Jump to content

జీవశాస్త్ర సంగ్రహము/రెండవ భాగము/ఆరవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఆరవ ప్రకరణము.

కాయ (The Fruit)

అయిదవప్రకరణమునందు మనము చూచియుండిన స్త్రీపురుషబీజముల సంయోగముచేత నేర్పడిన సంయుక్తబీజము సంయోగబలిమిచేత నవీనమైనశక్తిగలిగిన దగును. ఈశక్తివలన స్థూల బీజమునందును, స్థూలబీజాశయమునందును, అండాశయమునందును గూడ ననేకమార్పులు కలుగును. స్థూలబీజాశయము నందలి మార్పులవలన పరిణమించిన భాగమునకు గింజయని పేరు. అండాశయముయొక్క పరిణామరూపమునకు కాయయని పేరు. కాని యొకానొకప్పుడు అండాశయమునందేగాక పుష్పముయొక్క సంరక్షణపత్రములు, ఆకర్షణపత్రములు మొదలగు నితరభాగములలోగూడ విచిత్రమైన మార్పులు పై జెప్పబడిన స్త్రీపురుషబీజసంయోగ బలిమిచేగలుగును. అట్టి హెచ్చుమార్పు చేగలిగిన నిర్మాణములనుగూడ మనము సామాన్యముగా కాయలని వాడుచున్నను అవి నిజమైన కాయలుకావు. పనసకాయను చూడుము. ఇదియొక గుత్తిగానుండెడు యనేక పుష్పముల అండాశయములనుండి పుట్టిన యనేక కాయల సమిశ్రణముచే నేర్పడినకాయ. ఇట్టివానికి దొంగ కాయలనిపేరు. ఇందొక్కక తొన యొక్కొక నిజమైనకాయ.

కాయయొక్క ఉపయోగములు.

ఒక చెట్టుయొక్క కాయలన్నియును ఆ చెట్టుక్రిందనే రాలి పడియుండవలసినయెడల వానినుండి పుట్టు మొక్క లన్నియు సూర్యరశ్మి లేని కారణముచే క్రమముగా నశించిపోవును. సృష్టియందలి సమస్త జీవకోట్లయొక్కయు కడపటియుద్దేశము. తమ జాతిని సంతానవృద్ధిచే పెంపొందించుట యని యిదివరలో చెప్పియుంటిమి. ఇట్టి సృష్టివిధానము (Natural Law) నుబట్టి చెట్లు తమజాతిని వృద్ధి జేయుటకుగాను, తమ విత్తనములను తిరిగి వృక్షములగుటకు తగినస్థలములందు చేర్చవలసియున్నది గదా?

ఇట్టి వ్యాపకమును జేయునిమిత్తమై చెట్లు అనేక బంటుల నేర్పరచుకొనియున్నవని చెప్పవచ్చును.

1. జంతువులు:- వీనిచే తినబడిగాని వీని శరీరముల నంటిగాని యనేకగింజలు స్థలాంతరము జేరును. జంతువుల నాకర్షించునిమిత్తమై వృక్షములు తమ కాయలయం దేదో యొకభాగమున కొంత లంచమును జేర్చియుండును. ఉదా:- వెలువెల్లను చేదుగనుండు వేపచెట్టుసహితము తన గింజలకు అధిక వ్యాప్తి నిచ్చుటకై వానిచుట్టును తియ్యని గుంజును జేర్చియుంచును. ఈ గుంజున కాశపడి కాకులు మొదలగుజంతువులు వానిని మ్రింగి యందలి తియ్యనిలంచమును గ్రహించి దానికి ప్రత్యుపకారముగా నావృక్షముయొక్క గింజలను స్థాలాంతరమునకు జేర్చును. ఉత్తరేణి, అంట్రింత, చిగిరింత మొదలగు మొక్కలయొక్క కాయల యుపరితలమున నూగువంటి ముండ్లుండుటచే తమ్ము తాకుటకు తటస్థించిన పదార్థముల నవి యంటుకొని వానిమూలమున స్థలాంతరమునకు బోయి చేరును. 2. వాయువు:- కొన్ని కాయలు టపేలున పగిలి వాని యందలిగింజలు గాలికెగిరి దూరమునకు పోయిపడును. ఆముదపు గింజలు, బెండగింజలు, ప్రత్తిగింజలు మొదలగునవి. 82-వ పటము చూడుము.

ప్రత్తిగింజల చుట్టును అంటియుండు ప్రత్తిపోగులు ఆగింజయొక్క రోమములు. మనతలమీదనుండు వెండ్రుకలు మన కెట్టివో, అవియు నాగింజ కట్టివియే. అయినను వానియుపయోగమునందు భేదము కలదు. ఇట్టి తేలికైనరోమముల సహాయముచే నీగింజలు ఎగిరిపోయి మరియొకచోటికి జేరగలవు.

చీపురుముండ్ల తోకలుండుట వానియందలి గింజలను స్థలాంతరమునకు గాలిలో నెత్తుకొనిపోవుటకు రెక్కలుగా నుపయోగించు నిమిత్తమే యని యెరుంగునది.

3. నీరు:- కొన్నిగింజలపై నేర్పడియుండు కవచములు నీటిని చొరనియ్యనివగుటచేత నా గింజ లెంత దూరమైనను నీటిలో కొట్టుకొనిపోయి తగినస్థలము దొరికినప్పుడు మొలచును. ఉదా:- కలువయు, తామరయు, గల్జేరు, లింగమిరము మొదలగు గడ్డిజాతుల విత్తనములును ఈవిధమున వ్యాప్తినొందును. ఇట్టిగింజలు పక్వమునకు రాకమునుపే నీరు గింజలలోనికి ప్రవేశించినయెడల ఆగింజలు క్రుళ్లిపోవును. ఈయవాంతరము గలుగకుండ వానిపై పొరలలో నేదో యొకటి మిక్కిలిదట్టమై నీటిని చొరనియ్యనిదగును. ఈతగింజ, మామిడి టెంక వీని యొక్క దృఢమైనకవచములను చూడుము.

కాయయొక్క సూక్ష్మనిర్మాణము.

స్త్రీపురుషబీజముల జీవస్థానములు మిశ్రముకాగానే అనగా పిండోత్పత్తికాగానే సహాయకణములు హరించి పోవును.

యుక్తబీజము ప్రథమమున రెండు కణములుగా చీలును. అందు క్రిందికణము పిండకణము. పైకణము ఉపరికణము. 86-వ పటములో A-చూడుము.

ఈ పిండకణము సమకోణములుగానుండు మూడుకోతలచే నెనిమిదికణములుగా చీలి అవి మరల, 16, 32, 64, ఇత్యాది యనేక కణము లై యాకణము లన్నియు గూడి యొక బంతివలె గుండ్రముగ నుండు కణసముదాయ మగును. ఇది యనేకకణములుగల మల్బెరీదశ (205-వ పుట చూడుము) యని చెప్పనగును. ఉపరికణముగూడ కొన్ని కణములుగా చీలి యాకణములన్నియు నొక గొలుసువలె నొకదానికొన నొక టంటియుండును.

ఈ గొలుసుమూలమున మల్బెరీపిండము పిండతిత్తియొక్క గోడనుండి వ్రేలాడు చుండును (పటములో C). పిమ్మట నీకణములలో ననేకమార్పులు గలిగి తుదకు గొలుసునుండి చిన్నముక్కువలె నుండెడు ప్రథమమూలము (Radicle) అను వేరుయొక్క ప్రాతిపదికయగుభాగమేర్పడును. 86-వ పటములో E లో ప్ర. మూ. చూడుము. బంతివంటి క్రిందిభాగమునుండి ఆయాజాతుల ననుసరించి యొకటిగాని రెండుగాని బీజదళములును (Cotelydons బీ. ద.), ప్రథమశాఖాంకురమును (ప్ర. శా Plumule) అనగా మొట్టమొదటి కొమ్మయొక్క అంకురమగు మొటిమయును నేర్పడును. పై జెప్పినవిషయముల గ్రహించునిమిత్తమై మొట్టమొదట రెండు బీజదళములుగల జాతిలోనిదగు చిక్కుడుకాయను పరీక్షించి చూడుము.

చిక్కుడుకాయయొక్క నిర్మాణము.

చిక్కుడుకాయపై నెండియుండెడు గుల్ల చిక్కుడుపూవునందుండు ఒక అండాశయముయొక్క పొట్ట; దీనికే ఫలకవచమనిపేరు. దీని మొదటిభాగమున తొడిమ గలదు. చివరభాగమున చిన్న కాడ ముక్కువలె వంగియుండును; ఇది కొనకాడ. కాయలోపల నొక్కటె అర గలదు. కాయయొక్క నడిమియీనెకు ఎదురుగనుండు తలగడవంటి దిమ్మ నంటియుండు గింజలు స్థూలబీజాశయములు. ఈ తలగడకు అండపోషకమని పేరు. అండపోషకమనగా గింజలకు అండాశయముయొక్క పొట్టనుండి యాహారము తెచ్చి పోషించుమావి. ఈగింజలను ఒకదినము నాననిచ్చి యందొక దానిని క్రింది విధమున పరీక్షింపుము. ఈ గింజయొక వైపున వెలుపలి కుబ్బి వట్రువగను మరియొక వైపున నడుమ లోటుపడి గుంటగను ఉండును. లోటుగనుండు వైపునం దొకభాగమున తెల్లనిమచ్చయొకటి గలదు. ఈ మచ్చ అండాశయము యొక్క తలగడను గింజ యంటియుండుచోటు. ఇట్లు నానినగింజను కొంచెము నొక్కినయెడల నీ మచ్చప్రక్క నుండెడి యొక చిన్న రంధ్రముగుండ నొక నీటిచుక్క బయలువెడలును. ఈ రంధ్రమే సూక్ష్మరంధ్రము. పిమ్మట నీ గింజపైనుండు పొట్టును వెలుపలనుండి లోపలివైపునకు ఒలువుము. ఈ పొట్టునందు రెండుపొరలు అతుకుకొని యుండును. అందు లోపలివైపుననుండు పొర మిక్కిలి పలుచనిది. ఇవి రెండును

బీజకవచములు; అనగా గింజను కాపాడుపొరలు. ఈ పొరలను రెంటిని ఒలిచివేయగా వానిలో రెండు పప్పుబద్దలు కానబడును. ఇవియే బీజదళములు. ఈ బద్దలను రెంటిని రెండువైపులకు 88-వ పటములో జూపినట్లు విడదీసిచూడుము. ఇట్లు విడదీయగా రెండు బద్దలమధ్య కొక్కెమువలె పై వైపునకు వంగిన మొనగలభాగమొకటి మచ్చసమీపమున గానవచ్చును. ఇది ప్రథమమూలము (Radicle)

దీని క్రిందిభాగమున దీనితో జేరి కోమలమైన తెల్లని చిన్నఆకులు రెండు ముడుచుకొని మొగ్గవలె, రెండు బద్దల మధ్య నిమిడియుండును. ఈ చిన్న చిన్న యాకులుగల భాగమునకే ప్రథమశాఖాంకురము (Plumule) అని పేరు. ఇదియే మొక్కగా పెరుగునట్టి భాగము. షరా:- బాదము కాయలోపలనుండు బీజదళములు ఆకులవలె పలుచనివిగను, విశాలమైనవిగను ఉండును. ఇవి చుట్ట చుట్టుకొని గింజలోపల నణగియుండును. ఈ యాకులనె మనము బాదము పప్పు అని చెప్పుచు తినెదము. లేతబాదము కాయలోని పప్పును విడదీసిచూడుము.

ఈ గింజలను భూమిలో పాతిపెట్టినయెడల తగినతరుణమున నవి మొలక లెత్తును. అప్పుడు ప్రథమమూలము వేరుగా పరిణమించి గింజపై నుండు పొట్టు పొరలను అనగా బీజకవచములను పగుల్చుకొని భూమిలోనికి బోవును.

ప్రథమశాఖాంకురము భూమిపైకి పెరిగి ఆకుపచ్చని ఆకులను, శాఖలను గలది యగును. ఆ చిన్న మొక్కకు ఆకుపచ్చని యాకులు గలిగి యాహారమును సంపాదించుకొనుశక్తి గలుగువరకు దానికి బీజదళము లాహారమిచ్చి పోషించుచుండును. ఇట్లు చిక్కుడుగింజయందేగాక, ద్విబీజదళవృక్షములలో జేరిన ప్రతిగింజయందును పైనివివరింపబడిన ప్రథమమూలమును, ప్రథమశాఖాంకురమును, రెండు బీజదళములును గల పిండ ముండును. ఇట్లు రెండు బీజదళములుగల పిండములనుండి యుద్భవించెడు చెట్లే ద్విబీజదళ వృక్షములు. ప్రక్కననుండు వేపమొక్కయొక్క పటమును రెండవభాగముయొక్క ఆరంభముననుండు చింతమొక్కయొక్క పటమును చూడుము. ఇవి రెండును ద్విబీజదళవృక్షములే.

ద్విబీజదళవృక్షముయొక్క నిర్మాణము.

స్థూలబీజాశయమునందలి యితరమార్పులు.

పిండతిత్తియందలి యుపజీవస్థానము చీలిచీలి యనేక భాగములగును. ఈభాగములచుట్టును కొంత మూలపదార్థము చేరి యనేకకణము లేర్పడును. కొన్ని గింజలయందు మావిగుండ అండాశయములనుండి కొంతయాహారము పిండతిత్తిలో జేరి యాపిండతిత్తిని పూర్ణముగ నిండించివేయును. ఈ పదార్థమునకు బీజపోషకము (Endosperm) అనిపేరు. ఆముదపుగింజలోని చమురు నిలిచెడుభాగమును, కొబ్బరికాయయందలి తినుట కుపయోగించు గుంజును దానిలోపలి నీరును, ఈతగింజలోని గట్టిబారిన భాగమును వాని బీజపోషకములయొక్క రూపములే. బీజపోషకములును బీజదళములవలెనే లేతమొక్కకు ఆహారముగా నుపయోగపడును. సామాన్యముగా స్థూలబీజాశయగర్భము పిండము పెరిగినకొలదిని హరించిపోవును. కొన్నిటిలో మాత్రము ఈభాగములోగూడ కొంత యాహారపదార్థము చేరియుండును. దీనికి బీజపరిపోషకము (Perisperm) అనిపేరు. మిరియపుగింజలో నిట్టిది గలదు. ఈవిషయములను తెలిసికొనునిమిత్తము బీజపోషకముగల గింజ నొకదానిని పరీక్షించి చూడవలయును. ఈపర్యాయము ఏకబీజదళ వృక్షములలో నేదైననొకదాని మొలకను పరీక్షించి చూతము.

ఏకబీజదళవృక్షముయొక్క మొలక.

ఈతకాయను మీరందరు చూచియుందురు. దాని పైభాగముననుండు పలుచని తొక్కయును దాని లోపలిగుంజును ఫలకవచములోని భాగములు. గుంజు తినివేయగామిగులుభాగము గింజ. గుంజునకు లోపలివైపున పలుచనిపొర యొకటి గలదు. ఈపొర దానిలోపలి తట్టుననుండెడి కఠినమైన భాగమును కప్పియుండును.; ఇది బీజకవచము. దీనిలోపలనుండు కఠినమైనభాగము పిండతిత్తినుండి పుట్టినది; దీనికి బీజపోషకమని పేరు. కొబ్బరికాయలో మనము తినుచుండెడు భాగముకూడ ఈబీజపోషకమేయని క్రింద చదువగలరు. కాని ఈతకాయలో ఈభాగము గట్టిగనుండి రుచిహీనముగా నుండును. దీనిలోపల చిన్న మొటిమ గలదు; ఇది నిజమైన పిండము.

ఈతగింజ నొకదానిని తడినేలలో మొలవేసినయెడల దానినుండి క్రమముగ నొక చిన్నముక్కువలె వంగియుండు మొటిమ పుట్టి యామొటిమ దానిపై పొరలను పగుల్చుకొని భూమిలోనికి పోవును. ఇది ప్రథమమూలము; 90-వ పటములో క్రిందిభాగముననుండు వేరుయొక్క ప్రథమరూపమును జూడుము. దీనిపైభాగమున నుండి ఆదోకగనుండు మొలకయొకటి భూమినిపగుల్చుకొని బయటబడును. ఈమొలక ప్రథమశాఖాంకురము. దీనినుండి ఈత చెట్టు అంతయుపుట్టును; పటములో 2 చూడుము. ఈమొలక చుట్టుదళమైన పెచ్చువంటిభాగము అంటియుండును. ఈదళమైనభాగము బీజదళము. దీనికొకప్రక్కగా వ్రేలాడుచుండునది బీజపోషకము. ఇది గట్టిగనుండి నీటిని అంతగా చొరనియ్యని పదార్థమగుటచేత ఇప్పటికిని దీని ఆకారము ఈతగింజవలెనే యుండును.

ఈపటము, 70,75,79,82,83,86,87,92,94,96,మొదలు 104 వరకు నుండు సంఖ్యలుగల పటములు అరవభాషలో కె.రంగాచారి, యెం.,యెల్.టి., గారిచే వ్రాయబడిన వృక్షశాస్త్రమునందలి చక్కని పటముల ననుసరించి వారియనుమతిబడసి వ్రాయబడినవి. - ఆ.ల. తాటితేగలలో మనము తినునట్టిభాగము ఈ బీజదళమే. ఇందు వరిపిండి, చక్కెర మొదలగు ఆహారపదార్థములు కొంత పీచువంటిపదార్థములో నిమిడియున్నవి. ఇది లేతమొక్కను మొట్టమొదట కొంతకాలమువరకు పోషించునిమిత్త మేర్పడినది. ఇట్టిబీజదళము తాడి, ఈత, కొబ్బరి, వరి, జొన్న మొదలగు కొన్ని మొక్కలలో ఒక్కటియే యుండును. కావుననే వాని కేకబీజదళవృక్షములను నామము పుట్టెను.

పిండోత్పత్తి అయినపిమ్మట సంయుక్తబీజము పైనజెప్పిన ప్రకారము ప్రథమమూలము ప్రథమశాఖాంకురము మొదలగు భాగములుగా పరిణమించుచుండగా స్థూల బీజాశయములోని గర్భము, పిండతిత్తి మొదలగు ఇతరభాగములుకూడ నొకానొక సమయమునందు మార్పులజెందును.

పైన వివరించినమార్పులను జూడ స్థూలబీజాశయమే సామాన్యముగా గింజగా నేర్పడు భాగ మని తెలియగలదు. ఇట్లు పరిపక్వమునొందిన స్థూలబీజాశయమునే అండమనియు వాడుదురు. ఈ అండములు గల అండాశయమే కాయ యగునది.

అండాశయమునుండి పరిణమించుభాగములు.

స్థూలబీజాశయమునుండి పరిణమించిన గింజ యొకటిగాని యనేకములుగాని పొట్టలో కలిగిన అండాశయమే కాయగా నేర్పడుచున్నది. ఎట్లన అండాశయముయొక్క పొట్టయే సామాన్యముగా కాయపై నుండెడు తొక్క, గుల్ల యనబడు పై భాగము. ఈ భాగమునకు ఫలకవచము (Pericarp) అని పేరు. ఉదా:- కందిగింజలను కాపాడుటకై వానిపై గప్పియుండు కాయగా నేర్పడుగుల్ల ఫలకవచమే.

ఫలకవచమునందలి భేదములు.

కొన్ని కాయలలో ఫలకవచము మొత్తనిదిగనుండును. వంకాయ, మామిడికాయ, పొన్నకాయ, ద్రాక్షకాయ, అరటికాయ మొదలగునవి. వీనికి గుంజుకాయలు (Sacculent Fruits) అని పేరు. వీనినే రసయుత ఫలము లనియు చెప్పుదురు.

ఫలకవచము కొన్ని కాయలలో నెండి గుల్ల యగును. ఇట్టి కాయలకు ఎండుకాయలు (Dry Fruits) అనిపేరు. వీనికి శుష్కఫలములనియు పేరు. ఉదా:- కందికాయ, చిక్కుడుకాయ, చింతకాయ మొదలగునవి.

గుంజుకాయలు.

గుంజుకాయలలో టెంకకాయలు కండకాయలు అని రెండు ముఖ్యభేదములు గలవు.

మామిడి, పొన్న మొదలగుకాయలలో ఫలకవచముయొక్క వెలుపలి భాగమున నుండు పదార్థము మెత్తగనే యుండి లోపలిభాగమున నుండు పదార్థము గట్టిపడి టెంక యగును. అట్టికాయలకు టెంక కాయలు (Drupes) అని పేరు. వీనికి శిలాఫలము లని నామాంతరము.

వంకాయ, ద్రాక్షకాయ, పుచ్ఛకాయ మొదలగు కొన్నికాయలలో ఫలకవచము మిక్కిలి పలుచగ నుండి దానిలోపల గుంజు పెరుగును. వీని గింజ లీగుంజులో నిమిడియుండును. అట్టికాయలకు కండకాయలు (Berries) లేక మృదుఫలములు అని పేరు.

అరటికాయ కండకాయలలోనిదే. దానిగింజలు కాయయొక్క మధ్యభాగమున మూడు నాలుగు వరుసలుగానుండి నల్లనల్లగ కనబడుచుండును. కాని ఈగింజలయొక్క ఉపయోగము లేకయే దుంపలమూలమున సంతానవృద్ధి గలుగుచున్నందున, ఈగింజలకు మొలచునట్టి అలవాటు తప్పిపోయినది.

కొన్ని కండకాయలలో ఫలకవచముయొక్క వెలుపలిభాగము గట్టిపడి పెచ్చు అగును. ఉదా:- గుమ్మడి, బూడిదగుమ్మడి, పందిరి దోస, వెలక్కాయ మొదలగునవి. వీనిని శిలాఫలము లనగూడదు. పరీక్షించి చూడగా ఫలకవచమునందు మూడుభాగములున్నట్లు తోచుచున్నది.

I. వెలుపలిభాగము, లేక బాహ్యఫలకచము (Epicarp)

II. మధ్యభాగము లేక మధ్యఫలకవచము (Mesocarp)

III. లోపలిభాగము లేక అంతర్ఫలకవచము (Endocarp) ఈమూడు భాగములయొక్క వివరమును చక్కగ గ్రహించు నిమిత్తమై మామిడికాయను నిలువున కోయగా నేర్పడినచెక్కయొక్క

ఆకారమును చూపు 93-వ పటమును చూడుము. 1. అందు వెలుపలి భాగమున నున్న నల్లని గీటువలె కనబడునది (5) బాహ్య ఫలకవచము. ఇదిపచ్చి కాయలో నాకు పచ్చగను, పండుకాయలో సామాన్యముగ పసుపుపచ్చగను ఉండు తొక్క. II.పటములో 4:- ఇది మధ్యభాగమున నుండు గుంజు. ఇది పచ్చికాయలో తెల్లగను గట్టిగను సామాన్యముగ పుల్లగను ఉండును. పండుకాయలో పలుచబడి రసమగును. దీనికి మధ్య ఫలకవచము అని పేరు. కాయయొక్క జాతినిబట్టి ఈభాగమునందు కొద్దిగనో హెచ్చుగనో పీచు కూడఉండును. III.పటము 3 అంకెగలది గట్టిగనుండు టెంక. ఇది అంతర్ఫలకవచము.

2:- ఇది టెంకలోపలిభాగమున ఉల్లిపొరవలె పలుచగనుండు గోధుమరంగుగల పొర; ఇది గింజపై నుండు పొర; దీనికి బీజకవచము అనిపేరు. 1:- ఇది టెంకలోపలనుండు తెల్లనిజీడిపెచ్చుల రెంటిలో నొకటి; ఇది యొక బీజదళము. రెండు బీజదళములమధ్య నొక భాగమున కొక్కెమువలె వంకరతిరిగిన చిన్న మొలక యొకటుండును; ఇదియే మామిడిచెట్టుగా నేర్పడు పిండము.

కొన్ని గుంజుకాయలలో ఫలకవచముయొక్క లోపలి వైపుననుండు భాగము అనేక అరలుగా నేర్పడియుండును. నిమ్మ, పంపరపనస మొదలగు కాయలలోని యొక్కొక తొన యొక్కొక అర. కాయపై నుండెడు తొక్క బాహ్యఫలకచము. దీని లోపలిభాగమున దూదివలె మొత్తగనుండు భాగము మధ్యఫలకవచము. తొనలపై నుండు తొక్క అంతర్ఫలకవచము. రసముతో నిండియున్న ముత్యములనబడు కోమలమైన భాగములు అంతర్ఫలకవచమునుండి పుట్టినరోమములు. ఈరోమములోనుండు పలుచనిపదార్థము కణరసము. తొనయొక్క అంచు నొక దాని నంటియుండు గింజలను పరీక్షించిన వానియందలి బీజకవచములు, బీజదళములు, పిండము మొదలగువాని నిర్మాణము తెలియగలదు.

ఇట్లే బీరకాయలోగూడ ననేక అరలు గలవు. గుమ్మడికాయలో నొక్కటే అరగలదు.

ఎండుకాయలు.

ఫలకవచము ఎండిపోవుకాయలలో సహితము అనేక భేదములు గలవు. ఎట్లన, ఉలవ, గిలిగిచ్చ, అవిసె, చిక్కుడు, కంది, తురాయి మొదలగుకాయలలో అర ఒక్కటే యుండును. బెండకాయ, ఆముదపుకాయ మొదలగువానిలో అనేక అర లుండును; క్రిందిపటములు చూడుము.

ఇందు కొన్ని కాయలు పూర్ణముగ ఎండినతరువాత ఫట్టున పగిలి గింజల వెడల జిమ్మును. వీనికి పగులుకాయలు (Dehiscent) అనిపేరు. వీనికి విదారణఫలములు అనియు పేరుగలదు. కాని మరికొన్ని కాయల కవచము ఎండినను కాయ పగులదు.ఉదా:- చింతకాయ వడ్లగింజ మొ. వీనికి గట్టికాయలనియు, అవిదారణ ఫలములనియు పేర్లు.

పగులుకాయలు.

పగులు కాయలలో మూడుభేదములు గలవు.

1. కాయయొక్క రెండుప్రక్కలయందును ఈనెలుండి రెండువైపులను పగి లెడుకాయలు ద్వివిదారణఫలములు. (Legume) ఉలవకాయ. కందికాయ, చిక్కుడుకాయ మొ.

ఈజాతియందు చెట్లు రాత్రులయందు నిద్రపోవునని కొందరి యభిప్రాయము. ప్రొద్దు గ్రుంకినతోడనే వీని ఆకులన్నియు ముడుచుకొనుటచే నివి నిద్రించున ట్లగపడుటను మీరును చూచి యుందురు.

ద్వివిదారణఫలములు

1. తురాయికాయ. 2. ఉలవకాయ. 3. గిలిగిచ్చకాయ. - వీనియందు ఒక్కటే అరగలదు.

2. కొన్ని కాయలకుఒక్క టేయీనెయుండి, ఆ యీనెమార్గమునే అవి పగులును. వీనికి ఏకవిదారణ ఫలములు (Follicle) అనిపేరు. ఈ పగులు సామాన్యముగా అండాశయముయొక్క అంచులు అంటుకొనుటచే నేర్పడిన తలగడవైపున నుండును. జిల్లేడుకాయవంటి కొన్ని కాయలు ఈజాతిలో జేరినవి.

3. పై జెప్పిన ఎండుకాయలలో ఒక్కటే అరయుండును. కాని బెండ, గంగరావి మొదలగు మరి కొన్ని కాయలలో అనేక అరలుండును. ఇవి అనేక మార్గముల పగులును 96-వ పటముచూడుము. వీనికి బహువిదారణఫలములు (Capsules) అని పేరు. ఇందు కొన్ని కాయలలో గింజ అరలోపలకు పగులును. బెండకాయ చూడుము.
మరి కొన్ని కాయలలో అరలుయొక్క గోడలు విచ్చిపోయి ఏ అర కా అర వీడిపోవును. ఆముదపుకాయయొక్క పటమును చూడుము.

ఈఅరలయొక్క గోడలు ఇప్పుడు పగులకుండుట చేత అరలలోని గింజలు తమ అరలలోపలనే యుండును. ఈ కాయలు పగులునప్పుడు, వాని అరలు గింజలసహితముగా ఎగిరిపోవును. ఈ అరలు తిరిగి కొంతకాలము వరకు ఎండినపిమ్మట పగిలి వానినుండి గింజలు బయలువెడలును.

98-వ పటము.

తుమ్మకాయ, సీమచింతకాయ మొదలగు కొన్ని కాయలలో ఒక గింజకు మరియొక గింజకు మధ్యమున నుండు ఫలకవచము నొక్కుకొనిపోవును. ఇట్టి కాయలలో కొన్ని, యెండినప్పుడు వానిగింజల మధ్యనుండు సంధులలోవిరిగి వేరు వేరు కాయలుగా నేర్పడును.

గట్టికాయలు.

మనము వడ్లగింజ అని చెప్పునది నిజమైనకాయ. గింజకాదు చిట్టు అగుభాగము ఫలకవచము. బియ్యపు గింజపై నుండు కొంచె మెర్రరంగుగల పలుచనిపొర బీజకవచము. ఈభాగము తవుడు అగును. ఈపొరయు దీనిలోపలిభాగములును చేరినభాగము నిజమైనవరిగింజ. మనము తినుబియ్యపుగింజ బీజదళము. బీజదళము ఈకాయలో నొక్కటేగలదు. కాన వరియొక్క ఏకబీజదళవృక్షము. వడ్లగింజయం దొకకొన నంటియుండు చిన్న కొక్కెమువలె నుండు భాగమే పిండము.

చింతకాయ, వడ్లగింజవీనివంటి యెండినను పగులని కాయలకు గట్టికాయలు (Indehiscent) అని పేరు. వానిని అవిదారణఫలము లనియు చెప్పవచ్చును.

వెలగ కాయయొక్క వెలుపలిభాగము ఎండి కఠినమైన పెంకుగానయినను అది కండకాయలలో నిదే. కొబ్బరికాయలో ఫలకవచముయొక్క వేరువేరుభాగములు వేరువేరుమూర్పులను జెందియున్నవి. అయినను ఇది నిజమైన కాయయేగాని దొంగకాయకాదని తెలిసికొనవలెను. ఇది మామిడికాయవలెనే యొక టెంకకాయ. పటముచూడుము.

కాయయొక్క వెలుపలి తట్టుననుండు నారగలడొక్కలును పెంకుయును గూడ ఫలకవచముయొక్క భాగములు. వీనికి సంబంధించినభాగములు ఈతకాయ ఖర్జూరపు కాయలలో తియ్యగను మెత్తగను ఉండును. పెంకులోపలి భాగము మాత్రమే గింజ. ఈగింజయొక్క పై భాగముననుండు పలుచని గోధుమరంగుగల పొరయే బీజకవచము. ఈపొరలోపలి తెల్లని తియ్యని భాగమును, నీళ్లును బీజపోషకము అనుభాగము. ఈతకాయలోన బీజపోషకము మిక్కిలి గట్టిపడి సాధారణముగా గింజ యనబడుచుండును.

కొబ్బరికాయ మూడు అండాశయముల సంమిశ్రణముచే నేర్పడినది. అందుచే దానియందు-మూడు అరలుగలవు. అందు ఒక్కటి మాత్రము సంయోగమైన తరువాత పెద్దదై వృద్ధిపొం దును. తక్కినరెండును పెరుగవు. అనగా వానినుండి గింజపుట్టదు. కొబ్బరికాయ యొక్క ముచ్చికక్రింద మూడుమొటిమ లుండును. ఈమూడును మూడు అరలయొక్క గుర్తులను చూపట్టును. అందు ఒకమొటిమ పెద్దది. ఇదియే కాయ అయినది. కొబ్బరికాయ గుంజులో నిట్లు పెరిగిన అరకు ఎదురుగా చిన్న మొలక యుండును. కొన్నిజాతుల కొబ్బరికాయలలో రెండుమూడు అరలుండునట. ఇందొక్కొక కాయలోపల రెండుమూడుకాయ లుండవచ్చును. ఇవి అండాశయమునందలి అరలన్నియు వృద్ధిజెందుటచే నేర్పడిన రూపములు.

నిజమైనకాయలు.

కొన్ని పుష్పములయందు అండాశయము ఒక్క టేఉండును. అట్టిపుష్పములనుండి ఒక్కటియే కాయపుట్టును. ఇట్టివానికి సామాన్యఫలములనిపేరు. మరికొన్ని పుష్పములలో నొక్కొకపూవునందు అనేక అండాశయములుండి ఒక్కొక అండాశయమునుండి యొక్కొకకాయపుట్టి ఆ కాయలన్నియు వేరువేరుగనుండియును ఒక్కగుత్తిలో వ్రేలాడుచుండును. వీనికి సోదరఫలము లనిపేరు. మరికొన్ని పుష్పములలో అనేక అండాశయములుండి అవి యన్నియు అంటుకొనిపోయి ఒక్కటేకాయగా నేర్పడును. ఇట్టికాయలకు మిశ్రమఫలములనిపేరు. కాని సామాన్యఫలములు, సోదరఫలములు, మిశ్రమఫలములు అనునీ మూడువిధములైన ఫలములునుగూడ నిజమైనకాయలే. అనగా నివియన్నియు అండాశయములనుండి పుట్టినవే.

దొంగ కాయలు

ఇట్లుగాక అండాశయముతోపాటు పుష్పమునందలి ఇతర భాగములుకూడ వృద్ధిపొందుటవలన నేర్పడిన కాయలకు దొంగకాయలని పేరు. ఉదా: జీడిమామిడికాయయొక్క తొడిమ గుంజుగలదై కాయయొక్క భాగముగా నేర్పడుచున్నది 100-వ పటము చూడుము. నిజమైనకాయ మనము సామాన్యముగా జీడిమామిడి

గింజయని వాడెడు క్రిందిభాగము. కాయయొక్క ముఖ్యభాగములన్నియు దానిలోనున్నవి.

కొన్నివృక్షములలో అనేక పూవులు గుత్తులుగాచేరి యొక్కొకగుత్తి దానితో సంబంధించియుండు తొడిమలు మొదలగు వానితో మిశ్రమై యొక్కొక కాయయగుచున్నది; పనస, అనాస, అత్తి, మర్రి, రావి మొదలగుకాయలు. పనస కాయలలో ఒక్కొకతొన ఒక్కొక పువ్వు.

అనాసచెట్టుయొక్క పూవులన్నియు గుత్తులుగాపుట్టి చెట్టుయొక్కకొమ్మయు, పూగుత్తులయొక్క తొడిమలును, పూవులును గూడ గుంజుగామారి యేకమై అనాసకాయ యగుచున్నవి. 101-వ పటముచూడుము. కొన్ని పూవులలో అన్నిభాగములు ఉన్నప్పటికిని గింజలుకానరావు. ఇట్టిపూవులు గొడ్డుపూవులని చెప్పవచ్చును. సంయోగము అయినతరువాత అన్నిపూవులును అంటుకొనిపోయి కొంత గుంజుతోగలసి కాయయగును.

పనసకాయలోగూడ పుష్పములన్నియు గుత్తులు గుత్తులుగా పెరుగును. అయినను మగపూవులన్నియు ఒక గుత్తియగును. ఆడపూవులన్నియు మరియొకగుత్తియగును. మిధునపుష్పములు లేవు. సంయోగము అయినతరువాత ఆడగుత్తిమాత్రము పెరిగి పనసకాయయగును. మగపూవులనుండి పుప్పొడిపుట్టి ఆపుప్పొడియంతయు రాలిపోవును.

ఒక్కొక పనసతొన ఒక్కొకఆడపూవు. మనము తిను తక్కినభాగములు సంరక్షక పత్రములవలనను, ఆకర్షణపత్రములవలనను ఏర్పడినవి. తొనలోపలనుండు గింజగలసంచి అండాశయము. ఈ సంచిలోపల గింజపై నంటియుండు పలుచనిగోధుమరంగు గల పొరబీజకవచము. ఈబీజకవచములో నొకప్రక్కనుతీగెవలెనుండు తోకకలదు; ఇదియే కొనకాడ. సంయోగమయిన తరువాత కొన్ని ఆడపూగుత్తులుమాత్రమే తొనలగును. మరికొన్ని గుత్తులు కాడగాను నారవంటిభాగముగాను పరిణమించును; అనగా నివియన్నియు గొడ్డుపోయిన పూవులగును.

రావిపండు, మర్రిపండు, ఇవికూడపుష్పముల సమూహములచే నేర్పడినకాయలే. కాని, వీనియందలి పుష్పములు మిక్కిలి చిన్నవి. ఇవి మిక్కిలి యధికమైనమార్పులను జెందినవి. పుష్పముయొక్క తొడిమ పై భాగమునందుండు కర్ణిక మిక్కిలి హెచ్చైన మార్పులనుజెంది గిన్నెవలె నేర్పడి పూవులనన్నిటిని గిన్నెలోపల నిముడ్చుకొనినది.

102-వ పటములో పచ్చి మర్రికాయ నొకదానిని రెండు చెక్కలుగ కోసి అం దొక చెక్క యొక్క ఆకారమును చూపితిమి. కాయయొక్క పై కప్పుగా నున్నగిన్నెవంటిభాగము పూవుల గుత్తియొక్క తొడిమచివరనుండు కర్ణికనుండి పరిణమించినది. దీనికి వృంతపుచ్ఛము అనిపేరు. దీని లోపలిభాగము నంటి మగపూవులుండును. మధ్యభాగము నందును, పుష్పముయొక్క పీఠమునందును ఆడపూవులు పురుగు గ్రుడ్లవలె కానబడును.

రావిచెట్టుయొక్క పూవులును ఇట్లే కాయలోపల నుండును. రావిచెట్టుయొక్క పూవులను చూచినవారు లేరనియు, పర్వపుదినములలో రాత్రి రెండుయామములప్పుడు ఆ చెట్టుక్రింద కనిపెట్టియుండిన ఎప్పుడో ఒకప్పుడు తళుక్కున ఆచెట్టు పుష్పించి దానిపూవులన్నియు అకస్మాత్తుగా పిందెలుగానగుట జూడవచ్చుననియు, మంత్రములు అభ్యసించువారును, వనమూలికలు సంపాదించువారును, మోక్షముపొందుటకై ఉపదేశములు పొందువారును ఆ చెట్లక్రింద అట్టిసమయమునందు వానిని సంపాదించుకొనినయెడల అవి వారికి మిక్కిలి చక్కగ పట్టిచ్చుననియు వాడుకగలదు. ఇప్పు డీ రావిపూవులను చూచినవారలు పై జెప్పిన కట్టుకథలను విశ్వసింపరుగదా! చిన్నకత్తిని చేతబట్టుకొని యొక లేత రావిపిందెను రెండుసమభాగములగునట్లు తెగగోసి దానిమధ్యనుండు సన్నని నలుసులవలెకనబడు రావిపూవులను పరీక్షించినయెడల పై జెప్పబడిన సంశయము రూపుమాయును.

ఈ పై జెప్పబడిన కాయలు గాక యింక నెన్నెన్నియో కాయలు ఎన్నెనోమార్పులను జెందియుండును. ఇట్టిమార్పులన్నియు సంతానవృద్ధికొరకును, పుట్టినసంతానమునకు తరతరవ్యాప్తిగలుగ జేసికొనుటకును వృక్షములు చేయుప్రయత్నములు. ఈవిష యమై ఇంకను రెండుమూడు ఉదాహరణములుచూపి ప్రస్తుత మింతటితో నీగ్రంథమును ముగించెదము.

జాజికాయ మొదలగుకొన్ని కాయలకు చిన్న చిన్న తోకలుండును. ఈతోకలకు బీజపుచ్ఛమ లనిపేరు. జా పత్రి అనునది జాజికాయనంటియుండు బీజపుచ్ఛమే. ఆముదపుగింజయొక్క కొననంటి తెల్లని మొటిమవంటి భాగముండును 103-వ పటములో 1. చూడుము. ఈ భాగమునందు ఆముదపు శుద్ధిచేయబడి నిలవయుంచబడును. ఇదియును బీజపుచ్ఛమే.

చెట్టుయొక్క బహిరంగమైనభాగమును అలంకరించియుండు పూవులయొక్క సొగసును, ఈ పూవులు వేరువేరుగనుండి తగినంతయలంకారమును గలుగజేయ లేని యెడల గుత్తులుగుత్తులుగ గూడు స్వభావమును, విత్తనములను గాలిలో నెగరనెత్తుకొని పోవుటకు తగియుండు రెక్కలనదగు రోమముల యేర్పాటులను, తమ వంశాభివృద్ధికై పాటుపడువారికొరకు దాచిపెట్టబడినబహుమానము లనదగు తియ్యనిరసములను, పరీక్షించి చూచువానికి ఇవియన్నియు స్వజాతిని పెంపొందించు నిమిత్తమై వృక్షములు జేసికొనుప్రయత్నము లని తోచక మానదు.

ప్రకృతిసిద్ధ మైన జగడము.

సృష్టియందు ఏ పదార్థములకు హెచ్చు సుగుణములు గలవో ఆ యా పదార్థములు తక్కిన పదార్థములకంటె నెక్కువకాలము వర్ధిల్లును. ఏది తగినన్నిసుగుణములు లేనిదో అది యొక తరమునగాకపోయిన మరియొక తరముననైన, లేక మరిరెండు తరములలోనైన, పదితరములలోనైన, నూరుతరములలోనైన నిర్వంశమై పోవును. సుగుణములుగల జీవులయొక్క సంతతి ఒక్కొకతరముకంటె మరియొక తరమునందు హెచ్చు సుగుణములను గలిగియుండును. దుర్గుణములుగల జాతులయొక్క సంతతి దుర్గుణములందే హెచ్చు చుండును. తుదకు సృష్టియందు పిపీలికాది బ్రహ్మపర్యంతముండు ప్రాణకోటిలో అనగా వికారిణి మొదలు మానవునివరకు నుండు జంతువులయందును, సూక్ష్మజీవులు మొదలు చింతచెట్టువరకునుండు వృక్షములయందును, ఒండొరుల ఆహారమునకై జరుగు పెద్దజగడము (Struggle), లో, ఏ యే జీవులకు హెచ్చు సుగుణములుగలవో ఆయా జీవులు గెలిచి, తమ సద్గుణములను నిలుపుకొనును. ఇట్టి ప్రకృతిసిద్ధమైన జగడములో ఏజీవు లోడిపోవునో ఆజీవులు కొన్నితరములలో నశించును. ఎట్లన మంచివికాని విత్తనములతో నారుపోసిన ఆవిత్తనములలో కొన్ని మాత్రమే మొలచును. కొన్ని మొలచినను చక్కగ పెరుగక గిటకబారిపోవును. ఇట్లు గిటకబారినమొక్కల నుండి పుట్టువిత్తనములు వీనికంటె తక్కువ బలముగలవియగును. ఈవిత్తనములు పనికిమాలినవను విషయము కాపువానికి తెలిసినతోడనే అట్టిమొక్కలగింజలను రాబోవు సంవత్సరమున తాను చల్లుకొనుట కేర్పరచుకొనిన విత్తనములలో కలిసిపోకుండ జాగ్రత్తగా తొలగించివేయును. ఇట్లు బహిష్కరింపబడి తుదకు వీని సంతతి కొంత కాలమునకు నశించిపోవును. ఇదియే ప్రకృతిసిద్ధమైన జగడములోనోడిపోవుట.

ఇట్టి కలహము లందు ఆరితీరుటకే యనేకచెట్లు తమసంతతి యగువిత్తనములకు తమకుసాధ్యమయినన్ని సుగుణములను చేర్చియుంచును. ఎట్లన నీటియందు పడుటచేగాని, మొలకెత్తుటకు తగినకాలములో తడినేలమీద బడుటచేగాని, మెత్తబడిపోకుండ వృక్షము లనేకములు తమగింజలపై కఠినమైన కవచములను జేర్చియుంచుట జూచియున్నారు. మరియు, ద్రాక్షపండు, నేరేడుపండు, రేగుపండు, శీతాఫలము మొదలగువాని గింజలు తమవృద్ధికి అనర్హమగు మానవునిశరీరములోని జీర్ణాశయములందలి అతితీవ్రమైన జీర్ణ రసములలో పడ్డప్పుడు సహితము వానిపై గప్పియుండు కవచముల కఠినత్వముచే జీర్ణము కావు. మరికొన్నివృక్షములు ఒకచోటుననుండి మరియొక చోటునకు పోవుచు వచ్చుచుండు మనుష్యునకును జంతువులకును తమగింజలను అంటుకొనునట్లు జేసి వానిని దేశ దేశములకు రవానాచేయును. ఉత్తరేణి, అంట్రింత, చిగిరింత మొదలగునవి ఉదాహరణములు. ఇంకను చిత్రమేమనగా కొన్ని కాయలు ఎంత యెండిపోయినను, తడితగిలినగాని పగులవు, అనగా వాని మొలకకు తగినసమయము గలిగినగాని కాయపగిలి గింజలు బయటబడవు.

పటములో జూపబడిన టపాకాయచెట్టుయొక్క కాయ నొకదానిని తీసికొని వచ్చి యెంతయినను ఎండబెట్టుము; ఆకాయ పగులదు. తరువాత నొక్క నీటిచుక్కచే గాని, ఉమ్మి నీటిచే గాని ఆ కాయను కొంచెము తడిచేయుము; తత్క్షణమే కాయపగిలి పలుప్రక్కలకు మిక్కిలి వడిగా విత్తనములు పరుగెత్తును. ఆహా! ఇంత యేల, కొన్ని వృక్షములు నోరులేని తమబిడ్డలకు రెక్కలనిచ్చి గాలిపోసుకొని మీబ్రతుకు మీరు బ్రతుకుడని విడిచివేయుచున్నవి. స్వజాతిని విచ్చలవిడి నభివృద్ధిచేయు నుద్దేశముతోడనే గదా జిల్లేడు చెట్లును, బూరుగు చెట్లును, రెల్లుదుబ్బులును, జమ్ము మొక్కలును తమ విత్తనములకు దూది రెక్కల నమర్చి పెట్టినవి.

దొంగకాయలు

తమజాతిని తరతరములవరకు వృద్ధినొందించుకోరికతో,నోరు లేనిజీవులగు వృక్షములుసహిత మి ట్లన్నివిధముల పాటుపడుచుండగా సృష్టియందలి సమస్తప్రాణులతో నగ్రగణ్యుడగు మానవుడు స్వజాతివృద్ధికై తన యావచ్ఛక్తిని ధారపోయుచు కృషి చేయుట విధియై యున్నదని వేరుగ చెప్ప నక్కర లేదుగదా?