చిన్నయసూరి జీవితము/పద్య రచన
12. పద్య రచన
పచ్చయప్ప యశోమండనము
(ఆంధ్రము)
క్రోధి 1846
మ. గగనం బట్లు రసప్రపూర్ణ విల సత్కందంబుల న్మీఱి య
భ్రగనాలంబుగతిన్ సితచ్ఛదముల న్భాసిల్లి మేరుక్రియన్
జగదామోద సువర్ణభాస్వరముగా జానొందు పచ్చావనీ
శగుణంబు ల్గణుతించు కోశ మిది యిచ్చ న్మెచ్చు గావించెడిన్.
ఉ. శ్రీవరవర్ణి నీమణికిఁ బ్రేమపదంబు బుధోత్కరంబు లెం
తే వినుతింపఁ బెంపగు నహీనమహీభృదుదారమౌళి సం
భావితపాదపద్ముఁడు గృపాపరిపూర్ణుఁడు శ్రీనివాసుఁ డా
ర్యావసుఁ డెప్డు పచ్చప ధరాధిప కీర్తులఁ బ్రోచుఁ గావుతన్.
చ. అతులయశోవిశాలుఁడు జితాంతరఘోరవిరోధిజాలుఁ డం
చితసుగుణాలవాలుఁడు విశిష్టవిహాయత చాతురీ నిరా
కృతదివిజాతసాలుఁడు గిరీశ పదాంబుజభక్తిలోలుఁ డా
శ్రితపరిపాలుఁ డార్యసుతశీలుఁడు పచ్చనృపాలుఁ డెన్నఁగన్.
చ. అనయము భిక్షితాశనమ యౌట విషాదభావముం
గొని వసనంబు లేవడికి గుంది సగం బయినట్టి పార్వతీ
శునిముకు మ్రోవ నన్న మిడి శుద్ధదుకూల సమర్పణంబులం
దనియఁగఁ జేసెఁ బచ్చ నరనాథుఁడు గేవల దాతృమాత్రఁడే?
చ. అనవరతంబు డాసిన బుధాళి కభీష్టఫలంబు లిచ్చి భూ
జనులకు మేటి నా నెగడె సన్నుతమంజులతావిలాసముల్
దనరఁగ నాశ్రితాళుల నుదార రసాంబుధిఁ దేల్చు పచ్చపా
వనివిభు దానవైదుషికి వారక మ్రాన్వడు సౌరసాలముల్.
చ. నిరుపమ తావకీన కమనీయ యశశ్శరదాగమంబునం
బరపగు కల్మషంబు భువనంబు దొఱంగుట యుక్తమే కదా
యరయ ఘనాళిజీవనసమగ్రతఁ గాంచి వహించు టొక్క టే
ధరణి విచిత్రమౌర సముదాకరుణాకర పచ్చభూవరా.
చ. నెఱసె శరత్సమృద్ధి ధరణీ స్థలినెందు మరాళపాళికిం
బఱపుగ మీఱె పల్వలకుఁ బొండురపక్షము సర్వకాలముం
దెఱప యొకింతలేక భవదీయయశంబు ధృశంబు పేర్మిమై
వఱలఁగఁ బచ్చభూరమణ భవ్యలసద్గుణరత్నభూషణా.
సీ. తనమనోభీష్టప్రధానశౌండతకు కల్పద్రుమం బాకులపాటు నొంద
దనలసద్గంభీరతాగుణస్ఫూర్తికి వాహినీపతి భంగపాటుఁ దొడరఁ
దన నిరంతర ధీరతామహిమకుఁ గట్లరాయఁడు పాదసంక్రాతిఁ బెరయఁ
దనసకలాభినంద్యక్షమాలక్ష్మికిఁ బృథ్వీమహాదేవి క్రిందువడఁగ
వఱలు నీధన్యుఁ గుణమాన్యుఁ బరమపుణ్యు
పాదుజనగణ్యుఁ బోలంగ జగతిఁ గలరె
యనుచు నభిమతు లెల్లచో లల్లికొనఁగ
నుల్లసిలుఁ బచ్చపావనీవల్లభుండు.
సీ. ఆశావధూటి కాకేశపాశములకు మల్లీమతల్లి సంపత్తి నెఱపి
యామినీ కామినీస్వామిపక్షమునకు స్వచ్ఛాంగ రాగవిభ్రమ మమర్చి
వారాశిగూరుకు వారిజేక్షణునకు హీరవర్మ శ్రీరహింపఁజేసి
యామరసామజాతాస్యబింబమునకు ముత్యాల మొగముట్టు ముఱుపుఁ జూపి
డంబు దళుకొత్త నెవనియశంబు విష్ట,పంబునకు రవణంబు నందంబుమీఱు
నమ్మహాశీలు సుగుణలతాలవాలుఁ, బచ్చపనృపాలు నిలఁబోలువారుగలరె?
సీ. చందనహిమవారిసమభిషేకంబున దలయేటి పెనునాచుఁ దలఁగఁజేసి
కమనీయకస్తూరికా సంకుమదచర్చఁ బూదిపూఁతల ఱొచ్చుఁ బోకు వెట్టి
హురుమంజిముత్యాల చెరఁగుహోంబట్టుచే దోలుచేలపు టేవఁదొలఁగఁ ద్రోచి
యమృతోపమానదివ్యాన్నార్పణంబునఁ గంఠగరళకటుకత్వ ముడిపి
గీ. హరుమహాదేవు నిత్యసమర్పణక్రి, యాకలాపంబులనుఁ దనియంగఁజేయు
మహితబుధలోక జేగీయమానుఁడయిన, పచ్చనృపమౌళి యాశ్రిత పద్మహేళి.
చ. అమృతకరుండు తారకము లాదిమనాగము దేవతాగ వా
రము తగ నెంత కాలము గరంబు తిరంబుగ నుండు నా తెఱం
గమరఁగ నంతప్రొద్దు నిరపాయతఁ బచ్చనృపాలకీర్తుల
న్గొమరుగ శ్రీనివాసుఁడు గనుంగొని సత్కృపఁ బ్రోచుఁ గావుతన్.
విశ్వావసు 1846
ఉ. శ్రీయలమేలుమంగ కుచసీమఁ బయంటఁ దొలంగఁ గాంచి కాం
తా యిటఁ గొండపై నిరతహర్షమునం దగి గోరువంక లిం
పై యలరారెఁ గంటె యన నారసి సిబ్బితిపూను నచ్చెలిం
బాయక కౌఁగలించు హరి పచ్చపకీర్తుల నిచ్చఁ బ్రోవుతన్.
చ. సతత మనంతభోగముల సన్నుతికెక్కినవాఁడు కల్మిగు
బ్బెత కిరవైనవాఁడు ఘనవిభ్రమ మూనిన మేనివాఁడు రా
జితగుణరత్నహారములచేఁ దులకిం చెడువాఁడు సూరివం
దితుఁ డగు శ్రీనివాసుఁ డిల నిచ్చలు పచ్చపకీర్తిఁ బ్రోవుతన్.
పరాభవ 1847
ఉ. శ్రీ కనుగల్వదోయి వికసిల్ల దరస్మితచంద్రికావళిన్
లోకతమంబు బెల్లెడల లోఁగఁగఁజేసి బుధోత్కరంబున
స్తోకరసంబు గొల్పెడు విధుండు మహామహుఁ డిచ్చ నిచ్చలుం
జేకొని యుబ్బఁజేయు నృప శేఖరపచ్చపకీర్తివార్ధులన్.
ఉ. చల్లఁదనంబు లెల్లెడలఁ జల్లెడు మిన్కులవాఁడుగాని తా
నొల్లఁ డొకప్డు నుగ్రగతియోజలుధావళిఁ దన్పుచోట రం
జిల్లఁగఁ జేర్చుఁగాని కొఱఁ జెందఁ డొకప్పుడు బచ్చపక్షమా
వల్లభుఁ డీగుణాకరుని సాటియెరా జొకఁ డివ్వసుంధరన్?
క. భువన భరణ నిపుణుం డయి
తవిలి తనుం గొలుచు విప్రతతికోరుకు లె
క్కువ గాఁగ గురియు పచ్చప
ధవుఁడు ఘనుఁడు గాఁడె యెవ్విధంబునఁ దలఁపన్.
చిన్నయసూరిగారి సంస్కృత శ్లోకములు
క్రోధి 1845
శ్లో. ఏకాంకలాం భువనజాతహతిం దధాన
స్సర్వజ్ఞ తాం పద కథం లభతే గిరీశ:
బహ్వీ: కలా భువనజాతహితా దధాన
స్సర్వజ్ఞ ఏష ఖలు పచ్చపమానవేన్ద్ర:.
శ్లో. శ్రీపచ్చయప్ప నరనాథ భవత్కరోద్య
ద్దానామ్బు వార్ధిజ యశోమయపూర్ణచన్ద్రమ్
దృష్ట్వా కలఙ్క్ మతిలజ్జతయా హిమాంశు:
కార్శ్యం ప్రయాతి బహుళం న దివా చకాస్తి.
శ్లో. గుణస్య బాధికాం వృద్ధిం కృతవాన్పాణిని: పురా
అబాధితగుణాం వృద్ధి మకరోత్పచ్చపప్రభు:
శ్లో. పశ్యాయామహానయంద్యుసరిత:పూరాదిశశ్ఛాదయం
స్తత్రాస్మద్గజవాజిధేను తరవో మగ్నా: పునర్నేక్షితా:
ఏవం చారజనం బ్రువాణ మమర స్వామీహస న్వక్తిభో
మాభైషీర్నని భఙ్గ్‌వానయమత: పచ్చప్పకీర్తేర్మహ:
ఇవియేగాక, వ్యాకరణాదిగ్రంథములకు ముఖబంధముగా నాతఁడు రచించిన సంస్కృత శ్లోకములును నాతని కవితా పాటవమును ప్రదర్శించుచున్నవి.