జీవశాస్త్ర సంగ్రహము/రెండవ భాగము/మూడవ ప్రకరణము
మూడవ ప్రకరణము
ఆకు (The Leaf)
ఇది చెట్టుయొక్క ఆహారములో చాలభాగమును సంపాదించుటకును, ఉచ్ఛ్వాసనిశ్శ్వాస వ్యాపారముల జరుపుటకును, ప్రత్యేకముగా నిర్మింపబడినభాగము. ఇట్టిపని నెరవేర్చుటకు తగినట్లు దాని ఆకారమును నిర్మాణమును ఏర్పడియున్నవి. ఆకునందు మూడుభాగములు గలవు.
పత్రపీఠము
(2) పత్రమధ్యము.
ఇది మధ్యభాగము. దీనికి కాడయని పేరు. ఇది పత్రపీఠమునకును మూడవభాగమగు పత్రదళమునకును మధ్యనున్న భాగము. పత్రమధ్యము సామాన్యముగా గుండ్రముగ నుండును. దీని పైతట్టున తరుచుగ పొడుగునను కొంచెము పల్లముగనుండు నొక చాలువంటి భాగముండును.రావిఆకు నంటియుండు కాడయొక్క యుపరితలమున చూడుము. ఏకబీజదళవృక్షములందు సామాన్యముగను, అక్కడక్కడ కొన్ని ద్విబీజదళవృక్షములందును ఈకాడలోపించియుండును. అనాస, కలబంద మొదలగువాని ఆకులు చూడుము. కొన్నియెడల పత్రమధ్యమునుండి కూడ చిన్న చిన్న రెక్కలవలెనుండు ఉపదళము లుండవచ్చును. ప్రక్కపటములోని పంపరపనస దబ్బ మొదలగువాని ఆకును చూడుము.
(3) పత్రదళము.
ఇది ఆకునందు ముఖ్యభాగము. చివరనుండు పలుచని రేకు వంటిది. ఒకానొకప్పుడు ఈ భాగముకూడ విస్తరించక పత్రమధ్య మువలె గుండ్రముగనే యుండును. సూదులవలెనుండు సరుగుడు చెట్టు (Casuarina) యొక్క ఆకులు చూడుము.
పత్రవిశేషములు.
తమ్ము నాశ్రయించియుండు సందర్భములకు తగినట్లుగా తమ తమ వ్యాపారముల నెరవేర్చునిమిత్తము ఆకులు వివిధరూపముల నొందును. అందు ముఖ్యభేదములు:
1. బీజదళములు:- ఇవి బీజమునుండి మొక్క మొలచునప్పుడు మొట్ట మొదట పుట్టు దళమైన ఆకులు. ఇవి నానియుబ్బిన బీజములోని పప్పుబద్దలే. వీనియందు సామాన్యముగా హరితకములు లేకపోవుటచేత నివి తెల్లగ నుండును. గింజయందలి పిండిపదార్థము (Starch) బీజశర్కరికము (Diastase) అను రసముయొక్క శక్తిచే చక్కెరగా మారుననియు, ఇదియే బాల్యమునం దా మొక్కకు ఆహారముగా నుండుననియు నిదివరలో జెప్పి యుంటిమి. ఏకబీజదళవృక్షములలో నీదళములు ఒంటిగను, ద్విబీజదళవృక్షములలో జంటగను ఉండును. దీనినిబట్టియే ఆయా వృక్షజాతుల కట్టి నామములు గలిగె.
2. అల్పదళములు:- ఇవి పలువిధములైన రంగులుగల చిన్నచిన్న పలుచని ఆకులు. ఇవి భూమిలో వ్యాపించుకొమ్మల యందును, కొన్నిటియందు శాఖాంకురముయొక్కయు, పూగుత్తులయొక్కయు మొదటిభాగమునందును ఉండును. వీనివ్యాపారము సామాన్యముగా సంరక్షణము. భూమిలోనుండు నీరుల్లి మొదలగు దుంపలయందలి పై రేకు లీ యాకులే. ఇందు కొన్ని టిలో మొక్క యొక్క ఆహారపదార్థములు నిలువ జేయబడియుండుటచేత నవి దళముగా నుండును.
3. హరితదళములు:- ఇవి సర్వసామాన్యమైన ఆకుపచ్చని ఆకులు. ఇవి యాహారముల తయారు జేయునట్టియు ఉచ్ఛ్వాస నిశ్శ్వాసవ్యాపారముల జరుపునట్టియు అవయవములు. ఇందు హరితకములు ముఖ్యాంగములు. ఈ యాకులసూక్ష్మనిర్మాణమును గూర్చి ప్రత్యేకముగ వ్రాయబడును.
4. పుష్పదళములు :- ఇవి పూవులయొక్క పలువిధములై నట్టియు పెక్కురంగులుగలయట్టియు రేకులు. ఇవి మిక్కిలి చిత్రముగ మారినఆకులే. ఇవి సంతానవృద్ధివిధానమునకు సహాయభూతములుగానుండుట కేర్పడినవి. ఇట్టి తమవ్యాపారముల నెరవేర్చుటకై యివి అనేకవిధముల మార్పుల జెంది, యనేకరంగులు గలవిగను, అనేక పరిమాణములు గలవిగను ఉండును. ఈ యాకులగూర్చి ముందు ఒకప్రకరణము వ్రాయదలంచి యిక్కడ విస్తరించలేదు.
5. లతాదళములు :- కొన్ని తీగెల యందలి ఆకులలో కొన్నిటి యొక్క చివరభాగములు నులితీగెలుగా మారగా యా నులితీగెల ఆధారముచే నితర వస్తువుల నానుకొని తల్లితీగె పై కెక్కు చుండును (57-వ పటము చూడుము). ఇట్టినులితీగెలలో కొన్నిశాఖలయొక్క రూపాంతరములని యిదివరలో జెప్పియున్నాము (248- వ పుటచూడుము).
6. ఆదోకదళములు:- కొన్ని యాకులయొక్క అంచులును కొనలును మొనలుతీరి ఎదిగి ముండ్లుగా మారి ఆత్మ సంరక్షణము జేసికొనును. ఉదా:- మొగలి, కిత్తనార మొదలగునవి.
7. మాంసభక్షకదళములు:- ఇవిగాక యింకను మిక్కిలి చిత్రమైన ఆకులు కొన్నిగలవు. అం దొకటి రెండుమాత్రము ఉదాహరింపబడును. మాంసభక్షక (Carnivorous) వృక్షములు కొన్ని గలవని వ్రాసిన మీకు చిత్రముగ దోచవచ్చును. కూజా చెట్టు (Pitcher Plant) అను నొక మొక్క గలదు. ఈ మొక్క యొక్క ఆకులు కూజాలవలె పొట్టయును గొట్టమును గలిగియుండును. ఆకూజాలో అడుగుభాగమున నా చెట్టునుండి స్రవించిన ఏదోయొక జీర్ణరస ముండును. కొన్నిపురుగు లారసములో బడి మునిగి దానిశక్తిచే జీర్ణమై ద్రవపదార్థములుగా మారును. అట్లు జీర్ణమైనపదార్థముల నాయాకులద్వారా ఆ మొక్కగ్రహించును. ఇది వృక్షజాతుల కొకవింతయైన ఆహారపద్ధతిగా గ్రహింపనగును.
పురుగులను పట్టి తిను శక్తిగల వృక్షము లింకను కొన్ని గలవు. అమెరికా దేశములో సూర్యబిందువు (Sun Dew) అను వృక్షము గలదు. దాని ఆకుచుట్టును గుండ్రని పులిపిరికాయలవంటి చిన్నచిన్న మొటిమలు వరుసగా నంటియుండును. వీనినుండి యొక జిగురుపదార్థ మెల్లప్పుడు స్రవించు చుండును. ఈయాకున కేదైన పురుగు తాకగానే అది యీ మొటిమలకంటుకొనిపోవును. తోడనే ఆ యాకుయొక్క అంచులుచుట్టుకొనిపోయి ఆకంతయు నొక చిన్నబుట్టగా నగును. ఆ బుట్టలో నా పురుగు చెరబట్టుకొనబడి చచ్చును. అంతట నది క్రుళ్లి యా రసములో జీర్ణమయి మొక్కయొక్క ఆహారముగా చేకొనబడును.
ఆకుల ఆకారము.
ఆకుల ఆకారమును వర్ణించుచు ఎన్నిపుటలు వ్రాసినను వ్రాయవచ్చును. ఇవి అనేక ఆకారములు గలవి. కొన్ని అరటి కొబ్బెర మొదలగు ఆకులవలె పొడుగుగను, కొన్ని తామరాకులవలె గుండ్రముగను, పరుపుగను, కొన్ని జొన్న చెరుకు ఆకులవలె కోసు (ఆదోక) గను, కొన్ని సరుగుడు చెట్ల (Casuarina) ఆకులవలె సూదుల వలెను ఇంక నెన్నెన్నియో ఆకారములుగలవి. సామాన్యముగా ఆకులు పలుచగ నుండును గాని కలబంద ఆకులవంటివి కొన్ని రసపూరితములై దళముగ నుండవచ్చును. కొన్ని కిత్తనార ఆకుల (మట్టల) వలె నారగలిగినవై దృఢముగ నుండవచ్చును.
ఆకులయొక్క ప్రసారము.
నిర్మాణభేదములు.
ఆకుల అంచు.
కొన్నిటి అంచులు మర్రిఆకుల అంచులవలె నున్నగనుండును. వేపాకు అంచువలె కొన్నిటి అంచు ఎగుడుదిగుడుగ నుండు పండ్లు గలిగియుండును. కొన్ని దర్భవరిఆకులవలె సన్నని రంపపు కక్కులవంటి కక్కులు గలిగియుండును. కలబంద అనాసలవంటి మరికొన్ని ఆకుల అంచులయందు ముం డ్లుండును.
ఆకుల అగ్రము.
కొన్నిటి అగ్రము పొన్న ఆకు మర్రిఆకు కొనలవలె గుండ్రముగ నుండును. కొన్నిటి కొన తోకవలె పొడుగుగ నుండును. రావియాకు చూడుము.
రోమములు.
కొన్ని ఆకులమీద నూగు అనబడురోమము లుండును. దూలగొండి మొదలగువానియం దీరోమములయం దొకవిధమైన విషపదార్థము స్రవించి నిలువయుండును. అట్టి యాకును తాకినప్పుడు దానిరోమములు పగిలి యందలివిషము మన శరీరమున కంటుకొని జిల పుట్టించును.
నిర్మాణభేదములు.
ఆకులయొక్క నిర్మాణమునుబట్టి వానియందు రెండువిభాగములు గలవు.
1. మిశ్రమపత్రములు (Compound Leaves).
2. లఘుపత్రములు (Simple Leaves).
మిశ్రమపత్రము.
జింపబడిన ఆకునకు మిశ్రమపత్రమనిపేరు. చింతాకు, కొబ్బెరాకు (మట్ట), మునగాకు, వేపాకు మొదలగునవి (58,59-వ పటములు చూడుము). చిక్కుడాకు, బాడితాకులయందు మూడేసి చిట్టిఆకు లొక్కొకచో సంధించి యొక మిశ్రమపత్ర (60-వ పటముచూడుము).
2. లఘుపత్రము
లఘుపత్రము లనగా చిట్టిఆకులుగ చీలియుండనిఆకులు. కొన్ని యాకులలో పత్రదళముయొక్క అంచుమాత్రము కొంత వరకు అనేక భాగములుగా చీలియుండును గాని యా చీలికలు కాడవరకు వ్యాపించియుండవు. ఇట్టియాకులు లఘుపత్రములే. ఉదా:- ఆముదపుఆకు (41-వ పటము).
కొమ్మకును ఆకునకునుగల భేదములు.
కొబ్బెరాకు, తురాయిఆకు మొదలగు మిశ్రమపత్రములను కొందరు కొమ్మలేమోయని భ్రమింతురు. కాని మిశ్రమపత్రమునకు కొమ్మకు గల యీక్రింది నాలుగుభేదములను పరిశీలించిన నావివరము తెలియగలదు.
1. మిశ్రమపత్రమునకు శాఖాంకుర మనబడుకొనమొగ్గ లేదు.
2. మిశ్రమపత్రము కొమ్మనుండి యుత్పత్తియగుచోట దాని పంగలో నొక శాఖాంకురమను చిన్న మొటిమ యుండును.
3. మిశ్రమపత్రము మరియొక ఆకుయొక్క పంగలో పుట్టదు.
4. మనము ఆకులని వాడెడు చిట్టిఆకుల పంగలలో శాఖాంకురపు మొటిమ ముండవు.
సూక్ష్మనిర్మాణము.
కాడ:- కాడయొక్క సూక్ష్మనిర్మాణమును కొంచె మించు మించుగ శాఖయొక్క నిర్మాణమును బోలియుండును. దీనిగుండ నొకటిగాని యంతకు హెచ్చుగాని వాహికాపుంజములు కొమ్మనుండి పత్రదళములోనికి వ్యాపించియుండును. ఇవి పత్రదళములో ప్రవేశించి యనేక చిన్న చిన్న వాహీకాపుంజములుగా చీలి యాకులయందలి నులుయీనె లగును. పత్రదళము:- సామాన్యముగా నన్ని యాకులందును పై తట్టునకును క్రిందితట్టునకును భేదము గన్పట్టుచుండును. ఇందు
ఆకుయొక్క సూక్ష్మనిర్మాణము తెలుపునది.
బ1 - ఆకుయొక్క పైతట్టున నుండెడు బహిశ్చర్మము.
హ - హరితకములు. ఇవి ఆకుయొక్క గుంజులోని ప్రతికణమునందును పెక్కు లుండును. ఇవి నల్లనిచుక్కలుగా చూపబడినవి.
గోడ - ఇందు పొడుగుగనుండు మృదుకణము లొండొంటినడుమ సందులు లేకుండున ట్లమరియున్నవి.
గుల్ల - ఇందలి కణములమధ్య శూన్యస్థలము లనేకములు గలవు.
బ2 - ఇది ఆకుయొక్క క్రిందితట్టుననుండు బహిశ్చర్మము.
నో - నోరు. పె,పె - పెదవులు. పెదవికణములలో తప్ప బహిశ్చర్మమునందలి యితరకణములందు హరితకము లుండవు. నకు కారణము దాని సూక్ష్మనిర్మాణమును పరీక్షించిన తెలియగలదు. ఒకయాకునుండి అడ్డముగ ఖండింపబడిన యొక సూక్ష్మమైన తునకయొక్క ఆకారము సూక్ష్మదర్శనిలో చూచునప్పుడు 61-వ పటములో జూపినట్లుండును.
1. పైతట్టునను క్రిందితట్టుననుగూడ నొకవరుస బల్లపరుపైన కణముచే నేర్పడిన పొరలు గలవు. ఇవి రెండును బహిశ్చర్మపు కణములపంక్తులు. ఈ రెండు పొరలమధ్య ఆకుయొక్క గుంజు (Mesophyll) అను పదార్థము గలదు.
2. పైవైపుననుండు బహిశ్చర్మ కణములవరుసకు లోపలితట్టున నొకవరుస పొడుగైనకణము లొక దానిసరస నొకటి యమరియుండు గోడవలె నేర్పడియుండును. ఈ కణములమధ్య నందు లుండవు. ఈ కణములు బహిశ్చర్మకణములకు సమకోణములు గలవిగా నుండును. ఈ గోడయే గుంజునకు పై సరిహద్దు.
3. ఈ గోడకు లోపలితట్టున, నిర్ణియమైన ఆకారము లేనట్టియు, కొంచెము గుండ్రనైనట్టియు కణములు గుల్లగ నుండునట్లు అనగా కణములమధ్య సందులు మిగిలిపోవునట్లుగా చిమ్మబడియుండును. ఈ సందులన్నియు నొకటినొకటి కలిసికొని తుద కాయాకుయొక్క క్రిందిభాగముననుండు బహిశ్చర్మపుపొరలో నుండునోరు (Stomata) లనబడు సందులగుండ వెలుపలనుండు గాలితో సంబంధము గలిగియుండును.
4. గోడయందలి కణములును, గుల్లయందలి కణములును గూడ మృదుకణములే. వీని మూలపదార్థమునందు హరితకము లుండును. ఈ హరితకముల మూలముననే ఈ యాకులు కిట్టి ఆకుపచ్చనిరంగు గలిగినది. ఈ హరితకములలోని రంగు పసిమిరంగుగా మారుటచే పండుటాకుల కట్టి రంగు గలుగుచున్నది.
5. పైనిజెప్పిన గోడకును, గుల్లకును మధ్య అతుకులో నక్కడక్కడ నొక్కొక వాహికాపుంజము గానవచ్చును (అది పటములో జూపబడలేదు). అందు దారువు పైవైపునకును, త్వక్కుక్రిందివైపునకును ఉండును. కొంచెము పెద్దదైన వాహికాపుంజములచుట్టు నొడ్డాణమును, దానిచుట్టు అంతశ్చర్మకణములవరుసయు నుండును. ఈ అంతశ్చర్మకణములలో సామాన్యముగా పిండి అణువులు నిలువ జేయబడి యుండును.
6. ఈ వాహికాపుంజములనుండి మృదుకణములగుండ నటునిటు బహిశ్చర్మమువరకు దృఢకణము లక్కడక్కడ త్రాళ్లవలె వ్యాపించియుండును. వాహికాపుంజములును వానితో జేరియుండు నీ దృఢకణములును ఆకునకు నిలబడుటకుశక్తి గలుగ జేయునట్టి వగుటచే నవియే వాని అస్థిపంజరమని యూహింపనగును.
షరా:_ (1) పైని జెప్పబడిన వర్ణనయంతయు సామాన్యముగా మనము జూచెడు ఆకుల కన్నిటికి వర్తించును, గాని గగనమువైపునకు నెక్కియుండు కొన్ని ఆకులయొక్క రెండువైపులు నొక్కరీతిగనే యుండును. వానియందు రెండువైపులను నోరు లుండును. రెండువైపులను మృదుకణముల గోడ లుండును.
(2) నీటిమీద తేలుచుండు తామరాకులవంటి యాకులలో నోరులన్నియు పైవైపుననే యుండును. బహిశ్చర్మము.
చేమఆకు తమలపాకులవలె కొంచెము దళసరిగలఆకును దేనినైను చేతబట్టుకొని దాని రెండువైపులను పరీక్షించి చూడుము. అందు క్రిందివైపు ఎదో సులభముగ తెలిసికొనవచ్చును. అట్లు తెలిసికొనిన పిమ్మట నా యాకును పైవైపు పై నుండునట్లుగా చేత బట్టుకొని, కొంత యాకును వెనుకకు విరిచి పర్రున చింపుము. అట్లుచింపగా చిరిగిన ముక్కలయొక్క క్రిందితట్టున తెల్లనగు మిక్కిలి పలుచని పొర యొకటి చిరుగు అంచుల వెంబడిని అక్కడక్కడ అంటియుండును. ఇది ఆ యాకుయొక్క క్రిందివైపు బహిశ్చర్మపుపొర. ఇం దొక చిన్నముక్కను సూక్ష్మదర్శినిలో పరీక్షించునెడల దానియందలి నోరులనిర్మాణము చక్కగ తెలియగలదు. అట్టి పొరయొక్క నిర్మాణమును చూపు 62-వ పటము
చూడుము. అందు (నో). అనున దొక-నోరు. ఈ నోటికి రెండువైపులను పెదవు లనబడు రెండుకణములు గలవు. ఆ పెదవులు దొప్పలవలె నొకవైపున లోటుగను, రెండవవైపున ఎత్తుగను ఉండును. ఈదొప్పల రెంటియొక్క లోపలివైపులు ఒక దాని నొకటి యెదుర్కొనునట్లు జేరుటచేత నా పెదవుల మధ్యనుండు రంధ్ర మేర్పడును. ఈ పెదవికణముల లోపలిగోడలు మిక్కిలి బలముగలవి. ఇవి తమ యిచ్చవచ్చినట్లు పెద్దవి చిన్నవి కాగల సామర్థ్యము గలవి. అవి పొడుగుగ నెదిగినప్పుడు రెండు పెదవులును దగ్గిరబడి వాని మధ్యరంధ్రము మూసికొనిపోవును. పెదవులు చిన్నవైనప్పుడు వాని లోపలివైపున దొప్పలవలె నుండుగుంటలేర్పడి రెండుదొప్పల గుంటలును జేరి రంధ్ర మగును. ఈరంధ్రమే నోరు.
ఈ రంధ్రములు ఆకునందలి మృదుకణముల గుల్లలోని రంధ్రములతో సంబంధము గలవని చెప్పియుంటిమి. ఈరంధ్రములు తెరవబడినప్పుడు ఆకునందలి నీరు ఆవిరిరూపమున గాలిలోనికి బోవుచుండును. అవి మూయబడియుండినయెడల ఆకునందలి నీరు ఇగిరిపోనేరదు. ఇట్టిసాధనములచే ఆకులు చెట్టువేళ్లచే పీల్చబడిన నీటిలో తమకు కావలసినంతవరకు నుంచుకొని మిగిలిన నీటిని ఆవిరిగా గాలిలోనికి విడచివేయును.
వర్ష కాలమునందు చెట్లకు నీరు అధికమైనప్పుడు తమకుకావలసిన దానికంటె హెచ్చుగనుండు నీటిని ఆవిరిరూపమున విడుచు నిమిత్తమై వృక్షములు తమ యాకులయందలి నోళ్లను ఆవులించి నట్లుగా తెరచుకొనియుండును. వేసవికాలమునందు తమలోనుండు నీరు ఆవిరియైపోకుండ దాచికొనునిమిత్తమై తమ నోళ్లను మూసికొనియుండును. ఆకునందలి పాహికాపుంజముల వ్యాపకము.
దీనినిగూర్చి యిదివరలో 234-వ పుటలో వ్రాసియున్నాము. ఆకునందలి వాహికాపుంజములు వాని యీనెలగుండ ఆకుయొక్క అంచువరకు వ్యాపించియుండును. ఈ యీనెలయొక్క వ్యాపకమునుబట్టి ఆకులలో, (1) ఏక కాష్ఠములు (Unicostate),(2) బహుకాష్ఠములు (Multicostate) అని రెండువిభాగము లేర్పడియున్నవి.
1. ఏకకాష్ఠము.
కొన్నియాకులలో మధ్యఈనె యొకటుండి దానినుండి చిన్న చిన్న ఈనెలు పుట్టి అవి ఆకునంతటను అలుముకొనియుండును. ఈ యీనెయే ఆకును నిలువబెట్టుటకు శక్తి నిచ్చెడు ఊతపుకర్ర వంటిది. ఇట్లు ఒంటియీనె గలయాకులకు ఏక కాష్ఠములు అని పేరు. ఉదా:- రావియాకు, అరటియాకు.
2. బహుకాష్ఠము.
కొన్నియాకులలో మధ్యఈనియే యుండక తల్లికాడ ఆకులో ప్రవేశించినతోడనే అనేక ఈనెలుగా చీలి వానినుండి పిల్ల యీనెలు పుట్టి అవి ఆకునంతటను అల్లుకొనును. అట్టియాకులు బహుకాష్ఠములు. ఉదా:- ఆముదపాకు, తమలపాకు, చేమాకు మొదలగునవి చూడుము.
పిల్లయీనెల వ్యాపకము.
ఏకకాష్ఠములందును, బహుకాష్ఠములందునుగూడ పిల్ల యీనెల వ్యాపకము రెండువిధములుగ నున్నది.
1. సమాంతరము (Parallel)
2. జాలాకారము (Reticulate).
1. సమాంతర వ్యాపకము:-పిల్లయీనె లొకదానితో నొకటి యలుముకొనకుండ యొక దానిప్రక్క నొకటి సమాంతరముగ వ్యాపించుట. సామాన్యముగా నేకబీజదళవృక్షముల ఆకులన్నియు నీ తరగతిలోనివే. ఉదా:- ఏక కాష్ఠములలో అరటి యాకు, కొబ్బెరఆకు మొదలగునవి. బహుకాష్ఠములలో తాటి ఆకు, చేమాకు మొదలగునవి.
2. జాలాకారవ్యాపకము (జాలము-వల) - ఇందు పిల్లయీనెలన్నియు వలయల్లికలవలె నల్లుకొనియుండును. ద్విబీజదళవృక్షముల ఆకులన్నియు నీ తరగతిలోనివి. ఉదా:- ఏక కాష్ఠము-రావి యాకు; బహు కాష్ఠము-ఆముదపాకు మొదలగునవి.
ఆకుయొక్క ఉత్పత్తి.
ఇది కొమ్మచివరనుండు అంత్యవిభాజ్యమునుండి యొక చిన్న మొటిమగా నంకురించును. ఈమొటిమలో బాహ్యలింగము, పరిలింగముమాత్రము జేరియుండును. మొట్ట మొదట మొటిమయందలి కణములన్నియు విభజనాశక్తి గలిగియుండును. కాని కొంతవరకు ఆకుయొక్క ఆకార మేర్పడినతోడనే, ఆకుమధ్యనుండు కొన్నికణములు మాత్రము విభజనాశక్తి గలవై తక్కినకణములన్నియు విభజింపబడక పరిమాణమునందు మాత్రము పెరుగుచుండును. తుదకు ఆకునందలి కణములన్నియు నేర్పడినతరువాత మధ్యనుండు కణములకుగూడ విభజనాశక్తి లేకపోవును.
ఇట్టిస్థితికి రాగనే ఆకు పెద్దదై నదని మీరు తలచరాదు. ఇంతవరకు ఆకు చుట్ట చుట్టుకొని కొనమొగ్గలో తక్కినలేతయాకులమధ్య ముడుచుకొనియుండెడు చిన్నరూప మేర్పడును. తరువాత నది వికసించి దానియందలి ప్రతికణమును పెరుగుటచే దాని కనుగుణమైన పరిమాణము గలుగును. కాని యీపెంపు క్రొత్తకణములు పుట్టుచుండుటచేత గాదని గ్రహించునది.
ప్రథమమున మొటిమలో జేరిన పరిలింగములోని కణములలో కొన్నిటినుండి అంతర్లింగ మేర్పడి దానినుండి వాహికాపుంజములు పుట్టును. ఈయంతర్లింగము పిమ్మట శాఖయందలి అంతర్లింగముతో కలిసికొని శాఖనుండి ఆకులోని కేకమైనవాహికాపుంజము లేర్పడును.
ఆకు రాలుపు.
పత్రపీఠముయొక్క మొదటిభాగమున కొమ్మకును ఆకునకును మధ్య నడ్డముగ బెండుపొర (Cork layer) యొకటి పుట్టును. కొమ్మనుండి ఆకులోనికి వ్యాపించు వాహికాపుంజములలోని గొట్టముల నీ బెండుపొర యురిపోసినట్లుగా నొక్కి వానిరంధ్రముల మూసివేయును. అంతట ఆహారప్రసరణము లేనివై ఆకులు చచ్చి నేలబడును. ఇట్లీవాహికాపుంజముల రంధ్రములు నొక్కి వేయబడుటచేతనే ఆకులు రాలిపోయినప్పుడు వాని మొదళ్ళనుండు మచ్చలగుండ కణరసము (నీరు, పాలువంటి దేదియు) కారదు. ఆకురాలుపు-శీతోష్ణాదులయందలి యధిక భేదములచే గలుగుచున్నట్లు తెలియుచున్నది.
ఈయాకు రాలుపు చెట్టుయొక్క ప్రాణసంబంధమైన వ్యాపారమని యొక నిదర్శనమువలన తెలియగలదు. మన మొకకొమ్మను ఆకులసహితము నరికి యెండవేసినయెడల దానియాకులుకొమ్మ యంటియుండునుగాని రాలిపోవు. కాన ఆకులను రాల్చుశక్తి బ్రతికియున్న చెట్లకేగాని చచ్చినచెట్లకు లేదని యెరుంగునది. ఆకులను రాల్చుటకు ప్రయత్న మొకయాకు కొనమొగ్గనుండి వికసింపకముందే ప్రారంభమై, ఆయాకు రాలిపోవుటకు పూర్వపు క్షణికమువరకు సంపూర్ణముగాకుండ నుండునని కనిపట్టబడునది.