చిన్ననాటి ముచ్చట్లు/కేరళ దేశాచారములు

వికీసోర్స్ నుండి

15

కేరళ దేశాచారములు

కొన్ని సంవత్సరములకు ముందు నేను తిరుచూరు మకాములో ఉండగ మా ఇంటి మదురుగోడ ప్రక్కన పెద్దమంటలు మండుట చూచితిని. ఆ మంటయేమని మా యింటిలోని వారి నడిగితిని. మృతిజెందిన వారి కళేబరములను ఇంటివారి దొడ్డి తోటలలోనే దహనముచేయు ఆచారము కేరళదేశమునగలదని వారు చెప్పిరి.

తిరుచూరుకు సమీపముననే కాలడి అను పల్లెటూరు గలదు. ఈ గ్రామమున శివగురు అనునొక ప్రసిద్ద నంబూదిరీ బ్రాహ్మణోత్తముడుండెను. వీరికి ఆర్యయను నొక సతీ తిలకముండెను. ఈ శివగురు సకల శాస్త్ర సంపన్నుడై ధర్మపత్నితోగూడి యజ్ఞయాగాది క్రతువులనొనర్చి ప్రసిద్ధి చెందియుండెను. ఈ బ్రాహ్మణునకు వయసు చెల్లుచుండినను సంతానసంపద లేకయుండెను. అప్పడా శివగురు ధర్మపత్నితో సహా వృషగిరి అను శివక్షేత్రమునకు వెళ్లి అక్కడ శివభజనను చేయుటకు ప్రారంభించెను. అప్పడు శివుడు వారి భక్తికి మెచ్చుకొని పుత్ర సంతానము గలుగునట్లు వారికి వరమిచ్చి అనుగ్రహించెను. పిమ్మట కొంతకాలమునకు భార్య గర్భవతి అయి పుత్రుని గనెను. ఈ పుత్రునిచూచి శివగురునకు మితిలేని ఆనందము గలిగెను. ఈ బిడ్డడే విశ్వవిశృతుడైన ఆదిశంకరాచార్యస్వామి. వీరు క్రీస్తుశకము 806 సం||మునకు సరియగు కలివర్షం 3927 చైత్రమాసము (మేడమాసం 18 తేది) 18 తేదిన కాలడి గ్రామమున స్వగృహమునందు జనన మందిరని పండితులు నిర్ణయించిరి.

శంకరునకు మూడవ సం||ము వయసు దాటకమునుపే తండ్రి పరమపదించెను. అప్పటినుండి బాలుడు తల్లి చాటుననే పెరిగెను. వీరి కుటుంబము చాల పేదదైనందున ఊరివారి సహాయముతో శంకరునకు ఉపనయనాది వైదికకర్మలను తల్లి చేయవలసి వచ్చెను. ఈ దేశపు నంబూదిరీ బ్రాహ్మణుల కులాచారముల ననుసరించి బాలునకు వేదాధ్యయనాది విద్యలను అక్కడి పండితులవద్దనే అభ్యసింపచేసెను.

శంకరునకు జ్ఞానప్రాప్తి సిద్దించిన వెంటనే సన్యసించవలయుననే కోరిక మనసున దృఢముగ నాటుకొనెను. అయితే తాను సన్యసించిన వంశక్షీణమగునని తల్లి తలంచి సన్యసించుటకు ఆమె అనుమతి నివ్వదేమోనని సంశయించుచు యోచించుచుండెను.

ఇటుండగ ఒకనాడు శంకరుడు ఇంటి సమీపముననే యుండిన నదీప్రవాహమున స్నానము చేయుటకు వెళ్లెను. స్నానము చేయుచున్న శంకరుని కాలును నదిలో యుండిన మొసలి గట్టిగ పట్టుకొని బాధించుచుండెను. అప్పడు బాలుడు బాధకు తాళలేక 'అమ్మా-అమ్మా! అని ఆర్తనాదమున తల్లిని పిలిచెను. వీరి ఇల్లు ఆ నదీ సమీపముననే ఉండినందున కుమారుని కేకలు తల్లి విని మరి కొందరినికూడ పిలుచుకొనివచ్చి కుమారుని అవస్థను చూచెను.

అప్పడు శంకరుడు తల్లినిచూచి 'అమ్మా మొసలి వాతపడి చనిపోవుచున్న నాకు సన్యాసమును స్వీకరించుటకు నీవు అనుమతినిమ్మ" అని దీనముగ తల్లిని ప్రార్థించెను. అప్పడు కుమారుని కష్టములనుచూచి సహింపలేక వెంటనే సన్యసించుటకు తల్లి అనుజ్ఞనిచ్చెను.

నర్మదా నదీతీరమున నివసించుచుండిన గోవిందాచార్యుల వారిని ఆశ్రయించెను. ఆయన బాలుని చేరదీసి జ్ఞానోపదేశమును చేసిన పిమ్మట సన్యాసమును ప్రసాదించి అనుగ్రహించి ఆశీర్వదించెను. ఈ శంకరుడు కాశీక్షేత్రమునందుండి బ్రహ్మసూత్రం, దశోపనిషత్తు, భగవద్గీత ఈ మూడు గ్రంథములకు భాష్యం వ్రాసిరి.

ఈ శంకరభాష్యములే వీరి అఖండ శక్తికి నిదర్శనములు.

శంకరుడు కాశీనుండి ప్రయాగకు వెళ్లిరి. అక్కడ బౌద్ధమత విధ్వంసుకుడగు కుమారిలభట్టును దర్శించెను. కుమారిలభట్టు శిష్యుడగు మండనమిశ్రుని, సరస్వతీదేవితో సమానురాలైన వీరి భార్య, భారతీదేవిని దర్శించిరి. వీరిరువురను ఓడించి దిగ్విజయమును పొందిరి. పరాజయమును పొందిన మండనమిశ్రుడు స్వాములవారి శిష్యబృందమునచేరి సన్యాసమును స్వీకరించిరి. పద్మపాదుడు, మండనమిశ్రుడు మొదలగు శిష్యులను వెంటబెట్టుకొని దేశసంచారమును సల్పి పండితులనందరిని మెప్పించి దిగ్విజయమును బొందిన తర్వాత స్వామి శృంగేరి చేరిరి. ఆచార్యులు శృంగగిరి చేరినప్పడే తల్లి ఆర్యాదేవి చరమశయ్యపై పరుండి తన్ను స్మరించుచున్నట్టు జ్ఞానదృష్టితో గ్రహించినవాడై స్వగ్రామమగు కాలడికి మరలివచ్చి తల్లిని దర్శించెను. కుమారుని చూచి సంతసించి తల్లి మరణించెను. ఆమెను స్మశానమునకు తీసుకొనిపోయి కర్మక్రియలను జరుపవలసివచ్చి స్వజాతి నంబూదిరి బ్రాహ్మణులను పిలిచి తనకు సహాయపడవలయునని వారిని కోరిరి. గాని వారెవరును సహాయపడక నిరాకరించిరి. ఏలననగా శంకరుడు సన్యాసి అగుట వలన మాతా పితృ కర్మలను ఆచరించు అధికారము లేదు. మరియు బ్రహ్మచారిగ నుండి సన్యసించినది శాస్త్ర విరుద్దమని కక్ష కట్టి శంకరుని వెలివేసి సహాయ నిరాకరణమును సాగించిరి. అది వర్షాకాలము. జోరున వర్ధము కురియుచుండెను. కాల్చుటకు కట్టెలు లేవు. అప్పడు శంకరుడు తోటలోనున్న అరటిమాకులను నఱకి కాష్టమును పేర్చి అగ్నినుంచెను. కేరళదేశమున చనిపోయినవారిని తమ ఇండ్ల తోటలలో దహనము చేయుట ఇక్కడివారికి అమంగళముగాని భయముగాని లేదు. దహనము చేసిన స్థలమును పవిత్రముగ నుంచి ఒక సంవత్సరమువరకు అక్కడ దీపారాధనను చేయుచు మ్రొక్కుచుండెదరు.

కాలడి క్షేత్రము ఆదిశంకరుల జన్మస్థలము. చిన్న గ్రామమైనను రమణీయమగు వృక్షరాజముల మధ్య పెరియారను పేరుగల నదీతీరమున వెలసి ఉన్నది. అక్కడ శంకర శారదా దేవులను ప్రతిష్టించిన చిన్న దేవాలయములు గలవు. శంకరాచార్యుల తల్లిని దహనముచేసిన స్థలమున తులసికోట గలదు. సంస్కృత విద్యార్థులకు పాఠశాల గలదు. యాత్రికులకు ధర్మశాల గలదు.

పరశురాముడు కత్రియులందరిని వెదకి సంహరించిన అనంతరం ఆ పాప పరిహారార్ధము బ్రాహ్మణులకు భూదాన మొనర్చవలెయునని యోచించెనట. ఈ ధర్మబుద్ధితో పరశురాముడు పశ్చిమ సముద్రతీరమున నుండు ఒక పర్వతాగ్రమునుండి తన దివ్యాయుధమగు గండ్రగొడ్డలిని విసిరి సముద్ర మధ్యమునవేయగా ఆ జలములలోనుండి కొండలు, గుట్టలు, చెట్టుచేమలు, నదులు, దొరువులు, పాములు, మృగములు మున్నగువానితో గూడ భూమి పెల్లగిల్లి వైకుబికినది. ఆవిధముగా గొడ్డలి దెబ్బకు పాతాళ లోకమునుండి ప్రతిధ్వనిచేయుచు పైకుబికిన భూభాగమే కేరళదేశము.

ఇట్లు బయటపడిన నిర్జనప్రదేశమగు అరణ్యప్రాంతమును బ్రాహ్మణులకు దానమిచ్చు సంకల్పముతో పరశురాముడు ఆర్యావర్తము నుండి కొందరు బ్రాహ్మణులను రావించి వారికట్టే దానిని దానమొనర్చెను. అయితే ఆ వచ్చిన బ్రాహ్మణులు అక్కడనుండి క్రూరమృగములకు, ఘోరసర్పములకు ఝడిసి సమీపస్థమైయున్న కొంకణమునకు పారిపోయిరట. వారే నేడు సారస్వత బ్రాహ్మణులు అని పిలువబడు అందమైన జాతి.

పరశురాముడు రెండవసారి భక్తాగ్రేసరులు, పండితులు, మంత్రశాస్త్రవేత్తలునైన బ్రాహ్మణులను ఆర్యావర్తమునుండే తిరిగి రావించి వారికాభూమిని దానమొసగెను. రెండవసారివచ్చిన బ్రాహ్మణులు తపస్సంపన్నులు, మంత్రవేత్తలుగావున మృగసర్ప బాధలకు జంకక వానిని వశమొనర్చుకొని అక్కడనే స్థిరవాస మేర్పరచుకొనిరి. ఇట్లు రెండవసారి వచ్చినవారే నంబూదిరీ బ్రాహ్మణులు.

నంబూదిరీలు

వేదవేదాంగవేత్తలు; మహాకర్మిష్టులు, మంత్రశాస్త్రనిధులు, శిష్టాచార సంపన్నులు, ఆ వైదికాచారకర్మ పరాయణులై వీరు సామాన్యముగా ఇల్లు వదలి పైకిరారు. ఇతర కులముల స్పర్శ వీరికేమాత్రము పనికిరాదు.

వీరు తొలుదొల్తగా నీభూమికి వచ్చినప్పడు ఇది నిర్ణన ప్రదేశమగుట ఆర్యుల నాగరికత ననుసరించి వీలైనంత భూమి నాక్రమించి, సస్యములు, వృక్షజాతములు వృద్ధిచేసుకొనుచు అనుభవించిరి. ఆ భూములు వారి స్వంతమైనవి. నమ్మిక కలవారగుట, ఆచార సంపన్నులగుట, బ్రాహ్మణులగుట, పిదప రాజులు భక్తిపూర్వకముగ విస్తారముగ భూములను వీరికి దానమొసంగిరి. ఇట్టి భూముల ననుభవించు వీరిని 'జన్మీలు' అందరు - అనగా జమీందారులు (భూస్వాములు) అని అర్థము.

విధివిహితమగు షోడశకర్మలలో జాతకర్మ మొదటిది. బిడ్డపుట్టిన 36 గం||ల లోపున బిడ్డతండ్రి బిడ్డ ముఖారవిందమును చూచును. అంతట నాతడు స్నానముచేసి వచ్చి బిడ్డను వడిలో కూర్చుండబెట్టుకొని జాతకర్మ మొనర్చును. అప్పడే అతడు శిశువు దీర్ఘాయువునకై యోగక్షేమములకై దానధర్మము లొనర్చును. నేతిని, తేనెను కొద్దిగా కొద్దిగా తీసికొని కలిపి దానికి కొంచెము బంగారమును చేర్చి, అదృష్టచిహ్నముగా దానిని బంగారు కడ్డీతో కలియబెట్టి ఒక బంగారుపాత్రతో బిడ్డగొంతులో పోయును. ఆ కార్యమొనర్చుచు కొన్ని ఋగ్వేదమంత్రముల నతడు వల్లించును. ఆవిధముగా నాకాలపరిమితిలో నది జరుగనిచో పురుడు వెళ్లువరకు జరుగుటకు వీలులేదు. పురుడు మనదేశములోవలెనే 10 రోజులు పట్టుదురు. 11వ రోజున బాలింత శుద్ధి స్నానమొనర్చును.

పిదప కర్మ నామకరణము. మనవలె 11వ రోజునగాక 12వ రోజున జరుపబడును. తండ్రియే బిడ్డను వడిలో కూర్చుండబెట్టుకొని, మంత్రపూతముగా, విసర్గాంతమగు నామధేయమును సంస్కృతమున బిడ్డచెవిలో ఉచ్చరించును. తండ్రి పిదప తల్లియు అట్లే ఆ నామధేయమును శిశువు చెవిలో చెప్పును.

బిడ్డకు నాలుగవ మాసము వచ్చువరకు బాహ్యప్రదేశమునకు బిడ్డను తేరు. అప్పడు 'నిష్క్రమణము' అని యొక కర్మ జరుపబడుచున్నది. ఇందుకుగాను పనసచెట్టు నొకదాని నలంకరింతురు. బిడ్డ నప్పుడారు బయటికి తెచ్చి బిడ్డకాలితో ఆ పనసచెట్టు వేరు తొక్కింతురు. మామూలుగా బ్రాహ్మణులకు దానధర్మము లొనర్తురు.

శిశువు దినదినాభి వృద్దినందుచుండగా ఆరవనెలయందే అన్నప్రాశనము జరుగును. శుభముహూర్తమున అన్నమును, తేనె, నేయి, చక్కెరలతో చేర్చి శిశువుచే తినిపించుదురు. ఈ అన్నప్రాశన సమయమున అశ్వలాయన గృహ్యసూత్రానుసారముగ మంత్రములు చదువబడును. పిదప జరుగు కర్మచౌళము - అనగా ప్రథమముగా కేశఖండనము. మనదేశమున బాలురకే ఈ మహోత్సవము జరుపబడును. ఆ దేశమున బాలికలకును జరుపుదురు. అది వారికి అశుభము కాదు. సామాన్యముగ నిది 3వ సం||ననో, 5వ సం||ననో జరుపబడును. ఒక్కొక్కప్పడు బాలురకైదవఏటును బాలికల కేడవఏటును జరుపబడుట కలదు. బాలురకు శిఖ విడిచి తలయంతయు గొరుగబడును. బాలికలకు ఒకటి రెండు వెండ్రుకలు మాత్రము లాంఛనముగ తీసివేయుదురు. ఈ కర్మ జరుగునపుడు అశ్వలాయన సూత్రానుసారము బిడ్డను అగ్నిహోత్రమునకు పడమరగా తల్లివడిలో కూర్చుండ బెట్టుకొనును. తండ్రి తల్లికి దక్షిణముగా కూర్చుండి 21 దర్ఛపోచలు చేతబట్టి బిడ్డతలపై మంత్రపూర్వకముగ జలమున చిలకరించును.

ఆ తరువాత కర్ణవేదము - అనగా చెవులు కుట్టుటకూడా - 3వ ఏటనో 5వ ఏటనో జరుగును. ఇదియును మంత్రపూర్వకమే. ఈ పని గావించుటకు ముందు బాలునికి చక్కగా భోజనము పెట్టుదురు.

అట్లే, మూడవ సం||న గాని, 5వ సం||న గాని అక్షరాభ్యాసమగును. ఇందుకు సామాన్యముగా విజయదశమినే శుభముహూర్తముగా నిర్ణయింతురు. గణపతి పూజాదికములైన పిదప బాలునికి తండ్రియో, పోషకుడో బంగారపుటుంగరముతో 'ఓం' కారమును నాలుకపైవ్రాసి చెవిలో నుచ్చరించును. పిల్లవాని వుంగరపు వ్రేలు పట్టి బియ్యములో 52 అక్షరములు చెప్పుచు వ్రాయించును. మున్ముందుగా మనము 'ఓం నమఃశివాయ సిద్దం నమః" అన్నట్లే - వారు 'ఓం హరిశ్రీగణపతయే నమః' యని చెప్పింతురు. బాలుడు బుద్దివిశారదుడగుటకై మంత్రపూర్వకముగ వెన్న తినిపింతురు. గర్భాష్టమియందు గాని, అష్టమ వర్షమందు గాని ఉపనయనము జరుపబడును. ఉపనయన విధి చాలావరకు మనదేశమునందువలెనే జరుగును; కాని యజ్ఞోపవీతధారణా నంతరము మన పురోహితులు బ్రహ్మచర్య విధులు - గ్రుక్క తిప్పకుండ సంస్కృతమున ఏకరువు పెట్టుదురు. వారు అట్లుగాదు; సంస్కృతమున చెప్పినదానిని బాలున కన్వయమగుటకు మళయాళ భాషలో కూడ చెప్పదురు.

వీరిలో పెద్దవాడొక్కడే స్వకులమున వివాహమాడును. పిదప సోదరులందరును అక్కడ అగ్రజాతిశూద్రులైన నాయర్ స్త్రీలను వివాహమాడుదురు. ఈ ఆచారము ఎట్లువచ్చిన దనుదానిని గూర్చి పలుగాథలున్నవి. ఈ నంబూదిరీలు తొలుత వచ్చినప్పుడు వీరితో కూడ కొలదిమంది స్త్రీలే వచ్చిరట. పురుషులందరికి చాలినంతమంది స్త్రీలు లేరు పెద్దవాడు మాత్రము స్వకులమున వివాహమాడుటయు, మిగతవారు పరిచారికలైన శూద్రస్త్రీలను వివాహమాడుటయు ఏర్పడిన దందురు. జమీందారులగు నంబూదిరీలు వారి ఆస్థి చీలిపోకుండ ఏకముగా నుండుటకై ఆచారము నేర్పరచుకొనిరని కొందరందురు.

వరుని మనవాళన్ అని పిలుతురు. ఈ మనవాళన్ను స్వకులములో ఉత్తమునిగా చూతురు; కాని సమీపరక్త బంధువులు వివాహమాడరాదు. ఉత్తముడనగా వేదవేదాంగముల నభ్యసించినవాడు, సదాచార సంపన్నుడు, ధనవంతుడు. నంబూదిరీలలో వరాన్వేషణమేగాని వధునన్వేషించుట యెరుగరు. వివాహవిధులు చాలవరకు మనకువలెనే జరుగుతున్నవి.

పెండ్లికూతురిని సంపూర్ణముగ మేలిముసుగువైచి వరుని వద్దకు పిలుచుకొని వత్తురు. అప్పడామె పెళ్లికుమారుని ముఖము చూడకుండ అతనికి తన ముఖము కనపడకుండ - తాటియాకు గొడుగును అడ్డుపెట్టుకొని పూమాల నొకటి అతనిచేతి కందించును. అతడు దానిని ధరింపగా, పురోహితులు వేదమంత్రములు పఠించుచుండ - వధూవరులు ఒండొరులను చూచుకొందురు.

వారిలో పెండ్లికూతురునకు తాళిబొట్టు కట్టునది భర్తకాదు; తండ్రి. అనగా - వారు బాలికలకు తాళిబొట్టు కట్టుటను బాలురకుపనయన మొనర్చి యజ్ఞోపవీతము వేయుటవంటిదిగా భావింతురు. మాంగళ్య ధారణానంతరము, ఉదకపూర్వ కన్యాదానము, పాణిగ్రహణమును జరుగును. పాణిగ్రహణమప్పుడు పెండ్లికూతురు ఒకచేత అద్దము పట్టుకొని కుడిచేయి చాచి వ్రేళ్లు ముడుచును. ఆ ముడిచిన చేయి వీడదీసి అతడు పాణిగ్రహణ మొనర్చును. దీక్షా దినములు గడవగా - నాల్గవరోజున మంగళాస్నానములగును. ఆ రోజున మరికొన్ని తతంగములు జరుగగా, ఇద్దరు కలిసి ఒకే ఆకున భోజనమొనర్తురు. మనకు వలెనే వారికిని పున్నామనరకమునుండి యుద్ధరించుటకు పురుషు సంతానాపేక్ష మెండు.

ఆదిలో నేను మద్రాసునకు వచ్చినపుడు నేను చదువుకొనుచుండిన పాఠశాలలోని పిల్లకాయలు పెద్దవారలుకూడ ఆడమళయాళమును గురించి చిత్రవిచిత్రములైన కబుర్లను చెప్పుకొనుచుండిరి. ఆడమళయాళములో ఆడవారుతప్ప పురుషులే యుండురని చెప్పుచుండిరి. తప్పిదారి పురుషుడెవడైనను ఆ దేశమునకు పోయిన మళయాళ మంత్రములతో వానిని వశపరచుకొని వారిండ్లలో బందీలుగ చేసుకొని వార్లచేత సేవచేయించుకొనుచుందురనికూడ చెప్పుట వినియుంటిని.

ఆడమళయాళమనగ మాతృభక్తిగల పుణ్యభూమి. స్త్రీ స్వతంత్ర రాజ్యము. మనదేశమున పురుషుడు పుట్టుకతో అనుభవించు సర్వస్వతంత్రములన్నిటిని అక్కడి ఆడవారు జననమొందిన దాదిగ అనుభవించుచుచున్నారు. కేరళోత్పత్తికి మూలపురుషుడు పరశురాముడని వ్రాసియుంటిని. గనుక ఈ దేశమునకు పరశురామ క్షేత్రమనిన్నీ భార్గవక్షేత్రమనిన్నీ పేరు గలదు. పరశురాముడు ఉమామహేశ్వర్ల ఉపాసకుడు. పరమభక్తుడు. తాను సృష్టించిన కేరళరాజ్యము దుర్మార్గుల పాలు గాకుండుటకు పార్వతీ పరమేశ్వర్లను కాపలా కాయుటకు ప్రార్థించెను. అందుకు వారు సమ్మతించిరి.

ఈ పరశురామ క్షేత్రము గోకర్ణము మొదలు కన్యాకుమారి వరకు వ్యాపించి యున్నది. గోకర్ణమునందు శివుడును కన్యాకుమారియందు శక్తియగు కన్యాకుమారియను కాపలా కాయుచున్నారు. కేరళదేశము పరాశక్తి స్వాధీనమందున్నందున ఈ దేశమంతయు శక్తియుతమైయున్నది. శక్తి అనగ అధికారము అని కూడ అర్థము. నవశక్తులలోను కుమారి బ్రహ్మచారిణి అగుటవలన సర్వశక్తులను సంపూర్ణముగ సమన్వయించుకొనిన నిర్వాణి. నిరంజని. ఎక్కడ సౌందర్యము, సాహసము ఆకర్షనీయముగ నుండునో అక్కడనే అధికారము కూడియుండును. 'శివశక్త్యా యుక్త ప్రభవతి' అను శంకరుని వచనము.

శక్తిలేని శివుడు అశక్తుడు; శివుడులేని శక్తి మారణశక్తి. గనుక పార్వతీ పరమేశ్వరుల సమ్మేళనముననే కేరళదేశము మాతృప్రభ ప్రజ్వలించుచున్నది.

కేరళ రాజ్యమున మాతృపూజ ప్రతియింటను గ్రామమునను జరుగుచుండును. కాళీ, మహాకాళీ, భద్రకాళీ, కాత్యాయిని, మహేశ్వరి, గౌరీ అను నామములతో గ్రామదేవతలున్నారు. ప్రతియింటను లక్ష్మీ, పార్వతి, సరస్వతి, మాధవి అను పేర్లు గలవు. ఈ ప్రకారము దేశమంతయును శక్తియుతమైన ప్రభావమును గల్గియున్నది. నవరాత్రములయందు కన్యకాపూజ సాగుచున్నది - ఆ 9 రోజులున్నూ, వారు కన్యకలకు రక్తచందనము, రక్తవర్ణ పుష్పములు, ఎర్రగా పండిన పండ్ల, కుంకుమ, కుంకుమ పూవు - మొదలైన పదార్ధముల నిచ్చి ఆరాధింతురు. అనగా వినియోగము కాని సృజనశక్తి (మాతృత్వము) అగు నంతశక్తి అంతర్భూతమైయున్న కన్యకా స్వరూపము నారాధించి శక్తి సంపన్నులు అగుచున్నారు.

కేరళమున గృహలక్ష్మిని కులదేవతగా పూజింతురు. కొమారుడు రాజు అయినను కన్నతల్లి యెదుట చేతులు కట్టుకొని నిలుచుండుటయే వారి భక్తి విశ్వాసము. కూతుండ్లు అన్నదమ్ములందరు ఆమె ఆజ్ఞను రాజాజ్ఞగ పాలించెదరు. కుమార్తెలు తల్లిని విడిచిపెట్టి అత్తవారింటికి పోవు ఆచారము అక్కడలేదు. భార్య కావలసి వచ్చినప్పుడు భర్త భార్యయింటికి వచ్చిపోవుటయే వారి కులాచారము. ఇందువలన అక్కడి ఆడవారికి అత్తపోరు లేదు. ఆడబిడ్డల రాపిడియును నుండదు. తల్లియే కుటుంబమునకు అధికారి. కుటుంబ ఆస్తియంతయు ముఖ్యముగ ఆడవారికే చెందును.

శ్రీ రామచంద్రమూర్తి పంచవటిని వదలి శబరి ఆశ్రమమునకు వచ్చెను. ఈ శబరి ఆశ్రమము తిరువనంతపురమునకు సుమారు 160 మైళ్ల దూరముననుండు మహారణ్యమున శబరి పర్వతము మీద నున్నది. ఈ శబరి పర్వతము మీద నుండు అయ్యప్పన్ అను దైవము హరిహరాదులకు పుత్రుడు. విష్ణుమూర్తి మోహినీరూపమును దాల్చి శివుని మోహింప చేసినప్పుడు వారిరువురకు పుట్టిన దేముడని స్థలపురాణము చెప్పుచున్నది. ఈ క్షేత్రమున ప్రతి సంవత్సరము కేరళదేశమునుండి వేలువేలుగా జనులు శబరికొండనెక్కి అయ్యప్పన్ ను పూజించివచ్చుచుందురు. శబరి ఆశ్రమమునకు పోవు భక్తులందరు నీలివస్త్రములను ధరించి విభూతి రేఖలను దట్టముగ దిద్దుకొని చేత త్రిశూలములను ధరించి శివగీతములను పాడుచు శబరికొండ నెక్కెదరు. ఆశ్రమము చుట్టు పంపా సరోవరము, ఋష్యమూకపర్వతము, నీలాద్రి, శ్రీ రామవనం మొదలగు పురాతన పవిత్ర క్షేత్రములు గలవు. ఈ స్థలములన్నియు ఈ పేర్లతోనే యిప్పటికిని యున్నవి. (ఇచటివారైతే ఆ యాత్ర ప్రదేశములతో రామాయణ గాథకు సంబంధము కల్పించుకొని యున్నారు. గోదావరిలో శబరియను ఉపనది కలియుచున్నది. కాని బళ్లారి ప్రాంతమున ఋష్యమూక పర్వతాలు కలవని చెప్పకొందురు.)

మారుతి పర్వతమునుండి వర్షాకాలమున ఓషధులసారము ఆల్వాయిలో పారు పెరియారు నదిద్వారా కొట్టుకొనివచ్చును. ఈ కారణమున ఆల్వాయి నదీ స్నానము అనారోగ్యులకు అనుకూలముగ నున్నది. వేసవికాలమున దూరదేశములనుండికూడ రోగవిముక్తులగుటకు ఇక్కడికి వచ్చి సుఖముగ వెళ్ళుదురు. ఈ రైలు స్టేషన్ తిరుచూరుకు యెర్నాకులమునకు మధ్యనున్నది.

కొచ్చి రాజ్యమునకంతయును గొప్ప శివాలయము వడకన్నాధ క్షేత్రము తిరుచూరునందున్నది. తిరుచూరుకు సమీపముననే గురువాయూరునందు శ్రీ మహావిష్ణువు వెలసియున్నాడు. త్రిప్రయారను క్షేత్రమున శ్రీరామచంద్రమూర్తి దేవాలయము గలదు. ఇంకయును ననేక పుణ్యక్షేత్రములు గలవు. తిరువనంతపురం రాజు పద్మనాభుని దాసుడు. కొచ్చిను మహారాజు వైదిక శిఖామణి. దేవాలయములలో జరుగు వుత్సవాదులకు వీరు హాజరగుచుందురు. నిరాడంబరముగ రాజ్యపాలన చేయు మహాపురుషులు వీరు.