చిన్నయసూరి జీవితము/పాండిత్యప్రకర్ష - ఉద్యోగ ప్రయత్నములు
3. పాండిత్యప్రకర్ష - ఉద్యోగ ప్రయత్నములు
కాలక్రమమున సహజ మగు ప్రతిభాసంపత్తికిఁ దోడుగా హయగ్రీవమంత్రబలముగూడ ననుకూల మగుటచేత ముప్పదేండ్లు వచ్చుసరికి చిన్నయ సంస్కృతాంధ్రద్రవిడము లను మూఁడుభాషలయందు కూలంకషమగు పాండిత్యమును సంపాదించెను. కేవలము లక్షణగ్రంథములగు వ్యాకరణాదిశాస్త్రముల యందు పరిశ్రమఁజేసి లక్ష్యపరిజ్ఞానము నెఱుఁగని కొంతమంది లౌకికపండితులవలెఁగాక చిన్నయసూరి సిద్ధాంతకౌముది నామూలాగ్రముగా నాకళించినవాఁడయ్యు దానికి లక్ష్యములగు సంస్కృతకావ్యపఠనమునుగూడ సంపూర్తిఁ గావించినవాఁడు. తెనుఁగుభాషలో నారీతిగనే లక్షణగ్రంథములగు నాంధ్రశబ్ద చింతామణి, యథర్వణకారికావళి, అప్పకవీయము మున్నగు వానిని చక్కఁగ పరిశీలించుటయేకాక భాషయందు ప్రామాణికములైన నన్నయతిక్కనాది మహాకవుల కావ్యలక్ష్యగ్రంథములను పైవానితో సమీచీనముగా సమన్వయముఁ గావించుచు వచ్చెను. వ్యాకరణసూత్రములకును, ప్రామాణికకవి ప్రయోగమునకును నైక్యభావము సమకూర్చుట వ్యాకరణరచనకుఁ బునాదివంటిది. ఈ సమన్వయపద్ధతిని తొలినుండియు గ్రహించినవాఁ డగుటచేతనే చిన్నయ తరువాతికాలమున బాలవ్యాకరణమువంటి ప్రశస్తగ్రంథమును నిర్మించుటకు సమర్థుఁడైనాఁడు.
ఆంగ్ల భాషాభ్యాసము
ఆకాలమున నాంగ్లేయభాషయందే వ్యవహరించు రాజకీయోద్యోగులకు తెనుఁగుదేశమునఁ దెనుఁగుభాష నేర్చుకొన వలసిన యావశ్యకత యేర్పడినది. వారికి తెనుఁగు నేర్పెడు పండితునికి నారీతిగనే యాంగ్లేయభాషాపరిజ్ఞాన మావశ్యకమైనది. అయినను మన తెనుఁగుపండితులు సంస్కృతముఁ జదువుకొనెనను ఛాందసులగుటచే పాశ్చాత్యభాషయగు నాంగ్లేయభాషను నేర్చుకొనుట కాకాలమున నెంతమాత్ర మంగీకరింపరైరి. కొందఱు దానిని మ్లేచ్ఛభాష యని గర్హించిరి. కాని చిన్నయసూరి లోకజ్ఞుఁ డగుటఁజేసి దేశకాలపరిస్థితుల గమనించి తాను గొప్ప సంస్కృతపండితుండయ్యు నాంగ్లేయభాషను నేర్చెను. ఈవిధముగా నాంగ్లభాషాప్రాముఖ్యమును గుర్తించు టాతని నవీనదృక్పథమున కొక తార్కాణము. ఈ భాషాపరిచయముతో కంపెనీవారి ప్రభుత్వమునం దుండు నున్నతోద్యోగులతో స్నేహభావమును బెంపొందించుకొని చిన్నయసూరి వారి యనుగ్రహమునకుఁ బాత్రుఁడై నాఁడు. ఇంతియేకాక యీనాఁటి కొంతమంది రచయితలవలె తమ కేదో భాషాజ్ఞానము కలుగఁగానే గ్రంథరచన కుపక్రమించు నట్లుగాక నికరమును, నిర్దుష్టమును, నిరవద్యమును నగు పాండిత్యము పండఁబాఱినవెనుకఁగాని చిన్నయసూరి గ్రంథరచన కుపక్రమింపలేదు. విద్యాపరిజ్ఞానముతోఁగూడ ననుభవమును మేళవించి గ్రంథరచన ప్రారంభించుటచే నీతని గ్రంథము లుత్కృష్టములై యలరారుచున్నవి.
ఇట్లుండఁగా క్రీ. శ. 1836 - వ సంవత్సరమున వీరి తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులవారు కాలగతి నొందిరి. అప్పటికి వారి వయస్సు నూటపది సంవత్సరములు. సుప్రీముకోర్టున న్యాయాధిపతిగనున్న తండ్రి కాలధర్మమునొందుటచే సంసారభారమంతయు చిన్నయసూరిపైఁ బడెను. వెంటనే యుద్యోగప్రయత్నముచేసినను లభ్యము కాకపోవుటచే కొంతకాలము వీరి కుటుంబమునకు భోజనవసతులుకూడ సరిగా లభింపని పరిస్థితు లేర్పడెను. చిన్నయసూరి యట్టి క్లిష్టపరిస్థితులలోకూడ తన సాహిత్యవిద్యాపరిశ్రమను సాగించుచు కుటుంబభారమును నిర్వహించెను. ఇది సులభసాధ్యమైన పని గాదు. కాని చిన్నయసూరి దైవభక్తిపరాయణుఁ డగుటచే నీ విపదంభోధి నెదుర్కొని యచిరకాలములోనే దానిని తరింపఁగలిగెను.
ఆతని యదృష్టవశమున చెన్నపురియందలి 'ఆప్టను' మిషను పాఠశాలయందు కొలఁదివేతనముపై నొక యుపాధ్యాయపదవి లభించెను. ఇంతేకాక యీతని కాంగ్ల భాషాపరిజ్ఞాన ముండుటచే కొందఱు క్రైస్తవమతాచార్యు లీతనివద్ద తెనుఁగుపాఠములు చెప్పించుకొనుచుండిరి. సాహిత్యవిద్యయం దనుపమానపాండిత్యము కలవాఁడగుటచే చిన్నయసూరివద్ద పెక్కుమంది విద్యార్థులు పాఠములు నేర్చుకొని పండితపరీక్షలకు వెళ్లెడివారు. ఆ పరీక్షలలో తక్కిన గురువులవద్ద నేర్చినవారి కన్న చిన్నయశిష్యులు ప్రతిపరీక్షయందును ప్రథములుగా నుత్తీర్ణు లగుచుండిరి. దీనిచేత నీతని కీర్తిచంద్రికలు చెన్నపురిలో నలుదెసల వ్యాపింపఁజొచ్చినవి. ఈతని పాండిత్య ప్రతిభ, బోధనాశక్తి, విషయవైశద్యము, విచక్షణపరిజ్ఞానము నాకాలమందలి పండితమండలినేకాక పురప్రముఖలలో ముఖ్యు లగు శ్రీ గాజుల లక్ష్మీనరసింహముశ్రేష్ఠి, న్యాయాధిపతి కలుసలపల్లి రంగనాథ శాస్త్రి. పచ్చయప్పధర్మసంస్థ ప్రధానాధికారి కోమలేశ్వరపురపు శ్రీనివాసపిళ్ళె మున్నగు వారల నాకర్షించి ముగ్ధులను గావించినది. ఆ కాలమునందు చెన్నపురిలో జరుగు పండిత సభలకుఁగూడ నీతని నాహ్వానించు చుండెడివారు.