జీవశాస్త్ర సంగ్రహము/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

తొమ్మిదవ ప్రకరణము.

ఏకపత్రము ; వారిపర్ణి (Monostroma ; Chara).

సముద్రతీరమందు పోటుపాటులచే నిత్యము తడిసి యారుచుండు రాతిగుట్టలమీద ఏక పత్రమను నొక రమ్యమైన హరిత వర్ణముగల పలుచనియాకువలె నుండు నాచుజాతిలోని మొక్కయొకటి పెరుగును. ఈవరకు జదివిన బూజుపోగునందును, పసిరిక పోగునందును కణములన్నియు నేక పంక్తిగా నొకదాని ప్రక్క నొకటి చేరి పూసలదండవలె నుండెనని గ్రహించి యుంటిమి. ఏక పత్రమును సూక్ష్మదర్శనిలో పరీక్షించిన అందు కణములపంక్తు లనేకము లొకదానిప్రక్క నొకటి చేర్చబడి యున్న ట్లుండును

(16-వ పటము చూడుము). ఇది ఒంటి యిటిక దళసరిని పరచిన ఇటిక చప్టాను బోలియుండును. ఇందు ఇటికలు అడ్డముగను, నిలువుగను వరుసలుగా నుండునుగాని యెక్కడ చూచినను ఇటికపై నిటిక యుండదు. అట్లే దీనియందలి ఆకుపచ్చని ఇటికలవలె నుండు కణములును ఒక దాని ప్రక్క నొకటి బల్ల పరుపుగా సెల్లులూసు అను అడుసులో నమర్చిబడియుండును. కాని యొక కణముక్రింద మరియొకకణ ముండదు. ఒండొరుల కణకవ చము లించుమించుగా నంటియుండును. కాన నీ ఏక పత్రము కణములయొక్క చదరపు పేర్పు.

పసిరిక పోగు లొకదానిసరస నొకటి యొక కాగితముమీద మిక్కిలి క్రిక్కిరిసియుండు రూళ్ల వలె (Rules) సమాంతరములుగా (Parallel) అనేక తంతువుల నమర్చునెడల నిదే యాకార మేర్పడును. కావుననే ఏకపత్ర మనేక కణపంక్తుల కూర్పుచే నైనదని చెప్పవచ్చును. ఇందు నొక పంక్తిప్రక్క మరియొక పంక్తి యుండునుగాని యొక దానిక్రింద మరియొకటి యుండదు.

ఏకపత్రము మిక్కిలి పలుచని ఆకుపచ్చని పొరలవలె నుండును. ఈ మొక్కయంతయు నొక యాకును బోలియుండుటచేత దీనికి ఏకపత్ర మనుపేరు గలిగెను. దీని కణములందు హరితకము లుండుటచేత దీని యాహారము కేవల వృక్షాహారమని చెప్పనగును.

వారిపర్ణి (Chara).

మంచినీళ్ల చెఱువులలో మొలచు నాచు మొదలగు తుక్కులో వారిపర్ణి యను మొక్క మన మనుదినము జూచు పెద్ద వృక్షములవలె ఆకులును, కొమ్మలును, వేళ్లును గలిగియుండుటచేత, మిక్కిలి సులభముగ గుర్తింపదగియుండును (17-వ పటములో A. చూడుము).

నిర్మాణము:- ఇది వలయాకారముగల మృదువైన తీగెవలె నుండు తల్లికాడ గలిగి సుమారు 7 లేక 8 అంగుళములు గాని కొంచె మెక్కువగాని పొడుగుగలిగి యుండును. కాని దీనిలావు ఒక నూలులో ఆరవవంతు అనగా అంగుళములో 50-వ వంతుకంటె హెచ్చుగ నుండదు. గుంటయడుగున నుండు బురదలో మూలతంతువు లనబడు కోమలమైన పోగులచే ఈ మొక్క యొక్క మొదలు తేలికగా పైపైని నాటుకొని యుండును. ఈపోగులకు నులివేళ్లనియు పేరు (A-లో ను. వే. చూడుము). తల్లికాడనుండి యక్కడక్కడ గుంపులు గుంపులుగా ముల్లు మొనలవలె నుండు కొనలుగల యాకులు వెడలుచుండును (B-లో ఆకు చూడుము). ఈ మొక్కయంతయు నీటిలో మునిగియుండి, నీటినుండియే తన యాహారమును సంపాదించు ఆకులుగలది గాన దీనికి వారిపర్ణి యనుపేరు గలిగెను.

దీని యాకులును, మూలతంతువులును పటములో A-లో జూపబడినప్రకారము కాడమీద నక్కడక్కడ గుంపులుగా నమర్పబడి యుండుటచేత, దీని తల్లికాడ కొన్ని ఖండముల (Segments) వలన నేర్పడినదిగా నూహింపవచ్చును (A-లో ఖం. చూడుము). ఆకులులేక పొడుగుగానుండుభాగము స్కంధము (Internode) ; దాని తుదనుండు కనుపువంటి పొట్టిముక్కయగు భాగము స్కంధశిరము (Node). ఈ భాగమునుండి ఆకులగుంపు వెడలుచుండును. ఈ భాగములు రెండును గలిసి యొక ఖండమగును (A-లో స్కం. స్కం. శి. చూడుము).

వారిపర్ణి యొక్క ఆకారము. ను.వే - నులివేళ్లు. (మూలతంతువులు) - ఖం-ఖండము. ఒక ఖండమునందు స్కం.శి - స్కంధశిరము, స్కంస్కంధము, అను రెండుభాగములు గలవు. ఉ. శా-ఉపశాఖ లేక ఉపకాండము. కొ. మొ-కొనమొగ్గ.

B. కొనమొగ్గయొక్క ఆకారమును జూపు పటము. అ. క-అంత్యకణము.

C. ఒక ఆకునందు మూలపదార్థము ఎట్లు క్రిందివైపునకు పైవైపునకు ఎడతెగక ప్రవహించుచుండునో తెలియబరచును. దానియందలి బాణపు గుర్తులు చూడుము.

D. కణముయొక్క సూక్ష్మనిర్మాణమును తెలియజేయుపటము. క. క-కణకవచము. మూ. ప-మూలపదార్థము. ఇందు రెండుభాగములు గలవు. అందు వెలుపలిభాగమునందు హరితకములు (హ) వరుసలుగా నుండును. లోపలిభాగమునందు జీవస్థానములు (జీ) గలవు. కణము మధ్య నుండు తెల్లనిభాగము పెద్ద అవకాశము (అ).

స్కంధశిరమునుండి వెడలెడు ఆకులు, కిరణములవలె నలుప్రక్కలకు విస్తరించియుండును. మొదటనుండి చాలమట్టుకు స్కంధములపొడవు కొంచె మించుమించుగ సమానముగా నుండును. కాని కొనను సమీపించుకొలది స్కంధము లొకదానికంటె నొకటి చిన్నవగును. తుదకు చిట్టచివర స్కంధము మిక్కిలి చిన్నదై తత్పూర్వపు స్కంధశిరమునుండి వెడలి మొగ్గవలె ముడుచుకొనియున్న లేతయాకులచే కప్పబడియుండును (A. B. లలో కొ. మొ. చూడుము). ఈ మొగ్గకు కొనమొగ్గయని పేరు (Terminal bud). ప్రతికొమ్మకొనయు నిట్టి కొనమొగ్గచే రక్షింపబడి యుండును.

ప్రకాండము: కాండము.

కాడకును ఆకునకును పైవైపున నిమిడియుండు కోణమునకు ఆకుపంగ (Axil) యని పేరు. సామాన్యముగా ప్రతియాకు పంగనుండియు నొక పిల్లకొమ్మ అంకురించును (A-లో ఉ. శా. చూడుము). అది సర్వవిషయముల తల్లికాడను బోలి, స్కంధమును, స్కంధశిరమును, ఆకులును గలిగియుండును. దీని తుదనుండు కొనమొగ్గ దీనికొనను సంరక్షించుచుండును. అడుగునుండి చివరవరకు వ్యాపించు తల్లికొమ్మకు ప్రకాండము (Primary Stem) అని పేరు. తక్కిన కొమ్మలకు ఉపఖాండములు లేక ఉపశాఖలు (Secondary Stems) అని పేరు. కాండమన్నను శాఖయన్నను సర్వత్ర అన్నికొమ్మ (Stem) లకు వర్తించును. ప్రకాండమును, ఉపఖాండములును గూడ కొనమొగ్గచే కప్పబడి ముగియును (A-చూడుము). మూలతంతువులుగూడ ఉపకాండములవలె కనువులనుండియే అంకురించును (A-లో ను. వే. చూడుము).

బీజాశయములు.

శరదృతువునందు దీని కొమ్మలయొక్క చివర ఆకులమీద సూక్ష్మమైన నారింజపండ్లవలె గుండ్రముగానుండు చిన్న చిన్న మొటిమలు పసిడివర్ణముగలవై ప్రకాశించుచుండును. ఇవి సూక్ష్మబీజాశయములు. అనగా మగబీజముల కునికిపట్టయిన తిత్తులు. వీనిమధ్య నక్కడక్కడ కూజావంటి ఆకారముగల స్థూలబీజాశయములుగూడ నుండును. ఇవి లేతవైనప్పుడు గోధుమరంగుగను, ముదిరినపిమ్మట నలుపురంగుగను ఉండును. ఇవి ఆడబీజములకునికిపట్టు.

సూక్ష్మ నిర్మాణము (Histology).

శాఖలు:- ప్రతిశాఖయు ననేక ఖండములచే నేర్పడియున్నది. అందు ప్రతిఖండమునందును స్కంధము స్కంధశిరము అని రెండుభాగములుగలవు. సూక్ష్మదర్శనిలో పరీక్షించునప్పుడు ప్రతిస్కంధమునొక పెద్దకణముగా నగపడును (18-వ పటములో ఖం3. లో స్కం. చూడుము). ఒకానొకప్పుడు ముదిరినభాగములలో నిది అంగుళము లేక అంగుళమున్నర పొడవుగ నుండును. స్కంధశిరమనుభాగము పొట్టిదైనను, అడ్డముగా ఒండొంటి ప్రక్కన నమరియుండుకణములుగా విభజింపబడియుండును (18-వ పటములో ఖం3. ఖం4. లలో స్కం. శి. చూడుము). ఈ అడ్డకణములవరుసను క్రిందివైపునను పైవైపుననుగూడ పొడుగైన స్కంధకణము లుండును (18-వ పటము చూడుము). స్కంధశిరమునుండి ఉపశాఖలును, ఆకులును పుట్టును (ఆ3. ఆ2. ఆ1.).

ఆకులు:- ఒక యాకును సూక్ష్మదర్శనిలో పరీక్షింపగా నందు మొట్టమొదట స్కంధకణమువంటి యొక పొడుగైనకణ మగపడును (17-వ పటములో B-లో ఆకు. చూడుము). ఈ స్కంధకణముపైని స్కంధశిరకణములవంటికణములు రెండుమూ డుండును. దాని పై భాగమున చిట్టిఆకులను చిన్నచిన్న ఆకులు రెండుమూ డుండును (17-వ పటములో C). ఒక్కొక్క చిట్టిఆకు సామాన్యముగా మూడుకణములచే కూర్పబడియుండును. ఈకణము లొకదానిపై నొకటిగా నమరియుండి క్రమముగా చిన్నవియగును. అందు తుదనుండుకణము సూదిమొనవంటి మొనగలిగి యుండును.

కాబట్టి వారిపర్ణి యంతయు కణములసముదాయము. ఇందలికణము లొక నిర్ణయమైనరీతిని అమర్చబడియుండును. ఇంతకు పూ రెండుప్రక్కలను, విల్లువలె వంగియుండు స్వచ్ఛమైన సన్నని పట్టెలు రెండు ఒకదాని కొక టెదురుగా కన్పట్టును. ఈపట్టెలలో హరితకములుండవు (17-వ పటములో C-చూడుము). మూలపదార్థమునందలి రెండవభాగములోగూడ హరితకములుండవు. కాని దానియందు నిర్ణయమైనయాకారములేని స్వచ్ఛమైన అణువులుగలవు. అందు కొన్ని జీవస్థానములని తోచుచున్నది (17-వ పటములో D-లో జీ). అతిశీతలముగా నుండిన దప్ప, యీభాగమునందలి మూలపదార్థ మెల్లప్పుడు మిక్కిలి చురుకుగ ఒకవైపున మీదికిని రెండవవైపున క్రిందికిని పరుగెత్తుచుండును (C-లో బాణపుగుర్తులు చూడుము). పైకిపోవు ప్రవాహమునకును, క్రిందికి వచ్చు ప్రవాహమునకును మధ్య, పైని జెప్పబడిన స్వచ్ఛమైన పట్టెలు సరిహద్దులుగా నుండును. ఇందుండు జీవస్థానపు తునకలు మిక్కిలి వడిగా తమతమపనులను నెరవేర్చుకొనునిమిత్తమై జనసమ్మర్దముగల పట్టణపు రాజవీధినిబోవు బాటసారులు ఎవరిదారిని వారు ఇతరులతో సంబంధములేకుండ పరుగులెత్తు చుండునట్లు ఎల్లప్పుడును చరచర తిరుగుచుండును. కణకవచము యొక్క లోపలితట్టున మూలపదార్థ మిట్లు గిరగిర తిరుగుచుండుట వృక్షజాతికణములయందు తరుచుగ జూచుచుందుము. అన్నివైపులను ఆవరించి మూసివేసినదళమైన కణకవచముయొక్క ఆటంకముచే, స్వభావసిద్ధముగ ప్రవహించుశక్తిగల మూలపదార్థము తానున్న స్థలమునందే చుట్టిచుట్టి తిరుగుచుండును. ఈ చలన మొకవిధమైన సంకోచనాస్వభావమే (Contractility) యని చెప్ప వచ్చును. పై జెప్పబడిన జీవస్థానములు గుండ్రనైన కణికలవలెనుండి మధ్య కొంచెము వంగియుండును. రంగులలో ముంచియుంచిన వారిపర్ణియొక్క సూక్ష్మములగు తునకలలో ఇవి మిక్కిలి బాగుగ కనుబడుచుండును.

శాఖాంతముయొక్క సూక్ష్మనిర్మాణము.

పైని వ్రాసినసామాన్యవర్ణనలో ప్రతిశాఖాంతమును కొనమొగ్గచే గప్పబడి ముగియునని వ్రాసియుంటిమి. ఇచ్చటి స్కంధశిరమునుండి నలువైపులను పుట్టి మొగ్గగా ముడుచుకొను ఆకులను (ఆ3.) త్రుంచివేయగా స్కంధశిరము వెల్లడియగును (18-వ పటమున ఖం4. లో స్కం. శి. చూడుము). ఆ స్కంధశిరము పైని స్కంధకణ మగపడును. ఆస్కంధముయొక్క కొనయందు తిరిగి యొక చిన్న ఆకులవరుసయును (ఆ2.) వానిచే కప్పబడి యొక చిన్న స్కంధశిరమును (ఖం3. లో స్కం. శి.) కనిపించును. ఈయాకులుగూడ మొగ్గలవలె ముడుచుకొని యుండును. వీనిని నెమ్మదిగా త్రుంచివేయగా, తత్పూర్వపుఖండములోని వానికంటె చిన్నవైన స్కంధమును, స్కంధశిరమును (ఖం2. లో స్కం. శి.) చిన్న చిన్న ఆకులును (ఆ1.) బయటబడును. వీనినిగూడ త్రుంచగా వానిలోపల సూక్ష్మదర్శినిలోగాని స్పష్టముగా కానరాని యతి సూక్ష్మమగుభాగ ముండును (పటములో పైఖండము (ఖం1.) లోని స్కం. స్కం. శి. చూడుము).ఇందలి కనుపునుండి (ఖం1. లో స్కం. శి.) వెలువడు చిన్న మొటిమలు ఆకులయొక్క ప్రథమరూపములు. వీనికి పై తట్టున లింగాకారముగా నుండు నిజమైనకొన యనదగు అంత్యకణము (అ. క.) సూక్ష్మదర్శనితో చూడగా కనిపించును. ఇది యేకకణము. దీనికి వృద్ధికణము

ఈ పటము కొనమొగ్గయొక్క సూక్ష్మనిర్మాణము తెలుపును. ఇందు నాలుగు ఖండములు గలవు (ఖం4. ఖం3. ఖం2. ఖం1). ఒక్కొక ఖండమునందు స్కంధశిరము (స్కం.శి). స్కంధము (స్కం) అను రెండు భాగములు గలవు. స్కంధశిరములనుండి ఆకులు (ఆ3. ఆ2. ఆ1.) పుట్టును. స్కంధశిరము అనేక కణములవలన నేర్పడినది. స్కంధము ఒకటే కణము. ఖం1 - అను మొదటి ఖండమునందలి స్కంధములో జీవస్థానము గుండ్రముగ నున్నది. ఖం2. అనురెండవ ఖండములోని స్కంధములో నది అడ్డముగా సాగియున్నది. జీ - చూడుము. పటముయొక్క కొనయందున్న అంత్యకణము (ఆ.క) యొక్క ఆకారము చూడుము. ఇందు అవకాశములు లేవు. జీ - జీవస్థానము గుండ్రముగ నున్నది. (Growing Point) అనియు, అంత్యకణము (Terminal Cell) అనియు పేర్లు. ఇదియే కొమ్మయొక్క పెంపున కాధారమైనది.

అంత్యకణముయొక్క నిర్మాణము.

ఇది యెట్టిదో, వృక్షమంతయు దీనినుండి ఎట్లు నిర్మింపబడుచున్నదో తెలిసికొనుటకు కొనమొగ్గను నిలువున చీరి యాతునకలను సూక్ష్మదర్శనిలో పరీక్షింపవలయును. ఈ యంత్యకణము అంగుళములో 500-వ వంతు పరిమాణము గలదై అర్ధగోళా కారముగ నుండును. దీని కణకవచనము దళముగా నుండును. కణమంతయు దట్టమయిన అణువులుగల మూలపదార్థముతో నిండియుండును. ఇందు పెద్దదైన గుండ్రని జీవస్థానము చక్కగా తెలియుచుండును. అంత్యకణమందు అవకాశము లుండవు.

అంత్యకణఖండనము.

అంత్యకణము సజీవవృక్షమునందు ద్విఖండనవిధానముచే విరామము లేకుండ చీలుచుండును. మొదటి నిది అడ్డముగా రెండుగా చీలును (19-వ పటము 1-లో అ. క, ఉ. అ. క). అందు పైకణము

తిరిగి అంత్యకణ మగును (అ. క). క్రిందిది ఉపాంత్యకణము (ఉ. అ. క.) (Sub-apical Cell). ఈయుపాంత్యకణము తిరిగి అడ్డముగా ఖండింపబడును (19-లో 2-వ పటములో ఉ. అ. క. లో స్కం. శి;స్కం0. అందు మీదికణము తత్క్షణమే నిలువున అనేకకణములుగా చీలును (స్కం. శి). క్రిందిది చీలక నిలిచియుండును (స్కం).

ఉపాంత్యకణము.

ఈయుపాంత్యకణమునుండియే యొకఖండమంతయు నిర్మింపబడుచున్నది. ఎట్లన, దానినుండి పుట్టిన రెండుకణములలో పై కణమునుండి స్కంధశిరమును, ఆకులును గలుగుచున్నవి (స్కం. శి). క్రిందికణమునుండి స్కంధ మేర్పడుచున్నది (స్కం). క్రిందిభాగము విభజింపబడకుండుటయు, పైభాగ మనేక కణములుగ చీలుటకు ప్రారంభించుటయు జూచినతోడనే ఏభాగము స్కంధము కాదగియున్నదో ఏది స్కంధశిరము కాదగియున్నదో గుర్తింప వలనుపడును. ఇ ట్లేర్పడిన స్కంధశిరమునుండి పొట్టివైన మొండిమొలకలు బండి ఆకులవలె నలువైపుల నంకురించును. ఇవి పరిమాణమున పెరిగి, చీలి, యాకులగును.

పైని జెప్పబడిన ప్రకారము క్రమము తప్పక ఎడతెగని ఖండనమువలన వారిపర్ణియొక్క సమస్తభాగములును ఏర్పడుచున్నవి. ఎట్లన అంత్యకణమునుండి క్రొత్త యుపాంత్యకణములును, ఈ యుపాంత్యకణములనుండి స్కంధశిర, స్కంధకణములును, స్కంధశిరకణములు నిలువున చీలుటచే పత్రాధారకణములవరుసయు, పత్రాధారకణములనుండి ఆకులును నిరంతర మేర్పడుచుండును. స్కంధకణము చీలదు; దీనినుండి స్కంధ మేర్పడుచున్నది.

వృక్షముయొక్క పెంపంతయు కణఖండనముచే నగుచున్నదని చెప్పియుంటిమిగదా? అట్టి ఖండనమువలన గలిగిన భాగములన్నియు ఏకరూపముగలవిగ నుండక, కొన్ని యాకులుగను, కొన్ని కొమ్మలుగను, కొన్ని వేళ్లుగను రూపాంతరములు జెందుటకు కారణమేమి? యని చదువరు లడుగవచ్చును. దీనికి ప్రత్యుత్తర మేమన, ఖండనముచే నేర్పడు క్రొత్తకణములన్నియు సమానముగా పెరుగక, కొన్నికొన్ని కొంతకొంతవరకు పెరిగి యంతటితో నిలిచిపోవుటయు, మరికొన్ని స్వల్పమాత్రము పెరుగగానే, చీలుటయు, నివి మొదలైనకారణములచే నీ వివిధరూపము లేర్పడుచున్నవి. ఎట్లన, స్కంధశిరకణములు అనతికాలములోనే నిలువున పెరుగుట మాని, చిన్నవిగా నిలిచియుండును. కాని స్కంధకణము లతిశీఘ్రముగా పెరిగి, తమకు ఉపాంత్యకణమునుండి ఏర్పడునప్పు డున్న పరిమాణముకంటె మూడువేల (3000) రెట్లు హెచ్చుపరిమాణము గలవగును. ఆకులుగూడ మొదట మిక్కిలి పొట్టివైన మొటిమలు. ఇవి కొంతవరకు పెరిగినపిమ్మట వాని పైభాగములు చీలి చిట్టిఆకు లగును. ఈ ఆకులు అంత్యకణమువైపునకు విల్లువంపుగా వంగి యవి అన్నియు జేరి అంత్యకణమును కప్పుటచే కొనమొగ్గ యేర్పడుచున్నది. క్రమముగా నీ మొగ్గయందలి ఆకులు విస్తరించి తమకుతరువాత పుట్టిన లేతమొగ్గకు, తా మంతకుముందు చేయు అంత్యకణసంరక్షణ నొప్పగించి తాము దూరమునకు, అనగా, క్రిందికి తొలగిపోవును.

ముదిరిన స్కంధకణమునందు జీవస్థానము లనేకము లుండునని చెప్పియుంటిమి. ఇవియును తరువాత నేర్పడినవే. బాల్యమునందు స్కంధకణమునందు గుండ్రని జీవస్థాన మొక్కటియే యుండును (19-లో 2-లో స్కం. చూడుము). స్కంధకణము ఎంత వెడల్పు గలదో అంత పొడుగుగా ఎదుగుసరికి జీవస్థానముకూడ విభాగమగుటకు ప్రారంభించును. కణముయొక్క వెడల్పుకంటె పొడుగు రెట్టింపుగా పెరుగువర కది పెక్కు జీవస్థానములుగా ఖండింపబడును. మరియు నం దనేకములప్పుడు చీలుచున్నట్టు చూడగలము.

వారిపర్ణి యంతయు నొక్క కణమునుండి పుట్టినది.

పై జెప్పబడిన అంశములబట్టి చూడ వారిపర్ణియు బూజుపోగువలెనే అంత్యకణమను నొక్కకణమునుండి పరిణమించినదే యని తెలియగలదు. కణవిభాగముచే స్కంధములు, స్కంధశిరములు, ఆకులును వేర్వేరుగా నేర్పడినతరువాత అవి వానివాని స్వభావములలో విస్తారము మార్పులు జెందక పరిమాణము నందుమాత్రము హెచ్చుచుండును.

శాఖోత్పత్తి.

ప్రతికొమ్మయు స్కంధశిరమునందుండు కణములలో నొకదానినుండి మొటిమగా బయలుదేరును. ఈ మొటిమకు శాఖాంకుర మని పేరు. ఈ మొటిమ యెల్లప్పుడును ఆకునకును గొమ్మకును నడుమ నుండు పంగలో నంకురించును. పిమ్మట నీ మొటిమ తల్లికణమునుండి ఖండింపబడి శాఖాంత్యకణముగా పరిణమించును. ఇ ట్లేర్పడిన అంత్యకణమునుండి పై జెప్పినరీతినే ప్రకాండ మేప్రకారము కణవిభాగముచే నేర్పడుచున్నదో అట్లే ఉపకాండములును సర్వవిషయముల ప్రకాండమును బోలి వృద్ధిబొందు చుండును. శాఖ లెల్లప్పుడు ఆకుపంగనుండియే పుట్టున వగుటచేత వీనిని ఆకులనుండి గుర్తింపనగు. అనగా నొకానొకభాగము శాఖయా? కాదా? యను సందేహము కలిగినప్పుడు ఆభాగము ఆకునకును, కాండమునకును మధ్యనుండు పంగనుండి పుట్టుచున్నదా? లేదా? చూచుకొనవలెను. అట్టి పంగనుండి పుట్టుచున్న యెడల ఆభాగము శాఖయే. లేదా అది శాఖ కాదు.

ఆకులయుత్పత్తి.

ఆకులు శాఖలవలె అనంతమైన పెంపుగలవి గావు. ఇవి శాఖాంకురములవలెనే మొదట మొటిమలుగా పుట్టి, యా యంకురములు కొద్దికాలము మితమైన సంఖ్యగల కణములుగా విభజింపబడి శీఘ్రకాలములో ఆదోకగా పెరుగును. పిమ్మట దీని యంత్యకణము ముల్లువలె మొనకూరి దళమైన కణకవచము గలదై అవి భాజ్య మగును. ఇంతటనుండి దీనిపెంపు తగ్గిపోవును.

మూలతంతువులు.

ఇవి చూపునకు వేళ్ల వలె నుండునుగాని నిజమైన వేళ్లుగావు. ఈ భేదము నిజమైన వేరునుగూర్చి తెలిసికొనునప్పుడు గ్రహింప గలుగుదుము. ఇవి తప్పక స్కంధశిరములనుండియే అంకురించును. ఇవి పొడుగైన పోగులు. అక్కడక్కడ అడ్డుపొరలచే వేర్వేరుకణములుగా విభజింపబడి బూజుపోగును బోలియుండు కణపంక్తులు. ఇవియును బూజుపోగువలె అంత్యకణవిభాగముచేతనే పెంపొందును.

A. సూక్ష్మబీజాశయము. బ-బద్ద. సూక్ష్మ బీజాశయమునం దిట్టి బద్దలు ఎనిమిది గలవు. అందు నాలుగుమాత్రము పటములో జూపబడినవి. తొ - తొడిమ. పి-పిడి. త.క - తలకణము. ముం.క-ముందలకణము. బీ.తం-బీజతంతువులు.

B. ఇం దొకబద్ద పెద్దదిగ జూపబడినది.

C. ఒక సూక్ష్మబీజము.

D. E. F. స్థూలబీజాశయములు. తొ-తొడిమ. వ్యా.క-వ్యాపవర్తకకణములు. స్కం.శి-స్కంధశిరకణము. స్థూ.బీ-స్థూలబీజము. బు-బురుజు. E. లో బురుజుమధ్యమున నున్న రంధ్రము నల్లగ జూపబడినది. ఈ రంధ్రముగుండ సూక్ష్మబీజము స్థూలబీజాశయములోనికి ప్రవేశించును.

సూక్ష్మబీజాశయములు.

ఇవి చిత్రమైనవిగను గ్రహించుటకు కొంచెము కఠినమైనవిగను ఉన్నవి. సూక్ష్మబీజాశయము గుండ్రముగను నారింజరంగుగల చిన్న గోలీకాయవలెను ఉండునని చెప్పియుంటిమి. ఇదియొక చిన్నతొడిమ (Stalk) చే ఆకు నంటియుండును. దానిగోడలు 20-వ పటములో A. B. లలో జూపినప్రకారము విల్లువంపుగా నుండెడు ఎనిమిది బద్దలచే (బ) జేయబడినది. ఈ బద్దల కొనలయందు కక్కులు గలవు. ఒక బద్దయొక్క కక్కులు (కరుకులు) మరియొక బద్దయొక్క కక్కులలో నిమిడియుండుటచే నివి యతుకుకొనును. ఒక నారింజపండును ఒక దాని కొకటి సమకోణము (Right angel) గలవగు రెండుకోతలచే నిలువున చీరి నాలుగు పొడుగైనముక్కలు చేయుము. ఇట్టిపండును నడుమ నడ్డముగా పై జెప్పిన కోతలకు సమకోణము లగునట్లుగా నొక కోతచే కోయుము. ఇట్లు జేసిన నా పండు ఎనిమిది సమభాగములగును. ఈ ముక్కల అంచులందు రంపపుపండ్లవంటి కక్కులుండునని తలచుము. ఇం దొక దానికక్కులు మరియొక దాని కక్కులలో నమరియుండునట్లు అతికి తిరిగి నారింజపండు ఆకారమును ఏర్పరచవచ్చును. ఇదేప్రకారము పై జెప్పిన సూక్ష్మబీజాశయముయొక్క ఎనిమిది బద్దలును అతుకుకొని యుండునని గ్రహించవలయును.

ఈ బద్దలలో ఒక్కొక్కటియు ఒకప్రక్క లోటును, రెండవప్రక్క ఉబ్బును గల ఒక్కొకకణము. దాని లోపలితట్టున అనేకములైన హరితకములు గలవు. ఈ హరితకములు లోపలి అంచుననుండి పై యంచంతయు స్వచ్ఛముగా నుండుటచేత నీసూక్ష్మబీజాశయము, సరిగా సరిపోయిన గాజుకుప్పెలో కూర్చిన నారింజపండువలె కనిపించును. ఈ బద్దయొక్క లోపలితట్టున, మధ్యభాగమున నొక గొట్టమువంటి కణము పిడివలె (Handle) సూక్ష్మబీజాశయముయొక్క గోడనుండి, మధ్యవైపునకు వ్యాపించియుండును (20-వ పటములో A. B. లలో పి. చూడుము). ఈ పిడియందును నారింజరంగుగల హరితకము లుండును. ఇట్టి పిళ్ళ ఎనిమిదింటిని ఎనిమిది తలకణము (Head Cells) లుండును (20-వ పటములో A. B. లలో త. క). ఈ తలకణ మొక్కొక దాని నంటి ఆరు ముందలకణము (ముం. క.) లుండును (SuβHead Cells). ఈ ముందలకణమున కొక్కొకదానికి నాలుగు మిక్కిలి చిన్నవియు మృదువు నైన మెలికలుతిరిగిన బీజతంతువులను దారము లంటియుండును (20-వ పటములో A. B. లలో బీ. తం. చూడుము). ఈతంతువులు బూజుపోగుకణముల బోలియుండు చిన్నచిన్న కణముల పంక్తులు.

కాబట్టి యొక్కొక బీజాశయమునందు 8 పిళ్లును, పిడి యొకటింటి కారు ముందలకణములును, ఒక్కొక ముందల కణమునకు నాలుగు బీజతంతువులును చొప్పున మొత్తముమీద ఒక్కొక బీజాశయమునందు రమారమి రెండువందల (200) బీజతంతువు లుం (Spermatic filaments) డును. ఈ బీజతంతువు లన్నియు జేరి బీజాశయముమధ్య తెల్లని దూదిపింజెవలె చుట్ట చుట్టుకొనియుండును.

ఈ బీజతంతువునందలి కణములు మొదట బూజుపోగులోని కణములవలె నున్నప్పటికిని బీజాశయము ఫలించుతరికి ప్రతికణములో పాముచుట్టవలె చుట్టుకొనియున్న సూక్ష్మ (మగ) బీజ మొకటి యుండును. ఈసూక్ష్మబీజమునకు 20-వ పటములలో C-లో జూపినప్రకారము ఒకకొనను లావుగ నుండు తలయును, రెండవకొనను సన్నని రెండుతోకలు నుండును. బహుశ: నిజమయినబీజము తలనుండి తోకలవరకు నుండు భాగమే. ఈ భాగము కణముయొక్క జీవస్థానమునుండియు, మిగిలినతోకలు మూలపదార్థమునుండియు గలిగినవని తోచుచున్నది. పై జెప్పిన రెండువందల బీజతంతువులలో ప్రతిదానిలో నూరు లేక 200 లు సూక్ష్మబీజకణము లుండును. ప్రతికణమున నొక సూక్ష్మబీజ ముండును గాన ఒక్కొక బీజాశయమునకు 20 వేలు మొదలు 40 వేలవరకు సూక్ష్మబీజము లుండవచ్చును.

బీజములు పూర్ణముగా పెరుగునప్పటికి బీజాశయము పైబద్దలు ప్రత్తికాయ వీడినట్లుగా పగిలి లోపలి బీజతంతువులు ప్రత్తివలె పైకి వెడలును. అంతట నా బీజములు చెదరి బీజకణములను పగుల్చుకొని బయటబడి నీటిలో స్వేచ్ఛగా నీదు చుండును.

స్థూల (ఆడ) బీజాశయము (Ovary).

ఇది అండాకృతి గలిగి యొక చిన్న తొడిమచే ఆకు నంటియుండును (20-వ పటములో D. E. F. లో తొ. చూడుము). దానిచివర కూజాగొట్టమువంటి పొడుగైన గొట్ట మొకటి యుండును (20-వ పటములో F). స్థూలబీజాశయముయొక్క వెలుపలివైపున మరమేకు చుట్లవలె తిరుగుచు పై కెక్కెడు చాళ్లు (Grooves వ్యా. క.) కనుబడును. ఇవి అడుగుననుండి మీదికెక్కి పై భాగమున నన్నియు బురుజులో జేరిపోవును (క్రింద చదువుము). లేత ఆశయములందు మధ్యభాగమున కాంతిహీనమైన ముద్దవంటి పదార్థ మొకటి కానబడు చుండును (20-వ పటములో D. E. F. లో స్థూ. బీ. చూడుము). ఈ ఆశాయమును చిన్నచిన్న తునకలుగా ఖండించి వానిని సూక్ష్మదర్శనిలో పరీక్షించునెడల మధ్య నుండెడి యా పదార్థము స్థూలబీజమనియు, అది పిండి (Starch) యను నొక యాహారపదార్థపు నలుసులతో పూర్ణముగా నిండి యున్నదనియు తెలియగలదు. ఇది తొడిమ (తొ.) కొక చిన్నకణము ద్వారా అంటియుండును (20-వ పటములో D. E. F. లో స్కం. శి. చూడుము). తొడిమయును ఒక్కటే కణమువలన నైనది. తొడిమకును బీజమునకును మధ్యనుండు ఈ చిన్నకణమునుండి పదికణము లుద్భవించి, అవి మరచుట్టు చుట్లవలె తిరుగుచు పై కెక్కుచు స్థూలబీజముచుట్టు పటములో జూపిన ప్రకారము మెలితిరుగును. ఇట్లు తిరుగుచుపోయెడు కణములకు వ్యావర్తక కణము లని పేరు (20-వ పటములో వ్యా. క. చూడుము). ఈ పదింటికొనలయందు రెండేసికణములు బురుజులవలె (Crown) నేర్పడియుండును (20-వ పటములో E. లో బు.) ఇ ట్లీబురుజు కణములచే నేర్పడిన శిఖరముగుండ నొక సన్ననిరంధ్రము అడుగునుండి పైకి వచ్చుచు స్థూలబీజాశయముయొక్క లోపలిభాగమును నీటితో సంబంధముగలదానినిగా జేయును.

పూర్ణముగా తయారయిన మొక్క యొక్క ప్రతిభాగమును, అనగా స్కంధకణములును, స్కంధశిరకణములును, ఆకులును, వేళ్లును అన్నియు అంత్యకణమునుండియే ఏర్పడుచున్న వనియు, అవి బాల్యమునం దొకదాని నొకటి బోలియుండు కణములే యనియు ఆయాకణములయొక్క హెచ్చుతగ్గులైన కణవిభాగము (Cell division) కణవ్యత్యాసము (Differentiation) మొదలగు హేతువులచే వివిధరూపములు గలుగుచున్న వనియు జదివియుంటిమి. అట్లే బీజాశయములందుగూడ వాని ప్రతిభాగమును అంత్యకణము (Apical Cell) నుండి గలుగుచున్నదనిచెప్పిన వింతగా దోచవచ్చును.

సూక్ష్మబీజాశయములయుత్పత్తి.

ఇది మొట్టమొదట తొడిమ నంటియుండు నొక గుండ్రని కణము. ఇది క్రమముగా నెనిమిదికణములై యొక్కొకో టొక్కొక బద్దగా నగును. ఇం దొక్కొక్కటియు రెండుకణములుగానగును. అందు లోపలికణము తిరిగి రెండుకణము లగును. ఇప్పుడు ప్రతి బద్దయు మూడుకణములు గలదై యున్నది. అందు వెలుపలిది విల్లువంపుగా నుండు భాగము. నడిమిది పిడివలె నుండునది. లోపలిది తలకణము (20-వ పటములో A. B. లలో బ (బద్ద), పి (పిడి) త. క. (తలకణము), చూడుము).

ఈ తలకణమునుండి ముందలకణములును, బీజతంతువులును, స్ఫోటన (Budding) విధానమున పుట్టును. కాన నొకచిట్టిఆకు (Leaflet) నుండి సూక్ష్మబీజాశయము మంతయు కొన్ని మార్పులచే పరిణమించుచున్నదని చెప్పనగును. చిట్టిఆకునుభరించెడి తల్లియాకే తొడిమగా పరిణమించుభాగము.

స్థూలబీజాశయములయుత్పత్తి.

ఇదియునుగూడ ఏకకణమునుండియే యుత్పత్తి యగుచున్నది. ఆకణము తత్క్షణమే మూడుకణములుగా విభజింపబడి ఒక దానిపై నొకటి యెక్కి వరుసగనుండును (20-వ పటములో D. E. F. లో తొ. స్కం. శి. స్థూ. బీ. చూడుము). ఇందు మధ్యకణము (స్కం. శి.) నుండి పది మొటిమలు పుట్టి యవి పదికణములై మెలికలుతిరుగుచు పై కెక్కుచు స్థూలబీజాశయముయొక్క వెలుపలిగోడ నేర్పరచుచున్నవి. ఈ మూటిలోని పైకణము స్థూలబీజమగును. క్రిందికణము తొడిమి యగును. పిమ్మట ఈ మెలికకణముల అంత్యభాగమున రెండు అడ్డుపొర లేర్పడి యా పొరలు బురుజుకణములను ఖండించుచున్నవి. ఇవి స్థూలబీజముకంటె ఎత్తుగా పెరిగి దానిని నలువైపుల నావరించి శిఖరముగా నేర్పడుచున్నవి. ఇట్టి నిర్మాణమునుబట్టి స్థూలబీజాశయ మంతయు నొక శాఖాంత్యకణమునుండి కణవిభాగము, కణ వ్యత్యాసములవలన పరిణమించుచున్నదని స్పష్టపడుచున్నది. అది ఎట్లన, తొడిమ (తొ.) స్కంధకణమువంటిది (Internode). మధ్యకణము (20-వ పటములో D. E. F. లో స్కం. శి.) స్కంధశిరకణమును బోలియున్నది. మెలికకణములు (వ్యా. క.) ఆకుల బోలియున్నవి. స్థూలబీజము (స్థూ. బీ.) శాఖాంత్యకణము.

స్థూల (ఆడ) బీజ మెట్లు ఫలించును? ఇది ఫలించుట యనగా సూక్ష్మ (మగ) బీజముతో సంయోగము నొందుట. స్థూలబీజాశయములో మధ్యమున నున్న నీ స్థూలబీజమును సూక్ష్మబీజ మెట్లు చేరును? సూక్ష్మబీజములు, బీజతంతువునందలి కణములను పగుల్చుకొని నీటియందు స్వేచ్ఛగా నీదుచుండుట జూచియుంటిమి. ఇవి వాని తోకలసహాయముచే స్థూలబీజముల నిమిత్తమై వెదకుచు నీదుకొనుచు బోయిపోయి స్థూలబీజాశయమును స్పృశించినతోడనే దాని నంటుకొని, దాని శిఖరమునందుండు రంధ్రముగుండ నాయాశయములోనికి దిగి స్థూలబీజముతో నైక్యమై దానిని ఫలింపజేయును. ఇట్టి యైక్యముచే నేర్పడిన సంయుక్తబీజమే పిండము (Embryo) అగును.

పిండోత్పత్తి.

ఇట్టి పిండోత్పత్తి కాగానే స్థూలబీజాశయమునందు కొన్ని మార్పులు గలిగి పిండాశయ మేర్పడును. ఈ పిండాశయము తొడిమనుండి ఊడి నేలబడి కొంత విశ్రమకాలము గడచిన పిమ్మట తిరిగి యుత్పత్తి యగును. ఎట్లన, ముందుగా పిండము రెండుకణము లగును. అం దొకటి చిన్నది. రెండవది పెద్దది. మొదటికణము కేవలము మూలపదార్థముతో జేయబడినదై బురుజుసమీపమున నుండును. పెద్దకణము పిండి (Starch) అణువులతో నిండియుండును. మొక్కయంతయు చిన్నకణమునుండియే పుట్టుచున్నది. పెద్దకణము ఆహారము నిలువ జేసికొను గాదెవంటిది. ఇందుండి చిన్నకణము ఆహారము గొనుచుండును. ఈ చిన్న కణమునుండి పూర్వ వారిపర్ణియను నొక మొక్క పుట్టును. అది ఎట్లన, నీ చిన్నకణము మొదట రెండుకణములుగా ఖండనము నొందును. అం దొకటి క్రిందికి పెరుగును. దీనినుండి మూలతంతువు (Root filaments) లేర్పడును. రెండవది శాఖాంత్యకణమగును. ఇది పొడుగుగానెదిగి కణములపంక్తిగా ఖండింపబడును. ఈ కణములపంక్తియే పూర్వవారిపర్ణి. కొంచెము పెరిగినతోడనే పూర్వవారిపర్ణిలో నేవో రెండుకణములు స్కంధశిరములుగా నేర్పడును. అందు క్రిందిదానినుండి నిజమైన వారిపర్ణియొక్క మూలతంతువులు ఏర్పడును. పై స్కంధశిరమునుండి ఆకులు పుట్టును. ఈ కొమ్మకు ఆకునకు నడుమనుండు పంగలో నున్న యొక కణమునుండి యొక మొటిమ పుట్టును. ఈ మొటిమ క్రమముగా నొక కణముగా ఖండింపబడును. ఈకణము వారిపర్ణియొక్క అంత్యకణము (Apical Cell) గా నేర్పడును. దీనినుండి వారిపర్ణి యంతయు పుట్టుచున్నది. కాన నీవారిపర్ణి ప్రత్యక్షముగా సంయుక్తబీజమునుండి పుట్టుట లేదు. సంయుక్తబీజమునుండి పూర్వవారిపర్ణియను మరియొక మొక్క పుట్టి దానినుండి పుట్టిన యొక శాఖ వారిపర్ణి అగుచున్నది. సంయుక్తబీజము ఏకకణము మధుశిలీంధ్రకణములు బూజుపోగుల బీజములవంటిది. పూర్వవారిపర్ణి బూజుపోగువంటి కణములపంక్తి. దీనినుండి కణములయొక్క ఘనసముదాయమగు వారిపర్ణి పుట్టుచున్నది. ఏకకణమగు సంయుక్తబీజమునుండి యనేక కణముల కూర్పగు వారిపర్ణి ఎట్లు ఏర్పడుచున్నదో చక్కగ గ్రహింపనగును.

కణగుణనము, కణవ్యత్యాసము.

వికారిణి, సూక్ష్మజీవులు, ఆవర్తకారి, రక్తాక్షి ఇవియన్నియు ఏక కణప్రాణు లైనప్పటికి వీనియందలి మూలపదార్థము, కణకవచము మొదలగు కొన్ని భాగములయందుండు కొన్నికొన్ని వ్యత్యాసములచే వానిని మనము ఆయాజీవులుగా గుర్తించ గలిగి యున్నాము. ఆ జీవులయం దెన్నడును అనేకకణము లుండవు. ఇందు కణగుణనము అనగా కణముల సంఖ్యయందు వృద్ధి (Cell Multiplication) లేదు. ఈ కణములు విభాగమైనను అట్లు విభాగమగుటచే నేర్పడిన కణములు విడిపోయి వేర్వేరుగా జీవించును. కాని తల్లిజీవియందలి కణముల సంఖ్యను హెచ్చింపనేరవు.

పసిరికపోగు బూజుపోగు ఇవి యొకకణ మనేక కణములుగా గుణనమగుటచే నిర్మింపబడినవి. ఇం దొక కణమునకును మరియొక కణమునకును భేదము లేదు. అనగా కణవ్యత్యాసము లేదు, కాని కణగుణనము కలదు. వారిపర్ణి యందు కొన్ని కణములు విభాగమై గుణనమగుచు నొకానొక ఆకారమును నిర్మించుకొనుచున్నవి. మనము ముందు జదువబోవు హెచ్చుతరగతి వృక్షములయందువలె కణకవచము దళస రెక్కుట చేవదేరుట మొదలగు విశేషమార్పులు లేకపోయినను, వారిపర్ణి యందలి కొన్ని కణములు తాము నివసించు స్థానమునుబట్టియు చేయబోవు పనులనుబట్టియు, తమ స్థితిగతులకు తగినట్లుగా తమ మూలపదార్థము కణకవచము మొదలుగాగల వానియందు కొద్దికొద్ది మార్పులను బొందుచుండును ఎట్లన వారిపర్ణి యందలికణము కొన్ని ఆకులుగాపరిణమించి యొకవిధమైన వ్యాపారమును, మరికొన్ని నులివేళ్లుగా పరిణమించి మరియొక విధమైన వ్యాపారమును చేయుచున్నవి. అనగా వారిపర్ణిలో కణవ్యత్యాసము ఈషన్మాత్రము కన్పట్టుచున్నది. ఇట్టి కణవిభాగము కణవ్యత్యాసములచేతనే కొనమొగ్గలు, ఆకులు, వేళ్లు మొదలైన వేర్పడుచున్నవి. కణగుణనమును, కణవ్యత్యాసమును సూచించుజీవులలో మనము జదువు వానియందు వారిపర్ణి మొదటిది.