Jump to content

తిమ్మరుసు మంత్రి/షష్ఠ ప్రకరణము

వికీసోర్స్ నుండి


షష్ఠప్రకరణము

తిమ్మరుసుకారుణ్యము

అట్లు తిమ్మరుసు కృష్ణదేవరాయని సామ్రాజ్యాభిషిక్తుని గావించిన వెనుక నొకనాఁడు రహస్యముగా నతనికడకుఁబోయి మహాప్రభూ! పూర్వాచారము ననుసరించి పట్టాభిపేకమునకు ముందు వీరనరసింహదేవరాయని పుత్త్రుఁడైన తిరుమలరాయని, ఓబాంబికాపుత్త్రుఁడైన అచ్యుతరాయని బంధనప్రాపులను గావించితిమి. వారల నట్లుంచుట మనకు క్షేమకరముగాదు. వీరనరసింహదేవరాయఁడు మీకు ద్రోహము చేయఁదలంచినను మీరు మాత్ర మాతని కుమారునకు నపకారము చేయరాదు. అదియును గాక యతఁడు ప్రాణములు విడుచునప్పుడు తనకుమారుని నాకొప్పగించెను. ఆబాలుని సంరక్షించుట మీకు విధియై యున్నది. అచ్యుతరాయఁడు నిరపరాధి. అతనివలన నపకార మింతవఱకు జరిగినది లేదు. అయినను వారలను రాజధానీనగరమున నుంచుట అనేకానర్థములకు మూలమై యుండును. కావున వారలను రాజధానికి దూరమున భద్రముగా సంరక్షించుట కర్తవ్యము. వారి నుంచుటకుం దగినప్రదేశము చంద్రగిరిదుర్గమై యున్నది. అక్కడ వారల రక్షణకొఱకు సైన్యము నుంచి జీవనార్థము కొంతదేశము నిచ్చి స్వేచ్ఛగా మననిచ్చుట 'మీయౌదార్య బుద్ధికి వన్నెబెట్టినట్లుండును. అట్లనుగ్రహింపు' మని వేడుకొనియెను. ఔదార్యగుణశీలుఁడైన యామహాప్రభువు మంత్రిశేఖరుని ప్రార్థనమును మన్నించి యాతఁడు చెప్పినట్ల వారలను జెఱ విడిపించి కరుణార్ద్రహృదయుఁడై చంద్రగిరి దుర్గమునకుఁ బంపించి కొంత రక్షణసైన్యము నుంచి వారల జీవనార్థము కొంత దేశముపై రాఁగలఁరాఁబడి నొసంగి జనస్తుతికిఁ బాత్రుడయ్యెను.

తిమ్మరుసు కార్యనిపుణత్వము

ఎన్నఁడు స్వప్నమునందైన నెదురుచూడని మహాసమస్య యొకటి భయంకరమైన స్వరూపముదాల్చి తిమ్మరుసు నెదుర్కొనియెను. చిన్ననాఁటనుండియుఁ బెంచినవాడు తిమ్మరుసు మంత్రియైనను నాతనికిఁ దెలియకుండఁ గృష్ణదేవరాయఁడు బాల్యమున నొక వేశ్యాంగనాపుత్రికతోడ నెయ్యమును గల్పించుకొనియెను. అంత దినక్రమమున నానెయ్యము గాడానురాగముక్రిందను బరిణమించి వర్ధిల్లుచుండెను. ఆమెపై దనకుఁగల మోహవిశ్వాసములనుబట్టి తనకు సామ్రాజ్యాధిపత్యము లభించినయెడల నామెను బట్టపురాణిగఁ జేతునని పలుమాఱు వాగ్దానము చేయుచు వచ్చెను. ఆవేశ్యాంగనా పుత్త్రిక నామము చిన్నమ్మ. ఈచిన్నమ్మకును దనకునుగల ప్రేమపాశమును ద్రేంచుకొనఁజాలక కృష్ణదేవరాయఁడు తానొక మహాసామ్రాజ్యమున కభిషిక్తుఁడయ్యును చిన్నమ్మయింటిబానిసీఁడై రాత్రులందు రహస్యముగా నామె గృహమునకు బోవు చుండెను. అతిగోప్యమైయున్న యీదుర్వర్తన మొకనాఁటి ఱేయి తిమ్మరుసుకంటఁ బడియెను. అప్పుడు తిమ్మరుసుమంత్రి యచ్చెరువునందుచు దాను మిక్కిలి నొచ్చుకొని యాతని వెంబడించి పోయి యాతఁడు చిన్నమ్మగృహము ప్రవేశించినవెనుకఁ దానును బ్రవేశించి నానావిధములఁ జీవాట్లుపెట్టి నీతులెన్నో యుపదేశించి దానంగలిగెడి మహోపద్రవమును నచ్చఁజెప్పి మరల రాజభవనమునకుఁ గొనివచ్చెను. కృష్ణరాయఁడు సిగ్గుపడియు భయపడియు నూరకుండక యొకింతతెగింపునకు సాహసించి 'అప్పా! ఏమని చెప్పుదు. ఆమెయెడ నాకుఁ బ్రేమ మగ్గలమై యున్నది. ఆమెను విడిచి నేను బ్రదుకఁజాలను. ఆమెను వివాహము చేసికొందునని వాగ్దానము చేసి యున్నాఁడను. రాజ్యవియోగము నైన భరింపగలను గాని యామెతోడి వియోగమును భరింపఁజాల. నాకెట్లు సామ్రాజ్యమును సమకూర్చి పెట్టితివో అట్లే నాప్రాణనాయిక యైన సర్వాంగసుందరిని నాకు సమకూర్చిపెట్టుము. మాయనురాగము విధివిహితమైనది. దీని వెడఁభాపుట కెవ్వరును సమర్దులు కారు. ఇవిగో నామానప్రాణధనంబులు నీకు సమర్పించుచున్నాఁడ " నని దైన్యభావము దేఁటపడఁ బలుకుచు బహుభంగుల వేడుకొనియెసు. అప్పుడు తిమ్మరుసు దీర్ఘముగా నాలోచించి యిఁకఁ దాను ప్రతిబంధకములఁ గల్పించి వారల నెడఁబాపుట తనకును సామ్రాజ్యమునకుఁ గూడ ముప్పు వాటిల్లఁజేయునని గ్రహించి లోకనిందకుఁ బాత్రముగాకుండ నుండు విధమునఁ గార్యసానుకూల్యము గావింతునని యాప్రభునకు వాగ్దత్తముచేసెను. అంతఁ గొన్నిదినములకు శ్రీరంగపట్టణాధీశ్వరుం డగు వీరశ్యామలరాయని పుత్త్రికయగు తిరుమలమ్మ నిప్పించి కృష్ణరాయనికి వివాహము గావించెను. ఆవివాహమహోత్సవమంతయు ముగిసినవెనుక నొక మహాభవనమును నిర్మింపించి యందు తిరుమల్దేవిని చిన్నాదేవినిఁ బ్రవేశపెట్టించెను. నాఁట నుండియు రాయఁడును, ప్రభువులును, ప్రజలును చిన్నమ్మను గూడఁ బట్టపురాణిగ భావించి చిన్నాదేవి యని సమ్మానించు చుండిరి. తిరుమల్దేవికిని చిన్నాదేవికిని భేదమునెంచకయే యుభ

  • చిన్నాదేవి వేశ్యాంగనాపుత్రికయని కృష్ణరాయని సమకాలీనులగు 'పేయస్, సన్నిజు' అను పోర్చుగీసు చరిత్రకారులు వివరముగా వ్రాసియుండుటచేత నిది యధార్థమని యొప్పుకొనక తప్పదు. శ్రీకృష్ణదేవరాయని యాస్థానకవులుగా నుండి స్వారోచిషమనుసంభవమును, పారిజాతాపహరణమును వాని కంకితము గావించిన అల్లసాని పెద్దనామాత్యకవియు, నందితిమ్మనామాత్యకవియుఁ గూడ :-

“క. ఆవిభుననంతరంబ ధ
    రావలయముఁ దాల్చె గృష్ణరాయఁడు చిన్నా
    దేవియు శుభమతి తిరుమల
    దేవియునుం దనకుఁ గూర్చు దేవేరులుగాన్. "
                                              (మనుచరిత్రము)

“క. శ్రీ వేంకటగిరి వల్లభ
    సేవాపరతంత్రహృదయ చిన్నమదేవీ
    జీవితనాయక కవితా
    ప్రావీణ్యఫణీశ కృష్ణరాయమహీశా. "
                                              (పారిజాతాపహరణము)

యరాణుల నొక్కరీతి సామ్రాజ్యమునఁ బూజించుచుండిరి. కృష్ణరాయఁడు తనరాణులలో నెల్ల నీమెయెడనె యెక్కువ మక్కువ కలిగి యుండె నని చరిత్రకారులు వ్రాసిరి. ఈమె జ్ఞాపకార్థము కృష్ణరాయఁడు విజయనగరములో నాగలాపురమనియెడు నొకగొప్పపేటను మిగులరమ్యముగా నుండునటులు గట్టించి చుట్టును ప్రాకారమును నిర్మింపించె నఁట. ప్రభువర్గములో జేరినవారలలో బెక్కండ్రు దివ్యభవనములను గట్టి కాపుర ముండునటుల గావించెను. ఇందు మైలున్నరపొడవును నలువదిమూళ్ళవెడల్పును గలయొకవీధి సొగసుగా నిర్మింపఁబడినది. ఈవీధిని చరిత్రకారులనేకు లభివర్ణించి యుండిరి. కృష్ణరాయఁడు తఱుచుగా నిందే నివసించుచుండును. ఈ నాగలాపురమునకు వచ్చెడిసరకులపై వేయఁబడిన సుంకములవలన నలువదిరెండువేల వరహాలు వసూలు చేయఁబడుచుండె నఁట ! ఈయదృష్ట మంతయును చిన్నాదేవమ్మగారి దనుటకు సందియములేదు. కృష్ణదేవరాయని మనోభీష్టమునకు విరుద్ధముగా వర్తించి తిమ్మరుసు వీరల యనుసంధానమునకు విఘాతముచేసి యుండెనేని చరిత్రము మాఱి యుండును. తిమ్మరుసు దీర్ఘదర్శియై సామ్రాజ్యసంరక్షణమే ప్రధానముగా నెంచుకొని వర్తించుచున్నవాఁ డౌటచే నీయనుకూలదాంపత్యమును సంఘటింపఁజేసి తనకార్యనిపుణత్వము లోకమునకు వెల్లడించెను.

అను పద్యములలో తిరుమల్దేవిని, చిన్నాదేవిని గూడఁ బట్టపురాణులుగ నభివర్ణించి యుండుటయే యిందుకు గొప్పనిదర్శనము. ఏమి కారణముననో ఆముక్తమాల్యదయందు చిన్నాదేవి పేరు విడిచిపెట్టఁబడినది.

తిమ్మరుసుచారపద్ధతి

అసామాన్యప్రజ్ఞాప్రగల్బుఁడు గావున ననుక్షణమును గంటికిఱెప్పవోలె తిమ్మరుసుమంత్రీంద్రుఁడు కృష్ణదేవరాయని సంరక్షించుచుండెను. అతఁడెంత రహస్యముగా నేమి గావించినను మఱుక్షణముననే మంత్రివర్యునికిఁ దెలియుచుండును. తిమ్మరుసవలంబించిన చారపద్దతి యాతనికిఁ దప్ప రాయనికిఁ గాని సామ్రాజ్యమున మఱియెవరికిఁ గాని దెలియకుండెను. ఇట్టి ప్రతిభావంతుఁ డగుటచేతనే తిమ్మరుసును గన్నెత్తి తేఱిపాఱఁ జూచుటకు నెల్లవారు భయపడుచుందురు. ఇతని చారవర్గమునందు స్త్రీలుసు, పురుషులును, కొజ్జాలును గలరు. ఇతనిచే నేర్పఱుపఁబడిన చారుల సంఖ్య యింతయని లెక్కింపనలవికాదు ఒకనాఁడు కృష్ణదేవరాయఁడు తనపై నుండు భక్తివిశ్వాసములచేఁ బ్రజలు విధేయులై యున్నవారో కేవలము తిమ్మరుసు వలని భయముచేత విధేయులై యున్నవారో స్వయముగా బరీక్షింపగోరి పట్టపగ లెవ్వరికి జెప్పకుండ నొక్కఁడు నంతఃపురము బయలుదేఱి నగరములో దూరముననున్న యొకదేవళమును బ్రవేశించెను. అచటి స్థానికు లీతని రాయనిగా నెఱింగి శుద్ధజలంబు లొసంగిన నతఁడు నామతీర్థం బొనరించి తద్దేవతా నివేదనపదార్ధము లుపయోగించి కృతాచమనుఁడై సుఖముగా గూరుచుండెను. ఇంతలో నియమిత స్థానమున రాయఁడు లేకండుటఁ గాంచి తిమ్మరుసు తత్తరింపుచు వెదకుచుండఁ దన చారు లేతెంచి యాతఁ డొంటరిగా దేవళమునకుఁ బోయిన వార్త దెలిపిరి, అతఁ డెంతయు వగచుచు రక్షకసెన్యముతో బోయి కృష్ణరాయనిం గలిసికొనియెను. అతఁ డచ్చెరువందియుఁ గొంచెము కోప మభినయించి “ఏమి పుట్టిమునిఁగినదని యిచ్చటి కేతెంచితి' వని తిమ్మరుసును బ్రశ్నించెను. అంత భయవినయంబు లెనయ మంత్రీంద్రుఁ డిట్లనియెను.

“మహాప్రభూ! దేవరవా రిటవచ్చు టెఱుంగక వెదకుచుండ నొకచారుఁడు రహస్యముగా నేలిక వచ్చినజాడఁ దెల్పి నందునఁ బౌరు లెవ్వరికిని నీనమాచారముఁ దెలియకుండఁ జేసి వేఁటకొఱకు మసప్రభువు బయలుదేఱి వెడలుచున్నాఁడు గావున మీఱందరును సన్నద్ధులై రావలసినదిని కొందఱు సైనికులకు వర్తమాన మంపి యిటకు వచ్చినాఁడను. మీ యిష్టానుసారముగా నేకార్యముఁ దలపెట్టినను నవలీల నిర్వహింప మీయాజ్ఞానువర్తులమై మెలంగు నావంటి మంత్రులుండ సమస్తవైభవముతో నొప్పెడి మందిరమును విడిచి యొంటరిగా నిచ్చటికి రాఁ దగునా ! నీరాక యితరులెవ్వరైనవిన్నచో నెంతవైపరీత్యము సంభవించునో దేవరవారికిఁ బొడగట్టెనేని యింతసాహసకార్యమునకు నొడిగట్టియుండరు. మీవంటిరాజధి రాజులు సామాన్యుల విధముగా నిట్లు రాఁజెల్లునా ? అయ్యో! ఎంతపని చేసితిరి?" అని తిమ్మరుసుమంత్రి న్యాయనిష్ఠుర వాక్యములతో మందలింపఁగా నారాజేంద్రుఁడు మందహాసము చేయుచు నిట్లు ప్రత్యుత్తుర మొసంగెను. ఓమంత్రిపుంగవా! అఘటనాఘటనసామర్థ్యము గల మీవంటి యమాత్యశేఖరు లుండఁగా నిర్విచారముతో మేము యథేచ్ఛాసంచారముఁ జేసినఁ బ్రమాద మేమియుండును ? మీరసామాన్యశక్తిసంపన్ను లగుటంజేసి మీరు తలంచిన పక్షమునఁ దృణము మహామేరు వగును. మీరు కాదన్నచో మహామేరువే తృణ మగును. మీవంటి మహాత్ములు మంత్రులుగా మాకు లభించుట మాపూర్వజన్మభాగ్యము గాని మఱి యొండుకాదు.

ఇట్లు కృష్ణదేవరాయఁడు పలుక నాతని షూటల చమత్కారమునకు మనస్సులో నుప్పొంగుచు తిమ్మరుసు మరల యిట్లనియెను,

దేవా! మే మన నెంతవారము. ప్రభువు నాజ్ఞావిధుల ననుసరించి భయభక్తులతోఁ బ్రవర్తింపవలసినవారము. తృణ గ్రాహియైన నీలమున కెచ్చటను విలువ యధికమే యగును; కాని యది కేవలము తృణమని దానిని గ్రహింపరాదని విడిచినంతమాత్రమున నయ్యది జాతినీలము కానట్లు ప్రభువులు పరిగ్రహించినఁ బ్రజలే సమ్మానార్హు లగుదురు. దేవరవారి ప్రతాపము మూలముసఁ గాని యన్యథా సమర్దత యేలగలుగును ? ఏలిక యాజ్ఞాప్రకారము కార్యములు నడచును. దేవా ! మీయాజ్ఞ యెట్లో అట్లే సమస్తకార్యములు నిర్వహింతుము. దేవరవారింక నగరమునకు విచ్చేయవలయు. అని వినయనయ భయంబు లేర్పడఁ బలికిన తిమ్మరుసు పలుకుల కానందించి రాయండు సదయాత్ముండై యిట్లనియె.

కృష్ణరాయని ప్రార్థనము

మహారాజాధిరాజునై యుండి నేనిట్లొంటరిగాఁ జనుదెంచుట తగనిపని యని నామనంబుస కిప్పుడు దృఢముగాఁ దట్టినది. నారాకను తెలిసికొని రక్షకసైన్యముతో వచ్చినన్ను సంరక్షించి పితృవాత్సల్యమును జూపినందులకు నీకు నేనెంతయుఁ గృతజ్ఞుఁడను. నీహితోపదేశమును శిరసావహించినాఁడను. మహాత్మా! నేను దుష్టనిగ్రహమును శిష్టజనపరిపాలనమును జేసి జగంబున నాచంద్రార్కస్థాయిగా గీర్తిగాంచునట్లనుగ్రహించి నీవును శాశ్వతమైన యశస్సును బడయుము. నాతండ్రి నరసింహదేవరాయఁడు గాని, నాసోదరుఁడు వీరనరసింహదేవరాయఁడు గాని, యీసామ్రాజ్యమును సంపాదించిన సాళ్వ నరసింహరాయఁడు గాని సాధింపలేక విడిచిపెట్టినకార్యములను నేను నిర్వహించుమార్గమును నాకుఁ జూపి నీవుతోడ్పడి విజయమును సమకూర్చవలయును. రాచూరు, ముదిగల్లుదుర్గములు విజాపురసుల్తానుచే నాక్రమింపఁబడినవి. ప్రాగ్దిశాభాగమున నుదయగిరి వఱకు గల ప్రదేశమును గజపతు లాక్రమించుకొనిరి. ఆ దేశములనుండి శత్రురాజులను తఱిమివేసి యాభాగములను మదీయసామ్రాజ్యమునఁ జేర్చుకొని దక్షిణహిందూస్థానమున నేకచ్ఛత్రాధిపత్యమును వహించి పరిపాలింప వలయుసని నాకు పెద్దకోరికఁ గలదు. ఇంతియ గాక యింతసామ్రాజ్యభారమును వహించి నేను కేవలము నాకు సామంతులుగ నున్నవారికడ నుండు సైన్యముల నమ్మి యుండుటకంటె సొంతబలమును గూర్చుకొని యుండుట నాకు శ్రేయస్కరమనుట నీ వెరుంగనిది కాదు. అట్టిబలమును నాకు సమకూర్చి పెట్టవలయును.

అని ప్రార్ధించిన నతడు చిరునవ్వు నవ్వచు 'ప్రభూత్తంసమా! ఇంతమాత్రమునకై నీవు పెద్దగా యోజింప వలయునా? నీమనోభీష్టము ప్రకారము సమస్తకార్యములను జక్కఁబెట్టెదను. ఇంక జుగుసేయక వైళంబ లెమ్ము. మన మిచ్చటనుండుట తగదు. బయలువెడలుద' మని పలికి యతని నొక యేనుఁగుపై నెక్కించి రక్షకసైన్యము వెంటనంటిరాఁగా రాజభవనమునకుఁ దోడ్కొని వచ్చెను,

తిమ్మరుసు హితబోధ

అట్లు రాయనిఁ దోడ్కొనివచ్చి 'మహారాజేంద్రా! అంగరక్షకసైన్యము లేకుండ నొంటరిగ స్వమందిరమును విడిచి యిఁకముం దెచ్చటికి బోనని నాకు వాగ్దానము చేయు” మని ప్రార్థింప నామంత్రిపుంగవుని ప్రార్ధనమును మన్నించి యతం డట్ల వాగ్దానము చేసెను. అప్పుడు తిమ్మరుసు సంతోషసాగరమునఁ దేలియాఁడుచుఁ దనయేలికతోడ నిట్లు మనవిచేసెను.

దేవా ! మీచిత్తానుసారము దిగ్విజయయాత్ర కనుకూలములైన ప్రయత్నములను జేయుటకు నాకు రెండు సంవత్సర ములకాలము గడువీయ వలయును. అశ్వపతులును, గజపతులును, బలవంతులు. వారలతో నొకమాఱుగా వైరముఁబెట్టుకొనుట యనర్ధహేతువు. నీవు నీసోదరపుత్త్రుని దూరముగాఁ భాఱఁద్రోలి పట్టాభిషిక్తుడవై పరిపాలనము చేయఁబూనితివి. నీకు నీసామ్రాజ్యమునఁ బ్రబల శత్రువులు గలరని యెప్పుడు నేమరకయుండుము. నిన్నుఁ బదభ్రష్టుని జేయ నవకాశము కొఱకు నిరీక్షించుచుందురు. ఇట్టి సందర్భమున వెనుకముందు లాలోచింపక బలవంతులతోడ యుద్ధముల కుపక్రమింతుమేని దానఁ బ్రమాదము గలదు. ఇట్టివానికై వేగిరపాటు కూడదు. రాజ్యాంగమును బలపఱచుకొనవలయును. సైన్యములను సమావేశపఱచుకొని తగు సంస్కారములను గావించి సంసిద్ధముగా నుంచుకొనవలయును. అర్దంబులను దెచ్చి భండారము నింపవలయును. ప్రధానదుర్గంబులు తృణకాష్టజలసమృద్ధంబు లగునట్లుగా సిద్ధపఱచుకొనవలయును. దుర్గప్రాకారములను, వప్రంబులను, కొమ్ములను, క్రొత్తతళంబులను, అగడ్తలను, అట్టళ్లను, జంత్రంబులను, అనువుపఱచుకొని, ధాన్యంబులాదిగా వస్తువర్గముల సమకూర్చుకొని, విశ్వాసపాత్రులైన దొరలను పాలెములందు గొలువు నిలిపి యెట్టివారి కభేద్య మగునట్లు గావించుట ప్రథమకర్తవ్యము. వీని నన్నిఁటిని జక్కపఱచుకొని యసంఖ్యాకంబు లగుబలంబులతోడ దండయాత్రలకు వెడలినచో నవలీల విజయమును బడయవచ్చును. కావున దేవర వారు రెండు సంవత్సరముల కాలము వేచి యున్నపక్షమున నేను చెప్పిన చొప్పున సామ్రాజ్యమును దిటవు పఱచి దండయాత్రలకు సైన్యము సన్నద్ధము గావింతును. ఎదిరిబలమునకును తనబలమునకును గల తారతమ్యమును దెలిసికొనకుండ యుద్దమునకుఁ గడంగుట చేటునకు మూలము. అసాధ్యమైనది ప్రజ్ఞచే సాధ్యమగును. నీవు సాహసంబున విక్రమార్కుని మించినవాఁడ వౌదువు. నీవు సంగ్రామధనంజయుండవని నేనెఱుంగుదు. నీవు శత్రువుల నవలీల జయింతువు. అందులకు సందియములేదు గాని నేఁ జేయఁబూనిన రాజ్యాంగసైన్య సంస్కారములు ముగియునంతవఱకు నొకించుక కాలము వేచి యుండుట శ్రేయోదాయకము.”

అని బోధించి పిమ్మట తిమ్మరుసుమంత్రి సైన్యసంస్కరణమునకుఁ గడంగెను.

ప్రధమ సంస్కరణము

తనయెడఁ గృష్ణదేవరాయనికి నసూయ జనింపఁజేయు మార్గమునఁ బోక, కార్యసాఫల్యమునే ప్రధానముగాఁ జూచుకొని, తనపై మహాప్రభువునకు భక్తివిశ్వాసములు ముప్పిరిగొను విధముగాఁ బ్రవర్తింపుచుఁ గార్యకౌశల్యమును జూపుచు తిమ్మరుసుమంత్రి జాగరూకుఁడై మెలంగుచుండెను. అయిన రాయనికిఁ దనపై నసూయ పుట్టింపఁ గొందఱు సామంతప్రభువు లపవాదములను వేయుచుండిరి. కృష్ణదేవరాయఁడు తనరాజ్యభారమునంతయును తిమ్మరుసుమంత్రిపై నిడి విద్యా వినోదములం దగుల్కొని ప్రమత్తుఁడై యున్నవాఁడని కొందఱు సామంతప్రభువు లపవాదములు పుట్టింప శత్రురాజులు వానిని విశ్వసించి వారివలన రాయని రాజ్యములోని రహస్యముల గ్రహింపుచు రాయని జయించి వారికి స్వాతంత్ర్య మొసంగెదమని వాగ్దానమునుజేసి సమరసన్నాహములను జేయుచుండిరి. ఈవర్తమానము రాయనికి ముందుగాఁ దెలియవచ్చెను. అప్పుడు వెంటనే కృష్ణదేవరాయఁడు సమయముకాని సమయమైనను తిమ్మరుసును తన సమ్ముఖమునకు రమ్మని వర్తమానము చేసెను. తిమ్మరుసు జపము చేసికొనుచుండగా రాజభటులు వచ్చి రాయనియాజ్ఞను దెలిపిరి. అతఁడు బుద్దికౌశలము గలవాఁడు గావున రాయనితలంపు గ్రహించి జపమును మాని దిగ్గునలేచి యిదె వచ్చెదనని రాజభటులకుఁ దెలిపి యొక దొడ్డిలోనికిఁ బోయెను. రాజభటులును వానిని వెంబడించి పోయిరి. అతఁ డొక తోటకూరమడిలోఁ గూరుచుండి పెద్దపెద్ద మొక్కలను బెకలించి దూరముగాఁ బడవైచుచు, చిన్నమొక్కల జుట్టును మళ్ళుగట్టి సమీపమున నున్న బావిలో నుండి యుదకమును చేది దానిం దెచ్చి యాచిన్న మొక్కలను దడుపుచుండె నఁట! దీని నంతయును జూచిన రాజభటు "లీతఁడు రాజాజ్ఞోల్లంఘన చేయఁదలంచి కాలయాపనకై యీపని పెట్టుకొన్న ట్లున్నది; వెంటనే పోకయున్న మనలను గూడ రాజు శిక్షించు" నన్న భయముచేత మరలి పోయి యావృత్తాంతము నంతయుఁ దెలిపిరి. కృష్ణదేవరాయఁడు తిమ్మరుసుకడనే విద్యాబుద్ధులు నేర్చిన బుద్ధిమంతుఁడు గావున నతఁడు తనయాజ్ఞ నుల్లఘించువాఁడు కాఁడని తాను బాగుగా నెఱింగినవాఁడు గావున నతఁడు చేయుచున్నపని తననిమిత్తమే యని గ్రహించి యందలి రహస్యమును దెలిసికొని తన కనుమానము గలిగించిన పెద్దసామంతులను దొలఁగించి వారిస్థానమున విశ్వాసపాత్రులైన చిన్నసామంతులను నియమించి యాజ్ఞాపత్రముల నొసంగి వెంటనే మీయధికారములను జెల్లింపుఁడని యాజ్ఞచేసి యంతఃపురమందిరమునకుఁ బోయెనఁట ! వారును వానిం గైకొని తమకు వలయు సేనాసహాయముతోఁ బోయి యొకరివర్తమాన మొకరికిఁ దెలియకుండఁ బెద్దసామంతులను దొలఁగించి వారిస్థానముల నాక్రమించుకొనిరఁట ! ఈ వృత్తాంతములను దెలిసికొని పరరాష్ట్ర ప్రభువులు నిరుత్సాహులై యుద్ధప్రయత్నమును మానుకొని రఁట! కృష్ణదేవరాయని సామర్థ్యమును బ్రజలు బహుభంగులఁ గొనియాడు చుండిరి. తిమ్మరుసు బుద్ధివిశేషమును రాయం డభినందించెనఁట. ఈకథ యెట్టిదైనను అనుమానాస్పదమైన వర్తనముగల సామంతులను దొలఁగించి యాస్థానముల విశ్వాసపాత్రులైన సామంతులను నిలిపి ముందు రాఁబోవు నుపద్రవమునుండి సొమ్రాజ్యమును తన నేర్పరితనముచేత తిమ్మరుసు సంరక్షించి నది సత్యమగుటకు సందియములేదు. ఇట్టిపని జరిగినవెనుక నెల్లవారును రాయనిపట్లను మంత్రిపట్లను భయభక్తులతో వర్తించుచుండిరి.

ఇతర సంస్కరణములు

కృష్ణదేవరాయఁడు సింహాసనారూఢుఁ డగుటకు బూర్వము సేనలోఁ గొంతభాగము రాయనివశమునను, మఱికొంతభాగము సామంతప్రభువుల వశమున నుండెడిది. ఈమహారాజ్య మంతయును నాయకరములుగా విభాగింపఁబడి యొక్కొక్క నాయకర మొక్కొక్క రాజాజ్ఞానువర్తియగు నాయకునిచేఁ బరిపాలింపఁబడుచుండెను. ఈనాయకులు రెండు విధములైన తెగలుగ విభాగింపఁబడి యుండిరి. ఒకతెగ నాయకులు తాము జీతములు గైకొనుచుఁ దమనాయకరములో సంపాదించిన యార్షనమంతయును నగరికిఁ బంపెడియాచారము గలవారుగ నుండిరి. వీనినే కేవలనాయకులని చెప్పఁదగును, మఱియొకతెగ నాయకులు గలరు. వీరు పుత్త్రపౌత్త్రానుక్రమముగాఁ బరిపాలనముచేయు సామంతరాజులు. వీరినే అమరనాయకు లందురు. వీరు తమరాజునకై గొంతసేనను సిద్ధపఱచి యుంచు పద్ధతికి లోఁబడి తమనాయకరము లనుభవించుచుండెడివారు. నియమించిన విధమున వీరలకడ నుండు సైన్యములు సంఖ్యలో గొఱవడి యుండుటయెగాక గుణముచేతను గొఱవడియుండుటఁ గనుపెట్టి తిమ్మరుసుమంత్రి యాసైన్యములను సమకూర్చు కార్యము వారలనుండి తొలఁగించి సైన్యమునంతయును దనవశము చేసికొని బలపఱచి యెప్పుడు యుద్ధము తటస్థమైనను యుద్ధము చేయుటకు సిద్ధముగా నుండునట్లు గావించెను. కృష్ణదేవరాయఁడు పరరాష్ట్రాధిపతులతో నెప్పుడు యుద్ధము చేయవలసి వచ్చినను నెంతమాత్రమును సైన్యములకొఱఁత లేకుండ బదిలక్షల సైన్యమును సిద్ధముచేసెను. ఈసైన్యముల వెచ్చమునకుగా నమరనాయకులనుండి కప్పములను కొనుచు సైన్యముల మీఁది యధికారమును తిమ్మరుసుమంత్రి రాయనిపై నుంచెను. అతని యధికారమును వీరువా రనక యెల్లవారును శిరసావహింపవలసినదే. ముప్పదియాఱువేల గుఱ్ఱపుదళమును రాయఁడు స్వయముగాఁ బోషించునట్లు చేసెను. ఎనుమిదివందలయేనుగులనుగూడ రాయఁడు పోషించుచుండెను. ఈరెండు సంవత్సరములలోను గావలసినంత ధనమును బొక్కసములోనికి జేర్చెను. ప్రతి సంవత్సరమును విజయదశమినాఁడు రాయఁడు తన సేనలను బరీక్షించి సైనికులకు బహుమానములు మొదలగునవి చేయునట్లుగ నేర్పాటు గావించెను. ఇట్టి యేర్పాటుల యొక్క ప్రయోజనమును జక్కఁగా గ్రహించి శ్రీకృష్ణదేవరాయఁడు తనజన్మము సార్థక్యము నొందింప భూతలముపై నవతరించిన దేవగురునిగా తిమ్మరుసును సంభావింపుచుఁ నాతనికిఁ గృతజ్ఞుఁడై తనవలన నాతనికి నాతనివలనఁ దనకు లోకముస గౌరవము కలుగునట్లుగాఁ జాలకాలము ప్రవర్తించెను.

విద్యా గోష్ఠి

ఈమంత్రి శిఖామణి సంస్కృతాంధ్రములందు నసామాన్యపాండిత్యము గలవాఁడు. కర్ణాటాంధ్రపారసీకభాషలలో వ్యవహారము జరుపనేర్చిన వ్రాయసకాడు. పలుభాషలు ముచ్చటింపనేర్చిన ప్రెగ్గడ. ఇతఁడు సంస్కృతమునం దపారమైన ప్రజ్ఞ గలవాఁడగుటకు సగస్తేశ్వరవిరచితమైన సంస్కృత బాలభారతమునకు నితఁడు చేసిన వ్యాఖ్యయే గొప్పనిదర్శనముగాఁ జూపవచ్చును. ఇతఁడు సంస్కృతాంధ్రసాహిత్యము గలవాఁ డగుటచేతనే ప్రసిద్ధకవీంద్రు లనేకు లీకృష్ణదేవరాయని యాస్థానమునకుం జేరుకొనిరి. వారిలోఁ ప్రధానులు అల్లసాని పెద్దనామాత్యుఁడును, నంది తిమ్మనామాత్యుఁడు నై యుండిరి. మొదటివాఁడు నందవరీకనియోగిబ్రాహ్మణుఁడు; రెండవాఁ డార్వేలనియోగి బ్రాహ్మణుఁడు. వీరు మహాకవులుగాఁ బరిగణింపఁబడు చున్నను కృష్ణరాయని కాలమున మండలాధికారులుగఁ గూడ నుండిరి. వీరు నిరంతరముసు రాయని వెంబడించి యున్నవారు గావున వీరిని మంత్రివర్గములోఁ జేర్పవచ్చును. వీరికి రాయనికడ సర్వస్వాతంత్ర్యమును గలదు. వీరి కిట్టిసమ్మానము గలుగుట సాళువ తిమ్మమంత్రీంద్రుని భాషాపక్షపాతమును, కవిత్వమునందలి ప్రేమయును దక్క వేఱొండు గారణము గానరాదు. బొడ్డుచర్ల తిమ్మనామాత్యుఁడను కవీంద్రుఁ డొకఁడు కలఁడు. అతఁడు రాయనితోఁ జతురంగ మాడుటకై నియోగింపఁబడియెను. ఇతఁడు నందవరీక నియోగిబ్రాహ్మణుఁడు. మొదట కొప్పోలు గ్రామమునకుఁ గరణముగా నుండి కవీశ్వరదిగ్ధంతి యను ప్రతిష్ఠ గలవాఁడై చదరంగపుటెత్తులు వేయుటయం దసమానప్రజ్ఞాఢ్యుడుగ నుండెనఁట. ఈబొడ్డుచర్ల తిమ్మకవీంద్రుఁడు తిమ్మరుసుమంత్రి ప్రాఫునఁ గృష్ణదేవరాయని ప్రేమమున కాస్పదుఁ డయ్యెను. శ్రీకృష్ణదేవరాయని పక్షమున నెంద ఱాలోచించి యెత్తు వేయుచున్నను నీతఁ డొక్కఁడే యెదురెత్తువేసి యాట గెల్చుచు వేయార్లు పందెము గొనుచుండెడివాఁడని యీక్రింది పద్యమువలనఁ దేటపడఁగలదు.

"క. శతసంఖ్యు లొక్కటైనను
    సతతము శ్రీకృష్ణరాయజగతీపతితోఁ
    జతురంగ మాడి గెల్చును
    ధృతిమంతుఁడు బొడ్డుచర్లతిమ్మనబళిరే."

"ఉ. ధీరుఁడు బొడ్డుచర్ల చినతిమ్మనమంత్రి కుమారు డంచితా
     కారుఁడు సత్కళావిదుఁడు కౌశికగోత్రుఁడు పద్మనేత్ర సే
     వారతబుద్ధి నందవరవంశ్యుఁడు సత్కవిలోకనాథుఁ డా
     చారసమగ్రవర్తనుఁడు చారవచస్థ్సితి నొప్పువాఁ డొగిన్."

ఇతని శక్తిచాతుర్యములకు సంతోషించి కృష్ణదేవరాయఁడు కొప్పోలు గ్రామమునకు కృష్ణరాయవుర మని పేరిడి సర్వాగ్రహారముగా నీతనికి ధారపోసెను. శ్రీకృష్ణదేవరాయఁడు క్రీ. శ. 1509 వ సంవత్సరము మొదలుకొని 1512 వ సంవత్సరమువఱకు విద్యావినోదగోష్ఠియందే కాలము గడపెను. తిమ్మరుసుమంత్రియు రాజ్యాంగసంస్కరణమునందు మాత్రము తనబుద్ధినంతయుఁ జొనిపి యూరకుండక దానుగూడ విద్యా వినోదకార్యములయందు భాగస్వామియై కాలము పుచ్చుచుండెను. తిమ్మరుసు శిక్షణముచేతనే రాజ్యాంగవిషయమున నెట్లో అట్లే విద్యావిషయమునఁగూడ కృష్ణదేవరాయఁడు ప్రఖ్యాతి గాంచ గలిగెను. ఈ రెండు సంవత్సరముల కాలములోనే అల్లసాని పెద్దనామాత్యుని కాంధ్రకవితాపితామహుఁడన్న బిరుదము లభించినది. ఇతనికి నందితిమ్మనామాత్యునకు నగ్రహారములను బెక్కింటిని ధారపోసెను. శ్రీకృష్ణదేవరాయఁడు మహాసామ్రాజ్యభోగముల ననుభవించుట మాత్రమే గాక సరస కవితావిలాసలాలసుఁడై తిమ్మనాది కవీంద్రుల పలుకుఁదేనియలఁ జూఱలఁగొని తానును సంస్కృతాంధ్రములందు సరస కవిత్వము చెప్పఁగల్గిన కవిరాజ శిఖామణియై కవీంద్రలోకమునఁ గడుఁ బ్రఖ్యాతిఁ గాంచెను. “మణివావలయం వలయేన మణి” అనునట్లు తిమ్మరుసు మూలమున కృష్ణరాయనికీర్తియు విద్యాధికప్రపంచమునకు విదిత మాయెను.

ఎట్టి ప్రఖ్యాతిని గాంచినకవి యేతెంచినను రాయనికంటె ముందుగాఁ దిమ్మరుసుచే నాతిథ్యమును బొంది సమస్తవిధముల సమ్మానింపఁబడుచుండెను. కనుకనే తిమ్మరుసునకు కవీంద్రపక్షపాతి యని పేరు వచ్చెను. ఒకప్పు డేకారణము చేతనో రాయని యాస్థానకవులు భట్టుమూర్తికవి నవమా నించినఁ గుపితుఁడై తిమ్మరుసును రాయనిగూడ తనపట్ల నలక్ష్యముగలవారై యున్నవారని తలపోసి మహోగ్రుఁడై యీక్రింది యుత్పలమాలికను జెప్పెనఁట.

ఉ. లొట్ట యి డేటిమాట పెనులోభులతో మొగమోట మేల తాఁ
    గుట్టక యున్న వృశ్చికము గుమ్మర పుర్వని యందురే కదా
    పట్టపురాజుపట్టి సరిపల్లెసరాసరి యీయ కున్న నేఁ
    దిట్టక మాన నామతము తీవ్రమహోగ్రభయంకరంబుగాఁ
    దిట్టితినా మహాగ్రహమతి౯ - మకరగ్రహజర్జరీభటా
    పట్టపుదట్టఫాలఫణిభర్తృబహూకృత పర్జటస్ఫుటా
    ఘట్టనదట్టణాలకవిఘట్టనిరర్గళరాజభృత్యకీ
    చట్టచటార్భటీనయనజర్జరకీలలు రాలఁ గా వలెన్
    జుట్టరికంబునం బొగడఁ జూచితినా రజతాద్ర్యధిత్యకా
    పట్టణమధ్యరంగ గతభవ్యవధూవదనానుషంగసం
    హట్టశిరస్థ్సగాంగఝరహల్ల కజాలసుధాతరంగముల్
    చుట్టుకొన న్వలెన్ భువనచోద్యముగా భయదంబుగా మఱిన్
    దిట్టితినా సభాభవనధీంకృతభీమనృసింహరాడ్డ్వజా
    తాట్టమహాట్టహాసచతురాస్యసముద్భృకుటీతటీనటీ
    కోట్టణరోషజాలహృతకుంఠితకంఠగభీరనాదసం
    ఘట్టవిజృంభమాణగతి గా వలె దీవనపద్య మిచ్చి చే
    పట్టితినా మణీకనకభాజనభూషణభాసురాంబరా
    రట్టతురంగగంధగజరాజదమూల్యఘనాతపత్రభూ
    పట్టణచర్మహర్మ్యభటపం జ్త్కిచిరాయురనామయంబు నై
    గట్టిగఁ దోడుతో వెలయ గా వలె నెక్కువఠీవిఁ జూడుఁడీ
    య ట్టిటు మందెమేలముల నందఱనుంబలెఁ జుల్కఁ జూచి యే
    పట్టున నైనఁ గేరడము వల్కకుఁ డీపయిపెచ్చు నందులన్

గొట్టుదు దుష్కవిద్విరదకోటులఁ బంచముఖోద్భటాకృతిన్
బెట్టుదు దండముల్ సుకవిబృందము కే నతిభక్తి సారెకున్
గట్టితి ముల్లె లేఁబదియుఁ గా గలనూటఁబదాఱు రెయ్యెడన్
దట్టడిభట్టుమూర్తికవి రాయనిమార్గ మెఱుంగఁ జెప్పితిన్ .

అని యాగ్రహించి చెప్పినంతవఱకు రాయఁ డీబ్రాహణ కవివరుల దురాలోచన మెట్టిదో నేనెఱుంగను. నన్నేలతిట్టెదవని యనర్ఘబహుమాసము లొనరించి గాఢాలింగనంబు గావించెనఁట. అందులకు సంతసించుచు భట్టుమూర్తి యీక్రింది పద్యముచే రాయని స్తుతించెనఁట.

ఉ. ఆబ్జముభీమనోబ్జ నరసాధిపనందన కృష్ణ నీయశం
    బబ్జక రాజ్ఞజాబ్జనయనాబ్జవిలాసము నీపరాక్రమం
    బబ్జక రాబ్దజాబ్జనయనాబ్జ విలాసము నీవితీర్ణిమం
    బబ్జక రాబ్జజాబ్జనయనాబ్జవిలాసము చిత్ర మిధ్ధర౯".

అప్పుడు భట్టుమూర్తి తిమ్మరుసుం జూచి నీప్రోత్సాహంబున కవు లీవిషమాలోచనము గావించిరి. నేను నీకు కై వారం బొసఁగకుండుట కారణంబుగా వీరిం బురస్కరించుకొని నన్నవమానింషఁ జూచితివి ; కానీ,

"శా. గుత్తిం బుల్లెలుకుట్టి చంద్రగిరిలోఁ గూ డెత్తి పెన్గొండలో
     హత్తిన్ సత్రమునందు వేఁడి బలుదుర్గాధీశుతాంబూలపుం
     దిత్తు ల్మోసి పదస్థు లైనఘనులన్ దీవించ

అనునంతవఱకుఁ జెప్పునప్పటికిఁ దిమ్మరుసు దుష్కీర్తికి వెఱచి కృష్ణరాయఁడు బట్టాభిషేకసమయంబున నొసంగిన యమూల్యం బగు గారుత్మతరత్నహారంబు కవి కంఠంబు నలంకరించినఁ బ్రహృష్టుఁడై ................ దీవించెదన్

మత్తారాతియయాతినాగమసుతున్ మంత్రీశ్వరుం దిమ్మరు౯"." అని పూరించి,

"కం. అయ్య యనిపించికొంటివి
     నెయ్యంబునఁ గృష్ణరాయనృపపుఁగపుచే
     నయ్యా నీసరి యేరీ
     తియ్యనివిలుఁకాఁడవయ్య : తిమ్మరుసయ్యా: "

అని శ్లాఘించి నఁట! ఆంధ్రకవులం గూర్చిన కధ లిట్టి వనేకములు గలవు. ఆకథ లన్నియు నాయాకవుల చరిత్రమునఁ గాని కృష్ణరాయని చరిత్రమునఁ గాని యుదాహరింపఁ దగినవై యున్నవిగావున నిట వివరింపలేదు.


__________