Jump to content

జీవశాస్త్ర సంగ్రహము/రెండవ భాగము/నాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

నాలుగవ ప్రకరణము.

వేరు (The Root).

ఆకులు సూర్యకాంతి ఏవైపుననుండి వచ్చు చుండునో ఆవైపునకే పెరుగుస్వభావము గలవి. వేళ్లు అటుగాక వెలుతురునకు ప్రతిముఖముగా అనగా సామాన్యముగా భూమిలోనికి బోవుచుండును. కాని కొన్ని వృక్షములయందు అబ్బురపువేరులు (Adventitious Roots) ఆకులనుండియు, శాలనుండియు పుట్టి గాలిలో వ్రేలాడు చుండును. ఉదా:- మర్రిఊడలు. మరికొన్ని అబ్బురపువేరులు భూమిలోనికిగాక, గాలిలోనికి గాక యితర వృక్షముల కొమ్మలలోనికి జొరుచుకొనిపోవుచు ఆవృక్షములు సంపాదించుకొనిన ఆహారములో పాలు గూడుచుండును. ఇట్టి వృక్షములకు పరాన్నభుక్కులు (Parasites) అని పేరు.

ఆకారము.

ద్విబీజదళవృక్షములలో సామాన్యముగా నొక తల్లివేరు గలదు (65-వ పటము చూడుము). ఆతల్లివేరు మిక్కిలిపొడుగుగ భూమిలోనికి బోవును. దానినుండి అక్కడక్కడ పిల్లవేరులు పుట్టుచుండును. బోదెకు దగ్గిరనున్న పిల్లవేరులు ముదిరినవి. బోదెకుదూరమున అనగా లోతుననున్న పిల్లవేరులు లేతవి.

వేరుయొక్క-సూక్ష్మనిర్మాణము.

ద్విబీజదళవృక్షముయొక్క వేళ్లు. ఏకబీజదళవృక్షముయొక్క వేళ్లు.

ఏకబీజదళవృక్షములలో తల్లివేరు లోతుగ నెదుగదు (66-వ పటము చూడుము). అది మొండిదిగను పొట్టిదిగను ఉండి యనేములైన చిన్న చిన్న పిల్ల వేరులుగా చీలును. ఇవియన్నియు బోదెయొక్క మొదటిభాగమునుండియే పుట్టును. ఈతచెట్టు, తాటిచెట్టు వీని వేళ్లను చూడుము.

వేరుయొక్క సూక్ష్మనిర్మాణము.

వేరుయొక్క సూక్ష్మనిర్మాణమునకును, శాఖయొక్క సూక్ష్మనిర్మాణమునకును భేదములు స్వల్పములుగా నున్నవి. ప్రతివేరుయొక్క కొనయందును మూలరక్షణమను టోపివంటి భాగముండును. అదిగాక తక్కిననిర్మాణము చాలవరకు కొమ్మయొక్కనిర్మా

ణమును బోలియుండును. ఈ ప్రక్కనుండు వేరుయొక్క యుత్పత్తిని తెలుపు పటమును కొమ్మ యొక్క యుత్పత్తిని తెలుపు 54-వ పటముతోపోల్చి చూడుము. ఈ మూలరక్షణముయొక్క చివర భాగమున మూల రోమములు (Root Hairs) అను చిన్న చిన్న పోగులుండును. ఇవి యెల్లప్పుడు ఏకకణములు. ఇవి నీటిని ఆకర్షించుటయం దెక్కువశక్తి గలవై వేరునకు మిక్కిలి సహాయకారులుగా నుండును.

వారిపర్ణియందును నాచుమొక్కయందును వేరులు నూలు పోగులవలె నుండు కణములపంక్తులు. వీనికి మూలతంతువు లని పేరు. వీనినిర్మాణము మిక్కిలి సులభమైనది. కాని హెచ్చుతరగతి వృక్షములలో వేరుయొక్క వ్యాపారము అధిక మగుటచేత దాని నిర్మాణమునందును చిక్కులు అధికమైనవి. (68-వ పటము చూడుము). దాని మధ్యభాగమున స్వల్పమాత్రము దవ్వయుండును.

ద-దవ్వ.త్వ-త్వగ్వాహికాపుంజము. దా.వా-దారు వాహికాపుంజము. ఒ-ఒడ్డాణము. అం-అంతశ్చర్మము. ప-పట్ట. బ-బహిశ్చర్మము. రో-రోమము.

దీని వెలుపలివైపున చుట్టును వాహికాపుంఝములు జేరియుండును. వీనిలో దారువును, త్వక్కును కలిసి యేకపుంజముగానుండవు. దారువును, త్వక్కును విడివిడిగా నుండి యవి ఒకటి విడిచి యొకటిగా త్వక్కు చుట్టును అమరియుండును. దారుపుంజములును, త్వక్కుపుంజములును సమసంఖ్యకములుగానుండును. వీని రెంటిమధ్య నుండు కొన్ని మృదుకణములు వీనిని రెంటిని వేరుపరచుచుండును.

వాహికాపుంజముల వెలుపలివైపున నొడ్డాణము (Pericycle) ఒకటి గలదు. ఇందలికణములు మూలపదార్థ సహితములైన మృదుకణములు.

ఈ యొడ్డాణమునకు వెలుపలివైపున అంతశ్చర్మమనునొక కణములవరుస గలదు.

దీనికి వెలుపలివైపున అనేకవరుసల కణములు గలవు. ఈ భాగము పట్ట. ఈ పట్టకు వెలుపల అన్నిటిలో చిట్టచివర కవచమగు బహిశ్చర్మకణములవరుస గలదు.

బహిశ్చర్మనుండి యక్కడక్కడ రోమములు పుట్టుచుండును. ఇవి యెల్లప్పుడు ఏకకణములు, అనగా నీ కణము లెన్నడును చీలవు. వీనివ్యాపారము భూమినుండి నీటిని పీల్చుట.

పిల్లవేరుల యుత్పత్తి.

ఇవి ఆకులవలెను కొమ్మలవలెను బాహ్యలింగ, పరిలింగములనుండి పుట్టునవి కావు. అంతర్లింగములోని భాగమైన యొడ్డాణమునందలి కణములు కొన్ని విభాజ్యకణములుగా పరిణమించి (Become Meristematic) యవిచీలి యొక మొటిమ పుట్టును. ఆ మొటిమలో వెంటనే బాహ్యలింగ, పరిలింగ, అంతర్లింగ సంహ తులభేదము లేర్పడును. ఈమొటిమయే వెలుపలివైపున నుండు పట్టగుండ దొలుచుకొని పైకివచ్చి పిల్ల వేరగును. దీనిమార్గములో నుండు అంతశ్చర్మమును, పట్టలోని ఒకటి, రెండు, వరుసలందలి కణములును ఈపిల్ల వేరుకు టోపిగా నేర్పడును.

వేరుయొక్క ఉపయోగములు.

(1) భూమిలో పాతుకొనియుండి చెట్టును నిలువబెట్టుటకు చాలినంత బలము కలిగించుట.

(2) భూమినుండి ఆహారపదార్థపూరితములైన ద్రవముల నాకర్షించుట.

కొన్ని చెట్లయొక్క వేళ్లు ప్రత్యేకమైన యితర వ్యాపారములుగూడ జేయుచుండవచ్చును.

(3) ముల్లంగి మొదలగువానివేళ్లలో ఆహారము నిలువజేయబడియుండును.

(4) మర్రి మొదలగువానిలో పెద్దకొమ్మలకు ఊతములుగా ఊడలుగా నేర్పడియుండును.

(5) చెట్లమీద ప్రాకెడు కొన్ని తీగెల వేరులు నులితీగెలవలె యితరవస్తువులు చుట్టుకొని తల్లితీగెలు పై కెక్కుట కాధారభూతములుగా నుండును.



________