Jump to content

చిన్నయసూరి జీవితము/రాజధానీ కళాశాల పండిత పదవి

వికీసోర్స్ నుండి

5. రాజధానీ కళాశాల పండిత పదవి

చిన్నయసూరి వాఙ్మయ ప్రపంచమున చిరర్థాయియగు కీర్తిఁ బడయుటకు చెన్నపురి రాజధానీ కళాశాల పండిత పదవియే కారణభూతమైనది. కళాశాలలయందు పండిత పదవి యానాఁడు నేఁటివలె కేవలము సాహిత్య పాఠములకే సంబంధించినదికాదు. అంతకంటె నుత్కృష్టములగు న్యాయ శాస్త్రము, తర్కము, వ్యాకరణము విద్యార్థులకు బోధింప వలసిన యావశ్యకత యుండెడిది. చెన్న రాజధానిలో నీ కళాశాల పండిత పదవియొక్క చరిత్రము మనము పరిశీలించినచో చిన్నయసూరి కాలమునాఁటి కా పదవి యెట్టి గౌరవ పరిణామము పొందినదో గ్రహింపఁగలము. దీనికిముందు రాజధానీ కళాశాల తెలుఁగుశాఖ చరిత్ర తెలిసికొనుట యావశ్యకము.

చెన్నపురిలో కంపెనీ ప్రభుత్వమువారు క్రీ. శ. 1812 వ సంవత్సరమున ఫోర్టుసెంటుజార్జికోటలో నొక కళాశాలను స్థాపించిరి. దీనిలో ప్రభుత్వమున రాజకీయశాఖలో పనిచేసెడు నాంగ్లేయులకు మాత్రమే దేశభాషలగు తెలుఁగు, తమిళ భాషలలోను, భారతీయ భాషయగు సంస్కృతములోను శిక్షణ నిచ్చెడివారు. వారికేతప్ప స్వదేశీయుల కందు విద్య నేర్చుట కవకాశములేదు. మఱియు నాయుద్యోగులే న్యాయస్థానములలో తీర్పుచెప్పు అధికారము కలవారగుటచే హిందూ ధర్మ శాస్త్రమునందుకూడ వారు పరిశ్రమచేయుట యావశ్యక మైనది. పండితులుకూడ నా శాస్త్రమున ప్రావీణ్యము గలవారై యుండిరి. ఇట్టి పండితులలో మొదట నీ కళాశాల యందు తెలుఁగు భాషలో నియమితులైనవారు శ్రీ వేదము పట్టాభిరామశాస్త్రిగారు. వీరికి సహాయకారియగు పండితునిగా శ్రీ రావిపాటి గురుమూర్తిశాస్త్రి గారిని నియమించిరి. ఇందులో ప్రధాన పండితునికి నాకాలమున జీతము నెలకు నూటడెబ్బదియైదు రూప్యములు. ఆ కాలమున తెలుఁగు పండితునికి నూటడెబ్బదియైదు రూప్యముల జీతము ననుసరించినచో నీకాలమున 1400 రూప్యముల వేతనము నియ్యవలసి యుండెను. దీనినిబట్టి యా కాలమున నాపదవి కెంత గౌరవ ముండెడిదో తెలియచున్నదికదా!

పట్టాభిరామశాస్త్రిగారు 1816 వ సం.లో తెనుఁగున పద్యాంధ్రవ్యాకరణమును 'పట్టాభిరామ పండితీయ' మను పేరున రచించిరి. మఱియు 'ధాతుమాల' యను గ్రంథమును రచించిరి. ఇవి రెండును ముద్రితములు. గురుమూర్తిశాస్త్రిగారు క్రీ. శ. 1836 వ సంవత్సరమున నొక విపులమగు తెనుఁగు వ్యాకరణమును రచించి యానాఁడే ముద్రించిరి. ఈ వ్యాకరణ గ్రంథములు చిన్నయసూరి బాలవ్యాకరణ రచనమునకు నెట్లు మార్గదర్శకములైనవో రాఁబోవు ప్రకరణములలో చదువుదము.

గురుమూర్తిశాస్త్రిగారు క్రీ. శ. 1837 లో చనిపోయిరి. వీరి వెనుక పుదూరి సీతారామశాస్త్రులవా రా స్థానమున నియమితులైరి. వీరు పనిచేయుచుండఁగా, క్రీ. శ. 1840 లో నీ కళాశాల నెత్తివేసి కంపెనీ ప్రభుత్వము వారు రాధాని యున్నత పాఠశాలను స్థాపింపఁ జేసిరి. దీనియందు విశేష మేమనఁగా, స్వదేశీయులగు వారికిఁగూడ నిందు విద్య నేర్చుకొనుట కవకాశమియ్యఁబడినది. ఇదియే నేఁటి 'రాజధాని కళాశాల' - అనగా ప్రెసిడెన్సీ కాలేజికి మూలమైన సంస్థ. క్రీ. శ. 1853 లో మదరాసు విశ్వవిద్యాలయము ప్రారంభమైన వెనుక నిది కళాశాలగా రూపొందినది. అందు ప్రథమ శాస్త్రపరీక్ష, పట్టపరీక్ష తరగతులు నెలకొల్పఁబడినవి. ఆనాఁటికి విశ్వవిద్యాలయమున కంతటికి నిది యొక్కటే కళాశాల. ఈ కళాశాలలో పూర్వమువలెనే తెలుఁగు, తమిళము, సంస్కృతము మున్నగు శాఖలయందు పండితులు కావలసివచ్చినది. కాని పూర్వపురీతిగాఁగాక యే భాష బోధించెడువా రాభాషాసాహిత్యపాఠములనే బోధింప వలసిన నియమ మేర్పడినది. అనఁగా పాఠ్యప్రణాళికలో శాస్త్రము, సాహిత్యము వేఱువేఱుగా విభజింపఁబడినవి. అయినను తెలుఁగుపండితులకు మాత్రము ఛందోవ్యాకరణాలంకారములయందు, సంస్కృతసాహిత్యమునందు నసాధారణ పాండిత్య మావశ్యకమని నిర్ణీతమైనది.

ఈ నూతనపాఠశాలయందుఁగూడ సీతారామశాస్త్రిగారే తెనుఁగుపండితులై యాఱేండ్లకాలము నిర్వహించిరి. కాని క్రీ. శ. 1847 లో నీ పండితపదవియం దొక నూతనాధ్యాపకుని నియమించు పరిస్థితి యేర్పడినది. ఈ కళాశాలలో నింగ్లీషుభాష ప్రధాన భాషగా నుండి ఉత్తమ సాహితీపద్ధతుల పైని శిక్షణ గఱపఁబడుచుండుటచే దేశభాషాపండితులకుఁ గూడ కొంత యాంగ్లభాషాపరిచయము కలుగుట యావశ్యక మైనది. దీనికొఱకు క్రీ. శ. 1847 లో కేవల ప్రాచీనపండితులై యాంగ్లభాష నెఱుఁగని సీతారామశాస్త్రులవారి నాస్థానమునుండి తప్పించి, క్రొత్తపండితుని కొఱకు ప్రకటన గావించిరి. సీతారామశాస్త్రులవారు, తెనుఁగువా రాబాల గోపాలము ననవరతము నభ్యసింపఁదగిన, 'పెద్దబాలశిక్ష' యను గ్రంథమును 1849 లో రచించి ప్రకటించిరి. వీరే మొదట తెనుఁగువ్యాకరణమును ప్రశ్నోత్తరరూపముగా విద్యార్థులకు సులభముగా బోధపడునట్లు 'ప్రశ్నోత్తరాంధ్రవ్యాకరణము' అనుపేర రచించి క్రీ. శ. 1852 లో ప్రకటించిరి.

రాజధానీ కళాశాలాంధ్రపండితపదవి ప్రకటన వెలువడినతోడనే పండితులందఱును చిన్నయసూరిని ఈ పదవి నభ్యర్థించుచు నొక విజ్ఞాపనము నాకాలమున కళాశాల కధ్యక్షులును, రాజధాని విద్యాశాఖాదికారియు నగు శ్రీ A. J. అర్బత్‌ నాటు దొరగారికి పంపు మని ప్రోత్సహించిరి. చిన్నయసూరి యట్లే యొక విజ్ఞాపనపత్రమును పంపెను. కాని యీనాఁటివలెనాఁ డీపండితపదవు లధికారుల హస్తగతములు కావు. ప్రసిద్ధులగు విద్వాంసులసభలో పాండిత్యపరీక్షయం దభ్యర్థి యుత్తీర్ణుఁడైననే యీపదవి లభించెడిది. ఈ సూత్రము ననుసరించి చిన్నయసూరియు నట్టి విద్వత్సభాముఖమున తన యభ్యర్థిత్వము సమర్థించుకొనవలసివచ్చెను. అట్టిసభకు విద్యాధికారియగు ఆర్బత్ నాటుదొరగారు ముగ్గురు మహావిద్వాంసు లగు పండితులను పిలిపించి, చిన్నయసూరిగారిని పరీక్షింపఁగోరిరి. కాని యాసభలోనే పురాణము హయగ్రీవశాస్త్రిగా రను పండితుఁడు తానుకూడ నొక యభ్యర్థిగా నుందు నని సభలో వెల్లడించెను. అది చట్టమునకు కొంత విరుద్ధమైనను పండితుల ప్రోద్బలముచే ఆర్బత్ నాటుదొర యంగీకరించెను. వీరిరువురను పండితులు పరీక్షించిరి. అందులో చిన్నయసూరిగారినే ప్రథమగణ్యునిగా పరీక్షితు లేకగ్రీవముగా తీర్మానించిరి. తత్క్షణమే యాతఁడు రాజధాని కళాశాలలో ప్రధానపండితుఁడుగా క్రీ. శ. 1847 లో నియమితుఁ డయ్యెను.

అందు నియమితుఁడైన దినమునుండియు చిన్నయసూరి కడు జాగరూకతతో తన పండిత పదవి నిర్వహించుచు నచిర కాలములోనే యార్బత్ నాటు దొరవారి యాదరాభిమానములను చూఱగొనెను. విశ్వవిద్యాలయమునకు మూలభూతమగు నీ కళాశాలాధ్యక్షుఁడే యాకాలమున మదరాసు రాజధాని కంతటికి విద్యాశాఖాధికారిగ నుండుటచేత ఆ కళాశాల పండితులకు, వారి గ్రంథములకు దేశములో విశేషమగు పలుకుబడి, వ్యాప్తి యుండెడివి. ఆర్బత్ నాటు దొర దేశ భాషా పండితులను ప్రత్యేకముగా గౌరవించు స్వభావము కలవాఁడు. ఆ కాలమున కళాశాల పండితులందఱు 'శాస్త్రి' యను నుప నామమును ధరింపవలసిన నియమము కలదు. తెనుఁగుదేశపు సంప్రదాయము ననుసరించి వైదిక శాఖలో బ్రాహ్మణులు మాత్రము పుట్టుకచేత 'శాస్త్రి' నామమును ధరింతురు. అది వంశ పారంపర్యముగా వచ్చుచుండును. నియోగిశాఖలోని వారట్టి శాస్త్రి పదమును పండిత వృత్తిలోనున్నను ధరింపరు. కాని చిన్నయసూరికి ముందు ఫోర్టుసెంటుజార్జి కళాశాలలో పండితులై ప్రసిద్ధిచెందిన రావిపాటి గురుమూర్తిశాస్త్రిగా రాఱువేలనియోగి. అతఁడును కళాశాలా నిబంధనల ననుసరించి 'శాస్త్రి' యని వ్యవహరించుకొనెను.

చిన్నయ - 'సూరి' బిరుదము

చిన్నయసూరికిని ఉద్యోగములో ప్రవేశించునాఁటికి 'చిన్నయ' యనియే వ్యవహారము. ఒకనాఁ డార్బత్ నాటు దొరగా రాతనిఁ బిలిచి, "నీవు 'శాస్త్రి' యను నుపపదము నేల ధరింపలే"దని యడిగిరఁట. చిన్నయసూరి "అయ్యా! నేను పుట్టు శాస్త్రులను కాను; పెట్టు శాస్త్రులను కాను. కాఁబట్టి శాస్త్రినామమును ధరించుటకు జన్మముచే ననర్హుఁడను." అని జవాబిచ్చెను. "మఱి యేది పెట్టుకొనవచ్చు" నని దొరవారు తిరిగి ప్రశ్నించిరఁట. చిన్నయ 'సూరి' అను పదము నుపయోగింపవచ్చు నని సలహానిచ్చెను. అంతట నార్బత్ నాటుదొర యాంగ్లేయభాషలో 'చిన్నయ సూరి' అను నక్షరములతో చెక్కఁబడిన సువర్ణ హస్త కంకణమును సీమనుండి తెప్పించి యాతనిని బహూకరించెను. ఈ కంకణ ప్రదానము జరిగిన నాఁటనుండి 'చిన్నయ సూరి' అను వ్యవహారమే ప్రబలమైనది. ఇది యాతఁ డా కళాశాలలో ప్రవేశించిన కొంతకాలమునకు తర్వాత జరిగినది. ఏలయన, క్రీ. శ. 1847 లో నీతఁడును, వైయాకరణము రామానుజాచార్యులవారును కలిసి ముద్రించిన 'ఆంధ్ర మహాభారత' ప్రథమముద్రణ ముఖపత్రమున చిన్నయ యనియే వ్రాయఁబడియున్నది. 1847 చివరి భాగమునుండి యీపేరు ప్రసిద్ధి గాంచినది.

సూరి ప్రతిభా ప్రదర్శనము

దినదినప్రవర్థమానమగుచున్న చిన్నయసూరి కీర్తిని, ప్రతిష్ఠను అప్పటి సమకాలికు లగు పండితులు సహింప లేక, యీతఁ డాపదవి కసమర్థుఁ డని నిరూపించుటకు నొక పన్నాగమును పన్నిరి. గౌరవనీయులగు రంగనాథ శాస్త్రిగారి యింటియొద్ద నొక పండితసభ నేర్పాటుగావించి యకస్మాత్తుగా చిన్నయసూరి నచ్చటి కాహ్వానించిరి. రంగనాథ శాస్త్రిగారు న్యాయశాస్త్రమునందేకాక సంస్కృతభాష యందు, నితర శాస్త్రములయందు ప్రవీణత గలవారు. వీరికి పదునైదుభాషలలో పాండిత్య ముండెను. ఆకాలమున దేశభాషల విషయమై ప్రభుత్వమువా రీతనితోనే సంప్రతించుచుండిరి. అట్టివారి యధ్యక్షతక్రింద సూరిగారి నలంకార శాస్త్ర విషయమై యుపన్యసింపుమని కోరిరి. పండితుల కందఱకును సూరిగారికి వ్యాకరణమే కాని యలంకార మేమాత్రమును తెలియదను నభిప్రాయ ముండెడిది. ఉపన్యాసము ప్రారభించు సరికి మధ్యాహ్నము మూఁడుగంటలైనది. సూరి వేద కాలమునుండి యలంకారవిషయమును, దాని వ్యాప్తిని తెలియపఱచ నారంభించెను. గంగాప్రవాహమువలె నున్న యాతని యుపన్యాసధోరణి నాకర్ణించి సభాసదు లాశ్చర్యచకితులైరి. ఇంతలో సాయంకాలమయ్యెను. చీకటిపడఁ జొచ్చెను. కాలము నెవరు గమనింపకుండిరి. పనికత్తె దీపము వెలిఁగించెను. ఉపన్యాసము జరుగుచునే యుండెను. వినువారికి విసుగుపుట్టుట లేదు; కూర్చున్నవారు లేచుటలేదు; సభ్యులకు తనివి దీఱినట్లుగ లేదు. 'భోజన సమయ' మని సూపకారుని నివేదనమునుబట్టి కాలాతిక్రమణము నధ్యక్షులగు రంగనాథశాస్త్రులవారు గుర్తించిరి. సభామధ్యమున వారు లేచి, శ్రీసూరిగారియెడల తమ కిదివఱకున్న యభిప్రాయమును వదలుకొంటి మనియు, నానాఁటి యుపన్యాసముతో వారి పాండిత్యప్రకర్ష సర్వతో ముఖమైన దనిగ్రహించితి మనియు చెప్పి నాఁటి సభ ముగించిరి. తక్కిన పండితులుగూడ సూరిగారియం దానాఁటినుండి ద్వేష భావమును విడిచి మిక్కిలి గౌరవమర్యాదలతో ప్రవర్తింపఁ జొచ్చిరి.

సూరి దినచర్య

చిన్నయసూరి కళాశాలలో ప్రవేశించినదాదిగా నాతని దినచర్య యిట్లుండెను. అతఁడు తెల్లవాఱుఝామున లేచి కాలకృత్యములు నిర్వహించి మతసంప్రదాయికాచార నిష్ఠతో సాహిత్యవ్యాసంగము చేసెడివాఁడు. ఏదేని యొక విచిత్ర ప్రయోగమునుగాని, నూతనమైన పదములుగాని, విశేషముగల భాషాసంప్రదాయమునుగాని గ్రహింపకుండ నాతఁడు భోజనమునకు లేచెడివాఁడు కాఁడు. సకాలమునకు కళాశాలకు వెళ్లి పాఠములను బోధించెడివాఁడు. విరామకాలమునందు కళాశాలపుస్తకభాండాగారమున నున్న ప్రాచీనతాళపత్రగ్రంథ ములను, లిఖిత పుస్తకములను తదేకధ్యానముతో పరిశీలించెడి వాఁడు. ఇంకొక విశేష మేమనఁగా, తాను చదివి గ్రహించిన విషయముల నప్పుడే వ్రాసి భద్రపఱచెడి పద్ధతి నాతఁ డవలబించెను. తాను పాఠము చెప్పెడు గ్రంథములలోని లోపములను కనిపెట్టి,, వాని నున్నతవిద్య కనుకూలమైనరీతిగ సంస్కరించు రచనలను కావించెడివాఁడు. ఈరీతిగా నొక పదియేండ్ల కాల మచ్చట పదవిని నిర్వహించెను.

మదరాసు విశ్వవిద్యాలయ స్థాపనము

ఇంతలో క్రీ. శ. 1857 - వ సంవత్సరము ప్రారంభ మయ్యెను. ఈస్టిండియాకంపెనీప్రభుత్వ మంతరించి దేశపరిపాలనము సామ్రాజ్యాధికారిణియగు విక్టోరియాచక్రవర్తిని హస్తగత మయ్యెను. దానితో విద్యాశాఖయందు నవీనపద్ధతులు పరిణతిఁ జెంద నారంభించినవి. ఆ సంవత్సరముననే యున్నతవిద్యలకు కేంద్ర మగు విశ్వవిద్యాలయము మదరాసున స్థాపితమయ్యెను. అందు ప్రవేశపరీక్ష (మెట్రిక్యులేషను), ప్రథమశాస్త్రీయపరీక్ష (ఎఫ్. యే.), పట్టపరీక్ష (బి. యే.) అను శాఖ లేర్పఱుపఁబడినవి. పాఠ్యభాగము లన్నియు నాంగ్లేయ భాషలో బోధింపఁబడుచుండెడివి. దేశభాషాపరిజ్ఞానముకూడ నావశ్యకమే కాఁబట్టి తెలుఁగు, తమిళము విద్యార్థులు పఠింప వలసిన నియమ మేర్పడినది. కాని ఇంగ్లీషు ప్రధానభాష; దేశభాషలు ద్వితీయభాషలు. ఇంతకుముందు దేశభాషలే ప్రధానముగా నుండి ఇంగ్లీషుభాష యుద్యోగనిర్వహణమునకు మాత్ర ముపయోగపడుచుండెడిది. విశ్వవిద్యాలయస్థాపనతో ఆంగ్లేయభాష యుత్తమసాహితీశిక్షణకొఱకేకాక, పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య దేశములతో సంబంధము మనకు కలుగుట కనుకూలించినది. ఆ భాషాపరిజ్ఞానముకలవారికే ప్రభుత్వమున నున్నతోద్యోగములు, అధికారపదవులు లభించుటచే చెన్నపురమునందును, నితర ప్రదేశములయందును నసంఖ్యాకముగా నింగ్లీషుచదువు విద్యార్థులకొఱకు కళాశాలలుకూడ స్థాపితములైనవి. కాని వీనియన్నింటికంటెను ముందుచెప్పిన రాజధాని కళాశాలయే విశ్వవిద్యాలయమున మొదటి కళాశాల యైనది. ఆఁనాటి కింకను తక్కినచోట్ల కళాశాల లేర్పడలేదు. కాఁబట్టియే చిన్నయసూరి మదరాసు విశ్వవిద్యాలయ ప్రధానాంధ్రపండితుఁ డయ్యెను.

అప్పుడుకూడ సూరిగారి కభిమానులగు ఆర్బత్ నాటు దొరవారే విశ్వవిద్యాలయ కళాశాలాధ్యక్షులుగా నుండిరి. వారియం దుండు నపారగౌరవముచేత చిన్నసూరి తన గ్రంథములను వారికే కృతియిచ్చియున్నారు. ఈ విధముగా మఱి నాలుగేండ్లకాలము చిన్నయసూరి అసమానసామర్థ్యముతో పండిత పదవిని నిర్వహించి క్రీ. శ. 1861 - వ సం|| డిసెంబరు నెలలో రాచపుండు కలుగుటచే నుద్యోగమునుండి విరమించి, 1862 మార్చి నెలలో కీర్తిశేషుఁ డయ్యెను.

చిన్నయసూరి రచనలు

చిన్నయసూరి యొక సాధారణమైన తెనుఁగుపండితుఁడే యైనను నాతని రచన లాంధ్రవాఙ్మయ ప్రపంచమున నాచంద్రార్కము నిలుచునవియై, యాతని కమరత్వమును సిద్ధింపఁ జేసినవి. బాల్యమునుండి యహోరాత్రము లకుంఠితదీక్షతో నొనర్చిన భాషాపరిశ్రమచేతను, పాండితీగరిమచేతను, బోధనానుభవము చేతను, లక్ష్యలక్షణసమన్వయపరిజ్ఞానముచేతను, తన రచనలకు మెఱుఁగుపెట్టి, దిద్ది, తీర్చి సర్వాంగసంపన్నములుగా నొనర్చెను. దీనికితోడాతని యాత్మవిశ్వాసము, నాధ్యాత్మికపరిజ్ఞాన మాతని రచనల కొక సంపూర్ణత్వము సంపాదించినవి. విశ్వవిద్యాలయస్థాపనఫలితముగా ప్రాచ్యపాశ్చాత్యసంస్కృతుల సమ్మేళనమువలన నేర్పడిన నవీనయుగావిర్భావవికాసమునకు చిన్నయసూరి యెట్లు తోడ్పడెనో రాఁబోవుప్రకరణములఁ జదువుదము.