తిమ్మరుసు మంత్రి/అష్టమ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


అష్టమప్రకరణము

మఱునాఁడు తిమ్మరుసు ప్రయాణభేరి మ్రోగించెను. సేనాధిపతులందఱును తమతమ సైన్యములతోఁ బ్రయాణోన్ముఖులై యుండిరి. ఎచటఁ జూచినను భేరీమృదంగపణవాది తూర్యనినాదంబులు చెలంగుచు నింగి నిగిడెను. సైన్యాధిపతుల శంఖారావంబులును, ఏనుగుల ఘంటానాదంబులును బెల్లుగా మొఱసెను. వీరసైనికుల ఘంటలమ్రోత బెట్టిదంబయ్యెను. వందిమాగధుల కైవారంబులు మిన్ను ముట్టెను. రాజపురోహితులైన బ్రాహ్మణులు స్వస్తివాచకములు పఠించుచుండిరి. ఆమహానగరంబున నెక్కడ విన్నను నుత్సాహవాక్యములేగాని యన్యంబులు వినరావు. తల్లులు తమపుత్త్రులను, అక్క సెల్లెండ్రు తమ సోదరులను, భార్యలు తమభర్తలను తక్కుంగల స్త్రీలు తమబంధుసైనికులను రణోన్ముఖులను గావించి ప్రోత్సహించి వీరప్రవచనంబు లాడుచుండిరి.

దండయాత్ర వెడలుట

అట్లత్యుత్సాహముతో సైనికు లెల్లరు సమరోన్ముఖులై యుండ సకలసైన్యాధ్యక్షుఁడగు తిమ్మరుసుమంత్రీంద్రునిచే ననుజ్ఞాతులై ముఖ్యసేనాధిపతులు తమతమ సైన్యములతోడను, పరివారజనంబుతోడను, వస్తుసామగ్రితోడను ప్రాగ్దిశా ముఖంబున నొకరిని వెంబడించి యొకరు నడువ నారంభించిరి. అవసరమైనప్పుడు తెప్పించుటకై మూడులక్షల సైన్యమును నగరమున గోవిందామాత్యుని యాధిపత్యముక్రిందను మూలబలముగా నుంచెను. అట్లుంచి, విస్ఫురితభూషణభూషితంబైన గంధసింధురంబునెక్కి వెలిగొడుగులు మెఱయ నలంకారంబులఁ దఱచైన వజ్రంబుల నుద్దామంబులగు దీధితిస్తోమంబులును జూమరంబులును గలయం బొలయ బహురత్న ప్రభాసితంబైన గరుడధ్వజంబుఁ గ్రాలుచుండఁ గృష్ణదేవరాయ ధరణీవల్లభుండు తనరాణులతోఁ జనుదేర సకలచమూపతిత్వపదభాసితుఁడైన తిమ్మదండనాధాగ్రణి సమస్త సైన్యములను నడిపించుకొనుచు దండయాత్ర బయలువెడలెను. అల్లసాని పెద్దనామాత్యుఁడు, నంది తిమ్మనామాత్యుఁడు మొదలగు కవివర్యులును, రంగనాధ దీక్షితులు, మొదలగు రాజపురోహితులును, వైష్ణవస్వాములగు తాతాచార్యాది గురుజనంబులును, మఱియు ననేక బ్రాహ్మణ విద్వద్బృందమును, వారి ననుగమించిరి. ఒకమహానగరము శుభోత్సవమునకై తరలిపోవుచుండున ట్లుండెను.

ఉదయగిరి ముట్టడి

ఇట్లు క్రీస్తుశకము 1513 వ సంవత్సరములోఁ బూర్వ దిగ్విజయమునకై దండయాత్ర వెడలి రాయనిసైన్యంబు వచ్చుచుండఁ జారులవలన నంతవృత్తాంతమును ప్రతాపరుద్రగజపతి పిన్నతండ్రి తిరుమలకాంతరాయఁడు విని గజపతి కావార్తను బంపి తా నుదయగిరి దుర్గమును బలషఱుచుకొని పదివేల కాల్బలమును, నాలుగువందల గుఱ్ఱములును గల సైన్యమును దుర్గములోనికిఁ జేర్చుకొని దుర్గమును సంరక్షించుచుండెను. తినుబండారమున్నంతవఱకు నీస్వల్పసైన్య మెంతకాలమైనను, ఎంతసైన్యము ముట్టడించినను నిలిచి పోరాడఁగల సామర్థ్యము గలిగి యుండెను. ఒకచిన్నత్రోవఁ దక్క దుర్గమునకుఁ బోవ వేఱొకదారి లేక యుండెను. ఇట్టి యభేద్యమైన దుర్గమును శ్రీకృష్ణదేవరాయఁడు ముట్టడించెను. దుర్గములోనివారికాహార పదార్థము లందకుండఁ జేసిన దుర్గమును వశపఱతురని తిమ్మరుసును రాయలును నిశ్చయించి కోటను ముట్టడించి విడిచి యుండిరి. ఇంతలో గజపతి లక్షసైన్యమును దుర్గసంరక్షణార్థము పంపించెనుగాని, అప్పటికే శత్రుసైన్యముచే ముట్టడింపఁబడి యుండుటచేత నాసైన్యము వచ్చిన ప్రయోజనము లేకపోయెను. తిమ్మరుసు దండనాథాగ్రణి గజపతిసైన్యము వచ్చుచున్న వార్త విని ఉదయాద్రిముట్టడికై రాయసము కొండమ రుసయ్యను వాని సైన్యములను నిలిపి కృష్ణరాయని నాదళవాయికిఁ దోడ్పాటుగా నుండి దుర్గమును వశపఱచుకొనవలసినదని చెప్పి తక్కిన తనసైన్యము నంతయుఁ దరలించుకొని శత్రు సైన్యమున కెదురుగాఁ బోయి మార్కొని ఘోరసంగ్రామ మొనరించుచుండెను. రాయసము కొండమరుసయ్య రాయనితోఁ గలిసి యత్యుత్సాహముతోఁ గోటను బదునెనిమిది మాసములు ముట్టడించి యున్నను స్వాధీనముగానందునఁ బోరుచుండెను. బహువిధముల నష్టపడి తుదకుఁ గొండలను బగులఁ గొట్టించి విశాలములైనబాటల నేర్పఱచుకొని దుర్గమునుసమీపించి యాకలిబాధచేఁ దపింపుచు గుహలలోనుండి సింహములవలె వెలువడి పోరాడుశత్రుభటుల నెదుర్కొని వారల సంహరించి శ్రీకృష్ణదేవరాయఁడు దుర్గమును వశపఱచుకొని తద్దుర్గాధ్యక్షుఁడైన తిరుమలకాంతరాయని జెఱఁ గొనియెను. రాయని విజయంబునకుఁ దిమ్మరుసు సంతోషించి ఉదయగిరి రాజ్యమునకుఁ గొండమరుసయ్య దండనాధుని నేకధురంధరనిగా (గవర్నరు) నియమించెను. అతఁడు దేశమును స్వాధీనపఱుచుకొని న్యాయపరిపాలనమును నెలకొల్పి చక్కని కట్టుబాటులను గావించి విజయనగరముననున్న మూలబలములోని కొంతసైన్యమును తిమ్మరుసు సమ్మతినిగొని రప్పించి యుదయగిరిరాజ్యరక్షణమునకై నిలిపి తానును, రాయలును, తిమ్మరుసును గలిసికొనఁ బోయిరి. ఉదయగిరి మొదలుకొని నరపతి సైన్యములకును గజపతిసైన్యములకును రెండు సంవత్సరముల కాలము ముమ్మరమైన యుద్ధము జరుగుచుండెను. జయము లభించినకొలఁది తిమ్మరుసు సైన్యములు ముందుకు జరుగుచుండ గజపతి సైన్యములు వెనుకకుఁ గ్రమముగాఁ బోవుచుండెను.

ఉదయగిరిదుర్గము, అద్దంకి దుర్గము, వినుకొండదుర్గము, బెల్లముకొండదుర్గము, నాగార్జునకొండదుర్గము, తంగేడుదుర్గము, కేతవరదుర్గము, కొండవీటిదుర్గము మొదలగునవి గజపతిరాజ్యలోనివి. ఇవి యన్నియును, గృష్ణానదికి దక్షిణభాగమున నున్నవి. వీని కన్నిఁటికిని ముఖ్యస్థానము కొండవీఁడు. ఈకొండవీటి దుర్గమునందు ప్రతాపరుద్రగజపతి కుమారుఁడు వీరభద్రగజపతి నివసించు చుండెను. ఉదయగిరిదుర్గమును కృష్ణదేవరాయఁడు ముట్టడించె నని విని వీరభద్రగజపతి కుమారహంవీర మహాపాత్రునికుమారుఁడు వీరభద్ర పాత్రుఁడు, రాచూరి మల్లఖానుఁడు, ఉద్దండఖానుఁడు, పూసపాటి రాచిరాజు, శ్రీనాధరాజు, లక్ష్మీపతిరాజు, పన్యామలకసవాపాత్రుఁడు, పశ్చిమ బాలచంద్రమహాపాత్రుఁడు మొదలుగాఁగలనాయకు లనేకులను జేర్చుకొని కర్ణాటసైన్యముల నెదుర్కొని కొంతకాలము పోరాడియు బహిరంగ ప్రదేశమున నిలువం జాలక పలాయితుఁడై కొండవీటిదుర్గములోఁ దాఁగొనియెను. తిమ్మరుసు గజపతిసైన్యములను దఱుము కొనుచుఁబోయి వరుసగా అద్దంకిసీమ, వినుకొండసీమ, బెల్లముకొండసీమ, నాగార్జునకొండసీమ, తంగేడుసీమ, కేతవరముసీమ, కొండవీటిసీమ వశపఱచుకొనియెను. పూసపాటి రాచిరాజు తక్క తక్కిననాయకు లెల్లరును కొండవీడు దుర్గములోఁ బ్రవేశించిరి. రాచిరాజుమాత్రము కృష్ణ దాటి పోయెను. రాచిరాజు ప్రతాపరుద్రగజపతియల్లుఁడు. ఇప్పటి విజయనగర సంస్థానాధీశ్వరు లీరాచిరాజు వంశములోని వారని చెప్పఁదగును.[1]

కొండవీడును ముట్టడించుట

తిమ్మరుసుమంత్రి క్రీ.శ. 1515_వ సంవత్సరము మార్చినెలలో కొండవీటిదుర్గమును ముట్టడించెను. ప్రతాపరుద్రగజపతి కొండవీటిముట్టడిని విడిపించుటకై వేయిమున్నూఱు గజబలముతోడను, ఇరువదివేల గుఱ్ఱపుదళముతోడను, అయిదులక్షలకాల్బలముతోడను వచ్చుచున్నాఁడని తిమ్మరుసు విని తాను కొండవీడును ముట్టడించి స్వాధీనముఁ జేసికొందుననియు, ప్రతాపరుద్రగజపతిని కృష్ణరాయం డెదుర్కొని తఱిమి వేయవలసిన దనియు రాయనికిఁ జెప్పెను. అతఁ డందుల కంగీకరించి తక్కిన సేనానులను గూర్చుకొని కృష్ణానదీప్రాంతముస గజపతి సైన్యములతోఁ దలంపడి ఘోరమైన యుద్ధము గావించెను. కృష్ణరాయఁడు కృష్ణ దాటి వేడూరుకడను ప్రతాపరుద్రగజపతిని మార్కొని యుద్ధము చేసి యోడించి తఱిమెను. ఇక్కడ తిమ్మరుసుమంత్రి రెండుమాసములకుఁ బై గా ముట్టడించియుండి శత్రుదుర్గమును క్రీ.శ. 1515.దవ సంవత్సరము జూనునెల 23. తేదిని స్వాధీనపఱచుకొని వీరభద్రగజపతిమొదలుగా పాత్రసామంతుల నందఱను జెఱఁగొనియెను. ప్రతాపరుద్రుని హతశేషసైన్య మంతయును జెల్లాచెదరై పోయెను. తిమ్మరుసుప్రతిజ్ఞ నెఱవేఱెను. కృష్ణకు దక్షిణభాగమున గజపతిప్రభుత్వము తుదముట్టెను. కృష్ణరాయఁడు కొండపల్లి దుర్గమును మూఁడునెలలు ముట్టడించి స్వాధీనపఱచుకొని ప్రతాపరుద్రగజపతి భార్యలలో నొక్కతెను, పలువురుసేనానులను జెఱఁగొనియెను. శ్రీకృష్ణదేవరాయఁడు పూర్వదిగ్విజయయాత్రలోఁ జెఱగొన్న గజపతిసంబంధీకుల నెల్లరను విజయనగరమునకుఁ బంపివేసెను. కొండవీటిరాజ్యమును బరిపాలించుటకై రాయఁడు తిమ్మరుసునే పాలకునిగా నియమించెను. కాని కృష్ణరాయని వెంబడించి పోవుట కై తిమ్మరుసుమంత్రి తన మేనల్లుఁ డైననాదిండ్ల అప్పామాత్యునికి కొండవీటిరాజ్యమున కాధిపత్య మొసంగెను.

శ్రీకృష్ణదేవరాయని సాహసము

ఇట్టి విజయమునకు గర్వించి కృష్ణదేవరాయఁడుప్రతాపరుద్రగజపతికి నివాసపట్టణ మై రాజధానీనగర మై యున్న కటకమును బట్టుకొనవలయు నని సంకల్పించెను. తిమ్మరుసు దానిని గ్రహించి రాయని కిట్లు హితవు గఱపెను. ఓమహా రాజేంద్రా! మనము రాజధానిని విడిచి యిప్పటికే బహుదూరము వచ్చి యున్నారము. ఇంతటితోఁ దృప్తి నొందక మనము ముందునకు సాగితిమేని మనబలము క్షీణించుటయును, శత్రుఁబలము పెరుఁగుటయు సంభవించును. గజపతి బలాఢ్యుఁడైన శత్రువు గాని సామాన్యశత్రువు గాఁడు, అతని జయించుట కష్టసాధ్యము. ఇంతటితో మనము తృప్తి నొంది వెనుకకు మరలుట యుత్తమమార్గ మని తోఁచు చున్నది. అని తిమ్మరుసు రాయని దండయాత్రనుండి మరలింపఁ జూచెను గాని మహాపరాక్రమవంతుఁడైన యామహాప్రభువు "అప్పా ! అడ్డు పెట్టకుము. శత్రువు నవలీల జయింతును. సైన్యము చాలకయున్న విజయనగరమునుండి తెప్పింపుము. దండయాత్ర కటకపురినిఁ బట్టుకొని ప్రతాపరుద్రుని వశపఱచుకొన కుండ నిలుపుట నాకెంతమాత్రము నిష్టము లేక యున్నది. కావున నీవు సత్వరముగా విజయనగరము సైన్యముల కై సమాచారమంపి ముందుకు ప్రమాణము సాగింపు మని పలికెను. అంత తిమ్మరుసు భయమును సంశయమును బొందినవాఁ డయ్యును రాయనికిఁ దెలి యనీయక యతఁ డెట్లును మానువాఁడు గాఁడని గ్రహించి యిష్టము లేకపోయినను సమ్మతింప వలసినవాఁడయ్యెను. అట్లనే కానిమ్మని పైనిచెప్పిన ప్రకారము కొండవీటిరాజ్యమునకుఁ దనమేనల్లుఁడైన నాదిండ్ల అప్పామాత్యుని బ్రభువునుగాఁ జేసి తాను గృష్ణరాయనితోడ రాజమహేంద్రపురదుర్గమును ముట్టడింపఁ బోయెను. దారిపొడవునను గజపతి సైన్యములతోడ యుద్ధమును జేయుచునే యుండెను. ఓడించిన కొలఁది గజపతి సైన్యములు నిరుత్సాహముం జెందుచు వెనుకకుఁ బాఱుచుండుటయు, రాయని సైన్యము లుత్సాహవంతములై తరుముకొని పోవుచుండుటయు సంభవింపుచుండెను. కొన్నినెలలకు విజయనగరమునుండి సైన్యములువచ్చి రాయని సైన్యములఁ గలిసికొనియెను.

రాజమహేంద్రపురమును గైకొనుట.

ఇట్లు లక్షలకొలఁది సైన్యములను నడిపించుకొనుచుఁ గృష్ణదేవరాయఁడును, సైన్యాధ్యక్షుఁడగు తిమ్మరుసుమంత్రియును కృష్ణాగోదావరీమధ్యస్థమైన దేశము నంతయును స్వాధీనపఱచుకొని గోదావరినదిని సమీపించిరి. మొదట గోదావరిని దాటి శత్రువులను బాఱద్రోలి రాజమహేంద్రపురము నాక్రమించుకొన్నసేనాని ఆకువీటి యిమ్మరాజు; పింగళి సూరనామాత్య కవిపుంగవునిచే రాఘవపాండవీయ మనుద్వ్యర్థికావ్య కృతిపతియైన వేంకటాద్రియొక్కతాత యీయిమ్మరాజే. ఈతఁడు రాజమహేంద్రవరమును జయించినట్లీ క్రిందిపద్యములోఁ దెలిపియున్నాఁడు.

“క. రాజమహేంద్రవరాధిపు
    రీజైత్రవిచిత్రములఁ బరిభ్రాజితుఁ డై
    యాజిఘనుం డాయిమ్మమ
    హీజాని ప్రసిద్ధిఁ గాంచె నెంతయు మహిమన్."

అట్లు రాజమహేంద్రపురమును గైకొని యందు కొన్ని నెలలుండి యాసమీపమున గౌతమీతీరమున నున్న రహితాపురము మొదలగు మన్నెసంస్థానములను లోఁబఱచుకొని పిమ్మట మఱికొంతదూరము పోయి బాహుబలేంద్రుని వంశస్టులకు కొంతకాలము ముఖ్యపట్టణమై యుండిన పొట్నూరును జయించి యందొక జయస్థంభమును నెలకొల్సి మాడుగులు మొదలగు మన్యసంస్థానముల నాక్రమించుకొని మత్స్యవంశస్థుల దగువడ్డాది (ఒడ్డాది) మసియొనర్చి సింహాచలస్వామిని సందర్శించి యచట దండు విడిసి యుండఁగా గజపతి సైన్యములు గంటికి గానక పలాయనములయ్యెను. అంతటితో రాయలు సంతుష్టి నొందక తిమ్మరుసుమంత్రి వలదని వారించుచున్నను వినక సైన్యములఁ గటకపురికి నడిపింపుమని తిమ్మరుసున కాజ్ఞ చేసెను. అతఁడు సైన్యముల నరణ్యమార్గములగుండఁ గటకపురి వఱకుఁ గొనిపోయెను.

పాత్రసామంతుల యుద్దము.

కృష్ణరాయఁడు తమపట్టణముమీఁద దండెత్తి వచ్చుచున్నాఁడని విని 1 బలభద్రపాత్రుఁడుఁడు, 2 దుర్గాపాత్రుఁడు, 3 భీమాపాత్రుఁడు, 4 ముకుందపాత్రుఁడు, 5 భీకరపాత్రుఁడు 6 బేరుపాత్రుఁడు, 7 రణరంగపాత్రుఁడు, 8 ఖడ్గపాత్రుఁడు, 9 ఆఖండలపాత్రుఁడు, 10 మురారిపాత్రుఁడు, 11 వజ్రముష్టిపాత్రుఁడు, 12 తురగరేవంతపాత్రుఁడు, 13 గజూంకుశ పాత్రుఁడు, 14 అసహాయపాత్రుఁడు, 15 మృగేంద్రపాత్రుఁడు, 16 మఱియొకపాత్రుఁడు, (పేరు తెలియదు) ఈపదునాఱుగురు పాత్రసామంతులును తమకు గలుగఁబోవు నవమానమును భరింపఁ జాలక రోసావేశపరవశులై ప్రతాపరుద్రగజపతి సన్నిధి కేగి రాయలరాకను విన్నవించి యవశ్యము రాయనిం గెలిచి పట్టి యిచ్చెదమని పంతములు పలికి యుద్ధమున కనుజ్ఞ యిమ్మని ప్రార్థింపఁగా నాతఁడు మిక్కిలి సంతోషించి యట్లు గావించెను. ఆ మహావీరాగ్రగణ్యులై పాత్రసామంతులు లక్షలకొలఁది సైన్యములం జేర్చుకొని కర్ణాట సైన్యముల నెదుర్కొని ఘోరాహవమును మొదలు పెట్టిరి. అధికముగా గర్ణాట సైన్యములకు నష్టము కలుగుచుండెను. దేశ మరణ్యమయమై యుండుటయుఁ సైనికులు మార్గాయాసముకతన రోగగ్రస్తులై యుండుటయు, శత్రుసైనికులు స్థానబలిమిచే స్థిరచితులై నిలిచి పోరాడుచుండుటయును, గన్నులార వీక్షించి కృష్ణరాయఁడు తన కపజయము కలుగునని యూహించి తిమ్మరుసు గఱపిన హితోపదేశమును బెడచెవినిబెట్టి, యిట్టి విపత్తు తెచ్చికొంటిని గదా యని పశ్చాత్తప్తుఁడగుచు, మంత్రిని బిలువ నంపించి, తానడిచిన మార్గము తప్పని యొప్పుకొని, కర్తవ్య మాలోచింపుమని, బహుభంగుల వేడికొనియెను. అప్పుడు తిమ్మరు సిట్లనియెను.

దేవా! మనము మనరాజధానిని విడిచి బహుదూరము ప్రయణముచేసి శత్రుదేశమధ్యమునఁ జిక్కువడి యున్నవారము. దేశ మరణ్యమయమై యుండుటచేత సులువుగా మన సైన్యములను మరలించుకొని పఱువిడి పోవుటకు సాధ్యము గాదు. కీడెంచి మేలెంచు మన్నట్లు మన కదృష్టము తప్పేనేని మనసైన్యమంతయు నీకళింగదేశపుటడవులలో హరించిపోవుననుటకు సందేహములేదు. అపాయము కల్గెనా యింక మన దురవస్థ చెప్పనక్కఱలేదు. మనకు స్థానబలిమిలేదు. వారలకు స్థానబలిమి కలదు. ఇంక నసంఖ్యాకములగు సైన్యములను గొనివచ్చి గజపతి మనపైఁ బడఁగలఁడు. జయాపజయములు భగవదధీనములు. ఐనసు నిప్పటి పోరాటముయొక్క స్థితినిబట్టిచూడ మనకు జయము కలుగునని తోఁచదు. ఇట్టి సందిగ్ధసమయమున యుద్ధమును మాని వెనుకకు మరలుట ప్రమాదమునకు హేతువగును. ఏదైన మాయోపాయముచేత నీవిపత్తునుండి తప్పించుకొని కార్యమును సాధింపఁజూడవలయునుగాని విచారించుట వలనఁ బ్రయోజనము లేశమాత్రమునులేదు.

పాత్రసామంతుల మోసపుచ్చుట

మనకిట్టి విపత్తు కలుగవచ్చునని నేనూహించినవాఁడ నగుటచేతనే బెజవాడలో నాఁడు యుద్ధము చాలించి వెనుకకు మరలుదమని చెప్పితిని. అయిననేమి? దీనికై చింతింపకుము. ఉపాయముచేత యుద్ధమును మాన్పించి తనకూఁతు నీకిచ్చి వివాహముచేసి గజపతి నీతోడ సంధి చేసికొనునట్లు గావించి నిన్నీ పరిభవమునుండి గాపాడుదును. చూడుము నాశక్తియని పలికి యాతనిఁ బంపివేసి యిట్లు చింతించెను.

మనష్యుఁడైనవాఁడు తనకార్యమును నెరవేర్చుకొనుటకు సామదాన భేదదండములను జతుర్విధోపాయములఁ బ్రయోగింపవలసి యుండును. ఇచ్చట నామము పనికిరాదు. దండము సాధ్యమగునది గాదు. దానము భేదము నను రెంటివలనను కార్యము సాధింపవచ్చును. పాత్రసామంతులకును వారి ప్రభువునకును భేదము పుట్టించినఁగాని స్వపక్షమునకు జయము సమకూరునట్లు గన్పటదు. వంచనచేసి తప్పించుకొనుట కూడదని శత్రువునకుఁ దలయొగ్గి నాశనము నొందఁ గోరునంతటి యవివేకిఁ లోకిములో నెవ్వడుండును? ఇంతప్రఖ్యాతిఁ గాంచిన నాప్రభువునకు నవమానము గలుగుచుండ నుపేక్షించి యూరకుండుట భృత్యధర్మముగాదు. ఇట్టి సందర్భమునఁ జేసిన వంచన రాజనీతికి విరుద్ధముగాదు. అని వితర్కించుకొని తిమ్మరుసుమంత్రి పదియార్వురు పాత్రసామంతులపేరను దురాశను గల్పించు జాబులను వ్రాసి విశేషముగా ద్రవ్యమును దెప్పించి పదియాఱు పెట్టెలలో నిండించి యొక్కొక్కజాబు నొక్కొక్క పెట్టలోనుంచి యాపెట్టెలను బరిచారకుల శిరస్సులపై నుంచి శత్రుసైన్యములోనికిఁ బోయి పాత్రసామంతుల కప్పగించి ప్రత్యుత్తరములు తెండని యజ్ఞాపించిపంపెను. వారలు గజపతి సేనలమధ్యనుండి పెట్టెలను గొనిపోవుచుండ గజపతి వారలనుబట్టి తెప్పించి యాపెట్టెలను గైకొని యందుండు లేఖలను దీసి చదువుకొనఁగాఁ దనపాత్రసామంతులు దనకై కుట్రచేసి రాజద్రోహమున కొడిగట్టినట్లు స్పష్టపడియెను, జాబులలో నిట్లు వ్రాయఁబడి యుండెను.

"శ్రీకృష్ణదేవరాయలవారు మీపద్ధతుల కంగీకరించెను; ఆపద్ధతుల ప్రకారము గజపతిని బట్టి యిచ్చెదరేని మీరు నిర్ణయించిన ప్రకారము గ్రామములును, రత్నాభరములును, ధనమును మీయధీనము చేసెదము."

ఇట్లుండుటను ప్రతాపరుద్రగజషతి చదువుకొని భీత చిత్తుఁడై తాను తప్పించుకొని పోవుమార్గము నాలోచించు కొని పాత్రసామంతులకుఁ దెలియకుండ నితరులకు గోచరము గాకుండ దూరమున నున్న మఱియొకస్థలమునకుఁ బోయి యచ్చట రహస్యముగా నుండెను. తమప్రభువు యుద్ధభూమి యందుఁ గానరాకుండుటం జేసియు, నతనిక్షేమము దెలియ కుండుటంజేసియు వారలు యుద్ధమును ముగించి విచారించు చుండిరి. ఇంతలో వారలకు నొత్తుడు కలుగనీయక తిమ్మరుసుమంత్రి రాయనియాజ్ఞఁ గైకొని గజపతికడకుఁ బోవఁ నతఁ డర్హవిధానముల బహుమానపురస్సరముగాఁ బూజించి సంధిని గూర్చి ప్రసంగించుచుండెను. అందుల కనువగురీతిని తిమ్మరుసు ప్రసంగించి ప్రతాపరుద్రగజపతి రాయనితో సంధిచేసికొని తన కూఁతునిచ్చి వివాహము గావించుటకు నొడంబఱచెను. తరువాత ప్రతాపరుద్రగజపతి తనరూఁతురు తుక్కాంబ నిచ్చి వివాహము గావించెను. ఈమెనే యన్నపూర్ణాదేవియని యాముక్త మాల్యదయందు కృష్ణరాయఁడు మఱియొక నామమునఁ బేర్కొనియెను. శ్రీకృష్ణదేవరాయఁడు సంతోషించి రాజుమహేంద్రపురమువఱకును గలదేశమును మరల గజపతికొసంగి క్రీ. శ. 1516 వ సంవత్సరములోనే పూర్వదిగ్విజుయాత్రను ముగించి స్వస్థానమునకుఁ జేరుకొనియెను. తిమ్మరుసు చేసిన మోసమువలన పాత్రసామంతులకు బ్రాణభంగము కలుగలేదు. కృష్ణరాయని విజయప్రతిష్ఠకు భంగము కలుగలేదు. ప్రతాప రుద్రగజపతికి పదభ్రష్టత్వమును కలుగలేదు. భవిష్యత్కాలమున నుభయరాజ్యములకుఁ బోరాటము కలుగకుండ బాంధవ్వమును గల్పించెను. ఇంతయును తిమ్మరుసు కృష్ణరాయనితో గూడ నుండుటచే సంభవించినది. అట్లు కానియెడల చరిత్రము మఱియొక రూపము దాల్చియుండును.

__________
 1. పూసపాటి తమ్మరాజకృతమైన 'శ్రీకృష్ణవిజయ' మను గ్రంథమున నీక్రింది పద్యములోఁ దెలుపఁబడినది.

  సీ. నవభారతాఖ్యాన నవ్యకావ్యమునకు
              నాయకుం డయ్యె నేనరవరుండు
      కటకేశ్వరునిచేతఁ గని కేతవర మాత్మ
              పురముగా నేలె నేభూవిభుండు
      నిలిపె భారుహమన్నె నృపగండ పెండేర
              మెపుడు డాకాల నేనృపతిమౌళి
      యఖిలసద్గుణవతి యక్కమాంబాదేవి
              ప్రాణేశుఁడయ్యే నేపార్ధివుండు

      బ్రథితగజపతి రాజవీరప్రతాప
      రుద్రతనయాధినాయ కారూఢతమ్మి
      రాజజనకతఁ గాంచె నేరాజతిలక
      మతఁ డలరు తమ్మ విభురాచయప్రభుండు.