చిన్ననాటి ముచ్చట్లు/తీర్థయాత్రలు

వికీసోర్స్ నుండి

14

తీర్థయాత్రలు

అలహాబాదులో 1910 సం|| డిశంబరు నెలలో కాంగ్రెసు మహాసభ జరిగినది. ఈ సభకు నేనును నెల్లూరినుండి పబ్లికు ప్రాసిక్యూటరుగ నుండిన శ్రీ మైదవోలు చంగయ్య పంతులుగారును, వెంకటగిరిరాజుగారి ఉన్నత పాఠశాలకు అప్పటి ప్రధానోపాధ్యాయులు శ్రీమాన్ ఏ. సంతాన రామయ్యంగారును, అభ్రకపు గని స్వంతదారులగు శ్రీ విస్సా లక్ష్మీ నరసయ్యపంతులుగారును వెళ్లితిమి. మహాసభానంతరము అక్కడ నుండి కాశీయాత్రకు వెళ్లితిమి. నేనును విస్సా లక్ష్మీనరసయ్య పంతులుగారును కుటుంబములతో బయలుదేరితిమి.

కాశీలో తీర్థవాసియగు పుచ్చా సుబ్రహ్మణ్యశాస్త్రి యింట బస చేసితిమి. వీరు పూర్వము రాజమహేంద్రవర ప్రాంతములకు చెందిన ఆంధ్రులు. చాలకాలమునుండి ఇక్కడనే స్థిరనివాసియై మంచి స్థిరాస్థిని సంపాదించినవారు. కొన్ని గృహములకు యజమానుడు. మమ్ములనొక గృహము నందుంచెను. వీరి వ్యాపారమును సాగించుటకు వీరివద్ద కొందరు గట్టివారు గుమాస్తాలుగ నుండిరి. వారిలో ఒక గుమాస్తాను మాకు అప్పచెప్పిరి.

'వారణాశి" అని కాశీకి మరొకపేరు. 'వారణా' 'అశి' అని రెండు ఉపనదులు కాశీకి రెండువైపుల ప్రవహించి గంగలో కలియును. ఆ రెండు నదుల మధ్యయుండుటచే "వారణాశి" అని ఆపట్నము నందురు. పట్నమంతయు అర్ధచంద్రాకారముగ నదిగట్టున పొడవుగా నుండును. పురాతన పట్నమగుటచే కాబోలు, ఎత్తయిన ఇండ్లతో, మేడలతో, ఇరుకు వీధులతో నిండియుండును. కావున తెలిసినవారి సహాయము లేనిదే కొత్తవారు ఆ పట్నములలో తిరుగజాలరు. నది పొడవున భవనములున్నవి. ధనాధ్ధ్యులు పలు ప్రాంతములనుండి పిదప కాలమున వారణాశిలో నివసించి, అక్కడనే మృతిచెందిన - సరాసరి స్వర్గము చేరుదమని ఆ భవనముల కాపురముందురట. నది పొడవున పురాణ ప్రసిద్దములు చరిత్రాత్మకములు నగు అనేక 'ఘట్టము'లు కలవు. దశాశ్వమేధ ఘట్టము, హరిశ్చంద్ర ఘట్టము మున్నగునవి అట్టివే. ఇక్కడనే ఊరి మధ్య 'జ్ఞానవాపి' లేక 'కూపము' కలదు. యాత్రికులు ఆక్కడకువెళ్లి పూలు, పండ్లు అందువేసి పవిత్రులు, 'జ్ఞానవంతులు' నగుదురు. అయితే వారు అందువేసిన వస్తువులు కుళ్లి దుర్గంధములే అగుచుండును. 'గౌడిదేవిగుడి' యని - యొకటి హరిజనవాడ మధ్యనున్నది. ఎంతటి ఆచారవంతులైనను ఆ వాడకు అరమరికలు లేకుండా వెళ్లి గవ్వలుకొని ఆ గుడిలోవేసి వచ్చినగాని కాశీయాత్ర ఫలితము దక్కదు అని వాడుక. నది కావలిగట్టున కాశీమహారాజుగారు నివసింతురు. వారి ఆఫీసులు అక్కడనే యుండును. యాత్రికులలో నుత్సాహవంతులు కొందరు పడవలపై నది దాటి వానినన్నిటిని చూచివత్తురు. పలుదేశములనుండి పలువురు వచ్చి పోవుచుందురుగాన పట్టణమున 'గల్లీ'లు (వీధులు) చాల అపరిశుభ్రముగా నుండును.

'నఃమణి కర్ణికాసమంతీర్థం - విశ్వేశ్వర సమంలింగం -

నఃకాశీ సదృశీపురీ - నాస్తి బ్రహ్మాజ్డ గోళకే'

అను పూర్వుల సుభాషితము. మహమ్మదీయులకు మక్కా, క్రీస్తువులకు జరూసలము, బౌద్దులకు బుద్దగయ ఎటులనో హిందువులకు కాశీక్షేత్రము అటువంటిది. 'కాశ్యాంతు మరణాత్ ముక్తిః' ప్రాణ ప్రయాణ సమయమున కాశీక్షేత్రమునందే నివసించి మరణించవలయుననే అభిలాష అనేకులకు గలదు. కాశీయాత్ర చేయుటకు రైలు సౌకర్యములు లేనికాలమున అనేకులు తమ ఆస్తులను గురించి తగు యేర్పాటులను చేసి బంధువులకును ఊరివార్లకును అప్పగింతలుచెప్పి కాశీకి ప్రయాణమవుచుండిరి. కాశీ యాత్రానంతరము తిరుగ ఇంటికి వచ్చుట సందేహముగ నెంచుచుండిరి. స్వగ్రామమునువదలి దోవలో యుండు ప్రతిగ్రామమున బసచేయుచు పాదచారులై పోవుచుండిరి. ఆ కాలమున కాశీకి పోవువారిని ఆదరించి అన్నమిడుచుండిన వారుండిరి. వారిని చాల గౌరవముగ చూచుచుండిరి. యాత్రకు పోవువారు భార్యాభర్తలయిన ఆ దంపతులను ఆదరించి పూజించి పంపుచుండిరి. కాశీయాత్రకు పోయినవారు యాత్రను ముగించుకొని తిరిగి కొంతకాలమునకు తమ స్వదేశమునకు రాగలిగినవారిని చూచి భక్తిపూర్వకమైన ఆదరణతో వార్లకు ఆతిథ్యమిచ్చి సంతృప్తులగు చుండిరి. తిరిగి వచ్చినవారు కాశీకావడిని కట్టుకొని అందులో గంగ చెంబులను, సాలగ్రామములను, శంఖములను, రుద్రాక్ష దండలను, స్ఫటికములను పెట్టుకొని, దానిని మోసుకొనుచు వచ్చుచుండిరి. వీటిని చూచుటకు అనేకులు వచ్చి వారిని దర్శించినప్పడు వాటి మహాత్మ్యములను చెప్పుట విని సంతసించుచుండిరి.

బుద్ధ భగవానుడు లోకోత్తరమగు బౌద్దమతమును ఇక్కడి నుండియే ప్రపంచమునకు ప్రసాదించినది. అద్వైత మతస్థాపకులగు శ్రీశంకరాచార్యులు కాశీక్షేత్రముననే హిందూ మతమును ఉద్దరించినది. వీరశైవులకు స్మార్తులకు శివభక్తి ప్రదమైన శైవమతమును విశ్వనాథస్వామి ఇక్కడనుండియే వేలసంవత్సరములకు ముందు ప్రసరింపచేసినట్లు చెప్పుకొనెదరు. వీరవైష్ణవులకు శ్రీ బిన్లు మాధవస్వామి క్షేత్రము మరి అనేక విష్ణుక్షేత్రములు ఇక్కడ స్థాపింపబడియున్నవి. మధ్వమతస్తులకు శ్రీ హనుమంతుని దేవాలయములు గలవు.

జన్మసాఫల్యమునకు గంగాస్నానమొనర్చి రామకృష్ణాది మహనీయుల పాదధూళి సోకిన అయోధ్య, మథుర, బృందావనం, గోకులం మొదలగు పురాతనపు పుణ్యక్షేత్రములను దర్శించి రావలయుననే కోరిక నాకు చిరకాలముగ నుండెను.

ప్రాతఃకాలముననే గంగాస్నానమునకు బయలుదేరితిమి. విశాలాక్షి ఘట్టమునుండి మణికర్ణికా ఘట్టమునకు సుమారు ముక్కాలుమైలున్నది. అక్కడికి గంగవడ్డుననే నడిచిపోవలయును. మార్గమున యుండిన ఘట్టములలో అనేకులు స్నానమును చేయుచుండిరి. మేము నడుచుచుండు మార్గమున పోవువారు కొందరు 'రాం, రాం,' 'హరే, హరే'యని ధ్యానమును చేయుచు పోవుచుండిరి. మరికొందరు తమ సొత్తులను మూటకట్టుకొని తలమీద పెట్టుకొని 'శివ', 'శివ' యనుచు స్నాన ఘట్టమునకు నడుచుచుండిరి. కొందరు యువకులు, యువతులు చేతులు పట్టుకొని స్నానమునకు పోవుచుండిరి. బాల బాలికలును పరుగిడుతు గంగవైపునకు పోవుచుండిరి. తాతలు అవ్వలు కఱ్ఱల నాధారముచేసుకొని తిన్నగ నడుచుచుండిరి.

మేము మణికర్ణికా ఘట్టమునకు చేరుసరికి 10 గంటలయినది. మమ్ములను వెంబడించిన పురోహితుని ఆజ్ఞ ప్రకారము అక్కడ చేయవలసిన స్నానాది కర్మకాండనంతయు ముగించుకొంటిమి. అది డిశంబరు మాసమగుటచే విపరీతమైన చలిగ నుండెను. గంగాస్నానముచేసి గట్టునకు వచ్చులోపలనే కాయము కట్టెవలె మారినది. ఆ గంగ గట్టున కొందరు సన్యాసులు చలిమంటలను వేసుకొనుచుండిరి. స్నానము చేసిన వారు చలికి తాళలేక ఆ మంటలచుట్టు కూర్చుని చలికాచుకొనుట చూచి మేమును అక్కడ చేరితిమి. కొంతసేపు అక్కడ కూర్చుని సన్యాసులకు తల ఒక కాని యిచ్చి బయలుదేరి విశ్వేశ్వరుని దేవాలయము ప్రవేశించితిమి.

దోవలో ఇరుప్రక్కలను కూర్చుని యాచించు యాచకులకు కాసుల నిచ్చుచు లోపలకి సులభముగ పోతిమి. అక్కడక్కడ మరణించువారిని గంగా తీరమున కాల్చి గంగాభవానికి అప్పగించుటకు యేర్పడిన ఒక సేవాసమితి గలదు.

కాశీ నగరము ఆదిలో ఒక మట్టిదిబ్బగ నుండినట్లును, విశ్వనాథస్వామి బ్రహ్మహత్యకు భయపడి ఈప్రదేశమున వెలిసినట్లును స్థలపురాణము గలదు. మొదట ఇక్కడ ఉండినది శ్రీ ఆదినారాయణుడని ప్రమాణము గలదు. ఈ నగర ప్రకృతి ఆకృతి అసహ్యముగను, గజిబిజిగను కనుపించును. సందుగొందులు కలిగిన మార్గములను కలిగియుండును. మూడు నాలుగు అంతస్తుల మేడలనుగలిగి సూర్యకిరణముల కడ్డుపడు చుండును. పట్టణము పరిశుభ్రముగ నుండదు. ఈ అపరిశుభ్రమైన సందుగొందులలోనుండి విశ్వనాథ క్షేత్రమునకు పోవు మార్గముండెను. ఈ మార్గ మధ్యమున గోమాతలు విచ్చలవిడిగ సంచరించుచుండెను.

చిన్న గర్భగుడిలో వెలసియున్న నిరాడంబరమగు శివలింగమును జాతిమత భేదములులేక రాత్రింబవలు పూజించు క్షేత్రము మరియొక్కడను లేదు. స్వామిని పూజించు ప్రత్యేక పూజారి లేడు. వస్త్రాభరణములు సున్న. అచ్చటనుండి గయాక్షేత్రమునకు వెళ్లితిమి. దర్భతంత్రము జరిగినది. ఆకులు వేసినారు. కడుపు నిండియున్న గయావళులు త్రేన్పుతూ, ఆకులముందు కూచున్నారు. వడ్డించిన పదార్ధములలో ఇష్టమైనదానిని రుచి మాత్రము చూచిరి. పిమ్మట వటవృక్షమువద్దకు మమ్ములను తీసుకొని వెళ్లినారు. గంధముపూసి పూజించి దక్షిణ యివ్వవలయును. పితృదేవతలను తలచుకోవలయును. కర్తలు ప్రమాణపూర్తిగా నేను యింతమాత్రమే దక్షిణ యివ్వగలనని చెప్పవలెను. అట్లా చెప్పనియెడల 'గయాశ్రద్ధ ఫలితమస్తు' అని వీపున గట్టిగ కొట్టరు.

ఫల్గుణీ నదీ తీరమున జరిపిన కర్మకాండానంతరము విష్ణుపాదము నందు రెండవసారి పితృ దేవతలను దలచుకొని పిండ పితృ తర్పణములను జరుపవలయును. శ్రీమహావిష్ణుని పాదస్పర్శ సోకిన స్థలమిదియని స్థలపురాణమున గలదు.

మూడవసారి శ్రాద్దము చేయవలసిన స్థలము 'అక్షయవట'మను వటవృక్షము క్రింద. ఇక్కడనే కడపట శ్రాద్దమునుబెట్టి గయాక్షేత్ర యాత్ర ముగించుకొనవలయును.

విష్ణుగయ నుండి సుమారు 8 మైళ్ల దూరముననున్నది బుద్దగయ. హిందువులకు కాశీక్షేత్రము యెంత పావనమైన స్థలమో ఈ బుద్దగయ బౌద్దులకు అంత పావనమైనది. దీనిని బోధగయనికూడ పిలిచెదరు. బుద్ధభగవానుడు జ్ఞానసిద్ధిని పొందిన స్థలము. పూర్వమున ఈ మహాబోధియను ప్రసిద్ధి చెందిన వృక్షము క్రిందనే వీరు సిద్ధిని పొందిరి. ఆ మహాబోధివృక్షము ఇప్పటికిని ఇక్కడ నున్నది. అశోక చక్రవర్తి ఇక్కడికి వచ్చినట్లు శిలా శాసనములు యింకను యిక్కడనున్నవి. బౌద్ధమత ప్రచారకోత్తముడును అద్వితీయ గుణసంపన్నుడును అగు ఆ చక్రవర్తి శిలావిగ్రహమును ఇక్కడ ప్రతిష్టింపబడియున్నది.

ఈ క్షేత్రమును దర్శించుటకు ఇప్పటికిని నానాదేశములనుండి జనులు వచ్చుచున్నారు. ప్రతిదినము యిక్కడ చైనా, జపాన్, సిలోన్, బర్మా మొదలగు దేశముల నుండి వచ్చువారిని చూడవచ్చును. 'రాజగృహం' యను స్థానమునుండి బుద్ధుడు మతప్రచార ప్రారంభమును చేసినను ప్రపంచమంతయు సూక్ష్మదృష్టితో చూచుచు సిద్ధిపొందిన స్థలమిది.

ప్రయాగ (అలహాబాదు)

మేము కాంగ్రెసుకు హాజరగుటకు ప్రయాగ క్షేత్రమునకు పోతిమి. ప్రయాగ మహాక్షేత్రమున మహనీయులెందరో పూర్వము యజ్ఞయాగాది క్రతువుల జరిపినందున ఈ క్షేత్రమునకు ప్రయాగ యనుపేరు కలిగినదట. ఇక్కడ గంగా యమునా నదులు సరస్వతి అంతరవాహినిగా చేరి పారునట్టి కూడలి. ఈ కారణమున ఈ సంగమస్థానమునకు త్రివేణియను పేరు గల్లినది.

కాశీయాత్రకు వచ్చినవారు ముఖ్యముగ ఈ త్రివేణి సంగమము నుండియే గంగను తీసికొనిపోవుదురు. ఇక్కడ పారు జలమునకే అత్యంత మహాత్మ్యముండినటుల దెలిసికొనిరి. పాశ్చాత్య శాస్త్రవేత్తలుకూడ ఇక్కడి జలమును పలువిధములుగ పరీక్షించి ఈ జలమున రోగబీజముల నశింపజేయు శక్తిగలదని నిరూపించిరి. అందువల్ల ఈ జలమును పాత్రయందుంచి సీలుచేసిన యెన్ని సంవత్సరములైనను జలము చెడిపోక శుద్దముగ నుండును. మరియు ఈ జలమును తామ్రపాత్ర యందుంచుట మహావిశేషము. తామ్రమునకు క్రిమికీటికాదులను నశింపజేయు శక్తిగలదు. ఈ కారణముననే మన పూజాపాత్రలను తామ్రముతో చేసిరి. వాటినే వాడుచుండు పూర్వీకుల ఆచారము యిప్పటికిని గలదు. రోగక్రిమి నాశనమునకు రాగితాయిత్తులనే బిడ్డలమెడలలోను మొలలకును కట్టుదురు. ఈవిధముగ ఆరోగ్యసూత్రములతోకూడిన ఆచారము లెన్నియో కలవు.

త్రివేణి సంగమం మధ్యకు మేము పసుపు, కుంకుమ, పండ్లు, రెవిక మొదలగు వాయనపు సామానులను తీసికొని పడవనెక్కిపోతిమి. పురోహితుడు కూడ యుండి మంత్ర తంత్రములను జరిపిరి. సాధారణముగ గొప్ప క్షేత్రములన్నియుగూడ పరిశుభ్రముగ నుండవు. ఈ పట్టణమున గొప్ప గొప్ప భవనములతో లక్ష్మి తాండవమాడుచుండినను దరిద్రదేవత విచ్చలవిడిగ విహరించుచుండుట చూడవలసి వచ్చెను.

త్రివేణి సంగమ సమీపమున ఔరంగజీబు కోటయుండెను. ఇది పురాతన కట్టడమైనను అతిగంభీరముగ నుండెను. అక్షయవటమను వట వృక్షము యిక్కడ కలదు. ఆ వృక్షమును యిప్పటికిని భక్తి శ్రద్దలతో పూజించుచున్నారు. మరణానంతరము స్వర్గమునకు పోదలుచుకొన్నవారు ఈ చెట్టుకొమ్మన ఉరిదీసుకొనుట ఇక్కడి స్థలపురాణము.

ఇక్కడనుండి జగన్నాథము చేరితిమి. జగన్నాథమున ఒక ఉరియా మంగలి తీర్థవాసునింట దిగితిమి. అక్కడ మనము వంటచేసుకొని భోజనము చేయగూడదట. దేవాలయములో వండిన పదార్ధమునే దేవతాప్రసాదముగ భుజించవలయును. గనుక అక్కడి మంగలి కుండలతో వండిన అన్నమును, పప్పును మట్టిపాత్రలతోనే తెచ్చి మాకు పెట్టెను. ఇక్కడ దేవాలయములో 7 కుండల దొంతిమీద అన్నమును వండెదరు. అనగా 7 కుండలలోను బియ్యము నీళ్లు కలిపి ఒక దానిమీద యొకటి నా పొయిమీద పెట్టెదరు. అవి అన్నియు ఒకే సమయమున పచనమగును. ఇట్లు వండిన అన్నమే స్వామి ప్రసాదము.

ఇచ్చట జగన్నాథుడు ముఖ్య దేవుడు. బలరామస్వామియు ఉపదేవత. ఇక నిచ్చట స్త్రీదేవత లక్ష్మీగాని, రుక్మిణిగాని గాక సుభద్ర - ఇది అపూర్వము. జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణభగవానుడు తన చెల్లెలి కట్టి వరమిచ్చెనని ఏదో పుక్కిటి పురాణమును చెప్పదురు.

కాశీయాత్ర అనంతరము కొన్నాళ్లకు కేరళదేశ యాత్రకు బయలుదేరితిని. దివాన్ బహదూర్ దొడ్ల రాఘవయ్యగారు ఆరోజులలో తిరువనంతపురంలో (తిరువాన్కూరు) దివానుగా నుండిరి. ఆ సమయముననే నేను మళయాళదేశ యాత్రకు బయలుదేరితిని. శ్రీ రాఘవయ్యగారు నాకు చిరపరిచితులు. అందుచే ముందుగా తిరువనంత పురమునకు వెళ్లితిని. వీరు నాకు పద్మవిలాసమను భవనమున బస కుదిర్చిరి. తిరువాన్కూరు రాజ్యమంతయు శ్రీ పద్మనాభస్వామివారిదనియు వారి ప్రతినిధులుగా వారిదాసులై తాము రాజ్యమొనర్చుచున్నామనియు - ఈ రాజులు భావింతురు. రాజ బిరుదములలో 'పద్మనాభ దాస' అనునదియు కలదు. అనంత పద్మనాభస్వామివారి విగ్రహము చాలా గంభీరముగ నుండును.

అక్కడనుంచి మేము మొట్టమొదట కన్యాకుమారి క్షేత్రమునకు పోతిమి. అక్కడ సర్కారు సత్రములో దిగితిమి. ఆ సత్రములోయుండే బావిని చూచినప్పుడు గుంటూరు బావులు నాకు జ్ఞాపకమునకు వచ్చినవి. వంటవాడు వంటచేయు లోపల మేము సముద్ర స్నానమునకు వెళ్లివచ్చితిమి. ఇచ్చట పడమటి సముద్రము, తూర్పు సముద్రము సంధించు స్థలము. భారతదేశమునకు కొన యిది. ఇక్కడ అలలు ఉరవడిగా కొట్టుకొను చుండును. అందుచే స్నానమొనర్చువారికి ప్రమాదములేకుండా లావాటి ఇనుపగొలుసులను అడ్డముగా కట్టియుంచిరి. అక్కడి క్షేత్రవాసులు శ్రీరాముడు ఇక్కడనుండియే వారధికట్టి లంకపై దండెత్తెనని చెప్పదురు. అవిగో పెద్దరాళ్ల వంతెనను చూడుడు అని చూపుదురు; ఇదియే సేతుబంధన స్థలమనెదరు. స్నానానంతరము దేవాలయమునకు వచ్చి అమ్మవారిని దర్శించి పూజించితిమి. అమ్మవారి విగ్రహమునకు పసుపు దట్టముగ మెత్తబడి యుండును. పావడను గట్టి శృంగారింతురు. చూచుటకు 10 సం||ల కన్యకవలెనే అమ్మణ్ణి ఎంతో అందముగా నుండును.

ఈ ఊరు విడిచి సుచీంద్రమునకు వెళ్లితిమి. ఇక్కడి దేవాలయము చాల పురాతనమైనదిగాక అందమైనదికూడ.

షేంకోటలో మేము రాజభవనమున దిగి అక్కడనుండి స్టీముబోటులో పైకము ఆలస్పళె, అంబలప్పళె మొదలగు క్షేత్రములకు పోతిమి. పిమ్మట ఎర్నాకుళము పోయి ప్రసిద్ద వకీలు సుగుణపాయిగారింట బసచేసితిమి. వీరు సరస్వతి బ్రాహ్మణులు. మత్స్యములను తినుటకు అలవాటుపడినవారు. ఆనాడు మాకు మాత్రము వడ్డించలేదు.

తిరుచూరునుండి ఈరోడ్ మార్గమున శ్రీరంగము, మధుర, తిరునల్వేలి చూచుకొని కుత్తాళమునకు చేరితిమి. కుత్తాళములో శ్రీమౌనస్వామి మఠములో బసచేసితిమి. ఈ స్వామి నాకు మద్రాసులో పరిచయమగుటచే వీరు మమ్మాదరించి అనుగ్రహించిరి. అక్కడి ఆకాశగంగలో కొన్ని దినములు తృప్తిదీర స్నానమును చేసితిమి. చల్లని జల్లులలో ఆప్యాయముగ తడిసితిమి. పచ్చి జాజికాయలను, లవంగములను, ఏలక్కాయలను తనివితీర తాకి రుచి చూచితిమి. అయిదు ఆకాశధారల వద్దకుపోయి త్రోవలోయుండు లతావృక్షముల సౌందర్య మనుభవించితిమి. కుత్తాళమునుండి తిరిగివచ్చునప్పడు మధురలో దిగితిమి.

మధురలో వారము దినములు మకాంచేసి దేవాలయముయొక్క అద్భుత శిల్పశాస్త్ర ప్రదర్శనమును దినము చూచుచుండినను తనివితీర లేదు. పురాతన హిందువుల గొప్పతనమును దెలుసుకొనుటకు ఈ దేవాలయ గోపురములు, రాతిస్థంభములలో చెక్కబడిన సుందరమైన విగ్రహములే సాక్షులు. ఎంతకాలము యీ చిత్రములను చూచినను వింతగనే యుండును. దక్షిణదేశములోయుండు దేవాలయములలోనెల్ల యిదియే గొప్పది. పరిశుద్ధముగ నుండునది. చక్కని యేర్పాట్లు గలది.

దేవాలయమున దక్షిణ భాగము మీనాక్షీదేవికి సంబంధించినది; ఉత్తర భాగము సుందరేశునికి సంబంధించినది. ఇందు అష్టలక్ష్మీ మండప మొకటి కలదు. లక్ష్మీదేవియొక్క 8 రూపములు ఇక్కడ విగ్రహములుగా వేయబడియున్నవి. ఇక్కడనే మీనాక్షీ సుందరేశుల కథలును చెక్కబడియున్నవి. ఈ మంటపమునకు ప్రక్కననే సుందరమైన గణేశ విగ్రహమున్నూ, ఆరు తలలతో షణ్ముఖస్వామి విగ్రహమున్నూ కలవు. ఆ తరువాత మీనాక్షీదేవి వేటాడు ఆటవిక స్త్రీగాను, సుందరేశుడు వేటగాడుగాను చెక్కబడిన చిత్రగాధలున్నవి.

ఆ లోపలనే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయమున కటునిటు వాలిసుగ్రీవుల విగ్రహములు, చంద్రమతి హరిశ్చంద్రుల విగ్రహములు చెక్కబడియున్నవి. దేవాలయం బయట - తిరుమల నాయకుని సత్రం కలదు. సుందరేశుడు తిరుమల నాయకునికి ప్రతి సం||మున్నూ 10 రోజులు అతిథిగానుందునని వరమిచ్చెనట. స్వామివారు వచ్చి విడిదిచేయుటకు అర్ధముగా నీ సత్రము కట్టించబడినది. దీనిని కట్టించుటకు 22 సం||లు పట్టెనని చెప్పదురు. మధురకు రెండుమైళ్ల దూరములో తిరుక్కైకుండ్రను స్థలములో గొప్ప శివాలయము గలదు.

మధురనుండి రామనాథపురం దర్భశయనం మొదలగు క్షేత్రములను చూచుకొని రామేశ్వరమునకు చేరితిమి. నివసించుటకు మంచి యిల్లు దొరికినది. అక్కడ చేరిన మర్నాడు మొదట యాత్రికులు చేయవలసిన కార్యక్రమ కర్మములు మొదట క్షౌరకల్యాణము, పిమ్మట చంద్ర పుష్కరిణిలో ముక్కు మూసుకొని స్నానము, అటుపిమ్మట దేవాలయములోయున్న బావులలోని శుద్దోదక స్నానము! మాకు సంతానము లేకుండుటవలన ఇక్కడ నాగప్రతిష్టను చేయదలచుకున్నాము. నాగప్రతిష్ట మంత్ర తంత్రములతో జరిగెను. ఆ వూరు విడచి వచ్చునాడు మనము ప్రతిష్ట చేసిన నాగమయ్యను చూచిపోవుదమని యిరువురము గుడికి పోతిమి. మేము ప్రతిష్ట చేసిన నాగమయ్య మాయమైనాడు.

తంజావూరులోయున్న రాజాసత్రమున దిగితివిు. దేవాలయమునకుపోయి బ్రహ్మాండమైన లింగమునుచూచి పూజించితిమి. ఎదురుగునున్న పెద్ద వృషభమును చూచి ప్రదక్షిణముచేసి తాకి ఆనందించితిమి. ఈ దేవాలయము చుట్టు అగడ్త గలదు. పూర్వపు తంజావూరు రాజులు ఈ దేవాలయమునే కోటగా కట్టుకొనిరి. దేవాలయపు ప్రహరీగోడలు చాలా పొడవైనవి. శిథిలమయిన స్థితిలో యున్న శ్రీ సరస్వతి భాండాగారమునకు వెళ్లి నమస్కరించితిమి.

తంజావూరికి సమీపమున తిరువయ్యారు పంచనదీ తీరమున వున్నది. ఇక్కడనే త్యాగయ్యగారు నివసించి, రాముని భజించి, కీర్తనలు పాడి కీర్తిని బడసిరి. వీరి సమాధికి ప్రదక్షణమును చేసితిమి. వారుండిన యింటికి పోతిమి. ఆ యింటివారు త్యాగయ్యగారు ఆరాధించుచుండిన పురాతనపు శ్రీరామపంచాయతనం దేవతార్చన మందసమును చూపిరి. మేమును ఆ దేవునికి నమస్కరించితిమి.

తంజావూరునుండి శ్రీరంగము చేరినాము. శ్రీరంగ దేవాలయ గోపురము దర్శించగనే,

కావేరీ గిరీయాన్తోయం వైకుంఠ రంగమందిరం

పరవాసుదేవో రంగేశ ప్రత్యక్షంపరమంపదం

అని స్మరించుచు ఏకాదశి సత్రమున దిగితిమి. ఆనాడు మధ్యాహ్నము రాత్రియను రంగని సేవించి పూజించితిమి. మరునాడుదయముననే పోయి స్వామి యెదుట జరుగు విశ్వరూప దర్శనమును చూచి సంతసించితిమి. కావేరి కొల్లడములో, బ్రహ్మ ముళ్లతో స్నానము చేసితిమి. దేవాలయమునకు పోయి పులిహోర, దధ్యోజనము, నేతిగారెలను కొనుక్కొని యింటికి పోతిమి.

శ్రీరంగమునుండి తిరుచునాపల్లికి వచ్చి అక్కడి వుచ్చిపిళ్లారికొండ నెక్కి పిళ్లారి (విఫ్నేశ్వరుడు)ని దర్శించితిమి. కొండమీదనుండి శ్రీరంగము తిరుచునాపల్లి పట్టణములను చూచిన చిన్నవిగను చిత్రముగను కనుబడును.

కుంభకోణం

తిరుచునాపల్లినుండి కుంభకోణం చేరితిమి. ఇక్కడ నా పరిచితులగు దివాన్ బహదూరు భాష్యమయ్యంగారు జడ్జిగ యుండిరి. వారింటిలో బసచేసితిమి. ఆ వూరిలో నాలుగు దినములుండి కావేరి స్నానము, దేవుళ్ల దర్శనము చేసుకొనితిమి.

ఈ కుంభకోణములో 16 దేవాలయములున్నవి; వానిలో - 12 శివునివి; 4 విష్ణువువి. అన్నియు చూడదగినవే. సారంగపాణి (విష్ణు) దేవాలయము చాల గొప్పది. ఇక్కడ గాలిగోపురం సుమారు 150 అడుగులు ఎత్తుండును; మెడ వెనుకకు విరుచుకొనిగాని శిఖరమును చూడజాలము. ఈ స్వామికి రెండు కొయ్యరథములున్నవి. అందొకటి చాలా పెద్దది.

చిదంబరములో యొక నాటుకోటు శెట్టి వారి సత్రములో దిగితిమి. స్నానానంతరము సమయమునకు నటరాజస్వామి దర్శనమునకు పోతిమి. చిదంబర రహస్యమును నటరాజు వైభవమును చూచి ఆనందించితిమి. అప్పడక్కడ నందన్ చరిత్రము తలంపునకు వచ్చెను.

ముఖ్యముగ శ్రీ సరస్వతీబాయి చెప్పు నందన్ చరిత్ర హరికథ జ్ఞాపకమునకు వచ్చి మరియొకసారి నటన సభాపతికి ప్రదక్షిణము చేసి అక్కడనుండి పయనమైతిమి.

చంగల్పట్టు రైల్వేస్టేషన్లో దిగి సమీపమున యుండు పక్షితీర్థమను క్షేత్రమునకు పోయి సత్రములోదిగి శంఖుతీర్ధమున స్నానముచేసి కొండ నెక్కితిమి. సుమారు 11 గంటలకు ఒక పండారము చక్కెరపొంగలిని వండుకొని కొండ పైకి వచ్చి పక్షులను చెయ్యితట్టి పిలుచును. అప్పడు రెండుగాని మూడుగాని పక్షిరాజులు వచ్చి పండారమువద్ద వాలును. అవి ఆ ప్రాంతముల కొండగృహాలనుండి వచ్చుట చూడనగును. అయితే అవి ఒకటి కాశీనుండియు, మరియొకటి రామేశ్వరమునుండియు వచ్చినట్లు తీర్ధప్రజల కతడు చెప్పును. పక్షిరాజులు వచ్చినవెంటనే పండారము వాటికి స్నానము చేయించి తిరుమణి శ్రీ చూర్ణముతో అలంకరించి తెచ్చిన చక్కెరపొంగలిని పక్షులకు పెట్టును. పక్షులు తిని, మిగిలిన ప్రసాదమును వచ్చినవారందరికి పంచిపెట్టును. ఆ పక్షులు వచ్చిన త్రోవనే మరల యెగిరిపోవును. ఈ ప్రకారము దినము జరుగుచుండును. వందలాది సంవత్సరములుగ పక్షులు యిక్కడికివచ్చి ధర్శనమిచ్చుచున్నట్లు స్థలపురాణము గలదు. కొండక్రిందయుండు శంఖుతీర్ధమున 12 సం|| కొకసారి శంఖమొకటి గొప్పధ్వని చేయుచు వైకిలేచునని అక్కడివారు చెప్పెదరు.

కాంచీపురము వచ్చితిమి. వరదరాజస్వామి దేవాలయమున అర్చన వగైరాలను జరిపించి గుడిలో యుండు బల్లిని తాకితిమి. ఈ బంగారు బల్లిని తాకినవారికి బల్లిపడిన దోషముండదు.

దేవి ఈశ్వరునికై మామిడిచెట్టుక్రింద తపమాచరించెననియు, ఈశ్వరుడచ్చట ప్రత్యక్షమై దేవిని వివాహమాడెననియు కథ. ఆదిలింగమని చెప్పబడునది మామిడిచెట్టు క్రిందనున్నది. ఆ మామిడిచెట్టు చాలా పురాతనమని చెప్పదురు. మామిడిచెట్టు క్రింద వెలిసిన దేవుని ఏకామ్రేశ్వరుడు అందురు.

ఈ దేవాలయమును నాటుకోటు శెట్లు లక్షలాదులను ఖర్చుపెట్టి మరల కట్టించిరి. అక్కడి నల్లరాతి స్తంభముల మీద చెక్కబడియుండు విగ్రహములను చూడదగినవి. శ్రీ ఆదిశంకరులవారి విగ్రహమున్ను ఈ దేవాలయమున నున్నది. సాలెపురుగునకు, పామునకు, ఏనుగునకు మోక్షమిచ్చిన ఈశ్వరుని క్షేత్రమగుటచే "శ్రీకాళహస్తి" అని దీనినందురు. ఇదియును పురాతనమైన మహాక్షేత్రము. ఈశ్వరునకు తుమ్మిపూల అర్చన విశేషము గనుక ఈ దేవాలయములో తుమ్మిపూల మాలలను సుందరముగకట్టి విక్రయించుచుందురు. స్వామిని దర్శించుటకు పోవువారందరు తుమ్మి పూల మాలలను తీసుకొని పోయి లింగమునకు అలంకరించెదరు. ఈవూరిలో నాకు మంచి స్నేహితులు శ్రీ ఎన్. సాంబయ్యగారున్నందున వారింటిలోనే బస చేసితిమి.

ఈ ఊరి ప్రక్కన సువర్ణముఖీనది యున్నది. ఈ ఊరినంటి చిన్న కొండ తిప్పలున్నవి. ఆ తిప్పల మధ్య భరద్వాజాశ్రమమున్నది. అందొక తిప్పపై మూరెడు పొడవున దుబ్బుగా పెరుగు గడ్డియొకటి గలదు. ఆ గడ్డి భూమినుండి తీయకే పిడికెడు పోచలు చేతబట్టి ఏదైనను కోరుకొనుచు, ముడివేసినచో, ఆ కోరిక ఈడేరునని చెప్పదురు. వెళ్లిన యాత్రికులందరున్నూ ఆ పనిచేసి వచ్చుచుందురు.

ఏడుకొండలవానిని దర్శించుటకు తిరుపతి వెళ్లితిమి. తిరుపతిలో ఒక యింటిని బాడుగకు తీసుకొని దిగితిమి. కొండకు నడిచియే నిదానముగ యొక్కగలిగితిమి. కొండపైకి పోయి యిరువురము క్షౌరకల్యాణమును చేసుకొని, తీర్థస్నానమును చేసి, వెంకటరమణుని దర్శించి అర్చించి కర్పూరహారతి నిచ్చితిమి. చెల్లనికాసులను కొండికాసులను స్వామిహుండీలో వేసి నమస్కరించితిమి. అచ్చట మూడుదినములుండి దిగువ తిరుపతికి వచ్చి స్వామిభార్య అలిమేలుమంగ తాయారును దర్శించి కుంకుమార్చనను చేసితిమి. దిగువ తిరుపతిలో గోవిందరాజస్వామి దేవాలయము చాలా పెద్దది. యాత్రికులందరు ముందు దానిని దర్శింతురు. ఆ పిదప దిగువ తిరుపతికి ఒక మైలు దూరమున నుండు కపిలతీర్థంలో మునిగి మరీ కొండ ఎక్కుతారు. అది యొక జలపాతం వల్ల ఏర్పడ్డ కొలను. ఆ జలపాతం ఒక హనుమంతుని విగ్రహముపై పడుచుండును. ఈతనేర్చిన వారు ఈది వెళ్లి హనుమంతుని తలపై కూర్చుండి జలపాత స్నానము నేరుగా చేసివస్తారట.

కొండను 5 మైళ్లదూరము నిలువున ఎక్కుదురు. మొత్తము 7 కొండలు ఎక్కవలెను. మధ్యమధ్య అడవులు, తిప్పలు, సమతలములు ఉండును. ముఖ్యముగా మోకాళ్ల పర్వతమెక్కుట కష్టతరము. పూర్వము అందరు కష్టపడి ఎక్కేవారు. ఓపికలేనివారు డోలీలలో మోయించుకొని వెళ్లేవారు. ఇప్పడు రోడ్డు వేయబడినది; బస్సులు నడచుచున్నవి.

మొదట ఈ పర్వతం మేరుపర్వతంలో భాగమని, వాయుదేవునికి, ఆదిశేషునికి వాగ్వాదమురాగా మేరుపర్వత భాగమును తన పడగపై నెత్తుకొని ఆదిశేషుడు తన మహిమ చూపగా, వాయువా పర్వతము నెగురగొట్టి తనశక్తి చూపెనట. ఆ ఎగిరి వచ్చిన పర్వతము - ఇట్లు ఈ ప్రదేశమున పడి తిరుపతియైనది. తొలినామధేయము శేషశైలము లేక శేషాచలము.

దేవాలయమునకు మూడుమైళ్ల దూరములో మరియొక కొలను 'పాపవినాశం" అని గలదు.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి విగ్రహము చాల సుందరమును గంభీరమునై 7 అడుగుల ఎత్తున యుండును. ఈ విగ్రహము తొలుత శైవమనియు, శాక్తేయమనియు పండితులందురు. అందుకనుగుణ్యముగా జటాజూటము; ఫణిహారములు మున్నగు శైవచిన్నెలు విగ్రహమున నుండుటయు, శివప్రీతికరమగు బిల్వపత్రిపూజయు, శాక్తేయమగు శుక్రవారపు కుంకుమ పూజయు స్వామికి జరుగుచుండుటను ఆ పండితులు తార్కాణముగా నుదహరింతురు.

మానుముంతలను, కొయ్యబొమ్మలను, కొన్నిటిని కొనుక్కొని బోడిగుండ్లతో మద్రాసుకు వచ్చితిమి. తీర్థయాత్ర సమారాధనను చేసితిమి. తిరుపతి ప్రసాదమును అందరికిని భోజనకాలమందు పంచిపెట్టి సంతృప్తులమైతిమి.