తిమ్మరుసు మంత్రి/ప్రథమ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తిమ్మరుసుమంత్రి

ప్రథమప్రకరణము.

"చ. కరచరణాదు లందఱకుఁ గల్గినయంతట నే సమర్ధతన్
     మెరువడి గాంచ నేర్తురొ మనీషివరుల్ ధరలోన నెవ్వరి
     క్కరణిఘటింపుచుం గృతయుగంబునఁ ద్రేతను ద్వాపరంబునం
     దరయఁగ సాళ్వతిమ్మసచి వాగ్రణికి స్సరిమంత్రి గల్గునే?"
                                                               (కుమారధూర్జటి.)

"సీ. ఏమంత్రిమణి నిజస్వామికార్యక్రియాతత్ఫరమానసోత్సాహశాలి
     యే మంత్రిమణి మిత్రహితబాంధవాశ్రితప్రకరరక్షణకణా ప్రౌడబుద్ది
     యే మంత్రిమణి వచోహేలాతినై ర్మల్య శీతలతాధూతశీతరోచి
     యే మంత్రిమణి సుధాధామశాంభవదామ ధాళధళ్యసుతుల్యధవళకీర్తి.

     యట్టిమంత్రికులోత్తంస మహితనృపతి
     పటలమకుటాగ్రఘటితపత్పద్మయుగళి
     సకలకర్ణాటరక్షావిచక్షణుండు
     దీనసురశాభి సాళువ తిమ్మమంత్రి."
                                       (మాదయగారిమల్లనకవి.)

తిమ్మరుసువంశము.

తిమ్మరుసు పూర్వులు సాళ్వవంశీయులైన మహారాజుల యొద్ద మంత్రిత్వాదిపదవులను వహించి సుప్రసిద్ధకీర్తిఁ గన్న వా రగుటచేత వీరివంశమునకు సాల్వవంశ మని పేరు వచ్చినది. ఈ వంశమువారికిఁ దొలుత కొండవీటిసీమయె స్వస్థానముగ నుండెను. ఈసాల్వవంశమువారు కౌండిన్యసగోత్రులైనయాఱ్వేల

బాల్యదశ.

ఒకనాఁడు తిమ్మన చంద్రగిరిప్రాంతారణ్యభూములలోఁ తిరుగాడుచు నలసి మధ్యాహ్నసమయమున నొక చెట్టునీడను బరుండి గాఢనిద్ర పోవుచుండెను. అంతట సూర్యుఁడు పశ్చిమమునకు వాలుటచే సూర్యకిరణము లాతనిమోమును సూటిగా దాకుచున్నను మెలఁకువ రాక గాఢనిద్ర పోవుచున్నయాబాలుని సమీపమునకు నొకకృష్ణసర్ప మరుదెంచి తనఫణమును విప్పి వానిమోమున నెండ సోఁకకుండ గొడుగువలె నడ్డము పెట్టెను. అప్పుడాదారిని పోవుచున్న సిద్ధుఁడొక డాయద్భుత చర్యను గన్నులారఁ గాంచి యాబాలుఁడు మహైశ్వర్యపదవి నొందఁగలఁడని గ్రహించి సమీపమునకుఁ బోగా నాసర్ప రాజము వానిని విడిచి పాఱిపోయెను. అంతట నాసిద్ధుఁడు చిన్నవానిని లేపి “నాయనా ! నీ కచిరకాలములోనే మహైశ్వర్యపదవి లభించును; మహారాజభోగంబు లనుభవింతువు ; ఇట్లెన్నఁడు నొంటరిగ నరణ్యమునఁ బండుకొనకుము; శీఘ్రముగా నింటికి వెడలిపొమ్ము." అనిపలికి తనదారిని బట్టుకొని తాను వెడలిపోయెను. అప్పు డాబాలుఁడు తనలోఁ దానిట్లు వితర్కించుకొనియెను.

"నేను బాలుఁడను ; తల్లిదండ్రులు లేనివాఁడను; నాకు విద్య యెట్లు లభించును? నా కెవ్వరు దిక్కు? దేశములోఁ ద్రిమ్మరినై తిరుగుచున్న నన్నుఁ జేరఁదీయువా రెవ్వరు? నాకు మహైశ్వర్యపదవి యబ్బు ననియు, మహారాజభోగంబు లనుభవింతుననియు నీమహానుభావుఁ డెవ్వఁడో పలికి పోయెనే? ఇతఁ డేమిపరిహాసమునకై పలికెనా? ఇతఁడు నావంటిబాలునితో పరిహాస మేల చేయును? ఇతఁడు వాక్పారిశుద్ధ్యము గల సిద్ధునివలెఁ గానుపించు చున్నాఁడు. అవు నతఁడు సిద్ధుఁడే అతని పలుకు వృధావోవదు. నేను తప్పక యైశ్వర్యపదవిఁబడయుదు. మహారాజభోగము లనుభవింతును. అందులకు నేను మున్ముందు విద్యాధనమును సముపార్జింతును. ఎన్నికష్టములనైనఁ బడి ముందుగా విద్యాధనమును గడించిన నైశ్వర్యము దానంతట నదియె చేకూరఁగలదు.”

ఇట్లు చింతించుచు నాతఁడు చంద్రగిరికి మరలివచ్చెను. తనతమ్ముఁడు గోవిందుఁడు తోడిబాలురతో నాడుకొనుచుండ నాతనిం బిలిచి సిద్ధుఁడు తన్నుఁజూచి పలికినపలుకులు చెప్పెను. అప్పలుకులు విని గోవిందుఁడు పక్కుననవ్వెను. బాలు రెల్లరును విని 'మనతిమ్మనికి మహైశ్వర్యపదవి యెత్తునఁట! మహారాజభోగంబు లనుభవించు నఁట ! విన్నారా యీ వింత? అని పరిహాసముగాఁ బలుకుచుఁ జప్పటులు గొట్టిరి. ఒక బాలుఁడు సమీపించి 'తిమ్మన్నా ! నీవు మహారాజ వగుదువేని నాకు మంత్రిపద మీయవలెను జుమా" అని నుడివెను. మఱియొక బాలుఁడు సమీపించి "మనతిమ్మన్నకు మహైశ్వర్య మెత్తినప్పుడు మన కందఱకు మున్నూఁటయఱువది దినంబులు బూరె లతో భోజనముపెట్టి, మనుగుడుపుపెండ్లికొడుకుల మనుపునట్లు మనుపు చుండును లే" యని యెగతాళిగఁ బలికెను. ఇంకొక బాలుఁడు వచ్చి 'మఱే లే మనతిమ్మన్న కప్పుడు మనమాట జ్ఞప్తియుండునా? అతఁ డెవ్వరో మన మెవ్వరమో?' అని నిష్ఠురోక్తులు పలికెను. 'మిత్రులారా ! దరిద్రునికిఁ గోరికలు మెండని పెద్దలు చెప్పినవిధముగా మనతిమ్మన్నకుఁ బెద్దకోరికలే పొడమినవి. వా రేమి వెఱ్ఱివారలా? అని వేఱొక బాలుఁడు వచిం చెను. ఇట్లీవిధముగా బాలు రెల్లరు నెవ్వారికిఁదోఁచిన పోటు మాటలను వారు పలికి మనస్సు నొప్పించిరి. అతఁడు సూక్ష్మబుద్ధి కలవాఁడు గావున వారి యెగతాళిపలుకుల కుడుకుఁ జెందక వారలయెదుటఁదమ్మునకు సిద్ధునిపలుకులు వినిపించుట తప్పని గ్రహించి వారలతో నవ్వుచునాటల నాడుచుఁ బాటలఁ బాడుచు నాఁటిదినము సంతోషముతో గాలము పుచ్చెను. అతఁ డానాఁటిరాత్రి పండుకొనియున్నవేళ సిద్ధునిసుద్దులు మరల దలఁపునకు రాఁగా నిద్దురపట్టక తనలోఁ దానిట్లు తలపోసికొనియెను.

“ఎవ్వడీప్రపంచములో బహుజనోపకారియై ప్రవర్తింపుచుఁ దనజన్మమును సార్థకపఱచుకొనునో వాఁడే పురుషుఁడు; వానిదే యుత్తమజన్మము. వానికీర్తి శాశ్వత బ్రహ్మకల్పముగా భూమిపై నిలుచును. విద్యయు ధనము నున్నగాని జన్మము సార్థకతఁ గాంచదు. బహుజనోపకారి కావలెనన్న నవశ్యము పురుషుఁడు విద్యాధనములరెంటిని సముపార్జించవలయును. కాలముయొక్క విలువను గుర్తెఱింగి వర్తించినఁ గాని యవి సంప్రాప్తములు గావు. ఇంతకుఁ బూర్వమువలె నాఁటపాటలతోఁ గాలము గడిపిన, నాజన్మము వ్యర్ధము కాఁగలదు. ఇఁక నేనొకక్షణమైనను వ్యర్ధముగాఁ బోఁగొట్టుకొనఁ జాలను, చెడి బంధువులయిండ్లకుఁ జేరుటకంటె విద్యాభ్యాసముఁ జేయునంతవఱకు మాధుకరవృత్తిచే జీవింపుచుఁ గాలముగడుపుటయ యుత్తమపద్దతి. దాన దోషమేమియును గానుపింపదు. సిద్ధుని పలుకులు యధార్థము లనిపించుటకైనను నేను మనఃపూర్వకముగాఁ బరిశ్రమచేసి కృతార్థుఁడ నగుదు. నాకు మహైశ్వర్యము లభించిన నాజన్మము బహుజనోపకారకరమై శాశ్వతమైన యశస్సును పొందును” ఇట్లు తలపోసికొనుచుండ నాబాలునకు నిదురపట్టెను.

దారిద్ర్యము.

తల్లిదండ్రులు బాల్యముననే పరలోకగతులై , చిన్నవారగుటచేత నీబాలురిరువురు దారిద్ర్యమను పెనుభూతము నెదుర్కొనవలసినవారైరి. అష్టకష్టములపాల్సేసి మనస్సు కలంచివైచునది దారిద్ర్యము. గుండెదిటవు లేనివారిని పలాయితులను గావించి దుఃఖపరంపరలఁ బొరలాడించునది దారిద్ర్యము. మృత్యువుకంటెను కష్టప్రదమైనది దారిద్ర్యము. దారిద్ర్యము తలకెక్కినా పోటుబంటులు పిరికిబంటు లగుదురు. సత్యవంతు  లసత్యవంతు లగుదురు. వివేకు లవివేకు లగుదురు. జీవితరంగమున దారిద్ర్యము నెదుర్కొని పోరాడి జయించినవాఁడె మహావీరుఁడు గాని బలాఢ్యుఁడై రణరంగమున శత్రువుతలఁ దఱిఁగిన వాఁడు మహావీరుఁడు గాఁడు. మనుజునకు దీనింబోలినశత్రువు ధాత్రిలో మఱియొకటి గానరాదు. ఆత్మగౌరవ మున్నవాఁడు, జితేంద్రియుఁడైనవాఁడు, స్వశక్తి విశ్వాసము గలవాఁడు, దైవమునెడ శ్రద్ధాభక్తులు చూపువాఁడు, నిరంతరకర్మఠుఁడునైనవాడు మాత్రమే దారిద్ర్యభూతమును బాఱఁద్రోలఁగలఁడు. వీనితేజస్సుముందు దారిద్ర్యభూతము సుస్థిరముగా నిలువఁజాలదు. ఇట్టి సుగుణసంపత్తిగల ప్రతిభాశాలికిమాత్రమె దుర్భరమైన దారిద్ర్యముతోడి పోరాటము సాధ్యమగును. సమర్ధుఁడైన ప్రతిభాశాలిమాత్ర మీ పెనుభూత మాడించినట్లాడఁడు. వీనితోఁ బోరాటము పెట్టుకొనె నేని దారిద్ర్యభూతము దినక్రమమున దనబలము నంతయుఁ గోల్పోయి తనబలము నంతయుఁ దనశత్రువు గైకొనఁగా కడపటవానిని విడిచి యదృశ్యమైపోవుట నిశ్చయము. ఆ బాలురిఱువు రట్టి ప్రతిభాశాలురగుటంజేసి దారిద్ర్యభూతము నొకలెక్కగాఁ గొనక స్వప్రయత్నముచే విజయమును సాధింప సమకట్టిరి.

విద్యాభ్యసనము.

రామునియెడ లక్ష్మణుఁ డెట్టిభక్తివిశ్వాసములు చూపి యుండెనో యట్లే గోవిందుఁడు తనయున్నయగు తిమ్మనయెడ భక్తివిశ్వాసములు చూపుచుండుట యాతనియదృష్ట మని చెప్పఁదగియున్నది. అన్నమాట తమ్ముఁ డెన్నఁడును జవదాటి యెఱుఁగఁడు. అందువలన నాసోదరులిరువురును రామలక్ష్మణులవలె నన్యోన్యానురాగముతో ప్రవర్తింపుచు విద్యాభ్యసనమునకు దొరకొనిరి. అన్నదమ్ములిరువురు ప్రతిదినమును సూర్యోదయమునకు ముందుగాలేచి కాల్యకరణీయంబులు దీర్చుకొని, సువర్ణముఖికిఁబోయి, స్నానసంధ్యాద్యనుష్ఠానంబులు నిర్వర్తించుకొని, ప్రాతఃకాలమున నుపాధ్యాయులకడకేఁగి, కావ్యపఠన మొనరించి, సూర్యుఁడు నెత్తికి దిన్నఁగా మింట వెలుంగువేళ సోదరులలోనొకరు మాధుకరమునకై బయలుదేరి కొంత ప్రసాదమును సంపాదించుకొని వచ్చిన పిమ్మట నిరుపురును గలిసి భుజింపుచుందురు, భోజనముచేసి కొంతవిశ్రాంతి గైకొన్న మీఁదట దస్తూరి కుదుర్చుకొనుటకై గంటములతోఁ దాటాకులమీఁద వ్రాయుచుందురు. తరువాతఁ గొంతసేపు తెలుగు కావ్యపఠనమొనరించి, పిమ్మట రాజకీయోద్యోగుల కడకేఁగి వారల నాశ్రయించి వారలకు వినయవిధేయులై వారు నియమించినషసులను గావించి, సాయంకాలమైనతరువాత, పర్వతములు, చెఱువులు, నదులుగల ప్రదేశములకు వాహ్యాళి వెడలి, ప్రకృతి సౌందర్యమును దిలకింపుచు నానందించు చుందురు. అటుపిమ్మట నింటి కరుదెంచి రాత్రిభోజనమైనతరువాతఁ గొంతసేపు భారతకథలనుగాని, రామాయణకథలనుగాని పూర్వరా జన్యచరిత్రలు మఱియేవియైనగాని పెద్దలవలన వినుచుందురు. ఇట్లైదాఱుసంవత్సరములు బహుకష్టపడి సంస్కృతాంధ్రభాషలయందు చక్కని పాండిత్యమును సంపాదింపఁగలుగుటయగాక గొప్ప వ్రాయసకాండ్రుకూఁడనైరి. ఇంతియ గాక శాస్త్రము లభ్యసించుటకై పండితులుండెడి స్థానములకుఁ బోయి వారల నాశ్రయించి వారలకు శుశ్రూషలు గావించి శాస్త్రాభ్యసనము గూడఁ గావించిరి. సుప్రసిద్ధగణకులకడ కేఁగి రెండుమూఁడు సంవత్సరములు గణితశాస్త్రమునందుఁ గృషిచేసి ప్రావీణ్యమును సంపాదింపఁగలిగిరి. అతిసూక్ష్మబుద్ధి కలవాఁడగుటచేత తిమ్మన గోవిందునికంటెను మేధావియై వన్నె కెక్కుచుండెను. తనబుద్ది సూక్ష్మతచేత తిమ్మనార్యుఁడు ప్రపంచములోని వస్తుతత్త్వమును బాగుగా గ్రహింపుచుండెను. ఎప్పుడీతఁడు నెక్కడకుఁ బోయినను మనుష్యస్వభావమును గ్రహించుటకే ప్రయత్నము సేయుచుండెను. అరణ్యమునకుఁ బోయిన వివిధజాతివృక్షముల తత్త్వములను గ్రహింపుచుఁ దెలియనివానిఁగూర్చి, దెలిసిన వారి నడిగి తెలిసికొను చుండెను. ఇట్లే జలచరములు, చతుష్పాదజంతువులు, మొదలగువాని యొక్క స్వరూపగుణ స్వభావభావముల గుర్తింపుచు నాతఁ డెంతయో విజ్ఞానమును సంపాదించెను.

"శరీరమాద్యం ఖలు ధర్మసాధన" మ్మని యెప్పుడును శరీరారోగ్యమును గాపాడుకొనుచు దృఢకాయులుగ నుండవలయునని నిరంతరమును దేహపరిశ్రమ చేయుచుండిరి. ఆంధ్రకర్ణాటకులలో నుండు నానాజాతిసాంప్రదాయచరిత్రముల నేర్పుతోఁ బఠించిరి. ఇట్లిరువరిరెండు సంవత్సరముల వయస్సు వచ్చునప్పటికి సంస్కృతాంధ్రముల యందు సంపూర్ణ పాండిత్యమును చాలవరకు శాస్త్రీయపరిజ్ఞానమును, గణక విద్యానైపుణ్యమును గడించి విశేషప్రతిభావంతులనియు, దయార్ద్రహృదయు లనియు, కార్వేటినగరము, నారాయణవనము, చంద్రగిరి, గుత్తి, పెనుగొండ మొదలగు పట్టణములఁ ప్రఖ్యాతి గాంచుచుండిరి. ఇఁక వీరలు రాజనీతిశాస్త్రమును దెలిసికొన వలసియుండిరి.

చిట్టిగంగనామాత్యుఁడు.

ఈబాలు రభ్యసింపపలసిన శాస్త్రములలోఁ బ్రధానమైనది యర్థశాస్త్రము. వానిని బోధింపఁ గల పండితులసంఖ్య బహుస్వల్పముగ నుండెను. అట్టిశాస్త్రమును బోధింపఁ గల మహనీయుఁ డొక్కఁడు చంద్రగిరిరాజ్యమునం దుండెను గాని యతఁడెల్లరకు సులభసాధ్యుఁడు గాఁడు. అతఁడు కౌశిక గోత్రుఁడైన నాదిండ్ల చిట్టిగంగనామాత్యుఁడు. ఈ మహానీయుఁడు తాను వృద్ధుఁడైనను చంద్రగిరిరాజ్యాధిపతి యైన సాళ్వనరసింహ మనుజాధీశ్వరుని ప్రధానమంత్రిగ నుండి యా రాజ్యమును విస్తరింపఁ జేయు చుండెను.

ఇఁత డిప్పటికి డెబ్బదేండ్లు నిండినవయస్సు గలవాఁ డైనను గాయపుష్టియును, బుద్ధివై శారద్యము నితనికి బలీయముగ నుండెను. ఈ మంత్రిశిఖామణి మనబాలురకు బంధువుఁ డైనను దైన్యదశయం దుండియు వీ రేమికారణము చేతనో చిట్టి గంగనామాత్యునిప్రాపును మొదట నభిలషింపలేదు. ఈబాలురు విద్యాభ్యసనము గావించి పేరుపొందినవారగుట విని నాదిండ్ల చిట్టిగంగనామాత్యుఁడు వీరలను దనపట్టణమగు నారాయణ వనమునకు రప్పించెను. ఆకాలమునందు నారాయణవనము చంద్రగిరిరాజ్యమునకు రాజధానీ నగరముగ నుండెను. సాళ్వ నరసింహభూపాలుఁ డిచ్చటనే నివసింపుచుండెను. గావున నాతని ప్రధానమంత్రి యగు చిట్టిగంగనామాత్యుఁడు గూఁడ నారాయణవనమునందే నివసించు చుండెను. ఈగంగనామాత్యుఁడు సాళువ తిమ్మరాజును గోవిందరాజును రప్పించి వారివిద్యలను బరీక్షించి యాయవిద్యలయందు వారికిం గల ప్రజ్ఞావిశేషములం బరికించి మిక్కిలి సంతోషించి తనదివాణమునందు లేకరులనుగా నియమించెను. అట్లు వారు చిన్నపదవులందుండి తమ ప్రజ్ఞావిశేషములను జూపుచుఁ బైయధికారులదయను సంపాదించుకొని ప్రవర్తించుఁ చుండుటను గాంచి గంగనామాత్యుఁడు వారు రాజనీతిశాస్త్రము నభ్యసించినమహోన్నత పదవి నందఁగల రని నిశ్చయించి ప్రేమానురాగము లుట్టిపడ నొకనాఁడు తిమ్మనార్యుని రప్పించి 'తిమ్మనా! నీవు కడుబుద్ధి మంతుఁడవు ; ప్రతిభాశాలివి ; నీ పూర్వులు మంత్రిపదవులను బొంది ప్రఖ్యాతిఁ గాంచినవారు. వారికంటెను, మాకంటెను నీవు ప్రజ్ఞాఢ్యుడవై యుత్తమస్థానము నలంకరించి యీదక్షిణ హిందూస్థానమున కంతకును సర్వాధికారివై ధర్మపరిపాలనము గావింపఁగలవని నీశక్తినిబట్టి నేను గ్రహించితిని. నీవంటి సమర్థుడు నేఁడు మఱి - యొకండు నాకీరాజ్యమునఁ గానరాడు. నేను వృద్ధుఁడనైతిని. నాకుందెలిసిన రాజనీతిశాస్త్ర మర్మముల నన్నిటిని మహారాజ్య తంత్రవిధానములతోడం గఱపి నిన్ను రాజనీతివిద్యావిశారదు నిగా నొనరింపఁ నీయందుఁ గల మమకారము నన్ను శతవిధములఁ బ్రేరేపించు చున్నది. నాయనా! ఒక్కమాట మనస్సునం దుంచుకొనుము. హైందవ ధర్మరక్షణార్ధమై స్థాపితమైన యీసామ్రాజ్యము వినాశము నొందకుండ మ్లేచ్ఛాక్రాంతము గాకుండఁ జూచుకొమ్ము. నీ జీవితకాలమున నీవొనర్పవలసిన విధ్యుక్తధర్మమిదియే యని యెఱుంగుము. నీ బొందిలో ప్రాణమున్నంతదనుక దీని మఱువకుము.

రాజకీయ పరిస్థితులు.

చెట్టు చెడుకాలమునకుఁ గుక్కమూతి పిందెలు పుట్టినటులు సంగమరాజవంశమున దౌర్భాగ్యులు పుట్టి హరిహరప్రౌఢ దేవరాయాది రాజ్యవర్యులు సంపాదించి పెట్టిపోయిన సామ్రాజ్యవైభవమును గ్రమముగాఁ గొల్పోవుచు దుర్వృత్తులంబడి దుర్బలులై యొండొరులం జంపుకొనుచు స్వేచ్ఛావిహారులై వర్తింపు చుండుటయు, ఒకవంక బెడందకోటసుల్తాను (Sultan of Beder) కర్ణాటసామ్రాజ్యమును గబళింపఁజూచుటయు, మఱియొకవంక నొడ్డెరాజగు పురుషోత్తమగజపతి విజయనగర సామ్రాజ్యముపై దండయాత్రలు సలుపుచు నుదయగిరి పర్యంతము భూభాగము నాక్రమించుకొని పరిపాలించుచుండు టఁయుదలపోసి యీనరపతి సామ్రాజ్యము దక్షిణహిందూస్థానమున వర్థిలఁజేయవలయునని బుద్ధిమంతుఁడును, బాహుబలశాలియు మహాయోధుఁడునగు నీసాళువ నరసింహ భూపాలుని నీ సామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తునిగావింప దృఢసంకల్పుఁ డనై పదేండ్లుగాఁ బ్రయత్నించు చున్నాఁడను. బహమనీ సుల్తాను రెండవ మహమ్మదుషా దండెత్తివచ్చి గండికోట దుర్గమును ముట్టడించినప్పుడును, కళింగదేశాధీశ్వరుండైన పురుషోత్తమగజపతి కాంచీపురముపై దండెత్తి వచ్చినప్పుడును సాళ్వనరసింహుని సైన్యములు దలంపడి వారల నోడించి తఱుమునట్లు చేసితిని. సాళ్వనరసింహ భూపతిని కర్ణాట సామ్రాజ్యమున కంతకు నభిషిక్తుని గావింపవలయునని పెద్ద కోరికతోనున్న వాఁడను. ఈ సాళ్వనరసింహభూపాలుఁడు సర్వస్వతంత్రుఁడై పరిపాలనముఁ జేయుచున్నను విద్యానగరమున (విజయనగరము) సంగమ రాజవంశీయులు సింహాసనస్థులైయుండ నుపేక్షించి యూరకుండుట హైందవ సామ్రాజ్యమునకు క్షేమకరముగాదు. ఏవేళనో బలవంతులైన బహమనీ సుల్తానులు నోట వేసుకొందురను భయముగలదు. నేనొకవేళ నామహత్కార్యము నేఱవేర్చునంతవఱకు జీవించియుండుట తటస్థపడకపోయెనేని నీవా మహాకార్యమునకుఁ బూనుకొనవలయును. దీని నీవు వాగ్దత్తము చేసినయెడల నీకు రాజనీతి శాస్త్రీయ మర్మములన్నిటిని బోధించి ప్రధానమంత్రి స్థానమునకుఁ గ్రమముగా రప్పింతు" నని హెచ్చరించెను. అప్పుడు తిమ్మనార్యుఁడు 'అమాత్యవర్యా! నీ యభీష్టమును దీర్చుటకన్నఁ బరమోత్కృష్టమైన కార్యము నాకుమఱి యొండులేదు. అవశ్యము హైంధవసామ్రాజ్యాభి వర్ధనమునకై నాజీవితమును ధారపోయుదును. కృష్ణానదికి దక్షిణభాగము నుండి యశ్వపతులను గజపతులను బాఱద్రోఁలి మఱియెప్పుడును నడుగుపెట్టకుండఁజేయుదు. మహాత్మా! నీకుందెలిసిన రాజనీతిని నాకుబోధించి నాజన్మము. కృతార్థతంబొరయునట్లు గావించి యాశీర్వదింపుము. నీకరుణాప్రసాదమున సమస్త హైందవాళియొక్క మన్ననకుఁ బాత్రుఁడనై యార్యధర్మరక్షణార్థమై నాజీవితమును ధారపోసి వాసికెక్కుదు' నని పలికెను. ఆపలుకుల కావృద్ధమంత్రి పరమానందమునుబొంది యానాఁడు మొదలుకొని రాజనీతిబోధకంబులగు నర్థశాస్త్రీయ రహస్యంబుల బోధింపుచు వచ్చెను. రెండు సంవత్సరముల కాలములో దండనీతియను గొప్పశాస్త్రములోని మహద్విషయముల నన్నిటిని బోధించెను.

అర్థశాస్త్రపఠనము.

మనువు, బాహుదంతుఁడు, బృహస్పతి, శుక్రుఁడు వ్రాసిన మహద్విషయములను బోధించెను. భరద్వాజుఁడు, పరాశరుఁడు, వ్యాసుఁడు, వైశంపాయనుఁడు, ఘోటముఖుఁడు, పిశునుఁడు, కౌణపదంతుఁడు, వాతవ్యాధి, కాత్యాయనుఁడు, చారాయణుఁడు, కింజల్కుఁడు మొదలగు స్మృతికర్తలు వ్రాసిన నీతిశాస్త్రములు నేఁడుఖిలములై యున్నను, ఆకాలమున వ్యాప్తములై యున్నందున వానిలోనిరహస్యముల నన్నిఁటిని తెలియఁ జెప్పెను. కౌటిల్యునియర్థశాస్త్రమును, కామందకుని నీతిసారమును జక్కఁగా జదివించి ప్రజ్ఞాఢ్యునిఁ గావించెను. ఇట్లధిక శ్రద్ధాభక్తులు గలిగి చిట్టిగంగనామాత్యునివలనఁ దిమ్మరుసు మంత్రి విద్యాసముద్దేశము, వృద్ధసంయోగము, అమాత్యోత్పత్తి, మంత్రిపురోహితోత్పత్తి, దూతప్రణిధి, జనపదనివేశము, దుర్గవిధానము, దుర్గనివేశము, సీతాధ్యక్షత్వము, పణ్యాధ్యక్షత్వము, శుల్కాధ్యక్షత్వము, ధర్మస్తేయము, వ్యవహారము, కంటకశోధనము, యోగవృత్తము, అరిమిత్రో దాసీ నాది ద్వాదశరాజమడలములు, వివిధరాజ్యాంగముల యుత్తమస్థితి, శమవ్యాయామికము, పౌరుషము, దైవసహాయము, సంధి విగ్రహాయాన ద్వైధీభావాసన సమాశ్రయములు, వ్యసనాధి కారికము, అభియాస్యత్కర్మము, సాంగ్రామికము, సంఘవృత్తము, అబలీయనము, దుర్గాలంబోపాయము, ఔపనిషదికము, స్వబలోపఘాతప్రతీకారము, వంచనము, తంత్రయుక్తులు మొదలగు మహావిషయములను గూర్చిన పరిజ్ఞానమును మెండుగా సంపాదించెను.


___________