Jump to content

చిన్నయసూరి జీవితము/జననము - విద్యాభ్యాసము

వికీసోర్స్ నుండి

2. జననము - విద్యాభ్యాసము

చిన్నయసూరి చాత్తాదవైష్ణవ సంప్రదాయమునకుఁ జెందినవాఁడు. వీరినే 'సాతాను' లని యందురు. వీ రుభయ వేదాంత ప్రవర్తకులగు వైష్ణవాచార్యులతో సమానప్రతిపత్తి గడించినవారు. చిన్నయసూరి పూర్వికు లుత్తరదేశస్థులు; పరవస్తు మఠ మను నొక మఠమువారి శిష్యులు. వీరికిని బ్రాహ్మణులవలె సూత్రగోత్రములు గలవు. సూరిగారు ఆపస్తంబ సూత్రులు; గార్గేయ గోత్రులు; యజుశ్శాఖాధ్యాయులు. వీరి తండ్రిగారు వేంకటరంగరామానుజాచార్యులుగా రుభయ వేదాంత ప్రవర్తకులై, చెన్నపురమున తిరువళ్ళిక్కేణిలోని రామానుజకూటమునందు శిష్యులకు వైష్ణవమతసిద్ధాంతములను బోధించుచుండిరి. ఇట్లుండఁగా కొంతకాలమునకు శ్రీ ప్రతివాది భయంకరము శ్రీనివాసాచార్యులవారు వీరి బోధనా శక్తిని గమనించి వీరిని శ్రీ రామానుజులవారి జన్మస్థలమగు శ్రీపెరంబూదూరునకుఁ దీసికొనిపోయిరి.

అచ్చట కోవెలయందు వీరిని ద్రవిడ వేదపారాయణా ధ్యాపకులుగా నియమించి, తగిన వసతు లేర్పఱచిరి. శ్రీపెరంబూదూరున రామానుజాచార్యులవారు నివసించుచు నచ్చటికి వచ్చినవారి నందఱిని వైష్ణవమతప్రవిష్టులుగా నొనరించుచుండిరి. వీరు ద్రవిడవేదమేకాక సంస్కృతము, ప్రాకృతము, ద్రావిడము, తెనుఁగు మొదలగు భాషలు చక్కఁగా తెలిసినవారు. కనుక బాలురకు పాఠములుకూడ చెప్పెడివారు రామానుజాచార్యులవారి భార్య శ్రీనివాసాంబ. వారి కొక్క కొమరిత మాత్రమే యుండెడిది. ఆమె పెరిగి పెద్దదై వితంతు వయ్యెను. ఆ దంపతు లిరువురును పురుషసంతతి లేకపోవుటచే మిక్కిలి చింతించుచుండిరి. చాలకాలము గడిచినను వారి కోర్కె నెఱవేఱలేదు. తుట్టతుదకు వీరి మిత్రులగు శ్రీనివాసాచార్యుల వారు పుత్రోత్పత్తికొఱకు నొక యాగమును చేయించిరి. ఆ యాగపాయసమును భుజించినవెనుక నాదంపతులకు క్రీ. శ. 1806 ప్రభవసంవత్సరమున నొక పుత్రుఁడు జన్మించెను. అతఁడే మన కథానాయకుఁడు.

ఈతనికి తలిదండ్రులు 'చిన్నయ్య' యని నామకరణము కావించిరి. ఈ బాలునికి కుడికంటియందు నల్లగ్రుడ్డున్న స్థలము కొంచెము మాఱియుండెను. ఇది యొక శుభలక్షణ మని, దీనిని గలిగినవారు శాశ్వతమగు కీర్తిని సంపాదింతురని పెద్దలు చెప్పుచుండెడివారు. తలిదండ్రులును చాల కాలమునకు జన్మించిన పుత్రుఁడగుట చే నీతనిని మిగుల గారాబముతో పెంచుచుండిరి. ఈ కారణముచేత చిన్నయకు పదునాఱేండ్లు వచ్చువఱకు విద్యయం దాసక్తిగలుగుటకు నవకాశమే లేక పోయెను. ఇతఁడు తన తల్లితో పేరంటమునకు పోయి పాటలను పాడుచుండెడివాఁడు; ఇతర బాలురతో నాటపాటలతో కాలముఁబుచ్చెడివాఁడు. ఇట్లుండ నొకనాఁడు తండ్రిస్నేహితులగు కంచి రామానుజాచార్యులవా రితనినిఁజూచి "చదువులేని యీబాలుఁ డెవఁ" డని ప్రశ్నించిరి. విద్యాగంధము లేని బాలుని తన కుమారుఁ డని చెప్పుటకు తండ్రి సంకోచించెను. కాని రామానుజాచార్యులవా రా బాలుని పిలిచి, "నాయనా! మీతండ్రి గారు వయోవృద్ధులేకాక గుణవృద్ధులు, గురుపదారూఢులు నై యున్నారు. మావంటివా రెందఱో వారివద్ద శుశ్రూష లొనర్చి విద్యావంతులై నారు. అట్టి మహా విద్వాంసుని కడుపున నీయట్టి నిరక్షరకుక్షి జన్మించినాఁడు. నీకై నను బాల్యదశ గడచిపోయినది. ఇంకనైన నాలుగక్షరములు నేర్చుకొనకుండ వృధా కాలక్షేపము చేసినట్లయిన నీ తలిదండ్రులకు చెడ్డపేరు తెచ్చెదవు సుమా!" అని చీవాట్లు పెట్టిరి. ఆ మాటలు చిన్నయకు వాడిములుకులవలె మనమున నాటెను. అతడు నాఁటి నుండియుఁ దదేక దీక్షతో చదువుటకు పూనుకొనెను. తత్క్షణమే తండ్రిదగ్గఱ కరుదెంచి తనకు పాఠము చెప్పు మని కోరెను. అతఁడు తన స్నేహితులును, శిష్యులును నైన కంచి రామానుజాచార్యులవారికి చిన్నయకు చదువు నేర్పుటకు నొక జాబు నిచ్చెను. దానిని తీసికొనిపోయి చిన్నయ వారి కందిచ్చెను.

రామానుజాచార్యులవా రా జాబుచూచి "నీవు చదువు వాఁడవా? నాకు చాల సందేహముగా నున్నది" అనిరఁట. కాని చిన్నయ తాను, తప్పక, చెప్పినట్లు విని చదువుకొనెదనని బదులుచెప్పినంతనే యాచార్యులవారు ఇసుకయందు మొదట ఓనమాలను వ్రాసియిచ్చి చిన్నయను వ్రాయమని కోరిరి. ఆతఁడు తడుముకొనకుండ నటులనే తిరిగి వ్రాసెను. దానిని చూచి 'యీ బాలుఁడు బుద్ధిమంతుఁ'డని గ్రహించి అచ్చులను, హల్లులను వ్రాసియిచ్చిరి. గురువుగారు భుజించివచ్చునంతలో చిన్నయ వాని నన్నింటిని చక్కఁగా వ్రాసి చూపెను. ఆచార్యులవారు చాల సంతోషించిరి. చిన్నయ హృదయక్షేత్రమున నీరీతిగా నాటఁబడిన విద్యాబీజములు మెఱపుతీఁగెలవలె నతిస్వల్పకాలములో చక్కఁగా వృద్ధిచెంది పుష్పించి ఫలించినవి. పదునాఱేండ్లవఱకు పాండిత్యవాసనయే లేని బాలుఁడు ముప్పదేండ్లకు లోపుననే సాహితీసముద్రమును మథించి పాండిత్య పర్వతశిఖరము నధిరోహించినాఁ డన్న విస్మయావహముకదా! ప్రతిభాశాలురకు పుట్టుకతోడనే ప్రజ్ఞావిశేషము గలుగు నను సూత్ర మీతనియెడల ననువర్తింప లేదు.

సహజముగా గురువులయం దుండెడి భక్తిచేతను, చదువునందలి శ్రద్ధచేతను చిన్నయ త్వరలోనే గుణింతమును, వాక్యలేఖనమును నేర్చెను. లేఖనముతో కూడ వాచకత్వము నలవఱచుకొనుటకు పద్యములు, శ్లోకములు చదువుట ప్రారంభించెను. ఆకాలమున నిప్పటివలె వీథిబడులు, పాఠశాలలు విశేషముగా లేవు. గురువుల వాసగృహములే విద్యాస్థానములు. చదువులు చాలవఱకు లిఖితపుస్తకరూపమునఁగాక వాగ్రూపముగానే యుండెడివి. చిన్నయ యీ పద్ధతి ననుస రించి సంస్కృ తాంధ్ర భాషల రెండింటిని చదువ మొదలిడెను. మొదట బాలరామాయణమును, అమరమును, ఆంధ్రనామ సంగ్రహమును వల్లెవేసెను. అతఁ డేకసంథాగ్రాహి యగుటచే వానినన్నింటిని కొలఁదికాలములోనే హృదయంగతము కావించుకొన్నాఁడు. కొంతకాలమునకు తండ్రి యీతనిని పరీక్షింపఁదలఁచి పిలిపించి అమరమున కొన్నిప్రశ్నలను వేసినాఁడు. చిన్నయ ఝటితిస్ఫూర్తితో జవాబిచ్చి తండ్రిని సంతోషాంబుధి నోలలాడించినాఁడు. తన కుమారుఁ డింక సాహిత్యమును చదువ నక్కఱలేదనియు, శాస్త్రమువైపు నాతని దృష్టి ప్రసరింపఁ జేయవలయు ననియు, ముఖ్యముగా వ్యాకరణశాస్త్రము నభ్యసించవలసినదనియు బోధించి ఆతఁడు తానే యా వ్యాకరణవిద్యఁ గఱపుటకు పూనుకొనెను. కాని యింతలో చిన్నయతండ్రికి మదరాసునందు 'ఈస్టిండియా కంపెనీ' వారి *[1]సుప్రీముకోర్టున న్యాయశాస్త్రవేత్తగా నుద్యోగ మయ్యెను. దీనికి కారకు లా కాలమందు మదరాసుపుర ప్రముఖులలో ప్రథమగణ్యులగు గాజుల లక్ష్మీనరసింహము.

చెన్నపురి నివాసము

తండ్రిగారితో చిన్నయసూరి చెన్నపురికి వచ్చి వ్యాకరణము మాత్రమేకాక, అరవము, తెనుఁగు, ప్రాకృతము మొద లగు భాషలను నేర్చెను. కంచి రామానుజాచార్యులవారి యొద్ద తర్కము, మీమాంస, అలంకారముల నభ్యసించెను. శ్రీరామాశాస్త్రు లనెడు నొక వైదికవిద్వాంసునియొద్ద వేదమును, వేదార్థమును గ్రహించెను. వారివలననే చిన్నయసూరి యనితరలభ్యమగు హయగ్రీవమంత్రము నుపదేశముపొందెను. ఈ మంత్రోపదేశమువలన చిన్నయసూరి తన పాండిత్యమునకు తోడుగా వేదాంతవిజ్ఞానసంపత్తినిఁ బడసెను. తన కాలములో నంతటి ప్రతిష్ఠ సంపాదించుట కీమంత్రోపాసనాబలమే కారణము. కేవలము ప్రత్యక్షప్రమాణవాదులగు నీనాఁటివారికి నిట్టి సంఘటనలు విడ్డూరముగాఁ గానవచ్చును. కాని యాకాల మందలి మఱికొంతమంది కవిపండితుల చరిత్రలు పరిశీలించిన నిది యథార్థ మని గోచరింపక మానదు.

  1. * ఆ కాలమున, ననఁగా కంపెనీవారి ప్రభుత్వకాలమున నేఁటి హైకోర్టును 'సుప్రీముకోర్టు' అని వ్యవహరించెడివారు.