Jump to content

జీవశాస్త్ర సంగ్రహము/పదియవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదియవ ప్రకరణము.

నాచు (Moss).

మన మిదివరకు చదివిన జీవులలో కణము లెల్లయు సూక్ష్మదర్శనిలో చూచునప్పుడు విడివిడిగా గనబడుచున్నవి. వాని వాని వ్యాపారములయందు భేదము లుండుటచే ఆయాపనులను జేయు కణములు తమతమ నిర్మాణమునందు మార్పులను జెందుచు కొన్ని పొడుగుగను, కొన్ని పొట్టిగను, కొన్ని మూలపదార్థముతో సంపూర్ణముగ నిండినవిగను, కొన్ని పెద్ద పెద్ద అవకాశములు గలవిగను ఉండి తమతమ నియమితకృత్యములను యథావిధిగా నెరవేర్చుకొనుచుండును. ఇట్టి కణవ్యత్యాసములను వారిపర్ణిలో కొంతవరకు జూచియుంటిమి. ఇంక ముందుజదువబోవు జీవులలో నింకను వ్యాపారభేదమునుబట్టి నిర్మాణవ్యత్యాసములు హెచ్చుచుండుట చక్కగ గ్రహించగలము. ఈ ప్రకరణమునందు మనము జదువు నాచు అను మొక్కయందు గొప్పవృక్షముల యందుండెడు చిక్కులు లేవు. వారిపర్ణి మొదలగువానిలో సూచింపబడిన కణవ్యత్యాసములను చక్కగా గ్రహించుటకును పిమ్మట హెచ్చు జాతిజీవులగూర్చి జదువబోవునప్పుడు వానికిని తగ్గుజాతిజీవులకును గల సంబంధములు తెలుపుటకును మిక్కిలి యుక్తమైన మధ్య మెట్టుగా నుండునట్టిదైన నాచుమొక్కను గూర్చి యిందు బోధింపబడును. ప్రతి చెరువునకు నలంకారముగా నిత్యము పచ్చగనుండు నాచు మనమందర మెరిగినదియే. ఇం దనేకజాతులు గలవుగాని యీక్రింద వ్రాయబోవు వర్ణన సామాన్యముగా నన్నిటికిని జెందును.

నిర్మాణము.

నాచుమొక్కయం దొక ప్రకాండము (Primary Stem) గలదు. దానినుండి క్రిందికి వేళ్లును, పైనీటిలోనికి దట్టముగా నొకదానిపై నొకటిగా వెడలు ఆకులును అక్కడక్కడ నుపకాండములును (Secondary Stems) గలుగుచుండును (21-వ పటములో A-చూడుము). కాండమునందలి ఆకులు పుట్టుభాగమునకు స్కంధశిరమనియు, రెండు స్కంధశిరములకు మధ్యనుండు భాగమునకు స్కంధమనియు, నొక స్కంధమును స్కంధశిరమును గలిసిన భాగమునకు ఖండమనియు పేరు. కొమ్మయొక్క కొనయందు లేతయాకులు గుంపుగా కూడి యొకదానిపై నొకటి మొగ్గయొక్క రేకులవలె వంపునొంది కొనమొగ్గ యగును.

దీనికొమ్మ అస్వచ్ఛముగ నుండి వెలుతురు చొరనియ్యని దగుటచేత మిక్కిలి పలుచనైనపొరలుగా కోసి యాపొరల సూక్ష్మదర్శనిలో పరీక్షించినగాని దాని నిర్మాణము తేటపడదు. అట్లు పరీక్షించునప్పుడు మిక్కిలి చక్కగా నొకదానిప్రక్క నొకటిగా నమర్పబడిన కణముయొక్క ఘనసముదాయముగా నీ పొరలు గనబడును. కాని యీ కణములన్నియు నొకదాని నొకటి

21-వ పఠము.

ఇది యొక నాచుమొక్క వే-వేళ్లు. కొ-కొమ్మ (ప్రకాండము). ఆ-ఆకు. B. నాచుకొమ్మయొక్క చివరభాగము. అం-అంత్యకణము. ఉ. అ-ఉపాంత్యకణము. ఉపాంత్యకణమునుండి తక్కిన కణములన్నియు పుట్టుచున్నవి. ఆ-ఆకులు.

C. అంత్యకణముయొక్క ఆకారము. ఇది నాలుగు భుజములు గలది. 1,2,4 ఇది యొకభుజము. 1,2,3 ఒకభుజము. 2,3,4 ఒకభుజము. 1,3,4 అను భుజము పటములో మరుగుపడియున్నది. అందు 1,2,3 అను భుజమునుండి తప్ప తక్కిన మూడుభుజములనుండి ఒక్కొకభుజమునుండి యొక్కొక కణము చొప్పున ప్రతిపర్యాయము మూడేసికణములు ఖండన మగుచుండును.

D. ఇది యొక ఆకుయొక్క సూక్ష్మనిర్మాణము. దాని మధ్యభాగమున లావుగ నుండునది ఈనె. ఈనెయందు కణములు పెక్కువరుసలుగా నుండును. తక్కినభాగములందు కణములు ఒకటేవరుసగా నుండును.

E. నాచుకొమ్మను నిలువున చీరగా నేర్పడిన మిక్కిలి పలుచనిపొర యొకటి.

F. అడ్డముగ కోయగా నేర్పడిన పలుచనితునక. సగముభాగము మాత్రమిందు చూపబడినది. దృ-దృఢసారము. మృ-మృదుసారము. న-నడిమికట్ట. వే-వేరు. ఆ-ఆకు.

బోలియుండక కొంత వ్యత్యాసమును చూపట్టును (21-వ పటములో E. F. చూడుము). వెలుపలివైపున నుండు రెండుమూడు వరుసలలోనికణములు కొమ్మయొక్క పొడుగు ననుసరించి అనగా నిలువున పెరిగి నూలుకండెవలె నడుమ లావును కొనల సన్నమును గలవై యున్నవి. వాని కణకవచము మిక్కిలి దళసరెక్కి కొంచె మెర్రగా నుండును. ఇట్లు బలమైన వగుటచేతనే యీ కణములు మొక్కయొక్క లోపలిభాగములను సంరక్షించునవిగాను, కొమ్మను నిలువబెట్టుశక్తి గలవిగాను ఉన్నవి. ఇట్టి కణముల అల్లికకు దృఢసారము (Sclerenchyma) అని పేరు (21-వ పటములో దృ). కొమ్మయొక్క మధ్యభాగమున నిలువున వ్యాపించు పలుచని కణకవచముగల చిన్న చిన్న కణముల పేర్పునకు నడిమికట్ట (Axial bundle) యని పేరు. ఈ రెంటి మధ్యనుండు సామాన్యకణముల యల్లికకు మృదుసారము (Parenchyma) అని పేరు.

ఆకు:- నాచుమొక్కయొక్క ఆకు బల్లెపు అలుగువలె మొనతీరియుండు కొనయును వెడల్పైన మొదలును గలిగియుండును (21-వ పటములో A-లో అ). ఆకుయొక్క మధ్యభాగమున పొడవునను వ్యాపించియుండెను. ఈనె యనుభాగము పెక్కువరుసలుగనుండు కణములకూర్పుచే కట్టబడిన స్తంభమువంటిది. ఇందలి కణములు కొంచెము పొడుగుగను లావుగను ఉండును (21-వ పటములో D). ఈనెకు రెండువైపులనుండు భాగములు ఒక్కఇటికదళసరిని చప్టావలె పరుచబడిన కణముల చదరపుపేరుపు. ఇందలికణములు కొంచెము పొట్టిగా నుండును. ఇందు కణములవరుస లొక దానిప్రక్క నొకటి అమర్పబడియుండును గాని యొకదానిపై నొకటి ఎక్కియుండదు. ఈ కణములందు అండాకృతి గల హరితకము (Chromatophores) లుండును. మూలతంతువులు (Rhizoida):- ఇవి దీనివేళ్లు. ఇవి కణములపంక్తులు (21-వ పటములో F-లో వే). ఇందు కణము లొక దానికొన నొక టంటి యొక పూసలసరమువలె పేర్చబడి యుండును. ఇందు హరితకము లుండవు.

కొన మొగ్గ (Terminal bud):- కొన మొగ్గయందలి యాకులు వారిపర్ణి యందువలెనే శాఖాంతమును రక్షించుటకై యొక దానిపై నొకటి విల్లువంపుగా వంగియుండును. శాఖాంతమున అంత్యకణము (Apical Cell) కణ మొక టుండును (21-వ పటములో B-లో అం). ఇది వారిపర్ణి యందలి యంత్యకణముకంటె సంమిశ్రణమందు (Complexity) హెచ్చినది. కాబట్టియే దీని వ్యాపారములయందు ఆధిక్యతకూడ హెచ్చినది. దాని యంత్యకణము లింగాకారముగ నుండునని వ్రాసితిమి. దీని అంత్యకణము అట్లుగాక తాడిచెట్లు పగులగొట్టుట కుపయోగించెడు దోరపుచిప్ప (Wedge) వంటి ఆకారము గలిగి 21-వ పటములో C. అనుచో జూపబడిన ప్రకారము నాలుగు త్రిభుజములవలన (Triangles) జేయబడిన ఘనాకృతి గలిగి కొన క్రిందుగను పీఠము (Base) పైవైపునకును ఉండును. ఈ కణమునుండి ఖండము లొక క్రిందివైపునమాత్రమే ఖండింపబడక యొక్కొక సారెకు మూడుప్రక్కలనుండి మూడుకణములు ఖండింపబడును.

ఈవిషయమై చక్కగా తెలిసికొన దలచునెడల నొక కందదుంపనుండి (F.) నలువైపుల నాలుగుత్రిభుజములు సరిహద్దు గోడలుగాగల యొక ముక్కను కోయుము. దీని పీఠమును (Base) కొంచెము విల్లువంపుగా నుండి పైవైపున కుబ్బెత్తుగా నుండునట్లు కోయుము (పటములో 1,2,3 చూడుము). ఈ పీఠమును పైవైపునకును, కొనవైపు క్రిందికిని ఉంచి దానినే శాఖాంతకణ మనుకొనుము. మొదట 1,2,4 అనుగోడ ననుసరించి యొకపొర కోయుము. పిమ్మట 2,3,4 అనుప్రక్క ననుసరించి రెండవపొర ఖండింపుము. తరువాత 1,3,4 అను ప్రక్కనుండి మరియొకపొరను కోయుము (ఆప్రక్క చాటున బడుటచే పటములో కనబడదు). ఇట్లు ప్రతిసారి కోసినప్పుడును ఆదుంపముక్క పరిమాణమునందు తన యధాస్థితికి పెరుగునని యూహింపుము. ఇట్లు తెగిపోయెడుఖండములు తెగుచుండగా తల్లికణ మేమాత్రము తరుగులేనిదై యుండ ఒక్కొకసారి మూడుఖండముల చొప్పున ననేకఖండము లనవరతము వెడలుచుండును. ఈ ఖండములే ఉపాంత్యకణములు (21-వ పటములో B-లో ఉ. అ). ఇవి తత్క్షణమే చీలి యా చీలినచీలికలు తిరిగి యనేక కణములై నాచుమొక్కయందలి కణసముదాయ మేర్పడుచున్నది (21-వ పటములో B-చూడుము). ఆ కణములలో కొన్నిటియందు చిన్న చిన్న మొటిమలు పుట్టి యా మొటిమలే చీలి యాకు లగును. ఇట్లే క్రమముగా కొమ్మ పొడుగునందును ఆకులు సంఖ్యయందును వృద్ధియగుచుండును.

సంతానవృద్ధి.

1. దీనికి స్త్రీపురుషసంయోగ రహితమైన సంతానవృద్ధివిధానము గలదు. ఎట్లనగా, నొక కొమ్మను తెగనరికి మొలవేసిన దాని ప్రకాండమునకును ఆకునకు నడుమనుండు పంగలనుండి మొటిమ లంకురించి ఆ మొటిమలే శాఖాంత్యకణములై వాని నుండి తిరిగి నాచుమొక్క యేర్పడును. ఒకానొకప్పుడు పంగనుండి బయలు వెడలు నొక మొటిమనుండి ప్రథమతంతువును పేర (Protonema) నొక కణపంక్తి యేర్పడి దానినుండి క్రింద చెప్పబడునట్లు నాచుమొక్క యొక శాఖగా నంకురించుచున్నది.

సంయోగజనిత సంతానవృద్ధి:- 2. సూక్ష్మ బీజాశయములు-బీజాశయములు కొమ్మయొక్క చివరభాగమున పుట్టును. ఇవి కొంచె మెరుపైన చిన్నచిన్న లేతయాకులగుంపుచే మూయబడి మొగ్గలవలె నుండును. ఇట్టిమొగ్గలను నాచుపూవులని చెప్పుదురు. అందు సూక్ష్మ (మగ) బీజాశయము పొడుగుగా గదవలె-నుండును (22-వ పటములో A-చూడుము). అది కణములయొక్క కూర్పుచే నైన ఘనసముదాయము. ఆ కణములలో వెలుపలివైపున నుండునవి బీజాశయమునకు గోడగా నుండును. లోపలనుండు కణములన్నియు సూక్ష్మబీజము లగును. ఈ సూక్ష్మబీజములు మెలికలుతిరిగియుండి కొనయందు రెండు

మృదురోమములు గలవై యున్నవి (22-వ పటములో C. D. చూడుము). కొంతకాలమునకు బీజాశయము పైవైపున పగిలి సూక్ష్మబీజములన్నియు వెలువరింపబడును (B). ఈ సూక్ష్మబీజములన్నియు చెదరి నీటిలో నీదులాడుచుండును.

స్థూల బీజాశయములు.

సామాన్యముగా సూక్ష్మబీజాశయములుగల మొక్కమీద స్థూలబీజములును కొన్ని యుండును. ఈనాచుజాతిలోని కొన్నిమొక్కలందు ఒక్కొక మొక్కమీద సూక్ష్మబీజాశయములు మాత్రముగాని, స్థూలబీజాశయములు మాత్రము గాని యుండును. ఇట్టి మొక్కలు ఏకాంగులు? సూక్ష్మబీజాశయమువలెనే స్థూలబీజాశయమును మొట్టమొదట నొక కణముల రాసి. ఇది 23-వ పటమున చూపిన త్ళొకవిధమైన కూజావంటియాకారము గలదై, గుండ్రనైన మట్టు అను క్రిందిభాగమును, మధ్య పొట్టయు, పైభాగమున మెడయు గలదిగా

A. B. C. D. స్థూలబీజాశయముయొక్క వివిధావస్థలు.

A. ఇందు స్థూలబీజమును మార్గకణములును ఏర్పడియుండలేదు. ఇది మిక్కిలి లేతది. మ-మట్టు. పొ-పొట్ట. మె-మెడ.

B. దీనియందలి కణములలో క్రిందిది స్థూలబీజముగను దానిపనివి మార్గకణములుగను మారినవి.

C. ఇందు మార్గకణములు జిగురుపదార్థముగా మారి కరగిపోయి సూక్ష్మబీజముయొక్క రాకకై మార్గ మేర్పడినది.

D.ఇందు స్థూలబీజము అనేకకణములుగా చీలి యనేకకణపిండ మేర్పడినది.

నున్నది. మెడయందు వెలుపలివైపున నుండు నొక కణముల వరుసయు, పొట్టయందు వెలుపలివైపున నుండు రెండుకణముల వరుసలును బీజాశయమునకు గోడగా నుండును. లోపల నుండు కణము లొక్కవరుసగా నొకదానిపై నొకటి యుండును. మొదట నివి వెలుపలికణములవలెనే యుండునుగాని శీఘ్ర కాలములో నావరుసలో నన్నిటిలో క్రిందికణము స్థూలబీజముగా పరిణమించును. మిగిలినవి జిగురుపదార్థముగా మారును. ఈ కణములు ఉబ్బి పెద్దవయి మెడయందుండు గొట్టమును విరివిగా జేసి వెలుపలినీటినుండి స్థూలబీజమునకు మార్గ మేర్పడును. ఇందుచే వీనికి మార్గకణములని పేరు. ఈ మార్గముగుండ సూక్ష్మ (మగ) బీజము స్థూలబీజాశయములోనికి ప్రవేశించి స్థూల (ఆడు) బీజముతో సంయోగమునొంది దానిని ఫలింప జేయును.

ఏకకణపిండము.

సూక్ష్మస్థూలబీజముల రెంటియొక్క ఐక్యముచే నైన సంయుక్తబీజమునకు ఏకకణపిండము (Unicellular embryo) అని పేరు. ఇది ప్రథమమున ఏకకణము (23-వ పటములో C-చూడుము). దీనిచుట్టు నొక దళమైన కవచ మేర్పడును. పిమ్మట నీ పిండకణము స్థూలబీజాశయమున కడ్డముగ రెండుకణములుగా చీలును. అందలి ప్రతికణమును రెండుకణము లగును. ఈ నాలుగు ఎనిమి దగును. ఇట్లే ద్విఖండనవిధానముచే ననేక కణము లేర్పడి ఇవియన్నియు నొక చదరమున పేర్చబడి యనేక కణపిండ మగును (23-వ పటములో D-చూడుము).

జంతుపిండమునను వృక్షపిండమునకును గల భేదము.

త్వరలోనే, యనేకకణపిండములో బీజాశయముయొక్క మెడయొద్ద నుండు కణములలో నొక్కటి యంత్యకణస్వభావము నొంది కొమ్మయొక్క అంత్యకణమువలెనే క్రొత్తక్రొత్తకణము లను ద్విఖండనముచే ఖండించుచుండును. ఇంతటనుండియు జంతుపిండమునకును వృక్షపిండమునకును భేద మేర్పడుచున్నది. జంతుపిండమునందు అనేకకణపిండమునందలి కణములన్నియు ఖండనము నొందుచుండి యవి వరుసలుగా నేర్పడి యొక్కొక వరుసనుండి యొక్కొకవిధమైన కణసంహతి (Tissue) యేర్పడి ఆయాకణసంహతులే, కండ, చర్మము, నరము, ఎముక మొదలగునవిగా పరిణమించుచున్నవి. వృక్షజాతి పిండములయందు ఒక్కకణము తక్కినవానికంటె ఆధిక్యతజెంది అంత్యకణమై (Apical Cell) ద్విఖండనవిధానమున 165-వ పుటలో జెప్పినప్రకారము వృద్ధిజెందుచుండును. ఇతరకణముల పెంపు అంతటితో నిలిచిపోవును. వృక్షమునందలి సమస్తభాగములును అంత్యకణమునుండియే కలుగుచుండును.

సిద్ధబీజాశయము.

ఇట్టి అంత్యకణవిభాగమువలన నీ పిండము క్రమముగా పెరుగుచు పెద్దదై దాని మొదటిభాగము 24-వ పటములో A-లో జూపినట్లు నాచుమొక్కయొక్కకొమ్మ లోపలికి దించుకొనిపోవును. దీని పైభాగమున కాలక్రమమున 24 B.. అను పటములో జూపబడినప్రకారము కాయ యొక టేర్పడును. ఈ కాయకు సిద్ధబీజాశయము (Sporangium) అని పేరు. దీనియందలికణములు కొన్ని సిద్ధబీజమాతృకలు (Spore Mother Cells) గా నేర్పడును. అవి ఒక్కొక్కటియు నాలుగు పిల్లకణములుగా విభాగము నొందును. ఇట్టి విభాగమువలన నేర్పడిన కణములు రెండేసి కణకవచముల నేర్పరచుకొని నాచుమొక్కయొక్క సిద్ధబీజము (Spores)లగును. ఈ సిద్ధబీజములు ముదిరినతరువాత సిద్ధబీజాశయము పగిలి యందలి సిద్ధబీజము లన్నియు చెదరిపోవును.

ప్రథమతంతువు.

ఈ సిద్ధబీజమునుండి మొలక యంకురించునప్పుడు 25-వ పటములో A-లో జూపినప్రకారము దానియొక్క వెలుపలి కవచమునం దొక చోట పగులు పుట్టును. ఆ పగులుగుండ లోపలికణ కవచముచే నావరింపబడిన మూలపదార్థము ప్రాకి పొడుగైన తంతువుగా పెరుగును. దీనికి ప్రథమతంతువని పేరు. ఈతంతువునం దడ్డముగ నేర్పడు పొరలచే నిది యనేకకణముల పంక్తిగా విభజింపబడును. ఇట్టిస్థితిలో నిది బూజుపోగును బోలియుండును. దీనికి శాఖ లనేకములు పుట్టి యా పోగులన్నియు చిక్కగ నలుముకొని యల్లికగా నుండును. కొంతకాల
మునకు చిన్నచిన్న మొటిమలవంటి అంకురము లీ పోగులప్రక్క నుద్భవించును (25-వ పటములో B-లో శా.అ. చూడుము) ఈ యంకురములన్నియు నంత్యకణములుగా పరిణమించును. ఈ యంత్యకణములనుండి నాచు మొక్కల శాఖలును ఆకులును పుట్టును. ఇ ట్లంకురించు నొక్కొక్క మొటిమనుండియు నొక నాచుమొక్క నిర్మింపబడుచున్నది.

సంతానవృద్ధి.

ఒకానొకనాచుమొక్కనుండి మరియొక నాచుమొక్క పుట్టునప్పటికి ఈ రెంటికి మధ్య నొకతరము గడచుచున్నది. అనగా నాచుమొక్కకు దానిమొక్క మనుమరికములో నున్నదని చెప్పవచ్చును. ఏలయన, తల్లినాచుమొక్కయందు ఆడువగు స్థూలబీజములును, మగవగు సూక్ష్మబీజములు నేర్పడుచున్నవి. ఇట్టిసంయోగాపేక్షగల సూక్ష్మస్థూలబీజములయొక్క ఐక్యమువలన సంయుక్తబీజము (Oospore) ఏర్పడుచున్నది. ఈ సంయుక్తబీజమునుండి తిన్నగా నాచుమొక్క పుట్టుట లేదు. అనగా సంయుక్తబీజము నాచుమొక్కకు గింజగాదు. అట్లయినచో నొక నాచుమొక్కకు మరియొక నాచుమొక్క పుత్రస్థానము బడసియుండును. అట్లు గాక యీసంయుక్తబీజమునుండి స్వతంత్రమైన (ప్రత్యేకమైన) వృక్షజాతిజీవియని చెప్పదగు ఒకపిండ మేర్పడుచున్నది. ఈపిండమునుండి సిద్ధబీజాశయము ఏర్పడుచున్నది. దీనినుండి స్త్రీపురుషవివక్షత లేనట్టియు, సంయోగనిరాపేక్షకములై నట్టియు అనగా సంయోగములేకయే అంకురించుటకు శక్తిగలిగినట్టియు సిద్ధబీజము లను విత్తనములు పుట్టుచున్నవి. ఇవియే నాచుగింజలు. ఇవి ముదిరినతరువాత కొంతకాలమునకు స్ఫోటనవిధానమున వీనినుండి మొటిమలు పుట్టుచున్నవి. ఈమొటిమలు క్రమముగా నాచుమొక్క లగుచున్నవి.

కాబట్టి నాచుమొక్కకు సంయుక్తబీజమువలన గలిగినపిండము పుత్రసమానము. పిండమునుండి పుట్టెడు సిద్ధబీజములనుండి యంకురించు నాచుమొక్క పిండమునకు పుత్రసమానము అనగా మొదటి నాచుమొక్కకు రెండవనాచుమొక్క పౌత్రసమానమని గ్రహింపనగును. ఈరెంటికి మధ్యనుండు అనేకకణపిండము మొదటిమొక్కకు బిడ్డయును రెండవమొక్కకు తల్లియునుగా నెన్నదగును. ఇట్లు రెండేసితరములకొక సారి నాచుమొక్కయు నాచుమొక్కకు నాచుమొక్కకుమధ్య నొకతరము పిండములును వరుసగా పుట్టుచుండును. ఈప్రకారము తరమువిడచి తరమున ఒక్కొకతరహాప్రాణి పుట్టునట్లు మార్పులనొందు జన్మమునకు జన్మగర్భితజన్మము అనిపేరు. ఇట్లే వారిపర్ణికి పూర్వవారిపర్ణియు, పూర్వవారిపర్ణికి వారిపర్ణియు పుత్రస్థానముగ నున్నవి. పై వారిపర్ణినుండి జన్మించు క్రిందివారిపర్ణి పైదానికి పౌత్రసమానము అనగా మనుమనివంటిది.

నాచుకణముయొక్క యాహారము.

ఇది కేవల క్షృక్షాహారము. కణములయొక్క స్థితిగతులను బట్టి ఆయాకణములవ్యాపార వ్యత్యాసములు స్పష్టముగ నేర్పడుచున్నవి. ఇట్టి స్థితిగతులను కొన్నిటి నాలోచించుదము. వారిపర్ణిలో (Chara) ఆకులన్నియు నీటిలో మునిగియుండును. దీని కణములన్నిటియందును హరితకము లుండును. ఇం దన్ని భాగముల యందుండెడు కణములలో ప్రతికణము నితరకణములతో నిమిత్తము లేకుండ బొగ్గుపులుసుగాలిని (CO2) విడదీయుటయు, ఇతర యాహారపదార్థములను నీటినుండి తీసికొనుటయు మున్నగువ్యాపారముల నన్నిటిని స్వతంత్రముగ జేసికొనును. ఇందు ప్రతికణము నితరకణముల సహాయము లేకయే జీవించగలదు. నాచుమొక్క యందట్లుగాదు. దీనియందలి వేర్వేరుభాగములయందుండు కణము స్థితిగతులు వేర్వేరుగా నున్నవి. దీనిమూలతంతువులు చెరువు అడుగుననున్న బురదలో నాటుకొనియుండును గాన నవి వెలుతురునకు దూరమైనవిగా నుండుటచేత వీనికణములయందు హరితకముల యుపయోగము లేదు. కాన బొగ్గుపులుసుగాలిని (CO2) వేళ్ళయందలికణములు విభజింపనేరవు. కాని యివి ఎల్లప్పుడును తడిమట్టిలో పాతుకొనియుండుటచేత లోహపదార్థసహితమైన నీటిని తమలో నిముడ్చుకొనుటకు తగినస్థితిలో నున్నవి. కొంచెము దృఢముగ నుండునట్లు నిర్మింపబడిన కాండములు మొక్క నిలువ బడుటకు ఊతముగా నుండుటకై ముఖ్యముగా నేర్పడియున్నవి. వీనియందలి వెలుపలికణములు దళసరిగా నుండుట చేత నీటినిగాని ఆహారపదార్థములనుగాని చొరనియ్యవు. వీనియందును హరితకములు లేవు.

కాబట్టియే బొగ్గుపులుసుగాలిని (CO2) విడదీయు పని ఆకులకుమాత్రమే నియమించబడినది. సామాన్యముగా భూమిమీద నివసించు మొక్కవలెనే నాచుమొక్కయు తనకు కావలసిన కర్బను (C) నొకభాగమునందును అనగా ఆకులయందును, నీరు, నత్రజనము (N), గంధకము (S), పొటాసియము (K) వీనిని మరియొక భాగమునందును అనగా వేళ్లయందును ఇముడ్చుకొనును. మొక్కయొక్క ప్రతిభాగమునకు ఈ పదార్థములన్నియు కావలసియున్నందున చిట్టచివరనుండు ఆకులయందుండు కర్బను అడుగుననుండు వేళ్లకును, కర్బను గాక యితర యాహారపదార్థములు వేళ్లనుండి యాకులకును, జేర్చుమార్గము లుండవలయును. ఇంతవరకు జదివిన జీవులలో ప్రతి కణమును స్వతంత్రముగా తన యాహారమును తాను సంపాదించుకొనునదే కాని యొకదాని సహాయమును మరియొకటి అపేక్షించునదిలేదు. అదిగాక వాని కణకవచములు మిక్కిలి పలు చని వగుటచేత నొక కణముయొక్క మూలపదార్థము దాని ప్రక్కకణముయొక్క మూలపదార్థముతో కొంచెమించు మించుగా పూర్ణమైనసంబంధము గలిగియున్నది. కాబట్టి వానియం దిట్టిమార్గములు అగత్యము లేక పోయినవి.

ఇట్టి మార్గముల నిర్మాణములు హెచ్చుతరగతి వృక్షములలో మిక్కిలి బాగుగ జూడగలము. అయినను ముఖ్యాంశములయందు నాచుమొక్కయొక్క నిర్మాణమును వానినే బోలియున్నది.

ఉపశ్వాసము.

ఆకులయొక్క యుపరితలమునందుండు కణములనుండి యెడతెగక నీటియావిరి గాలిలోనికి బోవుచుండును. దీనికి ఉపశ్వాసము (Transpiration) అని పేరు. ఇది వృక్షములయొక్క ఆహారస్వీకరణములో ముఖ్యాంశముగా నెంచదగియున్నది. ఏలయన, పై జెప్పినప్రకార మావిరిగా బోవు నీటియొక్కస్థలమును తిరిగి యాక్రమించుటకై యెల్లప్పుడును వేళ్లచే నీరు పీల్చి పంపబడును. కాన నీ యుపశ్వాసములవలననే నిరంతరము నీటిప్రవాహము మొదటనుండి కొనవరకు నేర్పడుచున్నది. ఈ నీటియం దాహారపదార్థములలో కొన్ని లీనమై యుండుటచేత నా యాహారపదార్థములుగూడ నీ ఉపశ్వాసము మూలముననే పై కెక్కింపబడుచున్నవని గ్రహింపనగు. ఈ యుపశ్వాసముచే (Transpiration) ఆవిరియై పోవు నీటిని తరుణమందు తిరిగి యథాస్థానమున సంపూర్తి జేసినగాని మొక్క జీవింప నేరదు. దీనికి దృష్టాంతముగా మన మొక మొక్కను పీకి గట్టున వైచిన కొద్దికాలములోనే యది వడలిపోవును. ఏలయన, దాని యాకులనుండి వెలుపలికి బోవు నీటియావిరిమూలమున ఖర్చకు నీటికిబదులుగా వేళ్ల నుండి పీల్చబడి జమయగు నీరు, ఆ మొక్క పీకి గట్టుమీద వేయబడియున్నప్పుడు లోటుపడియున్నందున ఆహారము లేమిచే నా మొక్క యెండిపోవును.

కాబట్టి యీ యుపశ్వాసమువలన నైన ప్రవాహముచే నీరును, లోహపదార్థములును, భూమినుండి ఆకులు మొదలగు భాగములయందుండు సమస్తకణములకును నీడ్వబడుచున్నవి. ఈ ప్రవాహ మొకకణమునుండి మరియొక కణమునకు వాని పలుచని కణకవచములగుండ చెట్టుయొక్క క్రిందిభాగమునుండి పై భాగమునకు వ్యాపించియుండును.

ఎండవేళలయందు ఆకులయందలి హరితకములచే బొగ్గుపులుసుగాలి (CO2) విడదీయబడి, యందలి కర్బను నీటితోగూడి కర్బనోజ్జనితము (Carbohydrate) అగును. నీటిలో లీనమైయున్న నత్రితములతో నిది కలియుటచే అనేకములైన మిశ్ర పదార్థములు మధ్య అంతస్తుగా నేర్పడి తుదకు మూలపదార్థమగును. పై జెప్పినప్రకారము ఆకులన్నియు ఆహారమును ఆర్జించుకొనుచున్నవి. హరితకములు లేని కొమ్మలయందును, మూలతంతువులయందును, ఉండుకణములకు కర్బను (C) గాక యితర ఆహారపదార్థములన్నియు నీటిలో లీనమై దానితోగూడ జేరుచుండునని చెప్పియుంటిమి. కర్బను వీని కెట్లు సంపాద్యమగును? ఆకులయందలి హరితకములు గల కణములు తమకు గావలసిన ఆహారమును తాము తయారు చేసికొనుటయేకాక, ఆ వృక్షమునందలి హరితకములు లేని కణములకుసహితము కావలసిన సారజనక సంబంధమైన పదార్థములును (Nitrogenous Substances) తయారుచేయును. ఇట్లు తయారుచేయబడిన పదార్థములు ఒక కణమునుండి మరియొకకణమునకు వ్యాపించి, క్రమముగా కొమ్మలయందలి మిక్కిలి గూఢమైన మధ్యకణములకును, మిక్కిలి దూరమున నున్న మూలతంతువుల కొనలయందలి కణములకును గూడ నేకరీతిని వ్యాపించును.

ఇట్లు వ్యాపించిన ఆహారపదార్థమునందు, పాస్ట్యూరురసములో మునిగి తేలుచున్న మధుశిలీంధ్రకణములవలె నీ నాచు కణములును కణరసము (Cell Sap) అను ద్రవములో మునిగి తేలుచు దానిని తృప్తితీర త్రాగుచుండును.

శ్రమవిభాగము.

ఇట్లు హరితకములుగల కణముల సహాయముచే వేళ్లొ మొదలుగాగల భాగములయందలి కణములును, హరితకములు లేక నీటి నాకర్షించుశక్తి గల వేళ్ల యందలి కణముల తోడ్పా టుచే ఆకులయందలి కణములును సుఖించుచుండును. ఒండొరుల సహాయములేక నెద్దియును జీవింపజాలదు. ఇట్లు తమతమపనులను తమలోతమకు కష్టములేకుండునట్లు తమతమస్థానముల ననుసరించియు, స్థితిగతుల ననుసరించియు, పంచికొనుటయే శ్రమవిభాగము. ఈ శ్రమవిభాగమును చక్కగా గ్రహించుటకు జనసంఘముల నడవడికల చరిత్రములనుండి యుక్తమైన యుదా హరణములు గలవని యిదివరలో జెప్పియుంటిమి. ఒక గొప్పవాని సహాయములేక చాకలి మంగలి మొదలగు సేవకులు ఎట్లు జీవింపలేరో అట్లే చాకలివాని సహాయము లేక గొప్పవాడును అనుకూలముగా జీవించుట కష్టము. తమతమ చేతనైన పనులు చేయుచు ఒకరికొకరు సహాయులుగా నున్నయెడల ఇరువురకు అనుకూలముగానుండును. ఇట్లే రాజుయొక్క సహాయము లేక ప్రజలకుగాని, ప్రజలయొక్క విరోధమును సంపాదించుకొనిన రాజునకుగాని సుఖము గలుగ నేరదు. ఈశ్రమవిభాగసూత్రము అల్పప్రాణులగు నాచుమొక్కల కెట్లో హెచ్చుజాతిజీవులకు బోల్చదగిన జనసంఘములకును రాష్ట్రములకు నట్లే వర్తించునని గ్రహింపనగును.