Jump to content

చిన్నయసూరి జీవితము/కృత్యంతరములు

వికీసోర్స్ నుండి

11. కృత్యంతరములు

నీతిసంగ్రహము

నీతిసంగ్రహ మను నీ గ్రంథము చిన్నయసూరిచే ప్రాచీన కవులనుండి ఏర్చి కూర్పఁబడినది. అందులోను ముఖ్యముగా భారతమునుండి ఆయా సందర్భములనుండి గ్రహింపఁబడినవి, చిన్నయసూరి అచ్చటచ్చట తాను స్వంతముగా రచించిన పద్యములనుకూడ చేర్చియున్నాఁడు. ఇందు నూఱు పద్యములు గలవు. ఇవన్నియు నీతి బోధకములే. దీని కొక టిప్పణిగూడ నుండుటచే నాలుగైదు తరగతుల బాల బాలికల కవశ్య పఠనీయముగా నుండెడిది.

ఇందుఁ గందపద్యములు తేటగీత లాట వెలఁదులు 104 పద్యములు గలవు. మచ్చునకు రెండింటి నుదాహరింతును -

                 శ్రీ నొసఁగు యశము వెంచు న
                 నూనప్రమదంబుసేయు నురుదోషంబుల్
                 తో నడుచుఁ గరము విమల
                 జ్ఞానము మెఱయించు సాధుసంగతిఁ దలపన్.

భారతాది గ్రంథములనుండి పద్యములు గలవు.

                 జ్ఞానసిద్ధికంటెఁ జర్చింప సకల సి
                 ద్ధులును లొచ్చు గానఁ దొలుత దాని
                 గడనసేయవలయు నెడపక దాన న
                 నూనమైన సౌఖ్యమొందు నరుఁడు.

ఆంధ్రధాతుమాల

చిన్నయసూరి యాంధ్రభాషకు ధాతువులనుగూర్చి 'ఆంధ్ర ధాతుమాల' యనుపేర నొక గ్రంథమును రచించెనని యాంధ్రసాహిత్య పరిషత్తువారు క్రీ. శ. 1930 లో ముద్రించి ప్రకటించిరి. ఇది చిన్నయసూరి గ్రంథములయందు వ్రాఁతలో నాతని స్వంత యక్షరములతో లిఖింపఁబడియుండుట చూచి పరిషత్తువారు దానిని చిన్నయసూరి కృతముగా ప్రకటించి యున్నారు. కాని, గ్రంథమునందలి కొన్ని రూపములు పరిశీలించిన, అది యాతని రచన గాదని తెలియుచున్నది. ఈ 'ధాతుమాల'కు పీఠికను వ్రాసిన విద్వాంసులుకూడ ఈ కర్తృత్వ విషయమున కొంత సందేహమును చూపియుండిరి. ఆ సందేహము నిశ్చయమైనది. ఏలనఁగా దీనిని వాస్తవముగా రచించిన వారు వేదము పట్టాభిరామశాస్త్రులవారు.

ఆ విషయము బ్రౌనుదొరవారి వ్రాఁతలనుండియు, 'ఇల్లిసు' అను భాషా తత్వవేత్త ప్రకటించిన గ్రంథము వలనను తెలియఁగలదు. అందు చిన్నయసూరి మతమునకు విరుద్ధమైన ధాతువులు, వ్యావహారికములు చాలఁ గలవు. దీనిని గూర్చి నేను సమగ్రముగ వేదము పట్టాభిరామశాస్త్రిగారి 'పట్టాభిరామ పండితీయము' పీఠికలో చర్చించితిని. 'ధాతుమాల' సూరి రచన మెంత మాత్రమును కాదని సారాంశము.

ఆంధ్రశబ్ద చింతామణి వ్యాఖ్య

చిన్నయసూరి తన బాలవ్యాకరణమును నన్నయవిరచితమగు ఆంధ్రశబ్ద చింతామణి ననుసరించి రచించెనని బాల వ్యాకరణ వ్యాఖ్యత లెల్లరును వ్రాసియున్నారు. ఇది యెంతయు సమంజసమే. తెనుఁగునకు సంస్కృత భాషలో రచితమైన వ్యాకరణములలో ఆంధ్రశబ్ద చింతామణి, అథర్వణ కారికావళి ముఖ్యములు. చిన్నయసూరి అథర్వణ వ్యాకరణమునుకూడ నుదాహరించెను. కాని దానికంత ప్రామాణికత నీయలేదు. ఆంధ్రశబ్ద చింతామణికే యత్యంత ప్రామాణికత మిచ్చి దాని ననుసరించుటయేకాక దానికొక వ్యాఖ్యానమును కూడ రచించియు నుండవచ్చును. కాని, యిప్పు డా వ్యాఖ్యానము లభ్యమగుట లేదు, చిన్నయసూరి వ్యాకరణ రచనమునకు నెట్టి పరిశ్రమ చేసెనో ఈ వ్యాఖ్య లభ్యమైనచో మనకు తెలియఁజేయఁగలదు. ఈ రచనా కాలమునాఁటికి సంస్కృత మూలమగు నాంధ్ర శబ్ద చింతామణి ముద్రితమై యున్నది. కాని, చిన్నయసూరి దాని నుపయోగించెనో లేదో తెలిసికొనుటకు మన కవకాశములు లేవు. పండిత లోకములో నిది ప్రచారమున నున్నట్లు లేదు.

విశ్వనిఘంటు టీక

చిన్నయసూరి సంస్కృత భాషలో నున్న 'విశ్వనిఘంటువు' నకు తెలుఁగున టీక వ్రాయ ప్రారంభించి, కొంత వఱకు రచించెనని 'సుజన రంజని' పత్రిక తెలుపుచున్నది.*[1] ఆ యసమగ్ర భాగమును లభింప లేదు.

  1. * ఈ విషయము 'చిన్నయసూరిని గూర్చిన యభిభాషణలు' అను శీర్షికలో చూడనగును.