చిన్ననాటి ముచ్చట్లు/ద్వితీయం

వికీసోర్స్ నుండి

13

ద్వితీయం

నాకు 43 సం|| వయసు అయినది. రోగపీడితురాలయిన భార్య యింట యున్నది. ఇంటిలో మరి యెవరును లేరు. నాకు కొంత ఆస్తి, ఇల్లు, వ్యాపారము చేకూరినది. సంతానము లేదు. సంపాదించిన సొత్తునకు వారసులు లేరు. ఈ సమయమున నా బావమరిది కొడుకును దగ్గర తీసితిని. వాడు చనిపోయెను. పిల్లవాడు చనిపోయిన వెంటనే మాకు విరక్తిభావము మనసునకుతోచి ఇరువురము తీర్థయాత్రలకు ప్రయాణమైతిమి. ఉత్తర దక్షిణ యాత్రలన్నియు మూడు మాసములలో ముగించుకొని యిల్లు చేరితిమి. నా భార్య జబ్బు దినదినాభివృద్ధి యగుచుండెను.

సంతానముకొఱకు మేము తీర్థయాత్రలన్నియును ముగించుకొని యిల్లు చేరితిమి. నాకు సంతానాపేక్ష అధికమగుకొలది నా భార్యకు జబ్బు కూడ అధికమై లేవలేనంత స్థితికి వచ్చి మంచమెక్కెను. ఆమెకు వుపచారము చేయుటకుగాని నాకు సహాయపడుటకుగాని ఇంటిలో కూలివారు తప్ప మరియెవరును లేకపోయిరి. నా ఉద్యోగము పెద్దది. ఈపరిస్థితులలో నేను రెండవ వివాహమును చేసుకొనుటకు నిశ్చయించితి గాని 43 సం|| వయసుగల నాకు తగువయస్సు వచ్చిన పెండ్లాము యెట్లు లభించగలదు.

కొచ్చిరాజ్యమున కేరళస్త్రీలను బ్రాహ్మణులు వివాహమాడు సాంప్రదాయమున్నదని తెలుసుకొని తిరుచూరులో కేరళస్త్రీని వివాహ మాడితిని. అప్పడామెకు 28 సం|| వయసుండును. ఈమె ఈ వూరిలో ఒక వకీలు కుమార్తె. విద్యావంతురాలు. ఆయుర్వేద వైద్యమునందు పరచయము గలది. ముఖ్యముగ స్త్రీల రుగ్మతలను కనుగొని చికిత్సచేయు నిపుణురాలు. శిశుచికిత్స దెలియును. ఔషధములను చక్కగ తయారుచేయు అనుభవమును గలది. ఓషధి జ్ఞానమున్నది. ఈమె నాయింటికి వచ్చిన పిదప కేసరి కుటీరములో తయారుచేయు ముఖ్య ఔషధములన్నియును ఈమెయే తయారు చేయచున్నది. వైద్యశాలకు వచ్చిన స్త్రీలను, బిడ్డలను పరీక్షించి చికిత్స చేయుచున్నది. క్రమముగ ఆఫీసు పనులను నేర్చుకొనినది. ఇంటి పనులను మెళకువతో గమనించుచు నాకు తోడునీడ అయినది. ఇప్పడు నాకు చాలాభారము తగ్గినది. ఈమె పేరు మాధవి,

ఈమె నాయింటికి వచ్చిన మరుసటి సంవత్సరమున నాకు కుమార్తె పుట్టినది. కుమార్తె పేరు శారదాదేవి. ఈ కుమార్తెకు యుక్తవయస్సు రాగానే వివాహ ప్రయత్నమును చేయవలసి వచ్చినది. తిరుచూరుకు సమీపమున సుప్రసిద్ధి క్షేత్రము గురువాయూరు గలదు. ఇది విష్ణుక్షేత్రము. మన ప్రాంతమున తిరుపతి వెంకటేశ్వర కొండ యెంత ప్రసిద్ధియో కేరళ రాజ్యమున గురువాయూరు విష్ణుమూర్తికి అంత ప్రఖ్యాతి. ఈ దేశమున ఈ దేవుని 'గురువాయూరు అప్పన్' అనెదరు. ప్రతిదినము ఈ దేవుని పూజించుటకు వేలకొలది భక్తులు వచ్చి పూజించి పోవుచుందురు. ఈ నారాయణ క్షేత్రమున నంబూదిరీ బ్రాహ్మణ పండితోత్తములు కొందరు చేరి నారాయణ జపము, భజన, ఉపన్యాసములను ఇచ్చు పండిత బృందమొకటి గలదు. ఆ భక్తబృందమునకు చేరిన దివాకరనంబూదిరి బ్రాహ్మణుడు గలడు. ఈయన వేదాంతాది శాస్త్రవేత్త. భక్తుడు, భాగ్యవంతుడు. వీరి కుమారుడగు చిరంజీవి బాలకృష్ణునకు నా కుమార్తె చి| సౌ| శారదనిచ్చి వివాహమును చేసితిని. ఈ నంబూదిరి బ్రాహ్మణుని భార్య సుప్రసిద్ద నడుంగాడి కుటుంబమునకు చేరిన కేరళస్త్రీ. నా అల్లుడు M.B.B.S. డాక్టరు పరీక్ష నిచ్చి మద్రాసు జనరల్ హాస్పటల్లో యుండి పిమ్మట ఇటీవల ముగిసిన రణరంగమునకు వెళ్లి తిరిగి వచ్చి మద్రాసులో జనరల్ హాస్పిటల్లో నున్నాడు. (Capt. T.M.B.Nedungadi, I.M.S.). వీరికి ఇప్పుడు నలుగురు బిడ్డలు గలరు. పెద్దకుమారుని పేరు రాధాకృష్ణుడు, రెండవ కుమారుని పేరు బాలకేసరి. మూడవ కుమార్తె పేరు మధుమాధవి. చిన్న కుమారుని పేరు జయచంద్రుడు. మా అల్లుని యిద్దరి చెల్లెండ్రను కొచ్చి రాజు కుమారులగు రాజాకేరళవర్మ, రాజారామవర్మ రాజులకిచ్చి వివాహమును చేసిరి. ఈ యిరువురు రాజబంధువులేగాక మూడవవారగు రాజారవివర్మగారుకూడ దగ్గిర బంధువు. వీరు రాజ్యమును చేయుటకు సమీపమున నుండినవారు. కనుక నా రెండవ కల్యాణమువలన రాజబంధువులుకూడ నాకు గలరు. ఈ రాజకుమారులు సదాచార సంపన్నులు. దేవ బ్రాహ్మణ భక్తి గలవారు. మద్రాసులో కొచ్చిరాజులకు కొచ్చి భవనము Cochin House ఉన్నను, వీరు మద్రాసుకు వచ్చినప్పుడెల్లను నాయింటనే బస చేయుచుందురు. మేము మైసూరులో కాపురమున్నప్పడు చాముండేశ్వరి మాకు రెండవ కుమార్తెను ప్రసాదించినది. ఈమెపేరు వసంతకుమారి, నా మరదలు కాత్యాయనియను ఆమె వితంతువు; బిడ్డలు లేరు. నా యింటనే బిడ్డలను కనిపెట్టుకొని యున్నది.

కొచ్చిరాజ్యము కేరళదేశములో నొక స్వతంత్రరాజ్యముగ నుండెను. ఈ రాజ్యమునుచూచి ఉప్పొంగని వారుండరు. దేశమంతయు ఉద్యానవనముగ కాన్పించును. ఇది పడమటి సముద్రతీరమున నున్నది. పడమటి కనుమలు ఈ రాజ్యమును అనుసరించి బారులు తీరియుండును. కొచ్చిరాజ్యము కొండలతోను అడవులతోను కూడియున్నది. భూమి చాలభాగము గుంటుమిట్టలతో నుండుటవలన పంటలకు ముఖ్యముగ వర్షమే ఆధారము. ఈ రాజ్యమున వర్షకాలము యేడుమాసములయినను ముఖ్యముగ జూన్ జులై మాసములు యెడతెగక రాత్రింబవలు కుంభవర్షము కురియును. ఇక్కడ వర్షాకాలము ఎండాకాలములేగాని శీతకాలము లేదు. జోరున వర్షము కురియనప్పుడుకూడ వుక్కపోయుచుండును. దినమునకు రెండు పర్యాయములైనను గుంటలలో స్నానమును చేయకుండ నుండలేరు.

కేరళ స్త్రీలు వివాహమాడవలయునని నిర్భందము లేదు. అనేక యిండ్లలో బ్రహ్మచారిణులున్నారు. సన్యాసినులున్నారు; వేదాంతవేత్త లున్నారు; కేరళ దేశవాసులు శాక్తేయులు. స్త్రీలు విభూతి, కుంకుమలను ధరించుకొనెదరు. ఉమా, కాత్యాయిని, పార్వతి, శారద, మాధవి మొదలగు పేర్లను పెట్టుకొనెదరు. ఈ దేశమున శక్తి ఆలయములు మెండు. పునర్వివాహము సర్వసామాన్యము. విడాకులు అమిత సులభము. ఈ దేశమున నంబూదిరి బ్రాహ్మణులకు మంచి పలుకుబడి గలదు.

తిరుచూరు కొచ్చిరాజ్యమునకు చేరిన మంచి వాసయోగ్యమైన పట్టణము. కొచ్చిరాజ్యమున కెల్ల ఈ వూరి బావుల జలము మంచి ఆరోగ్యము నిచ్చునవి. ఈ వూర 7 మాసములు వర్షాకాలమగుటచే బావులలో నీరు పైభాగము వరకు వచ్చుచుండును. నేల కంకరభూమి అగుటవలన నీరు నిర్మలముగనుండును. కేరళదేశస్తులు నీళ్లను చూచినప్పుడెల్లను స్నానముచేయుటకు ఇష్టపడెదరు. కనుకనే వీళ్లను 'నీళ్లకోళ్లు' అనెదరు. ఈవూరిలో అక్కడక్కడ స్నానము చేయుటకు తటాకములు గలవు. ప్రతి దేవాలయము ప్రక్కనను స్నానముచేయు కోనేళ్లు కలవు. ఇక్కడివారికి చెంబుతో నీరును నెత్తినపోసుకొను అలవాటు లేదు. గుంటలలో మునిగి స్నానము చేయనిది తృప్తిలేదు. ఆడవారికందరికి ఈత తెలియును. ప్రజలందరు ప్రాతఃకాలమున లేచి స్నానముచేసి దేవాలయములకుపోయి దేవుని పూజించిన పిమ్మటనే వారివారి ఉద్యోగములకుపోవు ఆచారము గలదు. భోజన పదార్ధములలో కొబ్బెర తురుమును, కొబ్బెర నూనెను విరివిగ వాడెదరు. స్నానమును చేయునప్పుడు వీరు వంటికి, తలకు టెంకాయ చమురును పట్టించుకొని స్నానమును చేసెదరు. ఈ అలవాటు వలన వీళ్లకు చర్మవ్యాధులు రావు. స్త్రీల శిరోజములు దీర్ఘముగ వెరిగి తుమ్మెద రెక్కలవలె నల్లగ మిసమిసలాడుచుండును. వేడినీళ్ల స్నానమెరుగరు. భోజనము సాత్వికాహారము. స్త్రీలకు ఉండునంత స్వతంత్రము పురుషులకు లేదు. సంపన్నుల యిండ్లలో స్నానమును చేయుటకు తోటలలో తటాకములను త్రవ్వించుకొని యిష్టము వచ్చినప్పుడెల్లను స్నానమును చేయుచుందురు. తమ యిండ్ల చుట్టు వివిధ ఫల వృక్షములను నాటి, పెంచి వాటి ఫలములను అనుభవించెదరు. అనేకరకములైన అరటి, పనస, ముఖ్య ఫల వృక్షములు, జాజికాయ చెట్లునుండును. ప్రసిద్ధములైన కొబ్బరిచెట్లు గలవు. అరటి ఆకులలో పొడుగాటి మనిషి పడుకొని హాయిగ నిద్రించవచ్చును. నేంద్రం అరటిపండ్లు చాలా ప్రశస్తములయినవి, మంచి ఆరోగ్యమునిచ్చు ఫలములు. పనసపండుతోను నేంద్రం అరటిపండుతోను హల్వాను తయారుచేసి జాడీలలో నిల్వయుంచుకొని పండుగలకు పాయసమునుచేసి భుజించెదరు. శుభకార్యములకు పిండి వంటలకంటె పాయసములే ముఖ్యములు. పాలుపాయసం (బియ్యం, పాలు, చక్కెర), చక్క ప్రధమన్ (పనసపండు, బెల్లం పాయసం) నేంద్రపళం ప్రధమన్ (నేంద్ర అరటిపండు, బెల్లం పాయసం) పచ్చపయిరు ప్రధమన్ (పెసరపప్పు, బెల్లం, కొబ్బరతురుం పాయసం) ఈలాటివి యింకను కొన్ని పాయసములను తయారు చేసెదరు. నేంద్ర అరటి కాయలతో వుప్పుగాను తీపిగాను వరవలుచేసి నిల్వవుంచుకొని కాఫీతో కూడ చిరుతిండిగ నుపయోగించెదరు. బిడ్డలకు బిస్కతులకు బదులు వీటి నిచ్చెదరు.

తిరుచూరు అష్టాంగ ఆయుర్వేదవైద్యమునకు పుట్టినిల్లు. శాస్త్రసమ్మతమైన ఔషధ రాజములను తయారుచేయుటకు వనఓషధులు యిక్కడ లభించునట్లు మరియెక్కడను లభింపవు. తెల్లవారగనే పడమటి కనుమలనుండి పచ్చిమూలికలను మోపులుమోపులుగ దెచ్చి విక్రయించెదరు. ఒకే తడవ సుగంధి పాల వేరు, అశోక పట్ట, బిల్వవేరు మొదలగునవి యెన్ని టన్నులు కావలసినను దొఱకును. ఈ వూరినిండుగ ఓషధి ద్రవ్యములను, ఔషధములను విక్రయించు అంగళ్లు గలవు. ఇక్కడి వారు ప్రతిదినము యేదో ఒక తైలమును వంటికి, తలకు రాచుకొననిది స్నానమును చేయరు. వాత వ్యాధులను కుదుర్చుకొనుటకు పలుదేశములనుండి యిక్కడికి వచ్చి చికిత్సలను పొందెదరు. నవరక్కిళి, పిళింజలు, ధార మొదలగు ప్రత్యేక చికిత్సలను చేయుటకు యిక్కడ సమర్దులున్నారు. సర్కారు ఆయుర్వేద వైద్యశాల యున్నది. సుప్రసిద్దమాసు వైద్యవేత్తలు యిక్కడివారే.

ఔషధములను తయారు చేయుటకు అన్ని అనుకూలములు యిక్కడనున్నందున ఈ వూరిలో 'కేసరి కుటీరము'ను స్థాపించితిని. విశాలమైన తోటలో నివసించుటకు చలవరాళ్లు పరుపబడిన మంచి బంగళాను, ఔషధములను తయారు చేయుటకు అనుకూలమైన కట్టడమును, వనమూలికలను దెచ్చి శుభ్రపరచి సారహీనము కాకుండ భద్రపరచుటకు తగువైన స్థలమును ఆఫీసుకు, అతిథులకు ప్రత్యేకమైన గృహములును నిర్మించబడినవి.

ఈ వూరి ఆయుర్వేద వైద్యులు ఇంగ్లీషు డాక్టర్లవలె రోగులకు కావలసిన మందులకు జాపితా (Prescription) వ్రాసి యిచ్చెదరు. రోగులే అంగళ్లకు పోయి జాపితా ప్రకారము మూలికలను దెచ్చుకొని, మందులను వారే తయారుచేసుకొని సేవించెదరు. ఈ కారణమువలన ఈ వూరి వారందరును సామాన్యముగ ఔషధములను చక్కగ తయారుచేయు అనుభవము గలిగియున్నారు.

తిరుచూరు మధ్యలో గొప్ప శివాలయము గలదు. ఈ స్వామిపేరు వడకనాధన్. ఇది పరశురాముల ప్రతిష్ఠ ఈ ఆలయములోని శివలింగము పైకి కనుపడదు. ఈ లింగమునకు ప్రతిదినము నెయ్యిని అభిషేకమును చేయుటవలన పేరిన నెయ్యి లింగాకారముగ సుమారు 10, 12 అడుగుల పొడవుగ కనుపించును. ఈ లింగము వేసవికాలములో కూడ కరుగక పోయినను నెయ్యిభారమువలన అప్పడప్పడు విరిగి కూలుచుండును. ఈ విరిగిన నెయ్యి చర్మవ్యాధులకు మంచిమందని కొందరు కొనుక్కొని పోవుదురు.

ఈ దేవాలయములోని అర్చకులు చక్కగ చదువుకున్న సంబూదిరి బ్రాహ్మణులు; మంత్ర శాస్త్రవేత్తలు, సంస్కృత పండితులు, బ్రహ్మచారులు. వీరు పొరపాటున యెప్పడైన స్త్రీలను చూచుట తటస్థించునేమోయని వీళ్లకు ప్రత్యేకముగ దేవాలయ ఆవరణములోనే ఇంటిని గట్టించి ఇంటిచుట్టూ పెద్దప్రహరీగోడను కట్టి అక్కడ వీరు నివసించుటకు నిర్బంధమగు యేర్పాట్లు గలవు. ఈ యింటివాకిట సిపాయి పారాకూడ కలదు. వీరు నివసించు యింటినుండి దేవాలయమునకు పోవుటకు ప్రత్యేకమైన సందుదోవను యేర్పాటుచేసి వున్నారు. ఈ అర్చకులు రాత్రి 3 గంటలకు నిదురలేచి వారు నివసించు ఆవరణములోని గుంటలో స్నానమును చేసి, అనుష్టానములను తీర్చుకొని దేవతార్చనకు పోయెదరు.

ఈ దేవునకు ప్రతి సంవత్సరము 'పూరం' అను ఉత్సవము జరుగును. ఈ ప్రాంతమున కెల్లను ఇది గొప్ప తిరునాళ్ళు. ఈ ఉత్సవములో విశేషమేమన 12 గొప్ప ఏనుగులను బంగారు తొడుపులతో అలంకరించి దేవుని వూరేగించెదరు. కొచ్చి రాజ్యము గొప్ప ఏనుగులకు ప్రసిద్ధము. ఈ యేనుగులు దేవాలయమునుండి బారుతీరి సోల్జర్లు (Soldiers) నడిచినట్టు అడుగులను వేయుచు నడుచునప్పుడు ఆ దృశ్యము అద్భుతమును గలుగ చేయును. ఇటువంటి వుత్సవము మరి యెక్కడను వుండదు. ఈనాడు రాత్రి స్వామికి బాణవేడుక జరుగును. ఈ బాణవేడుకను రెండు కక్షలవారు ఒకరికంటె ఒకరు బాగుగ చేయవలెననే యేర్పాటును చేయుదురు. ఇందుకు వీరు చాల ధనమును ఖర్చు పెట్టుదురు. రాత్రి 10 గంటలు మొదలు తెల్లవారి 5 గంటలవరకు బాణవేడుక జరుగును.