తిమ్మరుసు మంత్రి/చతుర్థ ప్రకరణము

వికీసోర్స్ నుండి


చతుర్థప్రకరణము

రాజకుటుంబ రక్షణభారము

ఇక్ష్వాకువంశవార్షిచంద్రుఁ డగు దశరధమహారాజునకు కౌసల్యా సుమిత్రా కైకేయీలవలెఁ దుళువ నరసింహరాయనికి 'తిప్పాంబ, నాగాంబ, ఓబాంబ' లను మూవురు భార్య లుండిరి. నరసింహరాయనికి తిప్పాంబయందు వీరనరసింహదేవరాయఁడును, నాగాంబయందు కృష్ణదేవరాయఁడును, ఓబాంబికయందు అచ్చుతదేవరాయఁడును, రంగరాయఁడునను కుమారులు నల్వురు జనించిరి. ఎట్లుసామ్రాజ్య భారమునంతయుఁ దిమ్మరుసుమంత్రిపై నుంచి ప్రవర్తించెనో, అట్లే నరసింహదేవరాయఁడు స్వకుటుంబరక్షణ భారమును గూడ నాతనిపై నే యుంచెను. సామ్రాజ్యసంరక్షణభార మెంతకష్టప్రద మైనదో రాజకుటుంబసంరక్షణభార మంత కష్టప్రదమైనది. ముగ్గురు భార్యలను గట్టుకొని దశరథుఁ డెట్లు బాధపడియెనో యట్లే సరసింహదేవరాయఁడును ముగ్గురు భార్యలను గట్టుకొని బాధ పడుచుండెను. ప్రణయినుల ప్రణయకోపము మూలమున సంభవించెడి కలహములను నివర్తింపజేయు సందర్భమున నరసింహదేవరాయనికి హితవిధానములఁ గఱపవలసినవాఁడు తిమ్మరుసు గాక సమర్థుఁడగు మంత్రి మఱియొకఁడు లేఁడు. ఇట్లగుట దుర్భరమైన రాజకుటుంబరక్షణభారము బ్రాహ్మణమంత్రిపై నిడుటకు గారణమైనది. ఇట్టి కార్యనిర్వాహకత్వమున నరసింహభూపాలవర్యుఁడు తిమ్మరుసుమంత్రినిగాక మఱియెవ్వనినైన నియోగించి యుండెనేని సామ్రాజ్యమునే కోల్పోయి యుండును. ఇట్టి యాధిపత్యమును వహించి తిమ్మరుసు తనప్రజ్ఞా విశేషముచేత నంతఃపురమందిరమున మహోపద్రవము లేవియు సంభవింపకుండఁ గాపాడుకొనుచు వచ్చెను. ఏ మంత్రి యెట్టి బుద్ధి కలవాఁడో, ఏ సేనాధిపతి యెట్టి స్వభావము కలవాఁడో, ఏ మాండలిక ప్రతినిధి యెట్టి నైసర్గికగుణము కలవాడో, ఏ సామంతనృపతి యెట్టితలంపు గలవాఁడో సామ్రాజ్యమున నెల్ల వారి గుణశీలవృత్తములను దెలిసినవాఁడు తిమ్మరుసు మంత్రి. మఱియు రాజంతఃపుర మందిరమున సేవకావృత్తి నున్న దాసదాసీ జనంబుల గుణశీలవృత్తములఁ జక్కగా గ్రహించినవాఁడు తిమ్మరుసుమంత్రి. ఇంతియగాక యంతఃపుర మందిరముల నివసించు రాజబంధువు లందఱు నెట్టివారో యీతఁ డెఱుంగును. ఈ మహాపురుషుఁడు చేయుకార్యములకు సామ్రాజ్యాధిపతి యెన్నఁడు నడ్డము రాఁడని యెల్లవారు నెఱుంగుదురు. అందుచే మహాధికారియైననేమి, సామాన్యాధికారి యైననేమి, మహారాజైననేమి, మహారాజబంధువుఁడైన నేమి, అధికారియైన నేమి, అనధికారి యైననేమి, పట్టపురాణియైన నేమి, దాసీయువతి యైన నేమి, తిమ్మరుసాజ్ఞ యన గడగడలాడుచు విధేయులై వర్తించు చుండిరి. అంతఃపుర మందిరములలో నెంతరహస్యముగా నెట్టికార్యము జరిగినను తిమ్మ రుసు చెవిని బడక మానదు. ఇట్లనుటవలన నంతఃపురమందిరములఁ గాని సామ్రాజ్యమునఁగాని యీతనికిఁ బ్రతిపక్షులు లేరని గాని యీతడు తలపెట్టుకార్యములకుఁ బ్రతివిధానములఁ బన్ని విఘాతము చేయఁజూచువారు లేరని కాని చెప్ప సాహసింపరాదు. ప్రథమకర్ణాటరాజవంశమును సముద్దరింపవలయినని తత్పక్షపాతులై సమయ మపేక్షించి వేచియున్నవారు గొందుఱు గలరు. ఈ మహాసామ్రాజ్యమునకు సాళువనరసింహభూపతి సంతతియే యాధిపత్యము వహింపవలసిన వారుగాని యన్యులు కారని యిమ్మడి నరసింహరాయలను వజ్రసింహాసనారూఢుని గావించి సామ్రాజ్యమును సొళ్వరాజవంశమునకే నిలుపవలయునని ప్రయత్నించువారు గొందఱు గలరు. అనేక కారణములచే నిట్టి మహాపదవిని వహించి సమస్తసామ్రాజ్యాధికారధూర్వహుడై ప్రవర్తించెడి తిమ్మరుసునెడఁ 7వల మసూయాపిశాచగ్రస్తులై ప్రతిపక్షులుగా నుండెడివారు మఱికొందఱుగలరు. వీరెల్లరును తిమ్మరుసునెడఁ గలభక్తిచే విధేయులై యుండిరని తలంపరాదు. అత్యధికమైన ప్రతిభయు అప్రతిమానమైన ప్రజ్ఞయు అత్యద్భుతమైన మేధాశక్తియు అకళంకమైన సామ్రాజ్యభక్తియు అత్యనురూపమానమైన సమర్థతయు, అప్రతిబద్ధమైన యాజ్ఞయు, వీనిమించిన యౌదార్యమును, క్షాత్రమును, బ్రహ్మతేజస్సును ప్రతిపక్షుల భయకంపితులను జేయఁగా వారెల్లరును తిమ్మరుసు ననువర్తించువారైరి. సాళ్వనరసింహభూపాలుని పుత్రుఁడైన యిమ్మడి నరసింహరాయని పెనుగొండ రాజ్యమున కధిపతిని గావించి వానిని వానికుటుంబమును పెనుగొండదుర్గమున నుండునటులు నియమించెను. ప్రథమకర్ణాటరాజవంశమునెడఁ పక్షపాతము గలవారి కెవ్వరికిని విద్యానగరమున గొప్పపదవు లేవియు నొసంగియుండలేదు. కర్ణాటకులవలన నేవిధమైస యుపద్రవమును మూడకుండ వారిలో సమర్థులై యిష్టులుగా నున్నవారికి గోప్పపదవుల నిచ్చి కర్ణాటప్రజల మెప్పునుగూడఁ గాంచుచుఁ గర్ణాటకులకుఁ దెలుగువారికి వై మనస్యములు పెరుఁగకుండఁ జూచుకొనుచుండెను. కర్ణాటదేశముసఁ దెలుఁగువారికిని, తెనుఁగు దేశమునఁ గర్ణాటకులకు నధికారపదవు లొసంగుచుండెను. తనకు నలువది యేండ్లు నిండకపూర్వమె మహామాత్యపదవిని బొంది మహాకర్ణాటరాజ్యచక్రమును జేతబట్టుకొని విదేశీయరాజ్యతంత్రజ్ఞులు సయితముఁ “జే" యని ప్రస్తుతింప హస్తనైపుణ్యము వన్నె కెక్కునట్లుగా గిరగిర దిప్పుచుండెను,

{{}p|fs125|ac}తిప్పాంబ కౌటిల్యము.

ఏమి హేతువుచేతనో చెప్పజాలము కాని నరసింహదేవరాయఁడు తిప్పాంబకంటెను నాగాంబికయం దెక్కువ ప్రేమమును జూపుచుండెను. దీనివలన తిప్పాంబకు నాగాంబికయం దసూయ జనించెను. తిప్పాంబకుమారుఁడై న వీరనరసింహదేవరాయఁడు నాగాంబకుమారుఁడైన కృష్ణదేవరాయనికంటెను వయస్సునఁ బెద్దవాఁడు. తిమ్మరుసుమంత్రినే నాగాంబికాపుత్త్రుఁ డైన శ్రీకృష్ణదేవరాయనికి విద్యాగురువునుగా సరసింహదేవరాయఁడు నియమించెను. తనపుత్రులలో సమస్తవిధముల గృష్ణదేవరాయఁడే సుభగుం డని తన సమ్ముఖమునఁ బలుమాఱు తిమ్మరుసు ప్రశంసింపుచు వచ్చినందున నరసింహదేవరాయఁడు నొకింత యధికముగాఁ గృష్ణదేవరాయని బ్రేమింపుచు వచ్చెను. ఇది యంతయును దిప్పాంబకు నురిసిన పుండులో నుప్పుపెట్టిన చందముగా నుండెను. తనకుమారుని పట్టాభిషిక్తునిఁజేయక సపత్నీపుత్రుఁడైన కృష్ణదేవరాయనికే నరసింహదేవరాయఁడును తిమ్మరుసుమంత్రియుఁ బట్టము గట్టుదురని మనంబున నిశ్చయించి యొకనాడు తిప్పాంబాదేవి యిట్లు దురాలోచనము చేసెను.

"రాయనికి నామీదఁకంటెను నాగాంబికయం దెక్కువ యనురాగము గలదు. రాజునెడ నాగాంబకుఁ గలచనువు నాకు లేకయున్నది. రాజ్యతంత్రమునునడపు తిమ్మరుసుమంత్రి కృష్ణరాయనికి విద్యాగురువయ్యెను. అందుచే మంత్రి కృష్ణరాయని సరసరాయని సమ్ముఖమున స్తుతిపాఠములు చేయుచు నాతనియెడ రాయనికిఁ బ్రేమ మధిక మగునట్లు చూచుచున్నాఁడు. రాజ్య మన్ననో వంశక్రమాగత మైనదికాదు. ఇప్పటికి రెండు వంశములు గడచినవి. మూఁడవవంశమునకుఁ దక్కు నని యెట్లు చెప్పనగును? ఈమంత్రిసత్తముఁడు రాయని మరణానంతరము కధ యెట్లు నడిపించునో యెవ్వరు చెప్పఁ గలరు? సామ్రాజ్యమునంతను బిడికిటఁ బట్టి యింటను బైటను నిరంకుశాధికారియై ప్రవర్తించు చున్నాఁడు. ఇతని కాదని యెదుర్కొనుట పట్టపురాణి నైననాకే సాధ్యముగాకయుండ మఱియెవ్వనికి సాధ్యమగును. ఇమ్మడి నరసింగరాయని దూరముగాఁ గూరుచుండఁబెట్టి నరసరాయని ప్రతాపమును జాటుచు నాతని వలలో వేసికొని సరసరాయని పేరుతో తానే సామ్రాజ్యము నేలుచున్న యీబ్రాహ్మణమంత్రి నరసరాయని మరణానంతరము నాకుమారుఁడైస వీరనరసింహరాయనికిఁ బట్టము గట్టునని నాకెట్లు నమ్మకము కలుగఁగలదు? తిమ్మరుసుమంత్రియుఁ గృష్ణరాయఁడు బ్రతికియుండఁగా నా కుమారునకు రాజ్యము లభించు ననుమాట కల్ల. కావున వీరిలో నెవ్వనినైనఁ జంపించినఁగాని నాకోరిక కొనసాగదు. తిమ్మరుసుమంత్రిని జంపించుట సాధ్యమగుపనికాదు. అదియునుగాక యతనిఁ జంపించితిమేని కట్టడ దప్పి రాజ్య మరాజకము కావచ్చును. అప్పుడు నాకుమారునకే యీ రాజ్యము దక్కునని చెప్పరాదు. మఱియు నతఁడు బ్రాహ్మణుఁడు. అతని జంపితినేని బ్రహ్మహత్యాదోష మెన్ని జన్నములకైనను నన్ను విడుచునా? కావునఁ గృష్ణరాయని జంపించుట కార్యసాఫల్యమునకు ముఖ్యము. అది సులభ సాధ్యము.”

ఇట్లు తలపోసి తిప్పాంబిక తన దాసీకన్యకలతోఁ గృష్ణరాయని విషప్రయోగముచేఁ జంపించుటకై దురాలోచనము చేసి వెంటనే యా దుష్కార్యమునకుఁ గడంగెను. తిప్పాంబ విషప్రయోగముచే సపత్ని పుత్త్రుని జంపింపఁ బూనికొనియె నన్నసమాచారము దెలియరాఁగా తిమ్మరుసు మంత్రి విచారించి వానిని మృత్యువువాతఁ బడకుండ సంరక్షించెను. అంతటితో నిరుత్సాహపడి యూరకుండక తిప్పాంబ మఱింత దిట్టతనమును బూని కృష్ణరాయని జంపింప ముమ్మారు ప్రయత్నించెను గాని తిమ్మరుసు వానిని ప్రాణాపాయమునుండి తప్పించి తిప్పాంబదౌష్ట్యమును దలపోసి తనయింటనే యుంచుకొని వానిని సంరక్షింపుచు వచ్చెను. ఆమె దుష్ప్రయత్నము లన్నియు నొకదానివెనుక నొకటి భగ్నములయ్యెను. ఇట్లు కృష్ణరాయని ప్రాణములను గాపాడి విద్యాబుద్ధులు గఱపుచు, బెనుచు చున్నందునఁ గృష్ణరాయఁడు తిమ్మరుసుమంత్రిని 'అప్పాజీ' (నాయనగారూ) అని పిలుచుచుండెను. తిప్పాంబ కుమారుఁడైన వీరనరసింహదేవరాయఁడు భుజబలపరాక్రమ సంపన్నుఁడైనను కుటిల స్వభావుఁడును గ్రూరచిత్తము గల వాఁడునై యుండెను. వీరనరసింహరాయనికిఁ దనపై ససూయ జనింపకుండ నాతని యువరాజునుగా భావించుచు తిమ్మరుసు మంత్రి యాదరింపుచు రాజనీతిధర్మముల నుపదేశింపుచుండెను. అఖండ ప్రజ్ఞాధురంధరుఁడైన యుగంధరుని వంటివాఁడని వీరనరసింహరాయఁడు తిమ్మరుసును పితృసమునిగా భావింపుచు నాతనిదయను సంపాదించుకొనుటకై విధేయుఁడై యాతని కిష్టమైనరీతిగా వ్యవహరించుచుండెను.

కృష్ణరాయని విద్యాభ్యాసము.

శత్రువులవలన నేయపాయమును గలుగకుండ సంరక్షించుటకై పితృవాత్సల్యముఁ బూని కృష్ణరాయనికి రక్షకునిగా తిమ్మరుసుమంత్రి ప్రజ్ఞాధ్యుఁడైన తనతమ్ముని గోవిందరాజును నియమించెను. అతనికిఁ దానును గోవిందుఁడును విద్యాబుద్ధులు గఱపుచుండిరి. పదునెన్మిది సంవత్సరముల ప్రాయము వచ్చునప్పటికి నాంధ్రగీర్వాణభాషలయందు సాహిత్య జ్ఞానమును సంపాదించెను. కర్ణాటభాషయు, హిందూస్థానీభాషయు నభ్యసించెను. సాముగరిడీలం దేఱెను. ధనుర్వేద పారంగతుఁ డయ్యెను. అశ్వారోహణమునందు గడితేఱి తురగ రేవంతుఁడనఁ బ్రసిద్ధిగాంచెను. తిమ్మరుసు వాని బుద్ధికౌశల్యమునకు, తన యెడంగల భక్తికి సంతసించి రాజనీతి, దండనీతి మొదలగు రాజ్యతంత్రవిధానముల స్వయముగా నేర్పి మహిమోన్నతుని గావించెను. కృష్ణరాయఁడు సుందరాకారుఁడు. చక్కని ముఖవర్చస్సు గలవాడు. పొట్టియు, బొడవును గాక కాయపుష్టికిం దగినపొడవు గలవాడు. అతని ముఖముమీఁద స్ఫోటకపు మచ్చలుకలవు గాని ముఖవికాసము చూచినప్పుడు మాత్రము సార్వభౌమత్వమును స్ఫురింపఁ జేయునట్టిరీతి గానం బడుచుండును. దేహమును దిట్టపఱచి సుస్థిరముతోఁ గదన భూమి దృఢముగ నిలుచుటకై కృష్ణరాయఁడు ప్రతిదినమును విడువకుండ శరీరసాధనము సలుపుచుండెను. ఇట్లు కృష్ణరా యఁడు పూర్వజన్మ సుకృతవిశేషమునను, దైవానుగ్రహము వలనను, తిమ్మరుసు మంత్రి కృపావిశేషమునను విద్యను, శరీరదార్ఢ్యమును, రాజనీతి నైపుణ్యమును మాత్రమెగాక పరస్త్రీయెడ సోదరీభావము నలవర్చుకొని తిమ్మరుసు నడిపిన విధముగా నడిచి యాతనికి ముదంబుఁ గూర్చుచుఁ బ్రజానురంజకుఁడై ప్రవర్తించుచుండెను.

నరసరాయనిమృతి.

ఇంతలో క్రీ. శ. 1503 వ సంవత్సరమున నరసరాయనికి నుబ్బుజాడ్యము జనించి దినక్రమమున నభివృద్ధి నొంది తుదకు భయంకరమైనదిగాఁ బరిణమించెను. తాను జీవించెద నన్నయాశను విడిచిపెట్టెను. ఒకనాఁడు నరసరాయఁడు తిమ్మరుసును బిలుపించి యిట్లనియెను.

“అమాత్యవర్యా ! నాకవసానకాలము సమీపించినది. ఇఁక నాబ్రదుకు దినములమీఁద నున్నదిగాని మాసముల మీఁద లేదు. ఇంతవఱకు రాజ్యభారమునంతయు నీమీఁద విడిచిపెట్టినందులకు నామాట దక్కించి సామ్రాజ్యము సముద్దరించి వన్నెయు వాసియుఁ గల్పించితివి. నిన్ను నమ్మి నేనిఁక సుఖముగాఁ బ్రాణములను విడువఁగలను. నాసామ్రాజ్యమును నాబిడ్డలను నీకప్పగించుచున్నాఁడను. ఈ సామ్రాజ్యము నీచే సురక్షితము కాఁగలదు. ఈబిడ్డలు నీచే సురక్షితులు కాఁ గలరు. నా వెనుక వీరనరసింహదేవరాయనికిఁ బట్టము గట్టుము. అతఁడు నీప్రాఫునను, కృష్ణరాయనితోడ్పాటునను ప్రజానురంజ కముగా నీసామ్రాజ్యమును బరిపాలింపఁగలఁడు. నాపుత్త్రు లన్యోన్యము మత్సరగ్రస్తులై తగవులాడకుండఁ జూచుచు వారలను సంరక్షించుభారము నీయది. ఇమ్మడి నరసింగరాయనిచేఁ గాని వానివంక వారిచేఁ గాని యేవిధమైన యుపద్రవము పొడమకుండ సామ్రాజ్యమును సంరక్షింపఁగల సమర్ధుండవు నీవొక్కడవే సుమా."

అని పలికి పుత్రులం బిలుపించి 'పుత్త్రకులార ! తిమ్మరుసు నేఁడుమొదలు మీకు రక్షకుఁడు కాబోఁవు చున్నాడు ; సకలకార్యనముర్థుండైన తిమ్మరుసు చెప్పినట్లు వర్తింపుఁడు : దాన మీకు సౌభాగ్యమును శ్రేయస్సును గలుగును. నేను బ్రతికియుండఁగా గృష్ణకు దిగువ భాగమున నశ్వపతులకు, గజపతులకు రాజ్యము లేకుండఁ జేయవలయునని యెంతయో ప్రయత్నించితిని గాని దాని నెఱవేర్చు భాగ్యము నాకు లభించినదికాదు; ఎంతకాలము తురుష్కులు ముదిగల్లు, రాచూరు దుర్గములను స్వాధీనములో నుంచుకొనఁ గలుగుదురో అంత పర్యంతము సామ్రాజ్యమునకు క్షేమములేదని యెఱుంగుఁడు. దక్షిణహిందూస్థానమున మీప్రతిష్ఠ నిలుపుకో దలఁచిన పక్షమున నేను సాధింపఁజాలక విడిచిపెట్టినదానిని మీరు సాధింప వలయును; తిమ్మరుసుబుద్ది ననుసరించి వర్తింతురేని జయ మవశ్యము మీకు లభ్యమగు ననుటకు నెంతమాత్రము సందియములేదు" అని చెప్పి వెంటనే ప్రాణములను విడిచి కీర్తిశేషుఁడై లోకాంతరగతుఁడయ్యెను.

వీరనరసింహుని పట్టాభిషేకము.

నరసరాయని మృతి తిమ్మరుసునకు మఱింత కష్టప్రదమయ్యెను. వీరనరసింహుఁడు తిమ్మరుసునకు విధేయుఁడుగాఁ గన్పట్టుచున్నను విశ్వాసపాత్రునిగా నెంచుకొనలేదు. తిమ్మరుసు కృష్ణరాయనికిఁ బట్టము గట్టునేమోయన్న యనుమానముసు భయమును నాతఁడు గలిగియుండెను. అందువలన నాతనికి మాత్సర్య మంకురించెను. తనకును కృష్ణరాయనికి నెట్టి యపకృతి గావించునో యన్నభయము తిమ్మరుసునకుఁ గలదు. తిమ్మరుసుమాత్రము నరసింహునిఁ దొలగించి కృష్ణరాయనికి బట్టము గట్టవలయునని యోజింపలేదు. ఇమ్మడి నరసింగరాయనికి బట్టము గట్టక వీరనరసింహునకుఁ బట్టము గట్టిన యెడల సేనానులకు, మంత్రులకుఁ బ్రజలకు నిష్టముగనుండునో లేదో యన్నభయముగలదు. సంగమరాజవంశీయుల పక్షమున నున్న వారివలనఁగూడ భయము గలదు. ఇమ్మడి నరసింగరాయని కంటె వీరనరసింహరాయఁడు బలస్తోమము మెండుగా నుండుటచేతను, ఇమ్మడి నరసింగరాయఁడు పెనుగొండలో నుండుట చేతను, వీరనరసింహరాయఁడు సింహాసన మాక్రమించుకొని తానే సార్వభౌముఁడనని ప్రకటించెను. అధికారి వర్గము తిమ్మరుసుమంత్రి పట్ల భయమును భక్తియును గలవారు గావున విద్యానగరమున నాతని నెదుర్కొనలేకపోయిరి. తిమ్మరుసునెడ దసకెంత యనుమాన మున్నను నతనితో వైరము, బెట్టు కొనుటవలనఁ గార్యభంగ మగునని తలంచి తిమ్మరుసును దనకు దోడ్పడవలయునని ప్రార్థించెను. తిమ్మరుసందులకు సంతసించి మంత్రిత్వమును బూని నరసింహుని విద్యానగర సామ్రాజ్యముస కభిషిక్తుని గావించెను. అదివఱకు ద్రావిడాంధ్ర కర్ణాట దేశములలోఁ గప్పములు చెల్లించు రాజులనేకులు వీరనరసింహరాయని ప్రభుత్వము నంగీకరించినను కర్ణాటదేశములోని సామంతనృపాలు రనేకులు కప్పములు చెల్లింపమని తిరస్కరించిరి. ఇమ్మడి నరసింగరాయనితో మఱికొందఱు కుట్ర చేయుచుండిరి. ఒక్కమాఱుగ సామ్రాజ్యమునఁ గల్లోలము జనించెను.

వీరనరసింహుని దిగ్విజయయాత్ర.

తిమ్మరుసుమంత్రి ప్రతిభాఢ్యుఁడు గావునఁ దురుష్కుల నుండి యపాయము కలుగ కుండుటకై తుంగభద్రానదీ తటమున నొక కొంత సైన్యమును, గజపతు లాక్రమించుకొని రాకుండ నుదయగిరి ప్రాంతము సరిహద్దున నొక కొంతసైన్యమును గాపు పెటెను. ఇమ్మడి నరసింగరాయనిఁ బెనుగొండ రాజ్యమున కధిపతిని గావించి యాతని సమాధానపఱచి యా ప్రక్కనుండి గలిగెడి యుపద్రవమును దప్పించుకొనియెను. రాజధానియగు విద్యానగరమున మూలబలము విశేషముగా నుంచి సమర్థులును విశ్వాసపాత్రులునగు దండనాధులను గొందఱను నగరరక్షకత్వమున నియమించెను. అట్టి దండనాథులలో దిమ్మరుసు తమ్ముఁడు గోవిందరాజు ప్రముఖుఁడుగా నుండి నగర మున రాజద్రోహులను దలయెత్తకుండఁజేసి విశేషసామర్థ్యముతో నగరమును సంరక్షింపు చుండెను. వీరనరసింహరాయని పిన్నతమ్ములగు నచ్యుతరాయలను శ్రీరంగరాయలను గొంత సైన్యము నొసంగి కొంకణదేశమునకును, కర్ణాటదేశములోని తలకాడు, ఉమ్మత్తూరు మొదలగు ప్రదేశములకును గప్పములను రాఁబట్టుటకై పంపెను. వారలు కొంకణదేశపు నాయకులను జయించి వారలవలనఁ గప్పములనుగొని తలకాడునకుఁ బోఁగా నచటి పాలెగాండ్రు గప్పములను జెల్లింపక తిరస్కరించుటయే గాక వారల యుద్ధమున నోడించి తఱిమిరి. అప్పుడు తిమ్మరుసు వీరనరసింహరాయని సన్నిధానమున కేగి యిట్లనియె.

“రాజేంద్రా! ఇదివఱకు మీతండ్రికిఁ గప్పము గట్టుచున్న కొందఱు సామంతులును పాలెగాండ్రును మీరు పిన్నవారని యుద్ధతులై గప్పములు గట్టక స్వతంత్రులై మీ యధికారమును దొలఁగఁజేయవలయనని ప్రతిఘటించుచున్నారు. ఉమ్మత్తూరు శివసముద్రము పాలెగాండ్రపైకి బంపిన సైన్యము వారలతోఁబోరాడి జయింపలేక మరలివచ్చినది. ఇట్టి సందిగ్ధ సమయమున మనముపేక్షించితిమేని సామ్రాజ్యమునకుఁ జేటువాటిల్లును. మీకుటుంబమునెడ నాకుఁ గల భక్తివిశ్వాసములు మీర లెఱుంగనివికావు. మీతండ్రి నాయెడఁగల యనురాగమును విశ్వాసమును మీర లెరుంగనవికావు. మీరును నన్ను విశ్వాసపాత్రునిగాఁ దలంచినయెడల నేనొక్క యాలోచనమును జెప్పెదను. నేను చెప్పినట్లు మీరు చేసెదరేని దాన మీకు విజయమును శ్రేయస్సును గలుగుటమాత్రమే గాక సామ్రాజ్యముయొక్క ప్రతిష్ఠ లోకమున వ్యాపింపఁ గలదు. చిన్నపామునైనఁ బెద్దకఱ్ఱతోఁ గొట్టవలయునన్న సామెతరీతిగాఁ గప్పములు చెల్లింపక ప్రతిఘటించిన చిన్న పాలెగాండ్రను సయితము గొప్పసైన్యములతో, బోయి రూపు మాపవలయును. మనకుఁ గప్పములు చెల్లింపక ప్రతిఘటించుచున్న వారు కొందఱు సామ్రాజ్యములోపల నున్నవారని యీమహానగరమునఁ దెలియకపూర్వమె వారల నడంచుఁ బ్రయత్నములను జేసి విజయమును గాంచుట శ్రేయస్కరము. వజ్రసింహాసన రక్షణకొఱకును, రాజ్యపరిపాలనానిర్వహణము కొఱకును నేను రాజధానియందు నిలిచియుండెదను. మైసూరు దేశమునందలి పాలెగాండ్రను జయించి కప్పములు గొనుటకు మీ తమ్ముఁడు కృష్ణరాయఁడు సమర్ధుఁడు. అతఁడు విశ్వాసపాత్రుఁడు. నీకు విధేయుఁడైన తమ్ముఁడుగాని యన్యుఁడుగాఁడు. మీరు తీర్థయాత్రపేరు చెప్పి బహుళ సైన్యముతోఁ బోయి సామ్రాజ్యము నంతయును తిరిగి కప్పములను గొని రావలయును. కప్పములను జెల్లింపక తిరస్కరించెడివారుందురేని వారలను బదభ్రష్టులను గావించి వారిస్థానములఁ గ్రొత్తవారిని నియమించి కప్పములను గ్రహింపవలయును. అట్లుగాక యుద్ధము జరుపవలసి వచ్చెనేని సంశయింపక శత్రువుల రూపుమాపుటకుఁ గడంగ వలయును. ఒకప్పుడు మీతోడనున్న సైన్యము చాలదని తోఁచెనేని నాకు వర్తమానము చేసినయెడల వెంటనే సైన్య మును సమకూర్చి పంపెదను. అవశ్యము మీర లీమహాకార్యమును నిర్వహించి దిగ్విజయమును జేయవలయును.”

ఇట్లు ప్రబోధించిన మంత్రివర్యుని ప్రబోధమునకు వికాసమును జెంది వీరనరసింహరాయఁడు తిమ్మరుసుతో నిట్లనియెను.

"అమాత్యవర్యా! మాతండ్రి పరలోకగతుఁ డగునపుడు మమ్ములను మా సామ్రాజ్యమును నీకప్పగించి మా సంరక్షణభారము నీయది యని చెప్పెను. అర్దానర్థవిదుండవు ; అఘటనాఘటన చాతుర్య ధురీణుండవు ; సకలకార్య సమర్థుండవు ; మహారాజ్యతంత్రజ్ఞుండవు ; నీవు మాకు విశ్వాసపాత్రుఁడవుగాక యన్యుఁడవే ? నీ వేదిపనిచిన దానిఁ జేయుటకు నేనెప్పుడును వెనుదీయువాఁడను గాను. నీచే శిక్షితుఁడైన మా తమ్ముఁడు కృష్ణరాయఁడును మాకు విశ్వాసపాత్రుఁడే. అందులకు నీ వెంతమాత్రమును సందేహింపవలదు. ఇదే నేను దిగ్విజయయాత్ర వెడలి కప్పములు చెల్లింపక ప్రతిఘటించిన పాలెగాండ్రను శిక్షించి కప్పములు కైకొని తీర్థయాత్రలు సేవించి శీఘ్రకాలములోనే వచ్చెదను. ఈరాజధానిని, వజ్ర సింహాసనమును నీవకాపాడు చుండుము.”

అని చెప్పి యొకనాఁడు శుభముహూర్తమున బహుళ సైన్యసమేతుఁడై తీర్థయాత్రను సాటించి దిగ్విజయయాత్రకై బయలు వెడలెను.

తిమ్మరుసుమంత్రియుఁ గృష్ణరాయనిఁ బిలువ నంపించి “వీరాగ్రణీ! కర్ణాటదేశమునందలి రాజులును, పాలెగాండ్రును మీకుఁ గప్పములను చెల్లించుట మానుకొనుటయె గాక మీ యధికారమును ధిక్కరించు చున్నారు. కొంత సైన్యముతో మీ తమ్ములను బనుప వార లా పాలెగాండ్రతో బోరాడియు వారిని సాధింపఁజాలక మరలి వచ్చిరి. వారలను జయించి కార్యము సాధించి కప్పములు గొనిరా నీవ సమర్థుండ వగుటంజేసి మీ యన్న నిన్నుఁబనుచుమని నా కాజ్ఞాపించెను. ఆతఁడు దక్షిణదేశవిజయయాత్రకుఁ బోయి యున్నవాఁడు. ఆతఁడు తిరిగి వచ్చినప్పటికి నీ వీ మహాకార్యమును నిర్వహించుకొని రావలయును. ఇందువలన నీకును జూలప్రతిష్ఠ కలుగును. నీయెడ నిఁకముం దెట్టి యనుమానమును మీయన్నకుండఁ బోదు. సత్వరముగ నచ్యుతరాయనిఁ దోడుగాఁగై కొని దక్షిణ కర్ణాటముపై దండయాత్ర వెడలు” మని నియమించి కొంత సైన్యము నాతనిపరము గావించెను>

కృష్ణరాయని విజయము.

ఇట్లు నియమింపఁబడిన కృష్ణరాయఁడును బహుళసైన్య సమేతుఁడై మంత్రిసత్తముని యాజ్ఞను శిరసావహించి వెంటనే కర్ణాటముపై దాడివెడలి యుమ్మత్తూరును ముట్టడించి మూడు మాసములు ఘోరయుద్ధముచేసి శత్రువులను దూలించి దుర్గమును స్వాధీనముఁ జేసికొనియెను. అపుడు శివసముద్రము కోటలో రాజ్యము చేయుచున్న త్యావరాజు స్వర్గస్థుఁడుకాగా నతనికుమారుఁడు గంగరాజు శివసముద్రముకోటలో నుండి కృష్ణరాయని నెదుర్కొనియెను. కర్ణాటదేశములోఁ గావేరీతీరమునందున్న బలాఢ్యములైన దుర్గములలో శివసముద్రము మొట్టమొదటిదిగా నెన్నవలసినదై యున్నది. అటుపిమ్మట కృష్ణరాయఁడు గంగరాజునకు శత్రువైన చిక్కరాయఁ డను పాలెగాని వశపఱచుకొని మఱికొందఱు పాలెగాండ్రనుగూడఁ జేరఁదీసి ప్రేతపర్వతము, గౌరికొండలనడుమ దండుదిగి కావేరి కనుమమార్గములో శత్రువుల నడ్డగించి శివసముద్రమును సంవత్సరమువఱకు ముట్టడించెను. అపు డాగంగరా జాయవమానమును భరింపజాఁలక కావేరిమడుగులోఁ బడి ప్రాణత్యాగముఁ జేసెను. కృష్ణరాయఁడు శివసముద్రమును స్వాధీనపఱచుకొనియెను. అటుపిమ్మట నాతఁడు మఱికొన్ని పాలియంపట్టులను జయించి కర్ణాటదేశమునకంతకు శ్రీరంగపట్టణము నధికారస్థానముగా నియమించి శంఖచక్రములు గల ధ్వజము (కృష్ణరాయని ధ్వజము) నెత్తించి కర్ణాటదేశములోని పాలెగాండ్రందఱును కప్పముక్రిందను గోటిద్రవ్యము నిచ్చునటు లేర్పాటుచేసి రాజధానికి మరలి వచ్చెను. కృష్ణరాయనికీర్తి యావిజయముతో దేశమంతట వ్యాపించుటయె గాక శత్రురాజుల కాతనిపేరు చెప్పిన భయము కలుగుచుండెను. తిమ్మరుసుమంత్రి తనశిష్యుఁడైన కృష్ణరాయఁ డట్టి విజయమును గాంచినందుల కపరిమితా నందమును బొంది యతని బహువిధముల శ్లాఘించెను.

వీరనరసింహరాయని తీర్థయాత్రలు.

అట వీరనరసింహరాయఁడు ప్రతాపవంతుఁడై శత్రుజనభయంకరుఁడై దక్షిణదిగ్విజయాత్రకై బయలువెడలి తిరస్కరించిన పాలెగాండ్రను దొలఁగించి వారిస్థానముల గ్రొత్తవారిని నియమించుచు, తన్నెదుర్కొని పోరాడినవారిని రూపుమాపుచు దక్ష్మిణసముద్రమువఱకుఁ బోయెను. పాండ్య, చోళ, చేరచేశములలోని రాజు లెల్లరును గప్పములను సమర్పించి స్నేహము చేసికొనిరి. ఈదండయాత్రలో వీరనరసింహరాయని నెదిరించి మార్కొని పోరాడిన వారిలో నొక్కఁడును దప్పించుకొనిపోయి యుండలేదు. అతఁడు సామ్రాజ్యమంతటను సంచారముచేసి తన ప్రభుత్వమును స్థిరపఱచుకొని భుజబలవీరనరసింహరాయఁ డని ప్రసిద్ధి గాంచెను. అతఁడు కంచి, పక్షితీర్ధము, కుంభకోణము, చిదంబరము, జంబుకేశ్వరము, శ్రీరంగము, మధుర, రామసేతువు, గోకర్ణము, కాళహస్తి, అహోబలము, శ్రీశైలము, త్రిపురాంతకము, వేంకటాచలము, సంగమేశ్వరము మొదలగు బహుపుణ్యక్షేత్రములను సేవించి దేవబ్రాహణ భక్తి కలిగి బ్రాహ్మణుల కనేకభూదాన గోదాన సువర్ణదానముల నొసంగి, ప్రఖ్యాతిఁ గాంచెను. ఇట్లొకటి రెండు సంవత్సరములలో శత్రుల నందఱను జయించి కప్పముల నేర్పాటు చేసికొని రాజధానిఁ బ్రవేశించెను.

వీరనరసింహదేవరాయని పరిపాలనము.

వీరనరసింహరాయఁడు తనతండ్రియైన నరసింగరాయఁడు సాహసింపఁజాలని కార్యమునకుఁ దానొడిగట్టి యిమ్మడి నరసింగరాయనిఁ దోసిపుచ్చి తానే రత్నసింహాసన మాక్రమించుకొని తిమ్మరుసు తన్నుఁ బట్టాభిషిక్తునిఁ జేయ నవక్రపరాక్రముఁడై పరిసంధిరాజుల నుక్కడంచి ధరావలయమును బరిపాలించి మహారాజాధిరాజు, రాజపరమేశ్వరుఁడు, రోషకృతప్రతిపార్థి పదంపాడుఁడు, శేషభుజక్షితిరక్షణశౌండుఁడు; భాషిగెతప్పువరాయరగండఁడు, మూరురాయరగండడు, పరరాజ భయంకరుఁడు, హిందూరాయసురత్రాణుఁడు, దుష్టశార్దూల మర్ధనుఁడు, గజౌఘగండభేరుండుఁడు మొదలగు ప్రసిద్ధబిరుదములనుబొంది యాఱేండ్లు పరిపాలనము చేసెను. అదివఱకు సంపాదించిన దేశములను జక్కబఱచుకొని సామ్రాజ్యమును స్థిరపరచుకొనుటకు మాత్రమె ప్రయత్నించెను గాని గజపతులను, అశ్వవతులను జయించుటకుఁ దలఁపెట్టియుండలేదు. ఆకార్యమును బూనకపూర్వమే క్రీ. శ. 1509 వ సంవత్సరములో జాడ్యగ్రస్తుఁడై కాలధర్మము నొందుట సంభవించెను. అతఁడు మరణముఁ జెందునప్పటికిఁ నాతనికిఁ దిరుమలదేవరాయడను నెన్మిదేండ్ల వయస్సుగల కుమారుఁ డొకఁడుండెను.

వీరనరసింహరాయని దుష్టబుద్ది.

వీరనరసింహరాయఁడు కుటిలస్వభావుఁడనియుఁ గ్రూరచిత్తము గలవాడనియు మొదటనే చెప్పి యున్నాఁడను, ఇతఁడు చాలకాలమునుండి తిమ్మరుసునెడ ననుమానమును, కృష్ణరాయనియెడ నీర్షయుఁ గలవాడై యుండెను. తనకును, తనసంతతివారికిని లేకుండఁ జేసి కృష్ణరాయఁడు సామ్రాజ్య మపహరించు నన్నభయము కలదు. అతనియెడఁ బక్షపాతి గావున, తిమ్మరు సాతనికిఁ తోడ్పడునని పెద్దయనుమానముతో నుండెను. కృష్ణరాయని నాతని తమ్ములను జంపింప నూహించెను గాని తిమ్మరుసునెడఁగల భయముచేత సాహసింపఁజాల డయ్యెను. ఈయాఱేండ్లును తిమ్మరుసునెడఁగల భయముచేతఁ బైకి ప్రేమానురాగము లుట్టిపడు చున్నట్లుగా బ్రవర్తించుచు దనకుటిలస్వభావమును బయలుపుచ్చకయున్నను అవసానదశయందుఁ దనదుష్టబుద్ధి వెల్లడింపక తప్పినది కాదు. తనయనంతరము తిమ్మరుసు కృష్ణారాయనిఁ బట్టాభిషిక్తుని గావించునని దృఢముగా నమ్మియున్నవాఁ డగుటచేతఁ గాటికి గాళ్లుచాచుకొని మంచముపైఁ బన్నుండి లేవలేనిస్థితిలో నుండి తిమ్మరుసును రహస్యముగా బిలువనంపించి యిట్లనియెను, “అమాత్య వర్యా! నీవు నాతండ్రియాజ్ఞను బరిపాలించి నన్నుఁ బట్టాభిషిక్తునిఁ గావించి నాచేత సామ్రాజ్య మేలింపఁజేసితివి. నీయనుగ్రహమున నే నిట్టి సార్వభౌమపదవికి వచ్చి జన్మసార్ధక్యమును గాంచితిని. నాతండ్రియాజ్ఞ యెట్లు పరిపాలించితివో అట్లే నాయాజ్ఞనుగూడ నీవు పరిపాలింపవలసిన కాల మాసన్నమైనది. నామరణానంతరము నాకుమారుఁడైన తిరుమలదేవ రాయనికిఁ బట్టముఁగట్టి నీవు కార్యకర్తవై సామ్రాజ్యమును బరిపాలింపవలసినదని నాయజ్ఞ. నీవు నాకుమారునకుఁ బట్టము గట్టక యాతనిఁ జంపించి కృష్ణరాయనికి బట్టము గట్టెదవని నాకిప్పుడొక పెద్దయనుమానము పుట్టినది. కావున నిఁకముందు కృష్ణరాయనివలన రాజ్యమున కేవిధమైన యుపద్రవము పొడమకుండ నుండుటకు నీవు కృష్ణరాయని కన్నులు పెఱికించి తెప్పించి నాకు చూపించిన గాని నాప్రాణములు పోవు” అని పలికి యట్లు చేయ నామంత్రివర్యున కాజ్ఞాపించెను. ఆపలుకులు చెవులకు ములుకులై నాట నదరిపడి తిమ్మరుసు యొకింతసేపు మౌనము వహించి ధైర్యము తెచ్చుకొని సాహసముతో నిట్లు ప్రత్యుత్తర మిచ్చెను.

“రాజేంద్రా ! ఇ దెంతపని ? దీనికై నీవు పరితపింప నక్కఱలేదు. ఇది మనస్సులోఁ బెట్టుకొని బాధపడకుము. నేనుపోయి యవశ్యము నీకార్యముఁ దీర్చి వచ్చెద" నని చెప్పి సెలవు గైకొని తన మందిరమునకు వెడలిపోయెను.

తిమ్మరుసు పరివేదనము.

కృష్ణరాయనికి విద్యాబుద్ధులు గఱపి పెంచి పెద్దవానిని జేసినది నేను. నేను బెంచిన మొక్కను ద్రుంచివేయ వీరసరసింహదేవరాయఁడు నా కాజ్ఞాపించినాఁడు. ఆహా ! ఇతఁ డెంత కుటిలాత్ముఁడు? ఎంత క్రూరచిత్తుఁడు? పితృసమానునిగ భావింపుచుఁ గృష్ణరాయఁడు నన్ను నమ్ముకొని యున్నవాఁడు. కులభేద మొక్కటి విడిచిన పక్షమున నేవిషయమునందును నా కుమారుఁ డైన గోవిందునికంటె భిన్నముగ నాతని జూచు కొనుచుండుటలేదు. సమస్తవిధములచేతను సామ్రాజ్యమును బరిపాలింపఁ దగినవాఁడు కృష్ణరాయఁడు గాని వీరనరసింహుని పుత్త్రుడైన తిరుమలరాయఁడు గాఁడు. కృష్ణరాయఁ డిరువదేండ్లు దాటినవాఁడు. తిరుమలరాయఁ డెనిమిదేండ్లవాఁడు. అశ్వపతులను గజపతులను నిగ్రహింపవలసిన ఘనకార్యములు ముందున్నవి. సామ్రాజ్యము నింకను బెంపు నొందింపవలసి యుండెను. కృష్ణరాయఁడే వీనినెల్ల నిర్వహింప సమర్ధుఁడు కాని యెనిమిదేండ్ల బాలునివలన నేమి కాఁగలదు ? వీనిమోసము చేసియైనఁ గృష్ణరాయనిఁగాపాడి యీసామ్రాజ్యమున కభిషిక్తుని గావింపవలయును. కృష్ణరాయని విడిచి నేను బ్రదుకఁజాలను. అని వెంటనే కృష్ణరాయనికి సమాచారమంపి రహస్యముగా రప్పించి యతనింగాంచి కన్నుల నీరు నించుచు నిట్లనియెను.

కృష్ణరాయా! వింటివా మీయన్నగారి వాక్యములు? తనకుమారునకుఁ బట్టము గట్టి నీకన్నులు పెఱికించి తెచ్చి చూపవలయునని నాజ్ఞాపించినాఁడు. ఇప్పుడు నేనేమిచేయ వలసియుండునో చక్కగా యోజించి చెప్పుము.

అని పిడుగువంటి యావార్త వినిపించెను. అప్పలుకు తిమ్మరుసు నోటనుండి వెలువడినందున నిక్కముగాఁ నాతఁడు తన కన్నులను బెఱికించుటకై పిలువనంసి రప్పించి యుండునని భావించి సంభ్రమముఁజెంది గద్గదభాషియై తిమ్మరుసు కాళ్లపైఁ బడి "అప్పాజీ ! నాసవతితల్లి తిప్పాంబ విషముపెట్టించి చంపించవలెనని ప్రయత్నించునపుడెల్లను విఘాతము లాచరించి నన్ను సంరక్షించితివి. విద్యాబుద్ధులు గఱపి పెక్కు రాజనీతు లుపదేశించితివి. ఇప్పటికిని గంటికి ఱెప్పవలెఁ గాచుఁచున్నాడవు. కాని మాయన్నకు గాని సామ్రాజ్యమునకుఁగాని నేను చేసిన ద్రోహమెద్దియునులేదు. తన కుమారున కపకృతి చేయుదునని కదా మాయన్న నాకన్నులను బెఱికింప నాజ్ఞాపించినది ! సామ్రాజ్యముగాని, సామ్రాజ్యమున నేయధికారముఁగాని నాకక్కఱలేదు. నేను వైరాగ్యమును బూని జోగినై విహరింతును. అన్యాయముగా నాకన్నుల నేల పెఱికించెదరు? నన్ను రక్షించి విడువుము. దేశాంతరముపోయి బ్రదుకుగాంచెదను. నన్ను విడువ నీకు వలను పడదేని కన్నులను బెఱికించుటకు మాఱు శిరచ్చేదమును గావింపుము. నీకెంతయుఁ బుణ్యము గలుగు” నని కన్నీరు గార్చుచు బ్రతిమాలుకొనియెను. అతని యారాటమును గాంచి జూలినొంది తిమ్మరుసుమంత్రి వాని వీపు తట్టుచుఁ గుమారా ! నీకు వచ్చిన భయములేదు. నిన్ను నేను కాపాడి యీసామ్రాజ్యమున కభిషిక్తుని గావింప సంకల్పించి యున్నవాడను. వీరనరసింహరాయఁడు మరణించువఱకు నెవ్వనికిఁ గానుపింపకుండ నామందిరముననే దాఁగొని యుండుమని యాతని కభయహస్తమిచ్చి వెంటనే యొక యాఁడుమేఁక కన్నులను దెప్పించి పట్టుకొనిపోయి ప్రాణముల విడువనున్న వీరనరసింహదేవరాయనికిఁ జూపించెను. అతఁ డాకన్నులను జూచి సంతోషించి కుమారుని తిమ్మరుసున కప్పగించి యాక్షణము ప్రాణములను విడిచెను. అంత నర్హ విధానమున సంస్కారవిధుల నివర్తింపఁజేసి కృష్ణరాయనిఁ జక్రవర్తిగాఁ బ్రకటించెను.


__________