తిమ్మరుసు మంత్రి/తృతీయ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తృతీయ ప్రకరణము.

ఇమ్మిడి నరసింహయఁడు.

సాళ్వనరసింహరాయఁడు స్వర్గస్థుఁడైనవెనుక నతని పెద్దకుమారుని, బాలుని తిమ్మరాయనిఁ బట్టాభిషిక్తుని గావించి తుళువనరసరాజు సమస్థ రాజ్యభారధురంధరుఁడై తిమ్మరుసు మంత్రి సాహాయ్యంబున బరిపాలనము సేయుచుండెను. సరసింహసామ్రాజ్యమున నిట్టి మౌద్ధత్వమును బొంది నరసరాయఁడు తానే రాజ్యచక్రమును నడిపించుటఁ జూచి సహింప జాలక యొకదళవాయి నరసరాయనిపై నొకయపవాదు గల్పింపనెంచి రహస్యముగా బాలరాజును జంపించెను. తుళువ నరసరాజే రాజద్రోహియై రాజ్యాపహరణ నిమిత్తము బాలరాజును చంపించెనని ప్రజలు చెప్పుకొనుచు నరసరాజును ద్వేషించునట్లుగాఁ జేసినవాని కపటతంత్రమునకుఁ బ్రతిహతి నాలోచింపు మని తిమ్మరుసును వేడెను. “ప్రభువర్యా! శత్రువును సాధించుపని తరువాత చూచుకొందము. ముందుగా సాళ్వనరసింహభూపాలుని ద్వితీయపుత్త్రుని ఇమ్మడి నరసింహరాయఁ డనుపేరుతోఁ బట్టాభిషిక్తునిగావించి యపనిందఁ బాపికొను” మని తిమ్మరుసుమంత్రి ప్రబోధింపఁగా నతఁ డట్లు గావించి యపనిందఁ బోగొట్టుకొని జనరంజకుఁ డయ్యెను. తన ప్రయత్నమంతయు నీకార్యముమూలముగా విఫలమైనం దున నాదళవాయి విచారించుచు, తుళువ నరసరాయని మఱింత ద్వేషించుచు నపకారము సలుప నిశ్చయుఁడై ఇమ్మడి నరసింహరాయని ప్రేమను క్రమముగా సంపాదించి యాతనిఁ దన కనుకూలుని గావించుకొని తుళువ నరసరాయని, తిమ్మరుసును, సాగనంపుటకై ప్రయత్నించు చుండెను. తిమ్మరుసు మంత్రి చారులవలన వాని దుర్మార్గమును దెలిసికొని సరసరాయనితో నిట్లనియె." వీరాగ్రణీ! వీఁడు మనకు శత్రువై బాలుఁడైన మహారాజు నాకర్షించి యాతనితోఁ జెలిమి గావించుకొని మన వినాశనమునకై ప్రయత్నించుచున్నాఁడు. భ్రాతృహంతకుఁడైన వీనిని జేరఁదీసి యిమ్మడి సరసింహరాయఁడు గౌరవించు చున్నాఁడు. దీన నేమి యుపద్రవము కలుగునో యీబాలరాజు గుర్తెఱుఁగక యున్నాడు. నిష్కారణముగా దనయన్నను జంపించినవాఁడు తన్నుఁ జంపింపక మాసునా ! ఇతని దౌర్భాగ్య మేమని చెప్పవచ్చును? మన ముపేక్షించి యున్న పక్షమున సామ్రాజ్యమునకు ముప్పు వాటిల్లును. ఈద్రోహియైన దళవాయిని బలిమినైన మాయోపాయమునైనఁ గడతేర్చినఁగాని నీకును, నాకును, సామ్రాజ్యమునకును క్షేమము లేదు. కావున ముందుగా నేను బాలరాజును మందలించి హితబోధ గావించి చూచెదను. అతఁడు వినకున్న జరుపఁదగిన కార్యమునుగూర్చి తరువాత యోజింత' మని చెప్పి యాతని సమ్మతిగైకొని తిమ్మరుసుమంత్రి యొకనాఁడు మహారాజు సన్నిధానమునకు బోయి యిట్లు హితబోధ గావించెను. "రాజేంద్రా! ఈ సామ్రాజ్యమునకై మీతండ్రియును సైన్యాధ్యక్షుఁడైన నరసరాయఁడును పొందినశ్రమ యింతింత గాదు. మీతండ్రియెడఁగల భక్తివిశ్వాసములచేత తుళువ నరసరాయఁ డెప్పుడును మీతండ్రికి కుడిభుజముగా నుండి యీ సామ్రాజ్యసంపాదనమునందుఁ దోడ్పడి ప్రతిపక్షులనుక్కడంచి యీ మహాసామ్రాజ్యమునకంతకుఁ బట్టాభిషిక్తుని గావించి ప్రతిభ గాంచినవాఁడు గాని సామాన్యుఁడు గాఁడు. మీతండ్రి స్వరస్థుఁడైనను మీతండ్రి యభీష్టము ప్రకారము మీయన్నను బట్టాభిషిక్తునిఁ గావించి సమస్త రాజ్యభార ధురంధరుఁడై ప్రజాపాలనము సేయుచుండ సహింపఁజాలక దుర్మార్గుఁడై నీ హితుఁడైన దళవాయి వానిని రహస్యముగా జంపించెను. ఈ యపనిందఁ దనపైఁ బడెనని విచారించి నరసరాయఁడు స్వామిద్రోహి కాఁడు గావున నిన్నుఁ బట్టాభిషిక్తుని గావించి నీచేతఁ బరిపాలనము సేయించుచున్నాఁడు. దీనిని నీవు విస్మరించి భ్రాతృహంతకుఁడైన యా దుర్మార్గునితో మైత్రి నెఱపుచు కృతఘ్నుఁడవై నరసరాయనికిని నాకును నపహరముఁ జేయఁ జూచు చున్నాఁడవు. నీవు బాలుఁడవు. లోకవృత్త మెఱుంగనివాడవు. నీచులను జేరఁదీసి మెత్రి నెఱుపుదువేని తుదను సామ్రాజ్యమును, ప్రాణములనుగూఁడ గోలుపోవలసి వచ్చును. కావున నాప్రార్ధనమును మన్నించి దుర్మార్గులతోడ సహవాసమును మానుము. ముఖ్యముగా భ్రాతృహంతకుఁడైన యా దళవాయినిఁ చెఱబట్టి యుంచుట యొండె, దేశమునుండి వెడలనడచుటయొండెచేయుట నీకు శ్రేయోదాయకము. నీయొక్కయు, సామ్రాజ్యముయొక్కయు శ్రేయస్సును గోరి నిర్భయముగాఁ బలుకు చున్నాఁడను.”

ఇట్లు తిమ్మరుసుమంత్రి సాహసించి హితోపదేశము చేసిసప్పుడు మౌనము వహించి యూరకుండెను గాని బాలరాజు ప్రత్యుత్తర మీయఁ డయ్యెను. అంత తిమ్మరుసుమంత్రి బాలరాజునొద్ద సెలవుగైకొని సరసరాయనికడ కేతెంచి బాలరాజు మౌఢ్యము నెఱింగించి కలుగనున్న ప్రమాదమునుగూర్చి ముచ్చటించి యాదళవాయినిఁ బట్టుకొని సంహరించుట కర్తవ్యమని చెప్పి యందులకుఁ దగినమార్గమును సూచించెను. అతని హితోపదేశమును శిరసావహించి నరసరాయఁ డేదోమిష కల్పించుకొని తిమ్మరుసుతోఁగూడ పెనుగొండకుఁబోయి, అధికసైన్యమును గూర్చుకొని రహస్యముగా విద్యానగరమునకు వచ్చి ముట్టడించి భ్రాతృహంతకుఁ డైనదళవాయిని శిక్షింతువాలేక రాజ్యము విడిచెదవా యని బాలరాజునకు కబురు పంపెను. ఇట్లు దృఢనిశ్చయుఁడై తుళువ నరసరాయఁ డైదాఱు దినములు ముట్టడి వేసి విడువకయుండ బాలరాజు భయపడి యింకఁ గార్యము మించునని వెంటనే యాదళవాయిని జంపించి వాని తలను నరసరాయనికడకుఁ బంపెను. అప్పుడు నరసరాయుఁడు ముట్టడిని మాని యంతఃపురమునకు బోయి యా బాలరాజును సందర్శించి యింక నెన్నఁడు నిట్టికార్యములఁ జేయకుమని మందలించి యాతని నచ్చట నుంచక వేఱొక దుర్గమునకుఁ బంపి యాతని సంరక్షణార్థము కొంతసైన్యమును నిలిపి పేరున కిమ్మడి నరసింహరాయఁడే రాజేంద్రుఁడైనను వ్యవహారమున మాత్రము తుళువనరసరాయఁడే మహారాజేంద్రుఁడై సమస్త రాజ్యభార ధురంధరుఁడై ప్రవర్తిల్లెను. అతనియాజ్ఞ సామ్రాజ్యమునం దంతట నమోఘముగా నిర్వర్తిలు చుండెను. అత్యధిక ప్రతిభావంతుఁడైన సాళువతిమ్మనామాత్యుఁడు మహాప్రధానియై రాజ్యతంత్రమును నడుపుచుండఁ దుళువనరసరాయనికీర్తి జగద్వ్యాప్త మగుచుండెను. తిమ్మరుసుమంత్రి సామ్రాజ్యమున కంతకు మూలస్థంభ మయ్యెను. ఎవ్వనిపలుకు సామ్రాజ్యమున నప్రతి హతమై ప్రవర్తించు చుండెనని ప్రశ్నించితిమేని తిమ్మరుసునే మొదట చెప్పవలయును. మహారాజులు, మండలేశ్వరులును, మంత్రులు సేనానులు మొదలగువారెల్లరు నాతని యాజ్ఞా బద్దులై ప్రవర్తించుచుండిరనఁ దక్కినవారిసంగతి చెప్పనేల?

తురుష్కుల జయించుట.

విజాపురసుల్తానగు ఆదిల్‌షాహ ప్రత్యర్ధియగు కాశిం బరీదు తన ప్రతిపక్షిని జయించుటకై తనకు సాహాయ్యము చేయవలసినదని నరసరాయనిఁ బ్రార్థించెను. అతఁడు తిమ్మరుసుతో నాలోచింపగా నాతఁడిట్లనియె. "విజాపురసుల్తాను మసకు శత్రువు, కాశింబరీదును మనకు శత్రువు. మనకు శత్రువులుగ నుండువారు తమలోదాము పోరాడునపుడు మనమొక పక్షమున జేరి రెండవపక్షము నోడించితిమేమి మొదటిపక్షము వారు మనకు సులభసాధ్యు లగుదురు. శత్రువులను జయించుట కిదియొక మార్గము. మఱియు వారిలోవారి కైకమత్యము కలుగకుండ వారిలో వారికి మనస్పర్ధలను గలిగించు చుండవలయును. అందువలన వారిబలము తగ్గిపోయి సులభసాధ్యు లగుచుందురు. ఇది యొకవిధమైన రాజనీతి. కాశింబరీదు మన సాహాయ్యము నపేక్షించెను. గావున మనము చేయు సాహాయ్యము మనకే లాభించునదిగా నుండవలయును. కనుక కృష్ణా తుంగభద్రానదుల నడుమ నుండుదేశము అనగా ముదిగల్లు రాచూరు దుర్గముల మనమాక్రమించుకొందుము. అని చెప్పి కాశింబరీదునకు వర్తమానముచేసి కొంతసైన్యముసు బంపించి యా దుర్గములను వానిచుట్టు నుండుదేశము నాక్రమించుకొని యెను. ఆదిల్‌షాహ యేమియుఁ జేయజులక కొంతకాల మూరకుండవలసినవాఁడయ్యెను.

కోనేరినాధుని దుండగము.

సాళువనరసింహభూపాలుని కాలముననే సాళువ తిరుమలభూపాలునికి బిమ్మట మహామండలేశ్వరుఁ డైన కోనేరినాథుఁడు తిరుచునాపల్లి మండలమునకుఁ బరిపాలకుఁడుగా నియమింపఁబడి ప్రజాపాలనము సేయుచుండెను. ఇతఁడు శైవుఁ డైనందున జంబుకేశ్వరాలయమునెడఁ బక్షపాతము గలిగి శ్రీరంగము లోని రంగనాధుని యాలయథర్మక ర్తలను నానావిధముల బాధింపఁగా వార లీతనిబాధ పడలేక గోపురము పైనుండిపడి ప్రాణత్యాగమును గూడఁ జేసికొనిరఁట! ఈసమాచారము తిమ్మరుసునకుఁ దెలియవచ్చెను. తిమ్మరుసుమంత్రి శైవవైష్ణవ మతములయందు సమబుద్ధి గల స్మార్తుఁ డగుటచేత కోనేరినాథుని దుండగములను నివర్తింపఁజేయుట శ్రేయోదాయకమని నరసరాయనిఁ బ్రేరేపించెను. అతఁడు నాగమనాయని, కుమార నరసరాయని (వీరనరసింహరాయలు) వెంట నిడికొని తిరుచునాపల్లి మండలమునకుఁ బోయినపుడు కోనేరినాధుఁ డీసమాచారముఁ దెలిసికొని బహుసైన్యములం గూర్చుకొని వీరి నెదుర్కొని ఘోర సంగ్రామము సలిపెను. తుళువనరసరాజు కోనేరినాధుని రణరంగమున నోడించి సంహరించెను, అంతట నరసరాజు నాగమనాయకుఁడు కుమారనరసనాయకుఁడు శ్రీరంగమునకుబోయి రంగనాథుని సందర్శించి భక్తి యుక్తముగ నా దేవునకు భూదానములను బెక్కులను గావించిరి. కోనేరినాథునకు భయపడి స్వగృహములను విడిచి పాఱిపోయిన వైష్ణవస్వాముల కభయమొసంగి స్వస్థానమునకు రప్పించి యుత్సాహముఁ గల్పించిరి.

బహమనీరాజ్య విభాగములు.

అవక్రపరాక్రముఁడై అరాతిజనభయంకరుఁడై ఇమ్మడి నరసింగరాయని దూరముగాఁ గూరుచుండఁబెట్టి తానే సార్వభౌముఁడైనట్లుగా సామంతనృపవర్గముచే మ్రొక్కులను బడయు చున్న తుళువనరసింగరాయఁడు తనకు వశ్యుఁడై కర్ణాట సామ్రాజ్యనిర్వహణభారము నంతయుఁ దనపై బెట్టినందున సాళువతిమ్మనామాత్యచూడామణి యా మహాసామ్రాజ్యతంత్రమును బ్రజానురంజకముగ నడుపుచు, సుస్థిరముగ నిలుచుమార్గము నాలోచింపు చుండెను. అదివఱకు హైందవసామ్రాజ్యమునకు ప్రతిస్పర్ధముగ వర్థిల్లుచున్న బహమనీ సామ్రాజ్యము స్వప్రయోజనపరులైన సుబాదారులకుఁ జిక్కి యన్యోన్య వైషమ్యములమూలమున నైదువిభాగములుగా విడిపోయెను. (1) బరీద్‌షాహి, ఇది కాసింబరీద్ అనువానిచే నేర్పడియెను. దీని రాజధాని బేదర్ లేక బెడందకోట. (2) ఇమాంషాహి. ఇది పరాడ్ దేశములోనిది. ఫత్తేఉల్లా ఇమాంషాహ అను వానిచే నేర్పడియెను. దీని రాజధాని గావిల్ ‌గడము. (3) నిజాం షాహి ఇది అహమ్మద్‌షాహ అనువానిచే నేర్పడియెను. దీని రాజధాని అహమ్మదునగరము. (4) ఆదిల్‌షాహి ఇది యూసుఫ్‌ఆదిల్ షాహు అనువానిచే నేర్పడియెను. దీనిరాజధాని విజాపురము. (5) కుత్బ్‌షాహి. ఇది కూలికుత్బుషాహ అను వానిచే నేర్పడియెను. దీని రాజధాని గోలకొండ.[1] బహమనీ రాజ్యమిట్లు విభాగమై బలహీనమగుటకూడ తిమ్మరుసు చేయు ప్రయత్నములకుఁ దోడ్పడి జయప్రదములగుట కవకాశమిచ్చు చుండెను. మహారాజ్యతంత్రజ్ఞుఁడైన తిమ్మరుసు శత్రురాజ్యములలో నన్యోన్యము మైత్రి లేకుండునటులు ప్రయత్నించుచుఁ దనసామ్రాజ్యమునందలి సామంతప్రభువర్గమునను, సేనాధిపతి వర్గమునను, మనస్పర్ధలు జనించి సామ్రాజ్యవినాశహేతువులు గాకుండ వేయికన్నులతో జూచుచు హైందవసామ్రాజ్యమును వీక్షింపుచుండెను. కాని దైవ మెల్లకాల మనుకూలుఁడై యొక్కరీతి నుండుట యసంభవము.

ఆదిల్‌షాహ పరివేదనము.

విజాపురరాజ్యమునకును విజయనగర సామ్రాజ్యమునకును నడుమ రాచూరుమండలము గలదు. ఈ భూభాగము కృష్ణానదికిని తుంగభద్రానదికిని నడుమ బలాఢ్యములైన ముదిగల్లు రాచూరుదుర్గములచే నలంకరింపఁబడి యుండెను. ఇది సామ్రాజ్యరక్షకత్వమునకై కవచముభంగి నుండుటచేత బహమనీ సుల్తాను దీని నెప్పుడును స్వాధీనములో నుంచుకొనవలయునని ప్రయత్నించుచుండెను. అట్లే విజయనగరసామ్రాజ్య సార్వభౌముఁడును స్వాధీనములో నుంచుకొనవలయు ననియే ప్రయత్నించుచుండెను. ప్రస్తుత మియ్యది విజయనగరాధీశ్వరునిచే నాక్రమింపబడియెనని యిదివఱకుఁ జెప్పి యున్నాఁడను. ఇంత ప్రముఖమైన భూభాగము శత్రువు రాక్రమించినందులకుఁ బరితపింపుచు విజాపురసుల్తాను తన వజీర్లతో నిట్లు పలికెను. "ముదిగల్లు, రాచూరుదుర్గములు మనరాజ్యమున కాయుస్థానములని మీరెఱుంగుదురు. అట్టి యాయుస్థానములను మనశత్రువు లాక్రమించి విజృంభించుచున్నారు. మఱియు హైందవసామ్రాజ్యవర్ధ నస్థిరనీతికరణకుశలుం డగు తిమ్మరుసు మంత్రి నేడు గాకున్న ఱేపైనను విజాపురరాజ్యమును తుదముట్టింపఁగలడు. అతఁడు బ్రాహ్మణమంత్రి ; మహారాజ్యతంత్రజ్ఞుఁడు; అప్రతిమానప్రతిభాశాలి. అతనితో సాటి వచ్చువాఁడు విజాపురరాజ్యమునం గానరాఁడు. నే నెవ్వనికి భయపడువాఁడను గాను కాని వాని కొక్కనికే భయపడవలసి వచ్చుచున్నది. ఇంక మన ముపేక్షించుట ప్రమాదహేతువు. ఎట్లయిన నాదుర్గములను స్వాధీనపఱచుకొన్నఁ గాని నాకు నిద్దుర పట్టదు. ఈ యపకీర్తి బాపుకొన్నఁగాని దక్షిణహిందూస్థానమునఁ దురుష్క రాజ్యములకుం గలప్రతిష్ఠ, క్షీణమైపోవును."

అని నొవ్వఁబలికి దండయాత్రకు సైన్యముల సన్నదము చేయవలసిన దని యుత్తరు వొసంగెను. అతనియాజ్ఞను సిరసావహించి యూవజీర్లు సైన్యాధిపతులకుఁ దెలియఁ జేసిరి. తుళువ సరసరాయఁడు రాజద్రోహులనడంచుటకై దక్షిణ దేశమునకుఁ బోయినసమయమున విజాపురసుల్తాను రాచూరుమండలముపై దండెత్తి వచ్చెను. అయినను తిమ్మ రుసుమంత్రి యూరకుండక యా సుల్తాను నెదుర్కొని తఱుముటకై నరసరాయని సోదరుఁడగు తిమ్మనాయకుని నియమించెను. [2] అతఁడు కొంత సైన్య మును వెంటబెట్టుకొని బోయి తుంగభద్రానదిని దాటి యసహాయశూరుఁడై తురుష్క సైన్యముల నెదిరించి దోర్దర్పమును జూపి కొంతతడవు పోరాడఁ గలిగి దురుష్కసైన్యమును గొంతవఱకు నాశము గావించెను. గాని సుల్తానా యవమానమును భరింపజాలక సేనలం బురికొల్పుకొని స్థిరచిత్తుడై రణరంగమున నిలిచి సమరము సలుప తిమ్మనాయకుఁడు శత్రుసైన్య మధిక మగుటఁ గాంచి పోరాడఁ జాలక తన సైన్యములను మరిలించుకొని రాజధానికి వచ్చెను. ఆదిల్‌షాహ విజయనగరరాజధానిపై దండెత్తి రాఁగలసమర్ధుఁడు గాకుండుటచే నంతటితోఁ దృప్తినొంది ముదిగల్లు రాచూరుదుర్గములను గైకొనియెను. తిమ్మరుసు సామ్రాజ్యమున రాజ్యాంగ సంస్కరణములను గావింపవలసి యుండెను. రాజ్యంగమును బలపఱచుకొన్నఁ గాని తురుష్కులతో వైరముఁ బెట్టుకొని సాధించుటకు బ్రయత్నించుట యుత్తమపద్దతి కాదని యూహించి సైన్యాధిపతులు ప్రోత్సహించినను తురుష్కుల నుద్ద్రేకింపఁజేయు మార్గములపొంతఁ బోక యాయవమానమును సహించి యూరకుండెను. విజయనగరమున కుత్తరఫుదిక్కున శిధిలములై యున్న ప్రాకారములను దుర్గములను బలపఱిచెను. ఎన్నిదినములు ముట్టడించినను శత్రువుల కభేద్యమై యుండునట్లు చేసెను. నగరరక్షుకసైన్యమును పెంపు గావించెను. బొక్కసము ధనముచే నింపు చుండెను. ప్రతిసంవత్సరమును గజబలమును, హయబలమును కొంచెముగనో ఎక్కువగనో చేర్చు చుండెను. సామ్రాజ్యమున దన కనుకూలు రెవ్వరో, ప్రతికూలు రెవ్వరో తెలిసికొని ప్రతిగూలురను, నేర్పరితనముచే వశపఱచుకొను చుండెను. ఆదిల్‌షాహా తనకు జయము గలిగినందులకు నెంతసంతోషించినను, ఎప్పుడైనను తిమ్మరుసు మంత్రి తనరాజ్యమునకు ముప్పు దేఁగలడని దృఢముగా విశ్వసించినవాఁడు గావునఁ దరువాత నతఁడు తిమ్మరుసుతో నొడంబడిక జేసికొనియెను. ఇట్లుభయరాజ్యములవారు గొంతకాలము మైత్రి గలిగియుండిరి.


___________
  1. ఈ గోలకొండ రాజ్యము బహమనీరాజ్యమునుండి క్రీ. శ. 1512 సంవత్సరమున విడిపోయెను. తక్కిన వన్నియు క్రీ. శ. 1482 లోపలనే స్వతంత్రమును బ్రకటించి పరిపాలింపబడు చుండినవి.
  2. హేమరాజు బాలరాజును వెంట నిడుకొని యుద్ధము చేసెననియు, హేమరాజు పాఱిపోయె ననియు, బాలరాజు గాయముల నొంది మార్గమధ్యమునందుఁజనిపోయె ననియు, ఫెరిస్తా వ్రాసెసుగాని హేమరాజును నరసరాయఁడనియు, బాలరాజును ఇమ్మడి నరసింహరాయఁ డనియుఁ గొందఱు చరిత్రకారు లూహించు చున్నారు. వారియూహలు సరియైనవి కావు. ఎందుకన. ఇమ్మడి నరసింగరాయలు క్రీ.శ. 1505 వఱకు బ్రతికియున్నట్టు శాసనములు గన్పట్టుచున్నవి. (ఎఫిగ్రాఫికా ఇండియాకాసంపుటము. 7-నం 8 రు శాసనము జూడుఁడు). హేమరాజనుపేరు తిమ్మరాజనుపేరునకు సంబంధించినది కాని నరసరా జనుపేరునకు పోలికగిలిగినది కాదు. ఇంతయగాక యీ యుద్ధము క్రీ. శ. 1493 వ సంవత్సరమున జరిగినట్లు ఫెరిస్తా వ్రాసియున్నాడు. ఆసంవత్సరమున నరసరాజు దివ్యక్షేత్రయాత్రార్ధము దక్షిణదేశమునకుఁ బోయినట్లును, తిరుచునాపల్లి మండలేశ్వరుడైన కోనేరునాథునితోఁ పోరాడి జయించినట్లును, కోనేరినాథుఁడు యుద్ధములో మృతినొందినట్లును అచ్యుతరాయాభ్యుదయ మనుసంస్కృత కావ్యమువలన విదితమగు చున్నది. కావున ఫెరిస్తా వ్రాసిన దంతయు సత్యము కాదు. ఆదిల్‌షాహతో యుద్ధము చేసి యోడి పోయినది. నరసరాయఁడు కాదు. అతఁడు నరసరాయని సోదరుఁడగు తిమ్మరాయఁడై యుండవలయు ననుట యథార్థమునకు దూరమైన విషయము కాదు.