Jump to content

తిమ్మరుసు మంత్రి/ద్వితీయ ప్రకరణము

వికీసోర్స్ నుండి


ద్వితీయ ప్రకరణము

తుళువవంశము.[1]

మొదట చంద్రగిరిరాజ్యమునకు, నటుపిమ్మట నూత్న కర్ణాట సామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తుడైన సాళువగుండయ నారసింహ భూపాలుని సైన్యాధ్యక్షుడును, ముఖ్యమంత్రియు నగు నరసరాజు తుళువ వంశమునందు జనించిన యీశ్వరరాజునకుఁ బుత్త్రుఁడై యుండెను. ఈశ్వరనాయకుండును గొంతకాలము సాళ్వనరసింహ భూపాలునకు సైన్యాధ్యక్షుఁడుగ నుండెను. వీరిది తుళువవంశము. ఈ వంశమునఁ దిమ్మయదండనాధునకు నీశ్వరరాజు జనించెను. వీనికి నరసరాజు పుట్టెను. ఈశ్వరరాజు విఖ్యాత సేనాధీశ్వరుఁడుగానుండి బహుదేశములను జయించి సాళ్వనరసింహరాయని రాజ్యమును విస్తరింపఁజేసెను. వీని విజయములనుగూర్చి వరాహపురాణమునం దిట్లభివర్ణింప బడియెనూ

"సీ. ఉదయాద్రి భేదించే హుత్తరి నిర్జించె
              గండికోటపురంబుఁ గదల ద్రవ్వెఁ
    పెనుగొండ సాధించే చెగ్గులూరు హరించె
              గోవెలనెల్లూరు గుంటుపిఱిచెఁ
    గుందాణి విడిలించే గొడుగుచింత జియించె
              దాగూరు పంచముపాడు చేనే
    నరుగొండ వెకిలించె నామూరు మర్దించె
              శ్రీరంగపురమును బాఱిసమరె

గీ. రాయచౌహత్తమల్ల ధరావరాహ
   మోహనమురారి బర్బరబాహుసాళ్వ
   నారసింహప్రతాపసన్న హనుఁ డగుచు
   విశ్వహితకారి తిమ్మయయీశ్వరుండు."

తిమ్మరుసుమంత్రి ప్రతిబాఢ్యు డని దేశమున విఖ్యాతిని గాంచుట తనమిత్రుఁ డైన నాదిండ్ల చిట్టిగంగనామాత్యుని వలన విని యూతనిచేఁ బ్రేరేపితుఁడై సాళ్వ గుండయ నారసింహ భూపాలుని యంగీకారమును బడసి తుళువనరసరాజు తిమ్మ రుసును దనకు ముఖ్యమంత్రిగఁ జేసికొనియెను. నాదిండ్ల చిట్టి గంగనామాత్యుఁడు తిమ్మరాజునకు, గోవిందరాజునకు వివాహమైనపిమ్మట స్వర్గస్థుఁడయ్యెను. అచిరకాలములోనే తిమ్మరుసు ప్రజ్ఞావిశేషములు రాజ్యమునఁ బ్రవర్థిల్లుచు బహుజనశ్లాఘాపాత్రములై యాతని యశోవైభవమును నలుదిక్కులకుఁ బఱపుచుండినవి.

మహావిప్లవము

కర్ణాట సామ్రాజ్యమును బరిపాలించుచున్న యిమ్మడి విరూపాక్షరాయలు తన దుష్టప్రవర్తనముచేత జనకంటకుఁ డయ్యెను. నిరంతరము సురాపానప్రమత్తుఁడై కామినీజనపరి వృతుఁడై యంతఃపురమును విడిచి రాక మంత్రులకుఁ గాని, దండనాధులకుఁ గాని మోమయినఁ గనుబఱచక మైమఱచి విహరింపుచుండెను. ఇది గూడదని మందలించిన దండనాధులను బెక్కండ్రను దుష్టుఁడై చంపించెను. ఇమ్మడి విరూపాక్షుఁ డిట్లు దుష్పరిపాలనమున కొడిగట్టి జనకంటకుఁడై యుండుటఁగాంచి సామంతనృపతు లెల్లరును స్వతంత్రులై యెవరిరాజ్యములను వారు పరిపాలించుకొనుచుఁ గప్పములు గుట్టుట మానిరి. పశ్చిమసముద్రతీరమునందలిరేవు లన్నియుఁ బరాధీనములై నవి. తుంగభద్రాకృష్ణా మధ్యదేశమును దురుష్కు లాక్రమించుకొనిరి. కళింగదేశాధీశ్వరులైన గజపతు లుదయగిరి రాజ్యమును వశ పఱచుకొని పరిపాలించుచుండిరి. ఇంతకుఁ బూర్వమె చంద్రగిరి, పెనుగొండ, గండికోట రాజ్యముల నాక్రమించుకొని సాళ్వగుండ నరసింహభూపాలుఁడు మహాపరాక్రమవంతుఁడై అనుదినమును దనరాజ్యమును విస్తరింపఁజేయుచు స్వతంత్రుఁడై పరిపాలనము సేయుచు జనరంజకుఁడుగాఁ బ్రసిద్ది గాంచుచుండెను. ఇట్లు నానాటికిఁ గర్ణాటరాష్ట్రము బలము క్షీణించుచుండెను. దీని నంతయును జూచి సహింపఁజాలక వీని పెద్దకొడుకు తనతండ్రిని దనచేతులతోఁ జంపెను. వీనితమ్ముడు వీనిని జంపి, రాజయ్యెను. వీఁడును దనతండ్రివలెనె దుర్మార్గుడై దుష్పరిపాలనముఁ జేయ మొదలుపెట్టను. ఉద్దతులనడుమఁ బేదకుండ శక్యము గాని యట్లు తురుష్కులకును గజపతులకును నడుమఁబడి యిదివఱకే నలుగుచుండిన కర్ణాటసామ్రాజ్యము విద్యానగరమునందు సంభవించినట్టి రాజకీయవిప్లవస్థితినిఁ బురస్కరించుకొని బహమనీ సుల్తాను తానొక్కగ్రుక్కలో నీమహాసామ్రాజ్యమును మ్రింగి వేయవలయునని చూచుచుండెను గాని సాళ్వగుండయనారసింహునిభయముచేత వెనుకముందు నారయుచు సమయమునకై నిరీక్షించుచుండెను.

సమయాకర్షణము

తుళువనరసరాయనికడ మంత్రిపదవిని వహించిన తిమ్మరుసు ప్రతిభాఢ్యుఁడైనమంత్రి గావున విద్యానగర రాజకీయ విప్లవపరిస్థితులను దెలిసికొని యుపేక్షను వహింపక తానెవ్వని ప్రాపకమువలన నభివృద్ధి బొందఁగలిగెనో యట్టి రాజకీయ విద్యాగురువైన చిట్టిగంగనామాత్యుని బోధనమును మాత్రము మఱవక యాతరుణము నెట్లు సద్వినియోగమునకు దేవలసియుండునో దానిని జక్కగా నాలోచించి హైందవధర్మరక్షణార్ధ మీహైందవసామ్రాజ్యము సముద్ధరించుట తనకు విధ్యుక్త ధర్మమని నిశ్చయించెను. అప్పు డుపేక్ష చేసినయెడల నావల బ్రమాదము జనింపవచ్చును. విద్యానగరము బహమనీసుల్తానులవశ మయ్యెనేని హైందవసామ్రాజ్యము క్రమముగా నంతరించుసు. హైందవసామ్రాజ్యముతో నార్యధర్మములు తాటా దూటములగుట నిశ్చయము. ప్రజ్ఞావంతుఁడని, ప్రతిభాఢ్యుఁ డని, సమర్థుఁ డని తలంచియే చిట్టిగంగనామాత్యుఁడు భావి స్థితిని దలపోసి యీవిషయమై తన్ను బ్రబోధించినప్పుడు తిమ్మరుసు మిడిగ్రుడ్లు పెట్టుకొని యూరక చూచుచున్న పక్షమున నాతఁడును సామాన్యుని వంటివాఁడే యగును. అతడొకనాఁడు నరసారాయనికడ కేగి యిట్లనియెను. “నరసరాయా ! కర్ణాట ప్రభువు దౌర్భాగ్యస్థితి నంతయు విను చున్నావుగదా? అతఁడు రాజ్యమును బరిపాలింప నర్హుఁడుగాఁడు. ఎప్పుడు నంతఃపురము విడిచి రాఁడు. రాజ్యాంగముఁ గన్నెత్తిచూడఁడు. తురుష్కులు కృష్ణదాటి వచ్చిరి. సామంతనృపతులు స్వాతంత్ర్యమును బ్రకటించుచున్నారు. ఈ సమయమును జూచి బహమనీసుల్తాను విద్యానగరముపై దండెత్తి వచ్చి వశపఱచుకొనునేని హైందవరాజ్యము లింక నిలుచునా ? హిందూమతధర్మములు తాఱు మాఱులు గాకుండునా? ఇట్టి సమయమున మన ముపేక్షించి యూరకుండుట మనదేశమునకును మతమునకు నపచారము సల్పినవార మగుదుము. పూర్వము జనకంటకుఁడై వేనుఁడు దుష్పరిపాలనము జేయుచుండఁ బ్రజలు వానినిఁ బదభ్రష్టుని గావించి పృథువునకుఁ బట్టము గట్టినట్లుగా నీకర్ణాటప్రభుని సింహాసనమునుండి దొలగించి మన సాళ్వనరసింహభూపాలుని సార్వభౌమునిగఁ జేసి పట్టాభిషిక్తుని గావింతము. నిలిచియున్న యీహైందవసామ్రాజ్యమును సముద్ధరింతము. మనరాజకీయ విద్యాగురువైన చిట్టిగంగనామాత్యుఁడు మనకు బోధించిన కరమధర్మ మిదియే సుమా.” అని ప్రబోధించెను. అంత నరసరాయఁ డీపలుకులను విని తిమ్మరుసు మోమొకింతసేపు తేఱిపాఱఁ జూచి యతని దూరఫుటాలోచనకు సంతసించి “మంత్రివరా! నీబుద్దికి మెచ్చితిని. అవును. నీవు చెప్పినది సత్వము. మన మీసమయమును బోనీయరాదు. మన మిప్పు డూరకుండిన తుదకు మనకే ముప్పు రాఁ గలదు. కర్ణాటప్రభువును సింహాసనమునుండి తొలగించి మనప్రభువర్యునకుఁ బట్టము గట్టుద” మని చెప్పి యప్పుడే యావిషయమును దెలుపుచు సాళ్వనరసింహభూపాలునకు సందేశముఁ బంపెను. అప్పటికే తిమ్మరుసు ప్రతిభాఢ్యుఁ డనియు, రాజ్యధురంధరుఁ డనియు సాళువనరసింహభూపాలుఁ డెఱింగి యుండెను. తిమ్మరుసువంటి ప్రతిభాఢ్యునిచేఁ బ్రబోధితుఁడై తన సైన్యాధ్యక్షుఁ డగు తుళువనరసారాయఁడు పంపించినసందేశమున కెంతయు సంతో షించినవాఁడై తనకడ నున్నమంత్రివరులను, దండనాధులను రప్పించి వారల కీసందేశమును విన్పింపఁగా వారెల్లరును సమ్మతించి తిమ్మరుసు బుద్ధినైశద్యమును మిక్కిలి గొనియాడిరి. అప్పుడా సాళ్వనరసింహభూపతి విద్యానగరముపై దండయాత్ర వెడలుట కాజ్ఞాపత్రమును వ్రాసి తనసై న్యాధ్యక్షునకుబంపెను.

{{}p|fs125|ac}తుళువనరసింహుని దండయాత్ర

సాళ్వనరసింహుని యాజ్ఞాపత్రమును తిమ్మరుసుమంత్రి సైన్యాధ్యక్షునకుఁ జదివి వినిపించెను. తాను తలపెట్టినకార్యమున కెల్లరును నామోదించుట భావిశుభసూచక మనిగ్రహించి తిమ్మరుసు పరమానందభరితుఁ డయ్యెను. అంతట తిమ్మరును నరసరాజును గాంచి “భూవరా! ఇఁక మనము జాగు సేయరాదు. సేనలను సన్నద్ధము గావించుకొని మనయుద్యమ మెవ్వరికిఁ దెలియకుండ నకస్మాత్తుగాఁ బోయి విద్యానగరముపై బడవలయును. అట్లు గానియెడల ప్రతిపక్షులవలనను శత్రువులవలనను మనకు ప్రతిబంధకము లేర్పడి మన ప్రయత్న మంతయు విఫలము గా వచ్చును. గాన మనకు నపకారము గలుగ వచ్చును. ఇట్టి సందర్భములయందాలస్యము జయప్రదముగాదు. ఈ మన ప్రయత్నములను మన ప్రతిపక్షనాయకు లగుదండనాధులు విన్న విద్యానగరమును సంరక్షించుట కై స్వసైన్యములతోఁ బ్రవేశింతురు. అప్పుడు గోటఁ జిదుపందగిన వాని గొడ్డలిచే నఱకవలసి వచ్చు" నని హెచ్చరించెను. నరస భూపతియు తిమ్మరుసు పలికినపలుకులయందలి యధార్థ్యమును గ్రహించి కాలయాపనముచేయక వలసినసైన్యములను కొలది కాలములోనే సమకూర్చి తిమ్మరుసు పెట్టిన శుభముహూర్తమునఁ బ్రయాణభేరి మ్రోగించి దండయాత్రకు బయలు దేఱెను. నరసారాయనితోఁ దిమ్మరుసుకూడ నుండెను. తిమ్మరుసు మంత్రిసత్తముఁడు మాత్రమే గాక సమరక్రమ మెఱింగిన మహాయోధుఁడుకూడ నై యుండెను. అందువలన నరసారాయనికి మిక్కిలి సహాయకారిగ నుండెను. ఇట్లు గుత్తినగరము నుండి దండయాత్ర వెడలి విద్యానగరముఁ జేరి నగరము వెలుపల విడిసియున్నప్పుడు తిమ్మరుసుమంత్రి కర్ణాటరాజ్యసంరక్షకులై యుండిన దండనాధులకు సామంతనృపతులకు నరసారాయనిపేరుతో తాము వచ్చిన కార్యముయొక్క ప్రయోజనమును దెలుపుచు లేఖలను వ్రాసి పంపెను. సాళువనరసింహ భూపాలునికీర్తి యప్పటికే రాష్ట్రమునందంతట వ్యాపించి ప్రసిద్ది వహించి యుండుటచేత నెవ్వరును దత్సైన్యాధ్యక్షుఁడును సమర్ధయోధుఁడు నైనతుళువనరసారాయని నెదుర్కొన సాహసింప లేదు. నరసారాయఁ డనేకులకు గానుక లంపించెను, ఇట్లు విద్యానగరములోని దండనాధుఁ లెల్లరును వశ్యులై మౌనము వహించియుండ నరసారాయఁడు నగరమున కెంతమాత్రము నష్టము గలిగింపక రణభేరి మ్రోగించుచు నగరము సొచ్చి దానును సేనలును మహావైభవముతో నూరేగుచు రాజభవనము సమీపించుచుండెను. ఇట్లు జరుగుచున్న దని 'నేతిబీరకాయ' యన్నట్లు ప్రౌఢదేవరాయల నామమును వహించిన యాకామినీమనోహరుఁడు విద్యానగర సింహాసనాధిష్ఠితుఁడైన యాకర్ణాటప్రభువు వినియు విననట్లుండెను. నరసారాయఁడు రాజభవనము సమీపించు చున్నాఁడని సందేశమును దెచ్చినభటుని విశ్వాసపాత్రునిఁ బరిభవించి పంపించెను. వినాశకాలమునకు విపరీతబుద్ధి జనించిన దని యెల్లవారును దలంచి యుపేక్ష వహించి యుండిరి. ఇట్లు నరసారాయఁడు నగరమంతయు మహావైభవముతో నూరేగి రాజభవనము సమీపించి ద్వారపాలకులఁ బాఱఁద్రోలి యంతయు వశపఱచుకొన్నను నామందభాగ్యు డంతఃపురములోని శయ్యాగృహమును విడిచి బయలకు రాలేదు. తుద కాసేనాని రాజు పండుకొని యున్నగృహము సమీపింపఁగా దనకు రానున్న యపాయము నపుడు గ్రహించి ప్రాణరక్షణార్థము దిడ్డివాకిటనుండి తప్పించుకొని నిజమందిరమును, నగరమునుగూడ విడిచి పాఱిపోయెను. ఇట్లతఁడు పాఱిపోయె నన్నవర్తమానమును విని నరసారాయఁడు వానిం బట్టుకొనుటకై శ్రమపడక తత్క్షణమ ధనభాండారమును నగరము నంతయు స్వాధీనముఁ జేసికొని సాళువనరసింహభూపాలున కీవృత్తాంతమును దెలుపుచు విద్యానగరమునకు విచ్చేయుమని సందేశమంపెను. నగరమునంతయు నరసారాయనికి గడగడలాడుచుండెను. నగరములోని యాబాల వృద్దు లీమార్పునకు సంతోషించిరి. బహుస్వల్ప సంఖ్యాకుల కిది కంటకముగాఁ గాన్పించినను వీరి నెదుర్కొనునంతటి శక్తి లేక యుండెను. రాజబంధువులను విద్యానగరమున నుండనీయక నరసారాయఁడు కొందఱను పెనుగొండకును, కొందఱను గుత్తికిని, కొందఱను జంద్రగిరికిని బంపించెను. అంతః పురములోని నౌకరులను దొలఁగించి వారెస్థానమునఁ గ్రొత్తవారిని నియమించెను.

సాళ్వనరసింహుని పట్టాభిషేకము

తిమ్మరుసుమంత్రి సాళ్వగుండయనారసింహుని పట్టాభిషేకమహోత్సవాహ్వాన పత్రికలను రాష్ట్రములోని సామంత నృపతులకు దండనాధులకుఁ బంపించెను. సాళువ నరసింహ భూపాలుఁడు నరసారాయనికడ నుండి వచ్చిన సందేశమును విని తనవారివిజయమున కానందించుచు నెంతమాత్రమును జాగుసేయక పురోహితులను, మంత్రులను, సేనాపతులను, సామంతులను, రాణులను, పుత్త్రులను, పరివారజనంబులను వెంటఁగొని యొకశుభముహూ ర్తమున నారాయణవనమునుండి బయలుదేఱి కొన్నిదినములకు విద్యానగరమునకు వచ్చెను. తన సైన్యాధ్యక్షుడును, వాని మంత్రియగు తిమ్మరుసును పౌరజనులతో నెదురుగావచ్చి నగరమునకుఁ గొంపోయి రాజభవనమునం బ్రవేశపెట్టిరి. ఈసాళ్వనరసింహభూపాలుఁడు విద్యానగర నివాసులకుఁ గ్రొత్తవాడుకాఁడు. సాళ్వనరసింహుఁడు విద్యానగరమునఁ బేరు మోసినవాఁడే. కావున నితని బ్రేమించు వారే యానగరరాజమున నధికసంఖ్య గలవారుండిరి. సాళువనరసింహభూపతి బలాడ్యుఁడుఁ సమర్ధుఁడు, యోగ్యుఁడు నై నందున సామంతనృపవర్గ మాతనిపట్టాభిషేక మహోత్సవమున కామోదించుచుఁ గానుక లంపించిరి, మఱికొందఱు నామహోత్సవమును గన్నులార వీక్షించుటకై తామే యరుదెంచిరి. ఒకశుభమహూర్తమున సాళ్వనరసింహభూపతి కర్ణాటసామ్రాజ్య పట్టాభిషిక్తుఁడై మహారాజాధిరాజ, రాజ పరమేశ్వరేత్యాది బిరుదాంచితుఁడై వఱలెను. అంతటనుండి కర్ణాటసామ్రాజ్యము నరసింహసామ్రాజ్య మని దిగంతములవఱకు బేరుమ్రోసెను. కర్ణాటసామ్రాజ్యము బలపడియెను. సామంతనృపవర్గము నరసింహసార్వభౌముఁ డన్న భయభక్తులతో నుండెను. దండనాధు. రెల్లరును వినయవిధేయులై యుండిరి. ఇట్లు సాళ్వనరసింహభూపతి శకసంవత్సరము 1408-లో (1486–87) కర్ణాటసామ్రాజ్యసార్వభౌముఁ డయ్యెను. ఈతని పరిపాలనతో విద్యానగరమునఁ దెలుఁగువారికిఁ బలుకుఁబడి యెక్కువ యయ్యెను. కర్ణాటసామ్రాజ్యము సంపూర్ణముగా నాంధ్రుల స్వాధీన మయ్యె నని చెప్పవచ్చును. తిమ్మరుసుమంత్రి తన ప్రజ్ఞను వికసింపఁజేయుకాలము తటస్థించెను. ఇట్లు మనోరథసిద్ధిఁ బడయు నదృష్టముఁ గాంచిన తిమ్మరుసుమంత్రిని సాళ్వనరసింహసార్వభౌముడుఁ విడిచిపెట్టి యుండలేదు. అతని ననేక విధముల సత్కరించెను. అతనితో యోజింపక యేకార్యమును జేయకుండెను. తుళువనరసరాయనిమంత్రి యనుమాటయె కాని తిమ్మరుసు విద్యానగరముననుండి రాజకార్యధురంధరుఁడై నరసింహ సార్వభౌమునకు సలహాల నందిచ్చుచుఁ బరిపాలనమునఁ దోడ్పడుచుండెను. ప్రధానమంత్రిత్వపదవిని వహింప వలసినదని సార్వభౌముఁడు కోరినను తిమ్మరుసు తనకంటె వృద్దులై చిరకాలమునుండి యాశ్రయించుకొని భక్తిశ్రద్ధలు చూపి కొలుచుచున్న మంత్రిపుంగవులను గాదని వయస్సునఁ చిన్నవాఁ డగుఁదా నాపదవి నపేక్షించుట క్షేమకరము గాదనియు, మిత్రభేదమునకు హేతువగుననియు, దేశశాంతికి భంగకర మగుననియు నచ్చఁజెప్పి సామ్రాజ్యముపట్ల సదాసేవాపర తంత్రుఁడనై యుందునని వాగ్దానము గావించెను. తుళువ నరసభూపతియు సార్వభౌముఁడు నాతని బుద్దికౌశల్యమును శ్లాఘించిరి. విద్యానగరమునఁ దిమ్మరుసు ప్రసిద్ధి సర్వత్ర వ్యాపించెను. ఒకనాఁడు నరసింహసార్వభౌముఁడు తిమ్మర్సు మంత్రిని బిలువనంపించి యిట్లనియెను.

“తిమ్మనమంత్రీ! నీవు కడుబుద్ధిశాలివి. నాకొక్క కోరికగలదు. అశ్వపతులైన బహమనీ సుల్తానులును, గజపతులైన కళింగదేశాధీశ్వరులును. మనకుఁ బ్రబలశత్రువులై యున్నారు. కర్ణాటరాజ్యాధిష్ఠితుఁడనై నరపతిసార్వభౌముఁడనై యున్నను అట్టిశత్రువు లస్మద్రాజ్యము నపహరించి ప్రవర్థమానులగుచుండఁ జూచుచు నే నెట్లూరకుండఁ గలను. అశ్వపతు లను గజపతులను గూడఁ గృష్ణకు దిగువభాగమున నుండకుండఁ బాఱద్రోల వలయునని దృఢసంకల్పము గలదు. నేనీ శత్రువులనుఁ బాఱద్రోలునంతవఱకు నాకు నిద్రాహారముల యం దభిరుచి జనింపదు. దీని జయప్రదముగా నిర్వహించు మార్గము నెద్దియైనఁ జూపుము.”

తిమ్మరుసు హితబోధ

అందులకుఁ దిమ్మరు సిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. రాజేంద్రా ! అశ్వపతులు గజపతులు మనకు శత్రువులుగ నున్నమాట సత్యము. వారలను జయించుట కష్టసాధ్యము. అశ్వపతుల కాశ్వికసైన్యము మెండుగాఁగలదు. పూర్వకాలమున సైన్యము, రథములు, గజములు అశ్వపతులు, పదాతులను నాలుగుభాగములుగానుండి 'చతురంగ ' మను సంజ్ఞ కలిగి యుండెను. ఆకాలమునందు రథబలమె శ్రేష్ఠ మైనదిగా నెంచబడియె. రథికులకు, అతిరథుఁడు, మహారథుఁడు, సమరథుఁడు, అర్థరధుఁడు ననుబిరుదము లుండెను. రథబలమింతకుఁ బూర్వమె సేనాంగములో నశించి తక్కినవి మూడుమాత్రమె నిలిచి యున్నవి. కళింగదేశమునం దరణ్యములు మెండుగా నుండుటచేతను నాయరణ్యములలో గజములు విస్తారముగా నుండుటచేతను కళింగదేశాధిపతులకు గజబల మధికముగా నుండుచు వచ్చెను. అందువలన వారలకు గజపతు లనుబిరుదు నామము గలిగినది, అరబ్బీపారశీక సింధుదేశములందు గుఱ్ఱము లధికముగా నభివృద్ధి యగుచున్నవి. ఈదేశములు మహమ్మదీయాక్రాంతములై వారలచేఁ బరిపాలింపఁబడు చుండుటచేత వారలకు నశ్వపతులనుబిరుదు వచ్చినది. పదాతిసైన్యము మన కెక్కువగా నుండుటచేత మనకు నరపతు లనుబిరుదము వచ్చినది. అశ్వపతులను జయించుటకు మన కాశ్వికసైన్యము మెండుగా నుండవలయును. గజపతులను జయించుటకు గజ సైన్యము మెండుగా నుండవలయును. బహమనీసుల్తానుకన్న మీర లైశ్వర్యవంతులు. బహమనీసుల్తానుకన్న మన మధికమైన వెల యిచ్చినపక్షమున మనకే విక్రయింతురు. పోర్చుగీసు వర్తకులమూలమున మన మీకార్యమును నిర్వహించుకొనవచ్చును. అశ్వికసైన్యమును మనము బలపఱచుకొనుపర్యంతము బహమనీసుల్తానుపై దండయాత్ర సలుపరాదు. అతఁడు దండెత్తివచ్చిన మనము నిలిచి పోరాడవచ్చును. కాని మనము మాత్రము దండెత్తిపోరాదు. అశ్వబలమును సమకూర్చుకొని యశ్వపతులను జయించిన పిమ్మట గజపతులను జయింపవలయును. అంతపర్యంతము మన మోపికవహించి యశ్వబలమును గజబలమునుగూడ పెంపుచేసికొనుచుండుట శ్రేయమని నాయభిప్రాయము. అశ్వములను సంపాదించుటకై ధనమును గుప్పింపవలయును.”

తిమ్మరుసుచే నిట్లు ప్రేరేపింపఁబడి నరసింహమహా రాజేంద్రుఁడు అరబ్బీదేశమునుండియు, పారశీకదేశమునుండియు నుత్తమాశ్వములను బెక్కింటిని దెప్పించుటకై బ్రతికినవైనను చచ్చినవైనను మూఁడుగుఱ్ఱములకు వేయివరహాలచొప్పున నిచ్చుటకుఁ బ్రారంభించినందున మూరులను మహమ్మదీయ వర్తకులును, ఫోర్చుగీసువర్తకులు నశ్వములను గొనివచ్చి, సాళ్వనరసింహరాయని కమ్మి ధనవంతు లగుచుండిరి. తన కొఱకై తెచ్చిన గుఱ్ఱములు సముద్రముమీఁదఁ జచ్చినను వానితోఁకలను తెచ్చినపక్షమున ధన మొసంగు చున్నందున వర్తకు లావ్యాపారమును విడువక సాగించుచుండిరి. అందువలన స్వల్పకాలములో నరసింహుని యశ్వబలము శత్రుజన భయంకర మయ్యెను. ఇట్లు సాళ్వనరసింహభూపతి జీవచ్చవముగా నుండి కునుకుచున్న రాష్ట్రమున నుత్సాహక్రియాశక్తుల స్వసామర్థ్యముచే నెల్లెడలఁ బురికొల్పి పునర్జీవనము గల్పించి శత్రుభయంకరుఁడై ప్రజాపాలనముఁ జేయుచుండుట చేతఁ దురుష్కులును విదేశీయులగు పోర్చుగీసువారును, కర్ణాటరాజ్యమును 'నరసింగనిరాజ్య' మనియె వ్యవహరించిరి. తురుష్కులనుండి రాచూరుదుర్గమును గజపతులనుండి యుదయగిరిరాజ్యమును వశపఱచుకొనవలయునని యుత్సాహపడు చుండెను. గాని విధివశంబున నాకోరిక లీరిక లెత్తకముందే స్వర్గస్థుడగుట సంభవించెను. ఇతఁడీ సార్వభౌమపదవికి వచ్చిన తరువాత నెక్కువకాలము పరిపాలనము చేసినట్లు గస్పట్టదు. ఇతఁడు తనమరణకాలమునందుఁ దనపెద్దకుమారుని రాజును జేసి యతఁడు బాలుఁ డగుటచే సెన్యాధ్యక్షుడైన నరసరాజును గార్యకర్తనుగా నియమించెను.


___________
  1. మహమ్మదీయ మహాయుగములో తుళువవంశము సాళువవంశాంతర్గతమనియు, తుళువ నరసరాజు సాళువనరసరాజునకు అన్నమనుమఁడనియు శ్రీయుత కొమఱ్ఱాజు లక్ష్మణరావుపంతులు, ఎం.ఏ. గారు వ్రాసియున్నారు. ఆంధ్రకవుల చరిత్రములో “ఈ తిమ్మయ ఈశ్వరరాజు సాళువగుండ నరసరాజునకు సేనానాయకుఁడగుటయేగాక దాయాదుఁడుకూఁడ నై యుండుటచేత నాతని యనంతరమున రాజ్యమును వహించినట్లు తోఁచుచున్నది" అని యొకచోటను, "నరసింహరాజునకు (సాళువ) తిమ్మరాజను పేరుగల జ్యేష్టబ్రాత యొకఁడుగలఁడు. ఆతఁడే యీశ్వరరాజు తండ్రియైన సాళువతిమ్మరాజని తోచుచున్నది" అని యొకచోటను శ్రీయుత రావుబహదరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు వ్రాసిన వ్రాఁతయె పైవారు వ్రాసినవ్రాఁత కాధారమై యుండవచ్చుమ. ఇందుకు బ్రమాణ మెవ్వరును జూవలేదు. తుళువనరసరాయని కంకితము గావింపఁబడిన వరాహపురాణములో నంది మల్లన ఘంటసింగయకవులు సాళువవంశము వేఱుగను, తుళవవంశము వేఱుగను, స్పష్టముగ వర్ణించి యుండ వీ రిట్లు వ్రాయుట వింతగా నున్నది. వరాహపురాణవతారిక లోను, ఆశ్వాసాంత పద్యములలోను కృతిభర్త సాళువవంశీయుఁడని వక్కాణింపఁబడక తుళవాన్వయుండని వ్రాయుటయే యీయుభయవంశము లొక్కటికావని స్పష్టమగుచున్నది. కాఁబట్టి సాళువవంశము వేఱనియు తుళువవంశము వేఱనియు మన మిప్పటికి స్పష్టముగా నిర్ధారింపఁవచ్చును.