జీవశాస్త్ర సంగ్రహము/రెండవ భాగము/అయిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

అయిదవ ప్రకరణము.

పూవు (The Flower)

సంతానవృద్ధి:- ఈవరకు జదివిన పుష్పములులేని వృక్షజాతిజీవులలో సంతానవృద్ధి ఎట్లు గలుగునో కొంచెము విమర్శించి దానికిని ప్రస్తుతము జదివెడు హెచ్చుజాతివృక్షములకుగల సంతానవృద్ధికిని తారతమ్యము లాలోచింతము. ఏకకణ ప్రాణులగు వృక్షజాతి సూక్ష్మజీవులలో స్త్రీపురుషవివక్షత బొత్తిగ గానరాదు. పసిరికపోగునం దాభేదము సూచనగా కన్పట్టినది. సంయోగమున కేర్పడిన రెండుపోగులలో నొకటి చురుకుగనుండి సంయోగవిధానమునకై ముందుగ పూనికొని యెక్కువ పరిశ్రమ జేయును. అది పురుషాంగములు గలది-అనగా మగది. రెండవది మందముగ నుండునది-ఆడుది. వారిపర్ణి, నాచుమొక్క వీనియందు స్త్రీపురుషావయవములు వేర్వేరుగా నున్నవి. కాని యవి రెండును ఏకవృక్షమునందే యుండును. వానియందలి స్త్రీపురుషబీజము లెట్లుండునో, వానికి సంయోగ మెట్లు కలుగునో, వానినుండి సంయుక్తబీజము ఎట్లు గలుగుచున్నదో జూచియుంటిమి. సూక్ష్మ (మగ) బీజ మెల్లయెడలను చిన్నదిగను చురుకుగలదిగను ఉన్నది. స్థూల (ఆడ) బీజము పెద్దదిగను స్థావరముగను ఉండును. సూక్ష్మ (మగ) బీజములు పెక్కుగ నుండి, యవి యుక్తవయ స్సును జెందినప్పటినుండి స్థూల (ఆడ) బీజమునకై వెదకులాడుచు బోవుచుండును. ఏక ఫలాపేక్షకములగు అనేక సూక్ష్మబీజములలో నొక్కదానికిమాత్రమే తనకోరిక సఫలమగును. తక్కినవన్నియు విఫల మనోరథములై కొంతకాలమునకు నాశముజెందును.

పుష్పముయొక్క ఉపయోగమేమి?

ఇంతవరకు అనుసరించిన మీకు హెచ్చుజాతివృక్షములందు వివాహసంబంధము లుండునని వ్రాసిన చిత్రముగ దోచదు. సృష్టియందలి వివిధవర్ణములును, రూపములును గల పుష్పములు మానవుని ఆనందింపజేయు నిమిత్తమై సృజింపబడినవని కొందరి యభిప్రాయము. మానవున కుపయోగము కాని పుష్పముయొక్క జన్మము నిష్ఫలమని వారు తలంచుదురు. ఒకానొక జంతువున కొక యవయవమున్న యెడల దాని యుపయోగము కూడ తోడనే యేర్పడియున్నది. ఎట్లన, మానవునకు గోళ్లు ఎందుకున్నవని అడిగిన తనకు జిల పుట్టినప్పుడు గోకుకొనుట కని చెప్పుదుము. పశువులకు కొమ్ము లెందు కుండునని యడిగిన ఆత్మ సంరక్షణార్థము అనగా శత్రువులనుండి తమ్ము రక్షించుకొనుటకు అనియు, తోక యెందు కేర్పడినదనగా జోరీగలబాధ తొలగించుటకు అనియు జెప్పుదుము. ఇట్లే చెట్టునందు పుష్ప మేల యేర్పడినది అనుప్రశ్నకు రసిక జనుల నానందింపజేయుటకనిచెప్పెడు ప్రత్యుత్తరము యుక్తముకాదని మా యభిప్రాయము. ఏలయన రమ్యమైనట్టియు, సువాసనగలవై నట్టియు పుష్పములు మానవుల యుపయోగము నిమిత్తమై మాత్రమె సృజింపబడె ననితలంచువారు, సహింపరానిదుర్వా సనలును, వికారరూపములును గల పుష్పములు తమ్మెట్లు సంతోష పెట్టునని తలచెదరు? మరియు మానవున కగమ్యములైన కారడవులయందును, దుర్గమములగు పర్వతశిఖరములందును పుష్పించు పూవులు తమ కెట్లుపయోగపడును? కాన పుష్పములు తమ్ము గన్న వృక్షమునకు ఎట్లో యుపయోగకరముగా నుండునిమిత్తమర్ పుట్టినవని యూహింపనగును. అవి యా వృక్షములనిమిత్తమై యేయేపనుల నెట్లు నెరవేర్చుచున్నవో ముందు జూడగలము. మానవులకంటె తమ కెక్కుడుగ నుపయోగపరులగు నెవ్వరో మరి కొందరి మనముల రంజిల్ల జేసి వారివలన తాము పొందగల కొన్ని కార్యములను నెరవేర్చికొనుటకై యీ పూవు లిట్టి గంధ వేషాదులను ధరించునని మీరు ముందు గ్రహించగలరు.

సమస్తజీవకోట్ల జీవితమునకు కడపటి యుద్దేశము సంతానాభివృద్ధిచే స్వజాతిని పెంపొందించుటయే. అట్లయిన, వృక్షములు సంతానవృద్ధి నెట్లు జెందును? అందునకై పుష్పములు ఎట్లు సహకారు లగును?

వృక్షజాతులందు సంతానవృద్ధి రెండువిధములుగ నున్నది.

1. అంటులు.

తల్లి మొక్కయందలి కొన్ని నియతభాగములు భూమిలో పాతబడి తల్లివంటిమొక్కలుగా పెరుగును. మల్లె, చేమంతి మొదలగు పూవుల మొక్కల అంట్లును, కంద, పెండలము మొదలగు దుంపల ముక్కలును, చెరుకు మొదలగువాని శాఖాభాగములును, ఇట్టి సంతానవృద్ధి కుదాహరణములు. ఈ చెట్లకు సామాన్యముగా కాయలుండవు.

2. గింజలు.

పై నిజెప్పిన సంతానవృద్ధిచే నేవో కొన్నిజాతులుమాత్రమే వ్యాపించుచుండునుగాని అనేకజాతులు క్రింద చెప్ప బోవునట్లు స్త్రీపురుషసంయోగమువలన ఏర్పడిన గింజలమూలముననే స్వజాత్యభివృద్ధి జెందును. ఇట్టిగింజలు దేశ దేశములకు ఎగుమతికాగల వగుటచే వృక్షములు తమజాతిని మిక్కిలి దూరపుప్రదేశములకు సహితము వ్యాపింపజేయగలవు. ఇందుకొర కనేకవృక్షము లిట్టి సంతానవృద్ధినే కోరుచుండును.

స్త్రీపురుష వృక్షములు.

స్త్రీపురుష సంయోగసహితమైన సంతానవృద్ధికి పుష్పములు సంయోగావయవములు. తాడి, బొప్పాయి మొదలగు వృక్షజాతులలో కొన్ని పోతుచెట్లును (అనగా మగవియును) మరికొన్ని ఆడుచెట్లును గలవు. మగచెట్ల పూవులయందు పురుషాంగములు (కేసరములు) మాత్ర ముండును. ఆడు చెట్లయందు అండాశయములు *[1]మాత్ర ముండును. ఇట్టి వృక్షములకు ఏకాంగు లనిపేరు. ఇవి గాక యనేక వృక్షములు స్త్రీపురుషాంగముల రెంటిని ఏక వృక్షమునందే కలిగియుండును. వీనికి ఉభయాంగు (మిథున వృక్షములు) లని పేరు. ఇందుకొన్ని చెట్లలో పురుషాంగములు ఒకపుష్పమునందును, స్త్రీసంబంధమైన యంగములు మరియొక పుష్పమునందును ఉండును. ఉదా:- ఆముదపు చెట్టునందు మగపువ్వులును, ఆడు పువ్వులును వేరువేరుగ నుండును. 69-వ పటము చూడుము. ఈ రెండుజాతులపూవులును ఒక చెట్టునందే యుండును.

69-వ పటము

పూవులుపై సగభాగముననుండు ఆడపూవులు. క్రింది సగభాగమున నుండునవి మగపూవులు. వీనిలో కొన్ని పగిలియున్నవి, వానియుండి పుప్పొడిరేణువులు అనగా మగబీజములు చెదరిపోవుచున్నవి. కుడిప్రక్కను వికసించిన మగపూవొకటి కొంచెము పెద్దదిగ జూపబడినది. ఆడపూవులు గర్భవతులుకాగానే మగపూవులువీడిపోవును. గర్భవతులైన ఆడపూవులనుండి ఆముదపు కాయలు పుట్టును.

పుష్పముయొక్క నిర్మాణము.

అయినను అనేక వృక్షములు మిధునవృక్షములే. ఇందు స్తీ పురుషాంగములు రెండును ఏకపుష్పమునందే యుండును. 70-వ పటములోని ఉమ్మెత్తపూవు చూడుము. స్త్రీ పురుషావయవములు రెండును పెం పొందక అణగిపోయిన పుష్పములుగల చెట్లకునపుంసకవృక్షము లనిపేరు. వీనిపూవులను గొడ్డుపూవులందురు. ఉదా:- మల్లె గులాబి మొదలగుపూవులు.

1. ఉమ్మెత్తపూవు. మిధున పుష్పము.

2. దానిమధ్య నుండు అండాశయము అనగా స్త్రీసంబంధమైన అవయవము.

3. పురుషాంగము లేడు పూవుయొక్క రేకులవంటియున్నవి.

4. ఒక పురుషాంగము ప్రత్యేకముగ చూపబడినది.

పుష్పముయొక్క నిర్మాణము.

పుష్పములు శాఖావిశేషములే యని చెప్పి యుంటిమి. ఇవియును ఉపశాఖలవలెనే ఆకునకును ప్రకాండమునకును మధ్యనున్న పంగనుండి మొటిమలుగా పుట్టుచున్నవి. శాఖనుండి ఆకులు ఎట్లుపుట్టునో అట్లే ఈ మొటిమలనుండి రేకులు పుట్టుచుండును. పూవులు సంతానవృద్ధి గలుగ జేయుటకై ప్రత్యేకముగా నియమింపబడియుండుటచే, ఆ వ్యాపారమును నెరవేర్చునిమిత్తమై వానియందలి భాగములు తమతమ రూపములందు కొంతకొంత వరకు మార్పులను బొందియున్నవి. పుష్పమునందు సామాన్యముగా రెండుభాగములు గలవు.

రక్షక పత్రములు.

అందు మొదటిభాగము తొడిమ - ఇది ఆకుయొక్క కాడనుబోలియుండును. కలువ మొదలగు కొన్నిటియందీ తొడిమ మిక్కిలి పొడుగుగ నుండును. కొన్నిటియం దనేకపూవు లొక కాడ వంటి యేకగుచ్ఛముగా నేర్పడును. ఉగా :- ఎర్రగన్నేరు.

రెండవది కర్ణిక - ఇది తొడిమ చివరను కొంచెము లావుగనుండుభాగము. దీనినుండియే పుష్పముయొక్క పత్రము లన్నియు వ్యాపించుచుండును.

సర్వసాధారణముగా పుష్పమునందు నాలుగు పత్రభేదములు గలవు.

  1. . రక్షకపత్రములు (Sepels)
  2. . ఆకర్షణపత్రములు (Petals)
  3. . కింజల్కములు (Stamens) లేక పురుషపత్రములు.
  4. . అండాశయములు (Carpels) లేక స్త్రీపత్రములు.

1. రక్షక పత్రములు.

ఇవి పుష్పముయొక్క రేకులన్నిటికంటె క్రిందిభాగమున అనగా వెలుపలి వైపున సామాన్యముగా నాకుపచ్చగనుండు పత్రములు. ఇవి గులాబి మొదలగు పుష్పములలో నాకుపచ్చగనుండి ముండ్లు కలిగియుండును. (71-వ పటములో ర. చూడుము). దానిమ్మ ఉమ్మెత్త మొదలగు కొన్నిటిలో నీ పత్రములన్నియు నొక దాని నొకటి యంటికొనిపోయి, గిన్నెవలె నేర్పడి ప్రథమమున మొగ్గను సంరక్షించుచుండును. తరువాత కాయయొక్క పై పెచ్చుగాను ముచ్చికగాను ఏర్పడి గింజలను కాపాడుచుండును. సామాన్యముగా నాకర్షణ పత్రములును, కింజల్కములును తమతమపనులు నెర వేర్చినతోడనే పుష్పమునుండి యూడిపోవును. రక్షకపత్రము ఈ పేజి వ్రాయబడియున్నది. ఈ పేజివ్రాయబడియున్నది. లట్లుకాక యెల్లప్పుడు పుష్పము నంటియుండి దానిని సంరక్షించుచుండును. కొన్నిటియం దీ రక్షకపత్రములు తమపొరుగుననుండు ఆకర్షణపత్రములవలె రమ్యమైనవర్ణము కలిగియుండి పుష్పము యొక్క అందమును ఆకర్షణశక్తియును హెచ్చించును. ఎర్రకలువ మొదలగు కొన్ని పుష్పములందు ఈరక్షకపత్రములు కొంచె మాకుపచ్చగను, కొంచె మెర్రగను ఉండి కలువయాకుయొక్క ఆకుపచ్చరంగునకును, కలువపువ్వుయొక్క యెరుపురంగునకును మధ్యవర్ణమును దాల్చియుండును. మొగలి పొట్ట, మొక్క జొన్న పొట్ట, అని మనము వాడుకొను భాగములు పూవులే. వాని రక్షకపత్రములు కొంచె మొంచుగ నాకులవలెనే యుండును. కాన ఆకుపచ్చగనుండు ఆకునుండి వివిధవర్ణములుగల పుష్పములయొక్క రేకులు పరిణమించుటలో నీ రక్షకపత్రములు మధ్య మెట్టుగా గ్రహింపనగును.

2. ఆకర్షణపత్రములు.

ఇవి వివిధములై నరంగులు గలవిగను, స్ఫుటమైనవిగను ఉండి భృంగాదులకన్నులకు విందు జేయునట్టి పలుచని రేకులు (71-వ పటములో ఆ). సామాన్యముగా ననేక పూవులందు తామర పుష్పమునం దున్నట్లు రేకులు వేర్వేరుగా నుండును. కాని పచ్చ గన్నేరు, ఉమ్మెత్త మొదలగు పూవులందువలె రేకు లొక దానితో నొకటి జేరి గంటవలె నుండవచ్చును. ఈ రేకులు తురాయిపువ్వులో నున్నట్లు ఒక్క వరుసగా నుండవచ్చును. తామరపువ్వులో నున్నట్లు అనేక వరుసలుగాగూడ నుండవచ్చును..

ఆకర్షణపత్రముల పేరు ననుసరించియే వీని వ్యాపారముచే భృంగాదుల నాకర్షించుట యైయున్నది. ఈ విషయమై డార్విను (Darwin) అను నొక ప్రకృతిశాస్త్రవేత్త కొన్నిశోధనలు జేసి యిట్లు కనిపట్టెను. అతడు కొన్ని పుష్పములనుండి వాని ప్రకాశమానమైన రేకులను ఆపూవులు చెట్టుననుండగనే త్రుంచి వేసెను. ఇట్లు చేయుటవలన భృంగాది కీటకములు ఇరుప్రక్కల నుండు అందమైన పుష్పములమీద వ్రాలుచువచ్చినను. ఈ యాకర్షణపత్రములూడి దిగంబరులైయున్న పుష్పములవైపునకు కన్నెత్తియు చూడవాయెను. మరియొక రీ యంశమునే యీక్రిందివిధమున పరీక్షించిరి. చక్కగ వికసించిన ద్రాక్షపూగుత్తుల కొన్నిటిపై వీరు మిక్కిలి పలుచని వస్త్రమును చుట్టి యా పుష్పములను తేనెటీగలు మొదలగువాని కగమ్యముగ జేసిరి. ఇరు ప్రక్కల నుండుపుష్పములు కొంత కాలమువరకు నాభృంగాదులకు విందు చేయుచు పిమ్మట కొద్దికాలములోనే తమ యాకర్షణపత్రముల విసర్జించి దిగంబరులగుచు వచ్చెను. కాని యీ పలుచనివస్త్రముచే మూయబడిన పుష్పములు రెండు మూడు వారములవరకు శృంగారరూపమును విడువవాయెను. ఇట్టి భేదమునకు కారణ మేమియని చర్చించి, రేకులూడిన పుష్పములు గర్భవతులై యున్న వనియు, మూయబడిన పుష్పము లింకను గర్భవతులు కాలేదనియు, గర్భవతులైన పుష్పములు తమ యలంకారములకై యంతగా శ్రద్ధజేయవనియు, గర్భవతులు గాని పుష్పములుమాత్రము తమ మనోరథము సిద్ధించువరకు తమ సౌందర్యమును విడువ వనియు అతడు కనిపట్టెను. తదనుకూలముగా, కప్పబడిన పుష్పములనుండి యనేకములగు కాయ లేర్ప డెను, గాని యా కప్పబడిన పుష్పములనుండి యవి మూయబడి యున్నంతకాలము కాయలు పుట్టలేదు. ఇంతేకాక వానిపై గప్పిన వస్త్రము తీసివేయబడినతోడనే తుమ్మెదలు వానిపై జుమ్మని వ్రాలుచుండుటయు నవి పిమ్మట గర్భవతులగుటయు జూడగలిగెను. దీనినిబట్టి చూడ పుష్పములు తమంతట తాము గర్భవతులు కాజాలవనియు, అట్లు గర్భవతులగుటకు భృంగాదుల సహాయ మేటికో కావలసియున్నదనియు. అట్టి సహాయకారుల నాకర్షించుటయే యీ రమ్యమైనపుష్పముల యుద్దేశమనియు మన మూహింపనగు. ఇట్లాకర్షింపబడు తుమ్మెదలు మొదలగునవి పుష్పముల కెట్టి యుపయోగకారులో ముందు జూడగలము.

3. కింజల్కములు లేక పురుషపత్రములు.

పైని జెప్పబడిన రక్షక ఆకర్షణపత్రములు రెండునుగూడ సంతానవృద్ధికి సహాయభూతము లేగాని యంతగా ముఖ్యావయవములు గావు. ఇవి లేకయే కొన్నివృక్షములు సంతానవృద్ధి నొందును. కింజల్కములును, అండాశయములును ఇందునకు ముఖ్యాంగములు. ఇవి సామాన్యముగా ఆకర్షణపత్రముల పై భాగమున నుండును. ఇందు కింజల్కములు పురుషభాగము. అండాశయము స్త్రీ భాగము.

కింజల్కములు సామాన్యముగా తామరపువ్వు ఉమ్మెత్తపువ్వులందువలె పొడుగుగను, సన్నముగను ఉండును. వీరికి కేసరములనియుపేరు. ఇందు రెండుభాగములుగలవు. సన్ననిదారమువంటి మొదటిభాగమునకు పోగు (Filament) అని పేరు (70, 72, 73-వ పటములు చూడుము). వానిచివర నంటియుండు చిన్న జీలకర్రపాయవంటి

ముక్కు రెండవభాగము. ఈముక్కులు పురుషసంబంధమైనబీజములు గలిగినవగుట చేత వీనికి పురుషాంగములు (Anthers) అను పేరు గలిగెను. ఒక్కొకపురుషాంగము సామాన్యముగా రెండు వృత్తములు (Lobes) గా విభజింపబడి యుండును. ఆవృత్తముల రెంటిమధ్యనుండు సరిహద్దు ఒక చారవలె పైకి తెలియుచుండును. ఈవృత్తములే సూక్ష్మబీజాశయములు. ప్రతి వృత్తమునందు పుప్పొడితిత్తులు (Pollen sacs) అను రెండు గుండ్రని తిత్తు లుండును. 74-వ పటము చూడుము. పుష్పము బాగుగ వికసించునప్పటి కీ పుప్పొడితిత్తులు సూక్ష్మబీజము (Microspores)లతో నిండియుండును. సామాన్యముగా పుష్పములపై నంటియుండు దుమ్మువంటి పుప్పొడి రేణువు లీ సూక్ష్మబీజములే.

కింజల్కములు ఆకులయొక్క పరిణామరూపములు.

లేతయాకులు ప్రథమమున వెడలునప్పుడు పొడుగైన గొట్టములవలె చుట్ట చుట్టుకొని వచ్చుచుండుట తరుచుగ చూచు చుందుము. అరటాకు మోపునుచూడుము. ప్రక్క పటములోని

పరిణామరూపములు.

రావిచిగురుయొక్క కొనయందలి లేత యాకులు మొగ్గవలె నెట్లు ముడుచుకొని యున్నవో చూడుము. ఇట్లే అనేక పత్రములు సన్నముగను, పొడుగుగను రూపభేదములు జెందుచుండుట యొక విచిత్రము గాదు.

75-వ పటము.

రావిచిగురు

కింజల్కములు సామాన్యమైన ఆకులనుండి క్రమముగ నెట్లు పరిణమించెనో తెలిసికొనుట కొక యుదాహరణము చూపెదము. కలువపూవును చూడుము. దీని రక్షకపత్రములు ఆకుపచ్చనిరంగుగలిగి ఆకర్షణ పత్రములకును ఆకులకును మధ్య అంతస్తుగానున్నట్లు జెప్పియుంటిమి. ఆకర్షణపత్రములు ఆకులయొక్క పరిణామరూపములే యని పైనివ్రాసియున్నాము. మొగిలి పూవునందలి ఆకర్షణపత్రములు కొంచెమించుగ ఆకులవలెనే యుండునుగదా. ఎర్రకలువపూవును పరీక్షించిన యెడల నీ యాకర్షణ పత్రములు క్రమముగ పురుషపత్రములుగా నెట్లు మారునో, అట్లు మారునప్పుడు మధ్య ఎన్ని అంతస్తులుగల రూపభేదము లుండునో చూడవచ్చును. మొట్టమొదట ఆకర్షణ పత్రములలో కొన్ని కొంచెముసన్నమగును. క్రమముగా వీని సన్నదనము పై వరుసల కెక్కిన కొలదిని హెచ్చుచుండును. ఇవి యన్నియు ఆకర్షణ పత్రములవలె ఎర్రగనే యుండును. తరువాత నీ సన్ననిపత్రములు కొంచెము దళసరిగల వగును. దీని పై యంతస్తునందలి పత్రముల కొనయందు లోపలితట్టున రెండు నిలువుగీట్లు గన్పట్టును. ఈగీటులే క్రమముగా సూక్ష్మబీజాశయము లనబడు వృత్తములుగా పరిణమించును. అనగా నాపత్రములు పురుషాంగముల ధరించును. వీని పై యంతస్తునం దుండు రేకులు క్రమముగా ఆకర్షణపత్రముల అందమును పోగొట్టుకొని పురుషాంగముల ధరించుటయే ముఖ్య వ్యాపారముగ నేర్పరచుకొని హెచ్చుమార్పుల జెందును. ఇట్టి స్థితియందు ఈ పురుషపత్రములు ఆకర్షణ పత్రములనుండి పరిణమించినవని చెప్పిన సరియో కాదో యనుసందేహము గలిగించునంతటి మార్పు గలుగుచున్నది.

కొన్ని పుష్పములయం దీ పురుషపత్రములన్నియు తమ మొదటిభాగములందుగాని, చివరభాగములందుగాని యొక దాని నొకటి అంటుకొనిపోయి యుండును. గంగరావిపూవునందు వీని మొదళ్లన్నియు నొక దిమ్మగా నేర్పడి యాదిమ్మమీద పురుషాంగములన్నియు క్రిక్కిరిసి యంటియుండును. మందారపూవునందు పోగులన్నియుజేరి యొక గొట్టముగా నేర్పడి, దాని చివరభాగమున పురుషాంగములు మాత్రము వేరువేరుగా నంటి యుండును.
పత్రములు, కొన్ని జాతులలో తెల్లగను మరికొన్నిటిలో ఊదా రంగుగను ఉండును. పుష్ప కేసరములు పది యుండును. వీని నన్నిటిని నెమ్మదిగ త్రుంచివేయుము. పిమ్మట దానిలోపల 77-వ పటములోజూపిన ప్రకారముఒక సన్ననిదియు పొడుగునైన చిన్నకాయవంటి దుండును. ఇదియే అండాశయము. ఒక ఆకే ఇట్లు పరిణమించినదని గ్రహించుటకై యొక చిక్కుడాకును గైకొనుము. ఆయాకుయొక్క అంచులు పొడుగునను కలియునట్లుగా పటములో A1. లోజూపినట్లుగా మధ్య యీనెయొద్దకు మడువుము. అట్లుచేయునప్పుడు ఆకుయొక్క మధ్యయీనె యొక యోరగాను, ఆకుయొక్క చుట్టంచుకూర్పు ఒక యోరగాను, ఏర్పడును. ఇట్లు మడచిన ఆకుయొక్క అంచులు అంటుకొని పోవుటవలన నొకసంచి యేర్పడును.

స్త్రీ పత్రములు.

అట్టి సంచియొక్క మొదలును చివరయును సన్నముగను మధ్యభాగము లావుగను ఉండును. అందు చివరభాగము మిక్కిలిపొడుగుగ నెదిగి యొక కాడవలె నగును. దానికి కొనకాడయని పేరు. (76-వ పటములో కొ. కా. చూడుము). ఆకాడచివరనుండు గుండువంటి భాగమునకు కొనదిమ్మ యనిపేరు (కొ. ది.) ఈ కొనదిమ్మనుండి యెల్లప్పుడు నొక జిగురుపదార్థము స్రవించుచుండును. బోలుగనుండు గొట్టము వంటి మధ్యభాగమునకు పొట్టయని పేరు. దానిపొట్టయొక్క లోపలిభాగమున మధ్య ఈనెకు ఎదురుగనుండు అంచు పొడుగునను ఉబ్బి యొకతలగడవలె నేర్పడును. ఈతలగడకు అండపోషకమనిపేరు. ఈతలగడ హెచ్చుజాతి జంతువుల స్త్రీలగర్భమునందుండుమావి (Placenta) వంటిది. చిన్న చిన్నతొడిమలచే నీ మావి నంటిపెట్టుకొని కొన్ని యండాకృతిగల స్థూలబీజాశయము లుండును. ఈస్థూలబీజాశయములే గింజలగును. ఈగింజలు జంతుజాతిశిశువులవలెనే మావి ద్వారా తమ తల్లి గర్భముయొక్క గోడ నంటియుండుటజూడ నీ రెంటికి గలసారూప్యము వెల్లడికాగలదు. ఈ స్థూలబీజాశయము లను అండములు (అనగాగ్రుడ్లు) అనియు వాడుదురు. ఇట్టి అండములుగలతి త్తియే అండాశయము. సామాన్యముగా నిట్టిఅండాశయము ఒక్కొక పుష్పమునందు ఒక్కొక్కటియేయుండును. అట్టి పుష్పమునుండి యొక్క కాయయేపుట్టును. ఆ కాయయందు ఒక్కటే బిలము అనగా అరయుండును. కొన్నిపుష్పములందు అనేక అండాశయములుండి అనేక కాయలుపుట్టును. ఈ కాయలన్నియు నొక్క గుత్తిలోనుండును.

మరికొన్ని పుష్పములలోని అండాశయములన్నియు 78-వ పటములో 1 లో చూపబడిన ప్రకారము మధ్యభాగమునగాని 2 లో చూపబడిన ప్రకారము అంచునగాని అంటుకొనిపోయి ఒక్క కాయగా నేర్పడును. 79-వ పటములో బెండకాయను

అడ్డముగాకోయగా నేర్పడు రూపము చూపబడినది. అందు 7 బిలములు గలవు. ఒక్కొకబిలములో ఒక్కొకగింజ కనబడుచున్నది. అండాశయము లొకదానిప్రక్క నొకటి జేరియుండుటచేతనే నారింజ, పంపరపనస మొదలగువాని కాయలయందలి తొన లేర్పడుచున్నవి. ఇం దొక్క తొన యొక్కొక అండాశయము.

స్త్రీపురుషసంయోగము.

సామాన్యముగా నేక పుష్పమునందే పురుషపత్రములును, స్త్రీపత్రములును రెండును గలవని చెప్పియుంటిమి. ఇట్లుండినను ఒక పుష్పముయొక్క పురుష పత్రమునుండి యుద్భవించెడు సూక్ష్మ బీజములు ఆ పుష్పమునందలి స్త్రీ పత్రములోని స్థూలబీజములతో సంయోగము నొందవు. అట్లొకవేళ సంయోగమునొందినను, దానివలనగలుగు సంతానము మిక్కిలి బలహీనముగ నుండును. ఏలయన, ఆ బీజములు రెండు నొక పుష్పములో జన్మించిన వగుటచే అన్న చెల్లెండ్రవంటివి. మానవులలోసహిత మిట్టి వివాహ సంబంధములు గ్రాహ్యములు కావు. సంయోగమునకు రక్తసంబంధ మెంతదూరముగ నున్న నంత మంచిదని చెట్లుసహితము బోధించుచున్నవి. కావుననే మేనరికములు మొదలగు సమీప బాంధవ్యములు నిషేధింపదగినవి. ఇట్టి సంబంధములవలన కలుగు సంతానము బలహీనముగ నుండును. వంశపారంపర్యముగావచ్చు మతిభ్రష్టత, క్షయ, కుష్టు మొదలగు కొన్ని వ్యాధులు అట్టి వివాహసంబంధములచే తరతరములకు హెచ్చుచుండునని ఇప్పటి వైద్యులయభిప్రాయము.

ఇంతేకాక ఏకపుష్పమునందలి స్త్రీపురుషబీజములు సంయోగము నొందకుండ సృష్టియందలి కట్టుబాట్లు కొన్ని కానబడు చున్నవి.

1. ఒక్క పుష్పమునందలి స్త్రీపురుషబీజము లెన్నడును ఒక్కసారిగా వికసింపవు. సామాన్యముగా కొంజల్కములు ముందు వికసించును. అందలి సూక్ష్మబీజములు సంయోగమునకు సిద్ధముగ నున్నప్పుడు అండాశయము వికసింపదు. అనగా స్వకుటుంబములోని పురుషబీజము లన్నియు ఖర్చుపడువరకును స్త్రీ బీజములుయుక్త వయస్కములుగావు. కాన ఆ రెంటికిని సంయోగ మసాధ్యము. 2. మరియు స్త్రీపురుషబీజము లొక్కసారిగా వికసించిన పుష్పములలో సహితము, ఇట్టి యుపద్రవము గలుగకుండ, ఆ పుష్పములలోని స్త్రీ పత్రములు కింజల్కములకంటె మిక్కిలి పొడుగుగ నెదుగును. ఇందుచే పురుషబీజములు స్వకుటుంబములోని అనగా నేక పుష్పములోని అండాశయముపై బడనేరవు.

3. పురుషపుష్పములును స్త్రీ పుష్పములును ఒక్కటే గుత్తి యందుండు పుష్పములలో సహితము ఆ గుత్తియందలి మగపూవులయందుండు బీజములసంపర్కము దానియందలి ఆడపూవులకు గలుగకుండ కొన్ని యేర్పాటులు గలవు. 69-వ పటములోని ఆముదపుపూగుత్తినిచూడుము. అందలి ఆడపూవులు పై భాగముననున్నవి. మగపూవులు క్రిందిభాగముననున్నవి. మగ పూవులలోని పురుషబీజములు చెదరిపడినను అవి క్రింది వైపునకు పడునుగాని అదే గుత్తియందు పై భాగముననున్న ఆడపూవులపై సామాన్యముగా పడజాలవు. ఇందువలన దగ్గిర సంబంధములనువిడచి దూరపు సంబంధములలో వివాహమాడుట వృక్షములయుద్దేశమని తోచుచున్నది.

ప్రతిపుష్పమును దూరపుకుటుంబములోని పురుషబీజముల కాశించుచుండుటచేత నట్టి బీజములను తమకుసమకూర్చుటకు దూతలు కావలసియున్నారు. అట్టిదూతలు మూడుజాతులవారు గలరు. అందు మొదటివియు ముఖ్యమైనవియునగు దూతలు భృంగాదులు అనగా తుమ్మెదలును, తేనెటీగలును, చీమలును, రాత్రులయందు సంచరించుచుండు కొన్ని యితరములగు కీటకములును, రెండవదూత వాయువు మూడవదూత నీరు.

భృంగాదులు.

భృంగాదులు

పుష్పములు భృంగాదులను తమచక్కదనముచే నాకర్షించి తమ వాసనలచే నానందింపజేసి, తమ మకరందమును వానికి కానుకగా నిచ్చును. అందు కొన్ని పురుగులు దుర్వాసనయందు ఆసక్తిగలవగుటచేత, వానికి తృప్తి కలుగజేయుటకై కొన్నిపుష్పము లాదుర్వాసనలగూడ భరించియుండును. ఇంక నవి యెన్నెనో చోద్యములను చేయును. వీనినిగూర్చి యిచ్చట వ్రాయుటకు స్థలముచాలదు. ఈ భృంగాదుల రాకపోకలచే వీలుపడినంత యుపయోగమును పొందుటకుగాను కొన్ని పుష్పములు ప్రత్యేకమైన ఆకారములను గలవిగాగూడ సృజింపబడినవి. ఎట్లన, వానియందలి మకరందము పుష్పముయొక్క మొదటిభాగమున నెక్కడనో లోపలగా నొక ప్రత్యేకతిత్తిలో కూర్చి పెట్టబడును. దానిని త్రాగుటకై యీ భృంగాదులు పుష్పములపై గూర్చుండునప్పుడును, అవి వంగి మకరందమును త్రాగునప్పుడును, తటాలున లేచి ఎగిరి పోవునప్పుడును అనాలోచితముగా (Unconsclously) తమ శరీరముమీద కింజల్కములనుండి రాలెడు పురుషబీజముల ధరించి వానిని ఇతరపుష్పములలోనికి గొనిపోయి యందలి స్త్రీ పత్రముల కొసంగును.

ఇట్లు భృంగాదులశరీరమునుండి రాలిన అన్యపుష్ప కుటుంబములోని పురుషబీజము ఆండాశయముయొక్క కొనదిమ్మపై బడి దానినుండి స్రవించుచుండు జిగటపదార్థముచే దాని నంటుకొనిపో ఇట్టి దూత్యమునందు సూక్ష్మబీజము లనేకములు వ్యర్థపడిపోవును. ఈ నష్టమునకు సరిపోవునిమిత్తమే యిట్టి వృక్షములందు సూక్ష్మ బీజములు అమితముగ నుత్పత్తిజెందును.

3. నీరు.

నీటియందు పెరిగెడు కొన్ని జాతుల పుష్పములలో తమ్ము భరించు నుదకమే దూతగా నేర్పడి వాని వివాహసంబంధముల గూర్చును.

సంపర్కము.

సూక్ష్మ బీజము స్త్రీపత్రపు కొనయందలి దిమ్మమీదికి జేరుటకు సంపర్క మని పేరు. ఈ సంపర్కము (Pollination) రెండువిధముల గలుగుచుండుట జూచియుంటిమి.

(1) ఆత్మసంపర్కము (Self-Pollination):- ఒక పుష్పము నందలి సూక్ష్మ బీజములు ఆ పుష్పమునందలి స్త్రీపత్రపు కొన దిమ్మమీద కే జేరియుండుట.

(2) పరసంపర్కము (Cross-Pollination):- ఒక పుష్పముయొక్క స్త్రీపత్రపు కొనదిమ్మమీద ఇతరపుష్పములయొక్క పురుషబీజములు జేరుట.

ఈ రెంటిలో పరసంపర్కము మిక్కిలి తరుచుగ గలుగునదని చెప్పియుంటిమి.

పైని జెప్పబడిన రెండువిధములైన సంపర్కములలో నెవ్విధముచేతనయినను కొనదిమ్మమీదికి జేరిన సూక్ష్మ బీజము స్థూల బీజముతో నెట్లు సంయోగ మగునో తెలిసికొనవలయును. ఇందునకై స్థూలబీజము స్థూలబీజాశయమునందు ఎట్లిమిడియుండునో ముందు తెలిసికొనవలెను.

అండాశయము నొకదానిని నిలువున రెండుగా ఖండించి పరీక్షించునెడల దాని నిర్మాణమును దానియందలి స్థూలబీజాశయ నిర్మాణమును చూడగలము.

పుంజము. తొ - స్థూలబీజాశయముయొక్క తొడిమ. బీ. పీ-స్థూలబీజాశయపీఠము. ఆ. పొ-ఆవరణపుపొరలు రెండు. గ-స్థూలబీజాశయగర్భము. పిం. తి-పిండతిత్తి. స్థూ. బీ-స్థూలబీజము. స. క-సహాయకణములు. ప్ర. క-ప్రతిపాద కణములు. ఉ. జీ-ఉపజీవస్థానము. సూ. రం-సూక్ష్మరంధ్రము. పు. గొ-పుప్పొడి గొట్టము. దీనిగుండ సూక్ష్మబీజము సూక్ష్మ రంధ్రమార్గమున స్థూలబీజమును జేరును.

స్థూలబీజాశయముయొక్క సూక్ష్మనిర్మాణము.

అండాశయముయొక్క పొట్ట (పొ), కొనకాడ (కొ.క), కొనదిమ్మ (కొ. ది) అను మూడుభాగములనుచూడుము. దాని పొట్టలోపల స్థూలబీజాశయము (Ovule) ఒకటి బీజబంధకమను తొడిమ (తొ) చే నంటియున్నది. ఈ తొడిమనంటియుండు చోటునకు ఆనవాలుగనుండు మచ్చను కందిగింజ మొదలగు అనేక గింజలయందు చూడవచ్చును. దాని వెలుపలి సరిహద్దున రెండుపొరలు (Integuments ఆ. పొ) గలవు. ఈ పొరల లోపలితట్టున మెత్తని గుంజువంటిపదార్థముండును. ఈ పదార్థమునకు స్థూలబీజాశయ గర్భము (Nucellus) అని పేరు. ఈపొరలు రెండును ఇరువైపుల బీజాశయముయొక్క పీఠ (Base) మను మొదటిభాగమున పుట్టి స్థూలబీజాశయగర్భముచుట్టును చివరవరకువ్యాపించి పై భాగమునమాత్ర మొక చిన్నరంధ్రమునువిడచి తక్కినభాగముల నావరించియుండును. ఈరంధ్రమునకే సూక్ష్మరంధ్రము (Micropyle) అని పేరు. స్థూలబీజాశయగర్భమునందు సూక్ష్మరంధ్ర సమీపమున నొక చిత్రమైనకణము గలదు. దీనికి పిండతిత్తి (Embryo Sac) యనిపేరు. ఈకణమునందు ఇతరకణములం దుండురీతినే ఆవరణపుపొర నంటి కొంతయును, కిరణములుగా కొంతయును మూలపదార్థ ముండును. మధ్యభాగము చాలవరకు అవకాశముగానుండును. ఈయవకాశమునందు కణరస ముండును. ఇదిగాక యీకణమునందలి విచిత్రమేమనగా:- ఇందు సూక్ష్మరంధ్రసమీపభాగమున కణకవచములులేని మూడుకణము లుండును. వానిలో నన్నిటికంటె పెద్దది స్థూలబీజము (Magaspore), తక్కిన రెండుకణములు సహాయకణములు (Help Cells) అనబడును. వీని కెదురువైపున అనగా పీఠపువైపున ప్రతిపాదకణములు (Anti-Odal Cells) అనుమూడుకణము లుండును. పిండతిత్తియొక్క మధ్యభాగమున మూలపదార్థములో నిమిడి ఉపజీవస్థానము (Second-y Nucleus) అను స్ఫుటమైన జీవస్థానము గలదు. ఇంతవరకు స్థూలబీజాశయ నిర్మాణము.

ఇక కొనదిమ్మమీద జేరిన సూక్ష్మబీజముయొక్క నిర్మాణమును పరీక్షింతము.

సూక్ష్మబీజముయొక్క సూక్ష్మనిర్మాణము.

ప్రథమమున సూక్ష్మబీజ మేకకణము. కాని యదికొనదిమ్మను జేరకమునుపే రెండుకణములుగా విభజనమగును (81-వ పటముచూడుము). అందొక కణముచిన్నది. (ఉ. క); ఇది పెద్దకణముయొక్క మూలపదార్థములో థారాళముగ తిరుగుచుండును. ఈ చిన్నకణమునకు ఉత్పాదకకణము (Generative Cell) అనిపేరు. అనగా నిది సృష్టించుశక్తిగలది. రెండవది అనగాపెద్దకణము పాలకకణము (Vegetative Cell) అనగా పెంచునట్టి శక్తిగలది; పటములో పా. జీ. దీని జీవస్థానము. స్త్రీపత్రముమీద పడకమునుపుగాని లేక పడినతోడనేగాని యుత్పాదకకణము రెండు ఉత్పాదకకణము లగును. ఈకణములకు కణకవచములుండవు. ఇటుపై గలిగెడు మార్పులన్నియు సూక్ష్మబీజము స్థూలబీజాశయముయొక్క కొనదిమ్మమీద ప్రవేశించినతరువాతనే గలుగును.

సూక్ష్మ స్థూలబీజములసంయోగవిథానము.

కొనదిమ్మపై స్రవించు పదార్థముల శక్తియేమో కాని, సూక్ష్మబీజము దానిపై బడగానే అది మిక్కిలి చురుకుగా పెరుగ నారంభించును. దానియందలి పాలకకణ మేదో యొక చోట తన కవచమును పగుల్చుకొని కొనదిమ్మలోని కొక గొట్టముగా పెరుగును. ఈగొట్టమునకు పుప్పొడిగొట్టము (Pollen tube) అని పేరు. ఈపుప్పొడిగొట్టము త్వరలోనే కొనకాడగుండ చొరచుకొని అండాశయముయొక్క పొట్టలోనికి ప్రాకును. పిమ్మట నిది సూక్ష్మరంధ్రమార్గమున స్థూలబీజాశయములోనికిజేరును. తరువాత నీగొట్టము స్థూలబీజాశయగర్భము గుండ ప్రాకి పిండతిత్తిలోని స్థూలబీజముయొక్క సాన్నిధ్యమునకు జేరియుండును. ఇప్పటికి సూక్ష్మబీజములోని యుత్పాదకకణములు రెండును పుప్పొడిగొట్టముయొక్క చివరభాగమునకు దిగియుండును. అందొక యుత్పాదక కణము స్థూలబీజముతో సంయోగమునొంది దానితో నైక్యమగును. ఈ ఉత్పాదకకణముయొక్కయు స్థూలబీజముయొక్కయు జీవస్థానములు మిశ్రమై యేకజీవస్థానమేర్పడుటయే పిండోత్పత్తి. హెచ్చు జాతి జంతువులలోగూడ నిట్లే స్త్రీపురుషబీజముల సంయోగము చేతనే పిండ మేర్పడుచున్నది. ఇట్టి పిండోత్పత్తివలన నేర్పడిన కణమునకు సంయుక్త బీజమనిపేరు. ఈ సంయుక్తబీజము తనచుట్టును దళమైన కణకవచ మేర్పరచుకొని యింతటినుండియు అండ మనబడుచున్నది.

పైన చెప్పబడిన సంయోగబలిమచే స్థూలబీజమునందును, స్థూలబీజాశయమునందును, అండాశయమునందును అద్భుతమైన మార్పులు గలుగును. ఈమార్పులయొక్క పర్యవసానముగా గింజయును కాయయు నేర్పడును.



  1. * అండాశయము:- మొదటి కూర్పు నందు దీనినె పుష్పగర ము అని వాడియుంటిమి. ఆ. ల.