుపళ్ళుగా జీవితం పాడుచేసుకోవాలనా? ఏమిటీ ఆడవాళ్ళకు కావలసింది? హేమ : అల్లామాట్లాడాలి. గోముఖవ్యాఘ్రం బయలుపడింది. రంగు పూసుకుంటేమాత్రం చిరుతపులి చుక్కలు పోతాయా? వ్రతం చేసే పెద్దపులి మాంసభక్షణ మానుతుందా? ఏమి చూచావు నువ్వు రష్యాలో ? దేశాలన్నీ తిరిగి ఏమిటి నువ్వు కనిపెట్టింది?
త్యాగతి : రష్యాలో నేను చూచిందా? స్త్రీలకు సమాన ఓటు ఉంది. స్త్రీలకు ఉద్యోగాలన్నింటిలోనూ సమనాదికారం ఉంది. బిడ్డలను పెంచే దాడి భవనాలు ఉన్నాయి. ప్రభుత్వోద్యోగాల్లో అడవాళ్ళెంతమందో ఉన్నారు. అన్ని వృత్తులలోను ఉన్నారు. వివాహం స్త్రీ రద్దు చేసుకోవచ్చు. పురుషుడు రద్దు చేసుకోవచ్చు. విచాహం రద్దు విషయంలో ఎవరి తప్పైతే , వారి మీద పిల్లల పెంపకం బాధ్యత ఎక్కువ పడుతుంది.
హేమ : ఆ రకంగా ప్రతి దేశంలోనూ వుంటే ఏం తప్పు వచ్చింది?
త్యాగతి: ఈ విషయంలో రెండు దృశ్యాలను గూర్చి నీకు వర్ణించి చెబుతాను. తర్వాత నీ అభిప్రాయం చెప్పు.
22
హేమ బావగారి దగ్గరగా జరిగి, అతను విన్యసిస్తున్న బొమ్మను పరిశీలనగా చూస్తూ, ఎప్పుడూ ఆడవాళ్ళ బొమ్మలే నువ్వు వేసేది అన్నది. తమ కామవాంఛ తెలుపుకోవడానికి , తమ స్త్రీ వాంఛ తీర్చుకోవడానికి; వ్యంగ్యంగా స్త్రీల మీద కవిత్వం; స్త్రీలను ద్రోహులుగా రచించడం, స్త్రీలను చిత్రించడం; స్త్రీలను గూర్చి కధలు వ్రాయడం; సినిమాతారల బొమ్మలు గది నిండా వుంచుకోవడం; స్త్రీలకు___చిలకలకొలికి, లలిత, సుందరి, నతనాభి, ఆకాశమధ్య, చకోరస్తని, చపలాక్షి, కురంగాక్షి, రంభోరు, ఘనజఘనకుందరదన, హంసయాన, బింబాధరి, పల్లవపాణి__ఈ రకం పేర్లు పెట్టి దేహం అంతా కబళింపు చూపులతో చూస్తూ, గ్రంథాలన్నిటినీ నింపడం; ఈ రకం జావకడివనులు చేస్తున్నారు కవులూ, శిల్పులూ, వగైరా వారంతానూ అని హేళనగా నవ్వింది.
త్యాగతి : హేమా, నీ భావాలేమిటో స్పష్టంగా చెప్పు!
హేమ : నా భావాలా? నావి రష్యాభావాలు. నాకు ఈ పూంజీదారుల సంస్కృతీ , విజ్ఞానమూ ఇంతటితో అంతరించి, ఇక్కడనుంచైనా నిజమైన సర్వప్రజారాజ్యం రావాలి. సర్వప్రజాసంస్కృతీ కావాలి అని గాఢవాంఛ బయలుదేరింది.
త్యాగతి : కోటీశ్వరులు తమ ఇళ్ళనిండా కళావస్తువులు పరచుకోవడం; తమ కోసం కవిత్వం వ్రాయించుకోవటం; తమ దానధర్మాలు మెప్పించుకోవడం; శాసనాలు చెక్కించుకోడం; డబ్బిచ్చి కృతులు పుచ్చుకోడం, సుబ్బిశెట్టులు షష్టిపూర్తి ఉత్సవాలు చేసుకోవడం; రఘురామచౌదరి, కూతురు పెళ్ళికిలక్షరూపాయలు ఖర్చుచేసి ఏభైవేలు కట్నమూరి ఏభై ఎకరాలు పెళ్ళికూతురికి వధూకట్నం, లాంచనాలకు వెండి బంగారు వస్తువులకు ముప్ఫైవేలియ్యడం; పెళ్లి ఉత్సవాలకు శాంతాఆప్టే, విశ్వనాథ భాగవతార్, సైగల్ కచ్చేరీలు, బాలసరస్వతి డాన్సు పెట్టించడం, అందుకు తన తోటి వాళ్ళను , పెద్ద ఉద్యోగస్తులను పిలవడం; భోజనాధికాలకు నలభైవేలుఖర్చు చేయడం, ప్రతి పూటా ఆరు పిండివంటలూ, ఎనిమిది కూరలూ, పది పచ్చళ్ళూ, సాంబారు, మజ్జిగపులుసూ, మైసూరు రసమూ చేయించడం, బాటుమాంసాల బియ్యము, రాజనాలూ, డిల్లీభోగాలూ, మాత్రమే ఉపయోగించడం; వచ్చిన అతిధులు తినలేక అజీర్తులతో ఆవేదనపడడం; వీళ్ళందరికీ ప్రత్యేకం ఒక ఎం. బి., బి, ఎస్. నూ, ఒక వైద్యశాలనూ పెళ్లిశాలలో ఏర్పాటుచేయడం; ఊరంతా రొంపి అవడం; దేశ దేశాల లక్షాధికారులు, రాజకీయ నాయకులు , సంఘు నాయకులు, మహాకవులూ పిలవబడటం, కవి పండిత సన్మానం జరపడం, ఒక్కొక్కరికి నూటపదార్లు వగైరాలు ఇవ్వడం, మైసూరు బేండూ, వెంకటరంగమాణిక్యం పిళ్లె సన్నాయి మేళమూ రావడం మొదలైన ఈ పూంజీదారుల అసత్య, హింసాత్మక, దౌర్జన్యపూరిత, గందరగోళాలు పనికిరావంటావు నువ్వు, అంతేనా?
హేమ : ఎంత లెక్చరిచ్చావోయ్ బావా! ఎంత విచిత్రంగా చిత్రించావోయ్ బావా!
త్యాగతి : ఓ మరదలా ! ఇంక నీ అభిప్రాయం సాగనీ, నేను నీ భావాలన్నీ సరిగ్గా వ్యాఖ్యానం చేశానా?
హేమ : నీ వ్యాఖ్యానం అంతా నాకు నచ్చలేదులే!
త్యాగతి : నీ అభిప్రాయం సాగనీ!
హేమ : జాతీయవాదులమని బయలుదేరి ఈ బిర్లాలు, ఈ అంబాలాల్ సారాబాయిలు, ఈ బజాజులు ఓ గుడికట్టీ, ఓ పాఠశాల తెరచి, హరిజన నిధికి రెండులక్షలు ఇచ్చీ, వీరిని అంటే బీదలరక్తం పీల్చేవ్యాపారులను మనం నాశనం చేయాలి.
త్యాగతి : నిజం హేమా! పాశ్చాత్య సామ్యవాద దృష్టి ప్రకారం నువ్వన్న మాటలు నిజం.
హేమా : ప్రాచ్యభావన ప్రకారం నిజంకాదా?
త్యాగతి : కాదు.
హేమ : ఏమిటా ప్రాచ్యభావం ? అప్రాచ్యభావం ?
త్యాగతి: మహాత్మాగాంధీగారి అభిప్రాయాలు, రామకృష్ణ పరమహంసగారి అభిప్రాయాలు తెలుసుకోలేదా?
హేమ: తొంభై ఏళ్ళ గుడి ముసలమ్మ భావాలు, నూట ముప్ఫై ఏళ్ళ తొక్కుగారి భావాలు నాకక్కరలేదు.
త్యాగతి : కారల్ మార్క్స్ ఇప్పటిదాకా బ్రతికివుంటే పదహారేళ్ళ బాలకుమారుడా ? లెనిన్ ఇప్పటిదాకా బ్రతికివుంటే పన్నెండేళ్ళ పాలూరే బాలకుడా?
హేమ : వాళ్ళవి నిత్య సత్యాలు! త్యాగతి : బీదతనం లేకుండా చేయడమా, వారి నిత్య సత్యభావం?
హేమ : కాదు . అందరికీ పని, అందరికీ తిండి, అందరికీ బట్ట, అందరికీ ఇళ్ళు! ఒకరికి హెచ్చూ, ఒకరికి తగ్గూ ఉండ కూడదు. ప్రపంచంలో ధనం మనుష్యులందరిదీ!
త్యాగతి : జంతువులది కాదా ? జంతువుల్ని తినాలీ! జంతువుల్ని సరదాకు నాశనం చేయాలీ? మనుష్యుడు మానసికంగా ఎక్కువ బలవంతుడు, అందుకని జంతువులు, క్రిమికీటకాదులు వారి చెప్పుచేతల్లో వుండాలీ? మనుష్యులలో ఎక్కువ బలవంతుల జట్టు తయ్యారైతే, తక్కినవాళ్ళు వాళ్ళ చెప్పుచేతల్లో వుండాలీ? అక్కడ ధర్మం వేరేం! అది తాత్కాలిక ధర్మమా? అది సరియైన సామ్యవాదమా? అవసరమైతే , ఎవరు సామ్యవాదానికి భయంకర శత్రువులో వారితో సంధి చేసుకోవాలీ, ఆ పూంజీ, ఫాసిస్టువాడు తనలాంటి ఇతర సామ్యవాద విరోధుల నందరినీ నాశనం చేసి, తన అప్రతిమాన అవిచ్ఛిన్న పూంజీతత్వం క్రింద తక్కిన సామ్రాజ్య పూంజీ దారులను బానిసలను చెయ్యాలి! అది సామ్యవాద రాజనీతా! ప్రకృతి శాస్త్ర సత్యానికి మానవ మనస్తత్వ సత్యం అతీతమా! ఆధ్యాత్మకం ఈ ధర్మాన్ని నడపలేదా? ఒక సత్యమూ, ఇంకో సత్యమూ సామ్యవాద సత్యకోటిలో దెబ్బలాడుకోవచ్చా ? అని తాత్కాలిక సామ్యవాద ధర్మాలా?
హేమ : ఇదంతా సామ్యవాద నిరసనా?
త్యాగతి : సామ్యవాదమేమిటి ? దేన్నీ నిరసించలేను. సామ్రాజ్యతత్వం ధనేశతత్వంమీద ఆధారపడి వుండి, ధనేశ రాజ్యంలో కొన్ని రాజ్యాలు బానిస రాజ్యాలను స్థాపించినవి. ధనేకుల ధనం తిని, వారి భోగంలో పాలుపంచుకొని, వారి తృప్తికి సామ్రాజ్యవాది అగు కవి గాయకాదులూ, వేదాంతులూ, వేదాంతమూ, కళాది సంస్కృతీ వుద్వవింపచేస్తారు. 'నిషీ' అనే వేదాంతి బంగారపు జుట్టు, నీలికళ్ళు, తెల్లటి 'బ్లాండు' జాతిదే! మానసిక ఆద్యాత్మిక భౌతిక శక్తులన్నీ వారివేనని వాదించాడు. అల్లాగా హెర్బర్టు స్పెన్సరూ, దార్వినూ శక్తిగల ప్రాణే బ్రతుకుతుందనే ప్రామాణ్య వచనం ఉద్భవింపచేశారు. కిప్లింగ్ కవి పడమట పడమటే, తూరుపు తూరుపే! ఈ రెండూ ఎప్పుడూ కలవవు అని కవిత్వం వ్రాశాడు. ఈ ధనేశ వేదాంతము తెల్లజాతి సామ్రాజ్యవేదాంతమయింది. మన భారతదేశంలో ధనేశ వేదాంత మంతలేకపోయినా కొద్దిగా వుంది.
హేమ : అమ్మయ్యా కొంతైనా ఒప్పుకున్నాడు.
త్యాగతి : ఉండు తొందరపడకు! ఆ ధనేశ వేదాంతము పూర్వకర్మ సముపార్జితం విత్తం భోగం అన్న మెత్త వేదాంతాన్ని పుట్టించింది. యజ్ఞయాగాది కర్మలలో రాజసూయం, అశ్వమేధం ప్రోత్సహింపజేసింది. అన్నం కోసం దేవతలను ప్రార్ధించాలనీ, ఆ దేవతల కోసం యజ్జమనిన్నీ అన్న భావం మాత్రం ధనేశ భావం కాదు సుమా! హేమ : బాగుంది బావా. కానీ, కానీ. మా బావ నా వుద్దేశం వాడే అని నేను తీర్థమిత్రునితో అన్నాను. కాదని వాదించాడు. అతనివెఱ్ఱి అతనిది. నువ్వు పూంజీ భావం కలవాడవట. నీ వేదాంతం పూంజీవేదాంతంఅట.
త్యాగతి : రాయిష్టు! ఆ కథంతా నాకు తెలుసులే ! రాయిస్టుల సంస్కృతీ , వాదనా, వేదాంత వాదనా నాకు పూర్తిగా తెలుసు.
హేమ : అదిగో, నీకూ కల్పమూర్తికీ తీర్థమిత్రుడంటే అంత వుడుకుబోతు తనమేమి? అంత కోపమేమి?
త్యాగతి: నాకు ఆరెండూ లేవు. అతని భావాలన్నీ సంపూర్ణంగా నిరసిస్తా. అంతే. విను__ఏ రష్యాలోనో ఒక ఇంగ్లీషువాణ్ణిగాని, ఒక అమెరికావాణ్ణి కాని అన్యాయంచేస్తే, ప్రాణద్రోహంగాని, రాజద్రోహంగాని చేస్తే వాళ్ళని గురించి ఇంగ్లండు అమెరికాలో ధనేశులూ, వేదాంతులూ ధనేశుల కవులూ నానా అల్లరిచేసి వారి రాయబారులద్వారా జాగ్రత్త అనే విషయం ఆ రష్యా వగైరాది రాజ్యాలకు తెలియజేస్తారు. అవతల తామే ఓ డయ్యర్ దోమలను నలిపినట్లు వేలకొలది బిడ్డలకూ, స్త్రీలనూ, పురుషుల్నీ, వృద్దుల్నీ కాల్చి కాల్చి, చంపి చంపి, జలియన్ వాలాబాగ్ లో గుండ్లు అయిపోవడం వల్ల ఊరుకుంటే మాట్లాడరు. జావాలో, బర్మాలో, ఆఫ్రికాలో, అమెరికాలో నీగ్రో మొదలైన ప్రజల్ని గొంగళి పురుగుల కన్నా నీచంగా చూస్తారు. ఇది ధనేశ సామ్రాజ్యతత్వ వేదాంతము.
హేమ : చాలోయి బావా! నిన్ను ఆపళంగా ఆడపిల్లవైతే ఒక ముద్దు పెట్టుకొని వుందును.
త్యాగతి : నీ పుణ్యమా అని అలాంటి పొరపాటు పనులు మాత్రం చేయక. 23
మరదలు హేమ ఆ మాట అనగానే త్యాగతి ఏదో ప్రతివచనం అన్నా , అతని జీవితం మూలమూలలా కదిలిపోయింది. తన గురుదేవుడు తన కీ అగ్నిపరీక్ష యెందుకు పెట్టినాడు? తాను గృహస్తాశ్రమమే స్వీకరించవలసి వుంటే, తన గురుదేవుడే ఇంతకన్న ఒక పల్లెటూరి కుటుంబపు అమ్మాయిని తనకు నియమిస్తే , తాను పెళ్ళాడి వుందేవాడే! హేమ ఒక పెద్ద సంస్థ! ఈమె తనవలనగానీ, హేమ వలన తానుగానీ ఆనందం పొందగలగడం సంభవమా? ఎలాగు ఈ క్లిష్ట సమస్య విడిపోయేది? కాని తాను హేమను ప్రేమిస్తున్నాడే. హేమా, శకుంతలా ఒకటే మహాభావం యొక్క స్త్రీ అవతారాలన్న విషయం తనకు మెరుములా తోచినప్పుడు తాను పొంగి, పులకించి, సర్వభువనవ్యాప్తి నందినట్లు, దివ్యత్వమందినట్లు అనంద పరిపూర్తి దర్శించినట్లు తనకు అనుభూతి కలిగిందే!
హేమ : బావా! ఓ బావా! కానియ్యవయ్యా నీ ఉపన్యాసం! మనవాళ్ళ వేదాంతానికి, మన భారతీయ జీవితానికీ ఏమీ సంబంధంలేదు వేదకాల వేదాంతం పూజారి వర్గంవారయిన బ్రాహ్మణులది. అందుకనే వేదాలలో, ధర్మశాస్త్రాలలో అందరూ బ్రహ్మపుత్రులనీ, తాము పెద్దన్నయ్యలై పుట్టారనీ చెప్పారు.
త్యాగతి : ఆ తర్వాతనో దేవీ!
హేమ : ఫస్టుగా అన్నావు! నువ్వూ నేనూ కలసి ఓ నాటకం ఆడాలి. సరే విను. అక్కడినుంచి ఆ బ్రాహ్మణరాజ్యం ఉపనిషత్తు మెత్త వేదాంతానికి దిగితే. శ్రీకృష్ణుడు వచ్చి రాజుల వేదాంతం భగవద్గీతలో చెప్పాడు. అది బలం చేశాడు తర్వాత వచ్చిన బుద్ధుడు. ఆ తర్వాత గాంధీ వచ్చి కోమటి వేదాంతం ఇచ్చాడు. ఇప్పుడు సర్వసమానవత్వమైన శూద్రరాజ్యం వచ్చింది.
త్యాగతి : దాని కెవరు వేదాంత గురువు?
హేమ : ఎం. ఎన్. రాయి!
త్యాగతి : అతడా! అతడు పూర్వాశ్రమంలో బ్రాహ్మణుడు ! అతని నిజమైన పేరు నరేంద్రభట్టాచార్యుడు. బెంగాలు పంచుకులీనోపాద్యాయులలో భట్టోపాధ్యాయుల వంశంవాడు. ఈ ఆశ్రమంలో పేరు మారి శూద్ర పేరైన మణీంద్రనాధరాయి అయింది.
హేమ : నీ వెటకారాలు మానెయ్యి. అతడు స్వచ్చమైన శూద్రుడని తీర్థమిత్రుడన్నాడు. తీర్థ్ చాలా చదువుకొన్నాడు. మేఘు రాయి మానస పుత్రీపుత్రకులం కాము. మీరు మాత్రం వట్టి గాంధీ బానిసలు.
త్యాగతి : అయితే మీ వేదాంతం ఏమిటి? మీరే పక్షీయులు?
హేమ : మా పార్టీ మా స్వంత పార్టే! ముందు ముందు మా పక్షానికి ఎక్కువబలం వస్తుంది మా పక్షం పేరు స్వచ్ఛ స్వేచ్ఛాపక్షం మాది స్వచ్ఛ స్వేచ్ఛావాదం! మాకు జాతులు లేవు , మతాలూ లేవు, దేవుళ్ళులేరు, నీతి అనేది మానవుని ఇస్టంమీద ఆధారపడి ఉంది. సంఘానికి వ్యక్తి ధర్మం నిర్ణయించే అధికారం లేదు. సాంఘీక ధర్మసూత్రం నిర్ణయించే అధికారం వుంది.
త్యాగతి : అదే అనుకున్నాను. నీ వేదన అంతా అర్ధమయింది నాకిప్పుడు. నీ నాటకమూ అర్ధమయింది. నీకూ స్వేచ్ఛా ప్రణయవాదం నచ్చింది. వాదనకు ప్రియనాయకుడు ఒక్క తీర్ధమిత్రుడే అనుకున్నా!
హేమ : కాదు బావా, నువ్వు ముసలమ్మలా వాదించక, నిజమైన భావం__విను మరీ, ఆ బొమ్మమాని , మా నిజమైన భావం ఏమిటంటే-ఈ ప్రగతి స్థితిలో వివాహం అడ్డు వస్తుందని.
త్యాగతి : ఇంకా!
హేమ : ఇంకా లేదు గింకాలేదు! అన్ని పనులు మహోత్తమంగా చేయగలవారు సంఘం మీది, ఆస్తిమీది, రాజ్యం మీది, ప్రపంచం మీది, అనేగా ఆలోచన! నేను నా విషయం బాగా నిశ్చయించుకోలేదు. నాకు వివాహం ఆడాలని లేదు. అమ్మా, నాన్నా, బాధపడతారని ఊరుకున్నా! నాకు వివాహమూ, కామవాంఛా భరింపలేనివి కాలేదు. అయితే, ఏమి చేయాలని ఓ పెద్ద సమస్య వుంది. రెండు మూడుసారులు కామవాంఛ కలిగింది. అది చంపుకున్నాను.
హేమ త్యాగతి భుజంమీద చేయివేసి, బావా! అంది . త్యాగతి హేమా ! ఆ మాటలు చెబుతూ నా భుజం మీద చేయ వేయకు ! అని అంటూ చిరునవ్వు నవ్వాడు.
త్యాగతి ఆ ముక్క అన్నాడు. అతనిలోని నరాలు ఏదో వివశత్వం పొందినాయి. ఇంతలో ఏదో ఉప్పొంగు ఒక్కమాటుగ అతనిలోని తపను, కాంక్ష, ప్రేమ, పూజ కలసి మహాతరంగంలా ఆకాశం అంటాయి. ఆ ముక్క హేమ అనడంలో అర్ధం ఏమిటి? కాని తన బావను మళ్ళీ ఆలోచింపనిస్తేనా హేమ?
హేమ : బావా! ఏమిటి ఆలోచన?
త్యాగతి : హేమా, మనకు తెలిసో తెలియకుండానో, మాటలంటాము. మాటలు మాటలతో పోవు. జీవితంలోంచి వచ్చిన మాటలు జీవితంతో గాఢసంబంధం కలిగి వుంటాయి. నువ్వు చటుక్కున నువ్వు ఆడపిల్లవైతే నిన్ను ముద్దుపెట్టుకు వుందును అన్నావు. ఆ మాటలు నువ్వు ఎంత అనాలోచితంగానో అన్నావు. అలాంటి మాటలు అనడంలో నీ వెనుక వున్న ఇరవై ఏళ్ళ జీవితమూ ఉంది. నీ తల్లిదండ్రులు నిన్ను అల్లారుముద్దుగా పెంచారు. వాళ్ళు ఒక దెబ్బతిని ఉండడంచేత నీ ఇష్టమే నీ ఇంట్లో రాజ్యం అయింది. నీ మాట శాసనం అయింది. నీ భావాలు అనేక ప్రళయాలకు, గాలివానలకు లోనవుతున్నాయి. కాని ఈ గాలివానల్లోంఛి నిదానం, ఉత్తమమార్గ పరిశోదనా రావాలని నువ్వు ప్రయత్నిస్తే నాకు సంతోషమే! నువ్వు బోల్షివిజము అని ఓ మాటలంటావు. గాంధీమహాత్ముని దారి అని ఓ మాటంటావు. నీలో ఈ రెండూ లేవు. మహాత్ముని దరంటే, బోల్షివిజానికి, ఆధ్యాత్మికతత్వం రంగారిస్తే అయిన మహోత్కృష్టభావం కాని అది నీలో ఎక్కడుంది? నీలో వట్టి నాశనతత్వం ప్రస్తుతం విజ్రుమ్బించివుంది. మీబోటి వాళ్ళే కొందరు ఎక్కువ ధనవంతులై ఫ్రాన్సులో ఇది ప్రారంభించారు. ఈ తత్వం అమెరికా కోటీశ్వరులది. మేం గొప్పవాళ్ళం. మేందేవతలం అనే భావమే వరసా వావీ లేని స్త్రీ పురుషుల కలయికలుగా మారింది. అదే మీ మతానికి పరమావధి. కాబట్టి, మనుష్యులలో కొందరు మాత్రం గొప్పవారు, తక్కినవారు నీచులు, అన్నతత్వం ఈ మతం అంత నిండి నిబిడీకృతం అయివుంది. మీ మతం హిందూదేశం అంతా అల్లుకుని చదువుకున్న వాళ్ళలో పాకింది. తెలుగువాళ్ళలో కొందరు గురువులున్నారు. అందులో మీ తీర్థమిత్రుడొకడు. అతనంత భయంకర రాక్షషుడు ఇంకోడు లేడు....
హేమ కళ్ళేర్రజేసి, మొగం కందిపోగా , వణుకుతూ శక్తిలాలేచింది. ఛీ నోర్మూయ్! ఈవాగుడంతా వాగమని ఎవరధికారం ఇచ్చారు? నీజీవితం అంత ఛండాలపు జీవితం కాదు, మా తీర్థమిత్రునిది! నీకన్న ఎన్నో ఏళ్ళ చిన్నదాన్నయిన నన్ను కబళిద్దామని నువ్వు చేసిన దొంగకుట్ర నాకు అర్థం కాలేదనుకున్నావు! ఇంక నీ మొగం చూడకూడదు అని త్వరత్వరగా పోయి కారులో కూర్చుంది. పోనీయ్ తీర్థమిత్రుని ఇంటికి అన్నది. డ్రైవరు తిన్నగా కారును తీర్థమిత్రుని ఇంటికి పోనిచ్చాడు.
24
తీర్థమిత్రుని ఇల్లు ట్రిప్లి కేసులో వుంది. అతడు నల్లతంబి వీధిలో వున్న ఒక మేడ పైభాగం అంతా అద్దెకు పుచ్చుకొని ఉన్నాడు. బి. ఏ. పట్టము పుచ్చుకొని తర్వాత జి. డి. ఏ. పరీక్షలో కూడా నెగ్గి చెన్నపట్నంలో ఈ కమేనీ, ఆ కంపెనీలలో పనిచేసి, ఇప్పటికి మూడేళ్ళ నుంచీ జీవన లాల్ దయారాం కంపెనీలో ముఖ్య అకౌంటుగా చేరాడు. అతనికి రెండు వందల యాభై రూపాయల జీతం ఇస్తున్నారు.
భార్యపేరు నరసమ్మ. ఈతడామె పేరు బాగాలేదని కనకలత అని పేరు పెట్టి లతా అని పిలుస్తాడు. వారిరువురకు ముగ్గురు పిల్లలు కలిగినారు. ఇరువురు కుమారులు, ఒక కొమరిత. తీర్థమిత్రుడు పొట్టివాడు. అయిదడుగుల నాలుగంగుళాలుంటాడు. కనకలత పోతపోసిన బంగారు విగ్రహం. ఒత్తయిన ఉంగరాలు తిరిగిన జుట్టు, పిరుదులవరకూ వేలాడే జడ. చారడేసి కళ్ళు కనుముక్కుతీరు ఆ కళ్ళకు శృతిగా అందంగా వుంటుంది. బంగారు శలాకలాంటి కాయశరీరం మనిషి. ఏ హేమసుందరికో, ఏ కాంచనమాల లాంటివారి అందాలకు తగ్గుగాని, చక్కని చుక్క అయిన వనిత. తీయటి గొంతుక చిన్నతనంలో సంగీతం చెప్పించారు. ఆమె ఆక్రుతులే, ఆ పాటలే ఎప్పుడూ పాడుకుంటూ వుంటుంది. ఇరవై నాలుగేళ్ళ ఫ్రౌడాంగన అయినా ఎప్పుడూ పద్దెనిమిదేళ్ళ పడుచు ప్ర్రాయపు బాలికలా కనబడుతుంది. ఎక్కువగా మాట్లాడదు. కాని ట్రిప్లి కేసులో ఎందరో తెలుగు గృహలక్ష్ములలో తల్లోనాలుకగా మెలగుతూ వుంటుంది.
కనకలత అనేకరకాలైన చేతికుట్లు కుడుతుంది. అనేకరకాలైన నూలు అల్లికలు, ఊలుదారం అల్లికలు అల్లుతుంది. ఆ చుట్టుప్రక్కలవారైన అరవ బాలికలు ఆవిడ దగ్గరకు కుట్టుపని నేర్చుకోవడానికి వస్తూవుంటారు. వీరిదగ్గరా, వారిదగ్గరా అనేక విధాలైన పిండివంటలు నేర్చుకుంది. ఇవన్నీ తెలియని వారికి నేర్పుతూ వుంటుంది. చేతి కుట్టుపని యంత్రం సంపాదించి, తన రవికలు, బాడీలు, తన బిడ్డల చొక్కాలు, కోట్లు, లాగులు, తన భర్త షర్టులు, బనీనులు అన్నీ అందంగా కుడుతుంది. ముగ్గురు బిడ్డలూ బంగారపు బొమ్మలు. పాలతో కడిగిన ముత్యాలులా వుంటారు. మొదటి కాన్పు ఆడపిల్ల. రెండు, మూడు కాన్పులు మగపిల్లలు. ఆ పిల్లల అందానికి ఎంతోమందో వాళ్ళను ఎత్తుకొని వదలరు. పెద్దమ్మాయికి తొమ్మిదేళ్ళు. పెద్దకుర్రవాడికి ఆరేళ్ళు, రెండవవాడికి మూడో ఏడు. ఈ మధ్యనే కనకలతకు నెల తప్పింది.
తీర్థమిత్రునకు పెండ్లయినప్పుడు భార్య కాపురానికి వచ్చిన మొదటి రోజుల్లో ఆమె అందానికి తన ప్రాణమే అర్పించినట్లు పోయినాడు. ఆనాటి నరసమ్మకు భర్త రూపెత్తి వచ్చిన మన్మధుడే! ఆ రోజుల్లో భార్యా భర్తలిద్దరూ కలిసి నుంచుంటే చుట్టాలందరికీ ఎంతో ఆనందంగా వుండేది.
తన భార్య పొంకాల శరీరాన్ని ఆమె గాఢనిద్రలో వుండగా నెమ్మదిగా దిగంబరినిచేసి చూసి అతి పశుత్వగాఢకాంక్షతో ఆమెను తినేసేవాడు. భర్తయొక్క అతి పురుషత్వాన్ని చూచి కనకలత సిగ్గుపడేది. ఆమె లోపల ఆనంద పడినా, అతని అతిపురుషత్వ విదిత్వ కర్మాదుల కామెఅలా తన్నప్పగించుకొని ఊరుకొనేది. తీర్థమిత్రుని అతి పురుషత్వ దాహానికి పుత్తడిబొమ్మయిన భార్యా చాలలేదు. భార్యతో పొందు రెండు మూడు సంవత్సరాలాతన్ని ఇతర ప్రపంచాన్ని కన్నెత్తి చూడనీయలేదు. అప్పటికి భార్య తన పూర్తి సొత్తయినది. అతని పురుషత్వం ఎప్పుడామేను కోరితే___ఆ కాలం వుదయమయ్యేది, మధ్యాహ్నం అయ్యేది, సాయంకాలం అయ్యేది. ఏ కాలమైనా___ఆమె మాట్లాడక ఏదో పనిమీద వెళ్ళినట్లు వారి పడకగదిలోనికి పోవలసినదే! ఒక్కొక్కసారి అతని అతి పురుషత్వం ఆమెను దినానికి ఎనిమిది తొమ్మిదిసారులు వాంఛించేది. ఆమె కిక్కురుమనకుండా కామపు సామానులా తన్నప్పగించుకొనేది?
అతనికామ దావాగ్నికి భార్య పాతదయి పోయినది. ఆమెకు ప్రథమ సంతానము కలిగినది కూడా. ఇంకా పనిమనుషులు, వైద్యాలయంలో దాదులు, యురేషియన్ భామలు, మింటుస్ట్రీటులోని అప్సరసలు, సముద్రపు ఒడ్డు మృత్యగ్రందులూ, ఒకరనేమిటి ఎందరో వృక్షాలై, చిన్న పొదరిండ్లయి, కంటకమహీజాలై, చిట్టిఅడవులై, మహారణ్యాలై ఆహుతి అయినారు. ఆ సమయంలో ఒక స్నేహితుని వల్ల ఈతనికీ అప్పుడు ఇంటరు పరీక్షకు చదివే హేమసుందరికీ పరిచయం కలిగింది. ఆ పరిచయం జరిగిన క్షణంలో జానకిరామమూర్తి అనే తీర్థమిత్రుని ఎదురోమ్ముపై స్త్రీ అనే దివ్యకామామృత కలశం ఎదురుగా ప్రత్యక్షం అయి మెత్తని చిగురుజొంపముల ముస్టితో ధామ్మని గుద్దినట్లయింది. ఈ కలశం వాంఛించిన అసుర నాయకులలో మహానాయకుడయ్యాడతడు. అప్పటి పదహారేళ్ళ బాల కుమార్తె అయిన హేమ అప్పుడే పాలసముద్రపు అమృతపు జిడ్డులలో నుంచి ఉద్భవించిన లక్షిబాలలా ఉంది. ఈ బాలకు తానే విష్ణువో లేక రావణాసురుడో కావాలనుకున్నాడు. జానకిరామమూర్తి. ఈ బాలకే తన రసికత్వ మహారసాల ముఖ్య శాఖాగ్ర సుందరమైన జహంగీరు పండుకావాలనుకున్నాడు. తన రసిక మహాపాండిత్యాన్ని, ఈ బాలిక సౌందర్యము సవాలు చేస్తున్నదని అతడు భావించాడు. అంత అందగత్తె అని తాను గర్వపడే తన భార్య ఈ లేత నునుముగుద ఎదుట చాంపేనుద్రాక్షామృతమునందు తాటికల్లయిపోయిందని భావించుకున్నాడు. అంత పెద్దకళ్ళూ, అంత చక్కని మోములో గులాబీలో వాసనలా ఒదిగిపోయాయి అనుకున్నాడు. ఆమె ఆ అందం, ఒక లక్ష గులాబీలు విరిసిన తోటలోని ఉదయకాలంలా ఉంది అని అతడనుకున్నాడు. ఆమె ఆ లేతయవ్వనం మొదట పండిన నాజూకు పసందు మామిడిపళ్ళ ముక్కలు కోసి బంగారు పళ్లెన పెట్టినట్లుంది అని అతడు ఉప్పొంగి పోయాడు. ఆ క్షణం నుంచీ తీర్థమిత్రుడు అనేక కామ దేవాలయాలు మరచిపోయాడు. అవి గ్రామదేవతలు, ఇది మధుర మీనాక్షి దేవాలయం, తాను సుందరేశ్వరుణ్ణి అని కావ్యం అల్లుకున్నాడు.
25
కల్పమూర్తి ఆరువేల నియోగివంశ రత్నాకరముక్తాఫలము. అసలు పేరు చెన్నూరి శ్రీనివాసరావు. అతనిది కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని పామర్రు మంచి వసతిగల ఆస్తి. సాలుకు ఖరీదుల తక్కువ రోజులలో నాలుగువేల రాబడి వచ్చేది. ఈ యుద్ధం రోజులలో పదివేల రూపాయల రాబడి వస్తూంది. తండ్రి చిన్నతంలో పోయాడు. ఒక్కడే కొడుకు. తల్లి సుబ్బమ్మగారు, కొడుకును చూచుకోవడంలో దుఃఖంమరచి గుడివాడలో చదువు చెప్పించింది. కల్పమూర్తికి చిన్నతనాన్నుంచి ఆటలు మహా ఇష్టం. ఊలుబంతి ఆటలో మధ్యగా నాయకుడై అతడు నడిపే జట్టుకు ఓటమిలేదు. పుట్ బాల్ ఆటలో సెంటర్ ఫార్త్వర్డుగా తన హైస్కూల్ తరపున ఆడుతూ వుంటే, ఎ ఉన్నత పాఠశాల జట్టూ పదిమైళ్ళ దూరానికైనా రావడానికి వీలులేదు. ఒక్కసారిగా అయిదారుగురు ప్రయివేటు మాస్టర్లు చదువు చెప్పేవారు. వారందరూ కలిసి ఇతని విద్యానౌకను స్కూల్ ఫైనలు రేవుకు నెట్టారు. అక్కడ నుంచీ ఓడ కదలలేదు. ఎల్లగయితేనేం రెండేళ్లకు ఏమి మాయచేశారో చుట్టాలు పక్కాలు కల్పమూర్తికి ప్రపంచజ్ఞానం విద్య నేర్పి మామూలు విద్య ఆపుచేయించారు.
మదరాసు క్రికెట్టు జట్టులోనో, టెన్నిస్ లోనో ఆడి పేరు సంపాదించాలని కల్పమూర్తి మద్రాసు కాపురం పెట్టినాడు. క్రికెట్టులో మదరాసు జట్టులో బౌలింగులో, బంతి కొట్టడంలో అసమాన ప్రతిభ చూపిస్తూ నాయుడు, మంకాడ్, మర్చంట్ ఇలాహి అయిపోయాడు. ఇప్పుడు యాభైకి తక్కువగాని పరుగులు చేస్తారు. ఆట పూర్తయ్యేసరికి నాల్గయిదు వికెట్లు తింటాడు.
టెన్నిసులో ముఖ్యయోధుడు. అఖిల భారతీయ టెన్నిస్ పందేలలో దిట్టమైనవాడుగా పేరు సంపాదించాడు. ఇలాంటి ఒక పందెం జరిగేటప్పుడు కాలేజీ బాలికలకు పోటీవచ్చి డబుల్స్ లో సోఫీ, హేమా విజయం కావించినారు. సోఫీ సింగిల్స్ లో నెగ్గింది. హేమను ఓడించిందంటే జబ్బ పుస్టీ, దమ్మూ ఉన్న సోఫీ కొక్కదానికే చెల్లు. ఆ సమయంలో కల్పమూర్తి, హేమకు స్నేహం కలిగింది. హేమ అప్పుడు బి. ఏ. ఆనర్సు మొదటి తరగతి చదువుకుంటున్నది. హేమను ఆట డ్రెస్సులో చూచిన కల్పమూర్తి గుండె పదిహేను నిమిషాలాగిపోయింది. అతడే ఏ కావ్యనాయకుడో అయి ఉంటె! ఆ కోర్టులో విరుచుకు ప్రణయమూర్చలో పడిపోయేవాడే! ఆమె నానారాజ్య ఒలింపిక్ టెన్నిస్ ఆటలోని బంగారుగిన్నె బహుమానమై అతనికి తోచింది. బ్రాడ్ మన్ గారిని ఓడించగల క్రికెట్టు ఆట మూర్తికట్టి వచ్చినట్లాతనికి హేమ ప్రత్యక్షం అయింది. ఆమె పదివేల రూపాయల ఖరీదుగల టెన్నిస్ బేటు అని ఉప్పొంగిపోయాడు. ఆమె ఈతని అద్భుతమూర్తిని చూచి ఆటకు తగిన పురుషుడే అనుకొంది.
హేమ నియోగ బాలిక, పెళ్ళికాని అమ్మాయి. తన గోత్రానికి తగిన గోత్రం అని తెలుసుకోగానే అతడు హిమాలయ పర్వతంలా ఆకాశం అంటాడు. వెంటనే ఆమె బి. ఏ. ఆనర్సు చదువుకొంటోంది. అనగానే పసిఫిక్కు లోతుల్లోపడి ఊరుకున్నాడు. అయితే ఏమి? చదువూ, ఆటలనేర్పు రెండూ ప్రయాగక్షేత్రం కాగలవని అతడు ధైర్యం తెచ్చుకొని హేమతో స్నేహం వ్రుద్దిచేసుకొన్నాడు. అతడు మైలాపురం దగ్గర గోపాలపురంలో మేడ కొనుక్కున్నాడు. హేమ చేతనే ఆ మేడంతా అలంకరింపించాడు. ఆ బాలిక కొనమన్నదల్లా కొన్నాడు. ఆమె ఇది మచిదంటే స్టుడి బేకర్ కారు కొన్నాడు. అతడే స్వయంగా నడుపుకొనేవాడు. అతడు జిర్రున చీది ఎరుగడు. ఇంతకన్న హేమకు తగిన భర్త ఎవరు? అని అనేకులు పెద్దలతో సంప్రదించి సంబంద నిశ్చయానికి వినాయకరావుగారితో ముచ్చటింపించినాడు. వినాయకరావుగారు మా అభ్యంతరం ఏమీ లేదయ్యా, మా అమ్మాయి ఇష్టమే అన్నారు.
ఇంక హేమను అడిగేదేట్లా? అతనికి ఎవరన్నా, భయంలేదు. అందరూ స్నేహితులే తండ్రిగారు పత్రాలరూపంగా బ్యాంకులో డిపాజిట్టుల రూపంలో నిల్వచేసి వెళ్ళిన ధనబలం అంతా అతని వెనకాల ఉంది. విగ్రహం అపోలో విగ్రహం . ఏ గడ్డుపని ఎవరికి అవసరం వచ్చినా అది అతిసమర్థతతో నిర్వహించగలడు. ఇంతకన్న ఆ ఆటల సుందరి భర్తకు కావలసిన గుణగణాలు ఏమిటిగనకా?
శ్రీనివాసరావుకు కల్పమూర్తి అని పేరు పెట్టింది హేమ. హేమ అందరికీ పేర్లు పెట్టింది, అంటే అవి రూడియై పోయాయన్నమాటే! శ్రీనివాసరావు తెలివితేటలతో నిర్వికల్పమూర్తిఅట. కాని కల్పించిన పని సాధించ డంలో అసమానప్రజ్ఞా సంకల్పమూర్తి అట. అందుకని 'కల్పమూర్తి' అయినాడట. జానకిరామమూర్తి నారీ తీర్థయాత్రాపథికుడట. అందుకని అతడు ' తీర్థమిత్రు'డట. ఇంతలో నిశాపతి స్నేహం సంభవించింది హేమకు.
జగపతిరావు స్వచ్చమైన శుక్ల యజుర్వేది బ్రాహ్మణుడు. ఇంటిపేరు కొప్పర్తివారు. సన్నంగా పొడుగ్గా ఉంటాడు. అతని నలుపు అమావాస్య చీకటి! పాతాళలోకం! మైనపుగోరువంక , కోకిల! ఆ కోకిలా అతనిపాట తీయదనాల రాశి ! మైనపు గోరివంక గొంతులా అతని కంఠం సర్వ శ్రుతులూ ప్రోదుచేసుకొంది! పాతాళ లోకంలోని నాగకన్యల పాటలా అతని రాగాలలో సర్వసమ్మోహాలూ కూర్చుంది. అమావాస్య నిశిలోని సముద్రంహోరులా అతని గాంధర్వాన ఎవ్వరూ ఊహింపలేని లోతులున్నాయి.
హేమ బి. ఏ. ఆనర్సు ప్రథమ పరీక్ష అయిన వేసవికాలంలో గోక్లే హాలులో జరిగిన జగపతిరాయ సంగీత సభకు హాజరయింది. అతని పాటలోని మాధుర్యం ఆమెను ఆనందమూర్చలోముంచింది. ఇంకేముందీ, హేమే కోరి అతని స్నేహం వాంచించింది. హేమను నిశాపతి చూచాడు. అతని కంఠంలోని సంగీతం ఎడారిలో ఇంకినట్లయింది. ఆమె సౌందర్య పరమస్వచ్ఛత దర్శించాడు. అతని గొంతులో వేయివేల మాధుర్యాలు వరదల పొంగుల్లోపలే పరవళ్ళేత్తుకు ప్రవహించి వచ్చాయి.
జగపతిరావు సంగీత చరిత్ర సుందరీ విజయ పరంపరే! అతని గాంధర్వ మాధుర్యమత్తతలో ఎందరో వివిధ దేశాల సుందరులాతని హృదయంపై వాలిపోయారు. అతనికి అంతగా విషయాసక్తి లేదు. సుందరులు తనచుట్టూ తేనెటీగలలా ముసరడమే అతడు కోరాడు. వారిపూజ అతడు కోరాడు. ఒకరిద్దరు గాంధర్వబాలలు, వేశ్యావృత్తి పశువులాతన్ని తమభోగవాంఛలు తీర్చేటట్లు చేయగలిగారు. అంతే, కాని ఆ ఆడ సాలీళ్ళగూడులలోంచి జగపతిరాయుడు ఎల్లాగో తప్పించుకుపారిపోయి వచ్చాడు. అల్లాంటి జగపతి హేమను చూడగానే ఈ బాలిక పదివేల సితారుతీగలలోని పంచమ స్వరపుంజ మనుకొన్నాడు. ఈ బాలిక సరస్వతీ హస్తలీలాశుక మనుకొన్నాడు. జగపతి ఆనాటినుంచీ మదరాసే తన ముఖ్య మకాం చేసుకొన్నాడు, హేమ పకపక నవ్వుతూ నిశాపతిరావుగారూ అని అతన్ని పిలిచింది. అదే అతని పేరయి కూర్చుంది.
26
హేమ తన కారును తిన్నగా తీర్థమిత్రుని ఇంటికి పొమ్మని డ్రైవరుకు చెప్పి వెనక సీటులో కూలిపోయి కూర్చున్నది. కారు తీర్థమిత్రుని ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి కల్పమూర్తి కారు అక్కడ ఉన్నది. హేమ ఆ కారును చూడలేదు. డ్రైవర్ను తీర్థమిత్రుడుగారున్నారేమో చూడమన్నది. ఆ రోజు ఆదివారం కాబట్టి తీర్థమిత్రుడు ఇంటి దగ్గరే ఉంటాడని ఆమెకు తెలుసును.
డ్రైవరు వెళ్ళగానే అతని వెంట తీర్థమిత్రుడు ఉరుక్కుంటూ కారు దగ్గిరకు వచ్చినాడు. అతని వెంటనే కల్పమూర్తి ఇవతలికి పరుగెత్తుకొని వచ్చినాడు.
తీర్థ : హేమా! ఏమిటి అల్లా ఉన్నావు?
కల్ప : హేమా! ఒంట్లో జబ్బుగా ఉందా?
తీర్థమిత్రుడు హేమవైపు తీక్షణంగా చూచాడు. వేటాడేపులికి, ఎదుట వున్న హరిణహృదయం పూర్తిగా అవగతం అవుతుంది. అతనికి హేమ హృదయం అంతా ఒక్క నిమిషంలో అర్ధమైంది. తన స్నేహంలో దాగివున్న మహాద్భుతశక్తులన్నీ ఉపయోగించి కూడా హేమను లొంగదీయ లేకపోయాడు. ఈవరకు . ప్రపంచాద్భుత సుందరీ అయిన ఆ బాలికను నిదానంగా సర్వశక్తులూ ఉపయోగించి ఓడించాలి. ఈ బాలిక మనస్తత్వం అనేక వర్ణాల కలయిక. అనేక పరిమళాల కూడిక, అనేక రేఖల పొందిక! ఈ నిధిని పొందడానికి ఎంతకాలం తపస్సు చేస్తే యేమి? వివిధ సిద్ధులను సముపార్జించటానికి తమ తలలను బలియిచ్చిన మహాయోగులు లేరా? అప్పటికీ అయిదారుసారులు తానూ కొంత కొంత ముందుకుసాగాడు. ఆ పురోగమనం అంతటితో ఆగిపోవడమే కాకుండా మళ్ళీ వెనకటికన్న వెనక్కు వెళ్ళవలసి వచ్చింది. ఒకసారి ఆమెను కౌగిలించుకున్నంత పనిచేశాడు. ఒకసారి ఆమెను చిన్నబిడ్డలా ఎత్తి ఒక చిన్న కాల్వదాటాడు. ఒకసారి ఆమెను తోటలో పెదవులమీదనే చుంబించబోయాడు. అప్పుడామెకు విపరీతమైన కోపం వచ్చింది.
ఆ మర్నాడు తానామే నొంటిగా కలుసుకొన్నప్పుడు ఆమె బిగుసుకు పోయి మొగము చిట్లించుకొని తీర్థ్! నువ్వు, నన్ను కామోద్దేశంతో ముట్టుకోవడం ఏమీ ఇష్టంలేదు. అది పెద్దపాపం అని నేను ఇలా చెప్పడంకాదు. నా మనస్సు అలాంటి పనులవల్ల బాధపడుతోంది. ఇక ముందు నీకూనాకూ స్నేహం ఉండాలంటే ఏ విధంగానూ నన్ను ముట్టుకొనడానికి ప్రయత్నించకు. నిన్న నీ వర్తనం నాకు చాలా మనోవైకల్యం కలిగించింది. నేను నా నోరు డెట్టాల్ నీటితో కడుక్కోవలసి వచ్చింది. నీవే ఇంకా ఈలాంటి వెకిలితనం కనబరిస్తే, నువ్వూ మా ఇంటికి రావద్దు, నీ మొహం నాకు కనుబరచవద్దు. నాకు ఇష్టమయితే నేనే నిన్ను వెదకికొంటూ వస్తాను అని అన్న ముక్కలు తీర్థమిత్రుని బ్రతుకునకు మహత్తరమైన అవమానం అయినాయి. అప్పటినుండీ తీర్థమిత్రుడు హేమను ముట్టుకోలేదు.
ఇప్పుడు హేమను చూడగానే తీర్థమిత్రునికి ఇదే తనకు ప్రసాదించబడిన దివ్య సమయము అని తోచింది. ఈ ఆలోచనకు అంతా అతని మనస్సులో రెండు చిటికెలకాలం పట్టింది. అతడు నీలిపట్టుతాబితా కట్టుకొని ఒక చక్కని టర్కీతువాలు వల్లెవాటు వేసుకొని తన దబ్బపండుఛాయకు మరింత కాంతి వచ్చేటట్టుగా హేమ దగ్గరకు పరుగెత్తుకొని వచ్చాడు.
ఈ సాయంకాలం నీతో మాట్లాడవలసిన అంశాలు చాలా ఉన్నాయి. నువ్వూ నేనూ మాత్రం మాట్లాడాలి. నేను నీకోసం నా చిన్నకారు మీద వస్తాను. మనం తిన్నగా చెంగల్పట్టుపోయేదారిలో కొంతవరకు పోయి ఎక్కడో ఆగి విషయాలన్నీ మాట్లాడుకోవాలి. నువ్వు సైదా పేట రైలు గేటు దగ్గర నిల్చొని వుండు అని హేమ అతనికి మాత్రం వినబడేటట్లు చెప్పి, కల్పమూర్తీ! మా యింటికి వెడదాము. నీ భోజనము అయిందా? అని అడిగింది.
కల్పమూర్తి : ఇంకా చేయలేదు హేమా!
హేమ : రా నాతో! మా యింట్లో భోజనం చేద్దుగాని.
తమ తమ కారులమీద వారిద్దరూ హేమ యింటికి చేరారు.
హేమ గదులన్నీ మేడమీద ఉన్నాయి. ఒక గది హేమ చదువుకోనేది. ఒకటి హేమ స్నేహితురాళ్ళు కూర్చొనేది. ఒకటి హేమ గ్రంథాలయం. ఒకటి హేమ అలంకరణలగది. ఒకటి హేమ పడకగది. ఆ గదులన్నీ హేమ ఎంతో అందంగా అలంకరించుకొంది. దక్షిణవైపున ఆమె పడకగది, అలంకరణ గదీ వున్నాయి. తూర్పున అతిథి మందిరము వుంది. మధ్యహాలు రేడియో గది. ఆమె స్నానాలగదికి అలంకరణ గదిలోంచి దారి వుంది. పడకగది లోనుండి అలంకరణ గదిలోనికి దారి వుంది.
హేమ తల్లిదండ్రులు గదులు, లోకేశ్వరిగది, పూజా మందిరము, అతిథి మందిరము, సేవకుల గది, గ్రంథాలయము గది, అన్నీ క్రిందనే వున్నాయి. హేమ మేడచుట్టూ సర్వ పుష్పాలచెట్లు, కొబ్బరి, దానిమ్మ, మామిడి, సపోటా, దబ్బ, నిమ్మ, జామచెట్లు, ద్రాక్షపందిళ్ళూ వున్నాయి. తోటంతా రెండెకరాల వైశాల్యం. గులాబి జాతులు, చేమంతులు, మల్లి, జాజిజాతులు, మాధవి, మాలతీ లతాకుంజాలు, కనకాంబర, కుసుమాంబర, నీలాంబర జాతులు ఆ తోటంతా విలసిల్లుతున్నాయి. కొబ్బరి చెట్లు ఎప్పుడూ గెలలతో నిండివుంటాయి. ఆంధ్ర మామిళ్ళలో జహంగీరు, నాజూకుపసంద్, ఇమాంపసంద్, పంచదార కలశ, చిన్నరసం, చెరకురసం మొదలయిన జాతులున్నాయి.
27
హేమ, కల్పమూర్తీ భోజనం చేశారు. లోకేశ్వరి అప్పటికప్పుడే భోజనంచేసి తన గదిలో చదువుకుంటుంన్నది. వీళ్ళిద్దరూ భోజనముచేసి, హాలులోకి వచ్చేసరికి యింతలో తంతి వార్తాహరుండొకడు. లోకేశ్వరీదేవీ, శ్రీ వినాయకరావుగారింట్లో అన్న తంతివార్తను కొనివచ్చాడు.
హేమ, లోకం! నీకేదో తంతి వచ్చిందే అని కేక వేసింది. లోకేశ్వరి గబగబ పరుగెత్తుకొని వచ్చి, వణుకుతూ, ఆ తంతి కవరు తీసుకొని, లోపలికి పరుగెత్తుకొని వెళ్ళి, కవరువిప్పి వణుకుతూనే చదువుకొంది. లోకేశ్వరి కంగారు, వణుకుచూచి, హేమ భయపడి, లోకేశ్వరి గదిలోకి వెళ్ళింది. ఆమె కుర్చీలో కూలబడి కొంచెం నవ్వుతూ, కొంచెం ఏడుస్తూ వున్నది. హేమను చూడగానే లేచి వచ్చి ఆ బాలిక హేమను కౌగిలించుకొని హేమ అని మాటరాక ఊరుకుంది.
ఏమిటే లోకం, ఏమిటి కంగారు? ఆ టెలిగ్రాం నేను చూడవచ్చునా? అని అడిగింది.
అ! తప్పక అంటూ సిగ్గుపడుతూ కంటనీరు తుడుచుకుంటూ, చిరునవ్వుతో మోము ప్రపుల్లమైపోవ ఆ తంతివార్త హేమకు యిచ్చింది. డిల్లీ-11ఏప్రిల్-ఉదయం-7-20.
లోకేశ్వరి, వినాయకరావుగారి ఇంట్లో, 24 డేన్మోర్ గ్రౌండ్స్ - లోకం నువ్వు దేవకన్యవు-ఆరు నెలలునుండి-నా-మనస్సు-నీ-మీద-లగ్నం-నీకు-ఉత్తరం-రాయడానికి-సిగ్గు-పడ్డాను-నీ-పేరు-నాకు-సంతత-దేవీ-నామ-స్మరణ-నీ ఉత్తరం-దివ్య-ఆనంద-వరం-త్వరలో-ముహూర్తం-మామగారిని-సంప్రదించి-ఏర్పాటు-చేయి. హేమను-మామగారిని-అత్తగారిని-త్యాగతి-కల్పమూర్తిని-అడిగాను-పెద్ద ఉత్తరం వెంటనే-మామగారికి-ఉత్తరం-నీపాదాలకడ-మోకరించి-నీ-ప్రియ-అతి-ప్రియుడు-నిశాపతి అని తంతివార్త రెండు కాగితాలలో ఉంది.
హేమ లోకేశ్వరివైపు తీక్షణంగా చూచింది. కొంచెం అపహాసం ఆ పెదవుల ఎడమభాగంపై ప్రసరించింది.
హేమ : ఇదా కథ! యెన్నాళ్ళనుంచీ ఈ నాటకం నడుస్తూంది? నాతొ చెప్పడం అవమానం అనుకొన్నావు కాబోలు! అచ్ఛా!నీకు నా మనఃపూర్వకాభివందనాలు!
హేమ మాటలో నిండివున్న హేళన అంతా లోకేశ్వరి గ్రహించింది. ఆమె గబుక్కున లేచి, హేమ దగ్గరకు వచ్చి, ఆమె రెండు చేతులూ తీసి, తన రెండు చేతుల్తో పట్టుకొని, హేమా! నీతో చెప్పలేదని కోపమా? హేమా! నేను మొదటినుంచీ నిశాపతిని ప్రేమించాను. అతను నా మొగమైనా తిన్నగా చూసేవాడుకాదు. అలా రహస్యంగా నా హృదయంలో దాచుకొని ఉంటిని. అతడు నిన్ను ప్రేమించేవాడు. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావో లేదో నాకు తెలీయలేదు. అలాగే భగవంతుని ప్రార్థిస్తూ నా హృదయంలోని భావాన్ని అక్కడే చంపేసుకోవాలని ప్రయత్నంచేస్తూ, సాధ్యంకాక లోపల కులుముతూ, భగవంతుడు మీ ఇద్దరినీ కలుపుగాక అని కోరుతూ ఉండేదాన్ని. కాని నాకు అతని చరిత్ర నెల్లూరునుంచీ మా చుట్టం ఒకాయన ఉత్తరం రాశాడు. అంతగొప్ప సంగీత పాటకుడైన అతడు ప్రవరాఖ్యునిలా ఉంటాడని అనుకోలేదు సుమా! కాని చుట్టం రాసిన చరిత్రవంటి చరిత్ర నిజమై ఉంటుందా అనీ, ఆకాశంలోనుంచి కురిసే వర్షబిందువువంటి నిర్మల చరిత్రగల నా హేమ అతనిగుణం మంచిది కాకపొతే ఎలా స్నేహము చేయగలదనీ అనుకున్నాను. రహస్యంగా కంటినీరు కడవలు కార్చాను. హేమా! ఆ రోజులన్నీ నాకు యమయాతనే! అతడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను అతన్ని ప్రేమిస్తుంటిని. నా ప్రాణం పోయినా, వేయిమంది లోకేశ్వరులను బలియిచ్చినా, నా హేమకు సూదిమొనంత కష్టం రాకూడదు. ఇదీ నా ఆవేదన. ఇంతట్లో ఏమి వచ్చిందో నిశాపతి వెళ్ళిపోయాడు. సోఫీ అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పావు.దానితో నా గుండెల్లోంచి ఒక హిమాలయ పర్వతము తీసివేసినట్లయింది.
హేమ : ఓహో! ఒక కథలాగే ఉంది నీ చరిత్ర. నువ్వు నన్ను పొగడా అక్కర్లేదు. నీ ప్రేమ చరిత్ర నాకు చెప్పనూ అక్కర్లేదు. నా గుణం వాన బిందువూకాదు, మంచు బిందువూకాదు. మన రోడ్డుప్రక్క బురదగుంటలో నీటి బిందువు. నా గుణంతో సరిపోలిస్తే అది రెండుసార్లు బట్టీపట్టిన బిందువు లాంటిది. నిశాపతి పెళ్ళిచేసుకో మరి ఇంకొర్నిచేసుకో. నాకవసరంలేదు, అని అతి కోపంతో విస విస మేడమీదికి వెళ్ళిపోయింది.
ఏమిటీ విచిత్రమని లోకేశ్వరి అనుకుంది. ఎందుకు హేమకు కోపం? తానేమి చేసింది? హేమ తన హృదయాంతరాలో నిశాపతిని ఏమన్నా ప్రేమిస్తున్నదా? అయితే తాను వెంటనే హేమా నిశాపతుల జీవితంలోంచి మాయమైపోవలసినదే! ఈ తరుణంలో భగవంతుడే తనకు శక్తి ఇవ్వవలసి ఉంది. లోకేశ్వరి హేమ వెంట మేడమీదకు వెళ్ళాలా లేక వెళ్ళకుండా ఉండాలా? అని తటపటాయించింది.
లోకేశ్వరి చామనఛాయ కలది. అయినా ముఖం స్పష్టమైన రేఖలతో మనోహరంగా ఉంటుంది. దేహరేఖలూ స్పష్టమై పూర్ణత తాల్చి ఉంటాయి. లోకేశ్వరి స్త్రీలలో స్త్రీ. ఆమె వ్యక్తిత్వం దర్శించిన ఏ పురుషుడైనా, ఉత్తమ ప్రేమభావాలల్లావుంచి, ఆబాలిక దేహాన్ని వాంచిస్తాడు.
లోకేశ్వరి ఆలోచించుకొని, ఆలోచించుకొని, నెమ్మదిగా మేడమీదకు వెళ్ళింది. హేమ తనమంచంమీద బోర్లగిలా పడుకొనివుంది. లోకం వెళ్ళి, హేమా! నీ మనస్సులోనిదంతా నాతొ చెప్పు. ఇన్నినాళ్ళ స్నేహమూ వట్టిదేనా? ఆమెచుట్టూ చేతులువేసి ఆమెపై వాలి తన గుండెకు అదుముకొంది.
హేమ : ఏమో లోకం! నాకు స్నేహితులు లేరు, చుట్టాలు లేరు. మొండిలా నేనొక్కదాన్నే వున్నాను.
లోకం : అదేమిటి హేమా! నేను తీర్థమిత్రుని విషయం చెప్పలేను గాని, కల్పమూర్తీ, త్యాగతీ, సోఫీ, నేనూ నువ్వుంటే మా ప్రాణం అర్పించడానికి సిద్దంగా ఉన్నామే!
హేమ చటుక్కున లేచి కూర్చుంది. ఏమిటి తీర్థమిత్రునకు వచ్చినలోటు? అని తీవ్రంగా అడిగింది.
లోకేశ్వరి కస్టంతోచి కొంచం చురుకుగానే, అతడు ఇప్పటికి రెండేళ్ళ క్రితం ఒకసారి నన్ను గబుక్కున కౌగిలించుకొని, ప్రాణేశ్వరి, నువ్వు అపర రతీదేవివి; నీతోనే నా జీవితం అన్నాడు. అప్పుడు అతన్ని తీవ్రంగా అదలించి నా మొగం చూడకన్నాను. అవమానంచేత చచ్చిపోయాడు. ఈ మధ్య ఆరు నెలల క్రితం ఒకసారి లోకం! శృంగారాదిదేవీ! నా కోర్కె తీర్చకపోతే, నీ పాదలకడ నా ప్రాణం విడుస్తాను అన్నాడు. మోకరించాడు. నాకు పట్టరాని కోపం వచ్చి అతని మొగం మీద తన్నాను అని చెప్పింది.
మంచిపని చేశావు! నువ్వు అతనికి ఏదో ఆశకొలిపావు. అందుకని అలా అన్నాడు. ఇక్కడ నుంచి నా దగ్గర అతన్నేమీ అనడానికి వీలులేదు. నీకు ఇష్టం లేకపోతే నాతో మాట్లాడడం మానెయ్యి అని హేమ మళ్ళీ మంచం మీద వాలింది. 28
లోకేశ్వరి ఆశ్చర్యపడుతూ క్రిందికి దిగింది. హేమకు ఏమిటి ఈ విచిత్రస్థితి! తీర్థమిత్రుడంటే అంత ఇష్టమా? లేక ఇతరుల భావాలకు వ్యతిరేకాభిప్రాయ మివ్వడం అనే గయ్యాళి మనఃస్థితి ఉంది. ఆ మనస్థితిలో పడిందా హేమ! అనుకుంటూ లోకేశ్వరి కించపడిన హృదయంతో తన గదిలోనికిపోయింది.
తాను వినాయకరావు, వెంకట రాజ్యలక్ష్మమ్మగార్ల అనుమతితోనే నిశాపతికి ఉత్తరం రాసింది. అంతక ముందే నిశాపతి తన భావాన్ని వ్యంగ్యంగా తెలియజేస్తూ ఎంతో చక్కని ఉత్తరాలు వ్రాశాడు.
మొదటి ఉత్తరం
20 వీధి, లక్నో ప్రియమైన లోకేశ్వరీ! 4-10-1945
మిమ్ముల్నందరినీ వదలివచ్చి నాలుగునెలలు అయింది. నేను ఎందుకంత విచిత్రంగా పారిపోయానో ఈపాటికి మీకందరికీ అర్థమై ఉంటుంది. నాకు సంగీతంలో ఎంత శక్తి ఉందో స్త్రీ విషయ నీరస హృదయముంది. గొప్ప సంగీత పాఠకులకు అనేక జనానాల తలుపులకు గడియలుండవు. కాని, నేను ఏ కుటుంబంలో స్త్రీని నా నీచత్వంతో అధఃపతితురాలిని చేయలేదు అని సర్వవిశ్వం సాక్షిగా నీతో మనవిచేస్తున్నాను. ఎవరోకొందరు పెద్దరికం పుణ్యాంగనలు నాతో గాఢస్నేహంగా ఉండేవారు-అంతే!
అలాంటిది హేమకుసుమసుందరీదేవిగారిని చూడగానే నాకుయుగాలనాటి స్నేహితురాలనిపించింది. ఆమెతోటి స్నేహం, నన్ను పూర్తిగా మార్చింది ఆమెను ప్రేమించాను అనుకొన్నాను. సర్వలోకాలు నేను త్రివిక్రముడనై పొంగిపోయాను అనుకున్నాను. నా మనస్తత్వమే పూర్తిగా మారిపోయింది. ఆబాలిక ఎప్పుడు నన్ను కాదు అని అన్నదో నంది పర్వతాలకు పారి పోయాను. ఆ నందిపర్వతాలలో ఒక నెల జీవచ్ఛవంలాపడి వుంటిని. నా జీవితాన్ని ఏ కొండలమీదనుంచో క్రిందికి త్రోసుకొని సహస్రశకలాలు చేసుకుందామనీ, ఆ వార్తవిని హేమా, మీరూ బాధపడతారనీ ఊహించు కొన్నాను, కోపంతో మండిపోయాను, ఏడ్చాను. అప్పుడు నన్ను రక్షించింది నువ్వూ; త్యాగతీని. అంటే, నువ్వు ఓ రాత్రి నా సంగీత కచ్చేరి యైన తర్వాత మనం అందరమూ హేమగారి ఇంటికి వస్తూన్నప్పుడు నాతో, నిశాపతీ! నీ గొంతుక, నీ దివ్యసంగీతమూ భగవంతునికి ఒక మహానివేదన. జన్మలో ఈ రెండూ చాలు. ఇంక ఏవిలేకపోయినా జన్మ ఎత్తినందుకు సార్థకత దొరికినట్లే అన్నావు. ఆ ముక్కలు కోటి మెరుముల కాంతితో నా జన్మను వెలిగిస్తున్నాను.
నేను నందిపర్వతాలకు పారిపోయి వచ్చేటప్పుడు త్యాగతి నన్ను రైలు ఎక్కిస్తూ, నిశాపతీ! ప్రపంచంలో భౌతికవాంఛలు తీరినా ఒకటే, తీరకపోయినా ఒకటే. భౌతికవాంఛతో మనోవాంఛ కలిసిపోయినప్పుడు ఆ గాఢవాంఛ తీరలేదన్న బాధ ఎక్కువ అవుతుంది. అది తీరకపోయినంత మాత్రానమనం పశువులమై__ అంటే భౌతికవాంఛ కోరిన పశువు అది తీరలేదని బెంగపెట్టుకొని చచ్చిపోదు. చూడూ, ఆ వాంఛను మర్చిపోవాలి. మనం మరువలేనిది భౌతిక, మానసిక, ఆధ్యాత్మికములు సంగమించిన వాంఛనే అన్నాడు. ఆ మాటలు నాకు మొదట అర్థం అయ్యాయికావు. తర్వాత ఆ మాటలే నాకు పదేపదే జ్ఞాపకం వచ్చాయి. జ్ఞానవంతుణ్ణయి, దేశాలు తిరిగాను. అంతకన్న అంతకన్న హేమ నాకు సహోదరి అన్న భావం ఎక్కువైంది.
లోకేశ్వరిదేవి ! ఈ మూర్ఖుణ్ణి మరచిపోకు. నీకు నా సంగీతము ప్తె ఉన్న గాడాభిమానాన్ని ఈ దీనునిమీద కూడా కాస్త ప్రసరించు
త్యాగాతిని, కల్పమూర్తిని, హేమనూ, అత్తగారిని, మామగారిని అందరిని అడిగినాను.
ఇట్లు నీ ప్రియమిత్రుడు,
నిశాపతి
ఆ ఉత్తారాన్ని లోకేశ్వరి కళ్ళకద్దుకొని, ముద్దుపెట్టుకొని హృదయం కడ దాచుకోంది. ఈ ఉత్తరం వచ్చిన రెండు నెలలకు నిశాపతి కడ నుండి రెండో ఉత్తరం బొంబాయి నుండి వచ్చింది. ఆ ఉత్తరంలో "లోకేశ్వరిదేవి! నీతో ఎన్నో చెప్పాలి. ని జీవితం ఉత్తమం ____ అది ముందు ఎలా మారుతుందో? ఎలా మారినా నీవు మారవు. హేమకుసుమ దేవి చాలా గొప్ప వ్యక్తి అవుతుంది" అన్నమాటలు లోకేశ్వరి హృదయాన్ని గాలివాన నాటిసముద్ర కెరటాలలో ఎగిరించి పడవేశాయి. ఆమె కేదో సంతోషము, ఎదో భయమూ రెండూ కలిగాయి.
1941 మార్చినెలలో నిశాపతి డిల్లినుంచి మూడవ ఉత్తరము లోకేశ్వారికి వ్రాసినాడు. అందులో, "లోకేశ్వరి! నా కి నెలలన్నీ నీవే సర్వ కాలమూ జ్ఞాపకం వస్తున్నావు. నీ ఉత్తరాలు ఒక మ్తెసురు చండుగా పెట్టేలో పెట్టుకున్నా. మనం అందరమ కలసి హేమసుందరిగారి తోటలో తియించుకొన్న ఫోటోలోంచి నీబొమ్మను వేరేదియించి బంగారు ఫ్రేములో పెట్టుకున్నా, అందుకు నన్ను నువ్వు కోపపడకు" అన్న ముక్కలు లోకేశ్వరిని ఏలోకాలకో తేల్చుకొనిపోయాయి. ఆ ఉత్తరాలు మూడూ తీసుకుని లోకేశ్వరి త్యాగతికడకు పోయింది. అతనిలో తన హృదయం నిశాపతిపై లగ్నమ్తె ఉన్న విషయమూ, ఒకనాడు తనకేమి ఆశలేకపోవుటా, తనకాశ గలిగిన విషయమూ అతనితో చెప్పుకొన్నది.
త్యాగతి: లోకేశ్వరి! నువ్వు నిశాపతికి ఉత్తరం రాయి. ని హృదయము నీవు విప్పి రాయి, నేనూ రాస్తాను. అతను నువ్వంటే దేవతగా భావిస్తున్నాడు. కాని అతన్ని అర్ధంచేసుకోలేవెమోనని భయపడుతున్నాడు. మీ ఇరువురి దామ్పత్యమూ నాకు పరమ ఇష్టము.
ఈ చరిత్ర అంతా లోకేశ్వరి హృదయంలో సినిమా చిత్రంలా ప్రసరించిపోయినది. ఇంక హేమకు కోపమెందుకు కలగాలి. ఈ విషయము త్యాగాతితో చెప్పిన మరునాడే వినాయకరావుగారికి, వెంకట రామరాజ్య లక్ష్మమ్మగారికి తాను మనవిచేసింది. వా రేంతో సంతోషించి, లోకేశ్వరి వివాహము తమ ఇంటనే మహావ్తె భావంగా తాముజారిపించాలనుకుకొంటున్న కోర్కె, నేటికి ఈడేరె సమయం వచ్చినందుకు తమ ఆనందానికి మితిలేదన్నారు. ఆ విషయమూ లోకేశ్వరి నిశాపతికి రాసింది.
"మీరు రాసిన మూడుత్తరాలూ నాకు భగవద్గిత, రామాయణం, భారతం వంటివి! మీ ఉత్తరాలలో మీరు, నా జీవితంలోనూ నేను పెన్ని దానం అనుకునే మార్పు రాగలదనే సూచన చేసినారు. నా మనస్సు, ప్రాణం జీవితం మీకు ఇదివరకే లగ్నమ్తె ఉన్నవి. ఈ మాటలు త్యాగతి గారు నేను వ్రాయాలని చెప్పడంచేత సిగ్గువిడిచే రాస్తున్నా. మీరు నాకు దేవతలు. మీ బొమ్మను నేనూ విడిగా తీయించుకొని, పూజిస్తున్నా !....." అలా అలా ఏమేమిటో తాను రాసింది. ఆ ఉత్తరం రాస్తుంటే తనకు చెమటలు పోసినాయి.
పెట్టెలో దాచుకొన్న నిశాపతి బొమ్మను తిసి కళ్ళకద్దుకొని మళ్ళి పెట్టెలో పెట్టుకున్నది లోకేశ్వరి. కల్పమూర్తి ఇంటికి వెళ్ళిపోయినాడు, త్యాగతి మాటలు లోకేశ్వరికి కోటి శక్తులు ప్రసాదించినవి. ఎన్ని ఉత్తరాలో చింపి, చివరకు ఆ ఉత్తరం రాసింది. ఆదివరకే త్యాగతి ఉత్తరం నిశాపతికి అందింది. లోకేశ్వరి ఉత్తరం అందగానే తంతినిచ్చాడు.
29
మద్రాసు నుండి బొంబాయి మెయిలు అతివేగంతో వెళ్ళిపోతున్నది. ఆ వేసవికాలంలో నక్షత్రాలూ, ఇంజను పొగగొట్టం నుంచి వచ్సిన నిప్ప కణాలూ కలసిపోతున్నాయి! ఆ బందే నిప్పకణాలను ఆకాశంవరకూ ఎగజిమ్ముతోంది. ఆ కణాలు నక్షత్రాల్తే ఆకాశంలో నిలిచిపోతున్నాయి కాబోలు! పట్టాలప్తెన వెడుతున్నా బండి ఎల్లా వెళ్ళుతోందో, వెనక్కే వేడుతోందో, ముందుకో అనుకుంటారు యాత్రికులు. బండి నిండా అతి ఒత్తిడిగా జనం మనస్సంతా కుమ్ముకుంటున్న ఆలోచనలా ఉన్నారు. హృదయాలు మడుతున్నట్లు భరింపరాణి ఉక్క ! ప్రతిబండిలోనూ యుద్ద సబంధపువార్తేన స్తేనికులు,ఇంజనీర్లు కూలీలు, గుమాస్తాలు యూనిఫాం దుస్తులతో ఉన్నారు. వేల్తుతున్నదిచావుకో, విజయానికో; వాళ్ళఉత్సాహం వాళ్ళది. యుద్ధం అంతా ఒక విరనాట్యమే వారికి! వాళ్ళంతా పాటలు పాడుతున్నరు; అల్లరి చేస్తున్నారు. అక్కడక్కడ మూడవ తరగతి పెట్టెలలో మాత్రం సాధారణ యాత్రికులు స్ధలంకోసం దెబ్బలాడుకుంటున్నారు
ఇంజను దేశ నాయకుడిలా, కదానాయకుడిలామహావేగంతో వేడుతూంది. అది ఇనపజంతువు. దాని హృదయం అగ్ని; దానిశక్తి ఆవిరి. మ్తెళ్ళు మ్తెళ్ళు ముందుకు ర్తెలుపట్టా దారిమీద ప్రసరించే దాని చూపు అఖండ కాంతివంతమ్తెన ఒకటే కన్ను అదిఏకాక్షి. లోక సంహరిమాత్రం కాదు! మహావేగంతో వెళ్తున్న బండిలో మధ్యగా ఒక మొదటి తరగతి పెట్టె ఇద్దరు మాత్రమే కూర్చునే గది అది. అందులో ఈ పక్క నుంచి ఆ పక్కకు ఒకటే మెత్తటి పరుపున్న సిటు. ప్తెన ఒక సిటు ఉంది. అలాంటి పెట్టెలలో భార్యాభర్తలు ప్రయాణం చేస్తారు. ఆపెట్టేలో ఈ చివర కూర్చుని హేమ! ఆ చివర కూర్చుని తీర్ధమిత్రుడు!
హేమ ఆలోచనలు కళాతాత్రో, తుపానో, సుడిగుండాలో, గట్లు తెగిన వరదలతో నిండిపోయిన చెరువో! హేమ హృదయంలో పెద్ద వాడగాలో, వడగళ్ళ వానో, కన్ను కనబడని మంచో, గజగజలాడిస్తూ గడ్డ కట్టించే చలో!
ర్తెలు కదిలించి___మదరాసు స్టేషనులోంచి___ర్తెలు కదిలింది! అదివరదాకా ఉన్న హేమ స్ధితి___సంపూర్ణంగా మారిపోయింది. ఎదో ద్తేర్యంతో___నిశ్చయ___దృడనిశ్చయ హృదయంతో వచ్చి ర్తెలు ఎక్కింది, ర్తెలు ఎక్కటం టక టకమని ఎత్తుమడమల పాదరక్షలు చప్పుడు చేసుకుంటూ వచ్చి ___ఎక్కింది.....ఎవరో మహారాణిలా వచ్చి ఎక్కింది....ఎవరో పెద్ద ఉద్యోగాస్దురాలులా ఎక్కింది. తీర్ధమిత్రుడు....భార్య వెంటవచ్చే భార్తలా....ఉండాలని ....ప్రయత్నించాడు. స్త్రీ దళాల నాయకురాలివెంట ఆర్దర్లిలా__ అయిఊరుకున్నాడు.... పెద్దప్రభుత్వోద్యోగస్దురాలివెంట___గుమస్తాలా__అయి ఊరుకున్నాడు.
"తీర్ద్, అన్ని ఇంగ్లీషు .... తెలుగు పేపర్లు ....ఇన్ని వార....మాస ....పత్రికలు పట్టుకురా" అని హేమ పర్సులోంచి ఇన్ని పదిరూపాయల నోట్లు అతని చేతులలో పెట్టింది.
"ఇదిగో" అన్నాడు. హిగిన్ బాథమ్స్ దగ్గరకు పరుగెత్తాడు.
అందరూ ఆమెను చూచేవారే! ఒహొ ఎవరి మహారాణి అనుకున్నారు. వచ్చే స్తేనికుడు వెళ్ళే స్తేనికుడు ఆ పెట్టలోకి చూడడమే !
విధ్యుచ్చామరాలు ఎంతగాలి విసురుతున్నా ఆమెలో ఎదో వేడి మూలాన.... చెమటలు....చెమటలు! ఆమెచిన్న జేబురుమాళ్ళు .....ఎనిమిది తడిసిపో యాయి! ర్తెలు కదలదేమి? ఏడి .... ఈపుల్ .... ఏ పనికి వెళ్ళినా ....డాబుల ఆడపిల్ల ..... కులుకులు .... అతి తెలివి? ఏమిటి ఉక్క పోత? ఏప్రిల్ ఆఖరి వారంలోనే....త్యాగతి.....ఏం చేస్తూ ఉంటాడు..... ఎడిశాడు! ఏడుస్తూ ఉంటాడు అమ్మ !....అమ్మ ఎంత నీరసం? ఏమిటి? గడియారం గంటకో నిమిషం చొప్పన జరుగుతోందేమిటి? ఇక పది నిమిషాలుగా..... మారాయా? అమ్మయ్య ఈ లావెశాడు గార్డు గంట వచ్చాడయ్యా ఈ జిడ్డు ఓహొ తీర్ధమిత్రుడు అందంగానే ఉంటాడు! ర్తెలు కదిలింది. కదలడంతోటే ఆమె వతీ జావాకడిలా ఓ మూల కూలిపోయింది.
తీర్ధమిత్రుడు ఫిలిప్త్పేన్స్ పట్టించిన టోజోలా ఆనందంతో ఉప్పొంగి ఆ రైలు తన కేర్పరచిన స్పెషలుబండిలా భావించుకున్నాడు. ఒహొ ఇప్పటికి ఈ మూడు ఏళ్ళ మహొత్తమ కృషి ఈనాటికి ఫలించబోతోంది! ఈ ప్రపంచాద్బుత సమ్మోహనాంగి తన ప్రేయసి తానూ అయిదు వేలు పట్టుకువస్తోంది చక్కని హొటల్సు బొంబాయి తాజ్ మహల్ చాల అద్బుతంగా ఉంటుంది ఒకసారి తనలో ఈ బాలిక కరిగిపోతే ఇక ఎప్పడూ తనదే- తనదేనండయ్యా- ఈ కోటిపూవుల బాలిక కోటి సినిమా తారల నిధి కోటికోటిసువాసనలమూర్తి తనది ఈమె!తానే! ఒక పడకగదిలో ఇదివరదాకా ఊహించుకొన్న ఆమె సర్వాంగాలూ, ఆకులలోని గులాబిపూవు రేకలులా, ఆ పందిరిమంచంమీద నగ్నంగా ! ర్తెలు వేగంగా వెళ్ళి పోతోంది అతివేగంగా అతి మహావేగంగా వాయువేగ విద్యుత్ వేగ కాంతివేగ ఆకాశగోళ వేగంగా వెళుతోంది. తీర్ధమిత్రుని కాంక్షలు ఊహలు ఉప్పొంగు భావాలు వేగంగా, అతివేగంగా వెళ్ళుతున్నాయి.
ఇంత సేపూ కుంగిపోయి కిటికిలోంచి హేమ చూస్తోంది. తీర్ధమిత్రుడు ఆమెను కబళిస్తున్నాడు. చూపులతో కోర్కెలతో తమి మీరిన భావాలతో హేమకు దగ్గరగా చేరాడు! హేమ దగ్గరగా కూర్చున్నాడు. అతని కళ్ళు యేరు పెక్కాయి! అతని ఊర్పులు వేగవంతం అయ్యాయి.
హేమ తీర్ధమిత్రునివ్తెపు తిరగకుండానే, "తీర్థ్! నా ఆలోచనల కేమి భగ్నం కలిగించకు. బొంబాయి వెళ్ళినా అనుమతి అయినదాకా నన్ను ముత్తుకోవద్దు. మన ఒప్పందానికి భంగం కలిగించకు" అన్నాది.
30
హేమ కోపంతో వెళ్ళిపోయిన మరుసటిక్షణంలో త్యాగతి నిట్టూర్పు వదలినాడు. అతనికి మిన్నంటిన విచారము వచ్చింది. తాను చేసిన పనులన్నీ తేలివితక్కువవే. మదరాసులో మరదలిని తన భార్యగా చేసుకోనదానికి ఈ ఇల్లు కట్టించుకొడం, ఆ ఇల్లు కొనడం ఇక్కడే తాను శాశ్వతంగా ఉండమని ఎంచుకున్నాడు కాబోలు? మనుష్యులు మూర్ఖత్వ ప్రవాహం అర్ధంలేకుండా ప్రవహిస్తూ ఉంటుంది. తాను క్తెలాసానంద భారతి స్వామిజి గురు పాదులను ఆశ్రయించి ఈ బాధలన్నింటిని తప్పించుకోవలసినదే! ఎందుకు కి వ్యర్ధప్రయత్నం ? ఎందుకీ కతలు? ఎందుకు స్వామి ఈ ఆయంపటాటోపం?
నెమ్మదిగా లేచాడు. అతని కళ్ళల్లోనీరు తిరిగింది. తలుపు తీసుకొని బౌద్ద చ్తేత్యంలో ప్రవేశించాడు. బౌద్దమూర్తి ఎదుటసమాలింగిత భూతలు డయ్యాడు. లేచి కూర్చున్నాడు. పద్మాసనం వేసుకొని మనస్సు కుదుట పరచుకోడానికి ప్రయత్నం చేశాడు. అతని మనస్సు తన ఇష్టంవచ్చింట్లే పోయింది. తన్ను గోముఖవ్యాఘ్రాంగా పోల్చింది. అందులో అంతా సత్యం. తన ఈడుకు ఆ పసిబిడ్డను వివాహం చేసుకోటానికి ప్రయత్నం చేయడం ఏమిటి? పోరుషులంత హినజంతువులు ఈసృష్టిలో లేవు! హేమ చెప్పిన మాటలన్నీ నిజం. తన శకుంతల పోలికతో ఉన్న ఈ బాలిక దేహం వాంచించాడు. హేమ వ్యక్తిత్వాన్ని వాంచించాడు. ఎందుకు తనకి అర్జున విషాదయోగం? చాలు తన శృంగార నాయకత్వం. అంతా చాలు! చాలు భగవంతుడా చాలు !
అత డక్కడనుండి లేచి, తల్లిదగ్గరకువెళ్ళి, "అమ్మా, మనం వెంటనే హరిద్వారం పోవాలి! నా మనస్సులో నేను భరింపరాని బాధ తయారయింది. గురుదేవులను చూడకపోతే నాకు ప్రాణాలు నిలువవు. ఎల్లుండి ఉదయం ఇద్దరం కలసి స్వామిజి దగ్గరకు ప్రయాణం !" అన్నాడు.
రంగనాయకమ్మగారు తెల్లబోయి కొడుకుని చూచి, "నాన్నా స్వామిజి శిష్యరికం స్వామిజీవా రిచ్చిన ఆదేశాలను పరిపాలించటంలో లేదు కాబోలు. ఇంత మనస్సును లోబరచుకోలేనివాద వయ్యవేమిటిరా నాన్నా?" అన్నాది.
శ్రీ నాథమూర్తిసిగ్గుతో మోము వంచుకొన్నాడు. "ఎదో మనస్సులో ఆవేదనతో అన్నాను. నాకు అన్నం పెడ్తావా?"
రంగ:మడికట్టుకురారా! హేమ వచ్చినట్లుంది. నాతో చెప్పు కుండానే వెళ్ళిపోయిందేమిటిరా?
శ్రీనాథ: హేమ వచ్చింది. నాతో మాట్లాడుతూ కూర్చుంది. ఎదో కాస్త వాదనవచ్చి కోపంతో వెళ్ళిపోయింది.
రంగ: దానితో ని కాస్తమానం వాదనెందుకురా నాన్నా!
శ్రీనాధ:అమ్మా,హేమ ఈనాటిపిల్ల.ఎం.ఏ.కూడా!ప్రతి విషయమూ వాదించి ఒప్పించాలి.వాళ్ళ మనోగతులు వేరు.అందుకని ప్రతి విషయం ఆలోచించి హేమను నేను మంచి అనుకున్న దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను.ప్రయత్నం నెగ్గదేమో అన్న నిరాశ నాకు లేకపోలేదు.
రంగ:ఏమోరా నాన్నా,నాకు మీ పద్ధతులు ఏమీ నచ్చవు.ఏమిటో అంటారు.ఏమో చేస్తారు.ఏమి అనబోతారో,ఏమి చేయబోతారో,మాకు ఏమి ఆలోచించినా మనస్సుకు తట్టనే తట్టదు.
శ్రీనాధ:అమ్మా,నేను ఏమి చెప్పలేను కైలా సేశ్వరుణి ధ్యానించు కుంటూ కూర్చుంటాను.ఆ తరువాత ఆయన ఇచ్చ.
అని శ్రీనాధ మూర్తి భోజనము చేశాడు.మూడు రోజులు ఎడతెగని ప్రార్ధన చేసుకుంటూ ఉండేవారు.బుద్ధ మూర్తి వెనుకవున్న గదిలోనికి పోయి తలుపు వేసుకొని గంటలు ఉండేవాడు.
హేమ తనపై కోపగించి అతి వేగంతో వెళ్ళిణ రోజు ఆదివారం.ఆ ఆదివారం తర్వాత బుధవారం రోజున,చటుక్కున కల్పమూర్తి కారు వేసుకుని ఎనిమిది గంటలకు త్యాగతి ఇంటికి రహస్య విషయం మాట్లాడాలి"అన్నాడు.
త్యాగతి:"ఏమిటిది?"అని అడుగుతూ కల్పమూర్తితో వరండా లోనికి వచ్చాడు.
కల్ప హేమను తీర్ధమిత్రుడు ఎక్కడికో తీసుకుపోయాడు.
త్యాగతి గుండె ఆగిపోయింది."ఆఁ!"అన్నాడు అతని మెదడులో మహారౌద్రాగ్నిజ్వాల లోక్కసారి గుప్పుమన్నాయి.
ఆ అత్యంత విషాద సంఘటన సమయంలోనూ భయంకర యుద్ధం ముందు ఏమీ చలించని సేనానాయ కుడిలా అతడు ఒక్క సెకండులో గంభీరశాంతి వహించాడు."ఈ సంగతి ఎవరికి తెలియదు గదా?"
కల్ప:ఎవ్వరికి!
త్యాగ:మీకెవరు చెప్పారు?
కల్ప:తీర్ధమిత్రునీ హేమనూ తీసుకువెళ్ళిన టాక్సీమనిషి,వినాయక రావు గారి డైవరూ కలసి మా ఇంటికి వచ్చారు.
త్యాగతి:బొంబాయి మెయిలు వెళ్ళినట్లు?
కల్ప:బొంబాయి మెయిలు ఎక్కారట!
త్యాగతి:ఎలా తెలిసిందీ?
కల్ప:టాక్సీవాడికి ఏదో అనుమానం వేసి,సెంట్రల్ స్టేషనులో వాళ్లిద్దరూ సామాను పట్టించు కొని లోనికి వెడుతూంటే వాళ్లిద్దరూ చూడ కుండా లోపలివెళ్ళి బొంబాయి మెయిలులో ఎక్కుతుండగా చూశాడట.ఆ వెంటనే వాడు మన హేమగారి డైవరింటికి వెళ్ళి తన అనుమానం చెప్పాడట.వాళ్ళిద్దరూ హేమగారి ఇంటికి వెళ్ళి అక్కడ లోకాన్నికనుక్కుంటే,లోకం వెళ్ళి హేమ గదిలో చూస్తే,హేమ గదిలో బల్ల మిద లోకం పేరుతో ఓ కవరుందట.ఆ కవరులో తాను తీర్ధ మిత్రుని గాంధర్వం చేసుకో బోతున్నాననీ,ఆ విషయం జాగ్రత్తగా తన తల్లిదండ్రులతో చెప్పా వలసిందనీ లోకాన్ని హేమ కోరిందట!లోకం వెంటనే ఆ టాక్సీమిద మా ఇంటికి వచ్చింది.నేనూ,లోకం,నీ కోసం పరుగెత్తుకొని వచ్చాం.
త్యాగతి:లోకం ఏదీ?
కల్ప:నా కారులో ఉంది.
శ్రీనాధ మూర్తి ఒకసారి కళ్ళు మూసుకొని కైలా సేశ్వరుని ధ్యానించాడు.ఒకసారి శకుంతలను ధ్యానించాడు."కల్ప మూర్తీ!నీ కారులో గుంత కల్లు వరకూ వెళ్ళి వచ్చేందుకు పెట్రోలు సిద్ధంచేయి.లోకేశ్వరీ!ఇంటి దగ్గరకు పోయి మా అత్తగారితో మామగారితో మనం అంతా తిరుపతి కారు మీద వెళ్ళివద్దామని బయలుదేరామని చెప్పు.పోదాం పద.నేనూ వస్తున్నాను.నీ దగ్గర డబ్బు ఉంటే అంతా వేసుకురా.నా దగ్గర రెండు వందలు న్నాయి.అవి పట్టుకువస్తున్నాను"అని చెప్పుతూ లోపలకు పరుగెత్తాడు.
31
ఆ రాత్రి బొంబాయి మెయిలు బయలు దేరడం 6-45గంటలకు,అందుకై హేమ పగలు పదిగంటల నుండి చల్లగా సర్దుకుంటూ ఉంది.తన పేరునబ్యాంక్ ఉన్న పన్నెండు వేలలో డిపాజిట్లు రెండూ నాలుగు వేలకూ మూడు వేలకూ ఉన్నాయి.తక్కిన అయిదువేలూ తాను తీసివేసుకుంది.ఇంటి దగ్గిర తన స్వంత ఇనుప పెట్టెలో పదమూడు వందల రూపాయలున్నాయి.ఆ పదమూడు వందలలో,నాల్గువందల రూపాయలు తీర్ధ మిత్రుని కిచ్చి బొంబాయికి రెండు మొదటి తరగతి టికెట్లుకొని రిజర్వు చేయించ మంది తీర్ధ మిత్రునికి ఇచ్చిన నాలుగువందలు పోను తక్కిన తొమ్మిది వందలూ,ఇంకా అయిదు వందలతో తోలు పెట్టెలు, పరుపుచుట్ట, హోల్డ్ఆల్, దిండ్లు, దుప్పట్లు, తువాళ్ళు ,చీరలు, జంపర్లు, లోని లాగులు, బాడీలు, జేబు రుమాళ్ళు వగైరా సామానెంతో కొంది.అవన్నీ తీర్ధమిత్రునే జాగ్రత్త చేయమంది.జంపరు వగైరాలు మంగళవారమే అర్జెంటుగా కుట్టేటు ఏర్పాటుచేసింది. ఇంటి దగ్గిర నుంచి ఒక వస్తువు తీసుకొని రాదలచుకోలేదు.అనుమానాస్పదమౌతుందణి ఆమె భయం. అప్పటికి కొన్న చీరలు,జంపర్లు,అలంకారపు పెట్టెలు,చిన్నవి అన్నీ నెమ్మదిగా తీర్ధమిత్రుడికి చేరవేసింది.
* * *
ఆదివారం సాయంకాలం తాను తీర్ధ మిత్రునితో చెప్పినట్లు గా,హేమ బయలు దేరి అతణి సైదా పేట రైలుగేటుదగ్గర కలుసుకొని,చెంగల్పట్టు దారి పట్టించింది తన కారును.
తీర్ధమిత్రుడు హేమ తనకా కబురు చెప్పినప్పటినుంచీ ఈ లోకంలో లేడు.ఏవో మహామన్మద లోకంలో ఉన్నాడు.అతడు ఎగర వేసిన చక్రవాత్స్యాయన పతాక ఆకాశంలో కామదేవ లోకానికి సమీపం వరకూ విజృంభించి పోయింది.అతని పై మన్మధుడు మామూలు పూలబాణాలు వేయ లేదు.ఇప్ప పువ్వులు,గసగసాల పువ్వులు,నాభి పువ్వులు,కాసింత పువ్వులు,పుఖాంను పుంఖాలుగా డబ్బాతు వర్షంగా కురిపించాడు.అతనికి మదన జ్వరం 112డిగ్రీల వరకు వెళ్ళింది.
ఇదివరకు తాను మన్మధ మహాసామ్రాజ్య నిర్మాణము చేయడంలో పొందిన విజయాలు,ఏ గ్రీసు,టర్కీ యుద్ధమో వంటిది.ఈ రోజు పొందబోయే విజయం 1914యుద్ధం వంటిది.ఈ హేమకుసుమసుందరీ దేహమే తాను నిర్వహింపబోయే కామరాజ సుయయాగానికి యజ్ఞ వేదిక.తనలోని కందర్ప రసజ్ఞత ఇంధనాలు.అందుకు మంత్రాలు తానూ హేమా మాట్లాడ బోయే ప్రణయకావ్యాకు.తనకు వచ్చే పురోడాశము హేమ మెత్తటిగులాబీ మొగ్గల పెదవుల్లోని సుధారసము.ఈ రాజసూయానికి బలి త్యాగతి శిశు పాలుడు.ఉడికిపోయే దుర్యోధనుడు కల్పమూర్తి. సాయంకాలం కలియుగ మన్మదునిలా వేషం కై సేసుకొని,ఒళ్ళు చెక్కు చేదరకుండా ఉండాలి ట్రిప్లికాసు నుండి టాక్సీ వేసుకొని తిర్ద్ సైదా పేట చేరాడు.సాయంకాలం ఆరు గంటలకు హేమ తన కారుతో చక్కావచ్చి,తలుపు తెరచి తీర్ధమిత్రుని ఎక్కమని,మళ్ళికారు నడుపు కొని చెంగల్పట్టు దారిపట్టింది.అతి వేగంగా నడుపుకుంటూ పదిహేనుమైళ్ళు వెళ్ళి కారు ఆపు చేసి దిగించి తిర్ధమిత్రుడూ దిగాడు."తిర్ద్!నువ్వూ,నేనూ కలసి బొంబాయి ప్రయాణం.నేను నీతో రావడం నా ఆవేదన చల్లార్చి కొనడానికే.అయినా నాకు ఇష్టంవస్తే,నేను నీకు పెళ్లితంతులేని భార్యను అవుతాను.అదీ బొంబాయిలో,అక్కడయినా నా ఇష్టం వస్తేనే,ఆ విషయంలో నేనేమీ నిశ్చయానికి రాలేదు నేను నన్ను నువ్వు ముట్టుకోవచ్చు నన్నదాకా ముట్టటనికి వల్లకాదు.ఇవి నా షరతులు.ఇష్టం అయితే సరేఅను,లేకపోతే,తిరిగి వెళ్ళిపోదాం"అన్నది.
తీర్ధ:నాకు పరమయిష్టం.ఓహో!నా తపస్సు ఎన్నాళ్ళకు ఫలించింది!ఈలోగా ఒక్కసారి...
హేమ:ఛట్!వెదవ మొగతనం,నువ్వునూ!నే నన్నమాటలు అతి నిశ్చయంతో అన్నవి.
తీర్ధ:సరే,సరే!కాని ఓ స్వప్నరాణి!ఓ మహొజ్వల...
హేమ:పుల్,నోరుముయ్యి.నాకు ఈ ఉప్పచప్పని,దొంగ మాటలు అక్కర లేదు.వెనక్కుపోదాం.
అంటూ హేమ కారు ఎక్కింది.తీర్ధమిత్రునికి వేయి మదుర కలశాలు ఆతని తలపై దేవతలు గుమ్మరించినట్లయింది.ఏలా కారుమీద కూర్చున్నాడో ఆమెకు దగ్గరగా జరిగి అంటుతూ కూర్చున్నాడు."తిర్ద్,దూరంగా జరుగు.నా మాటలు వేళాకోళాలు కాదు"అని పళ్ళు బిగించి హేమ అన్నది.కధ అడ్డంగా తిరుగుతుందే మోనని తీర్ధమిత్రుడు దూరంగా జరిగి కూర్చున్నాడు. హేమ సైదా పేట దగ్గర అడయారు నది వంతెన మిద కారు ఆపు చేసి తీర్ధ మిత్రుని దిగమని,"తిర్ద్!నేను నీ చేతికి టిక్కెట్టు వగై రాలకు డబ్బు ఇస్తాను.మనం బుధవారం ప్రయాణం.ఈలోగా సోమ మంగళ వారాలు బీచి దగ్గర కలుసుకోవడం.అక్కడ నా సామాను నీకు అందిస్తాను"అని చెప్పింది.
ఆమె ఏర్పాట్లు ప్రకారం అన్నీ జరిగాయి.కాని రైలు కదలటం తోటే ఆమె చుట్టూవున్న సర్వ ప్రపంచం ఒక్కసారి కుంగినట్టయింది.రైలు చక్రాలు తిరిగికొలదీ,వానితో పాటు ఆమె ఆలోచన భ్రమణమూ ఎక్కువైంది.రైలు చక్రాలు పట్టాలమిద నడుస్తున్నాయి.ఆమె ఆలోచన్ చక్రాలు శూన్యంలో నడుస్తున్నాయి.రైలు క్రింద చెప్పుడుకూ,ఆమె హృదయం చప్పుడుకూ ఎక్కడా శ్రుతి అందడం లేదు.తీర్ధమిత్రుని మొగం వైపు చూడలేకపోయింది.రైలు ఎక్కడకు పోతోంది?ఈ రైలు ఇంకో రైలును డీకొని ముక్కలైపోతుందా?అందులో తానూ ఖండ ఖండాలుగా పడి వుంటుందా?
32
రైలు అతివేగంగా పరుగు పెడ్తున్నది.చిన్న పేటలు వెనక్కి మెరుములా మాయమవుతున్నాయి.చిన్న స్టేషన్లు కనబటం,అంతట్లో మాయమవడం!కొత్త కాలం అవడం వల్ల ఇంకా చీకట్లు రానే లేదు.
స్రీలకు భయంలేదా?దైర్యం లేదా?ఇలా పురుషునితో పారి పోవడమా!చెన్న పట్నంలోనే వుండి,తాను తనకు యిష్టము వచ్చిన పురుషునితో నిర్భాయముగా జీవించలేక,ఎందుకు ఇలా రహస్యంగా దొంగలా ఈ తీర్ధమిత్రునితో పారిపోవడం?అని హేమకు తిరిగితిరిగిఆఆలోచనేవచ్చింది.తానుతల్లిదండ్రులకుభయపడింది.త్యాగతికిభయపడింది.స్నేహితులకు భయపడింది.త్యాగతా?తనతల్లినికూడాతీసుకుదుఃఖాన్నుండిపారిపోయాడు.ఒక్కడూ తిరిగాడు.నీరసించిన మనస్సుతో సుశీల అనే ఆ అమ్మాయితోఒకసారి...అన్నీపురుషునిలా చేశాడు.అదీ పురుషత్వం!ఏదో ఆశయం పెట్టుకున్నాడు.దానికై ఆస్తులమ్మాడు.దేశాలు తిరిగాడు.మనస్సులో వచ్చిన భావాలన్నీ తనకు వ్రాసి చూపించాడు.
తానో!పిరికిపందలా ఈలా పారిపోయి వస్తోంది!తల్లిదండ్రుల సంగతి ఆలోచించిందా?వాళ్ళు తనమీద సర్వభారమూ ఉంచి,తనకు సర్వ స్వాతంత్రాలూ ఇచ్చి తనకై బ్రతుకుతూ వుంటే,వాళ్ళ విషయం ఆలోచించకుండా...ఎందుకు ఇల్లా తాను తీర్ధమిత్రునితో పారిపోయివస్తూన్నట్లు?తన సర్వస్వం వదలి,అతన్ని అనుసరించేటంత ప్రణయం తీర్ధమిత్రు డంటే వున్నదా?
"ఓ హేమా!నువ్వు వెఱ్ఱదానవు,నువ్వు చచ్చుదానవు.నువ్వు జజ్జమ్మవు.మగవాళ్ళ కోసం ప్రాకులాడే జావకడి ఆడదానవు.మగవాడి చూపులు నిన్ను ఆనందంతో చూస్తే నువ్వు ఉప్పొంగిపోతావు.మగవాడి కోటుచివర నీ చీరను స్పృశిస్తే నువ్వు స్వర్గలోకం అందుకున్నా నను కుంటావు.హేమకు తల తిరిగింది తాను చదివిన చదువు దద్దమ్మ చదువు.ఎవరైనా చదవ గలరు.ఎవరైనా పరీక్షలలో నెగ్గగలరు.ఒక్క గొప్ప చిత్రమైనా వేయలేక పోయింది.ఒక సంగిత సభ పండితుల ఎదుట చేయ లేక పోయింది.తన కంటె లోకేశ్వరి నయం.పరిక్షలో జయంమంది.పాఠశాలో పాద్యాయినిఅయి,ఒంగోలులో ఉన్న తన బీద కుటుంబానికి డబ్బుపంపి,పోషింస్తోంది.రేపు నిసాపతిని__జగత్ ప్రఖ్యాతికన్న జగపతిరావును__పెళ్లి చేసుకో గలుగు తోంది!ఇంక భాగ్య వంతుల బాలిక అయిన తాను త్రండ్రి తనకై పెంచిన డబ్బు చచ్చు పుచ్చు ఖర్చులు చేస్తూ,రక్తం పిల్చే దోమ జీవితం జీవిస్తోంది.
ఓహో!ఏమి గొప్పఆడది!స్రీజీవితంతానటఉత్తమంయడానికి...సంకల్పించుకొన్నదట!తన కోసం చెన్న పట్నం మకాం పెట్టుకొని ఒక్క మాట వల్లనైనా,ఒక్క చూపు వల్లనైనా,ఒక్క చేత వల్లనైనా మనస్సుకు ఈ షణ్మాత్రం నొప్పి కలిగించకుండా,తన్ను దివ్య ప్రేమ కాంతితో నింపిన తన బావ అంటే వెర్రికోపం పడి చెవుల మిద కోపంతో ముక్కు కోసుకున్నట్లు,తానీ తీర్ధ మిత్రునితో,ఒక అతి బలహినురాలిన ఒక స్రీ లేచి పారిపోయినట్లే లేచి వెడుతోంది.తన తల్లిదండ్రులు ఈ సంగతి గ్రహించగానే చచ్చిపోయే మాట నిశ్చయం.అనుమానం లేదు. ఎంత చక్కని కూతురు తాను! ఎంత గొప్పకూతురు! తాను తీర్ధమిత్రుని నిజంగా ప్రేమిస్తోందా?తీర్ధ మిత్రుని ఏమి అనకూడదని తన బావతో దెబ్బలాడి వచ్చి, ఇతనితో తాను లేచిపోతోంది.
మహాప్రళయం లోకాన్ని ఆవరిస్తుంటే, తాను చేయ వలసిన కర్తవ్యం ఆలోచించు కోలేదు. పైగా ఒక నీరసపు ఏకాంకిక రాసి పురుషులను తిట్టించింది.ఛీ! హేమ!నువ్వు పరువు లేని దానవు. ప్రతిష్ట లేని దానవు. నీవన్ని వట్టి డాంబికాలు. ఏ ఆవేశాలు,నీ కోపాలు,నీ గడబిడలు,నీ సంవత్సరాది ఉత్సవాలు ఒక పిచ్చిదాని చేష్టలు. పెద్దకూతురు పోతే,నిన్ను దేవకన్యలా పెంచిన తల్లిదండ్రుల విషయం ఇంతైనా ఆలోచించని అతి అమానూష స్వలాభపూరిత హృదయం కల రెండవ కూతురవు.నీ అందం నువ్వు చూసుకున్నావు. నీ డాబులు నువ్వు కులుకుకున్నావు. నువ్వు నిన్ను చాటుకున్నావు. నువ్వు రాక్షసివి. పిశాచివి. తన తండ్రి పువ్వులా పెంచాడు. లోభి తన ధనాన్ని కాపాడుకోనేటట్లు తల్లి తన్ను కాపాడింది.వారికి తనేమి ప్రతి ఇచ్చింది?
కల్పమూర్తి కుక్కకన్న,గుఱ్ఱంకన్న ఎక్కువగా తన్ను అనుసరించాడు. తన కనుసన్నల ఆజ్ఞను, ఒక పూర్వకాలపు సుల్తాను ఆజ్ఞలను బానిసలు నిర్వర్తించినట్లు నిర్వర్తించాడు. వెలిగించాడు. త్యాగతి మహోన్నత పురుషుడు తన అక్క పేర లలిత కళాశాల నిర్మిస్తాడట! అతడు పర్వతము, మహానది, సముద్రము, నిర్మలాకాశం!
ఇంతమంది ఉత్తములను ఏడిపించి తాను సఱున ఈ తీర్ధమిత్రునితో పారిపోయి వస్తోంది! తీర్ధమిత్రుడంటే తనకేమి ప్రేమలేదు. లేదని నిశ్చయం.ఎందుకు ఇతనితో...ఈలా. లేచిపోవడం?
కల్పమూర్తీ!నీతో లేచిపోతానంటే. అతడు ప్రాణం వదిలేస్తాడు. త్యాగతితో అంటే ఒక చిరునవ్వు నవ్వి చంటి బిడ్డను మారాము తీర్చినట్లు తీరుస్తాడు.ఈతడు పండ్లలాంటి బిడ్డల సంగతి ఆలోచింపక, బంగారు బొమ్మలాంటి భార్య విషయం తల పెట్టడం తనతో కామవాంఛ తీర్చుకోడానికి "రా"అంటే సిద్ధమై వచ్చాడు. తన్నో!తాను దేశసేవ చేస్తుందట! మానవ సేవ శిష్యురాలట! పరిశుద్ధమైన అగ్ని లాంటి బోల్షవిజానికి ఈ కళంకం ఎందుకు ఆపాదించడం?తన త్యాగతి...తన త్యాగతా? ఛీ! అలా అనుకోడానికి తన బోటి దద్దమ్మ తగునా?
ఛీ!ఛీ!తన ఈ చచ్చు ఆలోచలేమిటి? ఏం తప్పు చేశానని? తన ఇష్టం తన రాజ్యం.. ఎవరయ్యా ఈ విశాల ప్రపంచంలో తానుచేసిన పనిని తప్పు అని అనగల వారు?ఈ సంఘ మట!పాడుసంఘం!ప్రతివ్యక్తిస్వాతంత్ర్యానికిఅడ్డం.తానొక పెద్దడిక్టేటరా?మనుష్యుల జీవితాలు,కుటుంబాల జీవితాలు తన రక్షాసి చేతుల్లో నలిపి వేసి భయంకర ఢాకిని ఈ సంఘం ఎన్ని విధాల ఈ సంఘాన్ని నాశనం చేయాలో అన్నీ విధాలా చేయాలనే కాదా తా నీ రకంగా చేస్తునది.అందులో ఈ సంఘం స్రీ పురుష సంబంధం విషయాల్లో మరీ మహా మారణపిశాచి!ఆ విషయంలో ధైర్యమున్న వీరనారులు ఏది సంఘంలో అరాజకత్వం తీసుకురావాలి!ఆ సంఘ రాక్షసత్వానికి ఎవరు తోడుపడతారో వారు ఎవరైనా సరే నాశనం కావాలి.తన తండ్రి నాశనం కావాలి.తన తల్లి నాశనం కావాలి. ఆమె బిడ్డలు నాశనం కావాలి. కల్పముర్తీ, లోకేశ్వరీ, సోఫీ అంతా నాశనం కావాలి. తీర్ధ మిత్రుడు నాశనం కావాలి తానోక్కటే ఈ అఖండ నాశనం ఈ మండే కాష్టాలు,ఈ కుళ్ళే శవాల మధ్య నుంచొని,కొత్త సంఘం సృష్టిస్తుందీ! ఆహా అందుకు పురుషుడేడీ?ఎవరు?తామాలోకంతోపాటు.. చావనీ...చావనీ...కొత్త సంఘం....
రైలు వేగంగా వెడుతూ చెవులు గింగురంటూ కూత కూసింది. హేమకు మెలకువ వచ్చింది.ఒక్కసారిగా లేచింది.నూట ఇరవై రూపాయలు విలువ గల తన చేతిసంతి తీసింది,_ ఏదో వెడనవ్వు,వికారపు మెరుగులు ఆమె మొగమున ప్రసరించి, ఆమె మోమును భయంకర రేఖ లతో నింపాయి.ఆ సంచిలోంచి వందరూపాయలవి నాలుగునోట్లు తీసింది.అవి చేతితో పట్టుకుంది.రైలు పెట్టె తలుపుతీసి గుమ్మం దగ్గర నిలుచుంది.రైలు తిరువాళ్ళూరు స్టేషనులోకి వచ్చి నిలిచింది. హేమ తలుపు తీసినప్పుడు తీర్ధమిత్రుడు హేమవైపు చూచి,"జాగ్రత్త హేమా!"అన్నాడు. హేమ అలా నుంచోడం చూశాడు. నోట్లు చూడలేదు.
ఇంతలో గార్డు అలా ఈలలు,స్టేషను గంటలు మ్రోగాయి. రైలు కదలడం ప్రారంభించబోయే ముందు హేమ గుమ్మంలో నుంచే తీర్ధమిత్రుని వైపు తిరిగి,"క్షమించవోయ్ నన్ను.నేను పిరికిదాన్ని. ఇవిగో ఈ నాలుగు వందలూ" అంటూ ఆ నోట్లు సీటుమీదకి విసిరి వేసి,క్రిందికి దిగి తలుపు వేసి,తన సంచి చేతిలో విడిగా పట్టుకొని ఉన్న రైలు పెట్టె తాళం చెవితో రైలు కదిలి వెడుతుం డగా తాళం వేస్తూ,"నువ్వి దిగకు,నేను వెడుతున్నా.నాకు ధైర్యం చాలదు, పైగా నీమీద నాకేమి ప్రేమలేదు"అంటూ రైలు వేగం కాగా ప్లాటుఫారం మీద నిలుచుండిపోయింది.
౩౩
రైలువేగం ఎక్కువైంది.తీర్ధమిత్రుడు తెల్లబోయాడు.వెంటనే హేమ దిగిన గుణ్ణందగ్గిరకు వచ్చి తలుపు లాగితే రాలేదు.కిటికిలో నుంచి తొంగిచూశాడు.హేమ ప్లాటుఫారం మీద నుంచి స్టేషనులోనికి వెడుతూంది.రాక్షసి!పిశాచి!అల్లా తన్ను అవమానపరచి పారిపొయింది ఈ మూడు రోజులు పని ముక్కలే!ఈ లాంటి దొంగ స్త్రీను,పాడు స్త్రీలను బలవంతంగా పాడుచేసి నాశనం చేస్తేగాని లోకం బాగుపడదు.తన మగతనానికి తీరని అవమానం చేసింది.పోతేపోనీ,ఏదో నాలుగు వందల సంపాదన అయింది. ఈ పెట్టెలూ మొదలయిన హేమ సామానూ తనదే!రాక్షసి!
హేమ రైలు కదలగానే వెనక్కు పోయింది.తిరువళ్ళూరు నుంచి ఎనిమిదింటి కొక బండి,ఎనిమిదిన్నరకు ఒక బండి చెన్నపట్నం పోతాయి.అప్పుడైంది గం "7-40లు.ఆమె గడియారం చూచి వెంటనే టిక్కెట్లు అమ్మే స్థలానికి పోయి,మదరాసుకు సెకండు క్లాసు యిమ్మని,కొనుక్కొని,తిన్నగా అవతలి ప్లాటుఫారము మీదకు వంతెన మిద నుంచి దాటి అక్కడ సిద్ధంగా ఉన్న బండిలో,స్రీల రెండవ తరగతి పెట్టె ఎక్కి కూర్చుంది.
ఆ పెట్టెలో ఇద్దరు యూరోపియను బాలిక లెవరో ఉన్నారు.వారిద్దరూ హేమ వైపు తేరిపార చూచారు.ఒకామో హేమనుచూచి,"మీరేనా,స్రీల టెన్నిస్ పందెంలో సోఫీ గారితో కలిసి మొదటగా వచ్చింది"అని అడిగింది."అవును"అని హేమ నెమ్మదిగా అన్నది.ఆ ముక్కలు మందిపోయే హేమ హృదయాన్ని చల్లార్చినాయి.ఆమెకు కంటనీరు తిరుగబోయింది కాని అతి కష్టంలో ఆ అశ్రువులు కళ్ళవెనకే ఆపుచేసికొని,ఒక చిరునవ్వు నవ్వింది.
బొంబాయి మెయిలులోంచి దిగటంతోటే,హేమకు కోటి బరువులు తలపై నుండి బొర్లి పాతాళంలో పడినట్లయింది.ఆమెకు కలిగిన స్వేచ్చా భావం స్వచ్చమైంది.ఆమె ఎన్ని యుగాలనుంచో తన్ను కట్టిన గొలుసును తానే నిశిత మహాపరశువుతో ఖండించినట్లయింది.ఏ బాని సత్వాన్నుండి తన్ను తాను విముక్తి చేసుకుంది?తననుండి తన్నే విముక్తి చేసుకున్నానని ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది.తానే స్పష్టంతాల్చని,అర్ధంకాని,కుడురుకనని,భావశృంఖలాలను వేసుకొనితనచేతులకు,కాళ్ళకు,హృదయానికి,మనస్సుకు,జ్ఞానానికిలంకెలపోగుచేసుకొంది.తన చుట్టూ తానే గోడలు కట్టుకుంది.
తన బావ త్యాగతి ప్రోత్సాహంవాళ్ళ,ఎన్నో వేదాంత గ్రంధాలు చదివింది.అవి తన మెదడులో ఆరగ లేదు.బౌతికంగా స్వేచ్చ ఎవరికీ లేదు.తాను తండ్రికి కుమారైకాకుండా ఎలా ఉండ గలదు?ఆయన వెనక భట్టిప్రోలువారి తరాలెన్నో ఉన్నాయి.తనకూ తన తల్లికి ఉన్న సంబంధమూ అంతే.తాను భారతీయ నారి కాక నేట్లు?తన బంగారం దేహం పాశ్చాత్యచ్చారుణ శరీరం ఎల్లా అవుతుంది? ఈలా ఎవరికైనా కుటుంబ, సంఘ, జాతి, దేశాల లంకె లుండనే ఉంటాయి. గాలి, నీరు భోజనము లంకెలు! దేశకాల పాత్రలు లంకెలు! "ఇంక భౌతికమైన స్వేఛ్చ అంటే ఈ లంకెలతో శ్రుతిసామ్యస్థితి కలిగి ఉండడమే" అన్న త్యాగతి మాటలు అఖండ సత్యవాక్కులు.
ఎవరైతే ఆ సామరస్యం కావాలని పాడుచేసుకుంటారో, వారు తమకు తమి నిజమైన శృంఖలాలు తగిలించుకొంటారు. మనం చైతన్య రహితంగా పడిఉండడం అర్ధంలేని స్వేఛ్చ. చైతన్యంరాగానే ఆ స్వేఛ్చకు మనమే భంగం కలిగించుకొని శ్రుతిని సమకూర్చుకుంటే మాట్లాడుతాము, నడుస్తాము. ఆ శ్రుతిపోతే తల్లక్రిందుగా పడతాము. అడవి పెరగడం అయిదు నిమిషాలు. అడవి భూమిని వ్యవసాయ భూమిగా చేయడం, ఆ భూమిని వ్యవసాయ భూమిగానే ఉంచడం ప్రకృతికి అసత్య స్వేఛ్చ తీసి వేసి, నిజమైన స్వేఛ్చ ఇవ్వడం. స్వేఛ్చ అంటే మెదదును ఇష్టంవచ్చినట్లు పోనివ్వడం కాదుగదా! అయితే అది పిచ్చి అవుతుంది. కట్టుబాటులు, నియమాలు నిజమైన స్వేఛ్చ!
స్త్రీ కూడా దేశానికి ప్రపంచానికి అభ్యుదయ కృషి అర్పించాలి. అది నియమాలలో జరగాలి. రైలు పట్టా తప్పితే రైలుకు స్వేఛ్చలేదు. ఆవిరి ఇంజనులో లేక ప్రపంచం అంతా ప్రవర్తిస్తే దానికి స్వేచ్చా? మనుష్యునికీ అంతే! తన నిరర్ధక జీవితానికి ఈ శుభముహూర్తాన్నుంచీ స్వస్తి! తన శ్రీనాథమూర్తి బావతో కలసి.....తన శ్రీనాథమూర్తి బావా! ఉత్తమ పురుషుడు. తన బావ ఉత్తమ పురుషుడు అంటేనే ఇన్నాళ్ళ నుంచీ తాను పూజించింది. అతన్నే తాను ప్రేమించింది. అతడే తన కుడి చేయి. అతడే తన జీవితానికి తరణి. అలాంటి బావను తను ఎన్ని రకాలుగా బాధించింది. అతనితో చేయించరాని పనులు చేయించింది. అతని మనస్సు నొప్పించింది. తనవంటి తుచ్చరాలిని అతడు స్వీకరిస్తాడా! అతని ప్రతి అణువూ తాను ప్రేమించింది. ఆ ప్రేమకాంతితో తాను నిల్చోలేక పోయింది.
"ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారా? ఈ ఏడు టెన్నిస్ పందేలలో ఆడ్తారా? నిరుడు మీరూ ఒక పొడుగు పెద్దమనిషీ, స్త్రీ పురుష జట్టు పోటీ పందేలలో మొదటి బహుమానం పొందారుకాదూ!" అని ఆ యూరోపియను బాలికలలో ఒకామె అడిగింది.
రైలు విల్లివాకం వచ్చింది. "అవునండీ. ఈ సంవత్సరం పందేల లోనూ పాల్గొనాలానే ఉంది" అని హేమ అన్నది. ఏమిటీ మధ్య మధ్య స్వప్న భంగం అని హేమ అనుకొంది. కానీ వారూ తన బావను గూర్చిన స్వప్నంలో భాగమే అయ్యారు.
శ్రీనాథమూర్తి బావ ఎంత చక్కని టెన్నిస్ ఆడ్తాడు! అతన్ని ఈ ఏడు ప్రోత్సాహంచేసి టెన్నిస్ తాను ఆడించగలుగునా? ఛీ! ఛీ! ఎలాంటి పిచ్చి ఆలోచనలు? అతన్ని నానా దుర్భాషలాది అతని ప్రేమను కాలితో తనని, ఒక హీనపశువులా, స్త్రీ ప్రేమను ఏ మాత్రమూ గౌరవంతో చూడని ఒక నరనామక పశువుతో లేచిపోయి, అతనికి తన దేహం యావత్తూ అర్పించడానికి సిద్దమైన తనను తన బావ దగ్గరకు రానిస్తాడా? రానివ్వకేం! ఒకనాడు సుశీల నాతడు చేరదీయలేదా? ఆ చేరనియ్యడం, ప్రభుత్వంవారి రక్షవంటిది. ఆ బాధనుంచేగా అతడు దేశాలనీ తిరిగి కైలాసం పారిపోయాడు! ఇప్పుడాతడు సంపూర్ణ పురుషుడు. అతనికి కావలసింది సంపూర్ణ స్త్రీ. తాను పదోవంతు స్త్రీయైనా కాదు.
ఇంతట్లో రైలు పెరంబూరు వచ్చింది. రైలు చెన్నపట్నం చేరుతోంది. తాను పారిపోయిన సంగతి, తన నీరసపు కాంక్షలు తల్లిదండ్రులకు తెలియలేదుకదా! తల్లిదండ్రులకు ఆ వార్త పిడుగులా సోకి నాశనం చేయలేదుగదా! లోకేశ్వరి ఏమనుకుంటుంది? కల్పమూర్తి ఉత్తముడు. అతడేమనుకుంటాడు? ఒకరిని గురించి ఒకరు ఏమనుకుంటారు? ఏమనుకుంటే ఏమి? 'ఏమనుకుంటారో!' అనే నీరసభావం లోకాన్నిపూర్వకాలం నుంచీ తగలేసింది. మహాత్మా గాంధీజీకి లోకం ఏమనుకుంటుంది అనే ప్రశ్నలేదు, మనస్సు నిర్మలంగా ఉంచి, మన నడవడిని మనమే నిర్ణయించు కోవాలి. ఏమనుకుంటుంది లోకం? అన్న గుడ్డిభయం పనికిరాదని యెన్ని సారులో అన్నాడు. తానూ తన జీవితంలో తనను పరిశోధించుకుంటున్నది.
34
ఈ టెన్నిస్ తార ఏదో ఆలోచనలో వున్నదనీ, అందుకోసం జవాబులు సరీగా చెప్పటంలేదనీ ఆ యూరోపియను బాలిక లనుకున్నారు. ఎందుకు తిరువళ్ళూరుదాకా వచ్చింది ఈమె?
తన జన్మఅంతా ఒక పెద్ద ప్రహసనం అయిందని హేమ అనుకుంది. ఇంత వేళాకోళమై వెక్కిరింతలై ఇంతడబ్బు నీటిలా ఖర్చుచేస్తే కానీ నిజం తెలియలేదు హేమకు. కొంతకాలం ఆలోచనలు ఏమీ లేకుండా పడిఉంది. మదరాసు స్టేషను వచ్చింది. హేమ లేచి, ఆ యూరోపియను బాలికలనూ క్షమాపణ అడుగుచు తా నత్యంత ముఖ్యమైన కార్యం విషయంలో మనస్సు లగ్నం చేసుకొని వుండడంవల్ల తాను వారితో మాట్లాడలేక పోతినని చెప్పుకొని, వీధిలోనికి వచ్చి తిన్నగా ఒక టాక్సీని పిలిచి అందులో అధివసించింది.
అప్పటికి రాత్రి 9-20 గంటలయింది. తిన్నగా ఇంటికి వెళ్ళి, ఇంటిలో అడుగుపెట్టింది. హాలులో వినాయకరావుగారూ, వారి డాక్టరు గారూ, పలువురు సేవకులూ ఉన్నారు. పోర్చిలో కారు ఎవరిదా అంటూ లోపలికి వచ్చింది హేమ!
తండ్రి హేమను చూచి ఒక్క ఉదుటున లేచి "నాన్నా! నాన్నా ఎక్కడికి వెళ్ళావు?" అంటూ మొగం తిరిగి కుర్చీమీద కూలబడ్డాడు. డాక్టరుగారు రెండడుగులలో వారి దగ్గరకు వెళ్ళి, "ఏమిటండీ ఈ గడబిడ వినయకరావుగారూ? మీరు కూడానా?" అని అంటూ వెంటనే తన మందుల పెట్టెకడకు ఉరికారు.
హేమ భయభ్రాంతయై గజగజ వణుకుథూ తండ్రి దగ్గరకు పరుగెత్తింది. డాక్టరుగారు వినాయకరావుగారి ముక్కు దగ్గర హేమను ఒక సీసా వాసన చూపించమని చెప్పి, నాలుగు చుక్కలు 'నక్స్ వామికా', ఇరవై చుక్కలు 'స్పిరిట్స్ అమ్మోనియం అరెమేటికా' వేసి నీళ్ళుకలిపి, కళ్ళు తెరచిన వినాయకరావుగారిచేత తాగించారు.
హేమ కళ్ళనీరు కారిపోతుండగా, "నాన్నగారూ, ఏమిటి కంగారు?" అనితండ్రి ప్రక్కన కూర్చుండి అడిగింది. వినాయకరావుగారికే కళ్ళనీళ్ళు తిరిగాయి. ఆయన దీనంగా కుమార్తెవంక చూస్తూ, "మీ అమ్మ చావు బ్రతుకులలో వుంది నాన్నా!" అన్నారు.
"అమ్మా!" హేమకు పట్టరాని దుఃఖం వచ్చింది. ఆమె అనుకున్నట్లే అయింది. ఈ మహావిషాదానికంతకూ తానే నాయకురాలు అని ఆమె అమ్మకూ అర్ధమైపోయింది కాబోలు. ఎలావుంది తల్లికి? ఆమె అతి దీనవదనంతో డాక్టరుగారివైపుకు చూచింది.
డాక్టరుగారు హేమను చూచి, "ఏం ఫరవాలేదమ్మా. మీ అమ్మగారిని బ్రతికించే భారం నాది" అన్నారు. "నేను లోపలికి పిలువనంపగానే మీ అమ్మగారి దగ్గరకు రా; ఈలోగా మీ నాన్నగారితో మాట్లాడుతూ ఉండు" అని డాక్టరుగారు లోపలికి వెళ్ళారు. హేమ తండ్రివంక తిరిగి, "నాన్నగారూ, ఏమిటి గడబిడ అంతానూ? అమ్మకు జబ్బెమిటి?" అని అతిదీనంగా అడిగింది. వినాయకరావుగారు కొమరితవంక తీక్షణంగా చూచి, "నాన్నా, నువ్వు ఎక్కడానుండి వస్తున్నావు?" అని ప్రశ్నించారు.
"నాన్నగారూ, నన్నిప్పుడేమీ ప్రశ్నించకండి. ఒక్కటి మీరు నన్ను గురించి అనుమానపడవలసిన కారణం ఏమీలేదు. సర్వదేవతల సాక్షిగా నేను శకుంతల చెల్లెలిని. వెంకట్రామరాజ్యలక్ష్మమ్మగారి కూతురను. నా దేహము, నా ఆత్మ సీతాదేవి అవతారంలా నిర్మలాలు." అంటూ దొనదొన కంటినీరు వెల్లువగా వస్తూవుంటే తుడుచుకొంది. వినాయకరావు గారు మరి మాట్లాడలేదు. కుమార్తెను దగ్గరగా తీసుకొని గుండె కదుముకున్నారు. ఆయన ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, నిరభ్యంతరంగా కారిపోయే కంటినీరును తుడుచుకోవడం మానివేశారు.
డాక్టరు లోపలికి వెళ్ళినప్పటికి ఒక నర్సు రాజ్యలక్ష్మమ్మగారికి పరిచర్య చేస్తూ వున్నది. డాక్టరుగారు వెళ్ళి మంచందగ్గర కుర్చీమీద కూర్చున్నారు. రాజ్యలక్ష్మమ్మగారి చేయి తీసికొని, నాడి పరీక్ష చేస్తూ "రాజ్యలక్ష్మమ్మగారూ! ఇప్పుడు మీ వంట్లో ఇందాకటికన్న నయమేనా?" అని అడిగారు.
"రాజ్య: (నీరసంగా సన్నని గొంతుకతో) నయమేనండీ. ఎందుకాండీ నయం డాక్టరుగారూ?
డాక్ట: ఈపాటికి వాళ్ళు వస్తూ ఉండవచ్చును.
రాక్యలక్ష్మమ్మగారు 'ఎవరండీ' అంటూ నీరసంగా ఆ డాక్టరుగారి వైపు మొగం తిప్పింది.
డాక్ట : మనవాళ్ళే!
రాజ్యలక్ష్మమ్మగారు మాట్లాడకుండా డాక్టరుగారివైపు చూస్తున్నది.
డాక్ట : మీనాడి చాలా బాగుంది. అచ్చా! వీరందరూ ఎప్పుడూ తిరగడమే! ఇంకా వచ్చారుకాదేమో?
రాజ్య : ఎవరండీ?
డాక్ట : మనవాళ్ళేనండీ, హేమా వాళ్ళూనూ!
రాజ్య : హేమా? హేమ....?
డాక్ట : హేమ నాతో చెప్పింది. నలుగురం కలిసి ఇక్కడే ఒక దగ్గిర ఊరు చూసి పదిలోపుగా వస్తామని. ఇంకా వచ్చింది కాదే?
రాజ్యలక్ష్మమ్మగారు మాటలేకుండా తెల్లబోయి చూస్తున్నది.
డాక్టరు నాడి పరీక్షచేస్తూ, కొంచెం నాడి ఒడుదుడుకు పడడం కనిపెట్టి "ఆఁ....హేమ ఇంకా వచ్చింది కాదు. పోనీ లోకేశ్వరి యెక్కడకు వెళ్ళిందో? హేమ సరిగా పదిలోపుగా వస్తానని నాతో చెప్పింది. త్యాగతి గారూ, ఆమె ఒక కారులో కూర్చొని ఉన్నారు. నర్స్, నువ్వు వెళ్ళి అమ్మాయి వచ్చిందేమో చూడు."
రాజ్య : అమ్మాయి రాదండీ. మీతో పదింటిలోపుగా వస్తానందా?
డాక్టరు : (రాజ్యలక్ష్మమ్మగారి మాటలు విననట్లు నటించి) త్యాగతి గారూ ఆమాటే అన్నారు. ఎప్పుడు నాకు వాళ్ళిద్దరి కారు కనబడింది చెప్మా? ఆరున్నర....కాదు....ఆరూ ఇరవై ఇంటికి.... ఆఁ....అవును; ఆరూ ఇరవై ఇంటికే! నర్సు నవ్వుతూ లోపలికి వచ్చింది. డాక్టరుగారూ, రాజ్యలక్ష్మమ్మ గారూ నర్సువైపు చూచారు.
నర్సు: త్యాగతిగారు తమ అత్తగారిని చూడవచ్చునా అని అడుగుతున్నారు.
డాక్టరు : త్యాగతిగారూ చూడవచ్చును, హేమగారూ చూడవచ్చును.
నర్సు : తండ్రీ కూతుళ్ళిద్దరూ కంగారుపడుతూ కూరుచుని ఉంటే, రాజ్యలక్ష్మమ్మగారికి బాగా కులాసాగా ఉందని చెప్పానండీ డాక్టర్.
రాజ్య : (కొంచెం దృఢపడిన కంఠంతో) తండ్రీ కూతుళ్ళిద్దరూనా?
డాక్టరు : ఏ తండ్రీ....మన ఇంట్లో ఉన్న తండ్రే. వినాయకరావు గారూ...అయితే నర్స్, హేమగారూ వచ్చారేమిటి?
నర్సు : వారంతా వచ్చి పదినిమిషాలయిందనుకుంటాను.
డాక్టరు : అంతా అంటే?
నర్సు : త్యాగతిగారు, కల్పమూర్తిగారు, లోకేశ్వరిగారు, హేమగారూ.
రాజ్య : మా హేమ వచ్చిందా! (ఆమె గుండె చాలా వేగముగా మోగుతున్నది.)
డాక్టరు : నర్స్, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళినట్టు?
రాజ్య : ఎప్పుడూ ఏదో చోటుకు షికారు వెడుతూనే ఉంటారండీ. (ఆమె నాడి చాలా నిదానత పొందింది.)
డాక్టరు : నర్స్! నువ్వు ఇక్కడ కూర్చో. వాళ్ళ నలుగురినీ లాక్కొని వస్తాను.
డాక్టరు హాలులోకి వచ్చాడు. డాక్టరుగారు హాలులోనికి వచ్చేసరికి, హేమ తండ్రి దగ్గర కూర్చునిఉంది. లోకేశ్వరి వినాయకరావుగారి అవతల పక్కగా నిల్చొని ఉంది. త్యాగతి బల్లదగ్గర నిలుచుండి, ఆ హాలులో ఉన్న నూనెరంగుల చిత్రాలు చూస్తూ ఉన్నాడు. కల్పమూర్తి ఒక కుర్చీలో కూర్చుండి సిగరెట్టె కాల్చుకుంటూ పైకి చూస్తున్నాడు.
డాక్టరుగారు త్యాగతిని చూచి, "ఏమండీ త్యాగతిగారూ, మీ అత్త గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. మీ నలుగురూ ఈ ప్రపంచం అంతా చక్కర్ కొట్టి వస్తున్నారని రాజ్యలక్ష్మమ్మగారితో చెప్పాను సుమండీ! ఆ ముక్కలే జాగ్రత్తగా చెప్పండి వారితో" అంటూ, "రండి అందరూ. త్యాగతిగారూ, హేమగారూ, హేమగారి కారులో కూర్చుని కదూ నాకు కనబడింది? అప్పుడు సాయంకాలం ఆరున్నర అయివుంటుంది. సాక్ష్యం బాగా చెప్పకపోతే జడ్జీగారి తీర్పు వ్యతిరేకం అవుతుంది. లోకేశ్వరిగారూ, మీరు కారు వెనక సీటులోనా?" అన్నారు.
అందరికీ అర్ధమైంది. అందరూ లోనికి వెళ్ళారు. రాజ్యలక్ష్మమ్మ గారి దగ్గరకు హేమ వెళ్ళి, "అమ్మా, ఏమిటే ఈ గడబిడ? బావా, నేనూ, వాళ్ళు షికారు వెళ్ళివచ్చాము" అన్నది. రాజ్యలక్ష్మమ్మగారి గుండె నుంచి కోటిబరువులు తీసివేసినట్లయింది. త్యాగతి అత్తగారి చేయి తీసుకొని నాడి చూసి, అత్తయ్యగారూ! మా అమ్మకోసం కారు వెళ్ళింది! ఈపాటికి వస్తూ ఉంటుంది, నాడి చాలాబాగా ఉందే! ఇంకా నయం. నేనూ హేమా వీళ్ళూ మా ఇంటిదగ్గర భోజనంచేసి, సినీమాకు వెడదామనుకున్నాము. హేమే ఏదో బెంగగా ఉందని చెప్పి సినిమా ప్రోగ్రాం మానిపించింది" అని అన్నాడు.
35
హేమ తల్లి పక్కలో అలాగే చేయిపట్టుకొని కూర్చుంది. కొమరిత చేయి పట్టుకొని రాజ్యలక్ష్మమ్మగారు నిదురపోయారు. నెమ్మదిగా దగ్గరగా జరిగి హేమ కదలకుండా అలాగే కూర్చుంది. ఏదో మహత్తరమైన శాంతి ఆమె జీవితం అంతా ప్రసరించినట్లయింది. ఆమె చిన్నబిడ్డ అయినట్లు తోచింది. అల్లా తనతల్లి దేవతలా నిదురపోతోంటే చూస్తున్న హేమహృదయంలో వేసవికాలంలో సముద్రగాలి తిరిగిన వెనక దేశం అంతా సుఖం ప్రసరించుతున్నట్లు, ఆనందం అలముకున్నది. తాను ఎలా తీర్ధ మిత్రునితో అలా వెళ్ళిపోవడానికి సంకల్పించుకొన్నట్లు? ఎందుకు అలా తిరువళ్ళూరు స్టేషనులో దిగి పారిపోయి వచ్చినట్లు?
త్యాగతి, కల్పమూర్తి, లోకేశ్వరి అవతలికి వెళ్ళిపోయారు. వారు మువ్వురు హాలులోకి రావడంతోటే గ్రంధాలయం గదిలో ఉన్న టెలిఫోను మోగింది. త్యాగతి ఆ గదిలోకి వెళ్ళి టెలిఫోను చెవి దగ్గిర పెట్టుకొన్నాడు.
త్యాగతి : "హల్లో! నేను త్యాగతీ శర్వరీభూషణున్ని. ఇది వినాయకరావుగారి ఇల్లు. ఆ! నేను తీర్ధమిత్రుడుగారిని బాగా యెరుగుదును. ఊఁ! ఏమిటీ? తీర్ధమిత్రుడుగారి భార్య, చీర అంటించుకొంటే 'మీరు వెళ్ళి గొంగళీ కప్పి ఆర్పినారా? వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. ఇదిగో కారు తీసుకువస్తున్నా. ఎవరో లేడీ డాక్టరుగారు వచ్చారా? మంచిది. ప్రాణాపాయం లేదుగద? ఇదిగో వస్తున్నా, అక్కడే చెప్పుదురుగాని, అంతట్లో ఆస్పత్రికి అంబులెన్సుకు ఫోను చేయండి! ఆఁ."
త్యాగతి ఫోను పెట్టివేసి, హాలులోకి రెండంగలువేసి, కల్పమూర్తినీ లోకేశ్వరిని తనతో రమ్మని, మామగారితో కారు తీసుకు వెళ్ళుతానని చెప్పి, ముగ్గురూ కలసి ట్రిప్లి కేను వెళ్ళారు. వీరు అక్కడికి వెళ్ళేసరికి అంబులెన్సు కారూ వచ్చివుంది. ముగ్గురూ మూడంగలలో మేడెక్కారు. ఒక లేడీ డాక్టరుగా రున్నారు. నౌకరు, నర్సులు కనకలత గదిలో ఉన్నారు. లోకేశ్వరి లోనికి పోయింది.
కనకలత ఎడమచేయీ, వీపు కాలింది. ఆమె నిస్ప్రహలో అతి నీరసంగా ఉంది. లోకేశ్వరి లేడీ డాక్టరుగారి మొగం చూచి, "అమ్మా, మా హేమ కూడా వస్తానంది. వాళ్ళమ్మకేదో జబ్బు చేయడంవల్ల రావడానికి వీలులేకపోయింది" అన్నది. కనకలత కళ్ళు తెరచి లోకేశ్వరిని తీక్షంగా చూసింది. లోకేశ్వరి కనకలత దగ్గరగా వెళ్ళింది. "హేమ ఎక్కడికీ వెళ్ళలేదా?" అని కనకలత ప్రశ్నించింది.
"కనకం, మేమంతా కలిసి మహాబలిపురం వెళ్ళివచ్చాం. మీ ఆయన తన కంపెనీ పనిమీద బొంబాయి వెడుతూంటే మేమంతా సాగనంపే వెళ్ళాం. హేమను పిలవనంపనా?" అని లోకేశ్వరి అంది. కనకలత మోము నిండింది. "వద్దులే" అని నీరసంగా అంది.
వెంటనే ఆమెను జనరల్ ఆస్పత్రికి అంబులెన్సుమీద తీసుకుపోయారు. లోకేశ్వరీ, త్యాగతీ, కల్పమూర్తీ కూడా జనరల్ ఆస్పత్రికి పోయి పొయ్యిలో నిప్పుకొంగు అంటుకొని ఈ ఆపత్తు జరిగిందని అక్కడా చెప్పి, ఆమెను వైద్యాలయంలో ప్రవేశ పెట్టించారు. కట్లుకట్టగానే లోకేశ్వరి కనకలతతో "కనకం, నీ భర్తను నువ్వు అనవసరంగా అనుమానించావు అని నా ఉద్దేశం. నువ్వు ధైర్యంతో ఉండు. నీకు ఏమీ అనుమానానికి తావులేదు. భగవంతుని సాక్షిగా చెబుతున్నాను. నువ్వు బ్రతకాలి సుమా! పండ్ల లాంటి నీ బిడ్డల్ని మరచిపోకు, నీ భర్త పూర్తిగా మారిపోయే రోజులు వచ్చాయి. నేనూ వివాహం చేసుకుంటున్నాను తెలుసునా?" అన్నది!
"ఎవరిని?" అని కనకలత అడిగింది.
"నిశాపతిగారిని" అంటూ లోకం చిరునవ్వుతో ఉప్పొంగింది. కనకలతా నవ్వింది. "రేపువచ్చి నీ దగ్గరే ఉంటా" అన్ని చెప్పి లోకేశ్వరీ, త్యాగతీ, కల్పమూర్తీ వెళ్ళిపోయారు.
త్యాగతి తన ఇంటికి వెళ్ళాడు. అతనికి రాత్రంతా నిదురలేదు. ఏ స్టేషనులో హేమ దిగివచ్చింది? తిరువళ్ళూరు దగ్గిర అయి ఉంటుంది. సెంట్రల్ స్టేషనులో అయితే ఆ వరకే వచ్చి ఉండవలసింది. అటు తీర్ధమిత్రుని భార్య దేహం కాల్చుకుంది. ఉత్తమ యిల్లాలు, పండువంటి భార్యను ఆ రాక్షసుడు గంగలో కలిపివేయడుకదా? ఇదా ప్రపంచ ధర్మంకై జీవిత నటన? హేమ తిరిగి రావడానికి ఏమి జరిగింది? హేమకూ తీర్ధమిత్రునికీ ఎంతవరకూ వెళ్ళింది? హేమ తీర్ధమిత్రునికి తన దేహం అర్పించుకుందా?? ఆమె గతి ఏమిటి? ఎక్కడికి పోతోంది ఈ సంఘం? వారిద్దరూ మర్యాదలు అతిక్రమిస్తే వారిద్దరికీ వివాహం ఒక్కటే గత్యంతరం అవుతుంది. అప్పుడు కనకలత ఏమవుతుంది?
ఈ నాటకంలో తానే ప్రతినాయకుడు అయ్యాడు. తాను వచ్చి హేమను వివాహం చేసుకొనడానికి ప్రయత్నించకుండా ఉంటే? ఆ ప్రయత్నించడమూ ఏదో పిచ్చిరకంగానే! తనను తాను నాటకంలోలా తెలుపుకోకుండా ప్రయత్నం చేసినట్లు. దీనితో ముక్కుపచ్చలారని హేమకు ఒక విప్లవస్థితి వచ్చిపడింది. తా నసలు మదరాసే రాకుండా ఉంటే, ఏది ఎట్లా జరిగి ఉండునో? ఎదురుగుండా తను ఉంటే హేమ మనస్సును ఇంకా పాడుచేసిన వాడవుతాడు. ఏదో వంక పెట్టుకొని తానీ ఊరునుంచీ మకాం ఎత్తెయ్యాలి. చాలు! తా నింతవరకు ఇతర జీవితాలను దగ్ధం చేసింది చాలు! ఇక్కడనుంచైనా తా నితరుల జీవితాలతో సంబంధం కలుగజేసుకోకుండా మిగిలిన జీవితం గడిపినన్నాళ్ళు గడపవలసిందే! ఇందులో ఎవ్వరికీ ఆవేశాలు ఉండకూడదు. హేమ ఎంత బాధ పడిందో? ఏదో ఆడుతూ, పాడుతూ, అల్లరిచేస్తూ బాలికాత్వం ఇంకా వీడని బాలకు ఏవేవో వెర్రిసమస్యలన్నీ పెట్టి అనవసరపు కలతలు తీసుకొని వచ్చాడు తాను....ఈ రోజు కనకలత జీవించకపోతే ఆ చావుకు తానే కారణం అవుతాడు. కావలిస్తే లోకేశ్వరి పెళ్ళికి ఒక్కసారి వచ్చి చూచి పోవచ్చును. ఆ మర్నాడు త్యాగతి తల్లి హేమగారి ఇంటిదగ్గరనుంచి వచ్చీరాగానే ఆమెను చూచి, "అమ్మా! మనం కొల్లిపర వెళ్ళాలి. నేను పెట్టదలచుకున్న శకుంతలా లలితకళాశాల అలా వుండిపోయింది. ఇంక వెళ్ళిపని ప్రారంభిస్తాను."
రంగ : నాన్నా, ఈ ఇల్లూ అవీ?
త్యాగతి : ఇవి ఇలాగే వుంటాయి, నేను మధ్య మధ్యవస్తూ వుంటాను. ఆ కళాశాల బాగా పని ప్రారంభించగానే ఇక్కడి వచ్చేశాను. ఇకిక్కడ పురుషులకు లలిత కళాశాల ఏర్పాటు చేస్తాను. నువ్వు అత్తగారికి బాగా కులాసా కాగానే కొల్లిపర వచ్చేయి. లేదా యిక్కడే ఉండటం మంచిది.
రంగనాయకమ్మగారు ఏమీ మాట్లాడలేకపోయింది. సరేనని తల ఊపింది. తల్లి భావం త్యాగతి గ్రహించాడు. అయినా తన ధర్మం తాను నెరవేర్చాలి గదా! ఆ సాయంకాలం పెట్టే బేడా అన్నీ సర్దుకొని, తల్లిని హేమగా రింటిదగ్గర దిగవిడిచి, సెంట్రల్ స్టేషనుకు పోయి కలకత్తా మెయిలు ఎక్కాడు. 36
కనకలత ఒళ్ళు కాల్చుకున్న మర్నాడు ఉదయానికే తీర్ధమిత్రుడు చెన్నపట్నం వచ్చాడు. హేమసుందరి తిరువళ్ళూరు స్టేషను దగ్గర దిగిపోతుందని అతను కలలోనైనా అనుకోలేదు. అతడు మండిపోయాడు. అతి కోపంతో అతడు ఏడ్చాడు. రైలులోనుంచి ఉరుకుదామనుకున్నాడు. అలా ఉరకడం చూసేవారెవరూ లేక మానివేశాడు. మాట్లాడకుండా ఆ మెత్తటి సీటుమీద పడుకొన్నాడు. దొర్లాడు. చేతికి దొరికిన పండు దొర్లుకు పడిపోయింది. తన మగతనానికి ఎంత తీరని అవమానం! తన చరిత్రలో ఈలాంటిది ఎప్పుడూ జరుగలేదు. షడ్రసోపేతమైన భోజనం పెట్టి, ఆ విస్తరి మళ్ళా లాగివేసినట్లయింది!
హేమ వట్టి దద్దమ్మ; ధైర్యంలేని పిరికి చచ్చమ్మ. ఇలాంటివాళ్ళను కాళ్ళూ చేతులూ కట్టేసి, చీరలు, జంపర్లు, బాడీలు ఒలిచి, బలవంతంగా..నాశనం చేయాలి. కానీ, తాను ఇంతటితో వదులుతాడా ఆ కులుకురాక్షసిని? దానిలోని సౌందర్యరసం యావత్తు పీల్చి ఆ త్యాగతికి పిప్పి మాత్రం వదలాలి. ఏమో! హేమవంటి చదువుకున్న బాలిక తనకు లొంగుతుందా? పైగా ఉద్యోగానికి మొప్పం రావచ్చును. ఏ త్యాగతికో కోపం వచ్చిందంటే, ప్రాణంపోయిఊరుకుంటుంది. ఇప్పటికే వాళ్ళు మండిపోతూ ఉంటారు. రైలు ఆర్కోణం వచ్చింది. ఎన్నో ఆనందాలు ఊహించుకొన్నాడు తాను. అసలు హేమ ఈ బొంబాయి ప్రయాణం ఏర్పాటుచేస్తే తానెందుకు ఒప్పుకోవాలి? ఈలాంటి బాలికలతో తెరచాటున సంచరించాలిగాని, ఈ విధంగా బరిమీదపడితే ఎన్నో మొప్పాలు వస్తూ ఉంటాయి. హేమ దిగి వెళ్ళిపోవడమే మంచిదయింది. తన మేనేజరుకు ఈలాంటి విషయం తెలిసిందా తన పని క్షవరం. తానూ చల్లగా తిరిగి మదరాసుకుపోతే, అటునుంచి నరుక్కు రావచ్చును. అన్నీ సర్దుకొని తీర్ధమిత్రుడు రేణిగుంటలో దిగాడు. బొంబాయి నుంచి వచ్చే మెయిల్ తెల్లవారగట్లకు వచ్చినది. అందులో ఎక్కి తెల్లవారగనే మదరాసు వచ్చాడు. మదరాసు సెంట్రల్ లో టాక్సీకారు చేసుకొని అతడు ఇంటికి చేరాడు.
ఇంటిలో అడుగు పెట్టగానే, క్రిందనున్న ఇంటి యజమాని ఇల్లు వదలి పెట్టి వెళ్ళిపోవలసిందని నెల నోటీసు చేతిలో పెట్టాడు. ఆలోచనకు తావులేక తీర్ధమిత్రుడు మేడపైకివెళ్ళగానే పిల్లలందరూ ఘొల్లుమన్నారు. తీర్ధమిత్రుని అయిదు ప్రాణాలూ పైకెగిరిపోయాయి. క్రిందటి రాత్రికిరాత్రే లోకేశ్వరి, కల్పమూర్తీ, త్యాగతీ పిల్లలకోసం, ఆ ఊళ్ళోనే ఉన్న తీర్ధ మిత్రుడుగారి దూరపుచుట్టాలలో ఒకాయననూ, అతని భార్యనూ, బిడ్డలనూ అతని అక్కగారినీ తీసుకువచ్చి తీర్ధమిత్రుడిగారి ఇంట్లో దిగబెట్టారు.
ఆ చుట్టపాయన వరండాలో కూర్చుని ఆ రోజు పేపరు చదువుకొంటున్నవాడు తీర్ధమిత్రుడు పైకి రాగానే, "ఓరి పశువా! ఎంతపని చేశావురా?" అన్నాడు. వంటింటిలోనుంచి వచ్చి "నాయనా! వచ్చావు. ఇంత కన్నా పెళ్ళాన్ని బిడ్డల్ని ఒక్కసారే విషమిచ్చి చంపేయలేకపోయావూ!" అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నది. తీర్ధమిత్రుడు కాళ్ళు చచ్చుబడి అక్కడ ఒక కుర్చీ మీద చతికిలబడ్డాడు.
చుట్టపాయన: నాయనా! నీ భార్య నిన్ను గూర్చి చీర అంటించుకుంది. జనరల్ ఆస్పత్రిలో చావు బ్రతుకులమీద ఉంది.
చుట్టపాయన అక్క: నయమే! పిల్లల్ని తన్నూ కలుపుకొని అంటించుకొంది కాదు! ఎందుకు నీబోటివాళ్ళు పుట్టి? తీర్ధమిత్రుడు మాటలురాక తెల్లబోయి చూస్తున్నాడు. చుట్టపాయన చూపులు మండిపోతున్నాయి. చుట్టపాయన అక్క కళ్ళనీళ్ళు తుడుచుకొంటున్నది. తీర్ధమిత్రుని ఆడపిల్లలిద్దరూ తండ్రి దగ్గిరకువచ్చి, అతని ఒళ్ళో వాలి "అమ్మ చచ్చిపోయింది. నాన్నా! అమ్మ ఏది నాన్నా? అమ్మకావాలి నాన్నా! అమ్మను తీసుకురా నాన్నా!" అని గుండెలు అవిసేటట్లు ఏడవడం ప్రారంభించారు.
చుట్టపాయన: నీభార్య నీమీద ఏదో అనుమానంపడి, చీర అంటించుకుంది. కానీ వెంటనే గొంగళికప్పి, ఇంటి ఆయన ఆర్పివేయడం చేత భుజం క్రింది భాగమూ, ఎడమరెక్కా కాలాయట. వెంటనే మూర్ఛపోయిందట. ఆయన వెంటనే పరుగెత్తి, వినాయకరావుగారి ఇంటికి ఫోనుచేస్తే వాళ్ళేవారొ కారుమీద వచ్చారట. ఇంటాయనే జనరల్ ఆస్పత్రివాళ్ళకూ లేడీ డాక్టరుకూ ఫోనుచేస్తే, వాళ్ళు అంబులెన్సుకారు తీసుకువచ్చారట. మీ ఆవిణ్ణి వాళ్ళంతా ఆస్పత్రికి తీసుకుపోయి ప్రవేశపెట్టారట, ఒక కారుమీద శ్రీనివాసరావుగారూవారూ మాకోసం వచ్చి, మమ్మల్ని తీసుకువచ్చి ఇక్కడ దిగబెట్టి వెళ్ళారు. ఇప్పుడు నేను ఆస్పత్రికి వెళ్ళి ఎల్లా వుందో కనుక్కువస్తాను. నువ్వు పిల్లల దగ్గర ఉండు. సాయంకాలం నీకిష్టమైతే, డాక్టర్లు ఒప్పుకుంటే వెళ్ళి చూచివద్దువుగాని.
తీర్ధమిత్రుడు కళ్ళనీళ్ళు కారిపోగా వెక్కి వెక్కి ఏడ్పు ప్రారంభించాడు. తన చేతులారా భార్యను చంపుకున్నాడు. తాను హంతకుడు. ఉరిశిక్షకు పాత్రుడు. తీర్ధమిత్రుని చుట్టం ఎందుకీ దొంగ ఎద్పులూ ఈ బుడి బుడి దుఃఖాలూ అని అసహ్యించుకుంటూ వైద్యాలయానికి వెళ్ళాడు. దారిలో అతనికి తీర్ధమిత్రుని గురించి ఆలోచనలే. ఈలాటి నీరసపు కుంకలకు మాట్లాడితే ఏడుపులు! వాళ్ళ విచారాలు, వాళ్ళ ప్రేమలు నీటిలో రాతలు. మెత్తటి బురద హృదయాలు వీళ్ళవి. పెళ్ళాం చస్తే పెద్ద పెట్టున లోకం దద్దరిల్లేటట్లు ఏడుస్తారు! ఆ మర్నాడో, ఆ మరుసటినాడో ఇంకోపిల్లను పెళ్ళి చేసుకుంటారు. జానకి రామమూర్తి (తీర్ధమిత్రుడు) వంటి వాళ్ళు తెల్ల బొద్దింకలు. ఆ ఆలోచనలవల్ల అతని వళ్ళు జలధరించింది.
జనరల్ ఆస్పత్రిలో నరసమ్మ (కనకలత) చావుబ్రతుకుల మీద ఉందనీ, నిస్పృహ ఎక్కువవడంవల్ల వచ్చిన హృదయఘాతం (షాక్) తగ్గడంలేదనీ, గ్లూకోజు మొదలైనవి ఎన్ని ఇచ్చినా రోగి కోలుకోవటం లేదని తెలిసింది. అలాంటి బంగారుబొమ్మ ఈలాంటి వెధవకు ఎందుకు దక్కుతుందని అనుకుంటూ ఆ చుట్టం మైలాపూరు వెళ్ళి సమాచారం యావత్తూ లోకేశ్వరితో మాత్రం చెప్పి ట్రిప్లికేను వెళ్ళిపోయాడు.
తన చుట్టం తన భార్య విషయం ఏమీ దాచకుండా తనతో చెప్పగానే జానకి రామమూర్తికీ ఆవేదన ఎక్కువైంది. ఏమిటి చెయ్యాలి? కోటిమంది దేవుళ్ళకు మొక్కుకున్నాడు. ఏ దేవుడూ మనస్సుకు తోచడు. వెంకటేశ్వరుడా! పార్ధసారధీ! కపాలేస్వరా! ఎవ్వరూ పలకరు? క్రిందపడి దొర్లాడు. అతన్ని చూసి బిడ్డలు గొల్లుమన్నారు. ఇంటివారు ఏమయింది అని మేడ మీదకు పరుగెత్తుకు వచ్చారు. నరసమ్మగారికి భయంలేదనీ, జరిగిన ఉపద్రవానికి జానకి రామమూర్తి బెంగా పెట్టుకొని ఏడుస్తున్నాడనీ ఆ చుట్టం చెప్పాడు. ఆ చుట్టమే ఎలాగో సముదాయించాడు జానకిరామమూర్తిని.
వెంటనే పార్ధసారధి కోవెలకు పెద్దబిడ్డల నిద్దరిని తీసికొని పరుగెత్తి వెళ్ళి జానకిరామమూర్తి పదిహేను నారికేళాలు కొట్టి, సహస్రనామార్చన చేసి, తన భార్య బ్రతికితే మహాభోగం చేయిస్తానని మొక్కుకున్నాడు. కానీ తన మొక్కును భగవంతుడు మెచ్చుకుంటాడా అన్న భయంతో బిడ్డలచేత మొక్కించాడు. తొమ్మిదేళ్ళ ఆ పెద్దమ్మాయి "పార్ధసారధీ, మా అమ్మను బ్రతికించు. నేను నీకు నా ఉంగరం ఇస్తాను తండ్రీ" అని మొక్కింది.
37
త్యాగతి తిన్నగా కొల్లిపర వెళ్ళి తన ఇంటిలో మకాం పెట్టాడు. అక్కగార్లకు, మేనమామకు రావలసిందనీ కోరుతూ ఉత్తరాలు రాశాడు. ఒక గది శకుంతల పేర ఏర్పరచుకున్నాడు. తను శకుంతల విద్యాలయానికి వేసిన దానం బాగా పెరిగింది! విద్యాలయానికని తాను నిర్దేశించి ఉంచిన తోట కృష్ణ కాలవ పక్కనే ఉన్నది. అక్కడ నూయి తవ్వితే గంగాజలం వంటి నీరు పుడుతుంది. పనివాళ్ళను పిలిపించాడు.
శ్రీనాథమూర్తి వచ్చాడని, అతని చిన్ననాటి స్నేహితులు చాలామంది చూడడానికి వచ్చారు. సూరపరెడ్డి ఇప్పుడు తెనాలిలో వకీలుగా ఉన్నాడు. వెంకట్రామయ్యాచౌదరి ఎం. బి. బి. యస్. పరీక్షలో విజయం పొంది తెనాలిలోనే వైద్యవృత్తి చేస్తున్నాడు. వాళ్ళతో ఒక రోజల్లా ఆనందంతో గడిపాడు. అతని చిననాటి కథలన్నీ జ్ఞాపకం వచ్చాయి "ఒరే మూర్తీ! రారా తెనాలి. మా ఆవిణ్ణి చూడలేదు నువ్వు, మా పిల్లల్ని చూడలేదు. నువ్వు రాసే కథలు, పాటలు, శిల్పకళను గూర్చిన వ్యాసాలూ పత్రికలలో చూస్తూ, నీ బొమ్మల ప్రతిరూపాలు చూస్తూ, మన చిన్ననాటి ఆటలు తలుచుకుంటూ, మా ఆవిడకు చెపుతూ ఉంటాను. మా ఆవిడ బి.ఏ. ప్యాసయిన ఆవిడే!" అని వెంకట్రామయ్యచౌదరి అన్నాడు.
సూరపరెడ్డి బలవంతం చేశాడు. వాళ్ళతోపాటు తెనాలి పోయి త్యాగతి మూడురోజు లున్నాడు. రెండురోజులు చౌదరిగారి ఇంట్లో మకాం. ఒకరోజు రెడ్డిగారి ఇంట్లో మకాం. వెంకట్రామయ్యచౌదరీ, ఆయన భార్య సరళాదేవి, సూరపరెడ్డీ, త్యాగాతీ ఒకరోజున చౌదరిగారి ఇంట్లో సాయంకాలం టీకి చేరారు. ఫలహారాదులై త్యాగతీ, చౌదరి సిగరెట్లు వెలిగించారు. రెడ్డి చేబ్రోలు ఆకు చిన్న తోలుసంచిలో పెట్టుకొన్నది తీసి చుట్ట చుట్టూకొని వెలిగించాడు.
సూర : ఒరే మూర్తీ, ఎన్ని దేశాలు తిరిగావురా? ప్రస్తుతం ఏమి చేయదలచుకొన్నావు?
త్యాగతి : శకుంతలా లలిత కళాశాల పెట్టించదలచుకొన్నాను.
సరళ : ఏమండీ మూర్తిగారూ! మీ ఆవిడ పేరున లలిత కళాశాల పెట్టించడం ఎంతో సంతోషంగా వుందండీ నాకు. మీ ఆవిణ్ణి నేను చూడలేదు. కానీ మీరు వేసిన బొమ్మా, తయారు చేసిన శిల్పము, ఆమె ఫొటో అన్నీ చూస్తే ఆవిడ అత్యద్భుత సుందరీమణి అని నాకు తోచింది.
వెంక : నీకు తోచడం ఏమిటి! శకుంతల మా చిన్నతనంలో మాతో ఆడుకొనేది. ఆ అమ్మాయి అందాలముద్ద. సుగుణాల ప్రోవు. సరళ : అందుకనే శ్రీనాథమూర్తిగారు ఇంతవరకు ఆమెనే ధ్యానిస్తూ, ఆమె స్మృతికోసం జీవిస్తున్నారు. అయితే లలిత కళాశాల అంటే ఏం పెట్టాలని మీ ఉద్దేశం?
త్యాగతి : లలిత కళలు ఒకదానికొకటి అతి సన్నిహిత సంబంధం కల పంచనిదీ పరివేష్టితమైన పంజాబు వంటివి.
సూర : అది కాదురా. ఆ కళాశాలలో ఎవరు చేరుతారురా! శారదానికేతనానికే, విశ్వవిద్యాలయ పరీక్షలు లేకపోతే ఎంతమంది చేరే వారని నీ ఉద్దేశం?
త్యాగతి : ఒరే రెడ్డీ, నీవి ముసలమ్మల భావాలు. సంవత్సరానికి ఒకరైనా ఆ కళాశాలలో శిక్షణ పొందితే చాలు, ఆ కళాశాల పెట్టిన ఉద్దేశం నెరవేరుతుందనే నా ఆశయం.
వెంక : ఇంతకూ ఏలా ఏర్పాటు చేస్తావు? ఎవరు ఆ కళాశాల అధ్యక్షత వహించేది? ఎవరు అందుకు ఆచార్యులు?
త్యాగతి : మీ ఆవిడవంటి ఏ ఉత్తమురాలో అందుకు అధ్యక్షత వహించకూడదా?
సరళ : నేను తప్పకుండా మీ కళాశాలలో పనిచేస్తా సుమండీ.
త్యాగతి : మీకు కృతజ్ఞున్ని. అయిదు కళలు__సాహిత్యం, చిత్ర లేఖనం, శిల్పం, సంగీతం, నాట్యం అన్నీ వుంటాయి. ఆ కళాశాలలో సాధ్యమయినంతవరకు స్త్రీలే ఆచార్య పీఠాలు అధివసిస్తారు సరళాదేవి గారూ__
సరళ : నన్ను "గారూ గీరూ" అనకండి మీరు.
త్యాగతి : నన్ను "మీరూ గీరూ" అనకమ్మా! నాకూ, చౌదరికి, రెడ్డికి వున్న స్నేహం అలాంటిది.
వెంక : ఇన్నాళ్ళనుంచీ ఒక ముక్క రాశావూ! నీగతి ఏమయిందో మాకు రాయడంగాని, మా గతి ఏమయిందో నువ్వు తెలిసికోడంగాని ఏమీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు తిరిగావు. మీ బాపనాళ్ళెప్పుడూ అంతే లెద్దూ.
త్యాగతి : తెచ్చావు బ్రాహ్మణ అభ్రాహ్మణ సమస్య! ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కష్టాలకూ బ్రాహ్మణులే కారణం అని అనేకమంది మిత్రులు అనుకుంటారు. అధి లోక దౌర్భాగ్యం. బ్రాహ్మణుల సమాఖ్య తక్కువ. వాళ్ళని అణచి వెయ్యాలంటే తక్కినవారికి అయిదు నిమిషాలు పట్టదు. బ్రాహ్మణులు ధనవంతులూ కారు, ఆస్తివంతులూ కారు. బలంలేని ఒక శాఖ విషయంలో "అదిగోరా! అధిగోరా! బ్రాహ్మణుడు" అని అడలిపోవడం ఎందుకు?
వెంక : ఒరే మూర్తీ, బ్రాహ్మణుడు సహపంక్తిని భోజనం పెట్టడు.
త్యాగతి : మదరాసు గవర్నరు పెడ్తాడూ!
వెంక : మనం గొప్పవాళ్ళం అయితే, మన్ని భోజనానికి పిలవడానికి వీలుందిగాదురా?
త్యాగతి : నిజమే, అంత గొప్పవాడవైతే, బ్రాహ్మణుడు సంఘ సంస్కర్త అయితే నిన్ను సహపంక్తి భోజనానికి పిలవవచ్చుగాదా అంట! వెంక : కాని బ్రాహ్మణశాఖ బ్రాహ్మణేతరులను దగ్గరకు రానివ్వరు కాదట్రా.
త్యాగతి : అవునురా, మన్ని తెల్లజాతి దగ్గరకు రానిస్తూందిరా? మన దారిని వృద్దిపొందడం చూచుకోవాలి ఈ శాఖాభేదాలు మన దేశానికి తీరని కొరతే, కాదని నేను అనను. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు అనినట్లు భారత దేశంలో హిందువులందరూ బ్రాహ్మణులైతేనే జాతి అత్యంత పురోభివృద్ది పొందుతుంది. అందుకు మనదేశం అంతా ఏ ఉన్నతమైన బోల్షివిజమో రావాలి! మహాత్మాజీఇజం అల్లాంటిదనే నా ఉద్దేశం.
రెడ్డి : మహాత్మాజీ ధనికులను అల్లాగే ఉండమని, వారు బీదల తరపున ట్రస్టీలని వాదిస్తారు కాదట్రా?
త్యాగతి : ఆయన ఉద్దేశంలో ధనికులు వూంజీతత్వం వదలాలనే. అది భౌతికవిప్లవం ద్వారా కాకుండా నైతిక విప్లవం ద్వారా తీసుకురమ్మనే ఆయన బోధ!
వెంక : సంగీతాలకు చింతకాయలు రాల్తాయా?
త్యాగతి : కాని డప్పులకు పెద్దపులులే బెదురుతాయి. చెట్టెక్కికోస్తే చింతకాయలూ వస్తాయి. అంతేకాని తుపాకులు పుచ్చుకొని కుందేళ్ళను చంపి, చింతకాయలకోసం చింతచెట్టు యావత్తూ నరికితే ఎల్లాగుతా?
సరళ : ఈ సమస్యలన్నీ అవేపోతాయి. దేశం మారుతోంది. మార్పు వచ్చి తిరుగుతోంది. పాకిస్తాను అంటేగాని, ముస్లిం సోదరులు హిందువులతో సమత్వం పొందారు. అలాగే బ్రాహ్మణులను తిడ్తేనేగాని సాంఘిక సమస్యలు విడవవు. మూర్తిగారూ, మాది భావదాస్యం. బ్రాహ్మణ బావం వదలలేము. అందుకని అదంటే కోపం. ఆంగ్లదాస్యం వదలలేము: అందుకని అదంటే కోపం. ముందరమా కమ్మవారూ, కాపువారూ, రెడ్లూ, వెలమవారూ వివాహాది సాంఘిక విషయాలల్లో ఒకటైపోతే బ్రాహ్మణులు ఏంజేస్తారు? ఉద్యోగాలకోసం ఈ ఏడ్పంతా! బ్రాహ్మణేతరులలో కమ్మవారు, వగైరా, చాకలి వగైరాలతో పెళ్ళిళ్ళూ పంక్తిభోజనాలూ చేస్తారా? పనిచేసే వారు లేరు. వాగే వాజమ్మలు ఎక్కువ. రెడ్డి మంత్రయ్యాడని కమ్మవారూ; వెలుమలూ, కాపులూ మండిపోయారు. ఇంక చాకలివారూ, మంగలివారు, కమ్మరివారు, గొల్లవారు, గాజులబత్తులు, జక్కులవారు, కుమ్మరివారు, ఉప్పరులు, దొమ్మర్లు, కరణిబత్తులు, పద్మశాలీలు, ఏనాదులు, మాలలు, మాదిగలు, ఎరుకలు ఈ వగైరాలంతా ఏకమైతే ఎంత బాగుంటుంది! 38
హేమసుందరికి తన బావ కొల్లిపర వెళ్ళినాడని, అతను వెళ్ళిన సాయంకాలం తన ఇంటికి వచ్చిన, రంగనాయకమ్మగారు తన తల్లితో చెబుతోంటే విన్నది. వెంకట్రామ రాజ్యలక్ష్మమ్మగారు చాలావరకు ఆరోగ్యం పొందారు. అయినా కొన్నాళ్ళవరకూ పూర్తి విశ్రాంతిగా పండుకొని ఉండాలని డాక్టరు ఆజ్ఞ. తానూ తీర్ధమిత్రుడూ రైలెక్కగానే, టాక్సీకారు నడిపే డ్రైవరు హేమగారి పెద్దకారు డ్రైవరుతో చెప్పాడనీ, అతడు తన సైకిలుమీద వెంటనే తమ ఇంటికి వచ్చి లోకేశ్వరిని "హేమగారేరీ?" అని అడిగి, ఆమె ఎక్కడికో వెళ్ళిందంటే, టాక్సీడ్రైవరు చెప్పిన కథ లోకేశ్వరితో చెప్పాడనీ, ఆ విషయం పరిశీలన చేయడానికి కంగారుపడుతూ లోకేశ్వరి హేమ గదిలోకి వెడితే, హేమ లోకేశ్వరికి రాసిన ఉత్తరం చూసి, లోకేశ్వరి వెక్కి వెక్కి ఏడ్చిందనీ; తూలుతూ లోకేశ్వరి తన గదిలోకి వెళ్ళి శకుంతల ఫోటో దగ్గర కూలబడి ప్రార్ధించి, తమ కారు వేసుకుని కల్పమూర్తి దగ్గరకుపోయిందనీ; లోకేశ్వరి తన గదిలో ప్రార్ధిస్తున్నప్పుడు డ్రైవరు ఈ విషయం హేమ పరిచారిక వీరమ్మకు చెప్పాడనీ, ఆ తర్వాత వాడు కారుమీద వెంటనే లోకేశ్వరిని తీసుకుపోయాడనీ; వీరమ్మ గోల పెడుతూ, బావురుమంటూ రాజ్యలక్ష్మమ్మగారి దగ్గరకు వెళ్ళి ఆ విషయం చెప్పిందనీ, దానితో తన తల్లి కెవ్వున కేకవేసి పడిపోయిందనీ; వినాయకరావుగారు గబ గబ వచ్చి, వీరమ్మ చెప్పిన మాటలు విని, ఆయన భార్య అవస్థ చూచి మొండి ధైర్యం తెచ్చుకొని, ఈ విషయం ఎవరితో చెప్పవద్దని వీరంమకు చెప్పి, అలా చెబితే దాని బుర్ర చిదుకకొడ్తానని, వెళ్ళి డాక్టరుకు ఫోను చేశాడనీ; డాక్టరుగారు వచ్చేలోగా ఏవో నీళ్ళు చల్లుతూ కళ్ళనీళ్ళు కారుస్తూ కూర్చున్నారనీ; డాక్టరుగారు వచ్చి వైద్యం ప్రారంభించారనీ; వినాయకరావుగారు తూలిపడిపోబోయి, మొండిధైర్యం తెచ్చికొని, హాలులోనికి వెళ్ళి కుర్చీమీద చదికిలబడ్డారనీ; ఈలోగా డాక్టరుగారూ తా నెరుగున్న మంచి నర్సుకోసం తన కారు పంపించి రప్పించారనీ; ఆ తర్వాత తానూ, త్యాగాతీ వగైరా వచ్చామనీ; జరిగిందంతా లోకేశ్వరి ఆ రాత్రే హేమతో చెప్పింది.
లోకేశ్వరీ, కల్పమూర్తీ కలిసి త్యాగతి దగ్గిరకు పరుగెత్తారట. త్యాగతి గుంటకల్లులోనో, కడపలోనో హేమను కలిసి వెనక్కు తీసుకు వద్దామని సంకల్పించి కల్పమూర్తి కారును బాగా పెట్రోలు వేసి సిద్దం చేయమనీ; తాను రెండువందల రూపాయలు పట్టుకవచ్చి, కారులో తాను కల్పమూర్తితో వస్తూ డ్రైవరుతో_యిదంతా తన ఏర్పాటేననీ ముందు సోఫీ, తీర్ధమిత్రుడూ, హేమా హంపి వెళ్ళడం, తాము తర్వాత కారుమీద వెళ్ళడం ఏర్పాటు చేశాననీ చెప్పాడట__డ్రైవరూ నమ్మినట్లే కనబడ్డాడట. అయినా తన్ను యింటి దగ్గర జాగ్రత్తగా కనిపెట్టమంటూ దిగబెట్టడానికిన్నీ సోఫీని తీసుకువెళ్ళడానికిన్నీ నిశ్చయించేశాడట త్యాగతి. తామంతా కల్పమూర్తి ఇంటికి వచ్చారట. అక్కడ కల్పమూర్తి తన కారు తీసి వేయి రూపాయలు జేబులో వేసుకొని బయలుదేరాడట. లోకాన్నీ, కారునూ ఇంటిదగ్గర దిగబెట్టడానికి తమ ఇంటికి వచ్చారట. రాగానే హేమను చూచి ఆశ్చర్యం పొందారట. లోకేశ్వరికి కలిగిన ఆనందం వర్ణనాతీతమట. పెద్ద బరువు తీసినట్లయి వెక్కి వెక్కి ఏడ్పు వచ్చిందట లోకేశ్వరికి. లోకేశ్వరి వెంటనే తన గదిలోకి పరువిడి అక్క ఫోటో ఎదుట సాగిలపడి మొక్కుకొని ఆనందంలో కన్నీళ్ళు వెల్లువలయిందట. ఈ కథంతా హేమ తెల్లవారగట్ల నాలుగింటికి తన గదిలో కూర్చుని ఉండగా తిరువళిక్కేణి నుంచి వచ్చిన లోకేశ్వరి చెప్పి, హేమను బిగియార కౌగిలించుకుంది. హేమ కన్నీరు మున్నీరై లోకేశ్వరి కౌగిలిలో కుంగిపోయింది. మూడున్నర గంటలవరకూ హేమ తల్లి గదిలోనే ఉంది. ఆవిడ ఒళ్ళు తెలియకుండా నిదురపోవటం చూచి నర్సు వెళ్ళిపొమ్మని సైగ చేసింది. హేమ పిల్లి అడుగులు వేస్తూ, తండ్రిగారు కూడా వారి గదిలో గుర్రుపెట్టి నిదురపోవడం చూచి, తన గదిలోకి వెళ్ళింది. ఆ బాలిక గదిలోకి వచ్చిన వెంటనే లోకేశ్వరీ ఆ గదిలోకి వచ్చింది.
లోకేశ్వరి వచ్చీరానిడంతోటే హేమను కౌగలించుకుంది. లోకేశ్వరి కన్నీళ్ళు కారుతుండగా జరిగినదంతా చెప్పింది. హేమ మంచంమీద వాలిపోయి, "లోకం! నా జన్మ వృధా అనుకుంటా. ఒక్కటి మాత్రం దాచకుండా నీతో చెబుతా. నేను తెలియకుండా మా బావనే ప్రేమిస్తున్నాను. కాని ఆ ప్రేమవల్ల నాకు బానిసత్వం వస్తుందని నా హృదయంతరాళంలో భావం కలిగిందేమో, లేదా అతని అఖండ ప్రేమకు నేను తట్టుకోలేక పోయానో? నేను ఏమీ ప్రేమించని తీర్ధమిత్రునితో పారిపోయాను. అదీ రహస్యం! నేను నా దేహం ఏ తుచ్చవాంఛతోనూ అపవిత్రం చేసుకోలేదు లోకం" అని కుళ్ళిపోయింది.
"ఓసి వెర్రితల్లీ! నువ్వు ఎప్పుడూ, ఏ రకంగానూ అపవిత్రం చేసుకోగలవని ఎవ్వరూ అనుకోలేదు. నువ్వు శకుంతలకు చెల్లెలివి. శకుంతలకు మూడుమూర్తులా అపరావతారానివి. శకుంతల నాకు దేవి. నాకథ చెప్తా విను. "చుట్టాలింటిలోఉంది నెల్లూరులో చదువుకున్నాను. ఆ తర్వాత నాకు ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్ధినీ వేతనం వచ్చింది. ఆ కళాశాలలో చదివితే ఎక్కువ లాభం. ఎవరింటిలో ఉండను? ఆ అదను పోగొట్టుకుంటే ఎలాగూ? అని ఏడ్చాను. మదరాసువచ్చి ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాను. క్వీన్ మేరీ కళాశాల హాస్టలులో చేరాను. కొందరు రెడ్డి ప్రభువు లిచ్చిన చందాలతో కొంత కాలం గడిపాను. ఎందుకో మొదటినుంచీ నేనంటే గాఢ ప్రేమ చూపావు. మీ యింటికి తీసుకువచ్చేదానవు. నన్ను నువ్వు మీ కారుమీద తీసుకువచ్చిన మొదటరోజునే శకుంతల బొమ్మ చూశాను. మీ ఇద్దరి పోలికా అత్యంతాశ్చర్యం కలుగచేసింది నాకు. నీదేనా ఆ ఫొటో అని అడిగాను, జ్ఞాపకము వుంది కాదూ! మీ అక్క శకుంతలదన్నావు. నాకా ఫొటోలో కనబడిన వ్యక్తి ఒక దేవతే అనిపించింది హేమా. అప్పుడే ఎందుకో ఆమెకు నా మనస్సులో మొక్కుకొన్నాను. నువ్వు నన్ను తీసుకువచ్చిన నాల్గయిదుసారులు ఆ చిత్రం నాకు దేవతా చిత్రంలా కనబడి మనస్సులో నమస్కరించుకొనేదానిని. తల్లిదండ్రులు అతి బీదవాళ్ళు. తిండి సగం తినీ సగం తినకా కాలం గడుపుతున్నారు. హేమా, చదువులో మునిగి జీవించి ఉంటిని గాని మా బీదతనం నా గుండె పగిల్చి నాకు చిన్ననాడే చావుతెచ్చిఉండును. ఒకనాడు శకుంతల బొమ్మ నాతో పెదవులు కదిపి "చెల్లీ" అని పిలచినట్లయింది. నాకు కన్నీరు బొటబొట కారాయి. అవి తుడుచుకొంటూంటే మీ నాన్నగారు వచ్చి "అమ్మాయీ వెంకటరత్నం! నువ్వు మా యింటిలో వుండిపో. మా హేమతోపాటే నువ్వు. తల్లీ, నా మాట విను. మీ పిన్నీ, నేనూ ఈ విషయం ఎన్నిసార్లో అనుకున్నాం. మాకు ఒక్క హేమే కదా! మా దేవత శకుంతల వెళ్ళిపోయింది కదా! మేం ఇద్దరం పెద్దవాళ్ళ మవుతున్నాము. మా హేమ ఒంటరి అయిపోయింది కదా! నువ్వు మా అమ్మాయివి కావూ?" అన్నారు. పిన్ని దగ్గరకు బాబాయిగారు తీసుకువెడితే, ఆమె కళ్ళనీళ్ళతో నన్ను బ్రతిమాలింది. హేమా! అప్పుడు నువ్వూ నన్ను ఎంత బ్రతిమాలినావో, నువ్వు మరిచిపోయి ఉంటావు. అంత ఉత్తమ కుటుంబం మీది. ఆనాటినుంచీ మీ అందరి ప్రేమసముద్రాలలో నేను మునిగిపోయాను!" అని లోకేశ్వరి ఊరుకుంది.
హేమ : "లోకం, నువ్వు నా చిన్నక్కవే. నాకు మా అక్కపోయిన లోటు ఏమీలేకుండా నీ ప్రేమతో ముంచావు. డబ్బు ప్రేమను కొనగలదా లోకం! అదృష్టం ఉన్నవారికే అది ప్రాప్తం!"
హేమ అతిదుఃఖముతో కరిగిపోయింది. లోకేశ్వరి హేమను అతి గాఢంగా తన హృదయానికి అదుముకుంది. ఆ సాయంకాలం శ్రీనాధమూర్తి కొల్లిపర వెళ్ళిపోయినాడని రంగనాయకమ్మత్తగారు ఇంటికివచ్చి చెప్పారు. హేమ చల్లగా తోటలోకి జారి ఆ పూలచెట్లమధ్య కూర్చొని కుంగిపోయింది. ఇంతలో లోకేశ్వరి నిశాపతి దగ్గరనుంచి వచ్చిన టెలిగ్రాం అక్కడకు పట్టుకువచ్చింది. సోఫీ తన కారు దిగి "హేమా" అంటూ తోటలోకి పరుగెత్తుకు వచ్చింది. 39
సోఫీ హేమ దగ్గరకు పరుగెత్తింది. ఈమధ్య సోఫీ హేమగారింటికి ఎక్కువగా రాలేదు. దానికి కారణం తానీ వేసవికాలం తండ్రిగారితో కలిసి ఇంగ్లండు వెడదామని; ఆ సందర్భంలో యేర్పాట్లు చేయడానికి తానూ తన తండ్రీ ప్రభుత్వాజ్ఞలు మొదలయిన వాటికోసం ఉత్తరాలు వ్రాయడం, దరఖాస్తులు పెట్టటం వగైరాలలో ఉన్నామనీ, అవి వచ్చాయనీ, ఇంతట్లో లోకేశ్వరికి పెళ్ళి అనే సంగతి తెలిసిందనీ, పైగా తాము ఆఫ్రికామీదుగా వెళ్ళవలసివస్తుందని తెలిసిందనీ, అలా వెళ్ళడం కూడా ప్రమాదకరం అని ప్రభుత్వంవారు తెలిపారనీ,ఆ కారణాలచేత ప్రయాణం ఆపేశామనీ; వేసవికాలంలో ఊటీలో గడుపుతామనీ హేమతో చెప్పి హేమను గట్టిగా కౌగలించుకొని, "హేమ్, ఏమిటే అల్లా దిగులుపడి ఉన్నావు?" అని ప్రశ్నించింది.
హేమ : సోఫీ, నీకన్ని సంగతులు లోకం చెప్తుందిలే!
లోకేశ్వరి మొదటినుంచి చివరదాకా జరిగిన విషయాలన్నీ చెప్పింది సోఫీకి.
సోఫీ : నేను తీర్ధమిత్రున్ని ఎప్పుడూ మంచివాడనుకోలేదు. కానీ మన మనస్సు నిర్మలంగా వుంటే వేయి తీర్ధమిత్రుల్లు మన్నేం చేస్తారే? లోకం : తీర్ధమిత్రుడంటే హేమకు లెక్కలేదు. తానేదో తప్పు చేశానని కుళ్ళిపోతోంది.
సోఫీ : ఒసే హేమా! నీ ఇల్లు బంగారంకానూ. నువ్వు కుల్లడం ఎందుకు? నువ్వేమన్నా స్త్రీ పురుష సంబంధ విషయంలో తొందరపడ్డావు కనకనా? మీ హిందువుల్లో ఈ రోజున పెళ్ళి కాకుండా ఎదిగున్న పిల్లలుండటం తటస్థించింది. మా ఇంగ్లీషు వాళ్ళలో అనాదినుంచీ గొడవలు ఇవేగా! మా ఆంగ్ల బాలికలు ఎన్ని తప్పులో చేసి దిద్దుకుంటూ ఉంటారు. ఒకప్పుడు దిద్దుకోలేక కుళ్ళిపోతారు. ప్రతిజాతికీ, ప్రతిదేశానీకి ఈ సమస్యలు అనేక రకాలుగా వస్తూనే వుంటాయి. అందుకు నీకీ బెంగెందుకే హేమా?
లోకం : మనుష్యునీ జీవితం ఆనందమయంగా ఎప్పుడై నా ఒక పది నిమిషాలపాటో, పదిరోజులపాటో వుంటే వుండవచ్చునేమో? ఆ తర్వాత విచారంలో, ఆవేదనలలో పడిపోతాము. వెలుగునీడలే జీవితం కెరటాలూ, లోతులూ?
హేమ: ఏదో టెలిగ్రాం వచ్చిందేమిటి నీకు?
లోకం : నిశాపతిగారు రేపు సాయంకాలం గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ కు వస్తారట.
హేమ : అప్పుడే నిశాపతి గారయ్యాడూ నీకూ? (చిరునవ్వు నవ్వింది)
లోకం : (నవ్వుతూ, సిగ్గుపడుతూ) నిశాపతీ అని పిలవనా?
సోఫీ : మా వాళ్ళలో మొదట మిస్టర్, తర్వాత ఇంటిపేరు మాత్రం తర్వాత అసలు పేరు. పెళ్ళయితే ఒరే! ఒసే!
హేమ : అదీ ఒక అందమే!
లోకం : సోఫీ, రేపు హేమ త్యాగతిని బావా అనే పిలుస్తూ ఉంటుంది కాబోలు!
సోఫీ : ఒరే బావా! అని అంటూ వుంటే బాగా వుంటుంది.
ఇంతట్లో హేమ స్నేహితురాలూ, యింకా కళాశాలలో చదువుకుంటున్న సీతాకుమారి "తోడి దొంగలందరూ చేరారూ?" అంటూ వచ్చింది.
సోఫీ : సీతా! బొత్తిగా కనపడ్డం మానేశావేమిటే?
సీత : పరీక్షల గొడవల్లో పడ్డానా? అవి అయ్యాయి. ఆ తర్వాత, ఒక విషయం కొంచెం మార్కులు తక్కువగా వస్తాయన్న భయంవేసి నాన్నతో చెప్పాను. అందుకు తగిన ఏర్పాట్లు చేశారులే మా నాన్నగారు.
లోకం : బి.ఏ. పరీక్షలిచ్చి కూడా మార్కుల గొడవేంటే?
సోఫీ : వీళ్ళంతా మార్క్సిస్టులే లోకం.
అందరూ పకపక నవ్వారు, హేమ చిరునవ్వు నవ్వింది.
సీత : ఒసే హేమా! కల్పమూర్తిగారి రాయబారం విషయం విన్నావా?
లోకం : ఏదో నేను విన్నానే, తమ అందాలరాణిని అతడు గ్రహించాలని తమ తండ్రిగారికి రాయబారం పంపారనీ, తమ తండ్రి అయిన అడ్వకేటు గారు, బి.ఏ. పరీక్షకు వెళ్ళిన సీతాకుమారి నేమిటి? స్కూలు ఫైనలు నెగ్గలేని కల్పమూర్తి వివాహం వాంఛించడ మేమిటి? అని ఆశ్చర్యం పొందారనీ.
సోఫీ : కల్పమూర్తి సుగుణాలప్రోగే. అత్యంత సుందరాకారుడు. నేను హిందూబాలికనైతే అతన్ని ఎగనెత్తుకుపోయి ఉందును.
లోకే : ఒసే సీతా! కల్పమూర్తి కేమిటే? మొన్న హేమ కల్పమూర్తిని అమెరికాకుపోయి ఏ వ్యవసాయంలోనో, ఏ వ్యాయామంలోనో ఒక డిగ్రీ వేసుకురావోయి అంది. కల్పమూర్తి ఉబలాటపడ్డాడు. వాళ్ళమ్మ ఒప్పుకుంటేనా? అదీకాక బరోడా మహారాజు అతని టెన్నిస్, క్రికెట్టు ఆటలు చూసి, తన సంస్థానంలో స్కౌటు అసిస్టెంటు కమీషనర్ ఉద్యోగం ఇస్తామని రమ్మన్నారు. అది ఎరగవు కాబోలు. ఆ తర్వాత మొన్న వారి అంతరంగిక కార్యదర్శి కల్పమూర్తికి ఉత్తరం రాశాడు. నేను ఒప్పుకో నాయనా అంటే, త్యాగతి దగ్గరకు సలహాకు పోయాడు. త్యాగతి జాతీయ వాదీ; గర్భగాందేయుడు! అతడు నీకెందుకయ్యా ఉద్యోగం? అన్నాడట. మొగం ఇంత చేసుకొని వచ్చాడు?
సోఫీ : త్యాగతి ఎప్పుడూ అంతేలెద్దూ. కల్పమూర్తికి ఇష్టం లేని సలహా ఎందుకు?
సీత : ఎప్పుడూ చదువేనా ఏమిటి? మనిషియొక్క ఉచ్చనీచాలు నిర్ణయించేది?
సోఫీ : ఓహో! సీతకు కల్పమూర్తి__
సీత : ఛట్, ఊరుకో సోఫీ,
లోకే : నీ ఉద్దేశం మా దగ్గిర దాచడమెందుకే? అయినా ఇప్పుడు మించిపొయిందేమిటి? ఆయన బరోడా ఉద్యోగం ఒప్పుకావచ్చును.
సీత : నిన్న త్యాగతిగారు మా నాన్నగారితో మాట్లాడారట. బరోడా ఉద్యోగం ఒప్పుకోమనే అందరూ నిశ్చయించారట.
సోఫీ : చాలాబాగుంది. ఇవాళ అన్నీ శుభవార్తలే.
లోకే : కల్పమూర్తి ప్రియురాలా! సం-కల్పమూర్తి ఇల్లాలా?
టెన్నిస్ బాటు చేతబట్టి ఠీవిగా పోయేటి, కల్పమూర్తి ప్రియురాలా,
సం-కల్పమూర్తి ఇల్లాలా!
తోటంతా గంతువేసి దొడ్డంతా దొర్లివేసి
మాటలతో భర్తగార్ని మరిపించే మురిపించే
కల్పమూర్తి ప్రియురాలా! సం-కల్పమూర్తి ఇల్లాలా!
అందరూ చప్పట్లు కొట్టారు. సీతాకుమారి వచ్చి "ఒన్స్ మోర్" అన్నది.
సోఫీ : మొగుడిమీద పాట__మళ్ళీ వినాలని కాబోలు 'ఒన్స్ మోర్' అంటోంది.
హేమ చిరునవ్వు నవ్వుతూ "లోకం! నిశాపతి ఎక్కడ మకాం?" అని అడిగింది. "ఉడ్ లాండ్స్ లో ఉంటాను అని కూడా ఈ టెలిగ్రాం లోనే ఉందే" అని సోఫీ టెలిగ్రాం కాగితం చూస్తూ అన్నది.
సోఫీ : ఇంతకూ తీర్ధమిత్రుడి పెళ్ళానికి ఎల్లావుందే లోకం? లోకం : సాయంకాలం అతడు నేను జనరల్ ఆస్పత్రిలో ఉండగానే వచ్చాడు. భార్యను జూచి జరిగిందంతా చెప్పాడు. హేమ మహోత్తమ బాలిక అని కళ్ళనీళ్ళు కారిపోతుండగా భార్యతో గోలపెట్టాడు. ఆ అమ్మాయి తేరుకుంది. కాల్పులు త్వరలోనే మాన్తాయనీ, ఆవిడకు షాక్ తగ్గి సాధారణ స్థితిలోకి వచ్చిందనీ, వారం రోజులలో ఆమె ఇంటికి వెళ్ళవచ్చుననీ డాక్టరుగారు చెప్పారు. అమ్మయ్యా అని వచ్చేశాను.
సీత : ఒసే లోకం, నాకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు. నేను పురుషున్ని మాత్రం వాంఛించా, అతడు ఇల్లా ఉండాలి అల్లా వుండాలి అని కలలుకంటూ ఉండేదాన్ని. ఆ కలలే నాకు ఆనందం ఇచ్చేవి. పురుషున్ని వాంఛిస్తానుగాని హేమా! ఫలానా పురుషుడనిలేదు నాకు. నచ్చిన భర్త వస్తే, అతన్ని ఆనందంలో ముంచగలను, నేను కావలైస్నంత ఆనందం పొందగలను.
సోఫీ : భేష్! నాకు నువ్వు బాగా నచ్చావే!
హేమ : ప్రేమ అనే భావం కొంతమందికి ఇష్టం! దానికోసం ప్రాకులాడుతారు. ప్రాణం ధారపోస్తారు. ప్రేమ అనేది విషం! ఎందుకంటే ఎక్కువైతే ప్రాణం తీస్తుంది.
విషము: అలాగే ప్రేమ ఎక్కువైతే ప్రాణికి విషమే!
సీత : ఇవాళ హేమ వేదాంతం మాట్లాడుతోందేమిటి?
సోఫీ : అమ్మాయిగారి హంగామా చూసి, నాయకుడు హడలి బేజారై పారిపోయాడు.
హేమ : సోఫీ!
సోఫీ : ఏం నిజం చెబితే నిష్టురమటే! నీలో ఏ మాత్రమన్నా గౌరవం ఉంటే, నీలో త్యాగతి అంటే నిజమైన ప్రేమ ఉంటే, వెళ్ళి అతని కాళ్ళమీద పడు.
లోకే : ఛీ, నీ మాటలూ నువ్వూనూ! హేమ తెలివితక్కువది కావచ్చుగాని, హీనురాలు మాత్రం కాదు.
సోఫీ : ఇందులో హీనత్వం మాట ఎక్కడ వచ్చిందే! నేనే హేమనైతే నా ప్రేమే నాకు సర్వస్వమూ! నా జీవితం అంతా ఆ ప్రేమలోనే ఆనందమాయం చేసుకుంటాను. ఆ ఆనందం నాకు బలం కాగా లోకంలో నేను ఆడవలసిన పాత్రధారణచేసి, లోకోద్దరణ మహాసౌధ నిర్మాణం కోసం నా పరికరాలు సిద్దం చేసికొంటాను.
సీత : నాకు మీరు మాట్లాడేదేమీ అర్ధం కావటంలేదు.
లోకే : ఒసే సీతా! నీవు గృహిణివి, భార్యవు, ఇల్లాలివీ! నీ భర్త రాక్షసుడు కాకపోతే నీ జీవితం హైరోడ్డులా వెళ్ళిపోతుంది. కానీ అందరు స్త్రీలూ అల్లా ఉంటారంటే!
సీత : అర్ధం చెప్పవే అంటే కేంబ్రిడ్జి డిక్షనరీ అంతా చదువుతా వేమిటి!
లోకే : నీ మాట ముందు చూద్దూ. కల్పమూర్తి విషయం నువ్వేమంటావు? సోఫీ : అది సిగ్గుపడుతోంది! ఊరికే దాన్ని వేపుకుతింటావేం? నువ్వు నిశారాణివి గనక, వెన్నెల కుమారివి అవుతున్నావుగా, కొండెక్కి కూర్చుంటావు. నీకేం! సీతా చెప్పవే?
సీత : అద్గదీ! ఇందాకటినుంచీ మహావాగుతోంది! ఓ నిశారాణీ! నీకు జోహారులమ్మా! "వచ్చాడే మా బావా ఢిల్లీ నుంచీ, కల్లోనుంచీ నల్లనిరూపం నాలుగు కాళ్ళతో వచ్చాడే మా బావా!"
లోకేశ్వరి సీతాకుమారిని కొట్టబోతే సీత పక పక నవ్వుతూ తోటలోకి పరుగెత్తింది. 40
భోజనం చేసిన తర్వాత హేమకుసుమ తోటలోనికి పోయి అక్కడ సేవకుడు వేసిన పడకకుర్చీ పై పడుకొన్నది. సోఫీ, సీతాకుమారీ వెళ్ళిపోయారు. పది రోజులకన్న ఎక్కువ కాలం మనస్సు ఏ పనిమీదా లగ్నం కాదు. స్థానం తప్పిన తార అనంతపధంలో ఏ గతుల సంచరిస్తుందో ఎవరికెరుక? చంద్రుడు ఈ చతుర్దశినాడు పంచదశ కళానిదియై అమృతమూర్తయి వెన్నెల కరుళ్ళు హేమ హృదయంలోనికి ప్రవహింపచేస్తున్నా, ఆమె వేదనాగ్ని ఆ వెన్నెల ప్రవాహాలనే ఆహుతి కొంటున్నది.
చంద్రుడు అమృతమూర్తి! ప్రేమనిధి! కళాపూర్ణుడు! కళావేత్తలకు ఆ మూర్తిలోనుంచే మహాప్రజ్ఞ ప్రవహించి వస్తుంది. ఆ బింబంలోంచి అనిర్వచనీయమైన కాంక్ష మహావేగంతో వెడలివచ్చి ప్రేమికుల బ్రతుకంతా నింపుతుంది. చంద్రుడు సౌందర్యమూర్తి. అతని ప్రియురాలు చంద్రిక సౌందర్యమూర్తి. సౌందర్యారాధనకు ఫలము ప్రేమ. ప్రేమకుసిద్ది ప్రియసంగమము. ఆ సంగమంలో శిఖరితస్థితి ప్రతివారి జీవితంలో ఒక్కసారే వస్తుంది. అప్పుడు ఆ దంపతుల బ్రహ్మానందస్థితి ఒక్క నిమేషమాత్రం పొందగలరు. ఆ క్షణం అనంతమైన శాశ్వతమౌతుంది. కాని, ఆ సంగమానికి పునాది, స్త్రీ పురుష లిరువురూ దైహిక మానసిక ఆత్మ సౌందర్యాలలో ఉన్నతులు కావాలి. ఆ మూడూ ఒక్కొక్కరిలో దివ్యశ్రుతి స్వరూపమైన రాగమౌతుంది. ఒకరి ప్రేమ రెండవవారికి మూర్చన అవుతుంది; రాగతాళ యుక్త కీర్తనలో అంతర్గతమైన రెండు వేగాలూ అప్పుడు సంగమించి చంద్రబింబ మధ్యస్థామృత భిందుసిద్ధినిపొందుతాయి. ప్రేమయొక్కపరమ స్వచ్చభావం లలితకళ. ఆ లలితకళా యోగానికి సిద్ది ప్రియసంగమం. అందుకనే లక్ష్మీనారాయస్థితి హృదయంలో, శివపార్వతీస్థితి దేహంలో, వాణీభాత్రుస్థితి వాక్కులో, చంద్రచంద్రికాస్థితి సర్వంలో మూర్తీభవించి ప్రేమ తపస్వీతస్వీనులకు ప్రత్యక్షమవుతాయి. ప్రాణమూర్తి సూర్యుడు. సూర్యకళ అతని బిడ్డ. కాంతిరహితుడై స్థాణువైన చంద్రుని బ్రతుకులో ఆ బాల అతని ప్రియురాలైలయిస్తుంధి. అప్పుడు వారిరువురి సంగమానందంలోంచి అతడు సుధామూర్తిగా, ఆమె చంద్రికగా ప్రత్యక్షం అవుతారు...ఈ నిత్యశృంగారకావ్యము ప్రతినెలా విశ్వానందంకోసం ప్రదర్శింపబడుతోంది. ఈ నాయికా నాయకుల స్థాయీ భావంలోంచి, లోకానందమూర్తులు శశికళలు ఉద్భవించి భూమిలోని ప్రేమికులను కలతపెట్టి ప్రేమ తపోదీక్ష వారికి వరమిస్తారు. ఆ దీక్షలో జగజ్జీవుల వ్రున్గార నాటకాలు ప్రారంభం.
ఈ శృంగారాలకు ఉపాంగాలు మానవుల ఇతర ప్రయత్నాలు. ఒక జీవి బ్రతుకుకు ఆశించడం ఆ జీవి ముఖ్యదీక్ష. కానీ అది స్వలాభ స్వరూపమే అవుతుంది. ఆ బ్రతుకుకోసం....ఆహారం, నిద్ర రక్షణలు. అవే ఆర్ధిక, రాజకీయ పారిశ్రామిక సమస్యలయ్యాయి. ఇవి ప్రతీజీవికీ వ్యక్తిగతమైనవి. ఇన్ని ప్రయత్నాలు చేసి, ఇన్ని కష్టాలకు పాలవుతూ, ఓడిపోతూ, నెగ్గుతూ ప్రయాణం చేసిన జీవికి చివరకు చావు తప్పదు. కాబట్టి ఆర్దికాది సమస్యలు రెండవ రకమే అయ్యాయి. ముఖ్య సమస్య జీవికి శాశ్వతత్వం అనుగ్రహించే మిధునత్వం. సంగమం వల్ల జాతి జీవిస్తుంది. జాత్యభివృద్ధి అమృతత్వం అవుతుంది. అందుకని స్త్రీలకు పురుష వాంఛ పురుషులకు స్త్రీ వాంఛ అనే మిధునభావం....అత్యంత ప్రాముఖ్యమైన సమస్య అయింది. అదే శృంగారం! అందుకై సౌందర్యారాధన లలితకళా రూపం. సౌందర్యార్చన భావం వాణీ బ్రహ్మలు, స్త్రీ పురుష ప్రేమభావం లక్ష్మీనారాయణులు, వారి రతిభావం అర్ధనారీశ్వరులు. అంతతో కుమారాజననం. అది జాతివృద్దిభావం. ఇంతవరకు శివుడు మృత్యువు మహాకాళుడున్నూ, పార్వతి మహాకాళీ. ఇప్పుడే శివుడు మృత్యుంజయుడు; మహాకాళి అమృతమూర్తిమైన లలిత.
ఇంతవరకు మధురంగా పొంగిపోతూ హేమ ఆలోచనలు ఉప్పొంగాయి. ఆ బాలిక అప్పుడు ఆ ఆలోచనాభారం భరించలేక ఒక్క గంతున కుర్చీనుంచి లేచి, తోటంతా గబగబా తిరిగింది. తనకు చంద్రస్పర్స ఎక్కువై మతిపోయిందేమో? ఈ పిచ్చి ఆలోచనలు వచ్చాయేమిటి? ఈ ఆలోచన లిట్లా రావడం మూర్తి బావ కళావేదాంత బోధ! ఈలాంటి వెఱ్ఱి వేదాంతాలు నూరిపోసేవాడేమిటీ తనకు? అతడు తనకు చంద్రుడా? తా నాతని చంద్రికా? అయితే అక్క ఎవరు? అక్కా అతనూ ఎంత ప్రేమించుకొనేవారో అతడువ్రాసి తనకిచ్చిన అతనిస్వీయచరిత్రలో స్పష్టం చేశాడు. తన అక్కను అణువణువు అతడు ప్రేమించాడు, పూజించాడు. ఓహో! ఆ ప్రకరణము చదువుతోంటే తాను ఏ లోకాలకో తేలిపోయింది.
నిజమైన ప్రేమ ఒక్కసారి వస్తుందనుకుంటాను పురుషుని జీవితంలో, స్త్రీ జీవితంలోనూ! అలా కాకపోతే ఏదో జన్మలోన్నా వస్తుంది. అలా వచ్చిన వెనుక మరొక పురుషుడు స్త్రీకిగాని, మరొక స్త్రీ పురుషునికి గాని ప్రేమ నిదానాలు కాజాలదు. ప్రపంచంలో ఒక్కటే యమునాగంగా సంగమం. అది శాశ్వతం కూడా ఇప్పటికి నేను నా బావను ప్రేమిస్తున్నాను అనే విషయం నిశ్చయం అయింది. నా బావ నన్ను ప్రేమించలేకపోతే నా ప్రాణాలు మరుసటి ముహూర్తంలో పోవడం నిశ్చయం. నా బాల్య క్రీడా కాలం దాటింది. నేనిపుడు సంపూర్ణ స్త్రీని, ప్రేమపుంజాన్ని. నా ప్రేమచే జగమెల్ల పులకింతు అని కాకలీస్వనాలతో మాటాడుతూ తోటంతా మతిలేని దానిలా హేమసుందరి తిరిగింది. తన బావ తన స్వామిగాకుండా ఎలా మనగలదు? తన బావ తనలో తన అక్కను చూచాడు. మా అక్క మాటియ్యండి, నేనే హేమను, హేమే నేను!" అని అన్నట్లు తన బావకు తట్టినట్లు రాశాడు కూడా! ఏదో పరమ రహస్యం ఈ ప్రేమలో ఉన్నది. తాను చేసిన తెలివి తక్కువ పనివల్ల బావకు కోపం వచ్చి వెళ్ళిపోయాడా? తన శీలం శంకించాడా? ఈ రహస్యమూ తాను తేల్చుకుంటుంది. అయితే బావ ప్రేమను సాధించడం? ఆ ప్రేమబలంలో తానూ తన బావా ఈ లోక కళ్యాణం కోసం తమ సర్వస్వమూ అర్పించి దేశసేవ, మానవ సేవ చేస్తారు గాక. తానూ మహాత్మాగాంధీగారి కడకు పోయి, దేశ సేవ రహస్యం తెలుపుకుంటుంది. తాను సమస్త దేశాలూ పోయి నిజమైన ప్రజాపాలన, నిజమైన ఆర్ధిక సమత్వ రహస్యాలు నేర్చుకుంటుంది. ఈ రెండు పవిత్ర ధర్మాలు ఎక్కడా ప్రయాగ అవుతాయో ప్రయాణించి పరిశోధించి ఆ ప్రదేశం తెలుసుకుంటుంది. స్త్రీల హక్కులూ, స్త్రీ ధర్మాలూ, బాధ్యతలూ సంపూర్ణంగా దేశానికి తగినట్లు నిర్ణయించుకొని తన స్నేహితురాండ్రతో కలిసి తా నా పనినే తపస్సు చేసుకుంటుంది.
ఈ లోగా తన బావ దగ్గరకు తానే వెడుతుంది. పూర్వకాలపు నాయికలా తాను నాయకుడి కోసం ఎదురు చూస్తూ, కుళ్ళిపోతూ విరహతాపం పడుతూ ఉండదలచుకోలేదు. హేమకు ఏదో ఆనందం కలిగింది. ఆ తోటలో ఉన్న పూలచెట్లపై వంగి ఆ పరిమళాలన్నీ ఆఘ్రాణించింది. తలెత్తీ.
"ప్రేమదేవుడ వీవు చంద్రా కామదేవుని మేనమామవు! చంద్రికకు ఆత్మేశ్వరుడవు నేను చంద్రిక వీవు చంద్రుడు"
అని పాడుకుని ఆ వెన్నెలను పెదవులతో చుంబించి లోనికి పరుగెత్తింది. తండ్రిగారి దగ్గరకు పోయి, ఆయన మోమును తన రెండు హస్తాలతో పుణికి, చెంపలు పట్టి మోము తనవైపు తిపుకొని "నాన్నగారూ..." అని పిలిచింది.
"ఏమిటి తల్లీ?" అని ఆయన ప్రశ్నించారు.
"నాన్నగారూ! నేను బావను తప్ప ఎవ్వరినీ పెళ్ళిచేసుకోదలచుకొలేదు. బావ నన్ను చేసుకోకపోతే..." "ఆఁ ! ఆఁ! అంతటితో ఆపు. సరే బావనే చేసుకో తల్లీ! నేను వద్దంటానా." అన్నారాయన. ఆయన హృదయం ఆనందంతో పొంగిపోయింది. పైకి ఏమీ తేల్చని ముఖంపెట్టి "ఆత డేమంటాడో?" అన్నారు.
"ఏమంటాడూ..."
"అదేమిటో 'డూడీ, అని అంటావు అతన్ని!"
"పెళ్ళయిన దాకా నా యిష్టం? నేను ఎల్లుండి ఉదయమే అత్తగారిని తీసుకొని కొల్లిపర వెడ్తాను. ఉదయం పూర్ణిమయినా నా నక్షత్రం పునర్వసుకు స్వాతి పరమ మైత్ర తార! బావే ఒకనాడు నాతో జ్యోతిష్యాన్ని గూర్చి మాట్లాడుతూ ప్రేమయాత్రికులకు పూర్ణిమ ఉత్తమోత్తమ దినమన్నాడు." భరత వాక్యం 1
మంగళ గీతం
నేనూ మా రంగనాయకమ్మ అత్తగారూ గ్రాండు ట్రంకు ఎక్స్ ప్రెస్ లో ఆడవాళ్ళ రెండవ తరగతి ఎక్కాము. దారిలో కాలం వెళ్ళబుచ్చడానికి అనేక ఇంగ్లీషు నవలలు, ఇంగ్లీషు మాసపత్రికలు కొన్నాను. మా అత్తయ్యగారు చదువుకునేందుకు కొన్ని వేదాంత గ్రంధాలు తెచ్చుకున్నారు. తెల్లవారగట్లనే వంటయిపోవడంవల్ల మేము భోజనం చేసి రైలెక్కినాము. మధ్యాహ్నానానికి టిఫిన్ కారియరునిండా మా అమ్మ ఏవో పెట్టించింది. రైలు కాఫీహోటలు కూడా ఉండనే ఉంటుందాయను.
సాయంకాలం నాలుగున్నరకు తెనాలి చేరుకునేసరికి పదిరోజులు పట్టినట్లే ఉంది నాకు. ప్రేమ అంటే ఇట్లాగే ఉంటుంది కాబోలు! మా బావ నాకు కనబడతాడా? మా బావ నన్ను చూస్తాడా? మా బావ, అయిదడుగుల తొమ్మిదంగుళాల మనిషి. యోగమూ, ఆరోగ్యమూ, ఉత్తమ జ్ఞానమూ అతని విశాలఫాలంలో, వెడదరొమ్ములో, ఏనుగు కుంభ స్థలాల లాంటి భుజస్కంధంలో, కండలుకట్టి, నునుపులుతేరి, అతని అందమైన చేతుల్లో పొడుగాటి వేళ్ళల్లో గోమూర్ధకటిలో చంద్రబింబంలోని వెన్నెలలా, బంగారంలోని కాంతిలా, తామరపూవులోని మసృణత్వంలా, మరువపు మొక్కల పరిమళంలా చుట్టూ ప్రసరిస్తూ ఉంటాయి. ఎంత తీయని, గంభీరమైన మంద్రపు కంఠ మాతనిది.
అతని ప్రేమ గంగాఝరి కాగలదు. అతని ప్రణయము నిశ్చలతచే లోనికి చొచ్చుకొని వెళ్ళే హిమాలయ శిఖరంలా స్వచ్చమై, దివ్యోన్నత రూపమై, నిత్యమై ఉండగలదు. అతని కామం కాళిదాసకవితవలె దివ్యా నంద పూరితంకాగలదు. అతనిపూజ నిత్యనీల నిర్మలాకాశ పఠాత్మికమై ప్రసరించగలదు. అతడు మోహనమూర్తయై తల్పంమీద కూర్చుని ఉంటే__నేను అతని పాదాలకడ మోకరించి! అతని కళ్ళల్లోకి చూస్తూ, అతని రెండు చేతులూ నా హృదయానికి అదుముకుని, నాజీవిత సర్వస్వమూ నిండిఉన్న ప్రేమను ప్రేమగీతిగా మలచుకొని దివ్యలయగా నా బ్రతుకు స్వనిస్తూ ఉంటే, వినిపిస్తాను. అతడు నా చేతులు రెండూ తీసుకొని తన హృదయానీకి అదుముకుంటాడు. అప్పుడాతని అనన్య ప్రేమ విశ్వకృతిలో స్పందిస్తూ ఉంటే నే నా శ్రుతిలో లీనమైపోతాను! అతని ప్రేమ ఆనంద రాత్రియగు అమృతమేకాదు, నా జీవితానికి మహత్తరశక్తి ప్రసాదించి, నేను నిజమైన స్త్రీనై, సర్వమానవకోటికీ సేవచేయగలదాసినై, సర్వశిశులోకానికీ సేవచేయ గల మాతనై, సర్వ మహిళా మండలానికి సేవచేసే భక్తురాలనై, సర్వ పురుషజాతికీ సేవచేసే సోదరినై, నా భర్తకు, నా పురుషునకు, నా ప్రియునకు, నా స్వామికి అర్ధదేహినై, స్త్రీనై, ప్రియురాలినై అతని ప్రేమ సముద్రం తరిస్తూ, నా ప్రేమసముద్రంలో అతన్ని తరింపజేస్తూ ఓలలాడింప జేయగలను. ఇద్దరం ఒక మహాచరిత్ర రచిస్తాం.
ఈలా ఆలోచించుకుంటూ, ఒకమాటు రైలువేగం గమనిస్తూ, ఆ గంటలన్నీ అతి నెమ్మదిగా ప్రవహిస్తోంటే మతిలేకుండా పుస్తకాలు తిరగ వేస్తూ, మా బావను భావించుకుంటూ, కాంక్షిస్తూ రాబోయే మా దాంపత్యాన్ని ఎదుట ప్రత్యక్షం చేసుకుంటూ, ప్రయాణం ఎలాగో__ఎలాగో చేశాను.
రైలుదిగిన వెంటనే తెనాలిలో శ్రీనాథమూర్తి బావచుట్టాల ఇంటికి వెళ్ళాం. అక్కడ స్నానం చేశాము. వారు పెట్టిన ఫలహారాదులు నోటవేసుకున్నాము. నాజుట్టుపొగవేసి ఆరవేసుకొన్నాను. ఆరగానే వదులుజడవేసు కొన్నాను. పువ్వులు తెప్పించుకొని అలంకరించుకొన్నాను. పొందూరు ఖద్దరు చీర ఖాదీ దుకాణంనుంచి తెప్పించుకొని ధరించాను. సాయంకాలం ఏడుగంటలకు మావాళ్ళు కుదిర్చిన టాక్సీ వచ్చింది. ఆ కారులో కొల్లిపర ప్రయాణంచేసి రాత్రి ఎనిమిదింటికి చేరాము. మాతో మా చుట్టాల వారి అబ్బాయి, అతనిభార్య, చిన్నబిడ్డడూ, మా రంగనాయకమ్మత్తగారి ప్రోత్సాహం వల్ల కొల్లిపర వచ్చారు.
మా బావగారి ఇంటిదగ్గర దిగాము. నాకేదో సిగ్గు అలుముకుపోయింది. ఆ ఇల్లు నేను చిన్నతనంలో చూచినా, అంతా కొత్తగా ఉంది. నాలో ఏదో కొత్తదనం ఆవహించినట్లయింది.
మా బావ ఇంట్లోలేడు. అతడు గుమ్మం దగ్గరకు, మమ్ము లోపలికి ఆహ్వానిస్తూ రాలేదని గుండె గబుక్కుమన్నది. కాని అదీ మంచిదే అనుకున్నాను.
"అబ్బాయిగోరు యినాయికరావుగారి తోటలోకి ఎళ్ళారండీ" అని ఎవరో చెప్పారు. ఇల్లంతా గడబిడగా ఉంది. భట్టిప్రోలు నుంచి శ్రీనాథ మూర్తి బావ మేనమామ కొడుకు సుబ్రహ్మణ్యమూ, అతని భార్యా వచ్చారట. మా బావగారి ఇద్దరు అప్పగార్లూ, బిడ్డలూ ఇంటినిండాకళకళ లాడుతూ ఉన్నారు. యిల్లంతా పెళ్ళివా రిల్లులా ఉంది.
నేనూ, రంగనాయకమ్మత్తయ్యా కారు దిగగానే వెంకటరంగమ్మ వదినగారూ, అలివేలూ వదినగారూ "అమ్మ వచ్చిం" దంటూ పరుగుల్లో వచ్చారు. నన్ను చూచి "శకుంతలా! అని తెల్లపోయారు. రంగనాయకమ్మత్తయ్య "శకుంతల చెల్లెలు హేమను ఎరుగరటర్రా!" అన్నారు. వాళ్ళిద్దరూ నన్ను కౌగలించుకొని ఎన్నో ప్రశ్నల వర్షాలు కురిపించారు. "ఎప్పుడో చిన్నతనంలో చూచాను. అచ్చంగా శకుంతలే! అమ్మా! నువ్వూ తమ్ముడూ చెన్నపట్నంలో కాపురం పెట్టిన తర్వాత, ఒక్కసారైనా మమ్మల్నక్కడకు తీసికెడ్తేనా?" అంటూ వాళ్ళిద్దరూ ఏవేవో అన్నారు. పిల్లలందరూ "అమ్మమ్మా!" అంటూ మా రంగనాయకమ్మత్తమీదకు ఎగబడ్డారు. ఆవిడ తెనాలిలో కొని తెప్పించిన పూలు, మిఠాయి పొట్లాలూ, నేను తెప్పించిన బిస్కట్టు డబ్బాలూ, బొమ్మలూ, పిప్పరుమెంటు బిళ్ళల డబ్బాలు పిల్లలందరికీ పంచి యిచ్చారు.
"అమ్మా, హేమా వచ్చారని తమున్ని తీసుకురారా సుబ్బులూ!" అని అలివేలు వదినగారూ సుబ్రహ్మణ్యంగారితో చెప్పి పంపిస్తోంది. ఆ మాటలు వింటూ ఏదో భయంతో వణికిపోయాను.
రంగనాయకమ్మత్తగారు "హేమకు మేడమీద గది ఒకటి ఇవ్వండర్రా!" అంది. అలివేలు వదినగారు "సుబ్బులూ నీ గది పక్కగదిలో హేమ సామాను పెట్టించరా" అని చెప్పింది.
న అసామాను మేడమీదికి తీసుకుపోయి మేడమీద గదిలో పెట్టారు. అక్కడా జిడ్డుదీపం వెలుగుతోంది. నేను ఒక్కదాన్నీ ఆ గదిలో ఎలా ఉంటాను గనుక. శారద అనే మా బావ రెండో మేనకోడలికీ, నాకూ ఆ గది ఏర్పాటయింది. శారదకు ఇరవై ఏళ్లు ఉంటాయి. నాకన్నా ఏడాది పెద్దదనుకుంటాను. ఇంతవరకు పిల్లలెవరూ లేరు. అనేకమంది దేవుళ్లకు మొక్కుతున్నారు. పూజలు, వ్రతాలు, జపాలు చేయిస్తున్నారట. కానీ ఏమీ లాభంలేకపోయింది. ఆ అమ్మాయి నన్ను వింత మృగాన్ని చూచినట్లు చూచింది. నా చీరకట్టే విధానాలూ, నేను తల దువ్వుకొనే విధానమూ, అన్నీ కొత్తగానే ఉన్నాయి ఆమెకు. ఆ అమ్మాయి అక్కగారు సరోజినికి ఇరవై మూడు ఏళ్లు ఉంటాయి. నలుగురు బిడ్డల తల్లి.
ఇంతట్లో మా బావను తీసుకొని సుబ్రహ్మణ్యంగారు చక్కా వచ్చారు. నేను హాలులో కుర్చీమీద కూర్చుని ఏదో పుస్తకం చదువు కుంటున్నానన్న మాటేగాని, మనస్సు దానిమీద లేనేలేదు. బావ రాగానే, "హేమా! ఎప్పుడు వచ్చావు? అమ్మా, నువ్వూనా? పొద్దునే బయలుదేరి వచ్చారా?" అని అడిగాడు. నాకు మాట రాలేదు. ఊరికే తల ఊపుతూ నిలుచున్నాను. నీరాజనం
నన్ను చూచిన మా బావకు మోము తెల్ల పోయింది. అది నేను మాత్రం గ్రహించాను. మా బావ దేహవర్ణం నా చాయకన్న రెండు డిగ్రీలు తక్కువ, కాసుబంగారం ఛాయ అనవచ్చును. నా చాయ బాగా పండిన దబ్బపండు చాయలో గులాబిపూవు చాయ కలిపినట్లుంటుంది. అలాంటి అతని మోము చాయ ఒక్కసారి తెల్లబడిపోయింది. ఇంతట్లో అతడేధో గంభీర మౌనముద్ర వహించినాడు.
రాత్రి మేమందరం కలిసి భోజనాలు చేశాము. నాకు మా బావ వెండి కంచం పక్కనే వెండి కంచం వేశారు. మా కొంటె వదినలు చేసినపనది సుబ్రహ్మణ్యం అన్న ఎదురుగుండా కూర్చుంటే, అతని పక్క అతని భార్య కూచుంది. వెంకటరంగమ్మ అలివేలు వదినలూ, సరోజినీ పిల్లల కోళ్ళులా తమ చిన్న బిడ్డలను చుట్టూ పెట్టుకొని కూర్చున్నారు. పెద్దపిల్లలు విడివిడిగా కూర్చున్నారు.
మా బావ కొల్లిపర వస్తూనే మనుష్యులను పంపి తన అక్కలను, సుబ్రహ్మణ్యంగారినీ, అతని భార్యనూ రప్పించాడట. మేము సాయంకాలానీకి వస్తామనగా ఆ ఉదయమే సుబ్రహ్మణ్యమూ, అలివేలు వదినగారూ, పది పదకొండు గంటలకు వెంకటరంగమ్మ వదినగారున్నూ వచ్చారు.
మా బావ పక్కనే కూరుచుండి కిక్కురుమనకుండా భోజనం చేశాను. ఎందుకాతని మోము తెల్లబోయింది? అతడు నేనంటే అనుమానిస్తున్నాడా? నా భోజనం అంత సయించలేదు. మా బావ చల్లగా భోజనం చేశాడు. మా అలివేలు వదిన ఒకటే వాగుడు. నన్ను లక్షా వేళాకోళాలతో ముంచింది. నేను నవ్వు మాత్రంతో భోజనం ముగించాను. భోజనంచేసి మందువా ముందు ఆరుబైట సావడిలో కుర్చీలలో కూర్చుని తాంబూలాలు వేసుకుంటున్నాము.
మా బావ నావైపు చూచి, "హేమా! నిశాపతి వచ్చాడా?" అని అడిగాడు.
ఆ ప్రశ్న నాలోని బిడియాన్నీ, కుములుకుంటున్న దుఃఖాన్నీ మాయం చేసింది.
"నిన్న సాయంకాలానికి వచ్చాడు బావా! లోకేస్వరీ, నిశాపతుల ఆనందం వర్ణనాతీతం!"
"కాదామరి! వివాహముహూర్తం ఎప్పుడు?"
"వైశాఖశుద్దమందట. నేను పూర్తిగా తెలుసుకోలేదు."
మా బావ తాంబూలం వేసుకొని, లేచి నెమ్మదిగా వీధిలోకి జారాడు. విపరీత వేదన నా హృదయంలో మొలకెత్తింది. అయినా ధైర్యం వీడక, శారదా సుబ్రహ్మణ్యాలతో, మా అక్క సమాధి చూద్దామని బయలు దేరాను.
మా అక్క సమాధి మామిడితోటలో నిర్మించారట. అక్కడకు అంతకుముందే ఉదయించిన కృష్ణపాడ్యమి చంద్రుని కాంతిలో, నెమ్మదిగా అడుగులు వేస్తూ తోటలోనికి బయలుదేరాము. శారద "అత్తయ్యా! నీ కీ ఊరు బాగా జ్ఞాపకం లేదా? అని అడిగింది.
"లేదు శారదా! నేను మిమల్నెవర్నీ ఎరగను. మా అమ్మగారి వైపు వాళ్ళు చెన్నపట్నం వచ్చేవారు. నా అరవ ఏటనే కాదూ. ఈ ఊరువదలి చెన్నపట్నం వెళ్ళామూ!"
"నేను మా మూర్తిబావ చెన్నపట్నంలో ఉంటూన్నప్పుడు మూడు నాలుగు సారులు వచ్చానుగాని మీ యింటికి రాలేదు" అని సుబ్రహ్మణ్యం అన్నాడు.
మా తోట వచ్చింది. ఆ తోటలో చక్కని ఎత్తయిన తులసికోట దగ్గరకు వెడుతూంటే నాకు కళ్ళు గిర్రున తిరిగిపోయినవి, అక్కా! నువ్వు లేకపోవడం నా జన్మ కిలాన్తి విచిత్ర చరిత్ర ఉదయించింది. ఏ లోకాలలో ఉన్నావు అక్కా? ఏ వెలుగురూపంతో ఉన్నావు? అని నా హృదయంత రాళాలలో కుంగిపోయాను.
మేము ముగ్గురమూ ఆ సమాధి దగ్గరకు వెళ్లేసరికి అక్కడ మా బావ ఆ సమాధి కెదురుగా పద్మాసనంలో అధివసించి ఉన్నాడు. అతన్ని చూచి మేము మువ్వురమూ ఆగిపోయినాము. ఆ ప్రదేశంలో చెట్లేమి లేవు కానీ, ఆ సమాధి బృందామందిరామును చుట్టి వెనుకగా ఎన్నియో పుష్పని కుంజాలున్నవి. ఆ సమాధిపైని ఆలయ మందిరం కట్టించదానికి పునాదులు తీసి ఉన్నాయి. అక్కడక్కడ రాళ్ళూ, సున్నమూ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ తర్వాత చూడగలిగాను నేను.
వెళ్ళగానే, ఆ సమాధీ మా బావే మాకు కనబడుతా! నెమ్మదిగా వెళ్ళి, నా కాలి చెప్పులు వదలి, మా బావ పక్క కూచున్నాను. ఎదురు గుండా మా అక్క సమాధి. నా హృదయంలో ప్రార్ధానలేదు. విచారము లేదు, ఆవేదనలేదు. ఏదో కాంతి నన్నలముకుంది. అవిరళమైన నిశ్చలత, అననుభూతమైన తృప్తి అవధిరహితమైన ఆనందము నన్నలవి వేశాయి. చంద్రబింబరహిత పూర్ణజ్యోత్స్నార్ధ్రిత పరమపద మధ్యస్థ పద్మాసనా వసిత పురుషుని చెంతనే నధివసించి యున్నాను. ఎదుట ఒక మహా మందిరం. ఆ మందిరములో నేనూ, నా ఎదుట మోకరించి మా బావా!
ఎక్కడనుండో వీణాస్వరాలు అస్పష్టంగా వినిపిస్తున్నవి. అవి ప్రవహించి మా దగ్గరకు, దగ్గరకు వస్తున్నవి! ఇవన్నీ కరిగిపోయాయి. మా బావా, నేనూ మా అక్క సమాధి దగ్గర కూర్చుని ఉన్నాము. నన్ను ఎవరో "హేమా!" అని పిలుస్తున్నారు. నిద్రలో ఉన్నవారికై పిలువు! సగం మెలకువవచ్చి కలలుకంటున్న వారికై పిలుపు! మెలకువ వచ్చిన వారికి పిలుపు! నాకు మెలకువా వచ్చింది. హేమా, అంటూ మా బావ నా వైపు తిరిగి పిలుస్తున్నాడు. అతని మాటలలో ఏదో భయం, ఏదో ఆవేదన వ్యక్తం అవుతున్నది.
"ఆ! అంటూ అతనివైపు తిరిగాను.
బావ : హమా, ఎందుకు వచ్చావు? నేను నీ జీవితాన్ని చెరుపు చొచ్చిన మదపుటేనుగులా కదల్చిపారవేశాను.
నేను : బావా, నీ కోసం వచ్చాను. అతిచిన్నతనపు క్షుద్రత్వంతో నా హృదయం నేను తెలుసుకోలేక పారిపోయాను.
బావ : దానికేమి హేమా, ఎవరి ఆత్మను వారే దర్శించుకోవాలి. కానీ నా దుష్టత్వం నిన్నింతవరకూ వెంటాడించింది. నీ జీవితం నీది, నీ ప్రేమ నీది అని తెలిసి ఉండీ, నిను వాంచించి కృత్రిమవేషంతో, దురాశయంతో నీ జీవితం భగ్నం చేయడానికి మదరాసు వచ్చాను.
బావ మాటలు నాకు శూలాలైనవి. గుండెరక్తసిక్తమై పోయింది. అతని భుజాలు రెండూ పట్టుకుని కళ్ళనీళ్ళు కారిపోతూ ఉండగా, అతని కళ్ళల్లోకి చూస్తూ నా పెదవులు వణుకుతూ ఉండగా, "బావా, నా అక్క సమాధి సాక్షిగా చెబుతున్నాను. నేను నా దేహాన్ని అణుమాత్రం పంకిలం చేసుకోలేదు. నా మనస్సులో అలా రైలులో వెళ్ళేటప్పుడు నీ మీద నిష్కారణమైన కోపం ఒక్కటే ఉంది. ఇంకేమీ లేదు బావా. నా జీవితం అంతా నీమీదే ప్రేమే నిండి ఉంది. అందుకనే నేను నాకు తెలియకుండా నువ్వు వచ్చేటంత వరకూ ఎదురుచూస్తూ మదరాసులో ఉన్నాను కాబోలు. ఈ ప్రేమ పుట్టినప్పటినుంచీ ఉండి వుండాలి. ఈనాడు, నా శిశుత్వం రోజులు, బాలికా దినాలు జ్ఞప్తికి వస్తున్నాయి. అంత చిన్నతనంలోనూ మా ఆక్క ప్రేమలోనూ, నీ ప్రేమలోనూ నేను జీవించాను. అంతే! నిన్ను వదలి ఉండలేను. నేను అర్హురాలను అని తోస్తే నన్ను నీ హృదయంలోనికి తీసుకో. లేదా, నా జన్మ అంతా సన్యాసమే! దూరాన్నుండి నిన్నే పూజించుకుంటూ __ భగవంతుడు నా కిచ్చిన శక్తితో మానవ నారాయణ సేవచేస్తూ కాలం గడుపుతాను" అని గద్గదస్వరంతో పలికాను.
మా బావ నాకేసి ఆ వెన్నెలలో తేరిపార ఒక నిమేష మాత్రం చూచినాడు. మరునిమేషం నా బావ నన్ను తన హృదయాని కదుముకుని గాఢంగా కౌగిలించాడు. నా మోమెత్తి నా కళ్ళల్లోకి చూస్తూ నా కన్నీళ్ళు తన కండువాతో తుడుస్తూ "హేమం!క్షమించు" అని నా పెదవులు ముద్దు పెట్టుకున్నాడు. మహాదాశీర్వచనం
నా బావ నన్ను ముద్దుపెట్టుకున్నాడు: నన్ను హృదయానికదుముకున్నాడు; నా కళ్ళు రెప్పలు చుంబించినాడు. అలాగే పదినిమిషాలు మే మిరువురమూ చైతన్య రహితులమై వున్నాము. అతడు లేచి, నన్ను లేవదీసినాడు. నా బావ నాకు వరమిచ్చిన ముద్దులు బంగారుపళ్ళేన అమరించిన ఎఱ్ఱని కాబూలి దానిమ్మ గింజలులా ఉన్నాయి. నాలో అమృతప్రవాహాలు ప్రవహింపచేసి నాకు దివ్యత్వమిచ్చి నన్ను లోకాలోకాలు ఆవరింపచేసినవి. నాకు పరవశత్వము కలిగి, నా చెలికానిముందు, నాభర్తకడ నా స్వామి యెదుట, నా ఆత్మేశ్వరుని పాదాలపై సాష్టాంగమయ్యాను. అతడు నన్ను చేతులుపట్టి పైకెత్తి మరలమరల నా నేత్రాలు, నా కంఠము, నా నుదురు, నా చెవులు, నా పెదవులు, నా చుబుకము, చెంపలు ముద్దులిడగా మేము ఇద్దరం మా అక్క సమాధి దేవాలయానికి సాష్టాంగ పడినాము.
వెనక్కు తిరిగి ఆ వెన్నెల్లో నా బావా, నేనూ తిరిగి మా ఇంటికి వస్తున్నాము. మాలో మాటలులేవు. మాకు సంభాషణ స్పురింపదు. మా చుట్టూ కోకిల 'కో' అన్నది ఒకవేపు, ఒక ప్రక్క ఈలకోడి కూసింది. వేరే ఎడ దూరంగా పొలాల్లో మనుష్యుల పాటలు, దూరాన యూరోపులో, ఆఫ్రికాలో, శాంత అట్లాంటిక్ మహాసముద్రాలలో దారుణ సంగ్రామ ధ్వనులు. దగ్గర నా దేశంలో స్వాతంత్ర్యములేని ఆర్తనాదం, కమ్ముకు వచ్చే కాటకఘోషా, చీనాలో నిశ్శబ్దంగా రాక్షసత్వాన్ని ఎదిరిస్తూ, భయంకర యుద్దాలు చేస్తూ, ఆ రాక్షసత్వానికి ఆహుతి అవుతూ చీనా జాతీయత.
మేము ప్రేమమూర్తులమై ఇంటికి చేరాము. ఇంటిల్లిపాదీ మేము ఒక్క మానవ వ్యక్తిగా ఒకరిలో ఒకరమై నడచి రావడం చూచారు కాబోలు మాపై ఆనంద వీక్షణాలు పన్నీటి జల్లులా కురిసినవి. తిన్నగా మేము లోపలికి పోయి, ఇతరులు చూస్తున్నారన్న భయంలేక, మా రంగ నాయకమ్మత్త ఎదుట మోకరించి మా తలలు ఆమె పాదాల మీద ఆన్చినాము. ఈ యుగాల బాధ తమలో ఇముడ్చుకొని చిరునవ్వుతో తాను నడుస్తూ తన బిడ్డలా నడిపిస్తూ తూలుతూ కుంగుతూ వేయిరెట్లు బలంతో తిరిగిలేస్తూ, నిజాతీయుల దాడుల భరిస్తూ, సర్వకష్టాలు ఆనందంతో గ్రహిస్తూ, నూతన పుత్రకుల హృదయాల కదుముకుంటూ, లోకానికెప్పుడూ దివ్యసంగీతము వినిపిస్తూ ప్రయాణించే భారతధాత్రివంటి మహా ఇల్లాలు ఆ తల్లి. ఆ తల్లి కన్నీటినవ్వుతో, వణుకుతూ మా ఇద్దర్నీ లేవదీసి మాటలులేని దివ్యమంత్రాల మమ్ము ఆశీర్వదించిన తన హృదయానికి మమ్మిద్దరనూ అదుముకొంది.
* * *
మా బావ తలపెట్టిన స్త్రీ లలిత కళాశాలలో సంగీత పీఠము, సాహిత్యపీఠము, శిల్పపీఠము, నాట్యపీఠము భవననిర్మాణ పీఠము, లోకజ్ఞానపీఠము, కళాస్వరూప వృత్తివిద్యా పీఠము అని ఎనిమిది శాఖ లుంటాయట. లోకజ్ఞానపీఠంలో ప్రాధమిక, మాధ్యమిక, ఉత్తమ విద్యాభాగాలు మూడుంటాయి. భూగోళశాస్త్రము, ప్రజాశాస్త్రము, రాజకీయ, ఆర్ధిక, పదార్ధ, విజ్ఞాన, రసాయనిక, పారిశ్రామిక శాస్త్రాలు, వైద్యారోగ్య శాస్త్రాలు, చరిత్ర, వ్యవసాయ శాస్త్రము మొదలగునవి ఉంటాయట. కళాస్వరూప వృత్తివిద్యాశాఖలో__లక్కబొమ్మలు, కర్ర బొమలు, పింగాణీలు, తివాసీనేతలు, శాలువకుట్టు, శిల్పచర్మకారకత్వము అద్దకము, పేకబెత్తపు అల్లిక, కర్ర సామాను, కంచు మొదలయిన లోహాలతో శిల్పవస్తువుల తయారు, పుస్తకముల కుట్టు, బైండింగు, చేతి కాగితముల తయారు, ఫోటో అచ్చుల తయారు మొదలయిన పనులన్నీ నేర్పుతారట.
అందరూ ఖడ్డారు వడకాలట, ఖద్దరు కట్టాలట. ఇంక కళల విషయం చెప్పనవసరమే లేదుకదా. ఇది మహాప్రయత్నము. మా బావ ఎల్లా విజయం పొందుతాడో! నాకు మా తల్లిదండ్రులు నా వివాహంనాడు ఇవ్వదలచుకొన్న ముప్పయి ఎకరాల మాగాణి భూమీ, ఇతర దానాలు అన్నీ మా అక్క కళాశాలకు ఇవ్వాలని ఆ రాత్రే సంకల్పించుకొన్నాను. ఈ విషయం రాత్రి బావా, నేనూ మేడమీద మాట్లాడుకొన్నప్పుడు చెప్పాను. మా బావా దిగ్గున లేచి నా చేతులు రెండూ పట్టుకొని, "నువ్వు శకుంతల చెల్లెలివీ, శకుంతలవూ, నా హేమావూను!" అన్నాడు.
ఆ రాత్రి మా బావను నిద్రపోనీయలేదు. నేను నిద్రపోలేదు. నాకు తక్కిన ప్రపంచమంతా లేనేలేదు. నాకు చంద్రుడు లేడు. వెన్నెలలేదు. నాకు నా బావ త్యాగతి మాత్రం ఎదుట, నా అదృష్టాన్ని నేను నమ్మలేక పోయాను. ఈ ఉత్తమ పురుషుడు నాకు భర్తా? నాది ఎంత ఉత్కృష్ట జన్మ. ఐరోపియను పరపీడనం నాశనమవడం తధ్యం; జగత్తులో త్వరలో ధర్మం నెలకొలుపబడి తీరుతుంది అనుకున్నాను. బావను చూస్తూ అల్లా కూచున్నాను. న అకుర్చీ అతని కుర్చీకి అతి దగ్గరగా జరుపుకున్నాను. ఏదేని వంకతో అతని చేతులుపట్టి, ఏమాటల ధోరణిలోనో అతని చెంపలు పుణికి, ఏ యాధాలాపాననో అతని ఒత్తు నల్లటి జుట్టును నిమిరి, అతని ఒళ్ళోకి వాలి, అతని కంఠము చుట్టూ చేతులు చుట్టి, అతిసంతోషం తెలపడానికి అతని నుదురు చుంబించి, శరీరం వేడెక్కి పరవశత్వం అలుముకొనిపోయి, అతని పెదవులను గాఢంగా చుంబించాను.
సేసలు
నా వివాహము చెన్నపట్నంలోనే అయింది. మా చుట్టాలు ఎక్కడెక్కడివారూ వచ్చారు. నా వివాహంతోపాటు లోకేశ్వరి వివాహమూ అయింది. ఉదయలగ్నంలో మా వివాహం. లోకేశ్వరీ నిశాపతుల వివాహం రాత్రి లగ్నంలో జరిగింది. లోకేశ్వరి చుట్టాలు, నిశావతి చుట్టాలు అందరూ కిటకిటలాడిపోయారు. మా మేడచుట్టుప్రక్కల మేడలు నాలుగు విడుదులు ఏర్పాటుచేశారు. ప్రసిద్దాంద్ర గాయకుల కచేరీలు, నారాయణదాసుగారి హరి కథాకాలక్షేపం, కూచిపూడివారి నాట్యం, బాలసరస్వతీ నాట్యమూ, ఇద్దరు ఉత్తరాది గాయకుల సంగీతసభలు ఈ రెండు పెళ్ళిళ్ళ ఉత్సవాలరోజులలో ఏర్పాటయినవి. చెన్ననగరంలో ప్రసిద్దులందరూ ఈ వివిధ సభలకు వేంచేశారు. నలభీమపాకాల విందులర్పించారు మా నాన్నగారు. లోకేశ్వరికి వివాహకాలంలో మా నాన్నగారు రెండెకరాల మాగాణి పసుపూ కుంకుమ క్రింద చదివించారు. వేయి రూపాయల నగలిచ్చారు. ఈ మహోత్సవాలు జరిగిన మూడు రోజులు ఏదో లోకంలో విహరిస్తున్నట్లే ఉన్నదీ. అది గంధర్వలోకమో! స్వర్గలోకమో!
మా బావ రాజకుమారుడులావచ్చి పెళ్ళిపీటలమీద కూర్చున్నప్పుడు, నా మెళ్ళో మంగళ సూత్రం కట్టేటప్పుడు చిరునవ్వుతో మైగుబాళింపులో మేము ఇరువురము తలంబ్రాలు పోసుకునేటప్పుడు, నేను ఒక లోకోత్తర వధువునని అనుకున్నాను. మా బావ నాకు మాత్రం వినబడేటట్లు "అతివ సతీకరోన్నమితయై విభునౌదల సేసచల్లె" అని పద్యం చదివినాడు. నాకు చిరునవ్వూ, సిగ్గూ పొంగి పొర్లుకువచ్చాయి. పెళ్ళిల్లయి ప్రధమ గృహ ప్రవేశానికి త్యాగరాజనగరంలోని మా బావ ఇంటికి వెళ్ళాము.
నిశాపతి, లోకేశ్వరులూ మా బావగారింట్లోనే గృహప్రవేశమైనారు. నిశాపతి త్యాగరాజనగరంలో సర్వోదయ పాఠశాల కెదురుగా ఒకచిన్న మేడ కొనుక్కున్నాడు. లోకేశ్వరీ, నిశాపతీ అక్కడ కాపురం ఉంటారట. ఈ రోజులలో ఏకాగ్రత వివాహమువలె కాక మా వివాహం తంతు నాల్గురోజులు నడిచింది. రెండవ రోజున శేషహోమ మయినది. శేషహోమ మయిన వెనుక నాలుగవనాడు నాకబలి జరిగింది.
అక్కడనుంచి మా బావగారింటికి గృహ ప్రవేశానికి వచ్చాము. ఆ మరునాటి ఉదయం నన్ను అలంకరిస్తున్నారు మా పెద్ద వదినెగారు. అప్పుడు బావ లోపలికివచ్చి, "హేమా, ఒక్కసారి ఇల్లారా" అని పిలిచారు. నేను వెంటనే లేచి "ఎందుకూ" అని మా బావ దగ్గరకు వచ్చాను. బావ నన్ను పిలిస్తే, ఏవో దివ్యరాజ్యాలన్నీ నాకు అందినట్లే అవుతుంది.
"అబ్బా! సిగ్గన్నాలేదు అత్తయ్యకు" అంది శారద, పకపక నవ్వుతూ. నేను బావ వెనకాలే వెళ్ళాను. బావ నన్ను తన శిల్పమందిరము లోనికి తీసుకొనిపోయారు. అక్కడ మేమిద్దరమూ బుద్దభగవానునకు ప్రణుతు లర్పించాము. నా చేయి పట్టుకొని బావ నన్ను ఆ విగ్రహం వెనకాలఉన్న గుమ్మం దగ్గరకు తీసుకువెళ్ళినారు. ఆ తెర ఒత్తిగించి తాళంతీసి తలుపులు తెరచి, లోపలికి నా నడుముచుట్టూ చేయివేసి తీసుకువెళ్ళినారు.
ఎదురుగా ఒక లోహపద్మాసనముమీద పంచలోహమూర్తులు రెండు ఉన్నాయి. ఆ విగ్రహాలు రెండూ ఓకే పోలిక. కొంచెం తేడా ఉందేమో! ఒక విగ్రహం నా మూర్తే! రెండవ విగ్రహము మా అక్క ప్రతిమ! ఆ విగ్రహాలముందు పూజా పరికరాలన్నీ ఉన్నాయి. అతడా విగ్రహాల ఎదుట మోకరిస్తే నేనూ మోకరించాను. సువాసన దూపాలతో, వెండి పూవులతో అమరింపబడిన విధ్యుద్దీపాలతో ఆ మందిరము దేవలోకంలోని మందిరంలా ఉంది.
"హేమా! శకుంతలా నువ్వూ నా ఆశయమూర్తులు. శకుంతల నీలో సంపూర్ణ రూపంతో వుంది. మీ యిద్దరూ ఒకటే! నా సర్వస్వం ఏ అణువూ మినహాయింపుకాక నీకు ఇదివరకే అర్పించుకొన్నా! శకుంతలా పూజ, నీ పూజ దినదినమూ చేస్తూనే ఉంటున్నాను. నా సర్వేశ్వరీ, నా కళామూర్తీ! నీతో నేను మానవాభ్యుదయంకోసం మన ప్రేమను అంకితం ఇస్తున్నాను. ఇప్పుడే ఆ అంకితం" అంటూ ఆ రెండు విగ్రహాలకూ షోడశోపచార పూజ తన భార్యనైన నాతోకలిసి అర్పించారు.
పూజ అయిన తర్వాత మేము ఇద్దరం బావ శిల్పగృహంలోకి వెళ్ళి కూర్చున్నాము. మా బావ నె కూర్చున్న సోఫా దగ్గర క్రిందగా కూర్చుని ఒళ్ళో తలపెట్టి నా నడుంచుట్టూ చేయి వేసి, "హేమా! నా ప్రేమ లోకాలూ, విశ్వాలూ ఆవరించే వెలుగువు. ఆ వెలుగు మద్యంలోనూ నువ్వే, ఆ వెలుగుకు మూలంగానూ నీవే అయివున్నావు. హేమా! నువ్వే శకుంతలవు. నీలో శకుంతల లీనమైపోయింది. నన్ను ప్రేమించవేమో అని ఒక్కొక్కసారి మానమాత్రున్నవడంచేత అధైర్యం కలిగి సప్తపాతాళాలకీ కుంగిపోయేవాడిని. ఒక్కమాటలోగాని, చూపులోగాని నేను ప్రేమిస్తున్నాను అని నీకు తెలియకుండా సంచరిస్తూ, నిను ప్రతినిమేషమూ, ప్రేమిస్తూఉంటిని. నా శిల్పదేవీ; నా కళాపద్మాసనాధిష్టానమూర్తీ! ఈనాటికి కదా నీ యీ భక్తుని అనుగ్రహించావు" అన్నాడు. మా బావ కళ్ళవెంట ఆనందమే భాష్పాలై ప్రవహించింది.
"బావా! నువ్వు నన్నెంత మహోత్క్రుష్టంగా ప్రేమిస్తున్నావో, అంత మహోత్తమంగా నేను ప్రేమిస్తున్నాను. నేను పుట్టినప్పటినుంచీ మా అక్కలాగే నిన్ను మాత్రమే ప్రేమించాను కాబోలు. అది ఇప్పుడు నాకు అతిస్పష్టమై, ప్రత్యక్షమైంది" అని నేను సోఫానుంచి దిగజారి మా బావ ఒళ్ళోకి వాలాను.
వెన్నెల ప్రవాహాలు, వెన్నెల తరంగాలు, వెన్నెల మున్నీర్లు, వెన్నెల గంభీరాలు విరిగిపడే నీలాలరేఖలు, ఒడుసుకుపోయే నీలాల దూరాలు. ఆ రాత్రి మేడమీద నేనూ, నా బావా! నా బావను యెంత గాఢంగా చూడగలను? నా బావను యెంత దగ్గరగా అదుముకోగలను? యిద్దరం మా గదిముందు వరండాలో వెన్నెల్లో నుంచున్నాము. మేమిద్దరమూ ఆ వెన్నెల అంతా ఒక్కటిగా చేరిన ఒక్క దివ్యకిరణమైపోయాము.
"ఓం అసతో మా సద్గమయ,
తమసో మా జ్యోతిర్గమయ,
మృత్యో ర్మా అమృతం గమయ."
సంపూర్ణము