తిమ్మరుసు మంత్రి/సప్తమ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


సప్తమప్రకరణము

దక్షిణ దిగ్విజయము

శ్రీవీరనరసింహదేవరాయని పరిపాలనముననే శ్రీకృష్ణదేవరాయఁడు కర్ణాటదేశమునంతయు జయించి శ్రీరంగపట్టణమున చిక్కదేవరాయని ప్రతినిధిపాలకునిగా నియమించి జయధ్వజ మెత్తించి విజయోత్సాహముతో రాజధానిఁ బ్రవేశించెనని మున్నె తెలిపి యున్నాఁడను. ఇతఁడు పట్టాభిషిక్తుఁడైన వెనుక తిమ్మరుసుమంత్రి ద్రావిడదేశమును జయించి కప్పయిలు సరిగా నిర్ణయించి రాఁబట్టి తెచ్చుటకై విజయప్పనాయకుని, కృష్ణప్పనాయకుని, వేంకప్పనాయకుని మువ్వురను నియమించెను. విజయప్పనాయకుఁడు లక్షసైన్యముతో బయలువెడలి వేలూరు ప్రాంతదేశమును వశపఱచుకొని వేలూరు ముఖ్యస్థానముగ నేర్పఱచుకొని రాయనికై కప్పములు గైకొనుచుండెను. అట్లు చిత్తూరు, తొండమండలము, తంజపూరు, తిరుచనాపల్లి, మధుర, తిరునగరు, కొడగు, మళయాళము మొదలగుదేశముల రాజులెల్లరును రాయనికి వశ్యులై కప్పములను జెల్లించిరి, ఈ దక్షిణదేశమునంతయును మూఁడు ఖండములనుగా విభజించి మూవురు ప్రతినిధిపరిపాలకులక్రింద నుంచెను. జింజీలో నివసించెడి కృష్ణప్పనాయకుఁడు నెల్లూరు మెదలు కొల్లడము నదివఱకును గలదేశమునకు, విజయరాఘవ నాయకుఁడు కావేరినది ప్రవహించు ఫలవంతమైన దేశమునకు, వేంకటప్పనాయకుఁడు కొడగు, మళయాళదేశములకు నధికారులుగా, నియమింపఁ బడిరి. ఇట్లు పూర్వకర్లాట ద్రవిడదేశమునంతయును వశముచేసి కొని మూఁడుకోట్ల ద్రవ్యమును భాండారమునకుఁ జేర్పించెను. దక్షిణదేశమున రాయనిఁ దిరస్కరించి కప్పములు చెల్లింపక యుద్ధములు చేయువారు లేకుండఁ జేసి తిమ్మరుసు తనప్రజ్ఞా విశేషమును లోకమునకు వెల్లడించెను.

తిమ్మరుసు పూర్వదిగ్విజయయాత్రకుఁ బ్రోత్సహించుట

ఒకనాఁడు రహస్యముగా రాయనికడకుఁ బోయి తిమ్మరుసు మంత్రి యిట్లు ప్రబోధించెను.

దేవా! నీయభీష్టమును దీర్చుకొనుకాల మాసన్నమైనది. నీపు రెండు సంవత్సరముల క్రితము శాత్రవులను జయించి శత్రుదుర్గముల నాక్రమింపవలయునన్న పెద్దికోరిక గలదని నాతో నుడివినప్పుడు సైన్యముల నాయత్తపఱుచుటకు రెండు సంవత్సరముల కాలము గడువడిగి యున్నాను. నేఁటితో గడువు కాలము ముగిసిపోయినది. ఇప్పుడు యుద్ధముచేయుటకు పది లక్షల సైన్యమును సిద్ధము గావించితిని. అవసరమైనయెడల మఱియొక పదిలక్షల సైన్యమును సమకూర్చుటకుం దగు నేర్పాటులను గావించితిని. కవచధారణము గలిగిన ముప్పదివేల యాశ్వికబలమును చేకూర్చితిని. ప్రశస్తమైన గజబలమును గలదు. కావలసినంత ద్రవ్యమును భాండారమునం జేర్పించితిని. దుర్గములన్నియు సమస్త వస్తుసామగ్రులతోడ నింపి సమృద్ధము లగునట్లు గావించితిని. సేనాపతు లెల్లరును భక్తివిశ్వాసపరులైన శూరశిఖామణులై యున్నారు. మన కేవిధమునను గొఱంత గానరాదు. శత్రువు లెంతటి బలాఢ్యులైనను వారిని నేఁ డవలీల జయింపగలవు. పరరాష్ట్రాధిపతులు నిన్నుఁ గన్నెత్తి చూడనోడుదురు. శత్రురాజులు నాయెడల నీకు నీసు గల్పించి తగవులు పెట్టి సామ్రాజ్యమును జెఱుపఁ బ్రయత్నించిరి గాని వారి దుష్ప్రయత్నములన్నియు వ్యర్థములై పోయినవి. నేను నీయెడ భక్తివిశ్వాసపరుఁడనై వ్యవహరించినదియు లేనిదియు నీవే యెఱుంగుదువు. ఎవ్వరిని సంపూర్ణముగా జయింపఁజాలక పోతి మని నీపూర్వులైన సాళ్వనరసింహరాయాదులు పరితపించి గతాసువులైరో అట్టి యశ్వపతులను గజపతులను నీవు జయించి యీయభినవకర్ణాటహైందవ సామ్రాజ్యమునకు వన్నెయు వాసియుఁ గల్పించి లోకంబున శాశ్వతకీర్తిని సముపార్జింపుము.

అని తిమ్మరుసు ప్రోత్సహించి పలుకు పలుకులకుఁ బ్రీత చేతస్కుఁడై రాయఁడు 'అప్పా! ఎదిరిబలము నాబలము నెఱుంగక నాఁడట్లు శత్రువులను జయింప సమకట్టి నీతోఁ బ్రశంసించితిని. నాఁడు నీవు నాతమకమును వారించి ప్రబోధింపక నాచిత్తము వచ్చినట్లు వ్యవహరింప విడిచినపక్షమున నిప్పటికి నాపాట్లెట్లుండునో గదా! ఈరెండు సంవత్సరములలో నీవు చేసినకార్యములు శ్లాఘాపాత్రములైనవిగా నున్నవి. నీకు నే నెంతయుఁ గృతజ్ఞుఁడనై యున్నవాఁడను. అసూయాపిశాచగ్రస్తులై స్వార్ధపరాయణులై యూరక నీయెడ దోషారోపణ చేయువారి మాటలను నమ్మి నిన్నపనిందల పాలుచేసి నీతోఁ దగవులాడి కార్యభంగమును గలుగఁ జేసికొనునంతటి యవివేకిని గానని నీవెఱుఁగవా? ఈసామ్రాజ్యము నాకిచ్చినది. నీవ కాదా? నాకిట్టి కీర్తిని గల్పించుచున్నది. నీవకాదా ? వేయు నేల ? పితృవాత్సల్యముతో నా ప్రాణములను బల్మఱుఁ గాపాడినదియు నిప్పటికిని గాపాడుచున్నదియు నీవుగాదా? అట్టి నీకు దుష్టులమాటలు నమ్మి కృతఘ్నుఁడనై యెగ్గొనరింతునా ! ఎంతమాట ! అట్లు స్వప్నమందైనఁ దలంపకుము, మహాత్మా! నీయంతటివాఁడు నాకు ప్రాపై సమస్తరాజ్యనిర్వాహకర్తయై యుండ నేను దిగ్విజయముఁ గావించి లోకమునఁ బ్రశంసాపాత్రుండనగుట యొక యబ్బురమా ! నేటి నీవాక్కు, లానంద దాయకములై ప్రోత్సాహకరములై యొప్పుచున్నవి. అయిన నాకొక్క సందేహము కలుగుచున్నది. ముందు తురుష్కులను జయించి పూర్వదిగ్విజయయాత్రకు బయలువెడలుట యుత్తమ పద్ధతియో లేక పూర్వదిగ్విజయయాత్రను ముగించి తురుష్కులపై దాడి వెడలుట యుత్తమపద్దతియో తెలిసికొనఁజాలక నామనస్సు తల్లడపాటు నొందుచున్నది” అని హెచ్చరించెను. అందులకు మంత్రిపుంగవుం డిట్లు ప్రత్యుత్తర మిచ్చెను.

దేవా! నేఁడు విజాపురసుల్తానుకంటె గజపతి బలవంతుఁడుగ నున్నాఁడు. గజపతిదేశము గొప్పది. అతని సంపద సామాన్యమైనది కాదు. మఱియు నతఁడు మతాంతరుఁడు గాఁడు. అతని సైన్యాధిపతు లనేకులు తెలుఁగువారై యున్నారు. అందువలన దేశములోని ప్రజలు తురుష్క-ప్రభువుకంటె నీహైందవప్రభువునే యెక్కువగా బ్రేమింతురు. కనుక గజపతివలననే మన కెక్కువచెడుగు కలుగవచ్చును. వీనిని మన తెలుఁగు దేశమునుండి తఱిమివేయుట ప్రథమకర్తవ్యము. మఱియు బహమనీరాజ్య మైదుభాగములుగా భిన్నమై యైకమత్యములేని సులాన్తులచేఁ బాలింపఁ బడుచున్నది. వారలను విడిగా జయించుట బహుసులభసాధ్యము. ఒకవేళ మనము ముందుగా విజాపురసుల్తానుపై దండయాత్ర వెడలుద మనుకొనుము. ఏవురు సుల్తాను లేకమై మనపైఁ గడంగవచ్చును. అప్పుడు వారలను జయించుట కష్టసాధ్యము గావచ్చును. ఆయదను గనుపెట్టి శ్రీవీరప్రతాపరుద్రగజపతి మనరాజధానిపై దండెత్తివచ్చెనేని మనసామ్రాజ్యమునకు ముప్పు వాటిల్లుట నిశ్చయము. మనము ముందుగా ప్రతాపరుద్రగజపతిని జయింతుమేనిఁ దరువాత తురుష్కులను జయించుట సులభసాధ్య మగును. మనము పూర్వదిగ్విజయయాత్రకు బయలువెడలి నప్పుడు విజాపురసుల్తానులతో నిదివఱకె యొడంబడిక చేసికొని యున్నారముగనుక మనమీఁద యూరక దరడయాత్రకుఁ బ్రయత్నింపఁడు. ఒకవేళ దుర్బుద్ధిపుట్టి తన సైన్యముతో మన రాజధానిపైఁబడి యాక్రమింపఁ జూచునేని వాని నవలీల జయించునట్టి సైన్యమును విశ్వాసపాత్రుఁడైన యొక సేనాని క్రిందనుంచి రక్షణము గావింపవచ్చును.

ఈమహానగర సంరక్షణభారము నెవ్వనిపైఁ బెట్టుదునాయని యోజించుచున్నాను. దీనిభారమును వహించువాఁడు విశ్వాసపాత్రుఁడైనవాడుఁగా నుండుటమాత్రముగాక సమర్థుఁడుగాఁగూడ నుండవలయును. ఏసేనాని చిత్తమెట్టిదో పరీక్షించి తెలిసికొనుట కష్టసాధ్యము. ఎవ్వరును గానుపింపకున్న నేనే యీమహాకార్యమును నిర్విహింపఁ బూనుకొనఁదలంచి యున్నాఁడను.

అని తిమ్మరుసు ప్రత్యుత్తరమీయ రాయం డిట్లనియెను. అప్పా! నీవు నుడివినమార్గము భాగుగా నున్నది. అవశ్యము పూర్వదిగ్విజయయాత్రలో నీతోడ్పాటు గావలసియుండును. నగరరక్షణార్థము నిన్ను విడిచిపెట్టి నేనొక్కడ నీమహాకార్యమును సాధింపఁజాలను. ఇతరులను నమ్మి విడుచుటయు శ్రేయస్కరముగా గనుపట్టదు. అయినను దీనిని నిర్వహించు సమర్థులు మన సామ్రాజ్యమున ననేకులుగలరు. సమర్థులలో సమర్ధుఁడును దండనాధాగ్రణియునగు మీతమ్ముఁడు గోవిందనామాత్యుఁడు గన్పట్టుచుండఁగా నొరులకై వెదుకనేల ? అతఁడు విశ్వాసపాత్రుఁడైన యోగ్యుఁడు, అతఁ డెట్టి ద్రోహచింతయును లేని బ్రాహ్మణుఁడు. అతఁడు తనబొందిలో ప్రాణము లున్నంతదనుక షరరాజులను విద్యానగరభూమియందుఁ బాదముపెట్టనీయఁడు. కావున విద్యానగరమునకు రక్షకునిగా గోవిందరాజ ప్రధానదండ నాధాగ్రఱిని నియమించుట శ్రేయ స్కరమని నాయభిప్రాయము. అతఁడు నీతమ్ముఁ డగుటంజేసి నే నేమనుకొందునోయన్న సంకోచముచేతఁ బ్రశంసింపక యున్నాఁడవు గాని నీవుమాత్ర మెఱుంగవా? అట్టి సంశయముఁ బెట్టుకొనకుము. తురుష్కులనుండి యేవిధమైన యుపద్రవమును నగరమునకుఁ గలుగకుండ సంరక్షించుభారమును మీతమ్ముఁడు గోవిందామాత్యునిపైఁ బెట్టుము. అతఁడు సామర్థ్యమున నీకుఁ దీసిపోవువాఁడు కాఁడు. మఱియును నీవు సకలసైన్యాధ్యక్షుఁడవై పూర్వదిగ్విజయయాత్రను నడుపుము. నేను నిన్ను వెంబడించి వచ్చెదను.

అని పలుకఁగా నతనిబుద్ధికౌశల్యమును మెచ్చుకొని తన యెడఁజూపు విశ్వాసమునకు సంతసించి చిఱునవ్వు నవ్వుచు మరల యిట్లనియెను. మహాప్రభూ ! మేము బ్రాహ్మణులము. క్షత్రియులు నిర్వహింపవలసిన మహాకార్యములు మావలన నగునా? ఏల యిట్లు పలుకుచున్నావు. సర్వసైన్యాధిపత్యము నీవంటి సాహసవిక్రమార్కులు వహింపవలసినవారు కాని నావంటి వృద్ధబ్రాహ్మణుఁడుగాదు. అని పలికెను. అందులకు శ్రీకృష్ణదేవరాయఁ డిట్లు బదులు వక్కాణించెను. అప్పా ! ఇవెందుకు వచ్చినమాటలు ? మీరు బ్రాహ్మణు లగుదురుగాక! మున్ను కౌరవులకుఁ బాండవులకు విద్యాగురువైన ద్రోణాచార్యుఁడు కౌరవులపక్షమున నుండి సర్వసైన్యాధిపత్యమును వహించి పాండవాద్యనేకక్షత్రియవీరు లెందఱితోఁ బోరాడి యుండలేదు? కృపాచార్యుఁడు నశ్వత్థామ మొదలగు సేనాపతు లెవ్వరు? బ్రాహ్మణులు కారా! పరశురాముఁ డెవ్వఁడు? బ్రాహ్మణుఁడు కాఁడా! పూర్వకాలమున నెందఱో బ్రాహ్మణు లస్త్రవిద్యాభ్యాసముఁజేసి లోకమున వన్నె కెక్కి యుండలేదా? మీ నియోగి బ్రాహ్మణులు లౌకికతంత్రమునందు మాత్రమేగాక యుద్ధతంత్రములందును నాఱితేఱినవా రనుటకు పూర్వకథలె మనకు సాక్ష్యము లీయఁగలవు. ఇంతయేల ! అప్పా! మీ తమ్ముఁడు దండనాధులలో శ్రేష్ఠుఁడు, ఎన్నియుద్ధములలో విజయుఁడై యుండలేదు? మీరు బ్రాహ్మణులై నను క్షత్రియులను మించిన క్షాత్రము గలవారు. అన్నిటికంటెను ముఖ్యముగా మీరు బ్రాహ్మణు లగుటంజేసి మాకు విశ్వాసపాత్రులైరి. మీరెప్పుడును సామ్రాజ్యముయొక్క క్షేమము నభిలషించుచుందురు. అదియ మాకుఁ గావలసిన ప్రధానవిషయము. కావున నాప్రార్థనమును మన్నించి నేను జెప్పినట్లు చేయుము. మీతమ్ముని రాజధానీనగరాధ్యక్షునిగా నియమింపుము. నిన్ను సర్వసేనాధిపత్యంబునకుఁ బట్టంబు గట్టెదను. ఇందులకు మాఱు చెప్పకుము. అని ప్రార్థించెను.

అంత నమ్మంత్రిపుంగవుడు రాయని ప్రార్ధనమును మన్నించి తాను సర్వసేనాధిపత్యమును వహించుటకు నంగీకారము నిచ్చి యాతనిచే దండయాత్ర కనుజ్ఞాతుఁ డయ్యెను.

నగరాధ్యక్షుని నిర్ణయించుట

అట్లు రాయనిచే ననుజ్ఞాతుఁడై తిమ్మరుసుమంత్రి లక్ష సైన్యమును నగరసంరక్షణార్థము గోవిందామాత్యదండనాధుని వశము గావించి యాతనికి నగరాధ్యక్షపదవి నొసంగి యిట్లనియెను. తమ్ముఁడా! మేము పూర్వదిగ్విజయ యాత్రకు వెడలఁ బోవు చున్నారము. నీవు సేనాధిపతులలో శ్రేష్ఠుఁడవనియు, సమర్థుఁడ వనియు రాయఁడు నిన్ను శ్లాఘించి నగరాధ్యక్షత్వమును వహించుటకు నీవ యర్హుండవని నొక్కి వక్కాణించి నందున నతనిచే ననుజ్ఞాతుఁడనై నీపైన నీగొప్ప భారమును నిలిపినాఁడను. నీవు నగరసంరక్షణభారము మాత్రమే గాక తురుష్కులు తమ సరిహద్దులను దాఁటి రాకుండఁ జూచు భారముగూడ నీపైనఁ బెట్టుచున్నారము. మనమెందఱినో యలక్ష్యముచేసి కృష్ణదేవరాయన్ని బట్టాభిషిక్తునిఁ గావించితిమి. అతఁడును అతని సామ్రాజ్యమును వర్ధిల్లు మార్గమును జూచుట మనకు విధ్యుక్తధర్మమై యున్నది. అతఁడు మనల నమ్మి సామ్రాజ్యము మనచేతఁబెట్టి యున్నవాడు. కనుక నతని శత్రువులవలన నేవిధమైన యపకృతియుఁ గలుగకుండుటకై యెందఱో సమర్థులైన సేనానులున్నను నమ్మికలేక నిన్నే యీపదవియం దుంచుటకు గారణమైనది. తమ్ముడా ! ఏమఱి యుండెదవేని నీకును నాకును ప్రొణోపద్రవము గలుగుటయె గాక సామ్రాజ్యమునకును వినాశము గలుగవచ్చును. కావున నగరమును వేయి కన్నులతో వీక్షింపుచు భద్రముగాఁ గాపాడుచుఁ గీర్తిగనుము. అని యాతని కనేకవిధములై న రాజనీతివిధానంబుల నుపదేశించి రాయని దండయాత్ర నగరంబునఁ బ్రకటించుమని యూజ్ఞాపించి పంపించెను.

సేనాధిపత్య పట్టబంధనము

అట్లనుజ్ఞాతుఁడై నగరపాలకుఁడు దండయాత్రను నగరంబునఁ జాటింపించి రణభేరి మ్రోగింప నుత్తరు విచ్చెను. సేనాపతు లెల్లరును దమతమ సైన్యములతో సంసిద్ధులై యుండిరి. ఒకనాఁటి శుభముహూర్తమున వజ్రసింహాసనారూఢుఁడై శ్రీకృష్ణదేవరాయఁడు పురోహితులు, మంత్రులు, సామంతులు, సేనాధిపతులు, రాజబంధువులు, అధికారవర్గము, తక్కుంగల పరివారజనంబులు తన్నుఁగొలువఁ గొలువుండి కనకకలశంబులఁ బావనజలంబులఁ దెప్పించి మంగళోపకరణశోభితంబు గావించి బ్రాహ్మణజనంబుల పుణ్యాహనాదంబులును, పరమాశీర్వాదంబులును, వందిజనస్తుతిపాఠంబులును, మాగధగీతంబులును జెలంగఁ దిమ్మరుసుమంత్రి వరేణ్యునకు సేనాధిపత్యాభిషేకపట్ట బంధం బొనర్చెను. అత్తరి నాయకవర్గంబు నిజశంఖంబులఁ బూరించిన సఖలసైన్యంబులందును భేరీమృదంగపణవాది తూర్య నినాదంబులు నిగిడి నింగి ముట్టెను. ఇట్టు తన్నుఁ బెద్దగా నెన్ని సర్వసేనాధిపత్య మొసంగినందులకుఁ సంతుష్టహృదయుఁడై తిమ్మరుసు రాయని కాయురారోగ్యైశ్వర్యాభివృద్ధియు, సామ్రాజ్యాభివృద్ధియుఁ గలుగునటులు దీవించి సేనాధిపతుల వీక్షించి యిట్లు హెచ్చరించెను.

'దండనాధాగ్రణులారా! విజాపురసుల్తాను ఆదిల్‌షాహ రాచూరు, ముదిగల్లుదుర్గముల నాక్రమించుకొని రాజధానీనగర సమీపస్థుఁడై ప్రక్కలో బల్లెమై కూరుచుండియున్నవాఁడు. గోల్కొండసుల్తాను కూలీకుతుబ్షాహ రాచకొండ, దేవరకొండ, పానుగల్లు మొదలగు దుర్గముల నాక్రమించుకొని మనకు సామంతులై యున్న పద్మనాయకుల వెడలఁగొట్టి యున్నవాఁడు. తూర్పుప్రక్కను ప్రతాపరుద్రగజపతి విజృంభించి యుదయగిరి ప్రాంతమువఱకుఁ గలతెలుఁగుదేశము నాక్రమించుకొని యున్నవాఁడు. ప్రస్తుతము మన మిప్పుడు ప్రతాపరుద్రగజపతిపై దండయాత్ర వెడలి కృష్ణానది దిగువభాగమున నాతని ప్రభుత్వము లేకుండఁ జేసి తఱిమివేయ వలయును. కృష్ణానదీ సేతు మధ్యస్థమైన దేశమున కంతకు నేకచ్ఛత్రాధిపతినిగఁ జేసి యేలింపఁ బ్రతిజ్ఞ చేసితిని. ఇందువలన దక్షిణహిందూస్థానమున మనపూర్వులచే స్థాపింపఁబడిన హైందవసామ్రాజ్యము దృఢమై శాశ్వతముగా హైందవధర్మము చెక్కుచెదరకుండ స్థాపితమై దేశమున నాటుకొని యుండునటుల చేయవలయును. ఇది నాయొక్కనివలన నగు కార్యముకాదు. మీసహాయ్వమునఁ గాని మేమీ మహోద్యమమును నిర్వహింపఁజాలము. మీవంటి మహాయోధులు హైందవసామ్రాజ్య మలంకరించియుండ హైందవధర్మము వర్ధిల్లుననుటకు సందియమేమియునులేదు. మీసాహాయ్యంబునఁ బూర్వదిగ్విజయయాత్ర జయప్రదముగా నిర్వహింపఁబడునన్న విశ్వాసముతో మనయేలిక యున్నవాఁడు. మనయేలిక యభీష్టమునుదీర్చుట మనకెల్లరకు గర్తవ్వమని పలుమఱు నొక్కి వక్కాణింప నగత్యములేదు. భగవంతుఁడు మన యుద్యమమునకుఁ దోడ్పడి విజయమును బ్రసాదించును గాక." ఇట్లు హెచ్చరించి సైన్యము నేఁడు భాగములుగా విభజించి యొక్కొక్క భాగమునకుఁ ముప్పదివేలకాల్బలమును, నాలుగువేలగుఱ్ఱపుదళమును, ఇన్నూరేనుఁగులు నుండునట్లు నియమించెను. ఈయేఁడు భాగములకును కందనోలు పురాధీశ్వరుండైన ఆర్వీటి శ్రీరంగరాజు, నంద్యాలపురాధీశ్వరుండైన ఆర్వీటి నారపరాజు, ఆకువీడు దుర్గాధ్యక్షుఁడై ఇమ్మరాజు, రాయసము తిమ్మరుసుమంత్రి కుమారుడైన కొండమరాజు (కొండమరుసు), గండికోట దుర్గాధ్యక్షుఁడైన పెమ్మసాని రామలింగన్ననాయఁడు, వెలుగోటి దుర్గాధ్యక్షుఁడైన రేచర్ల కుమార తిమ్మానాయఁడు, రూపనారాయణ బిరుదాంచితుఁ డగు గంగాధరరెడ్డి (గంగారెడ్డియు) నను నేడ్వుఁరకు నాధిపత్య మొసంగి ముఖ్యసేనాధిపతులనుగఁ జేసెను. వీరలలో శ్రీరంగరాజు, నారపరాజు, ఇమ్మరాజును, నరపతివంశీయులై నరాజులు, రాయసము కొండమరుసు ఉదయగిరి కన్నడి నియోగిశాఖా బ్రాహ్మణుఁడు; పెమ్మసాని రామలింగన్న కమ్మనాయకుఁడు, వెలుగోటి కుమారతిమ్మానాయఁడు పద్మనాయకుఁడు, గంగాధరరెడ్డి పంటకులాన్వయుఁడైన రెడ్డినాయకుఁడు. వీరికి లోఁబడిన సేనాను లింకను బ్రాహ్మణులలోను బ్రాహ్మణేతరులలోను బెక్కండ్రు గలరు. ఇట్లు తిమ్మరుసు చేసిన యేర్పాటులకు శ్రీకృష్ణదేవరాయఁడు హర్షించి నాటికి దర్బారు ముగించి నిజాంతఃపురమునకు వెడలిపోయెను.


___________