చిన్నయసూరి జీవితము/పచ్చయప్ప పాఠశాలా పండిత పదవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

4. పచ్చయప్ప పాఠశాలా పండిత పదవి

చిన్నయసూరి పండితసభల కాహ్వానింపఁబడుట కవకాశము నాతఁడు పాఠశాలలో ప్రవేశించిన రెండవయేఁటనే తటస్థించినది. క్రీ. శ. 1837 - వ సంవత్సరమున విక్టోరియా చక్రవర్తినీపట్టాభిషేక మహోత్సవము లండను నగరమున జరిగెను. అప్పటికి హిందూ దేశమున ఈస్టిండియాకంపెనీవారి యధికారమే చెల్లుబడి యగుచున్నను నామె సామ్రాజ్యాధికారిణి గావున చెన్నపురినిగూడ నొక మహాసభ యేర్పాటు గావింపఁబడినది. ఆ సభయం దనేకులు విద్వాంసులు, విద్వత్కవులు విక్టోరియాచక్రవర్తిని నాశీర్వదించుచు రచనలను గావించిరి. తెనుఁగుభాషలో చిన్నయసూరి 'విక్టోరియాచక్రవర్తినీ మకుటాభిషేక మహోత్సవ పద్యరత్నము' లను పేర తొమ్మిదిపద్యములు రచించి చదివెను. అవి సభ్యులను విశేషముగా నాకర్షించినవి. నిశితమైన పాండిత్యప్రకర్షకుఁ దోడుగా నిరుపమాన మగు కవితారచనకూడ కలుగుటచే చిన్నయసూరి ప్రతిభ సర్వేసర్వత్ర వ్యాప్తిఁ జెందినది. ఆప్టనుపాఠశాల యందలి పండితపదవి యాతని పాండిత్యమునకు సరిపోయినది కాదనియు, నంతకంటె నున్నతమును, ప్రసిద్ధమును నగు స్థానము లభింపవలె ననియు ప్రజలు భావించుచుండిరి. ఇంతలో చిన్నయసూరిజీవితములోని యుచ్చదశ ప్రారంభమగుట కనువగు పరిస్థితి యేర్పడినది. దానకర్ణుఁ డని ప్రసిద్ధిఁ జెందిన పచ్చయప్ప మొదలిపేర స్థాపించిన విద్యాసంస్థ యందు పండితుఁ డొకఁడు కావలసివచ్చెను. అప్పటికీ విద్యా సంస్థకు నధికారవర్గ మొకటి యేర్పడియుండెను. దాని కధ్యక్షులు శ్రీ కోమలేశ్వరపురపు శ్రీనివాసపిళ్ళెగారు. వారు పుట్టుకచే తమిళులయ్యును తెనుఁగుభాషయం దత్యంతాదరాభిమానములు గలవారు. వారు చిన్నయసూరికిఁగల యాంధ్ర భాషాపాండిత్యము తొలుతనే గుర్తించినవారగుటచేత నాతని పిలిపించి పచ్చయప్ప పాఠశాలయందు పండితపదవి నొసఁగిరి. ఇది క్రీ. శ. 1844 - వ సంవత్సరప్రారంభమున జరిగినది.

ఆకాలమునాఁటికి మదరాసు విశ్వవిద్యాలయ మేర్పడక పోవుటచే నున్నతపాఠశాల లనుపేర మూఁడుపాఠాశాలలు మాత్రమే చెన్నపురమున నుండెడివి. అవి 1. రాజధాని యున్నత పాఠశాల, 2. పచ్చయప్ప యున్నతపాఠశాల, 3. క్రైస్తవోన్నతపాఠశాల. ఇచ్చట నున్నతవిద్య గఱపఁబడుటచే వీని కాపేరు వచ్చినది. ఆనాఁ డున్నతవిద్య యనఁగా నేఁటి కళాశాలలలోఁ గఱపఁబడు పట్టపరీక్షాదివిద్యలని యెఱుఁగఁదగినది. విశ్వవిద్యాలయ స్థాపనమైన వెనుక కళాశాలల స్థాపనకూడ జరిగినది. నాఁటినుండి కళాశాలా విద్యల కున్నత పాఠశాలలు సోపానములైనవి. ఆ పాఠాశాలయందు చిన్నయసూరి నాలు గేండ్లు పనిచేసినట్లుగా నా పాఠశాల సాంవత్సరిక నివేదికలు తెలుపుచున్నవి.

అచ్చట పండిత పదవి నిర్వహించుటయేకాక యాతఁడు గ్రంథ రచనను చేయుచుండెడివాఁడు. ఆ కాలమున పాఠశాలా వార్షికోత్సవములయందు పచ్చయప్ప మొదలియారినిఁ గూర్చి పండితులు పద్యములు, శ్లోకములు వ్రాయుచుండెడివారు. అందు పాల్గొని చిన్నయసూరి తెనుఁగు పద్యములేకాక సంస్కృత శ్లోకములు వ్రాసియున్నాఁడు.*[1] ఆ పద్యములలో సభలో మెప్పుగొన్నకొన్నింటుకి పారితోషికములుకూడ నిచ్చెడివారు. అట్టి పారితోషికములు చిన్నయసూరియే ప్రతి సంవత్సరమును తప్పక పొందెడివాఁడు. అందుచేత సమకాలికులకు, సహాధ్యాయులకు నీతనిపై నీర్ష్యాభావ మంకురించినది. పైఁగా చిన్నయసూరి బ్రాహ్మేణేతర కులమునకుఁ జెందిన సాతాని వైష్ణవుఁడగుటచే కేవలము విశిష్టాద్వైత సంప్రదాయమును పాటించు వైష్ణవ పండితులును. నితర స్మార్త పండితులునుగూడ చిన్నయసూరి నిత్యానుష్ఠానపరత్వము, నియమ విశేషము గ్రహింపకయే ద్వేషింపసాగిరి. చిన్నయసూరి కవితాకమనీయతను గూర్చి యాతని పద్య రచనలు అను శీర్షిక చూడనగును. పద్య రచనయందేకాక పాఠములు చెప్పుటయందును చిన్నయసూరి మిగుల శ్రద్ధవహించి ప్రాచీన సాహిత్యము నందలి కేవల వ్యాకరణచ్ఛందోలంకార విషయములేకాక మూల కథా విన్యాసము. అర్థసంగ్రహము, మనోహరశైలి, లక్ష్య లక్షణ సమన్వయము మున్నగువానిని గూర్చి విద్యార్థులకు సుగమముగా నుండునట్లు బోధించెడివాఁడు. తానుకూడ నొక విద్యార్థివలె రేయింబవళ్ళు పరిశ్రమచేయుచు తనయొద్ద చదివిన శిష్యులను తన్ను మించినవారినిఁగా చేయుటకు ప్రయత్నించెడివాఁడు. ఇట్టి యున్న తాశయములతో నున్నత విద్య నేర్పిన చిన్నయసూరివంటి పండితుఁడు నేఁటి యధ్యాపక బృందమున కాదర్శప్రాయుఁడుగదా!

  1. * 'పచ్చయప్పను' గూర్చిన ప్రశంసా పద్యములు, సంస్కృత శ్లోకములు 'పచ్చయప్ప యశోనృప మండసము' అను పేర గ్రంథ రూపమున ప్రకటితమైనవి.