జీవశాస్త్ర సంగ్రహము/ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఎనిమిదవ ప్రకరణము.

పసిరికపోగులు (Spirogyra).

నిలువ నీరుండు గుంటలయందును, మెల్లగా ప్రవహించు కాలువలయందును, తేలుచుండు పచ్చని తెట్టెవంటి తుక్కులో తక్కిన యన్నిజాతులకంటె తరుచుగ నుండెడు మిక్కిలి సన్నని పొడుగుపాటి కొంచె మాకుపచ్చని దారములకు పసిరికపోగు లని పేరు. ఇం దొకపోగును సూక్ష్మదర్శనిలో పరీక్షించినయెడల మరమేకుచుట్లవలె క్రమముతప్పక చుట్టిచుట్టివచ్చు ఆకుపచ్చనిపట్టెలు (Bands) దారముయొక్క లోతట్టున చుట్టు వ్యాపించియున్నట్టు తెలియగలదు (15-వ పటములో A. చూడుము).

సూక్ష్మ నిర్మాణము.

సూక్ష్మదర్శనిలో పరీక్షించునప్పుడు బూజుపోగునందు వలెనే దీనియందును కణములు ఒక్కటేపంక్తిగా నొకదానిప్రక్క నొకటి చేరియున్నట్టు తెలియగలదు. కాని బూజు పోగునకును పసిరికపోగునకును ఆకారమునందు భేదము లెవ్వియన, బూజుపోగునందు తరుచుగ శాఖ లుండును. అనగా ఒకపోగునుండి అనేక పిల్లపోగులు పుట్టుచుండును. అదిగాక ఆపోగుల మొదలు మొండిగను, చివర సన్నముగ నాదోకకగను ఉండును (12-వ పటములో B1. B2. చూడుము).
Jeevasastra Samgrahamu.pdf

A. ఒక పసిరికపోగునందలి మధ్యభాగము. ఈ పోగు అనేక అడ్డుపొరల (అ.పొ) చే వేరువేరుకణములుగా విభజింపబడినది. హ.ప-హరితక పుపట్టెలు మరమేకుచుట్లవలె, కణముయొక్క కవచము (క.క.) లోపలితట్టున చుట్టిచుట్టి పోవుచున్నవి. కుడివైపున చివరనుండు కణమునందు మూలపదార్థమును, జీవస్థానమును చక్కగ తెలియు నిమిత్తమై హరితక పుపట్టెలు విడిచివేయబడినవి. అందు తెల్లగ జూపబడినభాగమంతయు అవకాశము. కణముమధ్య నుండు జీవస్థానము చుట్టును, కణకవచముయొక్క లోపలితట్టున నొక పొరగాను, ఈ మునకును మరియొకకణమునకును మధ్య నడ్డముగ వ్యాపించు సెల్లులూసుపొరలు పోగును వెవ్వేరుకణముల విభజించును (A.లో అ. పొ. చూడుము). కణమునందలి మూలపదార్థమును గూర్చి కొన్ని విశేషవిషయములు గలవు.

ఈవరకు చదివిన జీవులలోని కణములందు అవకాశములు చూచుయున్నాము. వృక్షజాతికణములలో ముదురు వానియందు ఈ యవకాశములు మిక్కిలి పెద్దవి యగుటచే మూలపదార్థము స్వల్పమై కణకవచము నంటి యొక పలుచని పొరగా నుండును. ఈ విషయము పసిరికపోగుల కణములందు మిక్కిలి స్పష్టముగ తెలియగలదు. కాని వీనియందు మూలపదార్థము కణకవచము నంటిమాత్రమే యుండక, అవకాశము మధ్యనుండు జీవస్థానము చుట్టును నిర్ణయమైన ఆకారములేని చిన్న సముదాయముగాను, దానినుండి కణకవచము నంటియుండు మూలపదార్థము వరకు (బండికుండనుండి పూటీలవరకు వ్యాపించు ఆకుల (Spokes) వలెను నుండునట్టి) మిక్కిలి కోమలమైన కిరణములుగాను ఏర్పడి యుండును (A-లో కి-కిరణములు, మూ. ప-మూలపదార్థము చూడుము). దీని మధ్యనుండు జీవస్థానము బాదముకాయవలె స్పష్టముగ తెలియుచుండును. దానిమధ్య నొక చుక్కవలె కనుబడు అంతర్జీవస్థానమును గలదు.

మన మీవరకు జదివిన ప్రకరణములయందు జెప్పబడినట్లు హరితకములు మూల పదార్థమునం దక్కడక్కడ చిమ్మ బడియుండక, కణకవచముయొక్క లోపలితట్టున పటములో జూప బదులుగా పోగుమధ్య రెండు క్రొత్తపిల్లకణము లేర్పడుటచే పోగు పెద్దదగును. ఇట్టిపెంపునకే నడిమిపెంపు (Interstitial growth) అని పేరు. బూజుపోగునందలి కొన పెంపు (Terminal growth) నకును, దీనికిని గలభేదము చక్కగా తెలిసికొన నగును (116-వ పుట చూడుము). బూజుపోగుయొక్క రెండుకొనలకును భేద ముండుటకును పసిరికపోగుయొక్క రెండుకొన లొక్కరీతిగనే యుండుటకును పెంపునందలి వ్యత్యాసమే కారణము.

2. స్త్రీపురుషసంయోగము:- వేసవియందును, ఆకురాలు కాలమందును సమీపముననున్న రెండుపోగు లొక దానిప్రక్క నొకటి సమాంతర రేఖల (Parallel lines) వలె చేరును (15-వ పటములో B. చూడుము). ఇట్లు చేరిన కణములందు ఎదు రెదురుగా నుండువైపున గుండ్రనిపొట్టిమొటిమలు కణమున కొక్కొక్కటిచొప్పున నంకురించును. ఆ మొటిమలు పెరిగి యొకకణముయొక్క మొటిమ పటములో B-లో జూపబడినప్రకారము దాని యెదుటనున్న కణముయొక్క మొటిమతో కలియును. అట్లు కలియునప్పు డా రెండుమొటిమల మధ్యనుండు గోడ హరించిపోయి రెండుకణములకును మార్గ మేర్పడును. ఇట్లనేక కణములు ఒక్క సారిగా జతలుగా గూడి ఉద్దులు పట్టినట్లుగా సంబంధములు కలుపుకొనును. ఈరెండుపోగుల చేరికకు పటములో B-లో జూప బడినట్లు నిచ్చెనవంటిరూపము గలుగును.

ఈ పోగులయందలి కణములలో నొక్కొకకణము ఒక్కొక బీజాశయము (Gouad) అని చెప్పవచ్చును. ఈబీజాశయములలోని మూలపదార్థము కణకవచమునుండి విడివడి కణముమధ్య నొక ముద్దగా జేరును. ఈముద్దలే ప్రత్యక్షముగా సంయోగక్రియయందు నైక్యమగు సంయోగులు (Gamates). సంయోగార్థమై సమీపించు రెండుపోగులలో నేదో యొక దానియొక్క కణములయందలి మూలపదార్థము రెండవదాని కణములందలి మూలపదార్థముకంటె ముందుగా పైని జెప్పబడినప్రకారము ముద్దగా కణముమధ్యకు చేరును (B-లో పైవైపుననున్న పోగు చూడుము). ఇట్లు ముందుగా సిద్ధపడిన బీజాశయములయందలి మూలపదార్థము రెండవపోగునందలి కణములలోనికి పైని జెప్పబడిన మార్గములగుండ ప్రవేశించి వానియందలి మూలపదార్థపు ముద్దలతో నైక్యమగును (B. చూడుము). ఇట్లీ రెండుపోగులయందలి సంయోగుల యొక్క ఐక్యముచే గలిగిన ఫలితమునకు సంయుక్తబీజము (Zygote) అనిపేరు (B-లో స. బీ. చూడుము). సంయోగుల జీవస్థానములు రెండును మిశ్రమై యేక జీవస్థాన మేర్పడునని కనిపెట్టబడినది. సంయుక్తబీజము తన చుట్టును దళమైన కణకవచము నేర్పరచుకొని కొంతకాలము విశ్రాంతి జెందును (D1. చూడుము).

స్త్రీపురుషవివక్షత.

పసిరిక పోగునందు సంయోగులు రెండు నొకటే యాకారమును, సమపరిమాణమును గలవిగా నున్నవి. కాని యందొక సంయోగి చురుకుగ పనిచేయునదియు, రెండవది మందముగనుండు నదియుగా నున్నవి. సంయోగవిధానమంతటిని చురుకుగ పనిచేయు సంయోగియే నడపుచున్నది. కాని యిందు స్త్రీపురుషవివక్షత ఈషన్మాత్రము ఏర్పడియున్నది. ఏలయన, సంయోగులు రెండును సమరూపులును, సమపరిమాణులును అయినను, మనము ముందు జదువబోయెడు అనేకజీవుల సంతాన వృద్ధివిధానములతో దీనిని పోల్చి చూచినయెడల వీనియందలి చురుకైన సంయోగులు మగవనియు, మందములగునవి ఆడువనియు తెలియగలదు. సామాన్యముగా మగవి చిన్నవిగను ఆడువి పెద్దవిగను ఉండుటచేత మగవానిని సూక్ష్మసంయోగులు (Microgamates) అనియు ఆడువానిని స్థూలసంయోగులు (Magagamates) అనియు వాడుదుమని చెప్పియుంటిమి (102-వ పుట చూడుము). ఇట్లే సూక్ష్మసంయోగులు గల కణములకు సూక్ష్మబీజాశయములనియు, స్థూలసంయోగులు గల కణములకు స్థూలబీజాశయములనియు పేరు. B. అను పటములో పై పోగునందలికణములు సూక్ష్మ (మగ) బీజాశయములు (సూ. బీ. అ); క్రిందిపోగునందలి కణములు స్థూల (ఆడ) బీజాశయములు (స్థూ. బీ. అ); మగసంయోగికి సూక్ష్మబీజమనియు (Microspore), ఆడుసంయోగికి స్థూలబీజమనియు (magospore) గూడ పేరులు గలవు. సూక్ష్మస్థూలబీజముల సంయోగముచే నేర్పడిన ఫలితమునకు సంయుక్తబీజము (Zygote) అని పేరు.

పైని జెప్పబడిన విధానమువలన ప్రత్యేకముగా రెండు పసిరికపోగులు సమీపించి జతగూడి యం దొక దానికణములు మరియొకదానికణములతో నైక్యమగుటయేగాక, ఒకటే పోగునందుండు సన్నిహితకణము లొకదానితో నొకటి సంయోగమగు టయు గలదు. పటములో C1. లో జూపబడిన ప్రకారము ఒక పోగునందలి రెండు సన్నిహితకణములలో వాని సరిహద్దు గోడనుజేర్చి ఒకదానిమొటిమ మరియొక దాని మొటిమను అనునట్లుగా రెండుకణములును ఉబ్బును (పటములో C1. చూడుము). పిమ్మట నీ రెండు మొటిమల మధ్యనుండు గోడ హరించిపోయి యొక చిన్న మార్గమేర్పడి రెండుకణములు నొక దానితో నొకటి సంబంధము గలిగియుండును (C2, చూడుము). ఆరంధ్రముగుండా రెంటిలో నేదో యొక కణమునందలి మూలపదార్థము ముద్దగా గూడి, దానిప్రక్కనుండు కణములోనికి ప్రవేశించి దానియందలి మూలపదార్థముతో సంయోగమునొంది సంయుక్తబీజ మేర్పడును (C2. లో సం. బీ. చూడుము). ఇందు ఏకణము సంయోగార్థము ముందుగా ప్రయత్నించు చున్నదో అది సూక్ష్మబీజాశయము; అనగా మగది. దేనియందలి మూలపదార్థము తనస్థానమును కదలక యుండియు సంయోగమును జెందునో అది స్థూలబీజాశయము; ఇది ఆడుది సంయోగనిమిత్తమై సూక్ష్మబీజాశయమునందు కూడిన మూలపదార్థపుకూడికకు సూక్ష్మబీజము (Microspore) అని పేరు. స్థూలబీజాశయమునందలి అట్టికూడికకు స్థూలబీజము (Magaspore) అని పేరు. ఇట్టి బీజముల సంయోగమువలన నయ్యెడు ఫలితము సంయుక్తబీజము.

ఏకాంగులు; ఉభయాంగులు.

నిచ్చెనరూపమును గలిగించు సంయోగవిధానమం దొక పోగునందలి సంయోగులన్నియు మగవిగను రెండవదాని యందలి సంయోగులన్నియు ఆడువిగను ఉండునని చెప్పియుంటిమి. ఇట్లు పురుషజాతివియు, స్త్రీజాతివియు నగు సంయోగులు వేర్వేరు పోగులలో నుండు పసిరిక పోగులకు ఏకాంగులు (Monoecious) అని పేరు. పురుషయేకాంగులు స్త్రీయేకాంగులతో సంయోగము నొందును. అట్లుగాక స్త్రీపురుషులు రెండు నొకపోగునందే యుండువానికి ఉభయాంగులు (Dicecious) అని పేరు. ఇవి అర్ధనారీశ్వర రూపముననుండు శివపార్వతులకు బోల్చదగియుండును. ఇట్లే ఏలుగుపాము మొదలగు కొన్ని జంతువులలో గూడ స్త్రీపురుషాంగములు రెండును ఏకజంతువునందే ఉండునని రెండవ భాగమునందు చదువగలరు. ఇందు సూక్ష్మస్థూల బీజములు రెండును గలవు. ఇట్టి తంతువునందలిబీజములు తమలోదామే సంయోగము నొందును. వీనిని స్వసంయోగు లందురు (Self-fertilizing gamates).

3. మూడవ విధమైన సంతానవృద్ధి:- కొన్నిపోగులలో మూలపదార్థము కణకవచమును వదలి కణమధ్యమున దళమైన సెల్లులూసుపొర కట్టుకొని సంయోగవిధానముతో నిమిత్తము లేకయే సర్వవిషయముల సంయుక్తబీజమును బోలియుండును (పటములో D1. చూడుము). ఇట్టి బీజములకు సిద్ధ బీజములు (Spores) అని పేరు. కాని యీ సిద్ధబీజము తిరిగి మొలచునో మొలవదో కొంచె మనుమానముగా నున్నది. అయినను పసిరిక పోగులలో గాకపోయినను ఇతరజీవుల కొన్నిటియందు పురుష సంయోగము లేకయే ఫలించు స్థూలబీజములు గలవని కొందరు నిష్కర్షించియున్నారు. ఇట్టి సంతానవృద్ధికి కన్యాగర్భ మని పేరు (Parthenogenesis). పై జెప్పబడిన సంయుక్తబీజము పూర్ణముగా పెరిగినపిమ్మట దాని కణకవచము మూడుపొరలుగా విభజింపబడును. అందు నడిమిపొర యొక వింతతీరున మారి నీటిని చొరనియ్యనిదగును. అంతట నది తడిపొడులను (అనగా ఎండవానలను) లెక్క పెట్టని దై కొంతకాలము విశ్రాంతి నొంది పిమ్మట మొలకెత్తును. మొలకరించు సమయమున రెండు వెలుపలిగోడలును, మెత్తనయి ఉబ్బినవగును (D2. చూడుము). మూడవ యావరణములో నిమిడియున్న మూలపదార్థము ఆ యావరణపొరను ముందుకు త్రోసికొని ముగ్దరువలె పటములో D2. లో జూపబడినరీతిని వెలుపలి యావరణములను రెంటిని పగుల్చుకొని బయలు వెడలును. పిమ్మట నది క్రమముగా ననేక కణములుగా విభజింపబడి పసిరికపోగు రూపమును బొందును. కాన దీనియందును బూజుపోగునందునవలెనే యుక్తవయస్కములైన పోగులం దనేక కణము లున్నను అవి మొట్ట మొదట అనగా బాల్యమునం దేకకణప్రాణులుగా నుండెనని జ్ఞాపక ముంచుకొనవలయును.

పసిరిక పోగుయొక్క ఆహారము:- ఇది పూర్ణముగా హరితకముల సహాయముచే జీవించునది గాన దీని యాహారము కేవల వృక్షాహార మని చెప్పవచ్చును. ఇతరవృక్షములవలెనే యిదియును సూర్యకాంతి సహాయముచే కర్బనికామ్లవాయువును (CO2) విడదీసి యందలి కర్బనముతో నితరపదార్థముల జేర్చుకొని తమ మూలపదార్థమును తయారు చేసికొనును.


______